భాగవత మహా పురాణము
15 - పరశురామ కార్తవీర్యార్జునుల చరితము
శ్రీశుక ఉవాచ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! ఇలాపు త్రుడగు పురూరవునకు ఊర్వశి గర్భమునుండి ఆయువు, శ్రుతాయువు, సత్యాయువు, రయుడు, విజయుడు, మరియు జయుడు అనే ఆర్గురు పుత్రులు కలిగిరి.
శ్రుతాయువుయొక్క పుత్రుడు వసుమంతుడు. సత్యాయువు యొక్క పుత్రుడు శ్రుతంజయుడు. రయుని పుత్రుడు ఏకుడు. జయుని పుత్రుడు అమితుడు.
విజయుని పుత్రుడైతే భీముడు. భీముని పుత్రుడు కాంచనుడు. కాంచనుని పుత్రుడు హోత్రకుడు. హోత్రకుని పుత్రుడు జహ్నువు. జహ్నువు గంగను పుక్కిటబట్టి త్రాగివేసెను. జహ్నువుయొక్క పుత్రుడు పూరువు. పూరువు పుత్రుడు బలాకుడు. బలాకుని పుత్రుడు అజకుడు.
ఆ అజకుని పుత్రుడు కుశుడు. కుశునకు కుశాంబువు, తనయుడు, వసువు, కుశనాభుడు అనే నల్గురు పుత్రులు ఉండిరి. వారిలో కుశాంబుని పుత్రుడు గాధి.
ఆ గాధియొక్క కుమార్తె సత్యవతి. ఆమెను తనకిచ్చి వివాహము చేయుమని ఋచీకుడనే బ్రాహ్మణుడు కోరెను. కానీ, ఆయన తగిన వరుడు కాదని గాధి తలపోసి, భృగువంశీయుడగు ఆ ఋచీకునితో ఇట్లు పలికెను.
మేము కుశికవంశము వారము. మా కన్యకు కట్నముగా చంద్రుని వలె మెరిసిపోయే వేయి గుర్రములనీయవలెను. వాటికి ఒకవైపు (కుడి గా ని, ఎడమ గాని) చెవి నల్లగా నుండవలెను.
గాధి ఇట్లు పలుకగా ఆ ఋచీకుడు ఆయన అభిప్రాయమును తెలుసుకొని వరుణుని వద్దకు వెళ్లాను. ఆయనవద్దనుండి అట్టి గుర్రములను తీసుకువచ్చి ఇచ్చి సుందరముఖియగు ఆ కన్య (సత్యవతి) ను వివాహమాడెను.
ఆ ఋచీక మహర్షిని భార్య మరియు అత్తగారు కూడ తమకు సంతానము కలగాలని కోరిరి. అపుడా మహర్షి బ్రాహ్మణ (తన భార్య) క్షత్రి యు (అత్తగారు) లిద్దరికి చెందిన మంత్రములతో హోమమును చేసే అన్న మును వండి, స్నానమును చేయుటకు వెళ్లాను.
ఆయన తిరిగి వచ్చే లోపులో సత్యవతియొక్క చరువు శ్రేష్ఠమైన దని భావించి ఆమె తల్లి ఆ చరువును కోరెను. సత్యవతి దానిని తల్లికి ఇచ్చి, తల్లియొక్క చరువును తాను భక్షించెను.
ఆ విషయము తెలిసి ఋచీక మహర్షి ఇట్లు పలికెను -- హేయ మైన పనిని చేసితివి. నీకు క్రూరస్వభావము కలిగి శస్త్రములను ధరించే పుత్రుడు కలుగును. నీ తమ్ముడు వేదవేత్తలలో శ్రేష్ఠుడు అగును.
ఈ విధముగా ఘటిల్లరాదు అని సత్యవతి భృగువంశీయుడగు ఋచీక మహర్షిని ప్రసన్నుని చేసుకొనెను. అప్పుడాయన -- అయైనచో, నీ పుత్రుని పుత్రుడు అట్టివాడు (శస్త్రధారీ) కాగలడు -- అని చెప్పెను. తరు. వాత ఆమెకు జమదగ్ని (శాంతస్వభావుడు) పుట్టెను.
మహాపుణ్యాత్మురాలగు ఆ సత్యవతి జనులను పవిత్రము చేసే కౌశికి అనే నదియై ప్రవహించెను. రేణు మహర్షియొక్క కుమార్తెయగు రేణుకను జమదగ్ని వివాహమాడెను.
భృగువంశీయుడగు జమదగ్ని మహర్షికి రేణుకయందు వసుమం తుడు, వసువు, సుషేణుడు, రుమణ్వంతుడు అనే పుత్రులు కలిగిరి. వీరి తరువాత కనిష్ట పుత్రుడు జన్మించి, లోకములో (పరశు) రాముడు అనే పేరుతో చాల ప్రసిద్ధిని పొందెను.
హైహయుల వంశమును అంతమొందించిన ఆ పరశురాముడు శ్రీహరియొక్క అంశావతారమని చెప్పెదరు. ఆయన ఇరవై ఒక్క పర్యా యములు భూమండలముపై క్షత్రియులు లేకుండా చేసెను.
రజస్తమోగుణములతో నిండి దుర్బుద్ధితో వేదవేత్తలను పీడించే క్షత్రియుల సముదాయమును -- వారు చేసిన తప్పు చిన్నదే అయిననూ -- ఆయన వారిని సంహరించి, భూభారమును తొలగించెను.
రాజోవాచ ।
పరీక్షిన్మహారాజు ఇట్లు ప్రశ్నించెను --- మనోనిగ్రహము లేని క్షత్రి యులు భగవానునియెడల అపరాధమును చేయుటచే వారి వంశము పలు మార్లు వినాశము చేయబడినది గదా! వారు చేసిన ఆ అపరాధమెయ్యది?
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- హైహయవంశీయుల అధిపతి, క్షత్రియులలో శ్రేష్ఠుడు అగు కార్తవీర్యార్జునుడు నారాయణుని అంశావతారమైన దత్తాత్రేయునకు పరిచర్యలను చేసి ఆరాధించేను.
ఆయనకు దత్తాత్రేయుని అనుగ్రహముచే వేయి చేతులు, శత్రువు లచే పరాజయమును పొందకుండుట, మొక్కవోని ఇంద్రియపాటవము, సంపద, తేజస్సు, శక్తి, కీర్తి, మరియు బలములు లభించెను.
ఆయన యోగేశ్వరుడై అణిమ (దూదివలె తేలిక యగుట), గరిమ (పర్వతము వలె బరువు అగుట) మొదలైన సిద్దులు గల ఈశ్వరభావమును పొందెను. ఆయన వాయువు వలె ఆటంకము లేని గమనముతో లోకములను సంచరించెను.
గర్వముతో ఉద్రేకమును పొందియున్న ఆ కార్తవీర్యుడు గొప్ప యువతులు చుట్టువారియుండగా నర్మదానదీజలములలో విహరించుచుం డెను. ఆయన వైజయంతీ (తొమ్మిది రకముల మణుల) మాలను ధరించి యుండెను. ఆతడా నదీప్రవాహమును తన చేతులతో ఆపివేసెను.
ఆ సమీపములో దశకంఠుడగు రావణుడు శిబిరములో నుండెను. కార్తవీర్యుడు నదిని అడ్డుకొనగా, ప్రవాహము వెనుకకు మళ్లీ ఆ శిబి రమును ముంచివేసెను. తాను గొప్ప వీరుడననే అభిమానము రావణునకు ఉండెను. కావుననే, ఆయన కార్యవీర్యుని అట్టి (నదిని ఆపివేసే శక్తిని చూసి సహించలేక పోయెను.
రావణుడు కార్తవీర్యుని యెడల అనుచితముగా ప్రవర్తించెను. అపుడాయన ఆ రావణుని స్త్రీల యెదుటనే అలవోకగా కోతిని వలె పట్టుకోని మాహిష్మతీ నగరములో బంధించి తరువాత విడిచి పెట్టెను.
ఆ కార్తవీర్యుడు ఒకనాడు దట్టని అడవిలో వేటాడుతూ సంచరించే ను. ఆయన అనుకోకుండా (ఈశ్వరేచ్చచే) జమదగ్ని మహర్షియొక్క ఆశ్ర మస్థానమును ప్రవేశించెను.
తపస్సే ధనముగా గల జమదగ్ని వద్ద కామధేనువు గలదు. దాని అనుగ్రహముతో ఆయన ఆ మహారాజునకు, ఆయన సైన్యమునకు, మంత్రులకు, వాహనములకు కూడ ఆతిథ్యమునిచ్చెను.
వీరుడగు ఆ కార్తవీర్యుడు హైహయులతో కూడియుండెను. ఆతడు ఆ ఆశ్రమములో చూచిన సంపద (కామధేనువుచే సమకూర్చబడిన ఆతిథ్యము) తన ఐశ్వర్యమును అతిశయించి యుండెను. ఆయనకు ఆ కామధేనువునందు అభిలాష కలిగి, ఆ మహర్షి ఇచ్చిన ఆతిథ్యము సంతోష మును కలిగించలేదు.
ఆ రాజు గర్వముచే మహర్షియొక్క హోమధేనువును లాగుకొని రమ్మని తన అనుచరులను ఆదేశించెను. వారు కూడ ఆక్రోశించుచున్న ఆ కామధేనువును దూడతో సహా మాహిష్మతీ నగరమునకు బలాత్కారముగా లాగుకొని పోయిరి.
తరువాత మహారాజగు కార్తవీర్యుడు నిషమించెను. ఇంతలో రాముడు ఆశ్రమమునకు తిరిగి వచ్చెను. ఆయన ఆ కార్తవీర్యుని దుర్బు ద్ధిని గురించి విని, తోక తొక్కిన త్రాచు వలె, కోపించెను.
ఆ రాముడు భయంకరమగు గొడ్డలిని, డాలును, అంబుల పొదిని, ధనుస్సును తీసుకొని, నిలువరించ శక్యము కాని సింహము ఏనుగు వెంట బడినట్లుగా, ఆ కార్తవీర్యుని వెన్నంటి వేగముగా వెళ్లాను.
కార్తవీర్యుడు నగరములో ప్రవేశిస్తూ, భృగువంశీయులలో శ్రేష్టు డగు రాముడు తన మీదకు వేగముగా వచ్చుచుండగా చూచెను. లేడి చర్మ మును వస్త్రముగా దాల్చి, ధనుస్సు, బాణములు, గండ్ర గొడ్డలి అనే ఆయుధములను ధరించియున్న ఆ రాముని జటలు సూర్యకిరణముల వలె ప్రకాశించుచుండెను.
కార్తవీర్యుడు పది హేడు అక్షౌహిణీల సైన్యమును (క్రమముగా) రాముని పైకి పంపించెను. ఆ సేనయందు ఏనుగులు, రథములు, గుర్ర ములు మరియు పదాతులు ఉండిరి. గదలు, కత్తులు, బాణములు, ఈటెలు, ఇనుపముళ్ల కర్రలు మరియు చిల్లకోలలు అనే ఆయుధములతో ఆ సైన్యము చాల భయంకరముగ నుండెను. రాముడు ఒక్కడే ఆ సైన్యము నంతనూ సంహరించెను.
శత్రు సైన్యములను నుగ్గు నుగ్గు చేసే ఆ రాముడు మనస్సుయొక్క మరియు గాలియొక్క వేగమువంటి వేగముతో గండ్ర గొడ్డలితో కొట్టుచుండెను. ఆయన సైన్యములో ఎక్కడెక్కడైతే విక్రమించే నో, అక్కడక్కడ సైనికులు భుజములు, తొడలు, మెడలు తెగి క్రింద పడు చుండిరి. రథచోదకులు, గుర్రములు మొదలగు వాహనములు సంహరించ బడగా, వీరులు నేల గూలుచుండిరి.
ఆ యుద్ధరంగము రక్తప్రవాహములతో బురద ఆయెను. సైనికుల డాళ్లు, జెండాలు, ధనుస్సులు మరియు దేహములు కూడ రాముని గండ్ర గొడ్డలిచే మరియు బాణములచే తెగగొట్టబడి, ఆ సైన్యము నేల గూలెను. దానిని చూచి హైహయవంశీయుడగు కార్తవీర్యుడు కోపించి వేగముగా వచ్చెను.
అప్పుడా కార్తవీర్యార్జునుడు అయిదువందల ధనుస్సులయందు బాణములను ఎక్కు పెట్టి ఒకేసారి రామునిపై ప్రయోగించెను. అస్త్రవేత్త లలో అగ్రేసరుడగు రామునివద్ద ఒకే ధనుస్సు గలదు. ఆయన అనేకబాణములను ఒకేసారి ప్రయోగించి కార్తవీర్యుని బాణములను ముక్కలు ముక్కలుగా చేసెను.
యుద్ధరంగమునందు కార్తవీర్యుడు మరల తన చేతులతో పర్వత ములను, వృక్షములను ఊడబెరకి పైకెత్తి వేగముగా రామునకు ఎదురుగా పరుగెత్తి వచ్చుచుండెను. రాముడు యుద్ధములో ఆతని చేతులను, పాము పడగలను వలె, వాడియంచు గల గండ్ర గొడ్డలితో బలముగా నరికెను.
రాముడు ఆ కార్తవీర్యుని చేతులను నరికి పర్వతశిఖరమువంటి తలను ఊడగొట్టెను. ఈ విధముగా తమ తండ్రి సంహరించబడగా, ఆతనీ పుత్రులు పదివేలమంది పారిపోయిరి.
హోమధేనువు ఆశ్రమమునకు దూరమైనందులకు చాల దుఃఖ మును పొందియుండెను. శత్రువీరులను సంహరించిన రాముడు ఆ ధేను వును దూడతో సహా ఆశ్రమమునకు మళ్లించెను. ఆయన ఆశ్రమమును చేరుకొని ఆ ధేనువును తండ్రికి సమర్పించేను.
రాముడు తాను చేసిన ఆ పనిని గురించి తండ్రికి మరియు సోదరులకు కూడ వర్ణించి చెప్పెను. ఆ విషయమును విని జమదగ్ని ఇట్లు పలికెను.
ఓ రామా! రామా! నీవు గొప్ప భుజశక్తి గలవాడవు. కాని, నీవు సకలదేవతాస్వరూపుడగు నరపతిని వ్యర్థముగా సంహరించి పాపమునే చేసితివి.
అబ్బాయీ! బ్రాహ్మణులమగు మనమైతే సహనముచే పూజనీ యులమగుదుము. అట్టి సహనగుణముండుట చేతనే జగత్తును సృష్టించిన బ్రహ్మదేవుడు సర్వాతిశాయియగు సత్యలోకమును పొందినాడు.
వేదవేత్తల శోభ (సంపద) సహనగుణముచే సూర్యకాంతి వలే అధి కముగా ప్రకాశించును (వర్ధిల్లును). జగన్నాథుడగు శ్రీహరి భగవానుడు సహనగుణము గలవారల యెడల శీఘ్రముగా ప్రీతుడగును.
॥
సామ్రాజ్యపట్టాభిషిక్తుడైన మహారాజును వధించుట బ్రహ్మహత్య కంటె ఎక్కువ పాపము. నీవు బుద్దియందు అచ్యుతుని నిలిపి పుణ్య క్షేత్ర ములను సేవించి పాపమును పోగొట్టుకొనుము.
శ్రీమద్బాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో పరశురామ కార్తవీర్యార్జునుల వృత్తాంతమును వర్ణించే పదునైదవ అధ్యాయము ముగిసినది .
Summary of chapter 16 of the Bhāgavata Mahā Purana is as follows:
In revenge for Kārtavīryārjuna's death, the sons of the slain king crept into Jamadagni's ashram while Paraśurāma was absent and brutally murdered the peaceful sage while he was absorbed in meditation. Returning to find His father murdered, Bhagavān Paraśurāma took a solemn vow to rid the earth of corrupt, tyrannical Kshatriya rulers who had abandoned Vaidika Dharma. Paraśurāma waged a relentless military campaign, cleansing the earth of impious monarchs twenty-one times, filling five great lakes at Samantapañcaka with their blood. After restoring righteous order, Paraśurāma performed grand horse sacrifices, gave the conquered earth in charity to the brāhmaṇas, placed Jamadagni's head on his body to revive him as one of the Saptarshis, and retired to Mount Mahendra to engage in unbroken meditation.