గరుడ మహా పురాణము - ప్రేత ఖండము
7 - సంతప్తక బ్రాహ్మణుడు - పంచ ప్రేతాల కథ
విష్ణు మహిమ విస్తారంగా కనిపించే కథను వినాలనుందని వినతానందుడు వేడగా ఆతనిననుగ్రహించి చెప్పసాగాడు విరూపాక్షాది దేవనందితుడైన విశ్వవ్యాపి ఇలా :
‘గరుత్మాన్! పూర్వకాలంలో సంతప్తకుడని తపోధనుడైన బ్రాహ్మణుడొకాయన వుండేవాడు. ఆయన తన తపోబలం వల్ల పాపరహితుడైనాడు. ఈ సంసారం పేరులోనే గాని తత్త్వంలో సారం లేనిదేనని తెలుసుకున్నవాడై, అడవులలోకి పోయి వైఖానస మునుల వృత్తినే తానూ పాలిస్తూ అరణ్యంలోనే చరిస్తుండేవాడు. బాహ్య చిత్తవృత్తులను అదుపులో పెట్టుకొని తద్ద్వారా ఇంద్రియాలపై విజయం సాధించే ఉద్దేశ్యంతో తీర్థయాత్రలకు బయలు దేరాడు. కాని, దారిలో దారి తప్పి ఒక చీమలు దూరని, కాకులు కూడా దారి తప్పితే ఇక పట్టుకోలేని మహారణ్యంలోనికి వెళ్ళిపోయాడు. అతనికి నలువైపులా బ్రహ్మాండంగా పెరిగిన చెట్టూ, లతలూ పొదలూ ఇక దారీ తెన్నూ తోచనివ్వలేదు. సాధు, క్రూర జంతువులు, పక్షులు, రాక్షస పిశాచగణాలూ మాత్రమే అక్కడున్నాయి. నరసంచారం లేదు.
సంతప్తునికి భయమనిపించలేదు. గానీ దిక్కు తోచలేదు. కానున్నది కాక మానదు కదా, ఏదో ఒకటి జరుగుతుందిలే అనుకుంటూ ఒకవైపు సూటిగా సాగిపోయాడు. కొంతసేపటికి కీచురాళ్ళ అరుపులు కర్ణకఠోరంగానూ, గూడ్లగూబల ధూత్కారాలు భయంకరంగానూ వినిపించసాగాయి. అయినా ఆగలేదు కాని ఒక చోట నొక జుగుప్సాకర దృశ్యాన్ని చూసి నిలబడిపోయాడు. అడుగు ముందుకు పడలేదు.
అక్కడొక మఱ్ఱిచెట్టుకి కట్టబడి వేలాడుతూ ఒక శవం వుంది. దానిని అయిదు ప్రేతాత్మలు పీక్కు తింటున్నాయి. ప్రతి ప్రేతమూ చూడడానికి చాలా భయంకరంగా వుంది. ముఖం మీద తప్ప ఇంకెక్కడా మాంసం లేదు. చేతులు, కాళ్ళు, అన్ని అంగాలూ ఎముకల మీద చర్మం కప్పినట్టున్నాయి. ముఖంలో కళ్ళు లేవు; వాటికి బదులు రెండు గోతులున్నాయి. ఆ గోతులలోకి జారిపోయిందో, జారిపోతానని భయపడి పారిపోయిందో గాని ముక్కు అసలే లేడు. నెత్తి పై జుట్టు లేదు. అలాగని కోతిలా చూడగానే నవ్వు పుట్టించేలా కాకుండా భయంతో గుండెలవిసిపోయేలాగున్నాయవి. బ్రాహ్మణుడు వాటిని చూసి భయంతో మ్రాన్పడి పోగా అవి మాత్రం ఆయనను చూడగానే పిచ్చి ఆనందంతో గెంతులేస్తూ ‘వీడిని నేను తింటా’నంటే ‘నేను తింటా’నంటూ ఆయన వైపు పరుగు దీసి కాళ్ళను రెండు ప్రేతాలూ చేతులను రెండు ప్రేతాలూ పట్టుకోగా అయిదవది ఆయన తలను పట్టుకుంది. అవన్నీ భయంకరంగా అరుస్తూ అలా పట్టుకొనే గాలిలోకి లేచాయి. అంతవఱకూ తింటున్న శవంలో ఇంకా మాంసం వుండిపోవడంతో దానినల్లా దండగ పెట్టడం ఇష్టం లేక కిందికి వచ్చి దానిని కాళ్ళలో ఇరికించుకొని మళ్ళా పైకి లేచాయి.
అపుడా భయార్తుడైన సంతప్త బ్రాహ్మణుడు విష్ణుదేవునిలా ప్రార్థిస్తూ తన రక్షణకై పిలువనారంభించాడు. ‘ఆపద్రక్షకా! జగన్నాయకా! నాకు నీవే శరణు. నన్ను కాపాడు. దేవాధిదేవా, చిన్మయా, సుదర్శన చక్రధారీ, హరీ! నన్ను కాపాడు.
ఖగరాజారూఢుడై మొసలి నోట చిక్కిన ఏనుగును తన చక్రం ద్వారా రక్షించిన సామజవరగమనుడు నా కర్మ పాశాలను కూడా ఆ మొసలి తలను వలెనే ఖండించి నన్ను ముక్తుని చేయాలి గాక! రమారమి వందమంది నిర్దోషులైన రాజకుమారులను కారాగారంలో బంధించి బలిచ్చుటకు సిద్ధపడిన కర్కోటక లోకకంటక జరాసంధుని ధర్మజ రాజసూయ మిషచే చంపించి లోకకల్యాణాన్ని గావించిన శ్రీకృష్ణపరమాత్మ ఆ రాకుమారులకు వలెనే నాకునూ విడుదలను ప్రసాదించాలి గాక!’ అంటూ మరెన్నో విధాల నా అవతారతత్త్వాన్ని కీర్తిస్తూ ఆర్తితో అరుస్తూ నన్నే రమ్మని పిలచిన ఆ తపస్సంపన్నునిపై ప్రేమతో కూడిన జాలి కలుగగా నేను స్వయంగా బయలుదేరాను. నేనా దరిదాపులకు చేరగానే అతనిలోని ఏ తపశ్శక్తి ఆ విషయాన్నతనికి చేరవేసిందో యేమోగాని అతడు భయాన్ని వదిలేసి ఆ ప్రేతాల మూపులపై పల్లకీలో రాజులాగా సుఖంగా నిద్రిస్తున్నట్లయినాడు. నేనా గుంపు వెనకే కాసేపు వెళ్ళగా అక్కడ మణిభద్రుడను యక్షరాజు కనిపించాడు. నేనతనికి ‘ఈ ప్రేతాల సంగతేదో చూడు’మని కనుసైగ చేశాను. వెంటనే అతడా భయంకర ప్రేతాలకే దుఃఖాన్నీ, భయాన్నీ కలిగించే ప్రేతరూపాన్ని ధరించి వాటి కనులు కలవరపడేలా, గుండె గుభిల్లుమనేలా పెద్ద భుజాలతో, బుసలు కొడుతున్న తాచు పామంత నాలుకతో, ఉచ్చ్వాస నిశ్వాసాలను అవి భయంతో కంపించేలా తీసుకుంటూ ముందు వాటి యెదుట నిశ్చలంగా నిలబడ్డాడు. వారు (అవి) భయం నుండి తేరుకొనేలోగానే రెండింటిని చేతులతో రెండింటిని కాళ్ళతో ఒక ప్రేతాన్ని నోటితో ఒడిసి పట్టి భయంకరమైన పిడిగుద్దులతో వాటి (వారి) ఒళ్ళు హూనం చేసేశాడు. వారి చేతుల నుండి బ్రాహ్మణుని విడిపించి, శవాన్ని పట్టుకొని ఆ మణిభద్ర యక్షుడు మాయమైపోయాడు. మణిభద్రుని శిక్షతో నా (విష్ణువు యొక్క) దయతో వారి (ప్రేతాల) పాపాలు నశించి బ్రాహ్మణునికి ఎదురుగా మోకరిల్లి ఇలా అన్నారు. ‘హే విప్రదేవా! మమ్మల్ని క్షమించండి’ ఆయనకు చేతులు జోడించి ప్రదక్షిణ చేసి మరల క్షమింపుమని కోరారు. దీనికి కారణం బ్రాహ్మణ దర్శనం, శ్రీహరి కరుణ, యక్షస్పర్శల వల్ల వారికి పూర్వ స్మృతి కలగడమే. వారి దీన వదనాలనూ, మరింత దీనాలాపనలను చూసి మనసు కరిగిన బ్రాహ్మణుడు వారినిలా అడిగాడు :
‘బాబూ! మీరెవరు? ఇదంతా ఏమిటి? ఏదైనా మాయయా లేక నా చిత్త భ్రమా?”
స్వామీ! ఇది మాయా కాదు భ్రమా కాదు. మేం ప్రేతాలం. మా పూర్వ జన్మ దుష్కృతాల వల్ల ఇలా మాకు ప్రేత యోని ప్రాప్తించింది.’
‘ప్రేతములారా! మీ పేర్లేమిటి? మీరేం చేస్తుంటారు? మీకీ దుర్దశ ఎలా ప్రాప్తించింది? నా పట్ల మీ ప్రవర్తనకి, అందులోని మార్పుకి కారణమేమీ?’
‘ద్విజోత్తమా! మీ ప్రశ్నలన్నిటికీ ప్రత్యుత్తరాలిస్తాము. మా పేర్లు - పర్యుషిత, సూచీముఖ, శీఘ్రగ, రోధక, లేఖకులు. సామాన్య మానవులే అనుకొని మిమ్మల్ని పట్టుకున్నాం. మీరు యోగిరాజని విష్ణుభక్తులని తెలిశాక పూజిస్తున్నాము. మీ స్పర్శ మాత్రాననే మా పాపాలన్నీ ఎగిరిపోయాయి’
‘మీ నామధేయాలు విచిత్రంగా వినిపిస్తున్నాయి. ఇవి అర్థం లేనివని నాకనిపించడం లేదు. మీరు నాకు విస్తారంగా మీ గూర్చి వివరించండి’
అని బ్రాహ్మణుడాదేశించగానే ఆ ప్రేతాలొకటొకటిగా ఇలా చెప్పసాగారు.
‘బ్రాహ్మణోత్తమా! ఒకమారు నేను శ్రాద్ధం పెట్టవలసి వచ్చినపుడొక బ్రాహ్మణుని నియమించుకున్నాను. ఆ వృద్ధ బ్రాహ్మణుడు నడవలేక నడుస్తూ బాగా ఆలస్యంగా వచ్చాడు. నేను అకలికి తాళలేక శ్రాద్ధ కర్మ చేయకుండానే ఆ శాకపాకాలను తినేశాను. బ్రాహ్మణునికి పర్యుషిత (పాసిపోయిన) అన్నాన్ని ఎక్కడి నుండో తెప్పించి మరీ పెట్టాను. నేనిలా దుష్ట ప్రేతాన్ని కావడానికీ నా పేరు పర్యుషితుడు కావడానికి కూడా అదే కారణం.’
‘బ్రాహ్మణ దేవతా! నా పేరు సూచీముఖుడు. ఒకనాడొక బ్రాహ్మణి తీర్థస్నానానికయి భద్రవట తీర్థానికి వచ్చింది. ఆమెతో ఆమె అయిదేళ్ళ కొడుకున్నాడు. ఆమె అతనిని చూసుకొనే జీవిస్తున్నట్లుంది. నేనప్పుడు క్షత్రియ యువకునిగా జన్మించియున్నాను. అలవి మీరిన ఒళ్ళు పొగరు, క్రూరత్వాలతో ప్రజలను హింసిస్తుండేవాడిని. నేనా బ్రాహ్మణీ, పుత్రుల దారికాచి అతని తలపై పిడికిలితో బాది వారి సామాన్లన్నిటినీ లాగేసుకున్నాను. ఆ పసివాడు దాహం దాహమని ఏడుస్తుంటే తల్లి అతనికొక చిన్న పాత్రతో నీళ్ళిచ్చింది. నేను పాత్రను దౌర్జన్యంగా లాగేసుకొని ఖాళీ చేసేశాను. భయసంత్రస్తుడై, దాహవ్యాకులుడై ఆ పిల్లవాడు అక్కడే అప్పుడే మరణించాడు. అతని తల్లి ఆ గర్భశోకాన్ని తట్టుకోలేక అక్కడే వున్న నూతిలో దూకి అసువులు బాసింది. ఈ మహా పాపం వల్ల నాకీ ప్రేతయోని ప్రాప్తించింది.
పర్వతాకార శరీరుడనే కాని నాకు నోరు లేదు. కొంగలాగ సూది ముక్కుంది. నాకు అహారం దొరికినా దానిని తినడానికి చాలా సేపు కష్టపడవలసి వస్తుంది. నేనా రోజు బ్రాహ్మణ బాలకుని నీరు తాగనివ్వకుండా చేసినందుకు ఇలా అనుభవిస్తున్నాను. నా ఈ నోరు కలిసిన ముక్కు నా పేరుని సూచీముఖుడుగా చేసింది.
‘భూ సురేంద్రా! నా పేరు శీఘ్రగుడు. నేనొకప్పుడొక ధనవంతుడనైన వైశ్యుడను. ఆ జన్మలో నా మిత్రుడొకనితో కలసి ఇతర దేశాలకు వ్యాపార నిమిత్తమై వెళ్ళాను. నేను కటిక పేదవానిని కాకపోయినా నా మిత్రుని వద్ద అశేష ధనరాశులుండడంతో నాలో లోభం, దాని వల్ల క్రౌర్యం పెరిగాయి. మేమిద్దరం వ్యాపారం చేసి వెనుకకు మరలి వస్తున్నపుడు దారిలో తగిలిన ఒక నదిని పడవ సహాయాన దాటుతుండగా సూర్యుడస్త మించాడు. మసక చీకటిలో ప్రయాణీకులంతా ఎవరి గోల వారున్నారు. చాలామంది అలసట కారణంగా కునుకు పాట్లు పడుతున్నారు. వారిలో నా మిత్రుడు కూడా వున్నాడు. అతడు నా తొడ మీదే తల పెట్టి నిశ్చింతగా నిద్ర పోసాగాడు. నేనతనిని ప్రవాహంలోకి తోసేశాను. చీకటిలో నెవరూ చూడలేదు. అతని వద్దనున్న బహుమూల్య ప్రదాలైన రత్న జటిత స్వర్ణాభరణాలూ, ముత్యాలూ, బంగారు కాసులూ అన్నీ పట్టుకొని మా వూరొచ్చేశాను. నా మిత్రుని పత్నితో దారిదోపిడీ దొంగలు మాపై దాడి చేయగా ఆమె భర్త దొరికిపోయాడనీ, వారతని సొత్తంతా దోచుకొని అతనిని చంపేశారని చెప్పేశాను. నేను మరో దారంటా, తుప్పల వెంటా, నా సొమ్ముని పట్టుకొని పరుగెత్తి ఏదో చావు తప్పి కన్నులొట్టబోయిన చందాన ఇల్లు చేరానని చెప్పాను. నా జీవితాన్నంతటినీ ఆ పాపపు సొమ్ముతోనే గడిపాను. శీఘ్రంగా డబ్బు సంపాదనలో ముందుకెళ్ళానని నన్ను శీఘ్రగుడన్నారు కానీ ఆ పాపానికీ, నాకిలా ప్రేతయోనిలో పుట్టుక వస్తుందని ఎవరూ ఎరుగరు కదా!’
‘విప్రోత్తమా! నా పేరు గోధకుడు. నేను శూద్రజాతికి చెందినవాడను. రాజభవనం నుండి నాకు పెద్ద పెద్ద గ్రామాలొక వందపై అధికారం ఇవ్వబడింది. నా కుటుంబంలో వృద్ధులైన తల్లిదండ్రులు ఒక తమ్ముడు మాత్రమే ఉండేవారము. అయినా లోభం కొద్దీ నా తమ్ముడిని వేరే కాపురం పెట్టుకొమ్మని తరిమేసాను. వాడికేమీ లేదు. అన్నవస్త్రాలు లేక అవస్థపడుతున్నాడని తెలిసి నా తల్లిదండ్రులు రహస్యంగా నా గృహం నుండి అన్ని వస్తువులను పంపిస్తుండేవారు. నేనిది విని అగ్గిరాముడినై పోయి నా తల్లిదండ్రులను సంకెళ్ళతో బంధించి ఒక గదిలో పడేశాను. వారు అతి కష్టం మీద విడిపించుకొని ఆత్మాభిమానం దెబ్బతిన్నదనే బాధతో విషం మింగి మరణించారు. నా తమ్ముడు ఏమీ లేక ఎక్కడెక్కడో తిరుగుతూ ఏమైపోయాడో తెలియలేదు. వృద్ధులను బంధాలతో ‘రుద్ధం’ చేశాను కాబట్టి రోధకుడనే పేరు వచ్చి నిలిచింది. ఈ మహాపాపాల వల్ల నేనిలా ప్రేత యోనిలో పడి వున్నాను.’
‘హే విప్రదేవా! నన్ను లేఖకుడంటారు. పూర్వం ఉజ్జయినీ నగరంలో బ్రాహ్మణునిగా జనించాను. మారాజుగారు నన్నొక బ్రహ్మాండమైన కోవెలకు పూజారిగా నియమించారు. ఆ గుడిలో విభిన్న నామాలతో ఎన్నో విగ్రహాలున్నాయి. స్వర్ణ నిర్మితములైన ఆ విగ్రహాలలో అవసరమైన చోట పలు విలువైన రత్నాలు తాపడం చేయబడి వున్నాయి. వాటిని రోజూ పూజిస్తూ పుణ్యాన్ని వెనకేసుకోవలసిన నేను లోభమోహాలచే రాకాసి మనసు గలవాడినై డబ్బు వెనకేసుకోవాలనే వాంఛ పుట్టి మహాపాపినై పోయాను. బుద్ధి పాపాసక్తమై పోతే బ్రాహ్మణుడైనా, పూజాధికారైనా ఒకటే, రాక్షసుడైనా పిశాచమైన ఒకటే. నేనొక సూదిగా వాడిగా నున్న ఇనుప ఆయుధాన్ని చేపట్టి ఆ విగ్రహాలకున్న బంగారాన్నీ రత్నాలనూ పెకలించివేసి దాచేసుకున్నాను. మరునాడు ఎప్పటిలాగే కోవెల తెఱచి గోల గోల పెట్టేశాను, ఏమీ తెలియనివాడిలాగ. రాజుగారా రూపుమాసిన విగ్రహాలను చూసి ప్రజ్వలితాగ్ని వలె క్రోధంతో రగిలిపోయారు. ‘ఈ పని చేసిన దొంగను, దైవద్రోహిని, వాడు బ్రాహ్మణుడైనా సరే, పట్టుకొని నేరాన్ని నిరూపించి వానిని నా చేతులతోనే చిత్రవధ చేసి చంపేస్తాను’ అని దేవునియెదట ప్రతిజ్ఞ చేశారు.
ఆయన ‘బ్రాహ్మణుడైనా సరే’ అనడంతో అనుమానమేదైనా నా మీద కలిగిందేమో అనే అనుమానం నాకు కలిగి రాత్రికి రాత్రే రాజమందిరంలో ప్రవేశించి ప్రశాంతంగా నిద్రిస్తున్న రాజును చంపేసి అట్నుంచటే రత్నాలనూ బంగారాన్నీ పట్టుకొని పారిపోయాను. దాంతో భూదేవికి కూడా నా మీద అసహ్యం కలిగిందేమో అలా పారిపోతూ దారి తప్పి ఘోరారణ్యంలో దిగబడి అక్కడొక పులివాత పడి చనిపోయాను. కలం వంటి సాధనంతో మహా పాపం చేశాను కాబట్టి నన్ను నరకంలో లేఖకుడని పిలిచారు. అక్కడ ఎనలేని బాధలూ అనుభవించి ఇలా ప్రేతయోనిలో పడ్డాను.’
ఇలా అయిదు ప్రేతాలూ వినయంతో తమ పన్నాలను వినిపించగా బ్రాహ్మణుడు జాలిపడి వారి ప్రస్తుత పరిస్థితిని గూర్చి అడుగగా వారిలా చెప్పుకొని విలపించారు.
‘ఓ ద్విజేంద్రా! ఎక్కడ వేదమార్గం అనుసరింపబడుతుందో, ఎక్కడ లజ్జ, ధర్మం, దమం, క్షమ, ధృతి, జ్ఞానం వుంటాయో అక్కడ మేము ప్రవేశించలేము. శ్రాద్ధ, తర్పణ కర్మలు చేయబడని గృహాల్లో మేము దూరగలము. అక్కడి మనుషుల రక్తమాంసాలను వారికి తెలియకుండానే అపహరించి ఆరగిస్తాము. వారు ఏ జబ్బూ లేకుండానే నీరసించి పోతుంటారు. మా అహారం పరమ అసహ్యకరం. మలం దగ్గర్నుండి శవం దాకా అన్నీ తింటాం. మాకే సిగ్గనిపిస్తుంది - అయినా తప్పదు. మేము అజ్ఞానులం, తామసులం, మందబుద్ధులం, ఏ మాత్రం దైవశక్తి అలికిడి విన్నా భయంతో పారిపోయే పిరికిజనాలం. మాకీ ప్రేతజన్మ ఎప్పుడు పూర్తవుతుందా అని చూస్తుంటాం.’
బ్రాహ్మణుడు వారి బాధలను వింటుండగనే నేను (అనగా గరుడునికి ఇదంతా చెప్తున్న విష్ణువు) అతనికి దర్శనమిచ్చాను. హృదయంలో నివసించే అంతర్యామి పురుష స్వరూపంలో సాక్షాత్కరించిన నన్ను చూడగనే ఆ విప్రుడు నేలపై సాష్టాంగపడిపోయి నమస్కరించి స్తుతులతో నన్ను సంతుష్టపరిచాడు. అతని దయ వల్ల ఆ ప్రేతాలు కూడా నన్ను చూడగలిగాయి.
‘అన్ని రకాల ప్రాణులనూ కేవలం నీ దయతోనే, వారికే అర్హతా లేకపోయినా, నీవు ఉద్ధరించగలవు. మహాప్రభో! నీకు నమస్కారము’ అని పలుకుతున్న ఆ బ్రాహ్మణుని మనసులోని కోరికనర్థం చేసుకొని నేను వారందరికీ ఉత్తమలోకాలను ప్రసాదించాను.
నా ఇచ్ఛ మేరకు అత్యంత తేజము గల, శ్రేష్ఠ ఆకాశగమనం చేయగల, గంధర్వ, అప్సర యుక్తములైన ఆరు విమానాలక్కడికి వచ్చి ఆ బ్రాహ్మణునీ పంచప్రేతాలనూ ఎక్కించుకొని నా లోకానికి తీసుకొని పోయాయి’ అని చెప్పాడు శ్రీ మహా విష్ణువు.
Summary of chapter 7 of the Garuda Mahā Purana - Preta Khaṇḍa is as follows:
The Supreme Lord details the solemn Sapīṇḍīkaraṇa ceremony performed on the twelfth day after death, a momentous rite that marks the formal transition of the deceased from a lonely, wandering spirit to an honored ancestral Pitṛ. Bhagavān Vishṇu describes how the large Piṇḍa representing the newly departed is ceremoniously cut into three parts and merged with the three Piṇḍas representing the father, grandfather, and great-grandfather, symbolizing the soul's joyous reunion with its ancestral lineage. This sacred rite officially elevates the spirit into the community of ancestors, allowing it to receive formal Śrāddha offerings and bestow blessings of prosperity upon its living family.