విష్ణు మహా పురాణము

1వ అంశం

పురాణ సంహితావతారము

నారాయణం నమస్కృత్యనరంచైవ నరోత్తమమ్

దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్

పరమాత్ముడైన నారాయణునికి, నరులలో శ్రేష్ఠుడైన నరునికి, సమస్త విద్యలకు ఆధారభూతురాలైన సరస్వతీదేవికి, సమస్త పురాణ వాఙ్మయమును ఇతిహాసమైన భారతమును ఉపదేశించిన వ్యాసమహామునికి వందనము చేసి, జయము (అష్టాదశ పురాణములలో ఒకటి అగు ఈ విష్ణు పురాణము)ను తెల్పుచున్నాను.

పురాణములన్నియు విష్ణువును లేక శివుని పరదైవతముగ ప్రతిపాదించుచున్నవి. అష్టాదశ (18) పురాణములకు అష్టాదశ ఉప పురాణములకు అన్నింటికి కర్త వేదవ్యాస మహామునియే. వేదవ్యాసుడు పురాణములను రచించిన స్థలము భూలోకములో ఉత్కృష్ట స్థలమును, నరనారాయణ క్షేత్రమును, ప్రథమ విద్యా పీఠము అగు శ్రీ బదరికాశ్రమము. అందులో ప్రథమ గురుశిష్యులు శ్రీ నరనారాయణ మునులు. వారికి శ్రీ సరస్వతీ దేవికి నమస్కరించియే ‘జయం’ అను పేర తాను వ్రాసిన ఇతిహాస పురాణములను, పఠించవలెనని వేదవ్యాసులు తన శిష్యులకు ఆదేశింపగా, శిష్యులు గురువైన వ్యాసులవారిని చేర్చి దేవీ సరస్వతీం వ్యాసం అని పఠించిరి. పురాణ పఠనమున గురుస్తుతి ప్రథమ కర్తవ్యము. వ్యాసమహర్షి బదరికాశ్రమ విద్యాపీఠమునకు కులపతియై సకల విద్యా ప్రచారము చేసినట్లు స్కాందపురాణాంతర్గత కాశీఖండము ద్వారా తెలియచున్నది. వ్యాస శిష్యుడగు రోమహర్షణుడు (రౌమహర్షణి లేక లోమహర్షణుడు) అను సూత మహాముని నైమిశారణ్యము నందు ద్వాదశ వార్షిక సత్రయాగమున కూడిన మునులకు పురాణములు అన్నింటిని వినిపించి ప్రచారము చేసెను. అందుచేత ముందుగా సూతుడు చెప్పెను అని ఈ విష్ణు పురాణము ప్రారంభింపబడినది.

జితం తే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన

నమస్తే ఽ స్తు హృషీకేశ మహాపురుష పూర్వజ

పుండరీకాక్షుడైన శ్రీ మహావిష్ణువునకు జయము అగుకాక. ప్రపంచమును సృజించిన వానికి నమస్కారము. హృషీకేశునికి నమస్కారము. సృష్టికి ముందే ఉన్నవానికి నమస్కారము.

యదక్షరం బ్రహ్మయ ఈశ్వరః పుమాన్ గుణోమ్మిసృష్టి స్థితికాలసం లయః

ప్రధాన బుద్ధ్యాది జగత్ ప్రపఙ్చసూః సనోఽస్తు విష్ణుర్మతి భూతి ముక్తిదః

 శాశ్వతుడైన వాడును, నాశనములేనివాడును, బ్రహ్మ, ఈశ్వరరూపములను పొందిన పరపురుషుడును, నిత్యుడై సృష్టికి, రక్షణకు, విలయమునకు మూలకారణమైన వాడును. ప్రకృతికి మూలమైన వాడును; బుద్ధికి ఆధారమైనవాడును, ఈ సర్వప్రపంచమునకు తానే అయినవాడును అగు పుండరీకాక్షుడైన శ్రీ మహావిష్ణువు, మాకు బుద్ధిని, సత్పదము అను ముక్తిని ప్రసాదించుగాక.

ప్రమాణ్యం విష్ణుం విశ్వేశం, బ్రహ్మాదీన్ ప్రణిపత్య చ

 గురుం ప్రణమ్య వక్ష్యామి పురాణం వేదసమ్మితమ్

శ్రీ మహావిష్ణువునకు నమస్కరించి; విశ్వేశ్వరుడైన పరమశివునకువందనం చేసి, సృష్టికర్తయైన బ్రహ్మదేవుని స్తుతించి, గురువునకు నమస్కరించి, వేదసమ్మితమైన (విష్ణు) పురాణమును చెప్పుచున్నాను.

శ్రీ సూతుడు ఇట్లు చెప్పెను. మైత్రేయుడు పూర్వయామమునందు అనుష్ఠానము చేసికొని ఉన్న పరాశర మునీంద్రులకు సాష్టాంగముగ నమస్కరించి ఇట్లు అనెను. “ఓ గురుదేవా! నీ వలన వేదములను, వేదాంగములను వరుసగా చదువుకొంటిని. సర్వ శాస్త్రములను అధ్యయనము చేసితిని. నీ అనుగ్రహమున సర్వశాస్త్రములందు మరెవ్వరు చేయని పరిశ్రమ చేసితిని అని నన్ను పండితులు ప్రశంసించుచున్నారు. ఇంకను నీ వలన జగత్తు యొక్క సృష్టి స్థితిలయములను వినుటకు నాకు కుతూహలముగా ఉన్నది. ఓ బ్రాహ్మణమూర్తీ! ఈ జగత్తు దేనియందు నిండి ఉన్నదో, దేని వికారమో, దేని వలనపుట్టి పెరిగి లీనమగుచున్నదో, దీనికి మూలమైన, పంచభూతముల యొక్క సంస్థానము, (కూర్పు) ప్రమాణము, దేవాదుల వంశములు, మనువులు, మన్వంతర చతుర్యుగ, కల్ప, కల్పనలు, కల్పాంతము యొక్క స్థితి, నాలుగు యుగముల ధర్మములు, దేవర్షి రాజచరితము, వేదశాఖా విభాగము, బ్రాహ్మణాది వర్ణ ధర్మములు, బ్రహ్మచర్యాది ఆశ్రమధర్మములను వినకోరుచున్నాను. నీ మనస్సును నా ఎడ ప్రసన్నము అగునట్లు చేయుము. దానిచేత నేను సర్వమును తెలుసుకొనగలను” అనగా శ్రీ పరాశర మునీంద్రుడు ఇట్లు అనెను.

మైత్రేయా! మంచిది. ధర్మజ్ఞుడవు. మా పితామహుడు వశిష్ఠ భగవానుడు తెలిపిన ఈ పురాతన వృత్తాంతము నీవు అడుగుటచేత మరల జ్ఞప్తికి వచ్చినది. పూర్వము విశ్వామిత్రుని ఆజ్ఞచేత ఒక రాక్షసుడు మా తండ్రియగు శక్తి అను మహర్షిని భక్షించినట్లు విని, కోపించి రాక్షసులు చేయునట్టి సత్రయాగము చెడగొట్టుటను ఆరంభించితిని. ఆ సత్రయాగమునందు వందలకొలది రాక్షసులు నాచే భస్మమై నశించిపోయిరి. ఆరాక్షస క్షయమును చూచిన నా తండ్రి “నాయనా! తీవ్ర క్రోధము వలదు. రాక్షసులు అపరాధము చేయలేదు. నీ తండ్రి మరణము విధి విహితము. మూర్ఖులకేగాని, జ్ఞానులకు కోపము కలుగదు. ఎవనిచేత ఎవడు చంపబడును? ప్రారబ్ధము అనుభవించుట జీవియొక్క ధర్మము. పెక్కు జన్మములు మిక్కిలి శ్రమించి సంపాదించుకొన్న కీర్తిని, తపస్సును, క్రోధము నశింపజేయును. స్వర్గమునకు, మోక్షమునకు అభ్యంతరమైన కోపమును మహర్షులు త్యజింతురు. తండ్రీ! దానికి నీవు వశుడవు కావద్దు. నిరపరాధులు, దీనులు అయిన రాక్షసులు దగ్ధులయినారు. ఇక చాలు. ఈ సత్రయాగము చాలింపుము. సాధువులు క్షమాపారులు గదా! (సాధువులకు ఓరిమి పరమ ధర్మము, బలముకూడ) అని చెప్పగా, ఇట్లు మా తండ్రిచేత అనున యింపబడిన నేను, ఆయన మాటయందుగల గౌరవముచే ఆ సత్రయాగమును ఆపితిని.

అటుతరువాత పితామహునిచే అర్ఘ్యము ఈయబడి, అసన మలంకరించి పులహుని అన్నగారు పులస్త్యుడు ఇట్లనెను.

“తీవ్రమయిన వైర మేర్పడినను మహానుభావుడు, గురువు, పితామహుడు వశిష్ఠుడు చెప్పినట్లు విని, ఓర్పుతో వ్యవహరించితివి. ఈ విధేయతవలన నీవు సర్వశాస్త్రములను ఎఱుగ గలవు. కుపితుడవు అయినను నా సంతానమును విచ్ఛిన్నము చేయకుండుటవలన నీకు ఇంకొక వరమును ఈయదలచితిని. నీవు పురాణసంహితకు కర్తవు కాగలవు. దేవతల పరమార్థతత్త్వము సమగ్రముగ నీవు ఎరుగగలవు. ప్రవృత్తియందు (కర్మ మార్గమందు), నివృత్తియందు (జ్ఞాన మార్గమందు) నా అనుగ్రహము వలన నీ మనస్సు స్వచ్ఛముగ ప్రకాశించును” అనగా, అంతట మా పితామహుడు వశిష్ఠుడు కూడ పులస్త్యుడు వరమిచ్చినట్లు జరుగగలదనెను.” ఆ ఇరువురు మహానుభావులు చెప్పినట్లు సర్వశాస్త్రములు మీరడిగిన ఈ క్షణమందు జ్ఞప్తికి వచ్చుచున్నవి. కావున ... మైత్రేయా! పురాణ సంహితను నీకు ఇప్పుడే చెప్పుచున్నాను. దానిని అంతను చక్కగా వినుము. ఈ జగత్తు సర్వము విష్ణువు నుండియే పుట్టినది. ఆయనయందే నిలిచినది. ఆయనయే దీని లయకర్త అని ఇట్లు మైత్రావరుణుల కుమారుడైన వశిష్ఠ మహర్షి మాటలను విని, ఆయన ఇచ్చిన వరమునుపొంది, సత్రయాగమును ఆపి విష్ణుభక్తాగ్రేసరుడైన మైత్రేయునిచే తత్త్వార్థ ప్రతిపాదకమును వినువారికి, తెలుపువారికి కూడ సర్వార్థములను ఇచ్చు ఈ పురాణ సంహితను అధ్యయనము చేయించెను.

సృష్టి పూర్వస్థితి

శ్రీ పరాశరుడు ఇట్లు పలికెను:

ప్రపంచమునకు ఆధారమైనవాడు, అణువుకంటె అణువైన వాడు, సర్వభూతము లందు ఉండువాడు, అచ్యుతుడు, జ్ఞానమూర్తి, మిక్కిలి స్వచ్ఛమైనవాడు పరమార్థముగ నిర్మలుడు (గుణసంగము లేనివాడు), భ్రాంతిదృష్టికి జగముగ (వస్తువుగ) తోచువాడు సర్వవ్యాపకుడు, సర్వమును కబళించువాడు సృష్టి స్థితులను చేయుటయందు స్వతంత్రుడు, సర్వజ్ఞుడు, జగదీశ్వరుడు, పుట్టుట, హాని, వృద్ధులు లేనివాడు అయిన బ్రహ్మ తెల్పిన పురాణకథను నేను చెప్పుచున్నాను. వినుడు. పూర్వము దక్షాదులు పురుకుత్సుడను రాజు నకు నర్మదా తీరమున దీనిని తెలియజేసిరి. ఆ రాజు సారస్వతునికి, అతడు నాకు ఈ పురాణ వృత్తాంతమును ఎల్లను బోధించెను.

పరమాత్మ అను వస్తువు ఒకటే ఉన్నది. అది సర్వజీవులందు ఆత్మరూపమై ఉన్నది. అది నామరూప వర్గాది నిర్దేశము లేనిది. జన్మాది వికారములు ఏవియు లేనిది. అయినను అది ఒకటి ఉన్నదని చెప్పుటకు శక్యమైనట్టిది. అంతట, అంతయునై ఉన్నది. కావున విద్వాంసులు దానిని వాసుదేవుడని పేర్కొందురు. హేయోపాదేయాది విలక్షణమై, నిత్యమైయున్న ఆ పరబ్రహ్మయే వ్యక్తరూపము, అవ్యక్తరూపమునై, పురుషుడు మొదలగు రూపములతో వ్యవహరింపబడుచున్నను, అది ఆయా పురుషాదులకు పరమై ఉన్నది. సూరులు (జ్ఞానులు) శుద్ధమయిన ఆ విష్ణువు యొక్క పరమ పదమును దర్శింతురు. ప్రధానపురుషాదులు, సృష్టిస్థితి కాలములందు అభివ్యక్తమై ఉన్నట్లు ఉండును. వ్యక్తము అవ్యక్తము మొదలైన ఆయా పదార్థములతో జరుగు ఆ వ్యవహారము పరబ్రహ్మకు ఒక బాలక్రీడ. అవ్యక్తము కారణము, ప్రధానము అను పేర్లచేత ప్రకృతి చెప్పబడును. అది సూక్ష్మము. సదసదాత్మకము. ఉన్నదియు లేనిదియు అదే. అక్షరము మఱియొక ఆధారము లేనిది అమేయము అజరము ధ్రువము శబ్దస్పర్శములు లేనిది. రూపాదులతో కూడనిది. త్రిగుణాత్మకము, జగత్కారణము, అనాది, సృష్టిమూలము, అవ్యయము అయిన ఆ ఒక్కపదార్థము చేతనే, ప్రళయకాలము నుండి ఈ విశ్వము వ్యాప్తమై ఉన్నది. వేదవాదులు, వేదవేత్తలు బ్రహ్మనిష్ఠులు, ఈ ప్రధాన ప్రతిపాదకమైన విషయమునే వేదమని అధ్యయనము చేయుచుందురు.

అహోరాత్రాదులు, పంచభూతములు ఇంద్రియములకు అది అందదు. ప్రధాన వస్తువు అది ఒక్కటే. బ్రహ్మము అది అనబడునది ఒక్కటే ఉండెను. ఆ విష్ణుస్వరూపము నుండి పురుషుడు-ప్రధానము-రూపొందెను. దానియొక్క నానా వికారములే నామ రూపాత్మక ప్రపంచమంతయు. జరిగిపోయిన ప్రళయకాలమున ప్రకృతియందు లీనమై ఉండును. అదే ప్రాకృత సంచరము అను పేరు పొందును. కాలము భగవంతుడు. దానికి మొదలు తుదియును లేవు. అందుచేత ఈ సృష్టిస్థితిలయముల కట్టుబాటు అరి కట్టుటకు వశముగాదు. సత్వాది గుణముల యొక్క ఆ సామాన్యావస్థయందు, పురుషుడు వేఱే విడిపడి ఉన్న సమయమున విష్ణువు యొక్క కాలస్వరూపము పరివర్తనము చెందుచునే ఉండును. జరుగుచునే ఉండును. కాని సర్వాంతరమైన పరమాత్మ వస్తువు హరి తన ఇచ్ఛానుసారము వ్యయస్వభావమైన ప్రధానమందు, అవ్యయమైన పురుషతత్త్వములందు కూడ సృష్టికాలములో ప్రవేశించును. ఆ వస్తువు యొక్క సన్నిధాన మాత్రమున ఆ ప్రధాన పురుషాత్మక తత్త్వమందు క్షోభ జనించును. అసమయమునందు మనస్సు నిరుపకార మైనందున (స్థబ్దమై ఉన్నందున) ఆ పురుషోత్తముడైన పరమాత్మయే క్షోభింపజేయువాడు. క్షోభింపబడు వాడుగా కూడా తానై ఉండును. ఒకపరి వెలికి, ఒకపరి లోనికి (తాబేలువలె) ముడుచుకొనుచు తానే మిగిలి ఉండును. కావుననే ఈ స్థితిలో ఉన్న ఆ పదార్థము ప్రధానము అనబడినది. సర్వేశ్వరుడు విష్ణువు ఇట్లు వికాసరూపుడు, అణురూపమునై బ్రహ్మాది త్రిమూర్తులై వ్యక్త స్థితిని పొందును.

క్షేత్రజ్ఞునిచే అధిష్ఠితమైన ఆ గుణసామ్యావస్థ నుండి సృష్టి సమయమందు గుణముల అభివ్యక్తి ఆవిర్భావము అగును. తొలుత ఆవిర్భవించిన ఆ ప్రధాన తత్వము మహ త్తత్త్వమును ఆవరించెను. ఆ మహత్తత్త్వమే బుద్ధి. అది సాత్విక, రాజస, తామస భేదమున మూడురకములు అగును. అది త్రిగుణాత్మకము. కావున భూతములకు ఇంద్రియములకు అది కారణమగును. ఇట్లు ప్రధానముచే మహత్తు, మహత్తుచే ప్రధానమును పరస్పరము ఆవృతములై అంతట భూతాది అయిన అహంకారతత్త్వము తొలుత శబ్దతన్మాత్రను వ్యాకరించెను. దానినుండి శబ్దతన్మాత్రకమయిన ఆకాశమును సృజించెను. దానిని భూతాది ఆవరించెను. ఆకాశము వ్యాకృతమై స్పర్శను సృజించెను. అంత స్పర్శగుణకమైన వాయువు బలశాలి అయ్యెను. ఆ స్పర్శతన్మాత్ర, శబ్దతన్మాత్రమైన ఆకాశమును ఆవరించెను. అటు తరువాత, వాయురూప తన్మాత్రను సృజించెను. వాయువునుండి అగ్నిపుట్టినది. దానికి రూపము గుణము. స్పర్శ తన్మాత్రమైన వాయువును ఆవరించినవి. తేజస్సు వ్యాకరించుచు, రసతన్మాత్రను సృజించెను.

దాని నుండి రసమునకు (రుచికి) ఆధారములయిన జలములు పుట్టినవి. అవి రూపతన్మాత్రను ఆవరించెను. రసతన్మాత్రములు అయిన నీళ్ళు రూపతన్మాత్రను ఆవరించెను. నీళ్ళు వ్యాకృతి పొందినవై, గంధతన్మాత్రను సృష్టించెను. ఆ గంధతన్మాత్ర వలన ఒక సంఘాతము (ముద్ద) పుట్టినది. కావున దానిగుణము గంధమని చెప్పబడినది. ఆకాశాదులందు శబ్దాది గుణములు సూక్ష్మరూపమున ఉన్నందున దానికి తన్మాత్ర అను పేరు వచ్చినది. తన్మాత్రల విశేష రూపములు కావున అవి శాంతము, ఘోరములు, మూఢములును కావు. అవి శేషములు. భూతతన్మాత్రల సృష్టి తామసాహంకారమునుండి జరిగినది. తైజసాహంకార జన్య మలింద్రియములు వైకారికములు దేవతలు అనుపేర పది. పదునొకండవది మనస్సు. త్వక్కు (చర్మము) చక్షుస్సు (కన్ను) శ్రోతము (చెవి) జిహ్వ (నాలుక) ఘ్రాణము (ముక్కు) ఇవి (జ్ఞానేంద్రియములు) ఇవి శబ్దాది విషయ గ్రహణము కొరకు బుద్ధితో జతపడి ఉండును. వాక్కు (నోరు) పాయువు, కరములు, పాదములు, కర్ణేంద్రియములు విసర్గ - శిల్ప-గతి-ఉక్తి అను పనులను చేయును. ఆకాశము, వాయువు తేజస్సు నీరు భూమియు శబ్దాది గుణములతో ఒకదానితరువాత ఒకటి అధిక గుణములతో కూడి ఉన్నవి. అందుచే అవి శాంతములు, ఘోరములు, మూఢములు అని విశేషములుగా చెప్పబడినవి.

నానావిధ శక్తులుగల్గి నానారకములునైన ఆ గుణములు సంహతి లేకుండ (ఒక దానితో నొకటి ఒత్తిడి నొందకుండ ప్రజాసృష్టి చేయుటకు అసమర్ధములయ్యెను. అందువలన అవి పూర్తిగా కలిసికొని ఒకదానికొకటి ఆశ్రయమై ఒకే సంఘాత మందు లక్ష్యము గొని ఏకమై పురుషాధిష్ఠితములు అగుట వలన అవ్యక్తము యొక్క (అనుగ్రహము) అను బంధముచేతను మహత్తు మొదలుగ విశేషాంతము తుదదాక కూడి ఒక అండమును జనింపజేయును. అది క్రమముగా భూతములనుండి నీటిబుడగవలె, సమముగా మీదికి లేచినది. ఉదకమందంతట నావరించినది. అది బ్రహ్మ రూపుడగు విష్ణువు యొక్క ప్రాకృతమైన ఉత్తమ స్థానము. అవ్యక్తరూపుడుగా విష్ణువు ఇందు వ్యక్తమైనాడు. అట్లు అండ రూపుడైన ఈ హరికి మేరువు ఉల్బము (గర్భవేష్టన మాంసము) పర్వతములు, జరాయువు (ఉల్బవేష్టనము) గర్భమందున్న ఉదకము సముద్రాలు. ఆ అండమందు పర్వతములు, ద్వీపములు, జ్యోతిర్లోక సముదాయము, దేవాసుర, మనుషులతో కూడ ఉండెను.

పదిరెట్లు జలాగ్ని వాయువు ఆకాశ భూతములచేతను, అవ్వల భూతాదియైన అహం కారతత్వముచేతను, అండము ఆవృతమయి ఉన్నది. భూతాది మహత్తుచేతను మహత్తు అవ్యక్తముచేతను ఆవరింపబడి ఉన్నవి. ఈ ఏడు ఆవరణములను ప్రాకృతములు. ప్రకృతి మూలములు, దీనితో అండము కొబ్బరికాయలోని బీజము వెలుపలి డిప్పచేత వలె ఈయేడు ఆవరణములచేతను ఆవరింపబడి ఉన్నది. విశ్వేశ్వరుడయిన విష్ణువు రజోగుణమును పొంది బ్రహ్మయై, ఈ జగమును సృష్టించుటయందు ప్రవృత్తుడగును. సృజించిన దీనిని యుగానుసారముగ కల్పవికల్పన ఉన్నంతవరకు సత్త్వగుణమును పూని విష్ణువు అమేయ పరాక్రముడై రక్షించును. కల్పాంతమునందు తమోగుణోద్రేకమును పొంది జనార్దనుడు రుద్రరూపియై అతిభయంకరుడై ఎల్ల భూతములను భక్షించును. అన్ని భూతములందును జగత్తు ఏక సముద్రమైనంత శేషశయనమందు ఈ పరమేశ్వరుడు పరుండును. ఆపై మేల్కొని బ్రహ్మరూపియై మరల సృష్టి చేయును.

భగవంతుడు ఒక్కడే శ్రీహరి. సృష్టిస్థితిలయకారిణి బ్రహ్మవిష్ణుశివాత్మిక అనగా శక్తి అను పేరందును. స్రష్టయై తనను తాను సృజించును. విష్ణువై పాలింపవలసినదానిని పాలించును. స్వయంప్రభువై, చివర సంహర్తయై దీనిని ఉపసంహరించును. పృథివ్యాపస్తేజో వాయురాకాశములు జ్ఞానకర్మేంద్రియములు. అంతఃకరణ పురుషుడనబడు తత్త్వము జగత్తును ఆ విష్ణువే. సర్వభూతాత్మ విశ్వరూపుడు అయిన అవ్యయుడు ఆయనయే. భూతము లందలి సృష్ట్యాది కార్యమెల్ల ఆయనకు ఉపకారకమే. ఆ హరియే సృజింపబడిన వస్తువు. సృజించువాడు, వరేణ్యుడు. బ్రహ్మాది వివిధావస్థలచే సర్వమూర్తి వరదుడు వరేణ్యుడు వరిష్ణుడును అగువాడు ఆ హరియే. సృజ్యుడు, సృజింపబడు సర్వము ఆయనయే, సర్గకర్త. ఆయనయే పాలించును. భక్షించును. పాలింపబడును. (I-2) శ్రీ పరాశరుడు ఇట్లు చెప్పెను:

కాలస్వరూపము

శ్రీ పరాశరుడు ఇట్లు చెప్పెను:

“గుణము లేని, దేశకాలాది కొలతలకు అందని, దేహములేని, శుద్ధమైనవాడు సహకార సామగ్రి లేనివాడును, పుణ్యపాప సంస్కారములు, రాగాది గుణములు లేని పరబ్రహ్మ పుట్టించుట, పెంచుట, త్రుంచుట మొదలగు కార్యక్రమమునందు కర్త అగుట ఎట్లు పొసగును?” అని మైత్రేయుడు అడుగగా పరాశరుడు ఇట్లనెను.

“మణి మంత్ర ఔషధములు మొదలైనవాని యొక్క శక్తులు అచింత్యమైన జ్ఞానమునకే గోచరములు అగును. అచింత్యజ్ఞానము అనగా తర్కమునకు లొంగనిది. భిన్న, అభిన్నత్వాది వికల్పములచే ఊహించుటకు వశముకానిది, కేవలము అర్థాపత్తి ప్రమాణ విషయములు అన్నమాట. అగ్నికి దాహశక్తివలె, పరబ్రహ్మకుకూడ సృష్ట్యాది హేతువులైన, స్వభావ సిద్ధములైన శక్తులు కలవన్నమాట. స్వభావ సిద్ధములనగా అవి ఆయన స్వరూప భూతములే. కనుకనే మణి మంత్రౌషధ్యాదులచే మరి ఏ ఇతరమైన వేడిమినైన నివారింపవచ్చును కాని, స్వభావమైన పరబ్రహ్మయొక్క ఈశక్తులను వారింప శక్యముగాదు. కావుననే ఆయన యొక్క ఈ ఐశ్వర్యము నిరంకుశము.

ఓ తపస్విశ్రేష్ఠ! భగవంతుడు సృష్టియందు ఎట్లు ప్రవర్తించునో ఎఱుగుము. నారాయణుడే బ్రహ్మయు, లోకపితామహుడునై తనంత తాను ఆవిర్భవించగా భగవంతుడు (స్వయంభువు) పుట్టినాడని లోకములో జీవుల పుట్టుకతో పోల్చి చెప్పుట ఔపచారికము. అట్టివాని పరమాయువు బ్రహ్మమానముచే నూరేండ్లు అందురు. దానికి పరాయువని పేరు. అందు సగమునకు పరార్ధమని పేరు. అందు తొలి ఏబదేండ్లు పూర్వపరార్థము. తరువాతి ఏబదేండ్లు రెండవ పరార్థ (ద్విపరార్థ) కాలము అని చెప్పబడినది.

విష్ణువు యొక్క కాల స్వరూపమిది. మఱి ఆ బ్రహ్మయొక్క ఇతర చరాచర జీవుల యొక్క జీవనకాల పరిమాణమును తెలుసుకొనుము. పరిణామము అనుటచే జీవులయొక్క అవసానస్థితి కూడ తెలుసుకొనుము అని అనవచ్చును. దానికి అనువైన కాలమానమిది:

15 నిమేషములు ఒక కాష్ఠ. 30 కాష్ఠలు 1 కల. 30 కలలు 1 ముహూర్తము. 30 ముహూర్తములు 1 దినము (ఒక పగలు-ఒక రాత్రి). 30 దినములు ఒక మాసము. 15 దినములు ఒక పక్షము. 2 పక్షములు (శుక్ల పక్షము-కృష్ణ పక్షము) ఒక మాసము. 6 మాసములు ఒక అయనము, 2 అయనములు (ఉత్తర, దక్షిణ అయనములు) 1 సంవత్సరము, ఉత్తరాయణము 6 మాసములు దేవతలకొక పగలు, పితృదేవతలకు రాత్రి. దక్షిణాయనము 6 మాసములు దేవతలకు రాత్రి. పితృ దేవతలకు పగలు. దేవతల వేయి సంవత్సరములు (దివ్య) ఒక మహాయుగము. నాలుగువేల దివ్య సంవత్సరము అనగా-

              యుగములు                  యుగ సంధ్య                  యుగ సంధ్యాంశము

కృతయుగము   4 వేల దివ్య సం!!లు             4 వందల దివ్య సం!!లు          4 వందల సం!!లు

త్రేతాయుగము   3 వేల దివ్య సం!!లు            3 వందల సం!!లు                   3 వందల సం!!లు

ద్వాపరయుగము   2 వేల దివ్య సం!!లు        2 వందల దివ్య సం!!లు          2 వందల సం!!లు

కలియుగము      1 వేయి దివ్య సం!!లు          1 వంద దివ్య సంలు 1 వంద సం!!లు

ఈ విధముగా యుగ పరిమాణము మొత్తము 10 వేలు + సంధ్య + సంధ్యాంశము మొత్తము 2 వేలు కలసి 12 వేల దివ్య సంవత్సరములు ఒక మహాయుగము.

ఇట్టివి వేయి దివ్యమహాయుగములు బ్రహ్మకొక పగలు. ఆయన పగటివేళ మనువులు పదునాల్గురు ఆయాకాలములో సప్తర్షులు, దేవతలు, ఇంద్రుడు, మనువు ఆయన కుమారులు ఏకకాలమునందే సృజింపబడుదురు. ఉపసంహరింపబడుదురు. 71 చతుర్యుగములు (మహాయుగములు) ఒక మన్వంతరము. అది మనువు కాలము. అది ఇంద్ర ఋషి మనుపుత్రుల కాలము. ఒక కోటి యిరువది లక్షల దివ్య సంవత్సరములు బ్రహ్మయొక్క దివసప్రమాణము. అందు పదునల్గురు మనువులు గతింతురు. అనగా ఒక మన్వంతరమునకు ఎనిమిది లక్షల ఏబది ఏడు వేల నూట నలుబది మూడు దివ్య వర్షములు ప్రమాణము. అది మనుష్య మానమున ముప్పదికోట్ల ఎనుబదియైదు లక్షల డెబ్బదియొక్క వేయి నాలుగు వందల ఇరువది తొమ్మిది సంవత్సరములు.

బ్రహ్మయొక్క పగటి చివర నైమిత్తిక ప్రళయము (ప్రతి సంచరము) కల్గును. ముల్లోకములును తగలబడి పోవును. ఆ వేడికి ఓర్వలేక మహోలోకమందలి జనులు జన లోకమునకు ఏగుదురు. అంతయు ఒకే సముద్రమగును. అపుడు బ్రహ్మ, నారాయణ స్వరూపుడై ముల్లోకములను మ్రింగి కడుపులో ఇమిడించుకొని, శేషతల్పమున శయనించును. భగవంతుడైప విష్ణువు నీటిపై శేషశయ్యయందును, సృష్టికర్తయగు బ్రహ్మ ఆయన నాభి కమలమందును నిద్రింతురు. అపుడు జనలోక గతులగు యోగులు ఆయనను ధ్యానించుచుందురు. సరిగా అదే ప్రమాణమున రాత్రిని గడిపి, ఆవల ఆయన మరల సృష్టి కావించును. ఇట్టి దినములు, పక్షములు మాసముల లెక్కచే నొక్క సంవత్సరమై అట్టివి నూరేండ్లు బ్రహ్మకు పరమాయుర్దాయమే అగును. ఇపుడా బ్రహ్మకు ‘పాద్మమహా కల్పమను’ పేర నౌక పరార్ధము గతించినది. ద్వితీయపరార్ధ మందిపుడు వరాహకల్పము అను పేరుగల మొదటికల్పము నడుచుచున్నది” (I-3)

సర్వభూతముల సృష్టి

శ్రీ మైత్రేయుడు ఇంకను ఇట్లు చెప్పుచున్నాడు:

“కల్పాదియందు నారాయణుడు అనబడు బ్రహ్మ సర్వభూతములను ఎట్లు సృజించెను? తెల్పుమనగా మైత్రేయునకు పరాశరులు ఇట్లు అనిరి.

జరిగిన కల్పము చివర రాత్రి నిదురనుండి లేచి సత్త్వగుణోద్రిక్తుడై లోకమును శూన్యముగా చూచెను. నారాయణునిగూర్చి ఈ క్రింది శ్లోకమును మహర్షులు ఉదహరింతురు. ఆపః=నీరు - నారములు అనబడినవి. అవి నరుడు కన్నవి. ఆ నారాయణుకు అవి మొదట అయనము=గమ్యస్థానము అయినవి. అనగా ఉదకముల యందు ఆయన తొలుత విశ్రమించె నన్నమాట. ‘నారాః + అయనం యస్యసః నారాయణః’ అను నిర్వచనమును బట్టి ఈ శబ్దమేర్పడినది. ప్రళయమందు ఏకార్ణవమైన సమయమున నీటిలోపల ఉన్నట్లు ఊహించి ఈ భూమిని మీదికెత్తవలెనని నారాయణుని ప్రజాపతి కోరెను. అపుడు మునుపు నారాయణుడు కల్పాదులందువలె తాను మత్స్య కూర్మాది అనేక శరీరములను తాల్చెను. అట్లే వేదము యజ్ఞస్వరూపముగాగల వరాహరూపమును ధరించెను. అపుడు స్థిరము సర్వము పరము అయిన ఆత్మ తానై జనలోక మందున్న సనకాది సిద్ధులు స్తుతించుచుండ తనకు ఆధారమయిన ఆ పరమాత్మ ధరణిందాల్చి నీటిలో ప్రవేశించెను. అతనిని చూచి పాతాళమునకు వచ్చిన ఆ పృథివి వరాహమూర్తి కెఱిగి భక్తిచే వినమ్రయై ఇట్లు స్తుతించెను.

నమస్తే పుండరీకాక్ష తుభ్యం శంఖ గదాధర !

మాం ఉద్ధరాస్మాదద్యత్వం త్వత్తోహం పూర్వముత్థితా

త్వయాహముద్ధృతా పూర్వం తన్మయా హం జనార్దన

 తథాన్యానిచ భూతాని గగనాదీ న్య శేషతః

నమస్తే పరమాత్మాత్మన్ పురుషాత్మన్నమోస్తుతే

ప్రథాన వ్యక్త భూతాయ కాలభూతాయతే నమః

త్వం కర్తా సర్వభూతానాంత్వం పాతాత్వం వినాశకృత్

సర్గాదిషుప్రభో బ్రహ్మవిష్ణు రుద్రాత్మరూపధృత్

సంభక్షయిత్వా సకలం జగత్యేకార్ణవీకృతే

శేషేత్వమేవ గోవిన్ద చిన్త్యమానోమనీ షిభిః

భవతోయత్పరం రూపం తన్న జానాతికశ్చన

అవతారేషు యద్రూపం తదర్చన్తి దివౌకసః

త్వామారాధ్య పరంబ్రహ్మ యాతాముక్తిం ముముక్షవః

 వాసుదేవమనారాధ్య కో మోక్షం సమవాప్స్యతి

యత్కిఞ్చిన్మనసా గ్రాహ్యం యద్ద్రాహ్యం చక్షురాదిభిః

 బుద్ధ్యాచయత్పరిచ్ఛేద్యం తద్రూపమఖిలంతవ

త్వన్మయాహంత్వ దాధారాత్వత్సృష్టాత్వత్సమాశ్రయా

మాధవీమితి లోకోయమభిధత్తే తతోహిమాం

జయాఖి లజ్ఞానమయజయస్థూలమయావ్యయ

జయానన్త జయావ్యక్త జయవ్యక్త మయప్రభో

పరాపరాత్మన్ సర్విర్త్మన్ జయయజ్ఞపతే అనఘ

త్వంయజ్ఞస్త్వం వషట్కార స్త్వమోంకార స్త్వమగ్నయః

త్వంవేదా స్త్వంతదఙ్గానిత్వం యజ్ఞపురుషోహరే

సూర్యాదయోగ్రహాస్తా రానక్షత్రాణ్యభిలానిచ

మూర్తా మూర్తమదృశ్యంచ దృశ్యంచ పురుషోత్తమ

యచ్చోక్తం యచ్చనై వోక్తంమయాత్ర పరమేశ్వర

తత్సర్వం త్వం నమస్తుభ్యం భూయోభూయోనమోనమః

ఓ పుండరీకాక్ష! శంఖచక్రగదాధర! నీకు నమస్కారము. ఇందుండి నన్ను ఉద్ధరింపుము. మున్ను ఇట్లు ఉద్ధరించితివి. అపుడు నేను నీ స్వరూపమేయైతిని. ఆకాశాది సర్వభూతములు సర్వజగములు నీవె. ఓ పరమాత్మ! పురుషరూప! ప్రధాన వ్యక్త భూతునకు కాలాత్మకునకు నీకు నమస్కారము. సర్వ ప్రపంచము ఏకార్ణవమైనపుడు నీవు ఒక్కడివే శయనింతువు. జ్ఞానులపుడు నిన్ను ధ్యానించుచుందురు. నీ పరతరమైన రూపమును ఎవ్వడు ఎఱుగడు. నీవు అవతారమెత్తినప్పటి రూపమునే దేవతలు అర్చింతురు. (ఇదే అర్చనామూర్తి) వాసుదేవుడవగు నిన్ను ఆరాధింపక ఎవ్వడు ముక్తి పొందలేడు. ముముక్షు వుల కారాధ్యమయిన పరబ్రహ్మము నీవే. మనసుచేతను నేత్రాది ఇంద్రియములచేతను ఏదేది గ్రహింప వీలగునో బుద్ధిచే ఏది పరిచ్ఛిన్నమో (కొలవబడునో) ఆ రూపమంతయు నీవె. నేను త్వన్మయను (= నీతో నిండిన దానను) నా రూపమంతయు నీవే. నాకు నీవే ఆధారము. నీవే దిక్కు నీ చేతనే నేను సృష్టింపబడినదానను. అందువలననే లోకము నన్ను ‘మాధవి’ అని పేర్కొనుచున్నది. జ్ఞానమయా ! జయము! జయము! అని ఇత్యాదిగా వసుంధర అని స్తవము చేసెను.

అంతట శ్రీ పరాశరుడు ఇట్లు పలికెను:

పృథివి ఇట్లు స్తుతించగా శ్రీమంతుడు, సామస్వర ధ్వనితో ఘుర్ఘురించెను. వికసిత పద్మలోచనుడగు హరి తన కోరచే ఆ భూదేవిని పాతాళము నుండి ఎత్తి, ఒక నల్లని మహాపర్వతమువలె, నల్లకలువరేకులవలె నిగనిగలాడు మేనితో పైకి లేచెను. జనలోక మందుండు సనందనాది మునులచేత ఇట్లు స్తుతింపబడిన పరమాత్మ అట్లు ఎగసి తన ముఖవాయువుల తాకిడికి కెరటములుగా లేచిన ఉదకము నుంచి భూమిని ఎత్తి తన కోరలపై నిల్పెను. వరాహమూర్తి శరీరము బహువిస్తీర్ణ మగుటచే అబ్ధియందు అది మునిగిపోక గొప్ప ఓడవలె భాసించెను. అపుడు ఆ వరాహమూర్తి భూమిని సమమొనర్చి, కడచిన సర్గమందు దగ్ధములైన పర్వతములు ఎల్లను అమోఘ ప్రభావమున పునఃసృజించి ప్రతిష్ఠించెను. ఆ మీదట భూవిభాగము చేసి సప్తద్వీపములను, భూర్భువస్సువః పాతాళములను, నాల్గు లోకములను యథాతథముగ ముందటివలె రూపొందించెను. ఆ మీద హరి రజఃప్రధానమైన చతుర్ముఖ బ్రహ్మ స్వరూపముదాల్చి సృష్టిచేసెను. ఆ పనిలో ఈతడు నిమిత్తమాత్రుడే. సృజ్య శక్తులు ప్రధాన కారణములు. పరమేశ్వరుని నిమిత్తమాత్రత్వమును వీడి, మఱి ఇతరమును అపేక్షింపకయే - అనగా విశేష కారణాపేక్ష లేకుండగనే సృజ్యవస్తువు జీవుల (సృజ్య వస్తువుల) ప్రాచీన కర్మవాసనలచే వస్తుత్వము కూడా పొందింపబడుచుండును” (I-4)

సృష్టి వర్ణనము

అని తెలుపగా శ్రీ మైత్రేయుడు ఇట్లు ప్రశ్నించెను:

“దేవాది పిపీలికాంతము బ్రహ్మసృష్టిని ఎట్లు చేసెను? ఆయా పదార్థముల స్వభావము, గుణము, రూపము ఎట్టివి తెల్పుము” అనగా శ్రీ పరాశరమునీంద్రుడు ఆయనతో ఇట్లనెను. “సృష్టిని గూర్చి ఆలోచించునప్పుడు మున్ముందుగా తమోమయమైన, బుద్ధి పూర్వకముకాని (విశేష ధ్యానము లేని) సృష్టి ఆరంభమైనది. ఈ తమోగుణ సృష్టి ఆయన నుండి 1. తమోమోహము, 2. మహామోహము, 3. తామిస్రము, 4. అంధతమస్సు, 5 అవిద్య అను అయిదు పర్వములుగా (భాగములుగా) ప్రాదుర్భవించినది. భగవంతుడు ధ్యానించుచున్నయెడ, మేల్కొనక ఉన్న (నిద్రాస్థితిలో ఉన్నట్లున్న) స్థితి ఒకటి 1. తమో మోహము, 2. వెలుపల లోపలను వెలుగులేనిది మహామోహము, 3. సంవృతాత్మ (తామిస్రము), 4. అవిద్య (అంధతామిస్రము) కేవల స్థావరమైన నగాత్మకము. కొండలు ముఖ్యములు కావున వాని సృష్టి ముఖ్యసర్గము అనబడును. సృష్టికర్త ఆ సర్గమును చూచి ఇది సర్వ సృష్టి సాధకమే అనుకొనెను. అటుపై ధ్యానించుచున్న ఆయనకు తిర్య క్ర్సోతసము (పశుపక్ష్యాది) సృష్టి సాగినది. అందు పుట్టిన పశుపక్ష్యాదులు తమోగుణ ప్రాయములు. అవేదులు. జ్ఞానములేని జీవులు. హద్దుమీరి నడచునవి. తెలివిలేనివైనను తెలివిగల వానివలె ప్రవర్తించునవి. అహంమానములు. (నేనే గొప్పదానినని అహంకరించునవి. ) అంతః ప్రకాశములు (అంతర్వివిధములు) అనగా వానిలో చైతన్యమున్నను అది కప్పబడి ఉండును. అదిగాక అవి పరస్పరావృతములు. ఒకదాని నొకటి ఆవరించి ఉండు స్వభావము కలవి. పరస్పర సమ్మూఢములు. (ఒక జీవి సంగతి మరొక జీవికి తెలియనివి) ఆ తిర్యక్ర్సోతస్సును చూచి ఇదికూడ సృష్టి సాధకము కాదని మరల ధ్యానింపగా, మూడవసృష్టి ఊర్ధ్వస్రోతస్సు అనునది బయలుదేరెను. ఆ జీవులు ఊర్ధ్వముగా పోవువారు. ఆది సాత్వికము. (సత్వగుణ వికారము)చే పుట్టినవారు. ఆ జీవులు సుఖ సంతోషములు హెచ్చుగా కలవారు. లోన వెలుపలను ఆవరణ లేనివారు. బహిరంతః ప్రకాశకులు, అదే మూడవదైన దేవసర్గము. దానిచే బ్రహ్మకు సంతుష్టి కలిగెను. అయినను మరియొక సృష్టిని సాధకముగా ధ్యానించెను. లోగడ చెప్పిన ముఖ్య సర్గాదులు అసాధకములు అని గ్రహించి, ఇంకను నిత్యవస్తు ధ్యానము చేయు అతనికి అవ్యక్తమునుండి అర్వాక్ర్సోతస్సు ప్రత్యక్షము అయ్యెను. ఆ సృష్టి అడ్డముగా స్రోతోరూపము (ప్రవాహ రూపము)గా తోచినదిగావున దానికి ఆ పేరు వచ్చినది. అందలి ప్రాణులు బహు ప్రకాశములు, బహుతమః ప్రాయములు, బహురాజసములు అయ్యెను. అందువలన ఆ జీవులు దుఃఖప్రాయులు. బహిరంతః ప్రకాశులు మనుష్యులు. వారు సృష్టిసాధకులు. ఆరు విధముల సృష్టి ఇక్కడ తెలుపబడినది. వాని వరుస ఇది. బ్రహ్మ యొక్క మొదటి సృష్టి మహత్సర్గము. రెండవది తన్మాత్ర సృష్టి (భూత సృష్టి) మూడవది ఐంద్రియకము (వైకారికము). ఈ మూడును ప్రాకృత సర్గము అనబడును. ఇది బుద్ధిపూర్వకము. నాల్గవది ముఖ్యసర్గము. అయిదవది తిర్యక్ సృష్టి. ఆరవది దేవసర్గము. ఏడవది మనుష్య సృష్టి. ఎనిమిదవది అర్వాక్ర్సోతసము. అనుగ్రహ సర్గము, సాత్వికము, తామసము అను ఈ ఐదు సర్గములు వైకృతములు. ప్రాకృతములు. ప్రాకృతములు మూడు, కౌమారము కలిసి మొత్తము తొమ్మిది. నవసర్గములని వీనికి పేరు. ఈ ప్రాకృత వైకృత సర్గములు జగత్తునకు మూల కారణములు. ఇంకను మరి ఏమి వినకోరుచున్నావు” అనగా మైత్రేయుడు దేవసృష్టి క్లుప్తముగా తెల్పితివి సవిస్తరముగా ఆనతి ఇమ్మన పరాశర మహర్షి ఇట్లనియె.

“కుశలురైనవారు కుశలములైన పూర్వకర్మములచే భావితులై అనగా ఆయా వేదోక్త తమతమ వర్ణాశ్రమాచార విహిత ధర్మానుష్ఠానములచే ఆయా కర్మఫలముల అనుభవము నందు దాదాత్మ్యము పొందినవారై, దానిచే ఏర్పడిన ఖ్యాతిచేత అపూర్వ సిద్ధమైన సంస్కార విశేషములచేత, వాసనలచేత, విడివడక సంహార కాలమందు (లయ సమయమందు) కూడ ఉపసంహృతులయిరి. అనగా ఉపాధిభంగము పొందింపబడియు, లయకారుడైన పరమాత్మయందు సూక్ష్మ రూపమున అవశిష్టులైరి. వారిలో దేవతలు మొదలు స్థావరములైన పర్వతాదులవరకు అట్లు బీజరూపమున ఉన్నవారు నాల్గువిధములైన జీవులు. మరియు, సృష్టిచేయు నాల్గు విధములైన బ్రహ్మయొక్క మనసునందు పొడమిరి. అటు తరువాత దేవతలు, అసురులు, పితరులు, మనుష్యులుగా నాల్గు విధములైన జీవులను సృజింపనెంచి, సృష్టికర్త తన ఉదకములందు సమ్మేళన మొనరించుకొనెను. అట్లు సంయోగమందినంత మాత్రాన ఆతని నుండి తమోమాత్ర తనువు (కేవల చీకటి) ఉద్రేకించినది. అపుడా సృష్టి సంకల్పము చేసిన ఆతని యొక్క జఘనము (పిరిది భాగము) నుండి అసురులు పుట్టిరి.

ఆ తమోమాత్ర స్వరూపమయిన తనువును విడిచివేయవలెననుకొని, విడిచివేసిన ఆ తనువు రాత్రి (విభావరి) అయ్యెను. మరియును సృష్టిచేయవలెనని భావించి వేరొక తనువు నందు ఉండి అతడు సంప్రీతి చెందెను. అంతట సత్త్వోద్రిక్తులైన జీవులు ఆ బ్రహ్మ ముఖమునుండి జనించిరి. ఆ తనువును (ఉపాధిని) కూడ అతడు విడువగ, సత్త్వ గుణ ప్రాయమగు దినము జనించెను. అందువలన రాత్రి అసురులు, పగలు సురలు బలవంతులు అయిరి. అటుపైన ఆ విధి సత్త్వగుణ ప్రధానమైన ఇంకొక శరీరమును స్వీకరించెను. అపుడు నేను పితను (తండ్రిని) అని అనుకొన్నంతట అతనికి పితరులు జనించిరి. అటు పిమ్మట అతడు శరీరమును విడిచెను. అట్లు వదలిన ఆ శరీరమే సంధ్య. సంధ్య అనగా పగటికి రాత్రికి నడిమి స్థితి. ఆమీద అతడు రజోగుణ మాత్రమైన శరీరమును గైకొనెను. దాన రజోగుణోద్రిక్తులగు మనుష్యులు పుట్టిరి. రజః ప్రకృతి శరీరమును గూడ అప్పటికి అప్పుడే త్యజించెను. అంతట జ్యోత్స (వెన్నెల) ఏర్పడెను. అదే ప్రాక్సంధ్య (తొలిసంధ్య) అనబడెను. ఆ వెన్నెల ఏర్పడగనే మనుష్యులు, పితరులును కూడ ఆ సంధ్యా సమయమందు బలవంతులు అగుచున్నారు. వెన్నెల, రాత్రి, పగలు, సంధ్య అను ఈ నాలుగును బ్రహ్మయొక్క త్రిగుణాశ్రయములైన శరీరములు.

అటు పిమ్మట అతడు రజోగుణ ప్రధానమయిన మరొక శరీరమును గ్రహించెను. దాని వలన ఆకలి, కోపము పుట్టినవి. అటుతరువాత అంధకారమున ఆకలికి బక్క చిక్కినవారిని అతడు సృష్టించెను. వారు వికృతరూపులు, గడ్డములు పెరిగినవారునై ఆ సృష్టికర్త దగ్గరకు పరుగెత్తిరి. మరియు మనలను పుట్టించిన వీనిని రక్షింపవలదని వారనిరి. దానిచేత వారికి రాక్షసులు అను పేరు వచ్చినది. వారిలో కొందరు ఈ సృష్టికర్తను ‘జక్షామ’ (తినివేయుదమని పెద్దగా అరిచిరి. అందుచే వారికి యక్షులని పేరు వచ్చినది. బ్రహ్మ వారిని అనిష్టముగ చూడగా, అంతట వారి కేశములు రాలిపోయెను. అట్లు శిరో హీనులయిన వారు బ్రహ్మ శిరస్సుపైకి ఎగప్రాకిరి. అట్లు సర్పణము చేసినందున వారికి ‘సర్పము’ లను పేరు వచ్చెను. శిరస్సు హీనమగుట వలన ‘అహి’ అనుపేరుగూడ వచ్చెను. (అనగా పాములు అయిరన్నమాట). అందుచే కృద్ధుడై, జగత్కర్త క్రోధ స్వరూపులను పుట్టించెను. వారు కపిశవర్ణులు. (పసుపు మీరిన ఎరుపు రంగువారు) భయంకరులు అయి పిశితాశనులని పేరు పొందిరి.

అటుమీద ధ్యానము చేసినంత ఆ బ్రహ్మ శరీరము నుండి గంధర్వులు పుట్టిరి. వారు గాం=గోవును, కుడుచుచు పుట్టినందున గంధర్వులని పేరొందిరి. ఇట్లీ భూతములను సృష్టించి, శక్తి ప్రేరణముచే తనంత తాను పక్షులను (వయాంసి వయసః) సృష్టించెను. ఱొమ్ము నుండి గొఱ్ఱెలను, ముఖము నుండి అజము (మేక)లను, ఉదరము నుంచి, ఇరు పార్శ్వముల నుండి గోవులను, పాదముల నుండి గుర్రములు, ఏనుగులను, గాడిదలను, గవ యవము (అడవి ఆవు గురపిడి) లను లేళ్ళను ఒంటెలను, అశ్వతరము (కంచర గాడిద) లను న్యంకువులను (ఒక జాతి లేడి (ఇర్రి)) మరి పెక్కు జాతులను సృష్టించెను. ఆయన రోమములనుండి ఓషధులు, ఫలజాతులు దుంపలు పుట్టెను. కల్పాది త్రేతాయుగమందు పశువులను, ఓషధులను పుట్టించి వానిని అతడు యజ్ఞములందు ఉపయోగపరచెను. గోవు, మేక, పురుషుడు, అశ్వము, అశ్వతరము - గార్దభములను గ్రామ్యములైన పశువు లందురు. అరణ్య మృగములు శ్వాపదములు (పులులు ఖడ్గ మృగములు మొదలైన క్రూర జంతువులు ద్విశఫములు (రెండు డెక్కలు కలవి), ఏనుగులు, వానరములు, పక్షులు అను నవి అయిదురకములు, ఔదకములు (జల జంతువులు) ఆరవరకము పశుజాతికి చెందినవి. సరీసృపములు (సర్పజాతి) ఏడవరకము.

ఆయన ప్రథమ ముఖము నుండి గాయత్రీ ఛందస్సును, ఋగ్వేదమును, త్రివృస్తో మమును (అనగా దేవతాస్తుతి సాధన భూతములగు ఋక్కుల సముదాయము), రథంతర సామమును, యజ్ఞములలో అగ్నిష్టోమము అనెడి సోమసంస్థావిశేషమును సృష్టించెను. దక్షిణముఖమునుండి యజుర్వేదమును, త్రైష్టుభ ఛందస్సును, పంచదశ స్తోమమును, బృహత్సామము అను ఉక్థ్యమను సోమసంస్థను సృజించెను. పశ్చిమ ముఖము నుండి సామవేదమును, జగతీ ఛందస్సును, సప్తదశ స్తోమమును, వైరూపసామమును, అతి రాత్రము అనెడి సోమయాగ సంస్థను సృజించెను. ఉత్తరముఖము నుండి అధర్వణ వేదమును, ఆనుష్టుప్ ఛందస్సును, ఏకవింశ స్తోమమును, వైరాజసామమును, ఆపోర్యామము అనెడి సోమయాగ సంస్థను సృజించెను.

బహువిధ భూతములు ఆయన అవయవముల నుండి జనించెను. దేవాసుర పితరులను, మనుష్యులను సృజించి ఆమీద మరల సంకల్పము చేసి పిశాచ గంధర్వులను, అప్సరోగణములను, నరకిన్నర రాక్షసులను, పక్షులను, పశువులను లేళ్ళను, పాములను, అవ్యయము వ్యయము అయిన ఈ స్థావర జంగమ పంచమమును సృజించెను. వానివానికి క్రిందటి సృష్టిలో ఏయే కర్మములు విహితములో వానినే, ఈ సృష్టియందు అవి పొందినవి. హింస, అహింస, మృదుత్వము, క్రౌర్యము, ధర్మము, అధర్మము, ఋతము, అనృతము అనునవి ఎల్లను ఆ బ్రహ్మచే భావింపబడినవే ఆయా భూతములు పొందును. అవే వానికి రుచించును. ఇంద్రియార్థములందు శబ్దాది విషయములందు శరీరము లందు నానాత్వమును వినియోగమును బ్రహ్మ స్వయముగ సృజించెను. నామరూపములు ఆయా కృత్యముల వివరణము వేదశబ్దముల నుండియే మొదట దేవాదుల కేర్పరచెను. ఋషుల పేరులు, మున్ను వేదములందు వినబడినవే ఇప్పుడును చేసెను. అట్లే వానిని నియోగయోగ్యములను కావించెను. అనగా వానివానికి నియోగింపబడిన కర్మమునకు అనుగుణముగా గావించెను. ఋతువులందు, ఋతువిపర్యయమందు (ఋతువులు మారినపుడు) ఋతుచిహ్నములు నానారూపములై ఎట్లు కానిపించునో అట్లే కృతత్రేతాది యుగములందు గూడ ఆయా యుగధర్మములు వివిధ రూపములుగా కనిపించును. సిసృక్షతోగూడి (సృజింపచూచు ఇచ్చతో) సృజింపదగిన వస్తువుల యొక్క శక్తిచే ప్రేరేపింపబడి బ్రహ్మ సృష్టికార్యమును చేయుచునే ఉండును.” (5)

చాతుర్వర్ణ వ్యవస్థ 

మైత్రేయుడు ఇట్లనెను. “అర్వాక్ర్సోతస్సు మానుష సృష్టి అంటిరి. అది బ్రహ్మ ఎట్లు చేసెనో సవిస్తరముగ తెల్పుము. వర్ణములు గుణములు వాని కర్మ విశేషములు గూడ తెలియచేయుమనగా శ్రీ పరాశరుడు ఇట్లు చెప్పెను.

“జగత్తును సృజింప సమకట్టి, సత్యవస్తుధ్యానము చేయు బ్రహ్మయొక్క ముఖము నుండి సత్త్వ సంపన్నులగు ప్రజలు పుట్టిరి. బొమ్ము నుండి రజోగుణోద్రిక్తులు, తొడల నుండి రజస్తమో గుణోద్రిక్తులు పాదముల నుండి వేరు వేరు ప్రజలు ఉద్భవించిరి. వారు అందరు తమః ప్రధాన జీవులు. యజ్ఞ నిర్వహణమునకే బ్రహ్మ దీనిని అంతటిని కావించెను. చాతుర్వర్ణ్యము ఉత్తమమయిన యజ్ఞసాధనము. యజ్ఞములచే ఆప్యాయితులైన దేవతలు వర్షము కురిపించి ప్రజలను ఆప్యాయన పరతురు. కావున యజ్ఞములు కల్యాణ (మంగళ) హేతువులు. సదాచార సంపన్నులు ధర్మపరులును అయిన మహానుభావులచే సన్మార్గవర్తనులచే యజ్ఞములు నిర్వహింపబడును. మనుష్య జన్మముచేత మోక్షము స్వర్గమును పొందుదురు. ఇష్టమయిన ఏ స్థానమునకైన దానిచే పోగలరు. చాతుర్వర్ణ్య వ్యవస్థ గలవారు. శ్రద్ధాచార సంపన్నులు, శుద్ధాంతఃకరణులు, శుద్ధులు, సర్వానుష్ఠానము చేసి పాపము తొలగినవారు, సర్వబాధావర్జితులు యధేచ్ఛాలోక సంచారులు అగుదురు.

వారికి చిత్తము శుద్ధమై, అందు హరి వసింపగా విశుద్ధ జ్ఞానరూపమైన విష్ణువు అను పరమపదమును దర్శింతురు. అంతట హరియొక్క అంశమైన కాలాధిష్ఠాన దేవత వారి అల్పము ఘోరమును అయిన పాపమునంతను త్రుంచును. ఆ పాపము అధర్మ బీజము. తమోలోభాదిగుణ సంభవము. అది ప్రజలయందు రాగద్వేషాది రూపము నుండి అసాధకమగును. ముక్తి సాధకము కాక ఉండును. అందువలన ప్రజలకు సహజసిద్ధి (సాయుజ్య ముక్తి రూపమైనది) కలుగదు. రసోల్లాసము మొదలైన యష్టసిద్ధులు మాత్రమే కలుగును. ఇట్లాయాసిద్ధులు క్షీణించినంతట పాతకము మరల పెంపొంద, ద్వంద్వములకు రాగద్వేషములు సుఖదుఃఖములు మొదలైన జంటలకు లొంగి ప్రజలు మున్ను దుఃఖ వశులైరి. ఆ దుఃఖ సహనమునకై వారు దాన్వము (ఎడారి) మరు పార్వతము-జౌదకము- పురఖర్వటము (400 గ్రామాల పరగణాలకు ముఖ్యగ్రామము) గ్రామాదికము అగు కృత్రిమ దుర్గములను కల్పించుకొనిరి. శీతవాతాతపాది సహనమునకై ఇండ్లు వాకిండ్లు నిర్మించుకొన మొదలిడిరి. ఆ మీద బ్రతుకుతెరువునకు వార్తోపాయమును కృష్యాది జీవన వ్యాపారమును కల్పించుకొనిరి. కర్మసిద్ధమగు శిల్పాది హస్తసిద్ధిని సాధించుకొనిరి. ఆమీద యవగోధుమ ఆదిగ పదునేడు రకముల పంటలను పండించుట నేర్చుకొనిరి. 17 రకముల పంటలు ఇవి: వ్రీహులు, యవలు, గోధుమలు, నువ్వులు, ప్రియంగువులు= కొఱ్ఱలు, ఉదారములు=ధరలను వడ్లు, కోరదూషములు, సతీనకములు= అంకలు అనెడి పప్పుధాన్యము, మాషములు=మినుములు, ముద్గములు=పెసలు, మసూరములు=చిరు సెనగలు, నిష్పాపములు=అనుములు, కులుత్థములు=ఉలవలు, ఆఢ్యకములు=కందులు, చణకములు=సెనగలు, శణములు = జనుములు ఇవి గ్రామౌషధి జాతులు. యాజ్ఞికములు అనగా యజ్ఞోపయోగములైన ఔషధులు గ్రామ్యములు ఆరణ్యములు పదునాల్గు రకములు అవి. వ్రీహులు= ఎఱ్ఱవడ్లు యవలు, మాషములు, గోధుమలు, అనువులు, తిలలు, ప్రియంగువులు, కులుత్థములు=ఉలవలు, శ్యామాకమలు=చామలు, నీవారములు = నివ్వరి ధాన్యము, జర్తిలములు= అడవి నువ్వులు, గవేధుకలు =అడవి గోధుమలు, వేణుయవలు= వెదురు బియ్యము, మర్కటములు = ధాన్య విశేషములు, అనునవి పదునాల్గు రకములు. ఇవి కూడ గ్రామ్యములు అరణ్యములు అను భేదములు పొందినవి. ప్రజా కారణములుగా ఇవి యజ్ఞములతో పాటు సృష్టింపబడినవి.

వీనికి యజ్ఞము ఉత్తమకారణము. యజ్ఞానుష్ఠానము పాపశాంతి కూర్చుటకై ప్రతిదినము అనుష్ఠింపబడి ప్రజలకు ఉపకారకమగును. ఎవరి మనస్సులందు కాలముచే సృజింపబడిన పాపబిందువు ఇరవుకొన్నదో, క్రమాభివృద్ధిని అందునో అట్టివారు వేదములను, వేదములవలన తెలియనగు విషయములను, దేవతలను, యజ్ఞాది కర్మములను నెల్ల నిందించువారు, యజ్ఞములకు భంగము చేయువారు, ప్రవృత్తి మార్గమునకు (కర్మ మార్గమునకు) విచ్ఛిత్తి కల్గించువారు, వేదనిందకులు, దురాత్ములు, దురాచారులు, కుటిలులునై బయలుదేరినారు. వార్త సిద్ధమైనంతట (జీవన విధానము ఏర్పడిన మీదట) ప్రజా పతి ప్రజలను సృష్టించి ఆయా స్థానము గుణమునుబట్టి యొక మర్యాద (కట్టడ) ఏర్పరచెను.

వర్ణముల ఆశ్రమముల యొక్కయు ధర్మములను స్వధర్మ పరిపాలనము చేయు ఆయావర్ణములన్నిటికి కలుగు పుణ్యలోకములను పరమేశ్వరుడు సృజించెను. కర్మపరులయిన బ్రాహ్మణులకు ప్రాజాపత్యము అనుస్థానమును, యుద్ధములందు వెను జూపని క్షత్రియులకు ఇంద్ర స్థానమును, స్వధర్మ నిరతులైన (పశు గోరక్ష వాణిజ్యాది నిరతులైన) వైశ్యులకు వాయుదేవతా స్థానమును, పరిచర్యచేసి ధన్యులగు శూద్రులకు గంధర్వ స్థానమును ఏర్పరచెను. ఊర్థ్వరేతస్కులైన యతులకు ఎనుబది యెనిమిది వేల స్థానములు ఏర్పరుపబడినవి. అట్టిస్థానములనే గురుకుల వాసులగు నైష్ఠిక బ్రహ్మచారులకు ఏర్పఱచెను.

            వానప్రస్థులకు సప్తర్షులకు ఏస్థానమో అదే నిర్దేశించెను. గృహస్థులకు ప్రాజాపత్య స్థానము (బ్రహ్మలోకము) సన్యాసులకు (సన్యాసులకు పరివ్రాజులకు) (బ్రహ్మ స్థానము, బ్రహైక్య రూపము ఆత్మసంతుష్టులగు యోగులకు అమృత స్థానమును ఏర్పరచెను. ఏకాంతనిష్ఠులు బ్రహ్మధ్యాన నిష్ఠులు, యోగులు అయిన వారి స్థానము పరమోన్నత స్థానము. సూరులు బ్రహ్మ విద్వద్వరిష్ఠులు దానినే సదా దర్శింతురు.

చంద్ర సూర్యాది గ్రహాలు ఆయా గ్రహాధికార స్థానమునందు ఉన్న జీవులు వెళ్ళి వెళ్ళి తిరిగి తిరిగి వచ్చుచునే ఉందురు. కాని ద్వాదశాక్షర మహామంత్ర ధ్యాననిష్ఠులయ్యు ఉత్తమోత్తమ స్థానమునకు ఏగినవారేగిరేకాని ఇప్పటికిని వారు తిరిగిరాలేరు. తామిస్రము అంధతామిస్రము, రౌరవము, మహారౌరవము, అసిపత్రవనము, ఘోరము, కాలసూత్రము అవీచికము అను ఘోరనరకములు వేదనిందకులకు, యజ్ఞధ్వంసకులకు, స్వధర్మ త్యాగులకు చెప్పబడిన స్థానములు.

సృష్టిక్రమ వర్ణనము

శ్రీ పరాశరుడు ఇట్లు చెప్పెను:

అటుతరువాత అతడు ధ్యానింపగా, మనస్సునుండి సంతతి కల్గెను. ఆ కలిగిన మానసిక సృష్టి జీవులు, పుట్టుకలోనే కార్యములు (పదార్థములు) కరణములు (సాధనములు) అను వానితో కూడుకొని పుట్టిరి. అనగా చక్షురాది ఇంద్రియములు, ఆ ఇంద్రియ ములకు విషయములైన శబ్దాదులు, వానికి కారణములైన ఆకాశాది పంచ భూతములును, ఒకేసారి పుట్టినవి అన్నమాట. ఆ బ్రహ్మయొక్క అంగములందుండి, క్షేత్రజ్ఞులు అనగా జీవులు పుట్టిరి. సత్వాది గుణములు మూడింటివలన ఏర్పడిన ఆ జీవులను గురించి ఇంతకుముందే చెప్పి ఉన్నాను. అవి స్థావరములు, జంగములు అనునవి. ఆయనయొక్క మానస సంతానము వృద్ధి పొందని కారణమున సంతానమును కననందున, వారివంటి వారిని మఱి కొందఱిని, మనస్సునుండియే జనింపజేసెను. వారు నవబ్రహ్మలు. భృగువు, పులస్త్యుడు, పులిహరుడు, క్రతువు, అంగిరసుడు, మరీచి, దక్షుడు, అత్రి, వశిష్ఠుడు అనువారు. వారు పురాణ ప్రసిద్ధులు. ఖ్యాతి, విభూతి, సంభూతి, క్షమప్రీతి, సన్నతి, ఊర్జ, అనసూయ, ప్రసూతి అను కన్యలను కని, వరుసగా మీరు భృగ్వాదులకు భార్యలు కండని ఆజ్ఞ ఇచ్చెను. వీరికంటె ముందు పుట్టిన సనందనాదులు మానసపుత్రులు లోకములందు సక్తులుగాక, సంతానమునందు నిరపేక్షులైరి. అందఱు జ్ఞానులు, విరక్తులు, మత్సరములు లేనివారై, లోకసృష్టికి విముఖులై ఉన్న కారణముచే బ్రహ్మకు ముల్లోకములను దహింపగల క్రోధము పుట్టెను. ఆయన క్రోధజ్వాలల వలన ముల్లోకములు ఉద్దీపము అయ్యెను. కోపముచే ముడివడిన కనుబొమలతో కూడిన ఆయన లలాటము నుండి (నుదుటి నుండి) మధ్యాహ్న సూర్యునివలె ప్రకాశించు రుద్రుడు పుట్టెను. ఆ మూర్తి సగము స్త్రీ, సగము పురుషుడునై ప్రచండుడై ఉన్నందువలన అతనిని చూచి బ్రహ్మ “నిన్ను నీవు విభజించుకొనుమ”ని చెప్పి (నీవే అనేకరూపముల రూపొందుము. సృష్టిపెంపుము అని) అంతర్థానము అయ్యెను.

ఆ రుద్రుడు తనను స్త్రీగా పురుషునిగా తనను రూపొందించుకొనెను. ఆ పురుష రూపమును మఱల పదునొకండుగా విడదీసెను. స్త్రీత్వమును గూడ సౌమ్యము (శాంతము) అసౌమ్యము, రౌద్రముగా నలుపుగా తెలుపుగా ఛేదింపచేసెను. ఆ మీద బ్రహ్మ తనకు మొదటగా పుట్టిన స్వాయంభువ ప్రభువును, తానే అయిన వానిని ప్రజాపతిస్థానము నందు ఉంచెను. ఆయన తపస్సుచే కల్మషరహిత అయిన శతరూప అను అంగనను భార్యగా స్వీకరించెను. ఆతనివలన శతరూపఅను ఆమె ప్రియవ్రత ఉత్తానపాదుడు అను పుత్రులను ప్రసూతి, ఆకూతి అను ఇద్దరు కూతుండ్రను కనెను. ఆ కన్యలు రూప ఔర్యాది గుణసంపన్నులు. స్వాయంభువ మనువు, ప్రసూతిని దక్షునకు ఆకూతిని రుచి అను అతనికి ఇచ్చెను. ఆ రుచిప్రజాపతి ఆకూతిని గ్రహించెను. ఆ దంపతులకు యజ్ఞుడు, దక్షిణ అను మిధునము (స్త్రీ పుంస యుగ్మము) జన్మించెను. యజ్ఞునికి దక్షిణయందు పండ్రెండుగురు కొడుకులు పుట్టిరి.

స్వాయంభువమన్వంతరమందు వారు యాములు అను దేవతలుగా ప్రసిద్ధికెక్కిరి. దక్షుడు ప్రసూతియందు ఇరువది నల్గురు కూతుండ్రను కనెను. వారిపేర్లను వినుము. శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ బుద్ధి, లజ్జ, వపువు, శాంతి, సిద్ధి, కీర్తి అనునవి. వీరిలో పదుముగ్గురు దాక్షాయణులను (దక్ష కుమారికలను) ధర్ముడు స్వీకరించెను. వారి తరువాతివారు పదునొకండుగురు, ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నతి, అనసూయ, ఊర్జ, స్వాహా, స్వధా అనువారు. వారిని వరుసగా భృగువు, భవుడు, మరీచి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అత్రి, వశిష్ఠుడు, వహ్ని, పితృ దేవతలు భార్యలనుగా గ్రహించిరి. శ్రద్ధ-కాముని, చలా-(లక్ష్మి) - దర్పుని ధృతి-నియముని, తుష్టి – సంతోషుని, పుష్టి-లోభుని, మేధ- శ్రుతుని, క్రియ -దండుని, నయుని-వినయుని, బుద్ధి-బోధుని, లజ్జా-వినయుని, వపువు-వ్యవసాయుని, శాంతి- క్షేముని కనిరి.

శ్రీ మైత్రేయుడు ఇట్లు పలికెను:

ధర్ముని కొడుకులు సుఖము, సిద్ధి, యశుడు, కీర్తి అనువారు. కాముని వలన రతి హర్షుడను కొడుకును పొందెను. అతడు ధర్ముని పౌత్రుడు. (కొడుకు కొడుకు) అధర్ముని భార్య హింస. వారి కొడుకు అనృతుడు. కూతురు మాయవేదన. వేదన రౌరవునివలన దుఃఖమును కనెను. మాయ భూతములనెల్ల హరించు మృత్యు వును కనెను. మృత్యువు వలన వ్యాధి, జర (ముదిమి), శోక, తృష్ణ, (క్రోధులు జనించిరి. దుఃఖముతో గూడ వీరు అందరు అధర్మ లక్షణులు. వీరికి భార్య పుత్రుడు అనువారు లేరు. అందరును ఊర్ధ్వరేతసులు, అనగా సంతానమును కనుటకు పూనుకొనని వారన్న మాట. వీరు విష్ణువు యొక్క రౌద్ర రూపములు. వీరు నిత్యమును జగత్ప్రళయమునకు హేతువులు అగుచుందురు. దక్షుడు, మరీచి, అత్రి, భృగువు మొదలయిన ప్రజాపతులు సన్మార్గరతులు శూరులు వారందరు స్థితి కారకులు. నిత్యస్థితి, నిత్యసర్గము, నిత్యాభావము నిత్య ప్రళయము అనువాని స్వరూపము ఆనతి ఇమ్మని మైత్రేయుడు అడుగగా శ్రీ పరాశరుడు ఇట్లనెను.

ప్రళయ స్వరూపము:

హరి సృష్టి స్థితి లయములను ఆయా రూపములుగా తాల్చి అవ్యవహితముగా జరుపును. ప్రళయము నాల్గు విధములు. బ్రహ్మ ప్రళయము, నైమిత్తికము (బ్రహ్మ కల్పాంతమన్నమాట) అపుడు విష్ణువు నిద్రించును. ప్రకృతియందు (మాయమై) జగత్తు లయించుట ప్రాకృత ప్రళయము. యోగి పరమాత్మయందు లయించుట అత్యంతిక ప్రళయము. పగలు రాత్రి జీవులు పొందు నిద్ర, నిత్య ప్రళయము. ప్రకృతియందు జీవుల పుట్టుక ప్రాకృత సృష్టి. దైనందిన సృష్టి అనగా భూతములు దినదినమును పుట్టుట. నిద్రనుంచి లేచుట. జాగరణ స్థితి అన్నమాట. దానినే పురాణవేత్తలు నిత్యసర్గమందురు. ఇట్లు భగవంతుడు సర్వశరీరములందును సంస్థితిని (ఉనికిని) పొంది ఉత్పత్తి స్థితి లయములను ఒనరించుచుండును. సృష్టి స్థితి వినాశముల యొక్క శక్తులు విష్ణు కృతములు. సర్వదేహములందును రాత్రిందివములు సమస్థాయిలో జరుగుచుండును. ఈ శక్తిత్రయము. సత్వ రజస్తమోగుణ మయము. ఇది ఒకతరి అతిక్రమించి నడుచును. ఒక్కప్పుడు నడువనే నడువదు. ఒకప్పుడు పునరావృతమునుకాదు. (I-7)

రుద్ర సృష్టి

శ్రీ పరాశరుడు ఇట్లనెను: మైత్రేయ ! బ్రహ్మ యొక్క తామస సృష్టిని తెల్పితిని, ఇక రుద్ర సృష్టి తెలుపుచున్నాను వినుము. బ్రహ్మ కల్పాదిని తనకు ఈడగు కొడుకునకై ధ్యానించగా, ఆయన ఒడిలో నీలలోహితుడు అగు కుమారుడు ఉదయించెను. అతడు సుస్వరముగ రోదనము చేయుచు పరుగెత్తెను. బ్రహ్మ ఎందులకు ఏడ్చుచున్నావు అని అడుగగా, ఆ ప్రజాపతి నాకు ఒక పేరు ఇమ్ము అనెను. ‘రుద్రుడు’ అను పేరుగలవాడవు నీవు. ఏడువకుము. ధైర్యము కొనుమని పలుకగా శిశువు మరల ఏడు మార్లు ఏడ్చెను. అంతట విధి ఆతనికి ఏడు పేర్లు పెట్టెను. మొత్తము ఆ ఎనమండుగురు రుద్రులకు ఎనిమిది స్థానములను ఎనమండుగురు భార్యలను, పుత్రులను ఒసగెను. ఆ ఏడుగురి పేర్లు ఇవి: భవుడు, శర్వుడు, ఈశానుడు, పశుపతి, భీముడు, ఉగ్రుడు, మహాదేవుడు. వారికి స్థానములు సూర్యుడు, జలము, మహి, వాయువు, వహ్ని, ఆకాశము, దీక్షితుడైన బ్రాహ్మణుడు సోముడు అనువారు. ఇవే అష్టమూర్తులు సువర్చల, ఉష, సువేశి, శివ, స్వాహ, దిక్కులు. దీక్షా, రోహిణి అనువారు వారి భార్యలు. వీరి సంతానము వీరి పుత్రపౌత్ర పరంపరతో జగమెల్ల నిండినది.

శని శుక్రుడు లోహితాంగుడు (కుజుడు) మనోజవుడు, స్కందుడు, స్వర్గము, సంతానుడు అనువారు, వారి కొడుకులు. ఈ విధముగ సృష్టిని పెంచిన రుద్రుడు, సతీదేవిని భార్యగ గైకొనెను. ఆమె దక్షప్రజాపతి కూతురు, దక్షుని యెడ కోపించి ఆమె తన శరీరమును బాసి, హిమవంతునికి మేనకయందు ఉదయించెను. అపుడామె ‘ఉమ’ అను పేరందెను. ఆమెను భగవంతుడు హరుడు పెండ్లాడెను. భ్రుగువువలన ఖ్యాతి, ధాత, విధాత అను దేవతలను కనెను. నారాయణుని పత్నియగు శ్రీదేవిని కూడా కనెను.

అని చెప్పగా మైత్రేయుడు “అమృతమథన సమయమున లక్ష్మి పాల్కడలి నుండి అవతరించెనని చెప్పబడుచున్నది. భృగువునకు ఖ్యాతియందు ఉదయించెను అని నీవు అనుచున్నావు. ఇది ఎట్లు సంభవించినది?” అని అడుగగా పరాశరరుడు ఇట్లు అనెను.

మహాలక్ష్మి భార్గవి అగుట:

ఈ శ్రీదేవి విష్ణువునకు భార్య కాగా, విష్ణువు ఎట్లు నిత్యుడు, సర్వాంతర్యామియైన ఈమెయు నిత్య స్వరూపగా విష్ణునితో నిత్యము ఉండునది. విష్ణువు అర్థము ఈమె శబ్దము. ఈమె నీతి హరినయము (న్యాయము) విష్ణువు బోధము (జ్ఞానము) - ఈమె బుద్ధి. అతడు ధర్మము. ఈమె సత్ర్కియ. హరిస్రష్ట - ఈమె సృష్టి శాశ్వతురాలు. భగవంతుడు కామము-ఈమె ఇచ్ఛ. విష్ణువు యజ్ఞము. శ్రీదేవి దక్షిణ. లక్ష్మి ఆబ్యూహుతి (నేయి రూపమున ఇచ్చు హవిస్సు) హరి పురోడాశము (హోమములకు ఉపయోగించెడిదైన పిండి పదార్థము). లక్ష్మి పత్నిశాల - మధుసూదనుడు ప్రాగ్వంశము. త్రేతాగ్ని పాలకుడు. శ్రీదేవి చితి. హరి యూపస్తంభము. శ్రీ ఇద్మము. హరికుశ. భగవంతుడు సామస్వరూపి ఉద్గీతి (సామ) కమలాలయ. ఇందిర స్వాహారూపిణి. జగన్నాథుడు అగ్ని. శంకర భగవానుడు విష్ణువు గౌరి లక్ష్మి. సూర్యుడు కేశవుడు ప్రభ పద్మాలయ విష్ణువు పితృగణము పద్మ స్వధాదేవి. ఈమె శాశ్వతమైన పుష్టిని ఇచ్చునది. శ్రీదేవి ద్యులోకము. అతి విస్తారమైన అవకాశము. ఆకాశము. శ్రీధరుడు (విష్ణువు) శశాంకుడు (చంద్రుడు) కాంతి లక్ష్మి. అనుపాయిని ధృతి. రమ. జగచ్చేష్టాత్మకుడగు విష్ణువు వాయుసర్వగుడుగు వాయువు. సముద్రము గోవిందుడు వేల (చెలియలి గట్టు) లక్ష్మి. శచీదేవి లక్ష్మి దేవేంద్రుడు మధు సూదనుడు. యముడు చక్రి ధూమోర్ల (యమపత్ని) కమలాలయ. సమృద్ధి (సంపద) శ్రీ, శ్రీధరుడు, కుబేరుడు. గౌరి, లక్ష్మి, వరుణుడు హరి. శ్రీదేవి దేవసేన దేవసేనాధిపతి హరి. గదాపాణి అవష్టంభము (ఊత, పూనిక) లక్ష్మి శక్తి. కాష్ఠ లక్ష్మి నిమేషము హరి. ముహూర్తము ముకుందుడు కలారూపిణి కమలాలయ. వెన్నెల సిరి సకలమైన వెలుగు సర్వేశ్వరుడు. తీగ జగన్మాత. చెట్టు శ్రీవిష్ణువు. విభావరి (రేయి) శ్రీదేవి దివసము (పగలు) చక్రగదాపాణి వరప్రదుడు (హరి). వరుడు (పెండ్లికొడుకు) విష్ణువు పద్మవనవాసిని (లక్ష్మి) వధువు (పెండ్లికూతురు) నదము భగవంతుడు. శ్రీదేవి నది. పతాక కమల గేహిని. తృష్ణ లక్ష్మి లోభము జగత్స్వామి నారాయణుడు. రతి లక్ష్మి. రాగము గోవిందుడు. ఇక వేయి మాటలు ఎందులకు? దేవతలలో పశుపక్ష్యాదులలో మనుష్యులలో పురుషనామ మైనదెల్ల పురుషోత్తముడు, భగవంతుడు, విష్ణువు. స్త్రీ నామమైనదెల్ల శ్రీదేవి. వీరికంటె మఱిపరము లేదు. (I-8)

ఇంద్రరాజ్య భంగము

శ్రీ పరాశర ఉవాచ:

శ్రీ పరాశరుడు ఇట్లనియె. “మైత్రేయ! నన్ను నీవు అడిగితివి కాన తెల్పెదను వినుము. మరీచి వలన లక్ష్మీ చారిత్రమును ఇట్లు విని ఉంటిని. దుర్వాసుడు శంకరుని అంశము. ఆయన ఈ భూలోకమునందు సంచరించుచు, ఒక విద్యాధురునిచేత ఒక దివ్య పుష్పమాలను చూచెను. దాని పరిమళముచే ఆ వనమంతయు ఘుమఘుమలాడి వనవాసు లందఱకు మిగుల ఆనందమును కలిగించెను. ఆ మహర్షి పిచ్చివానివలె తిరుగుచు, ఆ సౌందర్యరాశివలె ఉన్న కల్పవృక్ష కుసుమమాలికను చూచి ఆ సుందరి దానిని తనకు ఈయవలసినది అని అడిగెను. ఆ విశాలనయన అతనికి మ్రొక్కి దానిని ఆ మునికి సమర్పించెను. అది చేకొని పిచ్చిగంతులు వేయుచు, ఆ ముని ఈభూమి నలుదెసల పరిభ్రమించుచు ఐరావతమును ఎక్కి ఎదురుగా వచ్చు త్రిభువనాధిపతిని శచీపతిని చూచెను. తత్సుగంధమునకు తుమ్మెదలు వెర్రెత్తి మూగుచున్న ఆ పూదండలను తన తలకు చుట్టుకొని, ఉన్నదానిని విడిచి, అమర రాజగు దేవేంద్రుని పైకి విసరెను. సురరాజు దానిని అందుకొని ఆ మదగజము తలపైకి విసరివైచెను. ఆ మద గజము శిరముపై ఆ దండ కైలాస శిఖరమందు గంగా నదివలె రాణించెను. మదముచే కన్నులు కానని గంధగజము మదము స్రవించు తొండముచే నాఘ్రాణించి దానిని నేలకు విసరెను. అందుకు దుర్వాసుడు కోపించి దేవరాజుతో ఇట్లనెను.

“వాసవ! ఐశ్వర్య మదముచే మత్తెక్కితివి. మొద్దుబారితివి. లక్ష్మీ స్థానమైనది అగునే నిచ్చిన ఈ కల్ప సుమమాలను అభినందింపవైతివి. మహాప్రసాదమని ప్రణతుడవై సంతోషాతిశయముచే మోమువిప్పార దీనిని తలదాల్చవైతివి. అందులో కూడ నేను ఇచ్చినదనియైన గమనింపక, గౌరవింపవైతివి. ఇందుచే ఓ మూఢ! నీ త్రిలోక సామ్రాజ్య లక్ష్మి తరిగిపోగలదు. ఇతర బ్రాహ్మణులవలె నన్ను లెక్కించి లెక్కచేయకపోతివి. నీవు దురభిమానివి. అందుచే మమ్ము అవమానించితివి. నేను కోపించి కనుబొమలు ముడిచితినా, ఈ చరాచర ప్రపంచము గడగడలాడునే! అట్టి నన్ను పొగరెక్కి, ఓ దేవరాజా! అవమానించితివి అని పలికె”నని చెప్పి,

శ్రీ పరాశరుడు ఇంకను ఇట్లు చెప్పెను:

“ఆ మాటలను విని మహేంద్రుడు గజేంద్రస్కంధము నుండి దిగ్గనదిగి, పుణ్యమూర్తియగు దుర్వాసుని బ్రతిమాలెను. అతడంతట మెల్లగా నవ్వి, ప్రణతుడై, ఇంద్రునకు ఇట్లు బదులు పల్కెను. “నేను దయా హృదయుడను కాను, నాకు ఓర్పు లేదు. కొద్ది ప్రార్థనకే మనసు కరుగు మునులు వేరు అని తెలుసుకొనుము. ఆ గౌతమాది మునులు ఇతరులు వృధాగా నిన్ను పొగడి, పొగరెక్కించినారు. ఇంద్రా! ఓరిమిలేమికి పరమసారము (నిగ్గు) అయిన దుర్వాసుడను నేను అని తెలుసుకొనుము” అని శ్రీ పరాశురుడు పలికెను.

“దయాసారులైన వశిష్ఠుడు మొదలైన ఈ ఋషులు నిన్ను తెగ పొగడగా నీవు మదమెక్కితివి. అందుచేతనే నన్నిట్లు అవమానించితివి. జ్వలించు జటామండలముతో, కినుకచే, కనుబొమలు ముడిపడి వికటమైన నా ముఖమునుచూచి భువనత్రయమందు హడలి పోనివాడు ఎవ్వడు? పెక్కు మాట లెందుకు? నిన్ను నేను క్షమింపను. బ్రతిమాలుట అను నీనాటకమును ఇంకను ఆడుచున్నావు అని ఆ మహర్షి వెళ్ళిపోయెను. అంతట ఖిన్నుడైన దేవరాజు ఐరావతమును ఎక్కి అమరావతికి వెనుతిరిగి పోయెను. దుర్వాసుడు శాపము ఇచ్చిన ఫలితముగా, ఇంద్రరాజ్యభ్రంశము జరుగగా, తరువాత అదిమొదలు మూడు భువనములు గజత్స్వరూపము సొంపు, తరిగిపోయినవి. ధ్వంసమైనవి. ఓషధులు పంటలు క్షీణించిపోయినవి. యజ్ఞములు జరుగుటలేదు. తాపసులు తపస్సు మానివేసిరి. దానాది ధర్మములందు జనము మనస్సును పెట్టక దుర్వృత్తులకు పాల్పడిరి. లోభాదులకు వారి ఇంద్రియములు వశమై, అల్పాల్ప వస్తువునకు కూడా ఉబలాటపడిరి. ఎందు సత్వమో (సత్వగుణమో) అందు లక్ష్మి ఉండును. ఎందు లక్ష్మియో అచ్చట సత్వగుణము ఉండును. సిరి కోల్పోయినవారికి సత్వ మెక్కడ? అది లేనిచో ఇక తక్కిన గుణము లెక్కడివి? గుణసంపద లేనిచో బలము శౌర్యము మొదలగునవి శూన్యము అగును. అవిలేనివాడు అందరికి లొంగిపోవును. లొంగిపోయిన మానవుడు మతిభ్రష్టుడగును. ఇట్లు అత్యంతము సిరి తగ్గి, త్రిభువనములు సత్త్వశూన్యములు అయినంత, దైత్య దానవులు దేవతల మీదికి దండెత్తుటకు ఉద్యమించిరి. లోభవశులై ఐశ్వర్యహీనులైన దైత్యులు సత్వముపోయి, సిరి తరిగి నిస్సత్త్వులైన దేవతలతో యుద్ధము చేసిరి.

ఇంద్రాదులు ఓడిపోయి అగ్నిమున్నుగా అందరు బ్రహ్మను శరణు చొచ్చిరి. వారి ఘోషను ఆలకించి బ్రహ్మ “ఆసురమర్దనుడైన జనార్దనుని శరణు పొందుడు” అని వారితో చెప్పి తానును క్షీరసముద్ర ఉత్తర తీరమునకు ఏగి పరాశర ప్రభుడగు హరిని తదిష్టములైన వాక్కులచేత (వేదముచేత) (బ్రహ్మ ఇట్లు స్తుతించెను.

బ్రహ్మకృత విష్ణు స్తుతి

నమామి సర్వంసర్వేశమనన్త మజయవ్యయమ్

లోకధామధరాధారమ ప్రకాశమభేదినమ్

నారాయణమణీయాంసమశేషాణామణీయసామ్

సమస్తానాంగరిష్ఠం చభూరాదీనాంగరీయసామ్

యత్రసర్వంయతత్సర్వముత్పన్నం మత్పురస్సరమ్

సర్వభూతశ్చయః ప్రోక్తః పరాణామపియః పరః

పరః పరస్మాత్పురుషాత్పరమాత్మ స్వరూపధృత్

యోగిభిశ్చిన్త్యతేయా అసౌముక్తి హేతోర్ముముక్షుభిః

సత్త్వాదయోనసన్తీ శేయత్రచ ప్రాకృతాగుణాః

సశుద్ధస్సర్వ శుద్ధేభ్యః పుమానాద్యః ప్రసీదశు

కలాకాష్ఠానిమేషాదికాలసూత్రస్య గోచరే

యస్యశక్తిర్నశుద్ధస్య ప్రసీదతు సనోహరిః

 ప్రోచ్యతేపరమేశో జోయశ్శుద్ధోప్యువచారతః

ప్రసీదతుసనోవిష్ణురాత్మాయస్సర్వ దేహినామ్

యః కారణంచ కార్యంచ కారణస్యాపికారణమ్

కార్యస్యాపిచయః కార్యం ప్రసీదతు సనోహరిః

కార్యకార్యస్య యత్కార్యం తత్కార్యస్యాపియస్స్వయమ్

తాత్కార్యకార్య భూతోయ స్తతశ్చ ప్రణతౌ స్స్మతమ్

కారణంకారణస్యాపితస్య కారణకారణమ్

తత్కారణానాం హేతుంతంప్రణతాస్స్మసురేశ్వరమ్

భోక్తారంభోజ్యభూతంచ స్రష్టారం సృజ్యమేవచ

కార్యకర్తృస్వరూపంతం ప్రణతాస్స్మపరంపదమ్

విశుద్ధబోధవన్నిత్య మజమక్షయమవ్యయమ్

అవ్యక్తమవికారం యత్తద్విష్ణోః పరమంపదమ్

నస్థూలంనచ సూక్ష్మంయన్న విశేషణగోచరమ్

తత్సదం పరమం విష్ణోః ప్రణమామ సదా అమలమ్

యుస్యాయుతాయుతాంశాంశే విశ్వశక్తిరియంస్థితా

పరబ్రహ్మస్వరూపస్య ప్రణమామస్తమవ్యయమ్

యద్యోగినస్సదోద్యుక్తాః పుణ్యపాపక్షయేక్షయమ్

పశ్యన్తి ప్రణవేచి న్య్తంతద్విష్ణోః పరమంపదమ్

యన్న దేవానమునయోనచాహంనచశంకరః

జానన్తి పరమేశస్య తద్విష్ణోః పరమంపదమ్

శక్తయోయస్యదేవస్య బ్రహ్మవిష్ణుశివాత్మికాః

భవన్త్య భూతపూర్వస్య తద్విష్ణోః పరమంపదమ్

సర్వేశ సర్వభూతాత్మన్ సర్వసర్వాశ్రయాచ్యుత

ప్రసీద విష్ణోభక్తానాం వ్రజనోదృష్టిగోచరమ్

సర్వులకు సర్వేశ్వరుడు, అనంతుడు, అజుడు, అవ్యయుడు, కారణమునకు కారణము కాని కారణమునకు కారణము దానికి కారణములయిన వానికి కారణము అయిన సురేశ్వరునికి ప్రణతులము అయ్యెదము. భోక్త భోజ్యము స్రష్ట సృజ్యము కార్యము కర్తయు అయిన పరమ పదమునకు వినతులము అయ్యెదము. విశుద్ధ జ్ఞాన సంపన్నము అజియు, అక్షయము, అవ్యక్తము, అవికారము అయిన విష్ణువు పరమపదము స్థూలముగాదు. సూక్ష్మముగాదు. విశేషణములకు గోచరముగాని ఆ విష్ణునికి పరమపదమును మ్రొక్కెదము. ఏ పరబ్రహ్మయొక్క పదివేల అంశమునకు బదివేలవ అంశమై ఈవిశ్వశక్తి ఉన్నదో అవ్యయమునకు మ్రొక్కెదము. యోగులు నిత్యమును ఉద్యమించి (నిరంతర అనుసంధానము చేసి) పుణ్య పాపములు క్షయించుటకు ఏ అక్షము అచింత్యము అయిన దానిని దర్శింతురో, ఆ విష్ణువు యొక్క పరమపదము. దేవతలు, మునులు, నేనును, శంకరుడును గూడ నెఱుంగరో ఆ విష్ణు పరమపదమును, అచ్యుత పూర్వుడయిన (పుట్టుకలేని) శక్తులు బ్రహ్మయు విష్ణువు శివుడను పేర ఉన్నవో అట్టి ఓ సర్వేశ! సర్వ భూతాత్మా! సర్వ! సర్వా శ్రయ! అచ్యుత! ఓ విష్ణూ! మాకు ప్రసన్నుడవు కమ్ము. మా దృష్టికి కనిపింపుము” అని ఇట్లు బ్రహ్మసేసిన స్తవమును ఆలించి దేవతలందరు ప్రణామములుచేసి ప్రసీద = ప్రస న్నుడవు కమ్ము. ప్రజనోదృష్టి గోచరమ్ = మా దృష్టికి కనిపింపుము అని అనిరి. ఎవ్వని పరమపదము భగవంతుడగు ఈ బ్రహ్మయు ఎరుగడో ఆ జగన్నివాసము అగు నీ పరమ పదమునకు మ్రొక్కెదము. ఓ అచ్యుత! ఓ సర్వగతా!” అని బ్రహ్మ దేవతలు పలికిన తరువాత ఇట్లు బృహస్పతి, దేవర్షులును అ మహావిష్ణువును స్తుతించిరి.

దేవర్షులు విష్ణువును స్తుతించుట:

ఆద్యుడవు, యజ్ఞమూర్తివి, పూర్వులకెల్ల పూర్వుడవు. సృష్టికర్తను సృష్టించినవాడవు. అవిశేషణుడవు. (విశేషణమనగా భేదకము. ఉన్నదొక్కటే వస్తువైనప్పుడు అది నిర్గుణము, నిర్వకారమైనప్పుడు భేదక సామాగ్రి మరి ఉండనే ఉండదని తాత్పర్యము) అట్టి నీకు వినతులము అయ్యెదము. లోగడ పుట్టిన, ఇకమీద పుట్టనున్న వానికి నీవు ఈశ్వరుడవు. యజ్ఞమూర్తిధరుడవు (లోగడనే యజ్ఞమూర్తివని పిలిచినారు. మరల యజ్ఞమూర్తివనుట పునరుక్తి కాదా? అనగా “స్తుతే బూమితానాస్తి” స్తుతులందు పునరుక్తి దోషములేదు అను న్యాయానుసారము చెప్పినవే మరల చెప్పుట స్తుతిలక్షణము. అట్టివానికి పునరుక్తికా భావము ఉండదు) మా ఎడ ప్రసన్నుడవు అగుము. మాకు దర్శనము ఇమ్ము. ఇదిగో బ్రహ్మాది దేవతలు వారి ముఖమైన అగ్నితో గూడ నీకు ప్రణతులైనారు. శరణుపొందినారు. అని ప్రార్థింపగా ఆ దేవతలపై అనుగ్రహమూని విష్ణువు వారికి ప్రత్యక్షమయ్యెను. శంఖచక్ర గదాధారియు అపూర్వరూప సంపత్తి కలిగి తేజోరాసియై దర్శనమిచ్చిన ఆ పుండరీకాక్షుని బ్రహ్మాది దేవతలు స్తుతించిరి. తెలియువాడు, తెలియదగినది, తెలివియు నీవే. నీ తేజస్సుచే శత్రువులమైన మమ్ములను ఆప్యాయనపరుపుము. నీ దర్శనము అగునంతవరకే బాధ, కోరిక, మోహము, దుఃఖమును ఉండును. నీవు నీ దర్శనముచే నీశక్తితో మమ్ము ఆనంద పరుపుము అని స్తుతింప ప్రసన్న కటాక్షములతో విష్ణువు వారిని ఆదరించి ఇట్లనెను.

క్షీరసముద్ర మథనము

“ఓ వేల్పులారా! మీ తేజస్సులను నేను మరల పూరించెదను. నేను తెల్పినట్లు చేయుడు. మందరమును కవ్వముగను వాసుకుని తరిత్రాడుగను చేసి నేను తోడై ఉండ, పాల్కడలిం త్రచ్చుడు. అయ్యెడ మంచిమాటలచేత, ఆ రాక్షసులు అందరికిని సంబంధించిన పని ఇది. ఫలము అందరకు సమానమే. ఇందులకు మీరు ఆహుతులు కండు. సముద్ర మధనమైనంతట అమృతము పుట్టును. దానిని త్రాగి మీరు బలవంతులు, అమరులు (మరణము లేనివారు) కండు. దేవదేవవుడైన నేను రాక్షసులకు అమృతము అందకుండ కేవలము సముద్రమథన క్లేశము మాత్రము అనుభవించునట్లు చేయగలను” అని ఆజ్ఞాపింపగా విని సురలు, అసురులతో సంధి చేసికొని అమృత సంపాదనమునకు ప్రయత్న మారంభించిరి. ఓషధులన్ని తెచ్చి పాలసంద్రమున వైచిరి. శరత్కాలము విధముగా అచ్చ మైన కాంతిగల ఆ పయోధియందు మథనము ఆరంభించిరి. మొట్టమొదట పాము తలవైపు పట్టిన దేవతలు తోకపట్టుటకు తోకపట్టిన దైత్యులు తలను పట్టునట్లు హరి తంత్రము గావించెను. మీరు మహాబలశాలురు, ధీరులు. మీరేమి తుచ్ఛమైన తోక పట్టు టేమి? ఈ అల్పబలులు అధీరులు దేవతలు శరీరమున కెల్ల ప్రధానమైన ముఖము పట్టు టేమి? సిగ్గుసిగ్గు అని పొఱపులు వెట్టి, వానిచే “ఔనౌను పొరబడితిమి మేము తల పట్టు కొందుము. మీరు తోకకు రండని వారలచేతనే అనిపించి బేలుచేసి ఇద్దఱకుం తల తోక మార్చెను. మొదటికంటె పోయిన కొలది త్రచ్చుతరి తరిబుద్ధి కలిగెను. ముల్లోకము లక్ష్మీ కళనిండెను. దేవేంద్రుడు ఎప్పటివలె శ్రీమంతుడు అయ్యెను. మఱల స్వర్గ సామ్రాజ్యమంది సింహాసన మధిష్ఠించి పద్మహస్త అగు శ్రీదేవిని దేవరాజు స్తుతించెను.

ఇంద్రకృత లక్ష్మీస్తుతి

నమామి సర్వలోకానాంజననీమబ్ధి సంభవామ్

శ్రియమున్నిద్ర పద్మాక్షీం విష్ణువక్షస్థలస్థితామ్

పద్మాలయాం పద్మకరాం పద్మపత్ర నిభేక్షణామ్

 వన్దే పద్మముఖీం దేవీం పద్మనాభ ప్రియామహమ్

త్వం సిద్ధిస్త్వం స్వధాస్వాహాత్వం సుధాలోకపావని

సంధ్యారాత్రిః ప్రభాభూతిర్మేధాశ్రద్ధా సరస్వతీ

యజ్ఞవిద్యా మహావిద్యా గుహ్యవిద్యాచ శోభనే

ఆత్మవిద్యాచ దేవిత్వం విముక్తిఫలదాయినీ

అన్వీక్షికీత్రయీ వార్తా దణ్డనీతి స్త్వమేవచ

సౌమ్యాసౌమ్యైర్జగద్రూపై స్త్వయై తద్దేవి పూరితమ్

కాత్వన్యాత్వామృతే దేవి సర్వయజ్ఞమయంవపుః

అధ్యాస్తే దేవదేవస్య యోగిచిన్త్యంగదాభృతః

త్వయాదేవి పరిత్యక్తం సకలం భువనత్రయమ్ ।

వినష్టప్రాయ మభత్త్వయే దానీం సమేధితమ్

దారాః పుత్రాస్తథా అగారసుహృద్ధాన్యధనాదికమ్

భవత్యేతన్మహాభాగే నిత్యంత్వద్వీక్షణా న్నృణామ్

శరీరారోగ్యమైశ్వర్య మరిపక్షక్షయస్సుఖమ్

దేవిత్వదృష్టిదృష్టానాం పురుషాణాం నదుర్లభమ్

త్వం మాతా సర్వలోకానాం దేవదేవోహరిః పితా ।

త్వయై తద్విష్ణునాచా మ్బజగద్వాప్తం చరాచరమ్

మానః కోశం తథా గోష్ఠం మాగృహం మాపరిచ్ఛదమ్

మాశరీరం కలత్రంచ త్యజేథాస్సర్వపావని

మాపుత్రాన్మాసుహృద్వర్గాన్ మాపశూన్ మావిభూషణమ్

త్యజేథామమదేవస్య విష్ణోర్వక్షస్థలాలయే

సత్త్వేన శౌచసత్యాభ్యాం తథా శీలాదిభిర్గుణైః

త్యజ్యన్తేతేన రాస్సద్యస్సంత్యక్తాయే త్వయామ లే

త్వయావలోకితాస్సద్యశ్శీలాద్యైస్సకలై ర్గుణైః

ధనైశ్వర్యైశ్చ యుజ్యన్తే పురుసానిర్గుణా అపి

సర్వలోకజనని సముద్రమందు జనించిన లక్ష్మిని, వికసించిన పద్మమువంటి నయన ములుగల దానిని, విష్ణు వక్షస్థల మందున్న దానికి మ్రొక్కుచున్నాను. పద్మము నివాసము, హస్తమునందు పద్మము, పద్మము వంటి కన్నులు, పద్మము వంటి నెమ్మోము సొంపుకులుకు పద్మనాభుని ఇల్లాలికి నమస్కరింతును. అమ్మా! నీవు సిద్ధివి, స్వధవు, స్వాహాదేవివి, సుధ లోకపావని, సంధ్య, రాత్రి, ప్రభ, భూతి, మేధ, శ్రద్ధ, సరస్వతి, యజ్ఞవిద్య, మహావిద్య, గుహ్యవిద్యవు, ఓ శోభన దేవతా! నీవే ఆత్మవిద్యవు కూడా. ముక్తిఫలదాయినివి అన్వీక్షవి, త్రయివార్త, దండనీతి నీవే. సౌమ్యములు అసౌమ్యములు అయిన రూపములచేత నీచేతనే ఈ జగత్తు నింపబడినది. నీవుగాక దేవీ! మరి ఎవ్వరి సర్వయజ్ఞ మయమైన దేవదేవుని గదాధరుని ధ్యానమునకు అందనిది, యోగి ధ్యేయము అయినదియు అగు ఆ మూర్తి అలంకరింపగలది. నీచే విడువడి ఈ భువనములు మూడును లేనట్లుగా అయి, ఇపుడు నీ చేత పెంపొందినవి. ఓ మహానుభావినీ! నీ కటాక్షముననే గదా భార్య, పుత్రులు, ఇండ్లు, వాకిండ్లు, మిత్రులు, ధనధాన్యాధికము నిత్యము కల్గును దేవీ! నీ దృష్టిచే చూడబడిన వారికి శరీర ఆరోగ్యము, ఐశ్వర్యము, శత్రునాశనము సుఖము దుర్లభముకాదు. నీవు సర్వలోక మాతవు. దేవదేవుడు హరితండ్రి. అమ్మా! ఈ చరాచర ప్రపంచము నీచే వ్యాప్తము. మా పరిచ్ఛదము సర్వసామగ్రి లక్ష్మి. మా శరీరమును కళత్రమును మా పుత్రులను, మిత్రులను, పశువులను, మా విభూషణములను ఎన్నడు విడువకుము. ఓ సర్వపావనీ! ఓ విష్ణు వక్షస్థలవాసినీ నీచే విడువబడినవారు సత్త్వము, సత్యము, శౌచము, శీలము మొదలైన లక్షణములచే విడువ బడుదురు. నీచే కనబడినవారు గుణహీనులైనా, క్షమాశీలాది సంపన్నులు, ధనైశ్వర్యములు కలవారు అయ్యెదరు.

నీవు ఎవ్వనివంక కనుగొందువో అతడు శ్లాఘ్యుడు. ఓ విష్ణువల్లభా! నీవెవ్వరికీ పెడమొగమౌదువో అప్పటికప్పుడే వారి శీలాదిగుణములు, వైగుణ్యమును పొందును. (బ్రహ్మ జిహ్వ (నాలుక) కూడ నీగుణములను వర్షింపచాలదు. పద్మాక్షీ! ప్రసన్నవు అగుము. దేవీ! ఎన్నడు నన్ను విడువకుము అని ఇట్లు స్తుతింప దేవతలందరు చూచుచుండ సర్వభూత నివాసిని, శ్రీదేవి ఎదుట కానవచ్చి దేవేశ! హరీ! నీ ఈ స్తుతిచే నేను సంతుష్ట నైతిని. నీ ఇష్టమైన వరమును అడుగుము. నీయెడ వరదనై వచ్చితిని అనగా ఇంద్రుడు దేవీ! నీవు వరమిత్తువేని, నేనావరము పొంద అర్హుడనేని, ఈ ముల్లోకమును నీవు ఎన్నడు విడువరానిదియే నాకు పరమ వరమగును గాక! అబ్ధిసంభవ! ఈ నాచేసిన స్తుతిచే నిన్ను ఎవ్వరు స్తుతింతురో వారిని కూడ నీవు విడువవలదు. ఇది నాకు రెండవ వరము.

అని ప్రార్థింపగా శ్రీదేవి ఇట్లనియె. “ఓ త్రిదశ శిరోమణీ! వాసవ! నీ పాలనలోని ముల్లోకములను ఎన్నడు నే విడువను. నీ స్తోత్రముచే, ఆరాధనచే సంతుష్టనై వరమిచ్చితిని. సాయప్రాతః సమయములందు ఈ స్తుతిచే నన్ను స్తుతించువానికి నేను పరాఙ్ముఖిని కాను” అని దేవరాజునకు ఆ దేవి వరమొసగెను. మైత్రేయ! భృగుమహర్షికి ఖ్యాతియందు మున్ను శ్రీదేవి ఉదయించినది. ఆమె మరల దేవదానవులు అమృతమథనము గావించిన తఱి సముద్రునకు ఉదయించినది. ఇట్లెప్పుడు జగత్ప్రభువు అవతరించినప్పుడెల్ల, ఆయన సమాయినియై ఈమె అవతారము చేయును. ఆయన ఆదిత్యుడైనపుడు ఈమె పద్మ (పద్మిని) అయ్యెను. పరశురాముడైన తఱి ఈమె భూదేవి అయినది. రాఘవుడై అవతరించిన తఱి సీత అయ్యెను. కృష్ణావతారమందు రుక్మిణి అయ్యెను. తక్కిన అవతారములందును ఈమె విష్ణువునకు విడిచిపెట్టనిదే అయ్యెను. దేవత్వమందు దేవ శరీరిణి. మనుష్యత్వము హరి పొందినపుడు మానుషి అగును. విష్ణువు దేహమున అనురూపముగ తన తనువును గైకొనును. ఈ లక్ష్మీ జన్మకథ ఎవ్వడు వినునో, చదువునో ఆతని ఇంట మూడు తరములదాక లక్ష్మి వీడదు. ఈ శ్రీకథ ఎవరి ఇండ్ల యందు పఠింపబడునో ఆ గృహంబులందు ఎన్నడు కలహములకు ఆధారమైన అలక్ష్మి ఉండదు. మైత్రేయ! నీవు అడిగితివి కావున ఇది ఎల్ల నీకు తెల్పితిని.

ఈ విధముగా సకల విభూతి వ్యాప్తికి హేతువగు ఈ ఇంద్రముఖోదితమైన లక్ష్మీస్తుతి అనుదినము ఈలోకమున ఎచట నరులచే పఠింపబడునో ఆ సదనములందు అలక్ష్మి (దరిద్ర దేవత) ఉండదు.

భృగుసర్గాది సృష్టి వర్ణనము

శ్రీ మైత్రేయుడు ఇట్లనియె:

మహర్షీ! నేను అడిగినదెల్ల ఆనతిచ్చితివి. భృగువు నుండి జరిగిన సృష్టిక్రమము సెలవిమ్మని ప్రార్థింపగా శ్రీ పరాశరుడు ఇట్లనెను. భృగువునకు ఖ్యాతి యందు లక్ష్మి ఉదయించి విష్ణువునకు భార్య అయ్యెను. అట్లే ఖ్యాతియందు ధాత, విధాత అను పుత్రులు భృగువునకు ఉదయించిరి. మేరువు కూతుండ్రు, అయతి ధాతకు, నియతి విధాతకు భార్యలైరి. వారికి ప్రాణుడు మృకండుడు అను కొడుకులు కల్గిరి. మృకండునికి మార్కండేయుడు కల్గెను. అతనికి వేదశిరుడు ఉదయించెను. ప్రాణుని కొడుకు ద్యుతిమంతుడు. వానికి అజావంతుడు, వానికి వంశుడు కల్గిరి. మరీచి భార్య సంభూతి పౌర్ణమాసుడను కొడుకును కనెను. ఆ మహాత్మునికి విరజుడు, పర్వతుడును కల్గిరి. స్మృతిఅను అంగిరసుని భార్య సినీవాలి, కుహువు, రాక, అనుమతి అను కన్యలను కనెను. అత్రివలన, అనసూయ, సోముని, దుర్వాసుని, దత్తాత్రేయయోగిని కనెను. పులస్త్యుని ఇల్లాలు ప్రీతియందు పులహ ప్రజాపతికి విక్షమ అను భార్యయందు కర్దముడు, చార్వరీ వంతుడు, సహిష్ణువు అను ముగ్గురు కుమారులు పుట్టిరి. క్రతువుఅను మునిభార్య సంతతి వాలఖిల్యులు అను అరు వదివేల మంది ఊర్ధ్వరేతస్కులైన కుమారులను గాంచెను. వారు బొటనవ్రేలి కణుపంత ఆకారము కలవారు. మధ్యందిన సూర్యప్రభావంతులు వశిష్ఠునికి ఊర్ణయందు ఏడుగురు సుతులు ఉదయించిరి. వారు రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహువు, సవనుడు మహర్షులు. బ్రహ్మ యొక్క పెద్దకొడుకు ఈ అగ్న్యభిమాని దేవతవలన స్వాహాదేవి మహౌజస్సంపన్నులైన ముగ్గురు సుతులను కనెను. వారు పావకుడు, పవమానుడు, శుచియైన జలాశి అనువారు. వారి సంతతియందు నలుబదియైదుగురు అగ్నులు ప్రసిద్ధులు కల్గిరి. తండ్రీ కుమారులు ముగ్గురును కలిసి, ఈ అగ్నులు నలుబది తొమ్మిదిమంది అయిరి. బ్రహ్మవలన సృజింప బడిన అగ్నిష్వాత్తులు, బార్హిషదులు అనగ్నులు సాగ్నులు అగువారిని వివరించి ఉంటిని. వారి వలన స్వధాదేవి మేన వైతరణి అను ఇర్వురు కుమార్తెలను కనెను. ఆ ఇర్వురు బ్రహ్మవాది యోగినులును మంచి జ్ఞాన సంపత్తి గలవారు. సర్వశుభ లక్షణలు. ఇది దక్ష కన్యకల సంతతి. దీనిని శ్రద్ధతో స్మరించినవాడు సంతానహీనుడు కాదు. 

ధ్రువ చరిత్రము

పరాశరుడు ఇట్లనియె: “స్వాయంభువమనువు కొడుకులు ప్రియవ్రతుడు, ఉత్తాన పాదుడును మహావీరులు ధర్మజ్ఞులు. ఉత్తానపాదునికి సురుచి అను ప్రియ భార్యయందు ఉత్తముడను మిక్కిలి ఇష్టుడగు కొడుకు కల్గెను. సునీతి అను ఆమె అతని అగ్రమహిషి ఆమె అందు ధ్రువుడు ఉదయించెను. అతనియందు తండ్రి కంత ప్రీతిలేదయ్యె. తండ్రి తొడ మీద కూర్చున్న తమ్ముని ఉత్తముని చూచి సురుచి చూచుచుండ తాను అక్కడ కూర్చుండ కుతూహలపడు ధ్రువునిగని ఉత్తానపాదుడు అందులకు ఇష్టపడడయ్యెను.

ప్రేమతో వచ్చి తండ్రి ఒడిలో కూర్చుండ ఉబలాటపడు సవతికొడుకును చూచి ఆ ఒడిలో ఉన్న తన కుమారుని చూచి సురుచి ఇట్లనియె. వత్స! ఏల ఊరక ముచ్చట పడెదవు? నా కడుపున పుట్టక వేఱొక స్త్రీ గర్భమున పుట్టి పరమోత్తమ స్థానమందని దానిని అవివేకివై కోరుచున్నావు. నిజమే నీవు ఈయన కొడుకువే. అయిననేమి నాచే పది మాసములు మోయబడిన వాడవుకావు. సర్వ రాజన్యులకు ఆశ్రయమైన ఈ రాజాసనము నా కొడుకునకు మాత్రమే తగినది. ఏల వృథా కేశపడెదవు? నా కొడుకట్లు ఈ గొప్ప కోరిక వ్యర్థ ముగ నీ కెందులకు? నీవు సునీతికి పుట్టితివనునది నీ అవగాహనలో లేదా? ఆనగా ఆ సవతి తల్లి మాటలువిని దండ్రిని విడిచి ఆ బాలుడు కినుకగొని తన తల్లి సౌధమునకు వెళ్లెను. అల్లన బెదవులదర కోపము గొనియున్న ఆ పిల్లవానిని గని సునీత ఒడిలోనికి దిగిచికొని “నాయన! ఎందులకు కోపము వచ్చినది? ఎవడు నిన్నుజూచి ఆదరింపడు. నీ యెడ అపరాధముచేసి ఎవ్వడు (నిన్నుగాదు) మీ తండ్రిని అవమా నించినాడు?”

అనగా ఆ పాపడు సురుచి రాజు ముందు తనతో ఆడిన మాటలెల్ల అమ్మకు చెప్పెను. ఆ యమ్మ సునీతి విని మనసుచెడి, నిట్టూర్పుపుచ్చి, ఊర్పులెగయ చూపుల సొంపుదఱుగ దీనురాలై బిడ్డనితో ఇట్లనియె. అబ్బాయీ! సురుచి నిజము పల్కినది. నీవు అల్ప భాగ్యుడవే. పుణ్యవతులైనవారి బిడ్డడు ఇట్లు సవతిచే నొవ్వ నాడబడునా? ఈమున్ను నీవు చేసిన ప్రయత్న మింకెన్నడునూ చేయవలదు. నీవు మున్ను చేసినది ఎవ్వడు హర్షింపగలడు. చేయనిది ఎవ్వడు ఈయగలడు? దాని మాటలం బొడమిన దుఃఖమిది నీవు లెక్కసేయవలదు. రాజాసనము, వెల్లగొడుగు, పతాక, గుఱ్ఱములు, మేటిఏనుగులు అను ఇవి అన్నియు ఎవనికి పుణ్యములు గలవు వానికే సంప్రాప్తము అగును. బిడ్డా! నీవు శమింపుము. జన్మజన్మాంతరముల పుణ్యములచే రాజు సురుచియండు సురచి అయ్యెను. పుణ్యములు లేని నాబోటి ఒక బోటి భార్య అని అనిపించుకొనుటకు మాత్రమే భార్య. పుణ్యముల పెంపున ఇంపుగుల్కు ఉత్తముడు, దాని కొడుకు ఉత్తముడే, ఉత్తమ పుణ్యుడు. నా కుమారుడవై అట్లే పుట్టియు, నీవు అల్పపుణ్యుడవు. నిక్కము. అయినను నీవు ఏడువందగదు. బుద్ధిమంతుడు తన కెంతగలదా పుణ్యఫలమున సంతు ష్టుడగును. సురుచి మాటచే నీకు ఎక్కువ దుఃఖము కలిగినేని, సర్వఫలప్రదమైన పుణ్యరాశి సంపాదనమునకు యత్నము చేయుము. మంచి శీలవంతుడవు కమ్ము. ధర్మాత్ముడవు అగుము. ప్రాణుల హితవు కోరుము. ఎల్లరయెడ మైత్రి పాటింపుము. నీరు పల్లమునకట్లు సంపదలు పాత్రుని దరిజేరును” అని పల్కగా విని

ధ్రువుడు ఇట్లనియె:

అమ్మా! నా ఉపశమనమునకు నీవు అన్న ఈ పలుకు ములుకుల చేత పగులువడిన నాయెడద నిలువదు. సర్వ జగమ్ములకు అభిపూజ్యమైన మహోన్నత స్థానము ఎట్లు పొందగలనో, అందులకు నేను యత్నించును. రాజునకు సురుచి ప్రియురాలు. ఆమె కడుపున నేను పుట్టనైతిని. అమ్మా! నీ కడుపున పుట్టి పెరిగిన నా ప్రభావము చూడుము. మా తమ్ముడు ఉత్తముడు. ఆమె గర్భమున మోపబడినవాడు. వాడే తండ్రి ఇచ్చిన రాజాసనము పొందుగాక! దేవీ! ఇంకొకడు ఇచ్చిన స్థానము నేను కోరను. నా కృషిచే నేను నా తండ్రిగూడ పడయని ఆ స్థానము కోరుచున్నాను అని పలికి జననిఇల్లు వెడలి, పురము వెడలి, ఆ పురము వెలినున్న ఉద్యానముకు సమీపమునగల వనమునకు వెళ్ళెను. అక్కడ అంతకుమున్న వచ్చి కృష్ణాజినములు పరచిన ఆసనములందు కూర్చున్న సప్తర్షులను దర్శించెను. ఆ రాచబిడ్డడు అందరకు ప్రణమిల్లి వినయావనతుడై చేతులు మొగిచి ధ్రువుడు ఇట్లు పలికెను: ఓ సత్తములారా! సునీతియందు కల్గిన ఉత్తానపాదుని కుమారుడనని నన్ను తెలియుడు. నిర్వేదపడి (దుఃఖముగొని) మీ సన్నిధికి ఏతెంచినవాడను. అనవిని ఋషులు; నాలుగు, ఐదేండ్ల ఈడువాడవు. రాకుమార! నీకు దుఃఖము కల్గుటకు కారణమించుకేని ఎపుడేని కానరాదు. నీవు చింతింప వలసినది కొంచెము లేదు. భూపతి తండ్రి అంతయు ధరించును, భరించును. నీకు ఇష్టజన వియోగాదికము (బంధు వియోగము) కానము. నీ శరీరమందు ఏ వ్యాధి కానబడదు. నీకు నిర్వేదము కల్గుటకు ఏవి నిమిత్తములు? ఏదేని కలదేని తెల్పుము. అన, వారికి ఆ బాలుడు సురుచి అన్న మాటలను తెలిపెను. అదివిని అమ్మునులు అందరు ఇట్లనుకొనిరి” ఆహా! ఈ బాలునిలోని క్షాత్రతేజము ఏమి వింతయైనది? ఈర్ష్యాబుద్ధిగల సవతి తల్లి పలుకులకు అతడికి సైపలేనితనము ఏమి వింత? ఈతని మనసు నుండి ఆ పలుకులు తొలగకున్నవి. ఓ రాచబిడ్డ! ఈదుఃఖముచే నీవిపుడేమి చేయదలచితివో అది ఇష్టమగునేని మాకు తెలుపుము. మఱియు మేము నీకేమి సాహాయ్యము చేయవలెనో అదియు తెలుపుము. నీవేదో మాకు తెలుప నెంచినట్లు కనిపించుచున్నావు.” అని ధ్రువుడు ఇట్లనియె. “నేను ఏదేని ఒక అర్థముకోరుటలేదు. ఓ విప్రోత్తములారా! ఈ ముందు ఇంకొకడు అనుభవింపని (మఱొకనిచే భుక్తముగాని) అట్టి స్థానము ఒక్కటే కోరుచున్నాను” అన మరీచి “గోవిందుని ఆరాధింపని నరులు ఆ స్థానమునందలేరు. కావున నీవు అచ్యుతుని ఆరాధింపుము”. అని పల్కగా అత్రి అతనితో “పరులకెల్లను పరుడైన జనార్దనుడు దేనియెడ సంతుష్టుడగును” ఆతడు ఆ అక్షయ స్థానమందును. ఇది నిక్కము. ఆ ఉన్నత స్థానము నీవు కోరుదువేని ఏ అచ్యుతుని యందు ఈ సర్వము ఉన్నదో, ఆ గోవిందుని ఆరాధింపుము” అని చెప్పెను. అంత పులహుడు: “పరబ్రహ్మ వస్తువు పరంధామము ఆపర బ్రహ్మ వస్తువు హరి కావున శ్రీహరిని ఆరాధించినవాడు, దుర్లభమైన ముక్తిని పొందును” అని చెప్పెను. అటుతరువాత క్రతువు: “యజ్ఞము, యజ్ఞ పురుషుడు, పరమ పురుషుడును అగు జనార్దనుడు తుష్టుడైన అందరానిది లేదు” అని పల్కగా, పులస్త్యుడు: “ఇంద్రుడు ఎవ్వనిని ఆరాధించి ఇంద్రస్థానము పొందెనో, ఆ యజ్ఞపతిని విష్ణువును సుప్రతివై ఆరాధింపుము” అని చెప్పెను. అంత వశిష్ఠుడు: వత్సా! విష్ణువును ఆరాధింతువేని ముల్లోకములలో మనసునందు ఏది కోరుదువో ఆ ఉత్తమోత్తమ స్థానమును పొందగలవు” అని పల్కెను.

అంతట ధ్రువుడు వినతుడై “నాకు తాము విష్ణువు ఆరాధింపుమని సెలవు ఇచ్చితిరి. ఆయన సంతుష్టుడగుటకు నేను ఏమి జరుపవలయునో, ఆయన ఆరాధన ఎట్లు చేయవలెనో ప్రసాదసుముఖులై ఓ మహర్షులారా! నాకు ఆనతిండు” అన ఋషులు ఇట్లనిరి. “రాజకుమారా! విష్ణువుని ఆరాధన ఎట్లు చేయవలెనో వినుము. మనసు నుండి వెలి వస్తువులను అన్నింటిని మరలించి, వదలించి ఆజగన్నివాసునియందు కదలకుండ నిలుపవలెను. ఇట్లు ఏకాగ్ర మనస్కుడై విష్ణుమయమైన మనస్సుతో “హిరణ్యగర్భ పురుష ప్రధానా! వ్యక్త రూపిణే. ఓం నమో వాసుదేవాయ శుద్ధ జ్ఞాన స్వభావినే” అని జపింప వలయును. (హిరణ్యగర్భుడు పురుషుడు ప్రధానము అవ్యక్తము అనబడు స్వరూపము గలవానికి శుద్ధజ్ఞానము స్వభావమైన వానికి వాసుదేవునికి నమస్కారము అని మంత్రము యొక్క భావము) స్వాయంభుమనువు మీ పితామహుడు భగవంతుడు (షడైశ్వర్య సంపన్నుడన్నమాట) ఇంతకుముందు ఈ మంత్రమునే జపించెను. దానికి జనార్దనుడు సంతుష్టుడయ్యెను. త్రిలోక దుర్లభమైన ఆయన కోరిన సమృద్ధిని అతనికి ఆ పరమేశ్వరుడు ఒసంగెను. అట్లే నీవును దీనిని ఏవేళ జపించుటచేత గోవిందుని సంతోష పరుపుము” అని చెప్పిరి.

ధ్రువోపాఖ్యానము

అటు పిమ్మట పుణ్యరాశి శ్రీ పరాశరుడు ఇట్లనియె. “సర్వముదానిని విని ఆ రాచ బిడ్డడు ఆ ఋషులకు ప్రణామములు చేసి తాను కృతార్థుడనైతిని అనుకొనుచు అచటనుండి మహాపుణ్యమైన యమునా తటమందలి మధువనమునకు ఏగెను. మధువను రాక్షసుడు ఉన్న వనమగుటచే అది మధువనము అని ప్రసిద్ధమయ్యెను. మధుని కొడుకు లవణా సురుని చంపి శత్రుఘ్నుడు మధురాపురిని నిర్మించిన తావు అదియే. దేవదేవుడు హరిమేధసుడను అర్చామూర్తి సాన్నిధ్యము అక్కడనే ఉన్నది. సర్వపాపహరమైన ఆ తీర్థమందు ధ్రువుడు తపమాచరించెను.

మరీచి ప్రముఖులైన మునులచే అపదిష్టమైనట్లు తనయందు అశేష దేవదేవేశుడు విష్ణువు ఉన్నట్లు తలంచెను. వేరు తలపులేక ధ్యానించు అతనికి సర్వభూతగతుడైన విష్ణు భగవానుడు సర్వభావగతుడై సర్వాంతర్యామియై గోచరించెను. సర్వాత్మకుండైన విష్ణువు ఆ యోగి మనస్సునందుండగా అంతట సర్వభూతధారిణియైన ఈ ధారుణి యా బరువును మోయజాలనిది అయ్యెను. ఎడమ పాదము బొటనవ్రేలును ఒత్తి ఆతడు నిలువబడినంత ఈమేదిని పర్వతములతో కూడ కంపించెను. నదీనద సముద్రములు సంక్షోభ మందినవి. ఓ మహామునీ! ఆ సంక్షోభముచే అమరులు మిగుల క్షోభమందిరి. అప్పుడు యముడు మొదలైన దిక్పాలురైన దేవతలు వ్యాకులురై ఇంద్రునితో ఆలోచించి ఆ బాలుని ధ్యానభంగము గావించిరి. ఆందోళించి కూష్మాండ దేవతలు ఇంద్రునితో పలురూపులుదాల్చి ఆ పాపనికి సమాధి భంగముచేయ ఆరంభించిరి. అతని తల్లి సునీతి మాయామయియై వచ్చి అతని ఎదుట కొడుకా! అని జాలిగ పిల్చి కన్నీరుగార నెదుట నిలువబడి అట్లయ్యె. నాయన! పెక్కువిధముల ముచ్చటపడి నిన్ను కంటిని. ఈశరీర ఘాతుకమైన ఈ దారుణమైన నిర్బంధము నుండి మరలుము. దీననై, అనాథనై ఒంటరి నైన నన్ను నీవు సవతి తల్లిమాటలచే వదలతగదు. దిక్కులేని నాకు నీవే దిక్కు ఐదేండ్ల ఈడువాడవు నీవేడ? ఈ దారుణ తపమ్మేడ? ఫలములేని ఈ నిర్బంధము నుండి ఈ కష్టమునుండి, నీమనస్సు త్రిప్పుకొనుము. ఇది నీకు ఆటలకు కాలము. తరువాత అధ్య యనమునకు, అటుపిమ్మట సకల భోగములకు కాలము. ఆమీద తపస్సు చేయతగును. ఆటలాడుకొనవలసిన తఱి నీవు తపస్సును గావించి, ఆత్మవినాశము కావించుకొనగోరెదవు ఇదేమి? నాకు ప్రీతిగూర్చుట పరమ ధర్మము. వయస్సు తదనుగుణమైన అవస్థ తదను గుణమగు క్రియ ఈ క్రమమును అనుసరింపుము. ఈ అధర్మము నుండి మరలుము. నన్ను అనుసరించుము. అర్హతకును ఈడునకును మించిన ధర్మము చేయుట అధర్మమే. వత్స! నీవు ఈ తపస్సు చాలింప వేని నేనును నీవు చూచుచుండ ప్రాణములు విడచెదను.

అని ఇట్లు కన్నుల నీరు గ్రుక్కుకొనుచు పలవించు తల్లిని అతడు విష్ణువునందు నిలిపిన మనసు కలవాడగుటచే చూడడయ్యెను (పరధ్యానమందుండెనన్నమాట). అంత ఆమె వత్సా! వత్సా! అల్లదె ఈ భయంకరాటవిలో ఆయుధములగొని ఘోరమైన రక్షస్సులు మీదబడుచున్నవి. పారిపొమ్మని ఆమె అటనుండి తొలగిపోయెను. వెంటనే రక్షస్సు లెదుట నిల్చినవి. ఆయుధములెత్తి జ్వాలామాలకులములైన ముఖములతో, భయంకరముగ అఱచుచు రాజసుతుని ఎదుట గిరగిర దిప్పి ప్రజ్వలించు అస్త్రములను వదలినవి. మంటలు గ్రమ్ము నోళుల అక్కలార్చినవి.

చంపుడు చంపుడు వీనిని బట్టి చీల్చుడు చీల్చుడు తీసుడు తినుడని ఆ నిశాచరులు ఆర్చినవి. మరియు ఆ నిశాచరులు సింహములవలె మొసళ్ళట్టి పలుమొగములను కొని ఆ రాచబిడ్డని జడిపింప ఆర్చిరి. ఆ రక్కసులు, వారి ఆ పెడ బొబ్బలు, ఆ ఆయుధము లేవియు గోవిందునందుడెందమత్తికొన్న ఆ బాలుని కంటబడ వయ్యెను. రాజపుత్రుడు ఏకాగ్రచిత్తుడై లోనున్న విష్ణునే చూచెనుగాని మరి యొండెట్లునుం జూడడయ్యె. ఇట్లు మాయలెల్ల మటుమాయమైనంత సురలు మరి అతడు తమ్మింకను పరిభవించునని శంకించి, అతని తపస్సు వేడిమికి తపించి అట నిలువక అందరు కలసి జగత్కారణుని ఆదిమధ్యాంతములులేని వానిని శరణ్యుని హరిని శరణందిరి. మరియు ఆ స్వామిని ఇట్లు స్తుతించిరి.

దేవతలు విష్ణుని స్తుతించుట

దేవదేవా! జగత్ప్రభూ! పరేశ! పురుషోత్తమ! ధ్రువుని తపమ్ముచేత ఉడికిన వారమై నిన్ను శరణంద వచ్చితిమి. దినదిన ప్రవర్ధమానుడగు చంద్రుడట్లీ ధ్రువుడు రేయింబవళ్లు నీ ప్రసాదమున పెంపొందుచున్నాడు. జనార్దన! ఔత్తానపాది తపముచే మేము ఇట్లు జడిసిపోయి, నిన్ను శరణుజొచ్చితిమి. వానిని తపమునుండి మరల్పుము. అతడింద్రత్వ మునే కోరునో సూర్యత్వమునే కోరుచున్నాడో ఎరుంగము. కుబేరుని వరుణుని సోముని ఏ పదవులందు అతనికి అభిలాషయో! కావున మమ్ము అనుగ్రహింపుము. మా హృదయ మందు గ్రుచ్చికొన్న శల్యము (బాధ)ను తీసివేయుము” అని విన్నవించుకొనగా, భగవంతుడు వీడు ఇంద్రత్వమును కాదు సూర్యత్వమునూ కాదు. వరుణ కుబేరాదులగుటను కాదు ఇతడేమి కోరిన అదియెల్లను ఒనరించెదను” ఓ వేల్పులార! మీ ఇచ్చవచ్చినట్లు మీ తావు నకు దిగులు విడిచి చనుడు. నేనీ బాలుని తపస్సునందంటిన మనసు మరలింతును” అని హరిచే తెలుపబడి త్రిదశులు స్వామికి ప్రణతులై ఇంద్రాదులు తమ సదనముల కరి గిరి. సర్వాత్మకుడు భగవంతుడు ధ్రువుడు తన్మయుడు అగుటకు సంతుష్టుడై నలు చేతులంగొనిచని ధ్రువునితో ఇట్లనియె.

“ఔత్తానపాదీ! నీకు భద్రమగుగాక. నీతపమ్మునకు సంతోషించితిని. వరదుడనై ఏతెంచితిని. ఓ సువ్రత! వరము వరింపుము. నీచిత్తము బాహ్యవిషయ నిరపేక్షయై నా యందు సమాహితమైనది కావున నీవలన నేను సంతుష్టుడనైతిని. కావున పరమోత్తమ వరమర్ధింపుము” అన దేవదేవుని పలుకులు విని ధ్యాన దృష్టియైన బాలకుడు కనులు తెరచి తన ఎదుట; శంఖము చక్రము గద శార్జము వరముద్ర కత్తియు చేపట్టి కిరీటము దాల్చి యున్న అచ్యుతునికాంచి తలతో ఇలను అంటి ప్రణతుడయ్యెను. తనువు గగుర్బొడువ తటాలున మిగుల జడుపుగొని దేవదేవుని స్తుతింపవలెనను తలుపుగొని ధ్రువుడు ఏమందును? ఎవరు చెప్పిన స్తోత్రముచే నీయనను స్తుతించుట అనియట్టెట్టయిన మదితో, ఆ దేవునే శరబొందెను. ధ్రువుడిట్లనియె. “భగవాన్! నా తపస్సుచే నీవు పరమానంద మందెద వేని నిన్నేను బొగడగోరెదను. అందు నాకు ప్రజ్ఞను దయసేయుము. వేదతత్త్వ మెరిగిన వేధమున్నుగా దేవతలు ఏ దేవుని జాడ నెరుంగరో అట్టి నిన్ను చంటికుర్రను నేనెట్లు పొగడ గలను? ఈ నా మనస్సు నీ భక్తియందు ఆదరముకొన్నది. నిన్ను స్తుతింపగోరుచున్నది. అందు నాకు ప్రజ్ఞను దయచేయుము. అనగావిని గోవిందుడు కేలుమోడ్చి ఎదుట నిలబడిన ఆ యుత్తానపాద తనయుని జగత్పతి శంఖము కొనతో (వేదాంత భాగములో తాకెను. అంతట ముఖము ప్రసన్నమై (తెలివిగొని) ఆక్షణము నృపనందనుడు ప్రణతుడై భూతధాత అచ్యుతుని స్తుతించెను.

ధ్రువుడు పురుషసూక్త మంత్రభావ గర్భితముగా చేసిన విష్ణుస్తుతి:

భూమిరాపో అనలో వాయుఃఖం మనోబుద్ధిరేవచ

భూతాదిరాది ప్రకృతిర్యస్య రూపంనతో అస్మితమ్

శుద్ధస్సూక్ష్మోఖిలవ్యాపీ ప్రధానాత్పరతః పుమాన్

యస్యరూపం నమస్తస్మై పురుషాయగుణాత్మనే

భూతాదీనాం సమస్తానాంగన్ధాదీనాంచశాశ్వతః

బుద్ధ్యాదీనాం ప్రధానస్య పురుషస్యచయః పరః

తం బ్రహ్మభూతమాత్మాన మశేషజగతః పతిమ్

ప్రపద్యేశరణం శుద్ధంత్వద్రూపం పరమేశ్వర

బృహత్త్వాదృృంహణత్వాచ్చ యద్రూపం బ్రహ్మసంజ్ఞితమ్

తస్మై నమస్తే సర్వాత్మన్ మోగిచిన్త్యావికారవత్

భూమి నీరు అగ్ని వాయువు ఖము (ఆకాశము) మనస్సు బుద్ధి భూతాది ఆది ప్రకృతి ఎవని రూపమో ఆ దేవునిగూర్చి వినతుడను అయ్యెదను. శుద్ధుడు సూక్ష్ముడు సర్వవ్యాపి ప్రధానముకంటె పైపురుషుడు ఎవ్వని రూపమో ఆ పురుషునకు గుణమయునకు నమస్కారము. ఆకాశాది భూతములకు, శబ్దాది గుణములకు, బుద్ధి మొదలయినవానికి, ప్రధానమునకు, పురుషునకు నెవ్వడు మీదివాడో (పరుడో) అట్టి బ్రహ్మమైన పరమాత్మను, జగత్పతిని, శుద్ధుని, నీరూపున ఉన్న వానిని పరమేశ్వర! శరణందెదను. ఏ రూపము బృహత్వాత్ (అన్నిటి కంటె పెద్దది అగుటవలన) బృంహణత్వాత్ (అంతట నిండి ఉన్నది అగుట వలన) ‘బ్రహ్మము’ అను సంజ్ఞను పొందినదో అట్టి నీకు ఓ సర్వాత్మక! యోగి చింత్య! అవికారి! నమస్కారము.

పురుష సూక్త స్తుతి

సహస్రశీర్షా పురుషస్సహస్రాక్షస్సహస్రపాత్

సర్వవ్యాపీ భువస్స్పర్మా దత్యతిష్ఠదశాఙ్గలమ్

యద్భూతం యచ్చవైభవ్యం పురుషోత్తమ ! తద్భవాన్

త్వత్తోవిరాట్స్వరా ట్సమ్రాట్ త్వత్తశ్చాప్యధిపూరుషః

అత్యరిచ్చత సోధశ్చతిర్యక్చోర్ద్వంచ వైభువః

త్తత్తో విశ్వమిదం జాతం త్తత్తో భూతం భవిష్యతి

త్వద్రూపధారిణిశ్చా న్తస్సర్వభూతమిదం జగత్

త్వత్తోయజ్ఞస్సర్వహుతః పృషదాజ్యం పశుర్ద్విధా

త్వత్తోఋచోథసామాని త్వత్తశ్ఛన్దాంసిజజ్ఞిరే

త్వోత్తోయజూంష్యజాయన్త త్వత్తోశ్వాశ్చైకతో దతః

గావస్త్వత్తస్సముద్భూతా స్త్వత్తోజా అవయోమృగాః 

త్వన్ముఖాద్ర్బాహ్మణా బాహ్వోస్తవక్షత్రమజాయత

వైశ్యాస్తథోరుజా శ్శూద్రాస్తవపద్భ్యాం సముద్గతాః

అక్ష్ణోన్సూర్యోఽ నిలః ప్రాణాచ్చన్ద్రమామనసన్తవ

ప్రాణోఽ న్తస్సుషిరాజ్జాతో ముఖాదగ్ని రజాయత

నాభితోగగనంద్యౌశ్చ శిరసస్సమవర్తత

దిశఃశ్రోత్రాతితిః పద్భ్మాంత్వత్తస్సర్వ మభూ దిదమ్

స్యగ్రోధస్సు మహానల్పే యథాబీజే వ్యవస్థితః

సంయమే విశ్వమఖిలం బీజభూతేతథాత్వయి

బీజాదఙ్కురసంభూతో న్యగ్రోధస్సు సముచ్ఛ్రితః

విస్తారంచ యథాయాతి త్వయాసృష్టం తథాజగత్

యథాహికదళీనాన్యా త్వక్పత్రాదథ దృశ్యతే

ఏవం విశ్వస్యనాన్యనా న్యస్త్వం త్వత్థ్సాయీశ్వర దృశ్యతే

హ్లాదినీ సంధినీ సంవిత్త్వయ్యేకా సర్వసంస్థితౌ

హ్లాదతాపకరీ మిశ్రా త్వయి నోగుణవర్జితే

పృథగ్భూతై కభూతాయభూతభూతాయతే నమః

ప్రభూతభూతరూపాయ తుభ్యంభూతాత్మనే నమః

వ్యక్తంప్రధాన పురుషౌ విరాట్సమ్రాట్స్వరా ట్తథా

విభావ్యతే అన్తఃకరణే పురుషేష్వక్షయే భవాన్

సర్వస్మిన్ సర్వభూతస్త్వం సర్వస్సర్వస్వరూపధృత్

సర్వంత్వత్తస్తతశ్చత్వం నమస్సర్వాత్మనే అస్తుతే

సర్వాత్మకోసిసర్వేశ సర్వ భూతస్థితోయతః

కథయామి తతః కింతేర్వం వేత్సిహృదిస్థితమ్

సర్వాత్మద్సర్వ భూతేశసర్వసత్త్వసముద్భవ

సర్వభూతోభవాన్ వేత్తిసర్వ సత్త్వ మనోరథమ్

యోమే మనోరథోనాథ సఫల స్సత్వయాకృతః

తపశ్చ తప్తం సఫలం యద్దృష్టో అసిజగత్పతే

సహస్ర శీర్షుడు (అనంత శిరస్సులు కలవాడు) సహస్రాక్షుడు (వేయికన్నులు కలవాడు) సహస్రపాత్ = వేయి పాదములుగలవాడై సర్వవ్యాపియై భూమిని తాకి నింగిని అంటి ఆ మీదగూడ పది అంగుళములు దాటి ఉన్నది, పుట్టనిది, పుట్టబోవునది అది ఎల్ల నీవే అగు పురుషోత్తమ! విరాట్టు స్వరాట్టు సమ్రాట్టు నీనుండియే పురుషాతీత తత్త్వమును ఏర్పడినవి. ఆ అధిపూరుషుడు (పరమాత్మ) భూమికి క్రిందను అడ్డముగను మీదును వ్యాపించుటచే నీ నుండి ఈ విశ్వము పుట్టినది. పుట్టగలదు. ఈ సర్వ భూతాత్మక జగత్తు నీ రూపమును ధరించినదే. సర్వహుతమైన యజ్ఞము పృషదాజ్య (దధి మిశ్ర ఘృతము) హవిస్సు రెండురకముల గ్రామారణ్యక పశుద్వయము ఏర్పడినది. నీ నుండి ఋక్కులు సామములు ఛందస్సులు జనించినవి. నీనుండి యజుస్సులు, గోవులు, మేకలు, గొర్రెలు, మృగములు, అశ్వములు జన్మించినవి. నీ ముఖమునుండి బ్రాహ్మణులు బాహువులనుండి క్షత్రము పుట్టినది. అట్లే ఊరువుల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు పుట్టిరి. నీ కన్నులనుండి సూర్యుడు ప్రాణము నుండి అనిలుడు (అగ్ని) నీమనస్సు నుండి చంద్రుడు పుట్టెను. అంతస్సుషీరము (ముక్కు రంధ్రము) నుండి ప్రాణము, ముఖము నుండి అగ్ని పుట్టెను. నాభినుండి గగణము, శిరస్సునుండి ద్యులోకము ప్రవర్తించెను. శ్రోత్రము నుండి దిక్కులు పాదముల నుండి క్షితి ధరణి నీనుండి ఈ సర్వమును అయ్యెను. పెద్దమర్రి చిన్నవిత్తులో ఎట్లున్నదో ప్రళయమున బీజమై ఇమిడిక గొన్న నీయందీ అఖిలవిశ్వము ఉన్నది. విత్తమున నుండి మొలకపుట్టి విస్తారమును అందినట్లు ఈజగత్తు నీచే స్పష్టమై విస్తరిల్లినది. అరటిచెట్టు ఎట్లు త్వక్కు (డిప్పల) కంటే ఆకుల కంటే వేరుగా కనిపించదో అట్లు విశ్వము కంటె నీవు వేరుగా కనిపింపవు. జగత్తు నీయందు ఉన్నది. హ్లాదిని శక్తి ఆహ్లాదమును ఇచ్చును. సంధినీ శక్తి తాపము ఒసంగును. ఈ రెండు శక్తులు కేవలము చిచ్ఛక్తిగా సర్వాధారమైన నీయందు ఉన్నవి. చిచ్ఛక్తి హ్లాదతాపములు రెండింటి మిశ్రానుభవ మిచ్చును. గుణశూనుడవైన నీయందు నిజానికి లేనే లేవు. వేరై, ఒకటై, భూతస్వరూపుడై, ప్రభూతభూతస్వరూపుడై భూతాత్మకుడవైన నీకు నమస్కారము.

వ్యక్తము ప్రధానము (ప్రకృతి) పురుషుడు విరాట్టు సామ్రాట్టు స్వరాట్టు అను పేర పురుషులందు అంతఃకరణ మందు నీవు భావింపబడుదువు. అన్నిట అన్నిరూపులు గలవై సర్వమై సర్వస్వరూపులను తాల్చినవాడపై ఉన్నావు. నీ నుండి సర్వము, ఆ సర్వమునుండి నీవు ఏర్పడినావు. అట్టి సర్వాత్మకునకు నీకు నమస్కారము. ఓ సర్వేశ్వర! నీవు సర్వాత్మకుడవు. సర్వభూతముల యందు ఉన్నందున నీకేమి చెప్పుడును! హృదయ మందున్న దెల్ల నీవెరుగుదువు. ఓసర్వాత్మక! ఓసర్వభూతేశ! సర్వసత్వోత్పత్తి కారణ! సర్వము నీవై సర్వసత్వముల (జీవుల) మనోరధమేమో ఎరుంగుదువు. నాథ! నా కోరిక ఏదో అది నీచేత సఫలము చేయబడినది. నీవు దర్శనమిచ్చుట వలన నేను చేసిన తపస్సు ఫలించినది” అని వినతిచేయగా భగవంతుడు ఇట్లనియె.

“నీకు నేను కనబడినాడను కావున ధ్రువా! నీ తపస్సునకు ఫలము సిద్ధించినది. నా దర్శనము ఎన్నడు విఫలముకాదు. నీకభిమతమైన వరమడుగుము. నేను చూపులం బెడితినేని, పురుషుల కంతయు సుసంపన్నమగును” అనగా ధ్రువుడు ఇట్లనియె. “భగ వంతుడ! సర్వ భూతేశ! నీవు అందరి హృదయమందున్నావు. నా మదిలో ఏకోరిక గలదో అది నీవు ఎరిగినదే! స్వామీ! అయినను దేవేశ్వర! అవినయశీలమైన హృదయముతో నేను చెప్పెదను. నేను అతి దుర్లభమైన కోరికను అడుగుచున్నాను. సర్వజగత్ విధాతువు నీవు ప్రసన్నుడవు కాగా దుర్లభమనునది ఏమి ఉండును? ముల్లోకములును ఇంద్రుడును కూడ నీ ప్రసాదముయొక్క ఫలమునే అనుభవించును. నా కడుపున పుట్టనివానికీ రాజా సనము అర్హముకాదని, గర్వమున నా సవతితల్లి పలికినది. అచ్యుతా! సర్వులకు జగత్తునకు ఆధారమైన నాశనములేని ఉత్తమోత్తమ స్థానమును నీ అనుగ్రహముచే నాకిమ్మని ప్రార్థించుచున్నాను” అనెను.

అనవిని భగవంతుడు ఇట్లనియె. “నీవేది ప్రార్థించితివో ఆస్థానమును నీవు అందెదవు. బాలక! ఇపుడేకాదు, మరి ఇతర జన్మమునందు నీవు నన్ను సంతోషపరచి ఉన్నావు. మున్ను నీవు బ్రాహ్మణుడవై నాయందే ఏకాగ్రమనస్కుడవై ఎప్పుడును తల్లిదండ్రుల శుశ్రూషచేసి స్వధర్మమును పాలించితివి. అట్లుండ యౌవనమందు నీకొక రాజకుమారుడు మిత్రుడయ్యెను. అతడఖిల భోగి సుందరుడు యువకుడును. వాని సంగము వలన నీవు దుర్లభమైన ఆతని ఆ సమృద్ధిని చూచి నేనుగూడ రాజపుత్రుడను కావలయునను వాంఛ గొంటివి. అంతట నీకభిలషించిన రాజపుత్రత్వము ప్రాప్తించినది. రాజగు ఉత్తానపాదుని ఇంట పుట్టితివి. స్వాయంభువు వంశమందు పుట్టుట దుర్లభమైన విషయము. అట్టిదాన నీకు జన్మముగల్గినది. ఆమీద నన్ను సంతోషపెట్టుట అను నీ అదృష్టముగూడ నీకు పట్టినది. నన్ను ఆరాధించిన నరుడు అవిలంబముగ ముక్తిపడయును. మనసు నాయందు అర్పించిన బాలక! స్వర్గాది పుణ్యస్థానము లెక్కేమి! ముల్లోకములకు అతీతమైన స్థానమున నా ప్రసాదముచే సర్వతారాగ్రహములకు ఆధారము అయ్యెదవు. సందేహము లేదు.

సూర్యుని కంటె చంద్రుని కంటే కుజుని కంటే బృహస్పతి కంటే శుక్రుని కంటె సూర్యతనయుడు శని కంటె, అన్ని నక్షత్రముల కంటె, సప్తర్షుల కంటె ఎల్ల వైమానికులు, సురల కంటె, మీదిస్థానము నీకు నేను ఒసంగితిని. కొందరు దేవతలు నాల్గు యుగములు (ఒక్క మహాయుగము) కొందరు మన్వంతరము (71 మహాయుగములు) ఉందురు. కాని ధ్రువ! నేను నీకు కల్పాంతస్థాయి నిచ్చినాడను. అంతకాలము నీతల్లి సునీతియు నీదగ్గరగ మిక్కిలి నిర్మల కాంతితో తారకయై (చక్కని చుక్కయై ; నక్షత్రమై) విమానము నందు ఉండును. అంతియకాదు ఏ మానవులు ప్రాతస్సాయం కాలములందు సమాహిత మనస్కులై నిన్ను కీర్తింతురో వారికిని మహాపుణ్యము కలుగగలదు.

పూర్వము ఇట్లు దేవదేవుడగు జగన్నాథుని వలన వరమునంది ధ్రువుడు ద్రుతవ స్థాన మును అధిష్టించి ఉన్నాడు. తల్లిదండ్రులకు స్వయముగ ధర్మవిహితమయిన శుశ్రూష చేసి నందు వలన ద్వాదశాక్షర మంత్రజప మహిమవలన తపః ప్రభావమువలన అతనికీ దివ్య పదము లభించినది. అతని ఆత్మాభిమానము (రాచబిడ్డకుండవలసినది), సమృద్ధి, మహి మను చూచి దేవతలకు రాక్షసులకును కూడ ఆచార్యుడైన శుక్రాచార్యుడు ఇట్లు కీర్తించెను.

“ఆహా! ఏమి వీని తపశ్శక్తి! వీని తపఃఫలము! వీనిని ముందిడుకొని సప్తర్షులు జ్యోతిర్మండలమందు ఉన్నారు. ఈ ధ్రువుని జనని సునీతిపేరిది సూనృతవచన! ఈమె ప్రభావము ఈ భువిలో ఎవరు వర్ణింపశక్తుడు? వీని స్థానము స్థిరాయతి (ఏనాటికీ చెక్కు చెద రని స్థాయిగలది) అయినది, త్రిలోకాశ్రయమైనది ప్రాప్తించినది. కుక్షి వివరమున ఈ ధ్రువుని భరించిన ఆమెకు ఈస్థానము లభించినది. ధ్రువుడు ద్యులోకాగ్రమునకు ఎక్కిన ఈ కథను ఎవ్వడు సంకీర్తించునో అతడు సర్వపాపములను ప్రక్షాళనముచేసుకొని స్వర్గమందుకాని, భూమిని గాని, స్థానభ్రంశమును పొందడు. సర్వకల్యాణ సంపన్నుడై ఆతడు దీర్ఘాయుష్మంతుడగును”.

పృథూపాఖ్యానము

శ్రీ పరాశరుడినియె: యోగ్యుడగు ధ్రువునివలన శంభువు అను నామె శిష్టి, భవ్యుడు అను పుత్రులను కనెను. శిష్టివలన సుచ్ఛాయ, రిపుడు, రిపుంజయుడు, విప్రుడు, వృకలుడు, వృకతేజుడు అను ఐదుగురు కొడుకులను కనెను. రిపునివలన చాక్షుషి అను నామె సర్వతేజ స్సంపన్నుడైన చాక్షుషుని కనెను. చాక్షుషుడు వీరణ ప్రజాపతి కూతురగు పుష్కరిణి యందు మనువును కనెను. వైరాజ ప్రజాపతి కుమార్తెయగు అడ్వల యందు మనువునకు పదిమంది తనయులు కల్గిరి. వారు కురువు, పురువు, శతద్యుమ్నుడు, తపస్వి, సత్య వంతుడు, శుచి, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు అనువారు తొమ్మిదిమంది. పదియవయతడు అభిమన్యుడు. అందరు మహాబలసంపన్నులు. ఆగ్నేయి, కురువువలన మంచి ప్రతిభావంతులను ఆర్వురు కొడుకులను కనెను. అంగుడు, సుమనసుడు, స్వాతి, క్రతువు, అంగిరసుడు, శిబి అనువారు ఆరుగురు. అంగునివలన సునీధ వేనుని కనెను. ఋషులు సంతతి కొఱకు అతని కుడి హస్తమును మధించిరి. అందు మహాతేజస్వి పృథువు ఉదయించెను. ఆతనిచేత ప్రజాహితమునకై భూదేవి గోవుగానై పిదుకబడినది. మైత్రేయుడు ఆ కథను అనతిమ్మన శ్రీ పరాశరుడు ఇట్లనియె.

పృథు చక్రవర్తి గోరూపిణియగు భూమిని పిదుకుట:

“మృత్యువు పెద్దకూతురు, సునీధ అంగునికి ఈయబడినది. ఆమెకు వేనుడు పుట్టెను. అతడు మాతామహుని దోషముచే (తాత పోలికగొని) స్వభావము చేతనే దుష్టుడై పుట్టెను. పరమర్షులు వానిని రాజ్యమందు పట్టాభిషేకించిరి. అతడు వెంటనే పృథివి ఎల్లను “యజ్ఞములు చేయరాదు. ఎవ్వరికి ఎవ్వరు దానములు ఈయరాదు. అగ్నిహోత్రములు చేయరాదు. యజ్ఞభోక్త మరియొక్కడెవ్వడు లేడు. నేనే యజ్ఞపతిని, ప్రభువును” అని చాటింపించెను. అంతట పరమర్షులు వచ్చి మహీపతిగదా అని మొదట పూజించి, సామమధురముగ ఇట్లు పలికిరి.

“రాజా! రాజ్యము దేవోపభోగమునకు ప్రజాహితమునకు ఉద్దేశింపబడినది. యజ్ఞమునందు యజ్ఞేశ్వరుడు మాచే ప్రీణీతుడై నీకు ఎల్ల కోరికలను ఈయగలడు. ఏ రాష్ట్రమందు, యజ్ఞమందు, యజ్ఞపతి పూజింపబడునో ఆ రాజులకు అభీప్సితార్థములను ఆయన ఇచ్చును” అని చెప్పగా వేనుడు ఇట్లు అనెను.

నాకంటె గొప్పవాడు, నాకంటే ఆరాధింపవలసినవాడు మరి ఎవ్వడున్నాడు? మీకు యజ్ఞేశ్వరుడు ఈ హరి ఎవ్వడు? బ్రహ్మ, జనార్ధనుడు, శంభువు, ఇంద్రుడు, వాయువు, యముడు, రవి, అగ్ని, వరుణుడు, ధాత, పూషభూమి, చంద్రుడు మరి శాపానుగ్రహ కారులైన ఇతర దేవతలు అందరు రాజశరీరమందున్నవారు. నృపతి సర్వదేవమయుడు. ఇది తెలిసి నే నొసంగిన ఆజ్ఞను అందరు పాటింపవలయును. దానము చేయరాదు. హోమములు చేయరాదు. యజ్ఞములు చేయగూడదు. స్త్రీలకు భర్తయొక్క సేవ పరమ ధర్మము అయినట్లు ఓ విప్రులార! మీకు నా ఆజ్ఞా పాలనము ధర్మము” అని పలుకగా “ఓ మహానుభావ! అనుజ్ఞ ఇమ్ము. ధర్మము సంక్షయ మందరాదు. ఈ సకలజగత్తు దేవతలకిచ్చు హవిర్భాగములయొక్క పరిణామమేకాని వేరుకాదు” అని పరమర్షులు విన్నవించినను, వినక మరిమరి తెలియచెప్పినను అనుజ్ఞ ఇవ్వకున్నంతట అమ్మహర్షులు అందరు కుపితులై, వీనిని జంపుదము చంపుదమని ఒకరు ఒకరితో అనుకొనిరి. యజ్ఞ పురుషుని విష్ణుని ఆదిమధ్యాంతములు లేనివానిని ఎవ్వడు దూషించునో ఆ దురాచారుడు భూపతిగ ఉండదగడని మంత్ర పవిత్రములయిన కుశలచే భగవంతుని నిందచే ఈవరకే చచ్చినవానిని చంపిరి. అటు పిమ్మట అమ్మునులు అంతట రేగిన రేణువును (ధూళిని) చూచిరి. దరినున్నవారిని ఇది ఏమి అని అడిగిరి. రాష్ట్రములో జనులు దొంగలై ఇతరుల ధనముల హరించుచున్నారని లోకులు తెల్పిరి.

మిక్కిలి వేగమున విజృంభించిన ఆ దొంగలవలన రేగిన ధూళి యిది అనగా విని మునులు ఆలోచించి అపుత్రకుడైన ఆ వేనుని తొడను మధించిరి. వాని ఊరువు నుండి కాలిన ఇనుప ప్రతిమను పోలిన ఒక్క మరుగుజ్జు పుట్టెను. అతడు పుట్టిన వెంటనే “నేనేమి చేయవలె” నని తొందరపాటున ఆ మునులను అడిగెను. వారు నిషేద (కూర్చుం డుము) అనిరి. అందువలన వాడు నిషాదుడు అను పేరు పొందెను (నిషాదుడు = బోయ జాతివాడు). వాని సంతానము వింధ్యశైల వాసులయిరి. వారందరు పాప కర్మపరులు. ఆ వేనుని పాపము వానిద్వారా తొలగిపోయినది. అటు పిమ్మట అతని కుడిచేతిని మధించిరి. అందుండి పృథువు అగ్నివలె దేదీప్యమానమూర్తియై ఉదయించెను. ఆ వెంటనే అజగవమను విల్లు, దివ్యబాణము, కవచము నింగినుండి పడినవి. అతడు జనించిన తరువాత సర్వభూతములు ఆనంద భరితములు అయినవి. అట్టి ఉత్తమ పుత్ర లాభముచే వేనుడు స్వర్గమునకు ఏగెను. పున్నామనరకము నుండి త్రాయతి = కాపాడువాడు పుత్రుడు అన్న పేరు పృథునికి సార్థకమయ్యెను. రత్నములను తమతో తీసుకొని వచ్చి తమ ఉదక ములచే సముద్రములు నదులు అతనిని అభిషేకించుటకు వచ్చినవి. బ్రహ్మయు వేల్పులతో అంగీరసులతో వచ్చెను. స్థావర జంగమము జీవకోట్లన్నియు వచ్చి వేనుని అభిషేకించినవి.

ఆయన కుడిచేతిలో చక్రరేఖ చూచి బ్రహ్మ ఈతడు విష్ణ్వంశ సంభూతుడని సంతో షించెను. ఏ చక్రవర్తి హస్తమందు విష్ణు చక్రరేఖ ఉండునో, అతడు అవ్యాహత పరాక్రముడై దేవతలకుగూడ అజేయుడగును. మంత్రకోవిదులైన విప్రులు పృథుని గొప్ప రాజరాజ్యాధి కారమందు యథావిధిగా అభిషేకించిరి. తండ్రిచే ఇడుమలు పడిన ప్రజలు అతని అనురాగముతో అనురంజితులైరి. దాని వలన అతడికి ‘రాజు’ అను శబ్దము సార్థకముగ ఏర్పడినది. (రంజనాత్ రాజా = సంతోషమును కలుగజేయువాడు సముద్రగాములు అయిన నీరు అతనిచే స్తంభింప చేయబడినది. పర్వతములు దారి ఇచ్చినవి. అతని ధ్వజమునకు పతాకమునకు ఎచ్చటను భంగము లేకుండెను. ఇరుకైన అడవులలో కూడ అతని జెండా దించవలసిన పనిలేనిది అయ్యెను. దున్నకయే భూమి పండెను. సంకల్ప మాత్రమున అన్నములు సిద్ధములయ్యెను. గోవులు సర్వకామములను చేసినవి. పట్టు పట్టునను తేనెలు కురిసినవి. అతడు పుట్టగానే బ్రహ్మదేవతాక యజ్ఞమందు సూత్యాహస్సునందు సూతి యందు మహా బుద్ధిశాలి సూతుడు పుట్టెను. అందే ప్రాజ్ఞుడు మాగధుడును జనించిరి. మునులా ఇద్దరను సూతమాగధులని పేర్కొనిరి. “మీరు పృథు చక్రవర్తిని (అతని కీర్తిని) గానముసేయుడు. ఇది మీకు విధి విహితమైన పని కాగలదనిరి”. వారు చేతులు జోడించి మునులతో ఇపుడే ఆవిర్భవించిన ఈ చక్రవర్తి చేసిన పనులు చరిత్రయు మాకు తెలియవుకదా ! ఇతని గుణములు మాకు తెలియవు. ఇతని కీరి ప్రసిద్ధముకాదు. దేనిని గురించి స్తోత్రము చేయవలెనో ఆనతిండనగా ఋషులు ఇట్లనిరి.

ఈ చక్రవర్తి మహాబలుడై ఈ పై ఏమి పనులు చేయగలడో చేయబోవునో ఆ పనులనే కీర్తింపుడనిరి. వారు చేసిన స్తుతులను విని ఆరాజు పరమానందము నందెను. సుగుణసంపదచే మానవుడు శ్లాఘ్యుడగును. కావున ఆ లక్షణములు శ్లాఘ్యములు కావలయును. అందుచే ఈ వందిమాగధులు చేసిన గుణవర్ణనమును అనుసరించి అ పనులనే నేను స్థిరచిత్తముతో చేసెదను. వీరు చేయగూడదని వర్ణించిన పనులను మానెదను అని నిశ్చయించుకొనెను. ఆ బుద్ధిమంతుడు జరుపబోవు ఉత్తమ కార్యములను సుస్వర లయానురంజనముగ వారు గానముచేసిరి. సత్యవచనుడు దానశీలుడు సత్యసంధుడు హ్రీమంతుడు (హ్రీ అనగా మనము చేయు పనిని పెద్దలు, మహానుభావులు మెచ్చుకొందురో లేదో ఎక్కడ పొరపాటు జరిగిపోవునో అను బెదురు. (ఒంచాడింపు అని తెలుగు సమా నార్థకము). మిత్రభావుడు, క్షమావంతుడు, పరాక్రమవంతుడు, దుష్టశాసకుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, దయాళువు, ప్రియభాషి, మాన్యులను గౌరవించువాడు యజ్వ (= యజ్ఞములను చేయువాడు) బ్రహ్మణ్యుడు (=బ్రహ్మజ్ఞాని), సాధువులయెడ వాత్సల్యము కలవాడు శత్రువు నెడ, మిత్రునెడ వ్యవహారములందు సముడు అను సూతమాగధులు పాడిన గుణములను వేనుడు తన హృదయమందు ఇడుకొనెను. అట్టి పనులే చేసెను. ఇట్లాతడు పృథివిని పాలించుచు, భూరి దక్షిణములైన యజ్ఞములు పెక్కులు చేసెను. అంతకుమున్ను అరాజ కమైన కాలమున (వేనుని పాలనమున) సర్వౌషధులు నష్టములై ఆహారము లేనందున ఆకలికి అల్లాడి ప్రజలా భూనాధుని దరికేగిరి. అతడు రాకకు కారణము అడిగినంత, ఓ నృపశిరోమణి! ఇంతకుమున్ను రాజ్యమందు ధరిత్రియందలి ఓషధులు అన్నియు నశించినవి. దాని ప్రభావము వలన ప్రజలు నశించుచున్నారు, విధాతచే (బ్రహ్మ) మాకు నీవు, జీవన విధాతయగు ప్రజాపాలకుడుగా చూపబడినావు. ఆకలిచే అలమటించు మాకు జీవన ఔషధులను దయచేయుము” అని ప్రార్థింపగా విని, పృథు చక్రవర్తి అజగనమను దివ్యధనువు దివ్యబాణములనుగొని, కినుకగొని, వసుంధరపైకి పరుగిడెను. ఆ దేవి జడిసిపోయి, గోవై, సత్వరమ బ్రహ్మాదుల లోకములకు పారిపోయెను. ఎచ్చటెచ్చటకు ఆ దేవి వెళ్ళెనో ఆచ్చటచ్చట తనముందు ఆ భూతధాత్రి ఆయుధమెత్తి ఉన్న ఆవైన్యుని దర్శించెను. అందువలన ఆ సుధ పృథు పరాక్రముడైన పృథుచక్రవర్తిని చూచి గడగడ వడకుచు రక్షణకై తహతహలాడుచు ఇట్లనెను.

అక్కట! నరేంద్ర ! నన్ను తుదముట్టింపవలయునని యత్నించుచున్నావు. నరేంద్ర! స్త్రీ వధ యందు పాపమును గమనింపవు అని అనగా పృథువు ఓదుష్టకారిణీ! ఒక్కని కడతేర్చిన పెక్కు మందికి క్షేమము కల్గునపుడు ఆ మ్రుక్కడీడిని తుద ముట్టించుట పుణ్యము” అని పలుకగా పృథ్వీ ప్రజోపకారమునకు నీవు నన్ను హతమొనర్తువేని నీ ప్రజలకు ఆధారము ఏమి ఉండగలదు? అని ప్రశ్నించెను.

నా ఆజ్ఞకు పెడమొగమైన నిన్ను చంపి నాయోగ బలముచే ఈ ప్రజలను నేను భరింతును అని అనగా వసుంధర ఆ తేనికి ప్రణతయై, శరీరము వణుకుచుండగా, పరమభయమంది “సర్వప్రారంభములు (పనులు) ఉపాయము వలన నెరవేరును. అందువలన నీకొక ఉపాయమును ఎఱిగించెద. ఇష్టమేని అట్లు చేయుము. నాచే జీర్ణములైన మహౌషధుల అన్నిటిని క్షీరరూప పరిణామము నొందించి నేను ఇచ్చెదను. కావున ప్రజల హితమునకు ఒక ధార్మిక సార్వభౌమ! నాకొక దూడను ఇవ్వుము. దానియందు నేను వత్సలనై పాలు చేపెదను. అంతేకాదు లోగడ ఎగుడు దిగుడైన నన్ను సమస్థితిని పొందు నట్లు చేయుము. వనౌషధులకు బీజమైన పాలను నేనంతట భావింతును. భావనా మాత్రమున స్రవింపచేయుదును అని పలికెను)

అది విని పృథువు అవనిలోగల పర్వతములను ధనుష్కోటిచే పెల్లగించి, మీదికెత్తెను. ఆ కారణముచే అవి పెరిగినవి. పూర్వసృష్టియందు భూతలము మిట్టపల్లములచేత ఎగుడుదిగుడై ఉండి పురగ్రామ విభాగము లేకుండెను. అప్పుడు పంటలు లేవు. గోరక్షణ లేదు. వ్యవసాయములేదు. వర్తకములేదు. ఇదంతయు ఆ వైన్యుని దగ్గర నుండియే ప్రారంభమైనది. ఎక్కడెక్కడ భూమి చదునయ్యెనో అటనట ప్రజలు నివసింప ఈ రాజు కోరెను. అపుడు ప్రజలకు కందమూల ఫలాదులు ఆహారమయ్యెను. అదికూడ కష్టమై ఓషధులు క్షీణింపగా పృథువు స్వాయంభువ మనువును దూడగా సంకల్పించి (ఏర్పరచి)తన చేతితో ఆ పృథివీపతి, పృథివిని సర్వసస్యముల యొక్క విత్తనములను పితికెను. ఆనాడతడట్లు కల్పించిన అన్నముచేతనే నాడు ఈనాడును ప్రజలు జీవించుచున్నారు. ఆ ప్రభువు ప్రాణప్రదాత, భూమికి తండ్రియు అయ్యెను. అందుచే అఖిలధారిణియైన ఈధారుణి పృథ్వి అను పేరొందెను. (పృథువు యొక్క కూతురు - స్త్రీ సంతానము పృథివి)

అటు పిమ్మట దేవతలు, మునులు, దైత్యులు, రాక్షసులు, పర్వతములు, గంధ ర్వులు, నాగులు, పితరులు మఱియెల్లరకు ఆ యా పాత్రలంజేకొని ఆయా వర్గమున కనువైన పాలు దూడలు పితుకు వారికి మూలమైనది. ఈ ధాత్రి సర్వ జగమునకు ధాత్రి. ధారణి, పోషణియై పృథ్వి విష్ణుపాద తలమునందు జనించినది. ఆ పృథువు అట్టి ప్రభావము కలవాడు. వేనుని పుత్రుడు. వీర్య వంతుడునై అవతరించెను. జనరంజనము చేసి తొల్లిటి రాజైనాడు. వేనునికొడుకగు పృధువుయొక్క ఈ జన్మ వృత్తమును కీర్తించిన నరునికి తొల్లిచేసిన పాపమే కొంచెమైనను ఫలింపదు. ఇది చదివిన, విన్న దుస్స్వప్న దోషోపములు తొలగిపోవును. ఈ పృథుచక్రవర్తి జన్మవృత్తాంతము ప్రభావమును నిరంతర శుభకారకములు. 

ప్రచేతసుని వంశవిస్తరము

పిమ్మట శ్రీ పరాశరుడు ఇట్లనియె: “పృథువు కుమారులు అంతర్థి, వాది అను వారిద్దరు. శిఖండిని అను ఆమె అంతర్థానుని (అంతర్థి) వలన హవిర్దానుని కనెను. హవిర్దా నునికి ఆగ్నేయి (అగ్నికుమార్తె)యగు ధిషణయందు అరుగురు కుమారులు కల్గిరి. వారు ప్రాచీనబర్హి, శుక్రుడు, గయుడు, కృష్ణుడు, వృజుడు, అజినుడు అనువారు. ప్రాచీనబర్హి భగవంతుడగు ప్రజాపతి, మహారాజునై ప్రజాభివృద్ధి చేసెను. భూమిపై అతడు తూర్పు కొనలుగా కుశలను పరచెను. అనగా అనేక యజ్ఞములు చేసెనన్నమాట. అందుచే ప్రాచీనబర్హి అను ప్రఖ్యాతిని పొందెను. అతడు మహాతపస్సుచేసి, చివరకు సముద్రుని కుమార్తె అగు సవర్ణను పెండ్లాడెను. ఆమె పదిమంది పుత్రులను కనెను. వారికి ప్రచేతసులు అను పేరు ప్రసిద్ధము. అందరు ధనుర్వేదపారగులు. అందరును ఒకే ధర్మమును అను ష్ఠించిరి. సముద్ర జలములందుండి పదివేలేండ్లు తీవ్ర తపస్సు చేసిరి అని చెప్పగా విని మైత్రేయుడు వారు సముద్ర జలములందు తపస్సు చేయుట ఎందులకని అడుగగా శ్రీ పరాశరుడు ఇట్లనెను: ప్రజాపతియగు ప్రాచీనబర్హి సబహుమానముగ కొడుకులను ప్రజాభివృద్ధి సేయుడని ఆదేశించెను. నేను దేవుడగు బ్రహ్మచే సంతానాభివృద్ధిని చేయుటకు ఆజ్ఞాపింపబడి సరి అంటిని. కావున ప్రజాపతి ఆజ్ఞను మనము పాలింపవలెను.”

వారును అట్లేయని “తండ్రీ! సంతానవృద్ధికి ఏమి చేయవలయునో వివరింపమని” అడిగిరి. ఆయన విష్ణువు కావున ఆయనను ఆరాధించిన అభీష్టము సిద్దించును. ఇంకొకరి చేతకాదు. కావున గోవిందుని ఆరాధింపుడు అనెను. ధర్మార్థ కామ మోక్షములు అను పురుషార్థములు కావలయును అను ఎవరికైనను వారికి భగవంతుడు పురుషోత్తముడు, ఆరాధనీయుడు. ఆయనను అర్చించియే మొదట ప్రజాపతి ప్రజాభివృద్ధిని సాధించెను.

ప్రచేతసులు సంతానవృద్ధికి హరిని గూర్చిన స్తుతి:

నతాస్మృ సర్వవచసాం ప్రతిష్ఠా యత్రశాశ్వతీ

తమాద్యన్త మశేషస్య జగతఃపరమం ప్రభుమ్

జ్యోతిరాద్య మనౌపమ్య మణ్వనన్త మపారవత్

యోనిభూత మశేషస్య స్థావరస్యచ రస్యచ

యస్యాహః ప్రథమం రూపమరూపస్యతతోనిశా ।

సంధ్యాచపరమేశస్యత స్మైకాలాత్మనేనమః

భుజ్యతే అనుదినందేవైః పితృభిశ్చ సుధాత్మకః

జీవభూతస్సమస్తస్యత స్మైసోమాత్మనే నమః

యస్తమో హన్తితీవ్రాత్మాప్రభాభిర్భా సయన్నభః

ఘర్మశీతామ్భసాంయోని స్తస్మైసూర్యాత్మనే నమః

కాఠిన్యవాన్ యోబిభిర్తి జగదేతదశేషతః

శబ్దాది సంశ్రయోవ్యాపీ తస్మై భూమ్యాత్మనే నమః

యద్యో నిరూపం జగతాం బీజరూపంచ దేహినామ్

తత్తో యరూపమీశస్య నమామో హరిమేధనః

యోముఖం సర్వదేవానాం హవ్యభుక్కవ్యభుక్తథా

పితృణాంచ నమస్తస్మై విష్ణువేపావకాత్మనె

పఞ్చధావస్థి తోదే హేయ శ్చేష్టాంకురుతే అనిశమ్

ఆకాశయోనిర్భగవాంస్తస్మై వాయ్వాత్మనే నమః

అవకాశ మశేషాణాం భూతానాంయః ప్రయచ్ఛతి

అనన్తమూర్తిమాన్ శుద్ధస్తస్మై వ్యోమాత్మనే నమః

నమస్తేన్ర్దియవర్గస్యయ స్తథాస్థాన ముత్తమమ్

తస్మై శబ్దాది రూపాయనమః కృష్ణాయవేధసే

గృహ్ణాతి విషయాన్ని త్యమిన్ర్తియాత్మాక్షరాక్షరః

య స్తస్మై జ్ఞానమూలాయ సతాస్మృహరిమేదసే

గృహీతాని న్ర్దియైరథాన్ నాత్మనేయః ప్రయచ్ఛతి

అన్తఃకరణభూతాయతస్మై విశ్వాత్మనే నమః

ఆ మాటలను విని వారు నారాయణ ధ్యాననిష్ఠులై, సముద్రమందు నిలిచి తపస్సు చేసి హరిని స్తుతించిరి. “సర్వవాక్కులకు ఎక్కడ ప్రతిష్ఠ పర్యవసానమో, అట్టి అదిమూర్తిని జగత్ప్రభునికి మ్రొక్కెదము. మొట్టమొదటి జ్యోతిస్సు, అణువుకంటె అణువు మహత్తుకంటే మహత్తునై ఏది చరాచర జగత్తునకు కారణమైనదో; అహస్సు (పగలు) రాత్రియు సంధ్యయు లేని మొదటి రూపమేదియో, అట్టి కాలస్వరూపికి నమస్కారము. దేవతలచే, పితృదేవతలచే అనుదినము సుధారూపమున భుజింపబడునట్టి సర్వభూత జీవభూతుడైన ఆ పరమాత్మకు నమస్కారము. ఎవ్వడు తీవ్రరూపియై తన ప్రభలచే నభము (ఆకాశము)ను వెలిగించుచు తమస్సును చెండాడునో ఘర్మమునకు (గ్రీష్మము-ఉక్క) చలికి జలములకు కారణమైన సూర్యస్వరూపికి నమస్కారము. ఈ జగత్తు అంతటికిని ఎవ్వడు కాఠిన్యమొంది భరించునట్టి శబ్దాది గుణాశ్రయుడై వ్యాపించు, భూమిస్వరూపికి నమస్కారము. జగత్కారణము దేహులకు బీజము అయిన ఉదక స్వరూపమైన ఈశ్వరుని, ఆ హరిని బుద్ధియందు నిల్పి నమస్క రింతుము. ఎవ్వడు సర్వదేవతల హవ్యములను పితృదేవతల కవ్యములను ఆరగించునో అట్టి పావకమూర్తి (అగ్ని)కి నమస్కారము. దేహమందు అయిదు రూపముల నుండి చేష్టను (కరచరణాదుల పనిని) చేయునో అట్టి వాయుస్వరూపికి నమస్కారము. అశేష భూతములకు అవకాశమును ఒసగు అనంతమూర్తియగు శుద్ధమైన ఆకాశమూర్తికి నమస్కారము. సర్వేంద్రియస్థానమైన శబ్దాది రూపమైన కృష్ణునికి. వేధకు నమస్కారము. ఇంద్రియరూపియై అక్షరముక్షరమును కూడ అయి, తానే విషయములను (శబ్ద స్పర్శాదులను) గ్రహించు జ్ఞానమూలమైనవానికి, హరికి నమస్కారము. ఇంద్రియములచే విషయములను (శబ్దాదులను) గ్రహించి ఆత్మ కందించు అంతఃకరణ స్వరూపికి అ విశ్వాత్మకునకు నమస్కారము.

ఏ అనంతుని యందు అనంత విశ్వమున్నదో, దేనినుండి సర్వము బయలు వెడలినదో, ఏది లయస్థానమో, అట్టి ప్రకృతిధర్మికి నమస్కారము. శుద్ధుడై (గుణలోపము లేని వాడు అయ్యు) భ్రాంతిచేత గుణములు కలవాడట్లు కనబడుచుండునో అట్టి ఆత్మరూపునికి దేవునికి పురుషోత్తమునికి మ్రొక్కుచున్నాము. అవికారుడు, అజుడు, శుద్ధుడు, నిర్గుణుడు, నిరంజనుడును అగు ఆ దేవునికి నమస్కరించెదము. ఆ పరబ్రహ్మ విష్ణువుకు, పరాత్పరునికి మ్రొక్కెదము. పొడవు, పొట్టి, స్థూలము, అణువు, ఎఱుపు, నలుపు, నిగనిగ చాయయు, లేక అల్పముగాక, అంటక, అశరీరమై, అనాకాశమై, అస్పర్శమై, అగంధమై, అరసమై, అచక్షువై, అశ్రోత్రమై, అచలమై, అవచానమై, అనిద్రమై, అజరామరమై, అనామగోత్రమై, అసుఖమై, అతేజస్కయై, అహేతుకమై, అభయమై, భ్రాంతిరహితమై, అనిద్రమై, అరజస్కమై, అశబ్దమై, అమృతమై, అప్లవమై (మునుగునది తేలునదియుగానిది), అసంవృతమై (నిరావరణము), పూర్వాపరములు లేనిదై విష్ణుపరమపదమై, వరమై ఈశిత్వ గుణవంతమై, సర్వ భూతమై (సర్వమై), అసంశ్రయమైన ఆ విష్ణుతత్త్వమును జిహ్వకు దృష్టికి గోచరము కాని దానికి మ్రొక్కెదము”

అని ఇట్లు ప్రచేతసులు విష్ణువునందు సమాధిగొని స్తుతించుచు, పదివేల ఏండ్ల జలాబ్ధి యందు తపము ఆచరించిరి. అంతట ప్రసన్నుడై భగవంతుడు ఆ నీటిలో విప్పా రిన నల్లకలువ రేకుల నిగనిగని నలుపు తళుకు నెమ్మేనితో ఖగరాజును ఎక్కి సాక్షాత్కరింపగా ఆ హరింగని వారు భక్తి భారమున తలలువంచి ప్రణతులైరి. అవ్వల భగవంతుడు మీకు అభీప్సితవరము అడుగమని ప్రసాద సుముఖుడై అవ్వరదుడు ఉపస్థితుడైనంత (ఎదుట కేతేర) వారు అవ్వరదునికి మ్రొక్కి తండ్రి ప్రజాభివృద్ధి సేయుడని ఆదేశమునూ తపః కారణమును విన్నవించిరి. ఆ దేవుడును సత్వరము అనుగ్రహించి అంతర్ధానము నందెను. వారును నీట నుండి వెడలిరి. 

దక్షుని తల్లి మారిష పాణిగ్రహణము

శ్రీ పరాశరుడు ఇట్లనియె: ప్రచేతసులు తపస్సు చేయుచుండ రక్షించువారు లేక చెట్లు తెగపెరిగి భూమిని ఆవరించినవి. దాని కారణముగా ప్రజాక్షయము అయ్యెను. వాయువు వీచుటకు శక్యముకాదయ్యెను. చెట్లతో ఆకసమెల్ల నిండెను. పదివేల ఏండ్లు ప్రజలు కదలిమెదలలేరైరి. వారిని చూచి ప్రచేతసులు కుపితులై, ముఖముల నుండి వాయువును అగ్నిని సృష్టించిరి. వాయువు ఆ వృక్షములను మొదలంట కూల్చి ఎండించెను. అగ్ని వానిని దహించెను. అందుచే వృక్షక్షయమయ్యెను. చెట్లు కొద్దిగా మిగులుట చూచి రాజగు సోముడు ప్రజాపతుల దగ్గరగావచ్చి. ఓ రాజులారా! కోపమును నియంత్రింపుడు. నా మాట వినుడు. చెట్లతో గూడ మీకు సంధానము (సంధిని) నేను చేసెదను. ఈ చెట్లకు పుట్టిన సుందరి, సుందరీ రత్నము. భవిష్యత్తును తెలుసుకొని, నేను ఈమెను నా కిరణములచే పెంచితిని. ఈమె ‘మారిష’ అను పేరుగలది. ఓ మహానుభావులార! మీకు ఈమె భార్య అగుగాక. మీ వంశాభివృద్ధి చేయును గాక ! మీ తేజస్సు సగము, నా తేజస్సు సగము కలిసి ఈమె యందు దక్షుడను ప్రజాపతి, జ్ఞాని పుట్టగలడు. మన ఉభయుల తేజస్సుతోగూడి అతడగ్ని సమాన తేజస్వియై ప్రజలను సంవర్ధింపగలడు.

మున్ను కండువు అను ముని కలడు. వేదవిదులందు అగ్రేసరుడు. చక్కని గోమతీ తీరమందు ఆ ముని తపముగావించెను. అతనిని క్షోభింపచేయుటకుగాను ఇంద్రుడు ప్రమోచ అను అప్సరసను ప్రయోగించెను. ఆ శుచిస్మిత (అచ్చపు చిరునవ్వుగలది) అతడిని కలసెను. ఆమెతో కలిసి అతడు నూరేండ్లు మించి, మందరగిరి కందరమున విషయరతుడై ఉండెను. ఆమె అతనింగని “మహానుభావ! దివంబునకు నేను పోవ కోరెదను. ప్రసాద సుముఖుడవై ఓ బ్రాహ్మణ! నాకు అనుజ్ఞ ఇవ్వవలసిన వాడవు నీవే” అనెను. అతడు ఆమాటలను విని ఆమె యందు మనసుగొని ఓ కళ్యాణి! కొలదినాళ్ళు ఉండుమనెను. ఇట్లున్న తర్వాత నూరేండ్లు పైగా జరిగినది. అతనితో ఆ తన్వి విషయములను అనుభ వించెను. తిరిగి “అనుజ్ఞ దయసేయుము. స్వర్గమునకు వెళ్లెదను అనగా అతడు వెండియు కొన్నాళ్లు నిలువమనెను. ఆ మీద నూరేండ్లు పైగా గడువగా ఆ చంద్రానన అల్లన నవ్వుచు ఓ బ్రాహ్మణ! దివమ్మున కేగెదనని వలపుమీర పలికెను.

అదివిని ఆ ముని ఆ విశాల నయనను జేతంకొని క్షణము ఉండుము, చిరకాలము అయినది నిజమే, వెళ్ళుదువుగాని అనియె. ఆయన శాపమునకు భయపడి ఆ పడతి కొంచెము ఇంచుమించుగా రెండు వందల ఏండ్లు కలిసి ఉండెను.

దేవేంద్ర! రాజధానికి వెళ్లెదనని ఆమె పలుమార్లు అడుగనడుగ అతడు ఉండుమను చుండెను. ఆ అప్సరఃకాంత శాపమునకు భయపడి దాక్షిణ్యముచే (ముగమాటముచే) దక్షిణ గావున సరళ స్వభావము కలదిగాన నేర్పరితనము కలదిగాన) ప్రణయ భంగము అయినప్పుడు కలుగు బాధ నెఱిగినది కావున ఆ మునిని విడిచి పోదయ్యెను. రాత్రిందివము లామెతో విహరించుచుండ మన్మథావిష్టచేతస్కుడగు అతనికి వలపు ఎప్పటికప్పుడు క్రొంగొత్త కాజొచ్చెను. ఒకతఱి తొందరగాని ఆముని పర్ణశాల వెడలి పోవుచుండెను. ఆ అప్సర ఈ విధముగా పోవుట ఎక్కడికి అని అడిగెను. ప్రొద్దు గ్రుంకుచున్నది, సంధ్య వార్చు కొందును. లేదేని కర్మ లోపమగును అని ఆ ముని అప్సరసకు సమాధానమును ఇచ్చెను.

ఆ మునిమాటలను విని ఆ అప్సర మెల్లగా నవ్వి ధర్మజ్ఞ! నీకు ఇప్పుడా ప్రొద్దు గ్రుంకినది? ఓ విప్ర! అనేక ఏండ్లు నీకు ఇట్లు ప్రొద్దు గ్రుంకినది. ఈ గడచినది ఎవ్వరికీ వింతగ అన్పింపదు? చెప్పుము అనగా కండువు “కళ్యాణీ! నీవు ఈ ఉదయమే ఈ నదీతీరమునకు వచ్చితివి. నాకు కనపడితివి. నా ఆశ్రమమునకు వచ్చితివి. ఇదిగో సంధ్యాకాలమయినది. పగలు గడచినది. ఎందులకు ఈ పరియాచకము! నాకు నీ మంచి అభిప్రాయమును చెప్పుము” అని పలికెను. ఆ మాటలను వినిన ప్రమ్లోచ: “బ్రాహ్మణుడా! వేకువనే నేను వచ్చినదానను. ఇది నిజమే అబద్ధముగాదు. ఆ విధముగా కాలము నూర్లకొలది సంవత్సరములు గడచినవి అనిన ఆ విప్రుడు సంభ్రమించి, ఆ విశాలాక్షిని చూచి “ఓ అబల! (భయస్వభావ) నీతో నేను విహరించిన కాలమెంత?” అన ప్రమ్లోచి: “తొమ్మిది వందల ఏడు సంవత్సరముల ఆరుమాసముల మూడు రోజులైనది” అనెను. కణ్డువు: “ఇది నిజమా! పరిహాసమా! చెప్పుము. నీతో నేను ఇచట ఉన్నది ఒక్క దినమనుకొనుచున్నాను” అని పల్కెను.

ప్రమ్లౌచ: “అబద్ధము ఎట్లు ఆడుదును. అందును నీ దగ్గరనా? విశేషించి దారి ఏ మాత్రము తప్పని తమరు అడుగుచుండగా నేనా అసత్యము పల్కుట!” అని ఆమె జవాబివ్వగా, ఆమె పలుకువిని నిజమనుకొని “ఛీ! ఛీ! నేనెంత నింద్యు”డనని తనను తాను నిందించుకొని; నేను చేసిన తపస్సులు నష్టములయ్యెను బ్రహ్మవిదుల ధనము దెబ్బతిన్నది, నావివేకమెవ్వడో కాజేసెను. నన్ను మోహింపచేయు ఒక ఆడుది ఎవ్వని చేతనో సృష్టింపబడ్డది. ఆత్మను జయించి మనస్సును నిగ్రహించి, షడూర్ములకు అతీతమైన బ్రహ్మ వస్తువును ఎఱుగవలసిన వాడను షడూర్ములు (ఆకలి, దప్పిక, శోకము, మోహము, ముదిమి, చావు అను ఆరు) నా మతి దేనిచే అపహరింపబడెనో అట్టి కామగ్రహము ఛీఛీ అని నిందింప తగినది. వేదవేద్యమైన బ్రహ్మ వస్తువును అందించుటకు హేతువునైన నా వ్రతములన్నియు నరకము అను గ్రామమునకు దారియైన సంగముచే అపహృతములైనవి” అని ఇట్లు ధర్మజ్ఞుడు ఆ ముని తనను తాను నిందించుకొని ఎదుట కూర్చున్న ఆ అప్సరసను చూచి ఇట్లనియెను.

“ఓ పాపురాల! పో! నీ ఇష్టము వచ్చినట్లు పొమ్ము ! నీ హావభావ విలాసములచేత నాకు క్షోభ కలుగచేసి, దేవేంద్రునకు ఏమేమి పని చేయవచ్చితివో అది అంతయు చేసితివి. కోపతీవ్రమైన అగ్నిచే నిన్ను నేను భస్మము చేయను. మైత్రి అనునది సత్పురుషునకు సప్తపదము (ఏడడుగులు కలిసి వేయుట లేక ఏడుమాటలు మాట్లాడుట వలన ఏర్పడునది) నీతో కలిసి నేను ఉంటిని. అదిగాక నీ తప్పేమి? నీ యెడల కోపపడుచున్నాను. ఇది నాదే తప్పిదము. ఇంద్రియ నిగ్రహము లేనివాడను నేను. శక్రుని (దేవేంద్రుని) ప్రియముగోరి నా తపస్సు నశింపచేయబడినది. ఛీఛీ! మహా మోహపేటిక, సర్వాసహ్యమైన నీకు నింద అగు గాక!” అని ఆ విప్రర్షి ఆ రమణితో ఇట్లు పలుకునంత ఆమె ఒడలెల్ల చెమట జాలువార మిగుల వణికిపోయెను. అట్లు వణకుచు మెయిదిగ చెమట గ్రమ్మ నిలిచిన దానిని గని కినుకతో ఆ ముని “పో! పోపొమ్ము” అనెను.

ఆమె అట్లు బెదరింపబడి ఆ ఆశ్రమము వెడలి ఆకాశగమనమున పోవుచు చెట్లకెంజిగురున నొడలు తుడిచికొనుచు, చెట్టునుండి చెట్టున కడుగునిడుచుచు పోయెను.

ఆ ఋషిచే ఆమె యందు ఏర్పడిన గర్భము (శిశువు) మేను గగుర్పొడువ చెమట రూపమున ఆమె ఒడలి నుండి బయలు వెడలెను. ఆ గర్భమును వృక్షములు చేబట్టినవి. వాయువులు ఏమొనర్చెను. అచే కిరణములచే అప్యాయితమై అది వృద్ధినందెను. ఆ వృక్షాగ్ర గర్భమందుండి మారిష అను ఒక రమణి ఉదయించెను. ఆమెను వృక్షములు మీకు కన్యగ ఇచ్చును. కావున శమింపుడు అని సోముడనెను.

ఈ విధముగ కండువు సంతానమైన ఆ కన్య వృక్షములనుండి వెడలినది వాయువు నకును. ప్రమ్లోచకును నాకును ఇది కూతురు. ఆ కండు మహర్షి అట్లు తపస్సు క్షీణింప అద్రియందున్న పురుషోత్తమమను విష్ణువుని ఆలయమునకేగి ఏకాగ్రమతియై ఊర్థ్వ బాహువై, మహాయోగియై, బ్రహ్మపారమను ఈ స్తోత్రమును జపించుచు విష్ణుని ఆరాధనము కావించెను. అనవిని ప్రచేతనులు ఆ విష్ణుపారమను పరమ ఉత్తమ స్తవమును విన కుతూహలపడుచున్నాము అన సోముడిట్లు ఆనతిచ్చెను.

బ్రహ్మపార స్తవము:

పారంపరం విష్ణురపార పారఃపరః పరేభ్యః పరమార్థరూపీ

సబ్రహ్మ పారః పరపార భూతః పరః పరాణామపిపారపారః

సకారణం కారణ తస్తతో పితస్యాపి హేతుః పరహేతు హేతుః

కార్యేషు చై వం సహ కర్మ కర్తృ రూపై రశేషైరవతీహ సర్వమ్

బ్రహ్మప్రభు బ్రహ్మస ససర్వభూతో బ్రహ్మప్రజానాంపతీరచ్యుతో అసౌ

బ్రహ్మాక్షరం నిత్యమజం స విష్ణురపక్షయాద్యై రఖిలై రసంగిః

బ్రహ్మాక్షర మజం నిత్యం యదా అసౌపురుషోత్తమః

తదా రాగాదయో దోషాః ప్రయాస్తు ప్రశమం మమ

సోముడు ఇట్లు స్తుతించెను. “శ్రీ విష్ణు భగవానుడు సంసార మార్గమునకు పునరావృత్తి శూన్యమగు పరమావధి అయినవాడు, లేక గురుపరంపరచే తెలియనగు రహస్య వస్తువైనవాడును, తెలియరాని అంతము గలవాడును, ఉత్కృష్టములుగా ఎంచబడు ఆకాశాదుల కంటె కూడ ఉత్కృష్టుడును. సత్య స్వరూపుడును లేక ఆనంద స్వరూపుడును. వేదము తపస్సులతో ఒప్పు వారిచే ప్రాప్తమైనవాడును, అనాత్మ ప్రపంచమునకు అవధియైన వాడును. ఆత్మగాతోచు ఇంద్రియములకు గోచరించువాడును, స్వభక్తులను పాలించువాడును, వారికి అభీప్సిత వరములచే పూరకుడుగను లేక లోకపాలకులుగ ఉన్న ఇంద్రాదులకు కూడ పాలకుడును అభీప్సిత పూరకుడును కారణమునకు కూడ కారణమైన వాడును, సృష్టికి మూలములైన భూత పంచకమునకు కారణమైన పంచతన్మాత్రలకు కూడ కారణమైనవాడును, పరము (అహంకారము) నకు కారణమైన మహత్తత్త్వమునకు కూడ కారణమైన ప్రకృతిరూపుడు, అనగా సమస్తమునకు ప్రధాన కారణము, మహదాది దేహాంత కార్య ప్రపంచమునందు కర్మరూపుడుగను కర్తరూపుడుగను ఉండి సర్వాత్మకుడై, సర్వమును రక్షించువాడునై ఉన్నాడు. ఆ విష్ణువే వేద నిర్వాహకుడు. వేదమే అతడు. సర్వముతానై సర్వభూత పాలకుడు అగును. అతడు సర్వభూత వివర్తమగుటచే స్వరూపచ్యుతి (నాశము) లేకపోవుటచే నచ్యుతుడు, అవ్యయుడు, నిత్యుడు, వ్యాపకుడు, అజుడు అనబడును. అపక్షయము మొదలగువానితో సంబంధములేని ఆ పురుషోత్తముడు పరబ్రహ్మయే. తదనుస్మరణచే నాకు రాగద్వేషాది సమస్త దోషములు శాంతించుగాక!

పారంపరం = సంసారముయొక్క పరమావధిలేక గురు సంప్రదాయముగా తెలియబడు రహస్యము, అపారపారః = అందుకోరాని అవధి గలవాడు పరేభ్యఃపారః = ఆకాశాది భూతములు పరములు. వానికంటె మీదివాడు. పరమార్థరూపీ = సత్యస్వరూపుడు (మోక్షరూపుడు) సత్తుచిత్తు ఆనందము అనువాని రూపము పరబ్రహ్మ. బ్రహ్మ పారః = బ్రహ్మ = వేదము, లేక తపస్సు అవిగలవారిచే పొందదగిన పారముగలవాడు పరపార భూతః = పరము = ఆత్మకానిది అంతయు, దానికి పారః (అవ్వలివాడు దృశ్యాత్మక జగత్తునకు సాక్షి) పరః పరాణామపి (ఆత్మగా భావింపబడెడి ఇంద్రియాదులకు పరుడు - గోచరము కానివాడు) పారపారః (పార = భగవద్భక్తులకు - పరస్య భగవంత సంబంధి పారః) పారః = పూరకుడు) పాలకుడు.

సః = ఆ విష్ణువు, కారణతః = కారణముకంటె కారణం కారణమయినవాడు తతోఅపి  = సృష్టికారణము అయిన భూతపంచకమునకు కారణమైన పంచతన్మాత్రలకు కూడ కారణము. పరహేతు హేతుః పర = మహత్తత్త్వము (బుద్ధి) దానికి హేతుః = ప్రకృతి దానికిని హేతువు, కార్యేషుచ = కార్య ప్రవాచములందు (మహదాది దేహాంతములైన వానియందు) సః కర్మర్తరూపైః అశేషః  =  కర్మ = కర్మరూపము కర్తరూపములు అన్నిటితోను, ఇహ = విశ్వ మందు, సర్వం = అంతను, అవతి = రక్షించుచున్నాడు.

సః = ఆ పరమాత్మ బ్రహ్మ ప్రభుః = వేదములకు నిర్వాహకుడు, సఃబ్రహ్మచ = వేద రూపుడు గూడ, సర్వభూతః = సర్వము అయినవాడు, ప్రజానాంపతిః = ప్రజాపాలకుడు అచ్యుతః = చ్యుతిలేనివాడు (వివర్త రూపచ్యుతి లేనివాడన్నమాట) అవ్యయః = క్షరము అనగా నాశనము లేనివాడు, నిత్యః = నిత్యుడు అజః = అప క్షయాది షడ్భావ వికారములనగా అస్తి = ఉండును, జాయతే = పుట్టును, వర్ధతే = పెరుగును, వరణమతే = రూపాంతరమందును, అవక్షీయతే = తఱగును, నశ్యతే = నశించును అను ఆరు వికారములతో సంబంధములేని అసంగి.

ఈ బ్రహ్మపార స్తవము జపించుచు కండుముని హరిని అర్చించి పరమసిద్ధిని పొందెను. ఈ స్తవము నిత్యము పఠించు, విను నాతడు కామదోషములనుండి విడివడి, అభీష్టమును పొందును.

మారిష వృత్తాంతము:

సోముడు ఇట్లు అనియె: “ఈ మారిష అను కన్యయొక్క కార్యగౌరవమును నేను తెల్పెదను. ఇది మీకు మంచి ఫలమిచ్చును. ముందు ఈమె ఒక రాజపత్ని. పుత్ర సంతానము లేక భర్త గతింప భక్తితో విష్ణువు ఆరాధించెను. దానిచే విష్ణువు ఆమెకు ప్రత్యక్ష మయ్యెను. వరమడుగుము అనెను. ఆమె స్వామీ! బాల వైధవ్య వ్యధకు లోనైనదానను. అభాగ్యను. నా జన్మ విఫలమైనది. నీ ప్రసాదమున నాకు కొనియాడదగిన వారు ప్రతి జన్మమందు భర్తలు అగుదురు గాక! నీ అనుగ్రహమున కొడుకును గల్గుగాక! అతడు ప్రజాపతులవంటివాడు కావలయును. రూప సంపద గల్గి సర్వ జగమ్మునకు ప్రియదర్శినినై, అయోనిజనై నీ అనుగ్రహమున నేను జన్మింప వలయునని పాదముల వ్రాలి ప్రణామము చేయగా ఆమెను లేపి, వరదుడగు హరి ఇట్లనెను.

“మహావీర్యులు మహోదార కార్యనిర్వాహకులు పదిమంది మరియొక జన్మమందు నీకు భర్తలగుదురు. అతివీర్య పరాక్రమశాలి ప్రజాపతి, గుణసంపన్నుడు అయిన మహాత్ముడగు పుత్రునిగూడ నీవు కాంతువు. ఈజగమ్మున అనేకవంశములు కతడు కర్త అగును. అతని సంతతి ముల్లోకములను నింపగలదు. నీవు అయోనిజవు, సాధ్వివి, రూపౌదార్య గుణశాలివియునై నా ప్రసాదముచే మానవులకు మనఃప్రీతి గూర్చుదానవు అయ్యెదవు” అని ఆ కలికింగూర్చి పలికి హరి అంతర్థానమందెను. ఆమె ఆ మారిష నీకు భార్య అయినది.

అంతట ఆ సోముని మాటను అనుసరించి ప్రచేతసులు, కోపము ఉపసంహరించి ధర్మవిదిని ఆమెను వృక్షముల నుండిగైకొనిరి. ఆమె యందు పదిమంది ప్రచేతసులకును ప్రజాపతి, దక్షుడుఅను మహానుభావుడు జనించెను. మున్నాయనయే బ్రహ్మకు ఉదయించి ఉండెను. ఆ దక్షుడు సృష్టిని పెంచుటకై కుమారులను కనెను. వారు కొందరు శ్రేష్ఠులు కొందరు తక్కువవారు. ద్విపాదులు, చతుష్పాదులు, బ్రహ్మనిర్దేశమును పాటించి వారింగని మనస్సుచే ఏబది మందిని స్త్రీలను కనెను. అందు బదిమంది ధర్మునకు పదముగ్గురు కాశ్యపునికి కాలగమనమునకు చంద్రునకు ఇరువది ఏడుగురను ఒసంగెను. వారియందు దేవతలు, దైత్యులు, నాగులు, ఖగములు(పక్షులు) గంధర్వులు, అప్సరసలు, దానవాదులు జనించిరి. ఆ మీదనుండి ప్రజలు మైధున సంభవులైరి. ఆ ముందటివారికి సంకల్పము దర్శనము స్పర్శమాత్రమున సంతానము కల్గెడిది. ఆ కాలమున వారు మిగుల తపస్సులు, తపో విశేష సిద్ధులునై ఉండిరి. కావున అట్లు జరిగినది.

అటుపిమ్మట మైత్రేయుడు ఇట్లు అనెను: “కుడి బొటన వ్రేలి నుండి దక్షుడు పుట్టెనని మున్ను విన్నాను. ఓ మహాముని! అతడు మఱి ప్రాచేతసుల కెట్లు జనించెను? ఈ సందియము నా హృదయమందు ఉన్నది దానిని వారింపుము. సోమునికి దౌహిత్రుడైన వాడు అతడు మామగారు ఎట్లు అయ్యెను? అని పరాశరుడు ఇట్లు అనియె: “ఓ ముని సత్తమ! భూతముల యందు పుట్టుట గిట్టుట అనునది నిత్యము. మునులు మఱి దివ్య దృష్టిగల మహానుభావులు కూడ ఇందు చొరబడుదురు. ఈ దక్షాదులు యుగయుగమున కలుగుచుందురు. అట్లే పోవుచుందురు. జ్ఞాని అందు మోహమొందడు. ఓ విప్రోత్తమ! మునుపు వీరికి పెద్ద చిన్న భేదము లేదు. తపస్సు, ప్రభావమే ఈ పెద్దరికమునకు చిన్న రికమునకు కారణమై ఉండెడిది. అన, మైత్రేయుడు: దేవ దానవ గంధర్వ నాగ రక్షస్సుల ఉత్పత్తిని విస్తరముగ ఇపుడు ఆనతి ఇమ్మనిన పరాశరుడు ఇట్లనియె.

బ్రహ్మ దక్షునింగని ప్రజలను సృజింపుము అన నాతడు ఎట్లు సృజించెనో వినుము. మనసుచేతనే అతడు భూతములను తొలుతసృజించెను. వారు దేవర్షిగంధర్వ సురపన్నగులు. దానివలన ప్రజావృద్ధి కాదయ్యెను. ఆ మీద ఆ ప్రజాపతి ఆలోచించి మైధున ధర్మముచే ప్రజాసృష్టిని పెంపనెంచి వీరణ ప్రజాపతి కూతురు నసిక్ని అను ఆమెను గ్రహించెను. ఆమె మహా తపస్విని. లోకధారిణియును. ఆమెయందు అతడు అయిదువేల మందిని మంచి బలశాలురైన కుమారులను కనెను.

సంతాన వృద్ధికావింపనున్న వారినిగాని నారదుడు ఇచ్చకములాడి, ఆ దేవర్షి, “ఓ హర్యశ్వులార! మహావీరులార! మీరు సంతానాభివృద్ధి చేయనున్నారు. మీ ప్రయత్నము తెలిసినది. మీరిది వినుడు. మీరందరు బాలిశులు (స్తబ్ధులు, శిశువులు) ఈభూమి అడుగు మీరేమో ఎఱుగరు. మీరు పిల్లలనెట్లు కందురు? మీరీ భూమియొక్క క్రిందు మీదులు, దీని అంతును అప్రతిహతగతిని ఎఱిగి చూచిరండు” అన వారు ఆమాట విని నలుదెసలకు పోయిరి. సముద్రగాములు అయిన నదుల విధముగా వారింత వరకు తిరిగిరానేలేదు. అట్లు ఆ హర్యశ్వులు పోగా ప్రాచేతసుడు మఱియు వైరిణియందు వేయిమందిని సృజించెను. బలాశ్వులను పేరుగల వారువారు సృష్టిని పెంచపూనినంత నారదుని ప్రేరణచే ఒండొరులు “మహాముని ఈయన నిజమాడెను. మనము అన్నల దారినే పోదగును. సంశయము లేదు. భూమియొక్క ప్రమాణము తెలుసుకొని ప్రజలను సృజింతము అని వారు అదేదారిని నలుదెసలకు పోయిరి. సముద్రగాములు అయిన నదులట్లు తిరిగిరానే లేదు. అప్పటి నుండి అన్నను వెదకబోయిన తమ్ముడు నశించును. ఇందు విమర్శింప పనిలేదను న్యాయ ఏర్పడెను.

దక్షుడు వారుపోయిరని తెలిసి కోపముగొని నారదుని శపించెను. మైత్రేయః ఆ మీద ప్రజాపతి సృష్టిచేయక, వైరిణియందు అరువది మంది కన్యల కనెనని మేము విందుము. అందు పదిమందిని ధర్మునకు, కాశ్యపునకు పదముగ్గురను, ఇరువది ఏడుగురను సోమునికి, అరిష్టనేమికి నల్గురను, ఇద్దరిని బహుపుత్రునికి, ఇద్దరి అంగిరసునకు ఇద్దరిని భృశాశ్వునకు ఇచ్చెను. వారి పేర్లు ఇవి:

అరుంధతి, వసువు, జామిలంఘ, భానువు, మరుద్వతి, సంకల్ప, మువహూర్త, సాధ్య, విశ్వ. వీరు పదిమంది ధర్ముని భార్యలు, వారి సంతానము విశ్వదేవులు. విశ్వకు సాధ్యులు, మరుద్వతికి మరుద్వంతులు, వసువునకు వసువులు, ముహూర్తకు ముహూర్తులు, భానునకు భానువులు, లంఘకు ఘోషుడు, జామికి నాగవీతి, అరుంధతికి పృథివీ విషయమైన సర్పము, సంకల్పకు సంకల్పుడు ఉదయించిరి. జ్యోతిః ప్రభృతులు అనేక వసు ప్రాణులు, వసువులు ఎనమండుగురు. వారి వంశవిస్తరమును ఎరింగించెదను. అపుడు ధ్రువుడు, సోముడు, ధర్ముడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అనువారు వసువులు.

ఆపుని కొడుకు స్తబ్ధుడు, శ్రముడు, శ్రాంతుడు, ధుని అనువారు. ధ్రువుని కొడుకు కాలభగవానుడు. ఆయన లోక ప్రకాలనుడు. లోకముయొక్క లెక్కకట్టు వాడన్నమాట. సోముని కొడుకు వర్చుడు. వాని కొడుకు వర్చస్వి. ధర్ముని కొడుకు ద్రవిణుడు హుతహవ్య వరుడును. మనోహర యొక్క కొడుకు శిశిరుడు, ప్రాణుడు, రమణుడు అనువారు. అనిలుని భార్య శివ. ఆమె కొడుకు పురోజవుడు, అవిజ్ఞాతగతి అనువాడు కూడ అనిలుని కుమారుడే. అగ్ని కొడుకు కుమారుడు రెల్లుదుబ్బుయందు జనించెను. అతని వెనుక శాఖుడు, విశాఖుడు, నైగమేషుడు అనువారు పుట్టిరి. కృత్తికల బిడ్డ కార్తికేయుడు. ప్రత్యూషుని కొడుకు దేవలుడను ఋషి. దేవలుని కొడుకులు ఇద్దరు. వారు క్షమావంతులు (ఓరిమి గలవారు), మనీషులును (బుద్ధిమంతులు). బృహస్పతి చెల్లెలు బ్రహ్మచారిణి, యోగ సిద్ధురాలు దేనియందు సక్తి లేక (విరక్తయై) ఎల్లజగమ్ముల గుమ్మరుచుండెను. ఆమె వసువులలో ఎనిమిదవ వాడగు ప్రభాసుని భార్య. ఆమె అందు విశ్వకర్మయను ప్రజాపతి కలిగెను. ఆయన శిల్పసహస్రకర్త, దేవతల వడ్రంగి, సర్వ భూషణములు చేయువాడు, శిల్పశిరోమణి. దేవతల విమానములను నిర్మించినవాడు ఆతడు. ఆయన శిల్పమును అనుసరించి శిల్పులై, మనుష్యులు జీవనము చేయుచున్నారు.

అజైకపాత్తు అహిర్భుధ్నుడు. త్వష్ట విశ్వరూపుడు హరుడు బహురూపుడు త్ర్యంబకుడు వృషాకపి శంభువు కపర్ది రైవతుడు మృగవ్యాధుడు శర్వుడు కపాలి అనువారు. వీరు ఏకాదశ రుద్రులు. త్రిభువనేశ్వరులు కాశ్యపునికి భార్య యందు నూరుగురు రుద్ర సంతతి కల్గిరి. అదితి, దితి, దనువు, అరిషా, సురస, కష, సురభి, వినత, తామ్ర, క్రోధవశ, ఖలా, కద్రువు ముని అనువారు కాశ్యపుని భార్యలు. చాక్షుష మన్వంతరము రాగా వీరొండొరులు మనువునకు సంబంధింపబడిరి. దేవతలార అదితినికొచ్చి చాక్షుష మన్వంతరములో సంతతిగా పుట్టుదము. దాన మనకు శ్రేయస్సు కల్గునని, పిలిచికొని మరీచి కొడుకగు కాశ్యపుని వలన దక్షకన్యయగు అదితియందు దేవతలు పుట్టిరి. అందు విష్ణువు, ఇంద్రుడు మఱల జన్మించిరి. వారు అర్యముడు ధాత త్వష్ట పూష, వివస్వంతుడు, సవిత, మిత్రుడు, వరుణుడు, ఆంశువు, భగుడు అతితేజుడు అనువారు. వారే ద్వాదశ ఆదిత్యులు. చాక్షుషమన్వంతరమున తుషితులు అను దేవతలు వైవస్వత మన్వంతరమున ద్వాదశాదిత్యు లైరి. సోముని భార్యలు ఇరువదియేడుగురు సువ్రతులు. వారికి తేజోవంతమయిన సంతానము కల్గినది. అరిష్టనేమి పత్నుల సంతానము పదునాల్గురు. బహుపుత్రుడు జ్ఞాని ఆయన కొడుకులు విద్యుత్తులను వారు నల్గురు. ప్రత్యంగిరుని కొడుకులు బ్రహ్మర్షి పూజితులు. ఋక్కులు దేవర్షియగు భృశాశ్వుని కొడుకులు దేవ ప్రహరణులు. వీరు వేయి యుగముల తర్వాత మరల జనింతురు. ముప్పదిమూడు దేవ గణములవారు వారు స్వచ్ఛందజులు. వారి సంతానమును నిరోధమును చెప్పెద. సూర్యునికి ఉదయ, అస్తమయములు అట్లు దేవతలును యుగయుగములందు పుట్టుచుందురు. కాశ్యపుని వలన దితికి ఇద్దరు కొడుకులు పుట్టిరని విందుము. వారు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడును. సింహికయను కూతురు పుట్టినది. ఆమె విప్రచిత్తికి భార్య. హిరణ్యకశిపుని కొడుకులు అనుహ్లాదుడు, హ్లాదుడు, ప్రహ్లాదుడు, సంహ్లాదుడు అనువారు నల్గురు. దైత్యవంశ వర్ధనులు. అందరిలో మహానుభావుడు, సమదర్శనుడు, జితేంద్రియుడు ప్రహ్లాదుడు విష్ణువు నందు పరమభక్తి గలవాడు. వాసుదేవుడు అతని హృదయము నందున్నందున దైత్యేంద్ర దీపితమైన అగ్ని సర్వాంగములందు రగుల్కొల్పబడియు ఆతనిని దహింపదయ్యె. ఏ మహానుభావుని పాశములచే బంధించి మహార్ణవ మందు తండ్రి త్రోయగా అందు అతడు, కదలినంత భూమండలమెల్ల కదలి పోయినది. వివిధాయుధ నిహతుడైన అతని శరీరము కందదయ్యెను. అచ్యుతునందు బుద్ధి నిలిపిన అతనిని విషజ్వాలలు చిమ్ము మహాసర్పము లేమియు చేయలేకపోయెను. కొండలనుండి దొర్లించినను విష్ణుస్మరణ దంశీతుడై (దంశనము = కవచము) అనగా విష్ణు స్మరణము అను కవచమును ధరించిన వాడై ప్రాణములు విడువడయ్యె. మీదినుండి భూమికి హిరణ్యకశిపుడు విసరిగొట్టగా కిందబడు అతని అవని ఎత్తుకొని రక్షించినది. మధుసూదనుడు అతని చిత్తమందు ఉన్నందున దైత్యేంద్రుడు ప్రయోగించిన సర్వ శాంఖకుడైన వాయువు అతనిని ఎండింపలేడయ్యెను. పైగా తానే శోషించి పోయెను. ఎవని రొమ్ముదాకి రాక్షసరాజు ప్రేరణమున ప్రయోగించిన దిగ్గజములు దంతభంగము నందెనో, దైత్యరాజ పురోహితులు పుట్టించిన కృత్య అను శక్తి ఎవ్వని తుదముట్టింప లేనిదయ్యెనో, అట్టి గోవిందైక చిత్తుడు ప్రహ్లాదుడు మహాభక్తుడు. శంబరాది మాయాసహస్రము విష్ణు చక్రముచే అట వ్యర్థమయ్యెను. హిరణ్యకశిపుని వంటి వాడు పెట్టిన మితిమీరిన హాలాహల విషమును మాత్సర్యమేమియును గొనక, ఆ భక్తశిరోమణి జీర్ణము ఒనరించుకొనెను. తనయందు అఖిల భూతములందు సమహితత్వంబున బరుగు మైత్రీగుణ సంపన్నుడు ధర్మాత్ముడు, సత్య శౌచాది గుణ రత్నాకరుడు, ఎల్లపుడు అశేష సాధువులకు ఉపమానమై ప్రహ్లాదుడు భాసించెను.

ప్రహ్లాద చరితము

శ్రీ మైత్రేయుడు పలికెను. ఓ పరాశరమునీ! మీచే స్వాయంభువమనువంశ జాతులగు ఉత్తానపాదాది మహాత్ముల వంశము చెప్పబడినది. సనాతనుడగు విష్ణువే జగత్కారణము. ప్రహ్లాదుని అగ్ని దహింపలేదు. అస్త్రములు బాధింపలేదు. సముద్రమున అతడు త్రోయబడగా, పాశములచే బంధింపబడగా, భూమి క్షోభించి చలించెను. పర్వతములచే కప్పబడినను అతడు మృతిచెందలేదు. విష్ణు భక్తుడు దీప్త తేజస్కుడు అగు అతని ప్రభావము నీచే చెప్పబడినను, మరల వినవలయును అను కోరిక పలుమారులు కలుగుచున్నది. ఓ మునీ! దైత్యులచే ధర్మపరుడగు ఈ ప్రహ్లాదుడు ఎందులకు అస్త్రములచే బాధింపబడెను? సముద్రమున త్రోయబడెను? పర్వతములచే కొట్టబడెను? పాములచే కరిపింపబడెను. పర్వత శిఖరములనుండి అగ్ని జ్వాలలలో త్రోయింపబడెను. దిగ్గజముల దంతములచే కుమ్మింపబడెను. సంతోషకమగు వాయువు ప్రయోగింప చేయబడెను. దైత్య గురువులు కృత్య అను శక్తిని ప్రయోగించిరి. ఐంద్రజాలికులు మాయా సహస్రముల కురిపించిరి. వంటవారిచే హాలాహల మహా విషమును పెట్టించిరి. ఈ ప్రయత్నములు అన్ని వమ్ము ఆయెను. ఎందులకు ఇట్లు చేయించిరో వినగోరెదము. విష్ణువునందు అనన్యమనసు కలిగి, ధర్మ తత్పరుడైన వానిని ఎవరు బాధించగలరు? ఇట్టి యోగ్యుని యందు ఏల దైత్యులు అట్లు ప్రవర్తించిరి? ఇట్టి యోగ్యులయెడ శత్రువులు కూడ ఇట్లు ప్రవర్తిల్లరు. స్వపక్షులు ప్రవర్తిల్లుదురా? దైత్యరాజు చరితమును పూర్తిగ వినవలతుము విస్తరముగ చెప్పుడు.

ప్రహ్లాద చరితము - 1

శ్రీ పరాశరుడు పలికెను: మైత్రేయా! నిరంతరము ఉదారచరితుడగు ప్రహ్లాదుని చరిత్రమును వినుము. పూర్వము దితి యొక్క పుత్రుడు మహాపరాక్రమశాలియగు హిరణ్యకశిపుడనువాడు బ్రహ్మవరముచే గర్వించి ఇంద్రుడుగను, సూర్యుడుగను, వాయువుగను, అగ్ని వరుణుడుగను, సోముడుగను, కుబేరుడుగను, యముడుగను వ్యవహరించుచు, యజ్ఞభాగములను అపహరించుచుండెను. అతని వలన భయపడి దేవతలు భూలోకమునకు ఏగి మనుష్య రూపధారులై తిరుగుచుండిరి. ముల్లోకముల జయించి హిరణ్యకశిపుడు విజయదర్పముతో గంధర్వులు కొనియాడగా, ప్రియవిషయములను అనుభవించుచుండెను. గానాదులచే సిద్ధులు అప్సరసలు వానిని సేవించుచుండిరి. మనోహర ప్రాసాదమున స్ఫాటిక శిలాస్థలిని అప్సరసలు నాట్యమాడగా మద్యపానాసక్తుడై ఉండెను. వాని పుత్రుడు ప్రహ్లాదుడు గురుకులమున బాలపాఠ్యములను అభ్యసించుచుండెను.

ధర్మాత్ముడగు ప్రహ్లాదుడు ఒక దినమున గురుపురస్సరముగ ఏతెంచి పానాసక్తుడగు తండ్రికి పాదవందనముచేయగా లేవనెత్తి హిరణ్యకశిపుడు నీ చదువులసారము నెరింగింపుము అన, ప్రహ్లాదుడు చదువుల మర్మమును నా మనోగతమైన దానిని తెల్పెదను. సావధానముగ వినుడు. ఆదిమధ్య అంతములు, వృద్ధి క్షయములు లేనివాడును, నాశరహితుడును, నాశకరుడును, సర్వకారణకారణుడును అగు విష్ణువునకు నమస్కరించెదను అని పలుకగా విని దైత్యరాజు కోపోద్రిక్తుడై గురువుతో ఇట్లనియె. “బ్రాహ్మణ బ్రువుడా! ఏమిది? నన్ను తిరస్కరించి అపారమగు శత్రుపక్షస్తుతిని వీనికి బోధించితివేల?” అనగా గురువు: దైత్యప్రభూ! ఆగ్రహింపవలదు నా బోధయొక్క సారమును నీ సుతుడు పలుకుట లేదు అనెను. “నాయనా నీవెవ్వరిచే ఇట్లు శిక్షింపబడితివి! నీగురువు ఇట్లు శిక్షింపలేదనుచున్నాడు” అని పలికిన తండ్రికి తండ్రీ! విష్ణువు సర్వజనుల హృదయాంత రాళవర్తియై శాసించుచుండగా అట్టి పరమాత్మకంటె మరెవ్వరు శాసించగలరు?”

అని పలికిన కుమారునితో “ఓ దుష్టబుద్ధీ! సర్వజగత్పతినగు నా ఎదుట పదేపదే నీవు పేర్కొనుచున్న విష్ణువు అనువాడెవ్వడు?” అని తండ్రి అనగా ప్రహ్లాదుడు. “ఎవ్వని స్వరూపము శబ్దగోచరము కాక యోగిజన ధ్యేయము మాత్రమో, సమస్త జగత్తు ఎవనివలన ఏర్పడుచున్నదో, ఎవడు విశ్వస్వరూపుడో అతడే పరమేశ్వరుడగు విష్ణుదేవుడు” అని పలుకగా, తెలివిలేనివాడా! నేనుండగా మరి ఒకడు పరమేశ్వరుడు అను వాడు ఎచటనున్నాడు? నీవు చచ్చుటకే క్షణక్షణము ఇట్లు పలుకుచున్నావు అని తండ్రి అనగా, ప్రహ్లాదుడిట్లనెను: “నాకు మాత్రమేగాదు సమస్త ప్రజలకు నీకును అతడే ధారకుడు, సృష్టికర్త పరమేశ్వరుడునై ఉన్నాడు. అనుగ్రహింపుము కోపమేల” అనగా తండ్రి ఆవేశముతో “ఇట్లు అయోగ్య వచనములు పల్కుటకు దుర్బుద్ధిగల ఈతని హృదయమున మహాపాపియగు ఎవడో ప్రవేశించెను” అని పలుకగా, ప్రహ్లాదుడు ఇట్లనెను, “తండ్రీ! నా హృదయమును మాత్రమే గాదు, సమస్త లోకములను ఆక్రమించుకొని ఉండి ఆ విష్ణువే నీవు మొదలగు అందరిని సమస్త వ్యాపారములందు ప్రవర్తింపచేయుచున్నాడు. అతడు అంతట నిండి ఉన్నాడు” అని పలుకగా హిరణ్యకశిపుడు “ఈ మహాపాపిని వెళ్ళగొట్టుడు. గురు గృహమున శిక్షింపబడు గాక! శత్రుపక్ష స్తుతియందు ఎవ్వడు ఈ దుర్మతిని ప్రవేశపెట్టెను?” అని పలుకగా గురు గృహంబునకు అతనిని కొనిపోయిరి. అంతట ప్రహ్లాదుడు గురు శుశ్రూషతో రేయింబవళ్ళు విద్యా గ్రహణము చేసెను. చాల కాలమునకు దైత్యపతి కుమారుని రప్పించి ఒకశ్లోకము చదువుము అనగా ప్రహ్లాదుడు “పురుషులకు చరాచర ప్రపంచమునకు సమస్తమునకు కారణభూతుడైన ఆ విష్ణువు మనలను అనుగ్రహించుగాక!” అని చదివెను.

అనగా రాజు “ఈ దుర్మార్గుడు చంపబడుగాక! వీడు బ్రతికి ప్రయోజనములేదు. స్వపక్షహానికర్త అగుటచే ఈతడు కులదాహకుడు” అని ఆజ్ఞాపింపగా మహా ఆయుధములు దాల్చిన వేలకొలది రాక్షసులు అతనిని చంపుటకు సిద్ధపడిరి. “శస్త్రములందు, మీయందు నాయందున్ను ఆ విష్ణువే నిండియున్నాడు. ఆయాదార్ధ్యమును అనుసరించి యాయుధములు నన్ను స్పృశింపకుండుగాక!” అని ప్రహ్లాదుడు పలుకగా అనేక రాక్షసులచే ఘోర శస్త్రములతో కొట్టబడినను ప్రహ్లాదుడు స్వల్పమగు బాధనుకూడ పొందకుండుటయే గాక, తిరిగి నూతనత్వమందుచుండెను. అది చూచి రాజు “ఓరీ దుర్బుద్ధీ! వైరి పక్షమునుండి మరలుము. నీకు అభయము ఇచ్చెదను. మిక్కిలి మూర్ఖత్వము నొందకుము” అని పలికెను. ప్రహ్లాదుడు “తండ్రీ! ఎవ్వని స్మరణ మాత్రమున జన్మభయము, జరా భయము, యమ భయము మున్నగు భయములు అన్నియు తొలగిపోవునో అట్టి అనంతుడు మనసులో ఉండగా, నాకు భయము ఎచ్చట ఉండును?” అనెను. అంతట వానిలో హిరణ్యకశిపుడు “ఓ సర్పములారా! దురాచారుడు దుర్భుద్దియు అగు ఈతనిని విషజ్వాలలచే భయంకరములైన ముఖములచే వెంటనే నశింప జేయుడు” అని పలుకగా తక్షకాది క్రూర సర్పములు అతని అవయవము లందు కాట్లు వేసెను. కృష్ణుని అందు లగ్నమైన మనసుగల ప్రహ్లాదునికి ఏమియు తెలియకపోయెను. సర్పములు దైత్యరాజుతో ఇట్లనియె. “మా కోరలు విరుగుచున్నవి. మణులు బ్రద్దలగుచున్నవి. హృదయమందు కంపము పడగలందు తాపము కలుగుచున్నది. ఓ ప్రభూ! పిల్లవాని చర్మమున కొంచెము అయినను భిన్నమగుటలేదు. మరియొక పనిని చెప్పుడు”.

అనగా రాజు “దిగ్గజములారా! శత్రు పక్షముచే ఖిన్నుడైన ఈ బాలుని మీ చతుర్దంతములతో చంపుడు. అరణివలన పుట్టిన అగ్ని ఆ అరణికి నాశనకరమగు గదా! అని పలుకగా, దిగ్గజములు ప్రహ్లాదుని దంతములతో పొడిచి క్రింద పడవేసెను. గోవింద స్మరణలో నిమగ్నుడైన అతనికి బాధ కలుగలేదు. దిగ్గజముల దంతములు భగ్నములు అయ్యెను. ప్రహ్లాదుడు తండ్రితో “తండ్రీ! వజ్రమువలె నిష్ఠురములైన గజదంతములను కూడ భగ్నముచేసిన భగవంతుని బలము చూడుడు. భగవదనుస్మరణము మహావిపత్తులను గూడ నశింప చేయగలదు” అనగా అతడు “రాక్షసులారా! దిగ్గజముల పారద్రోలుడు. అగ్నుల రగుల్కొల్పుడు. వాయువు అగ్నిని రగులజేసి ఈ పాపాత్ముని దహింపజేయుగాక!” అని ఆజ్ఞాపింపగా అట్లు చేయమొదలిడిరి. ప్రహ్లాదుడు “తండ్రీ! గాలిచే రగులజేయ బడిన ఈ అగ్ని నన్ను దగ్ధముచేయజాలదు. దిఙ్ముఖములెల్ల పద్మములచే పరువబడినట్లు చల్లగా ఉన్నవి” అని పలికెను. శుక్రాచార్య పుత్రులును రాక్షస పురోహితులును అగు చండా మార్కాదులు ఏతెంచి రాజుతో ఇట్లనిరి. “ప్రభూ! బాలుడైన నీ తనయునిపై కోపము ఉపసంహరింపుడు. మీకోపము దేవతలయెడ సఫలమగును. ఈ బాలుని మేము విపక్షనాశ దక్షుడగునట్లు శిక్షింపగలము. దైత్యరాజా! బాలభావము సర్వదోషములకు నిలయముగదా! ఈ అర్భకునియెడ తీవ్రకోపము వలదు. మా శిక్షణ వలన హరిపక్షమును వీడడేని కృత్యయను అభిచారికాభూత విశేషమును ఈ బాలుని పరార్థమై ప్రయోగింతము. దానికి తిరుగుండదు” అని పలికిన పలుకులను విని రాజు బాలుని అగ్ని నుండి తొలగింపజేసెను. పిమ్మట బాలుడు గురునికేతనమునందు, గురుబోధావసానము నందు, బాలదానవులకు విద్యను గరుప మొదలిడెను. “దైతేయ బాలకులారా! పరమ పురుషార్థమును వినుడు. అన్యధా భావింపకుడు. అనగా మిధ్యగా తలంపకుడు గురూపదేశమునందువలె నాబోధ యందు లోభాదులు కారణముకావు. జన్మాది పంచకము (జన్మ, బాల్యము, యౌవనము, జరా, మృత్యువులు) ప్రతి జంతువునకు ప్రత్యక్షముగ గోచరించుచున్నవి గదా! మృతునకు పునర్జన్మము కలుగును అనునదియు అసత్యముకాదు. కారణము లేకుండ పుట్టుక లేదని కూడ ఆగమము చెప్పుచున్నది. ఆకలి, చలి మున్నగుదాని ఉపశాంతి హేతువగు అన్నము, అగ్ని మొదలగునవి దుఃఖకారణమే అయినను అజ్ఞతచే సుఖహేతువు అనుకొనుచున్నారు.

మిక్కిలి నిశ్చలమైన అవయవములు గలవారునూ అయాసముతో సుఖమును పొందగోరు వారునూ భ్రాంతిచే గ్రమ్మబడిన నేత్రములు గలవారికిని దుఃఖమే సుఖముగ ఉండును. శ్లేష్మాది సమస్త కల్మషముల సముదాయ రూపమగు శరీరము ఎక్కడ? సౌందర్య శోఖాది గుణములెక్కడ? మాంస విణ్మూత్రాది సంఘాతరూపమగు దేహమునందు ప్రీతిగల మూఢునకు నరకమునందు కూడ ప్రీతి కలుగుగాక! అగ్నికి చల్లదనముచేత, నీటికి దప్పిక చేత, అన్నమునకు ఆకలిచేత, సుఖకర్తృత్వము చెప్పబడుచున్నది. శీతాది అభావములచే అగ్న్యాదులకు దుఃఖకర్తృత్వము చెప్పబడుచున్నది. ఓ దానవ బాలకులారా! ధనాదులు ఎంతెంత సంగ్రహింతురో, వారికి అవి అంతంతగ దుఃఖహేతువులు అగును. కళత్రాదిక మెంతగ ప్రేమింతురో, అంతగ అవి శోకశంకువై హృదయమున స్థిరముగ నిలిచి పోవును. ఇంటియందు ఉన్న వస్తువులన్నియు దూరమున ఉన్నవానికి నాశాద్యాశంకచే అవియెల్ల మనస్సునందే ఉండగలవు. జననమందు యమయాతనలందు గర్భమున సంక్రమించుట యందు, గర్భమునందును సుఖలేశమును కూడ ఊహింప శక్యముగాదు. ఈ విధముగ అతి దుఃఖములకు ఉనికిపట్టగు సంసార సముద్రమునందు విష్ణువు ఒకడే సుఖమైన శరణ్యము.

ఇది నిజము. మేము పిల్లలమని తలంచవలదు. దేహములందు ఉండు దేహి శాశ్వతుడు. జన్మ యౌవనము, జర మొదలగు ధర్మములు దేహమునకుగాని ఆత్మకు లేవు. “నేను బాలుడను. నా శ్రేయస్సు కొరకై ఏవనమున యత్నించును. నేనిపుడు యువకుడను. వార్ధక్యము వచ్చిన పిదప యత్నింతును. నేనిపుడు వృద్ధుడను. నాకిపుడే పనులు గోచరించుట లేదు. ఏమి చేయుదును? సమర్ధతతో ఉండగా నేను ఏమియు చేయనైతిని” అని దురాశాపూరితుడై నరుడు శ్రేయో మార్గమున ప్రవర్తించడు. బాల్యమున ఆటలతోను యౌవనమున విషయాసక్తితోను వార్ధకమున అశక్తతతోను మూఢులు కాలము గడుపుదురు. కావున వివేకయుక్తుడు బాల్యాది దేహభావములతో సంబంధము లేకుండ శ్రేయస్సు (మోక్షము) కొరకు ఎల్లపుడు బాల్యమునందే ప్రయత్నింపవలయును. నేను మీకు చెప్పిన ఈ విషయములు అసత్యముకాదని గుర్తించిన మీ ప్రీతికొఱకై భుక్తి ముక్తులను ఒసంగు శ్రీ మహావిష్ణువును స్మరింపుడు. ఇట్లు స్మరించుటకేమి శ్రమగలదు? స్మరణ మాత్రముననే హరి మంచిని కలుగజేయును. రేయింబవళ్ళు ఆ విష్ణుదేవుని స్మరించు వారలకు పాప నాశనముకూడ కలుగును. సర్వభూతములయందు నిండియున్న విష్ణువు నందు రేయింబవళ్ళు మీకు బుద్ధి నిలిచియుండు గాక! సర్వభూతములందు మైత్రి కలుగుగాక! ఇట్లు అగునేని సంసార క్లేశములు తొలగును. సమస్త ప్రపంచము తాపత్రయ దూషితము. అట్టి యెడ శోచనీయమైన ప్రాణులయెడ ప్రాజ్ఞుడైనవాడు కరుణ చూపునుగాని ద్వేషమూనడు.

సమస్త భూతములు అధికపుణ్యవంతములు. నేను హీనశక్తుడను అను భావమున్నచో దాని యందు మోదమును చూపవలెను. కాని అసూయ పడరాదు. ద్వేషము వలన తన పుణ్య నాశమగును గదా! వ్యర్థముగ బద్ధవైరులై పరులందు ద్వేషము చూపువారియెడ విద్వాంసుడు వీరు అధిక మోహముచే వ్యాప్తులై ఉన్నారు. కావున వీరు శోచనీయులుగాని ద్వేషింప దగినవారు కాదని ఉపేక్ష వహించవలెను. ఈ వికల్పములు అన్నియు భేదదృష్టిగల మధ్యమాధికారులు ద్వేషోపశమన ప్రకారములు. అభేద దృష్టిగల ఉత్తమ అధికారుల మతమును సంక్షేపముగ చెప్పెదను వినుడు.

ఈ సర్వజగత్తు సర్వభూత స్వరూపుడగు విష్ణుదేవుని విస్తృతియే. కావున నేర్పరులైన వారు సర్వభూతములను ఆత్మాభిన్నములుగ చూడవలెను. అసుర భావమును (దేహము నందు ఆత్మాభిమానమును) వదలి మీరు మేము కూడ మోక్షము పొందునట్లు ప్రయత్నించ వలెను. ఆ నిర్వృతి (మోక్షము) అగ్ని, సూర్య, చంద్ర, వాయు, వరుణ, సిద్ధ, సాధ్య, కిన్న రాద్యాది వైవికోప ఘాతములచే గాని, మనుష్య పశ్వాద్యాధి భౌతిక ఉపఘాతములచేగాని, శారీర మానసాది ఆధ్యాత్మిక ఉప ఘాతములచే గాని నాశనము చెందదు. అట్టి మోక్షమును మానవుడు అమలుడైన కేశవుని యందు హృదయము నుంచి కేశవ స్మృతిచే అందగలడు. అపారములగు సంసార వివర్తములగు దేవమనుష్యతిర్యక్ పశ్వాది జన్మలందు సంతోషమును పొందవలదు. సర్వ భూతముల సమదర్శితను పొందుడు. అదియే అచ్యుతారాధనము. ఆ కేశవుడు ప్రసన్నుడు కాగా అలభ్య మనునది లేదు. ధర్మార్థ కామములు అత్యంత అల్పములు. నిత్యసన్నిహితమైన బ్రహ్మకల్పతరువును ఆశ్రయించిన వారికి మహాఫలమగు మోక్షము తప్పదు.

ప్రహ్లాదుని బాధించుట - తత్త్వబోధ

అటుపిమ్మట శ్రీ పరాశరుడు ఇట్లు చెప్పెను. “ఆ ప్రహ్లాదుని రీతిని చూచి రాజువలన భయమున రాక్షసులు రాజుతో చెప్పగా అతడు వంటవారిని పిలిచి “ఓ పాచకులారా! నా పుత్రుడు దుష్టబుద్ధియై ఇతరులకు గూడ కుమార్గమును ఉపదేశించుచున్నాడు. దుష్టుడగు ఈతనిని ఆలశ్యము చేయక చంపివేయుడు. తిను పదార్థములలో విషమును కలిపి తెలియనీయకుండ అతనికి ఈయుడు. ఆలోచింపవలదు” అను రాజాజ్ఞను అనుసరించి వంటవారు మహానుభావుడగు ప్రహ్లాదునకు విషమునివ్వగా ప్రహ్లాదుడు అన్నముతో గూడ విషమును అనంతోచ్చారణచే అభిమంత్రించి త్రాగెను. అనంతనామ సంకీర్తనమున విషము నిర్వీర్యమాయెను. ఆ సంగతిని వంటవారు రాజునకు తెలుపగా రాజు తన పురోహితులతో “శీఘ్రముగ కృత్య అను శక్తిని పుట్టింపుడు అనెను. పురోహితుడు ప్రహ్లాదుని కడకు ఏతెంచి వినయాన్వితుడగు ప్రహ్లాదునకు సవినయముగ సామపూర్వకముగా ఇట్లు చెప్పిరి:

బ్రహ్మవంశమున పుట్టి, త్రైలోక్య విఖ్యాతిగన్న దైత్యనాథుడగు హిరణ్యకశిపుని పుత్రుడవగు నీకు ఇతర దేవతలతో ఏమి ప్రయోజనము! సర్వలోకములకు ఆశ్రయుడైన నీ తండ్రివలెనే నీవుకూడకాగలవు. కావున నీవు శత్రుపక్ష ప్రశంసను మానుము, అందరిచే శ్లాఘింపబడు నీతండ్రి, గురువులకు గూడ గురువు అని పలుకగా ప్రహ్లాదుడు ఇట్లనెను: “ఈ వంశము మరీచిమహాముని అంశము. చాలగొప్పది. గురువులలో తండ్రియే పరమ గురువు. పూజ్యుడు. అందు సంశయములేదు. ఆవిషయమై నేను పొరబడను. అనంతునితో ఏమి ప్రయోజనమని మీరనినమాట నిజముకాదు అని పలికి గురువులందలి గౌరవముతో మౌనము వహించి నవ్వి, “అనంతునిచే ఏమి లాభము”అని బాగుగా పలికినారు. మీకు కష్టము లేనిచో ఏమి లాభమో చెప్పెద వినుడు.

ధర్మార్థ కామమోక్షములు నాలుగు పురుషార్థములు. అవి ఎవని వలన సిద్ధించునో అట్టి అనంతుని వలన ఏమి లాభము అనుట బాగున్నది. మరీచి దక్షుడు మున్నగువారు అనంతుని వలననే ధర్మము పొందిరి. మరికొందరు అర్థమును, మరికొందరు కామమును పొందిరి. తత్త్వవేత్తలగు మరికొందరు జ్ఞాన ధ్యాన సమాధులచే ధ్వస్తమైన అజ్ఞానబంధము గలవారై ముక్తిని పొందిరి.

అనంతుడగు హరి ఆరాధనమే సంపత్తికి, ఐశ్వర్యమునకు, మాహాత్మ్యమునకు, జ్ఞానమునకు మూలకారణము. సర్వపురుషార్థములు ఆ ఆరాధనమునకు ఫలభూతములు. అట్టి అనంతుని వలన ఫలమేల అనుట బాగున్నది. వేయి మాటలేల? తాము మాకు గురువులు. మంచియో చెడో చెప్పుడు, మా వివేకము మిక్కిలి అల్పము. ఈవిషయమై వేరు చెప్పనేల? ఆ అనంతుడే జగత్పతి. ఆతడే కర్త, వికర్త, సంహర్తయు కూడా. అతడు అందరి హృదయములందు కలడు. భోక్త భోజ్యము కూడ అతడే. అతడే జగదీశ్వరుడు. బాల్యముచే నేను చెప్పిన దానిని క్షమించుడు” అని పలికిన ప్రహ్లాదునితో పురోహితులు ఇట్లనిరి. “ఇక మరల నీవిట్లు పలుకవుగదా! అను భావముతో అగ్నిచే దగ్ధమగుచున్న నీవు మాచే రక్షింపబడితివి. నీవింత అవివేకివని మేము తలంచలేదు. ఈ దురాగ్రహమును విడువలేని దుర్బుద్ధీ! నీ వినాశనము కొరకై కృత్యను సృజించెదము.”

అని పలుకగా ప్రహ్లాదుడు ఇట్లనెను. “ఎవడెవ్వనిచే చంపబడును. ఎవనిచే రక్షింప బడును? అధర్మము ఆచరించనివాడు రక్షితుడగును. సమస్తమునకు కర్మయే కారణము. కావున సర్వప్రయత్నములచే సత్కర్మను ఆచరింపవలెను”. ఇట్లు అనగానే రాజపురోహితులు కోపితులై అతిభయంకరమైన జ్వాలామాలలచే ప్రకాశించుచున్న కృత్యను సృజించిరి. ఆ కృత్య పాదములతో భూమితాడనముచేసి మహాకోపముతో ప్రహ్లాదుని హృదయమును శూలముతో కొట్టగా ఆ శూలము శతఖండములుగా భగ్నమాయెను. ఎవ్వని హృదయమున అనపాయిగా హరి ఉండునో, అచట వజ్రమే భిన్నమగును. శూలము మాట చెప్పనేల? పాపాత్ములగు దైత్యపురోహితులచే పాపరహితుడైన ప్రహ్లాదునిపై ప్రయోగింపబడిన కృత్య వారినే చంపెను.

దగ్ధమగుచున్న వారిని చూచి ఆ బాలుడు కృష్ణా! అనంతా! రక్షింపుమని వెంటబడెను. మరియు ఇట్లనెను. సర్వవ్యాపివి! జగత్ర్సష్టవు! జగద్రూపుడవు! ఈ బ్రాహ్మణులను దుస్సహమగు మంత్రాగ్ని వలన రక్షింపుము. జగద్గురువగు నీవే సర్వభూతములందు వ్యాపించియున్నావు. కావున వీరు బ్రతుకుదురుగాక!

విష్ణువగు నిన్ను సర్వత్ర ఎట్టి ఆపదలు కలిగించనివానిగా భావించుచున్నాను. కావున శత్రుపక్షీయులైనను వీరు జీవింతురుగాక! నన్ను చంపచూచినవారు, విషము పెట్టినవారు, అగ్నిని నాపై రగులు కొల్పినవారు దిగ్గజములచే త్రొక్కించినవారు సర్పముల కరపించిన వారు వీరందరియందు నేను సమమైన మైత్రితోనే ఉంటిని. ఆ నా సత్యదీక్షచే వీరందరు జీవింతురుగాక! అని పలికి వారిని స్పృశింపగనే వారు బాధారహితులై లేచి వినయముతో కూడిన ఆ బాలుని ఆశీర్వదించిరి. వత్సా! బల వీర్యోపేతుడవై దీర్ఘాయువువై అడ్డులేని వాడవై పుత్రపౌత్ర ధన ఐశ్వర్యములో వర్ధిల్లుము అని పలికి పురోహితులు రాక్షస ప్రభువునకు జరిగిన వృత్తాంతమును నివేదించిరి.

ప్రహ్లాదునిచేత చేయబడిన విష్ణు స్తుతి

శ్రీ పరాశరుడు పలికెను. కృత్య వమ్మైనట్లు విని, హిరణ్యకశిపుడు పుత్రుని పిలిచి ఈ ప్రభావమునకు కారణమడిగెను. “ప్రహ్లాదా! మంచి ప్రభావశాలివైతివి. ఈ నీ మహిమ మంత్రాదులచే కలిగినదా? సహజమా?” ప్రహ్లాదుడు తండ్రికి నమస్కరించి ఇట్లనెను: “మంత్రాది కృతముకాదు, నైసర్గికముకాదు. హృదయమునందు అచ్యుతుని ధరించినవాని కెల్ల ఈ ప్రభావము సమానమే. ఎవడు తనకువలె ఇతరునికి గూడ పాపఫలము (దుఃఖము) లను చింతించడో వానికి పాపకారణము లేకుండుటచే పాపము పుట్టదు. మనోవాక్కర్మల (త్రికరణముల)చే ఎవడితరునికి పీడను కల్గించునో అదియే బీజముగాగల జన్మ వానికి అశుభమును అధికముగ కల్గించును. అట్టి పాపమును నేను కోరను, చేయను, ఒకనికి చెప్పను. కేశవుని సర్వభూతములందును నాయందును ఉన్నవానిగా భావించుచు ఇట్లు అందరియందు శుభచిత్తముగల నాకు, శారీరక, మానసిక, ఆధిదైవిక ఆధిభౌతిక దుఃఖములు ఎట్లు కలుగగలవు? ఈ విధముగ శ్రీహరిని సర్వభూతమయునిగ తెలిసికొని పండితులు సర్వ భూతములందు గాఢమైన భక్తిని పరుపవలెను” ఈ వచనములను విని ప్రాసాద అగ్రమున ఉన్న రాక్షసరాజు క్రోధముచే క్రమ్మబడిన ముఖముగలవాడై, రాక్షస సేవకులతో

“ఈ దుష్టుని శతయోజన ఉన్నతమగు ఈ ప్రాసాదము పైనుండి త్రోసివేయుడు. రాళ్ళచే భిన్నమైన అవయవములుగలవాడై, పర్వతాగ్రమున పడుగాక!” అని పలకగానే వారు అట్లే త్రోసివేయగా హృదయమున శ్రీహరిని ధరించి పడుచున్న జగద్ధారకుడగు కేశవుని భక్తుడగు ఆ బాలకుని జగద్ధాత్రియగు భూదేవి జాగ్రత్తగ ధరించెను. చెక్కుచెదరకుండ పడిన పిల్లవానిని చూచి హిరణ్యకశిపుడు మాయావులలో శ్రేష్ఠుడగు శంబరునితో నిట్టనెను. దుర్బుద్ధి నీ బాలుని మేము చంపజాలము. నీవు మాయావివిగావున మాయతో వీనిని చంపుమనెను. ఆ శంబరుడు “అట్లే చంపగలను వేయింబది మాయలుగలవు” అని పలికి సర్వత్ర సమ (బ్రహ్మ) దర్శనముగల ప్రహ్లాదునిపై మాయలను ప్రయోగించెను. సమాహితచిత్తుడై ప్రహ్లాదుడు ఆ శంబరునియందుగూడ మాత్సర్యములేకుండ మధు సూదనుని స్మరింపగా భగవంతుడు వాని రక్షణకై సుదర్శన చక్రమును పంపెను. ఆ చక్రము ప్రహ్లాదుని రక్షించుచు మాయలను అణగ చేసెను.

రాజు వాయుదేవునితో ఈ దుర్మార్గుని శీఘ్రముగా శోషింప జేయుమని ఆజ్ఞాపింపగా ఆ వాయువు పిల్లవాని శరీరములో ప్రవేశించి బాధపెట్టగా ప్రహ్లాదుడు హృదయస్థుడగు జనార్దనుని ధ్యానించెను. ఆ భగవానుడు హృదయస్థుడై ఆ వాయువు నంతను పానము చేసెను. ఇట్లన్నియు సమసిపోగా ప్రహ్లాదుడు గురుగృహమును చేరెను. గురువు ప్రతిదినము శుక్రనీతిని బోధించెను. పూర్తియైన పిమ్మట రాజసన్నిధికి కొంపోయి నీ బాలుడు శుక్రనీతిని బాగుగ ఎఱంగియున్నాడు అని చెప్పగా ముల్లోకములలో భూపతి మిత్రులయందు, శత్రువులయందు, మధ్యస్థులయందు, ఎట్లు మెలగవలెను? మంత్రుల యందు, అమాత్యుల యందు, ఇతరులయందు ఆంతరంగికులయందు, చారులయందు, పౌరులయందు, శంకితులయందు, ఇతరులయందు ఎట్లు మెలగవలెను? కృత్యాకృత్య విధానమెట్లు? దుర్గములను ఆటవికులను ఎట్లు సాధించవలెను? కంటకములను అనగా చోరులనులేక క్షుద్ర శత్రువు లను ఎట్లు శోధింపవలెను? ఇంకను ఇతరములైనవి నీ నేర్చినవి ఎల్ల తెలుపుమని రాజు అడుగగా, ప్రహ్లాదుడు నమస్కరించి వినయముతో ఇట్లు తెలిపెను. నాకు గురువుచే సర్వము ఉపదేశింపబడినది. అందు సందేహము లేదు. కాని ఇదియోగ్యమైనది కాదని నా అభిప్రాయము. సామ దాన భేద దండోపాయములు మిత్రాదులను సాధించుట విషయమై చెప్పబడినవి. అట్టి మిత్రాదులే నాకులేరు. కోపపడకుము సాధ్యములైన మిత్రాదులే లేనప్పుడు సాధనములు ఎందుకు? సర్వభూత నియామకుడును జగత్ప్రభుడును, జగన్మయుడును, పరమాత్మయు అగు గోవిందునియందు మిత్రామిత్రుల ప్రసక్తియే లేదు. భగవంతుడగు విష్ణువు నీయందు, నాయందు, ఇతరుల యందు కలడుకావున వీడు నాకు మిత్రము. ఇతడు నాకు శత్రువు అను విభాగమేలేదు. అట్టియెడ దుష్టములైన ఉద్యమములకు సంబంధించిన నీతిశాస్త్రాది వచనములతో ఏమి ప్రయోజనము. అవిద్యాంతర్గతములు అయిన వానిచే శోభనమగు ఆత్మయందు యత్నము కర్తవ్యము. అజ్ఞానులకు అవిద్యయందు విద్యాబుద్ధి కలుగును. బాలుడు మిణుగుఱుపురుగును కూడా అగ్నినిగా తలచును గదా!

బంధ హేతువుకాని కర్మయే కర్మ అనబడును. మోక్షమునకు ఉపయోగించు విద్యయే విద్య. ఇతర కర్మ వృధా ప్రయాసము కొఱకే. ఇతర విద్య కేవల శిల్పచాతుర్యము కొఱకే కావున దీనినంతను అసారముగ తలచి, ఉత్తమమైన సారమును వినిపించెదను. నమస్కరించి చెప్పుచున్నాను. రాజ్యమును గూర్చి ఎవడు యోచించడు? ధనమును ఎవడు కోరడు? అయినను ప్రాక్తనపుణ్యవశమున రాజ్యముగాని, ధనముగాని లభ్యమగును. అందరు రాజ్యధనాదికము కొరకు యత్నింతురు. అయినను అదృష్టములే సంపదలకు కారణములుగాని యత్నములు కావు. జడులు (యత్నము లేనివారు), అవివేకులు, శౌర్యహీనులు, నీతిలేనివారికి గూడ రాజ్యములు అదృష్టవశమున భోగ్యములగుచున్నవి. ఆ కారణముచే గొప్ప సంపదను కోరువాడు పుణ్యముల విషయమై యత్నించవలెను. మోక్షమును కోరువాడు భగవదాత్మకము అగుటచే అన్నిటియందు సమబుద్ధిని చేయవలెను. దేవతలు, మనుష్యులు, పశువులు, పక్షులు, వృక్షములు, పాములు అన్నియు ఆ అనంతుని రూపమే. విష్ణువు కంటె అది వేరుగా కనబడుచున్నది. ఈ సంగతి తెలిసినవాడు స్థావర జంగమాత్మక సర్వ ప్రపంచము అంతర్యామియగు ఆత్మతో కూడినదానిని చూడవలెను. విష్ణుదేవుడు విశ్వరూపుడు గదా! ఇట్లు తెలిసిన వానియెడ అనాదియగు పరమేశ్వరుడు, అచ్యుతుడు ప్రసన్నుడగును. అతడు ప్రసన్నుడుకాగా క్లేశములెల్ల నశించును అని పలుకగా,

ఆ ప్రహ్లాదుని వచనములు విని కోపముతో ఆసనము నుండి లేచి హిరణ్యకశిపుడు కుమారుని వక్షమును తన్ని మండిపడుచు జగమును నశింపచేయువానివలె ఓ విప్రచిత్తా! ఓ రాహో! ఓ బలా! నాగపాశములతో గట్టిగాకట్టి వీనిని సముద్రమున త్రోసివేయుడు. ఆలసింపవలదు. లేనియెడల అన్నిలోకములలోని దైత్యదానవులు ఈ దుష్టబుద్ధి యొక్క మతమును అనుసరింతురు. అనేకవిధములుగా మాచే నివారింపబడినను ఈపాపాత్ముడు శత్రు స్తోత్రములు చేయుచున్నాడు. దుష్టులను చంపుటయే మేలు! అని పలుకగా రాక్షసులు వెంటనే ప్రహ్లాదుని నాగపాశములతో బంధించి ప్రభువు ఆజ్ఞను పురస్కరించుకొని సముద్ర జలమున త్రోసిరి. చలించుచున్న ప్రహ్లాదునితో సముద్రముగూడ చలించి క్షోభించెను. అప్పుడు రాక్షసులతో హిరణ్యకశిపుడు “దైత్యేయులారా! ఈ సముద్రమునందే వీనిని పర్వతములచే సందులేకుండ కప్పివేయుడు. అగ్ని, శస్త్రములు, సర్పములు, వాయువు, విషము, కృత్యమాయలు, ఉన్నత ప్రదేశమునుండి త్రోయుట, దిగ్గజములు మున్నగు వానితో వీనిని చంపుటకు శక్యము కాలేదు. వీడు బ్రతికి ప్రయోజనములేదు. నీటి మధ్యమునందు పర్వతముతో ఆచ్ఛాదింపబడి ఉండుగాక! వేయి సంవత్సరములకైన చావగలడు” అని పలుకగా రాక్షసులు అట్లే చేసిరి. నీటిమధ్యమున పర్వతాక్రాంతుడై ఉన్న ప్రహ్లాదుడు నిత్య కృత్యాచరణ సమయమున ఏకాగ్రచిత్తముతో అచ్యుతుని ఇట్లు స్తుతించెను.

ప్రహ్లాద ఉవాచ: విష్ణుస్తుతి

నమస్తే పుణ్డరీకాక్ష ! నమస్తే పురుషోత్తమ

నమస్తే సర్వలోకాత్మ న్నమస్తే తిగ్మచక్రిణే

నమస్తే వాసుదేవాయ నమస్తే కరుణాకర

నమస్తే విశ్వరూపయనమ స్తేసర్వ మూర్తయే

నమోబ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయచ

జగద్ధితాయకృష్ణాయ గోవిన్దాయనమోనమః

బ్రహ్మత్వేసృజతే సర్వంస్థితౌ పాలయతే పునః

రుద్రరూపాయ కల్పాన్తే నమస్తుభ్యం త్రిమూర్తయే

దేవాయక్షాసురాస్సిద్ధానాగగన్ధర్వ కిన్నరాః

పిశాచారాక్షసాశ్చైవ మనుష్యాః పశవ స్తథాః

పక్షిణస్థ్సావరాశ్చై వపిపీలిక సరీసృపాః

భూమ్యమ్బ్వగ్నిర్న భోవాయుశ్శబ్దస్స్వర్శ స్తథారసః

రూపంగన్ధో మనోబుద్ధిరాత్మాకాల స్థథాగుణాః

ఏతేషాంపరమార్థ శ్చసర్వమేత త్త్వమచ్యుత

విద్యావిద్యేభవాంత్సత్య మసత్యంత్వం విషామృతే

ప్రవృత్తంచ నివృత్తంచ కర్మ వేదాదితం భవాన్

సమస్తకర్మ బోక్తాచకర్మో పకరణానిచ

త్వమేవివిష్ణోసర్వా ణిసర్వకర్మ ఫలంచయత్

మయ్యన్యత్రతథా శేషభూతేషుభువనేషు చ

తవై వవ్యాప్తిరై శ్వర్యగుణసంసూచకీ ప్రభో

త్వాంయోగినశ్చిన్తయ న్తిత్వారియజ న్తివయాజకాః

హవ్యకవ్యభుగేక స్త్వం పితృదేవస్వరూపధృత్

రూపం మహత్తే అచ్యుత! యత్రవిశ్వం తతశ్చసూక్ష్మంజగదేతదీశ

రూపాణిసూక్ష్మాణిచభూత భేదా స్తేష్వ స్తరాత్మాఖ్యమతీవసూక్ష్మమ్

తస్మాచ్చసూక్ష్మాదివి శేషణానామగోచరేయత్సరమాత్మరూపమ్

కిమప్యచి న్త్యంత వరూపమ స్తి తస్మైనమ స్తేపురుష్తోమాయ

సర్వభూతేషుసర్వాత్మన్ యాశక్తిరపరాతవ

గుణాశ్రయానమ స్తస్యై శాశ్వతాయై పరేశ్వర

యాతీతగోచరావాచాం చసాంచావిశేషణా

జ్ఞానిజ్ఞానపరిచ్ఛేద్యాతాంవన్దేచేశ్వరీంపరామ్

ఓంనమోవాసుదేవాయ తస్మైభగవతే సదా

వ్యతిరి క్తంనయస్యాస్తి వ్యతిరిక్తో అఖిల స్వయః

నమస్త స్మైనమస్తస్మైనమస్తస్మై మహాత్మనే

నామరూపం నయస్యాస్తియో అస్తిత్వేనోపలభ్యతే

యస్యావతారరూపాణి సమర్చ న్తిదివౌకసః

అపశ్యన్తః పరంరూపంనమస్త స్మైపరాత్మనే॥

యో అన్తస్తిష్ఠన్న శేషస్య పశ్యతీశ శ్శుభాశుభమ్

తంసర్వసాక్షిణం విష్ణుంనమస్యే పరమేశ్వరమ్

నమో అస్తువిష్ణవేత స్మై యస్యాభిన్నమిదం జగత్

ధ్యేయస్స జగతామాద్యస్స ప్రసీదతుమే అవ్యయః

యత్రోతమేతత్ర్పోతంచ విశ్వమక్షర సంజ్ఞకే

ఆధారభూతస్సర్వస్య సప్రసీదతుమేహరిః

ఓం నమోవిష్ణవేతస్మై నమస్తస్మైపునః పునః

యత్రసర్వం యతస్సర్వంయస్సర్వం సంశ్రయశ్చయ

సర్వగత్వాదన న్తస్య స ఏవాహమనస్థితః

మత్తస్సర్వమహం సర్వం మయిసర్వంసనాతనే

అహమేవావ్యయోనిత్యః పరమాత్మాత్మ సంశ్రయః

బ్రహ్మసంజ్ఞో అహ మేవాగ్రే తథా అన్తేచ పరః పుమాన్

ప్రహ్లాదునిచేత చేయబడిన విష్ణు స్తుతి:

పుండరీకాక్షా! పురుషోత్తమా! సర్వలోకాత్మకా! తీక్ష్ణ సుదర్శన చక్రధారీ! బ్రహ్మజ్ఞానులకు ధ్యేయభూతుడా! గోబ్రాహ్మణ హితకరా! జగద్ధితవరా! గోవిందా! నమస్కారము. సృష్టి కాలమున బ్రహ్మగను ఉండు, త్రిమూర్తి స్వరూపుడవగు నీకు నమస్కారము. దేవాదులు, రాక్షసులు, మనుష్యులు, పశువులు, పక్షులు, స్థావరములు, చీమలు, పాములు, పంచభూతములు వాని గుణములగు శబ్దము స్పర్శ, రూప, రస, గంధములు మనస్సు, బుద్ధి, అహంకారము, కాలము వీని అన్నిటి పరమార్థమును నీవే. విద్య అవిద్య సత్యము అసత్యము, విషము, అమృతము, ప్రవృత్తి, వేదవిదిత కర్మయు నీవే.

సమస్త కర్మఫల భోక్తవు నీవే. కర్మఫలము నీవే. నాయందు, తదితరులయందు, ప్రాణులందు, భువనములందు నీవు వ్యాపించి ఉండుట నీ ఐశ్వర్యమును సూచించును. యోగులు నిన్నే ధ్యానింతురు. యజ్ఞకర్తలు నిన్నే ఆరాధింతురు. దేవతల కొఱకు హోమము చేయబడిన ద్రవ్యమును, పితృదేవతారూపము ధరించియు, భుజించువాడవు నీవే. ఈ విశ్వమంతయు నీ మహద్రూపము. ఇంకను సూక్ష్మముగ ఉండు రూపము నీవే. దానికంటె పరమై, సూక్ష్మాది భేదములకు అగోచరమగు ఏ పరమాత్మ రూపముగలదో అది అచింత్య మైనది. అది నీవే. అట్టి పురుషోత్తముడవగు నీకు నమస్కారము.

సర్వాత్మకా! సర్వ భూతములందు సత్వాది గుణములను ఆశ్రయించియున్న ఏ నీ అపరాశక్తి (ప్రకృతి) కలదో, ఆ శక్తికి నమస్కారము. వాక్కునకు మనసునకు గోచరము కానిదై, నిర్విశేషమై, బ్రహ్మజ్ఞానుల జ్ఞానమునకు మాత్రము లక్ష్యమగు స్వతంత్రమైన పరాశక్తి (చిచ్ఛక్తి)కి నమస్కరింతును. సమస్త జగన్నివాసభూతుడు ప్రకాశరూపుడు, షడ్గుణై శ్వర్య సంపన్నుడు అగు వానికి నమస్కారము. ఎవనికి వేరైనది లేదో (సర్వము తదాత్మకము కావున) సమస్తముకంటే ఎవడు వ్యతిరిక్తుడో (కార్యరూపమగు జగత్తుకంటె వేరైనవాడు కావున) వానికి నమస్కారము. నామరూపములు ఎవనికి (క్షేత్రజ్ఞునకు) లేవో, ఏ ఒకడు ఉన్నట్లు గోచరించుచు (బ్రహ్మగ) ఉన్నాడో వానికి నమస్కారము. ఎవని పరరూపమును చూడ లేక వాని అవతార రూపములనే ఆరాధించుచున్నారో, అట్టి మహాత్మునకు నమస్కారము.

ఎవడు సర్వహృదయములందు ఉండి శుభాశుభ కర్మలను ఎల్ల సాక్షిగ చూచుచున్నాడో, విశ్వరూపుడైన ఆ సర్వసాక్షి అగు పరమేశ్వరునికి నమస్కరించెదను. ఎవడు సర్వవ్యాపకుడో ఎవనికంటె జగత్తు భిన్నముకాదో, ఆతడు సర్వధ్యేయుడు సర్వజగదాద్యుడు నాశరహితు. అయిన అతడు ప్రసన్నుడగుగాక! వస్త్రమెట్లు పడుగు దీర్ఘతంతువులందు గ్రధితమై అడ్డతంతువులందు అనుస్యూతమై ఉన్నదో, అట్లే ఏ పరమాత్మ యందు ఓతప్రోత భావమున సర్వ ప్రపంచము ఆధారపడి ఉన్నదో, అట్టి అవ్యయమై, అక్షరసంజ్ఞతో ఒప్పు ప్రధాన మహదాది రూపమున ఉన్న శ్రీహరి ప్రసన్నుడగు గాక! ఎవ్వనియందు (ప్రళయమున) సర్వము కలదో ఎవ్వనివలన (సృష్టియందు) సర్వము వచ్చుచున్నదో ఎవడు (స్థితికాలమున) సర్వరూపుడుగ ఉండునో అట్టి సర్వాధారుడును సర్వవ్యాపకుడు అగు పరమాత్మకు నమస్కారము. అనంతుడు అంతటను ఆత్మరూపుడుగా ఉండుటచేత నేనా అనంతుడనే అయివున్నాను. సనాతనుడనగు నాయందే సర్వమున్నది. నాశరహితుడను, నిత్యుడను, పరమాత్మను, స్వమహిమయందు ప్రతిస్థితుడను, బ్రహ్మసంజ్ఞ కలవాడను నేనే. సృష్టికి పూర్వమందు ప్రళయానంతరమందు సర్వాతీతుడనై ఉన్న పురుషుడను నేనే.

నృసింహావతారము

అని పలికి ఇంకను పరాశరుడు ఇట్లనెను: ఓ బ్రాహ్మణుడా! ప్రహ్లాదుడు ఇట్లు విష్ణువును తనకంటే భిన్నుడు కానివానిగా భావించుచు ఉత్కృష్టమైన తన్మయత్వమును పొంది తనను అచ్యుతునిగా తలంచెను, తనను మరచెను. ఇతరము ఎఱుంగడయ్యెను. అవ్యయుడు అనంతుడు అగు పరమాత్మ నేనే అని తలంచెను. అట్టి విష్ణు తాదాత్మ్యభావనా యోగమువలన, క్రమముగా పాపపము ఇంకిపోగా శుద్ధాంతఃకరణమునందు జ్ఞాన మయుడగు అచ్యుతుడు నిలచెను. రాక్షసుడగు ప్రహ్లాదుడు యోగ ప్రభావమున విష్ణుమయుడై చలింపగా, నాగబంధములు అన్నియు తెగిపోయెను. భ్రమించుచున్న జలచర సంకులమై, తరంగములతో కూడిన సముద్రము క్షోభిల్లెను. పర్వతారణ్యములతో కూడిన భూమి కంపించెను. రాక్షసులచే తనపై ఉంచబడిన పర్వత సంఘాతమునెల్ల లేవనెత్తి, బుద్ధి మంతుడగు ప్రహ్లాదుడు పైకి వచ్చి ఆకాశాదులతో గూడిన జగత్తునుచూచి, తాను ప్రహ్లాదుడనని మనసునందు స్మరించెను. బుద్ధిశాలియగు అతడు త్రికరణములను నియమించుకొని ఏకాగ్రచిత్తుడై అనాదియగు పురుషోత్తముని తొట్రుపాటు లేకుండ ఈవిధముగా స్తుతించెను.

ప్రహ్లాద ఉవాచ:

ఓం నమః పరమార్థార్థ స్థూలసూక్ష్మ క్షారాక్షర

వ్యక్త్యాక్త కళాతీత సకలేశ నిరంజన

గుణాంగస గుణాధార నిర్గుణాత్మన్ గుణస్థిత।

మూర్తిమూర్త మహామూర్తే సూక్ష్మమూర్తే స్ఫుటా స్ఫుటః

కరాళ రూప సౌమ్యాత్మన్ విద్యావిద్యా మయాచ్యుత

సదసద్రూప సద్భావ సదసద్భావ భావన

నిత్యానిత్య ప్రపంచాత్మ నిష్ప్రపంచి మలాశ్రిత

ఏకానేక నమస్తుభ్యం వాసుదేవాది కారణ

యస్థ్సూల సూక్ష్మ ప్రకట ప్రకాశో యస్సర్వభూతో నచసర్వభూతః

విశ్వం యతశ్చైత దవిశ్వహేతో నమోస్తు తస్మై పురుషోత్తమాయ॥

పరమార్థ జ్ఞానరూపా! స్థూల సూక్ష్మరూపా! క్షరాక్షర రూపా! వ్యక్తావ్యక్త రూపా! సకల నిష్కల (సావయవ నిరవయవ) రూపా! నిర్లేపరూపా! సగుణ నిర్గుణరూపా! సమస్త గుణాధారా! మూర్తామూర్త రూపా! వ్యక్తావ్యక్త స్వరూపా! కరాల సౌమ్య స్వరూపా! విద్యా అవిద్యా రూపా! సదసద్రూప! కారణభూతా! సదసద్భావనాభిజ్ఞా! నిత్యానిత్య ప్రపంచ రూపా! ప్రపంచాతీతా! జ్ఞానులచే ఆశ్రయింపబడినవాడా! కారణ రూపమున ఏక రూపా! కార్య రూపమున అనేక రూపా! వాసుదేవా! ఆదికారణభూతుడా! నమస్కారము. స్థూలరూపమున ప్రకటమైన వాడును, సూక్ష్మ రూపమున అప్నవానుడును సర్వ భూతరూపుడు సర్వ భూతాతీతుడు, విశ్వహేతుభూతుడు జీవుల కర్మానుసారము సృష్టికి కర్తయు. అంతియే కాని నిజమునకు విశ్వహేతువు కానివాడును అగు పురుషోత్తమునకు నమస్కారము.”

ఇట్లు స్తుతించుచుండగా పీతాంబరధారియై శ్రీహరి సాక్షాత్కరించెను. వెంటనే ప్రహ్లాదుడు చూచి తత్తరపాటుతో లేచి “నమోస్తు విష్ణవే” అని అడుగడుగు అనుచు స్వామీ! శరణాగతార్తిహరా! అనుగ్రహింపుము! కటాక్షమునెరపి నన్ను పవిత్రుని చేయుము అని పలుకగా భగవానుడు “నాయందు స్థిరమగు భక్తితో స్తోత్రము చేయుచున్న నీకు ప్రసన్నుడనైతిని. అభీష్టమును కోరుకొనుము” అనెను. అపుడు ప్రహ్లాదుడు “అచ్యుతా నేనే జన్మమెత్తినను, నీయందు అనపాయినియగు భక్తి కలిగి ఉందును!” వివేకహీనులకు విషయములందు ఎట్టి గాఢ ప్రీతి ఉండునో, ఆ ప్రీతి నీ యందు నిన్ను స్మరించుచుండు నాకు కలుగుగాక!” అని పలుకగా, భగవానుడు నాయందు నీకు భక్తిగలదు కదా! ఇంకను ఉండును. నీకు అభీష్టమైన వరము కోరుకొనుమనెను. ప్రహ్లాదుడు ఇట్లు కోరెను.

శ్లో!! మయిద్వేషాను బంధో భూత్యం స్తుతా వుద్యతే తవ

మత్పితు స్తత్కృతం పాపం దేవత స్య ప్రణశ్య తు

శస్త్రాణి పాతితా న్యంగే క్షిప్తో యచ్ఛాగ్ని సంహతౌ

దంశితశ్చోరగై ర్దత్తం యద్విషం మమ భోజనే

బద్ధ్వా సముద్రే యత్ క్షిప్తో యచ్చితోఽస్మిశిలోచ్చయైః

అన్యాని చాప్య సాధూని యాని పిత్రా కృతాని మే

త్వయి భక్తి మతో ద్వేషాదఘం తత్సంభవం చయత్

త్వత్ప్రసాదాత్ప్రభో సద్యస్తే నము చ్యేత మేపితా

“నేను నిన్ను స్తుతింప ప్రయత్నించగా, నాతండ్రికి నీపై ద్వేషముకలిగెను. దానివలన ఆతనికి కల్గినపాపము నశించుగాక! శస్త్రములు, అగ్ని, సర్పములు, విషాన్నము, సముద్రము, పర్వతములు మున్నగు వానితో నన్ను అనేక విధముల మా తండ్రి బాధించెను. అందు వలన కలిగిన పాపము నశించు గాక! నీ అనుగ్రహముచే నా పాప విముక్తి అగుగాక!” అని ప్రార్థించెను. అంతట శ్రీమహావిష్ణువు

“నా అనుగ్రహముచే అన్నియు జరుగును. మరియొక వరము కోరుకొనుము” అనెను. ప్రహ్లాదుడు ఇట్లు కోరుకొనెను. “ నీయందు చలించని భక్తి ఎల్లప్పుడు కలుగుగాక! ధర్మార్థ కామములతో ఏమి ప్రయోజనము? సమస్త జగన్మూలకారణుడగు శ్రీహరియందు స్థిరమగు భక్తిగల వానికి ముక్తి కరతలామలకమే” అనగా భగవంతుడు ఇట్లనెను. “నీ చిత్తము అచంచలమై నాయందు ఉన్నట్లే నా అనుగ్రహముచే నీవు మోక్షమును పొందగలవు” అని పలికి మైత్రేయా! అతడు చూచుచుండగనే భగవానుడు అంతర్హితుడు ఆయెను. ప్రహ్లాదుడు తండ్రి వద్దకు వెళ్ళి పాదములకు మ్రొక్కగా, తండ్రి వాని శిరము మూర్కొని కౌగలించి “వత్సా! బ్రతికియుంటివా” అని బాష్పార్థలోచనుడై, పశ్చాత్తప్తుడై, ప్రేమ కలవాడయ్యెను. ధర్మవేత్త అగు ప్రహ్లాదుడు గురుజనకులకు విశేషభక్తితో సేవచేసెను.

నృసింహరూపియైన విష్ణు భగవానునిచే ఉపాధిపోగా, ప్రహ్లాదుడు అనుభవముచే కర్మశుద్ధిని కలిగించు రాజ్యలక్ష్మిని పొంది పుత్రపౌత్రాదైశ్యర్యము పొంది క్షీణింప, ప్రారబ్ధకర్మ పుణ్యపాపరహితుడై భగవద్ధ్యానమువలన ముక్తినొందెను. “మైత్రేయా! ఏ ప్రహ్లాదుని గురించి నన్ను నీవడిగితివో ఆ రాక్షసుడగు ప్రహ్లాదుడు ఇట్టి మహామతి. ఇట్టి మహానుభావుని చరితమును విన్నవాని పాపములు వెంటనే నశింపగలవు. నిరంతర కృత పాపముకూడ ఏతచ్చరిత్ర పఠనమునను, శ్రవణమునను నశించును. సందేహము లేదు. పూర్ణిమ, అమావాస్య, అష్టమి, ద్వాదశి తిథులందు పఠించిన యెడల గోదాన ఫలము కలుగును. శ్రీహరి సర్వాపదలందు ప్రహ్లాదుని రక్షించినట్లే, తచ్చరిత శ్రవణమొనరించిన వానినికూడ సదా రక్షించును. 

ప్రహ్లాద వంశ విస్తారము

ప్రహ్లాదుని పుత్రులు శిబి, బాష్కలుడు, విరోచనుడు అను మువ్వురు. విరోచనుని కుమారుడు బలి. బలికి నూర్గురుపుత్రులు. బాణుడు పెద్దవాడు. హిరణ్యాక్షుని కుమారు లందరు మహాబలశాలులు ఝుర్ఝరుడు, శకుని, భూతసంతాపకుడు, మహానాభుడు, మహాబాహువు, కాలనాభుడు అనువారు. దనుపుత్రులు: ద్విమూర్ధుడు, శంబరుడు, అయోముఖుడు, శంకుశిరుడు, కపిలుడు, శంకరుడు, ఏకచక్రుడు, మహాబలుడగు తారకుడు, రాహువు, వృషపర్వుడు, పులోముడు వీరుడగు విప్రచి. స్వర్భాను (రాహువు) పుత్రిక ప్రభ వృషపర్వుని కన్య శర్మిష్ట, ఉపధాని, హయశీర్ష కూడ వానికన్యలే. వైశ్వానరుని కన్యలు పులోమ, కాలక అను ఇద్దరు. ఈ ఇద్దరు మారీచుని భార్యలు. వారివలన పుత్ర సహస్రము కలిగెను. దనుపుత్రులు అరువది మంది. పౌలోములు కాలకేయులు మారీచ తనయులు ఇంకను సింహిక (హిరణ్యకశిపుని సోదరి) విప్రచిత్తికి కలిగినవారు మహావీరులు నిర్దయులు కఠినులు త్ర్యంశుడు, శల్యుడు, నభుడు, మహాబలశాలులు. వాతాపి, నముచి, ఇల్వలుడు, ఖసృముడు, అంధకుడు, అరకుడు, కాలనాభుడు, స్వర్భానువు, మహావీర్యుడు, వక్త్ర, యోధి, మహాసురుడు, వీరు దనువంశోద్ధారకులగు దానవులు. వీరి పుత్ర పౌత్రులు వందలు వేలు కలరు.

గొప్పతపస్సుచే భావితాంతఃకరణుడగు ప్రహ్లాదునకు నివాతకవచులు పుట్టిరి. తాశ్రుకు మహాబలశాలురగు ఆరుగురు సుతులు కలిగిరి. శుకి, శ్యేని, భాసి, సుగ్రీవి, శుచి, గృద్ధ్రక అని వారి నామధేయములు. శుకి, శుకము (చిలుక)లను, గుడ్లగూబలను, కాకులను కనెను. శ్యేని, డేగలను, భాసిభాసములను, గృద్ధ్రి గ్రద్దలను, శుచి నీటి పక్షులను, సుగ్రీవి అశ్వములను, ఒంటెలను, గాడిదలను కనెను. తామ్రా వంశము కీర్తింపబడినది. వినతయొక్క పుత్రులిద్దరు. గరుడుడు, అరుణుడు. సుపర్ణుడు (గరుడుడు) పక్షులలో శ్రేష్ఠుడు. కఠినుడు సర్పముల భక్షించును. సురసయందు మిక్కిలి ఓజస్సుగలవియు అనేక శిరములు కలవియు ఆకసమున సంచరించుచు మహా ప్రభావ సంపన్నములగు సర్ప సహస్రములు పుట్టెను. కద్రువవలన పుట్టిన సహస్ర సంఖ్యాకములు అయిన అనేక శిరస్కములు బలశాలులు ఓజోపవంతములును అగు సర్పములు గరుడ వశమైరి. వానిలో ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు, శంఖశ్వేతుడు, మహాపద్ముడు, కంబలుడు, అశ్వతరుడు ప్రధానులు. ఏలాపుత్రుడు కర్కోటకుడు ధనంజయుడు ఇంక మరికొన్నియు విషప్రాబల్యము కలవి. ఈ సముదాయము క్రోధవశురాలు అగుట వలన కలిగినది. వీనికి కోరలుకలవు. ఇవి స్థలజములు, జలజములు, పక్షములు కలవి. క్రూరములు మాంసాశనములు. కోపము వలన పిశాచములను పుట్టించెను. గోవులను, గేదెలను పుట్టించెను. ఇరవృక్షములు, లతలు, కల్లులు, తృణజాతులను అంతట పుట్టించెను. ఖశ (స్వస), యక్షలను, రాక్షసులను పుట్టించెను. ముని అప్సరసలను అరిష్టమహాబలోపేతులగు గంధర్వులను సృజించెను.

ఇవి అన్నియు కశ్యప ప్రజాపతి దాయాదులగు స్థావరజంగములని చెప్పబడును. వారి పుత్రులు, పౌత్రులు వందలకొలది వేలకొలదిగలరు. ఇది స్వారోచిష మన్వంతర సృష్టి.

వైవస్వత మన్వంతర సృష్టి:

వైవస్వత మన్వంతరమునందు వరుణుడు చేయుచున్న గొప్ప క్రతువునందు హోతగా ఉన్న బ్రహ్మయొక్క సృష్టి ఇచట చెప్పబడుచున్నది. గంధర్వాదులకు పూర్వము పుట్టిన మన్వంతరీయులగు, మనోజాతులగు, సప్తర్షులను బ్రహ్మ స్వయముగ గంధర్వ సర్వ దేవతలను, దానవులకును, పుత్ర ప్రభావమున కల్పించెను. దితి నష్టపుత్రులు గలదై కశ్యప ప్రజాపతిని సేవించెను. కశ్యపుడు సంతోషించి వరమిచ్చెదను అనెను. ఆమె ఇంద్రుని వధనిమిత్తమె సమర్ధుడు ప్రతాపశాలియగు పుత్రునికోరెను. భార్యకు కశ్యపుడు వరమిచ్చి ఇట్లనెను. “నీ గర్భమును నూరు సంవత్సరములు శౌచవతివై జాగ్రతతో ధరించెదవేని నీ పుత్రుడు ఇంద్రుని చంపగలడు” అని కశ్యపుడు చెప్పెను. ఆమె గర్భవతి ఆయెను. నియమవతియై ఆమె గర్భ సంరక్షణము చేయుచుండెను. ఆ గర్భము తన పదార్థమై ఏర్పడెనని తెలిసికొని, ఇంద్రుడు వినయాన్వితుడై ఆమె సన్నిధికి ఏతెంచి సమయముకొరకు నిరీక్షించుచుండెను. వర్షశతము పూర్తికాక పూర్వమొక అవకాశము చిక్కెను. దితి పాదప్రక్షాళన శౌచమును చేసికొనక పరుండెను. ఆమె గర్భమున చేరిన దేవేంద్రుడు నిద్రను తెప్పించెను. ఇంద్రుడు వజ్రపాణియై, ఆ గర్భమును ఏడు ఖండములు చేసెను. వజ్రముచే పీడించుచుండగా, గర్భస్థ పిండము ఘోరముగా ఏడ్చెను. ఏడ్వవలదని ఇంద్రుడు మాటిమాటికి అనుచుండెను. ఆ గర్భము ఏడు ఖండములాయెను. ఇంద్రుడు కోపించి వజ్రముతో ఆగర్భ ఖండములను ఒక్కొక్క దానిని ఏడు భాగములుగ ఛేదించెను. ఆ ముక్కలు మహావేగవంతులైన మరున్నామక దేవతలైరి. భగవంతుడు చెప్పిన విధముగ, ఆ నలుబది తొమ్మండుగురు మరుదేవులు వజ్రపాణికి సహాయభూతులైరి.

పృథురాజ్య పట్టాభిషేకము

పూర్వము పృథుచక్రవర్తిని మహర్షులు రాజ్యమునందు అభిషేకించిన వెనుక క్రమముగ బ్రహ్మ రాజ్యములను ఈయ మొదలిడెను. నక్షత్రములు, గ్రహములు, లతలు, యజ్ఞములు, తపస్సుల రాజ్యమునందు సోముని (చంద్రుని) పతిగ ఉంచెను. రాజుల రాజ్యమున కుబేరుని జలముల రాజ్యమును వరుణుని ఆదిత్యుల రాజ్యమున విష్ణువును, వసురాజ్యమున అగ్నిని, ప్రజాపతుల రాజ్యమున దక్షుని, అదితి పుత్రులగు మరుత్తుల రాజ్యమున వాసవుని (ఇంద్రుని), దైత్యదానవుల రాజ్యమున, ప్రహ్లాదుని అధిపతులుగ జేసెను. పిత్రుదేవతలకు యమధర్మరాజును, గజేంద్రములకు ఐరావతమును, పక్షులకు గరుత్మంతుని, దేవతలకు వాసవుని, అశ్వములకు ఉచ్చైశ్రవములను, గోవులకు వృషభమును, మృగములన్నిటికిని సింహమును, సర్పములకు శేషుని, స్థావరములకు హిమవత్పర్వతమును, మునులకు కపిల మహామునిని, నఖములు, కోరలు ప్రధానముగా గల మృగములకు వ్యాఘ్రమును, వనస్పతులకు ప్లక్షము (జువ్విచెట్టు)ను ఇతరములకు కూడ ఇట్లే ప్రాధాన్యమును పురస్కరించుకొని రాజ్యాధిపతుల చేసెను. ఇట్లు రాజ్యములను విభజించి దిక్పాలకులను కూడ బ్రహ్మ ఏర్పాటు చేసెను.

తూర్పు దిక్కునందు వైరాజప్రజాపతి పుత్రుడగు సుధన్వుని, దక్షిణ దిక్కునందు కర్దమ ప్రజాపతి పుత్రుడగు శంఖపదుని, పశ్చిమదిక్కునందు రజపుత్రుడును నాశరహితుడును అగు మహానుభావుడు కేతుమంతుని, ఉత్తర దిక్కునందు పర్జన్య ప్రజాపతి పుత్రుడును ఏరికిని ఎదుర్కొన శక్యము కానివాడు, హిరణ్యరోముడు అనువానిని, బ్రహ్మ రాజులుగ నభిషేకించెను. ఆదిక్పాలకులచే నీ సప్తద్వీపములు పట్టణములతో ఒప్ప, భూమి అంతయు వాని ఆదేశమును మీరక ధర్మమును పురస్కరించుకొని ఇప్పటికిని పరిపాలింపబడుచున్నది. వీరందరు ప్రపంచస్థితి (పరిపాలనము) యందు ప్రవర్తించిన మహానుభావుడగు విష్ణుదేవుని విభూతు (ఐశ్వర్య)లే. ఇంక ఇతర రాజులు కాబోవువారు పూర్వము అయిన వారు, ఇప్పుడు ఉన్నవారు అందరును సర్వభూతమయుడగు విష్ణువు యొక్క అంశ భూతులు. దేవ, దైత్య, దానవ, రాక్షస, పశు, పక్షి, మనుష్య, సర్ప, నాగ, వృక్ష, పర్వత, గ్రహ, ప్రభువులు అతీతులు వర్తమానులు భావులు వారందరు విష్ణుదేవుని అంశవలన పుట్టినవారే.

పరిపాలనాసామర్థ్యము సర్వేశ్వరుడగు విష్ణువును వదలి మరి ఎవ్వరికిని ఉండదు. ఈతడే సృష్టికాలమునందు రజోగుణాశ్రితుడై, సృష్టిని, స్థితికాలమున సత్త్వగుణా శ్రితుడై, పరిపాలనమును, ప్రళయకాలమున తమోగుణాశ్రితుడై, ఒక అంశచే బ్రహ్మగను అవ్యక్త రూపుడు అయ్యెను. రెండవ అంశచే మరీచ్యాది ప్రజాపతులైరి. మూడవ అంశ కాలముగ అయ్యెను. నాల్గవయంశ సర్వభూతములు ఆయెను. స్థితికాలమున సత్వగుణా శ్రితుడై, ప్రథమాంశచే విష్ణువుగనై, పాలనము చేయుచున్నాడు. రెండవ అంశచే మన్వాది రూపుడు గను మూడవ అంశచే కాలరూపుడుగను నాల్గవ అంశచే సర్వ ప్రాణులందు నుండి స్థితిని (పరిపాలనమును) చేయుచున్నాడు. అంత కాలమునందు తమోగుణాశ్రితుడై ప్రథమాంశచే రుద్ర రూపుడుగను, రెండవ అంశచే అగ్ని, అంతకుడు (యముడు) మున్నగు రూపములతోను, మూడవ అంశలో కాలస్వరూపుడుగను, నాల్గవ అంశలో సర్వభూతముగనునై వినాశము చేయుచున్నది. ఈ విభాగము సార్వకాలికము.

బ్రహ్మ దక్షుడు మున్నగువారు, కాలుడు జంతువులు అన్నియు ఇవి అన్నియును జగత్తుయొక్క సృష్టి కారణములైన హరివిభూతులు. విష్ణువు, మనువు, మొదలైనవారి కాలము సర్వభూతమును, ఇవి అన్నియు స్థితికి నిమిత్తమగు విష్ణువుయొక్క విభూతులు. రుద్రుడు, కాలుడు, అంతకుడు మున్నగువారు సమస్త జంతువులు ఇవన్నియు ప్రళయమునకు నిమిత్తమగు జనార్దనుని విభూతులు. సృష్టి జగదాదియందు మధ్యమందు అంతము నందును ధాత మరీచ్యాదులచేత చేయబడుచున్నది.

ఆ కాలమునందు బ్రహ్మ సృష్టిచేయును. తరువాత మరీచ్యాదులు. జంతువులు, పక్షులుకూడ ప్రతిక్షణము సృష్టించుచుండును కాలరూపమగు విభూతిలేకుండ బ్రహ్మగాని, ప్రజాపతులుగాని సమస్త జంతువులుగాని సృష్టిని చేయజాలవు. స్థితిని, లయమును చేయజాలవు. ఏ ప్రాణిచేత సృష్టి స్థితి లయములు చేయబడుచున్నను, వానికెల్ల నిమిత్తము హరి శరీరమే. ఈ విధముగ సృష్టి స్థితి లయములకు జనార్ధనుడే కర్త. త్రిగుణ ప్రవృత్తిచే ఇట్లు మూడు విధములై నాలుగు అంశలతో ఉండును. గుణ ప్రకృతి రహితమైన పరమ పదము మహత్తు. అది జ్ఞానమయము. వ్యాపకము, స్వప్రకాశము, సాటిలేనిది, పరమాత్మ స్వరూప మగు ఆ పదముకూడా నాలుగురీతులు గలది.

మైత్రేయుడు “ఆ పరమపదము బ్రహ్మరూపమే గదా! దానికి చాతుర్విద్యము ఎట్లు?” అని పలుకగా పరాశరుడు సర్వవస్తువులకును కారణమైన దానినే సాధనము అందురు. దానిచే సాధించుటకు అభిమతమైన వస్తువే సాధ్యము. ముక్తిని కోరిన యోగికి ప్రాణాయామ ఆదికము సాధనము. పునరావృత్తి రహితమైన పరబ్రహ్మ సాధ్యము. యోగులకు ముక్తి కొరకై యోగశాస్త్ర జన్యమైన ప్రాణాయామాది సాధన విషయమైన జ్ఞానమే. చతుర్భేద జ్ఞానభూత బ్రహ్మ యొక్క మొదటి భేదము.

క్లేశ నివృత్తి కొఱకై యోగమును అభ్యసించుచున్న యోగికి సాధ్యమగు బ్రహ్మ విషయకము అగు జ్ఞానము రెండవ భేదము. (అనగా సాంఖ్య జన్యమగు ప్రకృతి వివిక్తాత్మ విషయక విశిష్ట జ్ఞానము.) సాధ్యసాధన విభాగరహితమై, పరస్పరైక్య భావముతో “బ్రహ్మై వాహం” “ఆహమేవ బ్రహ్మ” అనెడి దేవ మనుష్యాది ద్వైత రహితాత్మ విషయ ప్రచురమైన విజ్ఞానము మూడవ భేదము.

పైన చెప్పబడిన మూడు జ్ఞానముల (1. నేను దేహాది విలక్షణుడను; 2. సచ్చిదా నంద రూపమగు బ్రహ్మను, 3. బ్రహ్మను నేనే) యందలి విశేషాంశ పరిత్యాగ పూర్వకముగ చూపబడిన నిర్విశేషాత్మ స్వరూపము కలదియు, వ్యాపారశూన్యము (సాధన అనుష్ఠాన రహితము) నాకు రూపగోచరము కానిదియు, వ్యాపించునదియు, సాటిలేనిదియు, స్వప్రకాశము, సత్తామాత్రము, (అపక్షయాది రహితము) స్త్రీత్వాది లింగ గమ్యము కానిదియు ప్రశాంతము = ఆశనాయాది షడూర్మి రహితము, శుద్ధము = కర్మ రహితము, ఊహాతీతము, ఆశ్రయ శూన్యమును బ్రహ్మ సంజ్ఞత మగు జ్ఞానమయుడగు విష్ణు జ్ఞానము నందు ఇతర జ్ఞాన నిరోధముచే అంతిమ జ్ఞానబలముచే లయమును పొందు యోగులు, సంసార కేదారమునందు నిర్బీజతను అనగా పునరావృత్తి లేకపోవుటను పొందుదురు. ఇదియే విష్ణు పదము.

ఇది పాపశూన్యము, శాశ్వతము, వ్యాపకము, నాశరహితము. హేయ శూన్యము. పునరావృత్తి శూన్యము. పాపనాశము కాగా క్లేశ ధ్వంసము కాగా, నిర్మలుడై ఈ పదము నందును. బ్రహ్మ రూపములు రెండు. అక్షరము, లక్షరము. మూర్తము అమూర్తము. ఇవి సర్వభూతములందు గలవు. ఆ పరబ్రహ్మ అక్షరరూపము. సమస్త జగత్తు అక్షర రూపము. ఒక ప్రదేశమున ఉన్న అగ్నియొక్క కాంతి విస్తరించినట్లు పరబ్రహ్మ శక్తియే ప్రపంచము. సామీప్య దూరత్వాదులచే అగ్నికి బహుత్వ అల్పత్వములవలె తచ్ఛక్తికి కూడ తారతమ్యముండును. బ్రహ్మశక్తులయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రధానులు. దేవతలు దక్షాదులు అంతకంటె న్యూనులు. అంతకంటె మనుష్యులు అంతకంటె పశువులు మున్నగు వారు అల్పులు, అల్పతరులు. ఓ మునివరా! ఈ జగత్తంతయు నిత్యము అక్షరము. ఆవిర్భావ తిరోభావములచే జన్మనాశ వికల్పములు కలుగుచుండును.

ప్రవాహమువలె అది నిత్యము. సర్వశక్తిమయుడు విష్ణువు. బ్రహ్మ యొక్క పర స్వరూపము. అందు మూర్తరూపమును యోగులు యోగారంభమునందు ధ్యానింతురు. మనస్సు ఏకాగ్రముకాగా, విద్యరూప విషయము కూడినదగుటచే సాలంబమై, మంత్రాను సంధానాది యుక్తమగుటచే సబీజమైన మహాయోగము యోగులకు సమాధి పర్యంతము ఆ రూపమున కలుగును. ఆ విష్ణువు సర్వశక్తులకంటె ఉత్కృష్ణుడు. అపరరూపము బ్రహ్మకు సన్నిహితము. బ్రహ్మ మూర్తరూపుడు. హరి సర్వ బ్రహ్మమయుడు. ఆ హరియందే సమస్త జగత్తు తపోప్రభావమున ఉన్నది. పడుగుపేకగా అల్లుకొన్నది. ఆయన వలన జగత్తు. జగత్తునందు ఆ హరి. క్షరాక్షరరూపుడగు శ్రీహరి భూషణాస్త్ర స్వరూపముగల పురుష ప్రకృతి రూపమగు జగత్తును భరించుచున్నాడు.

మైత్రేయుడు పలికెను:

“భూషణ అస్త్ర స్వరూపమున ఉన్న ఈ జగత్తును విష్ణువు భరించుచున్న సంగతిని తెలుపుదురు అని ప్రార్థించుచున్నాను”

పరాశరుడు పలికెను:

సమర్థుడును అప్రమేయుడు అగు విష్ణుదేవునకు నమస్కరించి, వశిష్ఠునిచే నాకు చెప్పబడిన విషయమును చెప్పెదను. భగవంతుడగు శ్రీహరి కౌస్తుభమణి రూపమున ఈ జగత్తుయొక్క స్వచ్ఛమగు రూపమును ధరించుచున్నాడు. శ్రీవత్స రూపముతో ఉన్న ప్రధానమును ధరించుచున్నాడు. బుద్ధి అనగా మహత్తత్త్వము గదారూపమున మాధవుని యందు ఉన్నది. భూతములకు ఆదిభూతమగు తామసాహంకారమును శంఖరూపముతోను, ఇంద్రియములకు అది భూతమగు రాజసాహంకారమును శార్ఙదనూరూపమునను ధరించుచున్నాడు. మిక్కిలి చంచలమును, వేగముచే వాయువును అతిక్రమించినదియు అగు మనస్సును, సుదర్శనచక్ర రూపమున హస్తమున ధరించుచున్నాడు. ముక్తామాణిక్య మరకతేంద్ర నీలవజ్ర రూపమై పంచరూపములతో ఉన్న గదాధరుని వైజయంతీమాల పంచభూత హేతువులగు పంచతన్మాత్రల సంఘాతమైన భూతమాలయే. జ్ఞానేంద్రియములను కర్మేంద్రియములను అన్నిటిని అశేషబాణ రూపమున జనార్ధనుడు ధరించుచున్నాడు. అచ్యుతుడు ధరించుచున్న అతి నిర్మలమైన ఖడ్గరత్నము అవిద్యామయ కోశ మందుదాచబడిన విద్యామయమగు జ్ఞానమే. ఈ విధముగ హృషీకేశుడు ప్రధానమును బుద్ధి (మహత్తత్త్వము) అహంకార ద్వయమును భూతపంచకమును మనస్సును సర్వేంద్రియములను విద్యా అవిద్యలను అస్త్రభూషణ రూపమున ఉన్న వానిని అరూపుడై ధరించుచున్నాడు. ప్రాణుల శ్రేయస్సుకొరకై, మాయారూపుడై వికారములతో కూడిన ప్రకృతిని సకలజగత్తును ధరించుచున్నాడు.

మఱియు విద్యా, అవిద్యలును, సదసత్తులును, సర్వభూతేశుడైన మధుసూదనుని యందుగలవు. కలా, కాష్ఠా, నిమేష దిన, ఋతు ఆయన సంవత్సరాది కాలస్వరూపుడు భగవంతుడు. ఆ పాపుడు నాశరహితుడు. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకములు ఏడును ఈ ప్రభువే.

సమస్తలోక రూపమగు ఆకారముగలవాడై, పూర్వజులకు కూడ పూర్వజుడై సర్వవిద్యలకు ఆధారభూతుడై శ్రీహరి స్వతంత్రుడై యున్నాడు. దేవ, మనుష్య, పశ్వాది బహు రూపములతో అమూర్తిమంతుడగు ఈ సర్వేశ్వరుడు భూతమూర్తియు అనంతుడు అగుచున్నాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము, ఉప వేదములు, ఇతిహాసములు, వేదాంత (ఉపనిషద్) సూక్తులు, వేదాంగములు, మన్వాది స్మృతులు, సమస్త శాస్త్రములు, ఉపాఖ్యానములు, అనువాకములు వాక్య ప్రసంగములు గీతములు, ఇవి అన్నియు శబ్దరూపధరుడగు విష్ణుభగవానుని శరీరమే. మూర్తములు గాని, అమూర్తములుగాని అగు వస్తు సముదాయమంతయు వాని శరీరమే. కార్యకారణ రూపమగు ఈ విశ్వమంతయు ఆ జనార్దనుని కంటె వేరుగాదు. ఆహరిని నేనై ఉన్నాను, అను బుద్ధి ఎవరికి కల్గునో అతనికి శరీరము వలన కలిగెడి రాగ ద్వేషాదులు కాని హృద్రోగములు కాని సంభవింపవు అని చెప్పి పరాశరుడు ఓ బ్రాహ్మణుడా! విష్ణు పురాణమందలి ప్రథమాంశము పూర్తిగ నీకు చెప్పితిని. దీనిని ధరించుటచే జనుడు సర్వపాప నిర్ముక్తుడు అగును మైత్రేయా! ఈ ప్రథమాంశమును వినుటవలన మానవుడు కార్తికమాసమందు పుష్కర క్షేత్రమునందు పన్నెండు సంవత్సరములు స్నానము చేసిన వచ్చెడి ఫలము కలుగును. దేవ, ఋషి, పితృ, గంధర్వ, యక్షాదుల జన్మవృత్తాంతమును విను వానికి దేవతలు మొదలగువారు వరప్రదాతలగుదురు. అని ఈ విధముగా పరాశరుడు విష్ణుపురాణ ప్రథమాంశమును ముగించెను. (I-22)