శ్రీ మద్భాగవతము - అష్టమ (8వ) స్కందము

Table of Contents

2 - గజేంద్రోపాఖ్యానము - గజేంద్రుని మొసలి పట్టుకొనుట

             శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! త్రికూటము అని వినుతికెక్కిన అందమైన పర్వతము గలదు. పదివేల యోజనముల ఎత్తు గల ఆ పర్వతమును పాల సముద్రము చుట్టువారి యుండును.

దాని చుట్టు కొలత కూడ అంతే ఉండెను. దానికి వెండి, ఇనుము, బంగారముల మూడు శిఖరములు ఉండెను. అవి సముద్రమును, దిక్కుల ను, ఆకాశమును ప్రకాశింప జేసెను.

ఆ పర్వతముయొక్క ఇతరములగు శిఖరములు రత్నములతో మరియు గైరికాది ధాతువులతో వేర్వేరు రంగులను కలిగియున్నవి. వాటిపై ఉండే వివిధములైన చెట్లు, తీగలు, పొదలు, కొండకాలువల నీటి గలగలలు దిక్కులనన్నింటినీ ప్రకాశింప జేయుచుండెను.

సముద్రతరంగములు ఆ పర్వతముయొక్క పాదభూములను అన్ని వైపులా ప్రక్షాళనము చేయుచుండును. పచ్చని మరకత మాణిక్య ములు పొదిగియున్న ఆ పర్వతముయొక్క రాళ్లు అచటి నేలను శ్యామల వర్ణము గలదిగా చేయుచున్నవి.

సిద్దులు, చారణులు, గంధర్వులు, విద్యాధరులు, గొప్ప నాగులు, కిన్నరులు, అప్సరసలు కూడ ఆ పర్వతగుహలను సేవించుచుందురు.

అచట సంగీతముయొక్క చక్కని ధ్వనులతో గుహలు ప్రతిధ్వనిం చగా, సింహములు తమకు ప్రతిపక్షులైన సింహములు గర్జించుచున్నవనే ఆశంకతో అటువైపు తిరిగి అసహనముగా గర్జించుచున్నవి. సింహముల ప్రతాపము లోకప్రసిద్ధమైనదే గదా!

ఆ పర్వతమునందలి లోయలు పలురకముల అడవి జంతువులతో రద్దీగా అందముగా నున్నవి. ఆ పర్వతమునందలి ఉద్యానములలో దేవ తలు సంచరించెదరు. అచటి రకరకముల చెట్లపై పక్షులు మధురముగా కూయుచుండును.

ఆ పర్వతమునందలి కొండ కాలువలలో మరియు సరస్సులలో స్వచ్చమగు నీరు గలదు. ఆ జలములలో దేవతాస్త్రీలు జలకాలాడుటచే ఆ జలములు, వాటి పైనుండి వీచే గాలులు పరిమళ భరితములై యుండు ను. అచటి సరస్సుల ఇసుక తిన్నెలు మణుల గుట్టల వలె ప్రకాశించును.

ఆ పర్వతపు లోయలో సర్వాత్మభావము గల వరుణ భగవానుని ఉద్యానము గలదు. ఋతుమత్ అని ప్రసిద్ధి గాంచిన ఆ ఉద్యానమునందు దేవతాస్త్రీలు విహరించుచుందురు. ఆ ఉద్యానము అంతటా అన్ని కాల ములలో దేవలోకమునకు చెందిన పుష్పములు, పళ్లు, చెట్లతో చాల శోభగా నుండును.

మందారములు, పారిజాతములు, కలిగొట్టు చెట్లు, అశోకవృక్షము లు, సంపెంగ చెట్లు, వివిధరకముల మామిళ్లు, రకరకముల ద్రాక్ష మొక్క లు, పనసలు, అంబాళపు చెట్లు, పోక చెట్లు, కొబ్బరి చెట్లు, ఖర్జూరపు చెట్లు, మాదీఫల వృక్షములు, ఇప్ప, మద్ది, తాటి, ఉలిమిరి, వేగిస, ఏరువు ద్ది, కుంకుడు, మేడి, జువ్వి, మర్రి, మానేరు, గంధము, వేము చెట్లు, రక్త కాంచన వృక్షములు, తెల్లతెగడ, దేవదారు, చెరుకు మొక్కలు, అరటి, నేరే డు, రేగు, తాండ్ర, వట్టివేరు, నేల ఉసిరి, మారేడు, వెలగ, నిమ్మ, జీడిమా మిడి మొదలగు చెట్లు ఆ పర్వతము పై గలవు.

             ఆ ఉద్యానములో మిక్కిలి విశాలమైన సరస్సు గలదు. దానిలో ప్రకాశించే బంగరు పద్మములు గలవు. అది తెల్ల కలువలు, నల్ల కలువలు, చెంగలువలు, తామర పువ్వుల శోభతో సంపన్నమై యుండెను. అది మధు రముగా కూసే పక్షులతో, మత్తెక్కిన తుమ్మెదలతో ప్రతిధ్వనించుచుండెను.

ఆ సరస్సు హంసలు, కారండవ పక్షులు, జక్కవ, బెగ్గురు పక్షులతో ఎడము లేకుండా నిండియుండెను. నీటి కోళ్లు, గ్రుడ్డి కొంగలు, భరత పక్షుల గుంపులతో ఆ సరస్సు ప్రతిధ్వనించుచుండెను.

చేపలు, తాబేళ్లు కదలుచుండగా పద్మములు కదిలి రాలిన పుప్పొడితో ఆ సరస్సులోని నీరు నిండియుండెను. కడిమి చెట్లు, నీటి ప్రబ్బలి చెట్లు, కిక్కన గడ్డి, మంకెన చెట్లు, తినాస చెట్లతో ఆ సరస్సు తీర ముల వెంబడి నిండి యుండెను.

ఆ సరస్సు తీరమునందు గన్నేరు, గోరంట, కంకేళి, దిరిసెన, అవి సె, గార, ఉత్తరేణి, ఎర్ర టెంకాయ, అడవి మొల్ల, పొన్న, సురపొన్న, ఉసి రి, గురివింద, అరటి మొదలగు ఇతరములగు చెట్లు, మల్లె తీగలు, తామర మొక్కలు పెరుగుతూ ఆ సరస్సుయొక్క శోభను మిక్కిలి ఇనుమడింప జేయుచుండెను. ఆ చెట్లు అన్ని ఋతువులలో పూలతో, పళ్లతో నిండి యుండెను.

ఆ అడవిలో ఒక గజేంద్రుడు నివసించుచుండెను. అది ఒకనాడు తన గుంపులోని ఆడు ఏనుగులతో గూడి సంచారము చేస్తూ, ముళ్ల చెట్ల ను, విశాలమైన సన్న వెదురు వేదురు వేము డొంకలను విరుగకొట్టుచుండె

ఆ ఏనుగు వాసన తగిలినంత మాత్రాన సింహములు, మిగిలిన పెద్ద ఏనుగులు, పెద్దపులులు ఖడ్గమృగములు మొదలగు క్రూరమృగము లు, పెద్ద సర్పములు, గౌరమృగములు, నల్ల యిర్రులు, మీగండ్ల మేకములు, సవరపు మెకములు కూడ భయముతో పరుగు తీయుచుండును.

ఆ ఏనుగు అనుగ్రహమును పొందిన తోడేళ్లు, అడవి పందులు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, ఏదుపందులు, కొండముచ్చులు, అడవి కుక్కలు, కోతులు, లేళ్లు, కుందేళ్లు మొదలగు అనేక చిన్న జంతువులు దానికీ దూరముగా సంచరించును.

ఆ ఏనుగు చుట్టూ మిగిలిన మగ మరియు ఆడ ఏనుగులు చుట్టు వారియుండెను. మదమును స్రవించే ఏనుగు గున్నలు దాని వెనుక పరుగె త్తుచుండెను. దాని బరువుచే పర్వతము చుట్టూ అధికముగా కంపించుచుం డెను. మదమును భక్షించే తుమ్మెదల గుంపులు దాని చుట్టూ తిరుగుచుం డెను. పద్మముల పుప్పొడిచే సుగంధితమైన వాయువు సరస్సు మీదనుండి వీచుచుండగా, అది ఆ గంధమును చాల దూరమునుండియే ఆఘ్రాణించేను. మదముచే దాని కన్నులు మూసుకొని పోవుచుండెను. అది వేడి వలన తాపమును పొందియుండెను. ఆ ఏనుగు దప్పికతో ఇబ్బంది పడుచున్న తన గుంపు తనను చుట్టువారి రాగా, అప్పుడు ఆ సరస్సు ఒడ్డును వేగ ముగా చేరుకొనెను.

ఆ సరస్సులోని స్వచ్చమైన నీరు బంగరు రంగు గల పద్మములు మరియు కలువల పుప్పొడితో సుగంధీతమై యుండెను. ఆ ఏనుగు దానిలో దిగి తనపై నీళ్లను చల్లుకుంటూ, అమృతమువంటి ఆ నీటిని కడుపు నిండా త్రాగి సేద దీరేను.

             గృహస్థునకు వలెనే ఆ ఏనుగునకు తన గున్నలపై ప్రేమ, ఆడు ఏనుగులపై ఆసక్తి అధికము. మిక్కిలి మదించియున్న ఆ ఏనుగు తన తొండముతో నీటిని పైకి తీసి, తుంపరలతో వాటికి చక్కగా స్నానము చేయిస్తూ వాటిచే చక్కగా ఆ నీటిని త్రాగిస్తూ, దేవుని మాయచే తనపై పడబోవుచున్న ఆపదను అది కనుగొనలేదు.

ఓ రాజా! ఆ సరస్సులోని బలశాలియగు ఒకానొక మొసలి దైవ ముచే ప్రేరితమే కోపముతో ఆ ఏనుగు కాలును పట్టుకొనెను. ఈ విధ ముగా ఆ ఏనుగు ఈశ్వరేచ్చచే అనుకోకుండా ఆపదలో పడెను. కానీ అది చాల బలము గలది. అది తన బలమునకు తగ్గట్లుగా పరాక్రమించి, విడిపిం చుకొనే ప్రయత్నమును చేసెను.

ఆ విధముగా బలశాలియగు మొసలి బలముగా లాగుచుండగా ఆ ఏనుగు స్వాధీనత తప్పియుండెను. ఆడు ఏనుగులు దీనమైన అంతఃకరణ ములతో ఆ గజేంద్రుని గురించి ఆక్రోశించుచుండెను. ఇతరగజములు . కూడ దానిని వెనుకనుండి పట్టుకొని లాగుటకు ప్రయత్నించినవి. అయిన నూ, అవి ఆ గజేంద్రుని సరస్సునుండి బయటకు దాటించలేక పోయినవి.

ఓ మహారాజా! ఈ విధముగా బలశాలురగు ఏనుగు, మొసలి పర స్పరము యుద్ధమును చేయుచుండిరి. ఏనుగు బయటనుండి, మొసలి లోపలినుండి లాగుచుండెను. ఈ విధముగా వేయి సంవత్సరములు గడిచి . పోయెను. దేవతలు కూడ ఆ యుద్దము అద్భుతమని తలపోసిరి.

తరువాత దీర్ఘకాలము గడుచునాటికీ, నీటిలోనికి గట్టిగా లాగివేయ బడుతూ ఖేదమును పొందియున్న గజేంద్రునకు మనోబలము, ఇంద్రియ పాటవము, శరీరబలము కూడ చాలవరకు క్షీణించి పోయెను. అదే సమయ ములో, నీటిలో నివసించే మొసలికి ఆ మూడు తల్లక్రిందులు. ఆయెను; అనగా, క్రమముగా అవి వర్ధిల్ల జొచ్చెను.

ఈ విధముగా దేహాభిమానియగు (బలము పోయి దేహమాత్రావశి ఛుడై యున్న) ఆ గజేంద్రుడు చాల కాలము తనను విడిపించుకొనలేక స్వాధీనత తప్పి ఈశ్వరేచ్ఛతే అనుకోకుండా ప్రాణసంకటమును పొందెను. అపుడాతడు ఆలోచించి, ఈ నిశ్చయమునకు వచ్చెను.

ఆపదలోనున్న నన్ను నాతో సమానులగు ఈ ఏనుగులు విడిపించ లేకపోయినవి. ఆడు ఏనుగులు ఎట్లు విడిపించ గల్గును? (లేవు). బ్రహ్మ గారి మృత్యుపాశము ఈ మొసలి రూపములో నన్ను చుట్టివేసినది. నేను పశువునే అయిననూ, ఆ పరమేశ్వరుని శరణు వేడెదను. ఈశ్వరుడే సర్వో తమమైన ఆశ్రయము.

బలశాలియగు మృత్యువు అనే సర్పము భయంకరమగు వేగ ముతో అంతటా పరుగెత్తుచున్నది. దాని వలన భయపడి శరణు పొందినవా నిని ఆ సర్వేశ్వరుడు, ఎవడో వాడు, రక్షించును. ఆయనకు భయపడియే మృత్యుదేవత నిరంతరముగా ప్రాణులయందు ప్రవర్తిల్లుచున్నది. ఆ దేవుని మేము శరణు వేడుచున్నాము.

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో గజేంద్రోపాఖ్యానములో గజేంద్రుని మొసలి పట్టుకొనుటను వర్ణించే రెండవ అధ్యాయము ముగిసినది (2) .