శ్రీ మద్భాగవతము - అష్టమ (8వ) స్కందము
15 - వామనావతారము - బలి స్వర్గముపై విజయమును పొందుట
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- శ్రీహరి సర్వేశ్వరుడై ఉండియు దీనుడు వలే బలి చక్రవర్తిని మూడడుగుల భూమిని యాచించు టకు కారణమేమి? ప్రయోజనము సిద్ధించిన తరువాత కూడ ఆయన బలిని బంధించుటకు కారణమేమి?
మాకు ఈ విషయమును తెలియవలెననే ఉత్కంఠ అధికముగా గలదు. యజ్ఞమునకు ప్రభువు, పూర్ణుడు అగు శ్రీహరి యాచించుట, బలి నిరపరాధియే అయినా ఆయనను బంధించుట ఎట్లు సంభవమాయెను?
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! ఇంద్రుడు బలిని ఓడించి ఆతని సంపదను హరించుటయే గాక, ఆతని ప్రాణములను కూడ తీసెను. అపుడు గొప్ప శీలము గల ఆ బలిని భృగువంశీయులు బ్రతి కించిరి. ఆయన వారికి శిష్యుడై పదార్థములను సమర్పిస్తూ అన్ని విధము లుగా వారిని సేవించెను.
భృగు వంశీయులగు బ్రాహ్మణులు గొప్ప ప్రభావము గలవారు. వారు బలి యెడల చాల ప్రసన్నులైరి. స్వర్గమును జయించ గోరే బలిని వారు యథావిధిగా మహాభిషేకముతో అభిషేకించి, విశ్వజిద్యాగమును చేయించిరి.
తరువాత హవిస్సులచే ఆరాధించబడిన అగ్నినుండి బంగర వస్త్ర ముచే కప్పబడిన రథము, ఇంద్రుని గుర్రములవలె పచ్చని గుర్రములు, సింహముతో ప్రకాశించే ధ్వజము కూడ ఆవిర్భవించెను.
బంగరు రేకు తొడిగిన దివ్యమైన ధనుస్సు, అక్షయములైన తూణీ రములు, దివ్యమగు కవచము కూడ ప్రకటమయ్యెను. తాతగారు ప్రహ్లా దుడు ఆ బలికి వాడని పుష్పముల మాలను, శుక్రాచార్యుడు శంఖమును ఇచ్చిరి.
ఈ విధముగా బలికి యుద్ధపరికరములను ఆ బ్రాహ్మణులు యజ్ఞము ద్వారా సంపాదించి పెట్టిరి. వారు స్వస్తివాచనములు పలుకగా ఆతడు వారికి ప్రదక్షిణ నమస్కారములను చేసి, ప్రహ్లాదునకు నమస్కరించి ఆయన వద్ద సెలవు తీసుకోనెను.
మహారథుడగు బలి చక్కని మాలను, ధనుస్సును, కత్తిని, తూణీర ములను ధరించి, కవచమును వేసుకొని, భృగువంశీయులు సమకూర్చిన దివ్యమగు రథమునెక్కెను.
ఆయన చేతులు బంగరు భుజపురులతో ప్రకాశించేను. మెరిసి పోయే మకరాకార కుండలములను ధరించిన ఆ బలి రథమునెక్కి, అగ్ని కుండమునందలి అగ్ని వలె ప్రకాశించెను.
బలి చక్రవర్తిని రాక్షస సేనానాయకులు తమ తమ సైన్యములతో కూడి చుట్టువారి యుండిరి. బలితో సమానమైన ప్రభావము, బలము, సంపదలు గల ఆ సేనానాయకులు చూపులతో ఆకాశమును త్రాగుచు న్నారా యన్నట్లు, దిక్కులను తగులబెట్టుచున్నారా యన్నట్లు ఉండిరి. బలి పెద్ద రాక్షస సైన్యమును నడుపుతూ మిక్కిలి సమృద్ధమగు ఇంద్రనగరము (అమరావతి) ను చేరెను. ఆయన సైన్యమును నడుపుచుండగా భూలోక స్వర్గలోకములను కంపింప జేయుచున్నాడా యన్నట్లు ఉండెను.
ఆ నగరములోని నందనము మొదలైన ఉపవనములు (దగ్గరగా ఉండే పళ్ల తోటలు), ఉద్యానములు (దూరముగా ఉండే పూలదోటలు) కూతలు కూసే పక్షుల జంటలతో, ఝంకారమును చేసే మదించిన తుమ్మె దలతో, కొమ్ముల నిండా చిగుళ్లు పళ్లు పువ్వుల పెను భారము గల దేవ (క ల్ప) వృక్షములతో శోభాయుతములై యుండెను.
హంసలు, బెగ్గురు పక్షులు, జక్కవ పక్షులు, కారండవ పక్షుల సమూహములతో అక్కడి తామర కొలనులు కోలాహలముగా నుండును. వాటియందు దేవతలచే సమ్మానించబడే దేవస్త్రీలు క్రీడించెదరు.
పూజనీయమైన ఆకాశగంగ అమరావతీ నగరము చుట్టూ అగర్త ఆయెను. ఆ నగరము చుట్టూ అగ్ని వలె ప్రకాశించే ఎత్తైన ప్రాకారము గలదు. దానిపై బురుజులు గలవు.
ఆ నగరములోని ద్వారముల తలుపులకు పట్టీలు వెండివి. దాని పురద్వారములకు స్పటికములు పొదగబడినవి. విశ్వకర్మచే నిర్మించబడిన ఆ నగరమునందు రాజమార్గములు చక్కగా విభాగము చేయబడియున్నవి.
అమరావతీ నగరము సభలు, ముంగిళ్లు, రథమార్ధములతో సుసం పన్నమై యుండెను. దానియందు పది కోట్ల విమానములు, మణులు పొది గిన కూడళ్లు, వజ్రములు పగడములు పొదిగిన వేదికలు గలవు.
ఆ నగరమునందలి యువతులు నిత్యము ఉండే సౌందర్యము, యౌవనము గలవారు. శుద్దమగు వస్త్రములను దాల్చే ఆ సుందరులు ఆభ రణములను దాల్చి, జ్వాలలతో గూడిన అగ్నులు వలె ప్రకాశించెదరు.
ఆ నగరమునందు దేవస్త్రీల కేశములనుండి జారిపడిన సౌగంధిక పుష్పముల మాలల పరిమళమును స్వీకరించి వాయువు మార్గమునందు మెల్లగా వీచుచుండును.
సుగంధభరితమైన తెల్లని అగురు ధూపము బంగరు కిటికీలనుండి బయటకు వచ్చి మార్గమును కప్పివేయును. అట్టి మార్గమునందు అప్సర సలు నడచుచుందురు.
ఆ నగరము అంతటా ముత్యముల చాందినీలు, మణులు గల బంగరు టెక్కెములు, అనేకములైన చిన్నజెండాలు పెట్టిన ఇళ్ల నడికొప్పు లు ఉండెను. నెమళ్లు, ' పావురములు, తుమ్మెదలు ధ్వనిని చేయుచుండెను. దేవస్త్రీల మధురగానములతో ఆ నగరము మంగళప్రద ముగా నుండెను.
ఆ నగరములో డోళ్లు, శంఖములు, తప్పెట్లు, దుందుభులు, తాళ ములు, వీణలు, మద్దెళ్లు, ఋష్టి అనే వాద్యములు, వేణువులు మొదలగు వాద్యములను వాయిస్తూ గంధర్వులు గానములను చేయుచుండగా, అప్సరసలు నాట్యములను చేయుచుండిరి. ఈ విధముగా మనోహరమైన ఆ నగరము తన కాంతిచే కాంతిదేవిని కూడ జయించినదా యన్నట్లు ఉండెను.
ధర్మాత్ములు కానివారు, దుష్టులు, ప్రాణులకు ద్రోహమును చేయువారు, రహస్యముగా అపకారమును చేయువారు, గర్విష్ఠులు, కాముకులు, లోభులు ఆ నగరమును చేరలేరు. ఈ దోషములు లేనివారు మాత్రమే ఆ నగరమును పొందెదరు.
సేనాపతియగు ఆ బలి దేవతల రాజధానియగు అమరావతిని బయట అంతటా సైన్యముతో ముట్టడించెను. ఆయన ఇంద్రుని భార్యలకు భయము కలిగే విధముగా, ఆచార్యులచే ఈయబడిన గొప్ప ధ్వనిని చేసే శంఖమును పూరించెను.
బలియొక్క ఆ గొప్ప యుద్ధోద్యమమును గురించి తెలుసుకున్న ఇంద్రుడు దేవగణములందరితో గూడి బృహస్పతితో ఇట్లు పలికెను.
ఓ పూజనీయా! మనకు పూర్వమునందు శత్రువైన బలి చేయు చున్న యుద్దప్రయత్నము చాల పెద్దది. మనము వీనిని ఎదుర్కొనలేమని నా అభిప్రాయము. ఈతడు ఏ శక్తిచే ఇంతటి శక్తి గలవాడైనాడు?
ఎవ్వడైననూ ఏ ఉపాయముచేనైననూ వీనిని నెట్టివేయుటకు సమ ర్థుడు కాడు. ఈతడు నోటితో జగత్తును త్రాగుచున్నాడా యన్నట్లు, దిక్కుల నాస్వాదించుచున్నాడా యన్నట్లు, చూపులతో దిక్కులను దహించుచు న్నాడా యన్నట్లు ప్రళయకాలాగ్నివలె ఆవిర్భవించినాడు.
నా శత్రువగు ఈతనిని జయించ శక్యము కాదు. ఈతని ఈ స్థితికి కారణమేమి? ఈతనిలో మనోబలము, ఇంద్రియబలము, శరీరబలము ఎక్కడనుండి వచ్చినవి? వాటి ఆధారముగనే ఈతడు ఇంత ఉద్యమమును చేయుచున్నాడు.
ఓ ఇంద్రా! శత్రువుయొక్క ఈ అభివృద్ధికి కారణము నాకు తెలి యును. వేదవేత్తలగు భృగువంశీయులు తమ శిష్యుడగు ఈ బలియందు తేజస్సును నింపినారు.
జనులు మృత్యువు యెదుట నిలువలేరు. అదే విధముగా, నీవు గాని, నీవంటివాడు మరియొకడు గాని, సర్వేశ్వరుడగు శ్రీహరిని విడిచి పెట్టినచో, వీని యెదుట నిలబడలేరు.
కావున, మీరందరు స్వర్గమును విడిచి ఎచ్చటనో దాగియున్నవా రై, కాలమును వేచి చూచుచుండుడు. కాలమే శత్రువు స్థితిని తల్లక్రిందులు చేయగలదు. .
వేదవేత్తల బలముచే ఉత్తరోత్తరాభివృద్ధి గల ఈతని పరాక్రమము ఇప్పుడు వృద్ధి చెందియున్నది. ఈతడు మరల ఆ వేదవేత్తలను అవమా నము చేసినప్పుడు మాత్రమే సపరివారముగా వినాశమును పొందగలడు.
యథార్థమైన విచారమును చేసే బృహస్పతి ఈ విధముగా విచా రపూర్వకముగా దేవతల ప్రయోజనమును గురించి సలహానిచ్చెను. అపుడు ఆ దేవతలు తమకు నచ్చిన రూపములను దాల్చి స్వర్గమును విడి చిపెట్టి వెళ్లిరి.
దేవతలు దాగుకొనగా ఆ తరువాత విరోచన పుత్రుడగు బలి దేవ తల రాజధానియగు అమరావతీ నగరమునకు అధీశ్వరుడై ముల్లోకములను తన వశము చేసుకొనెను.
జగత్తును జయించి తమను అనుసరించే తమ శిష్యుడగు బలిపై భృగువంశీయులకు ప్రేమ మెండు. వారాయనచే వంద అశ్వమేధ యాగ ములను చేయించిరి.
తరువాత ఆ యజ్ఞముల ప్రభావముచే ఆ బలి ముల్లోకములలో దిక్కులయందు తన కీర్తిని విస్తరింప జేసి, నక్షత్రాధిపతియగు చంద్రుడు వలె ప్రకాశించేను.
బలి గొప్ప ఔదార్యము గలవాడు. యజ్ఞములను చేసి తాను కృతార్థుడనైతినని ఆయన తలపోసెను. వేదవేత్తల అనుగ్రహముచే దేవతల సమృద్ధమైన సంపద లభించగా, ఆయన దానిని అనుభవించెను.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో బలి స్వర్గముపై విజయమును పొందుటను వర్ణించే పదిహేనవ అధ్యాయము ముగిసినది .
