శ్రీ మద్భాగవతము - ప్రధమ (1వ) స్కందము
19 - ఏకోనవింశోఽధ్యాయః
తరువాత పరీక్షిన్మహారాజు తాను చేసిన నిందనీయమైన పనిని గురించి ఆలోచించుచుండెను. ఆయన మనస్సు ఆ పనిచే చాల వికలమా యెను. అయ్యో! నిరపరాధి, నిగూఢమగు బ్రహ్మతేజస్సు గలవాడు అగు మహర్షి విషయములో నేను దుష్టుని వలె నీచమగు పనిని చేసితిని.
నేను దేవుని వంటి మహర్షిని అవమానించితిని. దాని వలన నాకు నిశ్చయముగా శీఘకాలములోననే దాట శక్యము కాని ఆపద కలుగును. నా పుత్రాదులకు కాక సాక్షాత్తుగా నాకు అట్టి ఆపద యథేచ్ఛగా వచ్చుగాక! దాని వలన నాకు పాపనిష్కృతి కలిగి, మరల నేను అట్టి పాపమును చేయ కుందును.
బ్రహ్మర్షుల క్రోధము అనే అగ్నిలో దుష్టుడనగు నా రాజ్యము, సేన మరియు సమృద్ధమగు కోశము దహింపబడు గాక! నాకు మరల బ్రాహ్మణులు దేవతలు మరియు గోవుల యెడల పాపబుద్ధి కలుగకుండు గాక!
ఆయన ఈ విధముగా చింతిల్లుచుండగనే, తనకు మునికుమారుని శాపము వలన తక్షకుడనే సర్పముయొక్క విషముచే ఏడవ రోజున మృత్యువు రానున్నదని ముని పంపిన శిష్యుని వలన వినెను. సంసార ములో మునిగియున్న తనకు వైరాగ్యము కలుగుటకు హేతువు అగు తక్ష కుని విషాగ్ని శీఘ్రముగా సంప్రాప్తమగుట మంచిదియేనని ఆయన తలపో సెను.
ఆయన రాజ్యమును చేయుచుండగనే వేదాంతవిచారమును చేసి ఇహలోకపరలోకములు రెండు విడువదగినవియేనని నిర్ధారించుకొని యుండుటచే, వాటిని గురించి పట్టించుకొనకుండగా, శ్రీకృష్ణుని పాదముల సేవయే పరమపురుషార్థమని తలచినవాడై, గంగానదీతీరమునందు ప్రాయోపవేశమును మొదలిడెను.
గంగానది ప్రకాశించే శ్రీతులసి గంధముతో మిశ్రితమైన శ్రీకృష్ణపా దరేణువులను తనలో కలుపుకొని, తద్ద్వారా సర్వోత్కృష్టమైన నీటిని గొనివ చ్చి, లోకపాలకులతో సహా లోకములను లోపల (అంతఃకరణమును) మరియు బయట (శరీరమును) కూడ పవిత్రము చేయుచున్నది. అట్టి గంగను మరణించ బోయే ఏ వ్యక్తి సేవించకుండును?
పాండువంశసంజాతుడగు ఆ పరీక్షిన్మహారాజు ఈ విధముగా విష్ణుపాదోద్బవయగు గంగానదియొక్క తీరమునందు ప్రాయోపవేశమును చేయవలెనని నిశ్చయించుకొని, సాంసారికములగు ఆసక్తులనన్నింటినీ విడిచి పెట్టి, మునుల వ్రతమును చేబట్టి, మరియొక ఆలోచన లేని మన స్సుతో పరమేశ్వరుని పాదములను ధ్యానించెను.
భూమిని పవిత్రము చేసే మహానుభావులగు మహర్షులు తమ శిష్యులతో గూడి అచటకు విచ్చేసిరి. సాధారణముగా సత్పురుషులు తీర్థ యాత్ర అనే వ్యాజముతో తామే తీర్థములకు పవిత్రతను కలిగించు చుందురు గదా!
అత్రి, వసిష్ఠుడు, చ్యవనుడు, శరద్వంతుడు, అరిష్టనేమి, భృగు డు, అంగిరసుడు, పరాశరుడు, విశ్వామిత్రుడు, పరశురాముడు, ఉతథ్యు డు, ఇంద్రప్రమదుడు, ఇద్మవాహుడు, మేధాతిథి, దేవలుడు, ఆర్షి షేణు డు, భారద్వాజుడు, గౌతముడు, పిప్పలాదుడు, మైత్రేయుడు, ఔర్వుడు, కవషుడు, అగస్త్యుడు. వ్యాసుడు మరియు నారదభగవానుడు విచ్చేసిరి.
ఇంతేగాక, ఇంకనూ కొందరు దేవర్షి బ్రహ్మర్షి రాజర్షివర్యులు మరియు అరుణుడు మొదలగు కాండర్హులు కూడ విచ్చేసిరి. రాజు ఋషి గోత్రములలో ప్రముఖులగు ఆ ఋషుల నందరిని పూజించి తలను వంచి నమస్కరించెను.
తరువాత వారందరు సుఖముగా కూర్చుని యుండగా, శుద్ధమగు అంతఃకరణము గల పరీక్షిన్మహారాజు మరల వారికి నమస్కరించి, వారి యెదురుగా చేతులను జోడించి నిలబడి, తాను చేయదలచుకున్న ప్రాయో పవేశమును గురించి విన్నవించెను.
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికేను: ఆశ్చర్యము! మహాత్ములగు మీరు అనుగ్రహించుటకు అర మైన శీలము గలవానినిగా నన్ను భావించి, రాజులలో నేను ధన్యతముడగునట్లు చేసిరి. అయ్యో! నిందనీయమగు కర్మను చేయు రాజుల వంశములు బ్రహ్మర్షుల పాదములను కడిగిన జల మునకు దూరమగును. అనగా, అట్టి భాగ్యము వారికి లభించదు. అట్టి వారి జోలికి బ్రహ్మర్షులు పోరు.
అట్టి నిందార్తమగు కర్మను నేను చేసితిని. నిరంతరముగా సంసా రాసక్తి గల నేను పాపిని. కారణకార్యరూపమగు ఈ జగత్తునకు ప్రభువగు పరమేశ్వరుడు బ్రాహ్మణశాపరూపములో నాకు యెదురై వైరాగ్యమును కలిగించినాడు. అట్టి శాపము నెత్తి పై నుండగా మానవుడు సంసారములో నికి మరల చొరబడుటకు చాల భయపడును గదా!
ఓ మహర్షులారా! అట్టి నేను మిమ్ములను శరణు జొచ్చినానని తెలుసుకొనుడు. నేను ఈశ్వరునియందు లగ్నమైన మనస్సు గలవాడనని గంగాదేవి కూడ తెలియుగాక! బ్రాహ్మణబాలకుని శాపప్రభావముచే కపటి యగు తక్షకుడు తనకు తృప్తి కలుగునంత వరకు నన్ను కాటు వేయుగాక! మీరు శ్రీమహావిష్ణువుయొక్క గాథలను గానము చేయుడు.
నేను ఏయే జన్మలను పొందిననూ, ఆ జన్మలలో మరల నాకు అనంతభగవానునియందు ప్రీతి, ఆయన. భక్తులగు మహాత్ములతోడి నిరం తరసంగము, సర్వప్రాణులయందు ప్రేమ కలుగు గాక! మహర్షులకు నమ స్కరించుచున్నాను.
వివేకియగు పరీక్షిన్మహారాజు తన కుమారుడగు జనమేజయునకు రాజ్యభారమునప్పగించి, ఈ విధమగు దృఢనిర్ణయమును తీసుకొని, గంగానదియొక్క దక్షిణతటమునందు దర్బలను కొనలు తూర్పువైపునకు ఉండునట్లుగా వేసుకొని, వాటిపై ఉత్తరముఖముగా కూర్చుండెను.
ఈ విధముగా పరీక్షిన్మహారాజు ప్రాయోపవేశమునకు కూర్చుం డగా, ఆకాశమునందు దేవతలు ఆయనను కొనియాడి ఆనందముతో భూమిపై పూలవానను కురిపించిరి. దేవదుందుభులు కూడ మ్రోగెను.
అచటకు విచ్చేసిన మహర్షులకు ప్రజలను అనుగ్రహించుట స్వభా వమై యున్నది. వారి తపోబలము కూడ ప్రజానుగ్రహము కొరకు మాత్ర మే. వారు పరీక్షిత్తును కొనియాడి, బాగున్నది అని తమ ఆమోదమును. తెలిపి, ఉత్తమమగు కీర్తిగల శ్రీహరియొక్క గుణముల వర్ణనచే సుందర మగు వచనములను కూడ పలికిరి.
ఓ రాజర్షి శ్రేష్ఠా! శ్రీకృష్ణుని అనుయాయులై సేవించే మీ పాండు వంశీయుల విషయములో ఇది ఆశ్చర్యము కాదు. ఏలయనగా, ధర్మ రాజాదులు భగవంతుని సన్నిధిని ఆకాంక్షించువారై, సాష్టాంగప్రణామము నాచరించే సామంతరాజుల కిరీటములచే సేవించబడే చక్రవర్తి సింహాసన మును క్షణములో విడిచి పెట్టిరి.
భగవద్భక్తులలో ప్రముఖుడగు ఈ పరీక్షిన్మహారాజు దేహమును విడిచి పెట్టి, త్రిగుణాతీతము శోకరహితము సర్వశ్రేష్టము అగు లోకము (మోక్షము) ను పొందునంత వరకు, ఇప్పటినుండియు మనము అంద రము ఇచటనే ఉండెదము.
పక్షపాతము లేనిది, తేనెలొలుకునది, గంభీరమగు అర్ధము గలది మరియు నిష్కపటమైనది అగు ఆ ఋషిసంఘముయొక్క వచనమును విని, పరీక్షిన్మహారాజు జ్ఞానులగు ఆ ఋషులను అభినందించి, శ్రీహరి యొక్క లీలలను వినగోరువాడై, ఇట్లు పలికెను.
ముల్లోకములకు ఆవలనుండే సత్యలోకములో వేదములన్నియు రూపు దాల్చి యుండును. అదే విధముగా మీరందరు అన్ని దిక్కులనుం డియు ఇక్కడకు విచ్చేసి యున్నారు. ఇతరులను అనుగ్రహించుట మీకు సహజస్వభావమై యున్నది. అది తప్ప మీకు ఇహపరలోకములలో సాధిం చదగిన గురిక ప్రయోజనమేమియు లేదు.
ఓ మహర్షులారా! అందువలన, నేను మిమ్ములను విశ్వసించి నా కర్తవ్యము విషయములో వేయదగిన ఒక ప్రశ్నను వేయుచున్నాను. మాన వుడు అన్ని అవస్థలలో, విశేషించి మరణించబోయే సమయములో చేయ దగిన పవిత్రమగు కార్యము ఏది? ఆ విషయమును మీరు సమాహితచి తులై విచారణను చేసి చెప్పడు.
దేనినీ ఆశించనివాడు, కంటికి కానరాని ఆశ్రమచిహ్నములు గలవాడు, ఆత్మలోభముచే సంతృప్తిని చెందియున్నవాడు, అవధూతవేషములో నున్నపోడు, వ్యాసపుత్రుడు అగు భగవాన్ శుకమహర్షి గొలీపోటముగా (ఈ శ్వరుని సంకల్పముచే) భూమిని సంచరిస్తూ అచట ప్రకటమయ్యెను. స్త్రీలు, పిల్లలు కుతూహలము వలన ఆయన చుట్టూ చేరి యుండిరి.
పదునారు సంవత్సరముల వయస్సు గలవాడు, సుకుమారమగు పాదములు చేతులు తొడలు బాహువులు స్కంధములు చెక్కిళ్లు మరియు శరీరము గలవాడు, సుందరమగు నిడివి కన్నులు ఎత్తైన ముక్కు సరిసమా నమగు చెవులు అందమగు కనుబొమలు గల ముఖము గలవాడు, శంఖ మువలె అందమగు కంఠము గలవాడు, మాంసముచే కప్పబడియున్న కంఠము క్రింది యెముకలు గలవాడు, విశాలమగు ఎత్తైన వక్షఃస్థలము గల వాడు, సుడిగుండము వంటి నాభి గలవాడు, మూడు ముడతలతో సుందర మగు ఉదరము గలవాడు, దిగంబరుడు, ముఖముపై చెల్లాచెదరుగా పడు చున్న జుట్టు గలవాడు, పొడవుగా వ్రేలాడే బాహువులు గలవాడు, దేవశ్రే షుడగు విష్ణువు వలె ప్రకాశించువాడు, నల్లని వాడు, ఎల్లవేళలా అత్యుత్త మమగు వయస్సుచే అనగా యౌవనముచే కలిగిన దేహకాంతితో మరియు ప్రీతికరమగు చిరునవ్వుతో స్త్రీలకు కూడ మనస్సునకు ఆహ్లాదమును కలిగించువాడు అగు శుకమహర్షిని చూచి, ఆయన దాగియున్న బ్రహ్మవర్చస్సు గలవాడే అయిననూ, ఆయనయొక్క చిహ్నములనెరింగిన ఆ మునులు తమ ఆసనములనుండి లేచి ఆయనకు ఎదురేగిరి.
పరీక్షిన్మహారాజు విచ్చేసిన అతిథికి శిరస్సును వంచి నమస్కరించి
పూజించెను. శుకుని వెనుకనే వచ్చిన స్త్రీలు, పిల్లలు అప్పుడు వెనుకకు - మరలిరి. ఆ విధముగా ఆదరించబడిన శుకమహర్షి పెద్ద ఆసనముపై కూర్చుండెను.
మహాత్ములలో మహాత్ముడగు ఆ శుకమహర్షి అచట బ్రహ్మర్షులు రాజర్షులు మరియు దేవర్షుల సముదాయములచే చుట్టువారబడి యున్న వాడై, గ్రహములు నక్షత్రములు మరియు ఇతరజ్యోతిర్మండలములచే చుట్టుపారబడియున్న చంద్రభగవానుని వలే అధికముగా ప్రకాశించెను.
భగవద్భక్తుడు, ఏకాగ్రమగు చిత్తము గలవాడునగు పరీక్షిన్మహా రాజు ప్రశాంతముగా కూర్చునియున్న, మొక్కవోని ధారణాశక్తి గల శుకము హర్షి వద్దకు వచ్చి, తల వంచి నమస్కరించి, నిలబడి చేతులను జోడించి మరల నమస్కరించి, తరువాత మధురమగు వాక్కుతో నిట్లు ప్రశ్నించెను.
ఓ మహర్షీ! ఇది అద్భుతము! అయోగ్య క్షత్రియులమగు మేము ఈ నాడు సత్పురుషులకు సేవించ దగినవారము అయితిమి. మీరు దయతో అతిథిరూపములో వచ్చి మాకు అట్టి యోగ్యతను కలిగించినారు.
మీవంటి మహాత్ములను స్మరించినంత మాత్రాన మానవుల గృహములు వెనువెంటనే నిశ్చయముగా పవిత్రములగును. అట్టిచో మిమ్ములను దర్శించి, స్పృశించి, పాదములను కడిగి, ఆసనమునిచ్చి సత్కరించినచో మరింత పవిత్రములగునని వేరే చెప్పవలయునా?
ఓ మహాయోగీ! నీ సన్నిధి వలన మానవుల మహాపాపములు కూడ విష్ణువు సన్నిధిలో రాక్షసుల వలే వెనువెంటనే నిశ్చయముగా నశిం చును.
శ్రీకృష్ణభగవానుడు పాండవులకు ప్రియతముడు. కావున, ఆయన తన మేనత్త కొడుకులగు పాండవుల ప్రీతి కొరకై వారి వంశములో జన్మిం చిన నాయందు కూడ బంధుభావము గలవాడై, నాపై ప్రీతిని కలిగియుండ వచ్చును.
మహాసిద్దులగు మీరు వనములో నుండెదరు. మీ రాకపోకలు ఎవ్వరికీ తెలియవు. శ్రీకృష్ణభగవానుని అనుగ్రహము లేనిచో, శీఘ్రముగా మరణించబోయే నావంటి వారికి అట్టి మీ దర్శనము ఎట్లు సంభవమ గును?
మీరు యోగులకు కూడ పరమగురువులు. కావుననే, నేను మిమ్ములను ప్రశ్నించుచున్నాను. ఈ లోకములో శీఘ్రమే నిశ్చయముగా మరణించుచున్న మానవుడు మోక్షమును గోరి చేయ యోగ్యమగు కర్మ ఏది?
ఓ ప్రభూ! మానవులు దేనిని వినవలెను? జపించవలెను? చేయ వలేను? స్మరించవలెను? సేవించవలెను? మరియు, వేటిని విడనాడ వలెను? ఈ విషయమును చేప్పుడు.
పరబ్రహ్మస్వరూపుడవగు ఓ మహర్షీ! పూజ్యులగు మీరు ఎక్క డై ననూ గృహస్థుల ఇంటిలో ఆవు పాలను పితికినంత సేపైననూ ఉండరు. మీరు మా వద్దకు వచ్చుట మా భాగ్యము.
సూతుడు ఇట్లు పలికెను: పరీక్షిన్మహారాజు ఈ విధముగా వ్యాసపు త్రుడగు శుకమహర్షిని అభిముఖముగా చేసుకొని మధురమగు వాక్కుతో ప్రశ్నించెను. అపుడు ధర్మజ్ఞుడు, పూజ్యుడు అగు ఆ మహర్షి ఆయనకు సమాధానమును చేప్పెను.
శ్రీమద్బాగవత మహాపురాణములోని ప్రథమస్కంధములో పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది.
ప్రథమస్కంధము సమాప్తము.
