శ్రీ మద్భాగవతము - సప్తమ (7వ) స్కందము

Table of Contents

14 - గృహస్థుల ధర్మములు

ధర్మరాజు ఇట్లు పలికెను --- ఓ దేవర్షి! గృహమునందు వ్యామో హమును పొందిన బుద్ధిగల నావంటి గృహస్థుడు ఈ ఆత్మసాక్షాత్కార మును తేలికగా పొందే విధానమెయ్యది? చెప్పుము.

నారదుడిట్లు పలికెను --- ఓ రాజా! గృహస్థుడు ఆ ఆశ్రమము నకు చెందిన కర్మలను సాక్షాత్తుగా వాసుదేవునకు అర్పించే భావనతో చేస్తూ, మహాత్ములను సేవించవలెను.

గృహస్థుడు నిత్యకృత్యములను చేసుకుంటూ సమయము లభించి నప్పుడు. విరక్తజనులచే చుట్టువారబడి భగవానుని అవతారగాథలు అనే అమృతమును మరల మరల శ్రద్ధతో వినుచుండవలెను.

దేహము, భార్య, సంతానము మొదలైనవి ఏదో ఒకనాడు తమంత తాముగా విడిచి పెట్టేవే. అయిననూ, వ్యక్తి వాటియందు నాది అనే అభిమా నమును కలిగియుండును. నిద్ర లేచిన వ్యక్తి స్వప్నమును వలె, సాధకుడు సత్పురుషులతోడి సంగముయొక్క ప్రభావము వలన వీటియందలి ఆసక్తిని మెల్లగా విడిచి పెట్టవలెను.

వివేకి దేహముతో, ఇంటితో ప్రయోజనము ఎంతవరకో అంత మాత్రమే వాటిని సేవించవలెను. సాధకుడు విరక్తుడైననూ ఆ జనుల మధ్యలో ఆసక్తి కలవాడు వలె సామాన్య మానవుడు వలెనే వ్యవహరించ వలెను.

సాధకుడు మమకారము లేనివాడై, బంధువులు తల్లిదండ్రులు సంతానము సోదరులు మిత్రులు ఇతరులు దేనిని చేస్తే దానిని, దేనిని కోరితే దానిని, అంగీకరించవలెను.

వర్షములు కురిసి పంటలు పండి లభించే సంపద దివ్యము. బంగా రము మొదలైనవి భూమినుండి లభించే సంపద. ఇవి గాక అకస్మాత్తుగా సంపదలు వచ్చి పడవచ్చును. ఈ మూడు విధముల సంపద తనంత తానుగా అచ్యుతునిచే సమకూర్చబడినదియే. వివేకియగు సాధకుడు ఈ విషయమును గుర్తించి, ఆ సంపదనంతనూ అనుభవిస్తూ, పైన చెప్పిన ఈ సత్కర్మలను చేయవలెను.

ఎంతటి సంపద మనిషి పొట్ట నిండుటకు సరిపడునో, అంతటి సంపదపై మాత్రమే ఆ వ్యక్తికి హక్కు గలదు. అంతకుమించిన సంపదపై తన హక్కును స్వీకరించే వ్యక్తి చోరుడగును. కావున, ఆ వ్యక్తి శిక్షార్హుడు.

మృగములు, ఒంటెలు, గాడిదలు, కోతులు, ఎలుకలు, ప్రాకే జంతువులు, పక్షులు, ఈగలను వివేకి తన సంతానముగానే భావించవలె ను. వాస్తవములో ఈ ప్రాణులకు, సంతానమునకు తేడా ఎంతటిది?

గృహస్థుడైననూ అతిశయించిన క్లేశముతో ధర్మార్థకామములనే పురుషార్థములను సాధింప బూనరాదు. దేశకాలములకు అనుగుణముగా దైవము 'సంపన్నము చేసినంతవరకు మాత్రమే గృహస్థుడు ధర్మార్థకామ ములను సేవించవలెను.

గృహస్థుడు భోగ్యవస్తువులను కుక్కలకు, పాపులకు, పతితులకు కూడ వారి అర్హతకు తగ్గట్లుగా పంచి ఈయవలెను. మానవులకు భార్య యందు, ఈమె నా వ్యక్తి అనే అభిమానము ఉండును. గృహస్థుడు అట్టి తన భార్యను కూడ కలుపుకొని సకలప్రాణులకు సేవను చేయవలెను.

మానవుడు స్త్రీయందు, ఈమె నా భార్య అనే అభిమానము గల వాడై, ఆమె కొరకై ప్రాణములనైననూ విడిచి పెట్టును; తల్లిదండ్రులను, గుర వునైననూ హతమార్చును. కాని, ఎవడైతే స్త్రీయందలి అట్టి అభిమాన మును విడిచి పెట్టునో, వానికి అపరాజితుడగు భగవానుడు కూడ వశుడగును.

ఆఖరుగా క్రిములు, మాలిన్యము, బూడిదలయందు పర్యవసా నము చెందే ఈ తుచ్ఛమగు దేహము ఎక్కడ? ఆ దేహమునందు ప్రీతి గల భార్య ఎక్కడ? ఆకాశమునకు కూడ కారణము (ఆకాశము కంటే సూక్ష్మము, వ్యాపకము) అగు ఈ ఆత్మ ఎక్కడ?

దైవానుగ్రహముచే లభించిన సంపదతో పంచయజ్ఞములను (దేవ, పితృ, ఋషి, మనుష్య, భూతయజ్ఞములు) చేసి, ఆపైన మిగిలిన ద్రవ్య ములతో గృహస్థుడు తన జీవికను నిర్వహించుకొనవలెను. మిగిలిన సర్వ మునందు, ఇది నాది అనే అభిమానమును విడిచి పెట్టిన వివేకి మహా త్ములు పొందే ఆత్మసాక్షాత్కారము (మోక్షము) ను పొందును.

గృహస్థుడు తనకు తన వృత్తిచే లభించిన సంపదతో, దేవతలు ఋషులు మానవులు పశుపక్ష్యాదులు మరియు ఆత్మ అనే వేర్వేరు రూప ములలోనున్న పరమేశ్వరుని ఆరాధించవలెను.

గృహస్థుడు తనకు యోగ్యత మొదలైన యజ్ఞమునకు ఆవశ్యక మైన సంపదలు అన్నీ సమకూరిన పక్షములో, అగ్నిహోత్రము మొదలైన కర్మలను కల్పసూత్రములలో చెప్పబడిన విధానముతో చేసి పరమేశ్వరుని ఆరాధించవలెను.

ఓ రాజా! యజ్ఞభాగములన్నింటికీ భోక్తయగు ఈ భగవానుడు వేదవేత్తకు ఆహారమును సమర్పించుట అనే యజ్ఞముచే ఎంత బాగా ప్రస న్నుడగునో, అగ్నియందు హోమములతో చేసే ఆరాధనతో అంత బాగా ప్రసన్నుడు కాడు. ఇది నిశ్చయము.

కావున, దేవతలను, వేదవేత్తలను, ఇతర మానవులను, పశుపక్ష్యా దులను వారి వారి అర్హతకు తగ్గట్లుగా ఆయా భోగ్యవస్తువులను సమర్పించి ఆరాధించుము. ఆ విధముగా వీరందరియందు దేహేంద్రియమనస్సంఘా తమునకు సాక్షియై ఉండే పరమాత్మను ఆరాధించుము.

సంపద గల బ్రాహ్మణుడు ఆశ్వయుజ కృష్ణపక్షమునందు తల్లిదం డ్రులకు, పితామహ మాతామహులకు తన సంపదకు తగ్గట్లుగా మహాలయ శ్రాద్ధమును చేయవలెను.

కర్కట మకర సంక్రాంతులు, మేష తులా సంక్రాంతులు, వ్యతీపా తము (ఆదివారమైన అమావాస్య), దీనక్షయము (సూర్యోదయము తరు వాత వచ్చిన తిథి మరునాడు సూర్యోదయమునకు ముందే అంతమగుట), చంద్ర గ్రహణము, సూర్య గ్రహణము, శ్రవణము ధనిష్ఠ అనూరాధ నక్షత్ర ములు వచ్చిన ద్వాదశి, వైశాఖ శుక్ల తదియ (అక్షయ తదియ), కార్తీక శుక్ల నవమి (అక్షయ నవమి), హేమంత శిశిర ఋతువులలోని (కార్తీక పుష్య మాఘ ఫాల్గున మాసములలో) నాలుగు కృష్ణాష్టములు, మాఘ శుక్ల సప్త మి, మఖా నక్షత్రముతో కూడిన పూర్ణిమ, మాస నక్షత్రము (చిత్ర, విశాఖ మొదలగునవి) తో కూడిన శుక్ల చతుర్దశి పూర్ణిమలు, అనూరాధ శ్రవణము. ఉత్తర ఫల్గుని ఉత్తరాషాఢ ఉత్తరాభాద్రలతో కూడిన ద్వాదశి, ఉత్తరఫల్గుని ఉత్తరాషాడ ఉత్తరాభాద్ర జన్మనక్షత్రము శ్రవణములతో కూడిన ఏకాదశి -- ఈ దినములలో పితృశ్రాద్ధమును చేయవలెను.

ఈ పైన చెప్పిన దినములు మానవులకు కల్యాణమును వర్ధిల్ల జేసే కల్యాణ దినములు. కావున, మానవుడు ఈ దినములయందు సర్వప్ర యత్నముచే పుణ్యకార్యములను చేయవలెను. అట్లు చేయుట జీవితము నకు సాఫల్యమును చేకూర్చును.

ఎందుకంటే, ఈ దినములలో చేసిన తీర్థస్నానము, జపము, హోమము, వ్రతము, దేవపూజ, బ్రాహ్మణపూజ, పితృశ్రాద్ధము, దేవతలకు నైవేద్యాదులను సమర్పించుట, మానవులకు దానమును చేయుట, పశుప క్ష్యాదులకు ఆహారమునిచ్చుట అనే ఈ కర్మలు అక్షయఫలమునిచ్చును.

ఓ రాజా! భార్యకు చేసే పుంసవనము మొదలగు సంస్కారముల యందు, సంతానమునకు చేసే జాతకర్మ మొదలగు సంస్కారములయం దు, గృహస్థుడు తనకు చేసుకొనే యజ్ఞోపవీతధారణము మొదలగు సంస్కార కాలములయందు, ప్రేతకార్యములయందు, వార్షిక శ్రాద్ధము నందు మరియు ఇతరములగు మాంగళిక కర్మల (వ్రతములు మొదలైనవి) యందు చేసిన దానము అక్షయమగును.

ఇప్పుడు ధర్మము మొదలైన కల్యాణములను కలిగించే స్థానము లను గురించి చెప్పెదను. ఎచ్చటనైతే దానమునకు యోగ్యుడైన వ్యక్తి లభించునో, అదియే నిశ్చితముగా మిక్కిలి పవిత్రమైన దేశము.

సకలచరాచరజగత్తునకు అధిష్టానమైన భగవానుని మూర్తి గల స్థానము, తపస్సు శ్రద్ద దయ అనే గుణములతో కూడియున్న బ్రాహ్మణుల సముదాయము ఉన్న స్థానము మిక్కిలి పవిత్రమైన స్థానములు.

శ్రీహరియొక్క పూజ జరిగే ప్రతి స్థానము, పురాణములలో అధిక ముగా వర్ణించబడిన గంగ మొదలైన నదులు ఉండే స్థానము మిక్కిలి పవి త్రమైనవి, మరియు కల్యాణములకు నిధానములు.

పుష్కరము మొదలైన సరస్సులు, మహర్షులు సిద్దులు మొదలైన పుణ్యాత్ములు నివసించిన క్షేత్రములు, కురుక్షేత్రము, గయాసురుని తల పడిన గయాక్షేత్రము, ప్రయాగ, పులహుని ఆశ్రమము (సాలగ్రామ క్షేత్రము) లు మిక్కిలి పవిత్రములైన స్థానములు.

నైమిశారణ్యము, ఫాల్గున క్షేత్రము, సేతుబంధము, ప్రభాసము, ద్వారక, కాశి, మథుర, పంపాసరము, బిందుసరము పవిత్ర స్థానములు.

ఓ రాజా! బదరికాశ్రమము, అలకనంద, సీతారాముల ఆశ్రమము లైన చిత్రకూటము మొదలైనవి, మహేంద్ర-మలయ-సహ్య-శుక్తిమత్-ఋ క్షవత్-వింధ్య-పారియాత్రములు అనే కులపర్వతములు మిక్కిలి పవిత్ర మగు స్థానములు.  

శ్రీహరియొక్క అర్చామూర్తులకు ఆశ్రయములగు స్థానములు మిక్కిలి పవిత్రములు. కల్యాణమును కోరే వ్యక్తి ఈ స్థానములను నిశ్చయ ముగా మరల మరల సేవించవలెను. ఈ స్థానములలో చేయబడిన ధర్మము మానవులకు వేయి రెట్లు అధికఫలమునిచ్చును.

ఓ మహారాజా! స్థావర జంగమాత్మకమగు ఈ జగత్తు అంతా శ్రీహరిచే వ్యాప్త మై యున్నది. కావున, ఈ లోకములో శ్రీహరి ఒక్కడే పూజకు పాత్రుడు, అని పాత్రస్వరూపమును తెలిసినవారిలో అగ్రగణ్యు లగు మహాత్ములు నిర్దేశించినారు.

ఓ మహారాజా! ఎందుకంటే, అక్కడ నీ రాజసూయయాగసభలో బ్రహ్మగారి పుత్రుడగు నారదుడు మొదలైన మహర్షులు, దేవతలు, సిద్దపు రుషులు ఉండగా, అందరికంటే ముందుగా చేసే పూజకు శ్రీకృష్ణుడు అర్హమైనవాడుగా స్వీకరించబడినాడు.

బ్రహ్మాండకోశమనే మహావృక్షము జీవుల సమూహములచే వ్యాప్తమై యున్నది. దానికి మూలము అచ్యుతుడే. కావున, అచ్యుతుని ఆరాధించినచో, సకలజీవుల ఆత్మకు తృప్తి కలుగును.

ఈ ఈశ్వరుడు మానవులు, పశుపక్ష్యాదులు, మహర్షులు, దేవ తలు మొదలగు ప్రాణుల శరీరములను సృష్టించి, వాటియందు జీవరూప ముగా ప్రకటమగుచున్నాడు. పురములనదగిన శరీరములయందు ప్రకటన గుచుండుటచే ఈ ఈశ్వరునకు పురుషుడు అనే సార్థకనామము కలిగినది.

ఓ మహారాజా! అట్టి ఈ ప్రాణులయందు భగవానుడు చైతన్యాంశ ములోని తరతమభావముతో ప్రకటమగుచున్నాడు. కావున, మానవమా త్రుడు దానాదికమునకు యోగ్యుడే. మనుష్యులలో ఎవనియందు చైతన్య రూపమగు జ్ఞానము ఏ విధముగా ప్రకటమగునో, దానిని బట్టి ఆ వ్యక్తి యొక్క యోగ్యత నిర్ధారితమగును.

ఓ మహారాజా! త్రేతా మొదలగు యుగములలో మానవులకు పర స్పరము అవమానించుకోనే లక్షణము అధికముగా నుండును. ఈ విషయ మును గమనించియే, మహర్షులు పూజాకర్మ (ఉపాసన) కొరకు శ్రీహరి యొక్క ప్రతిమను కల్పించిరి.

తరువాత కొందరు ప్రతిమయందు చక్కని శ్రద్దగలవారై పూజలను చేసి శ్రీహరిని ఉపాసించుచున్నారు. కాని, ఇతరమానవులను ద్వేషిస్తూ ప్రతిమయందు శ్రీహరిని ఉపాసించిననూ, దానివలన పురుషార్థము సిద్ధించబోదు.

ఓ మహారాజా! మానవులయందు కూడ వేదవేత్తయగు బ్రాహ్మ ణుడు దానాదికమునకు మంచి యోగ్యుడని మహాత్ములు చెప్పెదరు. ఎందుకంటే, అట్టి బ్రాహ్మణుడు సంతుష్టి గలవాడై, తపస్సు మరియు ఉపా సనల ద్వారా శ్రీహరి రూపమగు వేదమును వల్లించి నిలబెట్టుచున్నాడు.

ఓ మహారాజా! జగద్రూపముగా ప్రకటమైయున్న ఈ శ్రీకృష్ణునకు కూడ బ్రాహ్మణులు గొప్ప దైవము. ఇది నిశ్చయము. ఇట్టి బ్రాహ్మణులు తమ పాదధూళిచే ముల్లోకములను పావనము చేయుదురు.

శ్రీమద్బాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో

 గృహస్థుల ధర్మములను వర్ణించే పదునాల్గవ

అధ్యాయము ముగిసినది (14).