శ్రీ మద్భాగవతము - అష్టమ (8వ) స్కందము

Table of Contents

8 - సముద్ర మథనము - లక్ష్మి, ధన్వంతరుల ఆవిర్భావము

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- రుద్రుని ధ్వజము పై వృష భము చిహ్నముగా నుండును. ఆయన విషమును త్రాగగా, దేవతలు రాక్ష సులు ప్రీతిని పొందిరి. వారు వేగముగా సముద్రమును మథించిరి. ఆ మథ నము వలన కామధేనువు పుట్టెను.

ఓ మహారాజా! సత్యలోకమును సిద్ధింపజేసే యజ్ఞమును చేయు టకు, నిత్యాగ్నిహోత్రమునకు కూడ పవిత్రమగు హవిస్సు ఆవశ్యకము. పాల ద్వారా అట్టి హవిస్సును సమకూర్చే ఆ కామధేనువును వేదవేత్తలైన మహర్షులు స్వీకరించిరి.

తరువాత ఉచ్చైశ్శ్రవసమని ప్రసిద్ధి గాంచిన గుర్రము పుట్టెను. అది చంద్రుని వలె తెల్లగా మెరియుచుండెను. బలి దానిపై మనసు పడెను. శ్రీహరి ముందే శిక్షణనిచ్చియుండుటచే ఇంద్రుడు దానిని కోరలేదు.

తరువాత ఐరావతమని ప్రసిద్ధి గాంచిన గొప్ప ఏనుగు పుట్టెను. నాలుగు తెల్లని దంతములు గల ఆ ఏనుగు రుద్ర భగవానుని తెల్లని కైలాస పర్వతముయొక్క మహిమను అపహరించుచుండెను.

ఆ మహాసముద్రమునుండి కౌస్తుభమనే పేరు గల పద్మరాగమణి పుట్టెను. తన వక్షఃస్థలమునకు అలంకారముగా నుండుననే భావనతో శ్రీహరి ఆ మణిపై మనసు పడెను.

తరువాత దేవలోకమునకు అలంకారమైన కల్పవృక్షము పుట్టెను. భూలోకములో నీవు (పరీక్షిత్తు) వలెనే, ఆ వృక్షము కోరువారి కోరికలను సర్వకాలములలో పూర్తి చేయుచుండును.

తరువాత కంఠమునందు పతకములను, చక్కని వస్త్రములను ధరించిన అప్సరసలు కూడ పుట్టిరి. వారు తమ మనోహరమగు నడకలతో, విలాసపు చూపులతో స్వర్గవాసులను రంజింప జేయుదురు.

తరువాత సాక్షాత్తుగా లక్ష్మీదేవి, పర్వతశిఖరము పై మెరిసే మెరుపు వలె, దిక్కులను తన కాంతిచే ప్రకాశింప జేయుచూ ఆవిర్భవించే ను. ఆమె శ్రీహరి భగవానునియందు పూర్ణమగు అనురాగము గలదియై ఆయనను రంజింపజేయును.

            దేవతలు, రాక్షసులు, మానవులతో సహా అందరు ఆ లక్ష్మీదేవిని కోరిరి. వారి మనస్సులు ఆమెయొక్క రూపము, ఔదార్యము, యౌవనము, రంగుల గొప్పదనముచే ఆకర్షించబడెను.

ఆమెకు మహేంద్రుడు ఆశ్చర్యమును కలిగించే పెద్ద ఆసనమును తీసుకురాగా, రూపు దాల్చిన గొప్ప నదులు బంగరు కడవలతో స్వచ్ఛ మగు నీటిని తెచ్చిరి.

భూమి అభిషేకమునకు వినియోగించే మొక్కలనన్నింటినీ, ఆవులు పావనము చేసే పంచగవ్యములను, వసంతుడు (ఋతువునకు అధిదేవత) చైత్రవైశాఖమాసములకు చెందిన పుష్పములను, పళ్లను సమ కూర్చిరి.

మహర్షులు యథావిధిగా అభి షేకమును సంపన్నము చేసిరి. గంధర్వులు మంగళసంగీతమును గానము చేసిరి. నటస్త్రీలు పాటలను పాడుతూ నాట్యమును చేసిరి.

మేఘాధిష్టాన దేవతలు సంకులమగు ధ్వనిని చేసే డోళ్లను, తప్పె ట్లను, మద్దెళ్లను, భేరీలను, కొమ్ము బూరాలను, శంఖములను, వేణువుల ను, వీణలను మ్రోగించిరి.

తరువాత దిగ్గజములు పతివ్రతయగు లక్ష్మీదేవి చేతిలో పద్మ మును పట్టుకొనియుండగా, వేదవేత్తలు అభి షేకమంత్రములను పఠించు చుండగా, పూర్ణకుంభములతో ఆమెను అభిషేకించినవి.

సముద్రుడు పచ్చని పట్టు వస్త్రముల జంటను, వరుణుడు వైజ యంతి అనే పుష్పమాలను ఇచ్చెను. ఆ పుష్పములలోని తేనెచే మత్తెక్కిన తుమ్మెదలు ఆ మాలను చుట్టువారి యుండెను.

విశ్వకర్మ ప్రజాపతి రంగురంగుల ఆభరణములను, సరస్వతి హార. మును, స్వయంభువుడగు బ్రహ్మగారు పద్మమును, నాగులు కుండల ముల జతను సమర్పించిరి.

వేదవేత్తలు స్వస్తివాచనమును పఠించిన తరువాత లక్ష్మీదేవి చేతిలో ఒక కలువల మాలను పట్టుకొని ముందుకు నడిచెను. ఆ మాల చుట్టూ తుమ్మెదలు ధ్వనించుచుండెను. చక్కని చెక్కిళ్లు గల ఆమె ముఖము కుండలముతో చాల శోభిల్లుచుండెను. ఆమె సిగ్గుతో చిరునవ్వు నవ్వుచుండెను.

మిక్కిలి చిక్కిన నడుముగల ఆ లక్ష్మీదేవి సమమైన అంతరాళము లేని పాలిండ్ల జంటపై గంధమును కుంకుమను అలముకొని యుండెను. ఆమే అటునటు. నడయాడుచుండగా కాలియందేల ధ్వనులు మనస్సును హరించుచుండెను. ఆమె నడయాడే బంగరు తీగవలె ప్రకాశించెను.

తనకు దోషములు లేనిది, శాశ్వతమైనది, ఏ కాలమునందైననూ తొలగిపోని సద్గుణములు గలది అగు ఆశ్రయము (భర్త) ను గురించి ఆ లక్ష్మీదేవి చూచుచుండెను. గంధర్వులు, యక్షులు, సిద్ధులు, చారణులు, స్వర్గలోకవాసులగు దేవతలు మొదలగువారిలో ఆమెకు అట్టి భర్త లభించలేదు. 

ఒకడు నిశ్చయముగా గొప్ప తపశ్శాలియే. కాని, వానికి కోప ముపై విజయము లేదు. మరియొకడు పండితుడే. కాని, దానికి సంసారా సక్తి మెండు. మరియొకడు గొప్పవాడే. కాని, దానికి కామముపై విజయము లేదు. ఐశ్వర్యము గలవాడైననూ ఇతరులనుండి ఏదో ఒకదాని కొరకై ఇతరులను ఆశ్రయించే వ్యక్తి సర్వస్వతంత్రుడు కాగలునా? (కాలేడు).

ఒకనియందు ధర్మమున్నది. కానీ, వానికి ప్రాణులయందు ప్రేమ లేదు. మరియొకనియందు త్యాగము గలదు. కాని, ఆ త్యాగము మోక్ష హే తువు కాదు. ఒక వ్యక్తికి బలము ఉన్నది. కాని, వాని ఆ బలము కాలము, యొక్క వేగములో నిలిచేది కాదు. ఒకనికి త్రిగుణకార్యమగు జగత్తునందు ఆసక్తి లేదు. కాని, ఆతడు సర్వదా రెండవది లేని సమాధిలో మండును.

ఒకనియందు దీర్ఘాయుర్ధాయమున్నది. కాని, మంగళప్రదమైన శీలము లేదు. మరియొకనియందు మంగళకరమగు శీలము కూడ గలదు. కాని, వాని ఆయుర్దాయమును గురించి తెలియకపోవుటయే మంచిది. ఒక సోకని (శివుడు) యందు ఈ రెండు గలవు. కాని వాని వేషము అమంగళ కరము. ఒకానొకడు (శ్రీహరి) సకలకల్యాణగుణములు గలవాడే. కానీ, ఆతడు నన్ను కోరుటనే లేదు.

             ఈ విధముగా విచారించి లక్ష్మీదేవి శ్రేష్ఠుడైన మోక్షప్రదాతయగు శ్రీహరిని వరించెను. ఆయనయందు సకలసద్గుణములు సర్వకాలములలో నుండును. ఆయన తన స్వరూపమునందు మాత్రమే ఆశ్రయము గలవాడ గుటచే త్రిగుణకార్యమగు జగత్తునందు ఆయనకు ఆశ్రయము లేదు (అనగా, ఆనందము కొరకై జగత్తు పై ఆధారపడువాడు కొడు). అణిమ మొదలైన సకలసిద్ధులు ఆయనను ప్రార్థించిననూ, ఆయనకు వాటి అపేక్ష లేదు. కావుననే, ఆయన లక్ష్మీదేవికి కోరదగినవాడు ఆయెను.

ఆమె ఆ శ్రీహరియొక్క మెడలో సుందరమైన కొంగ్రత్త కమల ముల మాలను వేసేను. మత్తెక్కిన తుమ్మెదల సమూహముచే ఆ మాల ధ్వనించుచుండెను. ఆమె సిగ్గుపడుతూ చిరునవ్వుతో తన నివాసస్థానమగు ఆయన వక్షఃస్థలమును చూచుచుండెను. ఆమే ఆయన ప్రక్కనే నిలబడేను.

             ముల్లోకములకు తండ్రియగు శ్రీహరి జగన్మాత, సంపద్రూపిణీ యగు లక్ష్మీదేవికి తన వక్షఃస్థలమును శ్రేష్ఠమైన నివాసముగా చేసెను. అచట నిలిచియున్న ఆ దేవి దయతో గూడిన చూపుతో తన సంతానమైన ముల్లోకములను, లోకపాలకులను కూడ వర్ధిల్ల జేసెను.

అపుడు శంఖములు, బూరాలు, డోళ్లు మొదలైన వాద్యపరికర ములు మ్రోగించబడెను. దేవతలకు అనుచరులగు గంధర్వులు అప్సరస లతో గూడి పాడుతూ నాట్యమును చేసిరి. ఇవి అన్నీ కలిపి పెద్ద ధ్వని ఏర్పడెను,

బ్రహ్మగారు, రుద్రుడు, అంగిరసుడు మొదలైన ప్రజాపతులు అందరు సర్వవ్యాపకుడగు శ్రీహరిపై పుష్పములను వర్షిస్తూ, శ్రీహరిని ప్రతిపాదించే యథార్థములగు మంత్రములతో ఆయనను స్తుతించిరి.

లక్ష్మీదేవియొక్క కృపాకటాక్షముచే ప్రజాపతులు, దేవతలు, ఇతర ప్రాణులు కూడ సచ్చీలము మొదలగు సద్గుణములను నిండా కలిగి, సర్వో తమమగు ఆనందమును పొందిరి.

ఓ మహారాజా! లక్ష్మీదేవి దితి దనువంశములకు చెందిన రాక్షసులను ఉపేక్షించెను. అపుడు వారు బలహీనులై భోగాసక్తులై ప్రయత్నశీల మును కోల్పోయి సిగ్గు లేని ప్రవృత్తిని కలిగియుండిరి.

తరువాత సురకు అధిష్టాన దేవతయగు దేవి కలువ కన్నుల కన్యయై ఆవిర్భవించెను. ఆమెను మాత్రము శ్రీహరి అనుమతితో ఆ రాక్ష సులు తీసుకొనిరి.

ఓ మహారాజా! తరువాత అమృతమును కోరే కశ్యపసుతులగు దేవతలు మరియు రాక్షసులు సముద్రమును మథించుచుండగా, దాని నుండి ఒక పరమాశ్చర్యమును కలిగించే పురుషుడు ప్రకటమయ్యెను.

శంఖమువంటి మెడగల ఆ పురుషుని పొడవాటి దండములవంటి బాహువులు బలిసియుండెను. శ్యామలవర్ణము గల ఆతని కన్నులు ఎర్రగా నుండెను. ఆతడు మాలను దాల్చి సకలాభరణములను అలంకరించుకొని

యుండెను.

పచ్చని వస్త్రమును ధరించిన ఆ పురుషుడు విశాలమైన వక్షఃస్థల ముతో, మిక్కిలి ప్రకాశించే మణి కుండలములతో చాల అందముగ నుండె ను, ఆతని జుట్టు కోనలు చిక్కగా ఉంగరాలు తిరిగి యుండెను. ఆతడు పరాక్రమములో సింహమువంటి వాడు.

             కంకణములను అలంకరించుకున్న ఆ పురుషుడు అమృతముతో నిండియున్న కలశమును ధరించి యుండెను. ఆయన నిశ్చయముగా సాక్షాత్తుగా శ్రీహరియొక్క అంశమైన సముద్రునియొక్క అంశమై జన్మిం చినవాడు. ఆయనయే ధన్వంతరియని ప్రసిద్ధి గాంచి ఆయుర్వేదమును ప్రవర్తిల్ల జేసిన ద్రష్ట. ఆయనకు యజ్ఞములలోని హవిస్సులో భాగము గలదు.

             ఆ ధన్వంతరిని, అమృతముతో నిండియున్న కలశమును రాక్ష సులు చూచిరి. మథనములో పుట్టిన సకలవస్తువులను తామే పొందాలని వారి కోరిక. అపుడు వారందరు ఆ కలశమును బలాత్కారముగా తీసుకు పోయిరి.

             రాక్షసులు అమృతముతో నిండిన ఆ కలశమును తీసుకుపోవుచుం డగా, దేవతలకు తమ మనస్సులో అధికమగు ఖేదము కలిగెను. వార ప్పుడు శ్రీహరిని శరణు వేడిరి.

సేవకుల పనిని చేసి పెట్టే శ్రీహరి భగవానుడు ఈ విధమైన దేవ తల ఆ దీనావస్థను చూచి వారితో నిట్లనెను -- భేదమును పొందకుడు. మీ పనిని నేను నా మాయచే రహస్యముగా సాధించగలను.

ఓ మహారాజా! రాక్షసుల మనస్సులో అమృతమును పొందాలనే పేరాస ఉండెను. నేను ముందు, నేను ముందు, నీవు కాదు, నీవు కాదు, అంటూ వారిలో పరస్పరము దాని కొరకై కలహము మొదలాయెను.

సత్రయాగముయొక్క ఫలము అందరికీ లభించును. అదే విధము గా, సమానమైన పరిశ్రమను చేసి అమృతోత్పాదనములో కారణమైన ఆ దేవతలకు కూడ ఈ అమృతములో వాటాను ఈయవలెను. ఇదియే సనాత నమైన ధర్మము.

ఓ మహారాజా! ఆ రాక్షసులలో బలశాలురు కలశమును పట్టుకొని పోగా, వారిలోనే బలహీనులకు ఈర్ష్య కలిగి పైన చెప్పిన విధముగా తమ వారికే పలుమార్లు అడ్డు తగిలిరి.

శ్రీహరి సకలోపాయములు తెలిసిన సర్వసమర్థుడు. ఈ కల హము మధ్యలో ఆయన వర్ణించ శక్యము కాని యువతి రూపమును దాల్చెను. సకలావయవములయందలి ఆమె సౌందర్యము పరమాశ్చర్య మును కలిగించెను. ఆమె కలువవలె శ్యామలవర్ణము కలిగి చూడ ముచ్చట గొలుపుచుండెను. ఆమె సమమైన చెవులయందు కర్ణాభరణము లను, తన పెద్దదైన కొప్పునందు విరిసిన మల్లెల మాలను, చక్కని మెడలో కంఠాభరణమును, చక్కని భుజములపై వంకీలను, నిర్మలమైన చీరచే కప్పబడిన ద్వీపములవంటి నితంబములపై బాగా శోభిల్లే వడ్డాణము ను, అందముగా నడిచే పాదములయందు అందేలను ధరించి యుండెను. చక్కని చెక్కిళ్లతో, ఎత్తైన ముక్కుతో ఆమె ముఖము అందముగా నుండె ను. వినూత్నమగు యౌవనముచే పూర్తిగా వర్తులమైన స్తనముల భార ముచే ఆమె నడుము చిక్కియుండెను. ఆమె ముఖముయొక్క పరిమళము నందు ప్రీతి గల తుమ్మెదలు ఝంకారమును చేయుచుండగా ఆమె కళ్లలో తొట్రుపాటు కనబడుచుండెను. ఆమె సిగ్గుతో చిరునవ్వుతో కనుబొమలను విలాసగా విరిచి చూపులను విసరగా, రాక్షస సేనానాయకుల హృదయము లలో కామన పలుమార్లు ప్రజ్వలితమాయెను.

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో సముద్ర మథన వృత్తాంతములో లక్ష్మీదేవి, ధన్వంతరి ఆవిర్భవించుటను వర్ణించే ఎనిమిదవ అధ్యాయము ముగిసినది .