శ్రీ మద్భాగవతము - సప్తమ (7వ) స్కందము
12 – బ్రహ్మచర్య - వానప్రస్థ ధర్మముల వర్ణనము
బ్రహ్మచారి ఇంద్రియనిగ్రహముతో గురుకులములో నివసిస్తూ గురువునకు హితమునాచరించవలెను. సేవకుడు వలె గురువు యెడల నమ్రుడై గురువునందు మిక్కిలి దృఢమగు అనురాగమును కలిగియుండవలెను.
బ్రహ్మచారి ఉదయము సాయంకాలము గురువును, అగ్నిని, సూర్యుని, శ్రీహరిని పూజించవలెను. మితముగా మాటలాడవలెను. రెండు సంధ్యలయందు కూడ ఏకాగ్రమగు చిత్తముతో గాయత్రిని జపించవలెను.
గురువు పిలిచినప్పుడు బ్రహ్మచారి మిక్కిలి సావధానుడై వేదమంత్రములను అధ్యయనము చేయవలెను. అధ్యయనమునకు ముందు వెనుక కూడ గురువు పాదములకు సాష్టాంగనమస్కారమును చేయవలెను.
బ్రహ్మచారి శాస్త్రములో విధించిన పద్దతిలో మౌంజి, మృగచర్మము, వస్త్రములు, జటలు, దండము, కమండలము, యజ్ఞోపవీతములను, చేతిలో దర్భలను ధరించవలెను.
ఉదయము సాయంకాలము బ్రహ్మచారి భిక్షాటనను చేసి ఆ ఆహారమును గురువునకు సమర్పించవలెను. గురువు అనుమతితో ఆ ఆహారమును భుజించవలెను. ఒకప్పుడు (అపరాధము చేసినప్పుడు) గురువు అనుమతినీయనిచో, ఆతడు ఆనాడు ఉపవాసమును చేయవలెను.
బ్రహ్మచారి చక్కని శీలము గలవాడై మితముగా తినవలెను; దక్షుడుగా ఉంటూ శ్రద్ధను కలిగియుండవలెను; స్త్రీలతో మరియు స్త్రీలకు వశులైన పురుషులతో పని ఉన్నంత వరకు మాత్రమే వ్యవహరించవలెను.
గృహస్థుడు కానివాడు, బ్రహ్మచర్యవ్రతము గలవాడు స్త్రీలకు సంబంధించిన ప్రసంగమునకు దూరముగా నుండవలెను. ఎందుకంటే, ఇంద్రియములకు దొడ్డ బలము గలదు. అవి యతియొక్క మనస్సునైననూ లోగివేయును.
యువకుడగు బ్రహ్మచారి యువతులగు గురుభార్యలచే తనకు జుట్టునకు అలంకారము, శరీరమునకు మర్ధనము, స్నానము, నలుగు పెట్టి స్నానము చేయించుట మొదలగువాటిని చేయించుకొనరాదు.
యువతి నిప్పు వంటిది కాగా, మగవాడు నేతి కుండవంటివాడు. ఇది నిశ్చయము. కావున, వ్యక్తి తన కుమార్తెతోనైననూ ఏకాంతమునందుండరాదు. బ్రహ్మచారి యువతితో ఏకాంతము కాని సందర్భములలో కూడ పని ఎంతవరకో అంతవరకే వ్యవహరించవలెను.
మానవుడు తన స్వరూపమును తెలుసుకొని దేహాదులతో సహా ఈ సర్వము కేవలము ప్రతీతి (కనబడేదే గాని ఉన్నది కాదు) మాత్రమేనని నిశ్చయించుకొనవలెను. అంతవరకు వానికి స్త్రీ-పురుషుడు అనే భేదబుద్ది దూరము కాదు. అట్టి భేదబుద్ది వలన వీనికి స్త్రీయెడల కామన కలుగును గదా!(కావున, పై నియమములను పాటించవలెను అని యర్థము).
ఈ శీలమును రక్షించుకొనుట మొదలైన ఉపదేశమంతయు గృహస్థునకు, సన్న్యాసికి కూడ విధించబడినది. భార్యతో కలిసి కాపురము చేసే గృహస్థునకు గురుశుశ్రూష మొదలైనవి వికల్పము, అనగా వీలుంటే చేయ వచ్చును, లేకపోతే అక్కర లేదు.
ఎవరైతే బ్రహ్మచర్య వ్రతముననుష్ఠించెదరో వారు కళ్లకు అంజనమును, అభ్యంగన స్నానమును, శరీరమునకు మర్ధనమును, స్త్రీల చిత్రములను చూచుటను, మాంసమును, మద్యమును, పుష్పమాలలను ధరించుటను, సుగంధద్రవ్యములను అలముకొనుటను, అలంకారములను విడిచి పెట్ట వలెను.
ఉపనయనసంస్కారము గల వ్యక్తి ఈ విధముగా గురుకులములో నివసించి తన శక్తికి, ఆవశ్యకతకు అనురూపముగా మూడు వేదములను, వాటి ఉపనిషత్తులను, వాటి అంగములను (శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, కలము. జ్యోతిషము. నిరుడము) వేదాద్యయమును కూడ విచారణ చేయవలెను. తరువాత, ఆతడు గురువు కోరిన వరమును ఆయనకు సమర్పించి, ఆయన అనుమతితో గృహస్థాశ్రమములో ప్రవేశించవలెను; లేదా, అడవికి వెళ్లి తపస్సు చేయవచ్చును; లేదా, సన్న్యసించవచ్చును; లేదా, గురుకులములోనే కొనసాగవచ్చును.
బ్రహ్మచారి అగ్నియందు, గురువునందు, తనయందు, సకలప్రాణులయందు కూడ సర్వప్రమాణములకు అతీతుడైన శ్రీహరిని దర్శించవలెను. శ్రీహరి సర్వత్రా వ్యాపించియే యున్నాడు గనుక, కొత్తగా దేనియం దైననూ ప్రవేశించబని లేదు. అయిననూ, సర్వమునందు తన అంశలే యగు జీవుల రూపములో ప్రవేశించినాడా యన్నట్లు భాసించును.
ఈ విధముగా నియమబద్దముగా జీవించే బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్న్యాసి కూడ తెలియదగిన ఆత్మతత్త్వమును తెలుసుకున్నవారై పరబ్రహ్మను ఆత్మరూపముగా పొందెదరు.
మహర్షులచే ప్రవచించబడిన వానప్రస్థ ధర్మములను చెప్పెదను. ఈ లోకములో మననశీలుడై ఈ ధర్మములనాచరించు వ్యక్తి మహర్షుల లోకమగు మహర్లోకమును పొందును.
భూమిని దున్ని పండించిన ఆహారమును గాని, నిప్పులలో కాల్చిన ఆహారమును గాని, పచ్చి కాయలను గాని, వానప్రస్థుడు తినరాదు. సహజముగా లభించే ఆహారమునైననూ కాలము కాని కాలమునందు తినరాదు. కాని, సూర్యుని వేడికి పండిన ఫలములు మొదలగువాటిని తిన వచ్చును.
వానప్రస్థుడు అడవిలో లభించే ధాన్యములతో అన్నమును పురోడాశములను తయారు చేసి వాటితోనే, ఆయా కాలములయందు విధించబడిన (నిత్య నైమిత్తిక) హోమములను చేయవలెను. తినదగిన ఆహారధాన్యములు కొత్త కొత్తవి లభించుట తోడనే, పాతవాటిని విడిచి పెట్టవలెను (ఇతరులకు, లేక పశుపక్ష్యాదులకు సమర్పించవలెను).
వానప్రస్థుడు అగ్నులను రక్షించుట కొరకు మాత్రమే పర్ణశాలను గాని, కొండ గుహను గాని ఆశ్రయించవలెను. తనకై తాను చలిని, గాలిని, అగ్నిని, వర్షమును, సూర్యుని వేడిని సహించవలెను.
వానప్రస్థుడు జటాధారియై జుట్టు, రోమములు, గోళ్లు, గడ్డము, మీసములయందలి మాలిన్యమును ఉపేక్ష చేయవలెను. ఆతడు కమండలమును, మృగచర్మమును, దండమును, ముదక వస్త్రములను, అగ్నిహోత్ర మునకు చెందిన స్రుక్కు మొదలగు సామగ్రిని ధరించవలెను.
వానప్రస్థుడు మననశీలుడై పన్నెండు, ఎనిమిది, నాలుగు, రెండు, లేక ఒక సంవత్సరము వానప్రస్థ ధర్మములను పాటించవలేను. కాని, ఆ ప్రయత్నములో క్లేశముల ఆధిక్యముచే బుద్ధి వినష్టము కాకుండ చూచుకొనవలెను.
ఎప్పుడైతే సాధకుడు వ్యాధుల వలన గాని, ముసలిదనముచే గాని, నిత్యకర్మలను అనుష్ఠించుటకు గాని ఆత్మవిచారమునకు గాని సమర్థుడు కాడో, అప్పుడు నిరాహారము మొదలగు వ్రతములను చేయవలెను.
వానప్రస్థుడు మూడు అగ్నులను తనయందు సమంత్రకముగా భావనారూపముగా ఆరోపించుకొనవలెను. ఆతడు దేహేంద్రియ మనస్సంఘాతమునందలి అహంకార (నేను)-మమకారము (నాది) లను విడిచి పెట్టి, వాటిని యోగ్యతననుసరించి వాటి వాటి కారణములయందు విలాపము (భావనారూపముగా) చేయవలెను.
సాధకుడు జితేంద్రియుడై దేహేంద్రీయమనస్సంఘాతమును వాటివాటికి చెందిన ప్రకృతి తత్త్వములయందు భావనారూపముగా విలీనము చేయవలెను. ఇంద్రియములను ఆకాశమునందు, ప్రాణాపానములను వాయువునందు, దేహపు వేడిని అగ్నియందు, రక్తము శ్లేష్మము మూత్రము మొదలగువాటిని జలములయందు, మిగిలిన దేహమును పృథి వియందు విలీనము చేయవలెను.
పలుకులతో బాటుగా వాగింద్రియమును అగ్నియందు, పట్టుకోనుట మొదలగు పనులతో బాటుగా చేతులను ఇంద్రునియందు, నడకతో బాటుగా కాళ్లను కాలస్వరూపుడగు విష్ణువునందు, ప్రీతితో బాటుగా జన నేంద్రియమును ప్రజాపతియందు విలీనము (భావన) చేయవలెను.
ఆయా ఇంద్రియశక్తులను వాటి వాటి అనుగ్రాహక దేవతలయందు విలీనమగుటను సాధకుడు భావన చేయవలెను. విసర్జనేంద్రియమును విసర్జనక్రియను మృత్యుదేవతయందు, శ్రోత్రేంద్రియమును శబ్దముతో సహా దిక్కులయందు, స్పర్శేంద్రియమును చర్మమును వాయువునందు విలీనము చేయవలెను
ఓ ధర్మరాజా! రూపములను కన్నుతో సహా సూర్యునియందు, రసనేంద్రియమును అధిదేవతయగు వరుణునితో (మనస్సును ఆకర్షించే రుచులతో) సహా జలములయందు, ఘాజేంద్రియమును ఆఘ్రాణించబడే గంధములతో సహా పృథివియందు విలీనము చేయవలెను.
కామనలతో సహా మనస్సును చంద్రునియందు, తెలియబడే విషయములతో సహా బుద్దినీ సర్వోత్కృష్టుడగు బ్రహ్మగారియందు, అహంకారముతో సహా క్రియలను రుద్రునియందు, సత్త్వగుణకార్యమగు ప్రకాశముతో సహా చిత్తమును క్షేత్రజ్ఞుని (జీవుని) యందు, సత్త్వరజస్తమోగుణములతో సహా వికారములు కలవానివలె కన్పట్టే జీవుని పరబ్రహ్మయందు విలీనము చేయవలెను.
పృథివీ తత్త్వమును జలములయందు, జలములను అగ్నియందు, అగ్నిని వాయువునందు, వాయువును ఆకాశమునందు, ఆకాశమును వాస్తవముగా వికారములు లేని జీవునియందు, జీవుని మహత్తత్త్వము నందు (మహదభిమానియగు హిరణ్యగర్భునియందు), మహత్తును మూల ప్రకృతియందు, మూలప్రకృతిని కాలాతీతమైన పరబ్రహ్మయందు విలీనము చేయవలెను.
ఈ విధముగా తన స్వరూపమునందలి అనాత్మలనన్నింటినీ నిషేధించగా మిగిలేది శుద్ధచైతన్యస్వరూపమగు ఆత్మయే. అది వినాశము లేని పరబ్రహ్మకంటె భిన్నము కాదు అనియు, దానియందు రెండవది లేదనియు తెలుసుకొని, తరువాత ఆ వానప్రస్థుడు, ఇంధనమును తగులబెట్టిన అగ్నివలె, సర్వకృత్యములనుండి విరమించును.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో బ్రహ్మచర్య-వానప్రస్థ ధర్మములను వర్ణించే పన్నెండవ అధ్యాయము ముగిసినది (12).
