నారద మహా పురాణము
36 - విష్ణు సేవాప్రభావః
సనక మహర్షి పలికెను :- వేదమాలి పుత్రులగు యజ్ఞమాలి సుమాలుల చరితమును ఇపుడు చెప్పెదను. పెద్దవాడగు యజ్ఞామాలి తన ధనమును రెండు భాగములుగా విభజించి ఒక భాగమును చిన్నవాడగు సుమాలికిచ్చెను. సుమాలి వ్యసనలోలుడై ధనమునంతటిని అపాత్రదానములచే నశింపచేసేను. ప్రతినిత్యము గీతవాద్యములందు ఆసక్తుడై మద్యపానరతుడై వేశ్యా విలాసములయందు ఆశపడి పరదొరరతుడాయెను. పిత్రార్జితమైన ధనమంతయూ వ్యయము కాగా పరద్రవ్యమును అపహరించి వేశ్యాలోలుడాయెను. సుమాలి దుర్వృత్తమును చూచి మహామతియైన యజ్ఞమాలి దుఃఖితుడై తమ్మునితో నిట్లు పలి కెను. సోదరా ! మన కులములో పుట్టిన నీవు దురాచారము నవలంబించి కష్టపడుట తగదు. ఈ కులములో నీ వొక్కడవే దుష్టాత్ముడవు మహాపాపరతుడవగుచున్నావు. ఈ దుర్వృత్తమును మానుము. ఇట్లు పలుమార్లు వారించుచున్న అన్న మీద ఆగ్రహించిన సుమాలి యజ్ఞమాలినీ చంపుటకు నిశ్చయించి ఖడ్గహస్తుడై కేశములను పుట్టుకొనెను. అంతట నగరమున భయంకరమైన మహానాదము కలిగెను. నగర ప్రజలు కోపించినవారై సుమాలిని బంధించిరి. సజ్జనుడగు యజ్ఞమాలి నాగరులను ప్రార్థించి సుమాలిని విడిపించేను.” మరల తన ధనమును రెండు భాగములుగా విభజించి ఒక భాగమును సుమాలికిచ్చెను. అతమూడుడైన సుమాలి ఆ ధనమును కూడా మూర్తులగు పాషండచండాలులతో కలిసి అనుభవించెను. దుర్జనుల సంపదలు దుర్జనులచే మాత్రమే అనుభవించబడును. వేపచెట్టు పండ్లను కాకులు మాత్రమే భుజించును కదా ! యజ్ఞమాలి ఇచ్చిన ధనమును కూడా సుమాలి వ్యయము చేసెను. మద్యపానమత్తుడై గోమాంసాదులను భక్షించేను. బందుజనులచే వెలివేయబడి, రాజుచే శిక్షించబడి చండాలస్త్రీలతో కూడి నిర్దారణ్యమున ప్రవేశించేను. మంచిబుద్ధి గల యజ్ఞమాలి మాత్రము ఎప్పుడూ ధర్మరతుడై నిరంతరాయముగా అన్నదానమును చేయుచుండ సత్సంగతివలన పాపములు తొలగెను. తండ్రి త్రవ్వించిన తటాకాదులను ధర్మపరాయణుడై నిత్యము కొపాడుచుండెను. ధర్మమార్గప్రవర్తకుడై మహానుభావుడగు యజ్ఞమాలి సతాత్రదానముచే ధనమునంతయూ వ్యయము చేసెను. సజ్జనుల సంపదలు సజ్జనుల భోగమునకే ఉపయోగపడును. కల్పవృక్షఫలములను అమరులు మాత్రమే అనుభవింతురు కదా ! ధర్మ కార్యములకు ధనమును వ్యయము చేసిన యజ్ఞమాలి ప్రతినిత్యము విష్ణ్వాలయమున పరిచర్యలను చేయుచుండెను.
కొంతకాలమునకు యజ్ఞమాలి సుమాలి వార్ధక్యమును పొందిరి. ఇద్దరూ ఒకే సమయమున మరణించిరి. మహానుభావుడు హరిపూజాపరుడు అయిన యజ్ఞమాలికై శ్రీహరి ద్వొరపాలకులతో కూడియున్న దివ్య విమానమును పం పెను. మహామతియుగు యజ్ఞమాలి దివ్య విమానము నధిరోహించి దేవతాగణములు పూజించుచుండగా, మునీశ్వరులు స్తుతించుచుండగా గంధర్వులు గానము చేయుచుండగా అప్సరోగణములు సేవించుచుండగా కామధేనువు పోషించుచుండగా చిత్రాభరణ భూషితుడై కోమలములైన తులసీమాలలచే అలంకరించబడి తేజోనిధి దివ్యమైన విష్ణులోకమునకు వెళ్ళుచు మార్గమధ్యమున తమ్ముని చూచెను. యమభటులు కొట్టుచుండగా ఆకలిదప్పులచే పీడించబడుచు, పేతరూపుడైన నగ్నముగా దుఃఖితుడై పాశబద్దుడై ఇటునటు పరుగిడుచు అనాధవలే విలపించుచు ఆక్రోశించుచు రోదించుచున్న వానిని చూచి మనసున వ్యధచెందెను. యజ్ఞమాలి దయాన్వితుడై దగ్గరలోనున్న విష్ణుదూతలను ఇట్లు భటులచే బాధించబడువాడెవ్వడు అని అడిగెను. అట్లు చేతులు జోడించి అడిగిన మహాతేజస్వియగు యజ్ఞమాలికి విష్ణుదూతలు, ఇతను నీ తమ్ముడు పాపాత్ముడగు సుమాలి, అని తెలిపిరి. విష్ణుదూతలు చెప్పిన మాటలను వినిన యజ్ఞమాలి మనసులో దుఃఖించి మరల వారి నడిగెను. ఇతను చేసిన పాపములనుండి ఎట్లు విముక్తి లభించును ? మీరు నాకు బంధువులు కావున ఆ ఉపాయమును తెలుపుడు. ఏడడుగులు కలిసి నడిచినచో సఖ్యమని ధర్మకోవిదులు చెప్పియున్నొరు. సజ్జనులకు ప్రతిపదమున మైత్రి అని కదా ధర్మ నిర్ణయము. కావున నన్ను గొనిపోవుట కొచ్చిన మీరు నాకు బాంధవులు. నా సోదరుడగు సుమాలి కూడా మోక్షమును పొందునుపాయమును తెలుపుడు. ఇట్లు పలికిన యజ్ఞమాలి మాటలను వినిన విష్ణుదూతలు దయాళువులు కావున చిరునవ్వుతో హరిప్రియుడగు యజ్ఞమాలిని గూర్చి ఇట్లు పలికిరి.
విష్ణు దూతల పలికిరి :- ఓ మహానుభావా ! నారాయణ పరాయణా ! యజ్ఞమాలీ ! సుమాలి మోక్షమును చెందు ఉపాయమును నీకు చెప్పెదము. నీవు పూర్వజన్మలో చేసిన మహాపుణ్యమును సంగ్రహముగా చెప్పెదను వినుము. నీవు పూర్వజన్మలో విశ్వంభరడను పేరుగల వైశ్యజాతీయుడవు. నీవు లెక్కించలేని మహాపాపములను ఎన్నింటినో చేసితివి. సత్కర్మవాస నాహీనుడవై తలిదండ్రులను ద్వేషించుచుంటివి. ఒకపుడు బంధువులందరూ వెలివేయగా శోకసంతాపముచే పీడించబడిన ఆకలిచే పరితపించుచు హరి మందిరమును చేరితివి. ఆ సమయమున ఆచట మహా వర్షము కురిసినది. ఆ ప్రాంతమంతయూ బురదమైనది. అపుడు నీవు అచట నివసించగోరి ఆ బురదను దూరము చేసి శుభ్రపరిచితివి. నీవు చేసిన పని హరీమందిరమును అలుకుటగా అయినది. నీవు ఆ రాత్రి ఆ దేవాలయముననే ఉంటివి. ఒక మహాసర్పము కాటువేయగా మరణించితివి. అట్లు విష్ణ్వాలయమున అలుకుట అను సుకృత ప్రభావముచే బ్రాహ్మణజన్మ హరిభక్తి లభించినది. కోటి కల్పములు హరి సన్నిధిన నివసించి జ్ఞానమునుపొంది మోక్షమునందగలవు. మహాపాపి అయిన నీ తమ్ముని పాపవిముక్తుని చేయగోరుచున్నావు. ఆ ఉపాయమును చెప్పెదము. తెలియుము. నీవు ఈ జన్మలో హరిమందిరమును అలికిన ప్రదేశమున గోచర్మమాత్రప్రదేశమును అలుకుట వలన కలిగిన పుణ్యమును నీ సోదరునికి దానము చేసి ఉద్దరించుము. ఇట్లు విష్ణుదూతలు పలుకగా దయాపరుడగు యజ్ఞమాలి ఆ ఫలమును సుమాలికరించెను. అన్నగారు దానము చేసిన పుణ్యముచే సుమాలి పాపవిముక్తుడాయెను. యమదూతలు సుమాలిని విడిచి పారిపోగా, ఆ విమానము నధిరోహించి ఆనందించెను. ఇట్లు ఆ సోదరులిరువురు దేవతాసమూహముచే నమస్కరించబడుచు పరస్పరమాలింగనమును చేసుకొని ఆనందించిరి. యజ్ఞమాలి సుమాలులు మహర్డులచే స్తోత్రము చేయబడుచు గంధర్వులచే గానము చేయబడుచు విష్ణులోకమునకు చేరిరి. ఆ విష్ణులోకమున యజ్ఞమాలిసుమాలులు సంతోషముతో ఒక కల్పము నివసించిరి. విష్ణులోకమున బహుభోగములననుభవించి అచటనే జ్ఞానమును పొంది మోక్షమును పొందెను. మహానుభావుడగు సుమాలి విష్ణులోకమున ఆనందముతో నివసించి మరల భూలోకమున బ్రాహ్మణత్వమునొందెను. పరమపవిత్రమైన కులములో పుట్టిన సుమాలి గుణవంతుడు వేదసారగుడు సర్వసంపత్సమేతుడు, హరిభక్తి పరాయణుడుగా నుండి హరినామ సంకీర్తనమును చేయుచు గంగాతీరమును చేరెను. గంగానదిలో స్నానము చేసి ప్రభువైన విశ్వేశ్వరుని దర్శించి యోగులకు కూడా దుర్లభమగు మోక్షమును పొందెను. ఓ మునీశ్వరా ! నీకు దేవాలయమున ఉపలేపనము చేయుటవలన కలుగు మాహాత్మ్యమును చెప్పితిని. కావున అన్ని విధములా ప్రయత్నించి జగన్నాధుని పూజించవలయును. సంకల్పములేక, కోరికలేక శ్రీహరిని పూజించిననూ ఎపుడూ సంసారబంధము కలుగును. హరిభక్తిరతులైన వారిని హరిబుద్ధిచే పూజించినచో బ్రహ్మ విష్ణుమ హేశ్వరులు సంతోషింతురు. హరిభక్తి పరులతో కలిసియున్నవారిని కలిసిననూ మహాపాతకులైనను అన్ని పాపములనుండి విముక్తులగుదురు. హరిపూజాపరులను హరినామసంకీర్తనము చేయువారిని సేవించువారు పొపులైనను పరమపదమును పొందెదరు.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున విష్ణు సేవాప్రభావమను ముప్పదియారవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 36 of the Nārada Mahā Purana is as follows:
యజ్ఞమాలి మరియు సుమాలి అను ఇద్దరి వృత్తాంతం ద్వారా శ్రీహరి సేవా ప్రభావము ఎంత మహత్తరమైనదో ఈ అధ్యాయంలో వివరించబడినది. భగవంతుని ఆలయ ప్రక్షాళనము, దీపారాధనము మరియు తులసి పూజ వంటి సామాన్య సేవలు కూడా మానవుని సమస్త పాతకములను తొలగించి పరమపదమును ప్రసాదిస్తాయని ఇక్కడ నిరూపించబడినది.