నారద మహా పురాణము
77 - నర్మదా తీర్థ మహాత్మ్యమ్
మోహిని పలికెను :-
ఓ బ్రాహ్మణోత్తమా ! నేను ఉత్తమమగు సేతు మాహాత్మ్యమును వింటిని. ఇపుడు నర్మదాతీర్థ సంగ్రహమును వినగోరుచున్నాను.
వసురువాచ : -
వసువు పలికెను :-
ఓ మోహినీ ! చెప్పెదను వినుము. నర్మదానదికి రెండు తీరములందు నాలుగు వందల తీర్థములు కలవు. ఉత్తరతీరమున పదకొండు, దక్షిణ తీరమున ముప్పది, రేవా సాగర సంగమమున ముప్పది యైదు. చుట్టూ ఓంకార తీర్థము. అమర కంటక పర్వతమునకు క్రోశద్వయమున అన్ని దిక్కులలో సార్థకోటిత్రయి కలదు. కపిలాసంగమమున ఒకకోటి తీర్థములు కలవు. అశోకవనికయందు లక్ష తీర్థములు కలవు. అంగార గర్తము నందు నూరు, కుఱ్ఱయందు పదివేలు, వాయు సంగమమున సహస్రము, సరస్వతి యందు నూరు, శుక్ల తీర్థమున రెండొందలు, విష్ణుతీర్థమున వేయి, మాహిష్మతియందు వేయి, శూల భేదమున పదివేలు, దేవగ్రామమున వేయి ఉలూకమున ఏడొందలు, మణి నదీ సంగమమున నూట ఎనిమిది, వైద్య నాధమున ఘటేశ్వరమున కూడా అన్నియు రేవాసాగర సంగమమున సార్థ లక్ష తీర్థములు ఎనుబది ఎనిమిది వేలు, వ్యాస తీర్థమున ద్వీప శతకము, కరంజా సంగమమున పదివేల ఎనిమిది, ఏరండీ సంగమమున నూట ఎనిమిది, ధూత పాపమున అరువది యెనిమిది, కోకిరమున సార్ధకోటి, రోమ కేశమున సహస్రము ద్వాదశార్కమున సహస్రము, లక్షాష్టక మున రెండు వేలు, " శుక్ల తీర్థమున సర్వసంగమములందు నూటా ఎనిమిది, కావేరీ సంగమమున అయిదొందలు, భృగు క్షేత్రమున కోటి తీర్థములు భార భూతియందు నూట ఎనిమిది. ఆమ్రరేశమున సార్థశతము, విమలేశమున లక్ష తీర్థములు కలవు. ఇట్లు నార్మదమున సార్థకోటి తీర్థములు కలవు. దశాదిత్య తీర్థమున తొమ్మిది, కపిల తీర్థమున ఎనిమిది, నంది తీర్థమున కోటి ఎనిమిది, నాగాగ్నిసిద్ధా వర్తములు ఏడు, కేదారేంద్రియ వాగీశ నంది దైవతకములు అయిదు, యమేశ వైద్య నాధులు, వామనాంగార కేశ్వరులు సారస్వతులు మునీన్తులు దాంకేశులు గౌతములు, నలుగురు విమలేశ్వరులు మువ్వురు, సహస్ర యజ్ఞ భీష్మేశులు, స్వర్ణతీర్థములు, దౌతపాపకరం జేశులు ఋణముక్తి గుహసంజ్ఞకములు. దశాశ్వమేధము, నంద, మన్మధేశము, భార్గవము, పరాశరయోని సంజ్ఞము, వ్యాసాఖ్యపితృనందికలు, గోపీశ మారుతేశాఖ్యములు, జంగలేశాఖ్య శుక్లకము, అక్షరేశము, పిప్పలేశము, మాండవ్య దీపకేశ్వరము, ఉత్తరేశము, అశోకేశము, యోధనేశము, రౌహిణము, ద్విసంఖ్యాకమగు లంకేశము ప్రత్యేకముగా చెప్పబడినవి. ఇవి మొత్తము పందొమ్మిదొందలు విడి విడిగా ఒక్కొక్కటి పుణ్యప్రదము. స్తబకములందున్న తీర్థములు రెండు వందల పదునాలుగు. ఇవన్నియు శైవతీర్థములు. వైష్ణవ తీర్థములు ఇరువది రెండు. అన్నియూ బ్రహ్మతీర్థములే. శాక్త తీర్థములు ఇరువది యెనిమిది. వీటిలో మాతృదేవతలవి మూడు సరస్వతివి లక్ష్మివి రెండు, మిగిలిన పదునారుపార్వతీ తీర్థములు. ఇట్లే ఒకటి క్షేత్ర పాలతీర్థము కలదు. ఇచట అవాంతర తీర్థములు రహస్య తీర్థములు, ప్రకాశ తీర్థములు అన్నియూ కలిసి మూడు కోట్ల యాబధి లక్షలని వాయుదేవుడు చెప్పియున్నాడు. స్వర్గమున భూలోకమున అంతరిక్షమున కల తీర్థములన్నియూ ఇచట కలవు. ఈ తీర్థములలో ఏ దో ఒక తీర్థమున స్నానమాడిన పరిశుద్దుడు ఉత్తమగతిని పొందును. నర్మదా తీరమున చేసిన దంతయూ అక్షయమగును. సరస్వతీ జలము మూడు దినములలో యమునా జలము ఏడు దినములలో, ఒక స్నానముచే గంగా జలము, దర్శన మాత్రముననే నర్మదా జలము పావనము చేయును. ఇట్లు నీకు నర్మదా తీర్థ సంగ్రహమును చెప్పితిని. ఈ తీర్థ సంగ్రహమును లిఖించి నిత్యము పూజించి ఇంటిలో మారీ అగ్ని, రాజ చోర శత్రు రోగ భయములు కలుగవు. ఆ గృహము నిరంతరము ధన ధాన్య సమృద్ధికలిగి యుండును. పుత్ర పౌత్రులతో వివాహాది శుభకార్యములచే నిరంతరము శోభిల్లు చుండును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున నర్మదాతీర్థ మాహాత్మ్యమను డెబ్బది యేడవ అధ్యాయము.
Summary of chapter 204 of the Nārada Mahā Purana is as follows:
శ్రీ నారద మహాపురాణము మొదలైన పవిత్ర మహాపురాణ గ్రంథములను లిఖించి, సద్భక్తులకు దానము చేయుట వలన లభించే అక్షయమైన పుణ్యఫలము ఈ అధ్యాయంలో అభివర్ణించబడినది. పురాణ దానము వలన విష్ణులోక ప్రాప్తి సిద్ధించునని వివరింపబడినది.