శ్రీ మద్భాగవతము - సప్తమ (7వ) స్కందము

Table of Contents

7 - ప్రహ్లాద చరితము - ప్రహ్లాదుని జన్మవృత్తాంతము

నారద మహర్షి ఇట్లు పలికెను --- ప్రహ్లాదుడు రాక్షసుల వంశ ములో జన్మించిననూ, గొప్ప భగవద్భక్తుడు. ఆ రాక్షసపుత్రులే విధముగా ప్రశ్నించగా ఆయన నా ఉపదేశమును స్మరిస్తూ, చిరునవ్వుతో వారిని ఉద్దే శించి ఇట్లు పలికెను.

ప్రహ్లాదుడిట్లు పలికెను --- మా తండ్రి తపస్సు కొరకై మందర పర్వతమునకు వెళ్లినప్పుడు, దేవతలు రాక్షసులకు వ్యతిరేకముగా యుద్ధ ము కొరకై పెద్ద ఉద్యమమును చేసిరి.

ఇంద్రుడు మొదలగువారు ఇట్లు పలికిరి -- హిరణ్యకశిపుడు జను లను హింస పెట్టేను. చీమలు పామును భక్షించినట్లుగా, దైవవశముచే ఆ పాపీని వాని పాపమే భక్షించినది.

వారి మహాబలపూర్వకమగు యుద్ధప్రయత్నమును చూచిన రాక్షస సేనానాయకులు అందరు భయపడిరి. దేవతలు వారిని సంహరించ మొద లీడిరి. భార్య, పిల్లలు, మిత్రులు, ఆప్తులు, ఇళ్లు, పశువులు, భోగసాధన ములు అనువాటిని పట్టించుకోకుండా, వారు కేవలము ప్రాణములను మాత్రమే రక్షించుకొనగోరి, వేగముగా అన్ని దిక్కులకు పరుగులెత్తిరి.

విజయమును కోరే దేవతలు రాజనివాసమును తగులబెట్టిరి. ఇంద్రుడైతే మా తల్లియగు మహారాణిని చెరబట్టెను.

భయముతో కలవరపాటు చెందియున్న ఆ మహారాణిని ఇంద్రుడు తీసుకొని పోవుచుండగా, ఆమె కురరి (లకుముకి పిట్ట) వలె రోదించుచుం డెను. ఆ సమయములో దేవర్షియగు నారదుడు అనుకో కుండా ఈశ్వరే చ్ఛచే అచటకు వచ్చి, దారిలో ఆమెను చూచెను.

నారదుడు దేవనాయకుడగు ఇంద్రునితో ఇట్లు పలికెను -- ఓ మహానుభావా! పతివ్రతయగు ఈమె నిర్దోషి. పరభార్యయగు ఈమెను నీవు తీసుకొనిపోవుట తగదు. ఈమెను విడిచి పెట్టుము, విడిచి పెట్టుము.

ఇంద్రుడిట్లు పలికెను --- ఈమె గర్భములో దేవవిద్వేషియగు హిరణ్యకశిపుని వీర్యము ఉన్నది. భవిష్యత్తులో ఆ శిశువు పెరిగి పెద్దయైన చో, వాని ప్రతాపమును దేవతలు సహించలేరు. కావున, ప్రసవము అయ్యే వరకు ఈమె నా వద్దనే ఉండుగాక! నా ప్రయోజనము (శత్రు శేషము ఉండ కుండా చేయుట) సిద్ధించిన తరువాత, ఈమెను నేను విడిచి పెట్టెదను.

నారదుడిట్లు పలికెను --- ఈ శిశువులో దోషము ఉండదు. ఈతడు సాక్షాత్తుగా గొప్ప భగవద్భక్తుడు, గొప్పవాడు, శ్రీహరి సేవకుడు కాగలడు. అట్టి ఈ బలశాలి కాబోయే పిల్లవానిని నీవు చంపలేవు.

దేవర్షియగు నారదుడు ఇట్లు చెప్పగా, ఇంద్రుడు ఆయన మాటను మన్నించి, మా తల్లిని విడిచి పెట్టెను. అనంతునకు ప్రియుడనైన నేను గర్భ మునందుండుటచే, ఇంద్రుడు మా తల్లికి ప్రదక్షిణము చేసి, స్వర్గమునకు వెళ్లాను.

తరువాత నారద మహర్షి మా తల్లిగారిని తన ఆశ్రమమునకు తీసుకు వచ్చి ఆమెను ఓదార్చి ఇట్లు పలికెను - అమ్మాయీ! నీ భర్త వచ్చేవరకు నీవు ఇచట నివసించుము.

ఆమే సరే అని పలికి, రాక్షసరాజగు హిరణ్యకశిపుడు కఠినమైన తపస్సును మాని తిరిగి వచ్చేవరకు, దేవర్షి నారదుని వద్ద నివసించేను. ఆమెకు అచట దేనినుండియైననూ భయము లేదు.

పతివ్రత, గర్బిణి అగు మా తల్లి అచట ఉంటూ, తన గర్భములోని శిశువుయొక్క క్షేమము కొరకు మరియు తాను కోరినప్పుడు ప్రసవము అగుట కొరకు, నారద మహర్షిని గొప్ప భక్తితో సేవించెను.

నారద మహర్షి దయాళువు, సమర్థుడు. ఆయన తన మనస్సులో నన్ను కూడ పెట్టుకొని, ఆమెకు నిర్మలమైన ధర్మస్వరూపము మరియు జ్ఞానము అనే రెండింటినీ అనుగ్రహించెను.

చాల కాలము అగుట వలన, స్త్రీకి ఉండే ఇబ్బందుల వలన, ఆ ఉపదేశమును మా తల్లి మరచెను. కాని, నేను నారదుని అనుగ్రహమును పొందినవాడనగుటచే, ఆ స్మృతి ఇప్పటికీ కూడా నన్ను విడిచి పెట్టలేదు.

నా మాటపై మీకు శ్రద్ధ ఉన్నచో, మీకు కూడ ఆ జ్ఞానము కలుగు గాక! శ్రద్ధ వలన దేహాభిమానమును పోగొట్టే వివేకబుద్ధి నాకు కలిగినట్లు గానే స్త్రీలకు, పిల్లలకు కూడ కలుగును.

ఈశ్వరుని రూపమే అయిన కాలముయొక్క ప్రభావముచే దేహ మునందు పళ్లయందు వలె పుట్టుక, ఉండుట, పెరుగుట, పరిణతి జెందు ట, క్షీణించుట, నశించుట అనే ఆరు వికారములు మనకు అనుభవములో నున్న విషయములే. పండు వికారములు చెట్టుకు లేనట్లే, దేహముయొక్క వికారములు ఆత్మకు సంక్రమించవు.

కాలమునకు అతీతమైన ఆత్మయందు క్షీణించుట అనేది ఉండదు. ఆత్మకంటే భిన్నముగా రెండవది లేనందు వలన, ఆత్మయందు రాగద్వేష సులకు తావు లేదు. దేహేంద్రియమనస్సంఘాతము అనే క్షేత్రము విష యములో ఆత్మ నిత్యసాక్షియై ఉండును. సర్వజగత్తునకు ఆధారమైన ఆత్మయందు వికారములేవియు ఉండవు. స్వయంప్రకాశమగు ఆత్మయే సర్వజగత్కారణము. ఆత్మ సర్వవ్యాపకమే అయిననూ, దానికి దేనితోనై ననూ సంగము లేదు. ఆత్మ ఆవరణములు లేని పూర్ణతత్త్వము.

వివేకి ఆత్మయొక్క స్వరూపమును సూచించే ఈ పన్నెండు శ్రేష్ఠ లక్షణములను అనుసంధానము చేయవలెను. దేహము ఇంద్రియముల యందలి వ్యామోహము వలన మనకు వాటియందు నేను, నాది అనే మిథ్యాభిమానము ఉండును. దానిని వివేకి పరిత్యజించవలెను.

బంగారమును తయారుచేసే వ్యక్తి బంగారము దొరికే గనుల యందలి రాళ్లలోని బంగారమును అనేకములైన ఉపాయములతో వెలికితీయును. ఆ ఉపాయములన్నియు ఆతనికి ఎరుకయే. అదే విధముగా, ఆత్మానాత్మవివేకము గల సాధకుడు ఆత్మజ్ఞానమునకు సహకరించే ధ్యానము మొదలైన ఉపాయములననుష్ఠించి, చైతన్య క్షేత్రములనదగిన దేహములయందే బ్రహ్మను ఆత్మరూపముగా సాక్షాత్కరించుకొనవలెను.

సాంఖ్యాచార్యుల పరిగణనమిట్లున్నది -- ప్రకృతులు (జగత్తునకు మూలమునందున్న తత్త్వములు) మూలప్రకృతి, మహత్తత్త్వము, అహంకా రము, పృథివి నీరు అగ్ని వాయువు ఆకాశము అనే అయిదు సూక్ష్మభూత ములు వెరసి ఎనిమిది. మూలప్రకృతి సత్త్వరజస్తమస్సులు అనే మూడు గుణములు గలది. అయిదు కర్మేంద్రియములు, అయిదు జ్ఞానేంద్రియములు, అంతఃకరణము, అయిదు స్థూలభూతములు వెరసి పదహారు వికార ములు (మూలతత్త్వములనుండి ప్రకటమైన కార్యములు). దృశ్యమగు ఈ సర్వమునందు వ్యాపించియున్న చైతన్యస్వరూపుడగు పురుషుడు ఒక్కడే.

ప్రకృతి-వికృతుల సమాహారమైన ఈ దేహము కదిలేది, కదలనిది అని రెండు విధములుగా నున్నది. పురుషుడు కాని దేహము, మనస్సు మొదలగువాటిని, ఇది కాదు, ఇది కాదు అంటూ నిరాకరించి పరమాత్మను ఈ దేహమునందు మాత్రమే అన్వేషించవలెను. కారణము కార్యప్రపంచ మునంతనూ వ్యాపించియున్ననూ (అన్వయము), కారణము కార్యము కంటే విలక్షణమైనది (వ్యతిరేకము) అనే వివేకమును ఆత్మవిచారమును. చేసే సాధకులు ప్రసన్నమైన మనస్సుతో అభ్యసించవలెను. ఈ జగత్తు దేనినుండి ఉదయించి దేనియందు నిలిచి దేనియందు విలీనమగునో అట్టి పరబ్రహ్మ సకలప్రాణులలో ఆత్మరూపముగానున్నది అని చక్కగా బోధించే శ్రుతివాక్యములను సాధకులు పరిశుద్ధమగు అంతఃకరణముతో వివేచించవ లెను. ఈ విచారములో తొందరపాటు పనికి రాదు.

తెలివిగా నుండుట, కలలను గనుట, నిద్ర అనే మూడు అవస్థలు ఏ చైతన్యము ద్వారా అనుభవమునకు వచ్చుచున్నవో, అట్టి సాక్షి చైత న్యమే దేహేంద్రియాదులకంటె అతీతమైన పరమాత్మ.

సత్త్వగుణప్రాధాన్యముచే జాగ్రదవస్థ, రజోగుణముచే స్వప్నావస్థ, తమస్సుచే నిద్ర కర్మఫలరూపముగా బుద్ధియందు కలుగుచుండును. ఆ బుద్ధియందు ఆత్మ సాక్షి చైతన్యరూపముగా అనుగతమై యున్నది. బుద్ధి తోడి తాదాత్మ్యముచే ఈ అవస్థలు ఆత్మకేనా యని అనిపించును. అట్టి తాదాత్మ్యమును నిరాకరించి, గంధమును బట్టి దానికి ఆశ్రయమగు వాయువును తెలుసుకున్నట్లుగా, బుద్దిలోని అవస్థలను ప్రకాశింపజేసే సాక్షి

చైతన్యస్వరూపముగా పరమాత్మను తెలుసుకొనవలెను.

ఆత్మానాత్మవివేకము లేకుండా ఈ బుద్దితోడి తాదాత్మ్యము వల ననే ఆత్మకు ఈ జననమరణప్రవాహరూపమగు సంసారము ప్రాప్తమై త్రిగు ణములచే మరియు కర్మలచే స్థిరము చేయబడుచున్నది. ఈ సంసారము కనబడుటయే గాని, వాస్తవము కొదు; ఇది కలవలె మిథ్య.

కావున, సాధకులు మూడు గుణముల పరిణామరూపములైన కర్మల బీజము ఆత్మానాత్మవివేకము లేకపోవుటయేనని గుర్తించి, అజ్ఞాన మనే ఆ బీజమును నశింపజేయుటకు యత్నించవలెను. అదియే యోగము. బుద్ధియొక్క ప్రవాహము ఉపశమించుటయే యోగము.

అజ్ఞానమనే బీజమును నశింపజేసే విషయములో వేలాది ఉపా యములు గలవు. కాని, భగవానుడు ఒక్క ఉపాయమును చెప్పినాడు. దేనితో వివిధధర్మముల ననుష్ఠించుచుండగా, జగన్నాథుడగు భగవానుని యందు ప్రేమ ఉదయించునో, అది (భక్తి) యే ఆ ఉపాయము.

భక్తితో గురువును సేవించుట, తనకు లభించిన సర్వమును భగవా నునకు సమర్పించుట, సత్పురుషులైన భక్తులతో సత్సంగము, ఈశ్వరుని ఆరాధించుట, ఈశ్వరుని గాథలయందు శ్రద్దను కలిగియుండుట, ఈశ్వ రుని గుణములను లీలలను కీర్తించుట, ఆ భగవానుని పాదపద్మములను ధ్యానించుట, ఆ భగవానుని మూర్తులను దర్శించి పూజించుట మొదలగు సాధనలచే భగవానునియందు ప్రేమ ఉదయించును.

సర్వేశ్వరుడైన శ్రీహరి సకలప్రాణులలో ఉన్నాడు అనే భావనతో ఆ ప్రాణులకు అభీష్టములగు వస్తువులను సాదరముగా సమర్పించవలెను.

సాధకులు కామక్రోధలోభమోహమదమాత్సర్యములనే ఆర్గురు అంతశ్శత్రువులను జయించి జగన్నాథుడగు వాసుదేవ భగవానునియందు ఈ విధముగా భక్తిని చేసినచో, భగవానునియందు ప్రేమ ఉదయించును.

భగవానుని సాటిలేని గుణములను, భగవానుడు లీల కొరకై అవ తారములనెత్తి చేసిన కర్మలను చూపిన పరాక్రమములను విని భక్తునకు గొప్ప హర్షముచే గగుర్పాటు కలిగి కన్నీరు ప్రవహించి కంఠము డగుత్తికను పొందును. ఆతడు ఎలుగెత్తిన కంఠముతో బిగ్గరగా పొడి శబ్దమును చేసి నాట్యమాడును. భక్తుడు దెయ్యము పట్టినవాడు వలె నవ్వుతూ ఏడుస్తూ ఈశ్వరుని ధ్యానిస్తూ జనులకు నమస్కరించును. ఆతడు ఆత్మరూపుడగు ఈశ్వరునియందు లగ్నమైన మనస్సు గలవాడై బిడియమును విడనాడి, పదే పదే నిట్టూర్పులను విడుస్తూ, ఓ హరీ! జగన్నాథా! నారాయణా! అని పిలుచును. భక్తుడు ఇట్టి స్థితిని చేరుకున్నచో, ఆతని సకలబంధములు తొల గిపోవును. ఆతని అంతఃకరణము, దేహము కూడ భగవానుని లీలయొక్క భావనకు అనురూపముగా తయారగును. ఈ విధమైన గొప్ప భక్తిని చేయు టచే ఆతని అజ్ఞానబీజము, వాసనలు పూర్తిగా దగ్ధమగును. అట్టివాడు ప్రత్యకాది ప్రమాణములకు అందని శ్రీహరిలో శాశ్వతముగా ఐక్యమగును.

ఈ లోకములో అమంగళకరమగు మనోవాసనలు గల మానవునకు సంసారచక్రమును నివారణ చేసేది ప్రత్యక్షాది ప్రమాణములకు అందని శ్రీహరిని పొందుటయే. ఆ శ్రీహరినే పరబ్రహ్మ అనియు, మోక్షానందమనియు మహాత్ములు వర్ణించెదరు. మీరు మీ హృదయములో హృద యేశ్వరుడగు ఆ పరమాత్మను ఆరాధించుడు.

ఓ అసురబాలకులారా! శ్రీహరి సకలప్రాణుల హృదయములో ఆకాశమువలె ఉండి సమానరూపముగా హితమును చేయుచున్నాడు. ఆ విధముగా తనకు ఆత్మరూపుడే అయి ఉన్న శ్రీహరిని ఉపాసించుటలో పెద్ద ప్రయాస ఏమి గలదు? భోగములను ఆర్జించుటలో ప్రయోజనమేమి గలదు?

ధనములు అస్థిరములు. భార్య, సంతానము, ఇల్లు, పశుసంపద, భూమి, ఏనుగులు, ధనాగారము, భోగసాధనములు మొదలైన అర్థకామములన్నింటియొక్క ఆయుష్షు క్షణకాలములో నశించేది మాత్రమే. ఇవి మానవునకు చేసే ప్రియము ఎంతటిది?(అల్పము).

ఇదే విధముగా యజ్ఞములను చేసి సంపాదించే ఈ స్వర్గాది లోకములు కూడ నశించే స్వభావము గలవియే. వాటిలో దోషములు లేవని చెప్పుటకు వీలులేదు. పైగా, వాటిలో ఒకదానిని మించి మరియొకటి ఉండుటచే అవి సాపేక్షములు. కావున, మీరు ఆత్మలాభము కొరకై అనన్యమగు భక్తితో ఆ పరమేశ్వరుని ఆరాధించుడు. ఆయనయందు దోషము కనబడదు; వేదములలో వినబడదు.

ఈ లోకములో మానవుడు తనకే అన్నీ తెలుసునని భావిస్తూ సుఖమును కోరి పదే పదే కర్మలను చేయుచుండును. కాని వానికి అవశ్యముగా విపరీత ఫలము, అనగా దుఃఖము, లభించుచున్నది.

ఈ లోకములో మానవుడు సుఖమును, దుఃఖమునుండి విముక్తిని కోరి కర్మలను చేయుచుండును. కాని, అన్ని సందర్భములలో మానవుడు దుఃఖమునే పొందుచున్నాడు. వాస్తవములో కామనను ఆపై ఆ కామన కొరకై కర్మను చేయుటకు ముందే మానవుడు నిండా సుఖమును కలిగియు న్నాడు.

ఈ లోకములో మానవుడు దేహము కొరకై భోగసాధనములను కోరి కామ్యకర్మలను చేయుచుండును. కాని, ఆ దేహమైతే నిశ్చయముగా నశించి క్రిమికీటకాదులకు ఆహారము అగును. ఆ దేహము జీవుని విడిచి పెట్టి, మరల జీవునకు సంప్రాప్తమగును.

దేహముయొక్క గతి ఇట్లుండగా, దేహమునకు బయట ఉండి, ఇది నాది అనే అభిమానములో విషయములయ్యే సంతానము, భార్య, ఇల్లు, ధనము, రాజ్యము, కోశాగారము, ఏనుగులు, అమాత్యులు, సేవకులు, ఆప్తులైన బంధువులు కూడ దూరమయ్యేవే అని వేరుగ చెప్పవలెనా?

తుచ్చములగు ఈ ఇంద్రియభోగములు శరీరముతో బాటే నశించును. ఇవి పురుషునకు అభీష్టములుగా భాసించిననూ, వాస్తవములో ఆపదలను కొని తెచ్చును. సర్వకాలములలో ఆనందమునకు మహాసముద్రమైయున్న ఆత్మకు వీటితో పని యేమున్నది?

ఓ అసుర బాలకులారా! మీరే ఆలోచించండి. తల్లి కడుపున పడుటతో మొదలు పెట్టి వేర్వేరు అవస్థలలో ప్రారబ్ధకర్మానుసారముగా కష్టములను పడుచున్న దేహధారికి ఈ లోకములో లభించే వాస్తవమైన ప్రయోజనము (ఫలము) ఎంతటిది?

దేహధారియగు జీవుడు తనకు వశమై యుండే దేహముతో కర్మలను చేయును. ఆ కర్మలచే ఆ జీవుడు మరియొక దేహమును పొందును. ఈ విధముగా జీవుడు తన స్వరూపమునకు దేహాదులకు ఉండే తేడాను గుర్తించకపోవుటచే దేహము-కర్మలు అనే రెండింటినీ విస్తరింప జేసుకొనును.

కావున, మీరు జగన్నాథుడై ఆత్మస్వరూపుడుగా ఉన్న శ్రీహరిని నిష్కామముగా భజించుడు. ఆయన కామనలు లేని పూర్ణుడు. ధర్మార్థకా మములు ఆయననే ఆశ్రయించి ఉన్నవి.

తనచే సృష్టించబడిన పృథివి మొదలైన మహాభూతములతో నిర్మితమైన సకల దేహములకు జీవుడని పిలువబడే ప్రియమైన ఆత్మ శ్రీహరియే. ఆయనయే ఆ జీవులలో అంతర్యామియై ఉన్నాడు.

దేవత గాని, అసురుడు గాని, మానవుడు గాని, యక్షుడు గాని, గంధర్వుడు గాని ఎవరైననూ మోక్షప్రదాతయగు శ్రీహరియొక్క పాదమును సేవించువాడు, మనవలెనే మంగళములను పొందును.

 

ఓ అసుర బాలకులారా! మోక్షప్రదాతయగు శ్రీహరిని ప్రసన్నము చేసుకొనుటకు ఉపనయన సంస్కారము గాని, దేవతయై ఉండుట గాని, మహర్షి యగుట గాని, మంచి నడవడి గాని, అధికమగు విజ్ఞానమును కలిగి యుండుట గాని, దానము గాని, తపస్సు గాని, యజ్ఞము గాని, బాహ్యము నందు ఆంతరమునందు శౌచమును కలిగియుండుట గాని, వ్రతములు గాని సమర్థములు గావు. శ్రీహరి నిర్మలమైన (కామన అనే మాలిన్యము లేని) భక్తిచే ప్రసన్నుడగును. ఇతరము సర్వము అనుకరణము మాత్రమే.

ఓ అసురులారా! కావున, సకలప్రాణులను తనతో సమానముగా ప్రేమించుట ద్వారా, సకలప్రాణులలో ఆత్మరూపుడై జగన్నాథుడైయున్న శ్రీహరి భగవానునియందు భక్తిని చేయుడు.

శ్రీహరితో ఐక్యమును పొందినవారు దితివంశీయులు, యక్షులు, రాక్షసులు, స్త్రీలు, శూద్రులు, గొల్లపల్లెలలో నివసించువారు, పక్షులు, పశు వులు, పాపజీవులు కూడ గలరు సుమా! (భక్తి మహిమ అట్టిది).

ఈ లోకములో మానవుడు పొందగలిగే సర్వోత్తమమైన పురుషా ర్థము గోవిందునియందు ఏకాంతభక్తిని చేయుటయేనని మహర్షులచే చెప్ప బడినది. సర్వకాలములలో సర్వదేశములలో సర్వమునందు శ్రీహరిని దర్శించుటయే ఆ భక్తియొక్క స్వరూపము.

శ్రీమద్బాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో ప్రహ్లాదచరితమునందు ప్రహ్లాదుని ఉపదేశమును వర్ణించే ఏడవ అధ్యాయము ముగిసినది (7) .