నారద మహా పురాణము
31 - యమదూతకృత్యనిరూపణమ్
ఓ మునిశ్రేష్టా! మీరు చక్కగా వర్ణాశ్రమవిధిని వివరించితిరి. ఇపుడు దుర్గమమైన యమమార్గమును వినగోరుచున్నాను.
సనక మహర్షి పలికెను :- పుణ్యశీలురకు సుఖమునిచ్చునది, పాపులకు భయమును కలిగించునది దుర్గమమైన యమమార్గమును చెప్పెదను వినుము. ఓ మునీశ్వరా ! యమలోకమార్గము ఎనుబది యారు వేల యోజన విస్తారము అని జ్ఞానులు చెప్పియున్నారు. దానశీలురైన మానవులు సుఖముగా వెళ్లేదరు. ధర్మ శూన్యులగు నరులు దుఃఖములచే పీడించబడుచు వెళ్ళెదరు. యమమార్గమున పాపులు మిక్కిలి భయముచే వివస్త్రులై తడారిన గొంతు పెదవులు కలవారై వీకృతముగా ఆరచుచు దీనులై వెళ్ళెదరు. యమభటులచే కొరడాలతో అంకుశములచే కొట్టబడుచు, ఇటునటు పరుగెత్తుచు దుఃఖముచే ఆ మార్గమున నడిచేదరు. ఒకచోట బురద, ఒకచోట అగ్ని, ఒకచోట బాగుగా కాగియున్న ఇసుక, ఒకచోట దావాగ్ని, నిశిత ధారలు గల శిలలు ఒకచోట, ఒకచోట ముళ్ళచెట్లు, దుఃఖముచే ఎక్కదగని రాళ్ళుగల పర్వతములు, కటిక చీకటిగల గుహాలు, మార్గమంతయు కంటకొవృతము, కోటబురుజులు ఎక్కుట, లోయలలో చొరబడుట, గులకరాళ్ళు, పాషాణఖండములు, సూదులవంటి కంటకములు, కొన్ని చోట్ల నాచు, కొన్ని చోట్ల వెదురు బొంగులు, కొన్ని చోట్ల గర్జించు పెద్దపులులు, కొన్ని చోట్ల జ్వరములు పెరుగుచుండును. ఇట్లు పలువిధములైన కష్టములతో పాపులు వెళ్ళెదరు. పాపులు ఆక్రోశించుచు, ఏడ్చుచు, వాగుచు పాశములచే కట్టబడుచు, అంకుశముచే కట్టబడుచు వెనుకకు వెళ్ళుచుందురు. ముక్కు చివర పాశముచే కట్టబడి, కొందరు తాళ్ళచే బాధించబడుచు, శిశ్నాగముచే ఆయోభారమును మోయుచు వెళ్ళెదరు. కొందరు నాసాగ్రముచే అయోభారధ్యయమును మోయుచు, కొందరు చెవులచే మోయుచు, కోందరు జారిపడుచు, కొందరు కొట్టబడుచు, మిక్కిలి నిట్టూర్చు కన్నులుమూసుకొని కొందరు నీడ, నీరు లేని దారిలో దుఃఖించుచు వెళ్ళెదరు. తెలిసి తెలియక చేసిన తన పనులను గూర్చి ఆలోచించుచు వెళ్ళెదరు.
ఓ నారద ! ధర్మిష్ఠులు, దానశీలురు సుబుద్దులు మిక్కిలి సుఖముతో ధర్మమందిరమునకు వెళ్ళెదరు. అన్నదానము చేసినవారు రుచికరమైన పదార్ధములను భుజించుచు వెళ్ళెదరు. జలదానమును చేసినవారు రుచికరమైన పాలను త్రాగుచు వెళ్ళేదరు. తక్రదానమును చేసినవారు దధి దానమును చేసినవారు ఆయా భోగములను అనుభవించుచు వెళ్ళేదరు. ఘృతదానమును మధుదానమును, క్షీరదానమును చేసినవారు తేనెత్రాగుచు ధర్మమందిరమునకు వెళ్ళేదరు. శాకదానము చేసినవారు పాయసమును త్రాగుచు, దీపదానమును చేసినవారు దిక్కులు ప్రకాశింప చేయుచు, వస్త్రదానమును చేసినవారు దివ్యాంబరధారులై వెళ్ళేదరు. చేయూత నిచ్చువారు దారిలో దేవతలచే స్తుతించబడుచు వెళ్ళెదరు. గోదానమును చేసినవారు సర్వసౌఖ్యములతో వెళ్ళేదరు. భూదానమును గృహదానమును చేసినవారు అప్సరోగణములతో సర్వసంపదచే కూడియున్న విమానమున విలాసముగా వెళ్లేదరు. హయదానమును వాహన దానమును, గజదానమును చేసినవారు భోగాన్వితములైన విమానములలో వెళ్ళెదరు, వృషభదానమును తాంబూల దానమును చేసినవారు సంతోషముతో వెళ్ళెదరు. మాతాపిత్సశుశ్రూష చేసినవారు దేవతలచే స్తుతించబడుచు సంతోషమనస్కులై వెళ్ళెదరు. యతులను ప్రతచారిణులను బ్రాహ్మణోత్తములను సేవించువారు మిక్కిలి సుఖముగా వెళ్ళేదరు. సర్వభూతదయాపరుడు దేవతలచే పూజించబడుచు సర్వభోగాన్వితమైన విమానముచే వేళ్ళును. విద్యాదానమును చేసినవారు బ్రాహ్మణులచే స్తుతించబడుచు, పురాణపాఠకుడు మునీశ్వరులచే స్తోత్రము చేయబడుచు వెళ్లెదరు. ఇట్లు ధర్మపరులు ధర్మమందిరమును సుఖముగా వెళ్ళెదరు. యమధర్మరాజు చతుర్ముఖుడై శంఖచక్రగదాఖడ్గములను ధరించి పుణ్యకర్మలను చేసినవారిని స్నేహముతో మిత్రుని వలే గౌరవించును. ఓ ఉత్తమ బుద్ధిమంతులారా ! నరక క్లేశములకు భయపడు మీరు చేసిన సుకృతమును చేయనిచో వాడే పరమపాపి ఆత్మఘాతమును చేయువాడగును. అనిత్యమైన మానవజన్మనుపొందును. అతనికంటే అజ్ఞాని మరొకరుండరు. యాతనారూపము మలాదపరిదూషితమైన శరీరమునందు విశ్వాసమును చూపువాడు ఆత్మఘాతకుడని తెలియుడు. అన్ని పదార్ధములలో ప్రాణులు శ్రేష్ఠులు. ప్రాణులలో బుద్ది జీవులు, బుద్ది జీవులలో మానవులు, నరులలో బ్రాహ్మణులు శ్రేష్టులు. బ్రాహ్మణులలో విద్వాంసులు విద్వాంసులలో కృతబుద్దులు, కృతబుద్దులలో ఆచారపగులు, ఆచారపరులలో బ్రహ్మ వాదులు, బ్రహ్మ వాదులలో నిర్మములు శ్రేష్టులు నిర్మములలో ధ్యానపరాయణులు శ్రేష్ఠులు. కావున సర్వవిధప్రయత్నముచే ధర్మ సంగ్రహమును చేయవలయును. ధర్మవంతుడు అంతటా పూజించబడును. కావున మీ యీ పుణ్యములచే సర్వభోగ సమన్వితమైన నా స్థానమునకు వెళ్ళుడు. ఏదేని దుష్కృతమున్న చో పిదప ఇచట అనుభవించగలరు. ఇట్లు యమధర్మరాజు పుణ్యాత్ముని గౌరవించి సద్గతిని చేర్చును.
యమధర్మరాజు పాపులను పిలిచి కాలదండముచే బెదిరించుచు ప్రళయకాలమేఘమువలే గర్జించుచు కాటుక కొండకాంతి కలవాడై మెరపువలె మెరయుచున్న ఆయుధములతో భయంకరుడై ముప్పదిరెండు భుజములతో యోజనత్రయ విస్తారుడై రక్తాకుడు, దీర్ఘనాసికుడు, దంష్ట్రాకరాలవదనుడు వాపీతుల్యోగ్రలోచనుడుగా కనిపించును. మత్యజ్వరాదులతో కూడిన చిత్రగుప్తుడు కూడా అతి భయంకరుడై కనపడును. యమదూతలందరూ యముని వలె భయంకరులై భీషణముగా గర్జింతురు. అపుడు చిత్రగుప్తుడు యమాజ్ఞచే భయముతో వణుకుచున్న ఆ పాపుల ‘తాము చేసిన దుష్కృత్యములను గూర్చి విచారించుచున్నవారి నిట్లు పలుకును.’ ఓ పాపులారా ! మీరు దురాచారపరులై అహంకార దూషితులై వివేక శూన్యులై ఎందుకు పాపమును మూటగట్టుకొంటిరి. కామక్రోధాదులు కలిగించిన గర్వము నిండిన మనసుతో మహాపాపముల నేల నాచరించితిరి. మీరు మిగుల సంతోషముతో చాల పాపమును చేసితిరి. అట్లే యాతనలను కూడా సంతోషముగా అనుభవించుడు ఏల దుఃఖించెదరు ? భృత్యమిత్రకలత్రముల కొఱకు మీరు దుష్కృతము నాచరింతిరి. అట్లే అతిదుఃఖముతో ఇచటకి చేరితిరి. మీరు పోషించిన పుత్రాదులు మరో ప్రదేశమునకు వెళ్ళిరి. ఆ పాపము మీకే చేరినది. అదియే దుఃఖకారణమైనది. మీ పాపమును మీ పుత్రాదులు పంచుకొని అనుభవించరు. మీ రెట్లు పాపముల నాచరింతిరో అట్లే యాతనలననుభవింతురు. ఇక దుఃఖమేల ? మీరు పూర్వము చేసిన పాపకృత్యములను ఆలోచించుచు. యముడు దండించునని అపుడెందుకాలోచించలేదు ? దరిద్రుని, మూర్ఖుని పండితుని, శ్రీమంతుని, కాందిశీకుని, వీరుని యముడు సమముగా చూచును. ఇట్లు చిత్రగుప్తుడు పలికిన మాటలను వినిన ఆ పొపులు తాము చేసిన పాపమును తలుచుకొని భయపడుచుందురు. యమాజ్ఞనాచరించు భయంకరులగు యమదూతలు, చండాలాదులు, బలాత్కారముగా వారిని నరకమును పడద్రోతురు. తాము చేసిన దుష్కృతమును అనుభవించి పాపశేషముచే మరల భూలోకమున స్థావరాదులుగా జన్మింతురు.
నారద మహర్షి పలికెను :- పూజ్యుడా ! దయానిధే ! నా మనసున ఒక సంశయము కలగినది. నీవు నాకగ్రజుడవు కొవున ఆ సంశయమును ఛేదించగల సమర్థుడవు. నీవు చాల ధర్మములను చాల పాపమును చెప్పితివి. ఆ పాపపుణ్యమును చిరకాల ఫలానుభవమును చెప్పితివి. బ్రహ్మ కు దీనంతరము ప్రాప్తించినపుడు మూడు లోకములు నశించును. రెండు పరార్ధముల కాలము తరువాత బ్రహ్మండము కూడ క్షయమగునని చెప్పితివి. ఓ బ్రహ్మపుత్రా ! గ్రామదానాది పుణ్యములకు కల్పకోటి సహస్రకాలము ఫలానుభవముండునని చెప్పితివి. ప్రాకృతలయమున సర్వలోకనాశము జరుగును, ఒక జనార్దనుడు మాత్రమే మిగులునని చెప్పింది. సర్వలోకనౌశమునందు వీని (కర్తకు) పుణ్యపాప భోగసమాప్తి జరుగదు కదా? ఆ ఫలభోగమెట్లు ఎచట జరుగును? ఈ సంశయము నాలో కలిగినది. దానిని తొలగించుము.
సనకమహర్షిపలికెను :- ఓ మహాప్రాజ్ఞా ! నీవు పరమ రహస్యమును బాగుగా ప్రశ్నించితివి. నీవడిగిన దానిని చెప్పచున్నాను. సావధానముగా వినుము. నారాయణుడు, అక్షరుడు, అనంతుడు, పరంజ్యోతి, సనాతనుడు, విశుద్ధుడు, నిర్గుణుడు, నిత్యుడు మాయామోహవివర్జితుడు నిరుణుడైనను పరమానంద స్వరూపుడు కావున గుణవంతుని వలె భాసించును. బ్రహ్మ విష్ణు శివాది నామ రూపములతో భేదము కలవాని వలె భాసించును. సనాతనుడగు నారాయణుడు మూడు గుణోపాధిభేదములచే భేదము కలవానివరే తోచును. మాయను చేర్చి అఖిలజగత్కార్యము నాచరించును. బ్రహ్మరూపముతో సృష్టించును. విష్ణురూపముతో పాలించును. రుద్రరూపముతో అంతకాలమును సర్వమును నశింపచేయును. మరల ప్రలయాంతమున జనార్దనుడు లేచి చరాచరాత్మకమగు నీ విశ్వమును యథాపూర్వకముగా సృష్టిచేయును. స్థావరాదులు ఏయే ప్రదేశములలో ఎట్లుండెనో అట్లే సృష్టి చేయును. కావున చేసిన పాప పుణ్ముల అక్షయఫలమును తప్పక అనుభవించేయే తీరవలయును. కల్పకోటి శతములు గడిచిననూ అనుభవించక కర్మ క్షీణించదు. చేయబడిన శుభాశుభకర్మలను తప్పక అనుభవించవలయును.జగత్స్వరూపుడు సర్వలోకాంతర్యామి పరిపూర్ణుడు సనాతనుడగు శ్రీమన్నారాయణుడు సర్వకర్మ ఫలమును అనుభవించుచుండును. ఈ విశ్వంభరుడు గుణభేదముల ఉపాధిచే రూపభేదములను స్వీకరించి సర్వమును ఉపభోగించు పరమాత్మ సర్వజగత్తును సృష్టించి కాపాడి లయమును చెందింపచేయును.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున యమదూతకృత్యనిరూపణమను ముప్పదియొకటవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 31 of the Nārada Mahā Purana is as follows:
పాపాత్ములను యమలోకమునకు కొనిపోయే యమదూతల యొక్క విధులు మరియు యమలోక యాతనల సత్యభయంకర దృశ్యములు ఈ అధ్యాయంలో వర్ణించబడినవి. శ్రీహరి భక్తులను, వైష్ణవులను దృష్టించేందుకు కూడా యమదూతలు భయపడతారని, హరినామ స్మరణ చేసేవారికి యమబాధలు ఉండవని ఇక్కడ స్పష్టంగా నిరూపించబడినది.