గరుడ మహా పురాణము - ప్రేత ఖండము
32 - జీవి ప్రాదుర్భావం - గర్భంలో దాని స్వరూపం - క్రమవృద్ధి - పంచతత్త్వాదుల ప్రవేశం- నేలపై బడగానే విష్ణుమాయ ఆతుర వ్యక్తికై క్రియమాణ కర్మ దాని ఫలం - పిండ బ్రహ్మాండాల సమాన స్థితి
గమనిక ఆతుర అనగా ఇక్కడ మరణాసన్నయని భావము.
ప్రభో! ఉద్భిజ, స్వేదజ, అండజ, జరాయుజ - ఈ నాలుగు ప్రకారాల ప్రాణులూ ఎలా పుడతాయి? త్వచ, రక్తం, మాంసం, మేద, మజ్జ, అస్థిలలోకి జీవం ఎలా వస్తుంది? రెండు కాళ్ళు, రెండు చేతులు, గుదము, నాలుక, వెంట్రుకలు, గోళ్ళు, తల, సంధిమార్గాలు, నానా ప్రకారాల రేఖలు - ఇవన్నీ ఎలా ఏర్పడతాయి? కామ, క్రోధ, భయ, లజ్జ, హర్ష, సుఖ, దుఃఖాది భావాలు మనసులోకి ఎలా వస్తాయి? ఈ శరీర చిత్రణ, ఛిద్రణ, వేష్టన ఎలా జరిగింది? హే హృషీకేశ ఇదంతా నాకేదో ఇంద్రజాలంలా కనిపిస్తోంది. ఇదంతా నాకు వివరంగా తెలియాలంటే మీరు తప్ప వేరే సాధనం నాకు లేదు. ఇంత అద్భుతమైన ప్రపంచానికి కర్త ఎవరు?’ అడిగాడు గరుడుడు. చెప్పసాగాడు శ్రీ మహావిష్ణువు.
‘వత్సా! దేనిని తెలుసుకుంటే వ్యక్తి సర్వజ్ఞుడవుతాడో దానినే చెప్తున్నాను విను.
స్త్రీలు ఋతుకాలంలో నెలకు నాలుగు రోజుల పాటు పరిత్యజింపబడతారు. ప్రాచీనకాలంలో బ్రహ్మ వృత్త్రాసురుని ఇంద్రుడు చంపినప్పటి బ్రహ్మహత్యా పాతకంలో నాలుగవ భాగమును ఇంద్రుని శరీరం నుండి తీసి స్త్రీ జాతికి అంకితం చేశాడు. దాని వల్ల స్త్రీలు ఒక నాలుగు రోజుల పాటు అపవిత్రంగా వుండవలసిన అగత్యమేర్పడింది. ఆ పాపం వారి శరీరంలో నున్నంతకాలం పురుషుడు వారి ముఖం చూడరాదు. నాలుగవ రోజు శుద్ధి జరుగుతుంది. అప్పటి నుండి వారం రోజుల దాకా ఆమె దేవతలను, పితరులను పూజించడానికి యోగ్యతను కలిగియుంటుంది. ప్రథమ సప్తాహం మధ్యలో స్త్రీ గర్భం ఆగిపోతే దానిని మలింలూచోత్పత్తి అంటారు. వీర్యస్థాపన సమయంలో తల్లిదండ్రుల ఆలోచనలు పవిత్రంగా వుంటేనే పవిత్రులు జనిస్తారు.
గమనిక యుగ్మతిథులున్న రాత్రులలో సంగమం జరిగితే కొడుకులూ, అయుగ్మరాత్రి సహవాసం వల్ల కూతుళ్ళూ పుడతారు. కాబట్టి కొడుకు పుట్టాలని కోరుకునేవారు ఋతుకాలంలో తొలివారాన్ని వదిలేసి రెండవ వారంలో యుగ్మతిథులున్న రాత్రులలో సంగమించాలి. సామాన్యంగా స్త్రీలలో ఋతుకాలం ఒక నెలలో పదహారు రాత్రుల పాటు కొనసాగుతుంది. పదునాలుగవ రాత్రి గర్భాదానక్రియ జరిగితే ఆ గర్భం నుండి గుణవంతుడూ, భాగ్యవంతుడూ, ధనవంతుడూ, ధర్మనిష్ఠుడనగు కొడుకు పుడతాడు.
గమనిక: యుగ్మ తిథి వివరణ ఇలా ఉంది -
ఋతుకాలాలీగా మీస్యాత్ స్వచార నిరతః సదా ।
పర్వం వర్జం వ్రజే చ్చై నాం తద్వ్రతో రతి కామ్యయా ॥
ఋతుః స్వాభావిక స్త్రీణాం రాత్రయః షోడశ స్మృతాః ।
చతుర్భిరతలైః సార్ధ మహోభిః సద్విగర్హితైః ॥
తాసామాద్యాశతస్రస్తు నిందితై కాదశీ తథా ।
త్రయోదశీ చ శేషాస్తు ప్రశస్తా దశరాత్రయః ॥
యుగ్మాసు పుత్రోతాయంతే స్తియోఽయుగ్మాసు రాత్రేషు ।
తస్మాద్ యుగ్మాసు పుత్రార్థీ సంవిశేదార్తవే స్త్రియం ॥
ఋతుకాలంలో అయిదవ రోజున స్త్రీలు చేదు, ఘాటు, ఉప్పు, కారం, వేడి అధికంగా నున్న భోజనాన్ని చేయరాదు. మధుర భోజనాన్ని తినాలి. అలా చేస్తే ఆమె కడుపు ఔషధ పాత్రగానూ పురుష బీజం అమృతతుల్యంగానూ వుంటాయి. ఆ సమయంలో పురుషుడు క్రోధాన్ని త్యజించాలి. మధురభోజనం వల్ల స్త్రీ గర్భం మృదుస్వభావానికీ, శీతలతకీ, పన్నీటిజల్లు వంటి ప్రకృతికీ నెలవై వుంటుంది. ఆ రాత్రి పురుషుడు మధురమైన తాంబూలాన్ని సేవించి పూలమాలతో చందనచర్చతో సువాసితుడై స్వచ్ఛమైన సుందరమైన వస్త్రాలను ధరించి వుండాలి. తరువాత శుద్ద మనస్కుడై మంచి ఆలోచనలతో శయ్యను చేరాలి. వీర్యం పడే సమయంలో ఎంత మంచి ఆలోచన (ఇద్దరికీ) వుంటే అంత మంచి స్వభావమున్న సంతానం కలుగుతారు. జీవం ప్రారంభంలో శుక్ర రక్త సంయోగం వల్ల పిండరూపంలో అస్తిత్వంలోకి వస్తుంది. ఆ పిండమే స్త్రీ గర్భమనెడి ఆకాశంలోశుక్ల పక్షచంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమవుతుంది.
శుక్రంలో చైతన్యం బీజ రూపంలో వుంటుంది. చిత్తం కామావృతమై అది శుక్రంలో కదలి స్త్రీ గర్భాశయంలో ప్రవేశించి ఒక నిశ్చిత రూపాన్ని ధరించడానికి సిద్ధమవుతుంది. ఆ వేళలో రక్తం బలంగా ఉంటే కూతురు, శుక్రం (అంటే వీర్యమే) బలంగా వుంటే కొడుకూ పుడతారు. రెండూ బలంలో సమానం కాకూడదు. అలా వుంటే నపుంసకులు పుట్టే అవకాశముంది. శుక్రశోణి సంయోగం వల్ల నేర్పడిన పదార్థం ముందు కణ కేంద్రంగా కదిలి అయిదవ రోజుకల్లా ఒక బుడగంతయై పదునాల్గవ నాటికి మాంసపు ముద్దగా పరిణతి చెందుతుంది. తరువాత అది ఘనీభవిస్తూ, క్రమంగా ఇరవైయవ రోజుకి పిండరూపాన్ని ధరిస్తుంది. మరొక అయిదు రోజులకు దానిలో శక్తీ, పుష్టతా కలిగి కదులుతుంటుంది. ఒక మాసం గడిచేసరికి దానిలో పంచతత్త్వాలు ప్రవేశిస్తాయి. రెండవ మాసంలో చర్మం, కొవ్వూ, మూడవ నెలలో మజ్జా, అస్థీ, నాలుగవ నెలలో కేశాలూ, వ్రేళ్ళూ, అయిదవ మాసంలో కన్నూ, ముక్కూ వక్షస్థలం ఏర్పడతాయి. కంఠం, రంధ్రాలు, ఉదరం, అరవ మాసంలోనూ, గుహ్యాది భాగాలు ఏడవ నెలలో నిర్మింపబడగా, ఎనిమిదవ మాసంలో ఆ ఒకనాటి పిండం సర్వాంగ ప్రత్యంగాలతో పరిపూర్ణ రూపాన్నొంది జనని గర్భంలోనే అటూ ఇటూ కదలుతుంటుంది. తొమ్మిదవ మాసంలో దానిలో ఓజోగుణమేర్పడి ఒక పరిపక్వత లభిస్తుంది. అప్పటి నుండి అది గర్భం నుండి బయటపడడానికి ప్రయత్నిస్తూనే వుంటుంది. చివరికి దేవుడు నిర్ణయించిన ముహూర్తంలో ఆడ శిశువుగానో మగబిడ్డగానో మూడవ ప్రకృతిగానో పృథ్విపై జన్మించడం జరుగుతుంది. అప్పటికీ పదవ మాసం వచ్చి వుండవచ్చు. పదవ మాసంలోనే పాంచభౌతికమైన శరీర స్వరూపం అత్యంత స్పష్టమవుతుంది. (చాలమంది శిశువులు తొమ్మిదవ మాసంలోనే సంపూర్ణ స్పష్టత నొందియుంటారు) ప్రసవకాలీన వాయువులచే ఆకర్షింపబడి, తాత్కాలిక పీడచే వశము దప్పి, అప్పటికే తల్లి యొక్క సుషుమ్ణా నాడి ద్వారా చేజిక్కిన శక్తి వల్ల బాగా బలపడి ఆ జీవి వీలైనంత వేగం బయటపడడానికి ప్రయాస పడుతుంటుంది. గర్భంలో పంచభూతాలు కావు, ఆరు భూతాలుంటాయి. పృథ్వీ, జలం, హవి, భోక్త, వాయు, ఆకాశ - అనే ఈ ఆరు భూతాలూ గర్భస్థ శిశువును బయటికి పంపడానికి ప్రయత్నిస్తాయి. స్నాయుతంత్రికలచే బంధింపబడిన శిశువు వాటి ఒత్తిడి మధ్యనే కదులుతుంటుంది. విద్వాంసులు వీటినే మూలభూతతత్త్వాలుగా పేర్కొన్నారు. ఇవి శరీరమంతటా వ్యాపించిన సప్తనాడుల మధ్యలో వుంటాయి.
ఇక ఏ తత్త్వం కారణంగా ఏయే ద్రవ్యాలు, మనోవికారాలూ శరీరంలో చేరతాయో విను.
పృథ్వి - చర్మం, ఎముక, నాడి, రోమం, మాంసం.
జల - లాల, మూత్రం, శుక్రం, మూలుగ, రక్తం
తేజ - ఆకలి, దప్పిక, నిద్ర, బద్ధకం, కాంతి
వాయు - రాగం, ద్వేషం, లజ్జ, భయం, మోహం
ఆకాశ - సత్యాసత్యవివేకం, శబ్దం, చింత, గాంభీర్యం, శ్రవణం
అకుంచన, ధావన, లంఘన, ప్రసరణ, నిరోధములు కూడా వాయుతత్త్వ ప్రసాదాలే.
గరుడా! చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు - ఇవి జ్ఞానేంద్రియాలు. చేతులు, కాళ్ళు, మాట, గుద, గుహ్యేంద్రియాలు కర్మేంద్రియాలు. ఇడ, పింగళ, సుషుమ్ణ, గాంధారీ, గజజిహ్వ, పూష, యశ, అలంబుష, కుహు, శంఖిని - ఈ పదీ దశనాడులు. నాడులు పిండమధ్యంలో వుంటాయి. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ - అనే పదీ ప్రాణులలో నుండు వాయువులు. ప్రాణి తినే పదార్ధమే దాని పుష్టికి కారణమవుతుంది. మానవులు తినే అన్నాన్ని ప్రాణవాయువే శరీరం లోపలికి, దాని అన్ని సంధుల వద్దకు చేరవేస్తుంది. భోజన రూపంలో గ్రహింపబడిన ఆహారం వాయువు ద్వారా రెండు భాగాలుగా విభజింపబడుతుంది. వాయువే అగ్నిని రగిల్చి అన్నాన్ని జీర్ణం చేసి శుష్క భాగాన్ని వేరు చేసి దానిని పన్నెండు మార్గాల ద్వారా మలంగా బయటికి పంపుతుంది. శరీరభాగాలైన చెవులు, కనులు, ముక్కు నాలుక, పండ్లు, నాభి, గుద, గోళ్ళు - ఇవన్నీ - మలాశ్రయాలు. విష్ఠ, మూత్ర, శుక్ర, శోణిత రూపాలలో ఈ మలం అనేక రకాలుగా వుంటుంది.
కర్మానుసారమే మనిషికి సుఖ, దుఃఖాలూ, భయాలూ, శుభాలు జరుగుతాయి, కలుగుతాయి. కర్మానుష్టానం జరిగేది శరీరం ద్వారానే కాబట్టి అది మనిషికి మిక్కిలి ముఖ్యమైనది. దీని ద్వారానే ఉత్తమగతులు, అధమగతులు ప్రాప్తిస్తాయి. కాబట్టి శరీరోత్పత్తి ఎలా జరుగుతుందో తెలుసుకోవడం మంచిది. జీవిని గర్భం నుండి బయటకు వాయువు పంపించినపుడు దాని రెండు కాళ్ళూ పైకీ, ముఖం కిందికీ వుంటాయి. అప్పటికే అమ్మ దయ వల్ల దానికి ఎముకలతో సహా మొత్తం శరీరం కుదిరి వుంటుంది. గర్భస్త శిశువు నాభి తల్లి యొక్క శక్తివర్ధని నాడితో కలుపబడి వుంటుంది. దీనిని ‘ఆప్యాయని’ అంటారు. స్త్రీ ఆంతచిద్రానికది కూర్చబడి వుంటుంది. బయటికి రాకముందు ఆ శిశువుకి జ్ఞానం ఎక్కువగానే వుంటుంది. విషయ స్మృతులన్నీ వుంటాయి. మరల మరొక జన్మనెత్త బోతున్నాననే విషయం తెలిసి దుఃఖం కూడా వుంటుంది. లోపల్లోపలే దెబ్బలూ తగులుతున్నా అవి బాధింపవుగాని ఏ పాపకర్మల వల్ల తాను ఎలాటి బాధలనుభవించిందో గుర్తుకొచ్చి పడే బాధ ఎక్కువగా వుంటుంది. తనకు తానుగా ఒక గట్టి నిశ్చయానికీ వస్తుంది. ఇలా ‘ఈ జన్మలో నేను పాపమే చేయను. జన్మరాహిత్యానికే సర్వశక్తులనూ కేంద్రీకరించి ప్రయత్నిస్తాను’ ఇలా ఎన్నో జన్మల పాపాలనో పుణ్యాలను కూడానో అనుభవించడానికి ప్రాజాపాత్య వాయు ప్రభావం వల్ల గర్భాశయాన్ని వదలి తలో, కాళ్ళో ముందు పెట్టుకొని మర్త్యలోకంలో పడుతుంది జీవి.
అప్పుడు దానికి చాలా ఉక్రోషంగానూ దుఃఖంగానూ వుంటుంది. అందుకే గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ బయటికొస్తుంది. ఆ రావడంలోని శ్రమ వల్ల ఒక లిప్తకాలంబాటు తెలివి తప్పినట్లయినా వెంటనే బయటి వాయుస్పర్శ వల్ల చైతన్యము తిరిగి వస్తుంది. వాయు స్పర్శ దానికి సుఖాను భూతినిస్తుంది. అప్పుడు ఈ మొత్తం విశ్వాన్నే మోహితం చేసే విష్ణు మాయ దానిపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. అది పూర్వజ్ఞానాన్ని కోల్పోతుంది.
నేలపై బడ్డ ప్రాణి పెరిగి పెద్దదై ముసలిదై మరణించడం సర్వసామాన్యం. దానికర్మ ఫలాల వల్ల నరకానికో స్వర్గానికో పోవడం జరుగుతుంది. అక్కడ కూడా పుణ్యపాపాలు పూర్తిగా తీరవు. వాటి కోసం మరల పృథ్విపైకి రావలసి వుంటుంది. ఈ మొత్తం జన్మల వ్యవహారంలో, జననమరణ చక్రంలో దుఃఖానిదే సింహభాగం కాబట్టి మనిషి ముక్తికై ప్రయత్నించాలి.
మృత్యువు బాగా దగ్గర పడిందని తెలిశాక ఆ వ్యక్తికి గోమూత్ర, గోమయ, తీర్థోదక, కుశోదకాలచే స్నానం చేయించాలి. తరువాత స్వచ్ఛ, పవిత్ర వస్త్రాన్ని కట్టి గోమయంతో అలికిన నేలపై కుశలనూ తిలలనూ పరచి వాటిపై ఆ వ్యక్తిని పరుండబెట్టాలి. ఇక్కడ వాడేకుశలు దక్షిణాగ్రములై వుండాలి. వ్యక్తి తల తూర్పు వైపుగాని ఉత్తరం వైపు గాని వుండాలి. అతని (అమె) నోటిలో చిన్న బంగారం ముక్క నుంచాలి. తల వైపు దగ్గరగా భగవంతుని శాలగ్రామమూర్తినీ తులసి మొక్కనీ వుంచాలి. అనంతరం అక్కడే నేతి దీపాన్ని వెలిగించి పెట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. హృషీకేశుడైన విష్ణుదేవుని బాగా పూజించాలి. వినయభావంతో స్తుతి పాఠాలను వల్లించాలి. బ్రాహ్మణులకు, దీనులకు మరణాసన్న వ్యక్తి పేరిట దానాలివ్వాలి. ప్రాణం పోతున్నపుడు వ్యక్తికి బాధ కలుగుతుంటుంది. అందుచేత పుత్రాది బంధుజనులంతా పురుష సూక్తాన్ని పెద్ద గొంతులతో పఠించాలి. దాని వల్ల ఆ వ్యక్తి బాధలు నశిస్తాయి.
ఈ సమస్త కర్మలకూ ఫలమేమిటో కూడా విను. స్నానం వల్ల శరీరం యొక్క అపవిత్రత దూరమవుతుంది. విష్ణు భగవన్నామ స్మరణ వల్ల అన్ని ప్రకారాల ఉత్తమ ఫలాలూ కలుగుతాయి. కుశలూ, పత్తీ, ఆతుర వ్యక్తికి స్వర్గాన్నిప్పిస్తాయి. తిలలతో కుశలతో కలిపిన నీటి ద్వారా చేయించబడే ‘అతుర స్నానం’ అవభృథ స్నానమంత గొప్పది కాబట్టి ఆ వ్యక్తికి అంత పుణ్యమూ వస్తుంది. గోమయంతో అలికిన ఏ మండలంలోనైనా త్రిమూర్తులూ, లక్ష్మీదేవీ, అగ్నిదేవుడూ ముచ్చటపడి కూర్చుంటారు. వారి కర్మకు ప్రసన్నులౌతారు. ఇక పంచరత్నాలు నోట్లో వేయడం నుండి వచ్చే ఫలాలిలా వుంటాయి.
పంచరత్నముఖే ముక్తే జీవే జ్ఞానం ప్రరోహతి ।
తులసీ బ్రాహ్మణాగావో విష్ణురేకాదశీ ఖగ ॥
పంచప్రవహణా న్యేవ భవాబ్ధౌ మజ్జతాం నృణాం ।
విష్ణురేకాదశీ గీతా తులసీ విప్రధేనవః ॥
అసారే దుర్గ సంసారే షట్పదీ భక్తిదాయినీ ।
నమో భగవతే వాసుదేవాయేతి జపేన్నరః ॥
ఇవికాక పురుష సూక్త పఠనం వల్ల ఆతుర ప్రాణి మోహం నుండి విడివడి ముక్తివైపు కదలి వెళ్ళే మార్గం దొరుకుతుంది. బ్రాహ్మణులకూ, దీనులకూ, అనాథలకూ దానాలివ్వడం వల్ల ఆతుర ప్రాణి అనంతర దశల్లో ప్రసన్నుడౌతాడు.
గరుడా! నీకొక విషయం తెలుసా? ఈ బ్రహ్మాండంలో నున్న గుణాలన్నీ మానవ శరీరంలో వుంటాయి. ముందుగా లోకాలే తీసుకో. మనిషి పాదాలలో తల లోకం, పిక్కలలో వితల లోకం, మోకాళ్ళలో సుతల లోకం, సక్థిప్రదేశంలో మహాతలం, తొడల్లో తలాతలం, గుహ్యస్థానంలో రసాతలం, కటిలో పాతాళం, నాభి మధ్యంలో భూర్లోకం, దానికిపైన భువర్లోకం, గుండెలో స్వర్గలోకం, కంఠంలో మహర్లోకం, ముఖంలో జనలోకం, మస్తకంలో తపోలోకం, మహారంధ్రంలో సత్యలోకం వుంటాయి. మంచి మనిషిని సంతోషపెడితే ఇవన్నీ కూడా సంతోషిస్తాయి.
మనిషి శరీరంలోనే భారత జాతికి పరమ పవిత్రాలైన కులపర్వతాలూ మహాసాగరాలూ వున్నాయి. శరీర త్రికోణంలో మేరు, అధః కోణంలో మందర, దక్షిణంలో కైలాస, వామ భాగంలో హిమాలయ, దక్షిణ రేఖపై గంధమాదన, వామరేఖపై మలయ, ఊర్ధ్వ భాగంలో నిషధ పర్వతాలుండగా, అస్థిభాగంలో జంబూ, మజ్జలో శాక, మాంసంలో కుశ, శిరలలో క్రౌంచ, త్వచటోశాల్మలి, రోమసమూహంలో ప్లక్ష, గోళ్ళలో పుష్కర నామక ద్వీపాలు నిలబడి వుంటాయి. మూత్రంలో క్షారోద, క్షాగతత్వంలో క్షీర, శ్లేష్మంలో సురోదధి, మజ్జలో ఘృత, రసంలో రసోదధి, రక్తంలో దధి, కాకు మాంసంలో స్వాదూదక సాగరాలు ప్రవహిస్తుంటాయి. శుక్రంలో గర్భోదక సాగరముంటుంది. ఇక గ్రహాలు కూడా వుంటాయి. నాదచక్రంలో సూర్యుడు, బిందు చక్రంలో చంద్రుడు, నేత్రాలలో మంగళుడు, గుండెలో బుధుడు, విష్ణు స్థానంలో గురుడు, శుక్రంలో శుక్రుడు, నాభి స్థానంలో శని, ముఖంలో రాహువు, పాయువులో కేతువు నెలకొని వుంటారు. కాబట్టి ఈ జన్మ దుర్లభం.
విశ్వరూపునిలో ఇవన్నీ ఉన్నాయి. దేవుడు మానవుని శరీరంలో వీటిని రేఖా మాత్రాలుగా ఉంచి మానవుడు మంచిగా బ్రతికి తనలోనే కలవాలని సూచించాడు. మనిషి తన పాపకర్మల కొద్దీ ఆయనకి దూరంగా పారిపోతుంటాడు. అతని పరుగు నరకంవైపే. జనన మరణ చక్రంలో గిరగిర తిరుగుతుండే ఈ సామాన్య మానవుల జీవిత విశేషాలూ, మృత్యువూ, మరుజన్మా ముందే నిశ్చితమై పోతూ వుంటాయి.
ఆయుః కర్మచ విత్తంచ విద్యా నిధనమేవచ ।
పంచైతాని హి సృజ్యంతే గర్భస్థస్యైవ దేహినః ॥ 32.126
పక్షీంద్రా! ఉత్తమ ప్రకృతి గల వ్యక్తి తన సుకృతాల వల్ల మంచి భోగాలననుభవిస్తాడు. వాని జన్మం కూడా మంచి చోటనే కలుగుతుంది. కాని ఆ పాపకర్మలను చేస్తూ జన్మను దుర్వినియోగ పఱచిననాడు అతడు మరుజన్మలో భగవంతునికీ సుఖానికీ కూడా దూరమై పోతాడు. మంచి జన్మ వచ్చినా సుఖ భోగాలకు దూరంగా భగవద్భక్తునిగా బతికినవాడు భగవంతునికి దగ్గరౌతూ క్రమంగా ఆయనలోనే కలసి పోతాడు.
Summary of chapter 32 of the Garuda Mahā Purana - Preta Khaṇḍa is as follows:
The Divine Lord vividly describes the painful process of rebirth and the soul’s confinement within the mother's womb, shedding light on the hidden suffering of incarnation. Bhagavān Vishṇu explains how the Jīva, bound by its past Karma, enters the microscopic embryo and undergoes physical formation in a cramped, dark, and warm environment over nine months. The Lord reveals that while inside the womb, the soul retains memory of its previous lives and laments its past errors, fervently praying to Bhagavān Vishṇu for deliverance from the endless cycle of birth and death.