మైత్రేయుడు ఇట్లు అనియె:
సర్గ, వంశ, మన్వంతర, వంశాను చరితములను విస్తరముగ వివరించితివి. కల్పాంత మందు జరుగు ప్రాకృత ప్రళయము నందలి ఉప సంహారమును గురించి వినగోరెదనుఅన శ్రీపరాశర మహర్షి ఇట్లనియె: మానవుల మాసము పితరుల కొకరోజు. మానవుల సంవత్సరము దేవతలకు ఒక దినము. రెండువేల చతుర్యుగములు (మహాయుగములు) బ్రహ్మకు ఒక రోజు. కృత త్రేతా ద్వాపర కలియుగములు చతుర్యుగము. పండ్రెండు వేల దివ్య వర్షములు దేవతలకొక్క మహాయుగము. ఈ నాల్గు యుగములలో మొదటి కృతయుగము చివరి కలియుగము తప్ప మిగిలిన అన్ని యుగములు ఒకే స్వరూపము గలవి. బ్రహ్మమొదటి కృతయుగము నందు సృష్టి కావించును. చివరి కలియుగమందు ఉపసంహరించును. అన మైత్రేయుడు నాల్గుపాదముల ధర్మము నశించు కలి స్వరూపమును అనతి ఇమ్మన శ్రీ పరాశరుడు ఇట్లు అనియె: ఋగ్యజుస్సామ వేదోక్త ధర్మ ప్రవృత్తికి హేతువైన కలియుగమందు వర్ణాశ్రమ ఆచారములు సాగవు. వివాహములు ధర్మ సిద్ధములు కావు. గురు శిష్య వ్యవస్థ ఉండదు. దాంపత్యక్రమముండదు. అగ్ని హోత్రములు దేవతోపాసన క్రమమునుండదు.
కలిలో ఏకులమువాడైన బలవంతుడే, సర్వేశ్వరుడే. అన్ని వర్ణములలో కన్యను పెండ్లాడుటకు వాడే యోగ్యుడు. ఏదో తనంతతాను మంచిదనుకొన్న పనిచేసిన వాడు దీక్షితుడు. తన బుద్ధిని అనుసరించి చేసినపని ప్రాయశ్చిత్తము. ఎవడేమి చెప్పిన అదియే శాస్త్రము. సర్వము దేవతయే. అందరికిని అంతయు ఆశ్రమమే. ఆయాసపడుట, ఉపవాసము, డబ్బిచ్చుట, తపస్సు. అభిరుచిని బట్టి చేసిన అనుష్ఠానములే ధర్మము. అత్యల్ప ధనవంతుడు కలిలో ధనవంతుడై పొగరెక్కును. స్త్రీలకు కేశ మాత్రముచేతనే సౌందర్యము. సువర్ణమణి రత్న వస్త్రాది సంపత్తి లోపించి, కేవలము జుట్టునే వివిధములుగా దిద్దుకొని అదే అందమని స్త్రీలు మురియుదురు. డబ్బులేని మగనికి స్త్రీలు విడాకులిత్తురు. స్త్రీలకు విత్తవంతుడే భర్త అగును.
డబ్బు సమృద్ధిగా ఇచ్చువాడు ప్రభువు. అంతియకాని ఉత్తమ వంశ జన్మము ప్రభుత్వ హేతువుకాదు. ఇట్లు కట్టుకొన్నవాడు ధనవంతుడుగా లెక్కింపబడును. ధన వంతుడు తెలివైన వారిలో లెక్క, ధనములకు పరమావధి తనకుతాను కుడుచుట. స్త్రీలు చిలిపి చిలిపి కోరికలకు పై మెఱుగులకు వశమై వ్యభిచారిణులు అగుదురు. పురుషులు అన్యాయ ఆర్జితవిత్తములకు ఉబలాట పడుదురు. ఎంత ప్రార్థించి, ప్రాకులాడినను స్నేహితుడు స్వార్థమునే చూచికొనును. పరుల ధనములకై చిల్లిగవ్వ కొఱకైన వేడుక పడుదురు. బ్రాహ్మణులయెడ సర్వమానవసమాన భావమేకాని విశిష్ట గౌరవము ఉండదు. ఆవులయందు పాలిచ్చుటకు సంబంధించిన గౌరవమేకాని మఱిమించి ఉండదు. ప్రజలు అనావృష్టికి జడిసిపోవుదురు. ఆకలికి కుములుదురు. ఆకసము వంకచూచెదరు. తాపసు లట్లు కందమూల ఫలములను తిందురు. వర్షములు కురియక దుఃఖించి, తమకు తాము చత్తురు. దుర్భిక్షము, క్లేశములు కుడుతురు, సుఖసంతోషములు దెబ్బతినును. స్నానము, అగ్ని, దేవతా, అతిథి పూజనము లేని భోజనము చేయుదురు. జనులు దురాశాపరులు, హ్రస్వ దేహులు, మఱు గుజ్జులు. ఎవడెవడు దుర్బులుడో వాడు వాడు కలిలో సేవకుడు. తిండిపోతులు, బహుసంతానము అల్పభాగ్యములు గలవారు అగుదురు. స్త్రీలు రెండు చేతులతో తల బరికికొనుచు, పెద్దలై భర్తల ఆజ్ఞలందు అనాదరలై ధిక్కరింతురు. బెదిరింతురు. తమబ్రతుకు తాము చూచుకొనుచు, నీచులై దేహసంస్కారశూన్యలై అనృతములు, పరుషములు పలుకుచుందురు. శీలముచెడి ఎప్పుడుదుశ్శీలురను వలతురు. కులవతులు కూడ పురుషులయెడ అసత్ప్రవర్తనము చేయుదురు.
బ్రహ్మచర్యవ్రత రహితముగ వటువులు వేదములను చదువుదురు. గృహస్థులు అగ్నిహోత్రములు చేయరు. తప్పనిసరిగ చేయవలసిన దానములు కూడ చేయరు. గ్రామ్యాహార పరిగ్రహములుచేసి పాడుతిండి తినుచు, పాడుదానములు పట్టుచు, గృహస్థులు వానప్రస్థులు అగుదురు. సన్యాసులు హితుడని, అహితుడని భావవికారములకు లోనై పోవుదురు. రాజులు రక్షకులుకారు. పన్నుల నెపమున సర్వభక్షకులు దొంగలు అగుదురు. ప్రజల ధనము దొంగిలింతురు. గుఱ్ఱాలు, ఏనుగులు, రథాలు గలవాడే రాజగును. వైశ్యులు కృషి వాణిజ్యము మొదలైన స్వధర్మములు విడిచి, వడ్రంగము మొదలయినవి చేసి, శూద్రుల వృత్తిచే బ్రతుకుదురు. అధములు, శూద్రులు సన్యాస చిహ్నములు కాషాయములుదాల్చి భిక్షావ్రతము చేయుదురు. గౌరవ సత్కారములు వడయుచు పాషండ వృత్తిని ఆశ్రయింతురు. దుర్భిక్షము పన్నులు మొదలయిన పీడలచే ఉపద్రవములకు గురియై జనులు దుఃఖితులై గోధుమలు యవధాన్యముపండు దేశములకు వలస పోవుదురు. వేదమార్గ మడుగంటి జనము పాషండమయముగా అధర్మము పెరిగి లోకములు అల్పాయుష్కములు అగును. రాజదోషముచేతను నరులు శాస్త్రవిహితముగాని వివేకులు ఘోరతపస్సులు చేయుట చేతను బాలమరణములు కల్గును. అయిదు ఆఱు ఏడేండ్ల ఈడుగల ఆడుపిల్లలు పిల్లలను కందురు. పండ్రెండేండ్ల వారికి జుట్టు నెరయును. ఇరువదేండ్లు మించి ఎవ్వడు బ్రతుకడు. అల్పబుద్ధులు వ్యర్థమైన సన్యాసాది చిహ్న ధారులు దుష్టమతులు అగుటచే మానవులు అత్యల్ప కాలముననే కాలవశులు అగుదురు.
ఎప్పుడప్పుడు ధర్మహాని కనబడునో, అప్పుడప్పుడు కలి పెరుగుచున్నట్లు వివేకులు గమనింపవలయును. ఎప్పుడెప్పుడు పాషండులు పెరుగుదురో, అప్పుడప్పుడు కలిపెంపును మహాత్ములు గుర్తింపవలెను. సత్పురుషులకు వేదమార్గానుసారులకు హానికల్గినప్పుడెల్ల కలి పెరుగుదలను ఊహింపవలెను. ధర్మపరులు యువకులు చెడిపోవునపుడెల్ల కలి ప్రాధాన్యమును పండితులు ఊహింపవలెను ఎప్పుడెప్పుడు యజ్ఞేశ్వరుడైన పురుషోత్తముని ప్రాజ్ఞులు యజింపరో అప్పుడప్పుడు కలి విజృంభణము భావింపనగును. వేదవాదముల యెడ ప్రీతిలేక పాషండులయెడ అది కల్గునప్పుడు కలివృద్ధిని విచక్షణులు ఊహింపవలెను. కలిలో పాషండ నిహతులై జనులు విష్ణుని, సర్వస్రష్టను, సర్వజగత్పతిని, ఆరాధింపరు. వేదము లెందులకు? ద్విజులెందులకు? దేవత లెందులకు? నీట తెగకడుగు ఆచార మెందులకు అని పాషండ భావోపహతులై ప్రజలు వాగుదురు. కలిలో మేఘము అల్పముగ కురియును. పంట దిగుబడి స్వల్పము. ఆ పంట కూడ అల్పసారము. కలలో జనపనారతో చేసిన వస్త్రములు, శమీమాత్రము వృక్షములు. శూద్రప్రాయములు వర్ణములు అగును. ధాన్యములు అణుప్రాయములు. పాలు అజ్య ప్రాయములు. (వట్టిజిడ్డు మాత్రముగలవై రుచి చవి ఉండదు) వట్టివేళ్ళు మాత్రము గంధము లేక ఉండును.
అత్తగార్లు మామగార్లు మాత్రమే నరులకు గురువులు. బావమరదులు, భార్యలే మిత్రులు. తండ్రి ఎవనికి? తల్లి ఎవనికి? ఇదంతయు కర్మానుసారమగునది అని అత్తమామల వెంటబడిన నరులు తల్లిదండ్రులను విడుదురు. మాటిమాటికి వాఙ్మనః కాయములచే మఱిమఱి నరులు అల్పబుద్ధులై పాపములు చేయుదురు. సత్యములేదు. శౌచము లేదు. అట్టి నరులకు కలికాలములో సర్వము దుఃఖమునకు కారణమగును. స్వాధ్యాయ వషట్కారములు వినిపింపవు. స్వాహాస్వధాకారములు శూన్యములై కలిలో స్వల్ప యత్నముచే ఏర్పడు పుణ్యస్కంధము కృతయుగమున తపస్సుచేసి సంపాదించినంత గొప్పది అగును.
శ్రీ పరాశరుడు ఇట్లు చెప్పెను:
ఈ కలియుగ విశేష ప్రసంగములో మహాజ్ఞాని వ్యాసుడు పల్కిన పల్కులు వినుము. మునులు తొల్లి ఏ కాలమందును లేనట్లుగా అల్పధర్మమేని మహాఫలమిచ్చును. జీవులకు మహాసుఖము కల్గును అను కారణములచే మునులకు పుణ్యగోష్ఠి జరిగి, వారు వేదవ్యాసుని ప్రశ్నింపగా గంగాజలములలో ఉన్న ఆయనను సగము స్నానము చేసినవానిని అడిగిరి. స్నానము పూర్తియగుదాక తీరమందు చెట్ల క్రింద నిరీక్షించుచు కూర్చుండిరి. నా కుమారుడు వ్యాసుడు నీటమునిగి లేచి, శూద్రుడు సాధువు అనుమాట వారు వినుచుండ, ఆ మీద అతడు నీట మునుగక శూద్రా! బాగుబాగు ధన్యుడవైనావని నీటినుండి లేచి పలికెను. అవ్వల మరియొకసారి మునిగిలేచి అమ్మహాముని స్త్రీలు ధన్యలు బాగుబాగు వారికంటె మరి ధన్యతరులు ఎవ్వరున్నారనెను. ఆ మీద యధావిధి స్నానముచేసి, అనుష్ఠానము చేసికొన్న నా కొడుకును మునులు వందనములు చేసి ఆసనముపై కూర్చున్న తరువాత మీరెందులకు వచ్చినారని సాత్యవతేయుడు వారిని ప్రశ్నించెను. మాకు కల్గిన సందేహమును అడుగవచ్చితిమి. అది అట్లుండ నిమ్ము. మఱియొకటి అడిగెదము తెల్పుము, కలి బాగు, శూద్రుడు బాగు, స్త్రీ బాగుబాగు. వారు ధన్యులని మఱిమఱి పల్కినావు అదియెల్ల గుహ్యము కాదేని వివరముగ వినగోరెదము అది ఆనతిమ్ము. ఆమీద మా హృదయమందున్న మా రాక ప్రయోజనమునుఅడిగెదము. అన వ్యాసభగవానుడు నవ్వి “మునివరులారా! వినుడు. బాగు బాగు అని నేనన్నదాని అభిప్రాయ మిది:
త్రేతాయుగమందు పదేండ్లు చేసిన పుణ్యము కలిలో ఒక్కయేడు ఒనరించిన చాలును. ద్వాపరమందు ఒక్క నెలరోజులు చేసిన పుణ్యము కలిలో ఒక్క అహోరాత్రము ఆచరించిన చాలును. జపతపోబ్రహ్మచర్యాదుల ఫలమిట్లు ఫలించును. అందుచే కలి బాగు అంటిని. కృతయుగమున ధ్యానము చేసి త్రేతాయుగమున యజించి ద్వాపరమున అర్చించి ఏ ఫలము వడయునో అది కలియందు విష్ణువును సంకీర్తనంచేసి పడయును. ఈకలిలో పురుషుడు అల్ప శ్రమచేతనే ధర్మోత్కర్షను పొందును. అందుచేత నేను కలియుగ విషయమున సంతుష్టించెందెదను. బ్రాహ్మణులు వృథా కథలు, వృధా భోజనము, వృథా యజ్జా చరణముచేసి పతితులగుదురు. కావున వారు మంచి నియమములు నిష్ఠగలవారుగా ఉండవలయును.
ఆ అనుష్ఠానము అన్ని వస్తువులయందు సరిగా చేయనియెడల దోషము సంక్రమించును. తినదగినవి త్రాగదగినది ఈ కలిలో వీరికి స్వేచ్ఛానుసారము చేయబడును. అన్ని పనులయందు వారికి పరాధీనత తప్పదు. కావున అట్టివారు ఎన్నో క్లేశములు పడి ఉత్తమలోకములను గెలుతురు. బ్రాహ్మణసేవచేతనే, శూద్రుడు పాకయజ్ఞాధికారము వడసి, పుణ్యలోకములను సాధించును. కావున శూద్రుడు ధన్యుడన్నాను. స్వధర్మమునకు విరోధము కల్గకుండ మానవులు సంపాదించిన ధనమును సత్పాత్రములకు ఈయవలెను. యథావిధి యజింపవలెను. అట్టిధన సంపాదనము క్లేశము. దానిని రక్షించుకొనుటలో మహాక్లేశము. అట్లేదాని వినియోగములో గూడ ఇంకెంతో తెలియవచ్చును. అట్లు అనేక క్లేశములుపడి ప్రాజాపత్యాది నిజలోకములను మానవులు జయింతురు. పతిసేవ చేసి త్రికరణశుద్ధిగ భర్త హితముకోరి, అతిక్లేశపడి పురుషుడు సంపాదించు లోకములెల్ల సులభముగ అతనితో స్త్రీ పొందును. అందుచే స్త్రీ బాగుబాగు! అని మూడవ వచనము పల్కితిని. ఇందులకై వచ్చినారుకావున మీకిది తెల్పితిని. ఇంకేమి కోరెదరడుగుడు తెల్పెదను”.
అని వ్యాసుడవుగాన “ఋషులు ఇంకను అడుగవలసిన ప్రశ్నములకు ప్రత్యుత్తరము ఇందులోనే నీవు తెల్పితి”వనిరి. అంతట కృష్ణ ద్వైపాయనుడునవ్వి, ఆశ్చర్యముచే విప్పారిన అవయవములుగల వారినికని, “ఈమీ ప్రశ్న దివ్యదృష్టితో నేను గ్రహించితిని. అందు చేతనే ప్రసంగమాత్రమున బాగుబాగు అంటిని. కలిలో స్వర్గ మాత్ర ప్రయత్నము చేతనే ధర్మము సిద్ధించును. తమ సద్గుణములను జలములచే ఎల్ల పాపములను ప్రక్షాళనము చేసికొన్న మానవులకు ఇది కలిలోనే సాధ్యము. శూద్రులుగూడ ద్విజ శుశ్రూషాపరులై ఉండి, స్త్రీ పతి శుశ్రూషచేసి ధన్యులగుదురు. కావున నేనీముగ్గురును అత్యంత ధన్యులని తలంతును. కృతాదియగములందు ధర్మ సంపాదనమందు ద్విజాదులకు చాల శ్రమ ఉన్నది. మీరు అడుగకుండనే మీ అభిప్రాయము గ్రహించి నేనుఇది తెల్పితిని. మఱియేమి చేయు మందురు? అనిన వారు వ్యాసుని పూజించి కొనియాడిరి. వ్యాసవచనములందు నిశ్చయముగొని వచ్చిన దారిని మునులుచనిరి. నీకీ రహస్యమును తెల్పితిని. అత్యంత దుష్టుడైన కలికిగల గుణము ఇదొక్కటే. కృష్ణ కీర్తన మాత్రముననరుడు బంధ ముక్తుడై పరమందును. నీ వడిగిన జగమ్ముల ఉపసంహార వృత్తాంతమును అవాంతర ప్రాకృతిక ప్రళయమును గూర్చి ఈ పై నీకు తెల్పెదను.
శ్రీ పరాశరుడు ఇట్లు అనెను:
సర్వభూతముల యొక్కయు, ప్రళయము మూడు విధములు: 1. నైమిత్తికము, 2. ప్రాకృతము, 3. అత్యంతికము. బ్రహ్మ కల్పము చివర అగునది బ్రహ్మప్రళయము ఇది నైమిత్తికము. ద్విపరార్థక ప్రళయము ప్రాకృతము. అత్యంతి కము మోక్షము. మైత్రేయుడుఅనియె “పరార్థమనుదాని సంఖ్యావత్సరములు తెలుపుము. దానికి రెట్టింపు కాలమే ప్రాకృత ప్రళయము” అన పరాశరుడు ఇట్లు అనియె: ఒక స్థానము నుండి ఇంకొక స్థానము పదిరెట్లు. అట్లు లెక్కించుకొనుచు పోగా పదు నెనిమిదవ స్థానము పరార్థమనబడును. అప్పుడు ప్రాకృత లయమగును. అప్పుడు వ్యక్తమైన ప్రపంచ మెల్ల అవ్యక్తమునందు లయించును మాత్రామాత్ర ప్రమాణము నిమేషము. 15 నిమేషములు, 1 కాష్ఠ - ముప్పది కాష్ఠలు కల. 15 కలలు నాడిక. 2 నాడికలు 1 ముహూర్తము. 30 ముహూర్తములు 1 పగలు 1 రాత్రి దినము. 30 దినములు 1 మాసము, 12 మాసములు సంవత్సరము. 1 మానవ సంవత్సరము దేవతలకు 1 దినము. 360 మానవ సంవత్సరములు దేవతలకొక సంవత్సరము. 12,000 దేవ సంవత్సరములు, ఒక్క చతుర్యుగము. వేయి మహాయుగములు బ్రహ్మకు ఒక పగలు. అదే కల్పము. అందు మనువులు పదునాల్గురు. ఆ చతుర్దశ మన్వంతరముల చివరఅగు లయము నైమిత్తిక ప్రళయము. అదే బ్రహ్మ ప్రళయము. ఆ లయము యొక్క స్వరూపము మహాభయంకరము. వినుము. ఆ మీద ప్రాకృత ప్రళయమును తెలిపెదను.
వేయి చతుర్యుగ సహస్రము, బ్రహ్మ కల్పమునందు, భూ మండలము క్షీణ ప్రాయమగును. నూరేండ్లు భయంకరమయిన అనావృష్టి ఏర్పడును. అల్పమైన సత్తువగల పార్ధిన ప్రాణులన్నియు నశించును. అప్పుడా భగవంతుడు విష్ణువు రుద్ర రూపముదాల్చి తన యందలి సకలప్రజలను క్షయింపచేయ చూచును. సూర్య కిరణములు ఏడింటను తానుండి సర్వజలములను ద్రావి వైచును భూమియందు ప్రాణులందును గల జలమునట్లు త్రావి సర్వమును శోషింపచేయును. సముద్రాదులందున్న పాతాళమందున్న నీరంతయు ఇంకి పోవును. ఆ విష్ణువుయొక్క చేష్టచేతనే ఉదకమును అపహరించుకొన్న ఆ ఏడు కిరణములే ఏడుగురు సూర్యులగును. వారు క్రిందునకు మీదికిని కూడ వెలుగుచు పాతాళముతో కూడ ముల్లోకములను దహింతురు. అందువలన ముల్లోకములు నదులతో, సముద్రములతో, పర్వతములతో శోషించిపోవును. ఇది తాబేటి వెనుడిప్పవలె ఘనీభావ మందును. అప్పుడే ప్రళయకాలాగ్ని రుద్రుడు సర్వహరుడై శేషసర్పముయొక్క నిశ్శ్వాసము నుండి పుట్టి క్రింది పాతాళములను కాల్చును. భూమికివచ్చి ఇదెల్లను దహించును. ఆ పైని భువర్లోకమును అంతరిక్షమును సువర్లోకము - ఆదిత్యమండల స్థానమును, జ్వాలా మాలలచే అక్కడనే క్రమ్ముకొని ఉండును. ముల్లోకమునులు అయ్యెడ స్థావర జంగమాత్మక మెల్ల జ్వాలలు క్రమ్ముకొని కాలుచున్న అంబరీషమట్లు ఉండును.
త్రిలోకవాసులు ఉడికిపోయి, మహర్లోకమునకు పోవుదురు. మరొక దశలో రుద్ర మూర్తియై విష్ణువు ఇట్లు సర్వజగమ్మును దహించి, తన ముఖ నిశ్వాసములచే ఘోరములైన సంవర్తకములు అను మేఘములను సృజించును. పెద్ద ఏనుగుల వంటివి, ఉఱుములు, మెఱుపులతో కూడినవియుఅగు ప్రళయకాల మేఘములు కొన్ని నల్లకలువ రంగుకలవి కొన్ని తెల్లకలువలు అట్టివి కొన్ని ధూమ్రవర్ణములు, కొన్ని పచ్చనివి కొన్ని గాడిద రంగువి లక్కరంగువి వైడూర్య వర్ణములు ఇంద్ర నీలముల వంటివి. శంఖములు మొల్ల పూవుల వంటివి, ఆర్ద్ర పురుగుల వంటివి, నెమళ్ల వంటివి, మణిశిల వంటివి, కాటుక వంటివి అరిదళము వంటివి, పాలపిట్ట ఱెక్కల వంటివి. పెద్ద నగరములు పెద్ద పర్వతముల వంటివి, కూటాగారముల వంటివి, స్థలములట్టివియై హాహా కారములచే ఆకసమును నింపి అతిభయంకరమైన అగ్ని వర్షించుచు, త్రిజగత్తు లందలి కాలాగ్నిని ఎల్లను ఆర్పి వేయును, నిర్విరామముగ వర్షించుచు, ఉదకములచే లోకత్రయమును ముంచెత్తును. స్థూల ధారలచే భూమినెల్లకాక భువర్లోకమును కూడముంచెత్తును. లోకము అంధకార బంధురమై చరాచర భూతకోటి నశింప, నూరు సంవత్సరములు అట్లే అవి వర్షించును. కల్పాంతమున నిత్యుడు, మహాత్ముడగు వాసుదేవ పరమాత్ముని యొక్క మహిమచే ఇట్లు జరుగును.
శ్రీ పరాశరుడనియె:
ఓ మహామునీ! సప్తర్షిమండలము నాక్రమించి జలము ఉన్న తరి, ఈముల్లోకము ఒకే సముద్రమగును. అంతట విష్ణుముఖనిశ్శ్వాసమునుండి పుట్టిన వాయువు ఆ మేఘములను చెల్లాచెదరుచేయుచు నూరు సంవత్సరములొకేరీతి వీచును. సర్వభూత మయుడు ఊహకందనివాడు విశ్వమునకు అదియు, ఆది లేనివాడు అగు భగవంతుడు వాయువుఅదియెల్ల త్రావి, బ్రహ్మరూపధారుడై శేషతల్పమందు నిదురించును. అప్పుడు జనలోకమునందు బ్రహ్మలోకమునందుఉండు సనకాది సిద్ధులు అదేవుని ధ్యానించుచు ముక్తికోరుచు స్తుతించుచుందురు. తన దివ్య మాయా స్వరూపిణిఅగు యోగనిద్ర యందుండి అమ్మధుసూదనుడు వాసుదేవాఖ్య పరబ్రహ్మమగు తన్నుదాను ధ్యానించు చుండును. ఇది నైమిత్తిక మనెడి ప్రళయము. బ్రహ్మస్వరూపుడగు హరి అయ్యెడ నిదురించుటయే నిమిత్తము - కారణము - కావున దీనికీపేరు వచ్చినది. ఆ సర్వాత్మకుడు మేలు కొన్నపుడు జగత్తు చేష్టించును. క్రియాసమర్థమగును. అచ్యుతుడు మాయాశయ్యపై ఉన్నపుడు ఈ నిఖిలజగత్తు కనుమూయును. వేయిచతుర్యుగములు పద్మగర్భునకు ఒక పగలు. లోకము ఏకార్ణవమయినపుడు అదే పరిమాణమున బ్రహ్మకు రాత్రి అగును. ఆ రాత్రితుద అతడు మేల్కొని తిరిగి సృష్టిని ఆరంభించును. అప్పుడు విష్ణువే బ్రహ్మ స్వరూపుడగును. లోగడ నీకిట్లు తెల్పి ఉన్నాను. ఇదే కల్పసంహారము అవాంతర ప్రళయము, నైమిత్తిక ప్రళయము అనబడును. ఇక ప్రాకృతిక ప్రళయము ఎట్టిదో వినుడు.
అనావృష్టి మొదలైన హేతువులచే సర్వలోకములందు పాతాళములందు క్షాళనము చేయబడగా మహదాది వికారము నుండి విశేషము వరకుగల సర్వవికృతి క్షయింపగా, కృష్ణుని ఇచ్చ వలన చేయబడు ప్రతిసంచరమునందు తొలుత ఉదకములు భూమి యొక్క గంధ గుణమును గ్రహించును. అంతట భూమి ప్రళయమునందు అనువగును. గంధ గుణము పోగా అది కేవలము జలమయమగును. అప్పుడు జలములు విశేషముగ పెరిగి పెద్దవేగము పెద్దధ్వనియుకలవై ఈ విశ్వమునంతను నిండును. అవి ఒక్కొక్క తరి నిలుపొందును. ఒకతరి చలించును. కెరటములు వేయని సలిలముచే లోకాంతముదాక ఎల్లెడ వ్యాప్తమగును. తేజస్తన్మాత్ర ఆ జలముల యొక్క గుణమును రసమును త్రాగివైచును. రసము క్షయించినంతట ఆయ్యుదకములు క్షయించును. రసగుణము పోయిన నీరు తేజోరూపమును పొందును. నీరగ్ని భూతావస్థయందు ఉండగా సర్వము తేజస్సుచే ఆవరింపబడగా ఆయగ్నిఅంతట వ్యాపించి ఆనీటిని స్వీకరించును. అప్పుడు ఈజగమెల్ల అగ్ని జ్వాలలచే నింపబడును. ఇట్లుది క్రిందను మీదను అడ్డముగను జ్వాలలచే నిండి నంతట, జ్యోతిస్సుయొక్క పరమ రూపమైన ప్రభాకరుని వాయువు మ్రింగును. సర్వాత్మక మయిన ఆ వాయుమహాభూతము గూడ రూపతన్మాత్రయందు విలీనమైనంతట అగ్ని భూతము ప్రణష్టమగును. జ్యోతిస్సు అట్లు ప్రశమింప మహావాయువు విస్తారముగ విసరి నంతట తేజోభూతము కేవల వాయుభూతావస్థ యందు ఉన్నతరి లోకము అంధకార బంధురమగును. అంతట ఆవాయువు తన నడక తుములమై, క్రిందను మీదను అడ్డము గనుపడి, దెసల విపరీతముగ వీచును. అంతట వాయుభూతముయొక్క స్పర్శ గుణమును ఆకాశముగ్రసించును. అపుడు వాయువుశమించును. ఆకాశ మహాభూతము నిరా వరణముగా ఉండును. రూప రస స్పర్శ గంధ గుణరహితమై రూపము కూడ లేక ఆ ఆకాశ మహాభూతము మిక్కిలి పెద్దదై ఉండును, పరిమండలము రంధ్రమాతమునైన ఆకాశము కేవలము శబ్దమే గుణముగా గలదై ఉండును. అట్టి ఆకాశమయ్యెడ సర్వమును ఆవరించి ఉండును. ఆకాశము యొక్క ఆ శబ్ద గుణమును భూతాది అహంకార తత్త్వము మ్రింగును. అంతఃకరణము భూతములు ఇంద్రియములు ఒక్కసారి భూతాదియందున్న తరి ఈ భూతాది అహం మమాభిమానాత్మకమై తామసమని చెప్పబడును. తమోగుణ ప్రాయమయిన అహంకారముఇది. ఆ భూతాదిని బుద్ధిఅను పేర చెప్పబడు మహత్తు గ్రసించును. ఈమహత్తు అనుభూమి జగత్తునకు లోపల, వెలుపల, దగ్గర, దాపునను కూడ ఉండును. ఈ మీదచెప్పిన క్రమముగ బుద్ధియొక్క సప్త మూలతత్త్వములు ప్రకృతులు అని చెప్పబడినవి. సృష్టి వికారమునకుఇవి మూలపదార్థములు. సృష్టి యొక్క ప్రవృత్తియందు. ఇవి విడివిడిగ నివృత్తియందుఒకదానియందొకటి ప్రవేశించును. ప్రవృత్తి అనగా ప్రయాణము, నివృతి యనగా ప్రతిప్రయాణము అని ఆగమికుల రహస్య సంకేతము. అనులోమము విలోమమునను మాటలచేకూడ ఈ సృష్టి ప్రతిసృష్టులు వ్యవహరింపబడును.
ఏ ఉదకములచే ఈ అండాకారమయిన జగత్తు ఆవరింపబడి ఉన్నదో, సప్తద్వీప సప్తసముద్ర, సప్తలోకాత్మకము అయినదిఎల్ల ఉదకములందు లీనమగును. ఆ ఉదకమును తేజస్సు త్రావును. ఆ తేజస్సు వాయువునందు లయమొందును. వాయువు ఆకాశము నందులయించును. ఆకాశమును భూతాది మ్రింగును. దానిని మహత్తు మ్రింగును. ఈ చెప్పిన వానితో కూడియున్న ఆ మహత్తును ప్రకృతియు గ్రసించును. సత్త్వరజ స్తమోగుణ సామ్యావస్థ పెరుగక, తఱుగక, ఉండునది హేతువు. ప్రధానకారణము అయినదిఇది ప్రకృతి అనబడును. ఇది ఎల్లవ్యక్తావ్యక్త స్వరూపిణి. వ్యక్తిస్వరూపము అవ్యక్తమందు లీనమగును. ఆ అవ్యక్తశబ్దమున చెప్పబడువాడు ఏకైకమూర్తి, శుద్ధుడు, అక్షరుడు, నిత్యుడు, సర్వవ్యాపి. పురుషుడు అని పిలువబడును. ఆయన కూడ సర్వమైఉన్న పరమాత్మకు అంశము సర్వేశ్వరమయిన వస్తువునందు సత్తామాత్ర స్వరూపము జ్ఞేయము (ఎఱుగ బడునది) జ్ఞానము (ఎఱుకయు) నైన ఏ పరవస్తువునందు నామ, రూప, జాత్యాదికల్పన లేదో అది బ్రహ్మము పరమ ధామము పరమాత్మ ఈశ్వరుడు విష్ణువే ఈసర్వము. అందుండి యతి ఆవృతిని అందడు. వ్యక్తావ్యక్త స్వరూపిణి అని నేను చెప్పిన ప్రకృతియు పురుషుడును, అను ఈ ఇద్దరును పరమాత్మయందు లయమందుదురు. పరమాత్మ సర్వులకు ఆధారుడు. పరమేశ్వరుడు విష్ణువు అనుపేర వేదములందు వేదాంతములందును కీర్తింపబడును.
వేదము చెప్పిన కర్మ ప్రవృత్తము, నివృత్తముఅని రెండు విధములు. ఆ రెండిటిచేతను అసర్వమూర్తిని పురుషులారాధింతురు. ఋగ్యజుస్సామ మార్గములు ప్రవృత్తములు. వీనిచే యజ్ఞేశ్వరుడు, యజ్ఞపురుషుడు, పురుషోత్తముడు యజింపబడును. జ్ఞానస్వరూపుడు, జ్ఞానమే తానైనవాడుఅగు విష్ణువును, యోగులు జ్ఞానయోగముచే నివృత్త కర్మమార్గమున సేవింతురు. ఆ విష్ణువు ముక్తి ఫలప్రదాత.
హ్రస్వ దీర్ఘ ప్లుతములను స్వరములచే ఏకొంచెము వస్తువు వచింపబడునో, ఏ వస్తువు వాక్కులకు (వేదములకు) గోచరము కాదో, అదంతయు అవ్యయుడైన విష్ణువు. వ్యక్తుడాతడే. అవ్యక్తమును అతడే. అతడే పురుషోత్తముడు. పరమాత్మ విశ్వాత్మ విశ్వ రూపధారి హరియే వ్యక్తావ్యక్త స్వరూపిణియగు ప్రకృతి, పురుషుడు ఆ విష్ణువునందు లీనమగును. సర్వవ్యాపి అవ్యాహతము అయిన ఆత్మయందు ద్విపరార్థమయిన నీకు నేచెప్పిన కాలము అవ్విష్ణువునకు పగలు. ఈ వ్యక్తము (దృశ్యప్రపంచము) ప్రకృతియందు పురుషునందు లీనమైనప్పుడు, అ ద్విపరార్థ దివాకాల ప్రమాణమై రాత్రి అగును. ఆ విష్ణువునకు పగలురేయి అనునవి లేవు. ఆ పరమాత్మయందు ఈ కాలపరిగణనము కేవలము ఔపచారికము. ఇట్లే మైత్రేయా! ప్రాకృతలయ వృత్తాంతము నీకు తెలుపబడినది అత్యంతిక ప్రతిసంచరమును గూర్చి ఇక తెలిసికొనుము.
శ్రీ పరాశరుడనియె:
ఆధ్యాత్మికము, ఆధిదైవికము, ఆదిభౌతికము అని తాపము మూడు రకములు. ఈ మూడింటి స్వరూపమునుతెలిసి జ్ఞాన వైరాగ్యములను పొందినవాడు ఆత్యంతిక లయమును ముక్తిని) పొందును. ఆధ్యాత్మిక తాపము శారీరకము మానసము అని. రెండు విధములు. శారీరకతాపము పలురకములు వినుము. శిరోరోగము ప్రతిశ్యాయము, పడిసెము, జ్వరము, శూలభగందరము (గుహ్యమందలి పుండు), గుల్మ (పైత్యముచే కడుపులో పుట్టు పుండు), ఆర్శ (మూలశంక), శ్వయథువు (వాపు), శ్వాస (ఒగరుపు), ఛర్ది (వాంతి) మొదలగు పెక్కు విధములు. కంటి రోగాలు, అతిసారము, కుష్ఠము, అంగామయము (ఒడలు నొప్పులు మొదలయినవి), మానసతాపము కామాదుల వలన పుట్టుబాధ, శోక, అసూయ, అవమాన, ఈర్ష్యా, మాత్సర్యాదిమయము. మృగపక్షిమనుష్య పిశాచోరగ రాక్షస సరీసృపాదులగు భూతములచే కల్గు బాధ ఆధిభౌతికము. శీతవాతాతపోష్ణ, వర్షాంబు, వైద్యుతాదులచే కల్గుతాపము ఆధి దైవికము. గర్భ జన్మ జరా జ్ఞాన మృత్యు నారక జన్య మయిన దుఃఖము వేలకొలది రకములుగ ఉండును. జీవుడు మిక్కిలి సున్నితమయిన శరీరముగల్గి మలపూరితమయిన కడుపులో మావిచే గ్రమ్ముకొని పృష్టము మెడయెముకలు కుంచించుకొనిపోవ మిక్కిలి పులుపు కారము ఉప్పు తీక్ష్ణమయిన వేడియుగల తల్లి తిన్న ఆహారములత్యంత తాపకరములైనవానిచే పెరుగుచు, వేదనతో అవయవములు చాచు కొనుట, ముడుచుకొనుట మొదలగునవి చేసికొనలేక మూత్ర పురీషమయమగు పెను రొంపిలో పడుకొని అన్ని విధముల పీడనను అందుచు, ఊపిరాడక, చైతన్యముకలిగి, అనేక పూర్వజన్మములను స్మరించుచు, తాను చేసిన ప్రారబ్ధమునకు కట్టుపడి గర్భమందు దుఃఖము కుడుచుచుండును.
పుట్టునపుడు మూత్ర పురీష రక్త శుక్లములు మొగము గ్రమ్ముకొన ప్రాజాపత్య వాయువుచే పీడితములైన అస్థిసంధిబంధములు కలవాడై, ప్రబలమైన ప్రసూతి వాయువులచే అధోముఖుడుగా చేయబడి అతికష్టముమీద తల్లి జఠరము వెలువడి నేలపై పదును. పడునపుడు, మహామూర్ఛనంది, ఆతురుడై బాహ్యవాయువుచే తాకబడి విజ్ఞానము కోల్పోవును. పుట్టిన తర్వాత గూడ ముళ్ళు గ్రుచ్చుకొన్నట్లు రంపములచే కోయబడినట్లు మలమయమైన పుండునుండి క్రిమి (పురుగు) వలె క్రిందబడి, దురదగొని, గోకికొనలేక అటునిటు తిరుగలేక (దొరలుటకు చేతగాక) పరేచ్ఛచే స్నానపానాదికమయిన ఆహారమును పొందును. మురికి, మలమూత్రముల కంపుగొట్టు పడక(పొత్తిళ్ళ) పై పరుండి చీమలు, నల్లులు దోమలు కుట్ట వానినితోలుకొనలేక, అనేక జన్మదుఃఖములను, జన్మాంతరములను బాల్యాదిదశలందు క్రమ్ము ఆధిభౌతికాది దుఃఖములను అజ్ఞానాంధకారమున కుమిలి మనసు మూఢమై తెలియనేరక, నరుడు ఎవ్వడను? నేను ఎటనుండి ఎక్కడికి పోవుచున్నాను నా స్వరూపమేమి? ఏమి బంధములో నేను బద్ధుడను? ఇందుకారణమేది? అకారణమేది ఏమి చేయవలెను? ఏమిచేయరాదు? ఏమిఅనవలెను? ఏమిఅనకూడదు? ధర్మమేది? అధర్మమేది? దేనియందు ఎట్లు నేను ప్రవర్తింతును. నేను చేయగూడని పనియేమి? ఏది గుణము కలది? ఏది దోషముగలది అని పశుప్రాయులై మూఢులై అజ్ఞానముచే శిశ్శోదరపరాయణులై అజ్ఞాన మహాదుఃఖములో కుమిలిపోవుదురు.
అజ్ఞానము, తమోగుణ జన్యము, ఒకపని (కర్మ) చేయుట, మానుటయు ఆ అజ్ఞానము చేతనే జరుగును. కర్మలోపముచే నరకము కల్గును అని పండితులు అందురు. అందుచే అజ్ఞానులకు ఇహమందు, పరమందును, మహాదుఃఖము తప్పదు. ముదిమిచే ఒడలు, బడలు వడి, తలనెరిసి, కన్నులు గ్రుడ్డివడి, కనుపాపలు దించుకొనిపోయి ముక్కు సోణముల నుండి వెండ్రుకలు వెలువడి, మేనువడక ఎముకలు అన్నియు బయలువడి వెన్నెముకలు వంగిపోయి జఠరాగ్ని పోయినందున, అల్పాహారము, అల్పచేష్టయునై, అతికష్టముమీద కదలుచు లేచుచు పరుండుచూ చెవులు కళ్లు శక్తి కోల్పోవ చొంగకారి మొగమెల్ల క్రమ్మ, సర్వేంద్రియములు జడనుపడి పనిచేయక, మరణమునకు ఉన్ముఖుడై అక్షణమున తాను కన్న-విన్న విషయములు జ్ఞాపకమురాక, లేకలేక ఒకమాట పలికిన దానిచే పెట్టబడినశ్రమ కుడుచుచు, శ్వాసకోశ రోగములచే పుట్టిన విపరీతాయాసముచే నిద్రలేక, ఇంకొకడు లేవదీయ పరుండబెట్ట, ముసలియై, నౌకరులు తన బిడ్డలు భార్యలు చేయు అవమానములకు గురియై, శౌచక్రియలు అన్నియు పోయి విహారాహారములమీద మాత్రము కోరికపోక, తోడివారు కూడనవ్వ, బంధువులందరు నిర్విణ్ణులై పోగా, వయస్సులో తన చేష్టితములను ఏదో మరియొక జన్మయందు అనుభవించినట్లు స్మరించుచు, పరితాప పడుచు నిట్టూర్పుపుచ్చును. ఇట్లఅనేక దుఃఖములను ముదిమియందు అనుభవించి, ఆపై మరణమందు ఆజీవి కుడుచు దుఃఖములను, ముదిమియందు అనుభవించి యాపై మరణ మందు ఆజీవి కుడుచు దుఃఖములను కూడ వినుము.
మరణకాలమున కాళ్ళు చేతులు మెడ శిథిలములు అగును. అంతలోనే శ్రమ, అంతలోనే తెలివి, కంపము, పరవశత్వము, అల్పజ్ఞానము కలుగుచుండును. తన భార్య, గృహము, ధనము, సేవకులు మున్నగునవి తన అనంతరము ఏమి అగును అను చింత కలుగుచుండును. అంపములతో కోయుచున్నట్లు మర్మస్థానములందు బాధ, అస్థిసంధులలో యముని బాణములు గ్రుచ్చుకొనినట్లు బాధ, కనుగ్రుడ్లు తిరిగిపోవుచున్నట్లు ఉండుట, కాళ్ళు చేతులు తన్నుకొనుట, కంఠము పెదవులు మొదలగునవి ఎండిపోయినట్లు ఉండుట, శ్వాస ఆడకపోవుట, ఆకలిదప్పులబాధ, యమభటులు పెట్టు బాధలు మున్నగు వానితో అతిక్లేశమున యాతనాదేహము ప్రవేశించును.
ఇక నరకములో యమభటులు పాశములతో కట్టుట, దండములతో కొట్టుట భయంకర యమదర్శనము భయంకర మార్గములు, అంపములతో కోయుట మూసలలో వేసి కాచుట, గొడ్డళ్ళతో పగుల గొట్టుట భూమిలో పాతిపెట్టుట మున్నగు నరకయాతనలు దుస్సహములు - ఇవి అన్నియు ఈజీవుడు చేసిన పాపముల ఫలితములే. వీనినెల్ల లెక్కింప జాలము. స్వర్గమునకు వెళ్ళిన వారికిగూడ వారి పుణ్యము పూర్తికాగానే క్రిందికి పడిపోవుదురు. తమను దుఃఖము వెంటాడుచునే ఉండును. కావున అచటను సుఖములేదు. మరల గర్భమును చేరుట, పుట్టుట, తిరిగి బాల్యముననో, యౌవనముననో, వార్ధక్యముననో మరణించుట అను జనన మరణ ప్రవాహము సాగును. ఈ సంసారమునందుఏది సుఖ కారణమో అదియే దుఃఖమునకు కారణము అగును. కావున దారపుత్రధనాదులందు సంగము పెంచుకొనక, ఈ తాపత్రయములలోని దోషములను గుర్తించి ముక్తికొరకై యత్నించుట ఒక్కటియే ఈ బాధను తొలగించుటకు ఔషధము. వివేకులందులకే యత్నింపవలెను.
కర్మాచరణము జ్ఞానము ఈరెండును ముక్తికి సాధనములే, ఆగమములలో చెప్పిన శబ్దబ్రహ్మోపాసనము, వివేకమువలన కలిగెడి బ్రహ్మతత్త్వజ్ఞానము, అని జ్ఞానము కూడ రెండు విధములు. శబ్దబ్రహ్మతత్త్వమున కృతార్థుడైనచో, పరబ్రహ్మత్వము ప్రాప్తించును. పరా, అపర విద్యలు రెండును ఎరుగ వలసి ఉన్నవని ఆధర్వణీయమగు ముండకోపనిషత్తు చెప్పుచున్నది. వానిలో ఋగ్వేదాది వేదప్రోక్తమగు కర్మానుష్ఠానము అపరావిద్య. అక్షరతత్త్వమగు పరబ్రహ్మమును అందించునది పరావిద్య. పరబ్రహ్మతత్వము, అవ్యక్తము, అజరము, అచింత్యము, అవ్యయము, అనిర్దేశ్యము, అరూపము, అపాణిపాదము, సర్వగతము, సత్యము, భూతయోని, వ్యాప్యము, వ్యాప్తమునై ఉన్నది. ఈతత్త్వమును సూరులు (బ్రహ్మ విద్యా గరిష్ఠులు) మాత్రమే ఎల్లపుడు దర్శింపగలరు. ఆతత్త్వమే విష్ణుభగవానుడు.
భూతముల ఉత్పత్తి, వినాశములుఅను, వాని రాకపోకలను, విద్యా - అవిద్యలను ఎరిగిన మహానుభావుడే భగవత్పదవాచ్యుడు. హేయములగు దుర్గుణములు కాని, దోషములుగాని ఏమియు లేక జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులు అను ఆరు శక్తులు గలవాడే భగవానుడు. ఆ పరమాత్మునియందు సమస్త భూతములును, సమస్త భూతము లందు అతడును వసించును. అతడు సర్వాత్మకుడు.
అందువలననే ఆ పరతత్త్వమునకు వాసు దేవుడు అని పేరు. పూర్వము మహర్షులు అడిగిన ప్రశ్నకు సమాధానముగా ప్రజా పతియే ఈ వాసుదేవ పదమునకు అర్థమును ఇట్లు వ్యాఖ్యానించి తెలిపెను. అందుచేతనే జగములను నిర్మించువాడు, వాని స్థితిని వ్యవస్థ చేయువాడు కూడ ప్రభువగు వాసుదేవుడే.
అతడు సర్వ భూతములకును ప్రకృతి, మూలతత్త్వము. సమస్త గుణ దోషములకు అతీతుడు. సర్వావరణలకు అతీతుడు. అఖిలాత్ముడు. ఈభువనాంతరాళము అంతయు ఆయన చేతనే ఆవరింపబడి ఉన్నది. అతడు సమస్త కళ్యాణ గుణాత్మకుడు. స్వశక్తి లేశమాత్రము చేతనే సమస్త భూతసృష్టిని చేయగలడు. తన ఇచ్ఛచేత తనకు ఇష్టములగు గొప్పరూపములను ధరించి, సమస్త లోకములకు హితమును సాధించును. తేజోబలైశ్వర్య వీర్యశక్తి జ్ఞానముల రాశి; పరమైన వానికంటె పరుడు. ఆ పరావరునియందు ఎట్టి క్లేశములు లేవు. అతడు ఈశ్వరుడు. వ్యష్టి సమష్టి రూపుడు, వ్యక్తిరూపుడు, అవ్యక్తరూపుడు, సర్వేశ్వరుడు, సర్వద్రష్ట, సర్వశక్తియు అగు పరమేశ్వరుడు సమస్త దోషరహితమును, శుద్ధమును, పరమును, నిర్మలమును, ఏక రూపమును అగు ఆమహాతత్త్వమును ఏది తెలుపగలదో, చూపగలదో, అవగతము చేయగలదో అదియే జ్ఞానము. తదితరము అజ్ఞానము.
శ్రీ పరాశరుడు అనియె:
స్వాధ్యాయముచే, యోగముచే, విష్ణువు కానబడును. పురుషోత్తమ ప్రాప్తికి కారణ బ్రహ్మమని (వేదమని) వేదాదులందు పఠింపబడి ఉన్నది. స్వాధ్యాయముచే యోగమును, యోగముచే స్వాధ్యాయమును అభ్యసింపవలెను. స్వాధ్యాయ యోగములు రెండింటి సంపత్తిచే పరమాత్మ వెల్లడిఅగును. బ్రహ్మ దర్శనమునకు స్వాధ్యాయము ఒక కన్ను. యోగము రెండవ కన్ను. మాంస చక్షుస్సుచే బ్రహ్మ వస్తువు దర్శింప శక్యముగాదు. అనగావిని మైత్రేయుడు ఆ యోగమును నేనుఎఱుంగ కోరెదను తెలుపుము. అది తెలిసిన యెడల సర్వాధారమైన పరమేశ్వరుని దర్శింతును అనగా పరాశరుడు కేశిధ్వజుడు ఖాండిక్యునకు జనకునకును మున్నెట్లు యోగమును చెప్పెనో అది నీకు చెప్పెదను అనగా మైత్రేయుడు ఖాండిక్యుడుఎవ్వరు! కేశిధ్వజుడుఅను ధన్యుడెవ్వరు? వారిద్దరికి యోగసంబంధ నిమిత్తమైన వాదమేమి జరిగినది అనగా పరాశరుడు ఇట్లు తెలుపసాగెను.
ధర్మధ్వజుడను జనకుడు ఉండెను. అతని పుత్రులు మితధ్వజుడు, కృతధ్వజుడుఅను పేరుగల వారధ్యాత్మ నిష్ఠులైన రాజులుండిరి. కృతధ్వజుని కొడుకు కేశిధ్వజుడు. మితధ్వజుని కుమారుడు ఖాండిక్య జనకుడు. ఖాండిక్యుడు కర్మమార్గానుసారియై పృథివియందు రాజయ్యెను. కేశిధ్వజుడు మిక్కిలిగ ఆత్మ విద్యా విశారదుడుఅయ్యెను. వారిద్దరు ఒండొరులం గెలువవలయును అనుకొనిరి. కేశిధ్వజుడు ఖాండిక్యుని రాజ్యమునుండి దించి వేసెను. అతడు మంత్రిపురోహితులతో అల్ప సాధనములు గలవాడై, రాజ్య నిరాకృతుడై దుర్గమమైన అరణ్యమున సంచరించెను. జ్ఞాననిష్ఠుడై ఆతడు బ్రహ్మవిద్య యందుండి ఆ విద్యచే మృత్యువును ధరింపవలెనని అనేక యజ్ఞములు చేసెను. మైత్రేయా! ఒకప్పుడు యాగము నందు వర్తించుచున్న తఱి ఒక పెద్దపులి నిర్జనఅరణ్యమందు ఘర్మధేనువును చంపెను. అంతట ఆరాజు ఆ వత్తాంతమును విని ప్రాయశ్చిత్త మిప్పుడు ఇక్కడనే జరుగ వలయును? దానినెట్లు జరుపవలెను తెల్పుడు అనగా ఋత్విజులు మాకది తెలియదు. కశేరువు నడుగుమన అతడును భార్గవుని అడుగు మనెను. అతడు నేనది యెఱుగను. శౌనకునిఅడుగుము అతడది ఎరుంగును అన అతడాతని నడుగ, ఆ శునకుడు కశేరువు కాదు నేనుకాదు. ఇప్పుడు భూమి మీద ఈ విషయ మెరిగినవాడు నీ శత్రువు, నీచే జయింపబడినవాడు అగు ఖాండిక్యు డొక్కడే ఎరుగును అనియెను. “ఖాండిక్యుడు ఆ శత్రుని దరికి ఇది అడుగుటకు ఏగెదను. అతడు నన్ను చంపునా ఈ యజ్ఞము ప్రాప్తమే అగును. (యజ్ఞము సమగ్రఫల సిద్ధిగనును) లేదా అతడు నేనడిగిన ప్రాయశ్చిత్తము సమగ్రముగ తెల్పునా దానిచేకూడ నా యాగము వికలము చెడకుండును.
అని రథమెక్కి కృష్ణాజినధారియైన ఆరాజు మహాజ్ఞాని ఖాండిక్యుడున్న తావునకు అరిగెను. పైపైకి వచ్చిపడుచున్న ఆతనింగని ఖాండిక్యుడు కోపముచే కనులెరుపెక్కి విల్లెక్కిడి ఇట్లనియె. నీవు కృష్ణాజినము మీద కట్టుకొని మమ్ము హతమొనర్పనున్నావు. నేను కృష్ణాజినధరుడనైయుండ నన్ను నీవు కొట్టలేవు, ఇది ఇపుడు ఎరుంగుదువు. మూర్ఖుడా! జంతువుల పృష్ఠములందు కృష్ణాజిన ముండదా? అట్టి జంతువులపై నీవును, నేనును ఉగ్రమైన బాణములను విసరలేదా? అలాటి నేను నిన్ను హతము గావించెదను. నా దగ్గర నుండి నీవు బ్రతికిపోలేవు. ఓ దుర్బుద్ధీ! నీవు నా రాజ్యము హరించిన శత్రువవు అతతాయివి.” అనగా కేశిధ్వజుడు ఇట్లు అనెను.
ఖాండిక్య! సందేహమొకటి అడుగుటకై నీదరికి వచ్చితిని. నిన్ను చంపుటకు కాదు. ఇది విమర్శింపకకోపమైన విడువుము లేదా బాణమైనను విడువుము అనెను. అంతట ఖాండిక్యుడు ఏకాంతమున పురోహితునితో గూడ మంత్రులందరితో ఆలోచన చేసెను. అతనింగని మంత్రులు “ఇతడు శత్రువు ఇప్పుడు స్వాధీనుడైనాడు. ఇతడు నీకు చంపతగినవాడు. అతడీల్గిన భూమియెల్ల నీవశమగును” అనగాఖాండిక్యుడు వారందరిగని ఇది ఇంతే సందియము లేదు. ఇతడీల్గిన భూమియెల్ల నా వశమగును. వానికి పరలోక జయము నాకు సర్వభూజయము. చంపనిచో, నాకు పుణ్యలోక విజయము. వానికి వసుంధరాలోక జయముకంటె, వసుంధర ఘనమని నేను అనుకొనను. పరలోకజయము అనంతము. (శాశ్వతము) మహీజయము అల్పకాలము. (అశాశ్వతము) కావున వీని నేను చంపను. అడిగినది చెప్పెదను అనెను. అంతట ఖాండిక్యజనకుడు శత్రువు దరికేతెంచి నీవుఅడుగ వలసినదంత అడుగుము. నేను సమాధానము చెప్పెదను అని అయెను.
అంతట కేశిధ్వజుడు ఘర్మధేనువధ మొదలుకొని జరిగినదెల్ల తెల్పి దానంగల ప్రాయశ్చిత్తమేమని అడిగెను. అతడది యథాన్యాయముగ, విధివిహితముగ కేశిధ్వజునికి ఎరిగించెను. అతడది తెలిసికొని అమ్మహాత్ముని ఆజ్ఞగొని యాగభూమికి వచ్చి సర్వ క్రియలు క్రమముగ నిర్వర్తించెను. యాగము చక్కగ నడపి, అవభృథ స్నాతుడై కృతకృత్యుడై ఆపార్థివుడు ఇట్లాలోచించెను.
సర్వద్విజులను పూజించితిని. సదస్యులను సమ్మానించితిని. ఆర్థిజనమునకు అభీష్టార్థ సమృద్ధి చేకూర్చితిని. ఇహమందు (ఈలోక మందు) ఏది అర్హమైన క్రియయో దానినెల్ల నేను అనుష్టించితిని. అయినను నా మనస్సు ఏదో క్రియాలోపము చేసినట్లున్నది అని అతడాలోచించుచునే, ఆభూపతి ఖాండిక్యునికి గురుదక్షిణ ఈయలేదని జ్ఞాపకము చేసికొనెను. వెంటనే అరదమెక్కి ఖాండిక్యుడున్న దుర్గమ గహనమున కేగెను.
ఖాండిక్యుడు మరల తనవైపు వచ్చుచున్న అతనినిచూచి ఆయుధమునుచేకొన నెంచి నిలువబడెను. అతనినిచూచి కేశిధ్వజుడు ఖాండిక్య! ఓ మహానుభావ! నీకే అప రాధము చేయరాలేదు. కోపింపకుము. గురుఋణము తీర్ప దక్షిణ ఈయగా వచ్చినాడనని తెలియుము. నీ ఉపదేశముచేయాగము చక్కగా జరిపితిని. అందుచే నేను గురుదక్షిణ ఈయ వచ్చితిని. కోరుమనియె.
మరల ఆరాజు మంత్రులతో మంతనము చేసి ఇతడు గురు నిష్క్రయము కోరుచున్నాడు. నేనేమి అడుగవలయును అనగా వారు సర్వరాజ్యము అడుగుము. సైనికులను శ్రమపెట్టకుండ శత్రురాజులు రాజ్యమును అడుగుట ఎందేనికలదనిరి. వారింగని మహాజ్ఞాని కావున ఖాండిక్యుడు నవ్వి మహీపాలనము అల్పకాల భోగము. నావంటివారు అది యెట్లు కోరుదురు? తాము ముందర అర్థసాధనాలోచనపరులు. ఇక్కడ పరమార్థము. ఇక్కడ ఏది యెట్లు? అనుదాన మీరు విచక్షణులుకారు అని పలికి, ఆ ఱేడు కేశిధ్వజుని దరికివచ్చి నీవు అవశ్యము గురుదక్షిణ నిత్తువా? మంచిదని అతనిచే అనిపించుకొని ఖాండిక్యుడుఅతనితో; నీవధ్యాత్మ విజ్ఞాన పరమార్థమందు విచక్షణుడవు (వివేకివి) నాకీవు గురు నిష్క్రయము (దక్షిణ) ఇత్తువేని క్లేశ ప్రశమనమునకు (సర్వదుఃఖశాంతికి) ఏపనిచేయవలెనో అది ఆనతిమ్ముఅనియె.
కేశిధ్వజుడు రాజ్యలాభము కంటె క్షత్రియులకు అతి ప్రియమింకొకటి లేదు. అకంటకమైన నారాజ్యము నీ వెందువలన కోరలేదని అడుగ ఖాండిక్యుడనియె:
“నేను రాజ్యమును అర్థింప కుండుటకు కారణమునునేను తెల్పెదను తెలిసికొనుము. రాజ్యమెల్ల తమకు కావలెనని ఆ విద్వాంసులైన రాజులు లోభవశులగుదురు. ప్రజాపాలనము ధర్మయుద్ధముచే తన రాజ్యమునకు శత్రువులైన వారిని చంపుటయు క్షత్రియులకు ధర్మము. ఆపనియందు అశక్తుడనైన నేను, నీచే రాజ్యము అపహరింప బడినానన్న దానిలో నాదోషము లేనేలేదు. అవిద్య క్రమము తప్పినపుడు బంధము కొరకే అగును. నాకు రాజ్యము మీది కోరిక జన్మోపభోగ లాభమునకు ఏర్పడినది. ఇతరులకా కోరిక దోషజన్యమే. అందు ధర్మమును అసరింపబడదు. క్షత్రబంధువులు ధర్మ నిమిత్తముగనే రాజ్యమును అడుగుకొనరు. ఇది సత్పురుష సమ్మతమైనరీతి. అవిద్యాంతర్గతము కావున నీ రాజ్యమును నేనుఅడిగి కొనలేదు. మమకారముచే మతిచెడిన అజ్ఞానము అహమాభిమాన మహాపానముచే అయిన మదముచే, ఒడలు తెలియనివారు రాజ్యమునెడ దురాశ కొందురు. కాని నావంటి వారది కోరరు. అనవిని కేశిధ్వజుడు బాగున్నదని మెచ్చికొని ప్రీతితో ఖాండిక్య జనకునితో వినుమని ఇట్లు పలికెను:
“నేను అవిద్యచే మృత్యువును తరింపగోరి రాజ్యము వివిధ యాగములను భోగములను అనుభవించుట మూలమున పుణ్యక్షయమును చేయుచున్నాను. నీ మనస్సు నీ భాగ్యమున వివేకైశ్వర్య భావమునుపొందినది. కులనందనువగు నీవు అవిద్యా స్వరూపమును వినుము. ఆత్మకాని దానియందాత్మబుద్ధి తనదిగాని దానియందు తనదను తలంపు అనునది అవిద్యా తరువున పుట్టిన బీజము రెండుగా ఉన్నవి. పాంచభౌతిక దేహమందు దేహిమోహత మంబునం చుట్టుకొని అహం = నేను, ఇదంమమ = ఇది నాది అని తలంపును కుమతియై చేయును. శరీరమందు ఆకాశాది పంచభూతములకంటె వేరుగా ఉన్న ఆత్మయందు ఆత్మమయభావనను ఎవ్వడు చేయును? (ఎవ్వడును చేయుటలేదని భావము) గృహక్షేత్ర, కళత్రాదికము కళేబరోపభోగ్యమును ఎవ్వడు నేను నాది అనును? దేహముగాని ఆత్మ విషయములలో ప్రాజ్ఞుడు ఇది నాది అనుకొనును. ఈ విధముగా తన దేహముచే పుట్టింప బడిన పుత్రపౌత్రాదులయందు జ్ఞాని ఎవ్వడు స్వామ్యమును చేయును? అట్లే ఆత్మకాని కళేబరమందును స్వామ్యమును ఎవ్వడును చేయడు. మానవుడు దేహోపభోగము కొఱకే సర్వకర్మమును చేయును. ఆ దేహము పురుషుని కంటె ఎపుడు వేరగునో దానికై చేయు కర్మము అప్పుడు బంధహేతువగును. మట్టితో కట్టిన ఇల్లు, మట్టినీళ్ళచే (బురదచే) చేయబడునో, మట్టిగిలాబాచేయు పార్థివమైన ఈ దేహము (భూమిభాగము హెచ్చుగా గల శరీరము) మట్టి నీళ్ళచే (బురదచే) పూయబడినట్లు గిలాబా చేయబడినట్లు, పృథివీ భూత, జలభూత జన్యమైన అన్నాదులచే పూయ బడును. పెంపబడును. పంచభూతాత్మక భోగములచే, పంచభూతాత్మక శరీరము ఆప్యాయనము చేయబడుచున్నదేని, దానిచే పురుషునకు భోగమిక్కడ ఎక్కడిది? అనేక జన్మసహస్ర పరిమితిగల సంసారపదవియందు చరించుచు, మోహములను శ్రమకుగురియై ఈ దేహి వాసనలు అనెడి రేణువులు (ధూళి) క్రమ్ముకొనిఉండును. వీని ఈ రేణువులు జ్ఞానవారిచే ఎప్పుడు కడుగబడునప్పుడు సంసార పాంథుని మోహశ్రమము శాంతినొందును. మోహశ్రమ శమింపగనే అంతఃకరణ స్వస్థమై, పురుషుడు అనన్యాతి శయమైన బాధారాహిత్యమును పొంది, పరమ నిర్వాణమును (మోక్షమును) పొందును. ఆత్మలను నిది నిర్వాణమయము జ్ఞానమయము అమలము. దుఃఖాజ్ఞాన మయమైన ఆయా ధర్మములు ప్రకృతివిగాని ఆత్మవి కావు.
నీటికి అగ్ని సంసర్గములేదు. అయినను స్థాలీసంగమువలన అనగా గిన్నెతోడి సంసర్గము వలన, అది దానికి కల్గి శబ్దము ( = చప్పుడు) ఉద్రేకము ( = పొంగు మొదలైన ధర్మములను ఆనీరు చేయును. అట్లే ఆత్మ ప్రకృతి సంగము వలన అహము అభిమానాదులచే దూషిత మగుచుండును. అగుచు వానికంటె వేరయ్యు, అవ్యయమయ్యు, అయ్యాత్మ అయా ప్రాకృత ధర్మములను పొందును. అవిద్యా బీజమిది నీకు వివరించి చెప్పితిని. దుఃఖములకు క్షయకర మైనది యోగము కంటె మఱి యొక్కటి లేదు.
ఖాండిక్యుడు - “యోగవేత్తలలో ఉత్తముడా! ఈనిమి సంతతిలో యోగశాస్త్రార్థము చక్కగ నెరిగిన మహానుభావుడవు. నీవు యోగమును గురించి చెప్పుము” అని అడుగగా కేశిధ్వజుడు ఇట్లు అనెను: “బ్రహ్మమందు లయమందిన ముని ఎచ్చట ఉన్నను అందుండి జారిపోడు. మానవులకు బంధమోక్షములకు మనస్సే కారణము. అది విషయము లందత్తు కొన్న బంధనమునకు కారణమగును. నిర్విషయమైనచో ముక్తికి హేతువగును. విజ్ఞాన స్వరూపుడైన ముని విషయముల నుండి మనస్సును సమాహరించి (వెనుకకులాగి) ముక్తి కొరకు బ్రహ్మమే అయిన పరమేశ్వరుని ధ్యానింపవలెను. అట్టి బ్రహ్మధ్యాన నిష్ఠుని ఈ మనస్సు అయస్కాంతము తన శక్తిచే వికారము లందదగిన లోహమునట్లు ఆత్మభావమును పొందించును. ఆత్మ ప్రయత్నము తోడి అపేక్షగల విశిష్టమైన ఏమనోగతిగలదో ఆగతిని బ్రహ్మమందు లగించుటయే యోగమని చెప్పబడును. (అనగా సాధకుడు గట్టి ప్రయత్నము చేసి సంకల్ప వికల్పాత్మకమైన మనస్సును ఇతర విషయములు వెంట పోకుండ సమాహరించి ఆత్మయందు (బ్రహ్మమందు) దృఢముగా నిలువరించుటయే యోగశబ్దమునకు అర్ధము). ఇట్లు మిక్కిలి వైశిష్ట్యముతో (అనుసంధానము నందలి నేర్పుతో కూడిన ధర్మము లక్షణముగాగల యోగము ఎవ్వనికి అనువుపడునో, అట్టి యోగి ముముక్షువు. (మోక్షమును కోరువాడు) అనబడును. మొట్టమొదట యోగాభ్యాసమునకు పూనుకొన్నవాడు) “యుంజానుడు” అనబడును. సమాధి చక్కగాకుదిరి, పరబ్రహ్మోపలబ్దినందినవాడు అంతరాయ దోషముచేత యోగ విఘ్నములని శాస్త్రమందు చెప్పబడిన అభ్యంతరముల దోషముచే ఈ సాధకుని మనస్సు దూషితమగునేని, (యోగభ్రష్టుడగునేని) తరువాత జన్మములందు ఆయోగ విధిని మానకుండ పట్టుకొని అభ్యసించునేని, వానికి ముక్తి కలిగితీరును. తొలి జన్మయందే సమాధి చక్కగా కుదిరెనేని ఆతడా జన్మమందే ముక్తి పొందును. అప్పుడు యోగాగ్నిచేత ఆతని పూర్వజన్మ కర్మము వర్తమానము కూడ అప్పుడే దగ్ధమైపోవును.
యోగి, బ్రహ్మచర్మము, అహింస, సత్యము, అస్తేయము (దొంగతనము లేకుండుట), అపరిగ్రహము (దానము పట్టకుండుట) అను ధర్మములను చక్కగా సేవించుచు తన మనస్సును, యోగ్యతను (యోగార్హతను) పొందించుచు, స్వాధ్యాయము, శౌచము, సంతోషము, తపస్సు, అనువానిని ఆచరించుచు నియతాత్ముడై మనస్సును పరబ్రహ్మమందు ప్రణవమయిన దానిగా (లగ్నమైన దానినిగా లేక ఆవంకకు ప్రసరించునదిగా) ఒనరింప వలెను. ఈ చెప్పిన నియమములుఐదు. వీనితోబాటు యమము లేదు. (ధ్యాన ధారణాదులు) యోగ శాస్త్రమందు చెప్పబడినవి. కామ్యము లైనపుడు విశిష్టములైన ఫలములను ఇచ్చును. అవే నిష్కాములైనవారికి ముక్తినిచ్చును. యతి (మనస్సును నియమించుకొన్న యోగి అన్నమాట) భద్రాసనములు మొదలగు యోగాసనముల లక్షణములతో కూడి యోగియమ నియమములతో యోగమును సంధాన పరచుకొనవలెను. ప్రాణముఅను పేరుగల వాయువును అభ్యాసమువలన వశముచేసికొనుట అనునది “ప్రాణాయామము” అనబడును. అది సబీజము, నిర్భీజముగా రెండు విధములని ఎరుగవలెను. ప్రాణవాయువు (హృదయమందున్న గాలి) అపానవాయువు (గుదమందుండునది) అను ఈ రెండు గాలులు నొకదానితో నొకటి (తిరస్కరించునప్పుడు) ఎదురయినపుడు వానిని రెండింటిని చక్కనిరీతిలో సంయమించి (నిరోధించి) ఆలంబించుట, మూడవ యోగభూమిక. అది స్థూలరూపము. అట్టి ఆలంబనమును విడువక యోగి అభ్యసింపవలెను. అందు శబ్దాది విషయానురక్తములయిన శ్రవణేంద్రియములను యోగవేత్త నిగ్రహించి చిత్తానుకారులుగా కావింపవలెను. చిత్తమువెంట ఉండువానిని చేయవలెను. అదే ప్రత్యాహారము అనబడును.
దానిచే అతిచంచలములైన ఇంద్రియములు వశ్యములగుట అను పరమయోగభూమిక సమకూరును. అవి వశములు కానిచో యోగి యోగ సాధకుడు కానేరడు. ప్రాణాయామముచే వాయువు, ప్రత్యాహారముచే ఇంద్రియము వశము చేయబడిన తరువాత యోగి మనస్సును శుభాశ్రయమందు సగుణమైన భగవన్ మూర్తియందు లేక నిర్గుణ పరబ్రహ్మమందో నిలకడచెందిన దానిని కావింపవలెను. అన విని ఖాండిక్యుడు మహానుభావ! ఈ చిత్తమునకు శుభాశ్రయమేది? దేనిని ఆధారము చేసికొని దోషమలముల పుట్టుకకు హేతువైన ఆ మనస్సు నశింపజేయును? ఆ వివరము తెలుపుము అనగా కేశిధ్వజుడు ఇట్లనియె:
ఖాండిక్యపుత్ర రాజ్యాభిషేకము:
రాజా! చేతస్సుకు (మనస్సునకు) ఆశ్రయము నైజముగా మూర్తము, అమూర్తము అను రెండు విధములైన వస్తువు. అమూర్తము (నిర్గుణము) పరము. మూర్తము (సగుణము) అపరము. భావనయు మూడు విధములు. ఒకటి కర్మభావన, రెండు బ్రహ్మ భావన, మూడు కర్మ బ్రహ్మో భయాత్మిక. సనందనాదులు (బ్రహ్మ మానస పుత్రులు) బ్రహ్మ భావనా సంపన్నులు. దేవాది స్థావర జంగమ భూతములు కర్మభావనాపరులు. హిరణ్య గర్భాదులందు బ్రహ్మ కర్మాత్మిక రూపము భయభావన ఉండును. జ్ఞానాధికారులైనవారి యందు భావభావన ఉండును. విశేషజ్ఞాన కర్మములన్నియు క్షీణము కానప్పుడు ఇది విశ్వము - దీనికి పరమైనది ఇంకొకటి ఉన్నది అను భేదముచే భిన్నమైన దృష్టి కలవారికి ఈ ద్వైత భావముఉండును. భేదము అస్తమించి ఏది సత్తామాత్రము వాచామ గోచరము ఆత్మ సంవేద్యమునైన బ్రహ్మ జ్ఞానమను పేరి జ్ఞానము. అది విష్ణువు యొక్క పరరూపము అది ఏరూపము అనుత్తమము (దానికంటే మరియు ఉత్తమము లేదన్నమాట) విశ్వము యొక్క ఈ పరమాత్మ యొక్క రూప వైరూప్య లక్షణములు రెండును కలది అది. అది యోగనిష్ఠునికి చింతింప (ధ్యానింప శక్యముగాదు. అందువలన హరియొక్క స్థూల రూపము విశ్వరూపమున గోచరమగుదానినే చింతింపవలెను. (ధ్యానము చేయవలెను).
హిరణ్యగర్భుడు భగవంతుడు వాసుదేవుడు ప్రజాపతి, మరుత్తులు, వసువులు, రుద్రులు, భాస్కరులు, (ద్వాదశాదిత్యులు) తారకలు, గ్రహములు, గంధర్వ, యక్ష, దైత్యాదులు, సర్వదేవయోగులు, మనుష్యులు, పశువులు, శైలములు, సముద్రములు, నదులు, చెట్లు, అశేష భూతములు వానికి హేతువులు అయిన ప్రధానము మొదలైన విశేషములు చేతనము అచేతనమునైనది ఏక ద్విపాత్పంచ బహుపాదములయిన ప్రాణులు అపాదకము (పాదములు లేనిది) నైన మూర్తమైన ఈ ప్రపంచమెల్ల హరి యొక్క రూపము.
ఈ చరాచరాత్మక విశ్వము అదియెల్ల త్రివిధ భావనారూపము పరబ్రహ్మ స్వరూపుడైన విష్ణువుయొక్క శక్తితో కూడినది. విష్ణుశక్తి పరఅను పేర ఒకటి, క్షేత్రజ్ఞఅను పేర అపరఅను పేర రెండవది. అవిద్య కర్మఅనుపేర మూడవశక్తి ఉన్నది. ఈ అ విద్యా కర్మరూపయైన మూడవ శక్తి చేతనే సర్వగమయిన క్షేత్రజ్ఞ శక్తి వేష్టితయై ఉన్నది. ఆ వృతయై ఉన్నదన్న మాట. అదే సంసారతాపములన్నిటిని విరామములైన వానిని అనుభవించును. ఆ మూడవ శక్తిచే కప్పువడినకతననే క్షేత్రజ్ఞశక్తి సర్వభూతములందు తరతమ భేదముచే కనబడుచుండును. ప్రాణములు లేని వాటియందది మిక్కిలి అల్పము. స్థావరములందు అంత కంటె కొంచెము ఎక్కువ. సరీసృపాదులయందు, పాములు, తేళ్ళు మొదలగువాని యందు అది అంతకంటె ఎక్కువ. పక్షులందు అంతకంటె, మృగములందు అంతకంటె, పశువు లందు అంతకంటే, మనుజులందు అంతకంటె, ఆ పరమ పురుషుని ఆత్మయొక్క శక్తి ప్రభావితమై ఉన్నది. మానవులకంటె పశువులవద్ద, అంతకంటె మనుజులందు అంతకంటె శక్రుడు (ఇంద్రుడు), అంతకంటే, ప్రజాపతి, ఆ పైని హిరణ్య గర్భుడు ఎక్కువగ ఆత్మ శక్త్యుపలక్షితులై ఉన్నారు. ఆకాశముచే అంతయు కూడిఉన్నట్లు ఈచెప్పిన అశేషరూపములు ఆ ఆత్మశక్తి యోగముచే ఆతని రూపములేయై ఉన్నవి. ఇది విష్ణువుయొక్క మూర్త రూపము - విశ్వరూపము.
ఇక విష్ణువు యొక్క రెండవరూపము యోగిధ్యేయము. అమూర్తము బ్రహ్మ యొక్క రూపము. పండితులు దానిని ‘సత్’ ఉన్న వస్తువని పల్కుదురు. ఈ సమస్త శక్తులు ఎందు ప్రతిష్ఠితములై ఉన్నవో, అది విశ్వరూప వైరూప్యమైన హరియొక్క మరియొక్క మహా రూపము. అది తన లీలచే దేవతిర్యఙ్మనుష్యాది చేష్టలుగల సమస్త శక్తి రూపములను చేయుచుండును. అది జగత్తునకు ఉపకారకము ఆశక్తి కర్మ నిమిత్తమున పుట్టినదికాదు. ఆ అప్రమేయమైన బ్రహ్మముయొక్క అవ్యాహతమైన సర్వవ్యాపినియైన చేష్టఅది. విశ్వరూపుడైన పరబ్రహ్మయొక్క ఆ శక్తిరూపము సర్వపాపహరము. అది యోగాను సంధానపరుడైన వానిచే ఆత్మవిశుద్ధి కొరకు ధ్యానింపదగినది. అగ్ని జ్వాలలు ఎగయ వాయువుతో గూడి కక్షమునుగడ్డిని, లేదా అడవిని దహించునట్లు విష్ణువు యోగుల చిత్తము నందుండి సర్వ కిల్బిషములను దహించును. కావున సమస్త శక్తులకు ఆదరువైన ఆ విష్ణువునందు మనస్సు యొక్క ధారణను నిలుకడను చేయవలెను. అదే శుద్ధ ధారణ అనబడును.
ఆ ధారణయందు ప్రసన్నముఖుడు పద్మపత్రాయతేక్షణుడు, సుకపోలుడు, సువిశాల లలాటఫలకోజ్జ్వలుడు, సమకర్ణములతోడ ఉంచబడిన చక్కని కుండలాలంకారములు కలవాడు, కంబుగ్రీవుడు, సువిశాల శ్రీ వత్సాంకిత వక్షుడు, కడుపుపై మూడు ముడుతలతో, లోతైన బొడ్డుతో కూడిన కడుపుతో, ప్రలంబ మానభుజాష్టకముతో, ఎనిమిది దీర్ఘబాహువులతో, లేదా నాల్గు భుజములతో కూడిన సమముగ ఉన్న తొడలు పిక్కలు కల్గి చాలచక్కగ ఉన్న పాదాంబుజ యుగముతో పీత నిర్మలాంబరధారిని, హరిని సాక్షాత్ బ్రహ్మమేయైన వానిని ధ్యానింపవలెను. మరియు కిరీటహార కేయూర కటకాది భూషితుడై, శార్ఙ్గశంఖ గదాఖడ్గచక్రములు అక్షవలయము వరద - అభయహస్తములందు రత్నాంగుళీయకములు పెట్టికొనియున్న సుందరుని, యోగి మనసున చక్కగాచేర్చి నిలిపి, తన్మయుడై ధారణ ఎంతవరకు దృఢమై అక్కడనే నిలుచునో అంతదనక ధ్యానింపవలెను. నడచుచున్న నిలిచి ఉన్న, మది స్వేచ్ఛగానే పనిచేయుచున్నను, మనసునుండి ఆ ధ్యానలక్ష్యము (గురి) అయిన పరమాత్మ వస్తువు (మూర్తము) తొలగకున్నచో, అపుడా ధారణ సిద్ధించినట్లు ఎరుగ వలయును.
అటుపైని కొన్నాళ్ళకు శంఖ చక్రాదులులేని లక్ష సూత్రముతో ఉన్న భగవ ద్రూపమును (పరిమితముగా) ధ్యానింపవలెను. ఆధారణ ఎప్పుడు పైదానివలె నిలుకడ చెందునో కిరీట కేయూరాది భూషణ రహితముగ, ఆ రూపమును ధ్యానింపవలెను. ఆ మీద ఒక్కొక్క అవయవమందు ధ్యానము నిలుపవలెను. దానిచే అవయవి యందు బ్రణిధానము నొందవలెను. అదే రూపమునందు దృఢపడి అన్యవస్తువునెడ స్పృహగొనక ఉండు, ఆ ధ్యానము మొట్ట మొదటి యోగాంగములు ఆరింటిచేత ఏర్పడును. అదే ధ్యానము యొక్క రూపాంతరము. కల్పనా రహితమయిన కేవలరూప గ్రహణము అనునదేదిగలదో, అది మనస్సుచే ధ్యానమందు ఏర్పరుపబడునది. అదే సమాధి అనబడును. అందు ప్రాప్యమయిన పరబ్రహ్మమందు ప్రాపకమయిన విజ్ఞానము ప్రాపణీయము (పొందింప వలసినదగు) అశేష భావనలు క్షీణించిన కేవల సంవిద్వస్తువు, ఆత్మవస్తువు క్షేత్రజ్ఞుడు, కరణ జ్ఞానము (సాధనకు ఉపయోగించు జ్ఞానము) దానియొక్క కరణము (సాధనము), ధ్యాన నిష్ఠాద్యము అనుకొన్న ముక్తి కార్యము అనునవి ఎల్ల కృతకృత్యములై మరలిపోవును. ఆభూమికలో తద్భావముపొంది; అనగా ధ్యేయవస్తువు యొక్క వస్తుత్వమును తాను పొంది ఈ సాధకుడు పరమాత్మతో అభిన్నుడగును. వానికి భేదము అజ్ఞాన కృతమగును. విభేదజనకమైన జ్ఞానము (తెలివి) పూర్తిగా నశింపగనే ఆత్మకు (తనకు) బ్రహ్మమునకు లేనిపోని భేద మెవడు చేయును? ఖాండిక్య! అడిగితివి కావున సంక్షేపముగను విస్తరముగ ఇట్లు నీకు యోగమును నేను తెల్పితిని. నీకింకేమి చేయుమందువు? అన ఖాండిక్యుడు - యోగసద్భావము తెలుపుటతో నాకు సర్వము చేసినదేయైనది. నీ ఉపదేశముచే చిత్తముల మెల్ల పోయినది. నాదిఅని నేనేమంటిని. ఇది తప్పేకాని వేరొకటి కాదని విజ్ఞేయవేదులు (తెలియవలసిన బ్రహ్మవస్తువును ఎరిగినవారు) చెప్పశక్యమైనది. నేను నాది అను ఈ వ్యవహారము అవిద్య. ఈ రెండింటి యొక్క పరమార్థము పలుకవలసినది కాదు. వాక్కులకది గోచరముకాదు కావున తాముఖక దయచేయుడు. నాకు చేయవలసినదెల్ల తాము కావించితిరి. ముక్తి ప్రదమైన అవ్యయమైన యోగము మీరు సెలవిచ్చితిరి. అని ఆ ఖాండిక్యునిచే యథార్హముగ పూజింపబడి కేశిధ్వజ నృపతి నిజపురమునకు ఏతెంచెను. ఖాండిక్యుడును కుమారుని రాజుని కావించి యోగసిద్ధికై గోవిందునందుడెందము నిలిపి వనమున ప్రవేశించెను. అట ఏకాంత మతియై యమాది గుణములతో విష్ణువను పేరి నిర్మల బ్రహ్మమందు ఆఱేడులయమందెను. కేశిధ్వజుడు విముక్తి కొఱకు స్వకర్మక్షపణముయెడ ఉన్ముఖుడై (కర్మక్షయమునకు ఉద్యమించినవాడై) విషయములు అనుభవించెను. అనభిసంహితముగా (కర్మఫలాభి సంధి లేకుండ) కర్మములను ఒనరించెను. అకల్యాణములైన ఉపభోగములచే పాపము క్షీణమై, అమలుడై, తాపత్రయక్షయము ఫలముగాగల ఆత్యంతిక సిద్ధిని (మోక్షమును) పొందెను.
శ్రీ పరాశరుడు ఇట్లు అనెను:
మూడవ ప్రతి సంచరమును (లయమును) చెప్పితిని. బ్రహ్మమందు లయమగుట అను ఆత్యంతికముక్తి ఇది. సర్గము ప్రతిసర్గము వంశము మన్వంతరములు వంశాను చరిత్రముఅను పురాణముల యొక్క ఐదు లక్షణములును మీకు తెల్పితిని.
మైత్రేయా! ఈ విష్ణు పురాణము సర్వపాపహరము. సర్వశాస్త్రముల కంటెపైది. నాల్గు పురుషార్థములను తెల్పునది. ఇంకేమి వచింప వలెనో అడుగుము. అన మైత్రేయుడు: భగవంతుడా! భక్తితో దయవలన వినదగినది అంతయు విన్నాను. సందేహములు పోయి నవి. మనస్సు పరిశుద్ధమైనది. ఉత్పత్తి, స్థితి, లయములు నాకు అవగతములు అయినవి. సృష్టి, స్థితి, పరిపాలన హేతువులగు బ్రహ్మ దక్షాదిరాశి విష్ణు మన్వాదిరాశి రుద్రకాలాంత కాది రాశి అను త్రివిధరాసులు విష్ణుశక్తి, క్షేత్రజ్ఞశక్తి అవిద్యా కర్మశక్తిఅను త్రివిధశక్తులు బ్రహ్మభావన, కర్మభావన, ఉభయభావన అను భావభావనాత్రయము మీ అనుగ్రహముచే పూర్తిగా తెలిసినవి. నీ అనుగ్రహముచే తెలియతగినది తెలిసినది. వర్ణాశ్రమ ధర్మములు తెలిసినవి. కృతార్థుడ నైతిని. ప్రవృత్తి నివృత్తికర్మలు తెలిసినవి. ఈ జగత్తంతయు విష్ణువు కంటె వేఱుకాదు. ఇది ప్రవచింపుమని శ్రమపెట్టితిని. క్షమించుము. మహాను భావులకు పుత్రునికి, శిష్యునికిని భేదము ఉండదు. అని పల్కుగా పరాశరుడు ఇట్లు అనియె:
ఈ విష్ణు పురాణము వేదతుల్యము. ఇది వినిన పాపరాశి నశించును. పురాణ పంచ లక్షణములు నీకు ఇందులో వర్ణించితిని. ఇందు దేవదైత్యగంధర్వాదుల చరిత్రలు అన్నియు తెలుపబడినవి. ఆత్మదర్శనము చేసిన మునులు చాతుర్వర్ణ్యము మహానుభావుల కథలు పుణ్యక్షేత్ర తీర్థములు వర్ణితములు. వేదశాస్త్ర విషయములు తెలుపబడినవి. విష్ణువును గూర్చి వినిపించితిని. అగ్ని లోహములనట్లు ఈ పురాణము కలికల్మషములను హరించి మనస్సును శుద్ధిచేయును. పిపీలికాది బ్రహ్మ పర్యంతమయిన బ్రహ్మాండమంతయు ఎవ్వని స్వరూపమో ఆ విష్ణుభగవానుడు ఇందు సంకీర్తింపబడెను. అశ్వమేధఅవ భృథస్నానము చేసిన ఫలము, ప్రయోగ పుష్కరము, కురుక్షేత్రము మొదలగువానియందు స్నానదానాదులు చేసిన కలుగు ఫలము ఈ పురాణ శ్రవణముచే సిద్ధించును. యమునయందు జ్యేష్ఠ శుక్ల ద్వాదశినాడు స్నానముచేసి మథురయందు హరిని దర్శించిన పుణ్యము దీనిచే కల్గును. జ్యేష్ఠ బహుళ ద్వాదశినాడు ఉపవసించి యమునా జలములందు స్నానము చేసి పితరులను అర్చించిన పుణ్యము ఈ పురాణ పఠన శ్రవణాదులు చేకల్గును. మథురానాథుని అయ్యెడ సేవించిన పుణ్యమును ఇది ఇచ్చును. ఇది దుస్స్వప్ప నివారకము. మంగళములకెల్ల మంగళము. పుత్రులను, సంపదలను ఇచ్చును. బ్రహ్మ ఋభునకు అతడు ప్రియవ్రతునకు అతడు భాగురికి, ఆయన స్తంభమిత్రునకు అతడు దధీచికి, ఆయన సారస్వతునికి అతడు భృగునకు, ఆయన పురుకుత్సునికి, అతడు నర్మదకు, నర్మద ధృతరాష్ట్రునికి, నాగునికి ఆ పూరణునకు, ఆ ఇద్దరు నాగేంద్రుడైన వాసుకికి, వాసుకి, వత్సునికి, అతడు అశ్వతరునకు, అతడు కంబళునకు, అతడుఏలా పుత్రునికి, ఉపదేశింపబడినది. వేదశిరుడను ఋషి పాతాళమునకు ఏగి దీనిని వినెను. అతడు ప్రమతికి, అతడు ఋతుకర్ణునికి, మఱి పుణ్యులెందరకో, ఈ పురాణము వినిపింపబడినది. పులస్త్యమహర్షి వరముచే నాకుఇది జ్ఞప్తికి వచ్చినది. నేను నీకు యథాతథముగ తెల్పితిని. నీవు దీనిని కలియుగము తుదిని, శినీకునకు ఉపదేశింపగలవు. ఇది పరమ గుహ్యము, కలిపాపహరము. భక్తితో విన్న అతడు సర్వపాప విముక్తుడగును. సర్వతీర్థ స్నానఫలము సర్వదేవతా స్తుతిఫలము దీనిచే కల్గును. కపిలగోదాన ఫలమునుఇది చేకూర్చును.
భగవత్ స్తుతి:
నాన్తో అస్తి యస్యనచయస్య సముద్భవో అస్తివృద్ధిన్నయస్య పరిణామ వివర్జితస్య - నాపక్షయంచసము పైత్యవికారిస్తుయస్తంనతోస్మి పురుషోత్తమమీశ మీడ్యమ్॥
తస్యైవయోనుగుణభుగ్బహుదైకఏవశుద్ధో అప్యశుద్ధ ఇవభాతిహిమూర్తిభేదైః ।
జ్ఞానాన్వితస్సకలసత్త్వ విభూతికర్తా తస్మై నమోస్తు పురుషాయ సదా అవ్యయాయ॥ జ్ఞానప్రవృత్తినియమైక్య మయాయపుంసోభోగప్రదానపటవే త్రిగుణాత్మకాయ ।
అవ్యాకృతాయభవభావన కారణాయ వన్దే స్వరూపభవనాయ సదా అజరాయ॥ వ్యోమానిలాగ్ని జలభూచర నామయాయ శబ్దాదిభోగ్య విషయోపనయక్షమాయ। పుంసస్సమస్తకరణై రుపకారకాయవ్యక్తాయ సూక్ష్మబృహదాత్మవతేనతో అస్మి ॥
ఇతివివిధమజస్య యస్యరూపం ప్రకృతి పరాత్మమయం సనాతనస్య ।
ప్రదిశతు భాగవాశేష పుంసాం హరిరపజన్మ జరాదికాంస సిద్ధిమ్ ॥
అచ్యుతునిపై మనస్సు నిలిపి, ఇది సంపూర్ణముగా విన్నవాడు విష్ణుసాయుజ్యము పొందును. దీని యందు మనస్సును నిల్పినవానికి స్వర్గముకూడ విఘ్నము అనిపించును. బ్రహ్మకల్పము కూడ అల్పమై తోచును. హరి ప్రసన్నుడై ముక్తిని ఇచ్చును. హరికథా శ్రవణము చేసిన జ్ఞానులు, పునరావృత్తి రహిత స్థితిని పొందుదురు. పితరులు తృప్తులగుదురు. హవ్యకవ్యములు ఆరగించు ఆవిష్ణువిభుడు సర్వశక్తిమయుడు. వీనులలో పడెనేని అట్టి పుణ్యశ్రవులు బ్రహ్మ నిష్ఠులగుదురు.
ఇది శ్రీ విష్ణు మహాపురాణమున షష్ఠాశమున పురాణ ప్రశంస అను ఎనిమిదవ అధ్యాయము.
శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ
శ్రీ మహావిష్ణు పురాణము సమాప్తము
సర్వేజనాస్సుఖినోభవన్తు.
Summary of chapter 6 of the Vishnu Mahā Purāṇa is as follows:
The sixth and final aṃśa turns toward the twilight of the ages, describing with unflinching clarity the degeneration of Kali Yuga, when truth grows faint and rulers forget their charge. From this sobering vision the text ascends to the four-fold dissolution (pralaya) — the elemental, occasional, incidental, and absolute — through which the universe returns again and again into the being of Viṣṇu, who alone remains when all else is unmade. The Purāṇa closes by extolling its own sanctity, promising liberation and the fruit of devout hearing to whoever receives this narrative with faith, so that Maitreya, and every listener after him, is left not with despair at cosmic dissolution but with the quiet certainty of Viṣṇu's eternal, unfailing presence.