సౌతిరువాచ- సౌతి మహర్షి ఇట్లు పలికెను.
స్వేచ్చామయుడు, అసహాయుడు, ప్రభువునైన శ్రీకృష్ణుడు శూన్యమైన విశ్వము, భయంకరముగా నున్న గోలోకము జంతువులు, జలములు, వాయువు, వృక్షములు, పర్వతములు, సముద్రములు, ధాతువులు, సస్యములు, తృణములు లేక వికృతముగా ఉండగా సమస్తమును మనస్సులో ఆలోచించి స్వేచ్ఛతో సృష్టించుటకు ప్రారంభించెను.
సృష్టియొక్క ప్రారంభసమయమున పరమపురుషుడైన శ్రీకృష్ణునియొక్క కుడిప్రక్కనుండి సంసారమునకు మూలహేతువులైన సత్వరజస్తమస్సులనే త్రిగుణములు పంచవింశతి తత్వములకు చెందిన మహత్తత్వము, అహంకారము, గంధ, రస, రూప, స్పర్శ, శబ్దములనే పంచ తన్మాత్రలు ఆకారమును ధరించి పుట్టినవి.
ఆ తర్వాత శ్యామమూర్తీ, యువకుడు. పీతవస్త్రములు ధరించినవాడు. వనమాలను ధరించినవాడు, చతుర్భుజుడు, శంఖ, చక్ర, గదా,పద్మాయుధములు ధరించినవాడు చిరునవ్వుతో కూడిన ముఖపద్మము కలవాడు, రత్నభూషణములు, కౌస్తుభమణి, శార్క్మనే ధనుస్సు ధరించినవాడు, వక్షస్థలమున శ్రీవత్సము కలవాడు, లక్ష్మీనివాసుడు, శరత్కాల చంద్రుని కాంతిని మరుగుపరిచే ముఖచంద్రునివల్ల ఆందమైనవాడు, మన్మథుని అందముకన్న మిన్నయైన రూపలావణ్యము కలవాడు ఆగు నారాయణమూర్తీ స్వయముగా ఆవిర్భవించెను. ఆ నారాయణమూర్తి శ్రీకృష్ణదేవుని ముందర నిలిచి చేతులు జోడించి ఇట్లు స్తుతించెను.
నారాయణ ఉవాచ - నారాయణుడు ఇట్లు పలికెను.
శ్రేష్ఠుడు, ప్రధానమైనవాడు, వరములనిచ్చువాడు, వరముల నిచ్చుటకు అర్హుడు, కారణములకు కారణమైనవాడు, కర్మస్వరూపుడు, ఆయాకర్మలకు కారణభూతుడు, తపస్వరూపుడు, ఆయా తపస్సుల ఫలితమునిచ్చువాడు, సదా తపస్వి, ఈశుడు, నూతన మేఘమువలె నల్లనివాడు, స్వాత్మయందును ఉండువాడు, మనస్సును హరించువాడు, నిష్కాముడు, కామస్వరూపుడు, కామమును పోగొట్టువాడు, కోరికలకు కారణభూతుడు, సర్వస్వరూపి, సర్వేశ్వరుడు సమస్తమునకు కారణమైనవాడు, వేదరూపుడు, వేదవాచ్యుడు, వేదములందు చెప్పబడిన ఫలితములనిచ్చువాడు, ఫలస్వరూపుడు, సమస్త వేదములు తెలిసినవాడు, సమస్తవేదములు తెలిసినవారిలో శ్రేష్ఠుడును ఐన నిన్ను ఎల్లప్పుడు నేను ప్రార్థింతును.
ఈవిధముగా భక్తితోకూడుకున్న ఆ నారాయణుడు శ్రీకృష్ణపరమాత్మ ఆజ్ఞననుసరించి ఆ పరమాత్మకు ముందున్న రత్న సింహాసనమున కూర్చుండెను.
శ్రీమన్నారాయణుడు చేసిన ఈ స్తోత్రమును శ్రద్ధాభక్తులతో నియమముతో గూడి త్రిసంధ్యలలో ఎవరు పఠింతురో, ఎవరు ఇతరులు చడువగా విందురో వారికి పాపమే ఉండదు. పుత్రులను కోరీ ఈ స్తోత్రము చేసినచో, విన్నచో వారికి తప్పక పుత్రులు కలుగుదురు. భార్య (వివాహము) కావలెనను కొన్నచో భార్య లభించును. రాజ్యభ్రష్టునికి రాజ్యము లభించును. ధనహీనుడు ధనమును పొందును. ఆపదలలో ఉన్నా. కారాగారములో పడినా ఈస్తోత్రమువలన తప్పక విముక్తుడగును. రోగపీడుతుడైనా ఈ స్తోత్రశ్రవణమువల్ల రోగముల పోగొట్టుకొనును.
సౌతిరువాచ- సౌతిమహర్షి ఇట్లు పలికెను.
ఆ పరమాత్మ ఎడమభాగమున శుద్ధస్ఫటికమువలేనున్నవాడు, ఐదు శిరస్సులు కలవాడు దిగంబరుడు, మిక్కిలి పరిశుద్ధమైన బంగారు కాంతిగల జడలు ధరించినవాడు, చిరునవ్వుగల ముఖముతో నున్నవాడు, మూడు కన్నులవాడు, శిరస్సున చంద్రుడున్నవాడు, చేతిలో జపమాల కలవాడు, సమస్త సిద్ధులకు ఈశ్వరుడు, స్వయముగా సిద్దుడు, యోగీంద్రులకు, గురువుకు గురువైనవాడు, మృత్యువుకు మృత్యువు, ఈశ్వరుడు, మృత్యుంజయుడు, శివస్వరూపుడు, జ్ఞానానందుడు, కాంతికన్న మిన్నయైన ముఖచంద్రుడు కలవాడు, విష్ణుభక్తులకెల్ల శ్రేష్ఠుడు అగుమహాదేవుడు బ్రహ్మతేజస్సుతో ప్రకాశించుచు శ్రీకృష్ణదేవునిముందు నిలిచి పులకించిన అవయవములు కలవాడై కన్నీళ్ళు కారగా మిక్కిలి గద్గద స్వరముతో ఆ పరమాత్మను ఇట్లు స్తోత్రము చేసెను.
మహాదేవ ఉవాచ - శ్రీమహాదేవుడు ఈవిధముగా అనెను.
జయస్వరూపుడు, జయమును కల్గించువాడు, జయేశుడు, జయకారకుడు, జయమును కల్గించువారిలో శ్రేష్ఠుడు, విశ్వస్వరూపుడు, విశ్వేశ్వరులకు ఈశ్వరుడు, విశ్వసృష్టికి కారకుడు, విశ్వమునకు ఆధారభూతుడు, విశ్వకారణ కారణుడు, ఈ ప్రపంచమును రక్షించువాడు, లయమును చేయువాడు, విశ్వమున పుట్టినవాడు, ఫలకారకుడు, ఫలమునకు ఆధారభూతుడు, ఫలస్వరూపుడు ఆ యా ఫలితముల నిచ్చువాడు, తేజఃస్వరూపుడు, తేజస్సును కలిగించువాడు, సమస్త తేజోవంతులలో శ్రేష్ఠుడు, అపరాజితుడు అగు శ్రీకృష్ణదేవుని నమస్కరింతును.
ఈ విధముగా స్తుతించి, ప్రక్కననున్న నారాయణమూర్తిని పలుకరించి, ఆ శ్రీకృష్ణదేవుని ఆజ్ఞననుసరించి శ్రేష్టమైన రత్నసింహాసనమున కూర్చుండెను.
మహాదేవుడు చేసిన ఈ శ్రీకృష్ణస్తోత్రమును ఎవరు నియమముతో చదువుదురో వారికి అన్ని సిద్దులు కలుగును. ఎల్లప్పుడు విజయము కలుగుచుండును. స్నేహితులు, ధనము, ఐశ్వర్యము కూడ కలుగును. శత్రుసైన్యములు నశించును. దుఃఖము, పాపముకూడ నశించును.
బ్రహ్మవైవర్త పురాణములో శ్రీ శంభువు చేసిన శ్రీకృష్ణస్తోత్రము సంపూర్ణము.
సౌతిరువాచ- సౌతిమహర్షి ఇట్లనెను.
ఆ తర్వాత శ్రీకృష్ణదేవుని నాభిపంకజమునుండి మహాతపస్వి, వృద్ధుడు, కమండలువు హస్తమున కలవాడు, శ్రేష్ఠుడు, తెల్లని బట్టలు, దంతములు, వెండ్రుకలు కలవాడు, యోగులకు, శిల్పులకు ఈశ్వరుడు, సమస్త ప్రాణికోట్లకు జనకుడు, గురుడు, తపః ఫలితములను, సర్వసంపదలను ఇచ్చువాడు, సృష్టికర్త, సమస్త కర్మలకు కర్త, విధాత, హర్త, నాలువేదములను తన ముఖములందు ధరించినవాడు, నాలువేదాలు తెలిసినవాడు, వేదములనుండి పుట్టినవాటికి ఆధిపతి, శాంతుడు, మంచివాడు, అధికదయకలవాడు, సరస్వతీదేవికి భర్తయైన చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించెను. ఆతడు శ్రీకృష్ణదేవుని ముందర నిలిచి చేతులు మొగిడ్చి, పులకించిన సమస్తశరీరముతో, భక్తితో వంగిన శిరస్సు కలవాడై ఇట్లు స్తుతించెను.
బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను.
గుణాతీతుడు, అద్వితీయుడు, నాశనములేనివాడు, వ్యక్తముకానివాడు, వ్యక్తుడు, వ్యయముకానివాడు, గోపవేషమును ధరించినవాడు, మనోహరుడు, నూతన మేఘమువలె నల్లనివాడు, కోటి మన్మథుల సౌందర్యము కలవాడు, బృందావనమున రాసమండలమున ఉన్నవాడు, రాసేశ్వరుడు, రాసవాసుడు, రాసక్రీడద్వారా ఉల్లాసము కలిగించువాడు, ఆవులకు ఆనందమును కలిగించు శ్రీకృష్ణ దేవుని నమస్కరింతును.
ఈవిధముగా శ్రీకృష్ణదేవుని స్తుతించి, సమీపముననున్న ఈశ్వరుని, నారాయణుని పలుకరించి ఆ కృష్ణదేవుని ఆజ్ఞపై రత్నసింహాసనమున కూర్చుండెను.
బ్రహ్మదేవుడు చేసిన ఈ స్తోత్రాన్ని ఉదయమే లేచి ఎవరు చదువుతారో వారి పాపాలన్నీ తొలగిపోవును. దుస్వప్నములు కలుగక సుస్వప్నములే కలుగుచుండును. సంపదలు, పుత్రులు, పౌత్రులు కలిగించే గోవింద భక్తి కలుగును. అపకీర్తి నశించి సత్కీర్తి కలుగగలదు.
బ్రహ్మ వైవర్తపురాణములో బ్రహ్మదేవుడు చేసిన శ్రీకృష్ణస్తోత్రము సమాప్తము.
సౌతిరువాచ - సౌతిమహర్షి ఇట్లు పలికెను.
ఆ తర్వాత పరమాత్మ వక్షస్థలమునుండి తెల్లనివాడు జడలను ధరించినవాడు, అన్నిటికి సాక్షీభూతుడు, సర్వజ్ఞుడు, అందరియందు, అన్ని కర్మలలో సమదృష్టి కలవాడు, దయ కలవాడు, హింస, కోపము వదలినవాడు . ధర్మజ్ఞానము కలవాడు, ధర్మపరాయణుడు, ధర్మస్వభావమును కలిగించువాడు, ధర్మవంతులకెల్ల ధర్మవంతుడు చిరునవ్వుకల ధర్ముడను పురుషుడుదయించెను. ఆ ధర్మదేవత శ్రీకృష్ణునిముందు దండప్రణామమొనరించి సర్వేశుడు, సమస్త కామితములనిచ్చు పరమాత్మను ఇట్లు నుతించెను.
శ్రీధర్మ ఉవాచ - ధర్మదేవత ఈవిధముగా అనెను-
శ్రీకృష్ణుడు, విష్ణువు, వాసుదేవుడు, పరమాత్మ, ఈశ్వరుడు, గోవిందుడు, పరమానందుడు, అద్వితీయుడు, అక్షరుడు, అచ్యుతుడు, గోవులను కాచే గోపులకు నాథుడు, గోపికలకు నాథుడు, గోష్ఠమున ఉండువాడు, గోవత్స పుచ్చధారి, గో, గోప, గోపీ మధ్యస్థుడు, ప్రధానుడు, పురుషోత్తముడు అగు నిన్ను నమస్కరిస్తున్నాను.
ఆని స్తుతించి, సమీపముననున్న బ్రహ్మవిష్ణు శివులను పలుకరించి శ్రేష్ఠమైన రత్న సింహాసనమున కూర్చుండెను.
ధర్మదేవత చెప్పిన ఈ ఇరువదినాలు నామములను ఉదయమే లేచి ఎవరు చదువుదురో వారు సుఖముగా ఉందురు. అన్నివిధముల జయము పొందుదురు. చనిపోవు సమయమున హరినామస్మరణ తప్పక చేయగులుగుదురు. ధర్మము ఎల్లప్పుడు అతనినంటియుండును. అధర్మముపై అభిరుచి ఎన్నడును కలుగదు. ధర్మార్థకామమోక్షములనే చతుర్వర్గ ఫలము ఆతని కరతలమున ఉండును. ఈ స్తోత్రము చదువువానిని చూచీ సమస్తపాపములు, భయములు, దుఃఖములు గరుత్మంతుని చూచి పాములు పరుగెత్తినట్లు శీఘ్రముగ తొలగిపోవును.
బ్రహ్మవైవర్తపురాణమున ధర్మదేవత చేసిన శ్రీకృష్ణస్తోత్రము సమాప్తము.
సౌతిరువాచ- సౌతిమహర్షి ఇట్లనెను-
ఆ తర్వాత పరమాత్మయగు శ్రీకృష్ణునిముఖమునుండి ధర్మదేవత యొక్క ఎడమ భాగమున మూర్తీభవించిన రెండవ లక్ష్మివలే ఒక కన్య ఆవిర్భవించెను. అద్వితీయయగు ఆ దేవి శుక్లవర్ణము కలది. వీణను పుస్తకమును చేతులలో ధరించినది. కోటి పూర్ణచంద్రులవంటి కాంతికలది. శరత్కాలమందలి పద్మములవంటి కన్నులుకలది. బంగారు వన్నెగల చీరను, రత్నభూషణములను ధరించినది. చక్కని పలువరుసకలది. చిరునవ్వుతోనున్న ముఖముకలది. శ్యామ, సుందరాంగులలో సుందరి, వేదములకు, శాస్త్రములకు నిలయ, విద్వాంసులకు తల్లివంటిది. వాక్కుకు అధిష్టానదేవత, కవులకు చాలాప్రీతిపాత్రమైన దేవత. శుద్ధసత్వస్వరూప, శాంతరూపయగు సరస్వతి గోవిందుని ముందు నిలిచి భగవంతుని గుణములను కీర్తిని సుందరముగా పాడెను. తర్వాత ప్రతి కల్పమునందును యుగమునందును హరియొనరించిన కర్మలను చక్కగా తన వీణపై ఆలాపించి చేతులు జోడించుకొని ఇట్లు స్తుతించెను.
సరస్వత్యువాచ - సరస్వతీదేవి ఇట్లు పలికినది -
రాసమండల మధ్యభాగమున నున్నవాడు, రాసోల్లాస సముత్సుకుడు, రత్నసింహాసనమందున్నవాడు, రత్నభూషణ, భూషితుడు, రాసేశ్వరుడు, రాసకరుడు, రాసేశ్వరీశ్వరుడు, రాసలీలకు ఆధిష్టాన దైవము, రాసక్రీడా వినోది, రాసక్రీడయందలి ఆయాసమువల్ల పరిశ్రాంతినందినవాడు, శాంతమైనవాడు, అందమైనవాడు అని స్తుతించి నమస్కరించినది. పిమ్మట ఆ సరస్వతీ దేవి శ్రేష్ఠమైన రత్నసింహాసనమున పరమాత్మ ఆజ్ఞననుసరించి కూర్చొనినది.
సరస్వతీదేవి చేసిన ఈ శ్రీకృష్ణస్తోత్రమును ఉదయముననే లేచి ఎవరు చదువుదురో వారు బుద్ధిమంతులు, ధనవంతులు, విద్యావంతులు, పుత్రవంతులు కాగలరు.
సౌతిరువాచ- సౌతిమహర్షి ఇటునుడివెను-
శ్రీకృష్ణదేవుని మనస్సునుండి రత్నాలంకారములు పీతాంబరము ధరించినది, చిరునవ్వుగల ముఖము కలది, నవ యౌవనవతి, సమసైశ్వర్యములకు అధిదేవత, సమస్త సంపదల ఫలితములనిచ్చునది అగు ఒకదేవి విష్ణువుముందు నిలబడి భక్తిచే వంచిన తలకలదై నమస్కరించుచు స్తోత్రము చేసెను.
మహాలక్ష్మీరువాచ - మహాలక్ష్మి ఇట్లనెను -
సత్యస్వరూపుడు, సత్యమునకు ఈశ్వరుడు, సత్యకారణుడు, సనాతనుడు, సత్యమునకు ఆధారభూతుడు, సత్యజ్ఞుడు, సత్యమూలుడు అగు శ్రీహరిని నమస్కరింతును అని శ్రీమహాలక్ష్మి స్వచ్ఛమైన బంగారమువంటి తన శరీర కాంతిచే అన్ని దిక్కులను ప్రకాశింపజేస్తూ శ్రీకృష్ణుని నమస్కరించి సుఖాసనమున కూర్చుండెను.
ఆ తర్వాత శ్రీకృష్ణదేవుని బుద్ధినుండి సమస్తమునకు అధిష్ఠాతృదేవి, మూలప్రకృతి, ఈశ్వరి, మేలిమి బంగారు వంటి కాంతి కలది, కోటి సూర్యుల కాంతి కలది. చిరునవ్వు కల ముఖముకలది, శరత్కాల పద్మమువంటి కన్నులు కలది, ఎఱ్ఱనీ వస్త్రములు ధరించినది రత్నాభరణములు ధరించినది, నిద్ర, తృష్ణ ఆకలిదప్పులు, దయ, శ్రద్ధ, క్షమ మొదలగు సర్వశక్తులకు అధిష్టాన దేవత, భయంకరమైనది, నూరు భుజములు కలది, కష్టసాధ్య, ఆర్తిని పోగొట్టునది, భగవంతుని శక్తిస్వరూప, లోకముల కన్నిటికి మాతృస్వరూప, త్రిశూలము, శక్తి, శార్‌ఙ్గమనే ధనుస్సు, ఖడ్గము, బాణములు, శంఖము, చక్రము. గద, పద్మము, స్పటికమాల, కమండలువు, వజ్రము, అంకుశము, పాశము, భుశుండి, దండము, తోమరము, నారాయణాస్త్రము, బ్రహ్మాస్త్రము, రౌద్రాస్త్రము, పాశుపతాస్త్రము, వాయవ్యాస్త్రము, వారుణాస్త్రము, ఆగ్నేయాస్త్రము, గాంధర్వాస్త్రమును ధరించుచున్న ప్రకృతి (దుర్గ) శ్రీకృష్ణుని ముందుండి ముదముతో ఇట్లు స్తుతించెను.
ప్రకృతి రువాచ - ప్రకృతి (దుర్గ) ఇట్లు పలికెను.
నేను ప్రకృతి స్వరూపిణిని, ఈశ్వరిని, సర్వేశ్వరిని, సమస్త రూపములు ధరించుదానను. సర్వశక్తి స్వరూపిణిని, నావలననే ఈ జగత్తంతా శక్తి కలిగి ఉన్నది. నేను నీచే సృష్టించబడిన దానను. అందువలననె స్వతంత్రురాలను కాదు. నీవే ఈలోకములకెల్ల ఈస్వరుడవు. గమ్యుడవు, రక్షకుడవు, సృష్టికర్తవు, సంహారకారకుడవు, పునఃసృష్టికర్తవు. సృష్టికర్తలను సృష్టించువాడవు, సంహారకారకులను సంహారించువడవు. పరమానంద స్వరుపుడవైన స్వరూపుడవైన నిన్ను నమస్కరింతును.
నీ కనురెప్పపాటు కాలములో బ్రహ్మ నశించును. అట్టి నీ ప్రభావమును ఎవరు వర్ణిపగలరు. నీ కనుబొమల విరుపుతోనే కోటి సంఖ్యగల విష్నువులను సృష్టించగలవు. బ్రహ్మ మొదలైన చరాచర జగత్తును సమస్త దేవతలను లీలగా సృజించగలవు. మహస్త్వరూపము, విరాట్ స్వరుపము నీ కళలో ఒక చిన్న భాగము. పరిపూర్ణుడవు, పరమాత్మవు, ఈస్వరుడవగు నిన్ను సంతోషముతో నమస్కరింతును. నిన్ను స్తుతించుటకు బ్రహ్మ విష్ణు శివాది దేవతలు, వేదములు, నేను, సరస్వతి, గొప్ప విద్వాంసులు సైతము శక్తులు కారు. నిరీహుడవగు నిన్ను నేను నమస్కరిస్తున్నాను.
ఈ విధముగా దుర్గాదేవి శ్రీకృష్ణుని స్తుతించి, ఆ దేవునికి నమస్కరించి శ్రేష్ఠమైన రత్నసింహాసనమున కూర్చుండెను. దుర్గాదేవి చేసిన స్తోత్రమునకు దేవతలంతా సంతోషించి ఆమెను పొగిడినారు.
శ్రీకృష్ణ పరమాత్మను గురించి దుర్గాదేవి చేసిన ఈ స్తోత్రమును పూజా సమయములో ఎవరు పఠిస్తారో వారు అన్ని స్థలములలోను జయమును పొందుదురు. సుఖమును పొందుదురు. ఆతని ఇంటిని దుర్గాదేవి వదలి ఎచ్చటికి పోదు. ఆతడు ఈజన్మలో కీర్తినీ, మరణించిన తరువాత శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందును.
శ్రీ బ్రహ్మ వైవర్తమహాపురాణములో సౌతి శౌనక సంవాద రూపమగు బ్రహ్మ ఖండమున ‘సృష్టినిరూపణ’ సమయమున దుర్గాదేవి చేసిన శ్రీకృష్ణ స్తోత్రము కల మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 3 of the Brahma Vaivarta Mahā Purana - Brahma Khaṇḍa is as follows:
When the Supreme Lord Śrī Kṛshṇa willed the manifestation of cosmic universes for His eternal play, a magnificent golden aura of light expanded from His transcendent body, filling the boundless expanse with divine energy. From the primordial waters that arose from His supreme potency, the grand four-armed manifestation of Lord Śrī Nārāyaṇa emerged, holding the sacred conch, disc, mace, and lotus flower in His glowing hands. Beholding the incomparable beauty and unlimited majesty of the Primordial Lord Śrī Kṛshṇa, Lord Śrī Nārāyaṇa folded His hands in deep humility and offered exquisite prayers of adoration, glorifying Śrī Kṛshṇa as the origin of all divine Avatāras, the master of Time, and the eternal source from whom all cosmic elements, planetary systems, and living beings draw their existence.