శ్రీ మద్భాగవతము - ప్రధమ (1వ) స్కందము

2 -  ద్వితీయోఽధ్యాయః

వ్యాసుడు ఇట్లు పలికెను: ఈ విధముగా ఆ మహర్షులు వేసిన చక్కని ప్రశ్నలను విని రోమహర్షణుని పుత్రుడగు సూతమహర్షి చాల సంతో షించి, వారి వచనమును అభినందించి చెప్పుట మొదలిడెను.

సూతుడు ఇట్లు పలికెను: జ్ఞానియగుటచే సకలకర్తవ్యములనుండి విముక్తుడై యున్న శుకమహర్షి ఉపనీతుడు కాకుండగా (లేదా ఒంటరిగా) సర్వమును విడిచి పెట్టి వెళ్లిపోవుచుండగా, వ్యాసమహర్షి ఆ వియోగము నకు భయపడి, ఓ పుత్రా అని పిలువగా, శుకుని ఆత్మరూపములే యగు వృక్షములు ప్రత్యుత్తరమునిచ్చినవి (ప్రతిధ్వనించినవి). సర్వప్రాణుల బుద్ధి యందు ఆత్మరూపముగా ప్రకాశించే అట్టి శుకమహర్షికి నేను నమస్క రించుచున్నాను.

పురాణములలో రహస్యమగు భాగవతము తనదైన అసాధారణ మగు ప్రభావము గలది. సకలవేదముల సారమగు ఈ పురాణసు సంసారమనే గాఢమగు చీకటిని అతిక్రమించగోరు సంసారులకు ఆత్మతత్వ మును ప్రకాశింపజేసే సాటిలేని దీపము వంటిది. దీనిని వ్యాసపుత్రుడగు శుకమహర్షి దయతో బోధించినాడు. మునులకు కూడ గురువగు ఆ శుకుని నేను శరణు పొందుచున్నాను.

మానవులలో సర్వశ్రేష్టులగు నరనారాయణమహర్షులను, సరస్వ తీదేవిని మరియు వ్యాసమహర్షిని నమస్కరించి, తరువాత సంసారముపై విజయమును కలిగించే శ్రీమద్భాగవతమును పఠించవలెను.

ఓ మునులారా! మీరు నన్ను లోకములకు కల్యాణమును కలిగించే, శ్రీకృష్ణునకు సంబంధించిన చక్కని ప్రశ్నను వేసితిరి. ఈ ప్రశ్నచే ఆగతఃకరణము మంచి ప్రసన్నతను పొందుచున్నది.

మానవులకు శ్రీమహావిష్ణువునందు ఫలతృష్ణ మరియు విఘ్న ముల బెడద లేని భక్తిని కలిగించే ధర్మమే సర్వోత్కృష్టమైనది. అట్టి భక్తి వలన హృదయము మిక్కిలి ప్రసన్నమగును.

సర్వజగన్నివాసుడు మరియు స్వయంప్రకాశస్వరూపుడునగు శ్రీకృష్ణపరమాత్మయందు భక్తిపూర్వకమగు నిష్ట గలవానికి శీఘ్రముగా వైరాగ్యము మరియు శుష్కతర్కమునకు గోచరము కాని ఆత్మజ్ఞానము కలుగును.

మానవులు ధర్మమును చక్కగా అనుష్టించినప్పటికీ, అది వారికి శ్రీమహావిష్ణువుయొక్క గాథలయందు ప్రీతిని కలిగించని పక్షములో కేవ లము వ్యర్థప్రయాస మాత్రమే యగును.

ధర్మముయొక్క ప్రయోజనము మోక్షము. అర్థము అనే పురుషా ర్థము ధర్మపురుషార్థమునకు యోగ్యమగు ఫలము కాదు. అటులనే, అర్థ మునకు ఏకైకప్రయోజనము ధర్మము కావలెనే గాని, కామము కాదని మహర్షులు చెప్పుచున్నారు.

విషయభోగమునకు కేవలము జీవితయాత్రను సాగించుటయే ఫలము గాని, ఇంద్రియతర్పణము కాదు. మానవజీవితము బ్రహ్మవిచార ముచే సార్థకమగునే గాని, కర్మలను చేసి ఫలములను పొందుటచే గాదు.

జ్ఞాతృ-జ్ఞానభేదము లేని జ్ఞానమే తత్త్వమని తత్త్వవేత్తలు చెప్పుచున్నారు. ఆ తత్త్వమునకే బ్రహ్మ, పరమాత్మ, భగవానుడు అని ప్యరము గలదు.

మననశీలురగు శ్రద్ధాళువులు శ్రవణముచే సంప్రాప్తమైన, జ్ఞానై రాగ్యములతో కూడిన జ్ఞాననిష్ణారూపమగు భక్తిచే ఆ తత్త్వమును బుద్ధియందు ఆత్మరూపముగా దర్శించెదరు.

కావున, ఓ శౌనకాది మహర్షులారా! వర్ణాశ్రమవ్యవస్థానుసార ముగా చక్కగా అనుష్ఠించబడిన ధర్మమునకు హరి ప్రసన్నుడగుటయే పూర్ణమగు సిద్ధి యగును.

కావున, నిత్యము ఏకాగ్రమగు మనస్సుతో భక్తవత్సలుడగు శ్రీకృ ష్ణభగవానుని గురించి శ్రవణము చేసి, ఆయనను కీర్తించి, ధ్యానించి, పూజించవలెను.

వివేకవంతులగు జనులు శ్రీకృష్ణుని ధ్యానము అనే కత్తితో అహం కారమనే చిక్కుముడిని కల్పించి గట్టిగా బంధించే కర్మను ఛేదించుచున్నారు. అట్టి స్థితిలో ఆయన కథయందు ఎవడు ప్రీతిని చేయకుండును?

ఓ మహర్షులారా! పుణ్యక్షేత్రములను సేవించుట వలన మహా త్ముల సేవ, దాని వలన శ్రద్ధ, దాని వలన. శ్రవణమునందు కోరిక, శ్రవణము వలన వాసుదేవుని కథలయందు ప్రీతి కలుగును.

శ్రీకృష్ణుని గాథలు వినువారిని కీర్తించువారిని పవిత్రము చేయును. ఆయన తన గాథలను వినువారి అంతరంగమునందున్నవాడై బుద్దియం దలి అమంగళకరమగు వాసనలను పారద్రోలును. ఏలయనగా, ఆయన సత్పురుషులకు హితకారి.

నిత్యము భగవద్భక్తులను (లేదా భాగవతమును) సేవించుట వలన అశుభవాసనలు ఇంచుమించు పూర్తిగా నశించిపోగా, పవిత్రమగు కీర్తి గల పరమేశ్వరునియందు నిశ్చలమగు భక్తి కుదురును.

  అప్పుడు రజస్తమోగుణములనుండి పుట్టే కామము లోభము మొదలైన భావములు మనస్సును నిర్వీర్యము చేయజాలవు. ఆ మనస్సు సత్త్వగుణమునందు స్థిరపడి ప్రసన్నముగా నుండును.

ఈ విధముగా భగవంతునితో భక్తిపూర్వకమగు నిరంతరసంబం ధము వలన ప్రసన్నమైన మనస్సు కలిగి సంసారమునందలి ఆసక్తులన న్నింటినీ విడిచి పెట్టిన సాధకునకు భగవంతుని యథార్థస్వరూపముయొక్కసాక్షాత్కారము ఉదయించును.

ఆత్మరూపుడైన ఈశ్వరుని సాక్షాత్కారము అయినప్పుడు మాత్రమే (అయిన వెంటనే) చైతన్యమునకు మిథ్యాభూతమగు జడముతో ఏర్పడిన ఈ జీవుని అహంకారమనే ముడి విడిపోయి, సందేహముల న్నియు పటాపంచలగును. అట్టి జ్ఞానియొక్క కర్మలన్నియు (ప్రారబ్ధకర్మను మినహాయించి) నశించును.

ఇందువలననే, వివేకవంతులు వసుదేవపుత్రుడై అవతరించిన శ్రీకృష్ణభగవానునియందు మనస్సునకు ప్రసన్నతను కలిగించే భక్తిని మహా నందముతో చేయుచున్నారు.

సత్త్వము, రజస్సు మరియు తమస్సు అనునవి ఈశ్వరుని మాయాశక్తియొక్క గుణములు. ప్రకృతికి అతీతుడు, అద్వితీయుడు మరియు పూర్ణుడు అగు పరమేశ్వరుడు ఈ గుణములతో కూడి క్రమముగా ఈ జగత్తుయొక్క సృష్టిస్థితిలయములను చేయుట కొరకై బ్రహ్మవిష్ణురు ద్రులనే నామములను స్వీకరించును. వారిలో సత్త్వస్వరూపుడగు విష్ణువు వలన మానవులకు శ్రేయస్సు కలుగును.

పృథివీవికారము, అనగా ప్రవృత్తి (రజోగుణలక్షణము) గాని, ప్రకా శము (సత్త్వగుణ లక్షణము) గాని లేని కట్టెనుండి పొగ (ప్రవృత్తి గలది), దానినుండి వేదోక్తకర్మలకు మూలమగు అగ్ని (ప్రకాశము) ఆవిర్భవించు చున్నవి. అదే విధముగా తమోగుణముకంటె రజోగుణము, దానికంటే సత్త్వగుణము శ్రేష్ఠమైనవి. ఏలయనగా, సత్త్వగుణము పరబ్రహ్మను ప్రకా శింప జేయును.

ఇందువలననే, పూర్వము మహర్షులు విశుద్ధసత్త్వస్వరూపుడగు శ్రీమహావిష్ణువును సేవించిరి. ఎవరైతే వారిని అనుసరించెదరో, వారు కూడ ఈ సంసారములో కల్యాణభోజనులగుదురు.

ఇందువలననే, మోక్షమును కోరు సాధకులు ఇతరదేవతారూపము లయందు దోషములను వెదికేవారు కాకపోయిననూ, భయంకరాకారులగు భైరవాది భూతనాథులను ప్రక్కనబెట్టి, శ్రీమన్నారాయణుని మరియు ప్రస న్నమగు రూపముగల ఆయన అంశలను సేవించుచున్నారు.

రజోగుణ తమోగుణప్రధానమగు స్వభావము గల వ్యక్తులు సంప ద, అధికారము, సంతానము అను వాటిని గోరి, తమ స్వభావముతో తుల దూగే పితరులు, భూతములు, ప్రజాపతులు మొదలగు వారిని ఆరాధించేదరు.

వేదములు వాసుదేవుని మాత్రమే పరమతాత్పర్యముగా బోధించు చున్నవి. యజ్ఞములు వాసుదేవుని ఉద్దేశించి మాత్రమే చేయబడుచున్నవి. యోగముల ఉద్దేశ్యము కూడ వాసుదేవుడే. కర్మలన్నియు వాసుదేవుని యందు పరిసమాప్తిని జెందును. జ్ఞానము వలన పొందబడేది వాసుదేవుడే. తపస్సు మరియు ధర్మము వాసుదేవుని కొరకు మాత్రమే అనుష్టించబడు చున్నవి. స్వర్గాదిఫలములన్నియు వాసుదేవునియందు మాత్రమే విలీనమ గుచున్నవి.

సర్వవ్యాపకుడగు ఆ పరమేశ్వరుడే తాను గుణములకు అతీతుడే అయిననూ, సృష్ట్యాదియందు కార్యకారణాత్మకము మరియు త్రిగుణాత్మ కము అగు తన మాయాశక్తిచే ఈ జగత్తును సృష్టించెను.

ఆ మాయాశక్తియొక్క విలాసములగు ఈ మూడు గుణముల యందు (కార్యములయందు) లోపల ప్రవేశించి ఆ పరమేశ్వరుడు చైతన్య శక్తిచే సర్వమును ఆవేశించి (సర్వమును ప్రకాశింపజేయుచూ), గుణములు కలవాడా యన్నట్లు అంతటా ప్రకాశించు చున్నాడు.

ఒకే అగ్ని తనను ప్రకటింపజేసే కట్టెలయందు ఉన్నదై అనేకమా యన్నట్లు కన్పట్టును. అదే విధముగా, సర్వప్రాణులలో ఆత్మరూపముగా నుండే పరమేశ్వరుడు అనేకమా యన్నట్లు కానవచ్చుచున్నాడు.

పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనే సూక్ష్మపంచ భూతములు, ఇంద్రియములు మరియు మనస్సు అను త్రిగుణాత్మకము లగు తత్త్వములతో ఈ పరమేశ్వరుడు ప్రాణులను సృష్టించి, వారియందు ప్రవేశించి, శబ్దరూపరసస్పర్శగంధములనే విషయములను భోగించు చున్నాడు.

లోకకర్తయగు ఈ పరమేశ్వరుడు దేవపశుపక్షిమనుష్యాదియోను లలో లీలగా అవతరించుటయందు ప్రీతి గలవాడై, సత్త్వగుణము ద్వారా నిశ్చయముగా లోకములను పాలించు చున్నాడు.

శ్రీమద్భాగవతములోని ప్రథమస్కంధమునందు రెండవ అధ్యాయము ముగిసినది.