బ్రహ్మ వైవర్త మహా పురాణము - బ్రహ్మ ఖండము

29 - నారదమహర్షి ప్రశ్నలు

సౌతిరువాచ-సౌతి మహర్షి ఇట్లనెను-

దదర్శాశ్రమమాశ్చర్యం దేవర్షిర్నారదస్తథా

ఋ షేర్నారాయణస్యైవ బదరీవన సంయుతం

నానా వృక్షఫలాకీర్ణం పుంస్కోకిలరుత శ్రుతం

శరభేంద్రైః కేసరీంద్రైః వ్యాఘ్రోఘైః పరివేష్టితం

ఋషీంద్రస్య ప్రభావేణ హింసా భయ వివర్జితం

మహారణ్యమగమ్యం చ స్వర్గాదపి మనోహరం

సిద్దేంద్రాణాం మునీంద్రాణామాశ్రమాణాం త్రికోటిభిః

ఆవృతం చందనాలణ్యైః: పారిజాత వనాన్వితం

దదర్శతమృషీంద్రంచ సభామధ్యే మనోహరం

రత్న సింహాసనస్థంచ వసంతం యోగినాం గురుం

జపంతం పరమం బ్రహ్మ కృష్ణమాత్మానమీశ్వరం

ప్రణనామ చ తం దృష్ట్యా బ్రహ్మ పుత్రశ్చ శౌనక

దేవర్షియైన నారదుడు బదరీవనములలో నున్న నారాయణ మహర్షియొక్క ఆశ్రమమును చూచెను. ఆ బదరికాశ్రమము అనేకములైన వృక్షములతో ఫలములతో నున్నది. కోకిలల కుహనాదము ఎల్లప్పుడు అచ్చట వినిపించుచుండును. శరభమృగములు, సింహములు, పులులు మొదలగు క్రూర జంతువులున్నను మహర్షియొక్క ప్రభావమువలన అచ్చట హింసకాని, భయముకాని లేకుండును. అచ్చటి మహారణ్యము చాలా గహనమైనదైనా స్వర్గము కంటె మనోహరముగా కనిపించును. అచ్చట మహాసిద్ధులయొక్క, మహరులయొక్క ఆశ్రమములనేకమున్నవి. చందనారణ్యములు, పారిజాతవనములనేకమున్నవి. అచ్చటి సభా భవనముయొక్క మధ్యలోనున్న రత్నసింహాసనమున యోగులకు గురువును, ఆత్మేశ్వరుడు పరబ్రహ్మయగు శ్రీకృష్ణుని నామమును జపించుచున్న నారాయణ మహర్షిని చూచి నారదుడు అతనికి నమస్కరించెను.

ఉత్థాయ సహసాలింగ్య యుయుజే పరమాశీషం

పప్రచ్ఛ కుశలం స్నేహాచ్చకారాతిథి పూజనం

 రత్నాసింహాసనే రమ్యే వాసయామాస నారదం

నివసన్నాసనే రమ్యే వర్త్మ శ్రమ వివర్జితః

ఉవాచ తమృషిశ్రేష్ఠం భగవంతం సనాతనం

ఆధీత్య వేదాన్ పర్వాంశ్చ పితు: స్థానే సుదుర్గమాన్

నారాయణమహర్షి లేచి నారదుని కౌగలించుకొని, ఆశీర్వదించి కుశలమడిగి ఆతిథి పూజ చేసెను. తరువాత నారదుని రత్న సింహాసనమున కూర్చుండబెట్టెను. సారదుడు మార్గాయాసము తీరిన తరువాత నారాయణ మహర్షితో ఇట్లనెను.

జ్ఞానం సంప్రాప్య యోగీంద్రాత్ మంత్రం పై శంకరాద్విభో

 మనో మే నహీ తృప్నోతి దుర్నీవారంచ చంచలం

 దృష్టం మయా త్వత్పాదాబ్జం మనసా ప్రేరితేన చ

కించిత్ జ్ఞాన విశేషం చ లబ్దుమిచ్ఛామి సాంప్రతం

యత్ర కృష్ణగుణాఖ్యానం జన్మమృత్యు జరాపహం

బ్రహ్మ విష్ణు శివాద్యాశ్చ సురేంద్రశ్చ సురా విభో

కం చింతయంతి మునయో మనవశ్చ విచక్షణాః

కస్మాత్ సృష్టిశ్చ భవతి కుత్ర వా సంప్రలీయతే

కో వా సర్వేశ్వరో విష్ణు సర్వ కారణ కారకం

తస్యేశ్వరస్య కిం రూపం కర్మవా కిం జగత్పతే

విచార్య మనసా సర్వం తద్భవాన్ వక్తు మర్హతి

ఓ మహర్షీ నేను యోగేంద్రుడైన శంకరునినుండి జ్ఞానమును సంపాదించు కొన్నప్పటికీ నా మనస్సు తృప్తి పొందలేదు. అది చంచలమైనది, ఐనను నామనస్సు యొక్క ప్రేరేపణ వలన ఇక్కడకు వచ్చి మీపాదపద్మముల నాశ్రయించితిని. ప్రస్తుతము కొంత విశేషఙ్ఞానము పొందవలెనను కోరికగలదు.

జన్మను, ముసలితనమును, మృత్యువునపహరించు కృష్ణునియొక్క దివ్యగుణకీర్తన ఎచ్చట జరుగునో, బ్రహ్మ, విష్ణు, శివుడు మొదలగు దేవతలు మహరులు, మనువులు ఎవరిని ధ్యానింతురో, ఎవరి వలన ఈ సమస్త విశ్వము, సమస్త ప్రాణులు సృష్టింపబడినవో, ఇవన్నియు ఎవరిలో విలీనమగుచున్నవో, ఎవరు సర్వేశ్వరుడో, సర్వవ్యాపకుడో, సర్వకారణకారణుడో, ఆసర్వేశ్వరుని రూపమెట్లుండును. అతడు చేయుపని ఎటువంటిది? ఈ విషయములను చక్కగా మీరు నాకు చెప్పగలరు.

నారదస్య వచ:శ్రుత్వా ప్రహస్య భగవానృషిః

కథాం కథితుమారేభే పుణ్యాం భువనపావనీం

నారదుని మాటలు విని పూజ్యడైన నారాయణ ఋషి భగవంతునకు సంబంధించిన పుణ్యకథను చెప్పుటకు మొదలుపెట్టెను.

ఇతి శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణే బ్రహ్మఖండే సౌతి శౌనకసంవాదే నారాయణం ప్రతి నారద ప్రశ్నో నామ ఏకోనత్రింశత్తమోఽధ్యాయః

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున సౌతిశానకుల సంవాదము గల బ్రహ్మ ఖండమున నారాయణ మహర్షిని నారదుడు ప్రశ్నించుట ఆను ఇరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.