గరుడ మహా పురాణము - ప్రేత ఖండము
38 - తీర్థమరణం, తత్సమయ భగవన్నామ మహిమ, శాలగ్రామ, తులసుల సన్నిధిలో మరణఫలం ముక్తిదాయక, స్వర్గదాయక ప్రశస్త కర్మలు, ఇష్టాపూర్త, ప్రేత సంస్కార, కర్మల మాహాత్మ్యం
‘హే జగన్నాథా! ఏ యే దానాల వల్లా తీర్థసేవనాల పల్లా మోక్షంగాని చిరకాల స్వర్గవాసం గాని లభిస్తాయి? సత్య, తేజో లోకాలే పుణ్యానికి ఫలాలు? ఎక్కడ మరణిస్తే ప్రాణికి స్వర్గం లేదా మోక్షం అబ్బుతుంది? అని అడిగాడు గరుత్మంతుడు. దానికి మహా విష్ణువిలా చెప్పసాగాడు.
‘గరుడా! భారతదేశంలో మానవయోని పదమూడు జాతులుగా వుంది. ఏ జాతివాడైనా మానవుడైతే చాలు, తీర్థయాత్ర చేయవచ్చు.
అయోధ్యా మథురామాయా కాశీకాంచీ అవంతికా ॥
పురీ ద్వారవతీ జ్ఞేయా సప్తతా మోక్షదాయికాః । 38.6
ఈ సప్తపురాలూ మోక్షదాయకాలే. అది కాక, మనిషి తాను పోతున్నానని తెలిసినప్పుడు తన ప్రాణం తన గొంతులోనే కొట్టాడుతున్నపుడు “నేను సర్వసంగ పరిత్యాగం చేస్తున్నాను. నేను సన్యాసినీ” అని గట్టిగా అనగలిగినా, అనుకున్నా వెంటనే ప్రాణం పోతే, ఆ మనిషి విష్ణులోకానికి వెళతాడు. అతనికి పునర్జన్మ వుండదు.
మృత్యువేళలో ‘హరి’ యను రెండక్షరాలను ఒక్కసారి పలికినా మోక్షప్రాప్తి వుంటుంది. ప్రతి దినమూ ‘కృష్ణ కృష్ణ కృష్ణ’ అంటూ నన్ను తలచుకొనే వానిని నీటిలోంచి కమలాన్ని పైకి తీసినట్లు నేనే స్వయంగా నరకంలోంచి పైకి తీసుకొస్తాను. శాలగ్రామ శిలగాని ద్వారవతీ శిలగాని రెండూ కలిపిగాని వున్న చోట మోక్షప్రాప్తి కన్ని అవకాశాలు వుంటాయి. శాలగ్రామ శిల గల చోట యజమాని ప్రాణం పోతే ఆయనకి మోక్షం వస్తుంది.
మృతో విష్ణు పురంయాతి నపునర్జాయతే క్షితౌ ।
సకృదుచ్చరితం యేన హరి రిత్యక్షర ద్వయం ॥
బద్దః పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి ।
కృష్ణ కృష్ణేతి కృష్ణేతి యోమాం స్మరతి నిత్యశః ॥
జలం భిత్త్వా యథా పద్మం నరకాదుద్దరామ్యహం ।
శాలగ్రామ శిలాయత్ర యత్ర ద్వారవతీ శిలా ॥
ఉభయోః సంగమోయత్ర ముక్తిస్తత్ర న సంశయః ।
శాలగ్రామ శిలా యత్ర పాపదోషక్షయావహా ॥
తత్సన్నిధాన మరణాన్ముక్తిర్జంతోః సునిశ్చితా । 38.11
గరుడా! తులసికున్న ప్రాశస్త్యం, పావిత్ర్యం మరే మొక్కకీ వుండవు. తులసి మొక్కను నాటి, దాని పాలన పోషణలను చూసి, నీటితో తడిపి, ధ్యానం స్పర్శ-గుణ గణాలను గావించే మనుష్యులకు పూర్వజన్మల సంచిత పాపాలన్నీ దగ్ధమైపోతాయి.
రోపణాత్ పాలనాత్ సే కాద్ధ్యాన స్పర్శన కీర్తనాత్ ।
తులసీ దహతే పాపం నృణాం జన్మార్జితం ఖగ ॥ 38.11
మానసతీర్థావగాహనం చేసిన వారికిక ఏ పాపాలూ అంటవు.
నిజానికి దేవతలు కఱ్ఱల్లో రాళ్ళలోనో వుంటారనుకుంటారు గానీ వారుండేది మనిషి మనసులో, భావనలో మనిషి ఆ వస్తువును ఆ దేవునిగా భావించి పూజించినప్పుడా దేవుడా వస్తువులోకి వచ్చి పూజలందుకుంటాడు.
జ్ఞానహ్రదే సత్యజలే రాగద్వేషమలాపహే ।
యః స్నాతో మానసే తీర్థేన స లిప్యేత పాతకైః ॥
న కాష్ఠే విద్యతే దేవో న శిలాయాం కదాచన ।
భావేహి విద్యతే దేవస్తస్మాద్భావం సమాచరేత్ ॥ 38.13
చేపలు పట్టేవాడు రోజూ పొద్దున్నే గంగా లేదా నర్మదా లేదా ఇతర పుణ్యనదీ దర్శనం చేస్తాడు. అంత మాత్రాన అతడు తీర్థసేవన ఫలాన్ని పొందలేడు. అతడు వెళ్ళేది భుక్తి కోసమే కాని భక్తితో కాదు. అలాగే తగాదాల్లో కొట్లాటల్లో మృతి చెందిన వానికీ పుణ్యం రాదు. అదే దేశం కోసం యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గం లభిస్తుంది. అలాగే బ్రాహ్మణ, గో, స్త్రీ, బాలక హత్యలను అడ్డుకోబోయి ఆ ప్రయత్నంలో ప్రాణాన్ని పోగొట్టు కున్నవానికి మోక్షం లభిస్తుంది.
బ్రాహ్మణార్థే గవార్థేచ స్త్రీణాం బాల వధేషు చ ।
ప్రాణత్యాగ పరోయస్తు సవై మోక్షమవాప్నుయాత్ ॥ 38.16
నిరాహార వ్రతం, బంధన ఛేదనం, బ్రాహ్మణులకి దానం, పైన చెప్పిన ఇతర మార్గాల మోక్షమార్గాలైనట్లే స్వర్గమార్గాలు కూడా వున్నాయి. గోశాలలో, దేశ విధ్వంసంలో, యుద్దభూమిలో, తీర్థస్థలంలో మృత్యువు శ్రేయస్కరం. ప్రాణి అక్కడ శరీరాన్ని త్యజించిన వెంటనే స్వర్గం చేరుకొని అక్కడ చిరకాలం నివాస ప్రాప్తినొందుతాడు. పండితులు దీనిని బాగా బోధపఱచుకొని ప్రవర్తిస్తే వారి పాండిత్యం సార్థకమవుతుంది. హరిక్షేత్ర, కురుక్షేత్ర, భృగుక్షేత్ర, ప్రభాస, శ్రీశైల, అర్బుద, త్రిపుష్కర, శివక్షేత్రాలలో మరణించిన వారు బ్రహ్మ యొక్క ఒక రోజు పూర్తయ్యేదాకా స్వర్గంలో వుంటారు. తరువాత పుడమిపై పుడతారు. సచ్చరిత్రుడైన బ్రాహ్మణునికి ఒక సంవత్సరం జీవన నిర్వాహకానికి సరిపడా అన్నవస్త్రాదులను దానమిచ్చినవాడు తాను స్వర్గప్రాప్తి నొందడమే కాకుండా తన వంశాన్ని కూడా ఉద్ధరించగలడు.
తన కూతురిని వేదపారంగతుడైన బ్రాహ్మణునికిచ్చి వివాహం చేసినవాడు తన పరివారంతో సహా (కుటుంబం కూడా) ఇంద్రలోక నివాసం చేయగలడు. మహాదానాలకూ అట్టి ఫలమే దక్కుతుంది. వాపీ, కూప, తటాకాది జలాశయాలను నిర్మించిగాని పాడుపడిన వాటిని మరల బాగు చేయించి వినియోగంలోకి తెచ్చిగాని జాతికంకితం చేసిన వారికీ అదే ఫలం చెప్పబడింది. జీర్ణదేవాలయోద్దరణ వల్ల పై జెప్పిన వాటికీ రెట్టింపు పుణ్యం వస్తుంది. విద్వాంసుడైన బ్రాహ్మణుడు కుటుంబ సమేతంగా తలదాచుకోవడానికొక ఇంటిని దానమిచ్చినవాడు మూడున్నర కోట్ల సంవత్సరాలు స్వర్గంలో వుంటాడు. నిత్యమూ ఒక బ్రాహ్మణునికి దినగ్రాసము నిచ్చువాడు నాలుగు చామరాలతో వెలుగొందు దివ్య విమానంలో స్వర్గానికి వెళతాడు. పాపాత్ముడు పరివర్తన చెంది నరకానికి పోకుండా వుండాలనుకుంటే జప తప పూజాదులతో బాటు ఒక బ్రాహ్మణునికి దిన గ్రాసదానానికి పూనుకుని ఆ దానాన్ని కొన్నేళ్ళపాటు కొనసాగిస్తే అతని పాపాలన్నీ దగ్ధమైపోతాయి. పేద విప్రుని కన్యకు తానే పూనుకొని వేదాంతవేత్త కామెనిచ్చి అన్ని ఆచారాలను పాటించి వివాహం చేసే ఏ వర్ణునికైనా అన్ని రకాల పాపాలు నశిస్తాయి.
అత్యవసరమైనచోట జలాశయ నిర్మాణం, నిర్ధనుని అవసరాన్ని గుర్తించి చేసే దానం చేయువాడు స్వర్గానికి పోయి అక్కడే నాయకుడవుతాడు. మనిషై పుట్టినవాడు వ్యర్థజీవనుడు కాకుండా వుండి పోవాలంటే దానం, దమం, దయ అనే మూడంశాలనూ పాటించాలి. ఇవే మానవ జీవన సారం.
ఫల్గుకార్యం పరిత్యజ్య సతతం ధర్మవాన్ భవేత్ ।
దానం దమో దయా చేతిసారమే తత్త్రయం భువి ॥
దానం సాధోర్దరిద్రస్య శూన్య లింగస్య పూజనం ।
అనాథ ప్రేత సంస్కారః కోటియజ్ఞ ఫలప్రదః ॥ 38.40
దరిద్రునికి చేసే దానం, శూన్య జీర్ణ శివాలయోద్ధరణ, అనాధ ప్రేత సంస్కారం - వీటిలో ఏ ఒక్కటీ చేసినా కోటీ యజ్ఞాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది.
గమనిక 39వ అధ్యాయం అశౌచవ్యవస్థ ఇంతకు ముందే చెప్పబడింది.)
Summary of chapter 38 of the Garuda Mahā Purana - Preta Khaṇḍa is as follows:
The Supreme Lord imparts supreme metaphysical wisdom regarding the true nature of the Ātman, revealing to Garuḍa that the individual soul is eternal, immutable, and beyond physical destruction. Bhagavān Vishṇu explains that just as a person discards worn-out garments to put on new ones, the Ātman casts off decaying physical bodies while remaining entirely untouched by birth, death, disease, or sorrow. By realizing one's true identity as the immortal self rather than the perishable physical vessel, the seeker conquers all fear of death and rests in eternal peace.