అథబ్రహ్మవైవర్తో బ్రహ్మఖండం-
బ్రహ్మవైవర్తపురాణములోని బ్రహ్మ, ప్రకృతి, గణపతి, శ్రీకృష్ణ జన్మఖండములనే నాలుగుఖండములలో బ్రహ్మఖండము ప్రారంభింపబడుతున్నది.
గణపతి. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, ఆదిశేషుడు మొదలైన దేవతలు, మనువు మొదలైన మహర్షులు, శ్రీదేవి, పార్వతి, సరస్వతి మొదలైన స్త్రీదేవతలు ఎవరిని ఎల్లప్పుడు నమస్కరింతురో ఆ శ్రీకృష్ణుని నమస్కరింతును.
త్రిగుణ స్వరూపుడు, మహత్స్వరూపుడు, ఆద్యుడైన శ్రీకృష్ణుడు సృష్టిచేయదలిచి తన రోమకూపములలో సమస్తలోకములను, స్థూలశరీరములను ఏర్పరుస్తూ తన మాయతో సూక్ష్మస్వరూపాన్ని కూడ సృష్టించినాడు. ఆట్టి పరబ్రహ్మరూపియైన శ్రీకృష్ణుని సదా నా మనస్సులో ధ్యానింతును.
ధ్యానైక నిష్టులైన దేవతలు, మునులు, మానవులు, యోగులు, ఏ పరమేశ్వరుని ఎల్లప్పుడు ధ్యానించినా, ఎన్ని జన్మలకైనా స్వప్నంలో కూడా అతనిని చూడలేకపోతున్నారో, త్రిగుణాతీతుడు, నిర్వికారుడు, కోరికలు ఏ మాత్రము లేని ఆ పరమపురుషుడు భక్తులు ధ్యానించుకొనుటకు అనుకూలముగా మిక్కిలి సుందరమైన నల్లని రూపును ధరిస్తున్నాడు. స్వేచ్ఛామయుడైన శ్రీకృష్ణదేవుని భక్తితో ధ్యానింతును..
బ్రహ్మ, అచ్యుతాదులకన్నా విశిష్టుడు త్రిగుణాతీతుడు ఐన ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మమునుండి ప్రకృతి, బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలగువారు ఉద్భవించిరి. ఆ శ్రీకృష్ణ తత్వమును నేను నమస్కరింతును.
ఓం నమో భగవతే | వాసుదేవాయ - భగవంతుడగు వాసుదేవునికి నమస్కారము.
నారాయణుని, నరుడనే మునిని, సరస్వతిని వ్యాసుని నమస్కరించి "జయ" శబ్దము చేయవలెను.
శ్రీవేదవ్యాసుడు వేదములను దూడగా ఒనర్చి, భారతి అను కామధేనువుమ పితుకగా వచ్చిన అపూర్వము, అమృతమయము, పురాణములలో కడు - ఇంపైన బ్రహ్మవైవర్త పురాణమనే క్షయములేని పాలను కడు ఇష్టముగా త్రాగుడు.
భరతఖండములోని నైమిశారణ్యములో శౌనకాదిమహర్షులు నిత్య నైమిత్తిక క్రియలు పూర్తిచేసికొని దర్భాసనములో కూర్చొని ఉండిరి.
ఆ సమయములో అనుకొనకుండా అక్కడికి వచ్చిన సౌతిని (సూతమహర్షి వంశజుడైన రోమహర్షణి మహర్షిని చూచి శౌనకాదిమునులు ఆసనమునిచ్చిరి.
(పృథుచక్రవర్తి యజ్ఞములు చేయుచున్నప్పుడు శ్రీమహావిష్ణువే సూతుడనే పేరుతో పురాణకథలను చెప్పినట్లు, అతని వంశమున పుట్టిన వారినందరిని సూతుడనే పేరుతోనే పిలుస్తున్నట్లు బ్రహ్మాండ పురాణము తెల్పుచున్నది. వ్యాసమహర్షి శిష్యులలో ఒకడైన రోమహర్షణీముని పురాణముల నన్నిటిని శౌనకాది మహర్షులకు వినిపించినాడు.)
ఆతిథిగా వచ్చిన ఆ సౌతమునిని శౌనక మహర్షి గౌరవించి ఇట్లు కుశలప్రశ్న వేసినాడు,
మార్గాయాసము తొలగిన పిమ్మట స్థిరాసనమున ఉన్నవాడు, సమస్త తత్వములు తెలిసినవాడు, ప్రాచీనములైన పురాణములన్ని తెలిసిన ఆ సౌతమహర్షిని మునుల సభలో శౌనకముని ఈవిధముగా ప్రశ్నించినాడు.
సమస్తశ్రుతి సమ్మతము, మంగళప్రదము అమంగళములనన్నిటిని తొలగించునది, సమస్త సంపదలను కలిగించునది. హరీయందు భక్తిని, శాశ్వత సుఖములను, మోక్షమును, తత్వజ్ఞానమును కలిగించునది, భార్యాపుత్రపౌత్ర సంపదనభివృద్ధిచేయునదీ, కృష్ణకథా సమన్వితమైన పురాణమును వినగోరి ఆకాశమునందున్న తారకలలో చంద్రునివంటి శౌనకమహర్షి ఇట్లు అడిగెను.
శౌనక ఉవాచ - శౌనకమహర్షి ఇట్లు పలికెను.
మీరు ఎచ్చటికి వెళ్ళుచున్నారు. ఎక్కడినుండి వచ్చుచున్నారు. మీకు మంగళమగుగాక. మీదర్శనమువలన మాకు ఈ దినము సుదినము.
మేము విజ్ఞాన రహితులము. సంసారసాగరమున మునిగి ఉన్నాము. కలియుగములో ఉన్నందువలన కలియుగ ధర్మములనుండి భయపడి మోక్షమును కోరి ఉన్నాము. మీరు మమ్ము సుజ్ఞానులచేసి మోక్షము కలిగించుటకు ఇచ్చటికి వచ్చియున్నారు.
మీరు సాధువులు శ్రేష్ఠులు. సమస్తపురాణములను ఎడిగినవారు. మిక్కిలి దయగలవారు.
ఏ పురాణశ్రవణమువలన కర్మబంధాలను సమూలముగా నిర్మూలము చేయగల్గినదీ, సంసారబద్ధులైనవారీ సంకెళ్ళమ ఛేదించగల్గినదీ, సంసారమనే కారుచిచ్చునబడి దగ్గమగుచున్నవారిపై అమృతవర్షాన్ని వర్షించునది. ఆనందమును, సుఖమును ఎల్లప్పటికి కల్గించునది ఐన శ్రీకృష్ణభక్తి కలుగునో ఆ పురాణమును మాకు చెప్పగలరని ప్రార్థన.
ఏ పురాణమున తొలుత సమస్తమునకు కారణమైన బ్రహ్మ' నిరూపణము, చరాచర జగత్తును సృష్టించ దలచిన ఆ పరబ్రహ్మయొక్క సృష్టి వివరణ, సాకారము, నిరాకారము ఐన ఆ పరమాత్మస్వరూపము. ఆ పరమాత్మను ధ్యానము చేయువిధము, వైష్ణవులు, యోగులు ఎవని ధ్యానింతురో, వేదప్రోక్తమైన వారి మతము, ప్రకృతి స్వరూపము, సత్వరజస్తమోగుణముల లక్షణము, పృథివి మొదలగు పంచభూతములు, వాటి తన్మాత్రలు, మహత్తు మొదలైనవాటి వివరణ, గోలోక వర్ణన, వైకుంఠ వర్ణన, శివలోక వర్ణన, ఇంకను స్వర్గలోక వర్ణన, ప్రాకృతులు, ప్రకృతీకన్న భిన్నమైన ఆత్మస్వరూప వివరణ దేవతలు, దేవతాస్త్రీలు, సముద్రములు, పర్వతములు నదులయొక్క ఉత్పత్తి, దుర్గ, లక్ష్మి, సావిత్రి, సరస్వతుల వర్ణన, వారి ధ్యానము, పూజాస్తోత్రాదికములు, అమృతప్రాయమైన రాధాదేవి చరిత్ర, నరక వర్ణన, జీవులు ఏ ఏ స్థానములందుందురో ఆయాస్థాన వర్ణన, జీవులు తాము చేయు శుభాశుభ కర్మలననుసరించి ఏ ఏ యోనులలో పుట్టునో, ఏ ఏ రోగముల పొందునో, ఆ యా కర్మలనుండి మోక్షము పొందు విధము, చెప్పబడిన ఆ పురాణమును మాకు వీపులముగా తెలుపుడు.
మనస, తులసి, కాళీ, గంగ, పృథివి, ఇంకను ఇతర దేవతల కథలు, శాలిగ్రామ శిలలగూర్చి వాటిని దానము చేయుటవలన కలుగు ఫలితములు, ధర్మాధర్మముల వివరణ. గణపతి చరిత్ర, కవచము, స్తోత్రములు, నిగూడమైన మంత్రములు మొదలగువాని వివరణ, ఇంతవరకు ఎన్నడు విననీ, అపూర్వము, అత్యద్భుతమైన ఉపాఖ్యానములు ఏ పురాణమున కలవో ఆపురాణమునంతయు మాకు చెప్పవలసినది.
భారతదేశమందలి ఏ పుణ్యక్షేత్రమున పరమాత్మయైన శ్రీకృష్ణుడు జన్మించినాడో, ఏపుణ్యవంతుని పవిత్రమైన గృహమున ఆ పరమాత్మ పుట్టినాడో, పూజనీయురాలు, సతి అగు ఏ పుణ్యవతి ఆతనిని కన్నదో, ఆ పరమాత్మ జన్మించిన స్థలమునుండి ఏకారణమున బయటికి వెళ్ళెనో, అచ్చట ఏఏ కార్యములు చేసెనో, మరల ఎట్లు తాను పుట్టినచోటికి తిరిగి వచ్చెనో, ఎవరీ ప్రార్థనవల్ల భూ భారమును తగ్గించెనో, ఏఏ కార్యములు చేసి తిరిగి గోలోకమునకు వెళ్ళెనో శ్రుతి దుర్లభము, మునులకు సైతం తెలియరానిది, మనస్సును తేలికపరచు ఈ కథను, ఇతర కథలను తెలిసి తెలియక నేను అడిగిన వాటిని, అడుగని వాటిని సద్యో వైరాగ్యమునిచ్చు ఆ పరమాత్మ కథలను విపులముగా వ్యాఖ్యానించగలరు.
యోగ్యాయోగ్య విషయములయందు ఎవరు సమదృష్టి కలిగిఉందురో, శిష్యులు అడిగినా, ఆడుగక పోయినా వారికి అవసరమైన విషయములను వ్యాఖ్యాన పూర్వకముగా ఎవరు తెల్పుదురో అతడు సజ్జనశ్రేష్ఠుడు. సద్గురువు.
సౌతిరువాచ - సౌతిమహర్షి ఇట్లు పలికెను.
శునకమహర్షీ| మీ పాదపద్మములను దర్శించుటచేత మేము కుశలముగా ఉన్నాము. నేను సిద్ధక్షేత్రమునుండి సారాయణ క్షేత్రమైన బదరికా వనమునకు పోవుచున్నాను. భరతఖండమున పుణ్యప్రదమైన నైమిషారణ్యమును చూచుటకు ఇచ్చటికి వచ్చితిని. ఇచ్చటి విప్ర సమూహమును చూచి నమస్కరించు భావనతో వచ్చితిని.
తొందరపాటువలన దేవతలను, విప్రులను గురువును చూచి ఎవడు నమస్కరించడో అతడు సూర్యచంద్రులున్నంతవరకు నరకమున ఉండును.
శ్రీమన్నారాయణుడు బ్రాహ్మణ రూపమున భూమి పై సంచరించును. కావున పుణ్యవంతుడు హరిరూపమున ఉన్న బ్రాహ్మణుని తప్పక నమస్కరించవలెను.
పూజ్యుడా| మీ ఆభీప్పితము నాకు బాగుగా తెలిసినది. మీరడిగినవన్నియు బ్రహ్మవైవర్త పురాణమున కన్పించును. ఆ పురాణము, పురాణములకన్నిటికీ సారభూతమైనది. అది పురాణ, ఉపపురాణములు వేదములయందు మనకున్న సంశయములను పోగొట్టును. కోరినవారికి ఐహికకామములను, మోక్షార్థులకు మోక్షమును, వైష్ణవులకు భక్తిని కల్పవృక్షమువలె అదీ ఇచ్చును.
బ్రహ్మవైవర్తపురాణము నాలుగు ఖండములుగా విభజింపబడినది. వాటిలో తొలిఖండమైన బ్రహ్మఖండమున యోగులు, సంతులు, వైష్ణవులు ఏ పరమాత్మను నిత్యము ధ్యానింతురో, సమస్త సృష్టికి కారణభూతమైన ఆ పరమాత్మ నిరూపణము చేయబడినది.
సంతులు, యోగులు, వైష్ణవులు ముగ్గురు వేరువేరని తలపరాదు. వారివారి అజ్ఞాన పరిపాకమువలన జీవులు మూడు విధములగా పేర్కొనబడుచున్నారు.
సత్సంగము చేసినవారిని సంతులని, యోగులతో కలిసి ఉన్నవారిని యోగులని, భక్తులతో కలిసి తిరుగువారిని వైష్ణవులని చెప్పుదురు.
రెండవఖండమైన ప్రకృతి ఖండములో దేవతలు, సమస్తజీవుల జన్మవృత్తాంతము దేవతా కవచములు, స్తోత్రములు, మంత్రములు పూజచేయు పద్ధతి, జీవుల కర్మవిపాకము, శాలీగ్రామములు, ప్రకృతి యొక్క లక్షణము, పుణ్యవంతులు, పాపులు పొందు శుభాశుభస్థానములు, నరక వర్ణన, రోగములు, వాటి నివారణ రీతులు చెప్పబడినవి.
తృతీయ ఖండమైన గణేశఖండమున ఆపూర్వము, వేదములయందు చెప్పబడని గణపతి చరిత్ర వర్ణించబడినది. అందలి గణేశ భుసంవాదమున సమస్త తత్వనిరూపణ. గణపతియొక్క కవచము, స్తోత్రములు, మంత్రముల వివరణ కన్పించును.
చివరిదైన శ్రీకృష్ణజన్మ ఖండమున శ్రీకృష్ణుని జన్మవృత్తాంతము, భూమీయొక్క భారమును తగ్గించుటకు ఆతడు చేసిన క్రీడలు సజ్జనులకు ఆతడు చేసిన మంగళ కార్యములు వర్ణింపబడినవి.
శౌనకమహర్షీ| ఈ బ్రహ్మవైవర్త పురాణము సమస్త ధర్మముల నిరూపించునది, బ్రహ్మఖండము మొదలైన నాలుగు ఖండములతో కూడుకున్నది, ఆందరికోరికలను తీర్చునది, సంపత్కరము. ఈ పురాణము సమస్త పురాణముల సారభూతము, వేద సమ్మితముకూడ. ఇందు శ్రీకృష్ణునిచేత బ్రహ్మస్వరూపమంతయు వివరించబడి ఉన్నందున దీనిని బ్రహ్మవైవర్తమని ప్రాచీనులు చెప్పుచున్నారు.
ఈ పురాణముయొక్క ఆచార్య పరంపర ఈవిధముగా నున్నది.
ఈ పురాణము శ్రీకృష్ణపరమాత్మచే గోలోకమున బ్రహ్మదేవునికి ఎంగించబడినది. బ్రహ్మదేవుడు పుష్కరతీర్థమున ధర్మునకు దీనిని తెలిపెను. ధర్ముడు బ్రహ్మపుత్రుడైన నారదునకు, నారాయణునకు చెప్పెను, నారదమహర్షి గంగానదీ తీరమున వ్యాసమహర్షికి చెప్పెను. వ్యాసుడు. విపులమైన ఈ పురాణమును చక్కగా విభజించి పుణ్య ప్రదేశమైన. సిద్ధక్షేత్రమున నాకు తెల్పెను. శౌనకమహర్షీ| నేను నీకు ఇప్పుడు దీనిని చెప్పుచున్నాను. ఇట్లు ఆచార్య పరంపరతో కూడుకొని ఉన్న ఈ పురాణమునంతయు శ్రద్ధగా నీవు వినుము.
వ్యాసమహర్షిచే 18,000 శ్లోకములతో ఈ పురాణము చెప్పబడినది. (కానీ ప్రస్తుతము ఈ పురాణమున 20 వేలకు పైగా శ్లోకములున్నవి. అనగా వ్యాసకృత బ్రహ్మవైవర్తమును సౌతిమహర్షి పెంచి శౌనకాదులకు వివరించినట్లున్నాడు. అందువల్లనే శ్రీ సాతిమహర్షి వ్యాసకృతమైన బ్రహ్మవైవర్తమును ‘పురాణకం' (చిన్నపురాణము) అని అన్నాడు.)
పురాణముల నన్నిటిని వినిన ఏ ఫలితము లభించునో ఇందలి ఏ ఒక్క ఆధ్యాయమును విన్నా అంతటి ఫలితము లభించగలదు.
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున రాతి శౌనక సంవాదముతో నున్న బ్రహ్మఖండమున ఆనుక్రమణిక {విషయసూచి)
అను ప్రథమాధ్యాయము సమాప్తము.
Summary of chapter 1 of the Brahma Vaivarta Mahā Purana - Brahma Khaṇḍa is as follows:
In the holy forest of Naimishāraṇya, where venerable sages gathered to perform an enduring sacrifice for the spiritual welfare of the world, the exalted sage Śaunaka humbly approached the revered Śrī Sūta Gosvāmī with deep devotion in his heart. With boundless reverence, Maharshi Śaunaka requested the divine narrator to unveil the supreme nectar of the Brahma Vaivarta Purāṇa, which illuminates the absolute truth of Lord Śrī Kṛshṇa and grants spiritual liberation to searching souls. Śrī Sūta Gosvāmī, overwhelmed with divine bliss, offered his solemn obeisances unto the Supreme Lord Śrī Kṛshṇa, Lord Brahmā, Goddess Sarasvatī, and his venerable preceptor Maharshi Vyāsa before embarking upon this transcendent discourse. He recounted how this sacred Purāṇa was originally revealed by the Supreme Lord to Lord Brahmā, who subsequently transmitted its eternal light to Maharshi Nārada, filling the entire assembly of ascetics with supreme spiritual ecstasy and profound anticipation.