బ్రహ్మ వైవర్త మహా పురాణము - బ్రహ్మ ఖండము

16 - చికిత్సా ప్రకరణము

బ్రాహ్మణ ఉవాచ- బ్రాహ్మణుడిట్లనెను-

దృష్టః కాలో యమో మృత్యుకన్యా వ్యాధిగణా అహో

కస్తేఽ ధునా చ సందేహః తం పృచ్చ కన్యకే శుభే

బ్రాహ్మణస్య వచః శ్రుత్వా హృష్ణా మాలావతి సతి

యన్మనో నిహితం ప్రశ్నం చకార జగదీశ్వరం

ఓ మాయావతీ! నీవు కాలువి, యముని, మృత్యుకన్యను వ్యాధుల సమూహమును చూచితివి కదా. ఇప్పటికీ నీకు మీగిలిన సందేహమును ఆడుగుము.

బ్రాహ్మణుని మాటలువిని పతివ్రతయైన మాలావతీ తన మనస్సులో నున్న సందేహము తీర్చుకొనుటకు జగత్పతినిట్లు ప్రశ్నించినది.

మాలావత్యువాచ- మాలావతి ఇట్లనెను-

త్వయా యత్కథితో వ్యాధిః ప్రాణినాం ప్రాణహారకః

తత్కారణం చ విధం సర్వం వేదే నిరూపితం

యతో న సంచరేత్ వ్యాధిః దుర్నీవారోశుభావహః

తదుపాయం చ సాకల్యం భవాన్ వక్తుమిహార్హతి

యద్యత్ పృష్టమపష్టం వా జ్ఞాతమజ్ఞాతమేవ వా

సర్వం కథయ తద్భద్రం త్వం గురుద్దీనవత్సలః

మాలావతీవచః శ్రుత్వా విప్రరూపీ జనార్దనః

సంహితాం వక్తుమారేభే సంహితార్థాం చ వైద్యకీం

ఓ బ్రాహ్మణా! ప్రాణుల ప్రాణములను పోగొట్టే వ్యాధి. వ్యాధి కారణము సమస్తము వేదమున నిరూపించబడినట్లు ఏదైతే చెప్పబడినదో నివారించుటకు వీలు కానీది ఆశుభమైనది ఐన ఆ వ్యాధి వ్యాపించకుండ దానికి తగిన ఉపాయమును వివరముగా తెలుపగలరు,

దీనవత్సలుడు గురువు ఐన మీరు నేను అడిగినవాటిని, ఆడగనివాటినీ కూడ, ఆట్లే నాకు తెలిసినా తెలియకపోయినా అన్నిటిని వివరముగా చేప్పుడు.

మాలావతి మాటలు విని విప్రరూపముననున్న జనార్దనుడు వైద్య సంహితను, సంహితార్థమును కూడ చెప్పుటకు ప్రారంభించెను.

బ్రాహ్మణ ఉవాచ- బ్రాహ్మణుడిట్లనెను-

వందే తం సర్వతత్వజ్ఞం సర్వకారణకారణం

పేదవేదాంగబీజస్య బీజం శ్రీకృష్ణ మీశ్వరం

స ఈశశ్చతురో వేదాన్ ససృజే మంగళాలయాన్

సర్వమంగళమాంగళ్యబీజరూపః సనాతనః

ఋగ్యజుస్సామాధర్వాఖ్యాన్ దృష్ట్యా వేదాన్ ప్రజాపతిః

విచింత్య తేషామర్థం చైవాయుర్వేదం చకార సః

కృత్వా తు పంచమం వేదం భాస్కరాయ దదౌ విభుః

స్వతంత్రసంహితార తస్మాద్భాస్కరశ్చ చకార సః

భాస్కరశ్చ స్వశిష్యభ్య ఆయుర్వేదం స్వసంహితాం

ప్రదదౌ పాఠయామాస తే చక్రుః సంహితాస్తతః

తేషాం నామాని వీదుషాం తంత్రాణి తత్కృతాని చ

వ్యాధి ప్రణాశబీజాని సాధ్వి మత్తో నిశామయ

ధన్వంతరిర్దివోదాసః కాశీరా జోశ్వినిసుతౌ

నకులః సహదేవోర్కిః చ్యవనో జనకో బుధః

బాబాలో జాబిలిః పైలః కరథ్యోగస్త్య ఏవ చ

ఏతే వేదాంగ వేదజ్జాః షోడశ వ్యాధినాశకాః

సర్వతత్వములు తెలిసినవాడు, సర్వకారణములకు కారణభూతుడు, వేదవేదాంగముల కారణులకు కారణమైనవాడు ఈశ్వరుడు. ఐన కృష్ణుని నమస్కరింతును.

సర్వమంగళమాంగళ్యములకు కారణభూతుడు, సనాతనుడైన పరమేశ్వరుడు చతుర్వేదములను సృష్టించెను. ఋక్, యజూస్ సామాధర్వములను వేదములను బ్రహ్మదేవుడు తెలిసికొని వాటి ఆర్థమును కూడ తెలుసుకొని ఆయుర్వేదమును సృష్టించెను. బ్రహ్మదేవుడు ఆయుర్వేదమను పంచమ వేదమును సృష్టించి భాస్కరునకుపదేశించెను. భాస్కరుడు తన శిష్యులకు ఆయుర్వేదమును తన పేరబడుగు భాస్కరసంహితను ఉపదేశించెను.

సూర్యునియొక్క శిష్యులు వివిధములైన సంహితలను వ్యాప్తిచేసిరి.

సూర్యుని శిష్యులయొక్క పేర్లు వారు రచించిన, వ్యాధిని సంపూర్ణముగా నాశనము చేయగలుగు తంత్రములు ఇవి.

ధన్వంతరి, దివోదాసుడు, కాశీరాజూ, అశ్వినీకుమారులు, నకులుడు, సహదేవుడు, ఆర్కి, చ్యవనుడు, జనకుడు, బుధుడు, జాబాలుడు, జాబిలి, ఫైలుడు, కరథుడు, ఆగస్యుడు అను పదునారుగురు సూర్యుని శిష్యులు. వారు వేదవేదాంగ తత్వజ్ఞులే కాక వ్యాధులను నిర్మూలనము చేయు సామర్థ్యముకూడ కలిగినటువంటివారు.

చికిత్పాతత్వవిజ్ఞానం నామ తంత్రం మనోహరం

ధన్వంతరిశ్చ భగవాన్ చకార ప్రథమం సతి

చికిత్సాదర్పణం నామ దీవోదాసశ్చకార సః

చికిత్సాకౌముదీం దివ్యాం కాశీరాజశ్చకార సః

చికిత్సాసారతంత్రం చ భ్రమఘ్నం చాత్వినీసుతౌ

తంత్రం వైద్యకసర్వస్వం నకులశ్చ చకార సః

చకార సహదేవశ్చ వ్యాధసింధువిమర్దనం

జ్ఞానార్ణవం మహాతంత్రం యమరాజశ్చకార సః

చ్యవనో జీవదానం చ చకార భగవానృషిః

చకార జనకో యోగీ వైద్యసందేహాభంజనం

 సర్వసారం చంద్రసుతః బాబాలస్తంత్రసారకం

వేదాంగసారం తంత్రం చ చకార జాబిలిర్మునిః

పైలో నీదానం కరథస్తంత్రం సర్వధరం పరం

ద్యైధనిర్ణయతంత్రం చ చకార కుంభసంభవః

చికిత్సాశాస్త్రబీజాని తంత్రణ్యేతాని షోడశ

వ్యాధిప్రణాశబీజానీ బలాధానకరాణి చ

ధన్వంతరి చికిత్సా తంత్ర విజ్ఞానమనే తంత్రమును, దివోదాసుడు చికిత్సాదర్పణతంత్రమును, కాశీరాజు చికిత్సా కౌముదీ తంత్రముమ, అశ్వినీకుమారులు సందేహములను తొలగించే చికిత్సాసార తంత్రమును, నకులుడు వైద్యక సర్వస్వమనే తంత్రమును సహదేవుడు వ్యాధసింధు విమర్ధనమును, ఆర్కియైన యముడు జ్ఞానార్ణవ మహాతంత్రమును చ్యవనమహర్షి జీవదాన తంత్రమును, యోగియగు జనకమహారాజు వైద్య సందేహభంజనమును, చంద్రపుత్రుడైన బుధుడు సర్వసార తంత్రమును జోబాలమహర్షి తంత్రసారకమును, జాజులిముని వేదాంగసార తంత్రమును, పైలమహర్షి నిదాన తంత్రమును, కరధుడు సర్వధర తంత్రమును, అగస్త్య మహర్షి ద్వైధనిర్ణయ తంత్రమును రచించెను.

మథిత్వా జ్ఞానమంత్రేణైవాయుర్వేద పయోనిధిం

తతస్తస్మాదుదాజహుర్నవనీతానీ కోవిదాః

ఏతాని క్రమశో దృష్ట్యా దివ్యాం భాస్కర సంహితాం

ఆయుర్వేదం సర్వబీజం సర్వం జానాహీ సుందరి

వ్యాధేస్తత్వపరిజ్ఞానం వేదనాయాశ్చ నిగ్రహః

 ఏతద్వైద్యస్య వైద్యత్వం నవైద్య ప్రభురాయుషః

ఆయుర్వేదస్య విజ్ఞాలా చికిత్సాసు యథార్థవిత్

 ధర్మిష్ఠశ్చ దయాళుశ్చ తేన వైద్యః ప్రకీర్తితః

ఆయుర్వేదశాస్త్రవిశారదులైన ధన్వంతరి మొదలగువారు ఆయుర్వేదమనే సముద్రమును జ్ఞానమనేమందర పర్వతముచే చీలికి పైన పేర్కొన్న గ్రంథములనే నవనీతముల తీసిరి.

దివ్యమైన భాస్కరసంహితను, పైగ్రంథములను చక్కగా చూచీన ఆయుర్వేదశాస్త్రము సమస్తమునకు కారణమని నీకు స్పష్టముగా తెలియును.

వ్యాధితత్వమును చక్కగా గుర్తించుట, రోగమువలన కలుగు వేదసలను నిగ్రహించు శక్తి కలిగినవాడే వైద్యుడు. ఆయుర్వేదశాస్త్రమును చక్కగా తెలిసినవాడు, చికిత్స చేయుట చక్కగా తెలిసినవాడు, దయాస్వభావము కలవాడు, ధర్మిష్ణుడు వైద్యుడనబడును. ఆ వైద్యుడు ఆయుస్సునకు కర్త మాత్రము కాజాలడు.

జనకః సర్వరోగాణాం దుర్వారో దారుణో జ్వరః

శివభక్తశ్చ యోగీ చ నిష్ఠురో వికృతాకృతీః

భీమస్త్రిపాదస్త్రిశిరాః షడ్భుజో నవలోచనః

భస్మప్రహరణో రౌద్రః కాలాంతకయమోపమః

మందాగ్నిస్తస్య జనక మందాగ్నేర్జనకాస్త్రయః

పిత్తశ్లేష్మసమీరాశ్చ ప్రాణినాం దుఃఖదాయకా

వాయుజః పిత్తజశ్చేవ శ్లేష్మజశ్చ తథైవ చ

జ్వరభేదాశ్చ త్రివిధాః చతుర్థశ్చ త్రిదోషజః

పాండుశ్చకామలః కుష్ఠ శోథః ప్లీహా చ శూలకః

జ్వరాతిసారగ్రహణీ కాస ప్రణ హలీమకాః

మూత్రకృచ్ఛశ్చ గుల్మశ్చ రక్తదోషవికారజః

వీషమేహశ్చ కబ్జశ్చ గోదశ్చ గలగండకః

భ్రమరీ సన్నీపాతశ్చ విఘాచీ దారుణీ  సతీ

ఏషాం భేదప్రభేదేన చతుస్షష్టి రుజః స్మృతాః

మృత్యుకన్యా సుతాశ్చైతే జరా తస్యాశ్చ కన్యకా

జరా చ భ్రాతృభిస్పార్థం శశ్వత్ భ్రమతి భూతలం

ఏతే చోపాయవేత్తారం న గచ్ఛంతి చ సంయతం

పలాయంతే చ తం దృష్ట్యా వైనతేయమివోరగాః

సమస్త రోగములకు కారణము దారుణమైన జ్వరము, ఆ జ్వరము శివభక్తుడు, యోగి, వికృతాకృతి కలది, భయంకరమైనది, మూడుపాదములు, మూడు తలలు, ఆరుభుజములు, తొమ్మిది కళ్ళు కలది. రౌద్రస్వరూపము కలది. కాలాంతక యమతుల్యమైనది.

జ్వరమునకు తండ్రి (కారణము) మందాన్నీ. ఆ మందాగ్నికి వాత, పిత్త శ్లేష్మములు కారణములు. జ్వరములు వాతము వల్ల కలిగినది, పిత్తమువలన కలిగినది, శ్లేష్మమువల్ల కలిగినదీ, త్రిదోషముల వలన కలిగినది అని నాలుగు విధములు.

పాండు, కామల, కుష్టు, శోధము (జలోదరము) ప్లీహము. శూల, జ్వరము, అతిసారము, గ్రహణి, కాస, వ్రణములు, హాలీమకము, మూత్రకృచ్ఛము, రక్తదోష వీకారమువలన కలిగిన గుల్మము, విషమేహము, కబ్జము, గోదము, గలగండకము, భ్రమరి, సన్నిపాతము, విషూచి వీటి భేదములు, ప్రభేదములచే అరువది నాలుగు విధములైన రోగములు కలుగుచున్నవి. 

ఈవ్యాధులన్ని మృత్యుకన్యకు పుత్రులు. జరా (ముసలితనము) మృత్యుకన్య పుత్రిక. ఈ జర తన సోదరులతో కలసి భూమండలమంతయు తిరుగుచున్నది. ఇవన్నియు యమనియమములతో నుండువానిని, రోగనివారణోపాయము తెలిసిన వానిని చూచి గరుత్మంతుని చూచి సర్పములు పరుగెత్తినట్లు పరుగెత్తిపోవును.

చక్షుర్జలం చ వ్యాయామః పాదాధస్తైలమర్దనం

కర్ణయోర్మూర్ద్ని తైలం చ జరావ్యాధి వినాశనం

వసంతే భ్రమణం వహ్ని సేవాం స్వల్పాం కరోతి యః

బాలాం చ సేవతే కాలే జరా తం నోపగచ్ఛతి

ఖాతశీతోదకస్నా సేవతే చందనద్రవం

నోపయాతి జరా తం చ నిదాఘేఽ నీలసేవకం

ప్రావృష్యుష్ణోదకస్నాయీ ఘనతోయం న సేవతే

సమయే చ సమాహారీ జరా తం నోషగచ్ఛతి

శరద్రౌద్రం న గృహ్ణతి భ్రమణం తత్ర వర్జయేత్

ఖాతస్నాయీ సమాహారీ జరా తం నోపగచ్ఛతి

ఖాతస్నాయీ చ హేమం తే కాలే వహ్నిం చ సేవతే

భుంక్తే నవాన్న ముష్ణం చ జరా తం నోపగచ్చతి

సద్యోమాంసం నవాన్నం చ బాలాస్త్రీ క్షీర భోజనం

ఘృతం చ సేవతే యో హి జరా తం నోపగచ్చతి

శిశిరేంశుకవహ్నిం చ నవోష్నాన్నం చ సేవతే

యశ్చ వోష్ణోదకస్నాయీ జరా తం నోపగచ్ఛతి

భుంక్తే సదన్నం క్షుత్కాలే తృష్ణాయాం పీయతే జలం

నిత్యం భుంక్తే చ తాంబూలం జరా తం నోపగచ్ఛతి

దధి హైయంగవీనం చ నవనీతం తథా గుడం

నిత్యం భుంక్తే సంయమీ యో జరా తం నోపగచ్ఛతి

కళ్ళను నీటితో పరిశుభ్రము చేయుట, వ్యాయమము, కాళ్ళ ఆడుగులను నూనెతో మర్ధించుట, చెవులలో నూనె వేసికొనుట, తలంటుకొనుట చేసికొన్నచో జరా, వ్యాధులు దూరమగును. వసంతరుతువులో ప్రతి దినము తీరుగుట, స్వల్పముగా వహ్నిని సేవించుట యుక్త సమయములో తనకంటె వయస్సులో చిన్నదైన స్త్రీతో సంగమించుట జరిగినచో వానికి ముసలితనమురాదు.

గ్రీష్మరుతువులో సరస్సులో నున్న చల్లని నీటిలో స్నానము చేయుచు, చందన ద్రవమును, చల్లనిగాలిని సేవించిన వ్యక్తికి ముసలితనము రాదు.

వర్షరుతువులో వేడినీళ్ళ స్నానము చేయవలెను. వర్షపు నీరును త్రాగరాదు. నిర్ణీతసమయమున సమానమైన (అతిగా కాకుండ, తక్కువ కాకుండ) భోజనము చేయవలెను.

శరత్కాలములో ప్రతిదినము ఉదయకాలపు భ్రమణమును మానివేయవలెను. సరస్సులో స్నానము చేయవలెను. మితమైన ఆహారమును మాత్రమే భుజింపవలెను.

హేమంత రుతువులోను సరస్సులో స్నానము చేయుట మంచిది. యుక్త సమయమున వహ్నిని సేవించవలెను. వేడిగానున్న క్రొత్త బియ్యపు అన్నమును తినినచో వారిని ముసలితనము దరి చేరదు.

శిశిర రుతువులోనూ వేడిగా నున్న కొత్త బియ్యపుటన్నమును తినవలెను. బట్ట చాటుగా ఉన్న అగ్నిని సేవించవలెను. ఉష్ణోదకమున స్నానము చేయవచ్చును. అందువలన ముసలితనము దరిచేరదు.

ఆకలియైనప్పుడు మంచి భోజనమును చేయవలెను. దప్పియైనప్పుడు వీరు తాగవలెను. నిత్యము తాంబూలమును సేవించినచో ముసలితనమతనికి రాదు.

జిహ్వచాపల్యములేక పెరుగు, నిన్న పిండిన పాలను తోడు పెట్టి తీసిన వెన్న (హైయంగవీనం) కొలనేయి, బెల్లము ప్రతినిత్యము తినినవానీకి జర దరిచేరదు.

శుష్కమాంసం స్త్రియం వృద్ధాం బాలార్కం తరుణం దధి

సంసేవంతం జరా యాతి ప్రహృష్టా భ్రాతృభిః సహ

రాత్రా యే దధి సేవంతే పుంశ్చలీశ్చ రజస్వలాః

తాను పైతి జరా హృష్టా భ్రాతృభిః సహ సుందరి

 రజస్వలా చ కులటా చావీరా జారదూతికా

శూద్రయాజకపత్నీ యా ఋతుహినా చ యా సతి

యో హి తాసామన్నభోజీ బ్రహ్మహత్యాం లభేత్తు సః

తేన పాపేన సార్థం సా జరా తముపగచ్ఛతి

ఎండిన మాంసము, తనకంటే వయసులో పెద్దస్త్రీ, ఉదయ కాలసూర్యుడు, లేత పెరుగు, రాత్రి పూట పెరుగు, చెడునడక గలస్తీ, రజస్వల ఐన స్త్రీ భర్త, పుత్రులు లేని స్త్రీ జారుని యొక్క దూతిక, యాగము చేసిన శూద్రుని భార్య, ముట్లుడిగిన స్త్రీ వీరిని సేవించిన వానినీ వ్యాధులు ముసలితనము త్వరగా దరిచేరును.

పైన పేర్కొనిన స్త్రీలు పెట్టిన అన్నము తిన్నచో బ్రహ్మహత్యా ఫలితము లభించగలదు. ఆ అన్నము తినిన వ్యక్తికి బ్రహ్మహత్యాపాపముతో ముసలితనముకూడా త్వరగా దరిచేరును.

పాపానాం వ్యాధిభిస్సార్థం మిత్రతా సంతతం ధ్రువం

పాపం వ్యాధిజరాచీజం విఘ్నబీజం చ నిశ్చితం

పాపేన జాయతే వ్యాధిః పాపేన జాయతే జరా

పా పేన జాయతే దైన్యం దుఃఖం శోకో భయంకరః

తస్మాత్పాపం మహావైరం దోషబీజమమంగళం

భారతే సతతం సంతో నాచరంతి భయాతురాః

పాపములకు వ్యాధులకు స్నేహము కలదు. పాపము జర, వ్యాధి. విఘ్నములకు కారణమగుచున్నది. పాపమువలన వ్యాధి కలుగును. వ్యాధులవలన ముసలితనము కలుగుచున్నది. ఆ పాపమువలన దైన్యము, దుఃఖము, మిక్కిలి భయంకరమైన శోకము కూడా కలుగుచున్నవి. అందువలన ఈ భారతదేశమున సత్పురుషులు దోషములకు హేతువైన పాపములను భయపడి చేయరు.

స్వధర్మాచారయుక్తం చ దీక్షితం హరిసేవకం

గురుదేవాతీథీనాం చ భక్తం సక్తం తపస్సు చ

ప్రజోపవాసయుక్తం చ సదా తీర్థని షేవకం

రోగా ద్రవంతి తం దృష్ట్యా వైనతేయమివోరగాః

ఏతాన్ జరా న సేవేత వ్యాధిసంఘశ్చ దుర్జయః

సర్వం బోధ్యమసమయే కాలే సర్వం గ్రసిష్యతి

జ్వరస్య సర్వరోగాణాం జనకః కథితః సతి

పిత్తశ్లేష్మ సమీరాశ్చ జ్వరస్య జనకాస్త్రయః

ఏతే యథా సంచరంతీ స్వయం యాంతి చ దేహిషు

తమేవ వీవీధోపాయం సాద్వి మత్తో నిశామయ

స్వధర్మాచారము కలవాడు దీక్షగైకొన్నవాడు, హరిభక్తుడు, గురువులందు, దేవతలందు, ఆతిథులందు భక్తి కలవాడు, తపస్సు చేయువాడు, ప్రతములు, ఉపవాసములయందు ఆనురక్తి కలవాడు. పుణ్యతీర్ణములను సేవించువాడు మొదలగు వారిని చూచి రోగములు గరుత్మంతుని చూచిన సర్పములవలే పరుగెత్తుకొని పోవును.

జ్వరమునకు, ఇతరములైన సమస్త రోగములకు పిత్తము, శ్లేష్మము, పాతము కారణములని ఇంతకుముందే చెప్పితిని. ఓమాలావతీ! ఆ వ్యాధులు ఏవిధముగా మానవులను చేరుచున్నవో వాటిని ఎట్లు నివారించవచ్చునో వినుము.

క్షుధి జాజ్వల్యమానాయాం ఆహారాభావ ఏవచ

ప్రాణినాం జాయతే పిత్తం చక్రే చ మణిపూరకే

తాలబిల్వఫలం భుక్త్యా జలపానం చ తక్షణం

తదేవ తు భవేత్పత్తం సద్యః ప్రాణహరం పరం

తప్తోదకం చ శిరసి భాద్రే తీక్తం విశేషతః

దైవగ్రస్తశ్చ యో భుంక్తే పిత్తం తస్య ప్రజాయతే

సశర్కం చ ధాన్యాకం పిష్టం శీతోదకాన్వితం

చణకం సర్వగవ్యం చ దధితక్ర వివర్జితం

బిల్వతాళఫలం పక్వం సర్వ మైక్షవ మేవ చ

ఆర్ద్రకం ముద్గయూషం చ తిలపిష్టం సశర్కరం

పితక్షయకరం సద్యో బలపుష్టిప్రదం పరం

 పిత్తనాశం చ తద్బీజముక్తమన్యన్నిబోధ మే

బాగుగా ఆకలి అగుచున్నప్పుడు అన్నము తినకుండా ఉన్నందువలన మణిపూరక చక్రములో పైత్యము పుట్టుచున్నది. తాటిపండును (ముంజకాయలను) మారేడు పండును తిని తక్షణము నీరు త్రాగినచో ప్రాణములను పోగొట్టు పిత్తమేర్పడగలదు. వేడి నీటిని శిరస్సుపై పోసుకొన్నను, భాద్రపదమాసమున చేదు వస్తువులు విపరీతముగా తిన్నను ఫైత్యమేర్పడును.

చక్కర కలిపిన ధనియాలు, చల్లని నీటితో తడుపబడిన పిండి, శనగలు, పెరుగు, మజ్జిగ కాక మిగిలిన గవ్యములు (ఆవుపాలు, ఆవువెన్న, ఆవునెయ్యి, ఆవుమీగడ) బాగుగా పండిన తాటిపండ్లు, మారేడు పండ్లు, చెరుకు సంబంధమైనవి, పెసరపప్పుతో చేసిన కట్టుచారు, చక్కర కలిపిన నువ్వులపిండి, అల్లము ఇవి పిత్తమును పోగొట్టును, బలమును పుష్టిని కలిగించును.

పై విధముగా పైత్యమునకు కారణములు, పిత్తనాశక వస్తువులు చెప్పబడినవి.

భోజనానంతరం స్నానం జలపానం వినా తృషా

తిలతైలం స్నిగ్ధతైలం స్నిగ్ధమామలకీ ద్రవం

పర్యుషితాన్నం చ తక్రం చ పక్వం రంభాఫలం దది

మేఘంబు శర్కరాతోయం సుస్నిగ్దజల సేవనం

నారికేళోదకం రూక్షస్నానం పర్యుషితే జలే

తరుగుంజాపక్వఫలం సుపక్వం కర్కటీఫలం

ఖాతస్నానం చ వర్షాసు మూలకం శ్లేష్మకారకం

బ్రహ్మరంద్రే చ తజ్జన్మ మహద్వీర్య వినాశనం

భోజనము తరువాత స్నానము చేసినను, దప్పిక లేక నీరు త్రాగినను, నువ్వుల నూనె, చిక్కని ఆమలకీ ద్రవము, చిక్కని నూనె, చద్ది అన్నము, నిన్నటి మజ్జిగ, పెరుగు, బాగా పండిన ఆరటిపండు, మేఘంబువులు, చక్కరవీళ్ళు, కొబ్బరినీళ్ళు, గురిపెంగ చెట్టు పండు, బాగుగా పండిన సన్నదోసపండు, వర్షకాలములో సరస్సులో చేసిన స్నానము మొదలగునవి శ్లేష్మమును కలిగించును. ఆ శ్లేష్మము వీర్యమునంత పోగొట్టును. దాని జన్మస్థానము బ్రహ్మరంధ్రము.

వహ్ని స్వేదం భ్రష్టభంగం పక్వతైల విశేషకం

 భ్రమణం శుష్క భక్షం చ శుష్కపక్వహరీతకీ

పిండారకమపక్వం చ రంబాఫలమపక్వకం

వేనవారః సింధువారః అనాహారమపానకం

నఘృతం రోచనాచూర్ణం సఘృతం శుష్క శర్కరం

మరీచం పిప్పలం శుష్కమార్ధకం జీవకం మధు

ద్రవ్యాణ్యేతాని గాంధర్వి సద్యః శ్లేష్మహరాణి చ

బలపుష్టి కరాణ్యేవ వాయుబీజం నిశామయ

వహ్ని స్వేదము (ఆవిరి పట్టుకొనుట?) తిరుగుట, ఎండిన వస్తువుల తినుట, కరకకాయ, పక్వము కాని వెలగపండు, అరటిపండు, వేసవారము (మిరియాలు, ధనియాలు, అల్లము మొదలగు దినుసులతో చేయబడిన పొడి), ఆహారము తీసుకొనకుండుట, నీరుతాగకుండుట, నేయి కలిపిన రోచనా చూర్ణము (ఆకలిపుట్టించు పొడి) నేయి కలిపిన చక్కర, మిరియాలు, పిప్పళ్ళు, శొంఠి, జీవకము, తేనే ఇవన్ని శ్లేష్మమును వెంటనే తొలగించును. ఈ వస్తువులన్నీ బలమును పుష్టిని కలిగించునవి.

ఓగంధర్వ రాజు దుహితా! మాలావతీ! వాతరోగమునకు గల కారణములను వినుము.

 భోజనానంతరం సద్యోగమనం ధావనం తథా

ఛేదనం వహ్నితాపశ్చ శశ్వద్భ్రమణ మైథునం

వృద్దస్త్రీగమనం చైవ మనస్సంతాప ఏవచ

ఆతిరూక్షమనాహారం యుద్ధం కలహమేవచ

కటువాక్యం భయం శోకః కేవలం వాయుకారణం

ఆజ్ఞాఖ్య చక్రే తజ్జన్మ నిశామయ తదౌషధం

భోజనము చేసిన వెంటనే నడుచుట, పరుగెత్తుట, ఛేదించుట (శారీరక శ్రమకలుగునట్లు చేయుట) ఎండకు కాచుకొనుట, నిరంతరము తిరుగుట, అతిమైథునము, వృద్ధస్త్రీ సంగమము. మనస్తాపము. మొరటు ప్రవర్తన, సరియైన వేళకు ఆహారము తీసికొనకుండుట, పోట్లాటలు, యుద్దముచేయుట, ఇతరులను బాధ పెట్టు మాటలాడుట, భయము, దుఃఖము ఇవన్నియు వాత రోగమునకు కారణములగుచున్నవి. ఈరోగమునకు జన్మస్థానము మానవుని శరీరములోని ఆజ్ఞా చక్రము.

ఇక ఈవాతరోగమునకు ఔషధములను వినుము.

పక్వం రంభఫలం చైవ సబీజం శర్కరోదకం

నారికేళోదకం చైవ సద్యస్తక్రం సుపిష్టకం

మాహిషం దధీ మీష్టం చ కేవలం వా సశర్కరం

సద్యః పర్యుషితాన్నం చ సౌవీరం శీతలోదకం

పక్వతైలవిశేషం చ తీలతైలం చ కేవలం

ఆంగలీలాళఖర్జూరముస్లిం ఆమలకీద్రవం

శీతలోష్ణోదకస్నానం సుస్నిగ్ధ చందన ద్రవం

స్నిగ్దపద్మపత్రతల్పం సుస్నిగ్దవ్యంజవాని చ

ఏతత్తే కథితం వలే సద్యోవాయుప్రణాశవం

వాయవస్తివిధాః పుంపాం క్లేశసంతాప కామజః

పండిన అరటిపండు, కొబ్బరినీరు, అప్పుడే చిలికి చేసిన మజ్జిగ, మంచి పిండి, గేదొ పెరుగు, శర్కరతో కూడుకున్న రుచికరమైన ఆహారము. కేవలం రుచికరమైన ఆహారము మరీ చద్దీదీకావి అన్నము, సౌవీరము, చల్లని నీరు, పక్వతైలము, నువ్వులనూనె, కొబ్బరి. ఖర్జూరము, తాటిపండు, వేడియైన ఆమలకీద్రవము, చిరువెచ్చని నీటిలో చేయస్నానము. మంచి చందన ద్రవము, దట్టమైన తామరరేకుల శయ్య, చక్కని ఏపనకట్టలు, ఇవన్నియు వాతరోగమును పోగొట్టుచున్నవి. ఈవాతరోగములు క్లేశజనితములవి, సంతాన జనితములని, కామ జనితములని మూడు విధములుగానున్నవి.

వ్యాధసంఘశ్చ కథితః తంత్రాణి వివిధాని చ

తాని వ్యాధి ప్రణాశాయ కృతానీ సద్భిరేవ చ

తంత్రాణ్యేతాని సర్వాణి వ్యాధిక్షయకరాణిచ

రసాయనాదయో యేషు చోపాయాశ్చ సుదుర్లభాః

వ శక్తః కథితుం పాధ్వి యథార్థం వత్సరేణ చ

తేషాం చ సర్వతంత్రాణాం కృతానాం చ విచక్షణైః

కేన రోగేణ త్వత్కాంతో మృతః కథయ శోభనే

తదుపాయం కరిష్యామీ యేన జీవేదయం సతీ

వ్యాధుల పేర్లు, వాటి నివారణకై ప్రాచీనులు రచించిన వివిధ తంత్ర గ్రంథముల పేర్లు మీకు చెప్పితిని. ఓ మాలావతీ! ఈ తంత్ర గ్రంథములన్నియు వ్యాధులను సమూలముగా నాశనము చేయునవి. ఈగ్రంథములందు తెల్పబడిన రసాయనాదులు, ఉపాయములు చాలా దుర్లభమైనవి. ఓ సాద్వి! వీటనన్నిటిని పూర్తి వివరముగా చెప్పుటకు పంవత్సరకాలము కూడ సరిపడదు.

ఓ పతివ్రతా! నీ భర్త ఏ రోగమువల్ల చనిపోయెనో తెలుపుము. దానివలన నీ భర్త బ్రతుకు ఉపాయమున నేను చెప్పుదును.

సౌతిరువాచ- సౌతీ మహర్షి ఇట్లనెను -

బ్రాహ్మణస్య వచః శ్రుత్వా కన్యా చిత్రరథస్య చ

కథాం కథలుమారభే సా గాంధర్వీ ప్రహర్షితా

బ్రాహ్మణుని మాటలు విని చిత్రరథుని కూతురైన మాలావతి సంతోషముతో తన విషయమునట్లు చెప్పెను.

మాలావత్యువాచ- మాలావతి ఇట్లనెను –

యోగేన ప్రాణాంస్తత్యాజ బ్రాహ్మణః శాన హేతునా

సభాయాం లజ్జితః కాంతః మమ విప్ర నిశామయ

సర్వం శ్రుతమపూర్వం చ శుభాభ్యాసం మనోహరం

భవేద్భవే కుతః కేషాం మహల్లభ్యం విపద్వినా

అధునా మత్ప్రాణకాంతం దేహి దేహి విచక్షణ

నత్వా వః స్వామినాపార్థం యాస్వామి స్వగృహం ప్రతి

మాలావతీవచః శ్రుత్వా విప్రరూవ్ జనార్దనః

సభాం జగామ దేవానాం శీఘ్రం విప్రస్తదంతికం

బ్రహ్మదేవుని సభలో తనకు జరిగిన అవమానమువలన నా భర్త సిగ్గుపడి బ్రహ్మదేవుని శాపకారణముగా యోగశక్తిచే తన ప్రాణములు వదిలెను. ఓ బ్రాహ్మణుడా! అపూర్వము మనోహరమైన నా భర్తకు సంబంధించిన విషయమునంత వింటివి. ఈ ప్రపంచములో ఎవ్వరికిని కష్టము లేక మంచి జరుగదు.

 అందువలన పీవు నా భర్తను వెంటనే బ్రతికింపుము. అప్పుడు మేమిద్దరము నీకు నమస్కరించి మా ఇంటికి పోయెదము.

మాలావతి మాటలు విని విప్రుని వేషమున నున్న నారాయణుడు దేవతలున్న బ్రహ్మదేవుని సభకు వెళ్ళాను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే సౌతి శానక సంవాదే బ్రహ్మ ఖండే మాలావతీ విష్ణు సంవాదే చికిత్సా ప్రణయనే షోడశోఽధ్యాయః

శ్రీ బ్రహ్మ వైవర్తమను మహాపురాణమున సౌతి శౌనక సంవాద రూపమైన బ్రహ్మ ఖండమున మాలావతీ విష్ణు మూర్తుల సంవాద సమయమున చీకిత్సా ప్రణయనమను పదునారవ అధ్యాయము సమాప్తము.