నారద మహా పురాణము
76 - సేతు మాహాత్మ్యమ్
మోహిని పలికెను :-
బ్రాహ్మణోత్తమా ! బాగు ! బాగు ! మానవులకు పాపములను హరించి పుణ్యమును పెంపొందించు రామాయణమును వినిపించితిరి. ఇక ఇపుడు ఉత్తమమగు సేతు మాహాత్మ్యమును వినగోరు చున్నాను.
వసువు పలికెను :-
ఓ మోహినీ ! ఉత్తమమగు సేతు మాహాత్మ్యమును చెప్పెదను వినుము. సేతువును దర్శించిన వారు సంసార సాగరమునుండి విముక్తులగుదురు. రామేశ్వరుడు నివసించి యున్న సేతు సందర్శనము పరమ పుణ్య ప్రదము. రామేశ్వరుని దర్శన మాత్రముననే అమరత్వము లభించును. నియత మనస్కుడై రామేశ్వరుని పూజించిన వారు సర్వకామనలను పొందెదరు. ఇచటనే పాపనాశనమగు చక్రతీర్థము కూడా కలదు. ఇచట ఆచరించిన స్నాన దాన జపహోమాదులు అనన్యమును ప్రసాదించును. తాల తీర్థమును చేరి నియతమనస్కుడై స్నానమాడిన వాడు. ఉత్తమ జన్మను పొంది స్వర్గమున దేవతల వలె ఆనందించును. తరువాత పాపవినాశనమను తీర్థమను చేరి స్నానమాడిన వారు స్వర్గమున ఆనందించెదరు. తరువాత సీతా కుండమును చేరి చక్కగా స్నానమాచరించి పితరులను దేవతలను తృప్తి పరిచి సర్వకామనలను పొందగలడు. మంగళతీర్థమును చేరి స్నానమాడిన వారు పాపవిముక్తులగుదురు. అమరవాసిలో స్నానమాడిన వారు అమృతత్వమును పొందెదరు. లక్ష్మణ తీర్థమున స్నానమాడిన వారు యోగగతిని పొందెదరు. జటాతీర్థమున స్నాననమాడిన వారు రోగరహితులగుదురు. హనుమత్కుండమున స్నానమాడిన వారు అజేయులగుదురు., అగస్త్య తీర్థమున స్నానమాడిన వారు పుత్రవంతులు ధనవంతులూ అయ్యెదరు. రామ కుండమున స్నానమాడి రామసాలోక్యమును పొందెదరు. లక్ష్మీ తీర్థాభి షేకముతో లక్ష్మీవంతుడు రూపవంతుడగును. అగ్ని తీర్థమున స్నానమాడి సర్వకిల్బిష వినిర్ముక్తుడగును. శివతీర్థమున స్నానముచే శివలోకమును చేరును. శంఖ తీర్థమున స్నానమాడిన వాడు దుర్గతిని పొందడు. యమునాది తీర్థములందు స్నానమాడి స్వర్గమును పొందును. కోటి తీర్థమున స్నానమాడి సర్వతీర్థ ఫలమును పొందును. సాధ్యామృతమున స్నానమాడి సాధ్యసాలోక్యమును పొందును. సర్వతీర్థమున స్నానమాడి సకలాభీష్టములను పొందును. ధనుష్కోటిలో యధావిధిగా స్నానమాడి బంధ విముక్తుడగును. క్షీరకుండమున స్నానమాడిన వారు ఉన్నత భోగములను అనుభవించును. కపి తీర్థమున స్నానమాడిన వారు విజాతిని పొంద జాలరు. గాయత్రీ తీర్థమున, సరస్వతీ తీర్థమున స్నాన మాడిన వారు కిల్బిష విముక్తులగుదురు. ఋణమోచన తీర్థాదులందు స్నానమాడిన వారు ఋణ విముక్తులగుదు. ఇది సేతు తీర్థముల మాహాత్మ్యమును నీకు చెప్పితిని. దీనిని వినువారు చదువు వారు సర్వపాపవినిర్ముక్తులయ్యెదరు.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున సేతు మాహాత్మ్యమను డెబ్బది యారవ అధ్యాయమ.
Summary of chapter 203 of the Nārada Mahā Purana is as follows:
శ్రీమహావిష్ణువు యొక్క పవిత్ర నామముల మహత్తర స్వరూపమును వశిష్ఠ మహర్షి ఈ అధ్యాయంలో ప్రబోధించినారు. భగవన్నామము సమస్త ఆపదలను హరించి భక్తులకు భుక్తి ముక్తులను ప్రసాదించే దివ్య ఔషధమని నిరూపించబడినది.