గరుడ మహా పురాణము - ప్రేత ఖండము
2 - మరణాసన్న మృత్యు పూర్వ సమయాల్లో చేయవలసిన కర్మలు
సూత మహర్షి ఇలా ప్రవచించసాగాడు. “మునులారా! నిర్మల మనస్కుడై లోక కల్యాణం కోసం ఆరాటపడుతూ అన్ని ప్రశ్నలను సంధించిన గరుత్మంతుని ఆంతర్యాన్ని గ్రహించిన పరమాత్మ వెంటనే ఇలా ఉపదేశించసాగాడు -
*వత్సా! వైనతేయా! మానవ హితం కోరి ఒక మహా విషయానికీ ప్రపంచంలో ప్రాచుర్యం కలిగించబోతున్న నీ ధన్యత కోసమైనా ఈ రహస్య విషయాన్ని చెప్పాలి. అస్తు. అవధరించు. వీటిని ఔర్ధ్వ దైహిక (పైకి లేచిన శరీరానికి సంబంధించిన కర్మలు అని భావము) క్రియలంటారు.
సమ్య గ్రూపం వల్ల భేదరహితమై, శ్రుతి స్మృతి - అను పవిత్ర గ్రంథాలలో మాత్రమే పేర్కొనబడి, ఇంద్రాది దేవతలూ, యోగులూ కూడా నేర్వని గుహ్యాతి గుహ్యమైన ఈ మహా తత్త్వ జనకమైన విషయాన్ని నువ్వు నా మహాభక్తుడివి కాబట్టి నీ ద్వారా బహిర్గతపఱస్తున్నాను.
పక్షీంద్రా! ఈ ప్రపంచంలో పుత్రహీనులకు సద్గతులుండవు. కాబట్టి ప్రతి వ్యక్తి శాస్త్రానుసారం, యోగానుసారం పుత్రుని ఉత్పన్నం చేయడం తప్పని సరి. ఎందుకంటే పుత్ర పౌత్రులే ఆ వ్యక్తి ఆత్మని పరలోకంలో మోస్తారు. అందుకు సంకేతంగానే ఇహలోకంలో వ్యక్తి మృత దేహాన్ని పుత్రపౌత్రులు భుజాలపై మోస్తారు.
మృతదేహాన్ని దహనమే చేయాలి. శవాన్ని తిలలు, దర్భలపై నేల మీద పడుకోబెట్టాలి. ఈ తిలల వల్ల దర్భల వల్ల భూమి ఋతుమతి యైన స్త్రీతో సమానమవుతుంది. మృతుల నోటిలో వేయు పంచరత్నాలు బీజావాపంతో సమానం. అవి ఆ జీవి శుభగతిని నిశ్చయించగలవు. ఆత్మ శుభయోనిలో ప్రవేశించడానికి దారిని సుగమం చేయగలవు.
అన్నిటి కన్న ముందు నేలను పేడతో అలకాలి. తరువాత దానిపై తిలలనూ కుశలనూ పరవాలి. మరణాసన్న వేళలో సదరు వ్యక్తిని వాటిపై పడుకోబెట్టాలి. ఇలా చెయ్యడం వల్ల ఆ మనిషి ప్రాణం పోయేలోగా కొన్ని పాపాలు దగ్ధమవుతాయి. దర్భలకు ఆ వ్యక్తిని స్వర్గానికి గొనిపోయే శక్తి వుంటుంది. మలమూత్రాదులు గాని ఆ ప్రదేశంలో వుంటే తొలగించి గోమయంతో శుద్ధి చేయాలి. ఆవు పేడతో అలకకుండా భూమిపై నుంచబడిన మరణాసన్న వ్యక్తి పైకి యక్ష, పిశాచ, రాక్షస గణాలు క్రిముల రూపంలో దాడి చేస్తాయి. భూమిపై జలంతో ఒక మండలాన్నేర్పాటు చేసి (జలమండలమనగా నీరు తడి, నేల పై గోళాకారంలో మండలం కొలతతో రేఖను గీసి పవిత్రీకరించుట) దానిపై ఆ వ్యక్తిని పడుకోబెట్టాలి. ఇది ముక్తిదాయకం. నిత్య హోమం, శ్రాద్ధం, పాదప్రక్షాళనం, బ్రాహ్మణులనర్చించుట, భూమండలీకరణ - వీటిని ముక్తి హేతువులుగా పరిగణిస్తారు. ఈ మండలంలో బ్రహ్మ, విష్ణు, రుద్ర, లక్ష్మి, అగ్ని- మున్నగు దేవతలు ప్రకాశిస్తుంటారు. మండల జలంలో మరణించని వారికి మంచి యోని దొరకదు. వారి జీవాత్మలు బహుకాలం పాటు గాలిలో దిక్కుతోచక తిరుగుతూనే వుండి పోతాయి. వారికి శ్రాద్ధాలలో నిచ్చు ఏ తర్పణలూ అందవు.
గరుత్మంతా! తిలలు నా చెమట నుండి పుట్టినవి కావడంతో పరమ పవిత్రాలయినవి. తిలలను ప్రయోగిస్తే అసుర, దానవ, దైత్యగణాలు సాగిపోతాయి. తిలలు తెల్లగానూ నల్లగానూ గోమూత్రపు రంగులోనూ వుంటాయి. ప్రతివ్యక్తీ వీటిని వాడుతూ ఇవి నా శరీరం ద్వారా చేయబడినట్టి సమస్త పాపములనూ నశింపజేయాలి గాక అని భావించు కుంటుండాలి. తిల దానం స్వర్ణదానం వలె పుణ్యశాలిని తర్పణాలలో, దానాలలో, హోమాలలో చేయబడు తిలదానానికి అక్షయ ఫలాలుంటాయి.
కుశదర్భలు నా శరీరం మీది రోమాల నుండి పుట్టినవి. అందుకే వాటిని వాడిన చోట దేవతలు తృప్తి చెందుతారు. తిలలు పితరులను తృప్తి పరుస్తాయి. దేవతలూ పితరులూ విశ్వరక్షకులు కాబట్టి కుశలూ తిలలూ విశ్వకల్యాణ కారకాలవుతున్నాయి. అపసవ్యది శ్రాద్ధలకు చెప్పబడిన విధి విధానాలను పాటిస్తే బ్రహ్మ దేవదేవేశ్వరుడు, పితృజనులు సంతోషిస్తారు.
మమస్వేద సముద్భూతా స్తిలా స్తార్క్క్ష్య పవిత్రకాః ।
అసురాదానవాదైత్యా విద్రవంతి తిలైస్తథా ॥
తిలాశ్వేత స్తిలా కృష్ణా స్తిలా గోమూత్ర సన్నిభాః ।
దహంతు తే మే పాపినా శరీరేణ కృతాని వై ॥
ఏక ఏవ తిలోదత్తో హేమద్రోణ తిలైః సమః ।
తర్పణే దాన హోమేషు దత్తోభవతి చాక్షయః ॥
దర్భారోమ సముద్భూతాః తీలాః స్వేదేషు నాన్యథా ।
దేవతా దానవా స్తృప్తాః శ్రాద్ధేన పితర స్తథా ॥
ప్రయోగ విధి నా బ్రహ్మా విశ్వంచాప్యుప జీవనాత్ ।
అపసవ్యాధితో బ్రహ్మా పితరో దేవ దేవతాః ॥
తేనతే పితరస్తృప్తా అపసవ్య కృతే సతి ।
కుశదర్భ మూలాన్ని బ్రహ్మగానూ, మధ్య భాగాన్ని విష్ణువుగానూ, అగ్రాన్ని శివునిగాను తెలుసుకోవాలి. ఈ త్రిదేవులూ కుశలో ప్రతిష్ఠితులు. బ్రాహ్మణుడు, మంత్రం, అగ్ని, తులసి, కుశ - వీటికి అపవిత్రత లేదు. ఎన్నిమార్లైనను ప్రయోగించవచ్చును, ఉపయో గించుకోవచ్చును. అవి నిర్మాల్యములు కానేరవు. అలాగే తులసి, బ్రాహ్మణుడు, విష్ణువు, గోవు, ఏకాదశి వ్రతం - ఇవి అయిదూ సంసార సాగరంలో మునిగిపోతున్న వారిని రక్షించు నౌకలు. విష్ణువు, ఏకాదశి వ్రతం, భగవద్గీత, తులసి, బ్రాహ్మణుడు, గోవు - ఈ ఆరూ అసారసంసారంలో పడి వున్న జీవులకు ముక్తినిచ్చు ‘షట్పది’ సాధనాలు.
దర్భమూలే స్థితో బ్రహ్మా మధ్యే దేవో జనార్దనః ॥
దర్భాగే శంకరం విద్యాత్ త్రయోదేవాః కుశస్మృతాః ।
విప్రమంత్రాః కుశా వహ్ని స్తులసీ చ ఖగేశ్వర ॥
నైతే నిర్మాల్యతాం యాంతి క్రియమాణాః పునః పునః ।
తులసీ బ్రాహ్మణాగావో విష్ణురేకాదశీ ఖగ ॥
పంచప్రవహణాన్యేవ భవాభ్ధౌ మజ్జతాం నృణాం ।
విష్ణురే కాదశీ గీతా తులసీ విప్రధేనవః ॥
అసారే దుర్గ సంసారే షట్పదీ ముక్తిదాయినీ ।
మరణాసన్న వ్యక్తికి దుర్గతి కలుగకుండా తిల, కుశ, తులసి కాపాడుతాయి.
తిలాః పవిత్రమతులం దర్భాస్యా పితుల స్యథ ॥
నివారయంతి చైతాని దుర్గతిం యాంత మాతురం ॥
రెండు చేతులతోనూ కుశలను చీల్చి నేలపై నుంచి వాటిపై నీటిని జల్లి మరల పైకి తీసి మరణాసన్న వ్యక్తి రెండు చేతులలోనూ ఉంచాలి. అప్పుడా వ్యక్తి మంత్రహీనకర్ముడైనా విష్ణు లోకాన్ని పొందగలడు. దర్భపై శయనం, మృతి, పేడచే అలకబడిన నేలపై మృతి, అగ్నిలో దహనం ఆ వ్యక్తి చేసిన పాపాలను దగ్ధం చేస్తాయి.
లవణం, దాని రసం దివ్యలోక ప్రాపకాలు. అవి ప్రాణుల సమస్త కామనలనూ సిద్ధింపజేయగలవు. లవణం లేని భోజనానికి అర్థం లేదు. అందుచేతనే లవణరసమంటే పితరులకు మిక్కిలి ప్రీతి. అది స్వర్గానికి దారులు తీయగలదు. ఈ లవణ రసం విష్ణు భగవానుని శరీరం నుండి ఉత్పన్నమైంది. ఈ విషయాన్ని తెలిసిన యోగులు దానంతో పాటు లవణాన్నీ అడిగి పుచ్చుకుంటారు. నేలపై ఏ వర్ణపు మరణాసన్న వ్యక్తికైనా మరణం రాక వేదన దుర్భరంగా వుంటే లవణ రసాన్ని దానం చేస్తే వారి కొఱకై స్వర్గద్వారాలు తెఱచుకుంటాయి. లవణ దానాన్ని ఆ వ్యక్తి పేర ఇచ్చినా అదే ఫలం.
గరుత్మంతా ! ఇక మృత్యు స్వరూపాన్ని విస్తార పూర్వకంగా విను. మృత్యువే కాలం. ఆ సమయం రాగానే దేహం నుండీ ప్రాణం నుండీ జీవాత్మ విడివడిపోతుంది. తను రావలసిన వేళకే మృత్యువు, ఎట్టి పరిస్థితుల్లోనూ వస్తుంది. ఈ మృత్యు కష్ట ప్రభావం వల్ల ప్రాణి తాను చేసిన కర్మలన్నిటినీ ఒక్కసారిగా మరచిపోతుంది. మేఘం వాయువు వశంలోనున్నట్లుగా ప్రాణి కాలవశంలో వుంటాడు. సాత్త్విక, రాజసిక, తామసిక భావాలన్నీ కాలం చెప్పుచేతల్లోనే వుంటాయి. ప్రాణులలో అవి కాలనియోగం వల్లనే విస్తరిస్తూ పోతాయి. సూర్య, చంద్ర, శివ, వాయు, ఇంద్ర, అగ్ని, ఆకాశ, పృథ్వీ, మిత్ర, ఔషధ, అష్టవసు, నది, సాగర, భాష, అభావాది మహా విషయాలన్నీ వాటి వాటి సమయాల్లో కాలానుసారము కాలంలోనుద్భవిస్తూ, పెరుగుతూ, కనుమరుగవుతుంటాయి.
మృత్యువు సాధారణ వ్యక్తులకెలా వస్తుందో చూడు. దానికి ముందే దైవయోగం వల్ల రోగమొస్తుంది. ఇంద్రియాలు వికలమై పోయి బలము, ఓజస్సు, వేగము శిథిలమైపోతాయి. కోటి తేళ్ళు ఒకేసారి కుట్టినంత బాధ కలుగుతుంది. మెల్లగా చైతన్యం తగ్గుతుంటే జడత్వం పెరుగుతుంటుంది. యమదూతలు మృతి చెందుతున్న వ్యక్తికే కనిపిస్తారు. వచ్చి పక్కనే నిలబడతారు. శరీరంలో ప్రాణం ఎక్కడ దాక్కుందో వారికి సులువుగా తెలిసిపోతుంది. వారు దానిని గేలతో లాగడం మొదలెడతారు. అప్పుడు ప్రాణం, అతి బలవంతం మీద కంఠం దాకా వచ్చి మొరాయిస్తుంది. ఈ పెనుగులాటలో మనిషి ముఖం వికృతంగా తయారవుతుంది. నోటి నుండి నురగ వెలువడుతుంది. ముక్కు నుండి ద్రవం కారుతుంది. తరువాత ప్రాణం హాహాకారం చేస్తూ అహంకార మమకారాల నింకా వదులుకోలేక యమదూతల బలానికి లొంగి బయటికి పోతుంది. అలా పోతూ పోతూ కూడా తన ఇంటివైపు తన ఆలుబిడ్డల వైపు ఆర్తిగా, కనుమరుగయ్యే దాకా మనసుతోనే చూస్తూ పోతుంది.
మృత్యు సమయంలో ప్రాణి శరీరంలోని వాయువు ప్రకుపితమై తీవ్రగతితో ప్రవహించి అగ్నితత్త్వాన్ని పెచ్చరిల్ల జేయడంతో ఇంధనం లేకుండానే అగ్ని ప్రజ్వరిల్లిపోయి ప్రాణి యొక్క మర్మస్థానాలను విరిచి అత్యంత కష్టానుభూతిని కలిగిస్తుంది. అదే భక్తజనులకూ, భోగాలపై ఆసక్తి లేనివారికీ ఆ వాయువు ప్రశాంతంగా పైకి ప్రవహించి నిర్గమిస్తుంది.
అబద్ధమాడని వారికీ, విశ్వాసాన్ని వమ్ము చేయనివారికీ, ఆస్తికులకూ, పూజాదులపై శ్రద్ధాళువులకు మృత్యువు సుఖపూర్వకంగా వుంటుంది. కామానికి లొంగకుండా, ఈర్ష్యాద్వేషాలను పెంచకుండా త్రుంచుటలో విజయులై, స్వధర్మాన్ని జీవిత పర్యంతమూ
నిర్వహించి, సదాచారులుగా సౌమ్యులుగా జీవించిన వారిని మృత్యువే మాత్రమూ బాధింపకుండా మృదువుగా సుఖంగా గొనిపోతుంది.
మోహంలో అజ్ఞానంలో దేశాన్ని గిరవాటేసి తాము బాగుపడిపోవడం కోసం కొందరు ఆ మోహ, అజ్ఞానాలనే జనాలకుపదేశిస్తారు. అలాటి వారు మృత్యు సమయంలో భయంకరమైన చిక్కటి కనులు పొడుచుకున్నా ఏమీ కనబడని చీకటి గుయ్యారంలో పడి కొట్టుకుంటున్న అనుభూతిని పొందుతారు. అబద్ధపు సాక్ష్యాలనిచ్చువారూ, అసత్య వాదులూ, విశ్వాసఘాతకులూ, వేద నిందకులూ మూర్ఛ రూపంలో మృత్యువు నొందుతారు. వారికి యమదూతలు లాటీ, సమ్మెట, ఇనుప గదలను ధరించి వాటిని ఝళిపిస్తూ దర్శనమిస్తారు. వారు దుర్గంధాన్ని వెదజల్లుతూ పరమభయంకరంగా వుంటారు. వారిని చూడగానే మూర్ఛ తేలిపోయి విపరీతమైన భయం వేసి ఒళ్ళంతా వణకిపోతుండగా ఈ ప్రాణులు తమ రక్షణకై రమ్మని ఆక్రందిస్తూ తల్లిదండ్రులనో పుత్రులనో అఱచి అఱచి పిలుస్తారు. కాని గొంతు పెగలదు. ఎంత గింజుకు చచ్చినా శబ్దం రాదు. ఇతరులకు వీరు మూర్ఛితులుగానే కనిపిస్తుంటారు. తటాలున కనులు తెచుకుంటాయి; అవి గుండ్రగా భయంకరంగా వికృతంగా కదులుతాయి; ఎగవూపిరి వస్తుంది; ముఖం పొడి పొడిగా అయిపోయి భరింపరాని వేదనపడుతూ మృతులవుతారు. వారి శరీరాన్ని చూడడానికి కూడా, అత్మీయులే ఇష్టపడరు.
ఇక నీ రెండవ ప్రశ్నకు సమాధానం విను. భూలోకంలోని జీవాలన్నీ పూర్వజన్మలలోని కర్మఫలాలను భోగిస్తూ భ్రమిస్తుంటాయి. దేవ, అసుర, యక్షాది. యోనులలో సుఖాలను భోగించడానికే పుడతారు. మనుష్య, పశు, పక్ష్యాది యోనులలో పుట్టుక దుఃఖ మయ జీవనానికి ప్రారంభం. ఓ ఖగేశ్వరా! ముందలి జన్మలన్నీ వెనుకటి జన్మలతో బంధితాలయి వుంటాయి. అప్పట్లో చేసిన పాపపుణ్యాల ఫలాలలో తారతమ్యాలే ఇప్పట్లో వీరనుభవించే కష్టసుఖాలు. దీనినే కర్మవిపాకమనవచ్చును.
ఒక జన్మలోని మహాపాపాలకి నరకంలో శిక్షననుభవించి కూడా మరుజన్మలో ఆ పాపానికి తగిన యోనిలో జన్మిస్తారు. ఈ జన్మంలో పుణ్యం చేస్తే కథ మారవచ్చు.
ఏ పాపానికీ ఏ జన్మ వస్తుందో విను.
చేసిన పాపం – వచ్చే జన్మ
· బ్రాహ్మణుని గాయపఱచుట - క్రిమి, కీటక, పురుగు
· బ్రహ్మహత్య - ఒకే జన్మలో చండాల, క్షయరోగి
· గో హత్య - ఒకే జన్మలో చండాల, మరుగుజ్జు
· కన్యాహత్య - ఒకే జన్మలో చండాల, కుష్ఠురోగి
· స్త్రీహత్య, గర్భపాతం - ఒకే జన్మలో భిల్ల, నిత్యరోగి
· స్వగోత్రస్త్రీ సంపర్కం - నపుంసక
· గురుపత్నీ గమనం - క్రమంగా దీపం పురుగు, క్రిమి, గడ్డి, లత, దుబ్బు
· బ్రాహ్మణుడై మాంసభక్షణ - అతిరక్ష అనే కుష్ఠు
· బ్రాహ్మణుడై మద్యపానం - వక్ర, అసితదంత
· ఇతరులకు పెట్టకుండా మధుర పదార్థాలను తినుట - గలగండ రోగి
· బ్రాహ్మణుడై అభక్ష్య భక్షణం - మహోదరజాడ్యం
· శ్రాద్ధంలో అశుచి అహారం పెట్టుట - చిత్రకుష్ఠువు అనే రోగి
· అబద్ధపు సాక్ష్యం - మూగ
· పంక్తిలో వలపక్ష భోజనం – ఒంటి కన్ను
· పెళ్ళిని చెడగొట్టుట - నిరోష్ఠుడు
· పుస్తకచౌర్యం - గుడ్డి
· గోబ్రాహ్మణులను కాలితో తన్నుట - కుంటి
· అబద్ధాలు చెప్పుట - నత్తి, నంగి
· అబద్ధాలను చెప్పించి, వినుట - చెవిటి
· శివధనాపహరణ, నిర్మాల్యం వాడకం - శిశ్నం నొప్పి
· విషం పెట్టుట - జడ, ఉన్మత్త
· ఇళ్ళు తగలబెట్టుట - పుట్టుక నుండే బట్టతల
· మాంసం అమ్ముట - కురూపి
· రత్నాల దొంగతనం - హీనత్వం
· బంగారం దొంగతనం - పుప్పిగోళ్ళు
· లోహాది చౌర్యం - నిర్ధనుడు
· అన్నం దొంగతనం - ఎలుక
· ధాన్యం దొంగతనం – మిడత
· నీళ్ళు దొంగతనం - చాతకపక్షి
· కూరల, ఆకుల అపహరణ - నెమలి
· పరిమళద్రవ్యాల అపహరణ - చుంచు
· మాంసం దొంగతనం - గ్రద్ద
· తేనె దొంగతనం - దోమ
· ఉప్పు దొంగతనం - చీమ
· ఫలపుష్ప పత్రచౌర్యం – అడవికోతి
· చెప్పులు, గడ్డి దూది అపహరణ - మేక
· దారి దోపిడీ/వేట - కటిక ఇంటి మేక
· విషం ద్వారా ఆత్మహత్య - కొండ నల్లత్రాచు
· వ్యభిచారం - అడవి ఏనుగు
· గాయత్రి జపం, సంధ్యోపాసనమానుట - కొంగ
· ఎవరూ పిలువకనే భోజనానికి వచ్చుట - కాకి
· గురువును అవమానించుట - నిర్ణలాటవిలో బ్రహ్మరాక్షసి
· బ్రాహ్మణులను పిలిచి దానమివ్వకపోవుట - అడవి నక్క
· మిత్రద్రోహి - పర్వతంపై గ్రద్ద
· అమ్మకాలలో మాయ - గుడ్లగూబ
· ఆచార నిరసన - అడవిపావురం
· స్వకుటుంబద్వేషి- పిండదశలోనే బహుమృతులు
· ప్రతిరోజూ కలహించే స్త్రీ - జలగ
· తాపస స్త్రీపై కామ వికారం - పిశాచ
· పర పురుషునిపై కోరిక - బల్లి
· (ఆ కోరికలో) భర్తను కాదనుట- రెండు తలల పాము
· ఈడేరని బాలికతో కామక్రీడ - అడవిలో కొండచిలువ
· గురుపత్నిపై కోరిక - తొండ
· రాజపత్ని, మిత్రుని భార్యపై కోరిక - గాడిద
· దేవలకుడు (దేవాలయాలలో పనిచేసి జీతం పుచ్చుకొనేవాడు) - కోడి
· అతికాముకుడు - గుఱ్ఱం
· శీలవతియైన భార్యను త్యజించుట - దరిద్రుడు
· ఇతర బ్రాహ్మణ పత్నితో అక్రమం - నక్క
· శయ్యను దొంగిలించుట - దరిద్రుడు
· వస్త్రహరణం - దీపం పురుగు
· మాత్సర్యంతో బాధించుట - జన్మాంధ
· దీపాల దొంగ - కపాలి
· పితృనింద - క్షయరోగి
· వివాహ విఘ్నకర్తృత్వం - మొసలి
· కూడలిలో మలాది విసర్జన - అపశూద్ర
· కన్యపై అపవాదు - నపుంసక
· వేదాన్ని అమ్ముట - పులి
· అయాజ్యయజ్ఞం - ఆడుపంది
· అడవులను తగలబెట్టుట - మిణుగురు
· దాతకిష్టం లేకున్నా ఒత్తిడితో ఇప్పించుట - ఎద్దు
· ఎవరికీ పెట్టకుండా భుజించుట – సంతాన హీనత
· గృహాదులకు నిప్పు పెట్టుట - కుష్టురోగి
· పాల దొంగతనం - కొంగ
· బ్రాహ్మణునికి పాసిపోయిన అన్నం పెట్టుట - గూని
· ఆరూఢ పాశిత్యం (సన్యాసం పుచ్చుకొని వదిలేసి మరల స్త్రీని కూడుట) - పిశాచము
· అసత్యంగా నిందలేయుట - తాబేలు
· బ్రాహ్మణుడైయుండి శూద్రను పెండ్లాడుట - తోడేలు
· జలప్రవాహాన్ని పాడు చేయుట - చేప
· హరికథనూ, కథకునీ నీరాదరించుట - కర్ణరోగి
· నోటి దగ్గర కూటిని లాగివేయుట - మందబుద్ధి
· దంభాలు చెప్పుకొనుట - గజచర్మరోగి
ఈ పాపాలను చేసే స్త్రీలు వచ్చే జన్మలో పురుష జన్మ నెత్తకపోతే ఈ పాపులకే పత్నులుగా జన్మిస్తారు. ఓయి ఖగపతీ! మిగిలిన పాపాలకు నరకాన్ననుభవించి మరల పుడమిపై పడినపుడు పైన చెప్పిన జన్మలెత్తుతారని తెలుసుకోవాలి. ఈ జగత్తులో ఎన్ని ద్రవ్య రూపాలున్నాయో అన్ని విభిన్న ప్రాణ జాతులూ వున్నాయి. కాబట్టి పాపానికి దూరంగా పోతూ వీలైనన్ని పుణ్యకార్యాలనే చేస్తూ బ్రతికే మనిషే ఇహపరాలలోనూ సుఖపడడం జరుగుతుంది.
Summary of chapter 2 of the Garuda Mahā Purana - Preta Khaṇḍa is as follows:
Bhagavān Vishṇu describes to Garuḍa the harrowing journey undertaken by the sinful soul after it departs its mortal shell, bound in tight cords by the formidable emissaries of King Yama. Dragged relentlessly over scorching sands, jagged rocks, and thorn-filled paths under a blistering sun without a drop of water or a moment of shade, the unrighteous spirit laments its past misdeeds in utter agony as it realizes the fruits of its selfish actions. The Lord explains that during this terrifying forty-six thousand Yojana march toward the city of judgment, the Jīva suffers severe thirst and hunger, weeping bitterly as it recalls the opportunities for charity and righteous living it carelessly squandered during its earthly existence.