బ్రహ్మ వైవర్త మహా పురాణము - బ్రహ్మ ఖండము

1 – అనుక్రమణిక

జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం

ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే

అథబ్రహ్మవైవర్తో బ్రహ్మఖండం-

బ్రహ్మవైవర్తపురాణములోని బ్రహ్మ, ప్రకృతి, గణపతి, శ్రీకృష్ణ జన్మఖండములనే నాలుగుఖండములలో బ్రహ్మఖండము ప్రారంభింపబడుతున్నది.

గణేశ బ్రహ్మేశ సురేశ శేషాః సురాశ్చ సర్వే మనవో మునీంద్రాః

సరస్వతి శ్రీగిరిజాదికాశ్చ యం నమంతీ దేవః ప్రణమామితం విభుం

స్థూలాస్తనూర్విదధతం త్రిగుణం వీరాజం విశ్వానీ లోమవీవరేషు మహాంతమాద్యం

సృష్ట్యున్ముఖః స్వకలయాపి ససర్జసూక్ష్మం నిత్యం సమేత్య హృది య స్తమజం భజామి

ధ్యాయంలో ధ్యాన నిష్ఠాః సురనరమనవో యోగినో యోగరూఢాః

సంతః స్వప్నేఽసి సంతం కతికతిజనీభీర్యం న పశ్యంతి తప్త్యా

ధ్యాయే స్వేచ్చామయం తం త్రిగుణపరమహో నిర్వికారం నిరీహం

భక్త్యా ధ్యానైక హేతోర్నిరుపమ రుచిరశ్యామ రూపం దధానం

వందే కృష్ణం గుణాతీతం పరం బ్రహ్మాచ్యుతం యతః

ఆవిర్బభూవు: ప్రకృతి బ్రహ్మ విష్ణు శివాదయః

గణపతి. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, ఆదిశేషుడు మొదలైన దేవతలు, మనువు మొదలైన మహర్షులు, శ్రీదేవి, పార్వతి, సరస్వతి మొదలైన స్త్రీదేవతలు ఎవరిని ఎల్లప్పుడు నమస్కరింతురో ఆ శ్రీకృష్ణుని నమస్కరింతును.

త్రిగుణ స్వరూపుడు, మహత్స్వరూపుడు, ఆద్యుడైన శ్రీకృష్ణుడు సృష్టిచేయదలిచి తన రోమకూపములలో సమస్తలోకములను, స్థూలశరీరములను ఏర్పరుస్తూ తన మాయతో సూక్ష్మస్వరూపాన్ని కూడ సృష్టించినాడు. ఆట్టి పరబ్రహ్మరూపియైన శ్రీకృష్ణుని సదా నా మనస్సులో ధ్యానింతును.

ధ్యానైక నిష్టులైన దేవతలు, మునులు, మానవులు, యోగులు, ఏ పరమేశ్వరుని ఎల్లప్పుడు ధ్యానించినా, ఎన్ని జన్మలకైనా స్వప్నంలో కూడా అతనిని చూడలేకపోతున్నారో, త్రిగుణాతీతుడు, నిర్వికారుడు, కోరికలు ఏ మాత్రము లేని ఆ పరమపురుషుడు భక్తులు ధ్యానించుకొనుటకు అనుకూలముగా మిక్కిలి సుందరమైన నల్లని రూపును ధరిస్తున్నాడు. స్వేచ్ఛామయుడైన శ్రీకృష్ణదేవుని భక్తితో ధ్యానింతును..

బ్రహ్మ, అచ్యుతాదులకన్నా విశిష్టుడు త్రిగుణాతీతుడు ఐన ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మమునుండి ప్రకృతి, బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలగువారు ఉద్భవించిరి. ఆ శ్రీకృష్ణ తత్వమును నేను నమస్కరింతును.

ఓం నమో భగవతే  వాసుదేవాయ - భగవంతుడగు వాసుదేవునికి నమస్కారము.

నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్

అమృతపరమపూర్వం భారతికామధేనుం

శ్రుతిగణ కృతవతో వ్యాసదేవో దుదాహ

ఆతిరుచిర పురాణం బ్రహ్మవైవర్తమేతత్

పిబత పిబత ముగ్ధ దుగ్ధ మక్షయ్య మిష్టం

నారాయణుని, నరుడనే మునిని, సరస్వతిని వ్యాసుని నమస్కరించి "జయ" శబ్దము చేయవలెను.

శ్రీవేదవ్యాసుడు వేదములను దూడగా ఒనర్చి, భారతి అను కామధేనువుమ పితుకగా వచ్చిన అపూర్వము, అమృతమయము, పురాణములలో కడు - ఇంపైన బ్రహ్మవైవర్త పురాణమనే క్షయములేని పాలను కడు ఇష్టముగా త్రాగుడు.

భారతే నైమిషారణ్యే ఋషయః శౌనకాదయః  

నీత్యాం నైమిత్తికీం కృత్వా క్రియా మూషు: కుశాసనే

భరతఖండములోని నైమిశారణ్యములో శౌనకాదిమహర్షులు నిత్య నైమిత్తిక క్రియలు పూర్తిచేసికొని దర్భాసనములో కూర్చొని ఉండిరి.

ఏతస్మిన్నంతరే సౌతిమాగచ్ఛంతం యదృచ్ఛయా  

ప్రణతం సువినీతం తం విలోక్య దదురాసనం

తం సంపూజ్యోతిథిం భక్త్యా శౌనకో మునిపుంగవః

పప్రచ్చ కుశలం శాంతం శాంతః పౌరాణికం ముదా

వర్త్మాయాసవినిర్ముక్తం  వసంతం సుస్థిరాసతే

సస్మితం సర్వతత్వజ్ఞం పురాణానాం పురాణవిత్

పరం కృష్ణకధోపేతం పురాణం శ్రుతిసంమతం  

మంగళం మంగళార్హంచ మాంగళ్యం మంగళాలయం

సర్వమంగళబీజం చ సర్వదా మంగళప్రదం  

సర్వమంగళనిఘ్నంచ సర్వసంపత్కరం వరం

హరిభక్తిప్రదం శశ్వత్సుఖదం మోక్షదం భవాత్

తత్వజ్ఞానప్రదం దారపుత్రపౌత్ర వివర్ధనం  

పప్రచ్ఛ సువివీతం చ సుప్రీతో మునిసంసది  

యథాకశే తారకాణాం ద్వీజరాజో విరాజితే

ఆ సమయములో అనుకొనకుండా అక్కడికి వచ్చిన సౌతిని (సూతమహర్షి వంశజుడైన రోమహర్షణి మహర్షిని చూచి శౌనకాదిమునులు ఆసనమునిచ్చిరి.

(పృథుచక్రవర్తి యజ్ఞములు చేయుచున్నప్పుడు శ్రీమహావిష్ణువే సూతుడనే పేరుతో పురాణకథలను చెప్పినట్లు, అతని వంశమున పుట్టిన వారినందరిని సూతుడనే పేరుతోనే పిలుస్తున్నట్లు బ్రహ్మాండ పురాణము తెల్పుచున్నది. వ్యాసమహర్షి శిష్యులలో ఒకడైన రోమహర్షణీముని పురాణముల నన్నిటిని శౌనకాది మహర్షులకు వినిపించినాడు.)

ఆతిథిగా వచ్చిన ఆ సౌతమునిని శౌనక మహర్షి గౌరవించి ఇట్లు కుశలప్రశ్న వేసినాడు,

మార్గాయాసము తొలగిన పిమ్మట స్థిరాసనమున ఉన్నవాడు, సమస్త తత్వములు తెలిసినవాడు, ప్రాచీనములైన పురాణములన్ని తెలిసిన ఆ సౌతమహర్షిని మునుల సభలో శౌనకముని ఈవిధముగా ప్రశ్నించినాడు.

సమస్తశ్రుతి సమ్మతము, మంగళప్రదము అమంగళములనన్నిటిని తొలగించునది, సమస్త సంపదలను కలిగించునది. హరీయందు భక్తిని, శాశ్వత సుఖములను, మోక్షమును, తత్వజ్ఞానమును కలిగించునది, భార్యాపుత్రపౌత్ర సంపదనభివృద్ధిచేయునదీ, కృష్ణకథా సమన్వితమైన పురాణమును వినగోరి ఆకాశమునందున్న తారకలలో చంద్రునివంటి శౌనకమహర్షి ఇట్లు అడిగెను.

శౌనక ఉవాచ - శౌనకమహర్షి ఇట్లు పలికెను.

ప్రస్థానం భవతః కుత్ర కుత ఆయాసి తే శివం

కిమస్మాకం పుణ్యదినమద్య త్వద్దర్శనేనచ

వయమేవ కలౌ భీతా విశిష్టజ్ఞానవర్జితాః

ముముక్షువో భవే మగా సద్దతు సమిహాగతః

భవావ్ సాధుర్మహాభాగః పురాణేషు పురాణవీల్

సర్వేషు చ పురాణేషు నిష్ణాతోఽతీకృపానిధిః

శ్రీకృష్ణ నిశ్చలభక్తిర్యతో భవతీ శాశ్వత

తత్కథ్యతార మహాభాగ పురాణం జ్ఞానవర్ధనం II

గరీయసీ యా సాక్షాచ్చ కర్మమూల నికృంతనీ

సంసారసన్నిబద్ధానాం నిగిడచ్ఛేదకర్తరీ

భవదావాగ్ని దగ్దానాం పీయూషవృష్టివర్షిణీ

సుఖదానందదా సౌతే శశ్వచ్చేతసి జీవినాం

మీరు ఎచ్చటికి వెళ్ళుచున్నారు. ఎక్కడినుండి వచ్చుచున్నారు. మీకు మంగళమగుగాక. మీదర్శనమువలన మాకు ఈ దినము సుదినము.

మేము విజ్ఞాన రహితులము. సంసారసాగరమున మునిగి ఉన్నాము. కలియుగములో ఉన్నందువలన కలియుగ ధర్మములనుండి భయపడి మోక్షమును కోరి ఉన్నాము. మీరు మమ్ము సుజ్ఞానులచేసి మోక్షము కలిగించుటకు ఇచ్చటికి వచ్చియున్నారు.

మీరు సాధువులు శ్రేష్ఠులు. సమస్తపురాణములను ఎడిగినవారు. మిక్కిలి దయగలవారు.

ఏ పురాణశ్రవణమువలన కర్మబంధాలను సమూలముగా నిర్మూలము చేయగల్గినదీ, సంసారబద్ధులైనవారీ సంకెళ్ళమ ఛేదించగల్గినదీ, సంసారమనే కారుచిచ్చునబడి దగ్గమగుచున్నవారిపై అమృతవర్షాన్ని వర్షించునది. ఆనందమును, సుఖమును ఎల్లప్పటికి కల్గించునది ఐన శ్రీకృష్ణభక్తి కలుగునో ఆ పురాణమును మాకు చెప్పగలరని ప్రార్థన.

యత్రాదౌ సర్వబీజం చ పరం బ్రహ్మ నిరూపణం  

తస్య సృష్ట్యున్ముఖస్యాఽపి సృష్టేష్రుత్కీర్తనం పరం II

సాకారం వా నిరాకారం పరమాత్మ స్వరూపకం

కిమాకారం చ తద్ర్బహ్మ తద్ధానం కిం చ భావనం

ధ్యాయంతే వైష్ణవాః కిం వా శాంతాశ్చ యోగినస్తథా

మతం ప్రధానం కేషాం వా గూడం  వేదే నిరూపితం

ప్రకృతేశ్చ య ఆకారో యత్రవల్ప నిరూపితః

గుణానాం లక్షణం యత్ర మహదాదేశ్చ నిశ్చయః

గోలోక వర్ణనం యత్ర యత్ర వైకుంఠ వర్ణనం

వర్ణనం శివలోకస్య యత్రాన్యత్ స్వర్గవర్ణనం

ఆంశానాం చ కలానాం చ యత్ర సౌతే నిరూపణం

కే ప్రాకృతా: కా ప్రకృతీః క ఆత్మా ప్రకృతేః పరః

నిగూఢం జన్మ యేషాం వా దేవానాం దేవయోషితాం

సముత్పత్తి: సముద్రాణాం శైలానాం సరితామహీ

కేవాంశా: ప్రకృతేశ్చాపి కలా: కా వా కలాకలాః

తాసాంచ చరితం ధ్యానం పూజాస్తోత్రాదికం శుభం I

దుర్గా సరస్వతీ లక్ష్మీ సావిత్రీణాం చ వర్ణనం

యశైవ రాధికాఖ్యానం అత్యపూర్వం సుధోపమం

జీవకర్మవిపాకశ్చ నరకాణాం చ వర్ణనం

కర్మాణాం ఖండనం యత్ర యత్ర తేభ్యో విమోక్షణం

యేషాంచ జీవినాం యద్యత్ స్థానం యత్ర శుభాశుభం

జీవినాం కర్మణో యస్మాద్యొసు యాసు చ యోనిషు

జీవినాం కర్మణో యస్మాద్యో  యో రాగో భవేదిహ  

మోక్షణం కర్మణో యస్మాత్తేషాం చ తన్నిరూషయ

ఏ పురాణమున తొలుత సమస్తమునకు కారణమైన బ్రహ్మ' నిరూపణము, చరాచర జగత్తును సృష్టించ దలచిన ఆ పరబ్రహ్మయొక్క సృష్టి వివరణ, సాకారము, నిరాకారము ఐన ఆ పరమాత్మస్వరూపము. ఆ పరమాత్మను ధ్యానము చేయువిధము, వైష్ణవులు, యోగులు ఎవని ధ్యానింతురో, వేదప్రోక్తమైన వారి మతము, ప్రకృతి స్వరూపము, సత్వరజస్తమోగుణముల లక్షణము, పృథివి మొదలగు పంచభూతములు, వాటి తన్మాత్రలు, మహత్తు మొదలైనవాటి వివరణ, గోలోక వర్ణన, వైకుంఠ వర్ణన, శివలోక వర్ణన, ఇంకను స్వర్గలోక వర్ణన, ప్రాకృతులు, ప్రకృతీకన్న భిన్నమైన ఆత్మస్వరూప వివరణ దేవతలు, దేవతాస్త్రీలు, సముద్రములు, పర్వతములు నదులయొక్క ఉత్పత్తి, దుర్గ, లక్ష్మి, సావిత్రి, సరస్వతుల వర్ణన, వారి ధ్యానము, పూజాస్తోత్రాదికములు, అమృతప్రాయమైన రాధాదేవి చరిత్ర, నరక వర్ణన, జీవులు ఏ ఏ స్థానములందుందురో ఆయాస్థాన వర్ణన, జీవులు తాము చేయు శుభాశుభ కర్మలననుసరించి ఏ ఏ యోనులలో పుట్టునో, ఏ ఏ రోగముల పొందునో, ఆ యా కర్మలనుండి మోక్షము పొందు విధము, చెప్పబడిన ఆ పురాణమును మాకు వీపులముగా తెలుపుడు.

మనసా తులసీ కాళీ గంగా పృద్వీ వసుంధరా

ఆసాం యత్ర శుభాఖ్యాన మన్యాసామపి యత్రవై

శాలిగ్రామశిలానాంచ దానానాంచ నిరూపణం

అపూర్వం యత్రజా సౌతే ధర్మాధర్మ నిరూపణం

గణేశ్వరస్య చరితం యత్ర తజ్జన్మ కర్మ చ

కవచస్తోత్రమంత్రాణాం గూడానాం యత్ర వర్ణనం

యదపూర్వముపాఖ్యానం ఆశ్రుతం పరమాద్భుతం

కృత్వా మనసి తత్సర్వం సాంప్రతం వక్తుమర్హసి

మనస, తులసి, కాళీ, గంగ, పృథివి, ఇంకను ఇతర దేవతల కథలు, శాలిగ్రామ శిలలగూర్చి వాటిని దానము చేయుటవలన కలుగు ఫలితములు, ధర్మాధర్మముల వివరణ. గణపతి చరిత్ర, కవచము, స్తోత్రములు, నిగూడమైన మంత్రములు మొదలగువాని వివరణ, ఇంతవరకు ఎన్నడు విననీ, అపూర్వము, అత్యద్భుతమైన ఉపాఖ్యానములు ఏ పురాణమున కలవో ఆపురాణమునంతయు మాకు చెప్పవలసినది.

యత్ర జన్మ భ్రమో విశ్వ పుణ్యక్షేత్రే చ భారతే

పరిపూర్ణతమస్యాపి కృష్ణస్య పరమాత్మనః

జన్మ కస్య గృహెలబ్ధం పుణ్యే పుణ్యవతో మునే

సుతం ప్రసూతా కా ధన్యా మాన్యా పుణ్యవతీ సతీ

ఆవిర్భూయ చ తద్గేహాత్ క్వా గతః కేన హేతునా  

గత్వా కిం కృతవాంస్తత్ర కథం వా పునరాగతః

భారావతరణం కేన ప్రార్థితో గోశ్చకార సః

విధాయ కిం వా సేతుం చ గోలోకం గతవాంపునః

ఇతీద మన్య దాఖ్యానం పురాణం శ్రుతి దుర్లభం

దుర్విజ్ఞేయం మునీనాం చ మనోనిర్మలకారణం

స్వాజ్ఞానాద్యన్మయా పృష్టం అపృష్టం వా శుభాశుభం  

సద్యోవైరాగ్య జననం తన్మే వ్యాఖ్యాతు మర్హసి

భారతదేశమందలి ఏ పుణ్యక్షేత్రమున పరమాత్మయైన శ్రీకృష్ణుడు జన్మించినాడో, ఏపుణ్యవంతుని పవిత్రమైన గృహమున ఆ పరమాత్మ పుట్టినాడో, పూజనీయురాలు, సతి అగు ఏ పుణ్యవతి ఆతనిని కన్నదో, ఆ పరమాత్మ జన్మించిన స్థలమునుండి ఏకారణమున బయటికి వెళ్ళెనో, అచ్చట ఏఏ కార్యములు చేసెనో, మరల ఎట్లు తాను పుట్టినచోటికి తిరిగి వచ్చెనో, ఎవరీ ప్రార్థనవల్ల భూ భారమును తగ్గించెనో, ఏఏ కార్యములు చేసి తిరిగి గోలోకమునకు వెళ్ళెనో శ్రుతి దుర్లభము, మునులకు సైతం తెలియరానిది, మనస్సును తేలికపరచు ఈ కథను, ఇతర కథలను తెలిసి తెలియక నేను అడిగిన వాటిని, అడుగని వాటిని సద్యో వైరాగ్యమునిచ్చు ఆ పరమాత్మ కథలను విపులముగా వ్యాఖ్యానించగలరు.

శిష్యప్రుష్టమపృష్టం  వా వ్యాఖ్యానం కురుతేచ యః  

స సద్గురుః సతాంశ్రేష్ఠో యోగ్యాయోగ్యే చ యస్సమ:

యోగ్యాయోగ్య విషయములయందు ఎవరు సమదృష్టి కలిగిఉందురో, శిష్యులు అడిగినా, ఆడుగక పోయినా వారికి అవసరమైన విషయములను వ్యాఖ్యాన పూర్వకముగా ఎవరు తెల్పుదురో అతడు సజ్జనశ్రేష్ఠుడు. సద్గురువు.

సౌతిరువాచ - సౌతిమహర్షి ఇట్లు పలికెను.

సర్వం కుశలమస్మాకం త్వత్పాదపద్మ దర్శనాత్  

సిద్ధక్షేత్రాదాగతోహం యామీ నారాయణాశ్రమం

దృష్ట్యా విప్రసమూహం చ నమస్కర్తుమహాగతః

ద్రష్టుం చ నైమిషారణ్యం పుణ్యదం చాపి భారతే

శునకమహర్షీ  మీ పాదపద్మములను దర్శించుటచేత మేము కుశలముగా ఉన్నాము. నేను సిద్ధక్షేత్రమునుండి సారాయణ క్షేత్రమైన బదరికా వనమునకు పోవుచున్నాను. భరతఖండమున పుణ్యప్రదమైన నైమిషారణ్యమును చూచుటకు ఇచ్చటికి వచ్చితిని. ఇచ్చటి విప్ర సమూహమును చూచి నమస్కరించు భావనతో వచ్చితిని.

దేవం విప్రం గురుం దృష్టా న నమేద్యస్తు సంభ్రమాశ్

సకాలసూత్రం ప్రజతి యావచ్చంద్ర దీవాకరౌ

హరి ర్బ్రాహ్మణ రూపేణ శశ్వద్రమతి భూతలే

సుకృతీ ప్రణ మేత్ పుణ్యాతో బ్రాహ్మణం హరిరూపిణం

తొందరపాటువలన దేవతలను, విప్రులను గురువును చూచి ఎవడు నమస్కరించడో అతడు సూర్యచంద్రులున్నంతవరకు నరకమున ఉండును.

శ్రీమన్నారాయణుడు బ్రాహ్మణ రూపమున భూమి పై సంచరించును. కావున పుణ్యవంతుడు హరిరూపమున ఉన్న బ్రాహ్మణుని తప్పక నమస్కరించవలెను. 

భగవన్ యత్త్యయా పృష్టం జ్ఞాతం సర్వమభీప్సితం

సారభూతం పురాణేషు బ్రహ్మవైవర్తముత్తమం

పురాణోపపురాణానాం వేదానాం భ్రమ భంజనం

హరిభక్తిప్రదం సర్వతత్వజ్ఞాన వివర్ధనం

కామినాం కామదం చేదం మముక్షణాం చ మోక్షదం

భక్తిప్రదం వైష్ణవానాం కల్పవృక్ష స్వరూపకం

పూజ్యుడా  మీ ఆభీప్పితము నాకు బాగుగా తెలిసినది. మీరడిగినవన్నియు బ్రహ్మవైవర్త పురాణమున కన్పించును. ఆ పురాణము, పురాణములకన్నిటికీ సారభూతమైనది. అది పురాణ, ఉపపురాణములు వేదములయందు మనకున్న సంశయములను పోగొట్టును. కోరినవారికి ఐహికకామములను, మోక్షార్థులకు మోక్షమును, వైష్ణవులకు భక్తిని కల్పవృక్షమువలె అదీ ఇచ్చును.

బ్రహ్మఖండం సర్వబీజం పరబ్రహ్మనిరూపణం

ధ్యాయంతే యోగినః సంతో వైష్ణవా యత్పరాత్పరం

వైష్ణవా యోగినః సంతో న చ భిన్నాశ్చ శౌనక

స్వాజ్ఞానపరిపాకేన భవంతి జీవినః క్రమాత్

సంతో భవంతి సత్సంగాత్ యోగిసంగేన యోగినః

వైష్ణవా భక్తసంగేన క్రమాత్ సద్యోగిన: పరాః

బ్రహ్మవైవర్తపురాణము నాలుగు ఖండములుగా విభజింపబడినది. వాటిలో తొలిఖండమైన బ్రహ్మఖండమున యోగులు, సంతులు, వైష్ణవులు ఏ పరమాత్మను నిత్యము ధ్యానింతురో, సమస్త సృష్టికి కారణభూతమైన ఆ పరమాత్మ నిరూపణము చేయబడినది.

సంతులు, యోగులు, వైష్ణవులు ముగ్గురు వేరువేరని తలపరాదు. వారివారి అజ్ఞాన పరిపాకమువలన జీవులు మూడు విధములగా పేర్కొనబడుచున్నారు.

సత్సంగము చేసినవారిని సంతులని, యోగులతో కలిసి ఉన్నవారిని యోగులని, భక్తులతో కలిసి తిరుగువారిని వైష్ణవులని చెప్పుదురు.

యత్రోద్భవశ్చ దేవానాం దేవీనాం సర్వజీవినాం

తతః ప్రకృతి ఖండే చ దేవీనాం చరితం శుభం II

జీవకర్మవిపాకశ్చ శాలిగ్రామ నిరూపణం

తాసాం చ కవచస్తోత్రమంత్రపూజానీరూపణం

ప్రకృతేర్లక్షణం తత్ర కళాంశానాం నిరూపణం

కీర్తీ రుత్కీర్తనం తాసాం ప్రభావశ్చ నిరూపితః

సుకృతీనాం దుష్కృతీనాం యద్యత్ స్థానం శుభాశుభం  

వర్ణనం నరకాణాం చ రోగాణాం మోక్షణం తతః

రెండవఖండమైన ప్రకృతి ఖండములో దేవతలు, సమస్తజీవుల జన్మవృత్తాంతము దేవతా కవచములు, స్తోత్రములు, మంత్రములు పూజచేయు పద్ధతి, జీవుల కర్మవిపాకము, శాలీగ్రామములు, ప్రకృతి యొక్క లక్షణము, పుణ్యవంతులు, పాపులు పొందు శుభాశుభస్థానములు, నరక వర్ణన, రోగములు, వాటి నివారణ రీతులు చెప్పబడినవి.

తతోగణేశఖండే చ తజ్జన్మ పరికీర్తితం

ఆతీవాపూర్వచరితం శ్రుతివేద సుదుర్లభం

గణేశ భృగుసంవాదే సర్వతత్వ నిరూపణం

నిగూఢ కవచస్తోత్ర మంత్రతత్వనిరూపణం

తృతీయ ఖండమైన గణేశఖండమున ఆపూర్వము, వేదములయందు చెప్పబడని గణపతి చరిత్ర వర్ణించబడినది. అందలి గణేశ భుసంవాదమున సమస్త తత్వనిరూపణ. గణపతియొక్క కవచము, స్తోత్రములు, మంత్రముల వివరణ కన్పించును.

శ్రీకృష్ణ జన్మఖండం చ కీర్తితం చ తతః పరం

భారతే పుణ్యక్షేత్రే చ శ్రీకృష్ణ జన్మకర్మ చ

భువో భారావతరణం క్రీడా కౌతుక మంగళం

సతాం సేతు విధానం చ జన్మఖండే నిరూపితం

చివరిదైన శ్రీకృష్ణజన్మ ఖండమున శ్రీకృష్ణుని జన్మవృత్తాంతము, భూమీయొక్క భారమును తగ్గించుటకు ఆతడు చేసిన క్రీడలు సజ్జనులకు ఆతడు చేసిన మంగళ కార్యములు వర్ణింపబడినవి.

ఇదం తే కధితం విప్ర పురాణప్రవరం పరం

చతు: ఖండైః పరిమితం సర్వధర్మనిరూపణం

సర్వేషా మీప్సితం శ్రీదం సర్వాశాపూర్ణ కారణం  

బ్రహ్మ వైవర్తకం నామ సర్వాభీష్ట ఫలప్రదం

సారభూతం పురాణేషు కేవలం వేదసంమితం  

వివృతం బ్రహ్మ కార్త్స్మ్యుం చ కృష్ణేన యత్ర శౌనక

బ్రహ్మ వైవర్తకం తేన ప్రవదంతి పురావిదః

శౌనకమహర్షీ  ఈ బ్రహ్మవైవర్త పురాణము సమస్త ధర్మముల నిరూపించునది, బ్రహ్మఖండము మొదలైన నాలుగు ఖండములతో కూడుకున్నది, ఆందరికోరికలను తీర్చునది, సంపత్కరము. ఈ పురాణము సమస్త పురాణముల సారభూతము, వేద సమ్మితముకూడ. ఇందు శ్రీకృష్ణునిచేత బ్రహ్మస్వరూపమంతయు వివరించబడి ఉన్నందున దీనిని బ్రహ్మవైవర్తమని ప్రాచీనులు చెప్పుచున్నారు.

ఇదం పురాణసూత్రం చ పురాదత్తం చ బ్రహ్మణే

నిరామయే చ గోలోకే కృష్ణేన పరమాత్మనా

మహాతీర్థ పుష్కరే చ దత్తం ధర్మాయ బ్రహ్మణా

ధర్మేణ దత్తం పుత్రాయ ప్రీత్యా నారాయణాయ చ

నారదో వ్యాస దేవాయ ప్రదదౌ జాహ్నవీ తటే  

వ్యాసః పురాణసూత్రం తత్సంవ్యస్య విపులం మహత్

మహ్యం దదౌ సిద్ధక్షేత్ర పుణ్యదేశే మనోహరం

మయేదం కథితం బ్రహ్మన్ తత్సమగ్రం నిశామయ

ఈ పురాణముయొక్క ఆచార్య పరంపర ఈవిధముగా నున్నది.

ఈ పురాణము శ్రీకృష్ణపరమాత్మచే గోలోకమున బ్రహ్మదేవునికి ఎంగించబడినది. బ్రహ్మదేవుడు పుష్కరతీర్థమున ధర్మునకు దీనిని తెలిపెను. ధర్ముడు బ్రహ్మపుత్రుడైన నారదునకు, నారాయణునకు చెప్పెను, నారదమహర్షి గంగానదీ తీరమున వ్యాసమహర్షికి చెప్పెను. వ్యాసుడు. విపులమైన ఈ పురాణమును చక్కగా విభజించి పుణ్య ప్రదేశమైన. సిద్ధక్షేత్రమున నాకు తెల్పెను. శౌనకమహర్షీ  నేను నీకు ఇప్పుడు దీనిని చెప్పుచున్నాను. ఇట్లు ఆచార్య పరంపరతో కూడుకొని ఉన్న ఈ పురాణమునంతయు శ్రద్ధగా నీవు వినుము.

అష్టాదశసహస్రంతు వ్యాసేనేదం పురాణం

పురాణ కార్త్స్మ్యు శ్రవణే యత్ఫలం లభతేనరః

తత్ఫలం లభతే నూనమధ్యాయ శ్రవణేన చ

వ్యాసమహర్షిచే 18,000 శ్లోకములతో ఈ పురాణము చెప్పబడినది. (కానీ ప్రస్తుతము ఈ పురాణమున 20 వేలకు పైగా శ్లోకములున్నవి. అనగా వ్యాసకృత బ్రహ్మవైవర్తమును సౌతిమహర్షి పెంచి శౌనకాదులకు వివరించినట్లున్నాడు. అందువల్లనే శ్రీ సాతిమహర్షి వ్యాసకృతమైన బ్రహ్మవైవర్తమును ‘పురాణకం' (చిన్నపురాణము) అని అన్నాడు.)

పురాణముల నన్నిటిని వినిన ఏ ఫలితము లభించునో ఇందలి ఏ ఒక్క ఆధ్యాయమును విన్నా అంతటి ఫలితము లభించగలదు.

ఇతి శ్రీ బ్రహ్మ వైవర్తే  మహాపురాణే సౌతి శౌనక సంవాదే బ్రహ్మఖండే అనుక్రమణికా నామ ప్రథమోఽధ్యాయః

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున రాతి శౌనక సంవాదముతో నున్న బ్రహ్మఖండమున ఆనుక్రమణిక {విషయసూచి)

అను ప్రథమాధ్యాయము సమాప్తము.