శ్రీ మద్భాగవతము - ప్రధమ (1వ) స్కందము
17 - సప్తదశోఽధ్యాయః
సూతుడిట్లు పలికెను : అచట పరీక్షిన్మహారాజు మహారాజవేషము లోనున్న ఒక అధర్మాత్ముడు కర్రను చేతబట్టి ఎద్దును ఆవును కొట్టుచుం డగా చూచెను. వాటికి రక్షకుడు లేకుండెను.
తామరతూడు వలె తెల్లనైన బక్కచిక్కియున్న ఆ ఎద్దును శూద్రుడు కొట్టుచుండగా, అది భయముతో వణకుచున్నదా యన్నట్లు ఒంటికాలిపై నిలబడి, మూత్రమును విసర్జించుచుండెను. రాజు ఆ దృశ్య మును చూచెను.
వేదవిహితకర్మలకు అవసరమయ్యే పాలు మొదలగు హవిస్సును ఇచ్చే ఆ ఆవు దూడలేక బక్కచిక్కి యుండెను. ఆ శూద్రుడు పాదముతో తన్నుచుండగా, ఆమె మిక్కిలి దీనురాలై యుండెను. కన్నుల వెంబడి నీటిని రాల్చుచున్న ఆ ఆవును రాజు చూచెను.
బంగరు పరికరములతో కూడిన రథమునందు కూర్చునియున్న మహారాజు ధనస్సును ఎక్కు పెట్టి, మేఘగర్జనవలె గంభీరమగు వాక్కుతో ఇట్లు ప్రశ్నించేను.
నీవెవరు? నేను పాలించే రాజ్యములో బలవంతుడగు నీవు బల హీనులను కొట్టుచుంటివి. నటుని వలె నున్నావు. వేషమును బట్టి మహారా జువలే కానవచ్చుచున్నావు. కాని చేసే పని మాత్రము నీవు దుష్టుడవని తెలియజేయుచున్నది.
నీవెవరివి? అర్జునునితో బాటు శ్రీకృష్ణుడు దూరము కాగానే, నిర్జ నస్థానమునందు నీవు నిరపరాధులను కోట్టుచున్నావు. నీ అపరాధమునకు మరణమే శిక్ష.
ఓ వృషభమా! నీవు తొమరతూడువలే తెల్లగా వున్నావు. మూడు కాళ్లు లేకున్ననూ ఒంటి కొటతో నడచే నీవు ఎవరివి? నీన్ను చూచిన నాకు చాల భేదము కలుగుచున్నది. బహుశః ఎవరో ఒక దేవత ఎద్దు రూపములో సంచరించుచున్నది కాబోలు!
పురువంశపు రాజులు తమ దృఢమగు బాహువులతో ఈ రాజ్య మును కౌగిలించుకొని యున్నారా అన్నవిధముగా ఈ రాజ్యమును పాలిం చుచున్నారు. ఈ రాజ్యములో నీవు తక్క ఇతరులెవ్వరూ ఏ కాలమునందై ననూ కన్నీటిని విడుచుట లేదు.
ఓ వృషభమా! దుఃఖించకుము. ఈ దుష్టుని వలన నీవు భయపడ కుము. దుష్టులను దండించే నేను ఉండగా, నీవు ఏడ్వవద్దు. ఓ గోమాతా! నీకు మంగళమగు గాక!
ఓ గోమాతా! ఏ మదాంధుడగు రాజుయొక్క పాలనలో ఏ ప్రాణి ననూ దుష్ఠులచే పీడించబడునో, అట్టి రాజుయొక్క కీర్తి, ఆయుర్దాయము, సౌభాగ్యము మరియు పుణ్యలోకము కూడ నశించును.
పీడితుల పీడను తొలగించుట రాజుల పరమధర్మము. కావున, ప్రాణులను హింసించే ఈ పరమదుర్మార్గుని నేను వధించెదను.
ఓ సురభిపుత్రా! నీ నాలుగు పాదములలో మూడింటిని ఎవడు నరికినాడు? శ్రీకృష్ణుని అనుయాయులగు రాజుల రాజ్యములో నీవంటి పీడి తులు లేకుందురు గాక!
ఓ వృషభమా! మీకు మంగళమగు గాక! మీ వంటి నిరపరాధు లగు సాధుజంతువులను, అంగవికలులుగా చేసి, పాండవుల కీర్తికి మచ్చను దెచ్చిన వ్యక్తిని గురించి చెప్పుము.
నిరపరాధియగు ప్రాణిని హింసించే వ్యక్తి ఎక్కడ ఉన్ననూ, వానికి నా వలన భయము తప్పదు. దుష్టులను దండించుట ద్వారా సత్పురుషు లకు నిశ్చయముగా మంగళము కలుగును.
ఎవడైతే అడ్డు ఆపు లేకుండగా నిరపరాధులయందు పాపమునాచ రించునో, అట్టి వ్యక్తి సాక్షాత్తుగా దేవతయే అయిననూ, వాని భుజమును భుజకీర్తితో సహా నరికి వేయగలను.
మానవుడు ఘోరమగు విపత్తులో మర్యాదను అతిక్రమించినచో, అది అంగీకారమే యగును. కాని, సామాన్యముగా మర్యాదను ఉల్లంఘించి అధర్మమార్గములో జీవించు వారిని శాస్త్రనియమముల ననుసరించి రాజు దండించవలెను. తద్ద్వారా స్వధర్మమునాచరించు జనులను రక్షించుట రాజునకు పరమకర్తవ్యమై యున్నది.
ధర్ముడు ఇట్లు పలికెను: పాండవులు తమ సద్గుణసంపదచే శ్రీకృ ష్ణభగవానుని అనుగ్రహమును పొంది, ఆయనను రాయబారము మీద లగు కార్యములయందు నియోగించ గలిరి. అట్టి పొండువంశస్థులగు మీకు ఈ విధముగా ఆపదలో నున్నవారికి అభయమునిచ్చుట ఎంతయూ తగి యున్నది.
ఓ పురుషశ్రేష్ఠా! విభిన్నవాదుల వాదములచే సమ్మోహితులమై యున్న మేము ఆపదల బీజములు ఏ పురుషుని వలన ఉదయించునో, ఆ పురుషుని యెరుంగము.
నానాత్వమునంగీకరించని యోగులు మన సుఖదుఃఖములకు కారణము మనమేనని చెప్పెదరు. మరికొందరు (దైవజ్ఞులు) దైవము వలన, ఇంకొందరు (మీమాంసకులు) పూర్వకర్మ వలన సుఖదుఃఖములు కలుగుచున్నవని చెప్పుచుండగా, లోకాయతీకులు స్వభావము చేతనే అవి సంక్రమించుచుండునని వాదించు చున్నారు.
మనస్సుచే చింతింప శక్యము కానివాడు, వాక్కులచే నిర్దేశింప శక్యము కానివాడు అగు పరమేశ్వరుని వలన ప్రాణులకు సుఖదుఃఖములు కలుగుచున్నవని కొద్దిమందియొక్క సిద్ధాంతము. ఓ రాజర్షీ! నీవు ఈ పక్షములను నీ బుద్ధితో విమర్శించి, యోగ్యమగు నిర్ణయమునకు రమ్ము.
ఓ శౌనకమహర్షీ! ధర్ముని ఈ వచనములను వినగానే పరీక్షిన్మహా రాజునకు గల ఖేదము తొలగిపోయెను. ఆయన ఏకాగ్రమగు మనస్సుతో ధర్మునీ చూచి ఇట్లు పలికెను.
మహారాజు ఇట్లు పలికెను: ఓ ధర్మజ్ఞా! అధర్మమును చేయువా నికి ఏ నరకము లభించునో, వానిపై చాడీలు చెప్పువానికి కూడ అదే నర కము లభించుననే ధర్మమును నీవు చెప్పకనే చెప్పుచున్నావు. నీవు వృష భరూపములోనున్న ధర్ముడవు.
లేదా, ఒకచో నీకు సుఖదుఃఖములకు హేతువు తెలియకున్ననూ, ఆశ్చర్యము కాదు. ఏలయనగా, పరమేశ్వరుని మాయాశక్తియొక్క ప్రవృత్తి, అనగా ఎప్పుడు ఎవరిని అనుగ్రహించి ఎవరిని హింసించును అనే విషయ ము, ప్రాణుల బుద్ధికి గాని, వాక్కులకు గాని గోచరించేది కాదు అనేది సిద్ధాంతము.
ధర్మమునకు తపస్సు, శౌచము, దయ, సత్యము అను నాలుగు పాదములు గలవని మహర్షులు కీర్తించిరి. అధర్మముయొక్క అంశములగు సమ్మోహము తపస్సును, దుష్టసంగము శౌచమును, గర్వము దయ అను నీ పాదమును విరుగ గొట్టినవి.
ఓ ధర్మమా! ఇప్పుడు నీ నాల్గవ పాదమగు సత్యము మాత్రమే మిగిలి యున్నది. నీవు దానితో మాత్రమే కష్టముగా నిలబడియున్నావు. మానవుడు దానితో మాత్రమే నిన్ను పొందుచున్నాడు. కానీ, అసత్యముచే వర్ధిల్లజేయబడిన ఈ అధర్మరూపమగు కలి ఆ సత్యమును మ్రింగివేయ గోరుచున్నది.
శ్రీకృష్ణభగవానుడు గోరూపములోనున్న ఈ భూమియొక్క పెను భారమును పోగొట్టినాడు. ఇపుడు ఈమె శోభాయుక్తములగు భగవానుని పాదముల చిహ్నములచే అంతటా మంగళమయమై యున్నది.
ఇపుడీ భూమాత భగవానునిచే విడువబడినదై, బ్రాహ్మణద్రోహు లగు రాజులు స్వధర్మమును మరచిన నామమాత్రపు రాజులై నన్ను భోగిం చెదరని, కన్నుల వెంబడి నీటిని స్రవిస్తూ, అభాగ్యురాలు వలె శోకించు చున్నది.
మహారథుడగు పరీక్షిన్మహారాజు ఈ విధముగా భూదేవిని, ధర్ముని ఓదార్చి, అధర్మమునకు కారణమగు కలిని హతమార్చుటకై వాడి కత్తిని చేతిలోనికి తీసుకొనెను.
పరీక్షిత్తు తనను సంహరించ బోవుచున్నాడని గమనించిన కలి భయముతో కంగారుపడి, తన రాజచిహ్నములను పారవేసి, ఆయన పాద మూలమునకు శిరస్సుతో మ్రొక్కెను.
దీనులయందు ప్రేమ గలవాడు, శరణు జొచ్చినవారిని రక్షించువాడు, సత్కీర్తికి తగినవాడు అగు పరీక్షిన్మహారాజు దయచే ఆతనిని చంపకుండగా విడిచి పెట్టి, చిరునవ్వుతో నిట్లనెను.
అర్జునుని కీర్తిని ధరించే మా వద్ద చేతులను జోడించిన నీకు నిశ్చ. యముగా భయము ఏమియు లేదు. కాని, అధర్మమునకు బంధువు అగు నీవు మా సామ్రాజ్యములో ఎట్టి పరిస్థితులలోనైననూ ఉండరాదు.
నీవు రాజుల దేహములయందు ఉండగా, నిన్ను అనుసరించి పిసి నారితనము, అసత్యము, పరధనమును అపహరించుట, రౌడీతనము,స్వధర్మమును విడిచి పెట్టుట, దారిద్యము, మోసము, కలహములు, దంభము (పలుకుబడి కోరకై ధర్మమునాచరించుట) అనే అధర్మసముదా యము కూడ వారియందు పనిచేయును.
అధర్మమునకు చెలికాడైన ఓ కలీ! కావున, ధర్మము సత్యము ఉండదగిన బ్రహ్మావర్త దేశములో నీవు ఉండరాదు. ఇచట యజ్ఞమును గురించి విస్తృతమగు విజ్ఞానము గల పండితులు ఆ యజ్ఞప్రభువగు శ్రీహ రిని యజ్ఞములతో ఆరాధించుచుందురు.
బ్రహ్మావర్తమునందు యజ్ఞమూర్తియగు శ్రీహరిని జనులు యజ్ఞ ములతో ఆరాధించేదరు. ఆయన వారి కోర్కెలను సఫలము చేసి, మంగళ ములనిచ్చును. ఆయన లోపల బయట ఉండే వాయువు వలె చరాచర ప్రాణి కోటియొక్క ఆత్మస్వరూపుడై ఉన్నాడు.
సూతుడు ఇట్లు పలికెను: కత్తిని పైకి యెత్తి పట్టుకొనియున్న పరీ క్షిత్తు యమధర్మరాజును బోలియుండెను. ఆయనను ఆ విధముగా చూచిన కలికి వణుకు పుట్టెను. ఆతనిని ఆయన ఈ విధముగా ఆదేశించగా, ఆతడు ఆయనతో నిట్లనెను.
కలి ఇట్లు పలికెను: ఓ చక్రవర్తీ! నీ అనుజ్ఞచే నేను ఎక్కడెక్కడ నివ సించిననూ, అక్కడక్కడ ధనుర్బాణములను సిద్ధముగా పట్టుకొనియున్న నీవు నాకు కనబడుచునే యుందువు.
ఓ ధార్మికశిరోమణీ! కావున, నీవు దయచేసి నాకు స్థానమును నిర్దేశించుము. నేను నీ ఆజ్ఞానుసారముగా అక్కడ మాత్రమే స్థిరముగా నివసించగలను.
సూతుడు ఇట్లు పలికెను: కలి ఈ విధముగా అభ్యర్థించగా, పరీక్షి న్మహారాజు ఆతనికి జూదము, మద్యపానము, దుష్టస్త్రీసంగము మరియు ప్రాణిహింస అనే నాలుగు స్థానములమ నిర్దేశించెను. వీటియందు క్రమ ముగా అసత్యము, మదము, విషయాసక్తి, క్రౌర్యము అనే నాలుగు రక ముల అధర్మము నివసించి యుండును.
కలి మరల యాచించగా, సర్వసమర్థుడగు పరీక్షిత్తు ఆతనికి బంగా.. రముతో బాటు, అసత్యము, గర్వము, కామము, రజోగుణమూలకమగు హింస అనే అయిదు స్థానములనిచ్చెను.
అధర్మమునకు మూలకారణమగు కలి పరీక్షిన్మహారాజుయొక్క ఆదేశమును పాటిస్తూ, ఆయన ఇచ్చిన ఈ స్థానములయందు మాత్రమే నివసించ దొడగెను.
అందువలన, బ్రతికి బట్టగట్టగోరు మానవుడు, విశేషించి ధర్మస్వ భావమును కలిగి జనులను పాలించే రాజు, ధర్మమును ఉపదేశించే గురువు ఏ కాలమునందైననూ వీటి జోలికి పోరాదు.
తపస్సు, శౌచము, దయ అనే ధర్మముయొక్క నశించిన మూడు పాదములను పరీక్షిన్మహారాజు తిరిగి నిలబెట్టెను. అనగా, వాటిని వర్ధిల్లజేసె ను. ఇంతేగాక, ఆయన భూదేవిని ఓదార్చి, చక్కగా వర్ధిల్లునట్లు చేసెను.
అడవికి వెళ్లగోరిన ధర్మరాజు సింహాసనమును తన మనుమనికి అప్పజెప్పెను. చక్రవర్తికి దగియున్న ఆ సింహాసనమును నిన్న మొన్నటి వరకు అట్టి పరీక్షిన్మహారాజు అధిష్ఠించెను.
రాజర్షి, మహాత్ముడు, గొప్ప కీర్తి గలవాడునగు ఆ పరీక్షిన్మహా రాజు నిన్న మొన్నటి వరకు హస్తినాపురమునందు కురుసార్వభౌముని శోభతో ప్రకాశించినాడు.
అభిమన్యుని పుత్రుడగు పరీక్షిన్మహారాజుయొక్క ప్రభావము ఇంత గొప్పది. ఆయన రాజ్యమునేలుచుండగనే, మీరు సత్రయాగదీక్షను స్వీకరించినారు.
శ్రీమద్భాగవత మహాపురాణములోని ప్రథమస్కంధములో పదునేడవ అధ్యాయము ముగిసినది.
