శ్రీ మద్భాగవతము - అష్టమ (8వ) స్కందము
21 - వామనావతారము - బలి చక్రవర్తి బంధితుడగుట
ఓ పరీక్షిన్మహారాజా! త్రివిక్రముని పాదములయొక్క చంద్రవంకలవంటి గోళ్ల కాంతిలో సత్యలోకము, స్వయంభువుడగు బ్రహ్మగారు వెల వెల బోయిరి. బ్రహ్మగారు ఆ కాంతిలో మునిగిపోయి, ఆ పాదమునకు ఎదురేగెను. మరీచి మొదలగు మహర్షులు, నారదుడు మొదలగు నైష్టిక బ్రహ్మచారులు, సనందనుడు మొదలగు యోగులు కూడ ఎదురేగిరి.
వేదములు (ఋగ్వేదము మొదలైనవి), ఉపవేదములు (ఆయుర్వేదము మొదలైనవి), యమములు (అహింస మొదలగునవి), నియమములు (శౌచము మొదలైనవి), న్యాయశాస్త్రము, ఇతిహాసములు (రామాయణ భారతములు), వేదాంగములు (వ్యాకరణము మొదలైనవి), పురాణములు (భాగవతము మొదలైనవి), సంహితలు (గర్గసంహిత మొదలైనవి) సత్యలోకములో మూర్తులను దాల్చి నివసించును. ఇంతేగాక, యోగము అనే వాయువుచే ప్రజ్వరిల్ల జేయబడిన జ్ఞానము (ఉపాసన) అనే అగ్నిచే దహించబడిన కర్మల కాలుష్యము గల యోగులు కూడ అక్కడ ఉండేదరు. వీరందరు ఆ భగవానుని పాదమునకు నమస్కరించిరి. స్వయంభువుడగు బ్రహ్మగారి ధామము (సత్యలోకము) కామ్యకర్మలచే పొంద శక్యము కానిది. దానిని ఈ యోగులు శ్రీహరి పాదమును స్మరించి, ఆ మహిమచే పొందినారు.
తరువాత, శ్రీహరియొక్క నాభియందలి పద్మమునుండి పుట్టిన బ్రహ్మగారు బాగా పైకి ఎదిగియున్న విష్ణువుయొక్క పాదమునకు స్వయముగా అర్ఘ్యమును సమర్పించెను. ఆయన ఆ పాదమును భక్తితో పూజించి స్తుతించెను.
ఓ మహారాజా! ఆ బ్రహ్మగారి కమండలమునందలి నీరు పెద్ద అడుగులు వేసిన శ్రీహరియొక్క పాదములను కడుగుటచే పవిత్రమై స్వర్గమునందు గంగయై ప్రవహించెను. అదియే అంతరిక్షమునందు పడి, శ్రీహరి భగవానునియొక్క స్వచ్చమైన కీర్తి వలె, ముల్లోకములను పవిత్రము చేయుచున్నది.
శ్రీహరి తన మహిమను ఉపసంహరించి వామనరూపములో నుండెను. అప్పుడు బ్రహ్మగారు, లోకపాలకులు తమ అనుచరులతో గూడి తమ నాథుడగు శ్రీహరిని చక్కని ఆదరముతో పూజించిరి.
వారు వామనుని అర్ఘ్య-పాద్య-స్నాన-ఆచమనీయములనే ఉపచారములను పరిమళభరితములైన నీటితో సమర్పించిరి. వారు సుగంధద్రవ్యములను ఆయనకు అలమి ధూపదీపములతో పూజించిరి. వారాయనను పేలాలు, అక్షతలు, దూర్వాంకురములతో పూజించి పళ్లను నైవేద్యమీడిరి.
వారు జయజయధ్వానములను చేస్తూ ఆయన పరాక్రమము యొక్క మహిమను ఉటంకించే స్తోత్రములతో ఆయనను స్తుతించిరి. నాట్యములు, వాద్యములు, గానములతో ఆయనను ఆరాధించిరి. వారు ఆయన పూజలో భాగముగా శంఖములను, దుందుభులను మ్రోగించిరి.
ఎలుగుబంట్లకు రాజగు జాంబవంతుడు మనోవేగముతో దిక్కులన్నింటియందు తిరిగి భేరీశబ్దముతో పెద్ద ఉత్సవము కలుగునట్లుగా శ్రీహరి యొక్క విజయమును చాటెను.
తమ రాజు యజ్ఞదీక్షలోనుండగా మూడు అడుగుల భూమిని యాచించి మోసముతో భూమినంతనూ లాగివేసుకొనుటను గాంచిన రాక్షసులు చాల కోపమును పొంది ఇట్లు పలికిరి.
ఈ వామనుడు బ్రాహ్మణ బాలకుడు కాడు. ఈతడు మోసగాళ్లలో అగ్రేసరుడగు విష్ణువు. ఇది నిశ్చయము. విష్ణువే దేవతలకు కార్యమును చక్కబెట్ట గోరి, ఈ విధముగా కపట బ్రాహ్మణవేషముతో వచ్చినాడు.
బ్రహ్మచారివేషములోనున్న ఈతడు మన శత్రువు. మన ప్రభువు ఇతరులను దండించే అధికారమును పరిత్యజించి యజ్ఞములో నుండగా ఈతడు వచ్చి యాచించి ఆయన సకలసంపదలను లాగివేసినాడు.
బలి సర్వకాలములలో సత్యమునందు నిష్ట గలవాడు. ఆయన బ్రాహ్మణులయందు భక్తిగల దయామయుడు. ఆయన విశ్లేషించి యజ్ఞ దీక్షలో నుండగా, అసత్యమును పలుకుట సంభవము కాదు.
అందువలన, వీనిని వధించుటయే ధర్మము; పైగా, అది మన ప్రభువునకు సేవ చేసినట్లు అగును -- అని పలుకుతూ, బలియొక్క అనుచరులగు రాక్షసులు ఆయుధములను చేబట్టిరి.
ఓ రాజా! బలి వ్యతిరేకించిననూ వారందరు కోపముతో శూలములను, అడ్డకత్తులను పట్టుకొని వామనుని చంపుటకై ముందునకురికిరి.
ఓ మహారాజా! ముందునకు ఉరుకుచున్న ఆ రాక్షస సేనానాయ కులను చూచి విష్ణువుయొక్క అనుచరులు గట్టిగా నవ్వి, ఆయుధములను పైకెత్తి వారిని అడ్డుకొనిరి.
నందుడు, సునందుడు, జయుడు, విజయుడు, బలుడు, ప్రబలుడు, కుముదుడు, కుముదాక్షుడు, విష్వక్సేనుడు, పక్షిరాజగు గరుత్మంతుడు, జయంతుడు, శ్రుతదేవుడు, పుష్పదంతుడు మరియు సాత్వతుడు అనే వీరందరు పదివేల ఏనుగుల బలము గలవారే. వారు ఆ రాక్షసుల సైన్యమును దునుమాడిరి.
బలికి శుక్రాచార్యుని శాపము గుర్తుకు వచ్చెను. కోపించియున్న తన వారిని పురుషోత్తముని అనుచరులు చంపుచుండుటను చూచి, ఆయన తన వారిని వారించెను.
ఓ విప్రచిత్తీ! ఓ రాహూ! ఓ నేమీ! నా మాటను వినుడు. యుద్ధమును మాని వెనుదిరుగుడు. ఈ కాలము మనకు అనుకూలము కాదు.
ఓ రాక్షసులారా! సకలప్రాణులకు సుఖదుఃఖములనిచ్చేది కాలమే. మానవుడు పురుషకారములచే దానిని అతిక్రమించుటకు సమర్థుడు కాడు.
కాలము సర్వసమర్థమైనది. అది ఇదివరలో మనకు కల్యాణమును, స్వర్గవాసులకు దుఃఖమును ఇచ్చినది. అదే కాలము ఈనాడు దానికి విరుద్ధముగా మనకు దుఃఖమును, దేవతలకు అభివృద్ధిని ఇచ్చుచున్నది.
సైన్యము, మంత్రులు, తెలివితేటలు, దుర్గములు, మంత్రములు ఔషధములు యంత్రములు మొదలైనవి, మరియు సామదానభేదదండోపాయములు అనువాటితో మానవుడు కాలమును అతిక్రమించలేడు. ఇది నిశ్చయము.
కాలము కలిసివచ్చి సంపదలు ఉన్నప్పుడు మీరే ఈ శ్రీహరి అనుచరులను పలుమార్లు జయించిరి గదా! కాని, ఈ నాడు కాలము కలిసి రాక, వారు మనలను జయించి సింహనాదమును చేయుచున్నారు.
దైవము అనుకూలమైనచో మనము వీరిని జయించగలము. కావున, మనకు కార్యసిద్ధికి అనుకూలమయ్యే కాలము కొరకు వేచియుండుడు.
ఓ మహారాజా! దితి దనువంశములకు చెందిన రాక్షస సేనానాయకులు తమ నాయకుడగు బలియొక్క మాటను స్వీకరించిరి. విష్ణువు యొక్క అనుచరులచే నిర్జించబడిన ఆ సేనానాయకులు రసాతలమును ప్రవేశించిరి.
తరువాత కశ్యపుని పుత్రుడు, పక్షిరాజు అగు గరుత్మంతుడు శ్రీహరి ప్రభుని అభిప్రాయమును తెలుసుకొని, ఆ బలిని అదే యజ్ఞములో సుత్యాహస్పు (సోమరసమును దంచే రోజు) నందు వరుణపాశములతో బంధించెను.
సర్వసమర్థుడగు శ్రీహరి రాక్షసరాజగు బలిని బంధించుచుండగా, భూలోక స్వర్గలోకములయందు అన్ని దిక్కులలో హాహాకారములు బయలు దేరెను.
స్థిరమైన వివేకజ్ఞానము, గొప్ప కీర్తి గల బలి నాగపాశములచే బంధించబడి శోభను కోల్పోయి ఉండెను. అపుడు వామన భగవానుడు ఆయనతో ఇట్లు పలికెను.
ఓ రాక్షసా! నాకు నీవు మూడు అడుగుల భూమిని వాగ్దానము చేసితివి. నేను రెండు అడుగులతో భూమినంతనూ ఆక్రమించితిని. నాకు మూడవ అడుగు భూమిని ఇమ్ము.
ఈ సూర్యుడు తన కిరణములతో ఎంతవరకైతే తపింపజేయునో, ఎంతవరకైతే చంద్రుడు నక్షత్రములు ప్రకాశింపజేయునో, ఎంతవరకైతే మేఘము వర్షించునో, అంతటి భూమి (సకల భూమండలము) నీ అధీనములో నుండెడిది.
వ్యాపకుడనగు నేను ఒక అడుగుతో భూలోకమును, శరీరముతో ఆకాశమును దిక్కులను, రెండవ అడుగుతో స్వర్గలోకమును ఆక్రమించితిని. నీవు చూచుచుండగనే నీ సంపద నాది అయినది.
వాగ్దానము చేసినదానిని దానము చేయని నీకు నరకమునందు నివాసము శాస్త్రముచే అంగీకరించబడినది. నీ గురువగు శుక్రాచార్యుడు కూడ అదే విషయమును అనుమోదించినాడు. కావున, నీవు నరకమును ప్రవేశించుము.
ఎవడైతే యాచకునకు మాట ఇచ్చి దానము చేయకుండా మోసగించునో, అట్టివానియొక్క స్వర్గసుఖములను పొందాలనే మనోరథము వ్యర్థము. అట్టివానికి స్వర్గము చాల దూరము. వాడు నరకములో పడును.
నేనే సంపన్నుడననే గర్వము నీకు గలదు. నీవు ఇచ్చెదనని మాట ఇచ్చి నన్ను కూడ మోసగించినావు. ఆ మోసమునకు ఫలము నరకము. కావున, నీవు కొన్ని సంవత్సరములు నరకముననుభవించుము.
శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో వామనావతారవృత్తాంతములో బలి బంధించబడుటను వర్ణించే ఇరువది ఒకటవ అధ్యాయము ముగిసినదీ (21).
