భాగవత మహా పురాణము
21 - రంతిదేవోపాఖ్యానము
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- వితథుడనే భరద్వాజునియొక్క పుత్రుడు మన్యువు. మన్యువునకు బృహత్క్షత్రుడు, జయుడు, మహావీర్యుడు, నరుడు, గర్గుడు అనే పుత్రులు గలరు. వారిలో నరుని పుత్రుడు సంకృతి.
పాండవులకు ఆనందమును కలిగించే ఓ పరీక్షిన్మహారాజా! సంకృతికి గురువు, రంతిదేవుడు అనే ఇద్దరు పుత్రులు గలరు. వారిలో రంతిదేవుని కీర్తి భూలోకములో మాత్రమే గాక, స్వర్గాది లోకములయందు కూడ గానము చేయబడుచున్నది.
ఆ రంతిదేవుని వద్ద యాదృచ్చికముగా తనకు గాలివాటముగా లభించిన ధనము మాత్రమే గలదు. పైగా, ఆయన తనకు లభించిన దానిని లభించుట తోడనే దానము చేసెడివాడు. దానితో ఆయన వద్ద ధనము ఏమీ లేకుండుటచే, సరియగు ఆహారము లేక ఆయన ఆకలితో బాధపడెడి వాడు. ఈ విధముగా కుటుంబముతో సహా క్లేశమును పొందియున్ననూ, ఆయన ధైర్యమును కోల్పోలేదు.
రంతిదేవునకు త్రాగే నీరు కూడ దొరకకుండెను. ఈ విధముగా నలభై ఎనిమిది రోజులు గడచిపోయెను. ఒకనాడు ఉదయము ఆయనకు నేయి, పాయసము, హల్వా మరియు నీరు లభించెను.
రంతిదేవుని కుటుంబము చాల క్లేశమును పొందియుండెను. ఆయనకు కూడ ఆకలి దప్పికలచే శరీరములో వణుకు పుట్టుచుండెను. ఆయన ఆ ఆహారమును తినగోరునంతలో, సరిగ్గా అదే సమయమునందు ఒక బ్రాహ్మణుడు అతిథి విచ్చే సెను.
రంతిదేవుడు సర్వమునందు శ్రీహరిని దర్శించును. ఆయన ఆ బ్రాహ్మణుని ఆదరించి శ్రద్దతో కూడినవాడై, ఆహారమును బ్రాహ్మణునకు వడ్డించెను. ఆ బ్రాహ్మణుడు భుజించి నిష్క్రమించెను.
ఓ పరీక్షిన్మహారాజా! ఆ రంతిదేవుడు మిగిలిన ఆహారమును కుటుంబసభ్యులకు పంచి యిచ్చి తాను తినబోవుచుండెను. ఇంతలో ఒక శూద్రుడు అతిథియై వచ్చెను. అప్పుడాయన శ్రీహరిని స్మరిస్తూ ఆ మిగిలిన ఆహారమును ఆ అతిథికి పంచి యిచ్చెను.
ఆ శూద్రుడు వెళ్లగానే రంతిదేవుని వద్దకు మరియొక అతిథి వచ్చెను. ఆ అతిథి చుట్టూ కుక్కలు ఉండెను. ఆతడు రంతిదేవునితో నిట్లనెను -- ఓ రాజా! నేను, నా కుక్కలు ఆకలి గొనియున్నాము. మాకు ఆహారమును ఇమ్ము.
ఆ రంతిదేవ మహారాజు ఆ అతిథిని కూడ ఆదరించెను. మిగిలి యున్న ఆహారమును ఆయన ఆ అతిథికి, ఆతని కుక్కలకు సత్కార పూర్వకముగా ఇచ్చి నమస్కారమును చేసెను.
రంతిదేవుని వద్ద ఒక్కని దాహమును తీర్చగలిగే నీరు మాత్రమే మిగిలి యుండెను. దానిని ఆయన త్రాగబోవుచుండగా ఒక కసాయి వచ్చి, అశుభకర్మను చేసి బ్రదికే నాకు నీటిని ఇండు, అని కోరెను.
వాని ఆ దీనమైన వాక్కులో అధికమగు శ్రమ ధ్వనించుచుండెను. దానిని వినుట తోడనే రంతిదేవుడు దయచే చాల పీడను పొందెను. ఆయన అమృతతుల్యమగు ఈ మాటను పలికెను.
నేను ఈశ్వరునినుండి అష్టైశ్యర్యములతో కూడిన సర్వోత్కృష్ట మైన స్థితిని గాని, తిరిగి పుట్టుక లేని మోక్షమును గాని కోరుట లేదు. నేను కోరేదేమంటే, నేను సకలప్రాణుల హృదయములో నుండి వారి దుఃఖమును అనుభవించవలెను. ఎందుకంటే, నేను అట్లు చేయుట వలన వారికీ దుఃఖము తొలగిపోవును.
ఈతడు దీనుడు, జీవించగోరే ప్రాణి. నీటిని ఇచ్చి ఈతని ప్రాణములను నిలబెట్టుట వలన నాకు ఆకలి దప్పికల శ్రమ, శరీరములోని అలసట, దైన్యము, గ్లాని, మానసిక పీడ, అవయవముల శైథిల్యము, వ్యామోహము అనే లక్షణములన్నియు దూరమైనవి.
సహజముగా దయాగుణము గల రంతిదేవ మహారాజు ఆత్మానాత్మవివేకము (ధైర్యము) గలవాడు. ఆయన ఒకవైపు దప్పికతో మరణించుటకు సిద్ధముగా నుండెను. అయిననూ, ఆయన ఈ విధముగా పలికి నీటిని ఆ కసాయివానికి ఇచ్చివేసెను.
ముల్లోకములకు అధీశ్వరులగు బ్రహ్మాదులు విష్ణుమాయచే కల్పించబడిన ఆయా రూపములతో రంతిదేవుని వద్దకు వచ్చియుండిరి. ఇప్పుడు వారు తమ అసలు రూపములతో ఆయనకు దర్శనమిచ్చిరి. ఫలములను కోరే ప్రాణులకు ఫలములనిచ్చేది వారే.
రంతిదేవునియందు సంసారాసక్తి గాని, భోగములయందు తృష్ణ గానీ సుతరాము లేకుండెను. ఆయన వారికి నమస్కరించి, మనస్సును భక్తితో కేవలము వాసుదేవ భగవానునియందు మాత్రమే నిలిపియుంచెను.
ఓ పరీక్షిన్మహారాజా! రంతిదేవునకు ఈశ్వరుడు తప్ప ఇతరము నందు తృష్ణ లేదు. కావున, ఆయన తన చిత్తమునకు ఈశ్వరుని మాత్రమే ఆలంబనముగా చేసుకొనెను. దాని వలన సత్త్వరజస్తమోగుణాత్మకమగు అవిద్య (సంసారము) కలవలే ఆయన స్వరూపమునందు విలీనమయ్యెను.
రంతిదేవుని అనుయాయులకు ఆయనతో నిరంతరమగు సంగము ఉండెను. అట్టి సత్సంగముయొక్క మహిమచే వారు కూడ నారాయణుడే పరమమగు ఆశ్రయముగా గల యోగులుగా తీర్చి దిద్దబడిరి.
మన్యుపుత్రుడగు గర్గుని పుత్రుడు శిని. శని యొక్క పుత్రుడు గార్గ్యుడు. గార్గ్యుడు క్షత్రియుడే అయినా, ఆయననుండి ప్రవర్తిల్లిన వంశము వారు బ్రాహ్మణులైనారు. మన్యుపుత్రుడగు మహావీర్యుని పుత్రుడు దురితక్షయుడు. దురితక్షయునకు త్రయ్యారుణి, కవి, పుష్కరా రుణి అనే ముగ్గురు పుత్రులు ఉండిరి. వారు క్షత్రియవంశమునందు జన్మిం చిననూ, బ్రాహ్మణరూపమును పొందిరి.
(మన్యుపుత్రుడగు)బృహత్ క్షత్రుని పుత్రుడు హస్తి. హస్తినాపురమును నిర్మించినది హస్తియే. హస్తికి అజమీఢుడు, ద్విమీఢుడు, పురుమీడుడు అనే పుత్రులు గలరు. ప్రియమేధుడు మొదలుగా గల అజమీడుని పుత్రులు బ్రాహ్మణులు అయిరి.
అజమీడుని (మరియొక) పుత్రుడు బృహదిషువు. బృహదిషువు యొక్క పుత్రుడు బృహద్ధనువు. బృహద్ధనువుయొక్క పుత్రుడు బృహత్కా యుడు. బృహత్కాయుని పుత్రుడు జయద్రథుడు.
జయద్రథుని పుత్రుడు విశదుడు. విశదుని పుత్రుడు సేనజిత్తు. సేనజిత్తునకు రుచిరాశ్వుడు, దృఢహనువు, కాశ్యుడు, వత్సుడు అనే పుత్రులుకలిగిరి.
రుచిరాశ్వునియొక్క పుత్రుడు పారుడు. పారుని పుత్రుడు పృథు సేనుడు. పారుని మరియొక పుత్రుడు నీపుడు. నీపునకైతే వందమంది పుత్రులు కలిగిరి.
ఆ నీపుడు శుకుని కుమార్తెయగు కృత్వియందు బ్రహ్మదత్తుడనే పుత్రుని కనెను. ఆ బ్రహ్మదత్తుడు యోగి. ఆయన భార్య సరస్వతి. ఆయనకు ఆమెయందు విష్వక్సేనుడనే పుత్రుడు కలిగెను.
జైగీషవ్య మహర్షి యొక్క ఉపదేశముచే ఆ బ్రహ్మదత్తుడు యోగ శాస్త్రమును రచించెను. ఆ విష్వక్సేనుని పుత్రుడు ఉదక్స్వనుడు. ఉదక్స్వనుని పుత్రుడు భల్లాదుడు. వీరందరు బృహదిషువు యొక్క వంశమునకు చెందినవారు.
(హస్తియొక్క పుత్రుడగు)ద్విమీఢుని పుత్రుడు యవీనరుడు. యవీనరుని పుత్రుడు కృతిమంతుడు. కృతిమంతుని పుత్రుడు సత్యధృతి. సత్యధృతియొక్క పుత్రుడు దృఢనేమి. దృఢనేమియొక్క పుత్రుడు సుపా ర్శ్వుడు.
సుపార్శ్వుని పుత్రుడు సుమతి. సుమతి యొక్క పుత్రుడు సన్నతిమంతుడు. సన్నతిమంతుని పుత్రుడు కృతి. ఆ కృతి హిరణ్యనాభునినుండి యోగవిద్యను పొంది, ప్రాచ్యసామలనే ఆరు మంత్రసంహితలను కూడ గానము చేసెను. కృతియొక్క పుత్రుడు నీపుడు. నీపుని పుత్రుడు ఉగ్రాయుధుడు.
ఉగ్రాయుధుని పుత్రుడు క్షేమ్యుడు. క్షేమ్యుని పుత్రుడు సువీరుడు. సువీరుని పుత్రుడు రిపుంజయుడు. రిపుంజయుని పుత్రుడు బహురథుడని ప్రసిద్ధి జెందెను. హస్తియొక్క మరియొక పుత్రుడగు) పురమీడునకు సంతానము కలుగలేదు.(హస్తియొక్క మరియొక పుత్రుడగు) అజమీడునకు రెండవ భార్యయగు నలినియందు నీలుడనే పుత్రుడు కలిగెను. నీలుని పుత్రుడు శాంతి.
శాంతియొక్క పుత్రుడు సుశాంతి. సుశాంతియొక్క పుత్రుడు పురుజుడు. పురుజునియొక్క పుత్రుడు అర్కుడు. అర్కునియొక్క పుత్రుడు భర్మ్యాశ్వుడు. భర్మ్యాశ్వునకు ముద్గలుడు, యవీనరుడు, బృహ దిషువు, కాంపిల్యుడు, సంజయుడు అనే అయిదుగురు పుత్రులు కలిగిరి. వీరిలో ముద్గలుడు పెద్దవాడు.
నా పుత్రులు అయిదు దేశములను రక్షించుటకు నిశ్చయముగా సమర్థులు అని భర్మ్యాశ్వుడు పలికెను. ఇందువలననే, వారికి పంచాలులు (పంచ అలమ్) అనే పేరు వచ్చెను.
భర్మ్యాశ్వుని పుత్రుడగు ముద్గలుని వలన మౌద్గల్యమనే బ్రాహ్మణ గోత్రము ప్రవర్తిల్లెను. ముద్గలునకు దివోదాసుడనే మగ పిల్లవా డు, అహల్య అనే అమ్మాయి అనే ఇద్దరు పిల్లలు కలిగిరి. అహల్యయందు గౌతమమహర్షి వలన శతానందుడు కలిగెను.
ఆ శతానందునకు సత్యధృతి అనే పుత్రుడు కలిగెను. ఆ సత్య ధృతి ధనుర్వేదమునందు నిపుణుడు. ఆయన పుత్రుడు శరద్వంతుడు. శర ద్వంతుడు ఊర్వశిని చూచినప్పుడు ఆయన రేతస్సు ముంజగడ్డి దుబ్బుపై పడి, శుభకరమైన ఇద్దరు (మగ, ఆడు) పిల్లల జంటగా ఆయెను.
వేటాడుచున్న శంతను మహారాజు ఆ జంటను చూచి దయ కలిగి వారిని తీసుకువెళ్లి రక్షించెను. వారిలో మగ పిల్లవాడే కృపాచార్యుడు. అమ్మాయి కృపి. ఆమెయే ద్రోణాచార్యునకు భార్య ఆయెను.
శ్రీమద్బాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో రంతిదేవోపాఖ్యానమును వర్ణించే ఇరువది ఒకటవ అధ్యాయము ముగిసినది (21).
Summary of chapter 22 of the Bhāgavata Mahā Purana is as follows:
Śrī Śukadeva Gosvāmī details the royal lineage extending from King Hastī (who founded the imperial capital Hastināpura) down through Ajamīḍha, Saṁvaraṇa, and King Kuru, after whom the sacred field Kurukshetra was named. The chapter traces the line through King Vasu, Bṛhadratha (father of the formidable King Jarāsandha of Magadha), Parīkshit I, and King Pratīpa, who fathered Śāntanu. Śāntanu wed Ganga (begetting Bhīshma) and later Satyavatī (begetting Citrāṅgada and Vicitravīrya). Following Vicitravīrya's premature death, Maharshi Vedavyāsa fathered Dhṛtarāshṭra, Pāṇḍu, and Vidura, tracing the royal birth of the righteous Pāṇḍavas (Yudhishṭhira, Bhīma, Arjuna, Nakula, and Sahadeva) who restored Vaidika Dharma to the world.