శ్రీ మద్భాగవతము - సప్తమ (7వ) స్కందము

Table of Contents

2 - ప్రహ్లాదుని చరితము - దితిని హిరణ్యకశిపుడు ఓదార్చుట

ఓ మహారాజా! ఈ విధముగా శ్రీహరి వరాహరూపమును దాల్చి తన సోదరుడగు హిరణ్యాక్షుని సంహరించగా, ఆ హిరణ్యకశిపుడు కోప ముతో మరియు దుఃఖముతో అధికమగు తాపమును పొందెను.

హిరణ్యకశిపుని శరీరము కోపముతో వణుకుచుండెను. ఆతడు పెదవిని కొరుకుచుండగా కోపముతో కన్నులు మండి పడుచుండెను. పొగతో నిండిన ఆకాశముకేసి చూస్తూ, ఆతడిట్లు పలికెను.

హిరణ్యకశిపుని కోరలు భయమును గొల్పుచుండెను. అతని చూపు క్రూరముగా నుండెను. కనుబొమలు ముడివడిన ఆతని ముఖము చూడ శక్యము కాకుండ నుండెను. ఆతడు సభలో శూలమును పైకెత్తి రాక్ష సులనుద్దేశించి ఇట్లు పలికెను.

దను-దితి వంశములకు చెందిన ఓ రాక్షసులారా! ఓ ద్విమూర్దా (రెండు తలలవాడు)! త్యక్ష (మూడు కన్నులవాడు)! ఓ శంబరా! ఓ శత బాహూ (వంద చేతులవాడు)! హయగ్రీవా (గుర్రపు తలవాడు)! నముచీ! ఓ పొకొసురా! ఇల్వలా! విప్రచిత్తీ! పులోమా! శకునీ! ఇతర రాక్షసులారా! మీరందరు నా మాటను వినుడు. వెంటనే నేను చెప్పినట్లు చేయుడు. విలంబమును చేయకుడు.

నా శత్రువులు (దేవతలు) సేవలతో శ్రీహరిని సంతోష పెట్టి సర్వులయందు పమభావము గల ఆయనను తమ వైపుకు తిప్పుకొని, ఆయనచే నా సోద రుని సంహరింప జేసినారు.

తేజశ్శాలియగు ఆ శ్రీహరి తన సమస్వభావమును విడిచి పెట్టి మాయను పన్ని అడవి మృగము (వరాహము) రూపు దాల్చినాడు. తనను భజించువారల వెంటబడే (అనుగ్రహించే) ఆతని మనస్సు బాలుని మనస్సు వలె చంచలమైనది. నేను నిశ్చయముగా నా శూలముతో వాని మెడను తెగగొట్టి ఆ అధికమగు రక్తముతో నా సోదరునకు తర్పణమిచ్చి, నా మనోవ్యథను దూరము చేసుకొనెదను. నా సోదరునకు రక్తమునందు ప్రీతి మెండు.

చెట్టు మొదలు నరికినచో, కొమ్మలు ఎండిపోవును. అదే విధము గా మోసగాడు మరియు అపకారి అగు ఆ శ్రీహరి నశించగానే, ఆయనయే జీవనమై స్వర్గములో నివసించే దేవతలు శుష్కించి పోయెదరు.

అంతలో (నేను శ్రీహరిని తుదముట్టించే లోపులో) మీరు వేదవేత్త లచే మరియు క్షత్రియులచే వర్ధిల్ల జేయబడిన భూలోకమునకు వెళ్లుడు. అచట తపస్సు, యజ్ఞము, వేదాధ్యయనము, వ్రతములు మరియు దాన ములను చేయువారిని సంహరించుడు.

వేదవేత్తలు చేసే వైదికకర్మలే యజ్ఞస్వరూపుడగు విష్ణువునకు మూలము. ధర్మరూపుడగు ఆ పురుషోత్తముడు దేవతలకు, పితృదేవతల కు, మహర్షులకు, సకలప్రాణులకు మరియు ధర్మమునకు కూడ సర్వోత్తమ మైన ఆశ్రయమై ఉన్నాడు.

ఏయే దేశములయందైతే వేదవేత్తలు వర్ణాశ్రమధర్మములను పాటిస్తూ కర్మలను చేయుచుందురో, గోవులు ఉండునో, ఆయా దేశము లకు వెళ్లి, వాటిని పూర్తిగా తగులబెట్టుడు. చెట్లను నరుకుడు.

వారికీ ఇతరులను పీడించుట సరదా. వారు ఈ తమ ప్రభువు ఆదే శమును సాదరముగా శిరస్సు వంచి స్వీకరించి, ఆ విధముగనే ప్రజలకు పీడను కలిగించిరి.

నగరములు, గ్రామములు, గొల్లపల్లెలు, ఉద్యానములు, పంట పొలములు, సత్రములు, ఆశ్రమములు, గనులు, రైతుల పల్లెలు, కొండపల్లె లు, అడవిపల్లెలు మరియు పట్టణములను వారు తగులబెట్టిరి.

కొందరు గొడ్డళ్లతో వంతెనలను, ప్రహరీలను, గోపురములను కూలగొట్టిరి. ఇంకొందరు జనులకు జీవికలను కల్పించే కొబ్బరి మొదలగు చెట్లను నరికిరి. మరికొందరు మండే కొరవిలతో జనుల ఇళ్లను పూర్తిగా తగుల బెట్టిరి.

ఈ విధముగా రాక్షసరాజగు హిరణ్యకశిపుని అనుచరులు లోకము నకు పలుమార్లు ఉపద్రవమును కలిగించిరి. దేవతలు స్వర్గమును విడిచి పె ట్టి, భూలోకమునందు కానరాకుండా తిరుగాడిరి.

సోదరుని మరణమునకు దుఃఖమును పొందియున్న హిరణ్యకశి పుడు ప్రేతకార్యములను చేసి, సోదరుని పుత్రులగు శకుని, శంబరుడు, ధృష్ణుడు, భూతసంతాపనుడు, వృకుడు, కాలనాభుడు, మహానాభుడు, హరిశ్మశ్రువు, ఉత్కచుడు అనువారలను ఓదార్చెను.

హిరణ్యకశిపు మహారాజు దేశకాలములనెరింగిన వాడు. వారి తల్లి యగు రుషాభానువును, తన తల్లియగు దితిని ఉద్దేశించి, ఆతడు మధుర మగు స్వరముతో నిట్లు పలికెను.

సంపదలయందలి లోభమునకు హిరణ్యాక్షుడు, ఆ సంపదలచే పొందబడే భోగములయందలి తృష్ణకు హిరణ్యకశిపుడు, భేదబుద్దికి దితి, క్రోధమునకు రుషోభానువు, బ్రహ్మానందమగ్నుడైన, ఆత్మజ్ఞానికి ప్రహ్లాదుడు, సకలప్రాణుల ఏకత్వమునకు నృసింహుడు ప్రతీకలు.

అమ్మా! అమ్మా! ఓ సోదరపత్నీ! ఓ పుత్రులారా! వీరుడగు హిర ణ్యాక్షుని గురించి మీరు శోకించుట తగదు. శూరులు శత్రువునెదుర్కుంటూ మరణించుట కొనయాడదగినది. అట్టి మరణమును శూరులు కోరెదరు.

గొప్ప నిష్ఠ గల ఓ తల్లీ! ప్రాణులు ప్రారబ్దవశముచే ఒకచోట కలు సుకొని, మరల విడిపోవుచుందురు. ఈ లోకములో వ్యక్తులు కలిసి జీవిం చుట చలిపందిరి వద్ద వ్యక్తులు కొద్ది సేపు కలియుట వంటిది మాత్రమే.

ఆత్మ కాలమునకు అతీతమైనది, వినాశము లేనిది, పాపపుణ్య ములు లేనిది, సర్వవ్యాపకము, సర్వజ్ఞము, మరియు ప్రకృతికి అతీతమైనది. అట్టి యాత్మ తన మాయాశక్తిచే సత్త్వరజస్తమోగుణముల కార్యములగు దేహములను విరివిగా సృష్టించి, సూక్ష్మశరీరమును ధరించుచుండును.

ఓ కల్యాణీ! నీరు బాగా కదులుతూ ఉంటే, దానిలో ప్రతిఫలించిన చెట్లు కూడ కదులుతున్నట్లు కొనవచ్చును. కన్నులు తిరిగినప్పుడు భూమి కూడ తిరుగుచున్నట్లు కనబడును. అదే విధముగా, గుణకార్యములగు విష యముల కారణముగా మనస్సు విచలితము కాగా, వికారములు లేనిదే అయిననూ ఆత్మ మనస్సుతో సమానముగా వికారములు కలది వలే భాసించును. వాస్తవములో ఆత్మకు దేహాదులతో సంసర్గము లేకున్ననూ, ఉన్నట్లే భాసించును.

ఆత్మకు దేహాదులతో వాస్తవమగు సంసర్గము లేకున్ననూ, అజ్ఞాన ముచే ఉన్నట్లు భాసించును. ఇట్టి అధ్యాస వలననే ఆత్మ తన స్వరూపము కంటే భిన్నముగా, ప్రియ-అప్రియములగు పదార్థములతో సంయోగ-వియోగములు గలదిగా, కర్మలను చేసేదిగా, కర్మఫలమగు సఫారమును అనుభవించేదిగా, పుట్టుక-మరణములు గలదిగా, పలువిధముల శోకమున నుభవించునదిగా, శోకము అవివేకములు కలదిగా, వివేకముయొక్క స్మర ణము లేనిదిగా అగుచున్నది అని మహాత్ములు చెప్పెదరు.

ఈ విషయములో ఒక ప్రాచీనమైన వృత్తాంతమును కూడ పెద్దలు ఉటంకించెదరు. ఒక మరణించిన వ్యక్తియొక్క బంధువులకు యమునితో జరిగిన ఆ సంభాషణమును గురించి మీరు తెలుసుకొనుడు.

ఉశీనర దేశములో సుయజ్ఞుడు అని ప్రసిద్ధి గాంచిన రాజు ఉండే ను. ఆయనను యుద్ధములో శత్రువులు సంహరించిరి. రత్నకవచము ముక్కలు కాగా, ఆభరణములు మాలలు చెల్లాచెదరు కాగా, బాణములు గుండెకాయను కోసివేయగా ఆయన యుద్ధభూమిలో పడియుండెను. ఆయన శరీరమంతా రక్తము వ్యాకులముగా నుండెను. జుట్టు చెల్లాచెదరై, కన్నులు ధ్వస్తమై యుండెను. ఆయన పెదవి కోపముతో కొరుకబడి యుండెను. పద్మమును పోలిన ఆయన ముఖము దుమ్ముతో నిండియుం డెను. ముక్క లైన ఆయుధములు, చేతులు గల ఆయన దేహము చుట్టూ జ్ఞాతులు కూర్చుని యుండిరి.

దైవము ఊసర దేశపు రాజైన తమ భర్తకు కలిగించిన ఆ స్థితిని దగ్గరగా చూచిన ఆయన భార్యలు దుఃఖిస్తూ -- ఓ నాథా! చంపబడితిమీ -- అంటూ, చేతులతో పలుమార్లు గట్టిగా గుండెలపై బాదుకుంటూ, ఆయన పాదముల చుట్టూ నేలపై పడిరి.

వారు తమ ప్రియుని పాదపద్మములను స్తనములపైని కుంకు మతో ఎర్రనైన కన్నీటితో తడుపుతూ బిగ్గరగా రోదించిరి. చెల్లాచెదరైన జుట్టు, ఆభరణములు కలిగి బిగ్గరగా విలపిస్తున్న ఆ భార్యలను చూచిన జనులకు కూడ దుఃఖము కలుగుచుండెను.

అయ్యో! ప్రభూ! విధాత దయ లేనివాడు. పూర్వములో నిన్ను ఉసీనర దేశవాసులకు రక్షకునిగా చేసిన ఆ విధాతయే ఇప్పుడు నిన్ను మా కంటికి కానరాని స్థితిని పొందించినాడు. అట్టి నీవు మాకు అధికమగు దుఃఖ మును మిగిల్చి దూరమైనావు.

నేలను కౌగిలించుకొనియున్న ఓ మహారాజా! కృతజ్ఞుడవు, గొప్ప హితకారివి అగు నీవు లేకుండా నీ వారలమగు మేము ఎట్లు జీవించగ లము? ఓ వీరా! మేము నీ రెండు కాళ్లను సేవించే వారము. నీవు వెళ్లే చోటకు మేము కూడ నీ వెంట వచ్చుటకు అనుమతినిమ్ము.

ఆ రాణులీ విధముగా భర్త శవమును గట్టిగా కౌగిలించుకొని దుఃఖించుచుండిరి. శవమును తీసుకువెళ్లుటకు వారు అంగీకరించలేదు. ఇంతలో సూర్యుడు అస్తమించెను.

మరణించిన రాజుయొక్క బంధువుల రోదనమును విని, యముడు స్వయముగా పిల్లవాని రూపములో అచటకు వచ్చి, వారితో ఇట్లు పలికేనట.

యముడిట్లు పలికెను -- ఆశ్చర్యము! వీరు వయస్సులో పెద్దవా రు, లోకములోని జన్మమరణములను విశేషముగా చూచినవారు. అయి ననూ, వీరలకు వ్యామోహము మెండు. తాము స్వయముగా మరణించే వారే. ఒక మనిషి ఎక్కడ (ఈశ్వరుడు) నుండి వచ్చెనో అక్కడికే వెళ్లిపో యినప్పుడు, వీరా మనిషిని గురించి వ్యర్థముగా దుఃఖించుచున్నారు.

ఆహా! మేము మిక్కిలి ధన్యులము. ఎందుకంటే, తల్లిదండ్రులు వదిలి పెట్టిన దుర్బలులమే అయినా, మమ్ములను తోడేళ్లు మొదలగునవి. తినివేయలేదు, మాకు చింతయే లేదు. ఎందుకంటే, గర్భములో ఉండగా రక్షించిన దేవుడే రక్షించగలడు.

ఓ అబలలారా! అవినాశియగు ఈశ్వరుడే స్వేచ్చగా ఈ జగత్తును సృష్టించి రక్షించి ఉపసంహరించుచున్నాడు. ఆ సర్వేశ్వరునకు ఈ స్థావర జంగమాత్మకమగు జగత్తు ఆటవస్తువు అని మహాత్ములు చెప్పెదరు. ఆయన పాలించుటయందు, సంహరించుటయందు కూడ సమర్థుడు.

దారిలో పడి ఉన్న వస్తువైనా ఈశ్వరునిచే రక్షించబడినదై చక్కగా ఉండును. ఇంటిలో భద్రము చేసిన వస్తువైననూ ఈశ్వరునిచే ఉపేక్షించబ డినచో నశించిపోవును. అడవిలో అనాథుడైన వ్యక్తి కూడ ఈశ్వరుని అను గ్రహముచే జీవించును. ఈశ్వరునిచే ఉపేక్షించబడిన వ్యక్తి ఇంటిలో రక్షణ ఉన్ననూ మరణించును.

ప్రాణులన్నీ తమ తమ కర్మలకు అనురూపమగు దేహములతో ఒక కాలములో జన్మించి మరియొక కాలములో నశించును. ప్రకృతికార్య మగు అట్టి దేహమునందు ప్రకటమగుచున్ననూ, ఆత్మ మిక్కిలి విలక్షణమై నదగుటచే ప్రకృతిగుణములచే బంధించబడుట లేదు.

వ్యక్తికి దేహమే తాను అనే వ్యామోహము వలన ఈ జన్మ కలిగిన ది. పంచభూతములతో తయారైన ఇంటిలో నివసించినా వ్యక్తి ఇంటికంటే వేరుగా ఉన్నాడు. అదే విధముగా వ్యక్తి తన స్వరూపములో దేహముకంటె విలక్షణుడై యున్నాడు. నీటి అంశములతో పుట్టే బుడగ మొదలగు పదార్థ ములు, అటులనే పృథివి అగ్ని అంశలతో పుట్టే పదార్థములు ఒక కాల ములో పుట్టి మార్పులు చెంది మరియొక కాలములో నశించును. అదే విధ ముగా వ్యక్తి కూడ ఒక కాలములో పాంచభౌతికమగు దేహముతో జన్మించును. ఆ దేహములో మార్పులు రాగా ఆ వ్యక్తి మరియొక కాల ములో మరణించును.

కట్టెలలో వ్యాపించియుండే నిప్పు కట్టెలకంటే విలక్షణముగనుండు నని మనకు తెలియుచుండును. దేహమును వ్యాపించియుండే వాయువు దేహముకంటే విలక్షణముగనే యున్నది. సర్వవ్యాపకమైననూ ఆకాశము నకు దేనితోనైననూ సంగము లేదు. అదే విధముగా, పూర్ణ-ఆత్మ సత్త్వరజ స్తమోగుణములకు, గుణకార్యములగు దేహాదులకు ఆశ్రయమే అయిన నూ, వాటన్నింటికీ అతీతమే.

ఓ మూఢలారా! మీరు ఎవనికొరకైతే దుఃఖిస్తున్నారో, ఆ ఈ సుయజ్ఞుడు (దేహము) ఇక్కడనే పడియున్నాడు. ఇతరుల మాటలను విని వాటికి సమాధానమును చెప్పే జీవుడు (సూక్ష్మశరీరి) ఈ లోకములో ఏ కాలమునందైననూ కంటికి కానరాడు.

ఈ దేహములో సకలచేష్టలకు ఆశ్రయమైన ప్రాణము గొప్పది, ప్రముఖమైనది (ముఖనాసికలయందు సంచరించేది). కాని, ఇతరుల మాట లను విని సమాధానము చెప్పేది ఈ ప్రాణము కాదు. ఈ దేహములోని ఇంద్రియముల ద్వారా సర్వమును సాక్షియై దర్శించే ఆత్మ దేహముకంటే, ప్రాణము కంటే విలక్షణమైనది.

పంచభూతముల కలయికయగు దేహముయొక్క ఉనికిని నిర్దారిం చేది జ్ఞానేంద్రియములు, మనస్సు మాత్రమే. ఇట్టి దేహములలో కొన్ని గొప్పవి కాగా, మరికొన్ని నికృష్టములైనవి. సర్వవ్యాపకమగు ఆత్మ ఆయా దేహములను ఉపాధిగా స్వీకరించుచున్ననూ, దేహముకంటే విలక్షణము గనే యుండును. కావుననే వివేకముయొక్క బలముచే, జీవభావమును

ఎంతవరకైతే ఆత్మకు లింగశరీరము (మనస్సు ఇత్యాది) తో తాదా త్మ్యము ఉండునో, అంతవరకు మాత్రమే కర్మబంధము, దాని వలన ఆత్మ యందు దేహము మొదలగు అనాత్మల ధర్మముల అధ్యారోపము, దుఃఖ ము, అవిద్యతోడి సంయోగము కొనసాగుచునే యుండును.

సత్త్వరజస్తమోగుణకార్యములగు సుఖదుఃఖాదులు సత్యమనే దృష్టి మరియు వచనము కూడ మిథ్య, వ్యర్థము అయిన పట్టుదల మాత్రమే. మనోరథములోని కల్పితవస్తువులు వలె, స్వప్నములోని ప్రపంచము వలె, ఇంద్రియముల వలన కలిగే జ్ఞానము (ఇంద్రియములచే గ్రహించబడే జగత్తు) అంతా మిథ్యయే.

కావున, ఈ లోకములో నిత్యానిత్యవస్తువివేకము గల వారలు నిత్యమగు ఆత్మను గురించి గాని, అనిత్యమగు దేహాదులను గురించి గాని శోకించరు. వాటిగురించి శోకించు వారలైననూ శోకించుటయే గాని, దేహా దుల స్వభావమగు అనిత్యత్వమును మార్చి నిత్యముగా చేయలేరు. కావున, శోకించుట వ్యర్థమని వివేకము గలవారికి తెలియును.

వేటగాడొకడు అడవిలో అక్కడక్కడ పక్షులను ప్రలోభ పెట్టే నూక లను చల్లి, వాటిపై వలను పన్ని, ఆ వలను గట్టిగా పట్టి యుంచెను. వేటగా, ళ్లను భగవంతుడు పక్షులను సంహరించుటకే సృష్టించినాడు కాబోలు!

ఆ అడవిలో ఒకచోట వడ్రంగి పిట్టల జంట తిరుగాడుతూ కనిపిం చెను. వాటిలోని ఆడు పిట్ట వేటగాడు చూపిన ఆశకు వెంటనే ప్రలోభమును పొందెను.

ఆ ఆడు పిట్ట మృత్యువుచే ప్రేరేపించబడి వల త్రాటియందు చిక్కుకొనెను. ఆ విధముగా ఆపదలో పడి దీనమైయున్న ఆ వడ్రంగి పిట్టను చూచి మగ పిట్ట చాల దుఃఖమును పొందెను. తాను ఏమీ చేయలేక దీనముగానున్న ఆ మగ పిట్ట ప్రేమ వలన పరితపించెను.

అయ్యో! దేవుడు సర్వవ్యాపకుడే అయినా దయ లేనివాడు. దీను డనగు నా గురించి దీనముగా దుఃఖిస్తూ ఉన్న ఈ నా ప్రియురాలు మిక్కిలి దయ చూపదగిన పక్షి. అట్టి ఈ పక్షిని దేవుడు ఏమి చేయబోవుచున్నాడో?

దేవుడు తన ఇచ్చవచ్చిన విధముగా నన్ను కూడ తీసుకొనిపోవు గాక! నా భార్య లేకుంటే నాలో సగము లేనట్లే, భార్య లేకుండా దుఃఖ ముగా జీవించే దీనమైన ఈ దేహముతో గాని, భార్య తోడు లేని ఆయుర్దా యముతో కాని నాకు పని యేమున్నది?

నా పిల్లలకింకనూ రెక్కలైననూ మొలవకుండానే తల్లికి దూరమై నారు. వారిని నేను ఎట్లు పోషించవలెను? నా పిల్లలు దురదృష్టవంతులు. వాళ్లు గూటిలో తల్లి కొరకు ఎదురు చూచుచుందురు.

ఈ విధముగా ప్రియురాలి వియోగముచే పీడించబడిన ఆ వడ్రంగి పిట్ట కన్నీటితో బొంగురవోయిన కంఠముతో విలపించుచుండెను. ఇంతలో మృత్యుదేవతచే పంపించబడిన అదే వేటగాడు దగ్గరలోనే దాగియుండి ఆ పిట్టను కూడ బాణముతో కొట్టెను.

ఓ మూఢస్త్రీలారా! మీరు కూడ అదే విధముగా భర్తను గురించి దుఃఖిస్తున్నారే గాని, మీకు కూడ మృత్యువు వేచి ఉన్నదని తెలుసుకొనలే కున్నారు. మీరిట్లు వందల సంవత్సరములు దుఃఖించినా, ఈతడు మీకు లభించడు.

హిరణ్యకశిపుడు ఇట్లు పలికెను --- చిన్న పిల్లవాడు ఇట్లు గొప్పగా చెప్పుచుండగా, బంధువులందరు తమ మనస్సులో ఆశ్చర్య మును పొందిరి. ఈ సర్వము అనిత్యము; వాస్తవముగా లేకున్ననూ, ఉన్నట్లు కనబడును -- అని వారు తెలుసుకొనిరి.

యముడీ విధముగా ఈ ఉపాఖ్యానమును చెప్పి అక్కడనే అంత ర్ధానమాయెను. సుయజ్ఞుని బంధువులు ఆయన పరలోకప్రాప్తికి కావలసిన కర్మలను చేసిరి.

కాబట్టి, మీరు మీ గురించి గాని, ఇతరుల గురించి గాని శోకించకు డు. తాను, పరాయి అనే దురభిమానము జనులలో ఉండును. అదియే అజ్ఞానము. అదే లేకున్నచో, తాను ఎవరు? పరాయి ఎవరు? తన సొత్తు ఎయ్యది? ఇతరుల సొత్తు ఎయ్యది?

ఈ విధముగా రాక్షసరాజగు హిరణ్యకశిపుని వాక్యమును విని దితి కోడలుతో సహా పుత్రుని గురించి శోకించుటను క్షణములో విడిచిపెట్టెను. ఆమె ఆత్మతత్త్వముపై తన మనస్సును నిలిపెను.

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో ప్రహ్లాదచరితమునందు దితిని హిరణ్యకశిపుడు ఓదార్చుట అనే రెండవ అధ్యాయము ముగిసినది (2).