శ్రీ మద్భాగవతము - సప్తమ (7వ) స్కందము

Table of Contents

15 - సదాచార నిరూపణము

నారద మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! వేదవేత్తలలో కొందరు కర్మలయందు, కొందరు తపస్సునందు, మరికొందరు వేదమును వల్లించుటయందు, ఇంకొందరు బోధించుటయందు, ఎవరో కొందరు ఆత్మ జ్ఞానమునందు, ఇంకా కొందరు భగవద్ధ్యానమునందు నిష్ఠను కలిగియుం దురు.

శ్రాద్దమునందు, దేవపూజయందు అనంతమగు ఫలమును కోరే వ్యక్తి క్రమముగా కవ్య (పితృదేవతలకు సమర్పించేది)-హవ్య (ఈశ్వరు నకు అర్పించేది) ములను జ్ఞాననిష్ఠుని కొరకు సమర్పించవలెను. అట్టి వ్యక్తి లేని పక్షములో ఇతరుల కొరకు వారి అర్హతను బట్టి దానము చేయవ లేను.

ఎంతటి సంపన్నుడైననూ శ్రాద్దములో విశ్వేదేవ స్థానమునందు ఇద్దరిని, పితరుల స్థానమునందు ముగ్గురిని, లేదా రెండు స్థానములలో ఒక్కొక్కరిని భోక్తలను భుజింప జేయవలెను. అంతేగాని, భోక్తల సంఖ్యను ఇంతకు మించి పెంచరాదు.

శ్రాద్ధాదులయందు విస్తారము చేయుట వలన, తన బంధువులను జమ చేసి వారికి భోజనాదులను సమర్పించుట వలన, ఆ దేశకాలములకు ఉచితమైన శ్రద్ద లోపించును. ద్రవ్యములు, భోక్తల యోగ్యత, వారికి చేసే పూజాదికము ఇత్యాదులు కూడ చక్కగా ఉండవు.

 

యోగ్యమగు దేశమునందు యోగ్యమగు కాలములో అడవి బియ్యముతో వండిన అన్నమునైననూ శ్రీహరికి నివేదించి శ్రద్దతో యోగ్యు డగు వ్యక్తికి సమర్పించినచో, అది ఆ దాతయొక్క కామనలను ఈడేర్చు టయే గాక, అనంతఫలమగు మోక్షమునకు కూడ దారి తీయును.

సాధకుడు దేవతలకు, మహర్షులకు, పితృదేవతలకు, ఇతరప్రాణు లకు, తనకు, తనవారికి కూడ ఆహారమును చక్కగా పంచి ఇస్తూ, వారందరిని పరమేశ్వర స్వరూపులుగా భావన చేయవలెను.

ధర్మముయొక్క స్వరూపమునెరింగిన సాధకుడు శ్రాద్ధమునందు మాంసమును వడ్డించరాదు; తాను కూడ తినరాదు. మునులు తినే అడవి బియ్యపు ఆహారమును వడ్డించిననూ, పితృదేవతలకు ఎట్టి మహాప్రీతి కలు గునో, అట్టి ప్రీతి పశువులను హింసించి మాంసమును సమర్పించుట వలన కలుగదు.

ధర్మము పరమేశ్వరుని రూపమే. అట్టి ధర్మమును కోరే సాధకుల కు, మనోవాక్కాయముల ద్వారా ఇతరప్రాణులకు కలిగే హింసను పరిత్యా గము చేయుట సర్వోత్కృష్టమైన ధర్మము.

యజ్ఞముయొక్క స్వరూపమును తెలిసినవారిలో అగ్రేసరులగు కొందరు నిత్యానిత్యవస్తువివేకము గలవారై కామనలను పారద్రోలి, కర్మ రూపములోనుండే యజ్ఞములను జ్ఞానముచే ప్రజ్వలితము చేయబడిన మనోనిగ్రహము అనే అగ్నియందు హోమము చేయుదురు.(అనగా బాహ్యకర్మలనుండి విరమించేదరు).

ద్రవ్యములతో చేసే యజ్ఞమునకు పూనుకున్నవానిని చూచి ప్రాణులు ఈ విధముగా భయపడును -- ఈతడు దయలేనివాడు, ధర్మస్వ రూపము తెలియనివాడు, తన ఇంద్రియముల తృప్తియే లక్ష్యముగా గల వాడు. ఈతడు నిశ్చయముగా నన్ను చంపును.

కావున, ధర్మరహస్యమునెరింగిన సాధకుడు మునులు తినే హవి స్సుతోనైననూ సంతోషమును పొంది, ప్రతిదినము సంధ్యావందనాది నిత్య కర్మలను, దానము మొదలగు నైమిత్తిక కర్మలను చేయవలెను.(కామ్యక ర్మల కొరకై హింసను చేయరాదు).

విధర్మము, పరధర్మము, ఆభాస, ఉపము, ఛలము అనే అయిదు అధర్మము (ముళ్లచెట్టు) యొక్క శాఖలను ధర్మము తెలిసినవాడు అధర్మ మును వలే విడిచి పెట్టవలెను.

ఏ పనిని చేయుటచే తన ధర్మమునకు ముప్పు వాటిల్లునో, అది విధర్మము (వామాచారము మొదలైనవి). అన్యునిచే అన్యుని కొరకు' విధిం చబడినది పరధర్మము (క్రైస్తవము మొదలైనవి). వేదవిరుద్దమగు ఆచా రము (తనను తాను హింసించుకొనుట మొదలైనవి), డాంబీకము ఉపమ లు. శాస్త్రవచనమునకు తప్పుగా వ్యాఖ్యానించుట (భేదమే సత్యము ఇత్యాది బోధలు)  ఛలము (మోసము).

మానవులు నాలుగు ఆశ్రమధర్మములకంటె విరుద్దముగా తమ ఇచ్చవచ్చినట్లుగా కొన్ని ఆచారములను కల్పించుచుందురు. అట్టి కల్పన ధర్మముయొక్క ఆభాసమే గాని, ధర్మము కాదు. మానవుని స్వభావమును బట్టి విధించబడిన ఆశ్రమధర్మము ఎవనికి ప్రశాంతిని కలిగించ సమర్థము కాదు?(అనగా, అందరికి పరమశాంతిని చేగూర్చును).

సాధకుడు బీదవాడైననూ ధర్మమును చేయుటకు గాని, జీవనయా త్రకైననూ ధనమును యాచించరాదు. కామనలు లేనివానికి వాని నిష్కాము తయే (దానిచే సూచించబడిన దైవమే), కొండ చిలువకు వలే, బ్రదుకుదెరు వును కల్పించును (కొండ చిలువ తన వద్దకు నడచి వచ్చిన ప్రాణిని తిని బ్రదుకును).

కామనలు లేకుండా సంతుష్టితో తన స్వరూపమునందే విశ్రాంతి నీ, ఆనందమును పొందే వివేకికి లభించే ఆనందము -- భోగవస్తువుల యందలి లోభముతో, ధనమునందలి కామనతో దిక్కులలో పరుగులు తీసే వానికి ఎక్కడ లభించును?(లభించదు).

చెప్పులు ఉన్న పాదమునకు గులకరాళ్లు, ముళ్లు మొదలగువాటి వలన దుఃఖము కలుగదు. అదే విధముగా, అన్ని కాలములలో సంతృప్తిని చెంది ఉండే మనస్సునకు చుట్టూ దిక్కులు అన్నీ సుఖముతో నిండియుం డును.

ఓ రాజా! సంతృప్తి గలవాడు నీటిని త్రాగియైననూ సుఖముగా జీవించగలడు. అట్లు కాకుండుటకు హేతువు ఏమియు లేదు. మానవుడు ఇంద్రియభోగములయందు, జిహ్వయొక్క చాపల్యమునందు ఉండే లోభము వలన ఇంటి కుక్క వలె ప్రవర్తిల్లును.

సంతృప్తి లేని విప్రునకు వర్చస్సు, విద్య, తపస్సు మరియు కీర్తి క్షీణించిపోవును. ఆతని జ్ఞానము కూడ నిశ్చయముగా తొలగిపోవును.

ఆకలి దప్పికలు తీరగానే తినాలనే కోరిక, త్రాగాలనే కోరిక అంత మగును. కోపము కూడ దాని పని పూర్తియే ఫలము ఉదయించగానే అంత మగును. కాని, మానవుడు భూలోకములోని దిక్కులనన్నిటినీ జయించి భోగించిననూ, వాని లోభము అంతము కాదు.

ఓ మహారాజా! కొందరు పండితులు చాల తెలిసి సందేహ ములను పోగొడుతూ సభలకు అధ్యక్షులై యుండి కూడ సంతుష్టి లేని కారణముగా అధఃపతితులగుదురు. ఇట్టి వారి సంఖ్య చిన్నది కాదు.

భోగ్యములను సంకల్పించుట మానివేసినచో, కోరికలపై విజ యము లభించును. కోరికలను విడిచి పెట్టినచో, కోపముపై జయము కలు గును. ధనమును ప్రోగుచేసుకుంటూ పోతే మిగిలేది ఆపదయేనని గుర్తించి నచో, లోభము దూరమగును. వస్తుస్థితిని జాగ్రత్తగా పరిశీలించినచో, భయ హేతువు దూరమై భయము దూరమగును.

ఆత్మానాత్మవివేకముచే శోకమును వ్యామోహమును జయించవ లెను. మహాత్ములను సేవించినచో డాంబీకము తొలగిపోవును. నలుగురు కలిసి కబుర్లాడుచున్నచో, సాధనకు విఘ్నము కలుగును. ఇట్టి విఘ్నము లను మౌనముచే జయించవలెను. దేహమును, ఇంద్రియములను నిశ్చే ష్టగా ఉంచినచో, హింసపై విజయము లభించును. .

ఇతరప్రాణుల వలన దుఃఖము కలిగినచో, దుఃఖమును కలిగించిన ఆ ప్రాణుల పైననే దయను చూపినచో, ఆ దుఃఖమును జయించవచ్చును. ప్రారబ్దవశముగా వచ్చే దుఃఖమును ఆత్మనిష్ఠ (అంతర్ముఖత్వము) చే జయించవలెను. దేహములో వ్యాధులు మొదలగువాటి వలన కలిగే దుఃఖమును యోగాభ్యాస బలముచే దూరము చేసుకొనవలెను. సత్త్వగుణ మును పెంపొందించే ఆహారము మొదలగువాటిని సేవించినచో, అధికనిద్ర దూరమగును.

మానవుడు రజోగుణము (భోగపరాయణత్వము) ను, తమోగు ణము (సోమరితనము) ను సత్త్వగుణము (వైరాగ్యము, జ్ఞానమునందలి ప్రీతీ) చే జయించవలెను. సాధకుడు సత్త్వగుణమును కూడ ఉపశమము (శాంతమైన మనస్సు) చే జయించవలెను. ఈ దోషములనన్నింటినీ మాన వుడు గురువునందలి భక్తిచే తేలికగా నిశ్చయముగా జయించవచ్చును.

జ్ఞానమనే దీపమును అనుగ్రహించిన గురువు సాక్షాత్తుగా భగవా నుడే. అట్టి గురువునందు ఎవనికైతే, ఈయన మామూలు మనిషే అనే ధారణ ఉండునో, వానికి చేసిన శాస్త్రశ్రవణమంతా ఏనుగు చేసిన స్నానము వలె వ్యర్థము (ఏనుగు స్నానము చేసి బూడిదను చల్లుకొనును),

ఈ శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా ప్రకృతికీ, జీవులకు ప్రభుడగు భగవా నుడే. ఇది నిశ్చయము. యోగిపుంగవులు ఈయన పాదములను తమ హృదయములో ధ్యానించెదరు. కాని లోకము ఈయన సామాన్యమానవు డని తలపోయును. అదే విధముగా, గురువు కూడ భగవానుడే.

శాస్త్రములో బోధించబడిన నియమములన్నింటికీ పరమప్రయోజ నము కామక్రోధలోభమోహమదమాత్సర్యములనే ఆరు శత్రువుల వర్గమును (అయిదు జ్ఞానేంద్రియములను, మనస్సును) వశము చేసుకోను టయే. ఇట్లు వశము చేసుకున్న తరువాత కూడ ఆ నియమములు భగవా నుని ధారణను, ధ్యానమును, సమాధిని ఈయలేకపోయినచో, అవి కేవ లము నిష్పలమగు శ్రమను మిగిల్చేవి మాత్రమే.

మానవుడు వ్యవసాయము మొదలగువాటిని చేసి వాటి ఫలములు పొందుచుండును. ఈ కర్మలు, వాటి ఫలములు వ్యక్తికి సంసారము కొనసా గుటకు మాత్రమే పనికి వచ్చునే గానీ, మోక్షమును సంపాదించి పెట్టలేవు. అదే విధముగా, దుర్బుద్ధి గలవాడు చేసే పూర్తకర్మలు (ప్రజలకు ఉపయో గించే చెరువులను త్రవ్వించుట మొదలగు పనులు), ఇష్టకర్మలు (యజ్ఞ ములను చేయుట) కూడ సంసారమును కొససాగించునే గాని, మోక్షమునకు దారి తీయవు.

ఎవడైతే చిత్తమును జయించుటకు పూనుకొనునో, ఆతడు సంగ మును పరిగ్రహము (భోగవస్తువులను ప్రోగుచేయుట) ను విడిచి పెట్టవలె ను. పవిత్రమగు స్థానమునందు ఏకాంతముగా నుండవలెను. భిక్షుకుడై భిక్షాన్నమును కూడ మితముగా భుజించవలెను.

ఓయీ మహారాజా! సొధకుడు స్వచ్చమైన సమతలస్థానము నందు తన ఆసనమును చక్కగా వేసుకొని, దానిపై స్థిరముగా సమముగా సుఖముగా నిటారైన అవయవములు గలవాడై కూర్చుండి ఓంకారమును జపించవలెను.

మనస్సు కామనలను (సంకల్పములను) విడిచి పెట్టేటంతవరకు సాధకుడు తన ముక్కు కొనపై ధ్యాసను ఉంచి, పూరక కుంభక రేచకము లనే ప్రాణాయామమును చేయవలెను. గాలిని నిండా పీల్చుట పూరకము. పూర్తిగా విడిచి పెట్టుట రేచకము. గాలిని లోపల, బయట నిలిపి యుంచుట కుంభకము.

కామనలచే చేడగొట్టబడి పరిభ్రమిస్తూ ఉండే మనస్సు ఎక్కడెక్క డికి పరుగులెత్తునో, అక్కడక్కడనుండి దానిని మెల్లమెల్లగా వెనుకకు మరల్చి (అనగా ఇంద్రియవ్యాపారములను ఉపసంహరించి), హృదయము నందు స్థిరముగా నిలుపవలెను.

ఈ విధముగా నిరంతరముగా అభ్యాసము చేసే ప్రయత్నశీలి యగు అట్టి సాధకుని చిత్తము, ఇంధనము లేని నిప్పు వలె, తక్కువ కాల ములోనే ఉపశమమును పొందును.

ఎప్పుడైతే సాధకుని చిత్తము కామక్రోధాదుల సంక్షోభములో పడ కుండా సకలవృత్తులు ఉపశమించి యుండునో, అప్పుడు ఆ చిత్తము బ్రహ్మానందముయొక్క సంస్పర్శను పొంది, మరల ఎన్నటికీ బహిర్ము ఖము కాబోదు.

గృహాశ్రమము ధర్మార్థకామములకు మూలము. దానిని ఎవడైతే ముందుగా విడిచి సన్న్యసించునో, అట్టి భిక్షువు సిగ్గు విడిచి అవే ధర్మార్థకా మములను సేవించే పక్షములో, ఆతడు నిశ్చయముగా వమనమును భక్షిం చువాడు అగును.

కొందరు పరమదుష్టులు ముందుగా ఈ దేహము అనాత్మ, మర ణించే స్వభావము గలది, మాలిన్యము గాని క్రిములు గాని బూడిద గాని అయ్యేది అని చింతించి, తరువాత వారే మరల ఆ దేహమును ఆత్మరూప ముగా స్వీకరించి ప్రశంసించెదరు.

బ్రహ్మచర్యవ్రతమును విడిచిపెట్టిన బ్రహ్మచారి, నిత్యకర్మలను విడిచి పెట్టిన గృహస్థుడు, తపస్సును విడిచి పెట్టి ఇంద్రియభోగములను సేవించే వానప్రస్థుడు, ఇంద్రియభోగముల ఆకర్షణకు వశుడయ్యే సన్న్యా సి -- వీరు ఆయా ఆశ్రమస్థులలో అధములు. వీరు కేవలము ఆశ్ర మస్తులను అనుకరించువారు మాత్రమే (ఆశ్రమస్థుల పవిత్రత వీరిలో ఉండ

దు). వీరు ఈశ్వరుని మాయలో పడి వ్యామోహితులై యున్నారు. వీరియందు దయను మాత్రమే చూపవలెను. కాని, వీరిని ఉపేక్షించవలెను (అనగా, వీరితోడి సంగము తగదు).

వివేకజ్ఞానముచే శోధితమైన అంతఃకరణము గల వ్యక్తి తన స్వరూపము పరబ్రహ్మ (పూర్ణము) అని తెలుసుకొనును. అట్టి జ్ఞానియందు భోక్తృత్వము ఉండదు. ఆ జ్ఞాని మరల ఇంద్రియలోలుడై దేనిని కోరి ఏ భోక్తను తృప్తి పరచుటకై దేహమును పోషించును?

ఈశ్వరునిచే సృష్టించబడిన దేహము రథమనియు, ఇంద్రియ ములే గుర్రములనియు, ఇంద్రియములకు ప్రభువగు మన స్సే కళ్లామని యు, శబ్దస్పర్శరూపరసగంధములు ఇంద్రియములనే గుర్రములు నడిచే మార్గములనియు, బుద్ధియే సారథి అనియు, అంతఃకరణమే పెద్ద కట్టు త్రాడు అనియు మహాత్ములు చెప్పెదరు.

ప్రాణ (శ్వాసక్రియ)-అపాన (విసర్జనక్రియ)-వ్యాన (బలవత్కర్మకు మూలము)-ఉదాన (వమనము ఇత్యాది ఊర్ధ్వగతికి ఆధారము)-సమాన ము (ఆహారము జీర్ణమగుట, రక్తప్రసారములకు ఆధారము)లు, నాగ (త్రే నును కలిగించునది)-కూర్మ (కన్నులను తెరుచుటకు ఆధారము)-కృకల (ఆకలిని కలిగించునది)-దేవదత్త (ఆవులించుటకు ఆధారము)-ధనంజయ ము (దేహమునకు పుష్టినిచ్చునది) లు అనే పది ప్రాణవృత్తుల సముదా యమే దేహము అనే రథమునకు ఇరుసు; ధర్మాధర్మములే చక్రములు; దేహాదులయందు నేను-నాది అనే అభిమానము గల జీవుడే రథస్వామి; ఓంకారమే ఆ జీవుని ధనుస్సు; జీవుడే బాణము; పరబ్రహ్మయే లక్ష్యము అని మహాత్ములు చెప్పెదరు.

రాగము, ద్వేషము, లోభము, శోకము, మోహము, భయము, గర్వము, అభిమానము, అవమానము, ఇతరుల గుణములలో దోషమును చూచుట, మోసము, హింస, ఇతరుల అభివృద్ధి యెడల ఓర్వలేని దనము, దురాగ్రహము, మరుపు, ఆకలి, నిద్ర మొదలగునవి సాధకుని శత్రువులు. వీటిలో కొన్ని రజోగుణ తమోగుణ ప్రధానములు కాగా, అప్పుడప్పుడు కొన్ని (ఆసక్తిగా మారిన ప్రేమ మొదలైనవి) సత్త్వగుణప్రధానములుగా కూడ ఉండును.

సాధకుడు ఇంద్రియములనే పరికరములతో గూడియున్న ఈ మానవదేహము అనే రథము ఎంతవరకైతే తన వశములో నుండునో, అంతవరకు మహాత్ముల చరణములను సేవించి అచ్యుతుడే బలముగా గలవాడై, వివేకజ్ఞానమనే కత్తికి పదును పెట్టి దానితో అంతశ్శత్రువులను జయించవలెను. ఆతడు తన స్వరూపభూతమైన ఆనందమును పొంది సంతుష్టుడై కామనలు చల్లారిన చిత్తము గలవాడై ఈ దేహమును విడిచి పెట్ట (ఉపేక్షించ వలెను.

సాధకుడు ఆదమరచియున్న పక్షములో, దుష్టములైన ఇంద్రియ ములనే గుర్రములు మరియు బుద్ధి అనే సారథి కలిసి ఆ వ్యక్తిని (దేహాము. అనే రథమును) తప్పు దారిలో నడిపించి విషయభోగములనే దారిదోపిడీ గాండ్రివద్ద పారవేయును. అపుడా భోగములనే దారి దోపిడీగాండ్రు గుర్ర ములతో మరియు సూతునితో సహా ఈ రథయజమాని (వ్యక్తి) ని సంసార మనే నూతిలో పారద్రోయుదురు. అజ్ఞానము అనే చీకటితో నిండియున్న ఆ నూతియందు మరణభయము అధికముగా నుండును.

వేదవిహితమగు కర్మ రెండు రకములుగా నున్నది. కామవల పరి పూర్తీ కొరకై చేసేది ప్రవృత్తి రూపమగు కర్మ. దాని వలన వ్యక్తి సంసార ములో పరిభ్రమించుచుండును. కావనలను విడనాడి ఆత్మనిష్టుడై యుండుట నివృత్తి రూపమగు ధర్మము. దాని వలన సాధకుడు మోక్షము (అమరణ భావము) ను పొందును.

ప్రవృత్తి అనబడే కర్మ ఇష్టము, పూర్తము అని రెండు రకములు. అగ్నిహోత్రము (వైదికుడు ప్రతిదినము చేసే హోమము), దర్శ (అమావా స్యనాడు చేసే ఇష్టి), పూర్ణమాస (పూర్ణిమనాడు చేసే ఇష్టి), చాతుర్మాస్య ము, పశుయాగము, సోమయాగము (ఇవి విస్తారమైన యాగములు) మొద లగునవి ఇష్టము. ఈ కర్మలు హింసతో కూడినవి. వీటిలో ద్రవ్యబాహు ళ్యము అధికము. కామనచే ప్రేరితములైన ఈ కర్మలు అశాంతిని కలిగిం చును. దేవాలయము, విశ్రాంతిగృహము, బావి, చలివేంద్రము, అన్నస త్రము మొదలగువాటిని నిర్మించుట పూర్తకర్మ అనబడును.

ఓ మహారాజా! ప్రవృత్తి పరాయణుడగు వ్యక్తి మరణించి వైదికక ర్మలలో సమర్పించిన ఆహుతుల పరిణామమైన సూక్ష్మరూపమును పొంది పితృయానమార్గములో చంద్రలోకమును పొందును, ఆతడీ మార్గ ములో క్రమముగా ఒక్కొక్కటిగా పొందే స్థితులేవనగా -- హోమధూమము ( ఆ అభిమాని దేవత), రాత్రి, కృష్ణపక్షము (కొలాభిమాన దేవతలు), మరియు చంద్రలోకము. పుణ్యము క్షయమైన తరువాత ఆ జీవుని ఆ దేవ దేహము పూర్తిగా క్షీణించును (అమావాస్య. ఆ జీవుడు సూక్ష్మరూపముతో వర్షజలముల ద్వారా మొక్కలలో ప్రవేశించి, ధాన్యమునందు సూక్ష్మరూప ముగా నుండి పురుషునకు ఆహారమై వాని శరీరములో రేతస్సు రూప మును పొంది, స్త్రీ ద్వారా మరల ఈ లోకములో జన్మించును. గర్భాధా నముతో మొదలిడి అంత్యేష్టి వరకు ఉండే సంస్కారములచే సంస్కరించ బడే వైదికుడు ఈ మార్గములననుసరించును.

నివృత్తి పరాయణులగు సాధకులు యజ్ఞము మొదలగు క్రియలను జ్ఞానశక్తితో ప్రకాశించే ఇంద్రియములయందు, ఇంద్రియములను సంకల్ప ముల రూపములోనుండే మనస్సునందు, వికారములను పొందే మన స్సును వాక్కునందు, వాక్కును అక్షరముల మాతృకయందు, అక్షరమాతృ కను ఓమ్ (అ, ఉ, మకారములు) నందు, ఓంకారమును బిందువు (అను నాసిక ధ్వని) నందు, బిందువును నాదము (దీర్ఘమగు ప్రతిధ్వని) నందు, నాదమును సూత్రాత్మ (సర్వజగద్వ్యాపకమగు ప్రాణతత్త్వము) నందు, ఈ సూత్రాత్మను పరబ్రహ్మలో (భావనారూపముగా) విలీనము చేయవలెను.

నివృత్తిపరాయణుడగు సాధకుడు మరణించిన తరువాత క్రమ ముగా అగ్ని, సూర్యుడు, పగలు, సాయంకాలము, శుక్లపక్షము, పూర్ణిమ, ఉత్తరాయణము (కాలాభిమాని దేవతలు), హిరణ్యగర్బలోకములను పొంది అచట భోగములననుభవించును. ఆతడు క్రమముగా స్థూలోపాధియగు దేహమునకు అభిమానియగు విశ్వుని సూక్షోపాధియగు తైజసునియం దు, మరల తైజసుని కారణోపాధియగు ప్రాజ్ఞునియందు విలీనము చేసి, ఈ మూడు ఉపాధులకు అధిష్ఠానముగా ఉంటూనే వాటికి అతీతమైన శుద్ద ఆత్మను తన స్వరూపముగా తెలుసుకొని మోక్షమును పొందును.

దీనిని మహాత్ములు దేవయానము అని నిర్దేశించెదరు. కామనలు చల్లారిన అంతఃకరణముతో ఆత్మను ఉపాసించిన నివృత్తి పరాయణుడగు సాధకుడు క్రమముగా ఆయా దేవతలను పొంది హిరణ్యగర్భ (సత్య) లోక మునందు ఆత్మనిష్ఠుడై మోక్షమును పొందును (మరల సంసారములో జన్మించడు).

వేదముచే నిశ్చయముగా బోధించబడిన ఈ పితృయాన, దేవ యాన మార్గములను ఎవడైతే శాస్త్రమే కన్నుగా గలవాడై తెలుసుకొనునో, అట్టి వివేకి దేహముతో జీవించియున్ననూ వ్యామోహితుడు కాడు.

ఈ జ్ఞాని స్వయముగా -- దేహములకు ఆదిలో కారణమై అంత ములో దేహములు విలీనమయ్యే అవధియై బయట భోగ్యముగను, లోపల భోక్తగను ఉన్న అఖండసదనమగు -- ఆత్మయే. గొప్పది, తక్కువది, తెలు సుకునే బుద్ది, తెలియబడే విషయము, నామము, రూపము, చీకటి, వెలు తురు అనే సర్వము ఈ ఆత్మయే.

యుక్తిపూర్వకముగా విచారించినచో, ప్రతిబింబము యథార్థముగా ఉన్నది కాదని తెలియుచునే యుండును. కాని, అదీ యథార్థవస్తువా యన్నట్లు కనబడును. అదే విధముగా, ఇంద్రియగోచరమగు ఈ జగత్తు లోని భేదము యుక్తికీ, ప్రమాణమునకు మరియు అనుభవమునకు విరు ద్ధమే అయిననూ, అవివేకులు ఆ భేదమే యథార్థమని స్వీకరించెదరు.

ఈ లోకములో పృథివీ మొదలగు అయిదు భూతముల సమాహార మగు దేహము మొదలగు పదార్థములు నీడ వలె మిథ్యయే. అవి అయిదు భూతముల కలయిక గాని, వాటి వికారము గాని కావు. అవి పంచభూతము లకంటే భిన్నముగా గాని, వాటితో జతగూడి గాని లేవు. కావున, పంచభూత ముల కలయిక యగు దేహాదులు కేవలము మిథ్య మాత్రమే.

పంచమహాభూతములు జగత్తునకు మూలమునందలి ధాతువులు. కాని, అవి కూడ పంచతన్మాత్రల (సూక్ష్మభూతముల) కలయికలే అగుట వలన, అవయవములు లేకుండా అవయవియొక్క ఉనికి సిద్ధించదు. అంతి మముగా అవయవి లేకున్నచో, అవయవముల ఉనికి సిద్ధించదు.

ఉన్నది ఒక్కటి మాత్రమే. అయిననూ, అజ్ఞానముచే వస్తువు (ఉ న్నది) నందు భేదము గోచరించుచుండగా, మనముందు కనబడే ఈ పదా ర్థములన్నీ సర్వకాలములలో ఏకరూపముగా ఉన్నవి అనే భ్రాంతి కలుగు చునే యుండును. స్వప్నములో కూడ జాగ్రత్తు-నిద్ర అనే అవస్థల అనుభ వము కలుగుచుండును. స్వప్నకాలములో అవి సత్యములే అనే భ్రమ కొన సాగును. అదే విధముగా ఈ జగత్తు, దానియందలి వ్యక్తియొక్క జీవిత ము, ఆ జీవితమును నిర్దేశించే విధిని షేధములు అనే ఈ సర్వము అజ్ఞాన కాలములో వాస్తవములే యన్నట్లు అనుభవమునకు వచ్చుచుండును.

ఆత్మయొక్క మూడు అద్వైతములను, అనగా భావాద్వైత-క్రీ యాద్వైత-ద్రవ్యాద్వైతములను మననము చేయు సాధకుడు ఆత్మనిష్ఠ యొక్క అనుభవముచే జాగ్రత్తు-స్వప్నము-నిద్ర (లేదా, జ్ఞాత-జ్ఞానము-జేయము అనే మూడు స్వప్నములను తొలగించుకోనును. అనగా, ఈ అవ స్థలకు అతీతమైన ఆత్మతత్త్వమునందు నిష్ఠను కలిగి యుండును.

మనకు కనబడే భేదము యథార్థము కాదు. వస్త్రము, నూలు వంటి కార్యకారణభేదము కనబడేదే గాని యథార్థము కాదు. కార్యకారణ ముల కనబడే భేదము రెండవది లేని తత్త్వమునందు విలీనమగును. ఈ దర్శనము భావోద్వైతము (పదార్థముల ఐక్యము) అనబడును.

కుంతీపుత్రుడవగు ఓ ధర్మరాజా! మనము మనోవాక్కాయము లతో చేసే కర్మలనన్నింటినీ సాక్షాత్తుగా పరబ్రహ్మయందు సమర్పించు టయే క్రియాద్వైతము (క్రియకు సంబంధించిన అద్వైతము) అనబడును.

సాధకుని దృష్టిలో తాను, తన భార్య, తన సంతానము, తన బంధువులు మొదలగువారికీ, ఇతరులైన సకలప్రాణులకు అర్థకామముల (సంపదను సంపాదించి ఇంద్రియసుఖములననుభవించుట) విషయములో (నాది పరాయి అనే తేడా లేదు అనే దృష్టి యేది గలదో, అది ద్రవ్యాద్వై తము (పదార్థములకు సంబంధించిన ఏకత్వము) అనబడును.

ఓ ధర్మరాజా! ఏ ఉపాయముచే ఎక్కడనుండి పొందబడిన ఏ వస్తువు ఏ వ్యక్తికి ఏ దేశకాలములయందు నిషిద్దము కాదో, ఆ వ్యక్తి ఆ వస్తువుతోనే తన పనులను నిర్వహించుకొనవలెను.' ఆపదల సందర్భ ములలో తప్పించి, ఆ వ్యక్తి ఇతర నిషిద్ధపదార్థముల జోలికి పోరాదు.

ఓ ధర్మరాజా! ఆ భగవానుని భక్తితో ఆరాధించే మానవుడు ఇట్టి కర్మలను, వేదముచే తనకు విహితములైన ఇతరకర్మలను చేస్తూ గృహస్థా శ్రమమునందే ఉన్ననూ, ఆ ఈశ్వరుని స్వరూపము (మోక్షము) ను పొందును.

ఓ మహారాజా! రాజులు, దేవతలు కూడ విడిపించుకొన శక్యము కాని ఆపదల సమూహములనుండి మీరు మీ ప్రభుడగు శ్రీకృష్ణుని కారణ ముగా గట్టెక్కితిరి. నీవు ఆయన పాదపద్మములను సేవించి ఆ శక్తితో దిగ్గజ ములను (భూమండలమును) జయించి అనేక క్రతువులను అనుష్ఠించితివి.

గడచిన మహాకల్పమునందు పూర్వజన్మలో నేను ఉపబర్హణుడనే పేరు గల ఒకానొక గంధర్వుడను. అప్పుడు నేను గంధర్వులలో గొప్పవా డిగా ఉండెడివాడను.

అప్పుడు నేను రూపము, సౌకుమార్యము, మధురభాషణము, పరిమళభరితుడై యుండుట అనే లక్షణములచే ప్రీతికరమైన దర్శనము. గలవాడనగుటచే, స్త్రీలకు మిక్కిలి ప్రియుడుగా ఉండెడివాడను. నేను అన్ని కాలములయందు అధికమగు భోగాసక్తి గలవాడనై గర్వించి యుండే డివాడను.

ఒకనాడు ప్రజాపతులు దేవతల సత్రయాగమునందు శ్రీహరి గాథ లను పాడుట కొరకై గంధర్వులు, అప్సరసల గణములను ఆహ్వానించిరి.

ఆ ఆహ్వానము సంగతి తెలిసిన నేను స్త్రీలు చుట్టువారియుండగా విలాసగీతములను పాడుతూ అచటకు వెళ్లితిని. నేను చేసిన ఆ అవ హేళన మును చూసిన ప్రజాపతులు కోపవేగముతో నన్ను ఈ విధముగా శపించిరి -- అపరాధమును చేసిన నీవు వెంటనే సంపదలనన్నింటినీ పోగొట్టుకోని శూద్రుడవు కమ్ము

వెంటనే నేను దాసికి పుత్రుడనై జన్మించితిని. ఆ జన్మలో కూడ బ్రహ్మవేత్తలను సేవించితిని. ఆ సేవయొక్క ప్రభావముచే మరుజన్మలో బ్రహ్మగారి పుత్రుడనై జన్మించితిని. .

నేను నీకు గృహస్థుల ధర్మమును వర్ణించితిని. ఈ ధర్మము పాప ములను నశింపజేయును. దీనిని పాటించే గృహస్థులు సన్న్యాసులు పొందే గతి (మోక్షము) ని సునాయాసముగా పొందేదరు.

ఆహా! మానవలోకములో మీరు గొప్ప భాగ్యవంతులు, రహస్య మగు పరబ్రహ్మ మనుష్యరూపముతో మీ ఇంటియందు నివసించియున్నది. కావుననే, లోకమును పావనము చేసే మహర్షులు మీ ఇంటిని వెతు క్కుంటూ వస్తూ ఉంటారు.

మహాత్ములు బ్రహ్మానందముయొక్క అనుభూతిని అన్వేషించు చుందురు. రెండవది లేని ఆ ఆనందములో ఉపద్రవములు సుతరాము లేవు. అట్టి ఆ పరబ్రహ్మయే మీకు ప్రీతిని, హితమును కలిగించే శ్రీకృష్ణు డు. ఇది నిశ్చయము. ఆయన మీకు మేనమామ కొడుకు మాత్రమే గాక, మీ ప్రాణము, గురువు కూడ ఆయనయే. మీచే పూజించబడే ఆయన మీ ఆదేశమును కూడ పాటించును.

ఆ ఈ భక్తపాలకుడగు శ్రీకృష్ణుని స్వరూపమును సాక్షాత్తుగా రుద్రుడు, పద్మసంభవుడగు బ్రహ్మగారు మొదలైన వారు కూడ తమ బుద్దితో ఇదమిత్తముగా వర్ణించలేకపోయిరి. ఆయనను మౌనపూర్వకమగు భక్తితో మరియు సకలకామపరిత్యాగముతో ఆరాధించవలెను. ఆయన మన పై ప్రసన్నుడగు గాక!

శ్రీశుకమహర్షి ఇట్లు చెప్పెను --- దేవర్షియగు నారదుడు చెప్పిన ఈ మాటలను విని, భరతవంశ శ్రేష్ఠుడగు ధర్మరాజు చాల సంతోషించి ప్రేమపారవశ్యముతో నారదుని, శ్రీకృష్ణుని కూడ పూజించెను.

నారదుడు పూజలనందుకొని శ్రీకృష్ణుని వద్ద మరియు ధర్మరాజు వద్ద సెలవు తీసుకొని వెళ్లాను. శ్రీకృష్ణుడే పరబ్రహ్మ అని విని ధర్మరాజు గొప్ప అచ్చెరువును పొందెను.

ఓ పరీక్షిన్మహారాజా! నేను నీకు దక్షుని పుత్రికల వంశములను వేర్వేరుగా వర్ణించి చెప్పితిని. దేవతలు, అసురులు, మానవులు మొదలైన కదిలే మరియు కదలని ప్రాణులు ఈ వంశములలో జన్మించినవే.

శ్రీమద్బాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో

 సదాచారమును నిరూపించే పదునైదవ అధ్యాయము ముగిసినది (15).

సప్తమ స్కంధము ముగిసినది.