శ్రీ మద్భాగవతము - సప్తమ (7వ) స్కందము

Table of Contents

 9 - ప్రహ్లాద చరితము - ప్రహ్లాదుడు. నృసింహుని స్తుతించుట

నారదుడిట్లు పలికెను --- ఈ విధముగా కోపావేశముతో నిండియున్న నరసింహుని సమీపించుట సుతరాము శక్యము కాకుండెను. బ్రహ్మగారు, రుద్రుడు, దేవతలు మరియు ఇతరులు ఆయన వద్దకు వెళ్లలేకపోయిరి.

దేవతలు సాక్షాత్తుగా లక్ష్మీదేవిని ఆయన వద్దకు పంపిరి. ఆ పెద్ద అద్భుతమైన రూపమును చూడగానే, ఆమెకు శంక కలిగెను. ఎందుకంటే, అట్టి రూపమును ఆమె ఇదివరలో చూడలేదు, వినలేదు. ఆమె ఆయన దగ్గరకు వెళ్లలేదు.

తన సమీపమునందు నిలిచియున్న ప్రహ్లాదుని బ్రహ్మగారు నరసింహుని వద్దకు పంపించేను -- వత్సా! నీవు నీ తండ్రిపై కోపించియున్న నరసింహుని వద్దకు వెళ్లి, ఆయన కోపమును చల్లార్చుము.

ఓ ధర్మరాజా! గొప్ప భగవద్భక్తుడగు ఆ పిల్లవాడు సరే అని పలికి, చేతులు జోడించి మెల్లగా దగ్గరకు వెళ్లి, సాష్టాంగ నమస్కారమును చేసెను.

తన పాదముల మొదట పడిన ఆ పిల్లవానిని చూచి నరసింహుని హృదయము దయతో నిండిపోయెను. ఆ దేవుడాతనిని పైకి లేవదీసి వాని తలపై పద్మమువంటి తన చేతిని ఉంచెను. ఆ చేతితో అభయమునిచ్చి ఆయన భక్తుల అంతఃకరణములో కాలము వలని ఉండే భయమును పోగొట్టును.

ఆయన చేతితో స్పృశించుట తోడనే ప్రహ్లాదుని అశుభవాసనలన్నియు కడిగివేయబడి, ఆతనికి వెంటనే పరమాత్మ సాక్షాత్కారము (బ్రహ్మజ్ఞానము) కలిగెను. మహానందమును పొందిన ఆతని శరీరము గగుర్పాటును పొందెను. ప్రేమతో ఆర్ద్రమైన హృదయము గల ఆతని కన్నులలో ఆనందబాష్పములు నిండెను. ఆతడు ఆయన పాదపద్మమును హృదయములో ఏకాగ్రముగా ధ్యానించేను.

మిక్కిలి సమాహితమైన అంతఃకరణము గల ప్రహ్లాదుడు తన హృదయమును నరసింహునిపై నిలిపి కన్నులతో ఆయనను మాత్రమే చూచుచుండెను. ఆయన ఏకాగ్రమైన మనస్సుతో మరియు ప్రేమతో గధ్గద మైన వాక్కుతో శ్రీహరిని స్తుతించెను.

బ్రహ్మగారు మొదలగు దేవతాగణములు, మహర్షులు మరియు సిద్ధపురుషులు కేవలము సత్త్వగుణప్రధానమైన అంతఃకరణము గలవారే. కాని, వారు ఈనాటి వరకు అధికమగు గుణములు గల తమ ప్రవాహరూపమగు వాక్కులతో శ్రీహరిని ఆరాధించుట (స్తుతించుట) కు పూర్ణముగా సమర్థులు కాలేకపోయిరి. క్రూరమగు రాక్షసజాతిలో జన్మించిన నాకు ఆయనను ప్రసన్నుని చేసుకొనే యోగ్యత గలదా?

సంపద, మంచి వంశములో జన్మించుట, అందము, తపస్సు, పాండిత్యము, ఇంద్రియపాటవము, వర్చస్సు, సామర్థ్యము, శరీరబలము, ఉద్యమశక్తి, బుద్దిశక్తి మరియు యోగసాధనలు అనేవి పురుషోత్తముని ప్రసన్నుని చేసుకొనుటకు సమర్థములు కానే కావని నా అభిప్రాయము. ఎందుకంటే, భగవానుడు భక్తిచే గజేంద్రుని యెడల కూడ ప్రసన్నుడైనాడు.

పన్నెండు గుణములు (జ్ఞానము, సత్యము, ఇంద్రియనిగ్రహము, పాండిత్యము, మాత్సర్యము లేకుండుట, వినయము, సుఖదుఃఖముల యెడల సహనము, ఇతరులలో దోషములను వెదుకకుండుట, యజ్ఞము, దానము, మనోధైర్యము, మనోనిగ్రహము అనేవి -- లేదా, పై శ్లోకములో చెప్పినవి) ఉన్ననూ, పద్మనాభుని పాదపద్మములపై భక్తిలేని వ్యక్తి వేదవేత్తయే అయిననూ --- ఆయనకే మనస్సును, వాక్కును, చేష్టను, సంపదను, జీవనమును కూడ అర్పించివేసిన కసాయివాడు ఆ వేదవేత్తకంటే శ్రేష్ఠుడు. అట్టి భక్తుడు తాను పుట్టిన కులమును పావనము చేయగా, పెద్ద గర్వము గల ఇతరుడు (వేదవేత్త) అట్టి పావనుడు కాబోడు.

తన ఆనందస్వరూపమునందు నిలిచియుండుట చేతనే భగవానుడు పరిపూర్ణుడు. ఆయనకు జనులు చేసే పూజాదికముతో తనకొరకై పొందదగినది ఏదీ లేదు. కాని, ఆయన దయామయుడగుటచే జనుల పూజాదికమును స్వీకరించుచున్నాడు. మానవుడు భగవానునకు ఏయే పూజాదికమును సమర్పిస్తాడో, దానిని తన కొరకే సమర్పించుకొనుచున్నాడు. ఇది యేల్లాగంటే, ముఖమునకు చేసుకున్న అలంకారము ఫలించేది అద్దములోని ప్రతిబింబమునందు మాత్రమే గదా!

కావున, నేను అల్పుడననే కలవరమును విడిచిపెట్టి పూర్ణప్రయత్నముతో ఈశ్వరుని మహిమను నా బుద్ధిశక్తికి తగటుగా వర్ణించి చెప్పేదను. ఎందుకంటే, భగవానుని మహిమను వర్ణించుటచే, అనాదియగు అవి ద్యచే సత్త్వరజస్తమోగుణముల కార్యమగు ఈ దేహమునందు నేను-నాది అనే అభిమానముతో తగుల్కొని సంసారములో పడియున్న పురుషుడు పవిత్రుడగును.

ఓ ఈశ్వరా! నీవు సత్త్వగుణమునకు నిధానమవు (కోపము రజోగుణ లక్షణమని అభిప్రాయము). భయపడుతున్న బ్రహ్మగారు మొదలైన వీరందరు నీ కింకరులే. వీరు మా రాక్షసులవంటి వారు కారు (అనగా, కోప ము ఆవశ్యకము కాదు). భగవానుడవగు నీవు మనోహరములైన అవతారముల ద్వారా వివిధములైన లీలలను ప్రకటించెదవు. వాటి వలన ఈ జగత్తు లోని ప్రాణులకు క్షేమము, సమృద్దులు మాత్రమే గాక, ఆత్మానందము కూడ సంపన్నమగును.  

ఓ నరసింహా! కావున, నీవు కోపమును నియంత్రించుము. నీవీ నాడు రాక్షసుని సంహరించితివి. తేలు, విషసర్పములను చంపినప్పుడు అహింసాపరాయణులైన సత్పురుషులు కూడ సంతోషిస్తారు. రాక్షసవధచే సుఖించిన సకలప్రాణులు నీవు ప్రసన్నుడవగుటకై వేచియున్నవి. జనులు భయమును పోగొట్టుకొనుటకై నీ ఈ రూపమును స్మరించెదరు.

ఓ అపరాజితా! నోరు, నాలుక, సూర్యగోళములవంటి కన్నులు, కోపముతో ముడివడిన కనుబొమలు, క్రూరమైన కోరలు గల నీ ముఖము చాల భయమును గొల్పును. నీకు ప్రేవులే మాలలైనవి. రక్తముతో తడిసిన జూలు, బల్లెపు కొనలవంటి చెవులు గల నీవు చేసే సింహనాదమునకు దిగ్గ జములు భయపడును. కాని, శత్రువును గోళ్ల కొనలతో చీల్చివేసిన నీ ఈ రూపమునకు నేను భయపడుట లేదు.

ఓ దేవా! నీకు దీనులపై ప్రేమ మెండు. నేను నా కర్మలచే బంధించబడి హింసను చేసే రాక్షసుల మధ్యలో ఉంచబడినాను (జన్మించినాను). అట్టి నేను సంసారములో భ్రమించుటలోని దుస్సహమైన దుఃఖము వలన మాత్రమే భయపడెదను. నీవు దయామయులలో ఉత్తముడవు. నీవు ప్రసన్నుడవై సంసారదుఃఖమును పోగొట్టి ఆశ్రయమయ్యే నీ పాదమూలము వద్దకు నన్ను ఎప్పుడు ఆహ్వానించెదవు?

ఓ అనంతా! నేను అనేకజన్మలలో ఇష్టమైనదానిని కోల్పోయి, ఇష్టము కాని దానిని పొంది, నిప్పువంటి శోకముచే కాల్చివేయబడియున్నాను. పైగా, దుఃఖమును నివారించే ఉపాయము కూడ దుఃఖరూపమే అయి ఉన్నది. అనాత్మయందు ఆత్మతాదాత్మ్యము గలవాడనై సంసారములో తిరుగాడుచున్నాను. కావున, నాకు నీ సేవ అనే మోక్షోపాయమును ఉపదేశించుము.

ఓ నరసింహా! ఆ విధముగా నిన్ను సేవించే నేను నీ పాదముల జంటనే నిరంతరముగా స్మరించే జ్ఞానులతోడి సంగమును నెరపుతూ, పరమేశ్వరుడవగు నీ లీలల గాథలను వర్ణించుచుందును. ప్రియుడవు (ఆత్మ రూపుడవు), హితకారివి అగు నీ గాథలను బ్రహ్మగారు కూడ గానము చేయుచుండును. ఆ విధముగా నేను సత్త్వరజస్తమోగుణములనుండి విముక్తుడనై పెద్ద కష్టములనైననూ సునాయాసముగా తరించెదను.

ఓ నరసింహ ప్రభూ! ఈ లోకములో నీచే ఉపేక్షించబడిన ప్రాణులకు సర్వసమ్మతమైన దుఃఖనివారణోపాయము కూడ తాత్కాలికమే యగును గాని, ఆ దుఃఖమునకు శాశ్వతమగు పరిష్కారము కాబోదు. ఉదాహరణకు, పిల్లవానిని తల్లిదండ్రులు గాని, రోగము వచ్చినవానిని మందు గాని, సముద్రములో మునిగిపోవుచున్నవానిని నౌక గాని ఖచ్చితముగా రక్షించుననే విశ్వాసము లేదు.

మానవులు వేర్వేరు స్వభావములను కలిగియుందురు. వారిలో కొందరు ఆధునికులు కాగా, మరికొందరు ప్రాచీనులు; కొందరు గొప్పవారు కాగా, మరికొందరు తక్కువ స్థాయికి చెందినవారు కావచ్చును. ఇట్టి కర్తలు ఏయే ప్రదేశములయందు ఏయే సాధనములతో, ఏయే వ్యక్తులచే లేక పరిస్థితులచే ప్రేరితులై, ఏ కాలమునందు ఏ కారణముగా దేని కొరకు దేనికి సంబంధించిన దేనిని ఏ ప్రకారముగా ఉత్పన్నము చేయుదురో, లేక పదార్థములలో విక్రియను కలిగించెదరో, ఆ సర్వము నీ స్వరూపమే.

అనాదియగు అవిద్య పదునారు (పది ఇంద్రియములు, పంచ ప్రాణములు, మనస్సు) ఆకుల సంసారము అనే చక్రమును కల్పించినది. మనస్సే ప్రధానముగా గల లింగశరీరమే ఇయ్యది. పురుషోత్తముని అను మతిచే కాలప్రేరితమైన మాయాశక్తియందు సత్త్వరజస్తమోగుణములలో కలిగిన క్షోభచే కర్మవాసనారూపమగు ఈ లింగశరీరము సృష్టించబడినది. వేదోక్తమగు కామ్యకర్మలే ప్రధానముగా గల ఇట్టి కామనాపూర్ణమగు మన స్సును జయించుట చాల కష్టము. దానితో తాదాత్మ్యమును పొంది తనను పరమాత్మవగు నీకంటే భిన్నముగా తలపోయువాడు ఎవ్వాడు ఆ సంసార చక్రరూపమగు లింగశరీరమును అతిక్రమించగల్గును?(అతిక్రమించలేడు).

ఓ ప్రభూ! సర్వేశ్వరుడవగు అట్టి నీవు చిచ్చక్తి స్వరూపుడవు. కావుననే, నీవు సర్వకాలములలో బుద్దియందు ప్రకటమగుచున్ననూ, దాని గుణములైన సుఖదుఃఖమోహములు నిన్ను స్పృశించలేవు. కాలస్వరూపుడవగు నీవు జగత్తులోని సాధ్యసాధనముల (కార్యకారణముల) నన్నింటినీ నీ వశములో నుంచుకున్నావు. అనాదియగు అవిద్యచే కల్పించబడిన పదు నారు ఆకులు గల ఈ సంసారచక్రములో పడి నేను నలిగిపోవుచున్నాను. నిన్ను శరణు పొందిన నన్ను నీ దగ్గరకు తీసుకొనుము.

ఓ ప్రభూ! స్వర్గములో లోకపాలకుల వద్ద ఉండే ఆయుర్దాయము, సంపదలు, అధికారములను నేను ఎరుగుదును. మానవుడు కోరేవి ఇవి యే. మా తండ్రి కోపముతో అట్టహాసము చేసి కనుబొమలను విరిచి చూచి నంత మాత్రాన లోకపాలకుల ఈ సంపదలన్నియు ధ్వస్తమైనవి. ఆ మా తండ్రిని కూడ నీవు సంహరించితివి.

కావున, దేహధారులగు జీవులు కోరే ఈ భోగములను, ఆయుర్దాయమును, సంపదను, అధికారమును, బ్రహ్మగారితో సహా అంతవరకు ఉండే ఇంద్రియభోగములను మరియు సిద్దులను, నిత్యానిత్యవస్తువివేకము గల నేను కోరుట లేదు. కాలస్వరూపుడవగు నీవు ఈ సర్వమును ధ్వస్తము చేసెదవు. నన్ను నీ సేవకుల సమీపమునకు గొనిపొమ్ము,

వినుటకు ఇంపుగా ఉండే ఎండమావులవంటి ఇంద్రియభోగములెక్కడ? సకలరోగములకు ఉద్బవస్థానమగు ఈ దేహమెక్కడ? ఈ విషయము మానవునకు తెలుస్తూనే ఉంటుంది. అయినా, మానవుడు దుఃఖముతో ఏవో కొన్ని అత్యల్పములగు తేనే తుంపరలవంటి భోగములను అతికష్టము మీద పొంది, వాటితో తన కోరికలు అనే అగ్నిని తాత్కాలిక ముగా చల్లార్చే ప్రయత్నమును చేయునే గాని, సుతరాము వైరాగ్యమును మాత్రము పొందుట లేదు.

ఓ ఈశ్వరా! తమోగుణ ప్రధానమగు ఈ అసురుల వంశములో రజోగుణ ప్రధానమగు జన్మను పొందిన నేను ఎక్కడ? నీ దయ ఎక్కడ? ఎందుకంటే, నీవు నా తలపై పద్మమువంటి చేతిని ఉంచితివి. ఈ అనుగ్రహము బ్రహ్మగారికి గాని, రుద్రునకు గాని, లక్ష్మీదేవికైననూ నిశ్చయముగా లేదు.

వీరు గొప్ప, వారు తక్కువ అనే భేదబుద్ధి అజ్ఞానులగు జనులకు మాత్రమే ఉండును. నీవు జగత్తునకు ఆత్మవు, హితకారివి. నీయందు అట్టి భేదబుద్ది నిశ్చయముగా లేనే లేదు. కల్పవృక్షమువంటి నిన్ను చక్కగా సేవించువారలకు నీ అనుగ్రహము కలుగును. ఆ నీ అనుగ్రహము వారి సేవకు అనురూపముగా నుండును. అంతేగాని, ఫలము లభించుటకు వ్యక్తులలోని ఎక్కువ-తక్కువలు హేతువు కాదు.

ఓ భగవానుడా! మానవుడు నిరంతరముగా విషయభోగములను కోరుతూ సంసారమనే నూతిలో కూరుకొనిపోవును. ఆ నూతిలో కాలమనే సర్పము గలదు. అట్టి జనుని వెనుకబడి తీవ్రమగు భోగాసక్తితో ఆ నూతిలో పడిపోవలసిన నన్ను దేవర్షియగు నారదుడు తనవానినిగా స్వీకరించి అను గ్రహించినాడు (పడిపోకుండా కాపాడినాడు), అట్టి నేను నీ సేవకుల సేవను ఎట్లు విడిచి పెట్టగలను?(విడిచి పెట్ట లేను).

ఓ అనంతా! నీవు నీ సేవకుడగు నారదమహర్షి పలుకులను యథార్థము చేయుటకై నా తండ్రియగు హిరణ్యకశిపుని వధించి నా ప్రాణములను కాపాడితివని నేను తలంచెదను. ఎందుకంటే, నా తండ్రి నన్ను చంపుట అనే తప్పు పనిని చేయ గోరి కత్తిని చేతబట్టి ఇట్లు పలికెను --  నాకంటే మరియొక ప్రభుడు ఉన్నచో, నిన్ను కాపాడుగాక! నేను నీ తలను నరుకుచున్నాను.(అట్టి స్థితిలో నీవు నన్ను రక్షించితివి).

ఈ జగత్తు నీవే. నీవు తప్ప రెండవది లేదు. ఏలయనగా, ఈ జగత్తునకు కారణము నీవే; ఈ జగత్తు విలీనమయ్యేది నీవే; జగత్తును నిలబెట్టేది కూడ నీవే. కాని, నీవు జగత్తుకంటే విలక్షణమైనవాడవు. సత్త్వరజస్తమోగుణముల పరిణామమగు ఈ జగత్తును నీవు నీ మాయాశక్తిచే సృష్టించి, దానిలో నీవే (సత్తాస్పూర్తుల రూపముగా) ప్రవేశించి, ఆ గుణముల కారణముగా నీవే అనేకమా యన్నట్లుగా భాసించుచున్నావు.

ఓ ఈశ్వరా! ఈ కార్యకారణరూపమగు జగత్తు నిశ్చయముగా నీవే. కాని, నీవు జగత్తుకంటే విలక్షణుడవు (జగత్తులోని గుణదోషములు జగత్కారణమగు పరబ్రహ్మను స్పృశించవు). నావాడు, పరాయివాడు అనే ఈ అజ్ఞానకల్పితమైన భేదబుద్ధి యథార్థము కాదు. ఎందుకంటే, ఎయ్యది దేనినుండి పుట్టి, దేనియందు మనుగడను సాగించి, దేనియందు ప్రకాశిం చి, దేనియందు విలీనమగునో, అది దానికంటే భిన్నముగా నుండదు. ఉదా హరణకు, పృథివీవికారమగు చెట్టు పృథివికంటె భిన్నముగా లేదు. కాలము యొక్క వికారమైన ఉషస్సు కాలముకంటె భిన్నము కాదు.

ఆత్మానందస్వరూపుడవు, నిష్క్రియుడవు అగు నీవు ఈ జగత్తును నీచేతనే నీయందే విలీనము చేసుకొని ప్రళయకాలమునందలి జలముల మధ్యలో పరుండెదవు. నీవు నీ స్వరూపమగు చైతన్యముచేతనే నిద్ర (తమోగుణము) ను నిరసించి కళ్లను మూసుకొని స్వస్వరూపమును అను సంధానము చేసెదవు. ప్రాణులలో ఆత్మరూపుడవైన నీకు నిద్రావస్థయం దలి అజ్ఞానముతో గాని, జాగ్రత్తు-స్వప్నము అనే అవస్థలయందలి విష యానుభవములతో గాని సంగము లేదు. ఆ అవస్థలను ప్రకాశింపజేస్తూనే నీవు తురీయము (నాల్గవది, వాటికి అతీతము) అగు శుద్ధచైతన్య-ఆత్మవై విలసిల్లెదవు.

ఈ జగత్తు నీ శరీరమే. ప్రళయకాలమునందు అది ప్రళయజలము లలో శయనించియున్న నీయందే విలీనమైయుండెను. నీయొక్క కాలరూపమైన శక్తిచే ప్రేరితమై మాయాశక్తియందలి సత్త్వరజస్తమోగుణములలో సంక్షోభము కలిగెను. అప్పుడు నీవు అనంతుడు అనే శయ్యనుండి యోగ నిద్రను విరమించి లేచితివి. అప్పుడు ఆ ప్రళయజలమునందు నీ నాభి నుండి ఈ జగత్తు పెద్ద పద్మము రూపముగా, సూక్ష్మమగు విత్తునుండి పెద్ద మర్రి చెట్టు వలె, ఆవిర్భవించెను.

ఆ పద్మమునుండి సూక్ష్మదర్శియగు బ్రహ్మగారు ఆవిర్భవించేను. ఆయనకు ఆ పద్మముకంటే మరియొకటి ఏదీ కానరాలేదు. తనకు కారణమై తనయందు వ్యాపించియే యున్న నిన్ను ఆయన బయట వెదుకడోచ్చెను. ఆయన ప్రళయజలములలో మునిగి వంద సంవత్సరములు నీ కొరకు వెదికిననూ, నీవు ఆయనకు కానరాలేదు. ఇది యుక్తియుక్తమే. ఎందుకంటే, అంకురము పుట్టిన తరువాత విత్తు దానికి బయట వేరుగా ఎట్లు కానవచ్చును?(కానరాదు).

ఓ ఈశ్వరా! అపుడా స్వయంభువుడగు బ్రహ్మగారు చాల విస్మితుడై, అదే పద్మమునాశ్రయించి కొంతకాలము తీవ్రమగు తపస్సును చేయగా, ఆయన అంతఃకరణము పరిశుద్దమాయెను. సూక్ష్మాతిసూక్ష్ముడవగు నీవు, భూమియందు మిక్కిలి సూక్ష్మమగు గంధము వలె, సర్వమునందు సత్తారూపముగా వ్యాపించియున్నావు. అట్టి నిన్ను ఆయన పంచభూతములు, కర్మజ్ఞానేంద్రియములు, అంతఃకరణముల సంఘాతమైన తనయందే సత్తారూపముగా వ్యాపించియున్నవానినిగా కనుగొనెను.

ఈ విధముగా తపస్సును చేసి బ్రహ్మగారు -- పరబ్రహ్మయే తన మాయాశక్తిచే గొప్ప విరాట్పురుషుని రూపములో ప్రకటము కాగా -- ఆ మహారూపమును దర్శించి ఆనందమును పొందెను. ఆ పురుషుడు అనంతములగు ముఖములు, పాదములు, తలలు, చేతులు, తొడలు, ముక్కులు, నోళ్లు, చెవులు, కళ్లు, ఆభరణములు మరియు ఆయుధము లతో సమృద్దుడై యుండెను. కార్యజగత్తులోని వివిధలోకములే ఆ పురు షుని వివిధములైన అవయవములకు సూచకములై యుండెను.

మహాబలశాలురు, రజోగుణ తమోగుణ స్వరూపులు అగు మధు కైటభులనే రాక్షసులు వేదములకు ద్రోహమును చేయుచుండిరి. అపుడు నీవు హయగ్రీవావతారమునెత్తి, ఆ రాక్షసులను సంహరించి, వేదముల గణములను తెచ్చి, బ్రహ్మగారికి అప్పజెప్పితివి. సత్త్వగుణము నీకు మిక్కిలి ప్రియమైన రూపమని మహాత్ములు చెప్పెదరు.

ఈ విధముగా మానవుడు (శ్రీరాముడు, శ్రీకృష్ణుడు), పశువు (వరాహము), మహర్షి (పరశురాముడు), దేవత (వామనుడు), మత్స్యము అనే అవతారముల ద్వారా నీవు జగత్తునకు ద్రోహము చేయువారలను సంహరించి, లోకములను పాలించుచున్నావు. ఓ పురుషోత్తమా! యుగము లయందు ప్రవర్తిల్లే ధర్మమును నీవే రక్షించుచున్నావు. నీవు కలియుగ ములో గుప్తరూపుడవై ఉండెదవు. కావుననే, అట్టి నీవు త్రియుగుడవు (మూడు యుగములలో ప్రకటమగువాడు) అయినావు.

ఓ వైకుంఠనాథా! నా ఈ మనస్సు పాపకార్యములచే కలుషితము, దుష్టము, వినయము లేనిది, కోరికలచే అలజడి చెందియుండునది, హర్షము శోకము భయము కామనలు అనువాటిచే భిన్నమైయుండునది. కావుననే, ఈ మనస్సు నీ గాథలయందు చక్కని ప్రీతిని పొందుట లేదు, అట్టి ఈ మనస్సులో దీనుడనగు నేను నీ స్వరూపమును గురించి ఎట్లు విచారమును చేయగల్గుదును?(చేయలేను).

ఓ అచ్యుతా! ఈ సంతృప్తినేరుగని జిహ్వ నన్ను రుచ్యములగు పదార్థముల వైపునకు, జననేంద్రియము సంభోగము వైపునకు, చర్మము మధురమగు స్పర్శ వైపునకు, పొట్ట ఆహారము వైపునకు, చెవి సంగీతము మొదలగువాటి వైపునకు, ముక్కు సుగంధముల వైపునకు, చంచలమగు కన్ను సుందరదృశ్యముల వైపునకు ఆకర్షించుచున్నవి. చేయి మొదలగు కర్మేంద్రియములు వివిధవ్యాపారములలోనికి నన్ను లాగుకొని పోవుచున్న

 

ఓ పరమాత్మా! నా చిత్తము నీ పరాక్రమమును గానము చేయుట అనే గొప్ప అమృతమునందు మునకలు వేయుచున్నది. అట్టి నేను దాట శక్యము కాని వైతరణీనది వలన సుతరాము భయపడను. కాని, ఆ అమృత మునుండి విముఖమైన బుద్ధి కలిగి ఇంద్రియభోగములయందలి మిథ్యాసు ఖము కొరకై సంసారభారమును మోయుచున్న పరమమూర్ఖులను గురించి నేను చింతిల్లుచున్నాను.

ఓ దేవా! తరచుగా మహర్షులు తమ మోక్షమును కోరువారై ఏకాంతమునందు మౌనవ్రతముననుష్ఠించెదరు. కాని, వారికి ఇతరుల ప్రయోజనమునందు నిష్టలేదు. కాని, నేను ఈ దీనులను విడిచి పెట్టి ఒక్కడినే మోక్షమును పొందగోరుట లేదు. సంసారములో పరిభ్రమించే ఈ జన మునకు నీవు తప్ప రక్షకుడు మరియొకడు నాకు ఎంత వెదికినా కానరాడు.

గృహాశ్రమమునందలి సంభోగము మొదలైన సుఖము నింద్యమై నది సుమా! ఇంద్రియభోగములు రెండు చేతులను గోకుకొనుట వంటిది. ఆరంభములో కొంత సుఖము కనబడిననూ, తరువాత కలిగేది నిరంతర మగు దుఃఖము మాత్రమే. కాని, మానవులు ఈ ఇంద్రీయసుఖముల యెడల తృప్తి లేనివారై అనేకములగు దుఃఖములననుభవిస్తూ దీనులై యున్నారు. వివేకము గల వ్యక్తి దురదను సహించినట్లే ఇంద్రియభోగము లకు చెందిన కామనలను కూడ సహించునే గాని, వాటి వెంట పడడు.

 

గొప్పగా కీర్తించబడే ఓ దేవా! ఈ సత్త్వరజస్తమోగుణములు గాని, వాటి పరిణామరూపములగు మహత్తు (సమష్టిక్రియా-విజ్ఞానశక్తులు) మొద లగు తత్త్వములు గాని, మనస్సు మొదలగు అంతఃకరణవృత్తులు గాని, దేవతలు గాని, మానవులు గాని ఈ సర్వము వచ్చి పోయేవే గాని, నీ స్వరూపమును తెలియలేకున్నవి. ఈ సత్యమును గుర్తించిన వివేకవంతులు శబ్దజాలమునుండి విరమించుకొనెదరు.

పూజనీయులలో శ్రేష్టుడవగు ఓ దేవా! నమస్కారము, స్తోత్రము, కర్మలను సమర్పించుట, పూజ, నీ రెండు పాదములను స్మరించుట, నీ గాథలను వినుట అనే ఆరు నిన్ను చక్కగా సేవించుటకు అంగములు. పరమహంసలచే ఆత్మరూపముగా పొందబడే నీయందలి భక్తి, ఇట్టి సేవ లేకుండగా మానవులకు లభించునా?(లభించదు). కావున, అట్టి భక్తిని అనుగ్రహించుము.

నారదమహర్షి ఇట్లు పలికెను --- స్వతహాగా నిర్గుణుడే అయినా సగుణుడై ప్రకటమైన నరసింహుని గుణములను భక్తుడగు ప్రహ్లాదుడు భక్తితో ఇన్ని విధములుగా వర్ణించెను. ఆయన అపుడు ప్రసన్నుడై తన కోపమును నియంత్రించి, ప్రణమిల్లిన ప్రహ్లాదునితో ఇట్లు పలికెను.