నారద మహా పురాణము
95 - వాయుపురాణానుక్రమణి నిరూపణమ్
బ్రహ్మ పలికెను :-
ఓ బ్రాహ్మణోత్తమా! శివలోకమును ప్రసాదించు వాయు పురాణమును చెప్పేదను వినుము. ఈ వాయు పురాణము ఇరువది నాలుగువేల శ్లోకములు కలది. ఇచట వాయువు శ్వేత కల్ప ప్రసంగముతో ధర్మములను చెప్పెను. కావున దీనిని వాయు పురాణమందురు. రెండు భాగములు కలిగియున్నది. ఈ పురాణమున సవిస్తరముగా సర్గాది లక్షణములు చెప్పబడినవి. మన్వంతరములందు వంశములు, గయాసుర వధ, మాస మాహాత్మ్యములు, మాఘమాస వైశిష్ట్యము, దాన ధర్మములు, రాజ ధర్మములు, భూపాతాళ దిగ్వ్యోమ చారుల నిర్ణయములు, వ్రతాదులు పూర్వభాగమున వర్ణించబడినవి. ఇక ఉత్తరభాగమున నర్మదా తీర్థ వర్ణనము, శివ సంహితా, సర్వదేవతలకు తెలియశక్యము కాని శివుడు సర్వాత్మనా నర్మదాతీరమున నుండుట, ఈ నర్మదా జలమే బ్రహ్మ, విష్ణువు రుద్రుడు, నిరాకార బ్రహ్మ, కైవల్యము, లోకహితము కొఱకు శివుడు తన శరీరము నుండి నదీ రూపమగు ఒకానొక శక్తిని నర్మదా రూపముగా నవతరింప చేసెను. నర్మదానదీ ఉత్తర తీరప్రాంతమున నుండు వారు శివానుచరులు, దక్షిణ తీరమున నుండువారు విష్ణులోకమును చేరెదరు. ఓంకారేశ్వరము మొదలు పశ్చిమ సముద్రము వరకు ముప్పది అయిదు నదుల సంగమములు సర్వపాప నాశకములు, ఉత్తర తీరమున పదకొండు, దక్షిణ తీరమున ఇరువది మూడు, ముప్పది అయిదవది రేవాసాగర సంగమము, రేవా తీర ద్వయమున సంగమములతో కలిసియున్నవే ప్రసిద్ధములగు తీర్థములు నాలుగు వందలు కలవు. అరువది వేల తీర్ధములు, అరువది కోట్ల తీర్థములు ఇతరములు రేవా తీరమున అడగడుగున కలవు. ఇట్లు వాయువుచే కీర్తించబడిన నర్మదా చరితము కల పరమాత్మయగు శివుని సంహిత పరమ పావనమైనది. అని చెప్పబడెను. ఈ పురాణమును వ్రాసి గుడధేను సమన్వితముగా శ్రావణ పూర్ణిమనాడు కుటుంబియగు బ్రాహ్మణునకు దానము చేసిన వారు పదునాలుగు ఇంద్రుల కాలము రుద్ర లోకమున నివసించును. ఈ వాయు పురాణమును హవిస్సును మాత్రమే భుజించుచు నియమ బద్దముగా వినువాడు చెప్పువాడు రుద్రుడే యగును. సంశయముతో పనిలేదు. ఈ వాయుపురాణాను క్రమణిని వినిపించినవాడు, వినినవాడు సర్వపురాణ శ్రవణ ఫలమును పొందును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్థపాదమున వాయుపురాణ అనుక్రమణీ కథనమను తొంబదియైదవ అధ్యాయము
Summary of chapter 97 of the Nārada Mahā Purana is as follows:
శ్రీరాధాకృష్ణుల నిత్య రాసలీలా విలాస భూమియైన బృందావన క్షత్ర మహిమ ఈ అధ్యాయంలో పరమ భక్తితో వర్ణించబడినది. బృందావన ధూళి స్పర్శ మరియు తులసీ వన దర్శనము వలన లభించే దివ్య ప్రేమభక్తి ఇక్కడ అభివర్ణించబడినది.