బ్రహ్మ వైవర్త మహా పురాణము - బ్రహ్మ ఖండము

23 - బ్రహ్మనారదుల సంవాదము

స్రష్టా సృష్టివిధానేన నియోజ్య సర్వబాలకాన్

నారదం ప్రేరయామాస సృష్టిం కర్తుం చ శౌనక

హితం సత్యం వేదసారం పరిణామసుఖావహం

ఉవాచ నారదం బ్రహ్మా వేదవేదాంగ పారగం

బ్రహ్మదేవుడు తన పుత్రులనందరిని సృష్టికార్యములో నియోగించుచు నారదుని కూడ సృష్టికార్యమును చేయుమని ప్రేరేషించెను.

బ్రహ్మ దేవుడు వేద వేదాంగ పారగుడైన నారదునితో హితమును, సత్యమైనదియు, వేదసారమని చెప్పదగిన మాటను చెప్పెను.

బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లనెను –

ఏహివత్స కులశ్రేష్ఠ నారద ప్రాణవల్లభ

జ్ఞానదీపశిఖాజ్ఞానతిమిరక్షయకారక

సర్వేషామపివంద్యానాం జనకః పరమో గురుః

విద్యాదాతా మంత్రదాతా ద్వౌ సమౌ చ పితుః పరౌ

తవాహం జనకః పుత్ర విద్యాదాతా చ పాలకః

మమాజ్ఞయా చ మత్ర్పీత్యా కురు దారపరిగ్రహం

స చ శిష్యః సోఽపి పుత్రో యశ్చాజ్ఞాం పాలయేద్గురోః

న క్షేమం తస్య మూఢస్య యో గురోరవచస్కరః

స పండితః సచ జ్ఞానీ స క్షేమీ సచ పుణ్యవాన్

గురోర్వచస్కరో యోహి క్షేమం తస్య పదే పదే

సర్వేషామాశ్రమానాం చ ప్రధానః పుణ్యవాన్ గృహీ

స్త్రీపుత్రపౌత్ర యుక్తం చ మందిరం తపసః ఫలం

పితరః పూర్వకాలే చ తిథకాలే చ దేవతాః

సర్వే గృహస్థమాయాంతి నిపానమివ ధేనవః

నిత్యం నైమిత్తికం కామ్యం కుర్వంతి గృహిణః సదా

ఇహ ఏతత్సుఖం పుణ్యం స్వర్గభోగః పరత్ర చ

జీవన్ముక్తో గృహస్థశ్చ స్వధర్మపరిపాలకః

యశస్వీ పుణ్యవాంశ్ఛైవ కీర్తిమాన్ ధనవాన్ సుఖీ

యశస్వీ కీర్తిమాన్యో హి మ్పతో జీవతి సంతతం

యశః కీర్తివిహీ నో హి జీవన్నపి మృతోహి సః

బ్రహ్మణో వచనం శ్రుత్వా నారదో మునిసత్తమః

ఉవాచ వినయం భీతః శుష్కకంఠౌష్ఠతాలుకః

ఓ నారదా! ఇటురమ్ము, నమస్కరించదగిన వారందరిలో తండ్రి చాలా గొప్పవాడు. విద్యనేర్పినవాడు మంత్రమును నేర్పినవారు తండ్రితో సమానులు మాత్రమే. నేను నీకు తండ్రిని, విద్యాబుద్ధులు నేర్పినవాడను, పోషించినవాడమ కూడ. అందువలన నామాటననుసరించి, నాకు సంతోషము కలిగించుటకై నీవు వివాహము చేసికొనవలెను.

గురువుయొక్క లేక పెద్దవానియొక్క ఆజ్ఞను పరిపాలించువాడే శిష్యుడు లేక పుత్రుడు. గురువు లేక తండ్రి మాటను జవదాటు మూడునకు క్షేమము కలుగదు. గురువుయొక్క మాటను వినువాడే పండితుడు, జ్ఞానవంతుడు, పుణ్యవంతుడు, క్షేమముగానుండువాడు. ఆన్ని ఆశ్రమములలో గృహస్థాశ్రమము శ్రేష్ఠమైనది. గృహస్థాశ్రమమున నున్నవాడు పుణ్యవంతుడు. అతడు చేసిన తపస్సుకు ఫలితమన్నట్లు అతని ఇల్లు స్త్రీలతో, పుత్రులతో, మనుమలతో నుండగలదు. శ్రాద్దకాలమున పితృదేవతలు పూజాది సమయములలో ఇతర దేవతలు అతని ఇంటికి, మడుగును చూచి దప్పిగొన్న ఆవులు పోయినట్లు పోదురు.

ఆతడు నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కొమ్యకర్మలు ఎల్లప్పుడు చేయుచుండును. అవి అతనికి ఇహలోక సుఖమును, పుణ్యమును పరలోకమున స్వర్గభోగములను కలిగించును. తన ధర్మమును పరిపాలించు గృహస్థుడు జీవన్ముక్తుడగును. ఆతనికి పుణ్యము, కీర్తి, ధనము, సుఖము లభించును. కీర్తి ఉన్నవాడు చచ్చిపోయినను బ్రతికి యున్నవాడే. అట్లే కీర్తిలేనివాడు బ్రతికి యున్నను చచ్చిపోయిన వానితో సమానుడు.

తన తండ్రియగు బ్రహ్మదేవుని పై మాటలు విని పెదవులు, నాలుక, గొంతు ఎండిపోగా భయపడుచు వినయములో నారదుడిట్లనెను.

నారద ఉవాచ - నారదుడిట్లనెను –

ఏకదావాగ్విరోధేన చోభయోస్తాతపుత్రయోః

హానిర్బభూవ దైవేన మహతీవాఽయశస్కరీ

మయా ప్రాప్తం చ త్వచ్ఛాపాద్గాంధర్వం శౌద్రమేవ చ

జన్మకర్మ చ మచ్ఛాపాత్త్యమపూజ్యోఽభవే భవః

బభూవ శాపో ముక్తో మే కాలే తే భవితా విధే

దోషాయ కల్పతే శశ్వద్విరాధో న గుణాయ చ

స పితా స గురుర్బంధుః స పుత్రస్సమధీశ్వరః

యః శ్రీకృష్ణపాదపద్మే దృఢాం భక్తిం చ కారయేత్

అసద్వర్త్మని చాజ్ఞానాత్ గచ్ఛంతి యది బాలకాః

నివర్తయతి తానేవ స పితా కరుణానిధిః

కారయిత్వా కృష్ణపాదే భక్తిత్యాగం చ యః పితా

అన్యస్మిన్ విషయే పుత్రం స కిం హంతుం ప్రవర్తయేత్

దారగ్రహో హి దుఃఖాయ కేవలం న సుఖాయ చ

తపః స్వర్గ భక్తి ముక్తి కర్మణాం వ్యవధాయకః

ఓతండ్రి ఒకప్పుడు ఇటువంటి జగడము వలననే తండ్రి కొడుకులమైన మన ఇద్దరకు దురదృష్టమువలన చాలా చెడు పేరు తెచ్చే హాని జరిగింది. నాకు నీ శాపమువలన గంధర్వ జన్మ, శూద్ర జన్మ కలిగినవి. నా శాపమువలన నీకు పూజలు లేకుండా పోయినవి. ప్రస్తుతము నేను శాపవిముక్తుడనైతిని. అట్లే నీవును కొంత కాలమునకు శాపవిముక్తిని పొందగలవు.

శాశ్వతవిరోధమెవ్వరికిని మంచి కల్గించదు. పైగా అదీ కీడును చేయును. అందువల్ల మన మధ్య విరోధము మంచిదికాదు. అట్లే శ్రీకృష్ణుని పద పద్మములపై దృఢమైన భక్తిని కలిగించినవాడే నిజమైన తండ్రి, గురువు, బంధువు, నాయకుడు. తండ్రియైన వాడు తన పుత్రులు దుష్టమార్గములో నున్నప్పుడు వారిని ఆ దారినుండి మరల్చి సన్మార్గమున ప్రవర్తించునట్లు చేయవలెను. శ్రీకృష్ణుని పదభక్తిని కల్పించి అన్యమార్గమునుండి తప్పించు తండ్రి తనపుత్రుని తానే చెడుత్రోవకీడ్చి అతనిని నాశనము చేయుటకు ఎప్పుడైనను ప్రవర్తించునా?

వివాహమనునది సంపూర్ణముగా దుఃఖమును కలిగించునే కాని సుఖమునెంత మాత్రమును కలిగించదు. పైగా అది పురుషుడు చేయు తపస్సునకు భక్తి, ముక్తి కలిగించు పనులకు అడ్డంకిగా మారగలదు.

యోషితస్త్రివిధా బ్రహ్మన్ గృహిణం మూఢ చేతసొం

సాధ్వీ భోగ్యా చ కులటాస్తాః సర్వాస్వార్థతత్పరాః

పరలోకభియా సాధ్వీ తథేహ యశసాఽత్మనః

కామస్నేహాచ్చ కురుతే భర్తుః సేవాం చ సంతతం

భోగ్యా భోగార్థినీ శశ్వత్యామస్నేహేన కేవలం

కురుతే కాంతసేవాం చ నచ భోగాదృతే క్షణం

వస్త్రాలంకార సంభోగ సుస్నిగ్ధహారముత్తమం

యావత్ర్పాప్నోతి సా భోగ్యా తాపచ్చ వశగా ప్రియా

కులాంగారసమా నారీ కులటా కులనాశినీ

కపటాత్కురుతే సేవాం స్వామినో న చ భక్తితః

సదా పుంయోగమాశంసుర్మనసా మదనాతురా

ఆహారాదధీకం జారం ప్రార్థయంతీ నవం నవం

జారార్ధే స్వపతిం తాత హంతు మిచ్ఛతి పుంశ్చలీ

తస్యాం యో విశ్వసేమ్మాడో జీవనం తస్య నిష్ఫలం

తెలివి తక్కువగల గృహస్థుల భార్యలు మూడు విధములుగా కన్పింతురు. వారు సాధ్వి. భోగ్యా, కులట అనేవారు. వీరు ముగ్గురు కూడ స్వార్థపరులే.

వీరిలో సాధ్వి పరలోకమందు ఏమో జరుగునన్న భయములో, లేనిచో చెడు పేరు వచ్చునను భయముతో భర్తతో కలిసియుండును.

తన భర్తవలన గొప్పనైన వస్త్రములు, అలంకారములు, నగలు, సంభోగము, చక్కని భోజనము దొరకునంతవరకు, ఆతనికి వశమై అతని మనసెరిగి ప్రేమతో భర్తకు సేవచేయునది భోగ్య.

మూడవదైన కులట భర్త కులమునకు నిప్పువంటిది. ఆతని కులమును నాశనము చేయును. సదా కామాతురయై భర్తృసేవను కపటబుద్ధితో చేయుచు క్రొత్తక్రొత్త జారులపై బుద్ధి కలిగియుండును. ఆమె తన జారువి కొరకు భర్తను చంపుటకైనను వెనుదీయదు. అట్టి కులటను ఏమూఢుడు విశ్వసించునో అతని జీవితమే వ్యర్థము కాగలదు.

కథితా యోషితః సర్వా ఉత్తమాధమ మధ్యమః

స్వాత్మారామా విజానంతి మనస్తాసాం న పండితాః

 హృదయం క్షురధారాభం శరత్పద్మోత్సవం ముఖం

సుధాసమం సుమధురం వచనం స్వార్థసిద్ధయే

ప్రకోపే విషతుల్యం చ విశ్వాసే సర్వనాశనం

దుర్జ్ఞేయం తదభిప్రాయం నిగూఢం కర్మ కేవలం

సదా తాసామవినయః ప్రబలం సాహసం పరం

దోషోత్కర్షచ్ఛలోత్కర్షః శశ్వన్మాయా దురత్యయా

పుంసశ్చాష్టగుణః కామః శశ్వత్కామో జగద్గురో

ఆహారో ద్విగుణో నిత్యం నైష్ఠుర్యం చ చతుర్గుణం

కోపః పుంసః షడ్గుణశ్చ వ్యవసాయశ్చ నిశ్చితం

యత్రేమే దోషనివహాః కాఽస్థా తత్ర పితామహ

పై విధముగా స్త్రీలు ఉత్తమ, మధ్యమ, ఆధమ తరగతులకు చెందినవారైయున్నారు. పరమయోగులు పండితులైనవారు సహితము ఆస్త్రీల మనోభావములను గుర్తించలేరు.

స్త్రీలయొక్క హృదయము కత్తియొక్క అంచువలె చాలాపదునైనది. ముఖము మాత్రము శరత్కాలమందలి పద్మమువలె మనోహరముగా ఉండును. వారి కోరికలను నెరవేర్చుకొనుటకు వారు అమృతమువలె తియ్యగ మాటలాడుదురు. వారికి కోపము కల్గిన విషముతో సమానముగా ప్రవర్తింతురు. వారిని సంపూర్ణముగా విశ్వసించినచో సర్వనాశనము జరుగగలదు. వారి మనస్సులోని అభిప్రాయముల నెవ్వరును తెలిసికొనలేరు. వారు చేయు పనులు చాలా నిగూఢముగా ఉండును. వారెల్లప్పుడు అవినయముతోనే ఉందురు. వారికి సాహసము చాలా ఆధికముగానుండును. మిక్కిలి దోషములు కలిగియుందురు. వారి మాయను ఎవ్వరు తప్పించుకొనలేరు. వారికి పురుషునకంటే ఎనిమిదిరెట్లు కామముండును. కామము ఎల్లప్పుడు ఉండునన్నను తప్పులేదు. అట్లే వారి ఆహారము పురుషులకంటే రెండురెట్లు అధికముగా ఉండును. నిష్ఠురమైన మాటలు నాల్గురెట్లు ఎక్కువగానుండును. కోపము ఆరురెట్లు అధికముగానుండును. వారి ప్రయత్నము స్థిరముగానుండును.

ఓ తండ్రీ! ఇన్ని దోషములకు నిలయమైన స్త్రీలపై కోరిక ఎందుకు ఉండవలెను.

కా క్రీడా కిం సుఖం పుంసాం విణ్మూత్రమలవేశ్మని

తేజః ప్రనష్టం సంభోగే దీవాలాపే యశఃక్షయః

ధనక్షయోఽతిప్రీతౌ చాత్యాసక్తౌ వపుఃక్షయః

సాహిత్యే పౌరుషం నష్టం కలహో మాన నాశనం

సర్వనాశశ్చ విశ్వాసే బ్రహ్మన్నారీషు కిం సుఖం

యావద్దనీ చ తేజస్పీ సశ్రీకో యోగ్యతాపరః

పుమాన్నారీం వశీకర్తుం సమర్దస్తావదేవ హి

రోగిణం నిర్ధనం వృద్ధం యోషిద్వై ప్రేక్షతేఽప్రియం

లోకాచారభయాత్తస్మై దదాత్యాహారమల్పకం

మూత్రమలములకు నిలయమైన స్త్రీ సంభోగమున సుఖమేమున్నది? స్త్రీసంభోగమున పురుషుని తేజస్సు నశించుచున్నది. దివాలాపము చేయుచుండిన అతని కీర్తికి హాని కలుగును. స్త్రీని అతిగా ప్రేమించినచో ధనము నశించి పోవును. లేక అత్యాసక్తినీ కనబరచిన శరీరము నశించిపోవును. అతిగా కలిసియున్న పురుషుని పౌరుషము నశించును. కలహము పెట్టుకోననిచో అభిమానము నశించును. అతిగా విశ్వసించినచో సర్వనాశము జరుగును. అట్టి స్త్రీల వలన పురుషులకు కలుగు సుఖమేముండును?

పురుషుడు మంచి ధనవంతుడు తేజస్వి యైనప్పుడు మాత్రమే స్త్రీని వశపరచుకొవగలడు. తన భర్త రోగియైనా, ధనహీనుడైనా, వృద్ధుడైనా అతనిని స్త్రీ ప్రేమతో చూచుకొనదు. కానిచో లోకాపవాదమునకు భయపడి అతనికి కొద్దిగ తిండిమాత్రము పెట్టును.

ఇత్యేవం కథితం సర్వం బ్రహ్మన్మాత్మాగమో యథా

సర్వం జానాసి సర్వజ్ఞ స్వాత్మారామేశ్వరో భవాన్

అనుగ్రహం కురు విభో విదాయం దేహి సంప్రతం

కృష్ణభక్తిం ప్రార్థయామి త్వయి కల్పతరో: పరే

ఇత్యుక్త్యా నారదస్తత్ర ధృత్వా తాత పదాంబుజం

ఆ జ్ఞాం యయాచే పితరం గంతుం తపసి మంగళ

కృతాంజలిపుటో భూత్వా భక్తినమ్రాత్మకంధరః

కృత్వా ప్రదక్షిణం నత్వా బ్రహ్మాణం గంతుముద్యతః

ఓ తండ్రి నీకు ఈ విషయమునంతయు విన్నవించితిని. నీవు సర్వజ్ఞుడవు. పరమయోగులలో శ్రేష్ఠుడవ. ఆత్మనుగురించి తెలుసుకొనినవానివలె నీవు సమస్తమును తెలుసుకొనగలిగిన వాడవు.

కల్పవృక్షము కన్న గొప్పనైన నీవు నేను కోరుకొనుచున్న శ్రీకృష్ణభక్తిని తప్పక అనుగ్రహింపగలవు. ఈవిధముగా నారదుడు తండ్రితో పలికి, అతని పాదములకు మొక్కి, చేతులు మొగిడ్చి, భక్తితో తలను వంచుకొని, అతనికి ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించి తపస్సు చేసికొనుటకై అనుజ్ఞనువేడెను.

గచ్ఛంతం తనయం దృష్ట్వా విధాతా జగతాం మునే

రురోదోచ్చైర్ముక్తకంఠం మహాసాంసారికో యథా

కరే ధృత్వా సమాలింగ్య చుచుంబ చ పునః పునః

చీరం వక్షసి కృత్వా చ వాసయామాస జానుని

స్వాత్మారామేశ్వరో బ్రహ్మా యోగీంద్రాణాం గురోర్గురుః

ఖేదం సోడుం న శక్తోఽభూద్విచ్ఛేదో దుస్సహోనృణాం

కాతరః పుత్రఖేదేన మోహితో విష్ణుమాయయా

శోకార్తో వక్తుమారేభే సుతం సంబోధ్య శౌనక

తపస్సు చేసికొనుటకై వెళ్ళుచున్న పుత్రుని చూచి ప్రపంచములను సృష్టించు బ్రహ్మదేవుడు సామాన్యమానవునివలె పెద్దగా ఏడ్చెను. పుత్రుడగు నారదుని చేతిలోనికి తీసికొని కౌగలించుకొని, మాటిమాటికి ముద్దుపెట్టుకొని, చాలా కాలము ఒడిలోనుంచుకొనెను.

పరమయోగీంద్రులలో శ్రేష్ఠుడైన బ్రహ్మదేవుడు విష్ణువుయొక్క మాయకు లోనై పుత్రవియోగమును భరించలేక దుఃఖించుచు కొడుకైన నారదునితో ఇట్లనెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే బ్రహ్మఖండే బ్రహ్మనారదసంవాదే త్రయోవింశతితమోఽధ్యాయః

శ్రీ బ్రహ్మవైవర్తమను మహాపురాణమున బ్రహ్మఖండమున బ్రహ్మనారదసంవాదముగల ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.