శ్రీ మద్భాగవతము - సప్తమ (7వ) స్కందము
8 - ప్రహ్లాద చరితము - నరసింహావతారము
తరువాత అసుర బాలకులందరు ఆ ప్రహ్లాదునిచే వర్ణించబడిన భక్తియోగము నిర్దోషమగుట వలన దానినే స్వీకరించిరే గాని, గురువుల బోధను సుతరాము నేర్చుకొనలేదు.
తరువాత, ఆ పిల్లల బుద్ది ఒక్క భగవానునియందు మాత్రమే స్థిరమై యుండుటను గమనించి గురుపుత్రుడు భయపడెను. ఆయన వెంటనే విషయమును ఉన్నది ఉన్నట్లుగా మహారాజునకు విన్నవించెను.
తన పుత్రుడు ఆ విధముగా దుఃఖమును కలిగించే అవిధేయతను కలిగియుండుటను ఆ రాక్షసుడు సహించలేకపోయెను. కోపముయొక్క ఆవేశములో ఆయన శరీరము వణకుచుండెను. ఆతడు తన పుత్రుని సంహరించుటకే నిశ్చయించుకొనెను.
స్వభావముచేతనే క్రూరుడైన హిరణ్యకశిపుడు వినయముతో నమ్రుడై తన యెదుట క్రింద చేతులు జోడించి నిలబడియున్న ప్రహ్లాదుని పరుషమైన వాక్కుతో తిట్టెను. మనోనిగ్రహము గల ప్రహ్లాదుడు ఆ తిట్లకు అర్హుడు కాడు. వక్రమైన పాపపు చూపుతో ప్రహ్లాదుని చూస్తూ, హిరణ్యకశిపుడు కాలితో తొక్కిన పామవలే బుసలు కొట్టుచున్నవాడై, ఇట్లు పలికెను.
ఓరీ మందబుద్దీ! నీవు వినయము లేని దుష్టుడవు, నీచుడవు. పొగరుమోతువగు నీవు వంశమును ముక్కలు చేసెదవు. నా శాసనమును ఉల్లంఘించే నిన్ను ఈనాడే యమపురికి పంపించెదను.
ఓరీ మూర్ఖుడా! నేను కోపిస్తే లోకపాలకులతో సహా ముల్లోకములు వణకిపోవును. అట్టి నా శాసనమును నిర్భయుని వలె ఏ బలముతో ఉల్లంఘించితివి?
ఓ రాజా! కేవలము నాకు మాత్రమే గాక, నీకు మరియు బలవంతులగు ఇతరులకు కూడ బలము నిశ్చయముగా ఆ శ్రీహరియే. బ్రహ్మ గారితో మొదలిడి చిన్న పెద్ద, కదిలేవి-కదలనివి అగు ప్రాణులు అన్నీ ఆయన వశములో మాత్రమే ఉన్నవి.
అట్టి ఈ ఈశ్వరుడే కాలరూపుడై ఉన్నాడు. ఆయన గొప్ప పరాక్రమముతో రెండు అడుగులలో ముల్లోకములను కొలిచినాడు. ప్రాణులలోని ఇంద్రియశక్తీ, మనశ్శక్తి, ధైర్యము, దేహశక్తి మరియు ఇంద్రియశక్తులకు అధిష్ఠానమైన ఆత్మ ఆ ఈశ్వరుడే. ఆయనే సత్త్వరజస్తమోగుణాత్మకమగు మాయాశక్తితో జగత్తును సృష్టించి, రక్షించి, ఉపసంహరించుచున్నాడు.
నీవు నీ ఈ ఆసురభావము (ద్వేషపూర్ణమగు స్వభావము) ను విడిచిపెట్టుము. మనస్సును రాగద్వేషములకు అతీతముగా సమముగా నుంచుము. అదియే మనము అనంతునకు చేసే చక్కని గొప్ప ఆరాధన. మనస్సును వశమునందుంచుకోననిచో అది తప్పు దారిలో నడచును. అట్టి మనస్సును మినహాయిస్తే, మనకు శత్రువులు వేరెవ్వరూ లేరు.
కొందరు ముందుగా తమ సర్వస్వమును హరించే బందిపోట్లు ఆర్గురుని (కామక్రోధలోభమోహమదమాత్సర్యములనే అంతశ్శత్రువులు, లేదా అయిదు జ్ఞానేంద్రియములు మరియు మనస్సు) జయించకుండా, తాము పది దిక్కులను జయించితిమని తలపోయచుందురు. మనస్సును జయించి సకలప్రాణులయెడల సమచిత్తము గల జ్ఞానియగు సత్పురుషునకు శత్రువులు ఎచటనుండి వచ్చెదరు? (శత్రువులు ఉండరు). వ్యక్తికి శత్రువులు కేవలము తన వ్యామోహము (నాది, పరాయిది అనే భేదబుద్ధి) చే మాత్రమే కలిగెదరు.
హిరణ్యకశిపుడిట్లు పలికెను --- ఓరీ మందబుద్దీ! నీవు అత్యధికముగా వదరుచున్నావు. అంటే, నీవు చావాలని నిశ్చయించుకున్నావని స్పష్టమగుచున్నది. ఎందుకంటే, చావగోరువారి నోటివెంట మాత్రమే ఇట్టి అనర్థదాయకములగు పలుకులు బయల్వెడలును. ఇది నిశ్చయము.
ఓరీ అల్పభాగ్యుడా! నాకంటె వేరే మరియొక జగన్నాథుడు గలడని నీవు చెప్పుచున్నావు. ఈతడు ఎక్కడ ఉన్నాడు? ఈతడు సర్వవ్యాపి యైనచో, ఈ స్తంభమునందు ఏల కానరాడు?
జగదీశ్వరుడనగు నేను వదరుబోతువగు నీ తలను మొండెము నుండి వేరు చేసెదను. నీవు అధికముగా ప్రేమించే నీ రక్షకుడగు ఆ శ్రీహరియే నిన్ను ఇప్పుడు రక్షించుగాక!
మహాబలశాలియగు ఆ మహారాక్షసుడు పరుషవచనములతో పలుమార్లు గొప్ప భగవద్భక్తుడగు తన పుత్రుని ఈ విధముగా పీడించెను. ఆతడు కత్తి పట్టుకొని సింహాసనమునుండి వేగముగా పైకి లేచి తన పిడికిలితో స్తంభమును కొట్టేను.
ఓ ధర్మరాజా! అదే సమయములో ఆ స్తంభమునందు మిక్కిలి భయంకరమగు ధ్వని పుట్టెను. గంగాళమువంటి బ్రహ్మాండము ఆ ధ్వనిచే పగిలినదా యనిపించెను. ఆ ధ్వని ఊర్ధ్వలోకముల వరకు చేరుకొనెను. దానిని విన్న స్వయంభువుడగు బ్రహ్మగారు మొదలగు వారు తమ తమ ధామములకు ప్రళయము వచ్చినదని తలపోసిరి.
అపూర్వము, అద్భుతము అగు ఆ ధ్వనిని విని రాక్షస సేనానాయ కులు అధికముగా భయపడిరి. పరాక్రమించి బలముతో తన పుత్రుని చంప గోరిన హిరణ్యకశిపుడు ఆ ధ్వనిని విని, సభ మధ్యలో ఆ ధ్వని పుట్టిన ఆధారమును కనుగొనలేకపోయెను.
శ్రీహరి సకల పదార్థములయందు తాను వ్యాపించియున్నానని నిరూపించి తన భక్తుని (సనకాదులు, ప్రహ్లాదుడు మరియు బ్రహ్మగారు) మాటను నిలబెట్టుటకే ఆ సభలోని స్థంభములో మిక్కిలి అద్భుతమగు రూపమును దాల్చి ప్రకటమయ్యెను. ఆ రూపము నిండా మృగము (సిం హము) కాదు, మనిషి కాదు.
ఆతడు చుట్టూ పరికించి చూస్తూ, స్తంభము మధ్యనుండి బయటకు వచ్చుచున్న ఒక విచిత్రప్రాణిని చూచి, ఇట్లు తలపోసెను -- ఆశ్చర్యము! ఇది మృగము కాదు, మనిషి కూడ కాదు. మనిషి సింహముల రూపము గల ఇది యెట్టి ప్రాణి?
ఆ మిక్కిలి భయంకరమగు ప్రాణిని గురించి ఆశ్చర్యముతో విచారించుచున్న హిరణ్యకశిపుని యెదుట శ్రీహరి నరసింహరూపముతో ప్రకటమయ్యెను. ఆ నృసింహుని కళ్లు పుటము పెట్టిన బంగారము వలె తీవ్రముగా ప్రకాశించుచుండెను. కోరలతో భయమును గొల్పుతూ ఆటోపముగానున్న దాని నోరు జూలుతో, మెడపై జుట్టుతో ప్రకాశించుచుండెను. చుర కత్తి పదును గల దాని నాలుక కత్తివలె కదలాడుచుండెను. కనుబొమలు ముడివడియున్న దాని ముఖము క్రూరముగా నుండెను. ఎత్తైన దాని చెవులు నిక్కబొడుచుకొని యుండెను. తెరుచుకొనియున్న దాని నోరు, ముక్కు పుటములు కొండ గుహలవలె ఆశ్చర్యమును గొల్పుచుండెను. విచ్చుకొనియున్న దాని దవడలు భయమును కలిగించుచుండెను. స్వర్గమును స్పృశించే దాని శరీరము మిక్కిలి పొడవు కాని బలిసిన మెడను, విశాలమైన వక్షఃస్థలమును, సన్నని నడుమును కలిగియుండెను. చంద్రకిర ణములవలె తెల్లని రోమములు దాని దేహమంతటా వ్యాపించియుండెను. వందలాది భుజముల సముదాయములు అంతటా వ్యాపించుచుండెను. గోళ్లే ఆయుధములుగా గల ఆ నరసింహుని సమీపించుట శక్యము కాకుండెను. తనదైన చక్రము మాత్రమే గాక, ఇతరములగు సకలములైన ఉత్తమమగు ఆయుధములతో ఆ నరసింహుడు దితి-దనువంశీయులగు రాక్షసులను తరిమి కొట్టెను.
బహుశః మహామాయావియగు శ్రీహరి నన్నీ విధముగా వధించే ఉపాయమును పన్నియుండును. ఈతని ఈ పెద్ద ఉద్యమముచే ఒరిగేది ఏమి గలదు? దితివంశీయులలో శ్రేష్టుడగు ఆ రాక్షసుడీ విధముగా పలికి, గదయే ఆయుధము కాగా, సింహనాదమును చేస్తూ, నరసింహస్వామి పైకి ఉరికెను. నిప్పులలో దూకిన మిడత వలె ఆ రాక్షసుడు నరసింహుని తేజస్సులో కనబడకుండ పోయెను.
సత్త్వగుణమునకు నిధానమగు శ్రీహరి విషయములో, హిరణ్యకశిపుడు ఆ విధముగా కనబడకపోవుట, విచిత్రము కాదు. ఎందుకంటే, ఆయన సృష్టి ఆరంభములో తన తేజస్సుచే ప్రళయకాలమునందలి తమస్సు (చీకటి) ను త్రాగివేసెను. ఇంతలో, ఆ మహారాక్షసుడు కోపముతో ఆ నరసింహునకు ఎదురుగా వచ్చి, అధికమగు వేగము గల గదతో కొట్టెను.
నరసింహరూపుడగు ఆ గదాధరుడైన శ్రీహరి గదతో కూడి పరాక్రమించుచున్న ఆ హిరణ్యకశిపుని, తార్క్ష్యపుత్రుడగు గరుత్మంతుడు పెద్ద పామును వలే పట్టుకొనెను. ఆటలాడుచున్న గరుత్మంతుని పట్టునుండి పాము విడిపించుకున్నట్లుగా, అపుడా రాక్షసుడు ఆయన చేతినుండి విడి పించుకొనెను.
ఓ ధర్మరాజా! హిరణ్యకశిపునిచే తమ తమ స్థానములనుండి వెళ్ల గొట్టబడిన లోకపాలకులగు దేవతలు మేఘములలో నక్కి చూచుచుండిరి. హిరణ్యకశిపుడు నరసింహుని చేతినుండి తప్పించుకొనుట వారికి నచ్చలేదు. యుద్ధములో అలసటను జయించిన ఆ మహారాక్షసుడు, తాను నరసింహుని చేతినుండి విడిపించుకొనుటచే, తన పరాక్రమమునకు ఆయన భయపడెనని తలపోసెను. ఆతడు కత్తిని, డాలును గట్టిగా పట్టుకొని మరల వేగముతో ఆయన మీదకు ఉరికెను.
ఆ రాక్షసుడు గ్రద్దయొక్క వేగమువంటి వేగము గలవాడై కత్తిని, డాలును క్రింద పైన అవకాశము లేని విధముగా త్రిప్పుతూ సంచరించుచుండెను. అపుడు నరసింహరూపియగు శ్రీహరి తీవ్రమైన పెద్ద అట్టహాసమును చేసెను. పెద్ద ధ్వనిచే భయమును గొల్పే ఆ అట్టహాసముచే వాని కన్నులు మూసుకుపోయెను. అపుడు మహావేగము గల నరసింహుడు వానిని పట్టుకొనెను.
ఇంద్రుని వజ్రపు దెబ్బలచే గాయపడని చర్మము గల హిరణ్యకశిపుడు నరసింహుని చేతిలో చిక్కి వివశుడై, అన్ని వైపులనుండియు తప్పించుకొనుటకు ప్రయత్నించుచుండగా, ఆయన వానిని పాము ఎలుకను వలె పట్టి ద్వారముపై తోడయందు పడవేసుకొనెను. ఆయన వానిని, గరుడుడు మహావిషము గల సర్పమును వలే, గోళ్లతో అవలీలగా చీల్చివేసెను.
కోపించిన నరసింహుని భయంకరమగు కన్నులు చూడ శక్యము కాకుండెను. ఆయన నోటిని తెరిచి తన నాలుకతో నోటి కొనలను ఆస్వాదించుచుండెను. రక్తపు బిందువులతో ఆయన ముఖము, జూలు తడిసి యుండెను. ఏనుగును చంపి దాని ప్రేవులను మెడలో మాలగా దాల్చిన సింహము వలె ఆయన భాసించెను.
దండములవంటి భుజముల సమూహములు గల నరసింహుడు గోళ్ల కొనలతో వాని పద్మమును బోలిన గుండెకాయను పెరికివేసి, వానిని ప్రక్కన పారవైచెను. వాని అనుచరులు, ఇతరులగు వాని పక్షమువారు ఆయుధములనెత్తి ఆయన మీదకు వచ్చిరి. ఆయన వారిని అన్ని వైపులా వేల సంఖ్యలో గోళ్లు అనే ఆయుధములతో మరియు కాలి మడమలతో సంహరించేను.
ఆయన జూలు విసురులకు మేఘములు చెల్లాచెదరైనవి. ఆయన కన్నుల కాంతి ముందు గ్రహములు కూడ వెలవెల బోయినవి. ఆయన శ్వాసవేగమునకు సముద్రములు కలిచివేయబడినవి. దిగ్గజములు ఆయన సింహనాదమునకు భయపడి ఆక్రోశించినవి.
ఆయన జూలు విసిరికొట్టబడిన విమానములతో రద్దీగానున్న ద్యులోకము అధికముగా అల్లల్లాడెను. ఆయన కాలిచే తొక్కబడిన భూమి ఆ బరువునకు చాల పీడను పొందెను. ఆయన వేగమునకు పర్వతములు ఎగురజొచ్చెను. ఆయన తేజస్సు ముందు ఆకాశము, దిక్కులు వెలవెలబోయెను.
తరువాత నరసింహునకు ఎదురుగా నిలబడే ప్రతిపక్షి కానరాలేదు. నిండు కాంతి గల ఆయన సభలో మిక్కిలి ఎత్తైన రాజసింహాసనముపై కూర్చుండెను. ఉగ్రమైన ముఖముతో మిక్కిలి భయమును గొల్పే ఆ విభుని వద్దకు సేవించుటకై ఎవ్వరైననూ వెళ్లలేదు.
ముల్లోకములకు తలపోటుగా తయారైన ఆ దితి పెద్దకొడుకును యుద్దములో నరసింహుడు సంహరించగా చూచిన దేవతాస్త్రీలు గొప్ప హర్షముతో వికసించిన ముఖములు గలవారై, పలుమార్లు పూలవానలను కురిపించిరి.
అప్పుడు ఆ దృశ్యమును చూడగోరి వచ్చిన దేవతల విమానములతో ఆకాశమంతా రద్దీగా ఆయెను. తరువాత దేవతల నగారాలు, దుందుభులు మ్రోగినవి. గంధర్వప్రముఖులు నాట్యమాడగా దేవతాస్త్రీలు పాడిరి.
వత్సా! బ్రహ్మగారు ఇంద్రుడు రుద్రుడు మొదలైన దేవతలు, మహర్షులు, పితృదేవతలు, సిద్ధులు, విద్యాధరులు, గొప్ప నాగులు, మనువులు, ప్రజాపతులు, గంధర్వులు, అప్సరసలు, చోరణులు, యక్షులు, కింపురుషులు, వేతాళురు, సిద్ధులైన కిన్నరులు, సునందుడు కుముదుడు మొదలైన ప్రసిద్ధులైన విష్ణుకింకరులు అందరు అచటకు వచ్చిరి. వారు సహించ శక్యము కాని తేజస్సుతో కూర్చునియున్న నరసింహునకు మరీ దూరము కాకుండా కొంచెము దగ్గరగా తలపై చేతులను జోడించి నిలబడి విడివిడిగా ఆయనను స్తుతించిరి.
బ్రహ్మగారు ఇట్లు పలికెను --- దేశకాలవస్తుపరిచ్చేదములు లేని శ్రీహరి శక్తులు అనంతములు. పావనము చేసే లీలలు గల ఆయన ప్రభావములు ఆశ్చర్యమును గొల్పును. ఆయన తన లీలచే సత్త్వరజస్తమోగుణాత్మకమగు ప్రకృతి ద్వారా జగత్తుయొక్క సృష్టిస్థితిలయములను చక్కగా చేయుచున్నాడు. వినాశము లేని స్వరూపము గల ఆ శ్రీహరి కొరకు నమస్కరించుచున్నాను.
శ్రీరుద్రుడిట్లు పలికెను --- నీకు కోపము వచ్చిన కాలము ప్రళయకాలమే. అల్పుడగు ఈ అసురుడు సంహరించబడినాడు. వాని పుత్రుడగు ఈ ప్రహ్లాదుడు నీ భక్తుడు, నిన్ను శరణు పొందినాడు. భక్తులయందు ప్రేమ గల ఓ శ్రీహరీ! వీనిని రక్షించుము.
ఇంద్రుడు ఇట్లు పలికెను --- ఓ పరమేశ్వరా! మమ్ములను రక్షించే నీవు మా యజ్ఞభాగములను తిరిగి మాకు అప్పగించితివి. మా హృదయములో నీవే ఉన్నాను. కాని, ఇంతవరకు నిరంతరమగు ఆ రాక్షసుని తలపుచే మా హృదయపద్మము ముడుచుకుపోయినది. దానిని మరల నీవు వికసింప జేసినావు. ఆశ్చర్యము! ఓ నాథా! నరసింహా! కాలముచే కబళించివేయబడే ఈ జగత్తు ఎంతటిది? నిన్ను సేవించువారలకు మోక్షమునందు కూడ పెద్ద ఆదరము ఉండదు. ఇక మిగిలినవాటిపై ఆదర ముండదని వేరుగా చెప్పవలయునా?
మహర్షులిట్లు పలికిరి --- శరణు పొందదగిన ఓ రక్షకుడా! పూర్ణ చైతన్యస్వరూపుడవగు నీవే జగత్కారణము. నీవు మాకు సర్వోత్కృష్టమైన తపస్సును ఉపదేశించితివి. ధ్యానరూపమగు ఆ తపస్సు నీ తేజస్సే. దాని ప్రభావముచేతనే నీవు నీయందు విలీనమైయున్న ఈ జగత్తును ప్రకటము చేసితివి. అట్టి తపస్సు ఈనాడు వీని కారణముగా లుప్తమైపోయినది. నీవు మరల మమ్ములను రక్షించుటకై ఈ రూపమును స్వీకరించి, మరల తపస్సు చేయుటకు అనుమతినిచ్చితివి.
పితృదేవతలు ఇట్లు పలికిరి --- మాకు మా సంతానము శ్రాద్ధము నందర్పించే పిండాదులను ఆ రాక్షసుడే బలాత్కారముగా అధిపతియై భుజించెడివాడు. పైగా వారు స్నానసమయములో సమర్పించిన నువ్వుల తోడి నీటిని కూడ ఆతడే త్రాగెడివాడు. సకలధర్మములను రక్షించే నరసింహుడు వాని పొట్టలోని వప (పలుచని చర్మము) ను గోళ్లతో చీల్చి ఆ పిండాదులను మా కొరకు తీసుకువచ్చినాడు. అట్టి నరసింహునకు నమ స్కారము.
సిద్దులు ఇట్లు పలికిరి --- మేము యోగసాధనచే కొన్ని సిద్దులను పొందియుంటిమి. దుష్టుడగు ఆ హిరణ్యకశిపుడు యోగసాధనను తపస్సును చేసి శక్తిని సంపాదించి, దానితో మా సిద్దులను ఊడలాగెను. అనేక విధములుగా గర్వించియున్న ఆ రాక్షసుని నీవు గోళ్లతో ముక్కముక్కలుగా చీల్చితివి. ఓ నరసింహా! అట్టి నిన్ను మేము నమస్కరించుచున్నాము.
విద్యాధరులు ఇట్లు పలికిరి --- మేము పలువిధములుగా మనస్సును నియంత్రించి అంతర్దానశక్తి మొదలగు విద్యలను సంపాదించితిమి. అజ్ఞానియగు హిరణ్యకశిపుడు బలపరాక్రమములచే గర్వించి మా విద్యను ప్రతిషేధించెను. మాయాశక్తిచే నరసింహరూపమును దాల్చి శ్రీహరి వానిని యుద్దములో పశువును వలె సంహరించెను. మేము నిత్యము ఆ శ్రీహరికి నమస్కరించుచున్నాము.
నాగులు ఇట్లు పలికిరి --- ఓ నరసింహా! ఈ పాపి మా పడగల యందలి రత్నములను మాత్రమే గాక, మా గొప్ప యువతులను కూడ అపహరించినాడు. నీవు. వాని రొమ్మును పగులగొట్టి ఈ యువతులకు ఆనందమును కలుగజేసితివి. నీకు నమస్కారమగుగాక!
మనువులు ఇట్లు పలికిరి --- ఓ దేవా! మేము నీ ఆదేశమును పాలించే మనువులము. దితిపుత్రుడగు ఈ హిరణ్యకశిపుడు మేము ఏర్పర చిన ధర్మమర్యాదలను పూర్తిగా ఉల్లంఘించినాడు. ఓ ప్రభూ! ఆ దుష్టుని నీవు సంహరించితివి. మేము నీకు ఏమి చేయదగును? సేవకులమగు మమ్ములను శాసించుము.
ప్రజాపతులు ఇట్లు పలికిరి --- ఓ పరమేశ్వరా! ప్రజాపతులమగు మమ్ములను నీవు సృష్టించితివి. కాని, మమ్ములను సృష్టి చేయకుండగా ఈ రాక్షసుడు నిషేధించుటచే మేము ప్రాణులను సృష్టించుటలేదు. అట్టి వీనిని నీవు నిశ్చయముగా వక్షఃస్థలమును పగులగొట్టి సంహరించితివి. నీ రూపము సత్త్వగుణప్రధానమైనది. నీ అవతారము జగత్తునకు మంగళ మును చేకూర్చును.
గంధర్వులు ఇట్లు పలికిరి --- ఓ ప్రభూ! మేము నీ యెదుట నాట్యమును గానమును చేసే నటులము. కాని, ఈ హిరణ్యకశిపుడు తన వీరలక్షణముతో మరియు బలపరాక్రమములతో మమ్ములను తన అధీన ములో నుంచుకొనినాడు. అట్టివానికి నీవీ దశను కలిగించితివి. తప్పుదారి యందు నడచువాడు క్షేమమునకు అర్హుడగునా? (కాడు)
చారణులు ఇట్లు పలికిరి --- ఓ శ్రీహరీ! మేము సంసారమునుండి విముక్తిని కలిగించే నీ పాదపద్మమును ఆశ్రయించితిమి. ఎందుకంటే, సత్పురుషుల హృదయములో భయమును కలిగించే ఈ రాక్షసుని నీవు సంహరించినావు.
యక్షులు ఇట్లు పలికిరి --- ఓ నరసింహా! మూలప్రకృతి, మహత్తత్వము (సమష్టి బుద్ధిశక్తి), సమష్టి అహంకారము, శబ్దస్పర్శరూపరసగంధములనే అయిదు తన్మాత్రలు, వాక్పాణిపాదపాయూపస్థములనే అయిదు కర్మేంద్రియములు, శ్రోత్రత్వజ్నేత్రజిహ్వాఘాణములనే అయిదు జ్ఞానేంద్రియములు, సమష్టి-అంతఃకరణము, పృథివ్య పేజోవాయ్వాకాశములనే అయిదు మహాభూతములు, వెరసి ఈ ఇరవై నాలుగు తత్త్వములకు సత్తా (ఉనికి)-స్పూర్త (ప్రకాశము) లను అనుగ్రహించే చైతన్యస్వరూపుడవు నీవే. మేము మనోహరములైన కర్మలననుష్ఠించి నీ అనుచరులలో ప్రము ఖులమైనాము. అట్టి మమ్ములను ఈ కాలములో దితిపుత్రుడగు హిరణ్యక శిపుడు పల్లకీ మొదలగు బరువులను మోసే పనికి కుదిర్చినాడు. ఆతడు జనులకు కలిగించిన పీడ నీకు తెలిసినదియే. కావుననే, నీవాతనిని సంహ రించితివి.
కింపురుషులు ఇట్లు పలికిరి --- మేము అల్పజీవులమగు కింపురుషులము. నీవైతే పురుషోత్తముడవగు ఈశ్వరుడవు. ఏ కాలమునందైతే సత్పురుషులు ఈ దుష్టవ్యక్తిని నిందించినారో, అప్పుడే వీని ఆయువు మూడినది.
వైతాళికులు (తాళముతో పాటలను పాడువారు) ఇట్లు పలికిరి --- ఓ భగవానుడా! మేము సభలలో మరియు యజ్ఞములలో నీ స్వచ్చమగు కీర్తిని గానము చేసి గొప్ప మానమర్యాదలనందుకొనుచుంటిమి. రోగము వలె పీడను కలిగించే పరమదుష్టుడగు ఈ రాక్షసుడు ఆ మానమర్యాదలకు అడ్డు పడినాడు. దైవమగు నీవు వీనిని సంహరించితివి.
కిన్నరులు ఇట్లు పలికిరి --- ఓ ఈశ్వరా! కిన్నరగణముల వారమగు మేము నీ అనుచరులము. దితిపుత్రుడగు ఈ హిరణ్యకశిపుడు మాచే వెట్టి చాకిరీ చేయించినాడు. ఓ శ్రీహరీ! ఆ పాపిని నీవు మట్టు బెట్టితివి. ఓ నరసింహ ప్రభూ! మాకు సమృద్ధిని కలిగించుము.
విష్ణువుయొక్క అనుచరులు ఇట్లు పలికిరి --- శరణునొసగే ఓ ఈశ్వరా! ఈనాడు మాకు నీ ఈ అద్బుతమగు నరసింహరూపము కనబడినది. ఈ రూపము సకలలోకములకు సుఖకరము. ఈ రాక్షసుడు నీ కింకరుడే. సనకాదుల శాపముచే రాక్షసుడైనాడు. ఆతని ఈ మృత్యువు ఆతనికి అనుగ్రహమేనని మాకు తెలియును.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో ప్రహ్లాదచరితమునందు నరసింహావతారమును వర్ణించే ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (8).
