గరుడ మహా పురాణము - ప్రేత ఖండము
48 - 49 - విష్ణుదేవుని ద్వారా గరుడుని కీయబడిన మహత్త్వ పూర్ణోపదేశము మానవ శరీరధారుల కర్తవ్యము ఈశ్వరనిత్యతా వర్ణనము వివేక జ్ఞానం తత్త్వజ్ఞానం సత్సంగం
సూత మహర్షి మరల గరుడుడు విష్ణువు నడిగిన అంశాలను ఇలా విప్రవరులకు వీనులవిందుగా చెప్పసాగాడు.
‘దయాసాగరా! జీవుని పుట్టుకకు మూల కారణం అజ్ఞానమేనని బోధపడుతోంది. మోక్షానికి అనగా జన్మరాహిత్యానికి గల సనాతనమైన ఉపాయాన్ని వినగోరుతున్నాను. ఓ దేవ దేవేశా, శరణాగతవత్సలా! దయచేసి వినిపించండి’
మహావిష్ణువిలా చెప్పాడు.
‘గరుడా! నువ్వడిగిన ప్రశ్నకు ప్రత్యుత్తరం చాలా గొప్పది. దానిని శ్రద్ధగా విన్నంత మాత్రాననే మనిషి ఈ సంసారావాగమన చక్రం నుండి ముక్తుడు కాగలడు.
ఈ జగత్తుకి అతీతుడై పరబ్రహ్మస్వరూపుడు, నిరవయవుడూ, సర్వజ్ఞుడూ, సర్వకర్తా, సర్వేశుడూ, నిర్మలుడూ, అద్వయతత్త్వమూ, స్వయంప్రకాశుడూ, ఆద్యంత రహితుడూ, వికారశూన్యుడూ, పరాత్పరుడూ, నిర్గుణుడూ, సచ్చిదానందుడనగు శివుడొకడున్నాడు. ఆయన అంశయే ఈ జీవుడు. అగ్నిలో నిప్పుకణాలున్నట్టే అవిద్యచే కప్పబడిన జీవిలో కూడా ఆయనుంటాడు. అనాది కర్మలచే ప్రాప్తించిన శరీరాది నానా ఉపాధులలో నుండు ఆ పరమాత్మకే ఆయా జీవులు చేసే పాప, పుణ్య కర్మలపై నియంత్రణ వుంటుంది. ఆ కర్మానుసారమే జీవికొక జన్మా, దానికి జాతి, దేహం, ఆయువు, భోగాదులు ప్రాప్తిస్తాయి. సూక్ష్మ లేదా లింగ శరీరం ఒక ఆత్మచుట్టూ ఏర్పాటవుతున్నంత కాలం అది (జీవుడు) మరల మరల పుట్టి చస్తూ పుడుతూనే వుంటుంది. ఇదొక విషవలయం.
స్థావరాలూ, క్రీములూ, పక్షులు, పశువులూ, మనుష్యులూ వారిలో ధార్మికులూ, చివరికి దేవతలూ కూడా యథాప్రకారంగా, యథాక్రమంగా నాలుగు రకాల శరీరాలను ధరించి ఏ వెయ్యిమార్లో వాటిని త్యజించడం జరుగుతుంది. ఏ పుణ్యకర్మ ప్రభావం వల్లనో ఒక ఆత్మ మానవయోనిలో పడుతుంది. ఎనుబది నాలుగు లక్షల యోనుల్లో ఒక్క మానవయోనిలో పడిన జీవాత్మకే తత్త్వజ్ఞానం లభించే అవకాశముంటుంది. ఇది మోక్షానికి సోపానం.
సోపాన భూతం మోక్షస్య
మానుష్యం ప్రాప్య దుర్లభం ।
ఈ దుర్లభ యోనిలో జనించి కూడా తనను తానుద్ధరించుకోలేని జీవుని కన్న ఈ జగత్తులో మూర్ఖుడెవడుంటాడు?
యస్తారయతి నాత్మానం
తస్మాత్ పాపతరోఽత్ర కః ॥
అన్యయోనులకు భిన్నంగా సుందరములైన ఇంద్రియాలతో, ఆకారంతో బుద్ధితో వచ్చిన మానవజన్మను సద్వినియోగం చేసుకొని ఆత్మ హిత జ్ఞానాన్ని పొందనివాడు తనను సృష్టించిన బ్రహ్మకే ద్రోహం చేసినవాడవుతాడు. ఈ శరీరం లేకుండా ఏ పురుషార్థమూ సంభవం కాదు కదా! కాబట్టి దానినన్ని విధాలా, ఎల్లవేళలా సంరక్షించుకోవడం పురుషుని మొట్టమొదటి బాధ్యత. (ప్రాచీనులు నిర్దేశించిన ఉపవాసం కూడా దేహరక్షణలో భాగమే) శరీరంతో బాటు ఆత్మ కూడా రక్షింపబడుతుంది. ఆ జీవన పర్యంతమూ ఆత్మను రక్షించుకోగలిగినవాడు తన జీవితకాలంలోనే సర్వమంగళాలనూ చూడగలుగుతాడు. మనుష్యునికి మాటిమాటికీ దొరకనివి గ్రామం, క్షేత్రం, ధనం, గృహం, శుభం, శరీరం. అరుదైన ఈ అవయవ సముదాయాన్ని అనవరతమూ ఆరోగ్యంగా వుండేలా చూసు కొనేవాడే భగవచ్చింతన చేయగలడు. శరీర రక్ష ధర్మానికీ, ధర్మరక్ష జ్ఞానానికీ, జ్ఞాన రక్ష ధ్యాన యోగానికీ, అది ముక్తి ప్రాప్తికీ బాటలు వేస్తాయి. ఇంద్రియలోలత్వం వల్ల, మోహ లోభాల వల్ల ఆత్మ చెడిపోయి అహితకార్యాలకు దూరంగా పోలేక చిక్కుకుపోతే ఇక ఆ మనిషి నెవరూ బాగుచేయలేరు.
ఔషధాలు దొరికేది ఇహలోకంలోనే. ఇక్కడే శరీరాన్నీ ఆత్మనూ బాగు చేసుకోలేనివాడు ఔషధరహితమైన పరలోకంలో ఎలా సుఖపడగలడు? కాబట్టి శరీరారోగ్యాన్ని కాపాడుకుంటూ అది బాగున్నపుడే తత్త్వజ్ఞానం కోసం ప్రయత్నం చెయ్యాలి. కొంతమంది ‘పదవి నుండి విశ్రాంతి లభించాక’ దేవుని గూర్చి ‘ఆలోచిద్దాం లే’ అంటారు. అప్పుడిక చేసేదేముంది? శరీరం శిథిలమైపోయేవేళ వచ్చిందనే కదా పదవి నుండి పంపించివేస్తారు. అప్పుడిక ఆధ్యాత్మిక చింతన మొదలు పెడదామనుకుంటే కోశాగారం తగలబడిపోతుంటే నుయ్యి తవ్వడం మొదలుపెట్టినట్లే.
ఇహైవ నరకవ్యాధో శ్చికిత్సాం న కరోతియః ।
గత్వాని రౌషధం దేశం వ్యాధిస్థః కిం కరిష్యతి ॥
వాఘ్రీవ్యాస్తే జరాచాయు ర్యాతి భిన్న ఘటాంబువత్ ।
నిఘ్నంతి రిపువద్రోగా స్తస్మా చ్ఛ్రేయః సమభ్యసేత్ ॥
యావన్నాశ్రయతే దుఃఖం యావన్నాయాంతి చాపదః ।
యావన్నేంద్రియ వైకల్యం తావచ్ఛ్రేయః సమభ్యసేత్ ॥
యావతి తిష్ఠతి దేహోఽయం తావత్ తత్త్వం సమభ్యసేత్ ।
సందీప్త కోశభవనే కూపం ఖనతి దుర్మతిః ॥
ఎన్నో పనులతో, తాపత్రయాలతో, శారీరక మానసిక గ్లానిలో పడి అలసటలో కూడా విసిగి బతికే సంసారికీ కాలం ఎలా గడిచిపోతుందో తెలియకుండానే జీవితమే ముగిసిపోతుంది. సుఖ దుఃఖాలు ఆత్మహితం ఇత్యాదుల గూర్చి ఆలోచించే లోగానే సామాన్యుని జీవిత కాలం కరిగిపోతుంది. పుడుతున్న వాళ్ళనూ, రోగులనూ, పూర్వకర్మాన్న నుభవిస్తూ దుఃఖిస్తున్నవాళ్ళనూ, ఆపదలలో ఇరుక్కున్న వాళ్ళనూ, చివరికి మృతి చెందుతున్న వాళ్ళనూ కూడా చూస్తూనే వుంటాడు, వారు అనుభవిస్తున్నదంతా ఒకప్పటి పాప ఫలమేనని వింటూనే వుంటాడు - అయినా ఈ మనిషి మోహమనే మదిర మత్తులోపడి దేనికీ భయపడడు. భగవంతుని శరణు వేడడం మాట దేవుడెరుగు, కనీసం ఆయనను, తన ఒంట్లో ఓపికున్నంత కాలం, అసలు స్మరింపనే స్మరింపడు.
గరుడా! ధనం కలలోని సిరి వంటిది. దానిని చూసుకొని సంబరపడడం మూర్ఖత్వం. యౌవనం పువ్వులాటిది. ఎప్పుడు వాడిపోతుందో తెలియదు. దానిని చూసుకొని మిడిసిపడడం అవివేకం. నిజానికి నూరేళ్ళ ఆయువు నిజమైన సాధకునికి అత్యల్పకాలం. ఇందులో సగభాగం నిద్రకే సరిపోతుంది. బాల్యంలో, రోగమొచ్చాక, వృద్ధాప్యం పైబడ్డాక ఏమీ చేయలేడు కదా! ఇక మిగిలిన కాలమెంత? అందులో అంతా కుటుంబ పోషణకూ, తన సరదాలకూ, సరసాలకే అయిపోతే వాడి జన్మ వ్యర్థమే కదా!
కాలో నజ్ఞాయతే నానా కార్యైః సంసార సంభవైః ।
మూర్ఖం దుఃఖం జనోహంత నవేత్తి హిత మాత్మనః ॥
జాతా నార్తాన్ మృతానాపద్ భ్రష్టాన్ దృష్ట్వా చ దుఃఖితాన్ ।
లోకో మోహ సురాన్ పీత్వా న బిభేతి కదా చన ॥
సంపదః స్వప్న సంకాశా యౌవనం కుసుమోపమం ।
తడిచ్చ పల మానుష్యం కస్య స్యా జ్జానతో ధృతిః ॥
శతం జీవిత మత్యల్పం నిద్రాల స్యైస్త దర్ధకం ।
బాల్యరోగా జరాదుఃఖై కల్పం తదపి నిష్ఫలం ॥
వెంటనే ప్రారంభించవలసిన పని మొదలుపెట్టకుండా, మెలకువగా వుండవలసిన వేళ మొద్దు నిదురపోతూ, భయపడవలసిన చోట మొండిధైర్యాన్ని ప్రదర్శిస్తూ దానం, దైవం లేకుండా బతికేసిన వానిని ఏ మనిషి బాగు చేయగలడు? ఏ దేవుడు రక్షింపగలడు? రెండు కనులూ తెఱచుకొని నడుస్తూ పడిపోయేవానిని (అనగా దేవుని సృష్టిని చూస్తూ దేవుడు లేడనే వానిని) వింటూ కూడా వినిపించుకోని వానిని, సద్గ్రంథాలను వృత్తిరీత్యా చదివి బోధిస్తూ కూడా తన కర్తవ్యాన్ని అర్థం చేసుకోలేని వానిని ఏ మనిషీ బాగు చేయలేడు, ఏ దేవుడూ రక్షింపడు.
ప్రారబ్ధయే నిరుద్యోగి జాగర్తవ్యే ప్రసుప్తకః ।
విశ్వస్తశ్చ భయస్థానే హా నరః కో న హన్యతే ॥
తోయఫేన సమేదేహే జీవే నాక్రమ్య సంస్థితే ।
అనిత్య ప్రియ సంవాసే కథం తిష్ఠతి నిర్భయః ॥
అహితే హిత సంజ్ఞః స్యా దధ్రువే ధ్రువ సంజ్ఞకః ।
అనర్థ చార్థ విజ్ఞానః స్వమర్థం యోన వేత్తి సః ॥
పశ్యన్న పి ప్రస్ఖలతి శ్రుణ్వన్నపి నబుధ్యతి ।
పఠన్నపి న జానాతి దేవమాయా విమోహితః ॥
కాలమనే ఈ లోతైన మహాసాగరంలో జగత్తంతా మునుగుతూ తేలుతూ వుంటుంది. మృత్యువు, రోగము, ముసలితనము అనే మొసళ్ళ చేత ఎంత బంధింపబడినా ఎవరికీ గ్రాహవిముక్తిని పొందాలనే జ్ఞానం కలుగదు. ప్రతి మనిషీ భయంలోనే బతికేస్తుంటాడు. మరో పక్క నుండి వానికి కాలమిచ్చిన గడువు కరగిపోతుంటుంది. అయినా పచ్చికుండ నీటిలో పడి కరిగిపోతున్నా కనబడనట్లు ఈ మనిషి క్రమంగా కూలిపోతున్నా అలా కనబడడు. తనను తానూ చూసుకోడు, తెలుసుకోడు. గాలిని బంధించి వుంచవచ్చునేమో గాని, ఆకాశాన్ని ముక్కలు చేసి పెట్టవచ్చునేమో గాని, కడలి కెరటాలను వెనుకకు మళ్ళించ సమర్థులున్నారేమోగాని, కాలమునాపి ఆయువును పెంచగలవారు మాత్రం లేరు. ప్రళయం వస్తే నేల బీటలు వారుతుంది, సుమేరు పర్వతమే పొడి పొడియై పోతుంది, సముద్రమంతటి జలాశయమే ఎండిపోతుంది. అలాటిది మనిషి బతుక్కి ప్రళయం లాంటి చావు వచ్చినపుడు ఏ శరీరం మిగిలి వుంటుంది.
తన్నిమజ్జ జ్జగదిదం గంభీరే కాల సాగరే ।
మృత్యు రోగ జరాగ్రాహై ర్న కశ్చిదపి బుధ్యతే ॥
ప్రతిక్షణ భయంకాలః క్షీయ మాణో న లక్ష్యతే ।
ఆమకుంభ ఇవాంభః స్థో విశీర్ణో న విభావ్యతే ॥
యుజ్యతే వేష్టనం వాయో రాకాశస్య చ ఖండనం ।
గ్రథనంచ తరంగాణా మాస్థానాయుషి యుజ్యతే ॥
పృథివీ దహ్యతే యేన మేరుశ్చాపి విశీర్యతే ।
శుష్యతే సాగరజలం శరీర స్యచ కా కథా ॥
అపత్యం మే కళత్రం మే ధనం మే బాంధవాశ్చమే ।
జల్పంతమితి మర్త్యా జం హంతి కాలవృకో బలాత్ ॥
గమనిక సంస్కృతంలో ‘మే’ అంటే ‘నా యొక్క అని అర్థము ఈ మనిషి నా భార్య, నా కొడుకు, నా ధనము, నా వాళ్ళు అని మేకలాగ విఱ్ఱవీగుతూ అరుస్తునేవుంటాడు. కాలమనే తోడేలు వచ్చి కబళించే దాకా ఆ మేకారం సాగుతుంది, అక్కడితో సరి.
రేపు చేద్దామనుకున్న మంచి పనిని ఇవాళే చేసెయ్యాలి. ఎందుకంటే ఆ పని అయ్యేదాకా మృత్యువాగదు. మనిషి యొక్క శత్రుసేన బలిష్టమైనది, భయంకరమైనది. దానికి పథప్రదర్శకులు మనిషి వృద్ధావస్థ; రోగాలు సైనికులు, సేనాని పాపము, శత్రురాజు మృత్యువు. ఈ భయంకర యుద్ధంలో అపజయ, మృత్యుగహ్వరాల నుండి రక్షించగలవాడు, విష్ణువొక్కడే. ఊహ తెలిసిననాటి నుండీ విష్ణువునే స్మరిస్తున్న వాడీ యుద్ధాన్నే చేయనక్కరలేదు. వానిని దేహాంతంలో దేవదూతలు వచ్చి విమానంలో గొనిపోతారు. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు - ఇలాంటి బంధాలకు కట్టుబడకుండా బాధ్యతగా మాత్రమే వాటితో ప్రసక్తాన్ని పెట్టుకొని మృత్యువు కోసం దేవుని కోసం ఎదురు చూసేవాడు సుఖి.
ఇదం కృత మిదం కార్య మిదమన్య త్కృతాకృతం ।
ఏవమీహా సమాయుక్తం కృతాంతః కురుతే వశం ॥
శ్వః కార్యమద్య కుర్వీత పూర్వాహ్ణే చౌపరాహ్ణికం ।
న హి మృత్యుః ప్రతీక్షతే కృతం వాప్యథ వాఽకృతం ॥
జరాదర్శిత పంథానం ప్రచండ వ్యాధి సైనికం ।
అధిష్ఠితో మృత్యు శత్రుం త్రాతారం కిం న పశ్యతి ॥
తృష్ణా సూచీ వినిర్భన్నాం సిక్తం విషయ సర్పిషా ।
రాగ ద్వేషానలే పక్వం మృత్యు రశ్నాతి మానవం ॥
బాలాంశ్చ యౌవన స్థాంశ్చ వృద్ధాన్ గర్భ గతానపి ।
సర్వానా విశితే మృత్యు రేవం భూత మిదం జగత్ ॥
స్వదేహ మపి జీవోఽయం ముక్త్వాయాతి యమాలయం ।
స్త్రీ మాతృ పితృ పుత్రాది సంబంధః కేన హేతునా ॥
దుఃఖ మూలం హి సంసారః సయస్యాస్తి స దుఃఖితః ।
తస్య త్యాగః కృతోయేన స సుఖీ నాపరః క్వచిత్ ॥
అన్ని రకాల దుఃఖాలకీ జనకమూ, సమస్తాపదలకూ పుట్టినిల్లూ, అన్ని ప్రకారాల పాపాలకూ ఆశ్రయమూ ఈ ప్రపంచము. కాబట్టి నరులు ఏ క్షణంలోనైనా దీనిని త్యజించడానికి సిద్ధంగా వుండాలి. ఇనుప వలలో కఱ్ఱ పెట్టెలో ఇరుక్కుని చిక్కుకున్న వాడైనా తప్పించుకోగలడేమోగాని స్త్రీ, పుత్రులు అనే మోహజాలంలో చిక్కుకున్నవాడిక విడుదల కాలేడు. మనిషి మనసుకి నచ్చిన పదార్థాల సంఖ్యను పెంచుకుంటూ పోతున్న కొద్దీ వాని మనసులో శోకాగ్ని కీలలు కూడా పెరుగుతూనే వుంటాయి. ఇంద్రియాలనెడు దొంగలు ప్రపంచాన్నే దొంగిలించి మూటకట్టి నరకం వైపు మోసుకుపోతాయి. ఆ మూటలో తాను ఉండకూడదనే ప్రతి మనిషీ కోరుకోవాలి. కాని మాంసపు ఎఱను మాత్రమే చూసి వెదురు ముల్లును పట్టించుకోకుండా ఆశ రేపిన దారిలోకి శీఘ్రం పయనించి గాలంలో చిక్కుకున్న చేపలాగా సుఖలాలస కొద్దీ ఇరుక్కున్న మనిషి యముని పట్టించుకోకుండా బతికేసి చచ్చాక ఏడుస్తాడు.
ప్రభవం సర్వ దుఃఖానా మాలయం సకలాపదాం ।
ఆశ్రయం సర్వపాపానం సంసారం వర్జయేత్ క్షణాత్ ॥
లోహదారుమయైః పాశైః పుమాన్ బద్ధో విముచ్యతే ।
పుత్రదార మయైః పాశై ర్ముచ్యతే న కదాచన ॥
యావతః కురుతే జంతుః సంబంధాన్ మనసః ప్రియాన్ ।
తావంతోఽస్య నిఖన్యంతే హృదయేశోక శంకవః ॥
వంచితాశేషవితై స్తై ర్నిత్యం లోక వినాశితః ।
హా హంత విషయాహారై ర్దే హస్థేంద్రియ తస్కరైః ॥
మాంసలుబ్ధో యథా మత్స్యో లోహశంకుం నపశ్యతి ।
సుఖలుబ్ధ స్తథా దేహీ యమబాధాంతపశ్యతి ॥ 49.51
గరుడా! తనకి హితమైనదేదో అహితమైనదేదో తెలుసుకోకుండా నిత్య కుపథగామియై అంటే బతుకంతా చెడ్డ మార్గంలో దుష్కర్మలనే గావిస్తూ, తన పొట్ట నింపుకోడం గురించే ఆలోచిస్తూ గడిపేసేవాడు నారకీయ ప్రాణి అయిపోతాడు. అంటే భూలోకంలో లేనికాలమంతా నరకంలోనే వుంటాడు. ఆహార నిద్రా భయమైథునాలు అన్ని జంతువులకీ సమానమే అయినా భగవద్ జ్ఞానంకల వారు మాత్రమే మానవులు కాగా మిగతావన్నీ, కొన్ని నరరూపంలో వున్నా, జంతువులే. పొద్దున్నే మల మూత్రాలను గూర్చీ, మధ్యాహ్నం, రాత్రీ భోజనాన్ని గూర్చి, రాత్రి మైధునాన్ని గూర్చి మాత్రమే ఆలోచిస్తూ అవి అయిపోగానే నిద్రపోయేవారు మూర్ఖులు. మానవజాతి విషయంలో నన్ను కూడా బాధించే దేమిటంటే వీరిలో అధిక శాతం అజ్ఞానం వల్ల మోహితులైపోయి తమ శరీరం, తమ స్త్రీ, తమ ధనం మున్నగు వాటి గూర్చే ఆలోచిస్తూ వాటి కోసమే జీవిస్తూ ఆ కోరికలూ, ఋణాలూ తీరక మరలా వాటి కోసమే జన్మనెత్తుతున్నారు, మరణిస్తున్నారు. ఇది పద్ధతి కాదు. మనిషి తన ఆసక్తిని త్యజించాలి. బాధ్యతను మాత్రమే నిర్వర్తించాలి. నా వైపు మళ్ళాలి. ఆధ్యాత్మిక జ్ఞానం పై ఆసక్తిని పెంచుకోవాలి. ఇదీ పద్దతి.
హితాహితం న జానంతో నిత్యమున్మార్గగామినః ।
కుక్షి పూరణ నిష్ఠాయే తే నరా నారకాః ఖగ ॥
నిద్రాభీ మైథునాహారాః సర్వేషాం ప్రాణినాం సమాః ।
జ్ఞానవాన్ మానవః ప్రోక్తో జ్ఞానహీనః పశుః స్మృతః ॥
ప్రభాతే మలమూత్రాభ్యాం క్షుత్తృంభ్యాం మధ్యగేరవౌ ।
రాత్రౌ మదన నిద్రాభ్యాం బాధ్యంతే మూఢమానవాః ॥
స్వదేహధనదారాది నిరతాః సర్వజంతవః ।
జాయంతే చ మ్రియంతే చ హా హంతాజ్ఞాన మోహితాః ॥
తస్మాత్ సంగః సదాత్యాజ్యః సచేత్ వ్యక్తుం నశక్యతే ।
మహద్భిః సహ కర్తవ్యః సంతః సంగస్య భేషజం ॥ 49.56
సత్సంగం, వివేకం - ఈ రెండూ మానవుని మలరహిత, ఆరోగ్యకరములైన రెండు నేత్రాలు. ఈ రెండూ లేని వాడు అంధుడికిందే లెక్క
సత్సంగశ్చ వివేకశ్చ నిర్మలం నయనద్వయం ।
యస్యనాస్తినరః స్కోఽ౦ధః
కథం న స్యాద మార్గగః ॥ 49.57
ఏకభుక్తాలూ, ఉపవాసాలు చేసి వూరుకుంటే చాలదు. అంతమాత్రాననే అజ్ఞానులైన జనులకు ముక్తి వచ్చెయ్యదు. పాపమూ నశించిపోదు. ఒక చిన్న కర్రపుల్లతో కొట్టినంత మాత్రాన మహాభుజంగం మరణిస్తుందా?
పెద్దపెద్ద జటలు పెంచుకొని, మృగచర్మాన్ని ధరించి వేషానికి మాత్రమే ఋషులై దాంభిక జ్ఞానాన్ని ప్రదర్శించే వారి అసలు రూపాన్ని తెలుసుకోవడానికి వివేకం కావాలి. అలాటి వారిని దూరం నుండే త్యజించాలి. వారే ఘోరనరకంలో పడబోతున్నారు. ఇకనన్నేమి రక్షిస్తారు? అనుకోవాలి. కొంతమంది సర్వసంగ పరిత్యాగులమని చెప్పుకొని దిగంబరులై సిగ్గులేకుండా తిరుగుతుంటారు. వారి పట్ల కూడా వివేకాన్ని వినియోగించాలి.
మట్టినీ భస్మాన్నీ ఒంటినిండా పులుముకొని తిరుగుతూ కొందరు తమకు ముక్తి తథ్యమని చెప్పుకుంటుంటారు. ఊరకుక్కలూ అలాగే తిరుగుతాయిగా, మంటిలో బూడిదలో పొర్లుతూ?
నిజమైన జ్ఞాని, వనవాసి అడవిలోకి మనం వెళ్ళినా ఒకంతట దొరకడు. అతడు తాపసియై గడ్డి, ఆకులు, పుల్లలు, నీరు మాత్రమే ఆహారంగా తీసుకుంటాడు. అడవిలో చాల జంతువులు (మాంసం దొరకనపుడు నక్కతో సహా) అలాగే బతికేస్తుంటాయి. వాటన్నిటి యెదుటా మోకరిల్ల లేముకదా! అలాంటి, నక్కలవంటి తాపసులు మనుష్యులలో కూడా వుంటారు. వారిని పోల్చుకోవడానికీ వివేకం కావాలి. గంగలో రోజూ మునకేసినంత మాత్రాన ఎవడూ మహాయోగికాలేడు. నిత్యం గంగలోనే వుంటాయిగా కప్పలూ, చేపలూనూ కొంతమంది నిత్యవ్రతులమని చెప్పుకుంటూ నిలవ నీటిని తాగరు. అంత మాత్రాన పావురం, శిలాహారం, చకోరం ముక్తులై పోతాయనగలమా? గరుడా! ఈ వ్రతాలూ, తపాలూ, ఉపవాసాలూ, నిరాహారాలూ వ్యర్థం కావు. అనవసరమూ కావు. ఇవన్నీ ముక్తికి మార్గాలే, కాని తత్త్వజ్ఞాన సహితములైనపుడే వాటికి గొప్ప విలువుంటుంది. (ఒకటి అంకె పక్కన సున్నాలలాగ)
వేదాలనూ శాస్త్రాలనూ చదవగానే సరికాదు. బట్టీపట్టి ఒప్పజెప్పినంత మాత్రాన కూడా దైవ, మానవ సేవకా బోదు. వాటి సారాన్ని గ్రహించి, ఆచరించి, అనుభవించి కనీసం భావస్వప్నంలోనైనా భగవంతుని చూడగలిగి అప్పుడు ప్రజలకు దానిని బోధించిన వాడు జనంలో జనార్దనుడవుతాడు. మానవ సేవా మాధవ సేవా కూడా చేసిన వాడవుతాడు. దీపం అనే మాటను పలకగానే ఎలాగైతే చీకటి దూరం కాదో అలాగే శబ్దజ్ఞానమును సంపాదించినంత మాత్రాన వ్యక్తిలోని అజ్ఞానం సమసిపోదు. బుద్ధిలేని వాని చేతిలోని చదువు అంధుని చేతిలోని అద్దంలాంటిదే. శాస్త్రాలన్నీ చదివెయ్యాలని కొందరు బయల్దేరతారు కాని అలా చేయగలగడం అసాధ్యం. హంసపాలను పీల్చినట్లు శాస్త్రసారాన్ని గ్రహించడం వివేక లక్షణం.
అనేకాని చశాస్త్రాణి స్వల్పాయుర్విఘ్నకోటయః ।
తస్మాత్ సారం విజానీయాత్ క్షీరం హంస ఇవాంభసి ॥ 49.84
వేదశాస్త్ర విద్వాంసునికి పరమతత్త్వానికి సంబంధించిన జ్ఞానం ప్రాప్తించిన తరువాత ఇక దేనితోనూ పని వుండదు. అమృతం త్రాగిన వానికిక అన్నంతో అవసరమే ముంటుంది?
వేదాధ్యయనంవల్ల గానీ శాస్త్రపాండిత్యం వల్లగానీ మోక్షం రావాలని లేదు. కైవల్యం జ్ఞానం వల్లనే తప్ప మరో విధంగా రాదు. ఆశ్రమాలూ, దర్శనాలూ కూడా ముక్తి సాధనాలు కావు. ఏ కర్మ ద్వారానైనా ముక్తి కోసం ప్రయత్నించవచ్చనేది సరికాదు. జ్ఞాన మొక్కటే ముక్తి నిస్తుంది. వెయ్యిశాస్త్రాలను నెత్తిపై కెక్కించుకొని చదివినా రాని అద్వైత శివతత్త్వం గురూపదేశం ద్వారా, ఆయన చెప్పిన సాధన ద్వారా సాధ్యం.
జ్ఞానం రెండు ప్రకారాలని పెద్దలంటారు. ఒకటి శాస్త్రకథిత జ్ఞానము కాగా రెండవది వివేకం వల్ల ప్రాప్తించేది. శబ్దమే బ్రహ్మమని ఆగమశాస్త్రమంటుంది. పరమతత్వమే బ్రహ్మయని వివేకులంటారు. కొంతమంది అద్వైతాన్నీ కొంత మంది ద్వైత సిద్ధాంతాన్నీ బలపరుస్తారు. కానీ, వీళ్ళలో ఎవరికీ తెలియని దేమిటంటే పరమాత్మ సమభావనగలవాడు. ద్వైతా ద్వైత ధహితుడు.
బంధనానికీ, మోక్షానికీ రెండక్షరాలే తేడా, ‘ఇది నాది’ అనేది బంధనం. ‘ఏదీ నాది కాదు’ అనే జ్ఞానమే ముక్తి.
ద్వేపదే బంధ మోక్షాయ నమమేతి మమేతిచ ।
మమేతి బధ్యతే జంతు ర్నమతి ప్రముచ్యతే ॥ 49.93
ఏ కర్మయితే ఈ జీవాత్మను బంధనంలోకి గొనిపోదో అదే సత్కర్మం. ప్రాణికి ముక్తిని ప్రదానం చేయగల సామర్థ్యమున్నదే విద్య. ఈ ప్రాణిలో సత్కర్మకాని దానివైపు ఆకర్షణ వున్నంత కాలం, సాంసారిక వాసనలు మిగిలిపోయి వున్నంతకాలం, ఇంద్రియాలలో చాపల్యం వున్నంతకాలం ఆ ప్రాణికి పరమతత్త్వ జ్ఞానం కలుగదు.
తత్కర్మయన్నబద్ధాయ సావిద్యాయా విముక్తిదా ।
ఆయాసాయాపరం కర్మ విద్యాన్యా శిల్ప నైపుణం ॥
యావత్ కర్మాణి దీప్యంతే యావత్ సంసార వాసనా ।
యావదింద్రియ చాపల్యం తావత్ తత్త్వ కథా కుతః ॥ 49.95
తన శరీరంపై ప్రేమ, దాన్ని చూసుకొని గర్వం, అన్నీ తానే చేయగలననుకొనే అహంకారం, ప్రయత్నం మాత్రమేతాను చేయగలననే వివేకం లేకపోవడం, శాస్త్రచింతనలేమి, మనస్సులో అస్థిరత - ఇవన్నీ గాని ఏ ఒక్కటిగాని ఉన్నా గురువుకి వానిపై దయకలుగదు. గురువుకే దయ కలగకపోతే పరమగురువైన పరమాత్మకి మాత్రం ఎందుకు కలగాలి?
ఓయ కాశ్యపా! తపాలూ, వ్రతాలూ, తీర్థాలూ, జపాలూ, హోమాదికములూ, వేదశాస్త్ర పఠన పాఠనాలూ - ఇవన్నీ పుణ్యం కలిగిస్తాయి, పరమాత్మవైపు నడిపిస్తాయి. పరమార్థ తత్త్వం తెలుసుకున్న వానికి ఆపై వీటి అవసరముండదు. మోక్షాన్ని కోరుకొనే వాడు అన్ని దశలలోనూ అవస్థలలోనూ పరమనిష్ఠతో దాని గూర్చే జీవించాలి. గురు ముఖంగా ప్రాప్తించిన విద్యను కూడా దానికే వినియోగించాలి. ఆత్మ తత్త్వ జ్ఞానాన్ని ఆ విధంగా పొందినవాడే ఈ దుర్ధర్ష సంసారబంధనాలనుండి సుఖంగా విడివడి పోగలడు.
తావత్ తపో వ్రతం తీర్థం జప హోమార్చనాదికం ।
వేదశాస్త్రాగమ కథా యావత్ తత్త్వం నవిందతి ॥
తస్మాత్ సర్వ ప్రయత్నే సర్వావస్థాసు సర్వదా ।
తత్త్వ నిష్ఠోభవేత్ తార్క్ష్య యదీచ్ఛేన్మోక్ష మాత్మనః ॥
ధర్మజ్ఞాన ప్రసూనస్య స్వర్గ మోక్ష ఫలస్య చ ।
తాపత్రయాది సంతప్తశ్ఛాయాం మోక్షతరోః శ్రయేత్ ॥
తస్మాద్ జ్ఞానే నాత్మతత్త్వం విజ్ఞేయంశ్రీ గురోర్ముఖాత్ ।
సుఖేన ముచ్యతే జంతుర్ఘోర సంసారబంధనాత్ ॥ 49.101
గరుడా! తత్త్వజ్ఞుని అంతిమకృత్యాలు చెప్తాను విను. వీటి ద్వారానే బ్రహ్మపద, నిర్వాణమను పేర్లుగల మోక్షం ప్రాప్తిస్తుంది.
మరణాసన్న వేళ తత్త్వజ్ఞుడు తన దేహాది ఆసక్తులన్నిటినీ శాస్త్రంలో చెప్పబడిన అసంగరూప ఖడ్గంతో తెగగోసుకోవాలి. తన ఇంట్లోనే వుంటూ సన్యాసాశ్రమాన్ని స్వీకరించి తీర్థస్నానం చేసి వస్తుండాలి. ఆ పవిత్ర తీర్థంలోనే ఏకాంత, శుద్ధ, స్వచ్ఛ ప్రదేశంలో విధ్యుక్తంగా ఆసనగ్రహణం చేసి ఏకాగ్రచిత్తుడై గాయత్రిమంత్రం ద్వారా ఆ పరమశుద్ధ బ్రహ్మాక్షరాన్ని ధ్యానించాలి. బ్రహ్మము యొక్క బీజమంత్రాన్ని మననం చేస్తూనే శ్వాసను ఆపి మనస్సును వశం చేసుకోవాలి. మనస్సనే గుఱ్ఱాన్ని బుద్ధియనెడి సారధిద్వారా సాంసారిక విషయాలవైపు పోకుండా నియంత్రించుకోవాలి. బుద్ధి ద్వారానే దానిని శుభకర్మలవైపు మళ్ళించుకోవాలి.
‘నేనే బ్రహ్మను, నేనే పరమధామమును, నేనే పరమపదమును’ అని సమీక్షించు కుంటూ ఏదో ఒక రోజు తన ఆత్మను నిష్కల అత్మలో ప్రవేశపెట్టాలి. ‘ఓం’ అనే ఏకాక్షర బ్రహ్మ జపాన్ని అవసాన వేళలో చేసేవాడు శరీరాన్ని త్యజించి పరమపదాన్ని పొందగలడు.
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్శా మనుస్మరన్ ।
యఃప్రయాతి త్యజన్ దేహం
సయాతి పరమాం గతిం ॥ 49.108
సుధీజనులనగా మంచి మేధస్సు గలిగి పరమాత్మవైపు వెళ్ళేవారు. అహంకారులూ, జ్ఞానవైరాగ్యరహితులూనగు సామాన్యులు చేసుకోలేని పదాన్ని వారందుకుంటారు. వారికి మాన - మోహాలుండవు; ఆసక్తి దోషానికి వారు అతీతులు. నిత్య అధ్యాత్మచింతనలో దత్తచిత్తులు; సాంసారిక సమస్తకామనలకూ బహుదూరులు; సుఖ - దుఃఖనామకద్వంద్వం నుండి ముక్తులు. అట్టి జ్ఞానులైన సుధీజనులు అవ్యయపదప్రాప్తి నందగలరు.
నిర్మానమోహా జితసంగదోషా
అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ।
ద్వంద్వైర్వముక్తాః సుఖదుఃఖ సంజ్ఞై
గచ్ఛంత్యమూఢాః పదమవ్యయంతత్ ॥ 49.110
ప్రౌఢ వైరాగ్యంలో వుంటూ అనన్యభావంతో నా భజనను చేసే వారికి ముక్తి లభిస్తుంది.
ప్రౌఢవైరాగ్యమాస్థాయ
భజతే మామనన్యభాక్ ।
పూర్ణ దృష్టిః ప్రసన్నాత్మా
సవై మోక్షమవాప్నుయాత్ ॥ 49.112
అయోధ్య, మథుర, మాయ, కాశి, కంచి, అవంతిక, ద్వారక అనే సప్తపురాలూ మోక్ష ప్రదాలు. మరణాసన్నవేళ ఇంటిని విడిచి ఇక్కడికొచ్చి మృతిచెందిన వారికి మోక్షం లభిస్తుంది.
త్యక్త్వా గృహంచయస్తీర్థ నివసేన్మరణోత్సుకః ।
ముక్తి క్షేత్రేషు మ్రియతే సవైమోక్ష మవాప్నుయాత్ ॥
అయోధ్యా మథురా మాయా కాశీ కాంచీ అవంతికా ।
పురీ ద్వారవతీ జ్ఞేయాః సప్తైతా మోక్ష దాయికా ॥ 49.114
ఓయి తార్క్ష్యా! జ్ఞాన వైరాగ్య యుక్తమైన మోక్షధర్మాన్ని సాంతమూ విన్నావు కదా! దీనినిక నీ నుండి ఎవరు విన్నా వారిద్వారా మరెందరు విన్నా వారందరికీ మోక్షం లభిస్తుంది.
తత్త్వజ్ఞులకి మోక్షం ప్రాప్తిస్తుంది. ధర్మనిష్ఠులు స్వర్గానికి వెళతారు. పాపులు నరకానికి పోతారు.
మోక్షం గచ్ఛంతి తత్త్వజ్ఞా ధార్మికాః స్వర్గతం నరాః ।
పాపినో దుర్గతిం యాంతి
సం సరంతి ఖగాదయః ॥ 49.116
అని విష్ణువు తనకు కావలసిన దానిని చెప్పడంతో సంతుష్టుడైనాడు గరుడుడు. ధన్యుడు కూడా అయినాడు. అతని ద్వారా అతని పేరిటనే ఒక అద్భుతమైన పురాణం లోకానికి ప్రసాదించబడింది.” అని అంటూ విష్ణువుకీ గరుడునికీ నమస్కరించి మరల ఇలా చెప్పాడు సూతమహర్షి.
“విప్రోత్తములారా ! తన ప్రశ్నలకు సమాధానంగా ఒక మహాపురాణాన్నే ప్రసాదించిన స్వామీకి నమస్కరించి అశ్రుపూరితనయనుడై మిక్కిలి ప్రసన్నుడై గరుత్మంతుడిలా అన్నాడు ‘ప్రభో! తమ ఈ ఆహ్లాదకర వచనాలను విని గహనాతి గహనమైన విషయాలను అర్థం చేసుకున్నాను. ఇలాటి గంభీర విషయాన్ని ఇంత ఆహ్లాదకరంగా చెప్పగలవారు లేరు. అయినా మీ దయ వల్ల ప్రయత్నిస్తాం’. ఇలా చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి గరుత్మంతుడు కశ్యపాశ్రమానికి వెళ్ళాడు”.
తరువాత శౌనకమహర్షి ఇలా అన్నాడు ‘పరమపవిత్రము పుణ్యదాయకమునగు ఈ పురాణం విన్నవారికి సకలపాపనాశకము, సమస్తకామనలపూరకము.”
పురాణం గారుడం పుణ్యం పవిత్రం పాపనాశనం ।
శృణ్వతాం కామనాపూరం శ్రోతవ్యం సర్వదైవహి ॥ 49.132
యశ్చేదం శ్రుణుయామర్త్యో యశ్చాపి పరీకీర్తయేత్ ।
విహాయ యాతనాం ఘోరాం ధూత పాపో దివం వ్రజేత్ ॥ 49.136
Summary of chapter 45 of the Garuda Mahā Purana - Preta Khaṇḍa is as follows:
Bhagavān Vishṇu proclaims the magnificent spiritual merit and sanctifying power of the Preta Khaṇḍa itself, declaring it to be a sacred treasure among scriptures. The Lord reveals that reading, listening to, or sharing these holy chapters with devotion dispels the fear of death, clears severe family doshas, and grants wisdom, health, and spiritual prosperity to the household. The Supreme Lord reassures Garuḍa that wherever this sacred dialogue is reverently recited, divine messengers protect the premises and ancestors rejoice in peace.