శ్రీ మద్భాగవతము - ప్రధమ (1వ) స్కందము

1 -  ప్రథమోఽధ్యాయః

ఈ జగత్తులోని పదార్థములన్నింటియందు ఉనికి అనువృత్తమగు చున్నది. కాని, ఒక పదార్థమునందు మరియొకటి ఉండుట లేదు. కావున, ఈ జగత్తు సద్రూపమగు పరంబ్రహ్మనుండి పుట్టి, దానియందే స్థితిని పొంది, దానియందే విలీనమగునని స్పష్టమగుచున్నది. సర్వజ్ఞుడు మరియు స్వయంప్రకాశస్వరూపుడు అగు ఆ పరమేశ్వరుడు తన సంకల్పముచేతనే బ్రహ్మగారికి వేదమును ప్రకాశింప జేసినాడు. ఆ పరమేశ్వరుని విషయములో విద్వాంసులైననూ మోహమును పొందుచున్నారు. సత్వ రూపమగు పరంబ్రహ్మయందు అగ్ని, నీరు మరియు పృథివి ప్రకటమైనట్లు గనే, వాటి కార్యమగు (లేదా త్రిగుణాత్మకమగు) ఈ జగత్తు వాస్తవముగా లేకున్ననూ ప్రతీయమానమగుచున్నది. చైతన్యస్వరూపుడగు ఆ పరమేశ్వరునకు మాయాదోషములు అంటవు. అట్టి సదనమగు పరంబ్రహ్మను ధ్యానించుచున్నాము (అనగా ఆత్మరూపముగా దర్శించుచున్నాము).

వేదవ్యాసమహర్షిచే రచించబడిన ఈ శ్రీమద్భాగవతమునందు ఫలమునందలి తృష్ణ అనే దోషమును పూర్తిగా త్రోసిపుచ్చే సర్వోత్కృష్ణమగు ధర్మము బోధించబడినది. మాత్సర్యదోషములేని సత్పురుషులచే తెలియదగినది, పరమార్థసత్యము, శ్రేయస్కరమైనది, ఆధ్యాత్మిక-ఆధిదైవిక-ఆధిభౌతికములనే మూడు విధముల దుఃఖములను పోగొట్టునది అగు బ్రహ్మవస్తువును ఈ గ్రంథము ప్రతిపాదించు చున్నది. ఇతరములగు శాస్త్రములు మానవుల హృదయములో ఈశ్వరుని వెనువెంటనే స్థిరము చేయు టలో విఫలమగుచుండగా, ఈ గ్రంథమును శ్రవణము చేయు పుణ్యాత్ములకు ఈశ్వరుడు తత్క్షణమే హృదయములో స్థిరముగా నెలకొనును.

పరమానందమనే రసముతో నిండియున్న భాగవతము అనే పంట వేదము అనే కల్పవృక్షమునుండి శుకమహర్షియొక్క నోటిగుండా (చిలుక కొరికిన పండు చాల రుచిగా నుండునని ప్రసిద్ధి) భూలోకములో అవతరించినది (నేలపై పడినది). ఆశ్చర్యము! భక్తిభావముతో నిండిన హృదయము గల ఓ రసజ్ఞులారా! రసరూపమగు ఈ పండును మోక్షము లభించు వరకు మరల మరల ఆస్వాదించుడు.

లుప్తము కాని చైతన్యము స్వరూపముగా గల శ్రీమహావిష్ణువు యొక్క క్షేత్రమగు నైమిశారణ్యమునందు, స్వర్గలోకములో గానము చేయ బడువాడు మరియు భక్తులచే సదా ధ్యానించబడువాడు అగు శ్రీమహావి ష్ణువును పొందగోరి, శౌనకుడు మొదలుగా గల మహర్షులు వేయి సంవత్స రములు (దినములు) కొనసాగే సత్రయాగముననుష్ఠించిరి.

ఒకనాడు ఆ మునులు ఉదయమే హోమద్రవ్యములతో అగ్ని యందు హోమమును నిర్వర్తించి, తరువాత సూతమహర్షిని సత్కరించి ఆసనముపై కూర్చుండబెట్టి ఆయనను సాదరముగా ఇట్లు ప్రశ్నించిరి.

ఋషులు ఇట్లు పలికిరి: ఓయీ పుణ్యాత్మా! నీవు ఇతిహాసములను, పురాణములను, సకలధర్మశాస్త్రములను అధ్యయనము చేయుట మాత్రమే గాక, వ్యాఖ్యానమును కూడ చేసియుంటివి.

ఓ సూతా! ఓయీ సాధుపురుషా! వేదవేత్తలలో శ్రేష్ఠుడగు వ్యాసు నకు మరియు సగుణనిర్గుణబ్రహ్మతత్త్వములనెరింగిన ఋషులకు తెలిసిన విషయములన్నియు వేదవ్యాసమహర్షియొక్క అనుగ్రహము వలన నీకు యథాతథముగా తెలియును. గురువులు ప్రేమ కలిగిన శిష్యునకు రహస్య మగు విషయమును కూడ నిశ్చయముగా చెప్పెదరు కదా!

ఓ ఆయుష్మంతుడా! ఆయా ధర్మశాస్త్రములు మొదలగు వాటి యందు ఏది మానవులకు యథార్థముగా ఖచ్చితమైన శ్రేయస్సును కలిగించే ఉపాయమని నీవు నిశ్చయించినావో, దానిని మాకు దయచేసి బోధించుము.

ఏలయనగా, ఈ కలియుగములో ఇంచుమించుగా మానవులందరు సోమరులై అల్పమగు ఆయుర్దాయము, మిక్కిలి మందమగు బుద్ధి మరియు అల్పమగు భాగ్యము గలవారై రోగములు మొదలగు వాటిచే పీడింపబడు చుందురు.

ఓయీ సాధుపురుషా ! శాస్త్రములు విస్తృతమగు కర్మలను బోధిం చుచున్నవి. శాస్త్రములు ఒక భాగమును వినుటకైననూ పెద్దవియే. కావు న, వాటి సారమును నీవు నీ బుద్దిని ఉపయోగించి పైకి తీసి మాకు చెప్పుము. దాని వలన మా అంతఃకరణము మిక్కిలి ప్రసన్నమగును.

ఓ సూతా! నీకు మంగళమగు గాక! భక్తరక్షకుడగు పరమేశ్వరుడు ఏ కార్యమును చేయగోరి దేవకీ వసుదేవుల పుత్రుడై జన్మించినాడో నీకు తెలియును.

ఓ సూతమహర్షీ! ఆ విషయమును మేము వినగోరుచున్నాము. దయచేసి మాకు వర్ణించి చెప్పుము. పరమేశ్వరుని అవతారము ప్రాణుల క్షేమసమృద్ధుల కొరకై ప్రవర్తిల్లును గదా!

భయంకరమగు సంసారములో నిస్సహాయుడై యున్న జీవుడు ఆ పరమేశ్వరుని నామమును ఉచ్చరించినచో, వెనువెంటనే దానినుండి విముక్తుడగును. భయము కూడ పరమేశ్వరునకు భయపడును.

ఓ సూతమహర్షీ! పరమేశ్వరుని పాదములను ఆశ్రయించి ప్రకృష్ణ మగు శమము (మనోనిగ్రహము) ను సాధన చేసే మహర్షుల సన్నిధిలో వారి స్పర్శ మాత్రముచే మానవుడు వెనువెంటనే పవిత్రుడగును. కాని, గంగాజలము కొంతకాలము సేవించిన తరువాత మాత్రమే పవిత్రము చేయును.

అంతఃకరణశుద్దిని కోరు ఏ మానవుడు పవిత్రమగు కీర్తి గల జను లచే కొనియాడబడే లీలలు గల ఆ భగవానునియొక్క కలిదోషమును పోగొట్టే కీర్తిని వినకుండును?

ఆ పరమేశ్వరుడు లీలగా అవతారములను ధరించి గొప్ప కార్యములను నిర్వర్తించుచుండును. ఆ కార్యములను విద్వాంసులు సర్వకాలములలో కీర్తించుచుందురు. శ్రద్ధాళువులమగు మాకు వాటిని గురించి చెప్పుము.

ఓ బుద్ధిశాలీ! సర్వేశ్వరుడగు శ్రీమహావిష్ణువు తన మాయాశక్తిచే యథేచ్ఛగా లీలలను ప్రకటించుచుండును. ఇపుడు శుభకరములగు ఆయన అవతారముల గాథలను చెప్పుము.

పుణ్యకీర్తియగు పరమేశ్వరుని విక్రమము విషయములో మాకు తృప్తి లేదు. ఏలయనగా, దానిని గురించి వినే రసజ్ఞులకు ప్రతి పదములో మధురపదార్థములకంటే కూడ అధికమగు మాధుర్యము లభించును.

శ్రీవిష్ణుభగవానుడు మాయామానుషరూపమును దాల్చి రహస్యముగా నున్నవాడై బలరామునితో గూడి మానవులకు సాధ్యము కాని పరా క్రమములను ప్రకటించినాడు గదా!

కలి వచ్చి పడినదని తెలుసుకొని మేము ఈ వైష్ణవపుణ్య క్షేత్ర ములో దీర్ఘకాలము స్తాగే సత్రయాగమును సంకల్పించి కూర్చుండినాము. మాకు శ్రీమహావిష్ణువుయొక్క కథలను వినే అవకాశము లభించినది.

మానవుల అంతఃకరణముయొక్క పవిత్రతను మరియు శక్తిని హరించి వేసే కలిని తరించుట కష్టసాధ్యము. దానిని నిశ్చయముగా తరిం చగోరే మాకు పరమేశ్వరుడు సముద్రమును తరించగోరువారికి నావికుని వలె నిన్ను చూపించినాడు.

యోగములన్నింటికి ప్రభువు, బ్రహ్మవేత్తలయందు ప్రీతి గలవాడు, ధర్మమును కవచమువలె రక్షించువాడు అగు శ్రీకృష్ణుడు స్వస్వరూపమును పొందినాడు. అనగా, అవతారము ఉపసంహరించ బడినది. ఇప్పుడు ధర్మము ఎవనిని శరణు పొంది యున్నది? ఈ విషయమును చెప్పుము.

శ్రీమద్బాగవత పుహాపురాణమునందు ప్రథమస్కంధములో మొదటిఅధ్యాయము ముగిసినది.