గరుడ మహా పురాణము - ప్రేత ఖండము
12 - ఎనభై నాలుగు లక్షల యోనుల్లో మనుష్య జన్మ శ్రేష్ఠత - మనిషి ఏకమాత్ర కర్తవ్యం - ధర్మం
మనిషికి అన్ని చోట్లా హితాన్ని కలిగించేవీ ప్రేతత్వం నుండి ముక్తిని కలిగించేవీ ఏవేవో తెలిసింది కదా! గరుత్మంతా! ఈ సృష్టిలో ఎనుబది నాలుగు లక్షల యోనులున్నాయి. వీటిని నాలుగు రకాల జీవాలుగా విభజించవచ్చును. అండజ, స్వేదజ, ఉద్భిజ, జరాయుజ అనే ఈ రకాలలో మరల నొక్కొక్కటి ఇరవై యొక్క లక్షల జీవాలతో నున్నది. మనుష్యాది యోనులను జరాయుజాలంటారు. వీటిలో మనుష్యజన్మ పరమ దుర్లభం.
మనుష్య లేదా మానవజాతి సర్వ శ్రేష్ఠం. ఈ పంచేంద్రియ యుక్త యోని ప్రాణికి ఎంతో పుణ్యం చేసుకుంటే గాని లభింపదు. ఈ జాతిలో ప్రముఖమైన వర్ణాలు నాలుగు. బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర నామకములైన ఈ వర్ణాలు వృత్తుల ఆధారంగానేర్పడ్డాయి. వీరేకాక మానవులలో బిల్లులనీ, తుంబులనీ, మ్లేచ్చులనీ మరెన్నో ప్రకారాల జాతులున్నాయి. జీవులలో వేల సంఖ్యలో రకాలున్నా ఆహారం, మైథునం, నిద్ర, భయం, క్రోధం అన్నిటికీ వుంటాయి కాని వివేకం కొందరికే వుంటుంది. శారీరక సంరచన కూడా అన్నిటికీ ఒకేలా వుండదు. ఒకే పాదం నుండి ఎనిమిది పాదాలున్న ప్రాణులు కూడా వుంటాయి. రెండు పాదాలున్నది మానవజాతి.
కృష్ణ సారమను పేరు గల మృగం నివసించే ప్రదేశాన్ని ధర్మ దేశమంటారు. బ్రహ్మాది దేవతలంతా అక్కడే నివసిస్తారు. పంచమహా భూతాలలో ప్రాణీ, ప్రాణులలో బుద్ధి జీవీ, బుద్ధి జీవులలో మనిషీ, మనుష్యులలో బ్రాహ్మణ వర్ణులూ, శ్రేష్ఠులు. స్వర్గాన్ని గాని మోక్షాన్నిగాని సాధించుకొనే అవకాశం మానవ శరీరానికే వుంది. అటువంటి మానవ శరీరం (జన్మ) లభించి కూడా దానిని సత్కర్మలకూ మోక్షసాధనకూ వాడనివారు తమని తామే మోసగించుకుంటున్నట్లు లెక్క వందకాసులున్నవాడు వేయి కాసుల కోసం, వేయి గలవాడు లక్ష కోసం ప్రయత్నిస్తాడు. లక్షకాసులున్నవాడు రాజ్యం కావాలంటాడు. రాజుకి వాడికున్న రాజ్యం చాలదు. మొత్తం పృధ్వీనే శాసించేయాలనుకుంటాడు. అలా పృథ్వీ శాసకుడైన చక్రవర్తి దేవేంద్ర పదవినధిష్టించాలనుకుంటాడు. ఆ ఇంద్రుడైనా తృప్తిగా సుఖంగా విశ్రాంతిగా జీవిస్తాడా అంటే అదీ లేదు. ఇలా మొత్తం మానవజాతిని ఒకే మనసూ, ఆ మనసుని ఒకే ఒక తృష్ణా శాసిస్తున్నాయి. ఈ తృష్ణ వల్ల దానికి బానిసయైన మనిషి నరకానికి పోతాడు. తృష్ణను జయించినవానికి తృప్తి లభిస్తుంది. ఆ మనిషి ఆ తృప్తి వల్ల ఉత్తమ లోకాలను పొందుతాడు.
ఇచ్ఛతి శతీ సహస్రం సహస్రీ లక్ష మీహతే కర్తుం ।
లక్షాధిపతీ రాజ్యం రాజాపి సకలాంధరాం లబ్దుం ॥
చక్రధరోఽపి సురత్వం సురభావే సకలసుర పతిర్భవితుం ।
సురపతి రూర్ధ్వ గతిత్వం తథాపి ననివర్తతే తృష్ణా ॥
తృష్ణాయా చాభిభూతస్తు నరకం ప్రతిపద్యతే ।
తృష్ణా ముక్తాసు యేకేచిత్ స్వర్గవాసం లభంతితే ॥ 12.15
ఈ విశ్వంలో ఆత్మాధీనులైన వ్యక్తులే సుఖపడతారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ - అనే అయిదూ విషయాలు. ఈ విషయాలను కోరేవే విషయవాంఛలు. అవి జీవిని సుఖంగా బతకనివ్వవు. లేడి, ఏనుగు, దీపం పురుగు, తేనెటీగ, చేప - ఈ అయిదు ప్రాణులూ క్రమంగా శబ్ద, స్పర్శ, రూప, గంధ, రస - అనే ఒక్కొక్క విషయ వాంఛతోనే నశిస్తాయి. అలాటపుడు అన్ని విషయ వాంఛల కోసమూ ఆరాటపడే మనిషి గతి వేరే చెప్పాలా? మానవ సంఘానికి కొన్ని కట్టుబాట్లుంటాయి. వాటిని గౌరవించి పాటించినంత కాలమే ఆ సంఘానికి సుఖశాంతులుంటాయి. కానీ, మనిషి పుత్ర, కళత్రాది బంధాలలో చిక్కుకున్నంతకాలం ముక్తి మార్గం కనుపింపదు.
ఎంత గొప్ప మనిషైనా మృత్యువును జయించలేడు. ఈ లోకంలోకి ఒంటరిగా వస్తాడు. ఈ లోకం నుండి ఒంటరిగానే పోతాడు. ఏడుస్తూ వస్తాడు. ఏడుస్తూనే పోతాడు. ఏడుస్తూనే వచ్చినా నవ్వుతూ పోగలిగినవాడే యోగి, ఋషి, ధన్యాత్ముడు. ఒంటరిగా మరణించే మానవుడు తన పాప పుణ్యాల ఫలాలను కూడా ఒంటరిగానే అనుభవించవలసి వుంటుంది.
మనిషి బతికినంత కాలం తానెంతగానో ప్రేమించిన బందు బాంధవులు ఆ మనిషి మరణించగానే వాని శరీరాన్ని కట్టెల సవారీకెక్కించి ఎప్పడికో దూరంగా మట్టిబస్తాను వలె మోసుకెళ్ళి నిప్పుల్లో పడేసి ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు. ధర్మమొక్కటే వానిననుసరించి పోతుంది. ప్రాణి యొక్క ధనమూ వైభవమూ వాని ఇంటి దగ్గరే వుండిపోతుంది. ఆ బంధం అక్కడే తెగిపోతుంది. మిత్రులూ బంధు బాంధవులూ శ్మశానందాకా వెళతారు. వీరి బంధం ఇక్కడతో తెగిపోతుంది. ఇక పుట్టినకాడి నుంచి చావు దాకా పెంచి పోషించి ఇది నాదనుకొని విఱ్ఱవీగిన శరీరం అగ్నిలో పడి బూడిదై పోతుంది. దాని బంధం అక్కడితో సరి.
ఇక వీడని బంధమై విడువని మిత్రమై, జోడువిడని సైదోడై జీవాత్మతో మిగిలేది పాపపుణ్యాలే.
మృతం శరీర ముత్సృజ్య కాష్ఠలోష్ట సమం క్షితౌ ॥
బాంధవా విముఖా యాంతి ధర్మస్తమనుగచ్ఛతి ।
గృహేష్వర్థానివర్తంతే శ్మశానా న్మిత్ర బాంధవాః ॥
శరీరం వహ్నిరాదత్తే సుకృతం దుష్కృతం వ్రజేత్ ।
శరీరం వహ్నినా దగ్ధం పుణ్యం పాపం సహస్థితం ॥ 12.26
పక్షిరాజా! ధనవంతుడు ఈ రోజు సూర్యుడస్తమించేలోగా ఎవరికీ ఏమీ దానం చేయలేదనుకో రేపు తెల్లవారాక, ఈ లోగానే వాడి బతుకు తెల్లారిపోతే, ఆ డబ్బంతా ఎవరి వశమై పోతుందో ఎవరికి తెలుసు? ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల ఎంతో మంది దగ్గర ఎంతో కొంత ధనం వుండే తీరుతుంది కదా! దానిని పరోపకార నిమిత్తమో, శ్రేష్ఠద్విజుల దానార్థమో వాడకుండా అంతా తానూ తన పుత్రులే వాడేసుకోవాలనుకుంటే ఆ ధనమే ఒక రూపాన్ని ధరించివాడు పోయే ముందు అడుగుతుంది. ‘నన్నెలాగూ తీసుకుపోలేవు. కనీసం దానమైనా చేసి వుంటే ఆ పుణ్యాన్నయినా పట్టుకు పోగలిగివుండే వాడివి కదా’ అని. ఇలా ఆలోచించి రేపు ఏమవుతామో అనుకొని ఇవాళే సత్కర్మలను ఆచరించాలి. మనిషి శ్రద్ధాపూర్వకంగా, పవిత్రుడై, శుద్ధమనస్కుడై ఇచ్చే ధనం ధర్మాన్ని నిలబెడితే ఆ మనిషికి నరకమే వుండదు. ఈ ధర్మమే మళ్ళా అతని అర్థ కామ సముపార్జనలలో అక్కరకు వస్తుందనేది ధర్మసూక్ష్మం. శ్రద్ధాపూర్వకం కాని ధర్మం ఏ లోకంలోనూ అక్కరకు రాదు. ప్రచుర ధనరాశి వల్ల ధర్మం సిద్ధించదు. ధర్మ సిద్ది శ్రద్ధా మూలకం. అట్టి ధర్మమే ఆ వ్యక్తికీ మోక్ష ప్రదాయకం.
శుభం వాయదివా పాపం భుంక్తే సర్వత్ర మానవః ।
యదనస్తమితే సూర్యే న దత్తం ధన మర్థినాం ॥
నజానే తస్య తద్విత్తం ప్రాతః కస్య భవిష్యతి ।
రారటీతి ధనం తస్య కోమే భర్తా భవిష్యతి ॥
నదత్తం ద్విజముఖ్యే భ్యః పరోపకృతయే తథా ।
పూర్వజన్మ కృతాత్ పుణ్యాద్యల్లబ్ధం బహుచాల్పకం ॥
తదీ దృశం పరిజ్ఞాయ ధర్మార్థే దీయతే ధనం ।
ధనేన ధార్యతే ధర్మః శ్రద్ధా పూతేన చేతసా ॥
శ్రద్దా విరహితో ధర్మో నేహాముత్ర చ తత్ఫలం ।
ధర్మాచ్చ జాయతే హ్యర్థో ధర్మాత్ కామోపి ఽ జాయతే ॥
ధర్మ ఏవాప వర్గాయ తస్మాద్దర్మం సమాచరేత్ ।
శ్రద్దయా సాధ్యతే ధర్మో బహుభిర్నార్థ రాశిభిః ॥
అకించనా హి మునయః శ్రద్ధావంతో దీవం గతాః ।
అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ ॥
అసదిత్యుచ్యతే పక్షిన్ ప్రీత్య చేహన తత్ఫలం । 12.27
తరువాతి అధ్యాయాలైన 13,14లలో విష్ణువు వృషోత్సర్గ, గోదాన మహిమలను గూర్చి గరుడునికి వివరించినట్లు చెప్పబడింది. ఈ రెండు విషయాలూ ఇంతకు ముందే ఇదే పురాణంలో విస్తృతంగా చర్చింపబడ్డాయి.
Summary of chapter 12 of the Garuda Mahā Purana - Preta Khaṇḍa is as follows:
Bhagavān Vishṇu addresses the tragic circumstances of unnatural deaths caused by accidents, lightning, suicide, poison, or violence, explaining how such abrupt terminations of physical life trap the soul in a restless intermediate state known as Pretatva. The Lord describes the profound sorrow and disorientation experienced by these spirits, who remain bound to the earthly atmosphere without the ability to move forward or take a new body. To liberate these suffering souls, Bhagavān Vishṇu prescribes special expiatory rituals, including Nārāyaṇabali and special Śrāddha rites, which break the ghostly bondage and restore the soul to the path of light.