నారద మహా పురాణము
97 - నారదీయపురాణానుక్రమణీకథనమ్
శ్రీ బ్రహ్మపలికెను :-
ఓ బ్రాహ్మణోత్తమా! ఇపుడు ఇరువది ఐదు వేల శ్లోకములు కల, బృహత్కల్ప కథాశ్రయమగు నారదీయ పురాణమును చేప్పెదను వినుము. ఈ పురాణమున సూత శౌనక సంవాదము, సృష్టి సంక్షేప వర్ణనము, పవిత్రములగు నానాధర్మకథలు, చెప్పబడినవి. పూర్వ భాగమున ప్రథమ పాదమున సనకమహర్షి నారద మహర్షికి చెప్పెను. ద్వితీయ పాదమున సనందన మహర్షి నారదునకు మోక్షోపాయ నిరూపణమును వేదాంగములను, శుకోత్పత్తిని చెప్పెను. మహాతంత్రమున పశుపాశ విమోక్షణమును, మంత్ర శోధనమును, దీక్షా మంత్రోద్ధారమును, పూజనమును, ప్రయోగములను, కవచమును, నామ సహస్రమును, స్తోత్రములను, గణేశ సూర్య విష్ణు శివశక్తుల ఆరాధనా విధానమును సనత్కుమారముని నారదునకు చెప్పెను. ఈ మహాతంత్రము తృతీయ పాదమున చెప్పబడినది. ఇక చతుర్థ పాదమున సనాతనముని నారద మహర్షికి పురాణ లక్షణమును, ప్రమాణముము, దానమును, దానకాలపురస్పరముగా చెప్పబడినది. చైత్రాది ద్వాదశ మాసములందు తిథులయందు చేయవలసిన విధానమును వేరువేరుగా చెప్పెను. ప్రతిపదాదితిథుల యందు చేయవలసిన ప్రతములను వివరించెను. ఇట్లు ఈ నాలుగు పాదములు కలది పూర్వభాగము బృహదాఖ్యానమనబడును. ఇక ఉత్తర భాగమున ఏకాదశి వ్రత విషయక ప్రశ్నము మాంధాతృ వసిష్ఠ సంవాద రూపముగా చెప్పబడినది. పవిత్రమగు రుక్మాంగద కథ, మోహినీ పుట్టుక, చేసిన పనులు, మోహినికి వసు విచ్చిన శాపము, శాపోద్దారము, పవిత్రమగు గంగాకధ, గయా యాత్రాను కీర్తనము, సాటిలేని కాశీమాహాత్మ్యము, పురుషోత్తమ వర్ణనము, క్షేత్రయాత్రా విధానము, బహ్వాఖ్యానములు, ప్రయాగ మాహాత్మ్యము, కురుక్షేత్ర మాహాత్మ్యము, హరిద్వార కథా, కామోదాఖ్యానము, బదరీ తీర్థమాహాత్మ్యము, కామాక్షీమాహాత్మ్యము ప్రభాస తీర్థ మాహాత్మ్యము, పుష్కరాఖ్యానకము, గౌతమాఖ్యానము, వేదపాదస్తవము, గోకర్ణక్షేత్ర మహాత్మ్యము, లక్ష్మణాఖ్యానము, సేతు మాహాత్మ్యము, నర్మదా తీర్థ వర్ణనము, అవంతీ మాహాత్మ్యము, మధురా మాహాత్మ్యము, బృందావన మాహాత్మ్యము, బ్రహ్మ సమీపమున పశుగమనము, మోహినీ చరితము ఇవి అన్నియూ చెప్పబడినవి. ఈ నారదీయ పురాణమును చెప్పినవాడు, వినినవాడు, బ్రహ్మలోకమును పొందును. ఈ పురాణమును వ్రాసి ఆశ్వయుజ శుద్ధపూర్ణిమ నాడు ఏడు గోవులతో బ్రాహ్మణోత్తమునకు దానము చేసినచో మోక్షము లభించును. సావధాన చిత్తముచే ఈ నారదీయ పురాణాను క్రమణికను చెప్పినవారు, వినినవారు స్వర్గమును పొందెదరు.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్థపాదమున నారదీయ పురాణ అనుక్రమణిక అను తొంబదియేడవ అధ్యాయము.
Summary of chapter 99 of the Nārada Mahā Purana is as follows:
శ్రీకృష్ణ ప్రభువు పరిపాలించిన దివ్య ద్వారాకాక్షేత్ర మాహాత్మ్యము ఈ అధ్యాయంలో అభివర్ణించబడినది. గోమతీ సంగమ స్నానము, ద్వారాకాధీశ దర్శనము మరియు చక్రతీర్థ మహిమ ఇక్కడ నిరూపించబడినది.