గరుడ మహా పురాణము - ప్రేత ఖండము
1 - వైకుంఠ వర్ణన, మరణ కాలంలోనూ, తరువాత విభిన్న విహిత కర్తవ్యాలపై గరుత్మంతుని ప్రశ్నలు, ప్రేతకల్ప ఉపక్రమం
నైమిషారణ్యంలో సుఖాసీనుడై వున్న సూతమహర్షిని శౌనకాది మహామునులిలా ప్రార్థించారు - శ్రీ సూతభగవాన్! జీవుడు ఒక శరీరం తరువాత ఇంకొక శరీరాన్ని ఆశ్రయిస్తాడని కొందరంటుండగా విన్నాము. మరికొందరు విద్వాంసులు ప్రాణి మృత్యువు తనను కబళించగనే యమధర్మరాజు వద్దకు పోయి రకరకాల యాతనలకు గురైన తరువాతనే మరొక శరీరాన్ని పొందుతుందని చెప్పగా కూడా విన్నాము. మరి ఏది సంపూర్ణ సత్యమో మీవంటి జ్ఞానియే తేల్చి చెప్పగలరు. దయచేసి మా సందేహ నివృత్తిని గావించండి.
సూతుడు సంతుష్టాంతరంగుడై ఇలా చెప్పసాగాడు, “మహామునులారా! మహా మేధావులైన మీరు మీ స్థాయికి తగిన ప్రశ్ననే వేశారు. ఒకప్పుడిదే ప్రశ్నను భాగవతోత్త ముడైన గరుత్మంతుడు పురుషోత్తముడైన మహావిష్ణువునడిగాడు. ఆ మహనీయుల సంవాద రూపమై గరుడ పురాణానికి సంబంధించిన ధర్మకాండ - ప్రేతకర్మ అనే మహావిషయాన్ని వినిపిస్తాను. మీ సందేహాలన్నీ తీరిపోతాయి.
బ్రహ్మాండమైన భవసాగరాన్ని ఏదో చిన్న కాలువను దాటేసినంత సులువుగా తరింపజేయు శ్రీ కృష్ణ భగవానునికి తొలుతగా నమస్కరించి ప్రారంభిస్తున్నాను.
మునులారా! ఒకప్పుడు వినతాపుత్రుడైన బ్రహ్మాండ నాయకుడు గరుత్మంతునికి ఈ బ్రహ్మాండంలోని అన్ని లోకాలనూ ఒకసారి చూడాలనిపించింది. హరి నామాన్నుచ్చరిస్తూ లోకాలను చూడసాగాడు. చివరగా స్వర్గ, పాతాళ, భూలోకాలను చూశాడు. ముఖ్యంగా పృథ్విపై గల దుఃఖాలను చూసి తానే దుఃఖితుడై పోయి అశాంత చిత్తంతో అలమటిస్తూ వైకుంఠానికి మరలాడు.
విష్ణులోకంలో రజోగుణ ప్రవృత్తి లేదు. తమో గుణ ప్రవృత్తీ లేదు. కనీసం సత్త్వగుణంతో కలిసియైనా లేవు. ఇక్కడ కేవలం శుద్ధ సత్త్వ గుణమే ఎల్లెడలా కనిపిస్తుంది. ఇక్కడ మాయ కూడా లేదు. ఎవరికీ వినాశమూ లేదు; రాగద్వేషాదిషడ్వికారాలూ లేవు. ఈ లోకంలో దేవాసుర వర్గాల ద్వారా పూజింపబడు విష్ణువు యొక్క పార్షదులు (సభ్యులు, దగ్గరివారు) దర్శనమిస్తుంటారు. వారు కూడా స్వామి వలెనే నీలమేఘశ్యాములు, పీతాంబర ధరులు, మణి యుక్త స్వర్ణాలంకృతులు, చతుర్భుజులు కూడ వారి చెవులకి గల కుండలాలూ, తలపై నున్న కిరీటాలూ రత్నమిశ్రిత స్వర్ణకాంతుల్ని వెదజల్లుతున్నాయి. వారి వక్షస్థలాలు సుందరములైన పుష్పమాలలచే సుశోభితాలై వున్నాయి. కనిపించగానే తనువును పులకింపజేసి మనసును మరిపింపజేసే అప్సరసలున్నారు. మహాత్ములను గొని వస్తున్న విమానాలు ఆకాశం నుండి సూర్యుడు దిగి వస్తున్న భ్రాంతిని కలిగిస్తాయి. అక్కడి జనం అన్ని ప్రకారాల వైభవాలతో లక్ష్మీప్ర సన్నతను కలిగి శోభిల్లుతున్నా, నిరంతరం శ్రీహరి చరణాలను పూజిస్తూనే వుంటారు.
గరుత్మంతునికి శ్రీ మహావిష్ణువు ఒక తూగుటుయ్యాలపై సుఖాసీనుడై దర్శనమిచ్చాడు. లక్ష్మీదేవి తన చెలికత్తెలతో సహా స్వామి పాదార్చనలో నిమగ్నమై వుంది. సువిశాల నేత్రయుక్తమైన ప్రసన్న ముఖంతో ఆ దేవాధిపతి, జగత్పతి, శ్రీపతి, యజ్ఞపతి అగు శ్రీ మహావిష్ణువు తన ప్రధాన పార్షదులైన నంద సునందాదుల వినతులను వింటున్నాడు. ఆ సమయంలో ఆయన తన అన్యాన్య సర్వశక్తుల చేత పరివేష్టితుడై వున్నాడు. హరి దర్శనం కాగానే వినతా సుతుని హృదయం ఆనందం తట్టుకోలేక ద్రవించింది, శరీరం గగుర్పొడిచింది, నేత్రాలు అశ్రుపూరితాలయినాయి. ఆనంద మగ్నుడై అతడు తన స్వామికి ప్రణమిల్లాడు.
తన వాహనమైన పక్షిరాజును కటాక్షించిన మహావిష్ణువు ‘పక్షిరాజా! సుఖంగా సాగింది కదా నీ ప్రయాణం’ అంటూ కుశల ప్రశ్నలు వేసి ఏయే దేశాలు, లోకాలు తిరిగావు? అని కూడా అడిగాడు.
వినమ్రంగా ఇలా విన్నవించుకోసాగాడు వినతాసుతుడు, “భగవన్! మీ కృప వల్ల నేను అన్ని లోకాలనూ చూడగలిగాను. వాటిలో నెలకొన్న సమస్త స్థావర, జంగమ ప్రాణులనూ చూశాను. హేప్రభో! అన్ని లోకాల్లో కన్నా భూర్లోకంలో ప్రాణి సమూహ మెక్కువగా నున్నది. అన్ని యోనులలోకీ మానవ యోనియే భోగాలకూ మోక్షానికీ శుభా శ్రయంగా వెలుగుతోంది. మంచి పనులకు భూలోకాన్ని మించిన తావు లేదు. దేవతలు భూలోకం - అందులో భరతఖండం ఉత్తమమని ఇలా ప్రశంసిస్తుండగా నేను విన్నాను. ఎవరైతే భరతభూమిలో జన్మించి నివసిస్తారో వారు ధన్యులు.
గాయంతి దేవాః కిల గీతకాని
ధన్యాస్తు యే భారత భూమి భాగే ।
స్వర్గాపవర్గస్య ఫలార్జనాయ
భవంతి భూయః పురుషాః సురత్వాత్ ॥
భూలోకంలో మృతి చెందిన ప్రేతం మరల భూమిపైననే పడవేయబడుతోంది. దాని నోట్లో పంచరత్నాలను (స్వర్ణ, గగన, మర్త్య, నాగ, పాతాళ రత్నాలు) వేస్తున్నారు. శవాన్ని దర్భలపై ఉంచడం జరుగుతోంది. దాని రెండు పాదాలనూ దక్షిణ దిశవైపే తిప్పి పెడుతున్నారు. మరణ మాసన్నమైన వారి ముందు పుత్రులు, మనుమలు నిలబడి వుంటున్నారు. రకరకాల దానాలు చేస్తున్నారు. మిత్రులూ శత్రువులూ కూడా బంధు బాంధవులతో సహా క్షమాయాచన చేస్తున్నారు. నువ్వులు, ఇనుము, బంగారం, పత్తి, ఉప్పు, సప్తధాన్యాలు (ప్రీహ, యవ, గోధుమ, పెస, మినుము, కొఱ్ఱ, శనగ) - వీటిని కూడా దానం చేస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారో నాకావంతైనా అర్థం కావటం లేదు.
హే జ్ఞాన సాగరా! ప్రాణులెలా మరణిస్తారు? ఆ తరువాతెక్కడికి పోతారు? ఆ సమయంలో అతివాహిక శరీరాన్ని (నిరాధార రూపంలో ఆత్మను ధరించు శరీరం) ఎలా పొందుతారు? అగ్ని సంస్కారానికి ముందు మానవ శరీరాన్ని కొడుకులు, మనుమలు భుజంపై పెట్టుకొని ఎందుకు మోసుకెళ్తారు? శవంపై నెయ్యి పోస్తారెందుకని? ఆ సమయంలో ఒక ఆహుతినిచ్చే సంప్రదాయమెక్కడి నుండి వచ్చింది? శవానికి భూస్పర్మనెందుకు చేయించాలి? స్త్రీలు ఆ మృతవ్యక్తికై ఎందుకు రోదిస్తారు? శవానికి ఉత్తరం వైపు కూర్చుని యమసూక్తాన్నెందుకు పఠిస్తారు? మృతులైన వారికి నీళ్ళివ్వడానికి ఏకవస్త్రలే కావాలని ఎందుకంటారు? ఆ సమయంలో సూర్య బింబం కోసం చూడడం, రాతిపై యవలనూ, ఆవాలనూ, దూర్వనూ, వేపాకులనూ పోసి వాటినెందుకు స్పృశిస్తారు? ఆ సమయంలో ఆడా మగా కూడా ఒంటికీ కిందా పైనా ఒకే బట్టనెందుకు ధరించాలి? మృతుల పుత్రులు పదిరోజుల పాటు పిండప్రదానమెందుకు చేస్తారు? వేడి చేసిన మట్టి పాత్రను అరుగుపై నుంచి అందులో పాలెందుకు పోస్తారు? మూడు కఱ్ఱలను తాళ్ళతో కట్టి దానిని కూడలిలో నుంచి దానిపై ఏడాదిపాటు దీపమెందుకు వెలిగించి ఉంచుతారు? శవానికి దహన సంస్కారమే ఎందుకు చెయ్యాలి, అప్పుడా ప్రాణి ఎలాగూ ఆత్మ రూపంలో ఎగిరి పోతుందంటారు కదా మరప్పుడు దానికి తొమ్మిది రోజుల పిండ ప్రదానం వల్ల ప్రయోజనమేమి? ఈ ప్రదానానికీ పద్ధతి వేరేగా వుంటుందా?
స్వామీ! ఈ కర్మకాండ మనిషి మృతి చెందిన వెంటనే చేసి వేయబడుతోంది కదా, మరి వేరే మరల మరల పిండప్రదానమేల? పూర్వ పిండదానమని, పునః పిండదానమని, ఇతరేతర అపర కర్మలని చేయమంటారు కదా, వీటి ఆవశ్యకత ఏమి? దహన సంస్కారం తరువాత అస్థిసంచయ విధానమెలా వచ్చింది? ముందో వెనకో నీటికుండను పగులగొడతారెందుకని? రెండవ, నాల్గవ రోజుల్లో సాగ్నిక ద్విజ స్నానమెందుకు చేస్తారు? పదవ రోజున పరిజనులందరితో బాటు శుద్ధి స్నానము చేస్తారు. మరి ఈ శుద్ధి అంటే ఏమిటి? పదవ రోజు నూనె రాసుకొని అభ్యంగన తలంటి పోసుకుంటారెందుకని? అది కూడా ఒక విశాల జలాశయతటంపైనే ఎందుకు చేయాలి? పదకొండవ రోజు వృషోత్సర్గాది సహితంగా పిండదానం చేయడం వల్ల ప్రయోజనమేమి? పాత్ర, పాదుక, ఛత్ర, వస్త్ర, అంగుళీయకాది దానాలిప్పుడెందుకు చేస్తారు? పదమూడవ రోజు కూడా దాన కార్యక్రమమెందుకుంటుంది? ఏడాది కాలంలో పదహారు శ్రాద్ధాలనెందుకు పెట్టాలి? మూడువందల అరవై అన్నం నీరు కుండల నెందుకు దానం చేస్తారు? రోజూ చేస్తారెందుకని, కొందరు ఒక కుండైనా?
జ్ఞానానికి సముద్రం వంటి ఓ దేవదేవా! నీవు తప్ప నాకు దిక్కు లేదు, వేరు గురువూ లేరు. అందుకే ఇన్ని ప్రశ్నలనూ నీ వైపే మరలిస్తున్నాను. మహాప్రభో! ప్రాణులెన్నో పాపాలు చేస్తారు, కొన్ని పుణ్యాలు చేస్తారు, దానాలిస్తారు, ఈ నానాప్రకార కర్మఫలాలన్నీ శరీరం దహనమైపోయినా, ఆ వ్యక్తి వెంట ఎలా వెళతాయి? మనిషి అనిత్యుడని వినడమైతే విన్నాను గానీ వాని ఆత్మ బయటికి శరీరాన్ని ఛేదించుకొని ఎక్కడికన్నం నుండి వస్తుందో నాకు తెలియరాలేదు. అలాగే పంచభూతాలూ, లోభ, మోహ, తృష్ణ, కామాహంకారములను అయిదుగురు దొంగలూ ఎక్కడ కన్నం వేసి పారిపోతారు?
ఇక, మృతి నొందిన వారికై సంవత్సరికం (సపిండీకరణ) మెందుకు చేస్తారు? ఆ ప్రేత కృత్యంలో ప్రేతపిండ మెవరితో ఎలా కలపబడుతుంది?
హే జగద్గురూ! మూర్ఛలో వుండి గాని పతనం వల్ల గాని మృతి చెందిన వారికి అంత్యక్రియలు దహనం ద్వారానే చేయాలా? అగ్ని సంస్కారం లేని ఆత్మలేమవుతాయి? పాపి, దురాచారి లేదా హతబుద్ధి యైన వానికి మరణానంతరం ఎట్టి స్థితి ప్రాప్తిస్తుంది? అలాగే అత్మఘాతి, బ్రహ్మ హంతకుడు, స్వర్ణచోరుడు, మిత్రద్రోహి, విశ్వాసఘాతకుడు - ఇలాటి వారికి ఎలాటి గతులు పడతాయి? శూద్రుని బ్రాహ్మణ స్త్రీ పొంది వుండిపోతే, ఇద్దరూ వివాహితులే అయితే, అంతకంటే పాపముండదేమో కదా, వారికెట్టి గతి రాసి పెట్టి వుంది?
విశ్వాత్మవై విలసిల్లు విష్ణుదేవా! నాపై దయ వుంచి మరొక విషయం కూడా మీరే చెప్పాలి. సంపూర్ణ జగత్తునే చుట్టి వచ్చానని విన్నవించాను కదా! లోకులు కష్టగ్రస్తులై, దుఃఖ పీడితులై కనబడుతున్నారు. నా మనస్సు వీరి బాధలను చూసి మిక్కిలి అశాంతికి లోనైంది. స్వర్గంలో దైత్యుల వలని భయం, పుడమిపై మృత్యు, రోగ భయాలు, పాతాళంలో నేనంటే భయం, సర్వ ప్రాణులకూ అభీష్ట వస్తు వియోగ భయం పట్టి పీడిస్తున్నాయి. జగదీశ్వరా! ఈ విష్ణు లోకంలో తప్ప ఇంకెక్కడా సంపూర్ణ సుఖంగాని నిర్భయతగాని నాకు కనిపించ లేదు. కాల వశీ భూతమై కష్టాలతో కాపురం చేస్తూ అన్ని రకాల భయాలనూ అనుభవిస్తూ కూడా కర్మభూమిగా పేరొందిన భరతఖండం రాగ, ద్వేష, మోహాదులచే సృష్టింపబడిన బురదలో పీకలదాకా కూరుకు పోయి వుంది. రోగులూ, వికలాంగులూ కనిపించారు. విధిపూర్వకంగా వార్షిక కర్మలు జరగని వారికి దుర్గతి పడుతుందని ఋషుల ద్వారా విన్నాను. నేను చూసిన బాధలకు ఇది కూడా ఒక కారణమా?
కాబట్టి ఓ విజ్ఞానజ్యోతి స్వరూపా! మరణించిన మనిషికి కూడా శుభాన్ని కలిగించే ప్రక్రియ వుంటే నాకు బోధించండి. దానాలివ్వాలా, ఏ మేరకు? దహన సంస్కారమెలా చెయ్యాలి? స్మశానికి మృతులు చేరుకొనేలోగా చేయవలసిన కర్మలుంటాయా? దుష్టులు మృతి చెందినపుడు వారి పాపాలకు ప్రాయశ్చిత్తాలను వారి సంతానం చేస్తే ప్రయోజనముంటుందా? పంచకశాంతినెలా చేపట్టాలి? మరణాసన్న వ్యక్తి, మృతి చెందిన వ్యక్తి, దహనమై పోయి పంచ భూతాలలో కలిసిపోయిన వ్యక్తి ఈ మూడు రకాల వారికీ కర్మల ద్వారా శుభాన్ని కలిగించే మార్గాలుంటే, నాపై ఈ లోకంపై దయ వుంచి నాకుపదేశించండి”.
Summary of chapter 1 of the Garuda Mahā Purana - Preta Khaṇḍa is as follows:
In the tranquil radiance of Vaikuṇṭha, where the Supreme Lord Bhagavān Vishṇu reposes in eternal bliss, His divine mount Garuḍa bows with deep humility and devotion to inquire about the terrifying mysteries of death that afflict mortal beings on Earth. Moved by profound compassion for humanity, the king of birds requests the Lord to reveal the true path taken by the soul after departing the physical body, the origin of grief experienced by living relatives, and the subtle mechanics that govern the transition from the earthly world to the realm of Yamaloka. In response to this selfless plea, the compassionate Lord Vishṇu begins His sacred discourse, illuminating the eternal truths of cosmic law, the inevitability of mortality, and the divine order that oversees every step of the soul’s postseason journey.