భాగవత మహా పురాణము
9 - గంగావతరణము
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- సగరుడే కాకుండా అంశుమం తుడు కూడ గంగను తీసుకువచ్చే కోరికతో చాల కాలము తపస్సు చేసెను. అయిననూ, ఆయన ఆ పనిని చేయలేకపోయెను. తరువాత కొంత కాల మునకు ఆయన మరణించేను.
ఆ అంశుమంతుని పుత్రుడగు దిలీపుడు గంగను తీసుకు వచ్చుటలో సమర్థుడు కాలేదు. ఆయన మృత్యువును పొందెను. దిలీపుని పుత్రుడగు భగీరథుడు సుప్రసిద్ధుడు. ఆయన చాల గొప్ప తపస్సును చేసెను.
గంగాదేవి ప్రసన్నురాలై ఆ భగీరథునకు దర్శనమిచ్చి, నీకు నేను వరమునిచ్చెదనని పలికెను. అపుడా భగీరథ మహారాజు వినయముగా తన అభిప్రాయము (తాతల ఉద్గారము) ను విన్నవించెను.
ఓ మహారాజా! నేను భూతలముపై పడుచుండగా ఎవరో ఒకరు నన్ను ధరించవలెను. లేనిచో, నేను భూతలమును పగులగొట్టి రసాతలము నకు వెళ్లిపోగలను.
ఓ రాజా! ఇంకో విషయము గలదు. నేను భూలోకములో ప్రవహించినచో, జనులు వారి పాపములను నాయందు కడిగేదరు గనుక, నేను భూలోకమునకు వెళ్లను. ఆ పాపమును నేను ఎక్కడ కడుగవలెను? ఆ విషయమును కూడ నీవు ఆలోచించుము.
భగీరథ ఉవాచ ।
భగీరథుడిట్లు పలికెను --- సర్వసంగములను పరిత్యజించి శాంత స్వభావులై బ్రహ్మనిష్ఠులైన సత్పురుషులు జనులను పావనము చేయుచుందురు. వారు నీయందు స్నానమును చేసినప్పుడు నీ పాపము పోవును. ఎందుకంటే, పాపములను పోగొట్టే శ్రీహరి వారియందు ఉండును.
రుద్రుడు ప్రాణుల ఆత్మ. ఈ జగత్తు ఆయనయందు, వస్త్రము దారములయందు వలె, పడుగు- పేక వలె వ్యాపించబడి యున్నది. ఆయన నీ వేగమును ధరించగలడు.
ఓ పరీక్షిన్మహారాజా! ఆ భగీరథ మహారాజు తపస్సు చేసి శివదేవుని సంతోష పెట్టెను. తక్కువ సమయములోనే శివుడు ఆ భగీరథుని యెడల సంతుష్టుడాయెను.
భగీరథ మహారాజు గంగావతరణమును గురించి చెప్పగా, సకల ప్రాణులకు హితమును చేసే శివుడు సరేయని భగీరథుని కోరికను అంగీకరించెను. శ్రీహరియొక్క పాదములచే పావనము చేయబడిన నీరు గల గంగను ఆయన సావధానుడై ధరించెను.
రాజర్షియగు ఆ భగీరథుడు లోకములను పావనము చేసే గంగను, బూడిదయై పడియున్న తన పూర్వజుల దేహములు ఉన్నచోటికి తీసుకు పోయెను.
వాయువేగముతో రథము పై భగీరథుడు వెళ్లుచుండగా, ఆయన వెంట పరుగెడుతూ గంగ దేశములను పావనము చేసెను. దహించబడి బూడిదయైన సగరపుత్రులను ఆమె ముంచెత్తాను.
సగరుని పుత్రులు మహర్షియొక్క శాపముచే బూడిదగా చేయబడి నారు. అయిననూ, కేవలము వారి దేహముల బూడిదను గంగ స్పృశించి నంత మాత్రాన వారు స్వర్గమును పొందిరి.
సగర పుత్రుల అవయవములు బూడిదయె ఉండెను. ఆ బూడిదకు గంగాజలములతో స్పర్శ కలుగగా, వారు స్వర్గమును పొందిరి. ఎవరైతే ప్రతనిష్ఠను పూని శ్రద్ధతో గంగాదేవిని సేవిస్తారో, వారు స్వర్గమును పొందెదరని వేరుగా చెప్పవలయునా?
స్వర్గమునందు ప్రవహించే గంగానది అనంతునీ పాదపద్మముల నుండి పుట్టినది. సంసారబంధమును తొలగించే గంగానది విషయములో ఇచట చెప్పిన మహిమ పెద్ద ఆశ్చర్యము కానే కాదు.
పవిత్రహృదయులగు మహర్షులు శ్రద్దతో మనస్సును అనంతునిపై చక్కగా నిలిపెదరు. విడిచి పెట్ట శక్యము కానీ త్రిగుణాత్మకమైన సంసారమును విడిచి పెట్టి, వారు జీవించి యుండగనే ఆ అనంతునితో ఐక్యమగుదురు.
భగీరథుని పుత్రుడు శ్రుతుడు. శ్రుతుని పుత్రుడు నాభుడు. ఈ నాభుడు ఇదివరలో చెప్పినవాడు కాదు, మరియొకడు. సౌభుని పుత్రుడు సింధుద్వీపుడు. సింధుద్వీపుని పుత్రుడు అయుతాయువు. అయుతాయువు పుత్రుడు ఋతుపర్ణుడు. ఈ ఋతుపర్ణుడే నలునకు మిత్రుడై ఆయనకు పాచికల విద్యను నేర్పి, తాను ఆయన వద్దనుండి గుర్రముల విద్యను నేర్చెను. ఋతుపర్ణుని పుత్రుడు సర్వకాముడు.
ఓ పరీక్షిన్మహారాజా! ఆ సర్వకాముని పుత్రుడు సుదాసుడు. సుదాసుని పుత్రుని మిత్రసహుడనియు, ఒకప్పుడు కల్మాషాంఘ్రి అని కూడ పిలిచెదరు. ఆయన భార్య మదయంతి. ఆయనకు సంతానము లేకుండే ను. ఆయన చేసిన పని వలన వసిష్ఠుడు శాపమీయగా, ఆయన రాక్షసుడాయెను.
రాజోవాచ ।
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- మహాత్ముడగు సౌదాసుడు (సుదాసుని పుత్రుడగు మిత్రసహుడు) గురువగు వసిష్ఠుని శాపమును పొందుటకు కారణమేమి? ఈ విషయమును తెలియాలనే కోరిక మాకు గలదు. అది రహస్యము కాని పక్షములో, చెప్పుడు.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- సౌదాసుడు వేటాడుతూ ఒక రాక్షసుని చం పెనట. కానీ, ఆయన ఆ రాక్షసుని సోదరుని విడిచి పెట్టేను. ఆతడు తరువాత కక్ష తీర్చుకొనుటకై (సౌదాసుని ఇంటికి) వెళ్లాను.
సౌదాస మహారాజు తన సోదరుని చంపుట అనే పాపకృత్యమును గురించి తలపోస్తూ, ఆ రాక్షసుడు ఆ రాజు ఇంట్లో వంటవాడు రూపములో ప్రవేశించెను. ఒకనాడు గురువగు వసిష్ఠుడు భోజనమును చేయగోరెను. అపుడా రాక్షసుడు నరమాంసమును వండి తెచ్చెను.
తినరాని నరమాంసమును వడ్డించుచుండగా చూచి, పూజనీయుడగు వసిష్ఠుడు వెంటనే కోపించి ఆ సౌదాస మహారాజును ఇట్లు శపించెను -- నరమాంసమును వడ్డించుట అనే ఈ పనిచే నీవు నిశ్చయముగా రాక్ష సుడవు కాగలవు.
ఆ పని రాక్షసుడు చేసినదని తెలిసి వసిష్ఠుడు ఆ శాపమునకు పన్నెండు సంవత్సరములను అవధిగా చేసెను. ఆ సౌదాస మహారాజు కూడ దోసిలితో నీటిని తీసుకోని, గురువగు వసిష్ఠుని శపించుటకు సంసిద్దు డాయెను.
గురువును శపించవద్దని సౌదాస మహారాజును ఆయన భార్య వారించెను. దోసిలిలో కోపాగ్నితో తీక్ష్ణములైన జలములు ఉండెను. ఆకాశము, దిక్కులు, భూమి అంతా ప్రాణులతో నిండియుండుటను చూచి ఆ రాజు ఆ నీటిని తన రెండు కాళ్లపైననే పోసుకొనెను.(భార్య మాటకు విలువనిచ్చుటచే ఆయన మిత్రసహుడైనాడు.మిత్రసహుడు అనగా భార్య మాటను మన్నించువాడు).
ఆ మహారాజు రాక్షసుడాయెను. ఆయన పాదములు నల్లగా ఆయెను (కావుననే, ఆయన కల్మాషపాదుడు అనబడినాడు). ఆయన ఒకనాడు అడవిలో నివసించే బ్రాహ్మణదంపతులను సంభోగ సమయములో చూచెను.
రాక్షసరూపములోనున్న సౌదాసుడు ఆకలిచే పీడించబడి ఆ బ్రాహ్మణుని పట్టుకోనెను. దీనురాలగు ఆతనీ భార్య ఇట్లు పలికెను -- నీవు యథార్థముగా రాక్షసుడవు కావు. నీవు ఇక్ష్వాకువంశపు రాజులలో ఒకడివి, మహారథుడవు.
ఓ వీరుడా! నీవు మదయంతి భర్తవు. నీవు అధర్మమును చేయదగవు. నా భర్త దీనుడు, బ్రాహ్మణుడు. సంతానమును కోరే నాకు నా భర్తను ఇమ్ము .
ఓ రాజా! నీవు వీరుడవు. ఈ మనుష్యదేహము సకలపురుషార్థములనిచ్చే సాధనము. కావున, దీనిని సంహరించుట యనగా సకలపురుషార్థములను వినాశము చేయుటయేనని పెద్దలు చెప్పుచున్నారు.
ఈతడు బ్రాహ్మణుడు, విద్వాంసుడు. ఈతనియందు తపస్సు, సచ్చీలము, సద్గుణములు నిండా యున్నవి. ఈతడు సకలప్రాణులయందు ఆత్మభావము గలవాడై పరబ్రహ్మను ఆరాధించ గోరుచున్నాడు. సకలప్రాణులలో ఆత్మరూపముగా ఉన్ననూ, సత్త్వరజస్తమోగుణములచే కప్పివేయబడియున్న ఆ పరబ్రహ్మనే మహాత్ములు పురుషోత్తముడని పిలిచెదరు.
ఓ రాజా! నీవు ధర్మము తెలిసినవాడవు. రాజర్షులలో శ్రేష్ఠుడవగు నీవు అట్టి బ్రహ్మర్షులలో శ్రేష్ఠుడగు ఈయనను వధించుట తగునా?(తగదు). తండ్రి పుత్రుని వధించుట తగునా?(తగదు).
నీవు సత్పురుషులచే కొనియాడబడేవాడవు. ఈతడు సత్పురుషుడు, పాపమునెరుగని వాడు, శ్రోత్రియుడు, వేదవేత్త, వేదవేత్తయొక్క కొడుకు. ఇట్టి బ్రాహ్మణుని వధించుట గోవును వధించుట వంటిది. ఇది మంచి పనియని నీవు ఎట్లు తలచెదవు?(అట్లు తలచుట సంభవము కాదు).
ఈయన లేనిదే నేను క్షణకాలమైననూ జీవించి యుండను. నేను మరణించినదానితో సమానము. కావున, నీవు ఈయనను తినే పక్షములో, ముందుగా నన్ను తినుము.
ఈ విధముగా ఆమె అనాథ వలే దీనముగా పలుకుతూ ఏడ్చు చుండెను. కాని, శాపముచే మోహితుడై యున్న సౌదాసుడు, పెద్దపులి పశువును వలె, ఆ బ్రాహ్మణుని తినివేసెను.
తనతో రమించగోరుచున్న తన భర్తను నరమాంస భక్షకుడు తినుచుండగా చూచి, పతివ్రతయగు ఆ బ్రాహ్మణస్త్రీ తన స్థితికి చాల శోకించేను. ఆమె కోపించి, ఆ సౌదాస మహారాజునకు శాపమునిచ్చెను.
ఓ పాపీ! నీవు దుర్బుద్ధివి. కామనచే పీడించబడిన నా భర్తను నీవు తినివేసితివి. కావున, నేను నీకు కూడ మరణము సంభోగము వలననే కలుగునని భావించేదను (శపించుచున్నాను).
ఆ బ్రాహ్మణస్త్రీకి తన భర్త పొందిన పుణ్యలోకమే ఏకైకలక్ష్యము. ఆమె ఈ విధముగా మిత్రసహుని శపించి, అగ్నిని బాగా ప్రజ్వరిల్లజేసి, దానియందు తన భర్తయొక్క ఎముకలను సమర్పించెను. తరువాత ఆమె భర్త పొందిన లోకమును పొందెను.
పన్నెండు సంవత్సరముల తరువాత సౌదాస మహారాజునకు శాప విముక్తి కలిగెను. కానీ, ఆయనకు బ్రాహ్మణస్త్రీ ఇచ్చిన శాపమును గురించి ఆయన భార్యకు తెలిసెను. కావుననే, ఆమె ఆయన రమించగోరగా నివారించెను.
ఆ శాపము తరువాత ఆ సౌదాస మహారాజు స్త్రీతోడి సుఖమును విడిచి పెట్టెను. బ్రాహ్మణుని తినివేయుట అనే కర్మచే ఆయన సంతానము లేనివాడాయెను. ఆయన ప్రార్థించగా, వసిష్ఠుడు మదయంతియందు సంతానమును కనెను.
ఆ మదయంతి ఏడు సంవత్సరములు గర్బమును ధరించిననూ, శిశువు పుట్టలేదు. అపుడామె ఉదరము పై కొట్టుకోనగా శిశువు జన్మించెను. కావుననే, ఆ శిశువునకు అశ్మకుడు అనే పేరు స్థిరమయ్యెను.
అశ్మకుని పుత్రుడు మూలకుడు. పరశురాముడు క్షత్రియవంశములను నశింప జేయుచుండగా, స్త్రీలు ఆ బాలకుని అన్ని విధములుగా రక్షించుటచే, ఆ బాలకుడు నారీకవచుడు (స్త్రీలు కవచముగా గలవాడు) అని పిలువబడెను. క్షత్రియులు నశించగా, క్షత్రియవంశమునకు మూలపు రుషుడగుటచే, మూలకుడు అనే పేరు సార్థకమాయేను.
ఆ మూలకుని పుత్రుడు దశరథుడు. దశరథుని పుత్రుడు ఐడవిడుడు. ఐడవీడుని పుత్రుడు విశ్వసహ మహారాజు. విశ్వసహుని పుత్రుడగు ఖట్వాంగుడు చక్రవర్తి ఆయెను.
ఖట్వాంగుని యుద్ధములో జయించుట శక్యము కాదు. దేవతలు ప్రార్థించగా ఆయన రాక్షసులను సంహరించెను. తన ఆయుర్దాయము కేవలము సుమారు ఒక గంట మాత్రమే ఉన్నదని తెలియగానే, ఆయన తన నగరమునకు తిరిగి వచ్చి మనస్సును భగవానునిపై లగ్నము చేసెను.
(ఖట్వాంగుడు ఇట్లు తలపోసెను) -- వేదవేత్తల సమూహము మా కులదైవము. వారికంటే నాకు ప్రాణములు గాని, పుత్రులైననూ గాని, సంపదలు గాని, భూమి గాని, రాజ్యము గాని, భార్యయైననూ ఎక్కువ ప్రియమైనవి గావు,
నా బుద్ధి బాల్యమునందు కూడ ఏనాడైననూ అధర్మమునందు రమించలేదు. నేను ఏ వస్తువునైననూ పుణ్యకీర్తియగు శ్రీహరికంటె భిన్నముగా చూడలేదు.
ముల్లోకములకు ప్రభువులైన దేవతలు నాకు యథేచ్చగా కోరుకోమనీ వరమునిచ్చిరి. కానీ, నా మనస్సు ప్రాణుల రక్షకుడగు శ్రీహరి యందే గలదు. కావున, నేను ఆ వరమును కోరుట లేదు.
దేవతలైననూ ఇంద్రియములు మరియు బుద్ది భోగములచే ఆకర్షితములైనచో, తమ హృదయమునందే నిత్యము ప్రియమగు ఆత్మరూపుడైయున్న శ్రీహరినీ తెలియజాలరు. ఇతరులు (మానవులు) తెలియలేరని వేరుగా చెప్పవలయునా?
ఈశ్వరుని మాయాశక్తిచే నిర్మితములైన సత్త్వరజస్తమోగుణకార్యములగు శబ్దాది విషయములు గంధర్వనగరము వలె కనబడేవే గానీ వాస్తవముగా ఉన్నవి కావు. కాని, నైసర్గికమగు అజ్ఞానముచే బుద్దియందు వాటిపై ఆసక్తి గట్టిగా నెలకొని యున్నది. అందువలన, నేను జగత్కర్త యగు భగవానునియందలి భక్తిచే ఆ ఆసక్తిని విడిచి పెట్టి, ఆ భగవానునే శరణు వేడుచున్నాను.
ఖట్వాంగుని బుద్ది నారాయణునిచే ఆకర్షితమగుటచే ఆయన ఈ విధముగా నిశ్చయించుకోనెను. వెంటనే ఆయన అజ్ఞానకల్పితమగు భేద బుద్దిని (అనాత్మలగు దేహాదులయందు ఆత్మబుద్దిని విడిచి పెట్టి, తన స్వరూపమైయున్న భగవానుని (జ్ఞానముచే) పొందెను.
పరబ్రహ్మ ప్రకృతికి అతీతమైనది, ఇంద్రియగోచరము కానిది. అది శూన్యము కాదు. కాని, శూన్యమా యన్నట్లు కల్పించబడినది. సత్త్వ గుణప్రధానులగు భక్తులు ఆ పరబ్రహ్మను భగవానుడనియు, వాసుదేవుడ నియు వర్ణించుచున్నారు.
శ్రీమద్బాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో గంగావతరణ వృత్తాంతమును వర్ణించే తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (9).
Summary of chapter 9 of the Bhāgavata Mahā Purana is as follows:
Following Aṁśumān and his son Dilīpa, who performed severe penances without succeeding in bringing the Gaṅgā, Dilīpa's son King Bhagīratha undertook extraordinary austerities to bring the celestial river down from heaven. Pleased by his devotion, Goddess Gaṅgā agreed to descend, but warned that her falling torrent would shatter the earth unless sustained by a suitable foundation. Bhagīratha prayed to Mahādeva Śiva, who agreed to catch the cascading river upon His matted locks, cushioning her descent. Bhagīratha guided the flowing Gaṅgā across India to the ocean, where her holy waters inundated the ashes of his ancestors, liberating the sixty thousand sons of Sagara. The chapter also details the histories of King Saudāsa (Kalmāshapāda), who was cursed by Vasishṭha to become a man-eating Rākshasa due to an offense, and King Khaṭvāṅga, who learned he had only forty-eight minutes left to live and instantly achieved liberation by surrendering his mind completely to Bhagavān Śrī Kṛshṇa.