విష్ణు మహా పురాణము

3వ అంశం

14 మన్వంతరములు

మైత్రేయుడు పలికెను:

గురువు (పరాశరుడు) చే భూ సముద్రాదులయొక్కయు, సూర్యతేజోమండలముల యొక్కయు సన్నివేశము విస్తృతముగ చెప్పబడినది. అట్లే దేవాదుల యొక్కయు, ఋషుల యొక్కయు సృష్టి వర్ణింపబడెను. చాతుర్వర్ణ్య సముత్పత్తి ధ్రువ, ప్రహ్లాద చరితములు వివరముగ మీచే చెప్పబడెను, మన్వంతరములను అన్నిటిని తదధి పతులగు ఇంద్రాదులను గురించియు మీరు చెప్పగా వినకోరిక కలదు.

శ్రీ పరాశరులు పలికిరి:

ఈ వారాహ కల్పమునందు అతీతములు అయినవియు అనాగతములు అయినవియు అగు మన్వంతరములను క్రమముగ చెప్పెదను. స్వాయంభువమనువు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుష మనువు అను ఆఱుగురు మనువులు గతించిరి. ప్రస్తుతము సూర్యపుత్రుడగు వైవస్వత మనువు యొక్క అంతరము. అనగా ఏడవ మన్వంతరము జరుగుచున్నది. కల్పాదియందలి స్వాయంభువ మన్వంతరము గురించియు అందు దేవతలను, సప్తర్షులను గురించి పూర్తిగ చెప్పితిని. ఇకముందు స్వారోచిష మన్వంతరమును, తదధిపతులను దేవతలను ఋషులను మనుపుత్రులను తెల్పెదను. ఈ మన్వంతరము నందు తుషితునితోగూడి పారావారులు దేవతలు. మహాబలుడగు విపశ్చిత్ అను నాతడు దేవేంద్రుడు. ఊర్జుడు, స్తంభుడు, ప్రాణుడు, వాతుడు, పృషభుడు, నిరయుడు, పరీవాస్ అను సప్తర్షులు ఉండిరి. చైత్రుడు కింపురుషుడు మున్నగువారు స్వారోచిషుని పుత్రులు. ఇది రెండవ మన్వంతరము. మొదటి స్వాయంభువ మన్వంతరము నందు యముడు మొదలగు దేవతలు పన్నిద్దరు. (పన్నెండుమంది) మరీచ్యాదులు సప్తర్షులు. ప్రియవ్రత ఉత్తానపాదులు మనుపుత్రులు. శిశ్వభుక్ అనువాడు దేవేంద్రుడు. తృతీయ మన్వంతరమున ఉత్తముడు మనువు. సుశాంతి అనువాడు దేవేంద్రుడు. సుధాములు, సత్యులు, జపులు, ప్రతర్దనులు, వశవర్తులు, అను అయిదుగణములు దేవతలు. ఒక్కొక్క గణమున పన్నిద్దరు (పన్నెండు మంది) కలరు. వసిష్ఠ తనయులు సప్తర్షులు. అజుడు పరశు దీప్తాదులు ఉత్తమ మనుపుత్రులు. చతుర్థమగు తామస మన్వంతరమున సుపారులు, హరులు, సత్యులు, సుధియులు అను దేవగణములు, ఒక్కొక్క గణమున ఇరువది ఏడుగురు గలరు. శిబి అనువాడు దేవేంద్రుడు. శతక్రతుత్వ, వజ్రిత్వ సహస్రాక్షత్వాది లక్షణములు సర్వమన్వంతరీయ దేవేంద్రులకు సమానము. జ్యోతిథ్థామ పృథువు కావ్యుడు చైత్రుడు అగ్నిధనకుడు పీడుడు అనువారు సప్తర్షులు. నరుడు ఖ్యాతి కేతురూపుడు జానుజంఘుడు మున్నగువారు మహాబలులు, రాజులు అయిన మనుపుత్రులు.

ఐదవదగు రైవత మన్వంతరమున రైవతుడు మనువు. విభువనువాడు దేవేంద్రుడు. అమితాభుడు భూతనయుడు వైకుంఠులు సుమేధసులు అగు పదునలుగురతో కూడిన పదునాలుగు గణములు దేవతలు. హిరణ్యరోముడు, వేదశ్రీ, ఊర్ధ్వబాహువు, సుధాముడు, పర్జన్యుడు, అనువారు సప్తర్షులు. బలబంధువు, సుసంభావ్యుడు, సుత్యకుడు మున్నగువారు రైవత మనుపుత్రులు. వారు మహావీర్యసంపన్నులు. రాజేంద్రులు, స్వాలోభిషుడు ఉత్తముడు. తామసుడు, రైవతుడు అను ఈ నలుగురు మనువులు ప్రియవ్రత వంశములోనివారు. రాజర్షియగు ప్రియవ్రతుడు తపస్సుచే విష్ణువును ఆరాధించి మన్వంతర అధిపతులైన ఈ నల్వురను కనెను.

ఆఱవ మన్వంతరమందు చాక్షుషుడు మనువు. మనోజవుడు అనువాడు దేవేంద్రుడు. అప్యులు ప్రసూతులు, భవ్యులు, పృథుకులు, దివౌకసులు అను అయిదు అష్టక గణములు దేవతలు. సుమేధ, విరజుడు, హవిష్మంతుడు, ఉత్తముడు, మధువు, అతినాముడు, సహిష్ణువు, అను ఈ ఏడుగురు సప్తర్షులు. ఊరువు, పూరువు, శతద్యుమ్నుడు మున్నగు మహాబలులు చాక్షుష మనుపుత్రులు. వీరు భూపతులు.

ఇప్పుడు ఏడవ మన్వంతరము. ఇందు వివస్వంతుని కుమారుడు వైవస్వతుడు మనువు. ఈతడు బ్రాహ్మణుడు, శ్రాద్ధీదేవుడు. మహాతేజస్వి, బుద్ధిమంతుడు. ఆదిత్య వసు రుద్రాదులు దేవతలు. పురిందరుడు అనువాడు దేవేంద్రుడు. వసిష్ఠుడు, కాశ్యపుడు, అత్రి, జమదగ్ని, గౌతముడు, విశ్వామిత్రుడు, భరద్వాజుడు ఈ ఏడుగురు సప్తర్షులు. ఇక్ష్వాకువు, నృగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, రిష్టుడు, కరూషుడు, పృషధ్రుడు అను ఈ తొమ్మండుగురు వైవస్వత మనుపుత్రులు. మిక్కిలి ధార్మికులు. సాటిలేనిదియు, సత్త్వగుణ ప్రధానము అగు విష్ణుశక్తి (అంశము), అన్ని మన్వంతరము లందును సర్వజగద్రక్షకముగా యజ్ఞాదిదేవతా రూపమున ఉండును. దానికి విష్ణ్వంశముతోనే స్వాయంభువ మన్వంతరమున యజ్ఞము పుట్టినది. ప్రథమ మన్వంతరమున ఆకూతికి మానస దేవుడు పుట్టెను. ఆతడు స్వారోచిష మన్వంతరమున తుషితయందు పుట్టి తుషితులతో అజయుడై ఉండెను.

ఉత్తమ మన్వంతరమున ఆ తుషితుడే సత్యయందు సత్యదేవతలలో సత్యుడను పేరున పుట్టెను. తామసమన్వంతరమునందు హర్యయందు హరులతో కూడ హరియే పుట్టెను. రైవత మన్వంతరమునందు ఆతడే (విష్ణువే) సంభూతియందు మానసుడుగా విష్ణువే దేవతలతో పుట్టెను.

చాక్షుష మన్వంతరమున, పురుషోత్తముడగు వైకుంఠవాసి వికుంఠయందు వైకుంఠ దేవతలలోగూడ పుట్టెను. ఈ వైవస్వత మన్వంతరమున విష్ణువు కాశ్యపుని వలన అదితి యందు వామనుడుగ పుట్టెను. ఆ మహానుభావుడు మూడడుగులచే మూడు లోకములను ఆక్రమించి, నిష్కంటకముచేసి ఇంద్రునకు ఇచ్చెను. ఈ రీతిగా సప్తమన్వంతరములందును ఆ మహావిష్ణుశరీరములే పుట్టి ప్రజాభివృద్ధిని చేసినవి. ఈ ప్రపంచమంతయు ఆతని శక్తిచే ప్రవిష్టమై ఉన్నది. (విశతి: ప్రవిశతి, ప్రపంచమితి) ప్రపంచమందు ప్రవేశించినవాడు కావున విష్ణువను పేరు. కావున సమస్త దేవతలు మనువులు సప్తర్షులు మనుపుత్రులు దేవేంద్రులు వీరందరు విష్ణుదేవుని విభూతులే.

సావర్ణ్యాది మనువుల ఉత్పత్తి

మైత్రేయుడు ఇట్లు పలికెను:

మీచే సప్త మన్వంతరములు చెప్పబడినవి. రాబోవు మన్వంతరములను నాకు చెప్పుదురుగాక!

శ్రీ పరాశరుడు ఇట్లు చెప్పెను:

సూర్యుని భార్య సంజ్ఞాదేవి. ఆమె విశ్వకర్మ యొక్క పుత్రిక. ఆమె సంతతి మనువు, యముడు, యామి. ఆమె భర్త యొక్క తేజస్సును సహించలేక తనవంటి యొక స్త్రీ అయిన తన ఛాయను భర్త శుశ్రూషార్థమై నియోగించి తపస్సు కొఱకై తాను అరణ్యమునకు ఏగెను.

సూర్యుడు ఆమెను సంజ్ఞాదేవిగనే ఎంచి, ఆమెయందు శనైశ్వరుడు, (మఱియొక) మనువు అను పుత్రులను, తపతి అను కన్యను సంతతిగ పొందెను. ఛాయ తన సంతతియందు పక్షపాతముండుటచే కొనిసి పాదముతో తన్నబోయిన యమునకు “నీ పాదము పడిపోవు గాక!” అని శాపమిచ్చెను. దానివలన ఈమె సంజ్ఞాదేవి కాదు మరియొక స్త్రీ అను భావము యమునకు, తండ్రియగు సూర్యునకు కలిగెను. వెంటనే సూర్యుడు నీవెవరో చెప్పుమని నిర్భంధించగా, నేను సంజ్ఞాదేవియొక్క ఛాయను. సంజ్ఞ ఉత్తరకురు దేశారణ్యమున బడబారూపమున తపస్సు చేయుచున్నదని తెలిపెను. సూర్యుడు సమాధి దృష్టితో ఆమెను వాజి (గుఱ్ఱము) రూపమున తపస్సులో ఉన్నట్లు గాంచి తానుకూడ వాజి రూపధరుడై, ఆమెయందు అశ్వినీ కుమారులను దైవంతుని కనెను. సంజ్ఞను స్వస్థానమునకు కొనివచ్చెను.

విశ్వకర్మ సూర్యుని తరణి(సాన) పట్టి ఎనిమిదవ భాగమును తగ్గింపగా, వైష్ణవ అంశమగు ఆ భాగము ప్రకాశించుచు క్రింద పడెను. ఆ తేజస్సుతో త్వష్టయే విష్ణు చక్రమును, శివుని త్రిశూలమును, కుబేరుని పుష్పక విమానమును, కుమారస్వామి యొక్క శక్తి అను ఆయుధమును, ఇతరదేవతల ఆయుధమును రచించెను.

ఛాయా సంజ్ఞాపుత్రుడగు ద్వితీయమనువు లోగడపుట్టిన మనువునకు సవర్ణుడు కాన సావర్ణి అని చెప్పబడెను. కావున ఈ ఎనిమిదవ మన్వంతరము సావర్ణిక మన్వంతరము అని చెప్పబడును. భవిష్యత్ మన్వంతరములను చెప్పెద వినుము. రాబోవు మనువు సావర్ణి. దేవతలు మిక్కిలి తపస్వులు. మహాదీప్తిమంతులు. వారిగణములలో ఒక్కొక్క గణమునకు ఇరువదిమంది కలరు. దీప్తిమంతుడు గాలవుడు, రాముడు, కృపుడు, ద్రోణి నా పుత్రుడగు వ్యాసుడు, ఋష్యశృంగుడు, సప్తర్షులు. విష్ణు దేవుని అనుగ్రహమున పాతాలాంతరగతుడు విరోచనుని కుమారుడగు బలి ఇంద్రుడు కాగలడు. విరజస్కుడు, ఉత్వరీవంతుడు, నిర్మోకుడు మున్నగువారు సావర్ణి పుత్రులు మనుజేశ్వరులు.

తొమ్మిదవ మన్వంతరమున దక్షసావర్ణి మనువు కాగలడు. పారులు, మరీచి గర్భులు, సుధర్ములు అనుమూడు గణములవారు దేవతలు. ఒక్కొక్క గణమునందు పన్నిద్దరు కలరు. మహావీరుడగు అద్భుతుడు అనువాడు వారికి దేవేంద్రుడు, సవనుడు, ద్యుతిమంతుడు, భవ్యుడు, వసువు, మేధాతిథి, జ్యోతిష్మంతుడు, సత్యుడు వీరు సప్తర్షులు. ధృతకేతువు, దీపకేతువు, పంచహస్తుడు, నిరామయుడు, పృధుశ్రవుడు మున్నగువారు దక్షసావర్ణి పుత్రులు. పదవ మన్వంతరమున బ్రహ్మసావర్ణి మనువు. సుధాములు విశుద్ధులు నూరుగురు దేవతలు. శాంతి అనువాడు ఇంద్రుడు కాగలడు. హవిష్మంతుడు, సుకృతుడు, సత్వుడు, తపోమూర్తి, నాభాగుడు, అప్రతిమేజుడు, సత్యకేతువు సప్తర్షులు. సుక్షేత్రుడు, ఉత్తమౌజుడు, భూరిషేణుడు మున్నగు వారు పదిమంది బ్రహ్మసావర్ణి పుత్రులు భూమిని రక్షింతురు.

పదునొకండవ మన్వంతరమున ధర్మసావర్ణిమనువు కాగలడు. విహంగములు, వామగములు నిర్వాణులు, ఋషులు అను గణములు కాబోవు దేవతలలో ముఖ్యులు. ఒక్కొక్క గణములో ముప్పదిమంది ఉందురు. పృషుడు, దేవేంద్రుడు, నిశ్ఛరుడు, అగ్నితేజుడు, వపుష్మంతుడు, ఘృణి, ఆరుణి, హవిష్మంతుడు, అనఘుడు అనువారు కాబోవు సప్తర్షులు, ధర్మసావర్ణి మనువుపుత్రులు సర్వత్రగుడు సుధర్ముడు దేవానీకాదులు భూపతులు.

ద్వాదశ మనువు రుద్రపుత్రుడగు సావర్ణి. ఋతుధాముడు దేవేంద్రుడు. హరితులు, రోహితులు, సుమనసులు, సుకర్ములు, సురాపులు అను అయిదు గణములు. ఒక్కొక్క గణమున పదిమంది చొప్పున దేవతలు. తపస్వి, సుతపుడు, తపోమూర్తి, తపోరతి, తపోధృతి, ద్యుతి, తపోధనుడు అను సప్తర్షులు. దేవవంతుడు, ఉపదేవుడు, దేవశ్రేష్ఠుడు మున్నగు మహావీర్యులగు మహారాజులు ఆ మనువు పుత్రులు.

పదమూడవ మనువు రుచి అనువాడు కాగలడు. సుత్రాములు, సుకర్ములు, సుధర్ములు అను ముప్పదిమూడు భేదములు గలగణములు దేవతలు. మహావీర్యవంతుడగు దివస్పతి వారలకు ఇంద్రుడు. చిత్రసేనుడు, విచిత్రుడు మున్నగు భూపతులు వారి పుత్రులు.

పదునాల్గవ మనువు భౌముడు. ఇంద్రుడు శుచి అనువాడు. దేవతలు అయిదు గణములు. చాక్షుషులు, పవిత్రులు, కనిష్ఠులు, భ్రాజములు, వాచావృద్ధులు అనుగణములు. సప్తర్షులు-అగ్ని బాహువు, శుచి, శుక్రుడు, మగధుడు, అగ్నీధ్రుడు, యుక్తుడు, జితుడు అనువారు ఊరువు గంభీరబుద్ధి మున్నగువారు మనుపుత్రులైన రాజులు భూమిని పాలింతురు.

నాల్గవ యుగాంతమునందు వేదముల అధ్యయన అభావముచే విప్లవము (నాశనము)  కలుగును. కృతయుగాదియందు దివమునుండి సప్తర్షులేతెంచి యుత్సన్న ప్రాయములైన వేదములను అధ్యాపనాదులచే ప్రవర్తింప చేయుదురు. ప్రతికృతయుగా రంభమునందు మనువు స్మృతిప్రణేత అగును. ఆ మన్వంతరదేవతలు మన్వంతర సమాప్తి వరకు యజ్ఞభోక్తలుగ ఉందురు. ఆ మనుపుత్రులు భూపాలకులుగ ఉందురు. ఇట్లు మనువు, సప్తర్షులు దేవతలు భూపాలకులగు మనుపుత్రులు, ఇంద్రుడు అను వీరు అధికారిక పురుషులుగా ఆ మన్వంతరమున ఏర్పడుదురు.

పదునాల్గుమన్వంతరములు గతింపగా, సహస్రయుగ పరిమితమగు కల్పము పూర్తి అగును. అటుపిమ్మట అంతపరిమాణముగల రాత్రి ఏర్పడును. సర్వేశ్వరుడు బ్రహ్మరూపధరుడై, జలప్రళయమునందు నారాయణ రూపమున శేషతల్పమునందు శయనించును. ముల్లోకములనెల్ల తన గర్భమునందు ఇముడ్చుకొని సర్వభూత రూపుడైన జనార్దనుడు స్వీయమాయ (యోగనిద్ర) యందుండును. ఆవ్యయాత్మ అగు భగవంతుడు కల్పకల్పమునందు తిరిగి మేల్కాంచినవాడై, రజోగుణ ప్రధానుడై యథాపూర్వముగ సృష్టిని చేయుచుండును. మనువులు రాజులు ఇంద్రుడు దేవతలు సప్తర్షులు వీరందరు జగత్తు యొక్క స్థితి (ఉనికి)కి కారణమగు భగవంతుని సాత్త్వికాంశములు, సాత్త్వికతనువు నాలుగు యుగములందును విష్ణుదేవుడు లోకస్థితిలో నిమగ్నుడై, యుగవ్యవస్థను చేయుచుండును. ఎట్లనగా.....

కృతయుగము నందు సర్వభూతరూపుడగు నారాయణుడు సర్వభూత హతార్థియై కపిలముని మొదలగువారి రూపములను ధరించి తత్త్వజ్ఞానమును గ్రహించును. ఆ ప్రభువే త్రేతాయుగమునందును చక్రవర్తి స్వరూపమున, దుష్ట నిగ్రహముచేయుచు, జగత్త్రయముల పరిపాలించును. వేదవ్యాస రూపమును ధరించి ఆ ప్రభువే ఒక వేదమును యుగభేదముచే నాలుగు భేదములతో ఒప్పుదానిని శాఖాశతములచే విస్తరింపచేయును. ద్వాపర యుగమున వేదవిభాగమును ఆ వ్యాసుడే చేయును. కలియుగ అంతమున అ శ్రీహరియే కలికి రూపధారియై దుష్టులను సన్మార్గమున పెట్టును.

ఈ విధముగ ఎల్లప్పుడు సమస్త ప్రపంచమును సృజించును. పాలించును. హరించును. అంతకాలమున అనంతుడుగా ఆ శ్రీహరి ఉండును. కావున గతించినది గాని వర్తమానమున ఉన్నదిగాని, రాబోవునదిగాని, ఈ సమస్తమును సర్వభూతమయుడగు ఆ పరమాత్మకంటె భిన్నముకాదు. మైత్రేయా! నీకు ఆ పరమాత్మయొక్క సద్భావమే ఈ ప్రకరణమున గాని మఱియొక ప్రకరణమునగాని నాచే చెప్పబడినది. మన్వంతరములు తదధిపతులు కూడ నీకు నాచే సమగ్రముగ చెప్పబడిరి. ఇంకేమి చెప్పుమందువు?  

వేదవ్యాస చరిత్ర

మైత్రేయుడు పరాశరునితో:

“భగవన్! సర్వ ప్రపంచము విష్ణువేకాని వేరుగాడు. ఇదంతయు విష్ణువునందే స్థితి, లయములు పొందుచున్నది. విష్ణువు కంటే వేరొకటి లేదు. అను విషయములను నీవలన నేను తెలిసికొంటిని. ఈ విషయమును వినగోరుచున్నాను. అదేమి అనగా-అ విష్ణువే వేదవ్యాస రూపమున వేదమును యుగయుగమున విభజించెనుగదా! ఏ యే యుగమందు ఏ ఏ రూపముదాల్చెనో తెలుపుము. వేద శాఖా భేదములను గూడ తెలుపుదువుగాక!” అని ప్రార్థించగా అతని కోరికను మన్నించి.

పరాశరుడు: మైత్రేయా! వేదమనెడి వృక్షమునకు శాఖలు వేలకొలది కలవు. వాని విస్తృతిని చెప్పనలవి కాదు. కావున సంగ్రహముగ వినుము. మహామునీ! ప్రతి ద్వాపరయుగమునను శ్రీ మహావిష్ణువు వ్యాసరూపధారియై జగత్తు యొక్క హితమును కోరి ఒక వేదమును అనేక భాగములు చేయును. మనుష్యుల యొక్క వీర్యము అనగా ఉత్సాహము, తేజస్సు అనగా తపోయోగాది జనిత ప్రభావము, బలము అనగా ధారణాశక్తియు, అల్పములని గుర్తించి సర్వభూతముల హితము కొఱకు వేద విభాగమును ఆ వేదవ్యాసుడు చేయుచుండును. ఒక్కొక్క వేదమును ఇట్లు విభజించుచున్న ఆ వేదవ్యాస మూర్తి మధుసూదనుని మూర్తియే. ఏ మన్వంతరమున ఏయే వ్యాసులు జనించి, వేదశాఖా భేదములను ఎట్లు గావించిరో వినుము:

వైవస్వత మన్వంతరమందలి ద్వాపర యుగములందు మహర్షులచే వేదము ఇరువది ఎనిమిది పర్యాయములు విభక్తమైనది. ఇరువది ఎనమండుగురు వేద వ్యాసులు గతించినారు. వారిచే ద్వాపర యుగములందు వేదము నాలుగు భాగములుగ అనేక పర్యాయములు చేయబడినది.

వేద విభాగీకరణము - భిన్న వ్యాసులు:

ప్రథమ ద్వాపరయుగము నందు స్వయంభువుని (బ్రహ్మ)చే వేదవిభాగము చేయబడెను. రెండవ ద్వాపరమున ప్రజాపతి మనువు వేదవ్యాసుడాయెను. తృతీయ ద్వాపరమున సుశనుడు (శుక్రుడు)ను, చతుర్ధ ద్వాపరమున బృహస్పతియు, పంచమ ద్వాపరమున సవిత (సూర్యుడు)యు, షష్ఠ ద్వాపరమున మృత్యుదేవతయు, సప్తమ ద్వాపరమున ఇంద్రుడును, అష్టమ ద్వాపరమున వసిష్ఠుడును, నవమ ద్వాపరమున సారస్వతుడు అనగా బ్రహ్మయు, దశమ ద్వాపరమున త్రిధాముడు (విష్ణువు)ను ఏకాదశ ద్వాపరమున త్రిశిఖుడు, ద్వాదశ ద్వాపరమున భరద్వాజుడు, త్రయోదశ ద్వాపరమున అంతరిక్షుడు, చతుర్దశ ద్వాపరమున వర్ణియు, పంచదశ ద్వాపరమున త్రయ్యారుణియు, షోడశ ద్వాపరమున ధనంజయుడును, సప్తదశ ద్వాపరమున ఋతుంజయుడును, అష్టాదశ ద్వాపరమున జయుడును, తరువాత భరద్వాజుడు, గౌతముడు, హర్యాత్మ, వాజశ్రముని, సోమ శుష్కాయణుడు, తృణబిందువు, ఋక్షుడు, భార్గవుడు, వాల్మీకి, వాని తరువాత మా తండ్రియగు శక్తియు, తరువాత నేను (పరాశరుడు), జాతవర్ణుడు, కృష్ణ ద్వైపాయనుడు వ్యాసులైరి. పూర్వపు వేదవ్యాసులగు వీరు ఇరువది ఎనమండ్రుగురు. ద్వాపరాదులందు వీరిచే ఒక వేదము నాలుగుగ చేయబడినది. రాబోవు ద్వాపరమున కృష్ణ ద్వైపాయనుని అనంతరము ద్రోణపుత్రుడగు అశ్వత్థామ వ్యాసుడు కాగలడు.

వేదము విభక్తమైనను వికారరహితమయి స్థిరముగ ఉన్న ‘ఓం’ అను ఏకాక్షర రూపమగు బ్రహ్మ గొప్పది అగుట వలన, పెంపొందించునది అగుట చేతను, బ్రహ్మ అనబడును. భూః భువః స్వః అను వ్యాహృతి త్రయమును కారణ అవస్థయందు అంతర్గతము చేసికొని ఉండుటచే బృహత్పదార్థ మగుటచేతను, కార్యావస్థయందు వ్యాహృతి వేదరూపమున పరిణమించుట చేతను, బృహత్వ, బృంహణములచే బ్రహ్మ అనబడుచున్నది. జగత్తుయొక్క ప్రళయోత్పత్తులందు కారణ రూపమై మహత్తత్త్వము కంటె పరమై, గుహ్యమైన ఏ ప్రధానము కలదో, తద్రూపమగు బ్రహ్మకు నమస్కారము. ప్రధానము నుండియే జగత్తుపుట్టి అందే లయించుటచే ప్రధానము అనగా ప్రకృతి జగత్తు యొక్క ప్రళయ ఉత్పత్తులకు కారణమందురు. అట్లు కారణమైన ప్రధాన తాదాత్మ్య రూపమున ప్రణవమును స్తుతించుచున్నాడని భావము.

ఆ తత్త్వము అగాధము-అనగా అది లేనిది. అపారము అనగా సర్వగతము నాశరహితమునై తమోగుణ కార్యమగు అజ్ఞానముచే పాపులకు మోహము కలిగించును. సత్వగుణ కార్యమగు ప్రకాశముచే జ్ఞానజననముచేతను రజోగుణ కార్యమగు ప్రవృత్తిచే కర్మోత్పాదన చేయుట చేతను పురుషార్థ సాధనమగును. భోగసాధనమగును. సాంఖ్యులకు అనగా మూలప్రకృత్యుపాసకులకు ప్రకృతి పురుష వివేకమును కలిగించునదగుటచే అదియే ప్రాప్యస్థానము. అంతరింద్రియ, బహిరింద్రియముల ఉపరమమే స్వభావముగాగల యోగులకు శమాది ప్రాప్తికి ఉపాయమగుటచే ప్రాప్యము. అప్రధానము ఇంద్రియ గోచరము కానిది, నాశరహితము. ప్రవృత్తి రూపము. ఎల్లపుడు సంకోచ వికాసములచే ఉండునది. ఉపనిషత్తులందు ప్రధానము స్వతస్సిద్ధమని అవిద్యాంతర్గతము భేదరహితము ప్రకాశవంతమని అపక్షయాశూన్యమని అనేకరీతులుగ చెప్పబడును. పరమాత్మరూపుడగు వాసుదేవరూపుడగు ఆ పరమాత్మకు నమస్కారము. ఈ ప్రణవరూప బ్రహ్మ అకారోకారమకార రూపావయవ భేదముచే మూడుగ ఉన్నది. అవియే విరూపమున అభిన్నము. ఈ ప్రణవరూప బ్రహ్మమే వాసుదేవుడు. సర్వభూతములందు ఆత్మ రూపుడుగ ఉన్నను భేదరహితుడు. తనయందు కల్పితములైన భిన్నమూర్తులచే భిన్నుడుగ గ్రహింపబడును. ఆ పరమాత్మయే ఋగ్యజుస్సామవేదమయుడు. తత్సారభూతమైన శరీరధారుల ఆత్మ రూపుడు. వేదమయుడు, అభిన్నుడు అయిన ఆ పరమాత్మయే శాఖా ప్రణీతయగు వ్యాసాది రూపము ధరించి వేద విభాగముచేయును. అట్లుచేయు అతడు సమస్త వేదశాఖ జ్ఞాన స్వరూపుడు అసంగుడు అగు భగవంతుడే.

ఋగ్వేదశాఖా భేదనిరూపణము

శ్రీ పరాశరుడు చెప్పుచున్నాడు:

సృష్టి ప్రారంభమున చతుర్ముఖ బ్రహ్మచే అవిభక్తముగ పరితమైన వేదము నాల్గు భాగముల (ఋగ్యజుస్సామాధర్వణము) తోను అనంత శాఖలతోను నిండియున్నది. ఆవేదముచే బోధింపబడిన యజ్ఞములు పది విధములుగ నున్నవి.

1. అగ్నిహోత్రము, 2. దర్శపూర్ణమాస్యలు, 3. చాతుర్మాస్యలు, 4. పశుబంధము, 5. సోమము అని అయిదు. వైతానిక యజ్ఞములు 1. దేవయజ్ఞము, 2. పితృయజ్ఞము, 3. భూతయజ్ఞము, 4. మనుష్యయజ్ఞము, 5. బ్రహ్మ అని యజ్ఞము అయిదు యజ్ఞములు గృహమునందు జరుపుకొనునవి. మొత్తము పది. ఈ యజ్ఞములు సమస్త కోరికలను పూరించగలవు. ఇరువది ఎనిమిదవ మన్వంతరమున నాకుమారుడు వేదవ్యాసునిచే నాలుగు పాదములతో కూడిన ఒక వేదము ఋగాది చతుర్విధముగ ఎట్లు విభజింపబడెనో అట్లే నాచేతనుగూడ విభజింపబడినవి. ఈ విధముగ సమస్త చతుర్యుగము లందు వేద పారగులచే వేదశాఖా భేదములు పఠింపబడినట్లు తెలిసికొనుము. కృష్ణ ద్వైపాయన వ్యాసుని అవతార మూర్తియగు నారాయణునిగా తెలిసికొనుము. తదితరుడు ఎవ్వడు మహాభారతకర్త కాగలడు?

బ్రహ్మచే వేదవ్యాసుడు వేద విభాగీకరణమునకు ప్రేరితుడై, వేదపారంగతులైన నల్గురుశిష్యులను స్వీకరించెను. అందు పైలుని ఋగ్వేద పాఠకునిగను వైశంపాయనుడను వానిని యజుర్వేద పాఠకునిగను జైమినిని సామవేదపాఠకునిగను సుమంతుని అధర్వవేద పాఠకునిగను చేసెను. మహాబుద్ధిశాలియగు రోమహర్షణుడు అను శిష్యుని ఇతిహాస పురాణ ప్రవక్తయగు సూతునిగ గ్రహించెను.

ఒకే విధమగు యజుర్వేదమును విభజింపగా చతుర్భేదము ఆయెను. అందు చాతుర్హోత్రము ఉండెను. అనగా నాలుగు ఋత్విక్కులను చతుర్హోతలు అందురు. ఆ నలుగురు చేయు కర్మకు చాతుర్హోత్రమని పేరు. దానిచే యజ్ఞమును కల్పించెను. యజుస్సులచే అధ్వర్యుడు చేయు కర్మకు ఆధ్వర్యవమని పేరు. ఋక్కులతో హోతచేయు కర్మకు హౌత్రమని పేరు. ఉద్గాత సామలతోచేయు కృత్యమునకు జౌద్గాత్రమని పేరు. అధర్వ మంత్రములతో బ్రహ్మ చేయు కృత్యమునకు అధ్వర్వణమని పేరు. అందలి ఋక్కులతో ఋగ్వేదమును, యజుస్సులతో యజుర్వేదమును, సామలతో సామవేదమును, అధర్వ ఋక్కులతో రాజులను సర్వకర్మలను చేయించి, బ్రహ్మత్వమును, శాస్త్రమర్యాదను అనుసరించి కల్పించెను. ఈ విధముగ ఒక వేదము వృక్షపృధక్కృతమై నాలుగు విధములై వేదారణ్యము అయ్యెను.

పైలుడు ఋగ్వేద వృక్షమును ముందుగా విభజించెను. రెండుగా విభజించిన ఆ ఋగ్వేదసంహితలను ఇంద్రప్రమితికి, బాష్కలునకు ఇచ్చెను. భాష్కలుడు చతుర్విధముగ విభజించి సంహితను తన శిష్యులగు బోధ్యాదులకు ఇచ్చెను. బోధ్యాది అగ్నిమాడకులు యాజ్ఞవల్క్య పరాశరులు బాష్కలశాఖ యొక్క ప్రతి (అవాంతర) శాఖలను గ్రహించిరి. ఇంద్రప్రమితి ఒక సంహితను, తన పుత్రుడగు మాండుకేయునకు చెప్పెను; వాని శిష్య ప్రశిష్యులకు, పుత్రశిష్యక్రమమున అది చేరెను.

వేదమిత్రుడగు (బ్రహ్మచారి) శాకల్యుడు ఆ ఇంద్ర ప్రమిత సంహిత అధ్యయనము చేసి, పంచసంహితలుగా విభజించి తన శిష్యులగు ముద్గలాదులకు ఒసంగెను. వారి నామధేయములు ముద్గలుడు, గోముఖుడు, వాత్స్యుడు, శాలీయుడు, శరీరుడు. శరీరుడు మహా బుద్ధిమంతుడు. మఱి ఒకడగు శాకపూర్ణ శావల్యుడు, ఆ ఇంద్రప్రమితి సంహితను మూడు సంహితలుగచేసి, క్రౌంచ వైతాళిక బలాక నిరుత్తులకు ఇచ్చెను. వేద శబ్ద నిర్వచన రూపమగు నిరుక్తము అను వేదాంగమును రచించి వేదవేదాంగ పారగుడగు నిరుక్తునకు ఇచ్చెను. ఇట్లు ప్రతి శాఖల నుండి అనుశాఖ లేర్పడెను. బాష్కలుడు మఱియొక మూడు శాఖలనుచేసి శిష్యులగు వాలాయని, గార్గ్యుడు, తధాజపుడు, అనువారలకు ఇచ్చెను. వీరందఱిచేత ప్రవర్తితములైన సంహితలకు బృహ్వృచ ఋగ్వేద సంహిత అని పేరు.

శుక్ల కృష్ణ యజుర్వేదశాఖా వివరణము

శ్రీ పరాశరుడు ఇట్లు అనియె:

యజుర్వేద వృక్షశాఖలు ప్రధానమైనవి ఇరువది ఏడుగ వ్యాసశిష్యుడగు వైశంపాయనుడు రచించి, శిష్యులకు ఇవ్వగా, వారు గ్రహించిరి. అందు బ్రహ్మరాతుని సుతుడగు యాజ్ఞవల్క్యుడు ఒకడు. అతడు మిక్కిలి ధర్మమెఱిగిన వాడు. గురువృత్తియందు ఆసక్తి గలదు. మహామేరువునుండి ఋషిసంఘముతో వచ్చు ఋషికి ఏడు రాత్రులలో బ్రహ్మహత్యా దోషము వాటిల్లగలదు. పూర్వముముని గణము చేసిన ఈశపథమును వైశంపాయనుడు అతిక్రమించెను. తన సోదరీపుత్రుని కాలితో తాకి చంపెను. అటుపై తన శిష్యులతో ఇట్లనెను. “శిష్యులారా! బ్రహ్మహత్యాదోషమును హరించునట్టి వ్రతమును నానిమిత్తమై అందఱు చేయుదురుగాక! ఆలోచనవలదు” అనగా యాజ్ఞవల్యుడు ఇట్లనెను. “భగవంతుడా! వీరినేల క్లేశపెట్టవలెను. అల్పతేజస్కులగు వీరందఱు ఎందులకు? నేను చేసెదననగా గురువగు వైశంపాయనుడు కోపించి బ్రాహ్మణులను అవమానించు నీవు నావద్ద అధ్యయనము చేసిన భాగమును కక్కివేయుము. బ్రాహ్మణ శ్రేష్టులగు వీరిని నిస్తేజస్సులుగా చెప్పుచున్నావు. అట్టి శిష్యుడు నాకేల? నా ఆజ్ఞను ఉల్లంఘించితివి అనెను. యాజ్ఞవల్క్యుడు”-భక్తితోనే నేను చెప్పితిని. నీ చదువు నాకు అక్కరలేదు” అని పలికి రక్తసిక్తములై రూపముదాల్చిన యజుస్సులను వమనముచేసి ఇచ్చి యాజ్ఞవల్క్యుడు చనెను. యాజ్ఞవల్క్య మహాముని కక్కిన యజుస్సులను ఆ శిష్యులు తిత్తిరిపక్షులుగా అయి స్వీకరించిరి. అందువలన వానికి తైత్తిరీయములని పేరుకల్గెను. గురుప్రేరితులై బ్రహ్మహత్యా వ్రతమును ఆచరించిరి. అట్లు ఆచరించి, యజుర్వేద అధ్యయన మొనరించిరి. యాజ్ఞవల్క్యుడును ప్రాణాయామపరాయణుడై నియమమున యజుర్వేదమును అపేక్షించి ఇట్లు సూర్యుని స్తుతించెను.

యాజ్ఞవల్క్యకృత సూర్యస్తుతి

నమస్సవిత్రేద్వారాయము క్తేరమితతతేజసే

ఋగ్యజుస్సామభూతాయత్రయీధామ్నే చతేనమః

నమోఽగ్నీషోమభూతాయజగతః కారణాత్మనే

భాస్కరాయపరంతేజస్సౌ షుమ్మరుచిబిభ్రతే

 కలాకాష్ఠానిమేషాది కాలజ్ఞానాత్మనే నమః

ధ్యేయాయవిశ్వరూపాయ పరమాక్షర రూపిణే

బిభశ్మిర్తి యస్సురగణానాప్యాయేన్దుంస్వరశ్మిభిః

స్వధామృతేనచపితౄం స్తస్మైధృత్యాత్మనే నమః

హిమామ్బుఘర్మవృష్టీనాం కర్తా హర్తాచయః ప్రభుః

తస్మైత్రికాలభూతాయ నమస్సూర్యాయ వేదసే  

అపహన్తితమోయశ్చజగతోఽస్యగతిత్పతిః

సత్త్వధామధరోదేవో నమస్తస్మై వివస్వతే

సత్కర్మయోగ్యోనజనోనై వాపశ్మౌచకారణమ్

యస్మిన్మనుదితేతస్మై నమోదేవాయభాస్వతే

స్పృష్టోయదంశుభిర్లోకః క్రియాయోగ్యోఽభిజాయతే

పవిత్రకారణాత్మాయ స్తస్మై శుద్ధాత్మానేనమః

సమస్స విత్రేసూర్యాయ భాస్కరాయ వివస్వతే

ఆదిత్యాయాదిభూతాయ దేవాదీనాం నమోనమః

హిరణ్మయంరథం యస్య కేతవోఽమృతవాజినః

వవాన్తి భువనాలోక దక్షా షంతం నమామ్యహమ్

శ్రీ పరాశర ఉవాచ:

ఇత్యేవమాదిభి స్తేవ స్తూయమానస్సవై రవిః

వాజిరూపధరః ప్రాహవ్రియతామితివాఞ్ఛితమ్

యాజ్ఞవల్క్య స్తదా ప్రాహప్రణిపత్య దివాకరమ్

యజూంషితాని మేదేహియానిస న్తినమేగురౌ

సృష్టికర్తవు మోక్షద్వారమవు, అమిత తేజస్వివి. ఋగ్యజుస్సామ వేదరూపుడవు. వేదత్రయాత్మక దీప్తియుక్తుడవు అగు సూర్యా! నీకు నమస్కారము. ఆతప వర్షహేతువగుటచే అగ్నిష్టోమరూపుడవు కనుకనే కారణరూపుడవు. తేజఃకారకుడవు చంద్రునికి పుష్టిని కలిగించు తేజస్సును ధరించినవాడవును కూడా. కలాకాష్టాది కాలజ్ఞాన రూపుడవును, ధ్యానింపదగినవాడవును, వ్యాపకుడవును, పరబ్రహ్మస్వరూపుడవును, ప్రణవరూపుడవు, అగు నీకు నమస్కారము. తన కిరణములచే చంద్రుని తృప్తిపఱచుచు, ఆ చంద్రునిద్వారా దేవతలను, స్వధామృతముతో పితృదేవతలను తృప్తిపఱచుచున్న తృప్తిరూపుడవగు నీకు నమస్కారము. మంచు, నీరు, తాపము, రంగులకు కర్తయై, ప్రపంచమును భరించువాడవు కనుకనే హేమంతవర్ష గ్రీష్మ రూపుడును సృష్టికర్తయునగు సూర్యునకు నమస్కారము. తేజస్సును ధరించి జగత్పతియై లోకములోని అంధకారమును నిర్మూలనముచేయు సూర్యునకు నమస్కారము. ఏ సూర్యుడు ఉదయించనిదే నరుడు సత్కర్మాచరణ యోగ్యుడుకాడో, నీరు పవిత్రతను కలిగింపజాలదో, అట్టి సూర్య దేవునకు నమస్కారము.

ఎవని కిరణములు సోకినంతనే లోకము కార్యాచరణయోగ్యము అగునో, అట్టి పవిత్రతకు కారణమైన శుద్ధాత్ముడగు సూర్యునకు నమస్కారము. ప్రేరకుడును జనకుడును తమోవినాశకుడును, అదితిసంతతియగు దేవాదులకు ఆదిభూతుడును అగు భాస్కరునకు నమస్కారము. రమణీయ తేజోమయమైన ఎవ్వని రథమును నిత్యములైన ఛందో రూపాశ్వములు వహించుచున్నవో, లోకమునకు నేత్రభూతు (జగచ్చక్షువు)డైన సూర్యునకు నమస్కరింతును అని ఈ విధముగ స్తుతించిన యాజ్ఞవల్క్యునకు సూర్యుడు అశ్వరూపమున వచ్చి వరము కోరుకొనుమనెను. యాజ్ఞవల్క్యుడు సూర్యునకు నమస్కరించి ఇట్లడిగెను. “మా గురువగు వైశంపాయను వద్దలేని యజుర్వేదమును నాకు అనుగ్రహింపుము” అనెను. అని చెప్పి ఇంకను పరాశరుడు ఇట్లు పలికెను. “ఇట్లు అడిగిన యాజ్ఞవల్క్యునకు సూర్య భగవానుడు అయాత యామములు (నిలువ యున్నవి) కానివియు, వైశంపాయడును ఎఱుగనివియు అగు యజుర్వేద భాగములను అనుగ్రహించెను. ఆభాగములను అధ్యయనము చేసిన బ్రాహ్మణులు వాజులు (అశ్వములు)గ చెప్పబడుదురు. సూర్యుడుకూడ వాజి(అశ్వ)రూపమును ధరించెను గదా! ఆవాజుల యొక్క శాఖలు పదునైదుగలవు. కాణ్వాదులు యాజ్ఞవల్క్యులుగ చెప్పబడుదురు.

సామశాఖ పురాణ వివరణము

శ్రీ పరాశరముడు ఇట్లు పలికెను:

సామవేదము అనెడి వృక్షము యొక్క శాఖలను వ్యాసశిష్యుడగు జైమిని మహర్షి క్రమముగా విభజించిన రీతిని చెప్పెదను వినుము. జైమిని పుత్రుడు సుమంతుడు. సుత్వానుడు సుమంతుని కుమారుడు. వీరిరువురు తమతమ తండ్రుల వద్ద ఒక్కక్క సంహితను అధ్యయనముచేసిరి. సుత్వానుని కుమారుడు సుకర్మ కూడ తన తండ్రివద్ద అధ్యయనము చేసి సహస్ర సంహితా విభాగము చేసెను. ఆ విభాగమును సుకర్మ శిష్యులగు కోసల దేశీయులైన హిరణ్యనాభుడు, పౌష్పింజియు గ్రహించిరి. పౌష్పింజికి ఉత్తర దేశీయులగు అయిదు వందలమంది సామగానము చేయువారు శిష్యులుండిరి. హిరణ్యనాభునకు కూడ అంతమంది శిష్యులు. వారిని పండితులు ప్రాచ్య సామగులు అందురు. లోకాక్షి, కౌముదిక క్షీవాన్, లాంగలి అను పౌష్పింజి శిష్యులు అనేక సంహితలను శిష్యప్రశిష్యులతో వ్యాప్తిచేసిరి. హిరణ్యనాభుని శిష్యుడు కృతనామముని తన శిష్యులకు ఇరువది నాలుగు సంహితలను చెప్పెను. వారిచేత ఈ సామవేదము బహుశాఖలుగా విస్తరింపబడినది.

ఇక అధర్వవేద సంహితల సముదాయమును చెప్పెదను. మహాతేజస్వీయగు వ్యాసశిష్యుడగు సుమంతుడు, కబంధుడుఅను శిష్యునకు అధర్వవేదమును చెప్పెను. అతడు దానిని రెండుగా చేసి తన శిష్యులగు దేవశర్మకు పథ్యునకు ఇచ్చెను. దేవశర్మ శిష్యులు మేధ, బ్రహ్మబలి, శౌల్కాయని, పిప్పలాదుడు అని నలుగురు. పథ్యుని శిష్యులు మువ్వురు. జాబాలి, సుముదాది, శౌనకుడు. శౌనకుడు సంహితలను రెండుగ విభజించి ఒక దానిని ప్రభువునకు ఇచ్చెను. రెండవ సంహితను సైంధవుడు అను వానికి ఇచ్చెను. సైంధవుని తర్వాత ముంజికేశుడు, వేదమును రెండు భాగములు చేసెను. ఈ సంహితా వికల్పములు అయిదు. 1. నక్షత్ర కల్పము, 2. వైతాన కల్పము, 3. సంహితా కల్పము, 4. అంగిరస కల్పము, 5. శాంతి కల్పము. ఇవి అధర్వుణులకు శ్రేష్ఠములు. పురణార్ధ విశారదుడగు వ్యాసముని ఆఖ్యానములు (చూచిచెప్పిన కథలు), ఉపాఖ్యానములు (వినిచెప్పిన కథలు), గాథలచే (ఋభువదాదులు), కల్పశుద్ధుల (పితృకల్ప మంత్ర కల్పాదుల)చే పురాణ సంహితను నిర్మించెను.

మహామతిమంతుడగు వ్యాస భగవానుడు తన శిష్యుడు సూతుడని ప్రఖ్యాతుడగు రోమహర్షణునకు పురాణసంహితను ఒసగెను. 1. సుమతి, 2. అగ్నివర్చసుడు, 3. మిత్రాయువు, 4. శాంసపాయనుడు, 5. అకృతప్రణుడు, 6. సావర్ణి అను వారు ఆఱుగురు రోమహర్షణుని శిష్యులు. సావర్ణి, శాంసపాయనుడు సంహితాకర్తలు. ఈ మూడు సంహితలకు మూలమగు సంహితను వ్యాసులు రచించి, లోమహర్షణునికి ఇచ్చిరి. “రోమహర్షణికాచార్య” అని అందు చెప్పిన సంహిత లోమహర్షణుడు రచించినదికాక వ్యాసులవలన పొందినది అని అర్థము. ఈ పురాణసంహిత మూలముగాగల పురాణములు నాచే రచింపబడినవి.

ఇందు మొదటిపురాణము బ్రాహ్మము. పురాణములు పదునెనిమిది అని పురాణజ్ఞులు చెప్పుదురు. అవి: 1. బ్రాహ్మము, 2. పాద్మము, 3. వైష్ణవము, 4. శైవము, 5. భాగవతము 6. నారదీయము, 7. మార్కండేయము, 8. ఆగ్నేయము, 9. భవిష్యము, 10. బ్రహ్మవైవర్తము, 11. లైంగము, 12. వారాహము, 13. స్కాందము, 14. వామనము, 15. కౌర్మము, 16. మాత్స్యము, 17. గారుడము, 18. బ్రహ్మాండము. ఈ పదునెనిమిది పురాణములు గాక ఉపపురాణములు గూడ మునులచే చెప్పబడినవి. పురాణములందు సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరములు, వంశానుచరితము అను పంచ లక్షణములు చెప్పబడినవి.

ఓ మైత్రేయా! నీకు ఇపుడు నేను చెప్పుచున్న పురాణము విష్ణుపురాణము. పద్మ పురాణము తరువాతది. సర్గాదుల యందు భగవానుడే కర్తగా అన్నిటియందు చెప్పబడుచుండును, వేదాంగములు ఆరు. వేదములు నాలుగు. మీమాంస, న్యాయము (తర్కము), పురాణము, ధర్మశాస్త్రము అను ఈ పదునాలుగు విద్యలు. ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ (సంగీత) వేదము, అర్థశాస్త్రము, రాజనీతిశాస్త్రము అను ఈనాలుగు చేర్చిన పదునెనిమిది విద్యలగును.

మొదట బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు అని ఋషి ప్రకృతులు మూడుశాఖలు. శాఖాభేదములు, తత్కర్తలు, అభేదమునకు కారణములు తెలుపబడినవి. అన్ని మన్వంతరములందును శాఖాభేదములు ఇట్లే ఉండును. కల్పాదియందు ప్రజాపతిచే దృష్టమైన శ్రుతి (వేదము) నిత్యమే. ఇపుడు అధ్యయనము చేయబడుచున్న శాఖాభేదములు ప్రాజాపత్య శ్రుతి యొక్క వికల్పములు. (కావున అనిత్యముల వంటివి. ప్రతి ద్వాపరమున కొంచెము మారుచుండును) మైత్రేయా! నీవు అడిగినంత చెప్పితిమి. నీకు వేద సంబంధమైన విషయము ఇంకేమి కావలెను?

యమలోక వర్ణనము

మైత్రేయుడు పలికెను:

ఓ గురూ! నేను మిమ్ములను ప్రశ్నించిన విషయ మంతయును ఉన్నది ఉన్నట్లు నాకు చెప్పితిరి. ఇంకను ఒక విషయము వినకోరుచున్నాను. అది నాకు మీరు చెప్ప వలయును.

ఓ మహామునీ! సప్తద్వీపములును, పాతాళలోకమును, ఈ బ్రహ్మాండమునకు లోపలి వైపున అంతటనుఉన్న, సప్తలోకములు అను ఇది అంతయును స్థూలములును, ఇంతకంటె ఇంకను స్థూలతరములును, సూక్ష్మములును, మరింత సూక్ష్మములును, వాని కంటెను మరియు సూక్ష్మతరములును అగు ప్రాణులతో ఆవరింపబడి ఉన్నది.

ఓ మునిసత్తమా! కర్మబంధముచే నిబంధింపబడిన ప్రాణులు లేనిచోటు ఈ బ్రహ్మాండ అంతర్భాగమున అంగుళములో ఎనిమిదవ భాగముకూడ లేదు. ఓ భగవన్! ఈ ప్రాణులన్నియు తమ ఆయువు ముగియగానే యమునకు వశమగుచున్నవి అని శాస్త్ర ప్రమాణముల వలనను, పెద్దల వచనముల వలనను తెలియుచున్నది. తరువాత జీవులు యమునిచేత విధించబడిన యాతనలను అనుభవించుచున్నారు. ఆ యమయాతనలనుండి తిరిగివచ్చిన ప్రాణులు దేవతలు మొదలుగాగల వివిధ యోనులయందును జన్మించుచు, మరణించుచు చక్రక్రమమున వర్దిల్లుచున్నారు. ఇదియే శాస్త్రముల నిర్ణయము. అందువలన ఈ సంశయమును నివర్తింపజేయు అంశమును వినగోరుచున్నాను. నరులు యమునకు వశవర్తులు కాకుండుటకు అమలమగు కర్మము ఏది ఆచరించవలెనో నాకు తెలుపుము.

ఓ మైత్రేయ మునీ! మహాత్ముడగు నకులుడు ఈ ప్రశ్నమునే అడుగగా అతని పితామహుడగు భీష్ముడు చెప్పిన సమాధానమును చెప్పెదను వినుము.

“నాయనా! నకులా! పూర్వము కళింగదేశీయుడగు నా మిత్రుడగు బ్రాహ్మణుడొకడు నా వద్దకు వచ్చెను. నేను అతనిని ప్రశ్నించగా, పూర్వజన్మ స్మృతికలవాడును, మునియుఅగు అతడు ఈముందటి విషయమును నాకు చెప్పెను. ఇది అంతయు పూర్వము ఆ బుద్ధి మంతుడు చెప్పినట్లే జరిగి ఉండెను. ఇక మీదటను ఇట్లే జరుగును. నేను శ్రద్ధా పూర్వకముగా ఆ కాళింగుని అనేక పర్యాయములు మరిమరి అడుగగా, అతడు నాకు ఏమని చెప్పెనో అది ఆ విధముగనే తప్ప మరియొక విధముగా ఎక్కడను నాకు కనబడ లేదు. ఓ నకులా! నీ విప్పుడు నన్నేమి అడిగితివో అదియే నేను ఆ కాళింగుని ప్రశ్నించితిని. దానికి అతడు సమాధానమును చెప్పెను. అవిప్రుడు పూర్వజన్మస్మృతి కలవాడు కనుక తాను పూర్వజన్మమున మునిగా ఉన్నప్పుడు తానెరిగినదియు రహస్యమును అగు యమునికిని అతని కింకరునకును జరిగిన సంవాదమును నాకుచెప్పెను. ఆముని చెప్పిన విషయమునే జ్ఞాపకము చేసికొని నీకు చెప్పెదను వినుము.

హస్తమున పాశమును ధరించి ప్రాణివధకై బయలుదేరుచున్న తన కింకరుని చూచి యముడు అతనిచెవిలో ఇట్లుచెప్పునట. “ఓయీ! కింకరా! శ్రీ మహావిష్ణుని ప్రతిపత్తి శరణాగతిచేయు భక్తులను మాత్రము విడిచివేయుము. నాకు అన్యమానవుల మీదనే కాని విష్ణుభక్తులపై అధికారము లేదు. దేవతలచే అర్చనలను అందుకొను బ్రహ్మ నన్ను లోకములందలి ప్రాణుల హితాహితములను విచారించి వారిని విషయమున యమునిగా (వారిని అదుపులో ఉంచువానిగా) నియోగించెను. కాని నేనును లోకములకు గురుడగు హరి అంశమున నడచుకొనవలసిన వాడనేకాని స్వతంత్రుడను కాదు. నన్నును సంయమించుటలో విష్ణువునకు సామర్థ్యముకలదు. సువర్ణము ఒకటియై యుండియు, కడియము, కిరీటము, చెవికమ్మ మొదలగు భేదములను పొందుచున్నట్లే, హరి తాను ఒక్కడే అయి ఉండియు దేవతలు, పశుపక్ష్యాదులు, మనుజులు మొదలగు భేదములను పొందిన వాడుగా కల్పనా మాత్రమున చెప్పబడుచున్నాడు. గాలికి పైకి లేచిన భూపరమాణువు లన్నియు గాలి వీచుట ముగియగానే, భూమితో ఏకత్వమును పొందునట్లే, ఈ దేవతలు, పశువులు, మనుజులు మొదలగు ప్రాణులును సృష్టి మొదలగు కార్యములను నెరవేర్చునపుడు, త్రిగుణములచే కలుషితుడును, వాస్తవమున అకలుషుడగు శాశ్వతుడు అగు ఆ విష్ణువుతో అంతమున ఏకత్వమును పొందును.

కనుక ఏమర్త్యుడు, దేవసమూహార్చిత పాదారవిందుని శ్రీహరికి సత్యముగా నమస్కరించునో, సమస్త పాపబంధములును తొలగిన అట్టి మర్త్యుని ఆజ్యాహుతిచే ప్రజ్వలించు అగ్నివలె తప్పించుకొని పొమ్ము”

పాశమున హస్తమున ధరించిన ఆ యమకింకరుడు యముడు చెప్పిన ఈ వాక్యమును విని యమధర్మరాజుతో ఇట్లు పలికెను. సమస్త సృష్టికర్తయు, సర్వేశ్వరుడును అగు ఈ హరియొక్క భక్తుడు ఏ లక్షణములు కలిగి ఉండునో నాకు చెప్పుము.

యముడు తన కింకరునితో ఇట్లు పలికెను: ఎవడు తన వర్ణమునకు విహితమైన ధర్మమును వదలకుండునో, శత్రువులయందును మిత్రులయందును సమబుద్ధి కలిగి ఉండునో, దేనినికాని అపహరించక హింసించక ఉండునో, అత్యంత నిర్మల మనస్సుకల అట్టి వానిని విష్ణు భక్తునిగా గుర్తింపుము. ఎవని అంతఃకరణము కలికాల దోషములచేత మలినము కాదో, ఎల్లప్పుడును తన మనస్సున శ్రీహరినే నిలుపుకొని ఉండునో అతనిని విష్ణువున కత్యంత భక్తునిగా గుర్తింపుము.

స్ఫటిక పర్వతపుశిలవలె నిర్మలుడగువిష్ణువెక్కడ? మానవుల మనస్సున మత్సరము మొదలగు అరిషడ్వర్గ దోషములు ఎక్కడ? చంద్రుని కిరణముల రాశిపై అగ్నిజ్వాలల వేడిమి ప్రసరింప జాలదుకదా! నిర్మలమగు బుద్ధి కలిగి మత్సరములేక మనస్సున అధికమగు శమము కలవాడై పవిత్రమగు నడవడిక కలిగి సమస్త ప్రాణుల విషయమున మిత్రతాభావము కలిగి ప్రాణులకు ప్రీతిని హితమును కలిగించుమాటలాడుచు అహంకారము కపటము లేక ఉండువాని హృదయమున ఎల్లప్పుడును వాసుదేవుడు నివసించును. శాశ్వతుడగు వాసుదేవుడు తన హృదయమున నివసించుచున్నంత వరకు అట్టి పురుషుడు లోకమునందలి ప్రాణులకు సౌమ్యరూపుడుగా కనబడును ఏపి చెట్టు తన అందముచేతనే, తనలో ప్రవహించు భూరసము ఎంత రమ్యమైనదో తెలుపును. భగవానుడును, అనాదియును, ఖడ్గము, శంఖము, గదలను ధరించువాడును, వికార రహితమగు, కూట స్వరూపుడును అగు హరి హృదయమునందు ఉన్నచో అట్టివాని పాపము కూడ హరిచేతనే భేదింపబడుచున్నది. సూర్యుడు ఉన్నచోట చీకటి ఎట్లుండును?

ఓ భటుడా! యమము, నియమము అను యోగశాస్త్ర సంబంధ నియమములచే కల్మషములు తొలగించుకొనినవారును, అనుదినమును అచ్యుతునియందు అసక్తమగు మానసము కలవారును, మదము అభిమానము, మత్సరము లేనివారును అగు మానవులకు దూరముగ పొమ్ము. రహస్యము, పరధనము, బంగారము కనబడినను గడ్డిపోచనుగా తలచుచు తన చిత్తమునందు విష్ణుభగవానుడు తప్ప ఇతరము లేనివాడగు పురుషశ్రేష్ఠుని విష్ణుభక్తునిగా గుర్తింపుము. పరధనము హరించుచు, ప్రాణులను హింసించుచు, అసత్యము లను కఠిన వచనములనుపలుకుచు, పాపవశమున దురహంకారము కలిగిన కలుషమతి యొక్క హృదయమున శ్రీహరి ఉండడు. సాధుస్వభావము లేక, కలుషబుద్ధికలిగి పరుల సంపదకు ఓర్వక సత్పురుషులను నిందించుచు, దేవతారాధనము చేయక, తనకున్న దానిని దానము చేయక, ఉండు అధముని మనస్సున జనార్దనుడు ఉండదు. పరమ మిత్రునియందు, బాంధవునియందు, భార్య విషయమున, కొడుకులు, కూతుళ్ళు, తల్లి దండ్రులు, భృత్యులు అనువారి విషయమునందుకూడ కపటముతో ప్రవర్తించుచు, ధనము నందు ఆశమాత్రము కలిగి ప్రవర్తించుచు, అధమచేష్టలు కలవాడు విష్ణుభక్తుడు కాడని గుర్తింపుము. అశుభమగు బుద్ధి కలిగి మంచి ప్రపత్తిలేక, ఎల్లప్పుడును పెద్దలు కానివారితో దుశ్శీలము కలవారితో సాంగత్యము చేయుచు మత్తుగొని అనుదినమును పాపబంధము నందు ఆసక్తుడగుచుండు పురుషపశువు వాసుదేవ భక్తుడుకాడు అని తెలియుము.

అనంతుడగు శ్రీవిష్ణువు హృదయమునందు కలవారికి ఈ సమస్త దృశ్య ప్రపంచమును నేనును (యముడు), వాసుదేవుడును, పరమపురుషుడును అగు ఆ పరమేశ్వరుడు ఒకటియే అను స్థిరబుద్ధి నిశ్చయము కలిగి ఉండును. నీవు వారిని విడిచి దూరముగా పొమ్ము. ఓ కమలముల వంటి నేత్రములు కలవాడా! వాసుదేవా! విష్ణో! ధరణీధరా! అచ్యుతా! శంఖచక్రపాణీ! నీవు నాకు రక్షకుడవు అగుము అని పలుకుచుండు పుణ్యుల నుండి ఓ భటుడా! దూరముగా పొమ్ము. అవ్యయస్వరూపుడగు విష్ణువు ఎవరి మనస్సునందు ఉండునో, ఆ పురుష శ్రేష్ఠుని కంటిచూపు మేరలో నీవుకాని, నేనుకాని సంచరింప జాలము. శ్రీ విష్ణునిచక్రశక్తిచేత నా వీర్యశక్తి ప్రతిహతమే అగును. అట్టి పుణ్యాత్ముడు ఇతరములగు ఉత్తమలోకములకు అర్హుడు.”

ఈ విధముగా సూర్యపుత్రుడును దేవుడును అగు యమధర్మరాజు తన కింకరుని శాసించుచు పలికెను. ఓ కురు శ్రేష్ఠుడవు అగు భీష్మా! ఆ యముడు ఇది నాకు చెప్పెను. నేను చక్కగా నీకు చెప్పితిని అని కాళింగుడు చెప్పెను. భీష్ముడు నకులునితో ఈ విధముగా పలికెను. ఓ నకులా! పూర్వము కళింగదేశము నుండి వచ్చిన మహాత్ముడు నా మిత్రుడును అగు విప్రుడు ఈ విషయము ప్రీతితో నాకు చెప్పెను. నాయనా! ఈ సంసారసాగరమున రక్షించువారు శ్రీ విష్ణువు తప్ప ఇతరులు ఎవరును లేరను విషయమును నేనును యుక్తియుక్తముగా చక్కగా నీకు చెప్పితిని. ఎవని మనస్సు ఎల్లప్పుడు కేశవునే ఆశ్రయించి ఉండునో, అట్టివానిని యమకింకరులు, యముని దండము, పాశము, యముడు, యమయాతనలు ఏవియు, ఏమియు చేయజాలవు.

శ్రీ పరాశరముని మైత్రేయునితో ఇట్లు పలికెను. ఓ మైత్రేయమునీ! నీ ప్రశ్నమునకు అనుగుణముగా యముడు చెప్పిన విషయమునే లెస్సగా నీకు చెప్పితిని. నీకుమరి ఏమి చెప్పవలయునో కోరుము!

విష్ణ్వారాధన ఫల ప్రశంస

మైత్రేయుడు పరాశరమహామునితో ఈ విధముగా పలికెను. “భగవానుడవు అగు ఓపరాశర మహామునీ! సంసారమును తరింపగోరువారు భగవానుడును, ప్రకాశమాన స్వరూపుడును లోకనాథుడు అగు శ్రీమహావిష్ణుని ఆరాధించవలసిన ప్రకారమును గోవింద ఆరాధనపరులగు నరులకు లభించు ఫలమును వినగోరుచున్నాను”

శ్రీ పరాశరముని మైత్రేయునితో ఇట్లు పలికెను: నీవు నన్ను అడిగిన ప్రశ్నమునే మహాత్ముడు అగు సగరుడు అడుగగా ఔర్వ మహాముని చెప్పిన విషయమును నేను నీకు చెప్పెదను. వినుము. ఓ ముని శ్రేష్ఠుడవగు మైత్రేయా! భృగువంశజుడు ఔర్వమహామునికి సగరుడు నమస్కరించి విష్ణువును ఆరాధించు విధానమునకు సంబంధించినదియును ఆ ఆరాధనము వలన నరులకు కలుగుఫలమును గురించియు ప్రశ్నించెను. దానికి సమాధానమును ఔర్యుడు సగరునకు చెప్పినదానినే నీకు అంతయు చెప్పెదను వినుము.

ఔర్వమహాముని సగరునితో ఇట్లనెను. “విష్ణుని ఆరాధించుటవలన భూలోకమున పొందదగిన కోరికలను స్వర్గమును స్వర్గవాసులకును నమస్కరింపదగిన ఉత్తమ పదమును అన్నిటికంటె ఉత్తమమగు మోక్షఫలమును కూడ మానవులు పొందుదురు. అచ్యుతుని ఆరాధించువారు ఏ ఫలమును ఎంతెంత కోరుదురో, అది అంతయు అధికమైనదే కాని అల్పమైనదే కాని, పొందుదురు.

ఓసగరమహారాజా! ఆవిష్ణుని ఎట్లు ఆరాధింపవలెను? అని నీవు అడిగిన ప్రశ్నమునకు సమాధానము అంతయు చెప్పెదను దానిని. నావలన తెలియుము. మానవుడు తన వర్ణాశ్రమ ఆచారములను పాటించుచునే పరమ పురుషుడగు శ్రీమహావిష్ణువును ఆరాధింపవలయును. వానిని విడిచి అతనిని ఆరాధించుట అతనికి ప్రీతి కలిగించదు. ఓ రాజా! యజ్ఞములలో దేవతలను ఆరాధించుటచే విష్ణువును ఆరాధించువాడగును. చిత్తశుద్ధికై మంత్ర జపములను చేయుటచే విష్ణుని జపించువాడు అగును. ఇతర ప్రాణులను హింసించుటచే విష్ణుని హింసించినవాడు అగును. హరి సర్వభూతాత్ముడు అగుటయే ఇందులకు హేతువు. అందువలన పురుషుడు సదాచారము కలిగి తనతన వర్ణమునకు విహితమయిన కర్మములను ఆచరించుచు విష్ణుని ఆరాధించవలెను. బ్రాహ్మణుడుకాని, క్షత్రియుడు కాని, వైశ్యుడు కాని, శూద్రుడుకాని ఓరాజా! తన వర్ణధర్మమునందు శ్రద్ధకలిగి దానిని ఆచరించుచునే విష్ణుని ఆరాధింపవలెనుకాని మరొకవిధముగ కాదు. పరనింద, కొండెములు చెప్పుట, అసత్యము, ఇతరుల మనస్సునకు నొప్పికలిగించు మాటలు, పరస్త్రీలయందు, పరధనములయందు, ప్రాణిహింసలయందు ఆసక్తి లేక, ఇతర ప్రాణులను కొట్టక, చంపక, ఇతరులకు కీడు కోరకుండా ఉండువారు చేయు ఆరాధనచే కేశవుడు తృప్తినొందును. దేవతలను, విప్రులను, గురువులను సేవించుటకు ఎప్పుడును పూనిక కలిగి, తనకు తన కుమారులకు వలెనే సర్వ భూతములకు హితము కోరుచు రాగము, ద్వేషము మొదలగు దోషములచే మనస్సు అపవిత్రముకాని మనస్సుకలిగి వర్ణాశ్రమాను సరముగ శాస్త్రములచే విధింపబడిన ధర్మములను అనుష్టించు మానవులు చేయు ఆరాధనలకు శ్రీమహావిష్ణువు సంతృప్తినొందును.”

సగర చక్రవర్తి ఔర్వ మహామునితో ఇట్లు పలికెను: ఓ మునిశ్రేష్ఠుడా! అట్లయినచో నేను విష్ణుని ఆరాధన చేయువారికి అవశ్యముగా చెందదగినవి కావున వర్ణాశ్రమ ధర్మములను గూర్చి నేను వినగోరుచున్నాను. తెల్పుము.

ఔర్వుడు సగరునితో ఇట్లుపలికెను: ఓ రాజా! బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములవారు ఆచరించవలసిన ధర్మములను చెప్పెదను. ఏకాగ్ర బుద్ధితో వినుము.

బ్రాహ్మణులు దానము, యజ్ఞములచే దేవతలను ఆరాధించవలెను. వేద అధ్యయనము, జీవనయాత్రకై ఇతరులచే యజ్ఞము చేయించుట, వేదములను అధ్యాపనము చేయుట, ఇతరులనుండి పవిత్ర ద్రవ్యములను శాస్త్రన్యాయానుసారముగా ప్రతిగ్రహించుట చేయవలయును. త్రికాల స్నానముచేసి అగ్నిహోత్రియై ఉండవలెను. సర్వప్రాణులకును హితమునేకాని వేనికి అహితము చేయరాదు. సమస్త భూతములయందు మైత్రీభావము విప్రులకు ముఖ్యధనము. రాతియందును రత్నమందును పరధనములందు సమబుద్ధితో ఉండవలెను. ఋతుకాలమున మాత్రమే భార్యతో సంగమింపవలెను.

క్షత్రియులు సంకల్ప పూర్వకముగా బ్రాహ్మణులకు దానము, యజ్ఞములచే దేవతారాధనము వేదాధ్యయనము చేయవలెను. ఆయుధవిద్యచే జీవనము, ప్రజలను రక్షించుట, రాజ్యపాలనము, అతనికి శ్రేష్ఠమగు జీవనవిధానము. యజ్ఞాదికర్మ ఫలముల అంశము రాజునకు చెందును. కావున క్షత్రియులు రాజ్యపాలనముచేసిననే కృతార్ధులగుదురు. దుష్టులను దండించి, శిష్టులను రక్షించి వర్ణధర్మ వ్యవస్థను లోకమున నిలుపు రాజు తాను కోరుకొనిన ఉత్తమ లోకములను పొందగలుగును.

ఓ రాజా! లోకపితామహుడగు బ్రహ్మ, వైశ్యులకు పశుపాలనము, వాణిజ్యము, కృషి, జీవనవృత్తిగా విధించెను. అతడును అధ్యయనము, యజ్ఞము, దానము, నిత్యనైమిత్తికములగు కర్మములు ఆచరించవలయును.

శూద్రులకు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను ఆశ్రయించి వారివలన పోషణము జరుపుకొనుట. లేదా వర్తకముచే కాని వడ్రంగము మొదలగు శిల్పవృత్తుల చేకాని జీవించుట విధింపబడి ఉన్నది. దానము చేయుట, పాకయజ్ఞ విధానమున దేవతలను ఆరాధించుట పితృకర్మలు మొదలగు నైమిత్తికములను ఆచరించుట శూద్రులకు విహితము.

ఓ సగరమహారాజా! భృత్యులు మొదలగువారి పోషించుటకై ఇతరుల నుండి దానము ప్రతిగ్రహించుట, స్వభార్యను ఋతుకాలమున కలియుట, సమస్త భూతములపై దయ, ఓర్పు, అహంకారము లేకుండుట సత్యము, శుచిత్వము, ఎక్కువ శ్రమ చేయకుండుట శుభమాచరించుట, ఇతరులకు ప్రీతిగ మాటలాడుట, మిత్రభావము, కోరికలు తగ్గియుండుట, దైన్యము లేకుండుట, అసూయ లేకుండుట, సర్వవర్ణములకు అన్ని ఆశ్రమములకు సాధారణ ధర్మములు. బ్రాహ్మణాది వర్ణములవారికి ఆపత్కాలమున తగిన గుణములను ధర్మములను చెప్పెదను వినుము. ఆపత్కాలము అనగా ధర్మముచే జీవనము జరుగనిచో, బ్రాహ్మణుడు, క్షత్రియులు, వైశ్యుల వృత్తులను అవలంబింపవచ్చును. అట్లే క్షత్రియుడును, వైశ్య వృత్తిని గ్రహింపవచ్చును. కాని వీరు ఉభయులుకూడ శూద్ర వృత్తిని అవలంభింపరాదు. సామర్థ్యము ఉన్నంతవరకు ఉచితధర్మమును అవలంబింపవలెనే కాని కర్మసంకరము ఒకరికి విహితకర్మములను ఇంకొకరు ఆచరించుట తగదు.

ఓ సగర మహారాజా! నీకు నేను ఇట్లు వర్ణ ధర్మములు చెప్పితిని. ఇక ఆశ్రమ ధర్మములు చెప్పెదను వినుము.

బ్రహ్మచర్యాది ఆశ్రమ ధర్మ నిరూపణము

ఔర్వ మహాముని అనియెను:

ఉపనయనము జరుపబడిన బాలుడు వేదములను సంపాదించుటయందు శ్రద్ధకలవాడుఅగుచు శ్రద్ధావంతుడగు బ్రహ్మచారిగా, గురుగృహమున ఉండవలయును. అచ్చట అతడు శౌచమును, సదాచారమును కలిగి గురునకు శుశ్రూష చేయవలయును. బ్రహ్మచర్యమునకు తగిన వ్రతములను ఆచరించుచు శ్రద్ధాబుద్ధితో వేదమును గ్రహించ వలయును. ఓ రాజా! ప్రాతః సాయం సంధ్యలయందును శ్రద్ధాపూర్వకముగా అగ్నిని ఉపాసించుట, సూర్యోపస్థానమును ఆచరించవలెను. గురునకు అభివాదనము చేయవలెను. గురువు నిలువబడినచో తాను నిలువబడుచు, నడచుచున్నచో తానును నడచుచు, కూర్చున్నచో తానుక్రిందుగా కూర్చుండవలయును. శిష్యుడు గురునకు ప్రతికూలము అగునది ఏదియును ఆచరింపరాదు. గురువు చెప్పినపుడు అతని ముందు ఉండి అన్యమనస్కత లేక వేదమును పఠింపవలెను. ఆచార్యుడు స్నానముచేసిన తరువాతనే శిష్యుడు స్నానము చేయవలెను. ప్రతి ప్రాతఃకాలమునను గురునకు సమిధలు జలము మొదలగునవి తెచ్చి ఇచ్చుచుండ వలయును. ఇది బ్రహచర్య ధర్మము.

తాను గ్రహింపవలసిన వేదములను గ్రహించిన తరువాత, గురునివలన తాను గ్రహించిన వేదాదివిద్యలకు తగిన ప్రతిఫలమును ఇచ్చి, గురు ఋణమును తీర్చి, అతని అనుమతి పొందివచ్చి, ప్రాజ్ఞుడై గృహస్థాశ్రమమున ప్రవేశింపవలయును. ఓ రాజా! శాస్త్రోక్త విధానమున భార్యను పెండ్లాడి తాను ఆచరించిన కర్మలచే ధనము ఆర్జించి తనశక్తిని అనుసరించి గృహస్థుడుగా ఆచరింపదగిన కార్యములను ఆచరింపవలెను. తర్పణముచేసి పితృదేవతలను, యజ్ఞములచే దేవతలను, ఆహారముచే అతిథులను, స్వాధ్యాయముచే మునులను, సంతానమును కనుటచే ప్రజాపతిని, బలివేయుటచే భూతము (ప్రాణు)లను, వాత్సల్యము, దయచేత సమస్తలోకమును ఆరాధించుచున్నచో, పురుషుడు తాను ఆచరించిన ఆయాకర్మములకు తగిన ఉత్తమలోకములను పొందును. భిక్షాటనము చేసి ఆహారము భుజించు యతులు, బ్రహ్మచారులు గృహస్థుని మూలముననే జీవింతురు. కనుకనే గార్హస్థ్యము గొప్ప ఆశ్రమము. ఓ రాజా! విప్రులు వేదాది విద్యలను సంపాదించుటకును తీర్ధములయందు స్నానమాచరింప కోరియు పృధివీ విశేషములను చూడ కోరియు భూమిపై సంచారము చేయుచుందురు. కొందరు నియతమగు నివాస స్థానము, ఆహారము లేక తాముసంచరించుటలో ఎక్కడ ఉండినను సాయంకాలమైనచో, ఆప్రదేశమునే గృహముగా గ్రహించి ఆరాత్రి గడపిపోవు మహనీయులు ఉందురు. అట్టివారికి అందరకును గృహస్థులే ఆశ్రయము, జీవనమునకు కారణమును. ఓ రాజా! గృహస్థులు అట్టివారికి మధురముగా స్వాగతముపలికి, ఇంటికి వచ్చిన వారికి ఆసనము, భోజనము, శయనములను సమకూర్చవలెను. ఎవరి ఇంటినుండి అతిథి తన కోరికలు తీరక మరలి పోవునో, అతడు తన పాపమును గృహస్థునకు సంక్రమింపజేసి అతని పుణ్యమును తీసికొనిపోవును. ఇతరులను అవమానించుట, అహంకారము, కపటము, పరితాపము నొందించుట, ఇతరులకు ఇబ్బంది కలిగించుట పరుషత్వము (మాటలలోకాని చేతలలో కాని) గృహస్థునియందు ఉండరాదు. శ్రేష్ఠమగు తన ఈ కర్మానుష్ఠానమును చక్కగా అనుష్ఠించు గృహస్థుడు సర్వ బంధముల నుండి విడుదలపొంది ఉత్తమములగు లోకము లనుపొందును. ఇది గృహస్థాశ్రమ ధర్మము.

ఓ రాజా! గృహస్థుడుగా ఇట్లు జీవించి కృతకృత్యుడై వయస్సు పండిన తరువాత, భార్యను తన కుమారులవద్ద ఉంచికాని తన వెంటతీసికొని కాని అరణ్యమునకు పోవలెను, ఆకులు, దుంపలు, వేళ్ళు, పండ్లు, ఆహారముగా తీసికొనుచు జుట్టు, గడ్డములు, మీసములు పెరుగనిచ్చుచు, జడలు ధరించి నేలపైనే శయనించుచు, ఏ ప్రయోజనము లందును కోరికలు లేక జీవించవలయును, చర్మముతో, బెల్లుతో దర్భలతో చేసిన ధోవతిని ఉత్తరీయమును ధరించవలయును. ప్రాతః మధ్యాహ్న సాయంకాలములయందు స్నానము చేయుట మంచిది. ఓ రాజా! ఇతనికి దేవతలను అర్చించుట, హోమము అభ్యాగతులను అందరను పూజించుట, భిక్షాప్రదానము, భూతములకు బలి ఇచ్చుట చాల శ్రేష్ఠమైనది. అడవిలో లభించు నూనెలతో తలంటుపోసికొనుట, చలిని, ఉష్ణమును, ఓర్చుచు తపస్సాచరించుచు, మౌనముతో, మననముతో మునిగా ఉండుట వానప్రస్థునకు విహితములు. ఈ కర్మములను ఇట్లు అనుష్టించు వానప్రస్థుడు అగ్నివలె దోషములను దహించును. శాశ్వతములగు లోకములను జయించును. ఇవి వానప్రస్థాశ్రమ ధర్మములు.

ఓ రాజా! విద్వాంసులు భిక్షువుయొక్క ఆశ్రమము, సన్యాసాశ్రమము అని వ్యవహరించు నాలుగవ ఆశ్రమముయొక్క స్వరూపమును చెప్పెదను వినుము. పుత్రులయందు, భార్యయందు, ద్రవ్యమునందు, స్నేహమును, మత్సరమును విడిచి సన్యాసాశ్రమమున ప్రవేశించ వలయును. ధర్మార్థకామ ప్రయోజనములకు సంబంధించి కార్యాచరణములను పూర్తిగా విడువవలయును. శత్రుమిత్రులయందుసముడై, సమస్త ప్రాణులయందు దయకలిగి ఉండవలయును. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజములు అగు ప్రాణులలో వేటికిని, వాక్కుచేకాని, మనస్సుచేకాని, కర్మచేకాని ద్రోహమును ఆచరింపరాదు. అన్ని విధములగు సంబంధములను విడువవలెను. గ్రామమునందు ఒక రాత్రి మాత్రము పురములందు పంచ రాత్రము, మాత్రము ఇట్లక్కడ ఉండు ఎవరియందును ప్రీతికాని, ద్వేషముకాని, కలుగుటకు అవకాశము లేకుండునట్లు కొలది కాలము మాత్రము నిలువవలయును. వంటలు ముగిసి నిప్పులు చల్లార్చి జనులు భోజనము చేసిన తరువాత శ్రేష్ఠవర్ణములవారి ఇండ్లకు తన శరీరయాత్రా మాత్రమునకై, ఆహారమునకై, భిక్షార్థము తిరుగవలయును. కామము, క్రోధము, దర్పము, లోభము, మోహము మొదలగు దోషములను విడిచిన ఎక్కడను ఏ ప్రాణుల వలనను భయము ఉండదు. అగ్నిహోత్రమును వేదిక యందుకాక తన శరీరము నందు నిలుపుకొని భిక్షాటనముచే లభించిన ఆహారముల చేత నోటిద్వారా అట్టి, శారీరాగ్నియందు హోమము జరుపు మహనీయుడు (సన్యాసి) అన్ని యజ్ఞములతోడను చితాగ్నులు అగ్నిచయనముచేసినవారు పొందులోకములను పొందుదురు. చక్కని సంకల్పములతో సంస్కరింపబడిన బుద్ధికలిగి ఈ చెప్పబడిన విధమున మోక్షాసన్యా సాశ్రమ ధర్మమును ఆచరించుచు, ద్విజుడు (బ్రాహ్మణుడుగాని, క్షత్రియుడు గాని, వైశ్యుడుగాని) కట్టెలను ఆశ్రయించిన జ్యోతిస్సువలె జీవించి ప్రశాంతమగు బ్రహ్మలోకమును పొందగలుగును.

వివరణము: ప్రాణులు నాలుగు విధములు.

1. జరాయుజములు: తల్లికడుపులో పిండము అన్ని అవయవములతో వృద్ధి పొంది మావితోకూడ జన్మించు మనుష్యులు, పశువులు, మృగములు మొదలగునవి.

2. అండజములు: తల్లికడుపు నుండి వెలువడిన గ్రుడ్డు నుండి పుట్టినవి. పక్షులు మొదలగునవి.

3. స్వేదజములు: చెమటనుండి పుట్టు తేలు, నల్లి, పేను మొదలగు ప్రాణులు.

4. ఉద్భిజములు: నేలను చీల్చుకొని పుట్టెడి చెట్లు మొదలగునవి.

పాణిగ్రహణ విధానము

సగరుడు పలికెను: “బ్రాహ్మణోత్తమా! నాల్గు ఆశ్రమముల యొక్కయు వర్ణముల యొక్కయు కర్తవ్య క్రియలు చెప్పితిని. నీవు సమస్త ధర్మములను ఎఱిగినవాడవు. కావున మానవుడు ఆచరింపవలసిన నిత్యనైమిత్తిక కామ్యకర్మములనెల్ల వినగోరెదను ఎఱిగింపుము.”

ఔర్వుడు పలికెను: “నీవడిగిన దానిని చెప్పెద. ఏకాగ్ర మనస్కుడవై వినుము. తండ్రి కుమారుడు పుట్టగనే జాతకర్మ మున్నగునవి అభ్యుదయశ్రద్ధతో చేయవలయును. ఓరాజా! ప్రాజ్ఞ్ముఖులగు బ్రాహ్మణ దంపతులను భుజింపజేయవలెను. హేతువగు సంస్కారములను, పిత్రర్చనలను బ్రాహ్మణులకు తృప్తి కలుగునట్లు చేయవలెను. పెరుగు యవలు రేగుపళ్ళు వీనితో మిశ్రమైన పిండములను సంతోషముతో, నాందీముఖ దేవతలను ఉద్దేశించి దైవతీర్థ(కరాగ్ర)ముతో సమర్పించవలెను. సమస్త వృద్ధి కాలములందు (కన్యా పుత్ర వివాహాదులందు ఉపచారముల నెల్ల ప్రాజాపత్య తీర్థము (కనిష్ఠికామూలము)లో ప్రదక్షిణముగ చేయవలయును. పిమ్మట తండ్రి, పురుడు పదవరోజు గడువగనే (11వ రోజున) కులదేవతా నామయుక్తమై పురుష వాచకముగ ఉండి బ్రాహ్మణాదులగు నాల్గువర్ణముల వారికి క్రమముగ శర్మ, వర్మ, గుప్త, దాస పదములు అంతము నందుగల నామము నుంచవలెను. అర్థశూన్యము, అప్రశస్తము, అపశబ్ద సహితము, అమంగళకరము, ఏవగింపును కలిగించునదియు గాక సమాక్షరములు కలదియై, అతిదీర్ఘాక్షరములు, అతి హ్రస్వాక్షరములు, అతి గురువర్ణ సమేతము కానిదై, సుఖముగ ఉచ్చరింపదగినదై లఘ్వక్షరములు చివర కలదై ఉండు పేరును పెట్టవలెను. పిమ్మట బాలుడు అనంత సంస్కారము (ఉప నిష్క్రమణ, అన్నప్రాశన, ఉపనయనము)లచే సంస్కరింపబడినవాడై, విధిననుసరించి విద్యా స్వీకారముచేసి, గురువునకు దక్షిణనొసంగి గృహస్థాశ్రమముకోరి భార్యను చేపట్ట వలెను. లేక సంకల్ప పూర్వకముగ నైష్ఠిక (యావజ్జీవ) (బ్రహ్మచర్యముతో అయినను కాలము గడుపవచ్చును. గురువునకు లేక వారి పుత్రాదులకు శుశ్రూష చేయవలెను. ఇచ్ఛను అనుసరించి, అనగా పూర్వసంకల్పమును బట్టి వానప్రస్థుడు లేక పరివ్రాజకుడు (సన్యాసి) కావచ్చును. ఏకగుణ వయస్కయగు భార్యను త్రిగుణవయస్కుడగు ఆతడు పెండ్లాడవలెను.

అనగా తనకంటె చిన్నదానిని వివాహము చేసికొనవలయునని తాత్పర్యము. అధిక కేశములుకలది, లేక కేశశూన్యయైనది మిక్కిలి నల్లనిది, గోరోచనవర్ణము గలది, స్వభావ విరుద్ధముగ అధికాంగము కలదియు హీనాంగములు కలదియు అపరిశుద్ధమైనదియు, దుష్కులమున పుట్టినదియు అధిక రోమములుగలది, అతిరోగవతియు, దుష్టురాలు, దుష్టవాక్యములను ఆడునది, కుష్టాది రోగులగు తల్లి దండ్రులు గలది పుంస్త్వాభి వ్యంజకమగు గడ్డము మీసాలు గలది, పురుషాకారము గలది, ఘర్ఘస్వరము గలది, కృశించినది కాకిధ్వనిగలది, చంచల దృష్టిగలది గుండ్రని నేత్రములుగలది, రోమయుతములగు పిక్కలుగలది ఎత్తైన చీలమండలు కలది నవ్వుచుండగా గుంటలుపడు చెక్కిళ్ళు కలదియు, వివాహమునకు పనికిరాదు. మిక్కిలి రూక్షమైన కాంతికలది, తెల్లని గోళ్ళు కలది, ఎఱ్ఱని చూపు కలది, మిక్కిలి లావైన హస్తపాదములు కలది మిక్కిలి, పొట్టిది, మిక్కిలి పొడవైనది, కలిసియున్న కనుబొమ్మలుకలది, మిక్కిలి ఎడమైన దంతములుగలది భయంకర ముఖము కలదియు, పనికిరాదు. మాతృపక్షమునుండి అయిదవది పితృపక్షమునుండి ఏడవది అగు కన్యను ధర్మవిధిని అనుసరించి వివాహమాడవచ్చును. వివాహములు ఎనిమిది విధములు గలవు. బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, ఆసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము. వీనిలో ఏ వర్ణమునకేది ధర్మముగ మహర్షులచే చెప్పబడి ఉన్నదో దానిని స్వీకరించి ఇతరమును విడువవలెను. తనతోకూడి ధర్మము ఆచరించుదానితో చేసికొనిన సద్వి వాహము మహాఫలమును ఒసంగును.

గృహస్థాచారప్రశంస యజ్ఞములు

సగరుడు పలికెను. మహామునీ! గృహస్థుడు ఏ సదాచారమును ఆచరించుటవలన ఇహపరలోకములనుండి చ్యుతుడు కాడో; అట్టి గృహస్థ సదాచారమును వినగోరుచున్నాను.

ఔర్యుడు పలుకుచున్నాడు. “ఓ రాజా! సదాచారస్వరూపమును వినుము. సదాచారవంతుడు ఇహపరలోకములను జయించును. సజ్జనులు పాపరహితులు అట్టివారు. సత్పథమునకు సాధువని అర్థము. వారి ఆచరణమే సదాచారము అనబడును. సప్తర్షులు, మనువులు, ప్రజాపతులు, సదాచారకర్తలు, వక్తలునై ఉన్నారు.

ఓ భూపతీ! బుద్ధిమంతుడైనవాడు బ్రాహ్మ (సూర్యోదయమునకు వెనుక మూడవ) ముహూర్తమందు లేచి, మెలకువతో కూడినవాడై, త్రివర్ణములందు సమదృష్టి కలవాడై, మనసుతో ధర్మమును, దానికి విరోధిగాని అర్థమును, ఆరెంటికి బాధకముగాని కామమును దృష్టాదృష్ట పాపవినాశము కొఱకై చింతింపవలెను. ధర్మమునకు బాధను కల్గించు అర్థ కామములను ఉత్తరత్ర సుఖమును చేకూర్చనిదియు లోకదూషితమైనట్టిదియు అగు ధర్మమునుకూడ విడిచిపెట్టవలయును. పిమ్మటలేచి కాలకృత్యమగు మూత్రోత్సర్జనము చేయవలయును. గ్రామమునకు నైరృతి దిక్కునందుగాని లేక ఇంటికి బాణప్రక్షేప దూరమునకు మించిన చోట, మూత్ర పురీషములు విడువవలెను. ఇంటి ముంగిట పాద ప్రక్షాళనము గాని, ఉమియుట మొదలగునవిగాని చేయరాదు. విజ్ఞుడైనవాడు తననీడకు చెట్టునీడకు గోవు, సూర్యుడు, అగ్ని, వాయువు, గురువు, బ్రాహ్మణుడు, వీనికి అభిముఖుడై మూత్ర పురీషముల విడువరాదు. దున్నినచోట సస్యమధ్యమునందు, ఆవులమందలోను జన సముదాయమున, మార్గమందు, నది మున్నగు తీర్థములందు, నీటియందు, నీటి తీర మందు, శ్మశానమునందు మూత్ర, పురీషములు విడువరాదు. ప్రాజ్ఞుడు సంకటము లేనప్పుడు పగలు సంధ్యలందు ఉత్తరాభిముఖుడుగను, రాత్రి దక్షిణాభిముఖుడుగను మూత్ర పురీషములను విడువవలెను. నేలపై గడ్డిపఱచి, వస్త్రముతో తలనుచుట్టి విడువవలెను. అచట చిరకాలము ఉండరాదు. మాట్లాడరాదు. పుట్టమట్టి, ఎలుక కన్నపు మట్టి, నీటిలోని మట్టి, శౌచము చేసికొనగా మిగిలిన మట్టి, మూత్రాది లేప సంగతమైన మట్టిని ఇంటినుండి శౌచము కొఱకై తీసికొని రాకూడదు. అణువులతోను జీవములతోను కూడి ఉన్నదియు, నాగలితో దున్నబడినదియు అగు మట్టిని శౌచమునకు ఉపయోగింపరాదు. శౌచము చేసికొనుటకు మట్టిని మూత్రావయవమందొక పర్యాయము పురీషోత్సర్జన అవయవమందు మూడు మారులు ఎడమచేతియందు పదిమారులు, రెండుచేతులందు ఏడేసిమారులు వాడవలెను. స్వచ్ఛమును వాసనగాని, ముఱుగుగాని లేనిదియు, బుడగలు లేనిదియు అగు నీటితో ఆచమనముచేసి మరల సావధానుడై మట్టించుకొనవలెను. ఇట్లు పాదశౌచముచేసికొని, పాదములు కడుగుకొని, త్రిరాచనము చేసి రెండు పర్యాయములు పరిమార్జనము చేసికొని, తలలోనున్న ఇంద్రియములను, తలను బాహువులను నాభిని హృదయమును ఆనీటితో స్పృశింపవలెను.

పిమ్మట ఆచమనముచేసి కేశాలంకరణము, అద్దముచూచుకొనుట అంజనము కాటుక మంగళవస్తువులు, దూర్వారులను గ్రహించుట చేయవలెను. పిమ్మట స్వవర్ణధర్మముతో జీవితనిమిత్తమై ధనార్జనము చేయవలెను. ఓరాజా! శ్రద్ధతో కూడినవాడై యాగములను నాచరించవలెను. సోమ సంస్థలు ఏడు. హవిస్సంస్థలు ఏడు. పాక సంస్థలు ఏడు. ఈ యాగములన్నియు ధనాయత్తములు అగుట వలన ధనార్జనకై ప్రయత్నింపవలెను. నిత్య కర్మానుష్ఠానార్థమై, నదులు, నదములు, తటాకములు, మనుష్యనిర్మితములుకాని దేవఖాత జలములందు, సెలయేళ్ళయందు స్నానమాచరింపవలెను. కూపములయందు తోడినజలముతో తత్తీరభూమియందు, అది శక్యముగానప్పుడు ఇంటియందు స్నానము చేయవలెను. పరిశుద్ధ వస్త్రము ధరించి సావధానచిత్తుడై దేవర్షి పితృతర్పణమును, దేవ-ఋషి పితృతీర్థముల (కరాగ్ర, కనిష్ఠికా మూల, తర్జనీ మూలముల)లో చేయవలెను. వీరికి తృప్తికై ముమ్మారు (అనగా భూః భువః సువః దేవాన్ ఋషీన్ పితౄన్ తర్పయామి) అని విడువవలెను. ప్రజాపతికి ఒక్క పర్యాయము విడువవలెను, పితామహులకు, ప్రపితామహులకు మాతామహునకు, వారి తండ్రికి, వారి తండ్రికి, పితృతీర్థము (తర్జనీ మూలము)తో ఇవ్వవలెను. కామ్యములను చెప్పెదను వినుము. తల్లికి, ఆమె తల్లికి, గురుపత్నికి, గురువునకు, మేనమామ మున్నగువారికి ఆప్తమిత్రునకు భూనాథునకు ఇవ్వలెను. ఈ దేవాదితర్పణ ఉదకమును భూతోపకారము కొఱకై తనకోర్కెను అనుసరించి ఈ వాక్యములను జపించవలెను.

నమోవివస్వతే బ్రహ్మభాస్వతే విష్ణు తేజసే

జగత్సవిత్రే శుచయే సవిత్రే కర్మదాయినే

దేవతలు, అసురులు, యక్షులు, నాగులు, గంధర్వులు, రాక్షసులు, పిశాచులు, గుహ్యములు, సిద్ధులు, కూశ్మాండ గణములు, చెట్లు, పక్షులు, జలవములు, భూనిలయములు, వాయ్యా ధార జంతువులు అన్నియు నేను ఇచ్చుచున్న ఈ తర్పణోదకములతో శీఘ్రముగ తృప్తినొందు గాక! సమస్తరకములందు యాతనా శరీరములందున్న వారికి తృప్తికై నాచే ఈ జలము ఇవ్వబడుచున్నది. బంధువులుగానీ, అబాంధవులుగాని, అన్యజన్మబంధువులుగాని, నావలన జలమును ఆపేక్షించు వారందరు తృప్తి పొందుదురుగాక! ఈనాచే ఈయబడిన తిలోదకము ఎచట ఉన్నను ఆకలి దప్పికలచే బాధితులైనవారికి తృప్తిని కలిగించును గాక!

రాజా! కామ్యఉదకప్రదానమును నీకు చెప్పితిని. దీనిని ఇచ్చుటచే నరుడు సకల ప్రపంచమును సంతోషపెట్టిన వాడగును. మఱియు ప్రపంచ ప్రేథనముచే కలుగు పుణ్యమును పొందగలడు. శ్రద్ధతో కామోదకమును సమర్పించి, ఆచమించి, సూర్యునకు ఈ క్రింది మంత్రముతో జలాంజలిని సమర్పింపవలయును. ‘వేదములతో ప్రకాశించు వాడును, సర్వవ్యాపకమగు తేజస్సుగలవాడును, జగజ్జనకుడును, పరిశుద్ధుడును, ప్రేరకుడును, కర్మ సాక్షియు అగు సూర్యునికి నమస్కారములు.’

పిమ్మట ఇంటియందు అభిమత దేవతలను జలాభిషేక పుష్ప ధూప నివేదనాదులతో అర్చించవలెను. బ్రహ్మాది పంచాహుతులతో అపూర్వాగ్నిహోత్రహోమము (వైశ్వదేవము)ను చేయవలెను. ప్రజాపతిని, గృహమునకు, కాశ్యపునకు అనుమతి దేవతలకు ఆహుతులను ఇవ్వవలెను. మిగిలిన దానితో జాపసనాగ్ని వద్ద ఉదపాత్రయందు భూపర్జన్య దేవతలను ఉద్దేశించి బలివేయవలెను. ద్వారమునందు ధాతకు, విధాతకు, గృహమధ్యమందు బ్రహ్మకు బలివేయవలెను. దిగ్దేవతలను వినుము.

శేషాన్నముతో తూర్పు మొదలగు దిక్కులందు క్రమముగ ఇంద్రునకు, యమునకు వరుణునకు, చంద్రునకు, ఈశాన్యమున ధన్వంతరికి బలివేయవలెను. వాయవ్య దిక్కున వాయువునకు బలివేయవలెను. అట్లే దిక్కులు అన్నిటియందు నిరంతరము బ్రహ్మకు అంతరిక్షము నకు, సూర్యునకు, విశ్వదేవులకు, సమస్త భూతములకు, విశ్వపతికి, పితరులకు యక్షులకు, బలిప్రక్షేపము చేయవలెను. (ఈ క్రమము పారస్కర గృహ్య సూత్రమున చూడవచ్చును).

అన్నంతరమును తీసికొను పరిశుద్ధమగు భూమియందు విద్వాంసుడు సావధాన చిత్తుడై సమస్త భూతములకు బలి ప్రక్షేపము చేయవలెను. ఆ సమయమున ఈ క్రింది శ్లోకములను చెప్పవలెను. వానితాత్పర్యమిది. ‘అన్నము అపేక్షించుచున్న దేవతలు మనుష్యులు పశువులు పక్షులు సిద్ధ యక్ష ఉరగ దైత్య సంఘములు ప్రేతములు పిశాచములు వృక్షములు వీనికొరకై నాచే ఈ అన్నము ఇవ్వబడుచున్నది. చీమలు కీటకములు మిడుతలు మున్నగు వానికి కర్మ సూత్రబద్ధములై ఆకలిగొన్నవానికి అన్నిటికిని అన్నము ఈయబడినది. దీనిచే అవి తృప్తినొంది సుఖించు గాక! తల్లిగాని, తండ్రిగాని, బంధువుగాని, అన్నసామగ్రి గాని, మఱిఏమియులేని భూతములను ఉద్దేశించి నాచే భూమిపై ఉంచబడిన ఈ అన్నము వలన, నా జీవములన్నియు తృప్తిచెంది ఆనందించును గాక! సమస్తభూతములు అన్నము నేనును విష్ణువు కంటె వేరుకాము. అందువలన నేను భూతసముదాయ శరీర భూతమయిన అన్నమును వానితృప్తికై ఇచ్చుచున్నాను. దేవ మనుష్య పశు పక్షి సిద్ధ యక్ష ఉరగ దైత్య ప్రేత పిశాచ వృక్ష పిపీలికా కీట శలభాది పదునాలుగు గణముల కొఱకును తృప్తి కలిగించుటకై నాచే ఇవ్వబడిన ఈ అన్నముచే అవి సంతోషించుగాక! అని చెప్పుచు అందఱికిని ఆశ్రయ భూతుడైన గృహస్థు శ్రద్ధతో సమస్త భూతోపకారము కొఱకై అన్న ప్రదానము చేయవలయును.

కుక్కలు చండాలురు పక్షులు పతితులు పుత్రరహితులు అగు మానవుల కొఱకై భూమి మీద అన్నము వేయవలెను. పిమ్మట ఇంటి ముంగిట అతిథి కొఱకై గోదోహనకాల మాత్రము (1/4 గడియ లేక 6 నిమిషములు) గాని అంతకు మించిగాని, నిరీక్షించవలెను. అచటకు దయచేసిన అతిథికి స్వాగతముపలుకుట, ఆసనప్రదానము, పాదములు కడుగుట, మున్నగు వానితో పూజించి శ్రద్ధతో అన్నప్రదానముచేసి, ప్రియమగు ప్రశ్నోత్తరములు పలికి వెళ్ళుచున్నవానిని అనుగమనించి గృహస్థు ప్రీతికలిగించవలెను. ఇతర స్థలమునుండి వచ్చిన ఏకగ్రామవాసి కాని అతిథిని, కులముగాని పేరుగాని తాను ఎఱుగకయే చక్కగ పూజింపవలెను. దరిద్రుడును తనతో సంబంధము లేనివాడును ఇతర దేశమునుండి దయచేసిన వాడును ఆకలి గొన్నవాడును అగు అతిథినివిడచి భుజించిన గృహస్థు పతితుడు అగును.

గృహస్థు అభ్యాగతు (భోజన సమయమునకు వచ్చిన)డైన అతిథిని అధ్యయనమును గోత్రమును, అవాంతరశాఖను, కులమును అడుగకయే బ్రహ్మబుద్ధి చేయవలెను. రాజా! పితృయజ్ఞార్థమై మఱియొక బ్రాహ్మణుని ఆదేశీయుడై కులాచారములను ఎఱిగి ఉన్న వానిని, పంచయజ్ఞములను ఆచరించువానిని, భుజింపచేయవలెను. ఉచ్ఛిష్టముకాని అన్నమును తీసి “మనుష్యేభ్యో హంతా” అను మంత్రముచే వేఱుచేయబడి ఉన్న అన్నమును శ్రోత్రియ బ్రాహ్మణునకు సమర్పించవలెను. యతులకు, బ్రహ్మచారులకు ముమ్మాఱు భిక్షాన్నమును ఈయవలెను. సంపదగల బుధుడు, వారు వద్దను వరకు పెట్టవచ్చును. వెనుక చెప్పిన అతిథులు, యతులు, బ్రహ్మచారులు, శ్రోత్రియుడు అను నాలుగు వర్గముల వారిని పూజించినవాడు పాపనిర్ముక్తుడగును.

ఎవని ఇంటి నుండి, అతిథి భగ్నాశుడై వెళ్ళునో, అతడు పాపమును ఆ యజమానికి ఒసగి వాని పుణ్యమును తీసికొని వెళ్ళును. ఓ రాజా! ధాత, ప్రజాపతి, ఇంద్రుడు, అగ్ని వసుగణము, సూర్యుడు, వీరు అతిథిలో ప్రవేశించి అన్నము తినుచుందురు. కావున అతిథి పూజ విషయమై నరుడు ప్రయత్నించవలెను. అతిథి లేకుండ భుజించువాడు కేవలము పాపమునే భుజించుచున్నాడు.

పిమ్మట గృహస్థు వివాహితయై, తనయింట ఉన్న స్వవాసినిని, దుఃఖిత అయిన దానిని, గర్భవతిని, వృద్ధులను, పిల్లలను ముందుగ వైశ్యదేవ సంస్కృతమైన అన్నమును భుజింపజేసి, చివరకు తాను తినవలెను. పైవారు భుజింపకయే గృహస్థు భుజించిన యెడల అతడు పాపమునే భుజించుచున్నాడు. అతడు మృతుడై నరకమునుచేరి శ్లేష్మమును భుజించును. స్నానము చేయక భుజించువాడు మలమును, జపముచేయక భుజించువాడు చీము, రక్తమును భుజించును. అసంస్కృతాన్నమును తినువాడు మూత్రమును, బాలురు మున్నగు వారి కంటె ముందు భుజించువాడు మలమును, హోమముచేయక భుజించువాడు క్రిములను, అతిథులకు పెట్టక తినువాడు విషమును తినును.

ఓ రాజేంద్రా! గృహస్థు ఎట్లు భుజింపవలెనో, భుజించుచున్నవానికి పాపసంబంధ మెట్లు కలుగదో, ఈ లోకమునందు చక్కని ఆరోగ్యము, బలవృద్ధియు ఎట్లు కలుగునో, శత్రు పక్షము విషయమై అభిచరించు వానికి అనిష్టశాంతి ఎట్లు కలుగునో చెప్పెదను వినుము. గృహస్థు స్నానము చేసి యథావిధిగ దేవ ఋషి పితృ తర్పణములుచేసి, సావధానముగ ప్రశస్తమగు రత్నమును చేతధరించి భుజింపవలెను. శుద్ధవస్త్రధారియై జపము, హోమము చేసి అతిథులకు బ్రాహ్మణులకు, గురువులకు, ఆశ్రితులకు అన్నమిడి పవిత్ర గంధము ధరించి, ప్రశస్తములగు పుష్పమాలలు ధరించి భుజింపవలెను. పరిశుద్ధ ముఖము కలవాడై సంతుష్టుడై భుజింపవలెను. ఏక వస్త్రమును ధరించి గాని, తడికాళ్ళు, తడిచేతులు కలవాడై గాని, విదిక్కులకు అభిముఖుడైగాని భుజింపరాదు.

మనుజుడు ఇతర దృష్టి లేనివాడై తూర్పు, ఉత్తర దిశాభిముఖుడై ప్రశస్తమైనది హితకరమైనది, గాయత్రీమంత్రోదక ప్రోక్షితమైనదియుఅగు దానిని తినవలెను. నీచులు తీసికొనివచ్చినదియు, ఏవగింపు కలిగించునదియు, వైశ్వదేవాదులచే సంస్కరింపబడ నిదియు పనికిరాదు. శాస్త్రమును అనుసరించు శిష్టులకు ఆకలిగొన్నవారికి పెట్టి తాను తినవలెను. కోపాదులులేనివాడై, భోజనమునకు ప్రశస్తములని చెప్పబడినవియు అగు పవిత్రములు అయిన ప్రేపపాత్రలందు భుజించవలెను. రాజా! పేపబెత్తముల పాత్రలందు అయోగ్య ప్రదేశమునందు సంధ్యాది సమయమందు, జనసమ్మర్ద ప్రదేశమందు భుజింప రాదు. ముందుగా అన్నమును అగ్నియందు హోమముచేసి, మంత్రములతో అభిమంత్రింప బడినదియు, ప్రశస్తమైనదియు పర్యుషితము (బహుకాలముంచబడినది) కానిదియు అగు అన్నమును తినవలెను. ఫలములు, దుంపలు, వేళ్ళు, ఎండిన కొమ్మలు మొదలగునవి అపక్వలేహ్యములు, మోదకాదిగుడ భక్ష్యములు మున్నగువానికి పర్యుషితత్వము లేదు. సారము తీసివేసిన ఆహారములను ఎప్పుడు భుజింపరాదు. రాజా! వివేకవంతు డెపుడును సగముతినిన దానిని మఱల తినరాదు. తేనె, నీరు, పెరుగు, నెయ్యి, పిండి వీనికి మాత్రము పై దోషములేదు. తదేకచిత్తుడై ముందుగ మధురరసమును, మధ్యలో ఉప్పని, పుల్లని పదార్థములను, పిమ్మట కారము చేదు అగు వస్తువులను తినవలెను. మనుజుడు ముందుగ ద్రవ పదార్థమును, మధ్యయందు కఠిన పదార్థమును తిరిగి చివర ద్రవ పదార్థమును తినువాడు బలారోగ్యములను వీడడు.

వాఙ్నియమముతో అన్నమును నిందింపకుండ నిత్యము అనిషిద్ధమైన అన్నమును తినవలెను. ప్రాణాపాన వ్యానో దాన సమాన వాయువుల సంతృప్తికై కఠిన మౌనముతో అయిదు గ్రాసముల (ఆహుతుల)ను పుచ్చుకొనవలెను. ప్రాఙ్ఞుఖుడుగగాని ఉత్తరాభి ముఖుడుగగాని, కూర్చుండి ఆచమనము చేసి భోజనము చేసి, కాళ్ళుచేతులు చక్కగ కడుగుగొని యథావిధిగ మఱల ఆచమనము చేయవలెను. స్వస్థము ప్రశస్తము అగు మనసు కలవాడై ఆసనమునందు కూర్చుండి అభీష్టదేవతా స్మరణము చేయవలెను. ‘వైశ్వానరాగ్ని వాయు ప్రేరితమై, ఆకాశముచే ఒసంగబడిన అవకాశముగల అన్నమును జీర్ణింపజేసి ఆ అన్నరసముచే నాయొక్క పార్థివధాతువు (శరీరము)ను సంతృప్తి నొందించుగాక! దాని వలన నాకు సుఖము చేకూరుగాక! అని పంచభూతానుగ్రహమును కోరవలెను.  తినిన అన్నము పరిపక్వమై నాకు సంబంధించిన పృథివీ, జలాగ్ని, వాయువులకు బలము కలిగించు గాక! దాని వలన అభ్యంతరము లేని సుఖము కలుగుగాక! నాచే తినబడిన అన్నము నా పంచప్రాణములకు పుష్టికరమై నాకు బీరుపోని సుఖము చేకూర్చునుగాక! అగస్త్యుడు, అగ్నిదేవుడు, బడబాగ్నియు నాచే తినబడిన అన్నమును నిశ్శేషముగ జీర్ణింప జేయుదురుగాక! దాని పరిణామము వలన ఆ శరీరము నందు రోగములేకుండ సుఖము కలుగుగాక! సమస్త ప్రాణుల దేహములే దేహముగాగల వాడును, భగవంతుడు అగు విష్ణువొక్కడే కావున నాచే తినబడిన ఈ అన్నమంతయు సత్యస్వరూపుడగు ఆ విష్ణువుచే భుజింపబడినదై, నాకు నారోగ్యము ఇచ్చునదిగ పరిణమించు గాక! తినువాడు, తినబడు అన్నము, తత్పరిణామమున్ను ఆ విష్ణువే అయి ఉన్నాడు. అట్టి సత్యరూపుడగు విష్ణుదేవుని చేతనే తినబడిన ఆ అన్నము చక్కగ జీర్ణించు గాక! అని ఉచ్చరించుచు చేతితో ఉదరమును నిమురు కొనుచు, అలసట లేనివాడై, శ్రమను కలిగించని పనులను చేయవలెను.

సజ్జనుల మార్గమునకు విరుద్ధముకాని, సచ్ఛాస్త్రాదుల వినోదముతో పగటిని గడిపి, పిమ్మట సావధాన చిత్తుడై సంధ్యోపస్థానము చేయవలెను. రాజా! చక్కగ ఆచమనము చేసినవాడై, సాయంకాల సంధ్యను సూర్యునితో కూడినదిగను, ప్రాతస్సంధ్యను నక్షత్ర యుతముగను, న్యాయమును అనుసరించి అనుష్ఠింపవలెను. సూతకాశౌచముగాని, శావా శౌచముగాని, ఉన్మాదముగాని రోగముగాని, ప్రాణభయాదులను గాని వదలి మిగిలిన సర్వకాలములందు సంధ్యోపస్థానము తప్పక చేయవలెను. ఆతురస్థితిలో తప్ప ఇతర సమయమందు సూర్యోదయ కాలమున నిద్రించువాడు ప్రాయశ్చిత్తార్హుడగును. కావున సూర్యోదయమునకు మున్నేలేచి ప్రాతస్సంధ్యను, నిదురించనివాడై, సాయంసంధ్యను ఉపాసించవలెను. పూర్వసంధ్యను పశ్చిమ సంధ్యను ఉపాసించనివారు అంధతామిస్ర నరకమును పొందుదురు.

ఓ రాజా! సాయంకాలమునందు కూడ వైశ్వదేవార్థమై తిరిగి పాకమును చేసి భార్యతోగూడ బలిప్రక్షేపమును ఆచరించవలెను. అందును చండాలాదులకై అన్న ప్రక్షేపమును చేయవలెను. ఆ సమయమున వచ్చిన, అతిథిని గృహస్థుడు తనశక్తిననుసరించి పూజింపవలెను. పాద ప్రక్షాళనము, ఆసనకల్పనము, నమ్రభావము, స్వాగతవచనములతో ఆదరించి అన్నదానము శయనోపకల్పనములతో పూజింపవలెను. పగటియందు అతిథి విముఖుడై వెళ్ళుటవలన వచ్చుపాపము కంటే ఎనిమిది రెట్లు పాపము, సూర్యాస్తమయా నంతరము వచ్చిన అతిథి విముఖుడై వెళ్ళుటవలనవచ్చును. కావున ఓ రాజేంద్రా! సూర్యోఢుడగు (రాత్రి వచ్చిన) అతిథిని స్వశక్తితో పూజింపవలెను. అతడు పూజితుడైన సర్వదేవతలు పూజింపబడినట్లే. నరుడు తనశక్తిని అనుసరించి అన్నశాకజలాదులను ఒసంగి కాని లేక పాన్పు తృణాది ప్రస్తరము చోటును ఇచ్చిగాని సంతోషపెట్టవలయును, గృహస్థు పాదాది శౌచము చేసికొని భోజనమాచరించి మంచమునుగాని, బద్ధలుకాని అనిషిద్ధద్రుమ నిర్మితమయిన బల్లనుగాని చేరవలెను. విశాలముకానిది, బ్రద్దలైనది, విషమమైనది, మలిన మయినది జంతుమయమైనది, పరువబడనిది అగు శయ్యపనికిరాదు. రాజా! పరుండునపుడు ఎప్పుడును తూర్పు తలపిగాని దక్షిణ తలపిగాని ప్రశస్తము. ఇతరమైనది రోగప్రదము.

ఓ రాజా! స్వభార్యయందు ఋతుకాలమునందు సంగమము ప్రశస్తమని ఇంతకు ముందు చెప్పబడినది. ఇంక విశేషములు చెప్పుచున్నాను. పున్నామ నక్షత్రములందు- అనగా అశ్వినీ కృత్తికా రోహిణీ పునర్వసు పుష్యమీ హస్త అనూరాధా శ్రవణ పూర్వాభాద్ర, ఉత్తరాభాద్రా కాలములందు ఉత్తరోత్తర శుభములైన సమసంఖ్యా రాత్రులందు ప్రశస్తము. అననుకూలమైనది: బాధితురాలు, రజస్వల, ఇష్టములేనిది, కుపితురాలు, గర్భవతి అనుకూల భావములేనిది, ఇతరునియందు కోరికగలది, కామము లేనిది, ఇతరుని భార్య, ఆకలిచే కృశించినది, అతిభోజనము చేసినదియు అగు స్త్రీగాని ఈ గుణములతో కూడి యున్న తాను గాని సంగమమునకు పనికిరారు. స్నానముచేసినవాడై మాలాగంధముల ధరించినవాడై ప్రీతుడై అతి తృప్తుడుకానివాడై, ఆకలిగొననివాడై, సంగమేచ్ఛగలవాడై, అనురాగవంతుడై, పురుషుడు సంగమము చేయవలెను. చతుర్దశి, అష్టమి, అమావాస్య, పూర్ణిమ, రవిసంక్రమణము, అనునవి పర్వములు. ఈపర్వములందు తైలమును, స్త్రీని, మాంసమును అనుభవించువాడు చనిపోయి మూత్ర పురీషములు ఆహారములుగాగల నరకమును చేరును. కావున పండితులు సమస్త పర్వకాలములందు నియమవంతులై సచ్ఛాస్త్రము, వేదము, యాగము, ధ్యానము, జపములందు ఆసక్తిగలవారై ఉండవలయును. ఇతర (గవాది) యోనియందుగాని, అయోనియందుగాని, రసాయనాదికము సేవించిగాని దేవతలు, ద్విజులు, గురువుల యొక్క ఆశ్రమమునందుగాని సంగమము చేయరాదు. గుడి మొదలగుచోట్ల ఇంటిముంగిట తీర్థములందు, గోశాలయందు, నాలుగు వీథులు కలిసినచోట, శ్మశానవనమునందు జలములందు పైని చెప్పబడిన సమస్త పర్వములందు సంధ్యాసమయములందుగాని మూత్ర పురీషములచే పీడితయైన స్త్రీనిగాని, మనస్సుతో గూడ సంగమించరాదు. పర్వకాల సంగమము నింద్యము. దివా మైథునము పాపప్రదము. జలాశయసంగమము రోగప్రదమగుటచే అప్రశస్తము. పరస్త్రీలను మనసులోనైనను సంగమించరాదు. సంగమించిన వారికి ఎముకల సంబంధములేని కృమికీటకాది జన్మ వచ్చును. ఈలోకమున ఆయువు క్షీణించును. మరణించిన తరువాత నరకమువచ్చును. పరస్త్రీ సంగమేచ్ఛ ఇహలోక పరలోకములు రెంటియందును భయ ప్రదము అనితలంచి స్వభార్యయందు ఋతు (4 నుండి 16 రోజు వరకు) కాలములందు తెలిసినవాడు సంగమించవలెను. వెనుక చెప్పిన దోషములచే శూన్యులై సంగమేచ్ఛ గలవారు, ఋతుకాలముకాని సమయమునందును ప్రవర్తింపవచ్చును. 

సదాచార ప్రపంచము

దేవగోబ్రాహ్మణ సిద్ధ వృద్ధాచార్యులను పూజింపవలెను. ప్రాతస్సాయములందు సంధ్యా వందనము అగ్న్యుపాసనము చేయవలయును. ఎల్లప్పుడును చినిగిపోని వస్త్రద్వయమును, విష్ణుక్రాంతా ఓషధులను, గారుడాది రత్నములను ధరింపవలెను. అలంకరింపబడిన కేశములుగలవాడై, సుగంధయుతుడై, చక్కని వేషమును ధరించి, మనోహరములగు తెల్లని పుష్పములను ధరించవలెను. పరధనమును లేశమయిన హరింపరాదు. స్వల్పమగు అప్రియమును కూడ పలుకరాదు. ప్రియమైనను అసత్యమును చెప్పరాదు. ఇతరుల దోషములను చెప్పరాదు. పురుష శ్రేష్ఠా! పరస్త్రీని, విరోధమును, అభిలషింపరాదు. దుష్టమైన వాహనమును ఎక్కరాదు. జలప్రవాహముచే హతమయిన ప్రదేశపునీడను ఆశ్రయించరాదు. శత్రువు, పతితుడు, ఉన్మాదముగలవాడు, బహువైరము గలవాడు, బహుకీటకములవలె బాధించువాడు అయోగ్యురాలు (జారిణి), సంకర జాతిది, నీచుడు, అబద్ధములు ఆడువాడు అతిగా ధనము వ్యయము చేయువాడు, పరస్త్రీవాంఛగలవారు, మూర్ఖుడు వీరితో బుద్ధిమంతుడు స్నేహము చేయరాదు. ఒంటరిగ త్రోవను పోరాదు. జలప్రవాహవేగమున మునుగరాదు. దగ్ధమగుచున్న ఇంటిలోనికి పోరాదు. చెట్టుచివరికి ఎక్కరాదు. దంతముల కొరకరాదు. ముక్కును నలుపరాదు. నోరు చేతిలో కప్పకుండ ఆవులించుటగాని ఉమియుట గాని చేయరాదు. బిగ్గరగ నవ్వరాదు. శబ్దము కలుగునట్లు అపానవాయువును విడువరాదు. గోళ్ళు తినరాదు. గడ్డిపరకను త్రుంచరాదు. నేలను రాచరాదు. నేర్పఱి అయినవాడు మీసములను కొఱుకరాదు. మట్టిగడ్డను చిదుపరాదు. అపవిత్రములు అప్రశస్తములు అగు జ్యోతిస్సులను చూడరాదు. దిసమొలతో ఉన్న పరస్త్రీని, ఉదయించుచున్న, అస్తమించుచున్న సూర్యుని చూడరాదు. శవమునుగాని, తద్గంధమును గాని ఏవగించుకొనరాదు. ఆ శవగంధము అగ్నీ ష్టోమీయమగు శరీరమునందలి సోమాంశముగదా! రాత్రియందు ఎల్లపుడు చతుష్పథమును, రచ్చచెట్టుకు, శ్మశానవనమును, దుష్టస్త్రీ సామీప్యమును విడువవలెను. పూజ్యులు దేవులు ద్విజులు జ్యోతిస్సులు వీని నీడను అతిక్రమింప(బాటలో) రాదు. ఒంటరిగా శూన్య అరణ్యమునకు వెళ్ళరాదు. అట్లే జన శూన్య గృహమున వసింపరాదు. కేశములు ఎముకలు ముండ్లు అపవిత్రములు బలులు బూడిద ఊక స్నానముచే తడిసిన భూమి వీనికి దూరముగ తొలగిపోవలెను. అయోగ్యులను ఆశ్రయింపరాదు. కుటిలుని కోరరాదు. క్రూరమృగము లేక పామును సమీపింపరాదు. వానిముందు నిలబడి చాలసేపు ఉండరాదు. అతిగ మేల్కొనుట, అతిగ నిద్ర పోవుట, నిలబడుట, కూర్చుండుట, శయ్యను వ్యాయామమును అతిగ అభ్యసించరాదు. కోరలు కొమ్ములుగల జంతువులను మంచును పురోవాతమును ఎండను దూరముగ విడువవలెను. దిస్సమొలతో స్నానము, నిద్రించుట, ఆచమనము చేయరాదు. జుట్టుముడివేయక ఆచమనము చేయరాదు. దేవతార్చన ఆదికమును చేయరాదు. హోమము దేవతార్చనము మున్నగు క్రియలలోను ఆచమనము చేయునపుడు బ్రాహ్మణపాద ప్రక్షాళనము చేయునపుడు ఏకవస్త్రుడుగ ఉండరాదు.

మంచి శీలము లేనివారితో ఎప్పుడు కలియరాదు. అర్థక్షణమైన సాధుశీలుర సాంగత్యము ప్రశస్తమైనది గదా! ఉత్తములతోగాని అధములతోగాని విరోధము కూడదు. రాజా! వివాహముగాని వివాదముగాని సమానులతో తగియుండును. ప్రాజ్ఞుడు కయ్యమునకు కాలు దువ్వరాదు. శుష్క కలహము పనికిరాదు. అల్పమయిన హానిని సహింపవలెను. వైరముతో ధనము ఆర్జింపరాదు. స్నానముచేసి, స్నాన వస్త్రముతోగాని చేతితోగాని, అవయవములను తుడుచుకొనరాదు. కేశములను దులుపుకొనరాదు. నిలబడి ఆచమనము చేయరాదు. ఒక కాలితో మఱియొక పాదమును త్రొక్కరాదు. పూజ్యులవైపు కాలుచాచరాదు. గురువునకు ఎదుట వినయముతో శయ్యనుగాని, ఆసనమునుగాని, అధిష్ఠించ వలయును. దేవాలయమునుగాని చతుష్పథమునుగాని అపసవ్యముగా చుట్టరాదు. మంగళ ద్రవ్యములను, పూజ్యములను కూడ అట్లే. తద్భిన్నములు అనగా అమంగళ ద్రవ్యములను అపూజ్యములను ప్రదక్షిణము చేయరాదు. చంద్రసూర్యాగ్ని జలవాయువులకు పూజ్యులకు ఎదురుగా ఉమ్మివేయుట, మూత్రపురీషముల, విడుచుట చేయరాదు. నిలబడిగాని మార్గమునందుగాని మూత్రవిసర్జనము చేయరాదు. శ్లేష్మమును మూత్రపురీషములను రక్తమును ఎప్పుడు దాటరాదు. అన్న సమయమునగాని పూజా జపహోమ సమయమునందుగాని, మహా జనమునందు గాని, కఫమునుగాని, చీమిడిగాని విడువరాదు. స్త్రీలను అవమానించరాదు. వారిని నమ్మరాదు. ఈర్ష్య పడరాదు. వారిని ఏప్పుడు ధిక్కరింపరాదు. సదాచారపరుడైన వాడు, మంగల ద్రవ్యములను పుష్పములను, రత్నాది పూజ్యవస్తువులకు నమస్కరించకుండ ఇంటినుండి బయలుదేరరాదు. చతుష్పథమునకు నమస్కరించవలెను. సకాలమున హోమము చేయవలెను. దీనులైన సజ్జనులను ఉద్ధరించవలెను. విద్వాంసులను సేవించవలెను.

ఓ రాజా! దేవతలను ఋషులను పూజించువాడు, పితృదేవతలను ఉద్దేశించి తర్పణాంజలులను వదులువాడు, పిండ ప్రదానము చేయువాడు అతిథులను సత్కరించు వాడును ఉత్తమ లోకములకు ఏగును. మనసును వశము చేసికొని సమయము వచ్చినపుడు హితము ప్రియము అయిన మాటను మితముగ చెప్పువాడు ఆహ్లాద కారణములై అక్షయములైన లోకములకు ఏగును. బుద్ధిమంతుడు లజ్ఞావంతుడు క్షమావంతుడు విద్యచేతను, కులము చేతను పెద్దలైన వారియెడ వినయము కలవాడును ఆస్తికులు అగువారు సర్వోత్త మమగు లోకమున కేగుదురు. ఆసమయ మేఘగర్జనాది సమయమునను పూర్ణిమాది పర్వములందు, అశౌచాదులు కలిగినప్పుడును, సూర్య, చంద్ర గ్రహణాదులందు వేదాధ్య యనము చేయరాదు. కోపించినవారిని శమింపజేయువాడును, అందరికీ బంధువగు వాడును, ద్వేషము లేనివాడును, భయము నొందినవారిని ఓదార్చువాడును, సాధువు అయిన వానికి స్వర్గము అనునది అల్పమైనఫలము. వాన ఎండలందు గొడుగును ధరించియు, రాత్రియందుగాని, అడవులందుగాని దండమును ధరించియు, శరీరరక్షణ కొఱకై పాదరక్షలు ధరించియు, ఎల్లపుడు సంచరించవలెను. పైకిని, అడ్డముగను దూరమును చూచుచు తిరుగరాదు. ఒక కాడి మాత్ర పరిమితమగు ప్రదేశమును జాగ్రత్తగ చూచుచు వెళ్లుచుండవలెను. నియమిత చిత్తముగలవాడై దోషకారణములు అన్నిటిని నిరసించినవానికి, ధర్మార్థ కామముల హాని లేశమైన కలుగదు. సదాచారాసక్తుడు, బాగుగ తెలిసినవాడు విద్యా వినయములందు శిక్షింపబడినవాడు, పాపునియెడ, క్రూరునియెడ, క్రమముగా కల్మషము లేనివాడును, ప్రియవాక్యములను చెప్పువాడును, మైత్రితోకూడిన చిత్తముగల వాడును అగువానికి ముక్తి అనునది చేతిలో ఉన్నది (సులభము). కామ క్రోధ లోభములకు గురి కాకుండ సదాచారములో ఉండినట్టివారి సత్యాది ప్రభావముల చేతనే భూమి ధరింప బడుచున్నది. అందువలన ప్రాజ్ఞుడైనవాడు ఇతరులకు ప్రీతిహేతువగు సత్యము ఎప్పుడు పలుకవలెను. ఇతరుల దుఃఖ కారణమగు సత్యము విషయమై మౌనము వహించవలెను. నేను చెప్పినది ప్రియమైనదేకాని హితకరము కాదు అని తలంచినవాడు అట్టి దానిని చెప్పరాదు. మిక్కిలి అప్రియమైనను శ్రేయస్కరము, హితకరము అగు దానిని చెప్పవచ్చును. బుద్ధిమంతుడగువాడు ప్రాణులకు ఇహపరలోకములందు ఉపకారము కల్గించు         దానిని త్రికరణ (మనస్సు, వాక్కు, కర్మ) శుద్ధితో చెప్పవలయును.

జాతకర్మాదికము

ఔర్వుడిట్లు పలికెను- కుమారుడు పుట్టగనే తండ్రిసచేల (కట్టుబట్టతో) స్నానము చేయవలెను. జాతకర్మను, వృద్ధి(నాందీ) (శ్రాద్ధమును, చేయవలయును. మిథునములను దేవతలను పితరులను తదేకచిత్తుడై, అన్యచిత్తములేకుండ ద్విజుడు క్రమమున పూజించి భుజింపచేయ వలయును. రాజా! తూర్పు లేక ఉత్తరదిక్కుగా అభిముఖుడై రేగుపళ్ళతో కూడిన పెరుగు, అక్షతలతో పిండములను దేవతీర్థము (అంగుళ్యగ్రము)తో గాని, ప్రాజాపత్యతీర్థము (కనిష్ఠి కామూలము)తో గాని ఈయవలయును. ఆ నాందీ (వృద్ధి) శ్రాద్ధముతో, నాందీ మొదలగు పితృగణము తృప్తి చెందును. కావున సమస్త అభ్యుదయ (వృద్ధి) కర్మలందును నాందీ శ్రాద్ధము అవశ్య కర్తవ్యము. కన్యాపుత్ర వివాహములందును గృహప్రవేశములందును, నామకరణమునందును, బాలుర చూడాకర్మ (పుట్టు వెంట్రుకల తీయించుట) మున్నగు వానియందును, సీమంత కర్మమందును, పుత్రాది ముఖావలోకన కర్మమందును, గృహస్థుడు సావధానముగా నాందీ మొదలగు పితృగణమును పూజింపవలెను. వృద్ధి కర్మలందు చేయదగిన పితృగణ పూజావిధానమును సంగ్రహముగ చెప్పితిని.

ప్రేత కర్మాదికము:

ఓ రాజా! ప్రేత కర్మాచరణ విధానమును చెప్పెదవినుడు. మృతుని శరీరమును శుభములగు స్నానసాధనములతో స్నానముచేయించి, మాలలతో అలంకరించి గ్రామమునకు వెలుపల దహనముచేసి సచేల (కట్టు బట్టలతోకూడ) స్నానముచేసి, బంధువులు దక్షిణ దిశాభిముఖులై ఎచటనో అచ్చటనున్న ఈ గోత్రనామములుగల వానికి ఇవి చెందుగాక! అని జలాంజలులను ఈయవలెను. గోవులతో కూడగాని, నక్షత్ర దర్శన సమయమున గాని గ్రామమును ప్రవేశించి, భూమియందు తృణాదిశయ్యపై పరుండుచు, శవసంబంధమైన అశౌచ కృత్య మాచరింపవలయును. రాజా! ప్రేత కొఱకు ప్రతిదినము భూమిపై పిండ ప్రదానము చేయవలయును. మాంసరహితమైన అన్నమును పగటిపూట యందు మాత్రము భుజింపవలెను.

అశౌచదినములలో తమ యిచ్ఛననుసరించి బ్రాహ్మణ భోజనము చేయింపవలెను. బంధుజనభోజనముచే ప్రేత తృప్తి చెందును. మొదటిరోజున మూడవరోజున, ఏడవరోజున తొమ్మిదవరోజున వస్త్రత్యాగ బహిస్స్నానములను చేసి తిలోదకము ఈయవలెను. నాల్గవదినమునందు అస్థి సంచయనము చేయనగును. అటు పిమ్మట సపిండుల (సప్తమ పురుష పర్యంతము సాపిండ్యముండును. (సాపిండ్యం సప్తపూరుషం) అంగస్పర్శ చేయవచ్చును. సమాన సలిల (సమానోదక భావస్తు జన్మనామ్నోరవేదనే) సంధ్యోపాసనాది సర్వకర్మలను ఆచరించవచ్చును. చందన పుష్పాదులు భోగము పనికిరాదు. సంచయ అనంతరము సపిండులకు కూడ శయ్య ఆసనాది భోగము పనికివచ్చును. స్త్రీ సంగమము పనికిరాదు. బాలుడు, దేశాంతరగతుడు (అనగా మహానదిగాని పర్వతముగాని వ్యవధానముగ ఉన్నను, భాషమారినను, దేశాంతరగతుడు అయినను) పతితుడు, యతి, మృతుడు కాగా నీరు, అగ్ని, ఉరి మొదలగు వానిచే మృతుడైనను, వెంటనే శౌచము, ప్రమాదమున జలాగ్నులచే చనిపోయిన యెడల అశౌచముండును. ఎవనిబంధువు మరణించునో, వానియింట భుజించరాదు. దాన ప్రతిగ్రహములు పంచయజ్ఞములు వేద అధ్యయనము వానికి లేదు. ఈ అశౌచము బ్రాహ్మణునకు క్షత్రియునకు పన్నెండురోజులు, వైశ్యునకు పదునైదురోజులు, శూద్రునకుమాసము ఉండును. చివరిరోజున విషమ సంఖ్యాకులైన బ్రాహ్మణులకు భోజనము పెట్టి, ఉచ్ఛిష్టసాన్నిధ్యమున దర్భలమీద ప్రేతకు పిండ ప్రదానము చేయవలయును. బ్రాహ్మణ భోజన అనంతరము చాతుర్వర్య్ణులు క్రమముగ నీరు, ఆయుధము, కొరడా, దండములను తాకినయెడల శుద్ధులగుదురు. పిమ్మట బ్రాహ్మణాదులకు విహితములగు ధర్మములను ఆచరించవలయును. నరుడు నిజధర్మములచే ఆర్జించిన ధనముతో జీవింపవలెను. పిమ్మట రెండవ మాసమునుండి మృతతిథినాడు ఏకోద్దిష్టముగ ఆవాహనాదికము, దైవనియోగము లేకుండ చేయవలెను. అందు ఏకార్ఘ్యము, ఏక పవిత్రము ఎంతమంది బ్రాహ్మణులు భుజించినను ప్రేతకొరకు ఒకపిండమును ఈయవలెను. యజమానునకు బ్రాహ్మణుల ప్రశ్న ప్రతివచనములు. చివరకు ఈతనికి అక్షయ్యమని చెప్పవలెను. ఇట్లు సంవత్సర పర్యంతము ఏకోద్దిష్ట మయమగు ధర్మమే.

సపిండీకరణము:

సపిండీకరణము కూడ ఏకోద్దిష్ట విధానమున ఆచరింపవలెను. సంవత్సరాంతము నందు గాని ఆరవమాసమునందుగాని, ద్వాదశాహస్సునందుగాని, చేయవలెను. తిలగంధ జలములతో కూడిన నాలుగు పాత్రములును ఉంచవలెను. అందు ప్రేతకొకటి, పితృ దేవతలకు మూడు. ప్రేతపాత్రను పితామహ ప్రితామహ, ప్రప్రపితా, మహ పాత్రలలో కలుపవలెను. దానిచే ప్రేత పితృత్వమునందగా, అతడు మొదలుగాగల ముగ్గురు పితృ దేవతలను సమస్త శ్రాద్ధధర్మములతో పూజింపవలెను. పుత్రుడు, పౌత్రుడు, ప్రపౌత్రుడు (మునిమనుమడు), సోదరుడు, వాని సంతతి, సపిండ సంతతి వీరిలో ఎవరైన ఈ కర్మ చేయుటకు అర్హుడు-వారెవ్వరు లేనియెడల సమానోదక సంతతి (పిండముతో సంబంధము గలవారు, సపిండులు, జలముతో సంబంధము గలవారు సమానోదకులు) మాతృపక్ష సపిండ సంబంధులు మాతృపక్ష జలసంబంధులు ఆ రెండు కులములవారు లేనప్పుడు స్త్రీలు చేయనగును. పితృమాతృసపిండ సంబంధులచేతగాని, పితృమాతృ సమానోదక సంబంధులచేగాని, ప్రేతకు సహాధ్యాయులు సహాయులు, సహయాత్రికులుగాని ప్రేతకర్మలు చేయతగుదురు, బంధురహితుడైన ప్రేతయొక్క ధనముతో భూపతికర్మ చేయింపవలెను.

పూర్వక్రియలు, మధ్యమక్రియలు, ఉత్తరక్రియలు అని ఈ క్రియలు మూడు విధములు. వాని భేదమును చెప్పెద వినుము.

దహన ప్రభృతి అశౌచ అంతమువరకు పూర్వ క్రియలు. నెలనెలకు ఏకోద్దిష్ట విధితో చేయుకర్మలు మధ్యమక్రియలు. ప్రేతపితృత్వమునందిన తరువాత సపిండీ కరణము తరువాత చేయబడు క్రియలు ఉత్తరక్రియలు. అందు పితృ మాతృ సపిండులచే గాని, సమానోదకులచే గాని సంఘాతాంతర్గతులచే అనగా సహాధ్యాయ, సహాయ, సహయాత్రి కులచేగాని, ప్రేతధనము తీసికొనిన రాజుచేగాని, పూర్వ మధ్యమ క్రియలు చేయతగును. ఉత్తర క్రియలు పుత్రాదులచేతనే చేయతగును. దౌహిత్రులచేగాని, వారిపుత్రులచేగాని ఈ ఉత్తర క్రియలు చేయనగును. మృతదినమునందు స్త్రీలకుకూడ ఉత్తర క్రియలు చేయవలెను. ప్రతి సంవత్సరము ఏకోద్దిష్ట విధానముతో చేయవలసిన ఉత్తర క్రియలను ఏ విధమున చేయవలయునో చెప్పెదవినుము.

ఉత్తర క్రియా వివరణము

శ్రాద్ధ ప్రశంస:

శ్రద్ధతో శ్రాద్ధమునుచేయు మనుజుడు బ్రహ్మ, దేవేంద్ర, రుద్ర, అశ్వినీ, దేవ, సూర్య, అగ్ని, వసు, వాయువులను, విశ్వేదేవతలను, పితృగణమును, పశుపక్షులను, మనుజులను, సర్పములను, ఋషిగణమును, ఇంకను సమస్త భూతములతోను ఒప్పు సకల జగత్తును సంతోషపెట్టిన వాడగును. ప్రతిమాసము అమావాస్యనాడు కృష్ణపక్షమునందు, అష్టకలయందు (తిస్రోష్టకలు) శ్రాద్ధము చేయవలెను. కాలములను చెప్పెద వినుము. శ్రాద్ధమునకు తగిన ద్రవ్యము విశిష్టమైన బ్రాహ్మణుడు సంప్రాప్తము కాగా తెలిసికొని శ్రాద్ధమును పెట్టవలెను. అట్లే వ్యతీపాతనామక యోగమునందు దక్షిణ, ఉత్తరాయణ కాలమందు విషువము (దివారాత్రములు సమానముగ ఉన్న సమయము) నందు సంక్రమణములందు సూర్య, చంద్ర గ్రహణములందు నక్షత్ర గ్రహపీడలందు దుష్టస్వప్నమును కన్నను, నూతన ధాన్యము వచ్చినపుడు, కామ్య శ్రాద్ధములను చేయవలయును. అమావాస్య, అనూరాధా విశాఖా స్వాతి నక్షత్రములతో కూడినపుడు పెట్టిన శ్రాద్ధములచే, పితృగణము ఎనిమిది సంవత్సరములు తృప్తినిపొందును. పుష్యమి అర్ర్ద్ పునర్వసు నక్షత్రములతోగూడిన అమావాస్యయందు అర్చితులై పితృదేవతలు ద్వాదశ వార్షిక తృప్తిని పొందుదురు. ధనిష్ఠ పూర్వాభాద్ర శతభిషక్ నక్షత్రములతో కూడిన అమావాస్య పితరులకు దేవతలకు తృప్తిని కలుగజేయగోరు మనుజులకు (పరమతృప్తి హేతువగుటచే)దుర్లభమైనది. ఈ పైనిచెప్పిన తొమ్మిది నక్షత్రములతో కూడిన అమావాస్యయందు పెట్టిన శ్రాద్ధము పితృదేవతలకు తృప్తిని ఇచ్చును. అట్లే తృప్తినిచ్చు మఱియొక శ్రాద్ధమును చెప్పెద వినుము. ఇది వినయ వంతుడు పితృభక్తుడు అగు నైలుడు అడుగగా సనత్కుమారునిచే చెప్పబడినది.

సనత్కుమారుడు ఇట్లు పలికెను. “వైశాఖ శుక్ల తదియ కార్తిక శుక్ల నవమీ, భాద్రపద కృష్ణ త్రయోదశి మాఘ కృష్ణ అమావాస్య ఈ నాలుగు తిథులు పవిత్రములు యుగాదులు అని పురాణములందుచెప్పబడినవి. సూర్యచంద్రగ్రహణములందు తిస్రోఽ ష్టకల (మార్గశిర, పుష్య, మాఘ, ఫాల్గుణ, కృష్ణ సప్తమి, అష్టమి, నవమి) యందు దక్షిణ, ఉత్తరాయణము లందు మంచి నీరైన నువ్వులతో కలిపి నియమవంతుడై పితృ దేవతల కొఱకు అంజలులు సమర్పింపవలెను. అట్లు చేసినయెడల వెయ్యిసంవత్సరములు శ్రాద్ధము చేసినట్లు అని పితృదేవతలు ఈరహస్యమును చెప్పుదురు. మాఘకృష్ణ అమావాస్య శతభిషక్ నక్షత్ర యోగము కలదగుటచే పితృదేవతలకు సామాన్య పుణ్యములతోరాదు. ధనిష్ఠా నక్షత్రముతో కూడిన ఆకాలమందు తత్కుల సంజాతులగు నరులచే ఈయబడిన జలములు పదివేల సంవత్సరముల వరకు తృప్తిని ఈయగలవు. ఆకాలమే పూర్వాభాద్రతో కూడిన యెడల అట్టి సమయమున ఈయబడిన శ్రాద్ధము గొప్ప తృప్తిని కలుగజేయును. పితృదేవతలు వేయి యుగములు గాఢముగ నిద్రింతురు. గంగ శతద్రు యమున విపాశ సరస్వతి నైమిశారణ్యగత గోమతీ నదులలో స్నానముచేసి పితృదేవతలకు చేసిన అర్చనము తనకుదురిత నాశనము చేయును. భాద్రపద కృష్ణ త్రయోదశినాడు మఘానక్షత్ర యోగము నందు చేసిన శ్రాద్ధము వలన తృప్తిచెంది పితరులిట్లు గానము చేయుచుందురు.” మాఘ కృష్ణ పక్షమున శుభతీర్థ జలముతో పుత్రాదులచే ఈయబడిన శ్రాద్ధముతో తృప్తిని చెందితిమి. పరిశుద్ధమగు మనసు ధనము ప్రశస్తమగు కాలము చెప్పబడిన విధి, యథోక్త మగు పాత్ర (భోక్త) గొప్ప భక్తియు మనుజులకు కోరిన కోర్కెలను ఈయగలవు.”

పితృ దేవతలచే గానముచేయబడిన ఈ శ్లోకములను రాజా! వినుము. నీవట్లే చేసి ఆ విషయమై దృఢ చిత్తముతో ప్రవర్తిల్లుము. మనవంశమునందు విత్తశాఠ్యము (ఉండియు లేదనుకొనుట)చేయక, మనకు పిండప్రదానముచేయు, బుద్ధిమంతుడు ధన్యుడు అగు జనుడు పుట్టునా? సంపద కలిగి మనలను ఉద్దేశించి బ్రాహ్మణుల కొరకు రత్నమును, వస్త్రమును, గొప్పవాహనమును, సర్వభోగాదికమును, ధనమును ఇచ్చువాడు మనవం శమున పుట్టునా! పరిమితమగు సంపదగలవాడై తత్కాలమున భక్తినమ్రుడై యథాశక్తిగా అన్నముతో యోగ్యులగు బ్రాహ్మణులకు భోజనము పెట్టువాడు మన వంశమున పుట్టునా! అన్న ప్రదానము చేయుటకు శక్తి లేక తన శక్తి కొలది ధాన్యమునుగాని అపక్వ తండు లమును, అల్పమైన దక్షిణను బ్రాహ్మణోత్తములకు ఇచ్చువాడు పుట్టునా? అంతకుకూడ సామర్థ్యము లేక కరాగ్రమున ఉన్న తిలలను బ్రాహ్మణ శ్రేష్ఠునకు నమస్కరించి ఇచ్చువాడైన పుట్టునా! లేక ఏడెనిమిది నువ్వుగింజలతో కూడిన జలాంజలినైను, భక్తినమ్రుడై ఇచ్చువాడైనా పుట్టునా! ఆ మాత్రముగూడ లేనివాడై యెచ్చటనైన సంపాదించి గోవుల కొఱకు ఒక్కదినమైన సంతుష్టిని కలిగించు గడ్డి మొదలగు దానినైన శ్రద్ధతో మాకు తృప్తికై ఇచ్చువాడు పుట్టునా! ఏమియు లేనిచో వనమునకు వెళ్ళి తనలేమిని ప్రకటించుటకై రెండు చేతులను ఎత్తి సూర్యాది అష్ట దిక్పరిపాలకులను ఉద్దేశించి, ఈ శ్లోకమును బిగ్గరగా పఠింపవలెను-నాకు హిరణ్యాది రూప ధనముగాని, జీవనధనమగు ధాన్యాదికము గాని, శ్రాద్ధమునకు ఉపయోగపడునది లేదు. మా పితృదేవతలకు నమస్కరించుచున్నాను. మీ ప్రీతి కొఱకై ఆకసము నందు నాయీ చేతులను ఎత్తితిని. నా భక్తితో దేవతలు తృప్తి చెందుదురుగాక!”

ఔర్వుడిట్లు పలికెను- “భావాఽ భావ ప్రయోగార్హ మగునట్లు పితృదేవతలచే ఇది చెప్పబడినది. శక్తి అశక్తి ప్రయుక్త కృత్యమగు దీనిని ఆచరించినయెడల శ్రాద్ధము వానిచే చేయబడినట్లే”.

శ్రాద్ధభోక్తలు

శ్రాద్ధమునందు ఎట్టి గుణములుగల వారగు బ్రాహ్మణులను భుజింపచేయ వలెనో చెప్పెద. వినుడు. త్రిణాచికేతః=ద్వితీయకాఠక మందున్న మూడు అనువాకములగు త్రిణాచికేత మంత్రములను చదివినవాడు, లేక తదర్థానుష్ఠానము చేయువాడు. త్రిమధుః = “మధు వాతా”అను మూడు ఋక్కులను అధ్యయనము చేసినవాడు లేక అది వ్రతముగా కలవాడు, లేక ఛాందోగ్యోక్తమగు మధు విద్యానిష్ఠ గలవాడు. త్రిసువర్ణః “బ్రహ్మమేతుమాం’ ‘ అను అనువాక త్రయమును అధ్యయనము చేసినవాడు. లేక తద్ర్వతుడు; లేక “చతుర్వర్గా’ ‘ అను ఋక్కును అధ్యయనము చేసినవాడు లేక తద్ర్వతుడు; షడంగవిత్ = శిక్షావ్యాకరణాది షడంగములతో కూడిన వేదమును అధ్యయనము చేసినవాడు, తదర్థ ప్రచారకుడు. యోగీ = బ్రహ్మ ధ్యానము చేయువాడు, జ్యేష్ఠ సామగః (“ఆజ్యదోహ” మను సంజ్ఞతో చెప్పబడు సామవిశేషమునకు జ్యేష్ఠసామము అనిపేరు) దానిని చెప్పువాడు, ఋత్విక్కు, మేనల్లుడు, దౌహిత్రుడు, అల్లుడు, పిల్లను ఇచ్చినమామ, మేనమామ. తపోనిష్ఠుడు, పంచ + అగ్ని + అభిరతః = ఆహవనీయాది త్రేతాగ్నులు సభ్యావసభ్యాగ్నులు రెండు = మొత్తము అయిదు అగ్నుల యందు అభిరతుడు. లేక వేదాంతములందు చెప్పబడిన ద్యు, పర్జన్య, పృథివీ, పురుష, యోషితూప పంచాగ్ని విద్యను ఉపాసించువాడు. శిష్యులు, వియ్యంకులు, మాతా, పితరులను సేవించువాడు. పైనిచెప్పిన గుణములుగల బ్రాహ్మణులను శ్రాద్ధమునందు ప్రథమమున పితృదేవతల సంతుష్టికై నియోగింపవలెను. వారు దొరకని సమయమునందు, అనుకల్పమునందు ఆ గుణములు లేనివారిని నియోగించవలెను.

మిత్రద్రోహి, పిప్పిగోళ్ళుగలవాడు, నపుంసకుడు, గొగ్గిపళ్ళవాడు, బ్రాహ్మణుడు కానివాడు, కన్యల దూషించువాడు, అగ్నిని వేదములను వదలినవాడు, సోమ విక్రయము చేయువాడు, మహాపాతకోపేతుడు, దొంగ, కొండెములు చెప్పువాడు, గ్రామార్థమై పౌరో హిత్యము చేయువాడు, ధృతిచే వేదము చెప్పువాడు, భరణమిచ్చి వేదాధ్యయనము చేసిన వాడు, రెండవపెళ్ళి చేసికొన్న దాని భర్త, తల్లిదండ్రులను విడిచినవాడు, శూద్రాపత్యమును పోషించువాడు, శూద్రస్త్రీపతి, దేవాలయార్చకుడు, వీరలు శ్రాద్ధమునందు ఆమంత్రణమునకు పనికిరారు. పండితుడు మొదట శ్రోత్రియులగు యోగ్యులను నియంత్రించవలెను. వారికి పితృదేవతలకై నిమంత్రణము అని చెప్పవలెను. పిమ్మట బ్రాహ్మణులతోకూడ కోపము, మైథునాదికము చేయరాదు. బ్రాహ్మణులును చేయరాదు. అట్లు చేసిన యెడల మహా దోషము. శ్రాద్ధమునందు నియుక్తుడై భుజించినను, ఇతరుని భుజింపచేసినను, మైథునము చేసినవాడు తన పితరులను రేతోగర్తము (పురుష వీర్యముగల గుంట)లో ముంచిన వాడగును. అందువలననే ముందుగ శ్రేష్ఠులగు బ్రాహ్మణులను నిమంత్రణము చేయవలయునని చెప్పబడెను, బ్రాహ్మణులను నియోగింపక తనయింటికి వచ్చిన నియమితేంద్రియులను, పాద్యాదులతో భుజింపచేయ వచ్చును. పవిత్రమును ధరించినవాడై ఆచమనముచేసినవారిని ఆసనములందు కూర్చుండ పెట్టవలెను. పితృదేవతలకై బేసి సంఖ్యవారిని, దేవతలకొఱకై సరిసంఖ్య వారిని లేక ఉభయులకు ఒక్కొక్కరిని నియంత్రించ వలెను. అట్లే వైశ్వదేవముతో మాతామహ శ్రాద్ధమును చేయవలెను. భక్తి సంపన్నుడై పితృమాతామహ శ్రాద్ధములు తంత్రముగా వైశ్వదేవముతో (ఒకే విశ్వేదేవ స్థానములో) చేయవచ్చును. విశ్వేదేవతలను తూర్పు ముఖముగను, పితృదేవతలను ఉత్తరముఖముగను లేక విశ్వేదేవతలను ఉభయాత్మకముగ భుజింపచేయవచ్చును.

పితృమాతామహవర్గముల వారికి వేఱుగా శ్రాద్ధము చేయవలయునని కొందరు అందురు. ఇతరమహర్షులు ఒకచోటనే ఒకే పాకముతో చేయవలయును అందురు. ఆసనార్థమై కుశలనిచ్చి అర్ఘ్యాది విధానముతో పూజించి ప్రాజ్ఞుడు దేవతల ఆ వాహనమును, దేవాత్మ బ్రాహ్మణానుజ్ఞతో చేయనగును. యవల జలముతో దేవతలకు అర్ఘ్యమును విధానమెఱింగినవాడై ఈయవలయును. పూలదండ, గంధము ధూపదీపములను యథా విధిగ సమర్పించి, పితృదేవతలకు అపసవ్యముగ సమస్తమును కల్పించి, అనుజ్ఞనుపొంది, దర్భలను రెండు విధములుగ భాగించి, మంత్రపూర్వకముగ పితృదేవతల ఆవాహనము చేయవలయును. తిలోదకముతో అపసవ్యముగ అర్ఘ్యాదికము సమర్పింపవలయును. ఆ సమయమున అన్నకాముడై ఏతెంచిన బాటసారియగు అతిథిని, బ్రాహ్మణుల అభ్యనుజ్ఞ నొంది, దానిని కూడ భుజింపచేయవలెను. యోగీశ్వరులు, నరులకు ఉపకారము చేయు వారై, వివిధ రూపములతో అవిజ్ఞాత రూపమున భూమినంతను తిరుగచుందురు. కావున శ్రాద్ధకాలమున ఏతెంచిన అతిథిని పండితుడైనవాడు అర్చించవలెను. ఓ రాజా! పూజింపబడని అతిథి, శ్రాద్ధమాచరించుటచే కలుగుఫలమును నాశము చేయును. ఓ పురుషోత్తమా! పిమ్మట ఆ బ్రాహ్మణ అనుజ్ఞ పొంది, వ్యంజన (శాకాదిక)ములు, లవణాది కము లేని అన్నమును మూడు పర్యాయములు హోమము చేయవలయును.

అగ్నయేకవ్య వాహనాయ స్వదేత్యాదౌనృపాహుతిః

సోమాయవై పితృమతే దాతవ్యాతదన న్తరమ్

  వై వస్వతాయచై వాన్యాతృతీయాదీయతే తతః  

హుతావశిష్టమల్పాస్నం విప్రపాత్రేషు నిర్వపేత్  

  తతోన్నంమృష్టమత్యర్థ మభీష్టమతిసత్కృతమ్

ద త్త్వాజుషధ్వమిచ్ఛాతోవాచ్యమేతదనిస్ఠురమ్

భో క్తవ్యంతై శ్చతచ్చిత్తైర్మౌ నిభిస్సుముఖై స్సుఖమ్    

అక్రధ్యతాచాత్వరతాదేయం తేనాపిభ క్తితః  

  రక్షోఘ్నమన్త్రపఠనం భూమేరా స్తరణం తిలైః

కృత్వాధ్యేయాస్స్వపితర స్తఏవద్విజస త్తమాః  

పితాపితామహశ్చైవతథై వ ప్రపితామమః

మమతృ ప్తింప్రయా స్త్వద్యవిప్రదే హేషుసంస్థితాః  

పితాపితామహ శ్చైవ తథైవ ప్రపితామహః

తృ ప్తింప్రయా స్తుపిణ్డేన మయాద త్తేన భూతలే

 పితాపితామహశ్చైవతథై వప్రపితామహః

తృప్తిం ప్రయా న్తుమేభ క్త్యాయన్మయైతదుదాహృతమ్

మొదట “అగ్నయే కవ్యవాహనాయ స్వధానమః” అను ఆహుతి. పిదప “సోమాయ పితృమతే స్వాహా” అను ఆహుతి. మూడవ ఆహుతి “వైవస్వతాయ యమాయాంగి రస్వతే” అని హోమముచేయగా, మిగిలిన అన్నము అల్పమైన దానిని బ్రాహ్మణుల విస్తళ్ళలో ఉంచవలెను. పిమ్మట మృష్టాన్నమును చక్కగ తయారుచేసిన దానిని వడ్డించి మీ అభీష్టము అనుసరించి భుజింతురు గాక! అని మృదువుగ చెప్పవలెను. బ్రాహ్మణులు తదేకచిత్తులై మౌనముతో సుముఖతతో సుఖముగ భుజించవలెను. కోపము, వేగము లేకుండ యజమాని భక్తి పూర్వకముగ వడ్డించవలెను. రక్షోఘ్న మంత్రములను చదువవలెను. తిలలతో భూమి యందు ఆస్తరణమును కల్పించి, ఆ బ్రాహ్మణులను తమ పితృ దేవతలుగ ధ్యానింపవలెను. నా యొక్క పితృ, పితామహ, ప్రపితామహులిపుడీ బ్రాహ్మణుల దేహమందు ఉన్నవారై తృప్తిని పొందుదురుగాక! హోమముచే సంతుష్టి చెందుదురుగాక! అట్లే భూమి యందు నాచేత ఒసంగబడిన పిండముచే తృప్తినందుదురు గాక! నా యొక్క భక్తిచే వారు తృప్తి నందుదురు గాక! మాతామహాదులు, విశ్వేదేవతలు పరమ తృప్తి నొందుదురుగాక! రాక్షసులు నశింతురుగాక! హవ్వకవ్యములను (దేవతలకు, పితరులకు ఒసంగు అన్నములు) భుజించువాడును, యజ్ఞేశ్వరుడును, అవ్యయుడు అగు శ్రీహరి ఇచట ఉండుట వలన సమస్త రాక్షసులు, అసురులు వెంటనే తొలగి పోవుదురుగాక! ఆ బ్రాహ్మణులు తృప్తినొందిన వెనుక భూతలమునందు అన్నమును చిమ్మవలెను. పిదప వారికి ఉత్తరాపోశన మీయవలెను. తృప్తులైన బ్రాహ్మణుల అనుజ్ఞనొంది, సావధానచిత్తుడై అన్నముతోను, నీటితోను భూతలమునందు పిండ ప్రదానము చేయవలెను. పితృతీర్థము (తర్జనీ మూలము) తో జలమును, తిలోదకమును పిండములను ఇవ్వవలెను. మాతామహాదులకు కూడనట్లే. దక్షిణాగ్రములగు దర్భలమీద పుష్పాదులచే పూజింపబడిన పిండములను ఉచ్ఛిష్ట సన్నిధానమున పితృ పితామహాదులకు ఒసంగి ఆ దర్భల మూలమునందు లేపభుక్కులగు చతుర్థాది పితరులను, లేపఘర్షణముతో సంతోష పెట్టవలయును. మాతామహాదులను కూడ అట్లే పూజించి యథాశక్తి దక్షిణలను ఒసగవలెను. వారి ఆశీస్సులను కోరి, ముందు పితృదేవతలను పిమ్మట విశ్వేదేవతలను విసర్జింపవలెను. (విశ్వే దేవతంత్ర పక్షమున- ముందు విశ్వే దేవతలకు, తరువాత పితరులకు చేయవలెను.) మాతామహాదులకు కూడ ఇట్లే. ప్రీతి వాక్కులను అడిగి, ద్వారపర్యంతము అనుగమించి మరలవలెను. పిమ్మట వైశ్వదేవమును నిత్య కృత్యముచేసి ఇష్టులు, శిష్టులు భృత్యులతో భుజింపవలెను.

ఈ విధముగా పండితుడు పితృ శ్రాద్ధమును మాతామహ శ్రాద్ధమును చేయవలెను. శ్రాద్ధములచే తృప్తి నందిన పితామహులు సర్వవాంఛలను అనుగ్రహింతురు. దౌహిత్రుడు (సుతాపుత్రుడు), కుతపకాలము, అనగా 8/15 దినభాగము, తిలలు, ఈ మూడు శ్రాద్ధము నందు పవిత్రములు. అట్లే వెండి వృత్తాంతము, వెండిదానము, తత్సంకీర్తనము మొదలగునవి పవిత్రములు. శ్రాద్ధముచేయునతడు భోక్తయు, కోపమును, మార్గగమనమును వేగమును, విడువవలెను. శ్రాద్ధము ఆచరించువాని కులము పితరులు, మాతామహులు విశ్వేదేవులు తృప్తి చెందుదురు. పితృగణము సోముని (చంద్రుని)పై ఆధారపడి ఉన్నది. ఆసోముడు యోగముపై ఆధారపడి ఉన్నాడు. కావున ఓరాజా! శ్రాద్ధమునందు యోగిని నిమంత్రించుట ప్రశస్తము. వెయ్యిమంది బ్రాహ్మణులకు ముందున్న యోగి భోక్తలను, యజమానుని తృప్తినొందించును.

సదాచార వర్ణనమ్

ఔర్వుడిట్లుపలికెను - శ్రాద్ధమున ఉపయోగింపదగిన వస్తువులు, పితృదేవతలకు తృప్తికలిగించువానిని చెప్పుచున్నాడు. హవిష్యా (వ్రీహ్యా)ద్యన్నముచేత ఒక మాసము మత్స్యముచే, రెండు నెలలు, కుందేలు, ముంగిస, పంది, మేక, లేడి, దుప్పి, గవయ మృగము, పొట్టేలు, గోవు వీనికి సంబంధించిన మాంసములచే మాసవృద్ధిగా అనగా - కుందేలు మాంసముచే మూడు నెలలు, ముంగిసచే నాల్గు నెలలు, పందిమాంసముచే అయిదు నెలలు, మేక మాంసముచే ఆర నెలలు, లేడి మాంసముచే ఏడు నెలలు, దుప్పి మాంసముచే ఎనిమిది నెలలు, గవయమృగ మాంసముచే తొమ్మిది నెలలు, పొట్టేలు మాంసముచే పదినెలలు, గోమాంసముచే పదునొకండు నెలలు, నల్లని ఎఱ్ఱని శిరస్సు తెల్ల ఱెక్కలుగల పక్షికి వార్థన మనిపేరు. దానిమాంసముచే నిత్యతృప్తియు పితృదేవతలకు కల్గును. ఖడ్గమృగ మాంసము, కఱివేప, తేనె ఇవి శ్రాద్ధ కర్మయందు మిక్కిలి ప్రశస్తములు. మిక్కిలి తృప్తి కరములు. గయా క్షేత్రమునకు ఏగి శ్రాద్ధముచేయు ఆతని జన్మ పితృదేవతలకు తృప్తి నిచ్చునదై సఫలమైనది. నల్లయవలు నివ్వరి ధాన్యము శ్యామాకములు (శ్వేత కృష్ణములు) వన్యౌషధి ప్రధానములు శ్రాద్ధార్హములు. యవలు, కొఱ్ఱలు, పెసలు, గోధుమలు, వ్రీహులు తిలలు, అనుములు, కాంచనము, ఆవాలు ఇందు మంచివి. ఆగ్రయణేష్టిచే సంస్కరింపబడని ధాన్యము, అలచందలు, చిఱువడ్లు (బుడమ ధాన్యము), చిఱుసెనగలు వీనిని శ్రాద్ధమున విడువవలెను. సొర, వెల్లుల్లి, నీరుల్లి, పిండమూలకము (కందమూలము), గాంధారవము (శాల విశేషము) పేలపిండి, లవణము, ఊషరక్షేత్రమున పుట్టినవి, ఎఱ్ఱనైన నిర్వాసనము (బంక, ఇంగువ మొ!!) లవణోత్కర పదార్థములు మున్నగునవి శ్రాద్ధమునందు పనికిరావు. క్రొత్తగా తీసికొని రాబడి, అదియు వాడనిదియు, ఆవునకు తృప్తిని కలిగించనిది (అల్పోదకము), దుర్వాసనగలది, నుఱుగుతో గూడినదియు, అగు నీరు శ్రాద్ధ యోగ్యముకాదు. ఒక గిట్టగల దానిపాలు, ఒంటెపాలు, మేకపాలు, లేడిపాలు, గేదెపాలు శ్రాద్ధము నందు విడువవలెను. నపుంసకుడు బహిష్కృతుడు చండాలుడు పాపాత్ముడు వేదబాహ్యుడు రోగి, కోడి, కుక్క, వేదకర్మను త్యాగము చేసినవాడు, కోతి, ఊరపంది, రజస్వల, ప్రసవమైనది, శౌచములేనివాడు, శవవాహకత్వముతో జీవించువాడు-వీరిచే చూడబడిన శ్రాద్ధమునందు దేవతలు పితృ దేవతలు భుజించరు. కావున సంవృతమగు ప్రదేశమునందు శ్రాద్ధమును శ్రద్ధతో పెట్టవలెను; భూమిపై నువ్వులను చల్లి రాక్షసులను పారద్రోలవలెను. గోళ్లు, కేశములు, కీటకములు, తొక్కితీసిన రసముతోను, పర్యుషితము (అతిక్రాంత కాలము) అగు అన్నము పనికిరాదు. శ్రద్ధతో కూడిన వారిచే నామగోత్ర పూర్వకముగ ఈయబడిన అన్నాదికము వారి పితృదేవతలు ఏలోకమునందు ఏ ఆహారమును తినువారు పుట్టిరో ఆలోకమునందు ఆహారముగమారి వారికి చెందును. ఓరాజా! హిమవత్ పార్శ్వము నందలి కలాప గోమోపవనమునందు మనుపుత్రుడగు ఇక్ష్వాకు మహారాజును ఉద్దేశించి పితృ దేవతలచే గీతమైన గాథయొకటి గలదు. మా కులమునందు సన్మార్గశీలురై గయకువెళ్ళి ఆదరముతో మాకు పిండములను వేయువారు పుట్టగలరా? మా వంశమునందు మఘా నక్షత్రయుక్త భాద్రపద కృష్ణత్రయోదశియందు తేనెతోను, నేతితోను గూడిన పాయసమును మాకు పెట్టువాడుపుట్టునా? పదిసంవత్సరముల పిల్లను వివాహము చేయువాడు నీల (ముఖమునందు తోకయందు గిట్టలు కొమ్ములు తెల్లనై ఉన్న ఎఱ్ఱని ఎద్దునకు నీలమని పేరు) వృషోత్సర్జనము చేయువాడును దక్షిణతో గూడిన అశ్వమేథ యాగమును యథావిధిగ చేయువాడును పుట్టునా?

సదాచార ఉల్లంఘనాదిస్వరూపము

శ్రీపరాశరుడిట్లు పలికెను - మైత్రేయా! ఔర్వుడు మహాత్ముడు అగు సగరునకు సదా చారమునుగూర్చి అడుగగా ఇట్లు చెప్పెను. నాచేత గూడ నీకు చెప్పబడెను. సదా చారములేకుండ ఎవ్వడును మంచిని పొందలేడు. శ్రీ మైత్రేయుడిట్లు పలికెను - షండుడు, అపవిద్ధుడు. మున్నగువారు ఉదాక్ష్యాదులును నాకు తెలిసినవారే. నగ్నుడనగా నెట్టివాడు? నీకు తెలియనిది లేదు. వాని స్వరూపమును వినగోరెదను. శ్రీ పరాశరుడు ఇట్లనియె- ఋగ్యజుస్సామ వేదములకు త్రయీ అనిపేరు. త్రయీ అనునది వర్ణరూపమైన ఆవరణమే గాక సర్వదుఃఖ నివారకమైన సంవరణముకూడ. అట్టిదానిని అజ్ఞానముచే విడిచిన బ్రాహ్మడు మహాపాతకి అగు నగ్నుడు. సందేహములేదు. మా పితామహుడు ధర్మజ్ఞుడు. అగు వశిష్ఠుడు మహానుభావుడగు భీష్మునకు చెప్పుచుండగా నీవు నన్ను అడిగిన నగ్న సంబంధ విషయమును నేను విన్న దానిని చెప్పుచున్నాను. వినుము - పూర్వము దేవాసురులకు నూఱు దివ్య సంవత్సరములు యుద్ధము జరుగగా, అందు హ్రాదుడు మున్నగు రాక్షసులచే దేవతలు జయింపబడి, క్షీరసముద్రము యొక్క ఉత్తర తీరముచేరి తపస్సు చేయుచు శ్రీ విష్ణువును ఆరాధించుటకై పఠించిన స్తోత్రము ఇది -

దేవకృత విష్ణుస్తవము

ఆరాధనాయ లోకానాం విష్ణోరీశస్య యాంగిరమ్

వక్ష్యా మోభగవానద్యతయా విష్ణుః ప్రసీదతు

 యతోభూతాన్య శేషాణి స్రూతాని మహాత్మనః

యస్మింశ్ఛలయమేస్య న్తి క స్తంసంస్తోతుమీశ్వరః

తథాఽ ప్యరాతి విధ్వంసధ్వ స్తవీర్యాభయార్థినః    

త్వాంస్తోష్యామ స్తవో క్తీనాం యథాథ్యంEనేశగోచరేత్

 త్వముర్వీ సలిలం వహ్నిర్వాయురాకాశ మేవచ

సమస్త మస్తః కరణం ప్రధనంతత్పరః పుమాన్

 ఏతంతవై తద్భూ తాత్మన్ మూర్త మయంవపుః

ఆబ్రహ్మ స్తమ్బపర్య న్తం స్తానకాలవి భేదవత్

 తత్రై శంతవయత్పూర్వంత్వన్నాభికమలోద్భవమ్    

రూపంసర్గో పకారాయక స్మైదేవాత్మనేనమః

 శక్రార్క రుద్రవస్వశ్విమరుత్సో మాదిభేదవత్

వయమేకం స్వరూపం తేతస్మై దేవాత్మనేనమః

 దమ్భప్రాయమ సంబోధితితిక్షాదమవర్జి తమ్

యధ్రూపంతవగోవిన్ద తస్మై దైత్యాత్మనేనమః

నాతిజ్ఞానవహాయస్మిన్నాడ్య స్త్సిమితతేజసి  

శబ్దాదిలోభియ త్తస్మైతుభ్యం యక్షాత్మనేనీమః

 క్రౌర్యంమాయామయం ఘోరంయచ్చరూపంత వాసితమ్

నేశాచరాత్మనేతస్మై నమస్తేపురుషోత్తమ

లోకారాధనకొఱకై విష్ణువునకు సంబంధించిన మేము చెప్పబోవు వాక్కుచే సర్వేశ్వ రుడగు విష్ణువు ప్రసన్నుడగుగాక! సమస్త భూతములు ఏ మహాత్మునినుండి బయలు దేరినవో ఎవ్వనియందు లయమగుచున్నవో, అట్టివానిని ఎవడు స్తుతింపగలడు? అయినను శత్రుకృత పరాభవముచే నశించిన శౌర్యముగలవారమై, అభయమును కోరుచు మేము నిన్ను స్తుతించెదము. నీ యదార్థస్థితి వాక్కులకందదు. నీవు భూమ్యాది పంచభూతములు సమస్తాంతఃకరణము-అనగా మనోబుద్ధి అహంకార చిత్తములు ప్రకృతి పురుషుడుఅను నీ మూర్తామూర్తరూపము స్థానకాల భేదముకలదియు అగు జగత్తు నీ యొక్క శరీరము. అందు నీ నాభికమలమందు పుట్టిన విశ్వోపకారకమగు బ్రహ్మకు నమస్కారము. ఇంద్ర సూర్య రుద్ర వసు మరుత్ అశ్వి సోమాది భేదముతో కూడిన దేవతలమగు మేము, నీ యొక్క రూపము. అట్టి దేవ రూపుడవగు నీకు నమస్కారము. దంభమే ప్రధానముగ కలదియు, వివేకశూన్యము, సహనము, నిగ్రహము లేనిదియు అగు ఏ రూపము గలదో ఆ దైత్యరూపుడవు అగు నీకు నమస్కారము. స్తబ్దమైన వివేకముగల ఏ యక్షరూపమునందు నాడులు అధిక జ్ఞానవాహినులు కాక ఉండునో శబ్దాదిలోభము కల్గియుండునో, అట్టి యక్ష రూపుడవు అగు నీకు నమస్కారము. క్రౌర్యము మాయ ప్రధానముగ ఉండి తమోమ యమైన ఏ నీ ఘోర రూపము కలదో, అట్టి నీ నిశాచర రూపమునకు నమస్కారము.

స్వర్గవాసులకు, సుకృతవంతులకు సద్ధర్మ ఫలమును అందజేయు నీయొక్క యమధర్మరాజ రూపమునకు నమస్కారము. ఆనంద ప్రచురము జలాగ్న్యాదులతో సంగము లేనిదియు (సిద్ధులు జలాగ్న్యాదు లందున్నను వాని సంపర్కము ఉండదు) గమనాదులందు గతితోకూడుకొని ఉండునదియు అగు, నీ యొక్క ఏ సిద్ధ రూపము గలదో దానికి నమస్కారము. హరీ! సహనము లేనిది క్రూరమైనది ఉపభోగ సమర్థము రెండు నాలుకలు గల నీ నాగరూపమునకు నమస్కారము. జ్ఞానముతో కూడినదియు శాంతమైనదియు రాగాది దోషశూన్యము, పాపరహితము, వ్యాప్తరూపము అగు, నీయొక్క ఋషి రూపమునకు నమస్కారము. పుండరీకాక్షా! కల్పాంతము నందు ఎవ్వరిచేతను నివారింపబడనిదై, సమస్త భూతములను భక్షించు నీయొక్క కాలరూపమునకు నమస్కారము. దేవాది సర్వ భూతములను పూర్తిగ భక్షించి అంతకాలమున నృత్యముచేయు నీయొక్క రుద్రరూపమునకు నమస్కారము. జనార్దనుడా! రజోగుణ ప్రవృత్తిచే కర్మలను ఆచరించు నరాత్మకమగు నీ రూపమునకు నమస్కారము. సర్వాత్మకా! తమోగుణ ప్రధానమై ఇరువది ఎనిమిది వధల (ఇంద్రియ వధలు 11 తుష్టి వధలు 9 సిద్ధి వధలు 8 = 28)తో కూడినదియు మార్గమును అతిక్రమించి నడచునదియు అగు, నీయొక్క పశురూపమునకు నమస్కారము. యజ్ఞమునకు అంగభూతము జగత్తుయొక్క సిద్ధికి సాధనము. వృక్షములు పొదలు తీగలు కొమ్మలు గడ్డిపర్వతములు అను భేదములలో ఆఱు భేదములుగల ముఖ్య రూపమగు నీకు నమస్కారము. (వృక్షాదులు యజ్ఞాంగములు) సమస్త ప్రపంచమునకుమూలమై పశు, పక్షి, మనుష్య, దేవాదులు, ఆకాశము, శబ్దాది రూపము సర్వాత్మకమగు నీయొక్క విశ్వరూపమునకు నమస్కారము. అంతర్యామీ! ప్రకృతి(ప్రధానము) బుద్ధి(మహత్తు) మున్నగు సమస్త జడ వర్గము కంటె భిన్నమై అసదృశమగు కారణము (అవ్యక్తము)నకు గూడ కారణ (పురుష) రూపమగు నీయొక్క ఆదిరూపమునకు నమస్కారము. శుక్లాది వర్ణములు గాని దీర్ఘాది ప్రమాణములు గాని ఘనాది భేదములుగాని లేనిదియు విశేషణములకు అందనిదియు శుద్ధము కంటె (శుద్ధమనగా ప్రకృతికంటె బద్ధుడు శుద్ధమైనవాడు) ఆబద్ధుని కంటె ముక్తుడు శుద్ధమైన వాడును మహర్షులకుమాత్రము దృశ్యమగు నీ శుద్ధ రూపమునకు నమస్కారము. మా శరీరములందును నితర దేహములందును సమస్త వస్తువు లందును, జన్మనాశాదులు లేనిదై ఉన్నదియు తనకంటే ఇతరము లేనిదియు అగు నీ బ్రహ్మ స్వరూపమునకు నమస్కరించుచున్నాము. సచేతనమగు నీ జగత్తంతయు సనాతనుడు (శాశ్వతుడు) చైతన్యఘనుడు అగు ఏ వాసుదేవుని రూపమో! నాశరహితుడు సమస్త కారణభూతుడు పరిశుద్ధుడు ప్రభువు అగు ఆ వాసుదేవునకు నమస్కరింతును.

శ్రీ పరాశరుడు ఇట్లుపలికెను - ఈ స్తవము ముగించగనే ఆ దేవతలు గరుడా రూఢుడై శంఖ చక్ర గదలను హస్తములందు ధరించిన పరమేశ్వరుడగు శ్రీహరిని చూచిరి. సర్వదేవతలు నమస్కార పూర్వకముగ ఇట్లనిరి-ప్రభో! నీ శరణు జొచ్చిన మమ్ము అనుగ్రహించి రాక్షసులబారి నుండి రక్షింపుము. పరమేశ్వరా! బ్రహ్మ యొక్క ఆనతిని ఉల్లంఘించి హ్రాదుడు మున్నగు రాక్షసులచే ముల్లోకములందలి మా హవిర్భాగములు హరింపబడినవి. మేము అందఱము సర్వాత్ముడవగు నీకు అంశ భూతులమే కాని అజ్ఞానముచే జగత్తును వేఱుగా చూచుచున్నాము. తమతమ వర్ణధర్మములందు ఆసక్తి గలవారును, వేద మార్గమును అనుసరించుచున్నవారును తపోబలముతో కూడిన శత్రువులు అగు రాక్షసులు మాచే చంపబడువారుకారు. సర్వాత్మకుడవగు ఓ భగవంతుడా! వీరిని చంపు ఉపాయమును అనుగ్రహింపుము అని దేవతలు చెప్పగానే, భగవంతుడు తన శరీరమునుండి మాయా మోహుని పుట్టించి, దేవతలకు ఇచ్చి ఇట్లుపలికెను. “వీడు మాయామోహుడు. దైత్యులను అందఱను మోహపెట్టును. దానివలన వేదమార్గమును వదలుటచే వారు వధింపబడుదురు. దేవతలారా! పరిపాలకుడను అగు నాకు బ్రహ్మయొక్క అధికారమునకు, విష్ణుకర్తలగు దేవదానవులెంత మంది అయినను వధ్యులగుదురు. దేవతలారా! వెళ్ళుడు. భయపడ వలదు. మీకు ముందు పోవుచు మాయామోహుడు మీకు ఉపకారము చేయగలడు.”

శ్రీ పరాశరుడు ఇట్లనెను - భగవంతుడు ఇట్లు పలుకగా దేవతలు నమస్కరించి వెళ్ళిరి. మాయామోహుడు కూడ వారితో రాక్షసులున్న తావునకు వెళ్ళెను. 

మాయామోహుడు రాక్షసుల వంచించుట

శ్రీ పరాశరుడు ఇట్లనియె - ఓ మైత్రేయా! ఆ మాయామోహుడు బయలుదేరివెళ్ళి, నర్మదానదీతీరమును ఆశ్రయించి, తపము ఆచరించుటయందు ఆసక్తితో ఉన్న మహారాక్షసులను చూచెను. పిమ్మట మాయామోహుడు, దిగంబరుడు, ముండిత శిరస్కుడు నెమలి పింఛములు దాల్చినవాడునై, రాక్షసులతో మృదువుగ ఇట్లనెను.

“మీరు మోక్షమునే కోరుదురేని, నా మాటలను ఆచరింపుడు. ఈ నేచెప్పు ధర్మమునకు తగుదురు. ఇది తెరువబడిన ముక్తి ద్వారము. ఈ ధర్మము మోక్షమునకు తగినది. ఇంత కంటె శ్రేష్ఠమైనది లేదు. ఈ ధర్మమునందే ఉండిన యెడల మీరు స్వర్గమునుగాని మోక్ష మునుగాని పొందుదురు.”

శ్రీ పరాశరుడు ఇట్లనియె-ఈ విధములైన అనేకములగు యుక్తి ప్రదర్శన చర్చలచే (అనగా శుష్కతర్కవాదములచే) మాయామోహునిచే నా రాక్షసులు వేదమార్గమునుండి మరలింపబడిరి. ఇది ధర్మము కొఱకు. ఇది అధర్మము కొఱకు. ఇది యోగ్యము. ఇది అయోగ్యము. ఇది మోక్షము కొఱకు. ఇది ముక్తిని ఇవ్వదు. ఇది పరమార్థము. ఇది పరమార్థము కాదు. ఇది కర్తవ్యము. ఇది కర్తవ్యము కాదు. ఇది ఇట్లు కాదు. ఇది ఇట్లే. దిగంబరులకు ఇది ధర్మము. బహువస్త్రులకు ఇది ధర్మము. అను ఆ సప్త విధములగు అనిశ్చిత వాదమును అనేక పర్యాయములు చెప్పుచున్న మాయామోహునిచే రాక్షసులందఱు ధర్మములను విడుచునట్లు చేయబడిరి. “పైన చెప్పిన ఏడు విధములగు వాదములు అర్హత ప్రోక్తములు. ఈ మాయామోహుడు అర్హతుడై ఇట్లు చెప్పెను. ఈ ధర్మమును ఆశ్రయించిన వారు అర్హతులని ప్రసిద్ధులైరి. వారివలన బోధింపబడి మఱికొందఱు, వారి వలన మఱి కొందరు ప్రేరితులై, త్రయీధర్మ త్యాగము చేసిరి. ఇట్లు కొద్దిరోజులలోనే చాలవఱకు రాక్షసులచేత త్రయి (వేదత్రయము) విడువబడెను. ఇది అర్హతమతము (బౌద్ధమతము) తిరిగి ఎఱ్ఱనివస్త్రములు ధరించి ఇంద్రియనిగ్రహముగల మాయామోహుడు ఇతర రాక్షసులతో చేరి మృదువుగను, అల్పముగను, మధురవచనములతో ఇట్లనెను. రాక్షసులారా! మీ కోరిక స్వర్గము కావలెననియా! మోక్షముకొఱకైనచో పశువుల చంపుట మున్నగు దుష్ట ధర్మములను మానుడు. ఈ సమస్తము విజ్ఞానమయము అని తెలిసికొనుడు. నామాట తెలిసికొనుడు. విద్వాంసులచే ఇట్లే చెప్పబడినది. అని యోగాచార్యులాత్మఖ్యాతి పక్షమున చెప్పుదురు. జగత్తంతయు ఆధార శూన్యము. (అధిష్ఠాన శూన్యమున భ్రాంతి జ్ఞాన సిద్ధ మని శూన్యఖ్యాతి పక్షమున మాధ్యమికులు) రాగాది దోషములు సంసారమున భ్రమింప చేయుచున్నవి. మీరు తెలిసికొనండి! తెలిసికొనండి! తప్పక తెలిసికొనండి! అని చెప్పుచు ఆ మాయామోహుడు రాక్షసులను నిజధర్మము విడిచి పెట్టునట్లు చేసెను. నానావిధములుగ చెప్పుట, యుక్తులను చూపుట, వీనితో ఆ రాక్షసులు క్రమక్రమముగ వేదధర్మమును వదలిరి. వారు మఱికొందరికి వారు మఱి కొందరికి చెప్పిరి. మైత్రేయా! ఇట్లు శ్రుతి, స్మృతి బోధిత ధర్మమును వారు త్యజించిరి. మహామోహకారియగు మాయా మోహుడు, ఇంకను ఇతరులను లోకాయతికా (చార్వాక ) ది వేదబాహ్య మతములను బోధించి, ధర్మ విముఖులుగా చేయుటయే కాక, వేదనిందకులుగను చేసెను. అల్ప కాలముననే మాయామోహునిచే ఆ రాక్షసులు అందఱు వైదికధర్మవార్తయే లేకుండుటయేగాక వేదములను నిందించువారు కొందఱు, బ్రాహ్మణులను నిందించువారు కొందఱునై, ఇట్లు వాదములను చేయసాగిరి. హింస కూడదని వేదము చెప్పుచుండ యాగపశ్వాది హింస ధర్మజనకము అనుట యుక్తి సహముగాదు. అగ్నిచే దగ్ధములైన హవిస్సులు ఫలజనకములనుట, పని పిల్లల మాటగ ఉన్నది. అనేక యజ్ఞములను చేసి ఇంద్రత్వమును పొందిన ఇంద్రుడు, మనచే హోమము చేయబడిన శమ్యాది సమిధలను భుజించును అని, చెప్పుట అంతకంటె కోమలములైన పత్రాదులను భక్షించు మేక, మొదలగు పశువులే శ్రేష్ఠమైనవి. అగును గదా! యజ్ఞమున వధింపబడిన పశువునకు స్వర్గలోకము లభించునేని యాగ కర్త తన తండ్రిని ఎందులకు చంపడు? ఒకడు భుజించిన అన్నముచే మఱియొకనికి తృప్తి అగునని శ్రాద్ధాదులు పెట్టెదరేని, బాటసారులు తమతోకూడ పాథేయముగ అన్నాదులను కొంపోవుట కేవలము శ్రమకేగదా! కావున కేవలము ఇవి ప్రాకృతజనుల నమ్మకములని నా మాటల వలన తెలిసికొని ఈ యజ్ఞములు, శ్రాద్ధములు మున్నగు విషయములలో ఔదాసీన్యము వహించుటయే మీకు శ్రేయస్కరము. అపౌరుషేయములు అగుటచే వేదములు ఆప్త వాక్యములై ప్రమాణము లందురా! అదియుసరికాదు. ఆప్తవాక్యములు ఆకాశము నుండి తమంతట తాము భూమిపై పడునా? కావున నాచేతను, మీవంటివారిచేతను కూడ యుక్తియుక్తమైన మాటయే గ్రహింపనగును.

శ్రీ పరాశరు లిట్లనియె:

మాయామోహునిచే ఇట్లే బహువిధములుగ రాక్షసులు వేదములందు రుచిలేనివారుగ చేయబడినవారై, అధర్మ మార్గానుయాయులు కాగా - దేవతలు గొప్ప ప్రయత్నముచేసి వారితో యుద్ధమునకు సన్నద్ధులైరి. ఆ యుద్ధమునందు సన్మార్గ విరోధులగు రాక్షసులు హతులైరి. ఆ రాక్షసులకు ఇదివరలో స్వధర్మ కవచమే రక్షకముగ ఉండెను. ఇపుడది నష్టమగుటచే దైత్యులు అసమర్థులైరి. మైత్రేయా! ఆ మార్గగాములు అందరు వేద కవచమును వీడుటచే (నగ్నులు = వస్త్రహీనులు). నానావిధమైన వారుగను, వేదనిందకులు గను, దేవతలచే చేయబడిరి. బ్రహ్మచారి గృహస్థు వానప్రస్థు, పరివ్రాట్ (సన్యాసి) అని నాలుగే ఆశ్రమములు. అయిదవది లేదు. గృహస్థు వేషమును విడచిన మాత్రమున వానప్రస్థుడుగాని పరివ్రాట్ గాని కానేరడు. అతడు నగ్నుడు పాపకారి.

శక్తుడైనవాడు ఒక్కరోజు నిత్యకర్మల లోపముచే పతితుడగును. అట్టివాడు ఆపదలో లేనప్పుడు గొప్ప ప్రాయశ్చిత్తముచే శుద్ధుడగును. ఒక పక్షము (15 రోజులు) నిత్యకర్మలు లేనివాడును, ఒక సంవత్సరము నిత్యకర్మల విడచినవాడును, కనపడెనేని సత్పురుషుడు సూర్యుని చూడవలెను. బుద్ధిమంతుడా! వానిని స్పృశించినయెడల సచేల (కట్టువస్త్రముతో) స్నానము వలన శుద్ధి కలుగును. ఈ చెప్పిన శుద్ధి, సజ్జనునికి గాని, పాపాత్మునకు కాదు. పాపాత్ముడనగా-ఎవ్వనియింట దేవ పితృ భూత యజ్ఞములు ఉండవో, వాని ఇంటనుండి దేవ పితృ భూతములు వెడలిపోవును. ఆ యజమానికంటె పాపాత్ముడు లేడు. అట్టివానితో సంవత్సరకాలము సంభాషణము ప్రశ్నించుట కలసి ఉండుట చేయు నాతడు వానితో తుల్యుడగును. ఎవ్వని శరీరముగాని, ఇల్లుగాని, దేవాదినిశ్వాసశూన్యమో వానితో గృహ ఆసన వస్త్ర సంపర్కము చేయరాదు. వానియింట భుజించినను, ఆసనమునందు కూర్చుండినను, లేక శయ్యపై పరుండినను, వెంటనేవానితో సమానుడు అగును. దేవ పితృభూత అతిథులను పూజించక భుజించినవాడు పాపమునే తినుచున్నాడు. వానికి నిష్కృతి (ప్రాయశ్చిత్తము లేదు. బ్రాహ్మణాది వర్ణములవారు స్వధర్మమును వదలి హీనకర్మలలో ఉన్న ఎడల వారు నగ్నులు అనబడుదురు. నాలుగు వర్ణములకు సాంకర్యము ఉన్నచోట సజ్జనులకు ఉనికి పతన హేతువే అగును. పంచమహా యజ్ఞములను (ఋషి, దేవ, పితృ, భూత, అతిథి) ఆచరించని వానితో మాట్లాడుటచే మనుజులు నరకమునకు పోవుదురు. కావున వేదత్రయధర్మత్యాగముచే, భ్రష్టులైన నగ్నులతో సంభాషణ స్పర్శనాదులను ప్రాజ్ఞుడు సదా విడువవలెను. ఇట్టి వారిచే చూడబడినదై శ్రద్ధావంతులు పెట్టు శ్రాద్ధము దేవ పితృ పితా మహాదులను సంతోషపెట్టజాలదు.

శతధన్వోపాఖ్యానము

భూలోకమున శతధన్వుడను ఒకరాజు ఉండెను. అతని భార్య శైబ్య అనునామె మిక్కిలి ధర్మాసక్తి గలదియు పతివ్రత, మహాప్రభావోపేత, సత్యము, శౌచము, దయలతో కూడినదియు, వినయాది సకల సల్లక్షణ సంపన్నురాలు. ఆ ప్రభువు ఆమెతోగూడ ఏకాగ్రతతో దేవదేవుడగు జనార్దనుని భక్తితో జపహోమ అర్చనాదులతోను, ఉపవాసములతోను, తదేక చిత్తుడై అనుదినమును ఆరాధించుచుండెను. ఒక రోజున భార్యాభర్త లిరువురు కార్తిక పున్నమినాడు గంగలో స్నానమాడి ఉపవసించినవారై ఎదురుగ వచ్చుచున్న ఒక పాషండు (నాస్తికు)ని చూచిరి. చాపాచార్యుడగు అ మహారాజునకు అతడు స్నేహితుడు అగుటచే ఆదరముతో సంభాషించెను. ఆపతివ్రతమాత్రము ఉపవసించినదగుటచే మౌనముతో ఉండి ఆతడు కంటబడగనే సూర్యునిచూచెను. ఆదంపతులు ఇంటికివచ్చి యధావిధిగ విష్ణు పూజాదికమును అంతను చేసిరి. చాలాకాలమునకు ఆ రాజు మరణించెను. రాణి ఆయనతో అనుగమించెను. ఆ రాజు ఉపవసించి పాషండునితో సల్లాపము చేయుట అనెడి అపచారముచే ఒక కుక్కగ పుట్టెను. ఆమె పూర్వజన్మ స్మృతిగలదై కాశీరాజునకు యోగ్యమైన కుమారిగ పుట్టెను. సర్వ విజ్ఞానముతో సమస్త లక్షణములతో ఆమె ఒప్పారుచుండెను. ఒక వరునకు ఈయబోయిన తండ్రిని నివారించి, ఆ పిల్ల దివ్యదృష్టితో తనపతిని కుక్కగా ఉన్నట్లు తెలిసికొని, విదిశా పట్టణమునకు ఏగి, ఆ స్థితిలో ఉన్న భర్తనుచూచెను. మహానుభావుడగు తన నాథుని కుక్కగఉన్నవానిని చూడగనే, మృష్టమైన ఆహారమును ఇచ్చెను. ఆ ఆహారమును తినుచు ఆ కుక్క తన జాతికి ఉచితములగు ప్రీతి చేష్టల చేయుచుండగా, చూచి, ఆమె సిగ్గుచెంది, కుయోనిలో పుట్టిన తన భర్తకు నమస్కరించి ఇట్లు పలికెను: మహారాజా! నాకు ప్రీతికరుడవగు నీవుచేసిన మొగ మోటము వలన ఇట్లు నీచ జంతువుగ జన్మించితివి. స్మరించు చుంటివా! తీర్థ స్నానా నంతరము ఒక నాస్తికునితో సంభాషణము చేయుటచే నీకీ స్థితి వచ్చినది. నీకు జ్ఞాపకము లేదా?

శ్రీపరాశరుడు ఇట్లు అనియె–ఆమెచే ఆ రాజు పూర్వ జన్మయందు చేసిన దోషమును స్మరింప జేయబడినవాడై, మిక్కిలి నిర్వేదపడి ఆ పట్టణమును దాటి గిరి తటము నుండి క్రిందనుపడి నక్కగ పుట్టగా, నామె దివ్య దృష్టిచే తెలుసుకొని, నక్కగ పుట్టిన తన భర్తను దర్శించుటకై కోలాహల పర్వత ప్రాంతమునకు ఏగి, పూర్వ జన్మమున పాషండాలాపమున నీకు కల్గిన నీచ జన్మవృత్తాంతమును నీకు గుర్తుచేసినదానిని స్మరించుచుంటివా? అని అడిగెను. నిజమును ఎఱిగి నక్కగ ఉన్న, ఆ రాజు అడవియందు నిరాహారుడై చనిపోయి తోడేలుగ జన్మించెను. మఱల ఆమె (శైబ్య) అచటికేగి రాజా! నీవు కుక్కవు గావు. నక్కవు కావు తోడేలువు కావు. శతధన్వమహారాజువు అని స్మరింప చేయగనే ఆతడు గ్రద్దరూపము తాల్చెను. మఱల ఆమె స్మరింపజేయగ కాకిగ పుట్టెను. ఆ పతివ్రత తన దివ్యదృష్టితో అతడి జన్మమును తెలుసుకొని వెళ్ళి ఇట్లనెను- ఓ రాజేంద్రా! సమస్తరాజులు నీకు వశమై, బలులు (కప్పములు-పన్నులు) ఇచ్చుచుండగా కైకొనెడి మహారాజువు ఇపుడు బలులనుతిని బ్రతికెడి కాకి (బలిభుక్కు) వైతివి” అని బోధించెను. ఇట్లే కొంగగా జన్మించి ఆమెచే బోధితుడాయెను. పిదప నెమలి జన్మ నొందెను. ఆమెయు అతనిని అనుగమించి, ఆ నెమలికి వలసిన భోజ్యపదార్థమును అందచేయుచు జనకచక్రవర్తి చేయుచున్న అశ్వమేధ యాగమునకు వెళ్ళి అవభృధము (దీక్షాంతస్నానము) నందు ఆ నెమలిని స్నానము చేయించి తానుకూడా స్నానముచేసి ఆ రాజునకు పూర్వ జన్మ క్రమమును స్మరింపచేయగా, ఆతడు తన కళేబరమును త్యజించి జనక చక్రవర్తికి పుత్రుడై పుట్టెను.

పిదప కాశీరాజపుత్రిక అగు ఆ పతివ్రతయగు శైబ్య తనతండ్రిని తనకు వివాహార్ధమై ప్రేరేపించగా ఆ రాజు స్వయంవరము ఏర్పాటుచేసెను. అందుకు ఏతెంచిన తనభర్తను గమనించి ఆమె ఆతనిని తన భర్తగ మఱల వరించెను. ఆ రాజపుత్రుడు ఆమెతో చిర కాలము భోగములను అనుభవించి తనతండ్రి గతించిన తరువాత విదేహదేశ రాజ్యమును పరిపాలించెను. అనేక యజ్ఞములనుచేసెను. యాచకులకు దానములను అనేకములను ఇచ్చెను. పుత్రులను పడసెను. శత్రువులను ఓడించెను. న్యాయముగా భూమిని పరిపాలించి భోగములను అనుభవించి ప్రియములైన తన ప్రాణములను క్షత్ర ధర్మమును అనుసరించి యుద్ధమునందు విడిచిపెట్టెను. చితియందున్న తన భర్తను వెనుకటి జన్మ మందువలె సంతోషముతో అనుగమించెను. ఆరాజపుత్రుడు ఆమెతోగూడ ఇంద్ర లోకములను అతిక్రమించి ఉన్న అక్షయ లోకములను వెంటనే పొందెను. ఇట్లా దంపతులు వెనుకటి పరిశుద్ధిని పొంది, తమ పుణ్యఫలముగ అక్షయ లోకమునుగూడ పొందిరి. నీకు ఇపుడు పాషండుని సంభాషణమువలన వచ్చిన దోషము అశ్వమేధయాగపు అవభృథస్నాన మహిమయు చెప్పబడినవి. కావున పాషండులతోను పాపాత్ములతోను సంభాషించుట స్పృశించుట పనికిరాదు. యజ్ఞాది కర్మలలో దీక్షితుడైన వానికి అసలు కూడదు. ఒక మాసకాలము నిత్యకర్మము విడిచిన వానిని చూచిన యెడల, బుద్ధిమంతుడు సూర్య సందర్శనము చేయవలెను. బ్రాహ్మణుడా! పూర్తిగ వేదములను వదలి పాషండాన్నమును తినుచు వేద మతమునకు విరోధులుగ ఉండి మహాపాపులతో సంభాషణము, సంబంధము, సహ స్థితియు, మహాపాపహేతువులని చెప్పనక్కరలేదు. కావున వారితో అవి పనికిరావు. పాషండులు (నాస్తికులు) వికర్మస్థాను (వికర్మల నాచరించువారిని)లను, బిడాల(పిల్లి) వ్రతులు (ఎదుట ప్రియమును చెప్పి పరోక్షమున మిక్కిలి అపకారము చేయువారు) (పిల్లివంటి వారు) శఠులు (వ్యక్తముగ అపరాధము చేయువారు) హైతకులు = హేతువాదము చేయువారు అనగా అన్ని కర్మలను హేతువులతో సందేహించు వారు, బకవృత్తులు (అధోదృష్టులై స్వార్థములను సాధించుటలో నిమగ్నులై, దుర్మార్గులై, అవినయముతో ఉండువారు) వీరిని మాటతోనైన గౌరవింపరాదు.

మహాపాపులగు పాషండులు దురాచారము గలవారు. వీరితో సంపర్కము పూర్తిగా విడువవలెను. కనపడినందు వలననే శ్రాద్ధమును పాడుచేయువారు నగ్నులని నీకు ఇది వరకు చెప్పితిని. వారితో సంభాషణము చేసిన యెడల ఒక రోజు చేసిన పుణ్యము నశించును. పాషండులు కూడ పాపాత్ములు. వీరితో సంభాషణము చేయుటవలన ఆ దినము చేసిన పుణ్యము నశించును. వ్యర్థముగ జడలను ధరించినవారు, అనగా అధర్వ వేదమున చెప్పిన శ్రౌత, పాశుపత వ్రతములకు అంగముగ చెప్పబడినవి కాకుండ వ్యర్థముగ జడలను ధరించిన వారు, శిఖలేకుండ ముండనమును చేయించుకొనిన వారు, మోఘాశులు = దేవతాతిధి పిత్రాదులు పూజకు ఉపయోగింపని అన్నము తినువారు, అఖిల (బాహ్యాభ్యంతర) శౌచము లేనివారు, తర్పణము చేయుట పితృ దేవతలకు పిండ ప్రదానము చేయుట మున్నగునవి లేనివారును, వీరితో సంభాషణ చేసినను నరక ప్రాప్తి కలుగును.