శ్రీ మద్భాగవతము - అష్టమ (8వ) స్కందము
18 - వామనావతారము - వామనుని ప్రాదుర్భావము
ఈ విధముగా మోక్షప్రదాతయగు శ్రీహరియొక్క లీలలను, పరా క్రమమును బ్రహ్మగారు స్తుతించేను. అపుడు పద్మము వలె నిడివి కన్నులు గల ఆ శ్రీహరి పీతాంబరుడై నాలుగు భుజములలో శంఖము, గద, పద్మ ము, చక్రములను ధరించి అదితియందు ఆవిర్భవించెను.
ఆ పురుషోత్తముడు స్వచ్ఛమైన శ్యామలవర్ణము కలిగియుండెను. పద్మమువంటి ఆయన ముఖముయొక్క శోభ మకరకుండలముల కాంతితో మరింత ఇనుమడించేను. ఆయన వక్షఃస్థలముపై శ్రీవత్సము ఉండెను. కంకణములు, భుజపురులు, కిరీటము, మొలనూలు, అందమైన ఆందెలు అనే ఆభరణములను ఆయన ధరించెను.
తుమ్మెదల గుంపుల ధ్వనితో ధ్వనించుచున్న అందమైన తన అడవి పువ్వుల మాలను, కౌస్తుభ మాణిక్యమును కంఠమునందు ధరించిన శ్రీహరి తన కాంతిచే కశ్యప ప్రజాపతియొక్క గృహమునందలి చీకటిని నశింప జేయుచుండెను.
ఆ సమయములో దిక్కులు, జలాశయములు ప్రసన్నముగా నుండెను. ప్రాణులు అధికమగు హర్షమును పొందినవి. ఋతువులు అన్నీ ఏకకాలములో తమ తమ గుణములను ప్రకటించినవి. స్వర్గము, అంతరిక్ష ము, భూమి, పర్వతములు (ఆయా అధిష్టాన దేవతలు), అగ్ని ద్వారా హవి స్సులను భుజించే దేవతలు, గోవులు, వేదవేత్తలు కూడ చక్కని ఆనంద మును పొందినారు.
భాద్రపద శుక్ల ద్వాదశినాడు చంద్రుడు శ్రవణములో నుండగా అభి జిత్ (మధ్యాహ్నము) ముహూర్తమునందు శ్రీహరి ప్రభుడు జన్మించేను. నక్షత్రములు, గ్రహములు మొదలగునవి ఆ భగవానుని పుట్టుక మంగళప్ర దమని సూచించినవి.
ఓ మహారాజా! ద్వాదశినాడు మధ్యాహ్నము సూర్యుడు నడినెత్తిని నిలిచియుండగా శ్రీహరి జన్మించెనని మహాత్ములు తెలియుదురు. ఆ దిన మునకు విజయ ద్వాదశి అనే పేరు ప్రసిద్ధి.
శంఖములు, దుందుభులు, మద్దెళ్లు, తప్పెట్లు, భేరీలు మ్రోగినవి. వివిధవాద్యములు మరియు తూర్యములయొక్క సంకులమైన ధ్వని కలిగె
అప్సరసలు ప్రీతితో నాట్యమాడగా, హాహా హూహూ మొదలైన గంధర్వశ్రేష్ఠులు పాడిరి. మహర్షులు, దేవతలు, మనువులు, పితృదేవతలు, అగ్నులు స్తుతించిరి.
దేవతల అనుచరులగు సిద్ధుల మరియు విద్యాధరుల గణములు, కింపురుషులు, కిన్నరులు, చారణులు, యక్షులు, రాక్షసులు, గరుడులు, శ్రేష్ఠులైన నాగులు పాడుతూ అధికముగా కొనియాడుతూ నాట్యము చేస్తూ, అదితియొక్క ఆశ్రమస్థానమును పుష్పములతో అంతటా వర్షించిరి.
పురుషోత్తముడు మూడు గుణముల ఘటనయగు తన మాయాశ క్తిచే దేహమును స్వీకరించేను. తన గర్భమునుండి పుట్టిన ఆయనను గాంచి అదితి ఆశ్చర్యమును, ఆనందమును పొందెను. కశ్యప ప్రజాపతి కూడ ఆశ్చర్యపడి, జయమగు గాక! అని పలికెను.
ఇంద్రియగోచరము కాని చైతన్యమే స్వరూపముగా గల శ్రీహరి ఆభరణములతో మరియు ఆయుధములతో ప్రకాశిస్తూ ఇంద్రియగోచర మయ్యే రూపముతో ఎదుట ప్రకటమయ్యెను. అద్భుతమగు నేర్పు గల , నటుడు వలె ఆయన అదే దేహముతో వారిద్దరు చూచుచుండగానే పొట్టి బాలకుడుగా మారిపోయెను.
వామనుడుగు ఆ బాలకుని చూచి మహర్షులు చాల ఆనందించిరి. వారు కశ్యప ప్రజాపతిని ముందడుకొని, ఆ బాలకునకు జాతకర్మ మొద లగు కర్మలను చేయించిరి..
ఆ వామనునకు ఉపనయనము జరిగెను. ఆ సమయములో సూర్యుడే స్వయముగా సవిత (సూర్యుడు, పరబ్రహ్మ), దేవతగా గల . గాయత్రీ మంత్రమునుపదేశించెను. బృహస్పతి యజ్ఞోపవీతమును, కశ్య
పుడు మొలత్రాడును ఇచ్చిరి.
వామనరూపధారియగు ఆ జగన్నాథునకు భూదేవి కృష్ణమృగ చర్మమును, ఓషధులకు ప్రభువగు చంద్రుడు కర్రను, తల్లియగు అదితి కౌపీనమును మరియు నడుమునకు కట్టే వస్త్రమును, స్వర్గాధిదేవత గోడుగును ఇచ్చిరి.
వినాశము లేని చైతన్యమే స్వరూపముగా గల శ్రీహరి వామనుడా యేను. ఆయనకు వేదనిధియగు బ్రహ్మగారు కమండలమును, సప్తర్షులు దర్భలను, సరస్వతి జపమాలను ఇచ్చిరి.
ఈ విధముగా ఉపనయనము చేయబడిన వామనునకు యక్ష ప్రభువగు కుబేరుడు భిక్షాపాత్రను ఈయగా, సాక్షాత్తుగా పతివ్రత మరియు జగన్మాతయగు ఉమా భగవతి భిక్షనిచ్చెను.
ఈ విధముగా సత్కరించబడిన శ్రేష్ఠుడైన ఆ వామనుడు బ్రహ్మవ ర్చస్సుతో, బ్రహ్మర్షుల సమూహముచే చక్కగా సేవించబడిన ఆ సభను అతిక్రమించి ప్రకాశించెను.
ఆ బ్రహ్మచారి అగ్నిని స్థాపించి, ప్రజ్వరిల్ల జేసి, చుట్టూ దర్భలతో - తుడిచి, దర్భలను పరచి, చక్కగా పూజించి, సమిధలతో హోమము చేసెను.
సంపదలతో సమృద్దుడైయున్న బలి భృగువంశీయుల సాహాయ్య ముతో అనేకములగు అశ్వమేధ యాగములను చేసేను. ఆయన మరల యాగమును చేయుచుండెను. సకలజగత్తుయొక్క సారము (సత్త) తో పూర్ఖుడైన ఆ వామనుడు ఆ విషయమును విని తన స్థానమునుండి ఆ బలి యొక్క స్థానమునకు వెళ్లాను. ఆయన నడచుచుండగా ప్రతి అడుగునందు ఆ భారమునకు భూమి బాగా క్రుంగిపోవుచుండెను.
నర్మదానదియొక్క ఉత్తరతీరములో భృగుకచ్ఛము అనే పేరు గల క్షేత్రమునందు భృగువంశీయులగు ఋత్విక్కులు బలిచే గొప్ప యజ్ఞము (అశ్వమేధము) ను చేయించుచుండిరి. వారు వామనుని, దగ్గరగా ఉద
యించిన సూర్యుడా యన్నట్లు, చూచిరి.
ఓ మహారాజా! ఆ ఋత్విక్కులు, యజ్ఞమును చేయుచున్న బలి మరియు సభాసదుల తేజస్సు వామనుని తేజస్సు ముందు వెలవెల బో యెను. ఈతడు యజ్ఞమును చూడగోరి వచ్చుచున్న సూర్యుడా యేమి? లేక అగ్నియా? లేక, సనత్కుమారుడా? అని వారు తలపోసిరి.
ఈ విధముగా భృగువంశీయులు, వారి శిష్యులు వామన భగవా నుని గురించి పలు పలు విధములుగా ఊహాగానములను చేయుచుండిరి.ఇంతలో ఆయన దండమును, గొడుగును, నీటితో కూడిన కమండలమును పట్టుకొని అశ్వమేధ యాగశాలను ప్రవేశించెను.
కపట బాలకుని రూపమును దాల్చిన శ్రీహరి ముంజగడ్డితో చేసిన మొలత్రాడును దాల్చేను. జటాధారియగు ఆ బ్రహ్మచారి చర్మమునే ఉత్తరీ యముగా ఉపవీత పద్దతి (యజ్ఞోపవీతము వలె) లో ధరించెను. యజ్ఞశా లలో ప్రవేశించిన ఆ వామనుని తేజస్సు ముందు భృగువంశీయులు వెల వెల బోయిరి. వారు ఆ వామనుని చూచి శిష్యులతో బాటు లేచి అగ్నులను పట్టుకొని ఆయనకు స్వాగతమును పలికిరి.
వామనుడు రూపమునకు తగ్గ అవయవములతో ఒప్పారే అంద గాడు. మనస్సునకు ఆహ్లాదమును కలిగించే వామనుని చూచి యజ్ఞమును చేయుచున్న బలి చాల ఆనందించి, ఆతనికి ఆసనమును సమర్పించెను.
సర్వసంగరహితుడగు వామనుడు మనస్సునకు ఆహ్లాదమును కలి గించుచుండెను. బలి ఆయనను స్వాగతము వచనముతో అభినందించి, తరువాత ఆయన పాదములు కడిగి పూజించేను.
వామనుని పాదములను కడిగిన నీరు జనుల పాపములను పోనా డునది. పరమకల్యాణకారియగు ఆ నీటిని ధర్మవేత్తయగు బలి తలపై చల్లు కొనెను. దేవదేవుడు, కైలాసవాసి, చంద్రవంక తలపై గలవాడు అగు శివుడు ఆ పాదముల నీటిని (గంగను) ఒకప్పుడు సర్వోత్తమమైన భక్తితో తలపై దాల్చెను. .
బలి ఇట్లు పలికెను --- ఓ బ్రహ్మచారీ! నీకు స్వాగతము. నీకు నమస్కారము. నీకు నేను ఏమి చేయవలెను? ఓ పూజనీయా! సాక్షాత్తుగా బ్రహ్మర్షులయొక్క తపస్సు నీ రూపమును దాల్చి వచ్చినదని నేను తలచే దను.
ఈనాడు నీవు మా ఇంటికి వచ్చుటచే మా పితృదేవతలు సంతృ పులైనారు; మా కులము పవిత్రమైనది; ఈనాడు ఈ యజ్ఞము నీ రాకచే సుసంపన్నమైనది.
ఓ బ్రాహ్మణ బాలకా! ఈనాడు నీ పాదములను కడిగిన నీరు నా పాపములను నశింప జేసినది. నేను నా అగ్నులలో యథావిధిగా చక్కగా చేసిన హోమము సఫలమైనది. అహా! నీ చిన్న చిన్న అడుగులతో ఈ భూమి కూడ పావనమైనది.
ఓ బ్రహ్మచారీ! నీవు దేనినో కోరదలచుకున్నావని నాకు తోచుచు న్నది. ఓ బ్రాహ్మణ బాలకా! నీకు ఏ వస్తువు పై కోరిక ఉంటే దానిని నానుండి స్వీకరించుము. పరమ పూజనీయా! గోవులను గాని, బంగార మును గాని, అన్ని సౌకర్యములు గల ఇంటిని గాని, రుచ్యమైన అన్నపాన ములను గాని, సంపన్నములైన గ్రామములను గాని, గుర్రములను గాని, ఏనుగులను గాని, నీవేది కోరితే దానిని నావద్దనుండి హాయిగా స్వీకరించు ము, నీవు కోరినచో నీకు ఒక బ్రాహ్మణ బాలికతో వివాహమునైననూ నేను ఏర్పాటు చేయగలను.
శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో వామనావతారవృత్తాంతములో వామన ప్రాదుర్భావమును వర్ణించే పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది .
