శ్రీ మద్భాగవతము - అష్టమ (8వ) స్కందము
10 - సముద్ర మథనము - దేవాసుర సంగ్రామము
ఓ మహారాజా! దను దీతి వంశములకు చెందిన రాక్షసులు సావ ధానులై ప్రయత్నశీలురై పనిని చేసిననూ, వాసుదేవుని యెడల విముఖు లైన కారణముగా, అమృతమును పొందలేక పోయిరి.
ఓ మహారాజా! శ్రీహరి అమృతమును సాధించి తన భక్తులైన దేవ తలచే త్రాగించి, సకలప్రాణులు చూచుచుండగా గరుడుని అధిష్టించి నిషమించెను.
దితిపుత్రులగు ఆ రాక్షసులు తమ శత్రువులైన దేవతలయొక్క గొప్ప సంపత్తిని చూచి సహించ లేకపోయిరి. వారు ఆయుధములను సంసిద్ధము చేసుకొని దేవతలపైకి ఉరికిరి.
అప్పుడు అమృతమును త్రాగి, బలమును పొందియున్న సకల దేవగణములు నారాయణుని పాదములను ఆశ్రయించినవారై ఆయుధము లతో యుద్ధమునకు తలపడిరి.
అపుడు అచట సముద్రతీరమునందు దైవాసుర సంగ్రామమని ప్రసిద్ధి గాంచిన మిక్కిలి దారుణమగు యుద్ధము జరిగెను. రెండు సేనలు కలిసిపోయి చేసిన ఆ యుద్ధము శరీరమునకు గగుర్పాటును కలిగించెను.
అపుడా యుద్దమునందు కోపముతో నిండిన మనస్సులు గల ఆ రెండు ప్రతిపక్షులు ఒకరికి మరియొకరు ఎదురుగా నుండి బాణములు, కత్తులు మొదలగు వివిధములైన ఆయుధములతో కొట్టుకొనిరి.
శంఖములు, తూర్యములు, డోళ్లు, భేరీలు, డమరువులు మ్రోగు చుండెను. ఏనుగులు, గుర్రములు, కాలిబంట్లు ధ్వనులను చేయుచుండిరి. రథముల ధ్వని కూడ తోడై (ఆ యుద్ధములో) పెద్ద ధ్వని బయలు దేరెను.
అపుడా యుద్దమునందు రథికులు రథికులతో, కాలిబంట్లు కాలి బంట్లతో, గుర్రపు రౌతులు గుర్రపు రౌతులతో, ఏనుగులపై నున్నవారు ఏనుగులపై యుద్ధమును చేయువారితో కలిసి యుద్ధమును చేసిరి.
కొందరు యోధులు ఒంటెలను, కొందరు ఏనుగులను, మరికొం దరు గాడిదలను, కొందరు గౌరమృగములను, ఎలుగుబంట్లను, పులుల ను, సింహములను అధిష్టించి యుద్ధమును చేసిరి.
గ్రద్దలు, రాపులుగులు, కొంగలు, డేగలు, కోళ్లు, తిమింగలములు, మీగండ్ల మెకములు, దున్నలు, ఖడ్గమృగములు, ఎద్దులు, గురుపోతులు, అరుణమృగములు అనువాటిని వాహనములుగా చేసుకొని మరికొందరు
యుద్ధమును చేసిరి.
నక్కలు, ఎలుకలు, ముంగీసలు, కుందేళ్లు, మానవులు, మేకలు, నల్లయిర్రలు, హంసలు, వరాహములు అనే వాహనములనెక్కి భటులు
యుద్ధమును చేసిరి.
ఓ మహారాజా! ఇతరయోధులు మెట్ట పక్షులను, నీటి పక్షులను, రోతను కలిగించే రూపము గల ప్రాణులను వాహనములుగా చేసుకొని రెండు సేనలలో ముందు ముందుకు దూసుకు పోవుచుండిరి.
పాండువంశీయులకు ఆనందమును కలిగించే ఓ మహారాజా! రంగురంగుల జెండా వస్త్రములు, తెల్లని స్వచ్చమైన గొడుగులు, మిక్కిలి విలువైన వజ్రములు పొదిగిన కర్రలు గల విసనకర్రలు, నేమలి యీకల వింజామరలు, గాలికి ఎగురుచున్న పై వస్త్రములు తలపాగలు, ప్రకాశించే కవచములు ఆభరణములు, సూర్యకిరణములు పడి మెరిసిపోయే స్వచ్చమైన ఆయుధములు మరియు వీరుల మాలలు అనువాటితో ఆ దేవవీరుల మరియు రాక్షసవీరుల సేనలు, జలచరములతో నిండియున్న రెండు సము ద్రముల వలె ప్రకాశించెను.
విరోచనుని పుత్రుడగు బలి చక్రవర్తి రాక్షసుల సేనకు నాయకుడు. ఇతర సేనానాయకులు ఆయనను చుట్లువారి యుండిరి. ఆయన వింజామ రలతో మరియు శ్రేష్టమైన ఛత్రముతో కూడి ఉదయ పర్వతమునందలి చంద్రుడు వలె ప్రకాశించేను. ఆయన యుద్ధములో వైహాయసమని ప్రసిద్ధి గాంచిన యథేచ్ఛాసంచారియగు గొప్ప విమానమును అధిష్ఠించెను. మయునిచే నిర్మించబడిన ఆ విమానమునందు సమస్తమైన యుద్ధసామగ్రి గలదు. అనేకములగు అద్భుతవస్తువులతో నిండియున్న ఆ విమానమును మనస్సుతో ఊహించుట గాని, వాక్కుతో వర్ణించుట గాని శక్యము కాదు. అది ఒకప్పుడు కనబడి, మరియొకప్పుడు అదృశ్యమగును.
నముచి, శంబరుడు, బాణుడు, విప్రచిత్తి, అయోముఖుడు, ద్విమూర్డుడు, కాలనాభుడు, ప్ర హేతి, హేతి, ఇల్వలుడు, శకుని, భూతసం తాపుడు, వజ్రదంష్ణుడు, విరోచనుడు, హయగ్రీవుడు, శంకుశిరసుడు, కపి లుడు, మేఘదుందుభి, తారకుడు, చక్రదృక్కు, శుంభుడు, నిశుంభుడు, జంభుడు, ఉత్కలుడు, అరిష్ణుడు, అరిష్టనేమి, మయుడు, త్రిపురాధిపుడు అనే రాక్షస సేనానాయకులు, పౌలోములు కాలేయులు అనే ఇతర రాక్షస గణములు, నివాతకవచులు మొదలగు ,రాక్షసులు ఆ బలి చక్రవర్తికి అన్ని వైపులా తమ తమ వాహనములపై నిలిచి యుండిరి.
వారందరు అమృతము కొరకై ప్రయాసలో పాలు పంచుకున్నవారే గాని, అమృతములో వాటాను పొందినవారు. గారు. వారు ఇదివరలో పలు మార్లు దేవతలను యుద్ధమునకు ఆరంభమునందే జయించినవారే.
ఆ రాక్షసులు సింహనాదములను చేయుచూ, పెద్ద ధ్వనిని చేసే శంఖములను పూరించిరి. గర్వించియున్న శత్రువులను చూచి ఇంద్రుడు చాల కోపమును పొందెను. -
స్వర్గాధిపతియగు ఇంద్రుడు ఐరావతమనే దిగ్గజమును అధిష్ఠించే ను. ఆయన ప్రవహించే కొండకాలువలతో కూడియున్న ఉదయ పర్వత మునధిష్టించిన సూర్యుడు వలె ప్రకాశించెను (దిగ్గజము కపోలమునుండి స్రవించే మదధారలకు కొండ కాలువల పోలిక).
ఆ ఇంద్రునకు అన్ని వైపులా దేవతలు పలురకముల వాహనము లతో ధ్వజములతో ఆయుధములతో నిలిచియుండిరి. వాయువు, అగ్ని, వరుణుడు, కుబేరుడు మొదలైన లోకపాలకులు తమ తమ గణములతో బాటుగా ఆయన చుట్టూ నిలిచిరి.
ద్వంద్వయుద్దమునందు వీరులగు ఆ దేవతలు, రాక్షసులు ఒకరికి దురుగా మరియొకరు తారసపడి పరస్పరము నిందావాక్యములను పలు కుచుండిరి. వారు పేరు పేరునా ప్రత్యర్థులను యుద్ధమునకు కాసుకొమ్మని పిలుస్తూ ముందుకు దూసుకుపోవుచుండిరి. ఈ విధముగా వారు యుద్ధ మును చేసిరి.
ఓ మహారాజా! బలి చక్రవర్తి ఇంద్రునితో, వరుణుడు హేతితో, మిత్రుడు ప్రహేతితో యుద్దమును చేసిరి. కుమారస్వామి తారకునిపై ఆయుధములను ప్రయోగించెను.
యముడు కాలనాభునితో, విశ్వకర్మ మయునితో, శంబరుడు త్వష్టతో, విరోచనుడు సవితతో యుద్ధమును చేసెను.
నముచి అపరాజితునితో, అశ్వినీ దేవతలు వృషపర్వునితో, సూర్యదేవుడు బలిచక్రవర్తియొక్క పుత్రులు బాణుడు మొదలగువారు వందమందితో యుద్ధమును చేసిరి.
చంద్రుడు రాహువుతో, వాయుదేవుడు పులోమతో, వేగము గల భద్రకాళీ నిశుంభ-శుంభులతో యుద్ధమును చేసిరి.
దుర్మర్షుడు మన్మథునితో, ఉత్కలుడు బ్రాహ్మి మొదలగు మాతృ గణములతో, బృహస్పతి శుక్రాచార్యునితో, శనిదేవుడు వరుణునితో యుద్ధ మును చేసిరి.
మరుత్తులు నివాతకవచులతో, వసువులనే దేవతలు కాలేయుల తో, విశ్వేదేవతలు పౌలోములతో, రుద్రులు క్రోధవశులనే సర్పములతో యుద్ధమును చేసిరి.
రాక్షసులు, దేవనాయకులు యుద్దములో జయమును గోరి ఈ విధముగా ఇద్దరిద్దరు చొప్పున కలిసి పరస్పరము ఎదురేగి వాడి బాణము లు, కత్తులు, చిల్లకోలలతో బలముగా కొట్టుకొనిరి.
భుశుండులు, చక్రములు, గదలు, చురకత్తులు, అడ్డకత్తులు, కత్తు లు, శక్తులు, కొరవిలు, ఈటెలు, గండ్ర గొడ్డళ్లు, బల్లెములు, ఇనుప రోకళ్లు, ముళ్ల గదలు మరియు ఇనుప గుదియలతో వారు శత్రువుల తలలను నరుకుచుండిరి.
ఏనుగులు, గుర్రములు, కాలిబంట్లు, వాహనములపై యుద్ధ మును చేసే యోద్దలయొక్క చేతులు, తొడలు, మెడలు, కాళ్లు నరకబడిన వి. రథములు, పలువిధముల వాహనములు విరుగ గొట్టబడినవి. రథముల జెండాలు, యోద్ధల ధనుస్సులు, కవచములు, ఆభరణములు చెల్లాచెద రుగా పడియుండెను.
వారు కాళ్లతో తొక్కుటచే మరియు రథచక్రముల తిరుగుటచే యుద్దభూమి పొడి పొడి ఆయెను. ఆ యుద్దభూమినుండి అప్పుడు అతిశ యించిన ధూళి పైకి లేచి దిక్కులను, ఆకాశమును, సూర్యుని కూడ కప్పి వేసెను. కొంత సేపు తరువాత ఆ యుద్ధభూమి అంతటా రక్తపు ధారలతో తడియగా ఆ ధూళి అణిగిపోయెను.
ఆ యుద్దభూమి తెగి పడిన తలలు, గొప్ప భుజములు, ఏనుగు తొండములవంటి తొడలు, ఆభరణములు, మరియు ఆయుధములతో అంతటా పరచబడి ప్రకాశించెను. కొన్ని తలలకు కిరీటములు, మరికొన్నిటికి కుండలములు ఎగిరిపోయెను. కొన్ని తలలకు కోపముతో నిండిన కన్నులు గలవు. మరికొన్ని తలల పెదవులు పళ్లతో కరచియుండెను.
ఆ సమయములో యుద్ధభూమియందు మొండెములు కూడ దండములవంటి చేతులలో ఆయుధములను పట్టుకొని పైకి లేచి భటుల పైకి అంతటా పరుగులు తీయుచుండెను. అవీ తెగిపడిన తమ తలలయం దలి కన్నులతో చూచుచుండెను.
బలి చక్రవర్తి మహేంద్రునిపై పది బాణములను, ఐరావతముపై మూడింటిని, నల్గురు పాదరక్షకులపై నాలుగింటిని, మావటివానిపై ఒక బాణమును వేసి కొట్టెను.
శీఘ్రమగు పరాక్రమము గల ఆ ఇంద్రుడు చిరునవ్వుతో అంతే సంఖ్యలో బాణములను ప్రయోగించి మీదకు వచ్చుచున్న ఆ బాణములను దగ్గరకు రాకముందే తెగగొట్టెను.
ఆ ఇంద్రుని ఆ ఉత్తమమగు కర్మను చూచి బలి చక్రవర్తి సహించ లేక పోయేను. ఆయన మండుతూ పెద్ద తోకచుక్కవలె ప్రకాశించే ఒక శక్తి ఆయుధమును చేతిలోనికి తీసుకొనెను. ఇంద్రుడు దానిని ఆయన చేతిలో ఉండగానే ఛేదించెను.
తరువాత శూలమును, తరువాత ఈటెను, తరువాత చిల్లకోలను, తరువాత కత్తులను, ఈ విధముగా బలి ఏయే ఆయుధములను చేతిలోనికి తీసుకొనెనో వాటిని అన్నింటినీ సమర్థుడగు ఇంద్రుడు ఛేదించెను.
ఓ మహారాజా! తరువాత రాక్షసుడగు ఆ బలి అంతర్ధానమై రాక్షస మాయను సృష్టించెను. అప్పుడు దేవ సైన్యము పైన ఒక పర్వతము ఆవి ర్భవించెను.
ఆ పర్వతమునుండి కార్చిచ్చుచే తగులబెట్ట బడుచున్న చెట్లు, ఉలివలె వాడియైన కొనలు గల రాళ్లు పడి శత్రు (దేవతల) సైన్యమును పిండి చేసినవి.
పెద్ద పాములు, త్రాచులు, తేళ్లు బయల్వెడలినవి. సింహములు, పెద్ద పులులు, అడవి పందులు బయల్వెడలి గొప్ప ఏనుగులను సంహ రించ జొచ్చెను,
ఓ మహారాజా! శూలములను చేతబట్టి దిగంబరలై రాక్షసస్త్రీలు మరియు రాక్షసుల గణములు వందలాదిగా ఆవిర్భవించిరి. వారు నరు కుము, పగుల గొట్టుము అని పలుకుచుండిరి.
తరువాత ఆకాశమునందు పెద్ద మేఘముల గుంపులు వచ్చి గాలుల కారణముగా ఢీకొనుచూ గంభీరముగా కర్ణకఠోరముగా గర్జిస్తూ మండే నిప్పులను విడిచి పెట్టినవి.
రాక్షసుడగు బలి చాల పెద్ద అగ్నిని సృష్టించెను. అది ప్రళయకా లాగ్ని వలె చాల భయమును గొల్పెను. గాలి దానిని వ్యాపింప జేయగా, అది దేవ సైన్యమును తగులబెట్ట జొచ్చెను
తరువాత చెలియలి కట్టను దాటిన సముద్రము (సునామీ) అంతటా కానవచ్చెను. ప్రచండమైన గాలులు దానియందు తరంగముల ను, సుడిగుండములను లేవగొట్టుచుండగా, అది చాల భయమును గొల్పు చుండెను.
ఈ విధముగా మహామాయావులగు రాక్షసులు కంటికి కానరాని గమనము గలవారై మాయలను సృష్టించి భయమును గొల్పుచుండగా, దేవ సైనికులు విషాదమును పొందిరి.
ఓ మహారాజా! ఇంద్రుడు మొదలగువారికి ఆ మాయలను నివా రించే ఉపాయము తెలియలేదు. అప్పుడు వారు లోకములను పాలించే శ్రీహరి భగవానుని ధ్యానించగా, ఆయన అచట సాక్షాత్కరించెను.
అప్పుడు గరుత్మంతుని భుజములపై చిగుళ్లవంటి కొళ్లను ఉంచిన పీతాంబరుడగు శ్రీహరిని వారు చూచిరి. కొత్తగా వికసించిన పద్మ మువంటి కన్నులు గల ఆయన ఎనిమిది చేతులలో ఆయుధములను ధరించి యుండెను. ఆయన వక్షఃస్థలముపై శ్రీదేవిని, మెడలో కౌస్తుభ మాణిక్యమును, మిక్కిలి విలువైన కిరీటమును, కుండలములను ధరించి
యుండెను.
సర్వాధికుడగు ఆ శ్రీహరి ప్రవేశించగానే ఆయన మహిమచేతనే, రాక్షసులు మాయలను సృష్టించే కర్మలను చేసి సృష్టించిన మాయలు, తెలివి రాగానే కల దూరమైనట్లుగా, నశించేను. ఎందుకంటే, శ్రీహరియొక్క స్మరణము అన్ని ఆపదలనుండి విముక్తిని కలిగించును.
ఓ మహారాజా! యుద్దమునందు గరుడుని అధిష్టించి వచ్చిన శ్రీహరిని చూచి వెంటనే కాలనేమి శూలమును పైకెత్తి కొట్టెను. ఆతడు ఏనుగులకు శత్రువగు సింహమును అధిష్టించి యుండెను. ఆ శూలము గరుడుని తలపై పడబోవుచుండగా, ముల్లోకములకు అధీశ్వరుడగు శ్రీహరి దానిని అవలీలగా పట్టుకొని, దానితోనే కాలనేమిని, వాని వాహన మును కూడ సంహరించేను.
మహాబలశాలురగు మాలి, సుమాలి యుద్దమునందు శ్రీహరి యొక్క చక్రముచే నరుకబడిన తలలు గలవారై నేల గూలిరి. అపుడు మాల్యవంతుడు సింహనాదమును చేసి వాడియైన గదతో శ్రీహరిని, పక్షి రాజగు గరుత్మంతుని కొట్టెను. అంతలోనే, సర్వకారణుడగు శ్రీహరి శత్రు వైన ఆ మాల్యవంతుని తలను చక్రముతో నరికెను.
శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో సముద్ర మథన వృత్తాంతములో దేవాసుర సంగ్రామమును - వర్ణించే పదవ అధ్యాయము ముగిసినది.
