భాగవత మహా పురాణము
4 - నాభాగుని చరితము - అంబరీషోపాఖ్యానము
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- నభగుడి కనిష్ట పుత్రుడు నాభా గుడు. ఆతడు గురుకులములో బ్రహ్మచారిగా ఉంటూ విద్యనభ్యసించి పండితుడై ఇంటికి తిరిగి వచ్చెను. ఆతని అన్నలు ఆస్తిలో వాటాగా ఆతనికి తండ్రిని అప్పజెప్పిరి.
అన్నలారా! నాకు ఏమి పంచి యిచ్చితిరి? అని నాభాగుడు ప్రశ్నించగా, నీకు తండ్రిని పంచి యిచ్చితిమని వారు చెప్పిరి. అపుడు నాభాగుడు తండ్రితో, తండ్రీ! పూజనీయులగు అన్నలు నాకు నిన్ను భాగముగా యిచ్చినారు, అని చెప్పెను. ఓ పుత్రా! నీవు వెర్రివాడవు. వారి మాటకు అంగీకరించకుము, అని తండ్రి చెప్పెను.
మంచి బుద్దిశాలురగు ఆంగిరస గోత్రీయులు ఈ కాలమునందు సత్రయాగము ననుష్ఠించుచున్నారు. విద్వాంసుడవగు ఓ పుత్రా! వారు ప్రతి ఆరవ దినము వచ్చునప్పటికి కర్మవిషయములో వ్యామోహమును పొందుచున్నారు.
మహాత్ములగు ఆ ఆంగిరసులచే నీవు విశ్వేదేవతలకు చెందిన రెండు సూక్తములను పఠింప జేయుము. వారు స్వర్గమునకు వెళ్లబోయే ముందు, సత్రయాగములో మిగిలిపోయిన తము ధనమును నీకిచ్చెదరు. కావున, వారి వద్దకు వెళ్లుము -- అని తండ్రి చెప్పగా, నాభాగుడు తండ్రి చెప్పిన విధముగనే చేసెను. ఆ ఆంగిరసులు సత్రయాగములో మిగిలిపో యిన ధనమును ఆతనికిచ్చి స్వర్గమునకు వెళ్లిరి.
యజ్ఞభూమియందలి ఆ ధనమును నాభాగుడు స్వీకరించబోవు చుండగా ఉత్తరము వైపునుండి నల్లని శరీరము గల ఒకానొక పురుషుడు ఎదురుగా వచ్చి, ఈ యజ్ఞభూమియందలి సంపద నాది, అని నాభాగు నితో పలికెను.
ఈ సంపదను మహర్షులు నాకు ఇచ్చినారని అప్పుడు మనువంశీ యుడగు నాభాగుడు చెప్పెను. మన ఈ వివాదము విషయములో నీ తండ్రిని ప్రశ్నించవలెనని ఆ పురుషుడు చెప్పెను. ఆయన చెప్పినట్లుగనే, నాభాగుడు తండ్రిని ప్రశ్నించెను.
ఒకప్పుడు మహర్షులు యజ్ఞభూమియందు మిగిలిపోయిన సర్వము రుద్రునకు చెందునని విభాగము చేసిరి. కావున, ఆ రుద్రదేవుడు సర్వమును తీసుకొనుటకు అర్హుడు, అని తండ్రి చెప్పెను.
నాభాగుడు ఆ రుద్రునకు ప్రణమిల్లి ఇట్లు పలికెను -- ఓ ఈశ్వరా! యజ్ఞభూమియందున్న సంపద నిశ్చయముగా నీదేనని నా తండ్రి చెప్పి నాడు. ఓ భగవానుడా! నేను శిరసు వంచి ప్రణమిల్లుచున్నాను. నా పై ప్రసన్నుడవు కమ్ము.
నీ తండ్రి ధర్మమును చెప్పినాడు. నీవు కూడ సత్యమును పలుకు చున్నావు. కావున, వైశ్వదేవసూక్తములను తెలుసుకున్న నీకు కాలమునకు అతీతమైన గొప్ప జ్ఞానమును (బ్రహ్మతత్త్వమును) ఉపదేశించెదను.
రుద్రభగవానునకు సత్యమునందు ప్రీతి మెండు. సత్రయాగము నందు మిగిలిపోయిన ధనమును నేను నీకు ఇచ్చుచున్నాను, తీసుకోను ము, అని పలికి ఆయన అంతర్ధానము జెందెను.
ఎవడైతే ఈ వృత్తాంతమును ఉదయము మరియు సాయంకా లము పూర్తి ఏకాగ్రతతో చక్కగా స్మరించునో, అట్టివాడు విద్వాంసుడు మరియు మంత్రవేత్త అగుటయే గాక, తన స్వరూపమగు పరబ్రహ్మను కూడ (ఆత్మరూపముగా) పొందును.
నాభాగుని పుత్రుడు అంబరీషుడు. ఆయన గొప్ప భగవద్బక్తుడు. ఆయన ఎంతటి పుణ్యాత్ముడంటే -- ఎన్నడైననూ దేని విషయములో నైననూ మొక్కవోని బ్రాహ్మణ (దుర్వాసుని శాపము కూడ ఆయనను ఏమీ చేయలేక పోయెను.
రాజోవాచ ।
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను -- పూజనీయుడవగు ఓ శుక మహర్షీ! అంబరీషుడు రాజర్షి, బుద్ధిశాలి. ఆయన గాథను నేను వినగోరుచు న్నాను. ఎందుకంటే, అతిక్రమించ శక్యము కాని బ్రాహ్మణుని శాపము ఆయనపై ప్రయోగించబడిననూ ఆయనను ఏమీ చేయలేక పోయేను.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- అంబరీషుడు గొప్ప భాగ్యవం తుడు. ఆయన ఏడు ఖండములతో కూడిన భూమండలము పై సాటిలేని ఈశ్వరభావమును పొందెను. ఆయన సంపద భూలోకములో తరిగి పోనిది.
మానవులకు మిక్కిలి దుర్లభమైన ఆ సర్వము కలవంటిది (కల్ల) మాత్రమేనని అంబరీషుడు తెలుసుకోనెను. ఏ సంపదల కోరకై మానవుడు పాపమును చేసి నరకమును పొందుతున్నాడో, ఆ సంపదలు ఆ యే దీపమువంటివేననే వివేకము ఆయనకు ఉండెను.
అంబరీషునకు వాసుదేవ భగవానునియందు మరియు వాసుదే వుని భక్తులగు సత్పురుషులయందు అతిశయించిన భక్తి ఉండెడిది. అట్టి భక్తి ఉన్నవానికి ఈ జగత్తు మట్టిబెడ్డవలే విలువ లేనిదిగా కన్పట్టును.
ఆ అంబరీషుడు మనస్సును శ్రీకృష్ణుని పాదపద్మములయందు, వాక్కులను శ్రీహరియొక్క గుణములను వర్ణించుటయందు, చేతులను రెండింటినీ శ్రీహరి మందిరమును తుడుచుట పుష్పములను కోయుట మొదలగు పనులయందు, చెవిని శ్రీహరియొక్క చక్కని గాథలను వినుట యందు నిశ్చయముగా లగ్నము చేసెను.
అంబరీషుడు కన్నులను రెండింటినీ మోక్షప్రదాతయగు శ్రీహరి యొక్క మూర్తుల ఆలయములను దర్శించుటయందు, త్వగీంద్రియ మును ఆ శ్రీహరి భక్తుల అంగముతోడి స్పర్శ (ఆలింగనాదులు) యందు, ముక్కును ఆయన పాదములయందు అర్పించబడిన తులసి పరిమళము నాఘ్రాణించుటయందు, నాలుకను ఆ శ్రీహరికి అర్పించిన నైవేద్యమును రుచి చూచుటయందు సంలగ్నము చేసెను.
అంబరీషుడు పాదములను రెండింటినీ శ్రీహరి క్షేత్రములకు పాద యాత్రను చేయుటయందు, తలను ఇంద్రియాధిపతియగు శ్రీహరి పాద ములకు అభివాదమును చేయుటయందు లగ్నము చేసెను. ఆయన చంద నాది భోగ్యవస్తువులను శ్రీహరి సేవయందు వినియోగించెనే గాని, వాటి యందలి ఇచ్చచే వాటిని స్వీకరించలేదు. ఇట్టి సేవచే సాధకుని ప్రేమకు పవిత్రకీర్తియగు శ్రీహరి భక్తులే కేంద్రబిందువులగుదురు.
అంబరీషుడీ విధముగా సర్వకాలములలో సర్వము ఆత్మరూపమే అనే భావన గలవాడై, తన కర్మలనన్నింటినీ యజ్ఞపురుషుడగు శ్రీహరి భగ వానునకు సమర్పించెను. ప్రకృతికి అతీతుడగు శ్రీహరి ప్రత్యక్షాది ప్రమా ణములకు గోచరుడు కాడు. అంబరీషుడు ఆ శ్రీహరియందు నిష్ఠ గల వేద వేత్తల వద్ద శిక్షణను పొంది, ఈ భూమిని పాలించెను.
ఈ అంబరీషుడు ధన్వ అనే ఎడారియందు సరస్వతీనది ప్రవాహ మునకు ఎదురుగా (ఆ నది ఒడ్డున) అనేకములగు అశ్వమేధ యాగము లను చేసి, యక్షేశ్వరుడు మరియు జగన్నాథుడు అగు శ్రీహరిని ఆరాధిం చెను. గొప్ప సంపదను వెచ్చించి ఆయన ఆ యజ్ఞములలోని అంగముల న్నియు పరిపూర్ణములగునట్లు చేసి అధికమగు దక్షిణలనిచ్చెను. వసి ష్ఠుడు, అసితుడు, గౌతముడు మొదలగు మహర్షులు ఆ యజ్ఞములను విస్తృతముగా నిర్వహింప జేసిరి.
అంబరీషుని యజ్ఞములయందు సభాసదులు, ఋత్విక్కులు, జనులు మంచి వస్త్రములను ధరించినవారై దేవతలతో సమానమైన రూప మును కలిగియుండిరి. పైగా, వారు కను రెప్పపాటు మాని చూచుచుండు టచే, దేవతలను పోలియున్నట్లు కన్పట్టిరి.
అంబరీషుని రాజ్యములోని జనులు పవిత్రకీర్తియగు శ్రీహరి యొక్క లీలలను విని గానము చేసెడివారు. దేవతలకు ప్రీతిపాత్రమైన స్వర్గమునందు వారికి ప్రీత్ లేకుండెను.
వారు మోక్షప్రదాతయగు శ్రీహరిని ఆత్మరూపముగా దర్శించెద రు. వారి అనుభవరూపమగు ఆత్మానందము ముందు విషయభోగముల ఆనందము దిగదుడుపు. సిద్దపురుషులకు దుర్లభములైన భోగములు కూడ వారికి హర్షమును కలిగించుట లేదు.
ఆ అంబరీష మహారాజు ఈ విధముగా తపస్సుతో కూడియున్న భక్తియోగముతో మరియు స్వధర్మము (ప్రజాపాలనము) ను అనుష్ఠించుట ద్వారా శ్రీహరిని ప్రసన్నుని చేసుకొనెను. ఆయన సంసారమునందలి ఆస క్తులనన్నింటినీ మెల్లమెల్లగా విడిచి పెట్టెను.
ఇల్లు, భార్య, సంతానము, బంధువులు, గొప్ప ఏనుగులు, రథము లు, గుర్రములు, సైన్యము, తరిగిపోని రత్నములు, ఆభరణములు, ఆయు ధములు, వస్త్రములు మొదలైనవి, అంతము లేని ఖజానాలు అనునవి మిథ్య అనే దృఢమగు నిశ్చయమును అంబరీషుడు కలిగియుండెను.
అంబరీషుని అనన్యమగు భక్తిభావముచే ప్రసన్నుడైన శ్రీహరి ఆయనకు చక్రమునిచ్చెను (ఆయన రక్షణకు చక్రమును నియోగించెను). ఆ చక్రము శత్రుపక్షము వారికి భయమును గొల్పి, భక్తులను రక్షించును.
వీరుడగు అంబరీషుని భార్య కూడ ఆయనతో సమానమైన శీలము గలదియే. ఆయన శ్రీకృష్ణుని ఆరాధించ గోరి, ఆమెతో గూడి సంవత్సర కాలము ద్వాదశీ వ్రతము (ఏకాదశినాడు ఉపవసించి ద్వాదశి నాడు ఉదయమే ఉపవాసమును సమాప్తి చేసే వ్రతము) ను పూనెను.
ఆయన కార్తీకమాసములో వ్రతముయొక్క అంతమునందు మూడు రోజులు ఉపవసించెను. ద్వాదశినాడు యమునానదిలో స్నానమును చేసినవాడై, ఆయన మధువనములో శ్రీహరిని అర్చించెను.
ఆయన శ్రీహరిని సామ్రాజ్యపట్టాభి షేకవిధితో అభిషేకించెను. ఆ అభిషేకము సకలసామగ్రులతో సంపన్నమాయెను. తరువాత ఆయన తన అంతఃకరణమును భక్తిభావముతో శ్రీహరిపై నిలిపెను. వస్త్రములు, ఆభర ణములు, గంధము, మాలలు, అర్ఘ్యదకము మొదలగువాటీతో ఆయన శ్రీహరిని పూజించెను. మరియు, ఆయన మహాత్ములైన బ్రహ్మవేత్తలను కూడ -- ఆ బ్రహ్మవేత్తలు సర్వము సిద్ధించినవారే అయిననూ -- భక్తితో పూజించెను.
ఆయన ముందుగా దానయోగ్యులైన బ్రాహ్మణులకు రుచికరమైన మరియు మిక్కిలి పుష్టికరమైన ఆహారమును ఏర్పాటు చేసెను. తరు వాత అరవై కోట్ల ఆవులను దూడతో సహా వారిళ్లకు చక్కగా పంపించేను. సాధుస్వభావము గలవై వయస్సులో నున్న ఆ ఆవుల కొమ్ములకు బంగార ము, గిట్టలకు వెండి తొడగబడెను. చక్కని రూపము గల ఆ ఆవుల పై చక్కని వస్త్రములు కప్పబడెను. వాటితో బాటుగా గంటలు, పాలు పితికే గిన్నెలు మొదలగు సామగ్రి కూడ ఈయబడెను.
వేద వేత్తలు దక్షిణలను పొంది, వ్రతము అంతమైనది గనుక భోజ నము చేయుడని అనుమతినీయగా, అంబరీషుడు అందుకు సంసిద్దుడగు చుండెను. ఇంతలో, పూజనీయుడగు దూర్వాస మహర్షి అతిథిగా ప్రత్యక్ష మాయెను.
అంబరీష మహారాజు ఆ అతిథిని చూచి లేచి నిలబడి ఎదురేగి. ఆసనముపై కూర్చుండబెట్టి పూజాద్రవ్యములతో పూజించెను. మహారాజు ఆయన పాదములకు ప్రణమిల్లి భోజనమునకు రండని కోరెను.
ఆ మహర్షి అంబరీషుని కోరికను స్వీకరించి మాధ్యాహ్నిక నిత్యక ర్మను నిర్వర్తించుటకై వెళ్లాను. ఆయన మంగళకరమగు యమునానదిలో స్నానము చేసి పరబ్రహ్మను ధ్యానించుచుండెను.
ద్వాదశి అరగంట మాత్రమే మిగిలియుండెను. ద్వాదశి వెళ్లి పోయే లోపులో వ్రతమును భోజనముతో ముగించవలెను. కాని, అతిథికి పెట్టకుండా తినరాదు. అంబరీషుడు ధర్మము తెలిసినవాడే అయినా, ఈ ధర్మసంకటమును గురించి వేదవేత్తలతో సంప్రదించెను.
బ్రాహ్మణుడు రాకుండా భోజనము చేసి ఆయన యెడల అపచా రము చేయుట తప్పు. ద్వాదశివేళ మించకుండా ప్రతాంత భోజనమును చేయకుండుట కూడ తప్పే. ఈ సంకటములో అధర్మము తగలకుండా నాకు మంచి కలిగే ఉపాయమేమి?
ఓ వేదవేత్తలారా! లేదా, నేను కేవలము నీటిని మాత్రమే త్రాగి వ్రతమును సమాప్తము చేసెదను. ఎందుకంటే, అట్లు నీటిని మాత్రమే త్రాగుట భోజనము చేసినట్లు కాదు, భోజనమును మానినట్లు కూడా కాదు.
కురువంశీయులలో శ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! రాజర్షియగు ఆ అంబరీషుడు నీటిని త్రాగి మనస్సులో శ్రీహరిని స్మరించెను. ఆయన వేదవేత్తయగు దూర్వాసుని రాక కొరకు ఎదురు చూచుచుండెను.
దూర్వాస మహర్షి నిత్యకర్మలను పూర్తి చేసుకొని యమునానదీ తీరమునుండి తిరిగి వచ్చెను. అంబరీష మహారాజు ఆయనకు నమస్కరించెను. రాజు నీటిని త్రాగిన విషయమును మహర్షి తన బుద్ధిచే గ్రహించెను.
అంబరీష మహారాజు దోసిలి యొగ్గి నిలబడి యుండెను. కాని, దూర్వాసుడు కోపముతో వణికిపోవుచుండెను. ఆయన ముఖము కనుబో మల విరుపుతో వికటముగా నుండెను. పైగా, ఆయన మిక్కిలి ఆకలి గొని యుండెను. ఆయన రాజుతో నిట్లనెను.
ఆహా! ఈ క్రూరుడు సంపదచే మదించి తాను ప్రభువుననే గర్వ ముతో ధర్మమునుల్లంఘించినాడు. చూడుడు. ఈతడు విష్ణుభక్తుడు కాడు.
నేను అతిథినై ఈతని వద్దకు వచ్చితిని. పైగా, ఈతడు నన్ను అతి థిసత్కారము కొరకు ఆహ్వానించినాడు. నాకు భోజనము పెట్టకుండానే తాను భుజించినాడు. ఓయీ! నీవు చేసినదానికి ఫలితమును నేను నీకు వెంటనే చూపించెదను.
కోపముతో మండి పడిన ఆ మహర్షి ఇట్లు పలుకుతూ జటను ఊడ పెరికి దానితో, అంబరీషుని చంపుట కొరకై ఒక క్షుద్రదేవతను నిర్మించెను. ఆ దేవత ప్రళయకాలాగ్నిని పోలి యుండెను.
ఆ క్షుద్రదేవత మండుతూ కత్తి చేతబట్టి కాలి అడుగులతో నేలను కంపింపజేస్తూ అంబరీష మహారాజు పైకి దూసుకువచ్చెను. కాని, ఆ రాజు ఆమెవైపు పట్టి పట్టి చూచెనే గాని, ఒక్క అడుగైననూ కదలలేదు.
దేశకాలములకు అతీతమైన ఆత్మయే స్వరూపముగా గల పురుషో త్తముడు ఇదివరలో తన భక్తుడగు అంబరీషుని రక్షణకై చక్రమును ఆదే శించి యుండెను. ఇప్పుడా చక్రము ఆ క్షుద్రదేవతను, కోపముతో బుసలు కొట్టే పామును కార్చిచ్చు వలె కాల్చివేసెను.
తాను చేసిన ప్రయత్నము విఫలమై చక్రము తన వైపునకు దూసుకువచ్చుటను గాంచిన దూర్వాస మహర్షి తన ప్రాణములను రక్షించుకొనగోరి, నలువైపులకు పరుగులు దీసెను.
ఎగసిపడే మంటలతో కార్చిచ్చు. పామును వెంటాడినట్లుగా, శ్రీహరి భగవానుని ఆ చక్రము ఆ మహర్షిని వెంట పరుగెత్తెను. ఆ విధ ముగా తననే వెంటాడుతున్న ఆ చక్రమును చూచి ఆ మహర్షి మేరు పర్వ తముయొక్క గుహలో ప్రవేశించగోరి పరుగు దీసెను.
దిక్కులు, ఆకాశము, భూలోకము, పాతాళలోకములు, సముద్ర ములు, యముడు మొదలగు లోకపాలకులతో కూడియున్న నరకము మొదలగు లోకములు, స్వర్గము అనే స్థానములన్నింటికి ఆ మహర్షి వెళ్లే ను. కాని, ఆయన ఎచటకు వెళ్లిననూ, అచట ఆయనకు ఆ చక్రమే ప్రత్యక్ష మాయెను.
ఆ మహర్షి చిత్తములో చాల భయపడిపోయేను. ఆయన తనకు శరణునిచ్చువాని కొరకు చూచుచుండెను. కాని, ఆయనకు ఎక్కడైననూ రక్షించువాడు దొరకలేదు. ఆపుడాయన బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి ఇట్లు పలి కెను -- స్వయంభువుడవగు ఓ బ్రహ్మా! పరాజయమునెరుంగని శ్రీహరి యొక్క చక్రమునుండి నన్ను కాపాడుము.
బ్రహ్మోవాచ ।
బ్రహ్మగారు ఇట్లు పలికెను --- ద్విపరార్దము (బ్రహ్మమాములో వంద యేళ్లు) కాలము పూర్తి అయినప్పుడు జగత్తు అనే శ్రీహరి భగవా నుని క్రీడ అంతమగును. కాలస్వరూపుడగు శ్రీహరి అప్పుడు ఈ జగత్తును దహించగోరి కనుబొమలను వీరువగా, అంతమాత్రము చేతనే ఈ సకలజ గత్తు మరియు నా ఈ లోకము కూడ అంతర్ధానమగును.
నేను, రుద్రుడు, దక్షుడు భృగువు మొదలగు ప్రజాపతులు, భూత నాథులు, దేవనాయకులు మొదలైన మేమందరము ఆ శ్రీహరి ఆజ్ఞను తల దాల్చి లోకములకు హితమును చేయుటకై ఆ ఆజ్ఞను పాలించుచుందుము.
విష్ణుచక్రముచే తపింపజేయబడే దూర్వాస మహర్షిని బ్రహ్మగారు స్వీకరించలేదు. అపుడా మహర్షి కైలాసవాసియగు రుద్రుని శరణు వేడెను.
శ్రీరుద్ర ఉవాచ ।
శ్రీరుద్రుడు ఇట్లు పలికెను --- వత్సా! అనంతుడగు శ్రీహరి విష యములో మేము (దేనీ కైననూ) సమర్థులము కాము. బ్రహ్మగారు అనే జీ వునకు ఈ బ్రహ్మాండము ఉపాధి. ఇటువంటి బ్రహ్మాండములు కూడ అనం తసంఖ్యలో ఆ పరమేశ్వరునియందు సృష్టికాలమునందు ప్రకటమై ప్రళ యకాలమునందు విలీనమగుచుండును. మేమా బ్రహ్మాండములలో తిరు గాడుచుందుము.
నేను, సనత్కుమారుడు, నారదుడు, స్వయంభువుడగు బ్రహ్మదే వుడు, కపిలుడు, అపాంతరతముడు (వ్యాసుడు), దేవలుడు, ధర్ముడు, ఆసురీ, మరీచి మొదలైన ఇతరులగు సర్వజ్ఞులైన సిద్దేశ్వరులము మేము అందరము ఆ పరమాత్మయొక్క మాయచే కప్పివేయబడి యున్నాము. మేము ఆ పరమాత్మయొక్క మాయను తెలియ లేకున్నావు.
నీవా శ్రీహరినే శరణు వేడుము. ఏలయనగా, జగన్నాథుడగు ఆ శ్రీహరియొక్క ఈ ఆయుధము మాకు సహించ శక్యము కానిది. నీకు శ్రీహరియే మంగళమును కలిగించగలడు.
నిరాశను చెందిన దూర్వాస మహర్షి ఆ కైలాసమునుండి శ్రీహరి భగవానుని ధామమునకు వెళ్లాను. ఆ ధామమునకు వైకుంఠము అని పేరు. దానిని శ్రీనివాసుడు శ్రీదేవితో గూడి అధిష్టించి యుండును.
అపరాజితుడగు శ్రీహరియొక్క చక్రమునుండి పుట్టిన అగ్ని ఆ మహర్షిని అధికముగా తగులబెట్టుచుండెను. ఆయన వణికిపోతూ శ్రీహరి పాదమూలమునందు పడి ఇట్లు పలికెను -- ఓ అచ్యుతా! అనంతా! సత్పు రుషులు నిన్నే కోరెదరు. నేను అపరాధమును చేసితిని. జగత్తును రక్షించే నీవు నన్ను కూడ రక్షించుము.
ఓ ప్రభూ! సర్వాతిశాయియగు నీ మహిమ తెలియక నేను నీ ప్రియభక్తులకు దుఃఖమును కలిగించితిని. దానికి ప్రాయశ్చిత్తమును విధిం చుము. నరకములో నున్న జీవుడు కూడ నీ పేరును ఉచ్చరించినచో, మోక్షమును పొందును.
శ్రీభగవానువాచ ।
శ్రీహరి భగవానుడిట్లు పలికెను --- ఓ మహర్షీ! నేను భక్తులకు వశమై యుండెదను. నాకు భక్తుల విషయములో స్వాతంత్యము లేదా యన్నట్లు ఉన్నది. ఏలయనగా సత్పురుషులగు భక్తులు నా చిత్తమును తమ వశము చేసుకున్నారు. భక్తజనులకు ప్రియుడనగు నాకు కూడ భక్తజ నులు ప్రియులు..
ఓ మహర్షీ! సత్పురుషులగు నా భక్తులకు సర్వాతిశాయియగు ఆశ్రయము నేనే. వారు లేకుండా నేను నన్ను గాని, నాతో విభాగమే లేని శ్రీదేవిని గాని కోరను.
ఎవరైతే జీవన హేతువులైన భార్య-ఇల్లు-పుత్రులు-బంధువులను, ప్రాణములపై ఆసక్తిని, సంపదను, ఇహపరలోకములను కూడ విడిచి పెట్టి నన్నే శరణు వేడెదరో, అట్టి భక్తులను నేను ఎట్లు విడిచి పెట్ట గల్గుదును?
సత్పురుషులు వారి హృదయమును స్థిరముగా నా పై నిలిపెదరు. వారు సర్వమునందు సమముగా వ్యాపించియున్న ఈశ్వరుని దర్శించేద రు. అట్టి సత్పురుషులు, మంచి యువతి తన భర్తను వలె, నన్ను వశము చేసుకోనెదరు.
నా సేవ సంతుష్టులయ్యే భక్తులు నా సేవచే లభించే సాలోక్య (శ్రీహరితో సమానమైన లోకములో నివసించుట)-సామీప్య (శ్రీహరికి సమీ పములోనుండుట)-సారూప్య (శ్రీహరితో సమానమైన రూపమును కలిగి యుండుట)-సాయుజ్య (శ్రీహరిలో విలీనమగుట) ములనే నాలుగు రక ముల మోక్షమును కూడ ఇష్టపడరు. కాలముచే కబళించి వేయబడే స్వర్గాది లోకములను వారు కోరరని వేరుగా చెప్పవలయునా?
సత్పురుషులకు నేను హృదయము (అత్యంతప్రియుడను). సత్పురుషులు నాకు హృదయము (అత్యంతప్రియులు). వారు నాకంటే భిన్నముగా ఇతరమును చూడనే చూడరు. వారికంటె ప్రియమైనది ఇత రము నాకు కొంచెమైననూ లేదు.
ఓ మహర్షీ! నీకు నేను ఉపాయమును చేప్పెదను. దానిని విను ము. నీవు ఎవని నిమిత్తముగా నీకు నీవే పీడను కొని తెచ్చుకున్నావో, ఆయననే నీవు శరణు వేడుము. ఒకడు తన శక్తిని సత్పురుషులపై ప్రయో గిస్తే, అది ఆ ప్రయోగించినవానికే అనర్థమును కలిగించును.
తపస్సు, ఉపాసన అనే రెండు వినయము గల మహరులకు మోక్షసాధనములు. కాని, వినయము లేని సాధకునకు ఆ రెండు అనర్థ మును కలిగించుటకు సమర్థము లగుచున్నవి.
ఓ మహర్షీ! కావున వెళ్లుము. నీకు మంగళమగు గాక! సోభాగుని పుత్రుడగు అంబరీష మహారాజు నిన్ను క్షమించునట్లు చేసుకొనుము. ఆయన గొప్ప భాగ్యశాలి. ఆయన క్షమించుట వలన నీకు తాపశాంతి కలు గగలదు.
శ్రీమద్బాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో నాభాగ వృత్తాంతమును అంబరీషోపాఖ్యానమును వర్ణించే నాల్గవ అధ్యాయము ముగిసినది (4).
Summary of chapter 4 of the Bhāgavata Mahā Purana is as follows:
This chapter documents the exalted life of King Ambarīsha, a sovereign emperor descended from Nabhaga, who engaged all his senses, royal wealth, and kingdom exclusively in the unalloyed devotional service of Bhagavān (*Sa vai manaḥ kṛshṇa-padāravindayoḥ*). Having observed the strict year-long Dvādaśī-vrata fast alongside his queen, Ambarīsha prepared to break his fast on the morning of Dvādaśī, when the fiery mystic sage Durvāsā Muni arrived as an uninvited guest. Durvāsā departed for the Yamunā River to perform ablutions, delaying his return beyond the astrologically sacred time limit. To honor scriptural injunctions without disrespecting his guest, King Ambarīsha drank a drop of sanctified water. Returning from the river, Durvāsā became enraged by this perceived disrespect and tore a lock of hair to create a blazing demon to destroy the king. Ambarīsha remained serene with folded hands, whereupon Bhagavān Vishṇu's weapon, the Sudarśana Chakra, instantly manifested, incinerated the demon, and pursued the terrified Durvāsā across the cosmos.