శ్రీ మద్భాగవతము - సప్తమ (7వ) స్కందము

Table of Contents

4 - ప్రహ్లాదుని చరితము - ప్రహ్లాదుని గుణములను వర్ణించుట

తరువాత హిరణ్యకశిపుని తపస్సుచే ప్రీతిని పొందిన బ్రహ్మగారు ఆతడీ విధముగా కోరగా, మిక్కిలి దుర్లభములైన ఆ వరములను ఆతనికి ఇచ్చెను.

వత్సా! నీవు నానుండి కోరిన వరములు మానవులకు పొంద శక్యము కానివి. ఓయీ! అయినప్పటికీ, నీకా వరములనిచ్చుచున్నాను.

తరువాత, బ్రహ్మదేవుడు రాక్షసశ్రేష్ఠుడగు హిరణ్యకశిపుని పూజల నందుకొని, ప్రజాపతులు స్తుతించుచుండగా వెళ్లాను. సర్వసమర్థుడగు ఆయన అనుగ్రహము అమోఘమైనది.

ఈ విధముగా వరములను పొందిన ఆ రాక్షసుని శరీరము బంగా రము వలె మెరిసిపోయేను. ఆతడు తన సోదరుని వధను గుర్తు చేసుకొని, శ్రీహరి భగవానునియందు ద్వేషమును కలిగియుండెను.

జగత్తును జయించిన ఆ గొప్ప రాక్షసుడు సకలదిక్కులను, మూడు లోకములను, దేవతలు రాక్షసులు మానవుల నాయకులను, గంధ ర్వులను, గరుడులను, నాగులను, సిద్దులను, చారణులను, విద్యాధరుల ను, మహర్షులను, పితృదేవతల నాయకులను, మనువులను, యక్షులు రాక్షసులు పిశాచముల నాయకులను, ప్రేతములు భూతముల నాయకుల ను, మరియు సకలప్రాణుల అధిపతులను జయించి తన అధీనములో నుంచుకోని, లోకపాలకుల స్థానములను వారి శక్తులతో బాటుగా లాగుకొనెను.

దేవతల ఉద్యానముతో శోభిల్లే స్వర్గమునకు హిరణ్యకశిపుడు అధి పతి ఆయెను. సాక్షాత్తుగా విశ్వకర్మ నిర్మించిన మహేంద్రభవనములో ఆతడు నివసించెను. ముల్లోకములకు చెందిన సకలసంపదలు ఆ భవన ములో ఉన్నవి.

ఆ భవనమునందలి మెట్లు పగడములతోను, నేలలు గొప్ప పచ్చ లతోను, గోడలు స్పటికములతోను, స్తంభముల వరుసలు వైడూర్యరత్న ములతోను పొదగబడెను.

అక్కడ రంగురంగుల మేలుకట్టులు, పద్మరాగమణుల ఆసనము లు ఉండేను. పాల నురుగును పోలియుండే శయ్యలపై ముత్యాల హార ములే పైన కప్పే వస్త్రములాయేను.

అందమైన పలువరుసలు గల దేవతాస్త్రీలు ఇటునటు నడచుచుం డగా వారి కాలియందెలు మధురమగు ధ్వనులను చేయుచుండును. వారు రత్నముల నేలలయందు తమ అందమగు ముఖమును చూచుకొనెదరు.

గొప్ప బలశాలియగు హిరణ్యకశిపుడు చాల స్వాభిమానము గల వాడు. ఆతడు ముల్లోకములను జయించి ఏకచ్ఛత్రాధిపతియై పాలించెను. ఆతని మీక్కిలి కఠినమగు శాసనముచే అధికమగు తాపమును పొందిన దేవతలు, గంధర్వులు మొదలగువారు ఆతని రెండు కాళ్లకు నమస్కరిం చుచుందురు. ఆ విధముగా ఆతడా మహేంద్రుని భవనములో రమించెను.

ఓ రాజా! ఆ హిరణ్యకశిపుడు తీవ్రమగు గంధము గల మద్య మును సేవించి మత్తెక్కి కన్నులను గిరగిర త్రిప్పుచుండగా, త్రిమూర్తులను మినహాయించి లోకపాలకులందరు చేతులలో బహుమానములను పట్టు కొని ఆతనిని సేవించిరి. ఆతడు తపోయోగమునకు, శరీర మనోబలము లకు నిధానముగా ఉండెను.

ఓ ధర్మరాజా! స్వశక్తిచే మహేంద్రుని సింహాసనమునధిష్టించిన హిరణ్యకశిపుని మహిమను విశ్వావసువు, తుంబురుడు, నావంటి వారలు గానము చేసిరి. గంధర్వులు, సిద్ధులు, మహర్షులు, విద్యాధరులు, అప్సర సలు కూడ ఆతనిని పలుమార్లు స్తుతించిరి.

వర్ణములు, ఆశ్రమముల జనులు అధికమగు దక్షిణలు గల క్రతువు లచే ఆ హిరణ్యకశిపునే ఆరాధించగా, ఆతడు తన శక్తిచే హవిర్భాగము లను స్వీకరించెను.

ఆతని పాలనలో భూమి దున్నకుండానే పంటలు పండెను. స్వర్గము కోరికలనన్నింటినీ ఈడేర్చెను. అంతరిక్షము అనేకములైన అద్భు తవస్తువులకు నిలయమాయెను.

ఉప్పునీరు, ఆసవము, నేయి, తేనె, పెరుగు, పాలు, తియ్యని నీరు గల సముద్రములు, వాటిలోకి ప్రవహించే నదులు కూడ తమ తరంగ ములతో రత్నములను గుట్టలను మోసుకు వచ్చినవి.

పర్వతములు తమ లోయలతో వానికి ఆటల మైదానములను సమకూర్చినవి. చెట్లు అన్ని ఋతువులయందు పూలు, పళ్లు మొదలగువా టిని సమర్పించినవి. ఆతడొక్కడే వేర్వేరు లోకపాలకుల గుణములనన్నిం టినీ తనయందు కలిగి యుండెను.

ఆతడు దిక్కులను జయించి ఏకచ్ఛత్రాధిపతి అయినాడే గాని, తన ఇంద్రియములను జయించలేదు. ఆతడీ విధముగా తనకు అభీష్టము లైన ఇంద్రియభోగములను తన ఇచ్చవచ్చినట్లుగా అనుభవించెను. అయి, ననూ, ఆతనికి తృప్తి కలుగలేదు.

బ్రహ్మర్షులగు సనకాదుల శాపమును పొందిన హిరణ్యకశిపుడు ఈ విధముగా ఐశ్వర్యముచే మదించి గర్వించి శాస్త్రమర్యాదను ఉల్లం ఘించి ప్రవర్తించుచుండగా, చాల కాలము గడిచి పోయెను.

వాని కఠోరమగు శాసనముచే లోకపాలకులతో సహా సకలజనులు చాల భయపడిరి. వారికి మరియొకని వద్ద శరణు లభించలేదు. అపుడు వారు శ్రీహరిని శరణు వేడిరి.

సకలప్రాణులకు ఆత్మరూపుడు, సర్వేశ్వరుడు అగు శ్రీహరి నివ సించే పరమధామమునకు నమస్కారమగు గాక! శాంతస్వభావులు, పవి త్రులు, సర్వసంగపరిత్యాగులు అగు మహాత్ములు ఆ ధామమును పొంది మరలి రారు (మరల జన్మించరు).  

వారలు నిర్మలమగు తమ మనస్సులను నిగ్రహించి ఏకాగ్రము చేసి నిద్రను వీడి వాయువును మాత్రమే భక్షిస్తూ శ్రీహరిని ఈ (పై) విధ ముగా స్తుతించిరి.

మేఘగర్జనను పోలి దిక్కులలో ప్రతిధ్వనించిన ఆకాశవాణి వారికి వినవచ్చెను. ఆ వాణి సత్పురుషుల భయమును పోగొట్టునది.

ఓ గొప్ప దేవతలారా! భయపడకుడు. మీకందరికి మంగళమగు గాక! ఏలయనగా, నా దర్శనము వలన (వాక్కును వినుట వలన) ప్రాణు లకు సకలకల్యాణములు లభించును.

దితిపుత్రులలో అధముడగు ఈ హిరణ్యకశిపుని దౌర్జన్యము నాకు తెలిసినదియే. నేను అది చల్లారునట్లు చేసెదను. మీరు కొంత కాలము వేచి చూడుడు.

ఎవడైతే ఏ కాలమునందైతే దేవతలు, వేదములు, గోవులు, వేదవే త్తలు, సత్పురుషులు, మరియు ధర్మము అనువాటియందు, సోయందు కూడ అధికమగు ద్వేషమును పొందునో, అట్టి వ్యక్తి నిశ్చయముగా నశించును.

హిరణ్యకశిపుని పుత్రుడగు ప్రహ్లాదుడు వైరభావము లేని మహా త్ముడు. మిక్కిలి శాంతస్వభావుడగు ఆతనికి హిరణ్యకశిపుడు ఎప్పుడైతే ద్రోహమును చేయునో, అప్పుడు వరముల బలము ఉన్నవాడే అయిననూ, వానిని నేను సంహరించేదను.

నారదుడిట్లు పలికెను --- జగత్తునకు తండ్రియగు శ్రీహరి ఇట్లు పలుకగా, స్వర్గలోకవాసులగు దేవతల భయము తొలగిపోయెను. వారాయ నకు నమస్కరించి, హిరణ్యకశిపుడు మరణించినట్లేనని భావిస్తూ వెనుకకు మరలిరి.

             

రాక్షసరాజగు ఆ హిరణ్యకశిపునకు గొప్ప అచ్చెరువును గొలిపే నలుగురు పుత్రులు ఉండిరి. మహాత్ములను సేవించే ప్రహ్లాదుడు గుణము లచే వారిలో గొప్పవాడుగా నుండెను.

నిండా సచ్చీలము గల ప్రహ్లాదునకు వేదవేత్తల యెడల భక్తి మెండు. ఇంద్రియములను జయించిన ఆతడు సత్యమునకు కట్టుబడి యుండెడివాడు. సకలప్రాణులకు ఆతడు ఆత్మవలే గొప్ప ప్రియమును, హితమును చేసెడివాడు. అట్టి హితకారి మరియొకడు లేడు.

ఆతడు మహాత్ముల పాదములకు దాసుడు వలె నమస్కరించెడివా డు. దీనులను తండ్రి వలె ప్రేమించెడివాడు. సాటివారియందు సోదరుడు వలె స్నేహమును చూపెడివాడు. గురువుల యెడల ఈశ్వరభావనను చేసెడివాడు. ఆతనియందు చదువు, సంపద, అందము నిండా ఉండెను. పైగా ఆతడు గొప్ప వంశములో పుట్టెను. అయిననూ, ఆతనియందు అభి మానము గాని, గర్వము గాని లేవు.

ప్రహ్లాదుడు కష్టములయందు కూడ హృదయములో భయమును, కలవరపాటును పొందెడివాడు కాదు. కోరికలు లేని ఆయన, చూచిన మరియు విన్న భోగములు (ఇహపరములయందలి భోగములు) మిథ్యయని తెలుసుకొనెడివాడు. సర్వకాలములలో ఇంద్రియములు, ప్రాణము, దేహము, బుద్ధి వశములోనుండే ఆ ప్రహ్లాదుని హృదయములో కొమనలన్నియు శాంతించుటచే, ఆతడు అసుర లక్షణము (భోగపరాయణ త్వము) లేని అసురుడుగా నుండెడివాడు.  

ఓ మహారాజా! సర్వేశ్వరుడగు భగవానునియందు వలె ఆ ప్రహ్లా దునియందు మహాత్ముల గుణములు చాల గలవు. కవులు ఆ గుణములను పలుమార్లు వర్ణించుచున్నారు. మహాత్ములు వాటిని తాము కూడ అలవర చుకున్నారు. ఆ గుణములు ఈ నాటికి కూడ అంతర్ధానము కాలేదు.

ఓ మహారాజా! సత్పురుషుల గాథలను చెప్పే సభయందు శత్రు వులగు దేవతలు కూడ ప్రహ్లాదుని దృష్టాంతముగా ఉటంకించెదరు. అట్టిచో, నీవంటి అజాతశత్రువులు ఆయనను సమ్మానించెదరని వేరుగా చెప్పవలయునా?

ప్రహ్లాదునియందు లెక్కించ శక్యము కానన్ని గుణములు గలవు. వాటిని అట్లుండనిండు. ఆతని మహిమను సూచించుటకు ఒక్క విషయ మును చెప్పిన చాలును. ఆతనికి వాసుదేవ భగవానునియందు సహజసిద్ధ మగు ప్రేమ ఉండెను.

ప్రహ్లాదుడు బాల్యమునందే ఆటవస్తువులను విడిచి పెట్టి ఆ శ్రీకృ ష్ణునియందు మనస్సును లగ్నము చేసెడివాడు. ఆతడు ఇతరులకు జడుని వలె కన్పట్టెడివాడు. ఆయన బుద్ధిని శ్రీకృష్ణుడు అనే ఆకర్షణ గట్టిగా పట్టు కొనుటచే, ఆయనకు ఈ జగత్తు విభిన్ననామరూపములుగా గాక, శ్రీకృష్ణ మయముగా కన్పట్టెడిది.

ఆతడు కూర్చున్ననూ, ఇటునటు తిరుగుచున్ననూ, తినుచు న్ననూ, పరున్ననూ, నీటిని త్రాగుచున్ననూ, మాటలాడుచున్ననూ, గోవిం దునియందు పూర్తిగా లగ్నమైన మనస్సు గలవాడగుటచే, ఆయా సంగతు లను పట్టించుకొనెడివాడు కాదు. .

ప్రహ్లాదుడు ఒకప్పుడు శ్రీహరియొక్క ధ్యానముచే (శ్రీహరి నాకు దక్కలేదు అనే భావనతో) వ్యాకులమైన మనస్సుతో ఏడ్చెడివాడు. ఒక ప్పుడు ఆయననూ ధ్యానిస్తూ ఆనందముతో నవ్వెడివాడు. మరియొక ప్పుడు బిగ్గరగా కీర్తించెడివాడు.

ప్రహ్లాదుడు ఒకప్పుడు (భావనలో భగవానుని దర్శనమైనప్పుడు) నాదము చేసెడివాడు. మరియొకప్పుడు బిడియము పడకుండా నాట్యము చేసెడివాడు. ఒకప్పుడు ఆ భగవానుని భావనతో నిండి ఆయనతో ఐక్యమై ఆయన లీలలను అనుకరించెడివాడు.

ప్రహ్లాదుడు ఒకప్పుడు భావనలో భగవానుని స్పర్శను పొంది ఆ ఆనందముచే గగుర్పాటును పొంది మిన్నకుండెడివాడు. భగవానునియందలీ ఆయన భక్తి విచలితము కానిది. దానిచే ఆయనకు ఆనందము కలిగి, ఆ ఆనందముచే కన్నీరు స్రవించి, చూపు సగము మూసుకుపోయెడిది.

సర్వసంగపరిత్యాగులతోడి సంగము వలన పుణ్యకీర్తియగు శ్రీహరి పాదపద్మములను నిష్ఠతో సేవించే భాగ్యము లభించును. ఆ ప్రహ్లా దుడు అట్టి సేవచే తనకు తాను సర్వాతిశాయియగు ఆనందమును విస్త రింప జేసుకొనుటయే గాక, దుష్టులతోడి సంగముచే దీనులైయున్న ఇత రుల మనస్సునకు కూడ పలుమార్లు శాంతిని కలిగించెను.

 

ఓ మహారాజా! మహాభాగ్యశాలియగు ఆ ప్రహ్లాదుడు గొప్ప భగవ ద్భక్తుడైన మహాత్ముడు. హిరణ్యకశిపుడు అట్టి తన పుత్రునకు ద్రోహమును చేసెను.

ఓ దేవర్షీ! నీ భగవద్భక్తి అనే ప్రతము చాల గొప్పది. నీనుండి నేను ఒక విషయమును తెలియ గోరుచున్నాను. ప్రహ్లాదుడు నిర్మలస్వభా వుడు, సత్పురుషుడు. ఆతనికి తండ్రి ద్రోహము చేయుటకు కారణమేమి?

తండ్రులకు కొడుకులపై ప్రేమ మెండు. తమకు వ్యతిరేకముగా ప్రవర్తించే కొడుకులనైననూ తండ్రులు కేవలము శిక్షణనిచ్చుట కొరకు మాత్రమే కోపపడెదరు. అంతేగాని, తండ్రి శత్రువు వలె కొడుకునకు ద్రోహ మును చేయనే చేయడు.

             

ఓ మహర్షీ! తండ్రికి అనుకూలంగా ఉంటూ పెద్దలను దైవముగా భావించే సత్పురుషులైన పుత్రులకు తండ్రులు ద్రోహము చేయరని వేరుగా చెప్పవలయునా? ఓ ప్రభూ! కాని, తండ్రియగు హిరణ్యకశిపుడు పుత్రు నిపై చూపిన ద్వేషము ఆతని మరణమునకే నిమిత్త మైనది. ఈ విడ్డూరము నకు కారణమును తెలుసుకోవాలనే కుతూహలము, దీనిపై సందేహము నాకు గలవు. దానిని నీవు పోగొట్టుము.

శ్రీమద్బాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో ప్రహ్లాదచరితమునందు ప్రహ్లాదుని గుణములను వర్ణించే నాల్గవ అధ్యాయము ముగిసినది (4).