శ్రీ మద్భాగవతము - సప్తమ (7వ) స్కందము
13 - యతి ధర్మములు - ప్రహ్లాద దత్తాత్రేయ సంవాదము
ఆత్మవిచారమునందు సమర్థుడైన వ్యక్తి అద్వయమగు ఆత్మను ధ్యానిస్తూ సన్న్యసించి శరీరముతో మాత్రమే మిగిలియున్నవాడై, ఒక గ్రామములో ఒక దినము చొప్పున నిష్కామముగా భూమియందు సంచరించ వలెను.
ఈ సన్న్యాసి వస్త్రమును ధరించే పక్షములో కేవలము కౌపీనమును మాత్రమే ధరించవలెను. దండమును, సన్న్యాసచిహ్నములగు జపమాల మొదలగువాటిని తప్పించి ఇతరమును, సన్న్యాసమును స్వీకరించే సమయములో విడిచి పెట్టినదానిని దేనినైననూ స్వీకరించరాదు.
సన్న్యాసి భిక్షాన్నముతో జీవిస్తూ ఆత్మనిష్ఠయందు రమిస్తూ ఇతరులపై ఆధారపడకుండా సకలప్రాణులకు హితమును చేగూర్చువాడై ఒంటరిగా సంచరించవలెను. సకలకామనలు చల్లారిన సన్న్యాసి నారాయణుడే పరమలక్ష్యముగా గలవాడై ఉండవలెను.
ఆత్మ కార్యకారణములకు, కాలమునకు అతీతమైనది. సన్న్యాసి సకలజగత్తును ఆత్మయందు దర్శించవలెను. మరియు, కార్యకారణరూపములోనుండే సకలజగత్తును ఆత్మ-అభిన్నమగు పరబ్రహ్మయందు దర్శించవలెను. అనగా, ఆత్మయందు అధ్యస్తమని తెలియవలెను.
నిద్ర-తెలివి అనే ఈ రెండు అవస్థల సంధిలో, అనగా నిద్ర లేచే సమయములో మరియు నిద్ర పోయే సమయములో (అజ్ఞానముయొక్క ఆవరణ గాని, విక్షేపము కాని ఉండదు), ఆత్మనిష్ఠుడగు సన్న్యాసి ఆత్మ యొక్క తత్త్వమునరయవలెను. బంధమోక్షములు కేవలము కల్పన మాత్రమే; ఆత్మకు అవి వాస్తవముగా లేవు అని ఆతడు ఆ సంధిలో
గుర్తించవచ్చును.
ఈ దేహమునకు మరణము నిశ్చితము. ఈ దేహముయొక్క జీవీతకాలము అనిశ్చితము. సన్న్యాసి ఇటు జీవితమును గాని, అటు మరణమును గాని అభినందించరాదు. ప్రాణుల జననమరణములకు కారణమగు కాలమును కేవలము ప్రతీక్షించుచుండవలెను.
అనాత్మశాస్త్రములగు నాట్యశాస్త్రము మొదలగువాటియందు సన్న్యాసి ఆసక్తిని కలిగియుండరాదు. జీవిక (జాతకములు చేప్పి ధనమును సంపాదించుట, ఉద్యోగము చేయుట, వ్యాపారమును చేయుట) ను ఆధారముగా చేసుకొని జీవించరాదు. వాదప్రతివాదములను తర్కములను విడిచి పెట్టవలెను. వైష్ణవ-శైవ ఇత్యాది ఏ పక్షమునైననూ ఆశ్రయించరాదు.
శిష్యమండలులను తయారు చేయరాదు. అనేకములగు వేదాంతశాస్త్రమునకు సహకరించని జ్యోతిశ్శాస్త్రమువంటి అనాత్మశాస్త్ర గ్రంథములను సుతరాము అభ్యసించరాదు. అట్టి గ్రంథములను ప్రవచించరాదు. ఏ కాలమునందైననూ మఠము మొదలగు పెద్ద పెద్ద కార్యములను ఆరంభించరాదు.
సర్వాత్మభావముతో సర్వమునందు ఈశ్వరుని దర్శిస్తూ కామనలకు అతీతుడై ఉండే యతికి తరచుగా సన్న్యాసచిహ్నములు ఆత్మనిష్ణా రూపమగు ధర్మమునకు ఆలంబనము కాజాలవు. అనగా, అట్టి యతి బాహ్యచిహ్నములతో సంబంధము లేకుండా ఆత్మనిష్ఠుడై యుండును. అట్టి మహాత్ముడు బాహ్యచిహ్నములను కొనసాగించవచ్చును; లేదా, విడిచి పెట్టవచ్చును.
యతికి తన ప్రయోజనము ఆత్మానుసంధానము అని స్పష్టమే. అయిననూ, ఆయన తన ఆత్మనిష్ఠను బట్టబయలు చేసే చిహ్నములను ధరించడు. ఆయన మనోనిగ్రహము గలవాడే అయిననూ జనుల దృష్టిలో తనను తాను పిచ్చివానిని వలె, అవివేకియగు పిల్లవానిని వలె, తాను విద్వాంసుడే అయిననూ, తనను మూగవానిని వలె ప్రదర్శించవలెను.
ఈ సందర్భములో మహాత్ములు ఒక ప్రాచీనమైన వృత్తాంతమును ఉటంకించెదరు. ఒకప్పుడు ప్రహ్లాదునకు దత్తాత్రేయ మహర్షితో సంభాషణము జరిగినది. ఆ మహర్షి కొండచిలువ వలె తన వద్దకు వచ్చిన ఆహారమును మాత్రమే తిని (ఆజగర వృత్తి, జీవించును.
దత్తాత్రేయ మహర్షి కావేరీ నదీతీరమునందు సహ్యపర్వతము యొక్క చరియపై కటికనేలపై పరుండియుండెను. ఆయన దేహావయవములు దుమ్ముతో నిండియుండుటచే, ఆయన స్వచ్ఛమైన తేజస్సు ప్రకటమగుట లేదు. భగవానునకు ప్రియుడగు ప్రహ్లాదుడు ఒకప్పుడు కొందరు మంత్రులతో గూడి ప్రాణుల తత్త్వమునరయుటకై లోకములను సంచరిస్తూ, ఆ మహర్షిని చూచెను.
ఆయన చేసే పనులను బట్టి, ముఖకవళికలను బట్టి, మాటను బట్టి, వర్ణము ఆశ్రమము మొదలగువాటికి చెందిన గురుతులను బట్టి, ఆయన ఒక సిద్ధపురుషుడా, కాడా అనే విషయము జనులకు తెలియదు.
గొప్ప భగవద్బక్తుడు, రాక్షసరాజు అగు ప్రహ్లాదుడు తత్త్వమును తెలియగోరి, ఆయనకు నమస్కరించి యథావిధిగా పూజించి తల ఆయన పాదములను సోకునట్లుగా సాష్టాంగప్రణామమును చేసి ఇట్లు ప్రశ్నించెను.
ధనమును సంపాదించే ప్రయత్నము చేసి భోగములు అనుభవించే వ్యక్తి వలే తమరు బలమైన దేహమును కలిగియున్నారు. ఈ లోక ములో ఉద్యమము చేయువారికి మాత్రమే ధనము, ధనము గలవారికి మాత్రమే భోగము ఉండుట, భోగము గలవారికి మాత్రమే ఈ దేహము బలముగానుండుట అనుభవసిద్ధమే. దీనికి విరుద్ధమగు అనుభవము లేదు.
ఓ మహర్షీ! ఉద్యమము లేకుండా పరుండియున్న నీ వద్ద ధనము ఉండియుండదు. ధనము లేనిదే భోగము ఉండదు గదా! ఓ వేదవేత్తా ! భోగము లేని నీ ఈ దేహము బలముగా నుండుటకు గల హేతువును, మేము వినదగ్గది అయినచో, చెప్పడు.
తమరు విద్వాంసులు, సమర్థులు, చతురులు. తమరి పలుకులు విచిత్రములు, లోకప్రియములు. లోకము కర్మలలో మునిగియుండగా, తమరు ఉదాసీనులై చూచుచున్నారు, లేదా పరుండి యున్నారు. దీనికి కారణమేమి?
నారద మహర్షి ఇట్లు పలికెను --- రాక్షసరాజగు ప్రహ్లాదుడు ఈ విధముగా వినయపూర్వకముగా ప్రశ్నించగా, ఆ మహర్షి అమృతమువంటి ప్రహ్లాదుని పలుకులకు వశుడై చిరునవ్వుతో ఆయనకు ఇట్లు బదులు చెప్పేను.
దత్తాత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఓ రాక్షసోత్తమా! సత్పురు షులు నిన్ను సమ్మానించెదరు. మానవులు కర్మలను చేయుటకు, మానివే యుటకు ఉండే ఫలములు, ఈ విషయములన్నీ అంతర్దృష్టి గల నీకు తెలి సినవే.
నిష్కామ భక్తి కారణముగా భగవానుడగు నారాయణ దేవుడు అన్ని కాలములలో నీ హృదయమునందున్నవాడై, సూర్యుడు చీకటిని వలె, అజ్ఞానమును పారద్రోలును.
ఓ రాజా! అయినప్పటికీ, నీ ప్రశ్నలకు మాకు తెలిసినంతలో సమాధానమును చేప్పెదము. ఎందుకంటే, అంతఃకరణశుద్ధిని గోరువార లకు నీవు సమ్మానించ దగినవాడవు.
తృష్ణను యోగ్యములగు కామనలచే పూరించుట సంభవము కాదు. అది జీవునకు జన్మమరణముల పరంపరను కలిగించును. దానిచే నేను కర్మలను చేయించబడుతూ అనేకజన్మలనెత్తునట్లు చేయబడితిని.
మనుష్యజన్మ స్వర్గమునకు (పుణ్యముచే). మోక్షమునకు (ఆత్మ జ్ఞానముచే), పశుపక్ష్యాదిజన్మలకు (పాపముచే) మరియు మరల ఈ మాన వజన్మకు (పుణ్యపాపముల మిశ్రమముచే) కూడ ద్వారము. కర్మలచే తీరు గాడుచున్న నేను అనుకోకుండా ఈశ్వరేచ్ఛచే ఈ మనుష్యజన్మను పొందించబడితిని.
ఈ మనుష్యజన్మలో కూడ దంపతులు దుఃఖమును దూరము చేసి సుఖమును పొందుటకై కర్మలను చేసి, వారి ప్రయత్నమునకు విరుద్ధ ముగా సుఖము దూరమై దుఃఖమునే పొందుచుండుటను గాంచి, నేను కర్మలనుండి నివృత్తుడనైతిని.
ఈ జీవుని స్వరూపము సుఖనిధానము. సకలములైన చేష్టలు నివృత్తమైనప్పుడు ఆ ఆత్మస్వరూపమగు సుఖము ప్రకటమగును. మన స్సునకు ఇంద్రియముల ద్వారా, విషయములతో సంపర్కము కలిగిన ప్పుడు మాత్రమే భోగము కలుగును. ఈ విషయమును గమనించిన నేను ప్రారబ్దముననుభవిస్తూ, సుఖము కొరకై చేసే ప్రయత్నమునుండి విరమిం చుకొని సుఖముగా నుండెదను.
ఈ విధముగా మానవుడు తనకు పురుషార్థమై తనలోనే ఆత్మరూపవుగా ఉన్న సుఖమును నిశ్చయముగా విస్మరించి, మిథ్యయైన నానా త్వమునందు పలువిధముల జన్మలను పొందుతున్నవాడై, భయంకరమగు సంసారములో పడీపోవుచున్నాడు.
అజ్ఞాని నీటియందు పుట్టిన గడ్డి మొదలగువాటిచే కప్పివేయబడిన నీటిని విడిచి పెట్టి వీటియందలి కోరికతో ఎండమావి వెంట పరుగులు తీయును. అదే విధముగా అజ్ఞాని తన ఆత్మకంటే ఇతరము (ఆత్మ) యందు పురుషార్థము (ఆనందము) ఉన్నదని తలపోయును.(ఇంద్రియభోగముల వెంట పరుగులెత్తును).
దేహము, ఇంద్రియములు మొదలైనవి ప్రారబ్ధమునకు వశమై యుండును. వాటి ద్వారా తనకు సుఖమును, దుఃఖనివృత్తిని సాధింపబూనే అస్వతంత్రుడైన వ్యక్తి మరల మరల చేసే కర్మలన్నియు వ్యర్థములే యగు చుండును.
మరణము సర్వదా వెన్నాడి ఉండే మానవునకు ఏ కాలమునందై ననూ శారీరకములైన మరియు ప్రకృతినుండే పుట్టే దుఃఖములనుండి విముక్తి లేదు. అట్టి వాడు కష్టపడి సంపదలను, భోగములను సంపాదించిన నూ, వాటివలన ఒరిగేది ఏమున్నది?
లోభులై మనోనిగ్రహము లేక, భయము వలన నిద్ర పట్టక, అంద రినీ అధికముగా శంకిస్తూ ఉండే ధనవంతుల పాట్లను నేను చూస్తూనే ఉన్నాను.
ప్రాణమునందు, ధనమునందు లోభము గల జనులకు రాజు, చోరులు, శత్రువులు, తన వారు, పశు పక్షులు, యాచకులు మరియు కొలముల వలన మాత్రమే గాక, తమ వలన కూడ తమకు సర్వకాలముల యందు భయము తప్పదు. తామే తమ ధనమును పాడు చేసెదమేమో యను భయము కూడ వారికి ఉండును.
వివేకి ప్రాణము (దీర్ఘ జీవితము, శరీరబలము) నందు, సంపదల యందు తృష్ణను విడిచి పెట్టవలెను. ఎందుకంటే, మానవులకు ఆ తృష్ణ మూలకముగానే శోకము, వ్యామోహము (అనిత్యమును నిత్యమని భ్రమపడుట), భయము, కోపము, ఆసక్తి, చేతగానిదనము, అలసట మొదలగునవి కలుగుచుండును.
మాకీ లోకములో ఇద్దరు ఉత్తములైన గురువులు గలరు. అవి తేనె టీగ, కొండచిలువ. మేము తేనెటీగనుండి వైరాగ్యమును, కొండచిలువ నుండి సంతోషమును నేర్చుకొంటిమి.
సకలకామనలనుండి వైరాగ్యమును నేను తేనెటీగనుండి నేర్చు కుంటిని. తేనెనువలె కష్టపడి ప్రోగుచేసిన ధనమును దాని యజమానిని చంపియైననూ మరియొకడు అపహరించును.
నాకు కామనలు లేవు. అనుకోకుండా. ఈశ్వరేచ్చచే లభించిన దానితో నా మనస్సు సంతోషమును పొందును. ఏదీ లభించనిచో ధైర్య ముతో కొండ చిలువ వలె చాల రోజులు పడియుండెదను.
ఒకప్పుడు తక్కువ, మరియొకప్పుడు ఎక్కువ; ఒకప్పుడు రుచి యైన ఆహారము, మరియొకప్పుడు రుచి లేనిది; ఒకప్పుడు ఆరు రసము లతో కూడినది, మరియొకప్పుడు ఏ రసమైననూ లేనిది; నేను ఏది లభిస్తే దానిని తినెదను.
ఒకప్పుడు ఒకడు శ్రద్ధతో సమర్పించిన ఆహారమును, మరియొక ప్పుడు ఒకడు అమర్యాదగా ఇచ్చిన ఆహారమును కూడ తినేదను. పగలు గాని, రాత్రి గాని ఏ సమయమునందైననూ అనుకోకుండా ఈశ్వరేచ్చచే అభించిన ఆహారమును తినెదను. ఒకప్పుడు ఒకసారి తిని, మరల కూడ తినేదను.
పట్టు వస్త్రము గాని, నాజూకు వస్త్రము గాని, చర్మము గాని, నార వస్త్రము గాని, చెట్టు పట్టయే గాని, ఏది దొరికితే దానిని నేను ధరించే దను. ప్రారబ్ధపశముగా లభించినదానిని అనుభవిస్తూ నేను సంతుష్టమైన మనస్సును కలిగియుందును.
ఒకప్పుడు కటికనేలపై, గడ్డిమీద, ఆకుల మీద, బూడిదలో, మరి యొకప్పుడు ఇతరుల ఇచ్ఛ ప్రకారముగా ప్రాసాదములోని పర్యంకమునం దు, లేదా పరుపుపై పరుండెదను.
ఓ రాజా! ఒకప్పుడు నేను స్నానమాడి దేహమంతటా చందనము నలముకొని చక్కని వస్త్రములను మాలలను దాల్చి రథముపై గాని, ఏను గుపై గాని, గుర్రముపై గాని సంచరించెదను. మరియొకప్పుడు పిశాచము వలె దిగంబరుడనై యుండెదను.
జనులు స్వభావముచేతనే భిన్నభిన్నముగా నుండెదరు. కావున, నన్ను నిందించువానిని నేను నిందించను; నన్ను సమ్మానించువానిని నేను స్తుతించను. కానైతే నేను వీరికై కల్యాణము, సర్వాత్మయగు పరబ్రహ్మయందు ఏకమగుట అనే మోక్షము కలగాలని ప్రార్థించెదను.
సాధకుడు నానాత్వమును మనోవృత్తియందు, మనోవృత్తిని పదార్థ ముల నానాత్వముయొక్క విభ్రమమును కలిగించే మనస్సునందు, ఆ మనస్సును అహంకారమునందు, దానిని మాయాశక్తియందు భావనారూప ముగా విలీనము చేయవలెను.
సాధకుడు మననశీలుడై సత్యమగు పరబ్రహ్మను అనుసంధానము చేయవలెను. ఆతడు ఆ మాయాశక్తిని భావనచే ఆత్మానుభూతియందు విలీనము చేయవలెను. తరువాత ఆత్మస్వరూపదర్శనముచే ఆత్మనిష్ఠ గల వాడై కర్తృత్వపూర్వకమగు కర్మలు లేనివాడై, ప్రవృత్తిమార్గమునుండి ఉపర తిని చేయవలెను.
నీవు భగవానుని శరణు పొందినవాడవు. కావుననే, నేను నీకు నా ఈ ఆత్మకథను, మిక్కిలి రహస్యమే అయిననూ, వర్ణించితిని, నా వృత్తాం తము"లోకముయొక్క మరియు శాస్త్రముయొక్క మర్యాదలకు అతీతమైనది.
నారద మహర్షి ఇట్లు పలికెను --- రాక్షసప్రభువగు ప్రహ్లాదుడు దత్తాత్రేయ మహర్షినుండి పరమహంసలకు చెందిన ధర్మమును గురించి విని చాల సంతోషించి, ఆయనను పూజించి, ఆయన అనుమతితో తన గృహమునకు వెళ్లాను.
శ్రీమద్భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో
ప్రహ్లాద-దత్తాత్రేయ సంవాదములో యతి ధర్మములను
వర్ణించే పదమూడవ అధ్యాయము ముగిసినది (13).
