శ్రీ మద్భాగవతము - అష్టమ (8వ) స్కందము
4 - గజేంద్రోపాఖ్యానము - గజేంద్రుని పూర్వజన్మ వృత్తాంతము
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- అప్పుడు బ్రహ్మగారు, రుద్రుడు మొదలుగా గల దేవతలు, మహర్షులు, గంధర్వులు శ్రీహరి యొక్క ఆ లీలను కొనియాడుచున్నవారై పూలవానను కురిపించిరి.
దేవదుందుభులు మ్రోగగా, గంధర్వులు గానము చేసి నాట్యమా డిరి. మహర్షులు, చారణులు, సిద్ధులు పురుషోత్తముడగు శ్రీహరిని స్తుతిం చిరి.
ఆ మొసలి వెంటనే గొప్ప ఆశ్చర్యమును కలిగించే రూపమును దాల్చెను. దేవుని శాపముచే మొసలి అయిన హూహూ అనే గంధర్వశ్రే షుడు శాపవిముక్తుడాయెను.
సర్వేశ్వరుడగు శ్రీహరి ఉత్తమమగు కీర్తి గలవాడు. వినాశము లేని శ్రీహరి కీర్తికి నిధానము. ఆయన గుణములు కీర్తించదగినవి; గాథలు మంచివి. ఆ గంధర్వుడు ఆయనకు తలను వంచి నమస్కరించి కీర్తించెను.
ఈశ్వరుని అనుగ్రహముచే ఆ గంధర్వుని పాపము తొలగిపోయే ను. ఆతడు ఆయనకు ప్రదక్షిణ నమస్కారమును చేసి, బ్రహ్మాదులు చూచుచుండగా తన లోకమునకు వెళ్లెను.
భగవానుని స్పర్శచే గజేంద్రుని అజ్ఞానము అనే బంధము తొలగి పోయెను. ఆతడు భగవానుని రూపమును పొంది నాలుగు భుజములు గల పీతాంబరుడాయెను.
ఆ గజేంద్రుడైతే పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడని ప్రసిద్ధి గాంచిన పాండ్యవంశపు రాజుగా ఉండెను. ఆయన ద్రవిడదేశములో శ్రేష్ఠుడుగ నుండెను. ఆయనకు విష్ణువతమునందు దృఢమగు నిష్ఠ ఉండెడిది.
మనోనిగ్రహము గల ఆ ఇంద్రద్యుమ్నుడు మౌనవ్రతమును స్వీక రించి యుండెను. తపోనిష్టగల ఆ రాజు జటాధారియై కులపర్వతము నందు ఆశ్రమమును కట్టుకొని నివసించుచుండెను. ఆయన ఒకనాడు స్నానమును చేసి ఆరాధన సమయమునందు సర్వేశ్వరుడైన శ్రీహరిని చక్కగా పూజించెను. శ్రీహరికి స్వరూపమునుండి చ్యుతి లేదు.
గొప్ప యశస్వియగు అగస్త్య మహర్షి శిష్యుల గణములు చుట్టు వారి రాగా, ఈశ్వరేచ్చ అనుకోకుండా అచటకు విచ్చే సెను. ఏకాంతము నందు మౌనముగా కూర్చున్న ఆ ఇంద్రద్యుమ్నుడు ఆయనకు అర్ఘ్యము మొదలగు ఉపచారములను చేయకపోగా, స్వాగతవచనములను కూడ పలుకలేదు. ఆయనను ఆ విధముగా చూచి ఆ మహర్షి కోపించెను.
ఆతనికి ఆ మహర్షి ఈ విధముగా శాపమునిచ్చెను -- ఈతడు దుష్టుడు, దుర్బుద్ధి. ఈతని బుద్ది శిక్షితమైనది కాదు. కావుననే, ఈతడీ నాడు మహర్షినగు నన్ను అవమానించినాడు. ఈతడు ఏనుగు వలే జడమైన బుద్ధి గలవాడు గనుక, ఏనుగు అయి అజ్ఞానము అనే దట్టని చీక టిని ప్రవేశించు గాక!
ఓ పరీక్షిన్మహారాజా! పూజనీయుడగు అగస్త్య మహర్షి ఈ విధ ముగా శపించి, తన అనుచరులతో గూడి వెళ్లాను. రాజర్షియగు ఇంద్రద్యు మ్నుడు ఆ శాపము దైవనిర్ణయమేనని నిశ్చయించుకొనెను.
జీవునకు తన స్వరూపముయొక్క స్మరణమును నశింపజేసే ఏను - గుజన్మను ఆయన పొందెను. ఏనుగై ఉన్న ఆయనకు శ్రీహరి స్తుతి గుర్తుకు వచ్చుట, పూర్వజన్మలో ఆయన చేసిన శ్రీహరి అర్చనయొక్క ప్రభావమే.
పద్మనాభుడీ విధముగా గజేంద్రుని మొసలినుండి విడిపించి, ఆయనకు తన అనుచరులలో స్థానమునొసంగెను. ఆయన కూడ వెంటరా గా, శ్రీహరి గరుత్మంతుని అధిష్ఠించి అద్భుతమగు తన భవనమునకు వెళ్లే ను. ఆయన లీలను గంధర్వులు, సిద్ధులు, దేవతలు కీర్తించుచుండిరి.
ఓ పరీక్షిన్మహారాజా! నీవు కురువంశములో శ్రేష్ఠుడవు. నేను నీకీ విధముగా గజేంద్రునకు విముక్తిని కలిగించిన శ్రీకృష్ణుని ప్రభావమును గురించి చెప్పితిని. దీనిని విన్నవారలకు కీర్తి, స్వర్గము లభించును. దీని వలన కలిదోషములు నివారణ యగును. ఇది చెడు స్వప్నములు రాకుండా నివారించును.
కల్యాణములను కోరే వైదికులు చెడు స్వప్నములు మొదలగు దోషములు తొలగిపోవుటకై, ఉదయమే నిద్ర లేచి పరిశుద్దులై దీనిని ఉన్నది ఉన్నట్లుగా కీర్తించెదరు (కీర్తించవలేను).
ఓ కురుశ్రేష్ఠా! సర్వసమర్థుడగు శ్రీహరియే సకలప్రాణుల రూప ములో నున్నాడు. ఆయన చాల సంతోషించి, సకలప్రాణులు వినుచుండ గా, గజేంద్రునితో నిట్లనెను.
శ్రీభగవానుడు ఇట్లు పలికెను --- ఎవరైతే తెల్లవారు జామున నిద్ర లేచి పరిశుద్దులై మిక్కిలి ఏకాగ్రమైన చిత్తముతో నన్ను మరియు నా రూపములను స్మరించెదరో, వారు నిశ్చయముగా సకలపాపములనుండి విముక్తిని పొందెదరు. నీవు (గజేంద్రుడు), ఈ సరస్సు, పర్వతము, గుహలు, అడవులు, వేము పొదలు, సన్న వెదురు పొదలు, వెదురు పొదలు, మందారము మొదలగు దివ్య వృక్షములు, ఈ శిఖరములు, బ్రహ్మలోక ము, శివలోకము, నా.. లోకము, పాల సముద్రము, నాకు మిక్కిలి ప్రియ మైన ప్రకాశవంతమైన నివాస స్థానమగు శ్వేతద్వీపము, శ్రీవత్సము (లక్ష్మి శ్రీహరి వక్షఃస్థలముపై మచ్చయై ఉండును), కౌస్తుభ మాణిక్యము, వైజయంతీ మాల, కౌమోదకీ గద, నా సుదర్శన చక్రము, పాంచజన్యమనే శంఖము, పక్షిరాజగు గరుత్మంతుడు, నా సూక్ష్మకళయైన ఆదిశేషుడు, నన్ను ఆశ్రయించి ఉండే లక్ష్మీదేవి, బ్రహ్మగారు, నారద మహర్షి, శివుడు, ప్రహ్లాదుడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఓంకారము, సత్యవాక్యము, మాయాశక్తి, గోవులు, వేదవేత్తలు, వినాశము లేని ధర్మము, ధర్మునకు చంద్రునకు కశ్యపునకు భార్యలైన దక్షుని పుత్రికలు, గంగ, సరస్వతి, అలక నంద, యమున, ఐరావతమనే దిగ్గజము, ధ్రువుడు, వసిష్ఠుడు మొదలగు ఏడురు బ్రహ్మర్షులు, పవిత్రమగు కీర్తి గల నలుడు మొదలగు మహాపురు షులు కూడ నా రూపములే. మత్స్య-కూర్మ-వరాహాది అవతారములలో నేను చేసిన లీలలను స్మరించు వారలకు అనంతమగు పుణ్యము లభించును.
ఓ గజేంద్రా! ఎవరైతే తెల్లవారు జామున లేచి నీవు చేసిన ఈ స్తోత్రముతో నన్ను స్తుతించెదరో, వారికి కూడ నేను మరణసమయము నందు స్వచ్ఛమగు (అజ్ఞానమును పోగొట్టే) బుద్ధిని అనుగ్రహించెదను.
ఇంద్రియాధిపతియగు శ్రీహరి ఈ విధముగా ఉపదేశించి, ఉత్తమ మగు శంఖమును పూరించి, దేవతల సముదాయమునకు హర్షమును కలిగి సూ, పక్షిరాజగు గరుడునిపై ఆసీనుడయ్యెను.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో గజేంద్రోపాఖ్యానములో గజేంద్రుని పూర్వజన్మ వృత్తాంతమును వర్ణించే నాల్గవ అధ్యాయము ముగిసినది (4) .
