శ్రీ మద్భాగవతము - సప్తమ (7వ) స్కందము
5 - ప్రహ్లాదుని చరితము - తొమ్మిది విధముల భక్తి
రాక్షసులు పూజనీయుడగు శుక్రుని పురోహితునిగా ఎన్నుకొనిరి. ఆయనకు శండుడు, అమర్కుడు అనే ఇద్దరు పుత్రులు గలరు. వారు రాక్ష సరాజగు హిరణ్యకశిపుని ఇంటికి సమీపములో నివసించిరి.
హిరణ్యకశిపు మహారాజు ప్రహ్లాదుని వారి వద్దకు పం పెను. ప్రహ్లా దుడు పిల్లవాడే అయినా, తత్త్వవిచారమునందు పండితుడే. వారు ప్రహ్లాదు నీ, ఇతరరాక్షసబాలకులను కూడ పాఠములను చదివించిరి.
ఆ గురుకులమునందు గురువు బోధించిన పాఠమును ప్రహ్లాదుడు విని తరువాత చదివెను. కాని, ఆ బోధకు తనవాడు, పరాయివాడు అనే తప్పుడు పట్టుదలయే ఆధారముగా నుండుటచే, ఆతని మనస్సునకు ఆ బోధ మంచిది అనిపించలేదు.
ఓ ధర్మరాజా! ఒకనాడు రాక్షసరాజగు హిరణ్యకశిపుడు పుత్రుడగు ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని, ఇట్లు ప్రశ్నించెను -- కుమారా! నీవు చదివినవాటిలో నీకు మంచిదని తోచినదానిని చెప్పుము.
ప్రహ్లాదుడిట్లు పలికెను --- ఓ రాక్షసశ్రేష్ఠా! మానవులు మిథ్య యగు విషయళగన్ యగు విషయభోగములయందు ఆగ్రహము గలవారగుటచే, వారి అంతఃక రణము తీవ్రమగు ఖేదమును పొందుచుండును. విషయభోగములకు నిలయమగు గృహము చీకటి నుయ్యి వంటిది. అది మానవుని పతనము నకు హేతువు. అట్టి గృహము (విషయభోగములు) ను జనులు విడిచి పెట్టి, అడవి (సత్సంగము) ని చేరి, శ్రీహరిని శరణు పొందవలెను. ఇదియే వారికి క్షేమమును కలిగించునని నా అభిప్రాయము.
తనకు శత్రువగు శ్రీహరియందు నిష్ఠ గల వచనములను తన పుత్రుడగు ప్రహ్లాదుడు పలుకగా విని, ఆ రాక్షసుడు నవ్వి ఇట్లు తలచెను -- శత్రువునందు నిస గలవారలు పిలల బుదినీ చెడగోటుచువారు
గురువుగారింట్లో పిల్లవాడగు ప్రహ్లాదుని వేదవేత్తలగు గురువులు చక్కగా .. కపటవేషధారులగు విష్ణుపక్షీయులు వాని బుద్దిని చెడగొట్టని విధముగా -- రక్షించవలెను (అని ఆతడు ఆదేశించెను).
తమ ఇంటికి కొనిరాబడిన ఆ ప్రహ్లాదుని రాక్షస పురోహితులు దగ్గ రకు పిలిచి, మధురమగు స్వరముతో మంచి మాటలతో ఇట్లు ప్రశ్నించిరి.
ఓ వత్సా! ప్రహ్లాదా! నీకు మంగళమగు గాక! నీవు సత్యమునే చెప్పవలెను. అసత్యమును చెప్పవద్దు. పిల్లలెవ్వరికైననూ లేని ఈ చెడు బుద్ధి నీకు ఎక్కడనుండి వచ్చినది?
నీకు ఈ చెడు బుద్ధిని శత్రువులెవరైనా కలిగించిరా? లేక, నీ అంతట నీకే కలిగినదా? ఆశ్చర్యము! మీ వంశీయుల ఆనందము నీ అధీన ములో నున్నది. గురువులమగు మేము వినగోరుచున్నాము చెప్పుము.
ప్రహ్లాదుడిట్లు పలికెను --- భగవానుని మాయచే వ్యామోహ మును పొందిన బుద్ది గల మానవులలో తనవాడు - పరాయివాడు అనే ఆగ్రహము కానవచ్చును. ఈ భేదము వాస్తవము కాదు. అట్టి మాయాధీశు డగు భగవానునకు నమస్కారము.
నేను వేరు, ఈతడు వేరు అనే భేదబుద్దికి మూలము అవివేకము. ఈ అజ్ఞానము మానవులలో ఉన్నది. కాని, ఆ భగవానుని అనుగ్రహము కలిగినప్పుడు దుష్టమగు ఈ భేదబుద్ధి తొలగిపోవును.
అట్టి ఈ భగవానుడు ఆత్మస్వరూపుడై యున్నాడు. తనవాడు, పరాయి వాడు అనే భేదబుద్ధి గల అవివేకులకు ఆయనను భజించుట చాల కఠినము. అజ్ఞానులు అద్వితీయమగు ఆత్మను తనవాడు - పరాయి వాడు అని వర్ణిస్తూ ఉంటారు. ఆ భగవానుని యథార్థస్వరూపము విషయములో బ్రహ్మగారు మొదలైన వేదవేత్తలు కూడ వ్యామోహపడుచున్నారు. నా బుద్దిని చెడగొట్టినది (మీ బుద్దికంటే విలక్షణముగా చేసినది) ఆయనయే.
గురువు గారూ! ఇనుము అయస్కాంతముయొక్క సన్నిధిలో తనంత తాను కదులును. అదే విధముగా నా మనస్సు చక్రపాణియగు శ్రీహరి సన్నిధిలో తనంత తానే (ఈశ్వరేచ్చచే) కరిగిపోవును (మీ బుద్దుల కంటే విలక్షణముగా నున్నది). లేదా, మీ మాటల్లో చెప్పాలంటే, తనంత తానే చెడిపోయినది.
గొప్ప వివేకియగు ప్రహ్లాదుడు పురోహితునితో ఇంత మాత్రమే పలికి విరమించెను. ఆ పురోహితుడు రాజునకు బంటు, దీనుడు. అపుడా యన కోపముతో ఆ ప్రహ్లాదుని అదిలించెను.
ఓరీ! బెత్తము తీసుకు రా! వంశమునకు చిచ్చువంటి ఈ దుర్బుద్ధి యగు ప్రహ్లాదుడు మాకు చెడ్డ పేరును తెచ్చినాడు. సామదానభేదదండ ములనే నాలుగు ఉపాయములలో వీనికి నాల్గవదియగు దండమే తగునని శాస్త్రము చెప్పుచున్నది.
రాక్షసులనే గంధపు చెట్ల అడవిలో ఈ పిల్లవాడు ముళ్ల చెట్టె పుట్టి నాడు. విష్ణువు ఆ చెట్లను మొదళ్లనుండి నరికే గొడ్డలి కాగా, ఈ బుడతడు ఆ గొడ్డలికి చేతిపిడి యైనాడు.
ఆ పురోహితుడు ఈ విధముగా ప్రహ్లాదుని చూపుడు వ్రేలితో అద లించుట, కొట్టుట మొదలైన వివిధములగు ఉపాయములతో భయ పెట్టెను. ఆయన ధర్మార్థకామములనే మూడు పురుషార్థములను మాత్రమే ప్రతిపా దించే శాస్త్రమును ఆతనిచే వల్లింప జేసెను.
రాజకుమారుడు తెలియదగిన సామదానభేదదండములనే నాలుగు ఉపాయములను ప్రహ్లాదుడు తెలుసుకొనెను. ప్రహ్లాదుని తల్లి ఆత నిచే అభ్యంగనస్నానము చేయించి భూషణములనలంకరింప జేసెను. తరువాత ఆ పురోహితుడు ప్రహ్లాదుని హిరణ్యకశిపునకు చూపించెను.
హిరణ్యకశిపుడు తన పాదములకు నమస్కరించిన ప్రహ్లాదుని ఆశీ ర్వచనముతో అభినందించెను. ఆయన ఆ బాలుని రెండు చేతులతో చాల సేపు కౌగిలించుకొని గొప్ప ఆనందమును పొందెను.
ఓ ధర్మరాజా! ఆతడు వికసించిన ముఖము గల ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చుండ బెట్టుకొని నుదుటిపై ముద్దాడి కన్నీటి బిందువులతో ఆత నిని తడుపుతూ ఇట్లు పలికెను.
హిరణ్యకశిపుడిట్లు పలికెను --- ఓ కుమారా! ప్రహ్లాదా! చిరంజీవీ! ఇంత కాలము నీవు గురువు వద్ద చక్కగా అధ్యయనము చేసి వల్లించిన పాఠములలో ఏదో ఒక ఉత్తమమైన పాఠమును అప్పజెప్పుము.
ప్రహ్లాదుడిట్లు పలికెను --- శ్రీహరియొక్క లీలలను వినుట, కీర్తిం చుట, స్మరించుట, శ్రీహరి పాదములను సేవించుట, పూజించుట, నమ స్కరించుట, శ్రీహరి యెడల దాసభావము, మైత్రి, శ్రీహరికి తనను తాను సమర్పించుకొనుట అని భక్తి తొమ్మిది విధములుగా నున్నది. సాధకుడు ఇట్టి భక్తిని సాక్షాత్తుగా శ్రీహరియందు సమర్పణ భావముతో చేసినచో, అదియే ఉత్తమమైన అధ్యయనమని నా అభిప్రాయము.
అప్పుడు పుత్రుని ఈ మాటను విన్న హిరణ్యకశిపుని క్రింది పెదవి కోపముతో బాగా వణకజొచ్చెను. ఆతడు గురువుయొక్క పుత్రుని ఉద్దేశించి, ఇట్లు పలికెను.
ఓ బ్రాహ్మణాధమా! ఏమిటి ఇది? నీవు దుర్బుద్ధివి. నీవు నా శత్రు వుల పక్షములో చేరిన దుష్టుడవు. నా మాటను కాదని పిల్లవానికి సారము లేని చదువును నేర్పితివి.
లోకములో కపటవేషముతో మోసపూరితమైన మైత్రిని నెర పే దుష్టులకు లోటు లేదు. పాపుల పాపము సమయము వచ్చినప్పుడు రోగము రూపములో బయట పడును. అదే విధముగా, ఇట్టి దుష్టుల పాపము కూడ బయట పడును.
గురుపుత్రుడు ఇట్లు పలికెను --- ఓ రాజా! నీవు ఇంద్రుని శత్రుడ వు. నీ ఈ పుత్రుడు చెప్పేది నేను గాని, ఇతరులు గాని, ప్రేరేపించినది కాదు. ఈ బుద్ది వీనికి సహజముగానే కలిగినది. నీవు కోపమును నియం త్రించుము. మాపై తప్పును రుద్దవద్దు.
నారద మహర్షి ఇట్లు పలికెను --- గురుపుత్రుడు ఈ విధముగా బదులీయగా, హిరణ్యకశిపుడు మరల పుత్రునితో నిట్లనెను -- అమంగళక రము, దుష్టము అగు ఈ నీ బుద్ధి గురువు నేర్పినది కానిచో, నీకు ఎట్లు అబ్బినది?
ప్రహ్లాదుడిట్లు పలికెను --- ఇల్లే వ్రతముగా కలిగి ఇంద్రియములు వశములో లేనిపోనై అంధకారముతో నిండిన సంసారములో మరల మరల ప్రవేశిస్తూ చేసిన కర్మలనే చేస్తూ అనుభవించిన భోగములనే అనుభవిస్తూ ఉండే లౌకికులకు బుద్ది, తనంత తానుగా గాని, ఇతరుల ద్వారా గాని, పర స్పరము సత్సంగము వలన గాని, శ్రీకృష్ణునియందు లగ్నము కాబోదు.
భోగవాసనలతో కలుషితమైన అంతఃకరణము గల జనులు బాహ్యప్రపంచమునందు మాత్రమే పురుషార్థము గలదని భావించి జీవించే లౌకికులను ఆదర్శముగా స్వీకరించెదరు. వీరిని గ్రుడ్డివానిచే నడిపించబడే గ్రుడ్డివారితో పోల్చవచ్చును. ఇట్టివారిని కామ్యకర్మలను బోధించే వేద భాగము పెద్దత్రాడై కామనలను నెరవేర్చే ఆయా కర్మలే చిన్న చిన్న త్రాళ్లు కాగా బంధించి యుంచును. ఆ వేదభాగమును వెలయించినది కూడ ఆ శ్రీహరియే. ఇట్టివారు ఆ శ్రీహరిని తెలియలేరు. ఎవరైతే ఆత్మరూపుడగు శ్రీహరిని పరమపురుషార్థముగా గుర్తించేదో, వారు శ్రీహరిని పొందెదరు.
ఏమీ లేనివారే అయిననూ మహాత్ములైనవారి పాదముల ధూళితో అభి షేకమును సాధకులు కోరుకోనవలెను. ఎందుకంటే, అట్టి అభి షేకము జరిగినప్పుడు మాత్రమే సాధకుల బుద్ధి, వామనావతారములో పెద్ద అడు గులు వేసిన శ్రీహరియొక్క పాదమును స్మరించును. అంతవరకు వారి బుద్దికి శ్రీహరి పాదముల స్మరణము కలుగదు. అనర్థములు దూరమగు టయే అట్టి స్మరణమునకు ప్రయోజనము.
ఇట్లు పలికి విరమించిన పుత్రుని హిరణ్యకశిపుడు కోపముతో తన ఒడినుండి నేలపైకి పారద్రో సెను. ఆతని బుద్ది కోపముచే గ్రుడ్డిది ఆయెను (వివేకమును కోల్పోయెను).
హిరణ్యకశిపుని అసహనము, కోపము ఆవేశించెను. ఆతని కన్నులు ఎర్రగా ఆయెను. ఆతడు ఇట్లు పలికెను -- ఓ రాక్షసులారా! వీడు వధించ దగినవాడు. వీనిని వెంటనే ఇచటనుండి తీసుకుపోయి వధించుడు.
ఈ అగముడే నా సోదరుని చంపినాడు. ఎందుకంటే, ఈతడు తనకు హితకారులగు తనవారిని విడిచి పెట్టి, తండ్రి సోదరుని చంపిన విష్ణువు పాదములను దాసుడు వలే పూజించుచున్నాడు.
తల్లిదండ్రుల ప్రేమను విడిచి పెట్టుట చాల కష్టము. కాని, ఈ దుష్టుడు అయిదేళ్ల వయస్సులోనే దానిని విడిచి పెట్టెను. వీడు విష్ణువునకై ననూ చేసే ఉపకారమేమి ఉండును?
మందు వలే మంచి చేసే వ్యక్తి పైవాడే అయినా కన్నవానితో సమానము. తన దేహమునుండి పుట్టే కొడుకే అయినా అపకారమును చేసేవాడైనచో, రోగము వంటివాడే. రోగగ్రస్తమై దేహమునకు అపకారము చేసే అవయవము తనదే అయిననూ, దానిని కోసివేయవలెను. ఎందుకంటే, దానిని శస్త్రచికిత్స చేసి తీసివేసినచో, మిగిలిన దేహము సుఖముగా జీవించును.
తపశ్శాలి తన వశములో లేని ఇంద్రియమును సర్వోపాయము లచే వశము చేసుకొనును. అదే విధముగా, హితకారి రూపములోనున్న శత్రువును సర్వోపాయములచే నివృత్తి చేసుకొనవలెను. భోజనము, నిద్ర, విశ్రాంతిగా కూర్చుండుట మొదలగు సందర్భములలో అట్టి శత్రువును విష ప్రయోగము మొదలగు ఉపాయములచే హతమార్చవలెను.
శూలధారులగు రాక్షసులకు హిరణ్యకశిపు మహారాజు ఖచ్చిత మైన ఆదేశములను జారీ చేసెను. రాగిరంగు గెడ్డములు మీసములు జుట్టు గల వారి ముఖములు వాడి కోరలతో భయమును గొల్పుచుండెను.
వారు భయంకరములగు నాదములను చేస్తూ, కోసివేయుము పగులగొట్టుము అని పలుకుచుండిరి. ప్రహ్లాదుని కూర్చుండబెట్టి వారు మర్మస్థానములన్నిటియందు శూలములతో పొడిచిరి.
పరబ్రహ్మస్వరూపుడగు శ్రీహరిని శబ్దములు నిర్దేశించలేవు. ఆయన ప్రాణులలో ఆత్మరూపముగా నున్నాడు. ఆయన ప్రహ్లాదుడు మనస్సును లగ్నము చేసియుండెను. ఆతనిపై వారు వేసిన ప్రహారములు, భాగ్యహీనుని గొప్ప ఉద్యమములు వలె, నిష్ఫలములాయెను.
ఓ ధర్మరాజా! ఆ పరిశ్రమ వ్యర్థము కాగా, రాక్షసరాజగు హిరణ్యక శిపునకు చాల సందేహము కలిగెను. ఆతడు హఠముతో ఆ ప్రహ్లాదుని చంపుటకై అనేకములగు ఉపాయములను చేసెను.
ఆ రాక్షసుడు పాపమునెరుగని ప్రహ్లాదుని దిగ్గజములచే తొక్కిం చెను; విషసర్పములచే కరిపించెను; చేతబడులను చేయించెను; కొండకో మ్ములనుండి పారద్రోయించెను; మాయలను పన్ని చంపుటకు ప్రయత్నిం చెను; గుహలు మొదలగుచోట్ల బంధించెను; పలురకముల విషమును పెట్టించెను; పస్తులుండునట్లు చేసెను; మంచులో విడిచి పెట్టెను; గాలి తుఫానులలో పారవైచెను; నిప్పులలోనికి త్రోయించెను; నీళ్లలో ముంచి చంపే ప్రయత్నమును చేసెను; బండరాళ్లను మీద పారవేయించెను. అయి ననూ, ఆతడు ప్రహ్లాదుని చంపించలేకపోయెను. ఆతనికి నిరంతరమగు బెంగ అధికమయ్యెను. ప్రహ్లాదుని చంపుటకు ఆతనికి మరియొక ఉపాయ మేదీ తోచలేదు.
నేను వీనితో అనేకములగు పరుషవాక్యములను పలికితిని. అంతే కాదు. శూలములతో పొడుచుట మొదలగు ద్రోహములను, చేతబడులు మొదలగు అపకారములను చేసి చంపించుటకు ఉపాయములను పన్నితి ని. కాని ఈతడు తన తేజస్సు చేతనే వాటినుండి విముక్తుడైనాడు.
ఈతడు నాకు దగ్గరలోనే ఉంటున్నాడు. పిల్లవాడే అయినా మంద బుద్ధి కాడు. ఈతడు సమర్థుడు. శునశ్శేపుడు తండ్రి చేసిన అన్యాయ మును మరచిపోకుండా తండ్రి శత్రువగు విశ్వామిత్రునితో జట్టు గట్టెను. అదే విధముగా ఈతడు కూడ నేను చేసిన అపకారమును మరువడు.
వీని మహిమ ఊహకు అందదు. వీనికి దేనివలనైననూ భయము లేదు. వీనికి మృత్యువు లేదు. వీనితోడి విరోధముచే నిశ్చయముగా నాకు మరణము కలుగునేమో? బహుశః అట్లు కాకపోవచ్చును.
ఈ విధమైన బెంగచే హిరణ్యకశిపుని ముఖము వాడిపోయెను. ఆతడు తల దించుకొనియుండగా ఏకాంతములో శుక్రాచార్యుని పుత్రులను శండ-అమర్కులు ఇట్లు పలికిరి.
ఓ ప్రభూ! నీవు కనుబొమలను విరిచినచో లోకపాలకులందరు గడ గడలాడెదరు. ముల్లోకములను నీవు ఒక్కడివే జయించితివి. నీవు బెంగ పెట్టుకోదగిన విషయమేమియు మాకు కానరాదు. పిల్లల ప్రవర్తన గుణదోష ముల నిర్ణయములో విషయము కారాదు. ఇది నిశ్చయము.
వీనిని వరుణుని పాశములతో కట్టియుంచుడు. అట్లు చేసినచో, ఈతడు భయపడి పారిపోవుట సంభవము కాకుండును. ఇంతలో గురువు శుక్రాచార్యుడు రాగలడు. ఇంతేగాక, వ్యక్తి బుద్ధి వయస్సుతో బాటు, పెద్ద లను సేవించుచున్నచో వికసించును.
హిరణ్యకశిపుడు సరే అని ఆ గురుపుత్రుల సలహాను స్వీకరించి శారితోనిట్లనెను -- రాజులు, గృహస్థులు పాటించే ధర్మములను వీనికి ఉప దేశించుడు.
ఓ ధర్మరాజా! వారిద్దరు వినయవిధేయతలు గల ప్రహ్లాదునకు క్రమముగా ధర్మార్థకామములనే పురుషార్థములను నిరంతరముగా బోధించిరి.
గురువులు ప్రహ్లాదునకు ధర్మార్థకామములను బోధించిరి. ఇట్టి బోధలు సుఖదుఃఖముల ద్వంద్వములననుభవిస్తూ ఇంద్రియభోగముల యందు రమించే జనుల కొరకు వర్ణించబడినవి. అవి శ్రేయస్కరములని ప్రహ్లాదునకు అనిపించలేదు.
ఒకనాడు ఆచార్యుడు ఇంటిపనుల విషయములో బయటకు వెళ్లి ను. అది ప్రహ్లాదుడు సమవయస్కులైన పిల్లలకు ఉత్సవమాయెను. వారు ఆ ప్రహ్లాదుని కూడ పిలిచిరి.
ప్రహ్లాదుడు గొప్ప జ్ఞాని. తనపై తన సహాధ్యాయులకు ఉన్న నిష్ఠ ఆయనకు తెలిసినదియే. ఆయన వారిని మధురమగు వాక్కుతో తన దగ్గ రకు పిలిచి, చిరునవ్వు నవ్వుతూ దయతో వారితో నిట్లనెను.
ఓ మహారాజా! సుఖదుఃఖములనే ద్వంద్వములననుభవిస్తూ భోగ ములలో తేలియాడే వారి మాటలు, చేష్టలు ఇంకనూ ఆ పిల్లల బుద్దులను కలుషితము చేయలేదు. వారికి ప్రహ్లాదునిపై గౌరవము మెండు. కావుననే, వారందరు ఆటవస్తువులను విడిచి పెట్టి, ప్రహ్లాదుని చుట్టూ కూర్చుండిరి. ఆతడు అసురవంశములో పుట్టినా, దయామయుడు, స్నేహశీలి, గొప్ప భగవద్భక్తుడు. వారు ఆతనినే చూస్తూ ఆతనిపై మనస్సు నిలిపిరి. ఆతడు వారితో నిట్లనెను.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో ప్రహ్లాదచరితమునందు తొమ్మిది విధముల భక్తిని వర్ణించే ఐదవ అధ్యాయము ముగిసినది (5).
