మైత్రేయుడు భగవంతుడా! కర్మమార్గమందున్న మానవులు చేయదగు మంచిపని నిత్యము, నైమిత్తికము అగు కర్మమేమి చేయవలెనో నాకు గురువులు చెప్పిరి. వర్ణాశ్రమ ధర్మములు గూడ వారిచే నాకు చెప్పబడినవి. రాజవంశములను గురించి వినగోరెదను ఆనతి ఇమ్మన శ్రీ పరాశరుండిట్లనియె:
మైత్రేయా! వినుము. బ్రహ్మ మొదలయిన మానస వంశము అనేక యజ్ఞకర్తలు వీరులు, ధీరులు, శూరులు అయిన భూపాలురచే అలంకృతమైనది ఆ వంశము యొక్క ఆనుపూర్విని సర్వపాప ప్రక్షాళనము కొఱకైవినుము. అనాదియగు ఋగ్యజుస్సామాది వేదమూర్తియగు విష్ణుభగవానుడు సర్వజగములకు ఆది. ఆ పరబ్రహ్మయొక్క సాకారరూపము హిరణ్యగర్భుడనువాడు బ్రహ్మాండ స్వరూపుడై భగవంతుడు, బ్రహ్మచే తొలుత రూపొందెను. ఆ బ్రహ్మయొక్క కుడి బొటన వ్రేలినుండి దక్షప్రజాపతి అతనికి అదితి, ఆమెకు వివస్వంతుడు అతనికి మనువు జన్మించిరి. మనువునకు ఇక్ష్వాకు, నృగ, దృష్ట, శర్యాతి, నరిష్యంత, నాభాగ, దిష్ట, కరూశ, పృషధ్రులను తొమ్మండ్రు కొడుకులు జన్మించిరి. మనువు పుత్ర కాముడై మిత్రా, వరుణులనుగూర్చి ఇష్టి కావించెను. మనుపత్నియగు శ్రద్ధాదేవి కన్యను కోరగా హోతచేసిన హోమమున పొరపాటువలన అయిష్టి వికలముకాగా ‘ఇళ’ అను కన్య పుట్టెను. ఆమె మిత్రావరుణుల అనుగ్రహముచే మనువు కొడుకు సుద్యుమ్నుడుగా అయ్యెను. ఒకానొకప్పుడు పార్వతీ పరమేశ్వరులు క్రీడించుచున్న ప్రదేశమునకు శివుని చూడ ఏతెంచిన మునులను చూచి, కోపించిన పార్వతిని ఓదార్చుటకై ఇచటికి వచ్చిన పురుషుడు స్త్రీ అగుగాక అని కోపముతో శివునిచే శపింపబడిన తావునకు సుధ్యమ్నుడు వేట తమకమున ఏతెంచి ఈశ్వర శాపమువలన స్త్రీయై ‘ఇళ’ అను పేరుతో వ్యవహరించెను. సోముని కుమారుడగు బుధుని ఆశ్రమ ప్రాంతమున చరించెను. బుధుడు ఆమెయెడ అనురక్తుడై, పురూరవుడు అను కుమారుని కనెను. అతడు పుట్టగా మహాతేజస్వులగు పరమర్షులచే, యజురాదిచతుర్వేదమయుడు, సర్వమయుడు, మనోమయుడు, విజ్ఞానమయుడు, అశేషమయుడు, అమృతమయుడు, యజ్ఞమూర్తియు అగు భగవంతుడు సుద్యుమ్నునికి పుంస్త్వము రావలెనని కోరి, యథావిధిగ యజింపబడెను. తత్ప్రసాదముచే ఇళ మరల పురుషుడుగా మారి సుద్యుమ్నుడు అయ్యెను. అతనికి ఉత్కల, గయ, వినతులు అను ముగ్గురు కొడుకులు పుట్టిరి. సుద్యుమ్నుడు మాత్రము తొలుత స్త్రీయైనందున రాజ్యభాగమును పొందడయ్యెను. కాని వశిష్ఠునిమాటను అనుసరించి ఆతని తండ్రి ప్రతిష్ఠానము అను నగరము అతనికి ఇచ్చెను. అతడు దానిని పురూరవున కొసగెను. వాని వంశమువారు అన్ని దిక్కులందు క్షత్రియులైరి.
మనువు కొడుకు పృషధ్రుడు గురువగు వశిష్ఠునిచే గోపాలనమునకై నియుక్తుడై రాత్రియందు గోవులను తినకోరివచ్చిన పులిని చంపకోరి ప్రమాదమున గురుగోవును చంపి గురుశాపమున శూద్రత్వము పొందెను. లేరూశుని వలన కారూశులు క్షత్రియులు మహాబల పరాక్రములు జనించిరి. దిష్టుని కొడుకు నాభాగుడు కర్మచే వైశ్యత్వమొందెను. అతనికి బలంధనుడు అను పుత్రుడుకలిగెను. బలంధనునికి కీర్తిశాలి అగు వత్సప్రీతియు, వానికి ప్రాంశువు, వానికి ప్రజాపతి, వానికి ఖనిమిత్రుడు, వానికి చక్షుషుడు, వానికి అతిబలశాలియైన వింశుడు, వానివలన వివింశకుడు, వానికి ఖనినేత్రుడు, వానికి అతివి భూతి, వానికి అతిబలపరాక్రముడు అగు కరంధముడు వానికి అవిక్షిత్తు వానికి మహాబలపరాక్రముడు మరుత్తుడు కల్గిరి. మరుత్తుని గూర్చి ఇప్పటికిని ఈ రెండు శ్లోకములు గానము చేయబడుచున్నది.
“మరుత్తుని యజ్ఞమువంటి యజ్ఞము భూమిపై మఱి ఎవ్వనికిని జరగలేదు. అందు సర్వ యజ్ఞసామగ్రి స్వర్ణమయమే. సుశోభనమే. సోమముచే ఇంద్రుడును దక్షిణలచే ద్విజులు మదించిరి. వడ్డించువారు మరుత్తులు, సదస్యులు దేవతలు, ఆ మరుత్త చక్రవర్తి నదిష్యంతుడు అను పుత్రునికాంచెను. వానికి దముడు, వానికి రాజవర్ధనుడు, వానివలన సువృద్ధి, వానికి కేవలుడు, వానివలన సుధృతి, వానికి నరుడు, వానికి చంద్రుడు, వానికి కేవలుడు, వానికి బంధుమంతుడు, వానికి వేగవంతుడు, వానికి ఋధుడు, వానికి తృణబిందువు, అతనికి ఇలబిల అను కన్యయు జనించిరి. తృణబిందువును అలంబుస అను అప్సరస వరించెను. ఆమెయందు అతనికి విశాలుడు జనించి వైశాలి అనుపురమును నిర్మించెను. అతని కొడుకు హేమచంద్రుడు. వానికి చంద్రుడు, వానికి ధూమ్రాక్షుడు, వానికి సృంజయుడు, వానికి సహదేవుడు, వానికి కృశాశ్వుడు, కృశాశ్వునికి సోమదత్తుడు ఉదయించి శతాశ్వమేధములు చేసెను. వాని కొడుకు జనమేజయుడు వానికి సుమతి పుట్టెను. వీరు వైశాలికులను పేరందిన రాజులు. వీరిని గూర్చిన శ్లోకము ఇది కీర్తింపబడుచున్నది.
“తృణబిందుని ప్రసాదముచే సర్వవైశాలిక రాజులు దీర్ఘాయుష్మంతులు, మహాత్ములు, వీర్యవంతులు, అత్యంత ధార్మికులు అయిరి. మనుపుత్రులలో శర్యాతికూతురు సుకన్య. ఆమెను చ్యవనమహర్షి పెండ్లాడెను. శర్యాతి కుమారుడు అనర్హుడు, మహాధార్మికుడు. ఆనర్తునికి రేవతుడు కొడుకు. అతడు అనర్తదేశమును పాలించెను. కుశస్థలి అతని రాజధాని. రేవతుని కొడుకగు (రైవతుడు) కకుద్మి అను పేరుగలవాడు. నూరుగురికి అతడు అన్నగారు. అతని కూతురు రేవతి. అతడామెను చేకొని ఈమె ఎవ్వనికి భార్యకాదగునని బ్రహ్మను అడుగుటకై సత్య లోకమునకేగెను. ఆ సమయములో బ్రహ్మ సన్నిధిలో హాహా హూహూ అను ఇద్దఱు గంధర్వులు అతితానమను పేరుగల దివ్య గాంధర్వమును (సంగీతమును) పాడిరి. అదికూడ త్రిమార్గ పర్యావృత్తిగ అనేక యుగములు జరుగుదాక అట ఉండి విని ఆ కాలమంతయు ఒక్క ముహూర్త మాత్రము అయినట్లు భావించెను. పాటచివర భగవంతుని, అబ్జయోనిని బ్రహ్మకు ప్రణమిల్లి రైవతుడు తన కన్యకర్హుడైన వరుడు ఎవ్వరు అని అడిగెను.
భగవంతుడు అతనిని నీకభిమతుడగు వరు డెవ్వడని ప్రశ్నించెను. అతడు ప్రణమిల్లి తనకు అభిమతులైన వరులను పేర్కొనెను వీరిలో నీకు అభిమతుడెవ్వడు? వానికి నాకన్యను ఇత్తుననెను. అంతట నించుక తలవంచి, అల్లన నవ్వుచు బ్రహ్మ ఇట్లనియె. “నీకు అభిమతులైనవారు వీరెవ్వరో వారిసంతానమునకు, సంతానముకూడ ఇప్పుడు అవనితలమందు లేదు. ఇచట నీవు సంగీతము వినుచుండగా, అనేక మహాయుగములు గడచిపోయినవి. ఇప్పుడు అవనిపై ఇరువది యెనిమిదవ మనువు యొక్క మహాయుగ మించుమించు గడచి పోవుచున్నది. కలి సమీపించినది గదా! నీవు ఒంటరిగ ఎవ్వనికేని ఈ పిల్ల నిమ్ము. నీకుకూడ మంత్రి భృత్య కళత్ర బంధు సైన్య కోశాదులన్నియు ఈ కాలమున పూర్తిగ చెల్లిపోయినవి” అనగావిని, ఆ ఱేడు మిక్కిలి జడిసి, భగవంతునికి మ్రొక్కి ఇట్లు అడిగెను. “స్వామీ! పరిస్థితి ఇట్లుండ నేనీకన్యను ఎవ్వనికి ఈయవలయును?” అన ఇంచుక మెడ వంచి చేతులు మొగిచి సర్వలోక గురువగు కమలయోని ఇట్లనియె.
బ్రహ్మపార స్తవము
సహ్యాదిమధ్యా న్తమజస్యయస్య విద్మోవయం సర్వమయస్యధాతుః ।
నచస్మరూపన పరంప్రభావం నచై వపారం పరమేశ్వరస్య ॥
కలాముహూర్తాదిమయశ్చ కాలోనయద్విభూతేః పరిణామ హేతుః ।
అజన్మనాశస్య సమన్త మూర్తే రనామరూపస్య సనాతనస్య ॥
యస్యవ్రసాదాదమమచ్యుతస్య భూత ప్రజాసృష్టికరోఽన్తజారీ ।
క్రోధాచ్చరుద్రః స్థితి హేతుభూతో యస్మాచ్చమధ్యేపురుషః పరస్మాత్ ।
మద్రూప మాస్థాయ సృజ త్యజోయః స్థితౌచయోఽసౌ పురుషస్వరూపీ ।
రుద్రస్వరూ పేణచయోఽత్తివిశ్వం ధత్తేతథాఽన్తవపు స్సమస్తమ్ ॥
శక్రాదిరూపీ పరిపాతివిశ్వమర్కేన్దురూపశ్చ తమో హినస్తి ।
పాకాయయోఽగ్నిత్వముపై తిలోకాన్ బిభర్తి పృథ్వీవపు రవ్యయాత్మా ॥
చేష్టాంకరోతి శ్వసనస్వరూపీ లోకస్య తృప్తించ జలాన్నరూపీ ।
దదాతి విశ్వస్థితిసంస్థితస్తు సర్వావకాంశచనభ స్స్వరూపీ ॥
యస్సృజ్యతే సర్గకృ దాత్మనైన యః పాల్యతే పాలయితాచదేవః ।
విశ్వత్మనాసంప్రియతేఽన్తకారీ పృథక్త్రయస్యాస్యచయోఽవ్యయాత్మా ॥
జయస్మిన్ఽజగ ద్యో గదేతదాద్యో యశ్చాశ్రితోఽస్మిన్ జగతి స్వయంభూః
ససర్వ భూతప్రభవో ధారిత్ర్యాం స్వాంశేన విష్ణునృపతేఽవతీర్ణః ॥
“అజుడగు ఎవ్వనికి ఆదిమధ్యాంతములను ఎఱుంగమో, సర్వమయుడు అగు ఆధాత యొక్క స్వరూప పరమప్రభావములు ఆ పరమేశ్వరుని పరమ పాకము తెలియమో, ఏ దేవుని విభూతికి కలాముహూర్తాదిమయమైన కాలము పరిణామహేతువు కాదో (కాలికమైన దశాపరిణామము లేనివాడు) పుట్టుట గిట్టుటయులేని రూపులేని పేరులేని సనాతనుని యొక్క ఏ అచ్యుతునియు అనుగ్రహముచే నేను ఈ భూత ప్రజాసృష్టిని చేయుచున్నానో; రుద్రుడు క్రోధముచే ఈ విశ్వమును భక్షించునో; స్థితికి హేతువై ఎవ్వడు అనంతుడై, పురుషరూపియై సకల విశ్వమును ధరించుచున్నాడో; ఇంద్రాది రూపియై పాలించుచున్నాడో, సూర్యచంద్ర స్వరూపియై చీకటిని చెండునో, తిన్న ఆహారము పాకము చేయుటకు అగ్నిత్వమును ఎవ్వడు అందునో, పృథ్వీరూపమున ఏఅవ్యయుడు లోకములను భరించునో, వాయుస్వరూపుడై చేష్టించునో; జలము అన్నము రూపొంది లోకమునకు తృప్తిని కూర్చుచున్నాడో; విశ్వమందు అంతట నిలిచి ఆకాశరూపమున సర్వావకాశమును ఒసంగునో; ఎవ్వడు తనను తానే సృష్టించుకొనునో, పాలించుకొనునో; విశ్వరూపమున తనను తాను ఉపసంహరించుకొనునో; ఈ మూడు పనులుచేయు మూడుమూర్తులై మఱి వానికంటె వేరై అవ్యయుడగుచున్నాడో, ఎవ్వనియందు జగమున్నదో, ఎవ్వడీ జగత్తో, ఎవ్వరు ఆద్యుడై ఈ జగత్తునకు స్వయంభువైన దిక్కో అట్టి సర్వభూత ప్రభవ కారణమైన విష్ణువు తన అంశమున అవతరించినాడు. కుశస్థలి అనుపురము యాదవ రాజులకు అమరావతివలె (ఇంద్ర రాజధానివలె) ధరణిపై మున్ను ఉండెను. అక్కడ ఇపుడు ద్వారక ఉన్నది. ఆ విష్ణువు బలదేవుడను పేర అచట ఉన్నాడు. నీ నీ పిల్లను ఆ మాయా మనుజునకు జాయగా ఒసగుము. ఈమె స్త్రీ రత్నము. ఈమెకు అతడే తగిన వరుడు. ఈ ఇర్వుర సంబంధము చాల అనురూపము.”
పరాశరుడు ఇట్లనెను: అని కమలభువుడు పలుకగా విని రేవత రాజు భూమికి దిగి వచ్చి మరుగుజ్జులు, అల్పబలులు, అల్పవివేక వీర్యులు అయిన పురుషులను చూచెను. రూపముమారి ఉన్న కుశస్థలి ద్వారకగామారెను. అచటికివచ్చి తన కన్యను స్ఫటికాద్రివలె దృఢము, విశాలము అయిన వక్షస్థలముగల హలాయుధునకు, ఆబుద్ధిశాలి కకుద్మి కన్యాదానము చేసెను. అతాలకేతువు (తాడిచెట్టు జండా గుర్తుగల బలరాముడు) తనకంటె ఎత్తుగా ఉన్నదని ఆమెను చూచి తన నాగేటికొనతో క్రిందికి వంచెను. ఆమెయు అప్పటి కప్పుడు వేఱొకతెవలె కనుపించెను. దేవతరాజకన్య అయిన ఆ రేవతిని, హలాయుధుడు యథావిధిగ పరియణము అడెను. ఆ రేవతరాజు కూడా ఆమె కన్యాదానము చేసి, మనో నిగ్రహము వడసి, తపస్సునకై హిమాచలమునకు ప్రయాణమైపోయెను.
శ్రీపరాశరుడు ఇట్లు అనియె:
కకుద్మి బ్రహ్మలోకమునుండి తిరిగి భూమికి రావలసినంతలో ఉద్వేజనులు అను పేర రాక్షసులు కుశస్థలీ పురమును ధ్వంసముచేసిరి. ఇతని తమ్ములు నూర్గురు వారికి జడిసి దిక్కులకు పారిపోయిరి. వారి వంశీయులు, క్షత్రియులు నలుదెసలకు చెదరిరి. వృష్టుని వంశము వార్షికమనుపేర క్షత్రజాతి ఏర్పడెను. నాభాగుని కొడుకు నాభాగుడన నొప్పెను. వాని కుమారుడు అంబరీషుడు అతని సుతుడు విరూపుడు. వానికి పృషదశ్వుడు వానికి రతీతరుడు పుట్టిరి. ఈ వంశమున ఈ శ్లోకము పఠితము. “రథీతరుల సంతతి క్షాత్ర సంపన్నులయ్యు తపముచే అంగీరసులనెడి ద్విజులు కూడ అయిరి.” మనువు తుమ్మినతఱి అతని ముక్కునుండి ఇక్ష్వాకువు పుట్టెను. వికుక్షి, నిమి, దండుడు అను ముగ్గురు అతడి నూర్గురు కొడుకులలో ముఖ్యులు. శకుని మొదలగు ఏబదిమంది ఉత్తరా పథమును పాలించిరి. ఎనుబదిఎనిమిదిమంది దక్షిణాపథ పాలకులైరి. ఇక్ష్వాకువు అష్టకా శ్రాద్ధనిమిత్తముగ మాంసము తెమ్మని వికుక్షిని పంపెను. ఆతడేగి అనేక మృగములను జంపి మిక్కిలి ఆకలిగొని అందొక కుందేటిని తినివేసెను. తక్కిన మాంసములను తెచ్చి తండ్రికి నివేదించెను. ఇక్ష్వాకువు, ఇక్ష్వాకు కులగురువగు వశిష్ఠుని దీనిని ప్రోక్షింపుము అని పలికినంతట, అతడు “చాలుచాలు ఇది అమేధ్యమైన (అపవిత్రమైన) మాంసము, దురాత్ముడు నీ కొడుకు దీనిని చెరచినాడు. ఇందలి కుందేటిని వీడు తిన్నాడు.” అని ఇట్లు ఆచార్యునిచే పలుకబడి ఆ వికుక్షి శశాదుడను పేరొంది తండ్రిచే పరిత్యజింపబడెను. తండ్రి చనిపోగా ఇతడు ఈ పృథివిని ధర్మముతో పాలించెను.
ఆ శశాదునకు పురంజయుడు పుట్టెను. అతని చరిత్ర ఇది. త్రేతాయుగమందు దేవాసుర యుద్ధము అతిభయంకరముగ జరిగెను. అందు అసురుల చేతిలో అమరులు ఓడి, విష్ణుని ఆరాధించిరి. సకలజగత్పరాయణుడు ఆద్యంతరహితుడు అగు నారాయణుడు వేల్పులకు ప్రసన్నుడై ఇట్లనియె. “మీ కోరిక నాకుతెలిసినది. అందులకు ఇదె నా పలుకు ఆలింపుడు. రాజర్షియైన శశాదుని తనయుడు పురంజయుడు క్షత్రియ వీరుడు. అతనిమేన నేను స్వయముగ వంశావతారమెత్తి ఆ రాక్షసులు అందరిని సంహరించెదను. అందుచే మీరు పురంజయుని అసురసంహారమునకు సన్నద్ధుని చేయుడు అనగా విని అమరులు విష్ణుభగవానునికి మ్రొక్కి పురంజయుని దరికివచ్చి ఇట్లుపలికిరి. “ఓ క్షత్రియ శిరోమణీ! మా కోరినటుల మాశత్రు సంహారమునకు నీవు సాహాయ్యము చేయగోరుచున్నాము. అభ్యాగతులము కావున మా ప్రీతికి భంగము చేయరాదు. “అనగా విని పురందరుడు ఇట్లు అనెను. మీకు రాజు శతముఖుడు, త్రిభువననాథుడు అతని మూపున నేను కూర్చుండి మీశత్రువులతో పోరుదునేని, నేను మీకు తోడు అయ్యెదనని చెప్పెను. నిమిదేవతలు, దేవేంద్రుడు ఇది బాగున్నదని అంగీకరించిరి. అవ్వల ఇంద్రుడు వృషభరూపము ధరింప, దాని కకుద (మూపుర)మున అత్యంత సంతోషముతో పురంజయ మహారాజు కూర్చుండి చరాచర గురువగు విష్ణు భగవానుని తేజస్సుచే ఆప్యాయితుడగుచు, ఆ దేవాసుర సంగ్రామ మందు ఎల్ల అసురులను కూల్చెను. ఎద్దు మూపురమున (కకుత్తునందు) స్థితుడయినందున అతనికి కకుత్థ్సుడను పౌరుష నామము ఏర్పడినది. అతని కుమారుడనేనసుడు. అతని కొడుకు పృథువు. అతని కొడుకు విష్టరాశ్వుడు. వాని పుత్రుడు చంద్రవంశీయుడగు యవనాశ్వుడు. యవనాశ్వుని సుతుడు శ్రావస్తుడు. అతడు నిర్మించినది శ్రావస్తిపురము. వాని కొడుకు బృహదశ్వుడు. వానికి జనించినవాడు కువలయాశ్వుడు. ఈతడు విష్ణు తేజస్సంయుతుడై, తన కొడుకులు ఇరువది యొక్క వేలమందితో ఏగి ఉదంక మహర్షికి అపకారియైన దుందుడను రాక్షసుని చంపి దుందుమారుడను పేరందెను. అతని కొడుకులందరు దుందుని ముఖ నిశ్శ్వాస అగ్నిచే దగ్ధులై నశించిరి. దృఢాశ్వ, చంద్రాశ్వ, కపిలాశ్వులు ముగ్గురు మాత్రము మిగిలిరి. దృఢాశ్వునికి, హర్యశ్వుడు, నికుంభుడు, నికుంభునికి అమితాశ్వుడు, వానికి కృశాశ్వుడు, వానికి ప్రసేనజిత్తు, వానికి యవనాశ్వుడు కల్గిరి. ఆ యవనాశ్వుడు సంతానములేక విచారమంది మునుల ఆశ్రమమండలమునందు వసించుచుండ దయాశీలురగు మునులు పుత్రకామేష్టి చేసిరి. ఆ ఇష్టిలో ఋషులు నడిరేయి దాటిన తర్వాత మంత్రపూతమైన జలము నింపిన కలశమును యజ్ఞవేది నడుమన ఉంచి అందరు నిదురపోయిరి.
ఆమునులు అట్లు నిదురపోవ, యవనాశ్వుడు దప్పికగొని అయ్యాశ్రమము లోనికేగి మునులను లేపకయే అటనున్న మంత్రపూతము మహామహిమకలదియుఅగు కలశ మందలి నీటిని త్రాగెను. ఋషులు మేల్కొని ఎవ్వడీ జలమును త్రాగెనని అడిగిరి. ఈ జలమును త్రావినచో యవనాశ్వనృపతిపత్ని మహాబల పరాక్రమ సంపన్నుడగు పుత్రుని కనగలదనిరి. అది విని ఆరాజు తెలియక నేనిది త్రావితిని అనెను. అతని కడుపున గర్భము (శిశువు) ఏర్పడి దినదినాభివృద్ధి నందెను. సమయమైనంత ఆ శిశువు కుడిబొటన వేల రాజుకుక్షిని భేదించుకొని వెలికివచ్చెను. ఆ రాజు మరణించెను. పుట్టినాడుగదా వీడేమి కుడుచుకొనునని మునులనిరి. అంతట ఇంద్రుడేతెంచి “నన్ను కుడుచు కొనును” (మాంధాన్యతి) అనెను. దాన అతడు మాంధాత అను పేరివాడగును. అని దేవేంద్రుడు ఆబిడ్డనోట తనచూపుడు వ్రేలిని ఇడగా అంతట అతడద్దానిని కుడిచెను. ఆ అమృతస్యంది. అయిన వ్రేలిని కుడిచి, ఒక నాటనే చక్కగ వృద్ధినందెను. ఆ మాంధాత చక్రవర్తి సప్తద్వీపవతియైన మహిని అనుభవించెను. ఇక్కడ ఒక శ్లోక మిట్లు ఉపశ్లోకితము. “సూర్యుడెంతమేర నుదయించునో, ఎంతదాక సంచరించునో ఆ సర్వప్రదేశము యవనాశ్వ తనయుడగు మాంధాతయొక్క క్షేత్రము అనబడును.”
మాంధాత శశి(త) బిందుతనయ ఇందుమతిని పరిణయము ఆడెను. ఆమెయందు ఆతడు పురుకుత్సుని, అంబరీషుని, ముచుకుందుని, ముగ్గురు పుత్రులను కనెను. ఆమెయందే ఆఱేనికి ఏబదిమంది కూతురులును పుట్టిరి. ఈనడుమ బహ్వృచుండు (ఋక్ఛాఖీయుడు అగు) సౌభరి అను ఋషి పండ్రెండేండ్లు జలములందు ఉండెను. ఆ నీటిలో సమ్మదుడను చేపలరాజు, పెక్కుమంది సంతానముగల్గి, అతి ప్రమాణము కలవాడు అందుండెను. వాని కొడుకులు, మనుమలు, కూతురుబిడ్డలు, వానివెనుకముందు ఇరు పార్శ్వముల ఱెక్కలందు, తోకను, తలమీదను తిఱుగుచు వానితోనే రేయింబవళ్ళు మిక్కిలి తనిసి క్రీడించిరి. వాడును సంతాన స్పర్శహర్షప్రకర్షంజేసి పలుతెఱగుల, తన పుత్రపౌత్ర దౌహిత్రాదులతో కూడ అనుదినము, ఆ మహర్షి చూచుచుండ మిగుల క్రీడించెను.
అటు పిమ్మట ఆ నీటిలో ఉన్న సౌభరి ఏకాగ్రతనుండి తొలగి (మనసు లక్ష్యమున నిలువక) అనుదినమా చేపయొక్క కొడుకులు, పౌత్రులు, దౌహిత్రులతోడి అతి రమణీయ విలాసమును అట్టెకని, ఇట్లు అనుకొనెను. ఆహా! ఈ మీనరాజు ఎంత ధన్యుడు అభిమతమైన ఒక జన్మాంతరమును అంది ఈ కొడుకులతో, మనుమలతో, మునిమనుమల తోను ఉల్లసిల్లుచు మాకు వేడుకనొదవించుచున్నాడు. మేమును ఇట్లు పుత్ర పౌత్ర దౌహిత్రులతో ఆనందింతుముగాక అని లెస్సగ గమనించి, ఆ నీరువెడలి సంతానము కనువేడుకగొని కన్యకై మాంధాతృ చక్రవర్తి దరికేగెను. ఆయన రాకవినినంతట భూకాంతుడువేచి ఎదురేగి లెస్సగ అర్ఘ్యపాద్యాదుల పూజింప ఉచితాసనము గొని సౌభరిఱేనిఁ గూర్చి ఇట్లనియె.
“నరేంద్రా! గృహస్థు కాదలచితిని. కావున నాకు నీ కన్యను ఇమ్ము. యజ్ఞమునకు భంగము సేయకుము! కార్యవశమున వచ్చిన అర్థులు కకుత్థ్స వంశమునందు విముఖులై పోరుగదా! పుడమియందు ఇతరులు రాజులున్నారు. వారికి కూతుండ్రును పుట్టినారు. కాని అర్ధులేతెంచి అర్థించినదానిని ఇచ్చెడి దీక్షయందు దృఢమైన వ్రతనిష్ఠగల కులము నీదొక్కటే. నీకు నూటయేబదిమంది కూతుండ్రున్నారు. అందొకకుమార్తెను నాకు ఇమ్ము. ఓ రాజోత్తమా! అడిగి లేదనిపించుకొనుట అతి దుఃఖహేతువు. నేను దానికి భయపడు చున్నాను.”
ముని వచన మాలించి, ఆ రాజు ముదిమిచే శరీరము శిథిలమై ఉన్న ఆమునిని చూచి, కాదనుటకు జడిసి, శాపమునకును వెఱచి, ఇంచుక మొగము వంచి, చాలతడవలు ఆలోచించెను. “రాజేంద్రా! ఎందులకు ఆలోచనలో పడితివి. ఇందేనించుకయు నసహముగా పలుకలేదు. కూతును ఎవరికో ఒకరికి అవశ్యము ఈయవలసినదియే. ఆమెచేత కృతార్థత లభింపకున్న ఇంకేమున్నది” అని సౌభరి భగవానుని వచనము విని శాపమునకు భయమంది మాంధాత వినయ వినతుడై ఇట్లనియె. “స్వామీ మా కుల మర్యాద ఇది. కన్యకు ఇష్టుడును ఉత్తమ వంశ్యుడు అగు వరునకు కన్యను మేము ఇత్తుము. మీ కన్యాయాచన మా మనోరథముల కందనిది. ఎట్లో ఇది తటస్థించినది. పరిస్థితి ఇది ఇట్లుండ నిప్పుడేమేమి చేయవలెనో ఎఱుంగక ఆలోచనలో పడినానని ఆ చక్రవర్తి అనగా, ముని తనలో ఇట్లు తలంచెను. మమ్ము త్రోసిపుచ్చుటకిది ఒక ఉపాయము. ఇతడు ముదుసలి. ముదితలకు అనభిమతుడు. కన్యలమాని మఱి ఏమనవలెను! అని ఇతడు ఆలోచించి ఇట్లన్నాడు. అగుగాక! ఇటు చేసెదనని తనలో గుణించుకొని, మాంధాతతో ముని ఇట్లనియె. ఇట్లేని మేము అంతఃపుర ప్రవేశము చేయుటకు పక్షవరునికి (అంతఃపురపు కావలివానికి) ఆజ్ఞనిమ్ము. ఏ కన్య అయినను నన్ను అభిలషించునేని, నేను దార సంగ్రహము చేసికొనెదను. అటుల కాదేని మా ఈ కాలాతీత ప్రయత్నమింతటితో చాలును” అని పలికి ఊరకుండెను.
అంతట ముని శాపశంకితుడై, మాంధాత కన్యాంతఃపుర రక్షకునికి ఆనతి ఇచ్చెను. వానితో గూడ సౌభరిభగవానుడు అంతఃపురములోన ప్రవేశించుచునే సకలసిద్ధ, గంధర్వ, మనుష్యుల కంటే అతిశయించిన చక్కని రూపము గైకొనెను. ఆ ఋషిని లోన ప్రవేశింపజేసి ఆపక్షవరుడు కన్యలతో ఇట్లనెను. మీ తండ్రి మహారాజు ఆజ్ఞాపించుచున్నాడు. “ఈ బ్రహ్మర్షి కన్యార్ధియై మమ్ముం గూర్చి అభ్యాగతుడు ఆయెను. నేనును మాట ఇచ్చితిని. మా పిల్ల ఎవతెయేని ఒక్కతె భగవంతుని నిన్ను వరించునేని ఆమె ఇష్టమునకు ప్రాతి కూల్యమును చేయను” అనెను.
ముని ఆ మాటలను కన్యలందరు ఆలించి అతనిపై అనురాగమొంది సకామలై అడ ఏన్గులు గజయూధపతి నట్లు ఆ ఋషిని “నేను నేనని అందరును వరించి ఇట్లు పలికిరి గూడ.” అక్కలార! చాలుచాలు. నేనితనిని వరింతును, ఇతనినే వరింతును. ఇతడు నీకునురూపుడుగాడు చెల్లీ! ఇతడు నాకే మగడుగా సృష్టింపబడినాడు. నేనితనికై సృష్టింపబడినాను. నీవు ఉపశమింపుము. నేను మొదట వరించితిని. నేను మొదట. ఇంట అడుగు పెట్టినదే తడవు నేను ఈతని వలచితిని. ఎందులకు భంగము చేసెదవు? నాచేత, నాచేత (ఆతడు వరింపబడెను)” అని ఆ ముని బాలునికై పెద్ద రగడ సాగెను. మిగుల చక్కనివాడని, చక్కని ఋషి అని పేర్లన్న ఆమ్మునిబాలుడు అందరిచేతను హృదయ పూర్వకముగ వరింపబడినంతట అంతఃపుర రక్షకుడేగి రాజునకు సవినయముగ అదియెల్ల విన్నవించెను.
పరాశరుడు ఇట్లు అనెను:
అది యెఱింగి ఇదేమి! ఇదెట్లు! ఏమి చేయుదును. నేను ఏమంటిని అని మనసుచెదిరి రాజు ఇష్టపడక ఉండియు, అందులకు అంగీకరించెను. పిమ్మట అనురూపముగ ఆ మహర్షి వివాహమాడి, ఆ కన్యలందఱిని తన ఆశ్రమమునకు కొనిపోయెను. అందును అతడు అశేష శిల్ప కల్పనా దక్షునికొక విధాతనట్లు విశ్వకర్మను ఆహ్వానించి అందఱు సుందరులకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటిగ ఉత్ఫుల్లపంకేరుహములు, కూజత్కలహంస, కారండతవాదివిహంగమ అభిరామములగు కాసారములతోను, ఉప వనములతోను, ఉపధానములతోడి శయ్యాపరిచ్ఛదములతోను, సమగ్ర అవకాశముగ నిర్మింపుమని ఆన తిచ్చెను. ఆ ఇచ్చిన ఆజ్ఞను అచ్చముగా పాలించి, అశేషశిల్ప విశేషా చార్యుండగు త్వష్ట అట్లు కావించి చూపించెను. అవ్వల అప్పరమర్షి సౌభరి ఆజ్ఞంగొని ఆ సదనములందు ఎన్నడు విడువక నందనమహానిధి నివాసము చేసెను. ఆపై నెడవడని భక్ష్య భోజ్య లేహ్య చోష్యాది వివిధోపభోగాహారోపహారములతో సందడిగ క్రందుకొను భృత్యవర్గము అహర్నిశము ఆ మందిరములందు ఆ ఇందువదనలు విందారగింపజేసిరి.
ఒకతటి కూతురులపై వాత్సల్యమున మనసులాగు చుండగా, అమ్మాహీపతి కన్యలు మిగుల దుఃఖితలా! లేక సుఖముగా ఉన్నారా? అని ఆలోచించి ఆ మహర్షి ఆశ్రమ సమీపమునకు ఏతెంచి, కన్నులు మిఱుమిట్లు గొలుప కిరణములు చిమ్ము, స్పటిక మణిమయ ప్రాసాదమాలా మనోహరమైన ఉద్యానవనమునందలి సరోవరమును దర్శించెను. ఒక్క ప్రాసాదమందు ప్రవేశించి, కూతురుని కౌగలించుకొని ఆమె ఇడిన చక్కని ఆసనమందు కూర్చిండి, వాత్సల్యరసపూరము ఉబికి ఆనందబాష్పములు కురియ, అమ్మాయీ! నీకు సుఖమేకద! అసుఖము ఇంచుకయు లేదుగద. నీపై ఈ మహర్షి చెలిమి వాటించునా; లేదా? మన ఇంట ఉనికి మాట జ్ఞప్తికి వచ్చునా? అని అడుగ కూతురు తండ్రి కిట్లనియె. నాన్నగారూ! ఈ సౌధము అతిరమణీయము. ఈ ఉద్యాన వనము అతి మనోహరము. ఉత్ఫుల్ల పద్మాకర జలాశయములు అవ్యక్తమధురకూజిత విహంగములచే హృదయంగమములు. మనోనుకూల భక్ష్యభోజ్యములు అనులేపనములు అంబరాభరణాది భోగము మృదుల మృదుల శయన ఆసనాది సర్వసంపదల సమృద్ధము. మీ గార్హ్యస్ష్యము అద్భుతము అయినను పుట్టిల్లును ఎవ్వరు మరువగలరు? నీ ప్రసాదముచేతనే నాకీ అశేష శోభన వైభవము. కాని ఒక్కటె నాకు భేద కారణము. నా ఇల్లు వెడలి ఈ మహర్షి నావల్లభుడు ఎటకును వెడలడు. నాప్రీతికై కేవలము ఇతడు నాచెంతన ఉండును. నా సోదరీమణుల చెంతకు ఏగిన జాడయేలేదు. దీనిచే నా అప్పచెల్లెండ్రు పరితపింతురేమొ! ఇది నాకొక్కటి దుఃఖ కారణము అన విని ఆ రాజు రెండవ ప్రాసాదమునకేతెంచి, ఆమెయు తనప్రాసాదాది ఉపభోగవైభవము వర్ణింప విని, ఆ బాలికయు నామగడు నాచెంతన ప్రొద్దెల్ల ఉండు, ఒండుమేడకు పోడని వాపోవ, విని ఇట్లందరి సౌధములకు ఏగి అందరు ఇట్లు ఉగ్గడింప ఆనందాశ్చర్య నిర్భరవివశ హృదయుడై సౌభరి భగవంతుడు ఏకాంతమున ఉండు తఱిదరిసి అతని పూజలందికొని ఇట్లనియె.
“భగవంతుడా! ఈ నీగొప్ప అణిమాది సిద్ధి ప్రభావమును చూచితిని. ఇట్టి విభూతి వైభవమును మేము ఇంకొకనియెడ తిలకించి ఉండము. ఇదంతయు భగవత్ మూర్తియగు నీ తపస్సు యొక్క ఫలము” అని అమ్మునిని పూజించి అక్కడనే అమ్ముని వరునితో కొంత కాలముండి అభిమత భోగములను అనుభవించి తనపురమునకు వచ్చెను. కొంత కాలము గడువ అమ్మునికి ఆ రమణులందు నూటయేబది మంది పుత్రులు కల్గిరి. దినదినమట్లు పెంపెక్కిన స్నేహప్రసారముగల ఆ ముని మమకారము మనసును ఆకర్షింప, నీ నా పిల్లలు ముచ్చటగ పలుక నేర్తురా? ముద్దుగ నడుతురా? యువకులు అగుదురా? యువతులను పెండ్లాండుదురా? అట్టి అందము నేను కందునా? వీరికి కొడుకులు ఉదయింతురా! వీరి కొడుకులకు, కొడుకులంగన నేను కనులారా కనుగొందునా? ఈ మున్నగు కోరికలను కాలసంపదచే అనుదినము పెరుగుచున్నవానిని చూచి ఇట్లు ఆలోచించెను. ఒక మనోరథము వెంట మరొక మనోరథము పుట్టును. మనోరథములకు సమాప్తి పదివేలు కాదు లక్షల ఏండ్లకైన లేదు. మనోరథములు పూర్ణములైన కొలది క్రొత్తవి పొటమరించును. నా పిల్లలకు కాళ్లువచ్చి నడకవచ్చినది. ఏవనమును గందిరి. భార్యలతో కలయిక ఏర్పడెను. సంతానము కల్గినది. కొడుకులను కంటిని. వారి కొడుకుల పుట్టువును ఇంకను నా మనసు చూడవలయునని కోరుచున్నది. వారి సంతానము కూడ చూచెద గాక! అవ్వల మరొక మనోరథము పుట్టును. అదియును నిండిన, ఆపై ఇంకొకటి పుట్టును. మనోరథములను ఎవ్వడు వారింపగలడు? మృత్యువు దాక మనోరథములకు అంతులేదు. ఇప్పటికిది నాకు దెలిసినది. మనోరథార్థములందు సక్తమయిన మనస్సు పరమార్థమందు సక్తము కాదు. నీటవసించు చేపల స్నేహముచే నా సమాధి వెంటనే నశించినది. ఆ సంగముచే అంగనా పరిగ్రహము చేసితిని. సంసార పరిగ్రహముచే అత్యంత విప్స (వాంఛ) అతిశయించినది. ఒక్క శరీరము పుట్టుటే దుఃఖమై ఉండ నూట యేబది శరీరములను ఇట కన్నాడను. రాజ కన్యల పెండ్లాడుటతో అనేక పుత్రులతో ఇది మిక్కిలి పెంపబడినది. పౌత్రుల చేతను, వారి కుమారులచేతను వారివారి పరిగ్రహముల చేతను దుఃఖహేతువు తెగ పెరుగును. మమకారమునకు పర్యాయమే పరిగ్రహము. నీటనుండి చేసిన తపస్సునకు ఈ అభివృద్ధి అంతరాయము (విఘ్నము) చేపతోడనుండుట వలన నాకు సుతాదులయెడ వలపు కలిగెను. దానిచే నేను ముషితుడనైతిని, హరింపబడినాడను. యతులకు నిస్సంగత్వము ముక్తిస్థానము. సంగమువలన ఎల్లదోషములు కల్గును. యోగారూఢుడు అయిన వాడు ఉక్తిచే క్రిందికి త్రోయబడును. అల్పసిద్ధిగలవాని మాట చెప్పెడిదేమి. భార్య అనెడి గ్రహము (మొసలి) పట్టి బుద్దిచెడిన నేను నావారి దుఃఖములకు దుఃఖపడక, దోషముల తొలగి ఆత్మసిద్ధి నందుటకు అనువుగ ఇకచరించెద. సర్వధాత, అచింత్యరూపుడు, అణువు కంటె అణువు, మహత్తుకంటె మహత్తుయుగభేదముచే సీతాసితవర్ణుడు లేక శుద్ధబద్ధ రూపుడు ఈశ్వరులకు ఈశ్వరుడునైన విష్ణువును తపసుచే ఆరాధింతును.
సమస్త శక్తిమంతుడును, సర్వరూపుడును, కారణ కార్యరూపుడును, అనంతుడును అగు ఆ విష్ణుదేవునియందు దోషదూరమైన చిత్తము తిరిగిపునరావృత్తి లేని ముక్తి ఎల్లప్పుడు స్థిరముగ ఉండుగాక! ఆది మధ్య అంతములు లేనివాడును దోషరహితుడును సమస్త రూపుడును, సర్వేశ్వరుడు అగు విష్ణువు కంటె ఇతర మేమాత్రము లేకపోవుటచే నేను గురువులకు పరమ గురువును అగు ఆ విష్ణువును శరణు పొందుచున్నాను” అని ఇట్లు తనను తాను తెలుసుకుని సౌభరి గృహారామ క్షేత్ర పుత్ర కళత్రా విషయ సముదాయమునెల్ల విడిచి, భార్యలందఱతో అడవిని ప్రవేశించెను. అందు అనుదినము వైఖానస (వానప్రస్థ) ప్రక్రియను అనుసరించి, అఖిల పాపములను తొలగించికొని, పరిపక్వ మనోల్లావర్తనుడై, తనయందు అగ్నులను ఆరోపించుకొని భిక్షువు (సన్యాసి) అయ్యెను. సకల కర్మకలాపమును భగవంతునియందు అర్పించి జన్మజరాది వికారశూన్యము మరణాది ధర్మరహితము దిగ్దేశాది సంబంధ శూన్యము పరమపదమునగు అచ్యుతస్థాన మందెను. ఈ మాంధాతృ దౌహిత్ర చరిత్రమును తెల్పితిని. ఈ సౌభరి చరిత్రమును ఎవ్వడు స్మరించునునో, చదువునో, జదివించునో, వినునో, వినిపించునో, ధారణ చేయునో, వ్రాయునో, వ్రాయించునో, నేర్పునో, అధ్యయనము చేయించునో, ఉపదేశించునో, వానికి ఎనిమిది జన్మములు అసద్భుద్ధి, అధర్మము వాఙ్మనఃకాయములచే అసన్మార్గ వర్తనము, సమస్త హేయ పదార్థము లందు మమకారమును గలుగదు.
అటుపై శ్రీ పరాశరులు ఇట్లు పల్కిరి:
ఇటుపై మాంధాత సంతతిని తెల్పెదను. మాంధాత తనయుడగు అంబరీషునకు యవనాశ్వుడు గల్గెను. వాని వలన హరితుడు ఉదయించెను. అతని పేరనే అంగిరసులు హారీతులు అను ప్రసిద్ధికనిరి.
పాతాళమందు మౌనేయులును (కాశ్యప ముని పత్ని, ఆమె సంతతులు), గంధర్వులు ఆరు కోట్లమంది ఉండిరి. వారు నాగ కులముల ప్రధాన రత్నములను అపహరించి వారి ఆధిపత్యములను కూడ స్వాధీనము చేసికొనిరి. గంధర్వుల బలముచే తిరస్కృతులయిన నాగేంద్రులు అశేషదేవాధీశుడగు విష్ణుభగవానుని సన్నిధికేగిరి. వారు చేసిన స్తవములను ఆలించినంత కన్నులు తెఱచిన పుండరీకనయనుడు, జలధిశయనుడు నిద్రావ సానమందు మెలకువగొనెను. వారు ప్రణతులై స్వామికి ప్రభూ! మాకీ గంధర్వుల వలన భయము పుట్టినది. ఇది ఎట్లు ఉపశమించునని విన్నవించుకొనిరి.
ఆద్యంతములు లేనివాడును, పురుషోత్తముడు అగు, భగవంతుడు “యౌవనాశ్వుని కుమారుడగు ఈ మాంధాతయొక్క కొడుకు పుకుత్సుడనువాడు ఉన్నాడుగద. వానియందేను బ్రవేశించి సర్వగంధర్వుల ఉక్కడంగింపగలను” అనియె. అది విని జలశాయియగు భగవంతునికి ప్రణమిల్లి, నాగేంద్రులు నాగలోకమునకు వచ్చి పురుకుత్సుని గొనితేర నర్మదను ప్రేరేపించిరి. అమెయు అతనిని పాతాళమునకు కొనిపోయెను. పురుకుత్సుడు రసాతలమునకేగి భగవత్తేజస్సుచేత తృప్తిపొందింపబడిన దేహము బలము గలవాడై, సకల గంధర్వులను చంపి స్వపురమునకు తిరిగి వచ్చెను. పన్నగాధీశులు అపుడు నర్మదకు నిన్ను ఎవ్వడు ఈక్రింది విధముగ స్మరించి నీ నామగ్రహణము సేయునో వానికి సర్పవిష భయము కలుగదని వరమొసంగిరి.
నర్మదా స్తుతి:
నర్మదాయై నమః ప్రాతర్నర్మదాయై నమోనిశి
నమోఽస్తు నర్మదే తుభ్యం త్రాహిమాం విషసర్పతః ॥
ఇత్యుచ్ఛార్యా హర్నిశ మన్థకార ప్రవేశే వాసర్పై ర్నదృశ్యతే ।
నచాపి కృతాను స్మరణ భుజో విషమపిభుక్త ముపఘాతాయభవతి ॥
ప్రాతఃకాలమున నర్మదకు నమస్కారము. నిశీధమున నర్మదకు నమస్కారము. ఓ నర్మదా! నీకు నమస్కారము. విషసర్పము నుండి నన్ను రక్షింపుము.” ఈ మంత్రమును ఉచ్చరించి రేయింబవళ్ళు అంధకారమున చొచ్చిననేని, వానిని పాములు చూడజాలవు. ఈ మంత్రానుస్మరణముచేసి భోజనము చేయువాడు, విషము తినినను, అది చంపదు. ఆ మీదట పురుకుత్సునికి కూడ సంతతి విచ్ఛేదము జరుగదని, నాగపతులు వరము అనుగ్రహించిరి. పురుకుత్సుడు నర్మదయందు త్రసదస్యుని కనెను. అతనికి అనరణ్యుడు పుట్టెను. వానిని దిగ్విజయమందు రావణుడు జంపెను. అనరణ్యునికి పృషదశ్వుడు, అతనికి హర్యశ్వుడును, గల్గిరి. హర్యశ్వునికి హస్తుడు గలిగెను. వానికి సుమనుడు, వానికి త్రిధన్వుడు, వానికి త్రయ్యారుణీయు కల్గిరి, త్రయ్యారుణికి సత్యవ్రతుడు కలిగెను. ఇతడే త్రిశంకుడను పేరందెను. అతడు చండాలత్వమును గూడ పొందినాడు.
ద్వాదశవర్ష క్షామము పట్టినపుడు విశ్వామిత్రుడు భార్యాపుత్రాదుల పోషణార్ధము చండాలురవలన బ్రతిగ్రహము చేయకుండ, జాహ్నవీ తీరమందు అనుదినము మృగ మాంసము తెచ్చి మఱ్ఱిచెట్టున కట్టుచుండెను. దాన సంతుష్టుడైన విశ్వామిత్రునిచే అతడు సశరీర స్వర్గమొందింపబడెను. త్రిశంకువు కొడుకు హరిశ్చంద్రుడు. వానికి రోహితాశ్వుడు, వానికి హరితుడు, వానికి చంచువు, వానికి విజయుడు, వసుదేవుడు, అను ఇద్దరు పుత్రులు కల్గిరి. విజయునికి రురుకుడు వానికి వృకుడు, వానికి బాహువు కల్గిరి. ఈ బాహువు హైహయతాళ జంఘాదులచే ఓడింపబడి, గర్భవతియైన పత్నితో అడవిలో ప్రవేశించెను. సవతి ఆమెకు గర్భస్తంభనముకొఱకు విషముపెట్టెను. దాన ఆమెగర్భము ఏడేండ్లు జఠరమందే ఉండెను. బాహువు వార్ధక్యముచే ఔర్వాశ్రమ సమీపమందు మరణించెను. ఆతని భార్య చితిపేర్చుకొని ఆతనితో అనుమరణము చేయ నిశ్చయించు కొనెను. అంతట అతీత, అనాగతములు తెలిసిన ఔర్వుడు తన ఆశ్రమము నుండి వెడలి చాలు చాలు! ఈ తప్పుపని నుండి ఆగుమాగుము. అఖిల భూమండలపతి, అతి వీర్యపరాక్రముడు, అనేక యజ్ఞకర్త, శత్రుక్షయకర్త, చక్రవర్తి నీ కడుపులో ఉన్నాడు. ఈ అతి సాహసమునకు దిగకుము. అనినంత ఆమె భర్తృసహగమన నిర్బంధము నుండి విర మించెను. ఆ మహానుభావుని చేతనే ఆమె తన ఆశ్రమమునకు కొంపోబడెను. కొలది రోజులలో సగరముగ (విషముతో కూడ) అతి తేజస్వియైన బాలుడుదయించెను. అతనికి ఔర్వుడును జాతకర్మాది క్రియలు జరిపించి ‘సగరు’డు అను పేరు పెట్టెను. ఉపనయనమైన ఈతని వేద శాస్త్రములు అన్నియు చదివించి ‘భార్గవ’మను పేరి ఆగ్నేయ అస్త్రమునుగూడ ఉపదేశించెను. జ్ఞానమువచ్చి అతడు తల్లిని అడిగెను. అమ్మా! చెప్పుము మనమిచట ఎందుకున్నాము. మా నాన్న ఎక్కడ? అని ఈవిధముగ అడుగుచున్న వానికి ఆయమ్మ సర్వము తెల్పెను. అంతట తండ్రి రాజ్యమును అపహరించిరని విని, పగగొని ఆ బాలుడు హైహయతాళ జంఘ సంహారమునకు ప్రతిజ్ఞ పూనెను. ఇంచుమించు హైహయతాళ జంఘులను అందరను గూడ చంపెను. శక, యవన, కాంభోజ, పారద, పహ్లవులను చంపబోవవారు వశిష్ఠుని శరణుచొచ్చిరి. అంతట వశిష్ఠుడు వీరిని జీవన్మృతులనుగా, (బ్రతికియు చచ్చిన వారట్లున్నవారిగా) చేసి సగరునితో వత్స! చాలును ఆగుము. వీరు జీవన్మృతులు. అనుమృతులు (పునర్మృతులు). వీరిని నీ ప్రతిజ్ఞను పాలింపనెంచి స్వధర్మ ద్విజసంగ పరిత్యాగము నేనే చేయించితిని. అన సరియని ఆ గురువచనము అభినందించి ఆ రాచబిడ్డ వారి వేషములను మార్చి వైచెను. యవనులను అందరను నిండు తలబోడులను, శకులను అరబోడులను, పారదులను ప్రలంబ కేశులను (తల విరబోసికొన్న వారి గను) పహ్లవులను మీసాలు, గడ్డాలు గలవాండ్రు గనుకావించెను. స్వాధ్యాయ వషట్కార శూన్యులనుగా ఈ క్షత్రియులను కావించెను. వాండ్రును స్వధర్మ పరిత్యాగము వలన బ్రాహ్మణులచే వెలివేయబడి మ్లేఛ్ఛత్వము నందిరి. సగరుడును స్వీయ అధిష్ఠానమునకు వచ్చి అస్ఖలితచక్రుడై (అప్రతిహత పరిపాలనుడై) సప్తద్వీపవతియైన ఈ ఉర్విని శాసించెను.
సగరునికి భార్యలు ఇద్దరు. కాశ్యపపుత్రి సుమతి. విదర్భరాజపుత్రి కేశిని. వారివలన సంతానము కలుగనందుచేత ఔర్వుని పరమ సమాధిని అసగరుడు ఆరాధింపగా అతడు వరమిచ్చెను. ఒకతె వంశోద్ధారకుని ఒక్కనిని, ఇంకొక ఆవిడ అరువదివేలమంది కొడుకులను కనునని అతడు అనుగ్రహించెను. ఇందెవతె ఏదికోరునో తెల్పుమనెను. కేశిని ఒక్క కొడుకును కోరెను. సుమతి అరువదివేలమంది కావలెననెను. ఔర్వుడు సరిఅనెను. కొలది దినములలో కేశిని ఒక్క పుత్రుని కనెను. అతడు అసమంజసుడను పేరు ఉంచబడినవాడు. వంశకరుడు. కాశ్యపతనయ సుమతికి అరువది వేలమంది సుతులు ఉదయించిరి. అసమంజసునికి అంశుమంతుడు పుట్టెను. ఆ అసమంజసుడు బాల్యమునుండి చెడ్డనడతలో ఉండెను. వీడు బాల్యముగడచి బుద్ధిమంతుడు కాగలడని తండ్రి ఊహించెను. కాని అప్పుడును అసచ్చరిత్రుడై ఉండుట చూచి తండ్రి వానిని త్యజించెను. ఆ అరువది వేలమంది కొడుకులును అసమంజస చరిత్రమునే అనుకరించిరి. అవ్వలగూడ అసమంజుని అనుకరించు సాగరులచేత జగత్తు యజ్ఞాది సన్మార్గము చెడి, దేవతలు సకల విద్యారూపుని, అశేషదోష సంస్పర్శలేనివానిని భగవంతుడు పురుషోత్తముని అంశమైన వానిని, కపిలుని అరిసి ప్రణమిల్లి ఇట్లనిరి. “ఈ సగర పుత్రులు అసమంజసుని నడవడిని అనుగమించుచున్నారు. ఈ దుర్వృత్తులచేత జగము ఏమగునో కదా! ఆర్త జగద్రక్షణ కొఱకుగదా భగవంతుడగు నీవు శరీరము గ్రహించితివి” అనగా విని అముని కొలదిదినములలో వారు నశింపగలరు అనెను. ఈలోన సగరుడు అశ్వమేధము అరంభించెను. ఆరువేలమంది కొడుకులు రక్షకులుగ వెంబడించిన ఆ గుఱ్ఱమును ఎవ్వడో హరించి బిలమందు ప్రవేశించెను. అటుపై సగర పుత్రులు గుఱ్ఱము యొక్క డెక్కల గుర్తులనుబట్టి పోయి, ఒక్కొక్క యోజనము ఒక్కొక్క అడుగుగ మేదినీతలమును త్రవ్విరి. పాతాళమందు అహయము తిరుగుచుండగా చూచిరి. అనతి దూరమందున్న తేజోమూర్తిని మబ్బులు తొలగిన శరత్కాలమందలి సూర్యునివలె తన తేజస్సులచే ఎడతెగకుండ క్రిందు మీదున అన్నిదెసలను ఉద్భావింప చేయుచున్న కపిల మహర్షిని కనిరి. మఱియు దురాత్ములై ఆయుధములు ఎత్తికొని గుఱ్ఱము దొంగ ఇడుగో ఈ యజ్ఞ విఘ్నకారిని అపకారిని చంపుదమని అతనిమీదికి పరుగెత్తిరి కూడ. అటుపై ఇట్టిట్టు త్రిప్పిన అతని చూపునబడి వారు తమ శరీరమందు పుట్టిన అగ్నిచే దహింపబడి నశించిరి. సగరుడును కపిల మహర్షి తేజమ్మున అశ్వానుసారియైన పుత్రబల మెల్లమసి అయ్యెనని తెలిసికొని అసమంజసుని కొడుకు అంశుమంతుని పిలిచి అశ్వాన్వేషణమునకు నియోగించెను. అతడును సాగరులు త్రవ్విన దారింబట్టిచని కపిలుని దరికి వచ్చి భక్తినమ్రులై, అప్పరమర్షిని స్తుతించెను. అంత అమ్ముని అతనితో ఇట్లనెను. ఈ అశ్వమును పితామహునికి చేర్పుము. వరము కోరుకొనుము. నీ కొడుకు, మనుమడు, ప్రపౌత్రుడు, (ముని మనుమడు) స్వర్గము నుండి గంగను పుడమికి కొనిరాగలడు అనెను. అంత అంశుమతుండును, బ్రహ్మదండ హతులైన మా పితరులకు స్వర్గమునకు అయోగ్యులయిన వారికి, స్వర్గ ప్రాప్తి కూర్చు వరమును మాకు కపిల భగవానుడు అనుగ్రహించుగాక అనెను. అదివిని కపిలర్షి మునిమనుడు ఈ భూలోకమునకు స్వర్గము నుండి గంగనుకొని రాగలడని, ఆ గంగోదకముచే నీ ఎముకలు బూదియు తడిసినంత మీతాతలు స్వర్గమును ఎక్కగలరని. నేనంటినిగదా! విష్ణు భగవానుని పాదము బొటన వ్రేలి నుండి వెడలిన నీటికి ఈ మహిమ గలదు. కేవలము అభిసంధిపూర్వకము (సంకల్పముతో చేయబడినది) కానక్కర లేదు. స్నానాది ఉపభోగములందు ఈ పవిత్ర తీర్థము యథాలాపముగ అయినను, తాకిన ఇది ప్రేతప్రాణియొక్క (మరణించినవానియొక్క) బూడిద, ఎముకలు, చర్మము ప్రేగులు కేశములు మొదలయిన శరీరభాగమేది ఇందు విడువబడినదో ఆ క్షణము శరీరిని (జీవుని) స్వర్గమునకు కొంపోవునన విని అతడు ఆమునికి ప్రణతుడై సెలవుగొని గుఱ్ఱమును కొనివచ్చి పితామహుని యజ్ఞమునకు ఏతెంచెను. సగరుడు ఆ అశ్వమునుగొని యజ్ఞమును పూర్తిచేసెను. అతడు పుత్రప్రీతితో సాగరమును తన పుత్రుడుగా కల్పించుకొనెను. ఆ అంశుమంతునికి, దిలీపుడు, అతనికి భగీరథుడును కల్గిరి. అతడే స్వర్గమునుండి గంగ నిక్కడకుగొనివచ్చి ‘భాగీరథి’ అను పేరందిన దానిగా ఆమెను కావించెను.
భగీరథునికి సహోత్రుడు, అతనికి నాభాగుడు, అతనికి అంబరీషుడు, సింధుద్వీపుడు అయుతాయవు ఋతుపర్ణుడు వరుసగ తండ్రీ కొడుకులైరి. ఋతుపర్ణుడు నలునికి సహాయుడై ఉండెను. అతడు ‘అక్షయ హృదయము’ పాచికలను గూర్చిన విద్య నెఱింగిన వాడు. ఋతుపర్ణుడు, సర్వసకాముడు, సుదాసుడు (సౌదాసుడు) మిత్రసహుడుగా వారి వంశవృక్ష క్రమము సాగెను. మిత్రసహుడు వేటకై అడవిలో తిఱుగుచు రెండు పెద్దపులులను చూచెను. ఆ రెండిటిచేత అవ్వనము జంతువన్నది లేకుండ చేయబడెనని తెలిసి, అందొకదానిని బాణముతో కొట్టెను. అది చచ్చుచు నతిభీషణాకృతియు, వికృత కరాళ వదనుడైన రాక్షసుండయ్యెను. రెండవపులి నీకు ప్రతిక్రియ చేసెదలెమ్మని అంతర్ధాన మొందె. కొంత కాలమఱుగ, అ సౌదాసుడు యజ్ఞమును చేసెను. యజ్ఞము సమాప్తియై వశిష్ఠుడు వెడలిపోగా ఆ రక్షస్సు వశిష్ఠుని రూపుగొని యజ్ఞావసానమందు, నాకు మనుష్యమాంస భోజనము పెట్టుము. దానికి సంస్కారము చేయుమని ఇదిగో క్షణములో వత్తునని వెళ్ళిపోయెను. మఱల వంటవాని వేషముతో రాజు ఆజ్ఞచే మానుష మాంసమును సంస్కరించి తెచ్చి రాజునకు నివేదించెను. ఈ రాజును బంగారు పాత్రమునందు ఉన్న మాంసముగొని, వశిష్ఠునిరాకకు ఎదురు చూచుచుండెను. అంతలో వశిష్ఠుడురాగా అది ఆయనకు నివేదించెను.
అహో! ఈ రాజు తప్పునడత వింతయైనది. ఈ మాంసము నాకు పెట్టుచున్నాడు. ఈ ద్రవ్యరాశి ఏమని ధ్యానపరుండయ్యెను. అందలిది మనుష్య మాంసమని కనుగొనెను. అందువలన కోపముచే మనసు కలుషితమై మావంటి తపస్వులకు తినరానిదని తెలిసియు, దీనిని పెట్టితివి కావున నీకే ఈ అపవిత్ర పదార్ధముపై అభిలాష కలుగుగాక అని రాజును శపించెను. అనంతరము ఆ రాజు స్వామీ తాము నన్నిట్లన్నారు తిరిగి శపించినారేమని తెలుప “ఏమేమి! నేనే ఇట్లంటినా?” అని మఱల అమహర్షి సమాధియందు నిలిచెను. దాన జరిగినది అవగతమై ఆ ఱేనియెడ దయగొని ఈ మనుష్య మాంసాశనము ఆత్యంతికము కాదు (నిరంతరము కాదు). పండ్రెండేండ్లు మాత్రమే ఇది నీకు భోజనము అగునని అనుగ్రహించెను. ఆ రాజు కూడ జలాంజలింగాని, మునికి ప్రతిశాపమీయ ఉద్యమించినంత “స్వామీ! ఈయన మన గురువు. మన కులదేవత అయిన ఆచార్యుడు ఈయనను శపింపదగదని మదయంతి (పత్ని) బ్రతిమాల, నిటు పంటను అటు మేఘములను రక్షింపదలచి ఆశాపోదకములు నేలమీదను ఆకాశమునందును చల్లక దానిచే తన పాదములను దడిపికొనెను. కోపాగ్నినంటిన ఆ నీట వాని పాదములు గాలి మిక్కిలి వన్నె తరిగెను. దాన నతడు కల్మాషపాదుడని పేరు పొందెను.
వశిష్ఠశాపముచే పండ్రెండేండ్ల కాలములందు రాక్షస స్వభావముగొని అడవి యందు తిఱుగుచు అనేక మంది మనుష్యులను తినివేసెను. ఒకప్పుడొక ముని భార్యాసంగతుడై ఉండగా చూచెను. వాని భీషణ రాక్షస ఆకారముచూచి హడలి ఆ దంపతులు పారిపోవుచుండ వాడు బ్రాహ్మణు దంపతులను పట్టెను. అంతట ఆ బ్రాహ్మణి పెక్కు తెరగుల భర్తను ఇమ్మని యాచించెను. దయచూపుము. నీవు ఇక్ష్వాకుకుల తిలకుడవు. మహారాజును, మిత్రసహుడవు. నాయెడ కృతార్ధుడుకాని ఈ నా భర్తను చంపదగడని అనేక ప్రకారముల ఆమె యేడ్చుచుండ, ఆ పులి ఆ విప్రుని జంతువును తిన్నట్లు తినివేసెను. అందుచే అతికోపముచే ఆ బ్రాహ్మణి ఆ రాజును శపించెను. నేనీ విప్రునితోడి సుఖమున అసంతృప్తురాలనైయుండ నా భర్తను తింటివి కావున నీవు కామోపభోగ ప్రవృత్తుడవై ఉన్న తఱించావు పొందెదవు గాక అని శపించెను. ఇటు శపించి ఆమె అగ్ని ప్రవేశము చేసెను. అటుపై పండ్రెండేళ్ళు గడువ, శాపముక్తినంది స్త్రీ విషయాభిలాషియై ఉన్న ఆతనికి మదయంతి జ్ఞాపకము చేసెను. ఆ మీదట అతడు స్త్రీభోగమును త్యజించెను. అపుత్రకుడై ఆ రాజు పుత్రార్ధమై యాచింప వశిష్టుడు మదయంతికి గర్భాధానము చేసెను. ఏడెనిమిదేండ్లకు కూడ శిశువు జనింపకున్నంత, ఆ దేవి (ఆశ్మ) రాతితో గర్భమును కొట్టుకొనెను. అంత పుత్రుడు పుట్టెను. వానికి అశ్మకుడనియే పేరయ్యెను. అశ్మకునికి మూలకుడు కొడుకయ్యెను.
పరశురాముడు క్ష్మాతలమును నిఃక్షత్రియ మొనరింప, స్త్రీలు వివస్త్రలై చుట్టువారుకొని అతనిని రక్షించిరి. అందువలన అతనిని నారీకవచుడని పిలుతురు. మూలికుని వలన దశరథుడు, వానివలన ఇలిబిలుడు, వానికి విశ్వసహుడు, వానికి ఖట్వాంగుడు కల్గిరి. ఖట్వాంగుడు దేవాసుర సంగ్రామమందు దేవతలర్ధింప అసురులను కూల్చెను. స్వర్గమందు కూడ తమకు ప్రియము చేసినాడని వరముకోర ప్రేరేపితుడై వరము గ్రహింపక తప్పదందు రేని నా ఆయుర్దాయమెంతో చెప్పుడని వేల్పులను కోరెను. ఆ పైని వారు ఒక ముహూర్త మాత్రమనిరి. అంత అస్ఖలితయైన, లఘువైన (మిక్కిలి తేలికయైన) విమానమున మర్త్య లోకమునకు వచ్చి ఇట్లనియె. “బ్రాహ్మణులకంటె నాకు ఆత్మ గూడ ప్రియతరము కానట్లు, ఎన్నడేని స్వధర్మమును నేను ఉల్లంఘింపనియట్లు, సకల దేవమానుషపశుపక్షివృక్షాదు లందు అచ్యుతునికంటె వేరైన దృష్టి కలుగకుండునట్లు, ఆ దేవుని మునిజనానుస్మృతుని భగవంతునే, అస్ఖలిత గతినై పొందగల్గునట్లు కోరి, దేవగురువు, అనిర్దేశ్యరూపుడు సత్తా మాత్రుడు అయిన వాసుదేవుడనబడు ఆత్మయందు ఆత్మను సంయోజించి అందే లయమొందెను. సాయుజ్యముక్తి వడసెను. ఈతని విషయమున మున్ను సప్తర్షులు గానము చేసిన (గీతము) శ్లోకరూపములో ఇది వినబడును. దాని భావమిది.” ఏ మహానుభావుడు స్వర్గమునుండి ఇటకు వచ్చి ముహూర్తమాత్ర ఆయుర్దాయమును పొంది జ్ఞానముచే, సత్యముచే, ముల్లోకములను అనుసంధించెనో, అట్టి ఖట్వాంగుని సమానమైన వాడవని పైన ఇంకొకడు లేడు ఉండబోడు.” ఖట్వాంగునికి దీర్ఘబాహువు, వానికి రఘువు, వానికి అజుడు, అజునికి దశరథుడును పుత్రులైరి.
రామాయణ కథ:
ఆ దశరథునికి అబ్జనాభుడు జగత్ స్థితి కార్యమునకు తన అంశమున రామలక్ష్మణ భరత శత్రుఘ్న రూపమున నలురూపుల పుత్రులు కలిగిరి. రాముడు బాల్యమందు విశ్వామిత్ర యజ్ఞ రక్షణకై ఏగుచు, తాటకను కూల్చెను. యజ్ఞమందు, మారీచుని ఒక్క బాణమున సముద్రమందు పడవేసెను. సుబాహు ప్రముఖ రాక్షసులను క్షయమందించెను. దర్శనమాత్రమున అహల్యను పాపరహితను కావించెను. జనకునింట మహేశ్వర చాపమును అనాయాసముగ విరచెను. అయోనిజఅగు జనకరాజతనయను, వీర్యశుల్కను, సీతను పెండ్లాడెను. సకలక్షత్ర క్షయకారిని హైహయవంశధూమకేతువును పరశురాముని వీర్యము బలము గర్వము పోవ బెండువడ చేసెను. పితృవాక్యముచే రాజ్యాభిలాషను గణింపక భార్యతో, భ్రాతతో వనమున ప్రవేశించెను. విరాధ ఖరదూషణాదులను, కబంధుని, వాలిని కూల్చెను. సముద్రమును బంధించి, అశేష రాక్షసకులక్షయము చేసి రావణుడు హరించిన సీతను, వానిని చంపుటచే కళంకము వాసిన దానిని అగ్ని ప్రవేశము చేసి పరిశుద్ధను అనిపించుకొన్న దానిని, అశేష దేవాధీశ సంస్తూయమానశీలను, జనకరాజ తనయను అయోధ్యకు గొని వచ్చెను. అటుపైన ఆ సీతారాములు పట్టాభిషేక మంగళము మైత్రేయా! నూరేండ్లకైన వర్ణింప శక్యము గాదు. సంక్షేపముగా వినుము.
శ్రీ సీతారామచంద్ర పట్టాభిషేక వైభవము:
లక్ష్మణ, భరత, శత్రుఘ్న, విభీషణ, సుగ్రీవ, అంగద, జాంబవంత, హనుమ ప్రభృతులు మోములు విప్పార, చత్రచామరాదులూని సేవింప, బ్రహ్మేంద్రాగ్ని యమ నిరృతి వరుణ వాయు, కుబేర, ఈశానన, ప్రభృతులతో సర్వఅమరులతో వశిష్ఠ, వామదేవ, వాల్మీకి, మార్కండేయ, విశ్వామిత్ర, భరద్వాజ, అగస్త్యాదులైన మునివరులు ఋగ్యజు సామాదులచే సంస్తుతింప, నృత్యగీత వాదాదులు మంగళ వాద్యములు వీణా వేణు మృదంగ భేరీపటహ శంఖకాహళ గోముఖ ప్రముఖ తూర్యనాదములతో, సమస్త భూపతుల మధ్య యందు సకల లోకరక్షణమునకై యథావిధిగా అభిషిక్తుడై దాశరథి, కోసలేంద్రుడు, రఘుకుల, తిలకుడు, జానకీప్రియుడు ముగ్గురు తమ్ములకు కూర్చువాడు, సింహాసనమును అధిష్ఠించి పదునొకండువేల ఏండ్లు రాజ్యము చేసెను.
భరతుడును గంధర్వరాజ్యసాధనకై ఏగి మూడుకోట్ల గంధర్వులను కూల్చెను. శత్రుఘ్నుడును అతి బలపరాక్రముడై, మధుపుత్రుని లవణుని చంపెను. మధురానగరమును నిర్మించెను. ఈ విధముగ అతిబలపరాక్రమ విక్రమంబులు అతిదుష్ట నిబర్హణముచేసి అశేష జగత్తునకుస్థితిని (ఉనికి) నిర్వహించి, శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు మరలి స్వర్గమును అధిష్ఠించిరి. ఆ భగవదవతారమూర్తులందు అనురక్తులైన కోసల రాజ్య ప్రజలు, జానపదులును తన్మనస్కులై తత్సాలోక్యమందిరి. దుష్టసంహారి రాముని కుమారులు కుశలవులు ఇద్దరు, లక్ష్మణని కొడుకులు గద, చంద్ర కేతువులు, భరత పుత్రులు తక్షక, పుష్కలులు, శత్రుఘ్నుని తనయులు సుబాహు, శూరసేనులు. కుశుడు, అతిథి, నిషధుడు, అనలుడు, నభుడు, పుండరీకుడు, క్షేమధన్వుడు, దేవానీకుడు, హీనగుడు, గురుడు, పారియాత్రుడు, బలుడు, ఛలుడు, ఉత్కుడు, వజ్రనాభుడు, శంఖణుడు, వ్యుషితాశ్వుడు, విశ్వసహుడు, హిరణ్యనాభుడు అను తండ్రి కొడుకుల వరుసలో కుశవంశ వృక్షము వర్ణితము. హిరణ్యనాభుడు మహాయోగీశ్వరుడైన జైమినికి శిష్యుడైన యాజ్ఞవల్క్యుని వలన యోగమును పొందెను. హిరణ్యనాభుని కొడుకు పుష్యుడు, వానికి ధ్రువసంధి, వానివలన సుదర్శనుడు, వానివలన అగ్నివర్ణుడు, వానికి శీఘ్రగుడు, అతనికి మరువు కల్గిరి. ఈ మరువు యోగానుసంధానము చేసి ఇప్పుడును కలాప గ్రామమందు ఉన్నాడు. రాబోవు యుగమందు సూర్య వంశ ప్రవర్తికుడు ఈతడు కాగలడు. అతని కొడుకు ప్రశుక్రుడు - వానికి సుసంధి, వానికి అమర్షుడు, అతనికి సహస్వంతుడు, అతనికి భవుడు, భవునికీ బృహద్బలుడు కల్గిరి. ఈ బృహద్బలుడు భారత యుద్ధము నందు అభిమన్యుని చేతిలో చచ్చెను. ఇక్ష్వాకువంశ రాజులను ప్రధానముగా నేను తెల్పితిని. వీరి చరిత్రవినిన వాడు పాప విముక్తుడు అగును. శ్రద్ధతో దీనిని చదివిన సర్వాభీష్టములను పొంది స్వర్గ మందు పూజింపబడును.
శ్రీ పరాశరులనిరి:
ఇక్ష్వాకుని తనయుడు నిమి సహస్ర సంవత్సర సత్రయాగమును ఆరంభించెను. అందు వశిష్ఠుని హోతగా వరించెను. అతనింగని వశిష్ఠుడు తొలుతనే ఇంద్రునిచే అయిదువందల ఏండ్లు జరుగు యాగమున వరింపబడినాడను. ఆ మీదవచ్చి నీకును ఋత్విక్కును అయ్యెదను అంతదనుక ఆగు”మన రాజు మారుపలకడయ్యె. వశిష్ఠుడు ఆతడు అంగీకరించెను అనుకొని అమరపతి యాగమును చేసెను. నిమియును తత్కాలముగ గౌతమాదులైన అన్యులచే యాగముగావింపించెను. ఇంద్రయాగము ముగియ, వశిష్ఠుడు త్వరపడి నిమియజ్ఞము చేయుదునని వచ్చెను. అక్కడ గౌతముడు యాగకర్త అగుట జూచి నిద్ర పోవుచున్న అఱేనికి నన్నుకాదని ఈ గౌతమునికి ఈ ఆతిధ్యజ్యమిచ్చెను కావున ఈతడు విదేహుడు కాగలడని శాపమిచ్చెను. అవనిపతియు మేల్కని ఇట్లనియె. “నన్ను పలుకరింపకనే నిద్రలోనున్న నాకు శాపమిచ్చితివి. నీవు దుష్ట గురువు కావున వానికిని దేహము పడిపోవునని ప్రతిశాపము ఇచ్చి తాను దేహమును విడిచెను. ఆతడిచ్చిన శాపము వలన వశిష్ఠ చిత్తము మిత్రావరుణుల తేజస్సున ప్రవేశించెను. ఊర్వశీదర్శనమువలన బీజస్ఖలనమైన ఆ మిత్రావరులనుండి వశిష్ఠుడు మఱియొక దేహమును పొందెను. ఇక నిమియొక్క శరీరము అతిమనోహరతైల గంధాదులచే ఉపసంస్కృతమై క్లేశాది దోషము లేవియు పొందక సద్యోమరణమందినట్లు ఉండెను. యజ్ఞసమాప్తియై భాగములందికొన వచ్చిన దేవతలంగని ఋత్విక్కులు యజమానునికి వరమిండని కోరిరి. దేవతలు వరమిత్తుము అడుగుమన నిమి ఇట్లు అనియెను. భగవంతులు తమరు సంసారదుఃఖహరులు. శరీరమునకు జీవాత్మకు వియోగ మైనప్పుడు కల్గు ఈ దుఃఖము వంటి దుఃఖమింకొకటి లేదు.
కావున నేను సర్వలోకుల లోచనములందు వసింపగోరెదను కాని శరీర గ్రహణము కోరను. అన దేవతలు అశేషభూతముల కన్నులందు అతనిని అవతరింపజేసిరి. అందువలన భూతములు (ప్రాణులు) ఉన్మేష నిమేషములు (ఱెప్పపాటు) చేయ మొదలిడెను. రాజ్యము అరాజకమగునని భయపడి మునులు పుత్రసంతానము లేని అఱేని శరీరమును అరణియందు మథించిరి. అందుండి కుమారుడు జనించెను. జనించుటవలన, జనకుడను పేరొందెను. ఈతని తండ్రి విదేహుడగుటచే (దేహములేని వాడు అగుటచే) అతని పుత్రుడు, ఈతడు వైదేహుడనియు, మధనమువలన వీధి అనిగూడ పేరందెను. అతనికి ఉదావసువు పుట్టెను. అటనుంచి వరుసగా నందివర్ధనుడు సుకేతువు, దేవరాతుడు, బృహదుక్థుడు. మహావీర్యుడు, సుధృతి, దృష్టకేతువు, హర్యశ్వుడు, మురుడు, ప్రతికుడు, కృతిరథుడు, దేవమీఢుడు, విబుధుడు, మహాదృతి, కృతరాతుడు, మహారోముడు, స్వర్ణరోముడు, హ్రస్వరోముడు, సీరధ్వజుడును తండ్రి కొడుకులయిరి. సీరధ్వజుడు సంతానార్ధియై యజ్ఞభూమి దున్నుచుండ సీత ఉదయించినది. సీరధ్వజుని తమ్ముడు సాంకాస్య పురాధిపతి కుశధ్వజుడు, సీరధ్వజుని కుమారుడు భానుమంతుడు అటనుంచి శుచి ఊర్జుడు, శతధ్వజుడు, కృతిరంజనుడు, పురుజిత్తు, అరిష్టనేమి, శ్రుతాయువు, సుపార్శ్వుడు, సృంజయుడు, క్షేమావి, అనేసుడు, భౌమరథుడు, సత్యరథుడు, ఉపగుపు, ఉపగుప్తుడు, స్వాగతుడు, స్వాంగుడు, స్వాపనుడు, సువర్చుడు, సుభాషుడు, సుశ్రుతుడు, జయుడు, విజయుడు, ఋతుడు, సునయుడు, వీతహవ్యుడు, ధృతి, బహులాశ్వుడు, కృతి మొదలైన వారిచే నిమివంశ వృక్షము తండ్రి కొడుకులుగా విస్తరించినది. ఈ జనక వంశము కృతియందు నిలుపు కొన్నది. వీరందరు మైథిలులు. వీరు సాధారణముగా ఆత్మవిద్యా సంపన్నులయిన భూపాలురుగా ఉందురు. అనగా రాజర్షులు అని అర్థము.
మైత్రేయుడు ఇట్లు అనెను:
నీవు సూర్యవంశ రాజులను తెల్పితివి. ఇక సోమ వంశ రాజులను గురించి వినకోరెదను. ఓ బ్రహ్మణ్య! స్థిరకీర్తులగు చంద్ర వంశ్య రాజుల చరిత్ర నేటికిని కీర్తింప బడుచున్నది. ప్రసాద సుముఖుడవై దానిని ఆనతి ఈదగుదువు అని అడుగగా, శ్రీ పరాశరుడు ఇట్లు అనియె. “ఓ ముని శార్దూల! ప్రసిద్ధ తేజుడగు సోముని వంశమున భూపతులు ప్రసిద్దులు జనించిరి. అనుక్రమముగ వినుము. ఈ వంశము అతిబలపరాక్రమ ద్యుతిశీలచేష్టావంతులు అతిగుణాన్వితులు అయిన నహుషయయాతి కార్తవీర్యార్జునాది రాజన్యులచే అలంకృతమైనది. అఖిల జగత్ర్సష్టయగు భగవంతుడు నారాయణునినాభి సరస్సునందు ఉద్భవించిన అబ్జయోని బ్రహ్మ యొక్క పుత్రుడు అత్రి. అత్రి కుమారుడు సోముడు. ఆయనను బ్రహ్మ ఓషధులు, ద్విజులు, నక్షత్రములకు అధిపతిగా అభిషేకించెను. అతడు రాజసూయ యాగముచేసెను. దాని ప్రభావమున అత్యున్నత ఆధిపత్యము వలన ఇతనిని మదము ఆశించెను. మదాతిశయముచే సకల దేవగురువు బృహస్పతి భార్య తారను హరించెను. బృహస్పతి ప్రేరేపణచే బ్రహ్మ చెప్పినను, దేవర్షులందరు యాచించినను, ఆమెను వదలడయ్యెను. బృహస్పతి తోడిద్వేషముచే శుక్రుడు చంద్రునికి సహాయపడెను. జంభ, నికుంభాదు లెల్ల దానవులు అతనితో పెద్ద యుద్ధము లేవదీసిరి. బృహస్పతికి శక్రుడు సకల దేవసైన్యముతో సహాయుడయ్యెను. ఇట్లు ఆ గురు, చంద్రులకు తారా నిమిత్తముగా తారకామయము అను ఘోర యుద్ధము జరిగెను.
రుద్రపురోగములు దేవతలు అసురులపైని, అశేష దానవులు దేవతల మీదను సర్వాస్త్ర శస్త్రములను ప్రయోగించిరి. ఇట్లు భయంకర సంగ్రామ సంక్షుబ్ధ హృదయమై జగత్తు బ్రహ్మను శరణొందెను. ఆయన శుక్రుని, శంకరుని, అసురులను, సురలను వారించి, బృహస్పతికి తారను ఇప్పించెను. ఆమె గర్భిణియై ఉండుటను చూచి బృహస్పతి నా క్షేత్రమందు నీవింకొకని సుతుని ధరింపరాదు. వీనిని విడువుము. అతిధార్యము చాలింపు చాలింపుము అనగా ఆమె మహాపతివ్రత కావున నాగర్భమును ఒక యిషీకాస్థంభమున తిగిచెను. తిగిచినదే తడవుగ, ఆశిశువు మహాతేజస్సుతో దేవతల తేజస్సును చిమ్మి వేసెను.
ఆ కుమారుడు అతిసుందరుడు అగుటచే వానియెడ ముచ్చటపడు గురుని, చంద్రునింగని దేవతలు సందేహము పుట్టి తారను ప్రశ్నించిరి. సుందరి! మాకు నిజము చెప్పుము. వీడు సోముని కొడుకా బృహస్పతి తనయుడా అన ఆమె సిగ్గుచే ఇంచుకయు పలుకదయ్యె. వేల్పులు మఱిమఱి అడిగినఁ చెప్పకున్నజూచి ఆ పుట్టిన శిశువు ఆమెను శపింపబూని ఇట్లనియె. దుష్టురాల! అమ్మ! మా తండ్రినేల చెప్పవు? ఇదిగో ఇప్పుడే దొంగ సిగ్గునభినయించు నీకు నేను శాస్తి చేయుదును (శాస్త్రి = శాసనము; ఆజ్ఞలో పెట్టెదనన్న మాట. తగిన శిక్ష చేసెదనని లోక వ్యవహారము) ఇప్పుడు గూడ కొంచెమైన పలుకకున్నావు. అనిబాలుడు అనగా పితామహుడు ఆ కుమారుని వారించి స్వయముగా తారను చేరి! అమ్మాయి! చెప్పు. వీడెవ్వని కొడుకు సోముని వాడా! బృహస్పతివాడా! అన నామె లజ్జించుచు మెల్లగ సోముని వాడు అనియె. అంత అచ్చపు తెలిచెక్కిళ్ళ యందు కాంతులు చెదర ఉడుపతి (నక్షత్రములకు రాజు - చంద్రుడు) కుమారుని కౌగలించికొని, బాగుబాగు! వత్స? ప్రాజ్ఞుడవు తెలివైనవాడవు అని వానికి బుధుడని పేరుపెట్టెను. ఇతడు ఇళ యందు పురూరవుడు అను కొమరుని గనెనన్న అంశమును లోగడ చెప్పితిని గదా!
పురూరవుడు అతి దానశీలుడు. అనేక యజ్ఞములు చేసినవాడు. అతితేజస్వి, సత్యవాది, రూపసి, మనస్వి (పండితుడు), మిత్రావరుణులు ఇచ్చిన శాపముచే మానుష్య లోకమునందే ఉండవలయునని నిశ్చయించి, ఊర్వశి ఆ సుందరుని చూచినంతన గుట్టువిడిచి, అతనిపై మనసుపడి స్వర్గసుఖాభిలాష గూడ విడిచి వానినే చేరెను. అతడును సకలలోకాంగనలను అతిశయించుదానిని, సౌకుమార్య లావణ్యగతి, విలాసహావభావాది గుణాది శేషములు ఉపలక్షించి ఆమెయందు మనసు లగ్నము చేసి ఉండెను. ఆ ఉభయులు ఒండొరులు మనసుపడి మరుచూపు లేక మఱి ఇతర ప్రయోజనము లన్నింటిని త్యజించి ఉండెను. పురూరవుడు ప్రౌఢుడు, కావున చొరవసేసికొని సుందరి! నిన్ను ఏను వలచితిని. ప్రసన్నవగుము. అనురాగము గొనుమని పలుక ఊర్వశీ సిగ్గుదొరగి, అగుగాక! నాకొక ప్రతిజ్ఞ గలదు, అది నీవు పాలింతువేని ఇట్లే అగుగాక అన అతడు మఱల ఆమెతో నాకా ప్రతిజ్ఞయేదో తెలుపుమన, ఆమె మఱియు ఇట్లుపలికెను. శయనసమయమున నాకు పుత్రులట్లున్న ఈ మేకపిల్లలను తొలగింపరాదు. నీవు నగ్నుడుగా నాకు కనబడరాదు. నాకు ఆహారము నేయి మాత్రము కావలెననెను. రాజట్లే కానిమ్ము అని చెప్పెను.
ఆమెతోగూడ పురూరవుడు అలకా నగరమందు చైత్రరథ పుష్పోద్యానములందు మానససరోవరము మొదలయిన పద్మ సరస్సులందతి రమణీయ ప్రదేశములందు విహరించుచు, ఇరువది యొక్క సంవత్సరములు దినదిన వర్ధమానానంద రసభరితుడై క్రీడించెను. ఊర్వశియు అతనితోడి ఉపభోగమున ప్రతిదినము అనురాగము అభివృద్ధి నొంద స్వర్గలోక నివాసము మాటయే మఱచెను. ఉర్వశిలేమిచే అమరలోక మప్సరసలకు గంధర్వులకు గూడ అంత మనోహరము కాదయ్యెను. ఉర్వశీ పురూరవులు చేసికొన్న సమయము (ఒడంబడిక) నెఱింగిన విశ్వావసువను నొక గంధర్వుడు తనవారితో గూడ వచ్చి ఆ రాత్రి వారి పాన్పునుండి యొక మేకను కొనిపోయెను. ఆకాశమందది లాగికొన పోవుతఱి బెట్టిన అరపు ఊర్వశి వినెను. దిక్కులేని నాబిడ్డను ఎవ్వడో లాగికొని పోవుచున్నాడు. నేనెవ్వని శరణు ఒందెదననెను. అది వినియు రాజు దిగంబరిగానున్న నన్ను దేవి చూడదని వెలికిపోడయ్యె. అవ్వల రెండవ మేకనుగూడ గంధర్వులు లాగికొనిపోయిరి. దాని అరపుగూడవిని మఱల నేననాథను అభర్తృకను. కుత్సితునొక్కని గట్టుకొని తిఱుగుచున్నాని ఆక్రందించెను. పురూరవుడు అందులకు కోపముగొని ‘చీకటిగదా’ అని ఖడ్గమును గొని ఓరీ! దుష్టదుష్ట! ఇదె చచ్చితివి చూడుము అనుచు పరుగెత్తెను. అంతలో గంధర్వులు మిక్కిలిగ ఉద్దీపించు మెఱుపును జూపిరి. ఆవెలుగులో ఊర్వశి రాజును దిగంబరిగాగని మున్ను చేసికొన్న కట్టడదప్పినదని ఆ క్షణమే వెడలిపోయెను. గంధర్వులు ఆ మేకల నక్కడనే విడచి సురలోకమేగిరి. ఆ మేకలంగొని రాజు ఆనందభరితుడై తన పాన్పునకేతెంచి యూర్వశిని కనడయ్యెను. ఆమెనటగానక దిగంబరిగానే వెర్ఱివాడట్టు వెఱ్ఱి పర్వులు పెట్టెను. కురుక్షేత్రమందు తామర కొలనిలోని ఇతరాప్సరసలు నల్వురగూడి ఉన్న ఊర్వశిని గాంచెను. ఆవెఱ్ఱి రూపుతోనే ఇంతీ! నిలునిలు! మనసున పరమఘోరవు. మాటలో కపటవు. ఓసి! నిలునిలుమని ఇట్లు పలుభంగులయిన సూక్తములు పల్కెను. ఊర్వసియు నిట్లనియె. మహారాజ! ఈ యవివేక చేష్టలు చాలును. నేనిపుడు గర్భిణిని. ఏడాది తరువాత నీరాడగును. నీకు కొడుకు కలుగగలదు. ఒకానొక రేయి నీతో కలసి ఉందునుగదా అన హర్షించి పురూరవుడు తన పురమునకుజనెను. ఆ అప్సరసలతో ఊర్వశి నేను ఇన్నాళ్ళు అనురాగమున మనసు ఆకర్షింపబడి గూడి యున్న పురుషుడు ఈతడు అనెను. వారు ఇట్లనిరి. బాగుబాగు! ఈతని చక్కదనమెంత చక్కనిది. ఈతనితో మాకుగూడ కలకాలమునికి జతవడుగాక! అనిరి. ఏడాది కాగానే ఆరాజచటకేతెంచెను. అతనికి ఊర్వసి కుమారుని దీర్ఘాయుష్మంతుని సమర్పించెను. సమర్పించి యొక్క రేయి ఆయనతో నుండి యైదుగురు కొడుకులు గలుగు గర్భము ధరించెను. మఱియు ఱేనింగని నాకు బ్రీతిగలుగ సర్వగంధర్వులు మహారాజువైన నీకు వరమీయనున్నారు వరమడుగుము అన రాజు రిపుల నందరను గెలిచితిని. ఇంద్రియ పాటవము ఇంచుకయు సడలలేదు. బంధు సమృద్ధియు గలదు. అమిత సైన్యకోశ సమృద్ధియు గలదు. ఊర్వశీ సాలోక్యము కంటె మరియొకటి మాకు కావలసినదిలేదు. కావున నేను ఈ ఊర్వశితోడన కాలము గడుపగోరెదను అన గంధర్వులు ఆ రాజునకొక స్థాలిని (పాత్రను) ఒసంగిరి. మఱియు ఇట్లు పలికిరి. వేదామ్నాయమును అనుసరించువాడవై, అగ్నిని మూడుగా చేసి ‘ఊర్వశీ సలోకతా మనోరథసిద్ధ్యర్థము అని (సంకల్పము చేసి) చక్కగ యాగము చేయుము. దాన అవశ్యము అభిలషితమందగలవు” అని పలుకగా అనగా అతడా అగ్ని స్ధాలింగాని ఏగెను. నట్టడవిలో అక్కడ! నా తెలివి తక్కువతనమిది యేమి? నేనిపుడేమి సేసితిని? అగ్ని స్థాలింగొని వచ్చితిని. ఊర్వశినిగాదు అని అర్థాలిని అడవిలోనే విడిచెను. స్వపురమునకు ఏగెను. అర్ధరాత్రి కడచిపోగా మెలకువవచ్చి ఇట్లనుకొనెను. “ఊర్వశీసాలోక్య ప్రాప్తికి గంధర్వులు నాకు అగ్ని స్థాలిని ఇచ్చిరి. నేనద్దానిని అడవిలో పారవేసితిని. అందుచే అది తెచ్చుట కేగెదనని లేచి అటకేగి అచ్చట దానిని గనడయ్యె.
ఇక్కడనే అగ్ని పాత్రనుంచితిని. అదే అశ్వత్ధము శమీగర్భము అయినది. అందుచే అదే అగ్ని రూపమునుగొని నేనుపురమేగి అరణింగావించి అందు ఉదయించిన అగ్నిని ఉపాసించెదను అని పురమునకువచ్చి అరణింగావించెను. అదే అంగుళముల కొలతతో అరణిఁజేయువాడై, గాయత్రిని పఠించెను. పఠించుచుండగా గాయత్రీ మంత్రాక్షరములు ఎన్నో అన్ని అంగుళముల అరణితయారయ్యెను. అందు అగ్నిని మధించి త్రేతాగ్నులను అతడామ్నాయానుసారియై హోమము చేసెను. ఊర్వశీ సాలోక్యమును ఫలముగా అభిసంధానముచేసెను. (సంకల్పము చెప్పికొనెనన్న మాట) అదే అగ్ని విధానమున బహువిధ యజ్ఞములుచేసి గాంధర్వలోకములు వడసి ఊర్వశితో ఎడబాటులేని స్థితినందను. మొదట ఏకాగ్నియే ఉండెను. ఈతనిచేత ఈ మన్వంతరము ఇట్లు త్రేతాగ్నులు ప్రవర్తింప చేయబడెను.
శ్రీ పరాశరుడు ఇట్లు చెప్పెను. ఆ పురూరవునకు ఆయువు, అమావసువు, విశ్వా వసువు శ్రుతాయువు, శతాయువు, అయుతాయువు అను ఆఱుగురు పుత్రులు కల్గిరి. అమావసువునకు భీముడు అను కొడుకు కల్గెను. భీమునికి కాంచనుడు, అతనికి సుహోత్రుడు, అతనికి జహ్నువు, పుట్టిరి. ఈ జహ్నువు యజ్ఞవాటమును గంగ ముంచెత్తగా, కోపముచే కన్నెఱ్ఱచేసి, భగవంతుని యజ్ఞపురుషుని పరమసమాధిచేత ఆత్మారోపణము చేసికొని, గంగనెల్ల త్రావివైచెను. అప్పుడు దేవర్షులు ఈయనను ప్రసన్నుని కావించిరి. గంగను ఈయనకు కుమార్తెను కావించిరి. జహ్నువునకు సుమంతుడు అను పుత్రుడు ఉదయించెను. అతనికి అజకుడు, అతనికి బలాకాశ్వుడు, వానికి కుశుడు కల్గిరి. అతనికి కుశాంబ, కుశనాభ, ఆధూర్తరజస, వసువు అను నల్గురు తనయులుకల్గిరి. అందు కుశాంబుడు ఇంద్రతుల్యుడు సుతుడు కావలెనని తపస్సు చేసెను. వాని ఉగ్రతపముగని “నాసమానుడు ఇంకొకడు కలుగకుండుగాక” అని ఇంద్రుడు తనకు తాను అతనికి పుత్రుడు అయ్యెను. అతడే గాధి కౌశికుడు అనబడెను. గాధికి సత్యవతి జనించెను. ఆమెను భృగువంశీయుడు, ఋచికుడు వరించెను. గాధి మిగులు రోషస్వభావుడై వృద్ధుడై ఉన్న బ్రాహ్మణునికి పిల్లనీయుటకు ఇష్టపడక, చెవులు నలుపు, మేనికాంతి చంద్రసదృశము వాయువేగమునుగల వేయి గుఱ్ఱములను కన్యాశుల్కముగా అడిగెను. ఆ ఋషియు వరుణుని వద్దనుండి అశ్వతీర్థమునందు పుట్టిన ఆ లక్షణములుగల అశ్వసహస్రము తెచ్చి ఇచ్చెను. అందుచే ఋచీకుడు సత్యవతిని పెండ్లాడెను. ఋచీకుడు ఆమెకు సంతానము కొఱకు ఒక చరువును కల్పించెను. ఆమె బ్రతిమాలగా ఆమెతల్లికి క్షత్రియవరుడు పుత్రుడు పుట్టుటకు ఇంకొక చరువునుసాధించెను. “ఈ చరువు నీకు ఈ ఇంకొక చరువును మీ అమ్మ లెస్సగ ఉపయోగింపవలెను” అని తెల్పి, వనమునకేగెను. ఉపయోగించు సమయమున సత్యవతితో తల్లి పుత్రి! తన కొడుకు మిగుల గుణవంతుడు కావలెనని అందరును కోరుదురు. అంతియకాని తన భార్యసోదరులు మొదలగువారి గుణములయెడ అంత ఆదరము గొనరు. అందుచే నీవు నీ చదువును నాకిచ్చి నా చరువును నీవు ఉపయోగించు కొనుము. నాకొడుకు సకల భూమండల మేలవలెను. బ్రాహ్మణునికి బలవీర్య సంపద ఎంతపాటి? అని సత్యవతి తన చరువును తల్లికిచ్చెను. వనమేగిన ఋషివచ్చి సత్యవతి వంక చూచెను. ఇట్లనెను గూడ! “ఓసీ! అతిపాపురాలు నీవీ పాడుపని చేసితివి ఏమి? నీ శరీరము అతి రౌద్రముగ కన్పించుచున్నది. మీతల్లికిచ్చిన చరువును నీవు ఉపయోగించితివి. ఇది నిక్కము ఇది తగని పని. నేనా చదువునందు సకలైశ్వర్యబల సంపద ఉంచితిని. నీ చదువునందు శాంతి జ్ఞానము ఓరిమి మొదలయిన అఖిల బ్రాహ్మణ గుణ సంపద ఉంచితిని. దానిని విపరీతము చేసితివి కావున నీకు అతి రౌద్రాస్త్ర ధారణ పాలనా నిష్ఠుడగు క్షత్రియాచారుడు పుత్రుడు కల్గును. ఆమెకు శమదమాది సంపన్నుడు, బ్రహ్మతేజస్వి, బ్రాహ్మణాచార్యుడు ఉదయించును” అని చెప్పగా. విని ఆమె ఆతని పాదములు పట్టు కొనెను. ప్రణతయై మఱియు ఇట్లనియె. “స్వామీ! నేను తెలియక ఇట్లు చేసితిని. దయచూపుము. నా కొడుకు ఇట్టివాడు కాకుండుగాత! పౌత్రుడిట్టివాడైన కానిమ్ము!” అన ముని అట్లే అగును అనియె. అవ్వల ఆమె జమదగ్నిని కనెను. ఆమె తల్లి విశ్వామిత్రుని కన్నది. సత్యవతి కౌశికి అనునది అయ్యెను. జమదగ్ని ఇక్ష్వాకు వంశ్యుడగు రేణువు అనురాజు కూతురును రేణుకను వివాహము ఆడెను. ఆమె యందు అశేష క్షత్ర సంహారకుడగు భగవంతుని పరశురాముని, సకలలోక గురువగు నారాయణ వంశమున కనెను. విశ్వామిత్రుని కొడుకు భార్గవుడే శునశ్శేపుడను పేరివాడు. దేవతలచే ఈయబడినాడు. అందుచేత దేవరాతుడు అని పేరొందెను. ఆతఱ్వాత మధుచ్ఛందుడు, ధనంజయుడు, కృతదేవుడు, అష్టకుడు, కచ్ఛపుడు, హరి అనువారు విశ్వామిత్రునికి పుత్రులు కలిగిరి. వారికి అనేకములు కౌశిక గోత్రములు ఇతర ఋభులందు వివాహము చేసికొన తగినవి కల్గినవి.
పురూరవుని పెద్ద కొడుకు ఆయువు. అతడు రాహువు కూతురిని పరిణయమాడి ఆమె యందు అయిదుగురు కొడుకులను కనెను. వారు నహుష, క్షత్రవృద్ధ, రంభ, రజి అనే నసుడు అనువారు ఆ వంశపరంపర వారి పేర్ల మూలముననే సులభముగా తెలియును.
శ్రీపరాశరులు అనిరి. రజికి అసమాన బలవీర్య పరాక్రమములు అయిదు వందల మంది కుమారులు ఉండిరి. దేవాసుర సంగ్రామ మందు దేవతలు రాక్షసులు నొండొరులం జంపికొన నెంచి బ్రహ్మ దగ్గరకువచ్చి మాలో ఏపక్షము గెలుచును అనిరి. బ్రహ్మ “ఎవరి వైపు రజి ఆయుధము ఎత్తి పోరాడునో, ఆపక్షము జయింప గలదు” అనియెను, అంత దైత్యులు వచ్చి రజిని తమవైపు పోరుమని అర్థించిరి. అతడు పోరెదనుగాని అమరుంగెల్చి నేను మీకు ఇంద్రుడు గావలయునన విని దైత్యులు మేమింకొకలాగు మాట్లాడము ఇంకొకలాగు చేయము. మాకు ఇంద్రుడు ప్రహ్లాదుడు అతని కోసమే ఈ మా ఉద్యమము అని, వారు చనినంత, దేవతలు వచ్చి మాపక్షమున పోరుమన వారితోడను అతడు అట్లే పలుకగా వారు అంగీకరించిరి.
రజియును, దేవసైన్య సహాయమున అనేక మహాస్త్రములచేత అసురబలమును సంహరించెను. ఆమీద అట్లు శత్రుపక్షమును గెలిచి, దేవేంద్రుడు రజిపాదములు రెండు తన తలనానించి ఇట్లనియె. భయమునుండి రక్షించి మాకు అన్నము పెట్టినావు కాన మాకీవు తండ్రివి. ఎల్లలోకాలకు నీవు ఉత్తమోత్తముడవు. అట్టి నీకు త్రిభువనాధీశ్వరుడనైన నేను పుత్రుడను. రజి మహారాజును నవ్వి అట్లే అగుత ఇట్లే అగుగాక! అనేక మధురమైన మాటలతో చేసిన ఈ ప్రణతి (సాష్టాంగ నమస్కారము) శత్రువేని కాదనరానిది అని నిజరాజధాని కరిగెను. శతక్రతువు ఇంద్రపదవిని నిర్వహించెను.
అవ్వల రజి స్వర్గమునకు అరుగగా రజి కుమారులు నారదుని ప్రేరణచే తమ తండ్రికి కొడుకైన శతక్రతుని (ఇంద్రుని) పితృపుత్ర సంప్రదాయమును అనుసరించి దేవేంద్ర రాజ్యమును అడిగిరి. అతడీయకున్నంత అతనిని ఓడించి ఆ బలశాలురు తాము ఇంద్రత్వమును నిర్వహించిరి. అవ్వల పెద్దకాలము గడువ ఏకాంతమందు బృహస్పతిని దర్శించి త్రైలోక్య యజ్ఞభాగములిట్లు రజి కొడుకులచే అపహరించబడి, ఇంద్రుడు రేగుపండంతయేని పురోడాశఖండము నాకీవు దయచేయవగుడు వన గురుండీమాట మున్నే నాకు చెప్పి ఉన్నట్లైన నీకై నేను చేయరానిపని ఏమున్నది? కొలదినాళ్ళలో నిన్ను నీస్థానమును పొందింతును చూడుమని ఆ రజి సంతానమునకు మతి చెడుటకు, శక్రునికి తేజోవృద్ధి అగుటకు ఆభిచారిక హోమము కావించెను. దానిచేవారు బుద్ధిమోహముచే చెడి బ్రహ్మ ద్వేషులై ధర్మత్యాగులై వేద విముఖులైరి. అవ్వల ఇందుడు ఆ అధర్మాచారుల నుక్కడగించెను. పురోహితునిచే తేజస్సాప్యాయనమొంది, ఇంద్రుడు స్వర్గమును ఆక్రమించెను. ఈ ఇంద్ర పదచ్యుతి నుండి పునరారోహణము వరకుగల కథను విన్నవాడు స్వపద భ్రష్టుడుగాడు. దౌరాత్మమును పొందుడు అనగా వానికి దౌర్భాగ్యము కలుగదు.
రంభునికి సంతతి లేదు. క్షత్రవృద్ధుని కొడుకు ప్రతిక్షత్రుడు. వాని కొడుకు సంజయుడు. వానికి జయుడు, వానికి విజయుడు పుట్టిరి. విజయుడును వానివాడు, హర్యధనుడు, వానివాడు సహదేవుడు. వానికొడుకు అధీనుడు. వాని తనయుడు జయ త్సేనుడు. వానికి సంకృతి, వానికి క్షత్రధర్ముడు కలిగిరి. వీరు క్షత్రవృద్ధ వంశీయులు అనగా వీరక్షత్రవృద్ధ వంశీయులు. ఈమీద నహుష వంశమును తెలిపెదను వినుడు.
నహుషుని కొడుకులు ఆరుగురు. యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియాతి, కృతి అనువారు. మహాబలశాలురు. యతి రాజ్యమును కోరలేదు. యయాతి భూపతి అయ్యెను. అతడు శుక్రాచార్యులు కూతురును దేవయానిని, వృషపర్వుడను రాజు కూతురును శర్మిష్ఠను పెండ్లాడెను. ఇక్కడ “దేవయాని యదువును తుర్వసుని కన్నది. వృషపర్వుని కూతురు (వార్షపర్వణి) ద్రుహ్యుని అనువును పూరుని కనెను”. శుక్రుని శాపముచే యయాతి కొంతకాలమునకు ముసలితనమొందెను. ఆమీద ప్రసన్నుడైన ఆ శుక్రుని మాటను బట్టి తన ముదిమిని పెద్ద కొడుకగు యదువునకు సంక్రమింప చేయవలెనని “వత్సా! నీ మాతామహుడు ఇచ్చిన శాపముచే ఈ అకాలమున నాకు జర (ముసలితనము) వచ్చినది. దానిని అతని అనుగ్రహముననే నీకు సంక్రమింప చేసెదను. ఒక వేయేండ్లు విషయ భోగములు అనుభవించితిని, కాని తృప్తి కలుగలేదు. నీ ప్రాయముచే నేను విషయములను అనుభవింపగోరుచున్నాను. ఇది నీవు కాదనరాదు.” అనవిని యదువా! ముదిమిని తీసికొన ఇష్టపడలేదు. వానినితండ్రి వీసంతతి రాజ్యార్హముకాబోదని శపించెను. అటుపై శర్మిష్ఠ తనయుని, అందరికన్న చిన్నవానిని, పూరుని అట్లే అడిగెను. అతడత్యంతాదర బుద్ధియై సబహుమానముగ తండ్రికి ప్రణమిల్లి మహాప్రసాదమిది మాకని” ఉదారముగ పలికి ముదిమినికొనెను. తనయౌవనమును తండ్రికొసగెను. అతడును, పూరువు యొక్క జవ్వనమును పొంది ధర్మము తప్పకుండ యథాభిలాషముగ సమయ మునకు సమకూరిన విధముగ ఉత్సాహముతో విషయములు వెంట చరించెను. ప్రజా పాలనము కూడ చక్కగ చేసెను. విశ్వాచి (అప్సరస)తో దేవయానితోడను, ఉపభోగ అనుభవమును పొంది కామముల తుదినందెను తనియుచు అనుదినము అదే మనసుపడి ఉండెను. దినదినోపభోగములచే కామములు అతి రమ్యములు అని తలంచెను. అందుచే ఇతని గూర్చి ఇది ఒక గాథ.
ఎన్నడేని కామము, కామముల ఉపభోగమున శమింపదు. హవిస్సుచేత అగ్నివలె, మిక్కిలిగ అభివృద్ధి చెందును. పృథివియందు ఉన్న మొత్తము వ్రీహులు, యవలు ఇత్యాది ధాన్య విశేషములు హిరణ్యము (బంగారము) పశువులు స్త్రీలును ఒక్కనికి గూడ సరిపోవు. అందువలన తృష్ణను ఆశను పరిత్యజింపవలయును. సర్వ భూతములందును పాపపు తలంపును ఎప్పుడు చేయడో, అప్పుడా సమదృష్టిగల వానికి అన్నిదిశలు సుఖ వలయములు. దుర్మతులైన వారేది వదలజాలరు. ఏ కొలది చరించిన కొలది యేదిచరింపదో (ముదిమి గ్రమ్మిన దేనికి ముదిమి లేదో) అట్టి తృష్ణను ఆశను ప్రాజ్ఞుడు వీడ వలయును. అట్టివాడు సుఖముచే నింపబడును. చరించిన వానికి జుట్టు దంతములు జరించును (జుట్టు నెరియును పండ్లూడును) ధనాశ జీవితాశ మాత్రము జరావశుడైన వానికి జరింపపు. విషయలంపటుడ నైన నాకు వేయి యేండ్లు నిండినవి. అయినను అనుదినమునాకు వానియందాశ కల్గుచునే ఉన్నది. కావున నేనీ తృష్ణను విడిచి మనసును బ్రహ్మమందు ఉంచి, నిర్ద్వంద్వుడనై (సుఖః దుఃఖములు శోక మోహములు అను నీ జంటల అంటు తొలగి) నిర్మముడనై నాది, నేను అను మమకారము బాసి మృగములతో గూడ జరించెదను అని పూరుని నుండి జరంగైకొని యౌవనము వానికిచ్చి రాజ్యమందతని అభిషేకించి తపస్సునకు అడవికి పోయెను. ఆగ్నేయ భాగమందు తుర్వసుని పడమట ద్రుహ్యుని దక్షిణాపథమున యదువును ఉత్తరదిశ అనువును పరిమితమండల అధిపతులను కావించి సర్వ పృథ్వీమండలేశ్వరుని పూరువును కావించి ఆతడు వనమేగెను.
శ్రీ పరాశరుడు అనెను. ఈమీద యయాతి పెద్ద కొడుకగు యదువు యొక్క వంశమును నేనుతెల్పెదను. ఇందు అశేషలోకవాసుడు మనుష్య సిద్ధ గంధర్వ యక్ష రాక్షస గుహ్య కింపురుష అప్సర ఉరగ విహగ, దైత్యదానవ ఆదిత్య రుద్ర వసు అశ్విమరుత్ దేవర్షులచేత మోక్షార్థుల చేత ఆయా ఫలలబ్ధికై ఎప్పుడు స్తుతింపబడుచు అపరిచ్ఛిన్న మాహాత్మ్యము యొక్క అంశముతో భగవంతుడు అనాదినిధనుడు విష్ణువు అవతరించెను. కృష్ణాఖ్యమగు పరబ్రహ్మము ఎందు నరాకృతిని అవతరించెనో, ఆయదువుయొక్క వంశమునువిని అతడు సర్వపాప విముక్తుడు అగును.
యదువు కుమారులు సహస్రజిత్తు, క్రోష్టువు, నలుడు, నహుషుడు అనువారు నల్గురు. సహస్రజిత్తుకొడుకు శతజిత్తు అతనికి హైహయ, హేహయ, వేణుహయులు ముగ్గురు పుత్రులు. హైహయుని కొడుకు ధర్మడు. వానివాడు ధర్మనేత్రుడు వానికి కుంతి వానికి సహజిత్తు, వానికి మహిష్మంతుడు కల్గిరి. మహిష్మంతుని నిర్మాణమే మాహాష్మతీ నగరము. వానికి భద్రశ్రేణ్యుడు, వానికి దుర్దముడు, వానికి ధనకుడు, వానికి కృతవీర్యుడు కృతాగ్ని కృతధర్ముడు, కృతౌజుడు అను నల్గురు కల్గిరి. కృతవీర్యునికి అర్జునుడు (కార్తవీర్యార్జునుడు) కల్గెను. ఇతడు సప్త ద్వీపాధిపతి వేయి బావులు కలవాడు అయ్యెను. ఈయన భగవదంశ సంభూతుడు. అత్రి వంశీయుడు అయిన దత్తాత్రేయుని సేవించి బాహుసహస్రము, అధర్మ సేవానివారము, స్వధర్మ సేవిత్వము, రణమందు పృథ్వీజయము, ధర్మపరిపాలము, శత్రువులవలన అపరాజయము, జగత్ ప్రఖ్యాతుడైన పురుషునివలన మృత్యువు అను ఈ తాను కోరిన వరములను పొందెను. అతనిచే అశేష ద్వీపవతి వసుమతి చక్కగా భావింప బడెను, ఇతడు పదివేల యజ్ఞములుచేసెను. పార్థివులుయజ్ఞములచే, దానములచే, తపస్సులచే, వినయముచే, శ్రుతముచే, (వినికిడిచే) పాండిత్యముచే, నిజముగా కార్తవీర్యుని దారి చనలేరు అని ఇతడు కీర్తింపబడెను.
అతని రాజ్యమందు ద్రవ్యనష్టము అనునది (దొంగతనము) లేనేలేదు. ఇట్లు ఎనుబది అయిదు వేల సహస్రములు అవ్యాహ్యతమైన ఆరోగ్యము బలము పరాక్రమమును పొంది రాజ్యము చేసెను.
మాహిష్మతీ నగరమందు దిగ్విజయమునకై బయలుదేరి వచ్చి నర్మదాజలము లందు దిగి, జలక్రీడలాడి పానమదముచే వ్యాకులుడైయున్న ఆకార్తవీర్యనిచే అశేషదేవదైత్య గంధర్వాధీశుల జయించినందున పుట్టిన మదమున కల్గిన గర్వాతిశయమును పొందిన రావణుడును పశువట్లుబంధింపబడి, తననగరమందు ఏకాంతమున ఉంపబడెను. ఈ మహాత్ముడు ఎనుబది అయిదువేల యేండ్ల చివర భగవన్నారాయణ అంశమైన పరశురామునిచే ఉపసంహరింపబడెను.
అతని నూర్గురు పుత్రులలో ఐదుగురు ప్రధానులు. శూర, శూరసేన, వృషసేన, మధు జయధ్వజులను పేర్లు గలవారు. జయధ్వజునికి తాళజంఘుడు. అతనికి తాళ జంఘులు అను నూర్గురు కొడుకులు కల్గిరి. వీరిలో జ్యేష్ఠుడు వీతిహోత్రుడు మఱియొకడు భరతుడు. భరతునికి వృషుడు, అతనికి మధురుడు, అతనికి వృష్టి మొదలగు నూర్గురు కొడుకులు కల్గిరి. అందువలన ఈ వంశము వృష్టి వంశము అను ప్రసిద్ధిపొందెను. మధువు అను నాతడు మధు వంశమను పేరునకు కారణమయ్యెను. యదువుపేర లక్షింప బడుచు యాదవులు అయిరి.
శ్రీ పరాశరుడు ఇట్లు అనియె. యదువు కొడుకు క్రోష్టువు. వానికి ధ్వజినీవంతుడు, వానికి స్వాతి, వానికి రుశంకువు, వానికి చిత్రరథుడు, వానికి శశిబిందువుకల్గిరి. ఇతడు చక్రవర్తి. పదునాల్గు మహారత్నములు ఈతని వద్ద ఉండేనట. వానికి నూరు వేల మంది భార్యలు పదిలక్షల మంది కుమారులు ఉండిరి. అతడి సంతానములో పృథుశ్రవసుడు, పృథువర్మ, పృథుకీర్తి, పృథు యశుడు, పృథు జయుడు, పృథుదాసుడు అను ఆరుగురు పుత్రులు ప్రధానులు. వారిలో పృథుశ్రవసుని పుత్రుడు పృథూత్తముడు. వానికి ఉశనుడు కల్గెను. ఇతడు నూఱశ్వమేధములు చేసెను. వాని కుమారుడు శితపువు. వానికి రుక్మకవచుడు, వానికి పరావృత్తు, వానికి రుక్మేషువు, పృథువు, జ్యామఘుడు, పలితుడు, హరితుడు అను ఐదుగురు కుమారులు కల్గిరి. జ్యామఘుని గూర్చి భార్యకు లొంగిన వారుందురు. కొందరు గతించి ఉందురు. శైబ్యకు భర్తయగు జ్యామషుడు శ్రేష్ఠుడు” అని ఒక శ్లోకము కీర్తింపబడుచున్నది. ఆమెకు సంతతి లేదు. అయినను భయపడి మఱొకభార్యను అతడు చేసికొనలేదు. అతడొక తఱి చతురంగబల సమ్మేత దారుణమైన యుద్ధమునందు సర్వశత్రు మండలమును జయించెను. ఆ శత్రు కూటమి పుత్రకళత్ర బంధు, యుతకోశ సమృద్ధమైన తమ రాజధానులను వదలి పారిపోయిరి. అప్పుడు భయభ్రాంతియై బెదరుచూపులు నొకరాజకన్యామణిని తండ్రీ! అమ్మా! అన్నా! రక్షించు రక్షింపుమని ఏడ్చుచున్న దానిని ఆ రాజు చూచెను: ఆమెను గనుటవలన ఆమె యందు అనురక్త మనస్కుడై ఇట్లనుకొనెను. బాగున్నది సంతానములేని (వంధ్యా భర్తను అగు) నాకు దైవము సంతాన కారణముగా ఒక కన్యా రత్నమును సంఘటించెను. అందు వలన నేనీమెను పెండ్లాడెదను లేదా ఈమెను రథము ఎక్కించికొని రాజధానికి కొని పోయెదను. ఆ శైబ్య అనుమతి తీసుకొనియే వివాహము అయ్యెదనని తన నగరమునకు వచ్చెను. శైబ్య విజయము గొని వచ్చుచున్న ప్రభువును దర్శింప పౌరభృత్య పరిజనామాత్య వర్గముతో ఎదురేగి నగర ద్వారమందు నిలిచి రాజువద్ద ఉన్న కన్యంగని ఇంచుక కినుక పొడమ అధరపల్లవము అదర రాజుతో అనెను. “ఓ! అతి చపలచిత్తుడా! ఎవతెను రథము ఎక్కించుకొని వచ్చితివి? అన ఆతేడు మిగుల జడిసి పోయి, ఈమె నా కోడలు అనెను. అంతట శైబ్య నేనా కొడుకును కనలేదు. నీకా ఇంకొక పెండ్లాము లేదు. నీ ఏ కొడుకు చేత ఈ కోడలి చుట్టరికము అనెను. ఇట్లు అసూయా కోపకలుషితములైన మాటవలన వివేకము కోల్పోయి జడుపువలన తాను మునుజెప్పిన తప్పుడు మాట తొలగించుకొన అవనిపతి ఆమెకు ఇట్లనియె.
నీకు కలుగబోవు కుమారునికి ఇంతదాక అవతరింపనివానికి ఈమె కాబోవు భార్యగా నిర్దేశింప బడినదన విని ఆ యింతి ఇంచుక నవ్వి అట్లే అగుగాక అనెను. రాజుతో నగర ప్రవేశము చేసెను. మఱియు ఆ మీద అతి వినిర్మల శుభలగ్న హోరాంశ లందు రాజు, తనకుపుత్ర లాభము కల్గునన్న వచన ప్రభావముచే, వయసు గడిచిన తర్వాత గూడ ఆరాజ్ఞి గర్భవతియై సకాలమున కుమారుని కనెను. ఆ శిశువునకు తండ్రి విదర్భుడు అను నామముంచెను. అతడా రాజకన్యను పెండ్లాడెను. ఆమెయందు అతడు క్రథుడు, కైశికుడు అను ఇద్దరు కొడుకులను కనెను. అటుపై రోమపాదుడు అను మూడవ పుత్రుని పొందెను. అతడు నారదుని వలన జ్ఞాన సంపన్నుడు అయ్యెను.
రోమపాదునికి బభ్రువు, బభ్రువునకు ధృతియు, ధృతికి కైశికుడు, కైశికునికి ఛేదిఅను కొడుకు ఉదయించెను. అతని సంతతియే వైద్యరాజులు. జ్యామఘుని కోడలి పుత్రుడగు క్రధునకు కుంతియు. కుంతికి దృష్టి, అతనికి నిధృతి, అతనికి దశార్హుడు, అతనికి వ్యోముడు, అతనికి జేమూతుడు, అతనికి వికృతి, అతనికి భీమరథుడు, అతనికి నవరథుడు, అతనికి శకుని, అతనికి కరంభి అతనికి దేవరాతుడు కల్గిరి. దేవరాతుని కొడుకు దేవక్షత్రుడు. అతనికి మధువు, మధునికి కుమారవంశుడు, అతనికి అనువు, అనువునకు పురుమిత్రుడు పుట్టిరి. అతనికి అంశుడు, అతనికి సత్వతుడు కలిగిరి. అతని వంశపరంపర సాత్వతులు అనబడిరి. ఈ జ్వామఘుని సంతతిని శ్రద్ధతో విన్నవాడు సర్వ పాపములనుండివిడివడును. (IV-12)
సత్త్వతుని కుమారులు ఏడుగురు, భజన, భజమాన, దిన్య, అంధక, దేవాపృథ, మహాభోజవృష్టి నామకులు కల్గిరి. భజమానునికి నిమి, కృకణ, వృష్ణులు కల్గిరి. వారికి సవతితల్లి కొడుకులు శతజిత్తు, సహస్రజిత్తు, అయతజిత్తు, అనువారు ముగ్గురు. దేవాపృథునికి బభ్రువు కల్గెను. ఆ తండ్రి కొడుకుల గూర్చిన శ్లోకము భావమిది.
“దూరము నుండి ఏమి విన్నామో దగ్గరగా దానిని చూచుచున్నాము. బభ్రువు మానవోత్తముడు. దేవాపృథుడు దేవసమానుడు.
బభ్రువు వలన అఱువది అఱువేలమంది, దేవాపృథుని వలనను ఎనిమిది వేలమంది పురుషులు అమృతత్వమునందిరి. అ వంశమందు మహాభోజుడు బహుధర్మమూర్తి. అతని పరంపర భోజులనుపేర మృత్తికావరపురవాసులు, మార్తికులనియు పేర్వడిరి. వృష్టి కొడుకులు సుమిత్రుడు, యుధాజిత్తు అటనుండి అనమిత్రుడు, అనమిత్రుని కొడుకు నిఘ్నుడు. వాని కొడుకులు ప్రసేన సత్రాజిత్తులు. సత్రాజిత్తునకు సూర్య భగవానుడు మిత్రుడు.
సత్రాజిత్తు చరిత్ర
ఒకతటి సముద్రతటమందు సత్రాజిత్తు సూర్యుని స్తుతించెను. తదేక మనస్కుడై చేసిన ఆస్తుతికి భాస్కరుడువచ్చి ఎదుట నిలిచెను. కనబడీ కనబడకుండ ఉన్న ఆయనను చూచి సత్రాజిత్తు ఆకాశమందగ్ని గోళమట్లు నిన్నెట్లు చూచితినో అట్లే ఇప్పుడు నా ఎదుట ఉన్నను కొంచెము ప్రసన్నుడవైన వానిగా చూచుచున్నాను. అనినంతట సూర్యభగవానుడు తన కంఠము నుండి తీసి స్యమంతక మణిరత్నము ఏకాంతమందు ఉంచెను. ఆమీదట సత్రాజిత్తు అదిత్యుని ఎఱ్ఱగవెలుగుచు పొట్టివాడై ఇంచుక తేనెరంగు కన్నులతో ఉన్న వానిగా గాంచెను. ప్రణామములుచేసి స్తుతించిన సత్రాజిత్తుంగని భగవంతుడు సహస్ర కిరణుడు భానుడు, నీకు అభిమతమైన వరము కోరుకొనుము అన అతడా మణిరత్నమునే కోరెను. వానికి దానిని రవి ఒసంగి నింగిలోని తన స్థానమును ఆరోహించెను. సత్రాజిత్తు అత్యంత స్వచ్ఛమైన ఆ స్యమంతక మణిరత్నమును కంఠమున ధరించి సూర్యునివలె వెలుగుచు, సర్వదిక్కులను వెలిగించుచు ద్వారకలో ప్రవేశించెను.
అట్లు దేదీప్యమాన ప్రభతో అరుదెంచు ఆ సత్రాజిత్తునిగాంచి పౌరులు భూభారావతరణమునకై విష్ణువు అంశముగా మానుషమూర్తియై భూమియందు అవతరించిన పురుషోత్తముడు భగవంతుడు ఆదిపురుషుడు అగు కృష్ణునికి మ్రొక్కి స్వామీ! తమ దర్శనము గావింప సూర్య భగవానుడు ఇడుగో వచ్చుచున్నాడని తెలుప భగవంతుడు హరి యీతడు సూర్య భగవానుడుకాడు ఆదిత్యుడు ఇచ్చిన స్యమంతకము అను పేరిమణిని ధరించి ఇటు సత్రాజిత్తు వచ్చుచున్నాడు. శాంతులై చూడుడు అన వారుఅట్లనే చూచిరి.
ఆ సత్రాజిత్తు రత్నమును తన ఇంట ఉంచుకొనెను. ప్రతిదినము ఆ మణిరత్నము ఎనిమిది బారువులు బంగారమును కనుచుండెను. ఆ ప్రభావమువలన సకల రాష్ట్రము అనావృష్ట్యాదులగు ఈతిబాధలు అగ్ని వాయువ్యాళాది ఉపద్రవములు వాసి, దుర్భిక్షము మొదలయిన భయములంతొలంగి సుఖముండెను. కృష్ణుడా దివ్యరత్నము ఉగ్రసేనునకు యోగ్యమని దానిని చేకొన నిశ్చయించెను. శక్తుడయ్యు జ్ఞాతులతో భేదము వచ్చునను భయముచే దానిని గైకొనడయ్యె. సత్రాజిత్తు ఎన్నిటికేని కృష్ణుడు దీనిని ఇమ్మని తన్నడుగునని గ్రహించి ఆ మణియెడగల ఆశచే దానిని తమ్ముడగు ప్రసేనునకు ఇచ్చెను. ఈ దివ్యమణిని పవిత్రుడై ధరించినచో అశేష సువర్ణాధికమును ప్రసవించును. తక్కుంగల గుణములన్నియు ఫలించును. మరొక విధముగా (అశుచియై) దీనిని ధరించినవానిని ఇది చంపునని ఎఱుంగక ప్రసేనుడు దానిని కంఠమున ధరించి గుఱ్ఱమెక్కి వేటాడుటకు అటవింజనెను. అక్కడ సింహముచే మరణమందెను. అశ్వముతోగూడ వానినిజంపి ఆ రత్నమును నోట కఱచుకొని పోవ ప్రయత్నించి ఋక్షాధిపతి (ఎలుగులరాజు) జాంబవంతుని చేతిలో అది మడిసెను. జాంబవంతుడు మణిరత్నమును చేకొని తనగుహయందు ప్రవేశించెను. సుకుమారుడు అను పేరుగల బాలకునికి దానిని ఆటవస్తువు కావించెను.
ఆ ప్రసేనుడు తిఱిగి రాకున్నంత కృష్ణుడు మణిపై చూపుపెట్టెను. అది యతడు గైకొనెను. ఇది నిక్కము ఈ పని వీనిదని సకల యదులోకము ఒండొరులు చెవిగౌఱికికొనిరి. ఆ లోకోపవాదము చెవింబడ, కృష్ణభగవానుడు యదుసైన్యపరివృతుడై ప్రసేనుని గుఱ్ఱము జాడంబట్టియేగి సింహనిహతుడై పడియున్న ప్రసేనుఁజూచెను. అందరిలో సింగము అడుగులంగని, మనస్సు కలతతేరి, ఆ అడుగు జాడలంటిపోయి, ఎలుగుల రాజుచే నిహతమైన సింహమును అత్యల్ప దూరమున చూచి ఆమీదట గూడ ఆ రత్నమునెడ గౌరవమును బట్టి ఆ ఎలుగుగొడ్డు అడుగుజాడలను అనుసరించెను. ఆ కొండదరియనెల్ల యదు సైన్యమును నిలిపి ఆ అడుగులంబట్టి చని ఆ భల్లూకము ఉండు బిలములో ప్రవేశించి సుకుమారుని ఆడించుచున్న దాదియొక్క కంఠస్వరమును ఆలించెను. అది ఉయ్యాలలో ఆ బాలుని ఊపుచూ
“సింహము ప్రసేనుని కూల్చినది. ఆ సింహము జాంబవంతునిచే ఈల్గినది. ఓ సుకుమారా! ఏడువకుము. ఈ స్యమంతకము నీదే కదా!” అని పాడుచున్న పాట భావమిది.
ఇట్లాదాది పలుకువిని స్యమంతకము కనపడక లోపలికేగి ఆ కుమారునికి ఆట వస్తువుగా చేయబడి ఆ మణిరత్నమును దాదిచేతిలో జాజ్జ్వల్యమానముగా ఉన్న దానిని చూచెను. స్యమంతకముపై వలపుగొన్న చూపులతో అరుదెంచిన అయ్యపూర్వపురుషుని చూచి రక్షింపుము రక్షింపుము అని కేకలువేసెను. ఆ ఆర్తరవము ఆలించినవెంటనే ఈసునమదినిండి అ జాంబవంతుడు అచ్చటకు అరుదెంచెను. వారిర్వురకు ఇరువది యొక్క రోజులు పోరుజరిగెను. యదుసైనికులు ఆ గుహకడ ఏడు ఎనిమిది రోజులు కృష్ణుని రాకకెదురు చూచుచుండిరి. అతడు రాకున్నంత హరి ఈ బలము అందక, అవశ్యముమంది ఉండును. కాదని అతడు జీవించి ఉండిన అతనికి శత్రుసంహారమునకు ఇన్నాళ్ళేల పట్టునని నిశ్చయించి, ద్వారకకు ఏతెంచి కృష్ణుడు హతుడు అయ్యెనని చెప్పిరి. స్వామి బంధువులు తత్కాలోచితమగు ఉత్తరకర్మకలాపములు కూడ జరిపిరి.
అట్లు వారుద్దేశించి చేసిన ఆచరణమందు ఉత్తమపాత్రులందు మిక్కిలి శ్రద్ధతో పెట్టిన మృష్టాన్నములచే శ్రీకృష్ణుని బలము ప్రాణము పుష్టినొందెను. అవ్వల శత్రువునకో (జాంబవంతునికి) అనుదినము ఆ గురుపురుషునిచే, (మహాపురుషునిచే పెద్దమనిషిచే) కొట్టబడు అతినిష్ఠురములైన దెబ్బలచే ఓడలు అవయవములు అన్ని స్థలములయందు తగిలిన దెబ్బలచే పైగా నిరాహారి అగుటచేత బలము తఱిగెను. అట్లు భగవంతునికి ఓడి జాంబవంతుడు నేలపై వ్రాలి ఇట్లనెను.
“నీవు సురాసురగంధర్వయక్షరాక్షసాదులెవ్వరినీ జయింపరావు. నేలనున్న అల్పబలులయిన నరులు, నరులకు అవయవ భూతములైన పశు పక్ష్యాదులకు, వానిని అనుసరించు నావంటి వారి మాట చెప్పనేల? తప్పక నీవు సకల జగత్పరాయణుడగు నారాయణునివి ఆ అంశమైన నా స్వామి రాముడవేయై ఉందువు. అని విన్నవింప కృష్ణ స్వామి, అతనికి దానవునిభారము దింపవచ్చుటను ఎఱింగించెను. మఱియును ప్రీతి వ్యక్తమగు తన కరతల స్పర్శచే అతని యుద్ధభేదమెల్ల ఉపశమింపచేసెను. అతడు మఱిమఱి ప్రణామములు చేయుచు స్వామిం ప్రసన్నుంగావించి తన ఇంటికి ఏతెంచిన తన ప్రభువునకు పాదములు కడిగి, అర్ఘ్యముగా జాంబవతి అను తన కన్యారత్నమును గ్రహింప చేసెను. మఱియు అతడి పదముల కెఱగి స్యమంతక మణిరత్నమును గూడ స్వామికి కానుకపెట్టెను. అచ్యుతుడును మిక్కిలి వినయవినతుడై, జాంబవంతుడు ఇచ్చిన ఆ మణిని గ్రహింపకూడనిదైనను తనశోధనకు (అపవాదమును వాపికొనుటకు) తాను గైకొనెను. జాంబవతితో ద్వారకకేతెంచెను.
శ్రీకృష్ణుడు శ్రీజాంబవతితో ద్వారకాపుర ప్రవేశము చేయుట:
భగవంతుని ఆగమనముచే కల్గిన ఆనందాతిశయముచే ద్వారకావాసులైన జనమ్మునకు మిగుల వయస్సుచెల్లిన వారికి కూడ కృష్ణ సందర్శనముచే ఆ క్షణము నూతన యౌవనము వచ్చినట్లయ్యెను. మహాభాగ్యము మహాభాగ్యమని సకల యాదవులు స్త్రీలును శ్రీహరిని గౌరవించిరి. స్వామియును యాదవ సమాజమునందు తాను పొందిన అనుభవమును ఉన్న దున్నట్లు వారికి తెలిపెను. స్యమంతకమణిని, సత్రాజిత్తునకు ఇచ్చి అపవాదు తొలగించుకొని జాంబవతిని అంతః పురమందుంచెను. సత్రాజితుడును నేను కృష్ణుని యందు లేనిపోని అపవాదు ఆరోపించితినని భయమువలన తన కుమార్తెను సత్యభామను భగవంతునికి పత్నిగ ఇచ్చెను.
ఆమెను లోగడ అక్రూర, కృతవర్మ, శతధన్వాదులైన యాదవులు వరించి ఉండిరి. ఆమెను కృష్ణునకు ఇచ్చినందున తమ్ము అవమానించెనని ఎంచి సత్రాజిత్తునందు వైరానుబంధ మొనరించిరి. అక్రూరకృతవర్మాదులా శత ధన్వునిగని ఇట్లు పలికిరి. “అతి దుర్మార్గుడీ సత్రాజిత్తు. మేము నీవును, బ్రార్థించినను మమ్ములను నిన్ను కూడ లెక్క చేయక తనపుత్రికను కృష్ణునకు ఇచ్చెను. ఈతడు బ్రతికి ఉండిన చాలు. వీనిని చంపించి యామహారత్నము స్యమంతకమును నీవెందులకు తీసికొనవు? నీపై కృష్ణుడు వైరాను బంధమును కొనెనేని మేమును నీవైపుండెదము. ఆన అతడు అట్లే కానిండు అనియె. ఇంతలో లక్కయింట దగ్ధలైరని, పాండవులు విని నిజమెఱింగిన భగవంతుడు హరి దుర్యోధనుని ప్రయత్నములను వమ్ముచేయ అర్జునునికి ఆనుకూల్య మొనరింప వారణావతమున కేగెను. అతడేగిన మీదట నిదురించుచున్న సత్రాజిత్తును శతధన్వుడు చంపి మణిరత్నమును తీసికొనెను. తండ్రి వధకు నిండుకోపముగొని సత్యభామ సత్వరముగ రథమెక్కి వారణావతముచని కృష్ణ భగవానునికి, అన్నిచ్చుటను సహింపలేక “శతధన్వుడు మాతండ్రిని వధించెను. మఱియు ఏమణి ప్రభలచే ముల్లోకముల అంధకారము పటాపంచలగునో అట్టి స్యమంతకమణిని గూడ హరించెను. ఇది నీకు చేసిన పరాభవమే కావున కర్తవ్యము ఇప్పుడేమో ఆలోచింపు”మని కృష్ణునితో పలికెను.
అ సత్యభామచే ఇట్లు పలుకబడి శ్రీకృష్ణుడు సంతుష్టమైన మనసుగలవాడైనను సత్యభామతో క్రోధముచే ఎఱ్ఱనైన నేత్రములు కలవాడై ఇట్లనెను. సత్యా! సత్యమిది నేను చేసిన అవమానమే. ఆ దురాత్ముని ఈ పనిని నేనుసహింపను. శత్రువృక్షమును తిరస్క రించిన దానిని ఆశ్రయించి యున్నపక్షులను ఎవ్వరు చంపరు. నాముందు శోక ప్రేరితమై వచ్చిన నీ వాక్య సముదాయము చాలునని పలికి ద్వారకకువచ్చి ఏకాంతమునందు బల దేవునితో వాసుదేవుడు ఇట్లు అనియె.
వేటకై చనిన ప్రసేనుని అడవిలో సింహము చంపెను. సత్రాజిత్తు కూడ శతధన్వునిచే ఇపుడు చంపబడెను. ఆయిద్దరు పోవుట వలన ఆ స్యమంతమణి మనకు ఉమ్మడి సొత్తుగా కలదు. అందువలన నీవిప్పుడు లేలెమ్ము రథమెక్కుము. శతధన్వుని చంపు ప్రయత్నము చేయుము. అనవిని బలరామమూర్తి అట్లే అని అంగీకరించెను. కృష్ణబలరాములు అందులకు పూనుకొనిరని తెలిసి శతధన్వుడు కృతవర్మదరికేగి తన సహాయనిమిత్తము ప్రేరేచెను. అప్పుడు కృతవర్మ నేను బలదేవ వాసుదేవులతోడి విరోధమునకు చాలను అన అక్రూరుని ప్రేరేపించెను. ఇతడును ఇట్లనియె. “అతడు అడుగును తట్టిన మాత్రమే జగత్త్రయము కంపించును. అమరవైరుల అంగనలకు వైధవ్యము గూర్చును. ప్రజలరిపు చక్రమునకు అప్రతిహతమైన చక్రాయుధమును తాల్చు ఆచక్రితోను అల్లల్లన ఒక యింత కనుదెరచి చూచినంతన నరి బలముం చెక్కివైచునట్టి ప్రబలశత్రు మదవారణ ములం బలిమియై ఓడించుటలో వెలువరింపబడిన మహామహిమము గల హలాయుధము గల హరితోడను పోరుటకు అఖిల జగద్ద్వంద్యులకు బృందారకులలో గూడ ఒక్కడును సమర్థుడు లేడు. నేనెక్కడ? అందుచే మఱొక్కని శరణుకోరుము అన శతధన్వుడు నాకు రక్షణ యిచ్చుటకు నిన్నీ అసమర్థునిగ భావింతువేని ఇదిగో ఈ మణిని జాగ్రత్తగ భద్రపరుపుము అనగా అతడు అంత్యావస్థలో గూడ నీవు ఇంకొకనికి ఇది తెలుపనందువేని దీనిని నేను తీసికొందును అనెను. అతడట్లేయన నక్రూరుడు ఆ మణిని జేకొనియె. శతధన్వుడురు వేగముగల నూరామడల లేక ధాటిం గొనిపోగల గుఱ్ఱ మెక్కి అట నుండి తఱలెను.
స్యమంతకోపాఖ్యానము
శైబ్యసుగ్రీవ మేఘపుష్ప వలాహకములనెడి నాల్గు గుఱ్ఱములు పూన్చిన రథమందు బలభద్రవాసుదేవులు ఎక్కి శతధన్వుని తరుముకొనిపోయిరి. అతడెక్కిన గుఱ్ఱము నూరామడల పరువెత్తి చని చని మిథిలా నగర ఉపవన ప్రాంతమున ప్రాణములు వాసెను. శతధ్వన్వుడు దానిని వదలి పాదచారియై పరుగెత్తెను. అప్పుడు కృష్ణుడు బలరామునితో నీవు ఈ రథముమీద ఇక్కడనే ఉండుము. నేను పాదచారినై, ఈ పదాతియగు ఈ అధముని వెంబడించి కూల్చివత్తును. ఈ ప్రాంతమునందు ఇబ్బందులు భయంకరమైనవి. చాలగలవు. నీవీ గుఱ్ఱమును దీనిని దాటిపోనీకుము అన బలరాముడు అట్లే అని రథమందే ఉండెను. కృష్ణుడు రెండు క్రోశము దూరము వెంబడించి, దూరమందు ఉండగనే శతధన్వుని పై చక్రమును ప్రయోగించివాని శిరస్సును ఖండించెను. వాని ఒడలిపై ఉన్న వస్త్రములందు ఎంత వెదకినను ఆ స్యమంతకమణిని పొందలేకపోయెను. అంతటవచ్చి బలభద్రునితో “శతధన్వుని మనము వృధాగా కూల్చితిమి. సర్వజగమ్ములందు సారమైన ఆ మహారత్నము దొరక లేదు.” అని చెప్పగా ఆ మాటలను విని అనవిని బలరాముడు కోపముతో కృష్ణునింగూర్చి, ఛీ ఛీ నీవు దురాశకు వశుడవైతివి తమ్ముడవని సైచితిని. నీ దారిని నీవు పొమ్ము. ద్వారకతోగాని, నీతోగాని బంధువులతోగాని నాకు పనిలేదు. నీ మాయా శపథములు చాలు చాలునని కసరి కృష్ణునిచే బ్రతిమాలబడియు, అట నిలువక విదేహ రాజనగరము బ్రవేశించెను. జనకరాజు అర్ఘ్య పూర్వకముగా అతని ఇంటిలో ప్రవేశపెట్టెను. అతడక్క డనే ఉండెను. వాసుదేవుడు ద్వారకకు ఏతెంచెను.
బలభద్రుడు జనకునింట ఉన్నంత వరకు దుర్యోధనుడు గదా యుద్ధము అతని కడ అభ్యసించెను. మూడేండ్ల తర్వాత బభ్రువు, ఉగ్రసేనుడు, మున్నుగాగల యాదవులు స్యమంతకమణిని కృష్ణుడు అపహరింపలేదని తెలిసికొని విదేహనగరి కేగి వారు బలదేవుని విశ్వసింపజేసి ద్వారకకు తీసికొనివచ్చిరి. అక్రూరుడును, అయ్యుత్తమమణి ప్రసవించు సువర్ణ సంపదచే భగవద్ద్యాననిష్ఠుడై నిర్విరామముగ యజ్ఞములు చేసెను. అరువది రెండేండిట్లా మణి మహిమచే అక్కడ ఆపదలు దుర్భిక్షము మసూచి మరణములును లేవయ్యెను.
అవ్వల అక్రూరునివైపు వారగు భోజులచే సత్వతుని ప్రపౌత్రుడు (ముని మనుమడు) చంపబడ, భోజులతోగూడ అక్రూరుడు ద్వారకను విడిచి వెళ్ళిపోయెను. ఆ వెళ్ళిన నాటనుండి అక్కడ ఆపదలు, కఱవు, ఘాతుకమృగభయము, అనావృష్టి, మహామారి మొదలయిన ఉపద్రవములు ఏర్పడెను. అంత బలరామ ఉగ్రసేనులతో యాదవులు ఆలోచన చేసిరి. భగవంతుడు కృష్ణుడు ఈ ఉపద్రవములు ఏర్పడుటను గూర్చి ఆలోచింప వలయునన అంధకుడు అను యదువృద్ధుడు ఈ అక్రూరుని తండ్రి శ్వఫల్గు ఎచ్చటెచ్చట ఉండునో అక్కడక్కడ దుర్భిక్షమారిక అనావృష్ట్యాది ఉపద్రవములు ఉండవని చెప్పెను. కాశీరాజు రాజ్యమందనావృష్టి ఏర్పడ, శ్వఫల్గుడటకు కొంపోబడినంత, ఆ క్షణమే పర్జన్యుడు వర్షించెను.
కాశీరాజు భార్య గర్భమందు మున్నొక కన్య ఉండెను. ప్రసూతి సమయము పూర్తియైనను ఆ శిశువు గర్భము వెలువడి రాకుండెను. ఇట్లు పండ్రెండు ఏండ్లయ్యెను. అప్పుడా కాశీరాజు గర్భమందున్న శిశువుతో; పుత్రీ! ఎందువలన నీవు పుట్టవు? వెడలి రమ్ము! నీ మోము చూడ గోరుచున్నాను. ఈ మీ అమ్మను ఎందులకు చిరకాలము శ్రమ పెట్టెదవు? అని ఆగర్భమందున్న ఆ ఆడు శిశువు “తండ్రీ! దినదినమొక్క గోవును బ్రాహ్మణునికి ఇత్తువేని ఇంక మూడేండ్లకీ గర్భమును వెలువడి వత్తును అని పల్కగా దానిని విని ఆరాజు ప్రతి దినమును విప్రునకు గోవును ఇచ్చుచుండెను. ఆ పిల్లయు చెప్పిన సమయమునకు జనించెను. అందుచే ఆమెకు తండ్రి గాందిని అను పేరుపెట్టెను. ఆ గాంధీనిని ఇంటికి ఏతెంచిన శ్వఫల్గునకును తనకు ఉపకారియైన వానికి అర్ఘ్య (పూజాద్రవ్య)మైన ఆ కన్యను దానముచేసెను. ఆ శ్వఫల్గున కీ అక్రూరుడు జనించెను. అతని పుట్టుక ఇటువంటి గుణవంతులయిన మిథునము నుండియైనది. ఈతడిట తలగి వెళ్ళినచో దుర్భిక్ష మారికాది ఉపద్రవములు ఎందులకు కలుగవు? అందువలన ఈతనిని ఇక్కడకు కొనిరండు. అతి గుణవంతుని యెడ తప్పులు వెదకుట ఇక చాలునని యదు వృద్ధుడు అంధకుడు చెప్పగా విని కేశవోగ్రసేన బలరామాదులతో యదువులు చేసిన తప్పు సైరించి అభయమిచ్చి శ్వఫల్గు కుమారుడు అక్రూరుని పురమునకు రప్పించెను. అక్కడ అతడు వచ్చినంతనే ఆస్యమంతకమణి ప్రభావముచే అనావృష్ట్యాది సర్వోపద్రవములును ఉపశమించినవి.
అంతట కృష్ణుడు ఇట్లు తలంచెను. గాంధీని యందు శ్వఫల్గునికి అక్రూరుడు ఉదయించెను అనుట ఇది చిన్న కారణము. అనావృష్టి దుర్భిక్షాది ఉపద్రవములను నివారించు ఈ ప్రభావము చాలగొప్పదికావున నిశ్చయముగా ఇతనిదగ్గర నా మహామణి స్యమంతకము ఉండితీరును. అమణి ప్రభావములు అనేకములు ఇట్టివి వినబడుచున్నవి. ఈ అక్రూరుడు కూడ యజ్ఞము తర్వాత యజ్ఞము దాని తర్వాత మఱియొక యజ్ఞము నిత్యము ఎడతెగ కుండ చేయుచున్నాడట. కావున నితని దరిని నిస్సంశయముగ అధిక జీవనాద్రవ్యమగు మణిరత్నమున్నదని నిశ్చయముచేసి, మఱియునొండు ప్రయోజనమును ఉద్దేశించి కృష్ణుడు సకల యాదవ సమాజమును తనఇంట సంఘటించెను. ఆసభయందు అందరు కూర్చుండ తొలుత సమావేశము యొక్క ప్రయోజనమును ఉపన్యసించి అది పూర్తిఅయినంతట అక్రూరునితో ప్రసంగాంతరమునకుందిగి, పరియాచకములాడి జనార్దనుడు అతనితో ఇట్లనియె. దానపతీ! శతధన్వుడు సకల జగత్సారమయిన స్యమంతకరత్నము నీకిచ్చినట్లు. సర్వ రాష్ట్రోపకారమయిన అది నీ దగ్గరనున్నది. అని మేమెఱుంగనే ఎఱుఁగుదుము. ఉండు గాక! మేమందరమును దాని ప్రభావము యొక్క ఫలమును అనుభవించువారమే. కాని ఈతడు బలరాముడు మమ్ముల శంకించెను. అందుచే దానిని మా ప్రీతి కొరకు చూపింపుమని పలికి భగవంతుడు వాసుదేవుడు ఊరకున్నంత, రత్నము దగ్గర పెట్టుకొన్న అక్రూరుడు ఇట్లు అనుకొనెను. ఇప్పుడు చేయవలసిన దేమి? ఇంకొకలాగు పల్కితినేని కేవలము బట్టచాటున ఉన్న దానిని వీరు వెదకువారై అమ్మణిని చూడగలరు. అతి విరోధము మంచిది కాదు అని ఆలోచించి అఖిల జగత్కారణమైన ఆ నారాయణుని గూర్చి అక్రూరుడు అనియె.
“భగవన్! ఈ రత్నమును శతధన్వుడు బహూకరించెను. అతడు సనిన మీదట ఇప్పుడో రేపో ఎల్లుండియో, భగవంతుడు హరి దీనినడుగగలడని నిశ్చయించి అతి కష్టము మీద నింతకాలము ఇద్దానిని నా యొద్ద ఉంచుకొంటిని. దానిని భద్రపఱచు క్లేశము చేత నేను అశేష భోగము లందు నా మనస్సు హత్తుకొనుటచే రవ్వంతయేని సుఖమెఱుంగ నైతిని. అశేష రాష్ట్రోపకారియైన దీనిని ఇంత మాత్రమేని, ఇతడు భద్రపరుపలేకపోయినాడని నీవనుకొందువని నిన్నిందులకు ప్రేరేపణ చేయనైతిని. అందువలన నీ స్యమంతకమును గైకొనుము. నీవు ఎవ్వనికీయ అభిమతముగలదో వానికి బహూకరింపుము అని తన కడుపునకు జుట్టు కొన్న బట్టలో దాచుకొన్న మిక్కిలి చిన్న పెట్టినున్న దానిని వెలువరించెను. ఆ బరణి నుండి తీసి దానిని ఆయదుకుల సమాజము నందు విడిచెను.
విడిచిన మాత్రముననే, దాని అపరిమిత కాంతిచేత అయ్యాస్థానమెల్ల మిఱుమిట్లు గొనెను. అంత అక్రూరుడు అదే శతధన్వుడు మాకిచ్చిన మణి. ఇది ఎవ్వనిదో అతడే దీనిని గైకొనుగాక అనియె. అదిచూచి సర్వయాదవులు “బాగుబాగు” అని మదిలో అచ్చెరువుగొని పలుకు పలుకులు వినబడెను. దానిని జూచి బలరాముడు మా కృష్ణునితో పాటు నాకు ఇది సమానమైన సొత్తని దానిపై వేడుకపడెను. నా తండ్రి సొత్తే ఇది అని సత్యభామ దానిపై మిక్కిలి ముచ్చటపడెను. బలరామ సత్యభామలను జూచి కృష్ణుడు తనను గో చక్రాంతర మందున్న వానినిగా భావించెను. సకలయాదవసమక్షమందు అక్రూరుని గూర్చి హరి ఇట్లనియె. ఈ మణిరత్నమున నా అపవాదు తొలగించుకొనుటకై ఈ యాదవులకు చూపితిని. ఇది నాకు మా బలరామునకు సరివంతయినది. సత్యభామ పితృధనము ఇది ఆమెదే. మఱియెవ్వరిది గాదు. సర్వకాలము దీనిని శుచియై బ్రహ్మచర్యాది గుణ సంపన్నుడై ధరించునేని ఇది సర్వ రాష్ట్రోపకారకము. అశుచియై ధరించిన ఇది ఆ ధరించిన వానిని చంపును. ఇందువలన పదాఱువేల మందిని పెండ్లాడిన నేను దానిని ధరింప అసమర్థుడను. సత్యభామ మాత్ర మెట్లు దీనిని స్వీకరించును! ఆర్య బలరామమూర్తి దీనిని ధరించునేని మద్యపానాది సకలోపభోగపరిత్యాగము చేయవలసి ఉండును. అందుచే అదివద్దు. ఈ యదులోకము, బలభద్రుడు, నేను, సత్యయును, ఓ దానపతీ! నిన్ను ప్రార్థింతుము. అది నీవే ధరింప సమర్ధుడవు. నీవు ధరించిన ఇది సర్వరాష్ట్రోపకారకమగును. అందువలన నీవే అశేష రాష్ట్రనిమిత్తముగా ధరింపుము. మఱుమాట పలుకకుము. అనిన, దానవతి అట్లే అనియె. ఆరత్నమును గైకొనెను. అది మొదలు అక్రూరుడు వెల్లడియై జాజ్వల్యమానమై ఉన్న ఆ మణి రత్నమును తన కంఠమున దాల్చి కిరణమాలి యైన ఆదిత్యునట్లు సంచరించెను.
ఈ కృష్ణ భగవానుని లోకాపవాదు బాపు కొన్న ఇతివృత్తము ఎవ్వడు స్మరించునో వానికి ఇంచుకేని అపకీర్తికలుగదు. ఇంద్రియపటుత్వము గలవాడై సకలపాపవిముక్తి పొందును.
శ్రీ పరాశరుడు ఇట్లు అనియె:
అనమిత్రుడు, శిని, సత్యకుడు, సాత్యకి (యుయు ధానుడు) సంజయుడు, కుణి, యుగంధరుడు అనువారు వరుసగా తండ్రి కొడుకులు. వీరు శైనేయులన బరగిరి. అన మిత్రుని వంశములోనే వృష్టి వర్థిల్లెను అతనికి శ్వఫల్కుడు కల్గిరి. శ్వఫల్కుని ప్రభావము చెప్పితిమి. శ్వఫల్కుని తమ్ముడు చిత్రకుడు. శ్వఫల్కునికి గాందిని యందు అక్రూరుడు పుట్టెను. అట్లే ఉపమద్గువు కల్గెను. ఉపమద్గువునకు మృద, అమృద, విశ్వ, అరిమేజయ, గిరిక్షత్ర, ఉపక్షత్ర, శత్రుఘ్న, అరిమర్దన, ధర్మదృగ్, దృష్ట ధర్మగంధమోజవాహ ప్రతి వాహులను కొడుకులు, సుతార అనెడి కన్యయును కల్గిరి. దేవవంతుడు, ఉపదేవుడు అనువారు అక్రూరుని తనయులు. పృథువు, విపృథువు మొదలయినవారు పెక్కుమంది చిత్రకునికి కల్గిరి. కుకుర భజమాన శుచికంబళ బర్హిషులు నల్గురు అంధకుని కొడుకులు. కుకురునకు ధృష్టుడు వానికి కపోతరోముడు వానికి విలోముడు, వానికి తుంబురుని మిత్రుడగు అనువు, వానికి ఆనక దుందుభి, వానికి అభిజిత్తు, వానికి పునర్వసువు, వానికి ఆహుకుడను పుత్రుడు, ఆహుకి అను పుత్రిక కల్గిరి. ఆహుకునికి దేవకుడు, ఉగ్రసేనుడు అను ఇర్వురు కొడుకులు జనించిరి. దేవవంతుడు ఉపదేవుడు, సహదేవుడు, దేవరక్షిత అను కన్యయు నల్వురు దేవకుని సంతానము. వారికి వృకదేవ, ఉపదేవ, దేవరక్షిత, శ్రీదేవ, శాంతిదేవ, సహదేవ, దేవకి అనువారు వేర్వేరు భగినులు. వారినందరిని వసుదేవుడు పెండ్లాడెను.
ఉగ్రసేనునకును కంస, న్యగ్రోధ, సునామ, ఆనక, శంకు, సుభూమి రాష్ట్రపాల, యుద్ధతుష్టి, సుతుష్టిమంతులను కొడుకులు కల్గిరి. ఉగ్రసేనుని కూతుండ్రు కంస, కంసవతి సుతను రాష్ట్ర పాలికలనువారు, భజమానునికి విదూరథుడు పుట్టెను. విదూరథుడు శూరుడు శమి, ప్రతిక్షత్రుడు, స్వయంభోజుడు, హృదికుడు అనువారు వరుసగా తండ్రికొడుకులు. హృదికునికి కృతవర్మ శతధన్వుడు దేవార్హుడు, దేవగర్భుడు మొదలయిన కుమారులు కల్గిరి. దేవగర్భుని కొడుకు శూరుడు, మారిష ఆతని ధర్మపత్ని. ఆమెయందు అతనికి వసుదేవాదులు పదిమంది పుత్రులు గల్గిరి. వసుదేవుడు పుట్టగానే అతని ఇంట భగవదంశ అవతారమును దివ్యదృష్టితో చూచి, దేవతలు స్వర్గమున ఆనక దుందుభులు మ్రోయించిరి. అందుచే ఇతడానక దుందుభి అను పేరొందెను. అతనికి దేవభాగ దేవశ్రవ అష్టక, కుకుచ్చక్ర, వత్సధారక, సృంజయ, శ్వామ, శమిక, గండూషులు అనువారు తొమ్మండ్రు తమ్ములు ఉండిరి. పృథ, శత్రుదేవ, శ్రుతకీర్తి, శ్రుతశ్రవ, రాజాధిదేవి అనువారు వసు దేవాదులకు ఐదుగురు భగినులుండిరి. శూరునికి కుంతి అనునతడు సఖుడుండెను. శూరుడు సంతతిలేని ఆ కుంతియను వానికి తనకూతురు పృథ అను ఆమెను యథా విధిగ దత్తము చేసెను. ఆమెను పాండురాజు పెండ్లాడెను. ఆమెయందు ధర్మ, అనిల, ఇంద్ర దేవతలవలన వరుసగా యుధిష్టిర, భీమ, అర్జునులు ఉదయించిరి. కుంతి కన్యగా ఉన్నపుడు (వివాహము కానప్పుడు) సూర్యభగవానుని వలన కానీనుడుగా కర్ణుడను వాడు పుట్టెను.(కన్యకు పుట్టినవాడు కానీనుడు) ఆ పాండురాజునకు మాద్రి అను భార్య యందు నాసత్యుడు, దస్రుడు అను అశ్వినీ దేవతలవలన నకులుడు, సహదేవుడు కల్గిరి.
శ్రుతదేవను వృద్ధధర్ముడను కారూశుడు (కరూశ దేశాధిపతి) పెండ్లాడెను. ఆమె యందు దంత వక్త్రుడు అను మహాసురుడు పుట్టెను. శ్రుతకీర్తిని కేకయ రాజు పెండ్లాడెను. ఆమెయందు అంతర్దనాదులు (కైకయులు) ఐదుగురు పుత్రులు జనించిరి. రాజాధిదేవి యందు ఆవంత్యులు (అవంతీరాజ్య దేశాధిపతికి పుట్టినవారు) విందుడు, అనువిందుడు అనువారు ఇద్దరు పుట్టిరి. శ్రుతశ్రవసను ఛేదిరాజు దమఘోషుడు పెండ్లాడెను. ఆమె యందు శిశుపాలుడు పుట్టెను. అతడే పూర్వము కూడ గొప్ప విక్రమవంతుడగు హిరణ్యకశిపుడు అను రాక్షసరాజుగా పుట్టినాడు. నరసింహావతారమున భగవంతుడు వానిని సంహరించెను. వెండియు ఆతడు అక్షయవీర్య శౌర్య సంపత్పరాక్రమ గుణుడై త్రిలోకేశ్వర ప్రభావమును ఆక్రమించిన దశాననుడై జనించెను. బహుకాలము అనుభవించిన భగవత్సాన్నిధ్యముచే పొందబడిన శరీరపాతము వలన పుట్టిన పుణ్యఫలము వలన సకలలోక గురువగు రఘువంశోద్భవుడగు శ్రీరామచంద్ర స్వరూపుడగు భగవంతుని వలన మరణము పొందెను. మరల ఛేదిరాజగు దమఘోషునికి పుత్రుడై శిశుపాలుడను పేరందెను. శిశు పాలత్వమందును భూభారావతారణమున కవతరించిన పుండరీకాక్షుడగు శ్రీ కృష్ణ భగవానునిపై మిగుల ద్వేషానుబంధము నొనరించెను. ఆ భగవంతుని చేతనే నిధనమొందింపబడెను. ఆ భగవంతునియందు మనసునిల్పి సాయుజ్యముక్తినందెను. భగవంతుడు ప్రసన్నుడయ్యెనా, అభిలషించినది ఇచ్చును. అప్రసన్నుడయ్యెనా అప్పుడు సంహారముచేసి అనుపమ దివ్యస్థానమునిచ్చును.
మైత్రేయుడు అటుపైన “హిరణ్యకశిపుడుగా రావణుడుగా పుట్టి విష్ణువుచేత కూలి దేవతలు కూడ పొందనలవి గాని భోగములనుబడసెను. కాని భగవంతునిలో లయము నందలేదు. ఆ హరి చేతనే అతడు శిశుపాలుడుగా హతుడై శాశ్వతుడైన హరితో సాయుజ్యమును ఎట్లుగాంచెను? ఈ వివరములను విన నాకు కుతూహలము అగుచున్నది. ఆనతి ఇమ్మ”న శ్రీ పరాశరుండనియె. “దైత్యేశ్వరుడగు హిరణ్యకశిపుని చంపుటకొఱకు మున్ను భగవంతునిచే నృసింహావతారము ప్రకటింపబడినది. అత్తఱి హిరణ్యకశిపుని మనసులో ఈతడు విష్ణువుఅను తలంపు కలుగలేదు. నిరతిశయ పుణ్యముచే ఆవిర్భవించిన జంతువిది అను ఊహ కలుగగా, తన యుద్రేకముచే ప్రేరేపింపబడిన విష్ణువుఅను తలంపు కలుగలేదు. ఏకాగ్రమైన మతికలవాడై ఆ విధమైన భావనచేసి (ఆ భావనారూప యోగముచే) ఆ నరమృగాకారముచేనైన మరణముచే నిరతిశయమైన సకల త్రైలోక్యమును మించిన ఆధిక్యమును కూర్చు భోగసంపదను రావణుడుగా పుట్టి అనుభవించెను. అంతియకాని అనాది నిధనము కేవలము పరబ్రహ్మము నిరాలంబమునైన భగవత్తత్వము ఇది అని భావన సేసి అందు మనస్సు యొక్క లయమును పొందలేదు. రావణుడై పుట్టి నపుడుగూడ ఇట్లే కామవశుడగుటచే జానకియందంటిన మనస్సుచే, దశరథకుమార రూపము ధరించిన రామచంద్ర పరమాత్మరూప భగవంతునిచే హతుడైనతఱి వానికి రాముడే కనిపించెనుగాని ఇతడు అచ్యుతుడు అను భావన కలుగలేదు. చనిపోవునెడ వాని యంతఃకరణమందు రాముడు కేవలము మనుష్యుడు అను భావనయే కలిగెను. అవ్వలనో అచ్యుతుని చేతిలో ఈల్గుట మాత్రమే, ఫలముగా కలది ఛేదిరాజకుల మందు శిశుపాలుడై అఖిల భూవలయము మెచ్చు అవ్యాహతైశ్వర్యమైన జన్మమందెను.
అ పుట్టువునందు అతడు సర్వభగవన్నామములను త్వంకరించుటకు కారణ మయ్యెను (త్వంకరించుట అనగా నీవు నీవని తృణీకరించుట) అందుచే తత్కాలముగా ఒనరించిన ఆ పేర్లన్నిటియందు నిరంతరము పెక్కు జన్మములందు పెంచుకొనిన విద్వేషముతో సుడివడిన చిత్తముగలవాడై నిందించుట బెదరించుట మొదలగు వానియందా భగవన్నామోచ్ఛారణము చేసెను. మఱియు విప్పారిన తామర పూరేకుల వంటి కన్నులు మెఱుగారుపీతాంబరము దాల్చినది అమల కిరీట కేయూర హార కటకాదిశోభితము ఉదార చతుర్భాహు శంఖచక్ర గదాధరమునైన ఆ పరమ సుందరరూపము ప్రగాఢ వైరానుభావముచే ఆక్రోశము (ఆక్షేప వచనము)లందు ఆ విష్ణు నామములనే ఉచ్చరించుచు, ఆతనిని హృదయమందు అవధరించుచు, తన చావునకు భగవంతుని హస్తమందలి చక్రాయుధము యొక్క కిరణమాలికలచే ఉజ్జ్వలమైన అక్షయ తేజస్స్వరూపముగల ద్వేషాది దోషదూరమునైన ఆకేవల పరబ్రహ్మ రూపమును దర్శించు చున్నంతట ఆ భగవంతుని చక్రముచే హతుడయ్యెను. తదనుస్మరణమున అఘసంచయ మెల్ల దగ్ధమై భగవంతునిచే అంత మొందింపబడి ఆ తత్త్వమందే లయమందెను. ఇది యెల్ల నీ కేను తెల్పితిని.
ఈ భగవంతుడు, పగనైన కీర్తింపబడి, స్మరింపబడి, అఖిల సురాసురాది దుర్లభమైన ఫలము నిచ్చును. మంచి భక్తి సంపన్నుల మాట వేటే చెప్పవలెనా? వసుదేవునికి (ఆనక దుందుభికీ) పౌరవిరోహిణి, మదిర, భద్ర దేవకి మొదలయిన పెక్కుమంది భార్యలు ఉండిరి. అతడు భద్రశఠ, సారణ, దుర్మదాదులను తనయులను రోహిణియందు కనెను. బల రాముడు, రేవతియందు విశఠడు, ఉల్ముకుడు అను ఇద్దరు కుమారులను గనెను. సాష్టి, మాష్టి, శశి, సత్యధృతి ప్రముఖులు సారణుని కొడుకులు. భద్రాశ్వ, భద్రబాహు, దుర్దమ భూతాదులు రోహిణీ కులజులు. నంద ఉపనంద కృతాదులు మదిరయొక్క తనయులు. ఉపనిధి గదాదులు భద్రాసంతానము. వైశాలి యందు కౌశికుని ఒక్కనినే కనెను. ఆనక దుందుభికి దేవకి యందుకూడ కీర్తిమంతుడు సుషేణుడు ఉదాయువు భద్రసేనుడు ఋజు దాసుడు, భద్రదేవుడు అను ఆఱ్వురు పుత్రులు కల్గిరి. వారి నందరను కంసుడు సంహరించెను.
అటుపై సప్తమ గర్భమును అర్ధరాత్రి భగవంతుడు పంప, యోగనిద్ర రోహిణి యుదరమును ఆకర్షించి కొనిపోయెను. కర్షణ మొనరించుట వలన నీ శిశువు సంకర్షణుడను పేరొందెను. అవ్వలసకల జగన్మహాతరువునకు మొదలు, భూతభవిష్యదాది సకల సురాసుర మునిజన మానసములకేని అగోచరుడు, బ్రహ్మాదులగు అగ్నిముఖులచే (దేవతలచే) ప్రణమిల్లి అవని భారముదింప ప్రసన్నత నొందింపబడిన భగవానుడు అనాది మధ్య నిధనుడు హరి వాసుదేవుడు దేవకీగర్భమున అవతరించెను. ఆ దేవుడి అనుగ్రహముచే దినదినాభివర్ధమాన మహిమగల యోగనిద్ర నందగోపుని పత్నియగు యశోదగర్భము నందునికి చేసెను.
ఆ పుండరీకాక్షుడు అవతరించుచుండగా, సూర్య చంద్రాది గ్రహములు సుప్రసన్నములు ఆయెను. వ్యాళాది భయరహితమై మనసు స్వస్థమై ఎల్లజగము అధర్మదూరమై ఉండెను. పుట్టినక్షణమ ఆ ప్రభువు ఈ యెల్లవిశ్వమును సన్మార్గవర్తిగ ఒనరించెను. ఈ మానవలోకమందు అవతరించిన భగవంతునకు ఇక్కడ పదునాఱువేల నూటొక్కమంది భార్యలుండిరి. వారిలో రుక్మిణీ సత్యభామ జాంబవతి చారుహాసిని మొదలగు వారెనమండ్రు గురు ప్రధాన భార్యలు. అఖిలమూర్తి అనాదియు అగు ఆ దేవుడు వారియందు ఒక లక్ష్మ యెనుబదివేల మంది పుత్రులను కనెను. వారిలో ప్రద్యుమ్న, చారుధేష్ణ, సాంబాది కుమారులు పదుమువ్వురు ముఖ్యులు. ప్రద్యుమ్నుడు రుక్మి కుమార్తె రుక్మవతిని పెండ్లాడెను. ఆమెయందు అనిరుద్ధుడు ఉదయించెను. అనిరుద్ధుడు రుక్మి పౌత్రి సుభద్రను పెండ్లాడెను. ఆమెయందు ఇతనికి వజ్రుడు ఉదయించెను. వజ్రునికి ప్రతిబాహువు అతనికి సుచారువులు గల్గిరి. ఇట్లనేక శతసహస్ర పురుష సంఖ్యాకము ఈ యదుకుల హరివంశ విస్తరము నూరేండ్లకైన వర్ణింప అలవి కాదు. ఈ క్రింది శ్లోకములు ఈ విషయములో చరితార్థములు.
“హరి కుమారులకు ధనుర్విద్యను శిక్షించుటకు నియుక్తులైన చాపాచార్యులు మూడు కోట్ల ఎనుబది ఎనిమిది వేలమంది గలరు. మహాత్ములగు యాదవులను ఎవరు లెక్కింప గలరు; అనేక లక్షలకొలది కలరు. అహుకుడను వాడెల్లపుడు యదురాజు. దేవాసుర యుద్ధమందు చనిపోయిన మహాబలవంతులగు దైత్యులు మనుష్యులందు జనోపద్రవకారులై పుట్టిరి. వారిని తుదముట్టించుటకీ భూలోకమున దేవతలు యదుకులమున జన్మించిరి. ఆ వంశములు నూటొక్కటి (నూఱుకు మించి) ఉన్నవి. వాని కార్య నిర్ణయమునందు, ప్రభుత్వమందు (రక్షణమందు) పూనికగొని విష్ణువు నిల్చినాడు. ఆయన యజ్ఞ మందు ఉండి, యాదవులందఱు వృద్ధిపొందిరి. వృష్ణుల ఈ సంతతిని ఎవ్వడు వినునో అతడు సర్వపాపవిముక్తుడై విష్ణు లోకమందును.
శ్రీ పరాశరుడు ఇట్లు అనియె:
యదువంశమును సంగ్రహముగ తెల్పితిని, తుర్వసు వంశమిక వినుము. తుర్వసుని కొడుకు వహ్ని. వాని కుమారుడు భార్ధుడు. అతనికి భానువు! అతనికి త్రయీసానువు, అతనికి కరందముడు. అతనికి మరుత్తుడు జన్మించిరి. మరుత్తునికి సంతానములేదు. అందుచే పూరువంశ్యుని (పౌరవుని) దుష్యంతుని పుత్రునిగా స్వీకరించెను. యయాతి శాపముచే యదువంశము పౌరవవంశమును ఆశ్రయించెను.
ద్రుహ్యుని తనయుడు బభ్రువు. ఆయన కుమారుడు సేతువు. సేతువు కొడుకు ఆరబ్ధుడు. ఆతని కొడుకు గాంధారుడు. అతని అనగా కుమారుడు వాడు ఘర్ముడు. ఘర్మునికి మృతుడు. అతనికి దుర్దముడు, అతనికి ప్రచేతసుడు, అతని కొడుకు శతధర్ముడు పుట్టిరి. ఈతడు ఔత్త రాహులగు (భారత ఖండమునకు ఉత్తరదిశనున్న) మ్లేచ్ఛులకు దొర అయ్యెను.
శ్రీ పరాశరుడు ఇట్లు అనెను:
యయాతి నాల్గవ కుమారుడగు అనువునకు సభానల, చక్షుః, పరమేషువులను వారు ముగ్గురు పుత్రులు కల్గిరి. సభానలుడు, కాలానలుడు, సృంజయుడు, జనమేజయుడు, మహాశాలుడు, మహామనుడు అనువారు వరుసగా తండ్రి కొడుకులు. మహామనునకు ఉశీనరుడు, తితిక్షువు అను ఇద్దరు కల్గిరి. ఉశీనరునకు, శిబి, నృగుడు, నవుడు, కృమి, వర్మ అను ఐదుగురు కుమారులు. శిబికొడుకులు వృషదర్భ, సువీర, కేకయ, మద్రకులను నల్గురు. తితిక్షువునకు రుశద్రథుడను వాడుగల్గెను. వానికి హేముడు వానికి సుతపుడు వానికి బలియు కల్గిరి. అతని భార్యయందు దీర్ఘ తమస అంగ వంగ కలింగ సుహ్మ పౌణ్డ్రులనువారు, క్షత్రజాతివారు, పుట్టిరి. ఇది బాలేయ (పవి క్షేత్రజ) వంశము అను ప్రసిద్ధిని పొందెను. ఆ సంతతియొక్క పేర దేశములు ఏర్పడినవి.
అంగుడు, అనపానుడు, దివిరథుడు, ధర్మరథుడు, చిత్రరథుడు (రోమపాదుడు) అను తండ్రీకొడుకుల వరుస ఏర్పడెను. రోమపాదుడు దశరథుని చెలికాడు. సంతతిలేని ఆ రోమపాదునకు శాంత అను కన్యను అజ మహారాజ కుమారుడు దశరథుడు కుమార్తెనుగా నిచ్చెను. రోమపాదుడు, చతురంగుడు, పృథులాక్షుడు, చంపుడు అనువారు వరుసగా తండ్రికొడుకులు. చంపుడు చంపానగర నిర్మాణము చేసెను. చంపుని కొడుకు హర్యంగుడు అతని కొడుకు భద్రరథుడు. అతని వాడు బృహద్రథుడు అతనికి బృహత్కర్మ అతనికి బృహద్భానువు. అతనికి బృహన్మనుడు అతనికి జయద్రథుడు కల్గిరి. జయద్రథుడు బ్రహ్మక్షత్రకులముల సాంకర్యమున పుట్టినది అగు భార్యయందు విజయుని కనెను. విజయునికి ధృతి, అతనికి ధృతవ్రతుడు, అతనికి సత్యకర్మ, అతనికి అతిరథుడు కల్గిరి. ఇతడు గంగకువెళ్ళి పెట్టెలోనున్న వానిని పృథ (కుంతి) చేత్యకమైన సుతుని కర్ణుని పుత్రునిగా బడసెను. కర్ణునికి వృషసేనుడు గలిగెను. ఇంతవరకు అంగ వంశ్యులు వారిని గురించి వింటివి, ఇటు మీద పూరువంశము వినుము.
పూరువు, జనమేజయుడు, ప్రచిన్వంతుడు, ప్రవీరుడు, మనస్యుడు, అభయదుడు, సుద్యుడు, బహుగతుడు, సంయాతి, అహంయాతి, రౌద్రాశ్వుడు, వరుసగా తండ్రి కొడుకులు. రౌద్రాశ్వుని కొడుకులు పదిమంది. ఋత్వేపు, కక్షేపు, స్థండిలేపు, కృతేపు, జలేపు, ధర్మేపు, ధృతేపు, స్ధలేపు, సన్నతేపు, వనేపు అనువారు. ఋతేపువు కొడుకు అంతినారుడు. అతనికి సుమతి, అప్రతిరథుడు, ధ్రువుడు అనువారు పుత్రులు. అప్రతిరథునికి కణ్వుడు, వానికి మేధాతిథి కల్గిరి. ఇతనికి కణ్వాయనులని ద్విజులు కల్గిరి.
అప్రతిరథునికి రెండవ కొడుకు ఐవీనుడు. అతనికి దుష్యంతుడు మొదలగు నల్గురు కుమారులు. దుష్యంతునకు భరతుడు చక్రవర్తి కల్గెను. ఈతనికి ఈ పేరుగల్గుటకు దేవతలు గానముచేసిన శ్లోకముల తాత్పర్యము ఇది. తల్లి చర్మపు తిత్తి. దానివలన పుట్టిన పుత్రుడు తండ్రికి సంబంధించినవాడే. తిత్తిలోనుంచిన ద్రవ్యము తిత్తిదిగాడు. ఆ ద్రవ్యము ఉంచినవానిదే. ఎవనివలన పుత్రుడు పుట్టెనో, అతడే అతడు. “అత్మావై పుత్ర నామాసి” (తానే పుత్రుడుగా జనించును) అని శ్రుతి. ఓ దుష్యంతుడా! పుత్రుని భరింపుము. శకుంతలను అవమానింపకుము. రేతోఆధానము చేసినవాడా! ఓ రాజా! పుత్రుడు యమలోకమునుండి స్వర్గమును చేర్చును. నీ గర్భమునకు (శిశువునకు) ధాతవు, శకుంతల నిజము చెప్పినది. భరతుని ముగ్గురు భార్యలందు తొమ్మండ్రుగురు పుత్రులు కల్గిరి. ఈ పిల్లలు నాకు అనురూపులు కారని అతడన్నందులకు వారిని పరిత్యజించునన్న భయముచే వారిని ఆ తల్లులే చంపిరి. అందువలన ఇతని పుత్రజన్మ మట్లు వ్యర్థమైపోగా, పుత్రార్థియై మరుత్సోమయాగము చేయగా గర్భగతుడు దీర్ఘతమసుని ప్రక్కన బృహస్పతి అన్నయగు ఉతధ్యుని భార్యయగు మమతయొక్క గర్భమున విడిచిన బృహస్పతియొక్క వీర్యమున మమత యందు పుట్టిన భరద్వాజుడు మరుద్దేవతలచే ఈయబడెను. అతని నామ నిర్వచనము చేయు శ్లోకతాత్పర్యమిది. “ఓ మూఢురాలా! ద్వాజం = ఇద్దరివలన జనించిన ఈ భరద్వాజుని నీవు భరింపుము. ఓ బృహస్పతీ నీవు భరింపుము అని పరస్పరము వీని తల్లిదండ్రులు ఇట్లు వెళ్ళిపోయిరి. అందు ఇతడు భరద్వాజుడైనాడు” ఆ భరద్వాజుడు భరతుని పుత్రజన్మ (వితథమై) వ్యర్థమై పోగా, మరుత్తులచే ఇవ్వబడినందున వితథుడు అను పేరొందెను.
వితథుని కొడుకుమన్యువు. అతనికి బృహత్ క్షత్ర మహావీర్య సగరగర్గులను వారు పుత్రులు. సగరునికి సంకృతి, అతనికి గురుప్రీతి, రంతిదేవులుగల్గిరి. గర్తునికి శిని కలిగె. అతని నుంచి గార్గ్యులు, శైన్యులు అనువారు క్షత్ర మిశ్రులైన ద్విజాతులు కల్గెను. మహావీర్యునికి దురుక్షయుడు కల్గెను. అతనికి త్రయ్యారుణి పుష్కరిణుడు కపి అను ముగ్గురు సుతులు కల్గిరి. ఆ ముగ్గురును తర్వాత విప్రత్వము నొందిరి. బృహిత్ క్షత్రునికి సుహోత్రుడు అతనికి హస్తియు కల్గిరి. ఇతడే హస్తినపురమును నిర్మించెను. హస్తి యొక్క తనయులు అజమీఢ ద్విజమీఢ, పురుమీఢులు ముగ్గురు. అజమీఢునికి కణ్వుడు, అతనికి మేధాతిథియు కల్గిరి. ఆ వంశము వారు కణ్వాయునులు అనబడిరి. అజమీఢుని మఱియొక కొడుకు బృహద్విషువు. అతనికి బృహద్ధనువు అతనికి బృహత్కర్మ వానికి జయద్రథుడు వానికి విశ్వజిత్తు వానికి సేనజిత్తు కల్గిరి. సేనజిత్తు కొడుకులు, రుచిరాశ్వ, కాశ్యదృఢ, హనువత్స, హన్వామలు కొడుకులు. రుచిరాశ్వపుత్రుడు పృథుసేనుడు. వానికి పారుడు, వానికి నీలుడు అతనికి నూరుగురు పుత్రులు కలిగిరి. వారిలో ముఖ్యుడు కాంపిల్యాధిపతి సమరుడు. అతనికి పార, సుపార, సదశ్వులు ముగ్గురుకొడుకులు. సుపారునికి పృథువు అతనికి సుకృతి, అతనికి విభ్రాజుడు, అతనికి అణుహుడు కల్గిరి. అణుహుడు శుకుని కూతురు కీర్తిని పెండ్లాడెను. అణుహునికి బ్రహ్మదత్తుడు, అతనికి విష్వక్సేనుడు, అతనికి ఉదక్సేనుడు, అతనికి భల్లాభుడు కల్గిరి. ద్విజమీఢుని కుమారుడు యవీనరుడు. వానికి ధృతిమంతుడు, అతనికి సత్యధృతి, వానికి దృఢనేమి, వానికి సుపార్శ్వుడు, వానికి సుమతి, వానికి సన్నతిమంతుడు, వానికి కృతుడు గల్గిరి. ఇతనిచే హిరణ్యనాభుడు యోగశాస్త్రమును అధ్యయనము చేయించెను. ఇతడు ప్రాచ్య సానగుల యొక్క సంహితలను ఇరువది నాల్గింటిని చేసినాడు. కృతాని కుమారుడు ఉగ్రాయుధుడు. ఇతడు నీపక్షయము ప్రచుర ముగా చేసెను (నీవులు అను శత్రురాజులను హతమార్చెను) ఉగ్రాయుధుడు క్షేమ్యుడు సుధీరుడు, రిపుంజయుడు, బహురథుడు అనువారు తండ్రి కొడుకులు, పౌరవంశమువారు.
అజమీఢుని భార్య నళిని. ఆమెకు నీలుడుకల్గెను. అటుపై శాంతి, సుశాంతి. పురంజయుడు, ఋక్షుడు, హర్యశ్వుడు తండ్రి కొడుకులు. హర్యశ్వునుకి ముద్గలుడు సృంజయుడు బృహద్విషువు యవీనరుడు కాంపిల్యులు అను పేర ఐదుగురు కుమారులు కల్గిరి. ఈ నా పుత్ర పంచకము దేశపంచకము ఏలుదురని తండ్రి పేర్కొనుటవలన పాంచాలు రనబడిరి. ముద్గలునివలన మౌద్గల్యులను క్షత్రవంశ సంబంధమునందిన ద్విజులు కల్గిరి. ముద్గలునికి హర్యశ్వుడు వానికి దివోదాసుడు అహల్యయు అను మిధునము జనించెనును. శరద్వతునకు అహల్యయందు శతానందుడు ఉదయించెను. శతానందునికి సత్యధృతి అను ధనుర్వేద పారంగతుడు ఉదయించెను. సత్యధృతికి ఊర్వశిని చూచినంత రేతః స్థలనమై రెల్లు స్తంభమందు పడెను. అదియు రెండు భాగములయ్యెను. దానఒక కుమారుడు, కుమారిక యును జనించిరి. వేటకేగిన శంతనుడు వారిని జూచి దయతో స్వీకరించెను. అందువలన బాలుడు కృపాచార్యుడు, బాలిక కృపియు అయ్యెను. అ కృపి ద్రోణాచార్యులకు పత్ని అయ్యెను. వారికి అశ్వత్థామ జనించెను. దివోదాసుని పుత్రుడు మిత్రాయువు. అతనికి కుమారుడు చ్యవనుడనురాజు. అతనికి సుదాసుడు, అతనికి సౌదాసుడు, అతనికి సహదేవుడు, అతనికి సోమకుడు, అతనికి జంతువనువాడు నూర్గురు కొడుకులలో జ్యేష్ఠుడు. వారిలో చివరివాడు పృషతుడు. అతనికి ద్రుపదుడు. అతనికి దృష్టద్యుమ్నుడు అతనికి దృష్ట కేతువు కల్గిరి.
అజమీఢునికి మరియొక కుమారుడు ఋక్షుడు. అతనికి సంవరణుడు, వానికి కురువు గల్గిరి. ఈ కురువే కురుక్షేత్రమును, ధర్మక్షేత్రమును కావించినవాడు కురువు కొడుకులు సుధన్వుడు, జహ్నువు, పరీక్షిత్తు మొదలైనవారు. సుధన్వుని పుత్రుడు సహోత్రుడు, వానికి చ్యవనుడు, అతనికి కృతకుడు, అతనికి ఉపరిచర వసువు కల్గిరి. బృహద్రథ ప్రత్యగ్రకుశాంబ కుచేలమాత్స్యు ప్రముఖులు, వసువు కొడుకులు ఏడ్వురు. బృహ ద్రథునికి కుశాగ్రుడు, అతనికి వృషభుడు, అతనికి పుష్పవంతుడు, అతనికి సత్యహితుడు, అతనికి సుధన్వుడు, అతనికి జంతువు గల్గిరి. బృహద్రథుని ఇంకొక కొడుకు జరాసంధుడు రెండు శకలములుగా (తొండెములుగా) పుట్టి జర అను రాక్షసిచే సంధానింప బడినందున వానికి జరాసంధుడు అను పేరు వచ్చెను. అతనికి సహదేవుడు అతనికి సోమపుడు అతనికి శ్రుతిశ్రవుడు గల్గిరి. ఈ నే చెప్పిన వారందరు మగథ భూపాలురు.
జహ్నువునకు సురధుడు జనించెను. అతనినుంచి విదూరథుడు, సార్వభౌముడు, జయత్సేనుడు, ఆరాధితుడు, అయుతాయువు, అక్రోథనుడు, దేవాతిధి, ఋక్షుడు అను వారు తండ్రి కొడుకులు. ఋకునికి భీమసేనుడు, అతనికి దిలీపుడు, అతనికి ప్రతీపుడు, అతనికి దేవాపి, శంతను, బాహ్లికులు అను ముగ్గురు సంతానము కల్గిరి. దేవాపి బాల్యమందు అడవిని జొచ్చెను. శంతనుడు మహీపతి అయ్యెను. అతడు ఏయే ముసలి వారిని, చేతులను తాకునో అతడు యౌవనము బడయును. పరమ శాంతిని పొందును. ఆ పనిచే అతడు శంతనుడు అనబడియె’ అని అతనిని గూర్చిన శ్లోకము పృథివి అందు కీర్తింపబడుచున్నది.
ఆ శంతనుని రాష్ట్రమందు పండ్రెండేండ్లు పర్జన్యుడు వర్షింపలేదు. దాని వలన ఆ అశేష రాష్ట్రము నశింపనుండగా చూచి ఈ రాజు బ్రాహ్మణులను చూసి మన రాష్ట్రమున వర్షమును దేవుడు ఎందులకు వర్షించలేదు? నా అపరాధము ఏమనిఅడిగెను. బ్రాహ్మణులు “మీ అన్నయొక్క భూమి ఇది దీనిని నీవనుభవించుచున్నావు. అందుచే పరివేత్తవయినావు. (అన్నకు పెండ్లికాకుండ పెండ్లిచేసికొన్న తమ్ముడు పరివేత్త) అయినావు” అనవిని ఇందు నేనేమి చేయవలయుడు అని అడిగెను. వారనిరి. దేవాపి పతనాది దోషములకు లోను కానంతవరకు ఈ రాజ్యము ఆతనిదే. కావున ఈ రాజ్యముతో నీకు పనిలేదు. దీనిని ఆతనికి ఇమ్మనిరి, అంతట ఆతని మంత్రిముఖ్యుడు అశ్మరావి అనువాడు అక్కడ అరణ్య మందు వేదవాదములకు విరోధముగా వాదించు తపస్యులను ప్రయోగించెను. వారును మిక్కిలి ఋజుబుద్ధియైన రాజతనయుని బుద్ధిని, వేదవాదములకు విరోధ మార్గమునందు పోవునట్లు మార్చిరి. శంతన మహారాజు మాత్రము ద్విజుల మాటలను బట్టి పరితాప దుఃఖము కల్గి యా విప్రులను ముందు ఇడుకొని యన్నగారికి రాజ్య దానము చేయ అరణ్యమున కేగెను. ఆ ఆశ్రమము చేరినవారై, వచ్చియున్న రాజు కుమారుడగు దేవాపిని స్తుతించిరి. ఆ బ్రాహ్మణులు వేద వాదానుసారులయిన మాటలు రాజ్యము అగ్రజునిదే కర్తవ్యమను అర్థముగలవి పల్కిరి. ఈ దేవాపియు, వేదవాద విరోధ యుక్తి దూషితముగ పెక్కురీతుల వారితో పలికెను. అంతట నా బ్రాహ్మణులు శంతనునితో “రారమ్ము. ఓ రాజా! అతి నిర్బంధము చాలుచాలు. అనావృష్టి దోషము శమించినది. అనాదికాలముగా చెప్పబడిన వేదవచన దూషణోచ్ఛారణముచే ఈతడు పతితుడైనాడు.” అని పల్కిరి. అన్నగారిట్లు పతితుడు అయినందున నీకు పరివేత్తృత్వ దోషము కలుగదన శంతనుడు తనపురమేగు దెంచి రాజ్యమును కావించెను. వేదవాద విరోధ వచనోచ్చారణముచే భ్రష్టుడైన జ్యేష్ఠభ్రాత దేవాపి ఉండగానే తమ్ముడు శంతనుడు రాజ్య స్వీకారము చేసెను. అంతట సర్వ సస్యములు పండుటకు పర్జన్య భగవానుడు వర్షించెను.
బాహ్లికునికి సోమదత్తుడు అతనికి భూరి, భూరిశ్రవుడు, శల్యుడు అను ముగ్గురు కల్గిరి. శంతనునికి దేవనది జాహ్నవియందు దారకీర్తి, అశేష శాస్త్రార్ధవేత్త భీష్ముడు అను పుత్రుడు ఉదయించెను. శంతనునికి సత్యవతి యందు చిత్రాంగద విచిత్ర వీర్యులు ఇద్దరు కల్గిరి. చిత్రాంగదుడు బాల్యమందే చిత్రాంగదుడను గంధర్వునిచేత యుద్ధము నందు కూలెను. విచిత్రవీర్యుడు కాశీరాజు తనయలను అంబ, అంబాలిక అను వారిని పెండ్లాడెను. వారి యువభోగాతి భేదముచే క్షయవ్యాధికి గురియై మరణించిరి. నా పుత్రుడు కృష్ణ ద్వైపాయనుడు, తల్లిమాట జవదాటరాదను సత్యవతీ నియోగముచే విచిత్రవీర్యుని క్షేత్రమందు (భార్యయందు) ధృతరాష్ట్ర, పాండవులను ఆమె(సత్యవతి) పంపిన భుజిష్యయందు (భోగ స్త్రీయందు) విరుదుని కనెను.
ధృతరాష్ట్రుడు గాంధారియందు దుర్యోధన దుశ్శాసన ముఖ్యులను నూర్గురు కొడుకు లనుగాంచెను. పాండుమ అరణ్యమందు వేటాడుచు ఋషి శాపముచే సంతానముకను సామర్ధ్యమును కోల్పోయెను. వానిభార్య కుంతియందు ధర్మ, వాయు, శుక్రులచే, యుధిష్ఠిర, భీమసేన అర్జునులును మాద్రియందు; అశ్వనీదేవతలచే నకుల సహదేవులును జనించిరి. పాండవులకు ద్రౌపదియందు ఐదుగురు పుత్రులు (ఉప పాండవులు) కల్గిరి. యుధిష్ఠిరుని వలన ప్రతివింధ్యుడు, భీమసేనుని వలన శ్రుతసేనుడు, శ్రుతకీర్తి అర్జునునివలన, శతానీకుడు నకులుని వలన, సహదేవునివలన శ్రుతకర్మయు కల్గిరి. పాండవులకు ఇంకను పుత్రులు కలరు. యుధిష్ఠిరునికి యౌధేయియండు దేవకుడు కల్గెను. భీమునివలన హిడింబ ఘటోత్కచుని గాంచె వానివలన కాశి అను నామె సర్వగుడను కుమారుని కనెను. సహదేవుని వలన విజ సుహోత్రుడను పుత్రుని గాంచెను, నకులుడు రేణుమతియందు నిరమిత్రుని గాంచెను. అర్జునునకు ఉలూపి అను నాగకన్యయందు ఇరావంతుడను కొడుకు ఉదయించెను. మణిపురపతి కూతురి యందు అర్జునుడు పుత్రికా ధర్మముతో అనగా సోదరులు లేని కన్యను నీకు ఇచ్చుచున్నాను. ఈమె యందు కలిగిన పుత్రుడు నాకు పుత్రుడు కాగలడను కన్యాదానకాల నిబంధనతో పెండ్లాడి బభ్రువాహనుని గాంచెను. అర్జునునికి సుభద్ర యందు అభిమన్యుడు ఉదయించెను. అతడు అర్చకుడు అయినందున అతిబల పరాక్రమశాలియై సర్వ శత్రుంజయశాలియై యొప్పెను. అభిమన్యునకు ఉత్తరయందు పరీక్షిజిత్తు జనించెను. కురురాజులందరు క్షయింప అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రముచే గర్భమందే భస్మీకృతుడయ్యు, సకలసురాసుర వందిత చరణారవిందుడగు భగవంతుని ఆత్మసంకల్పముచే అకారణమానుష రూపధారియునైన శ్రీహరియొక్క ప్రభావమువలన పునరుజ్జీవితుడై పరీక్షిత్తు ఉదయించెను. ఈ మహానుభావుడే ఇప్పుడీ భూమండలమును అఖండాయతి ధర్మముచే, అనగా ఉత్తరోత్తరాభివృద్ధియగు అఖండ సంపద కలుగునట్లు పాలించుచున్నారు.
శ్రీ పరాశరుడు ఇట్లు పలికెను:
ఈ మీద భవిష్యరాజులను వర్ణింతును. ఇపుడు ప్రభువుగాఉన్న పరీక్షిత్తునకు జనమేజయ, శ్రుతసేన, ఉగ్రసేన, భీమసేనులు అను నల్గురు కుమారులు కల్గుదురు. జనమేజయునికి శతానీకుడు కల్గును. ఈతడు యాజ్ఞవల్క్యుని కడ అధ్యయనముచేసి కృపాచార్యులవలన అస్త్రోపదేశము పొంది విషయభోగ విరక్తుడై, శౌనకుని ఉపదేశముచే ఆత్మజ్ఞాన సంపన్నుడై పరమ నిర్వాణమును (మోక్షమును) పొందును. శతానీకునికి అశ్వమేధ దత్తుడు ఉదయించెను. అతనికి అధిసీమకృష్ణుడు అతనికి నిచక్నుడు కల్గును. అతడు హస్తినాపురమును గంగముంచి వేయగా కౌశాంబి పట్టణమందు వసించును. అటనుంచి ఉష్ణుడు, చిత్రరథుడు, శుచిరథుడు, వృష్టిమంతుడు, సుషేణుడు, సునీథుడు, నృపచక్షువు, మఖిబలుడు, పారిఫ్లవుడు, సునయుడు, మేధావి, రిపుంజయుడు, అర్వుడు, తిగ్ముడు, బృహద్రథుడు, వసుదాసుడు, శతానీకుడు (2వ శతానీకుడు) ఉదయనుడు, విహీనరుడు, దండపాణి, నిమిత్తుడు, క్షేమకుడును వరుసగా తండ్రి కొడుకులగుదురు. బ్రహ్మ క్షత్రమునకు మూలమయిన దేవర్షులు మెచ్చిన వంశము క్షేమకుని ప్రభువునిగ పొంది, కలియుగమందు సంస్థానమును (సమాప్తిని) పొందును.
శ్రీ పరాశరుడు ఇట్లు అనియె:
ఇటుపై ఇక్ష్వాకు వంశమందు రాబోవు రాజులను గుఇరుంచి తెలిపెదను. బృహద్భలుడు, బృహత్ క్షణుడు, ఉరుక్షయుడు, వత్సవ్యూహుడు, వ్యోముడు, దివాకరుడు, సహదేవుడు, బృహదశ్వుడు, భానురధుడు, ప్రతీతాశ్వుడు, సుప్రతీకుడు, మరుదేవుడు, సునక్షత్రుడు, కిన్నరుడు, అంతరిక్షుడు, సుపర్ణుడు, అమిత్రజిత్తు, బృహద్భాజుడు, ధర్మి, కృతంజయుడు, రణంజయుడు, సంజయుడు, శాక్యుడు, శుద్ధోదనుడు, రాహుడు (బుద్ధుడు), ప్రసేనజిత్తు, క్షుద్రకుడు, కుండకుడు, సురథుడు, సుమిత్రుడు తండ్రి కొడుకులుగా కల్గుదురు. ఈ ఇక్ష్వాకులు బృహద్భల వంశీయులు. వీరిని గూర్చి
“ఇక్ష్వాకువుల వంశమిది సుమిత్రుని దాక ఉండును. కలిలో ఆతని దాక ఈ వంశము నకు ఇంపు కల్గును” అని వీరి వంశమును గూర్చి చెప్పబడును.
రాబోవు బార్హద్రథులు, మాగాధులు అనబడువారి వంశమిది. ఈ వంశమందు జరాసంధుడు మొదలుగా మహాబలశాలురు కల్గిరి. జరాసంధుడు, సహదేవుడు, సోమాపి, అనుశ్రుతశ్రవుడు, అయుతాయువు, నిరమిత్రుడు, సునేత్రుడు, బృహత్కర్ముడు, శ్యేనజిత్తు, శ్రుతంజయుడు, విప్రుడు, శుచి, క్షేమ్య, సువ్రతుడు, ధర్ముడు, సుశ్రవుడు, ధృఢసేనుడు, సుబలుడు, సునీతుడు, సత్యజిత్తు, విశ్వజిత్తు, రిపుంజయుడు అనువారు వరుసగా తండ్రి కొడుకులు. ఈ బార్హద్రథ మగధరాజుల వంశమొక్క వేయియేండ్లు ఉండును.
పరాశరుండు ఇట్లు అనియె:
బార్హద్రథులలో చివరివాడు రిపుంజయుడనువాని మంత్రమునికుడు రాజును చంపి తన కొడుకగు ప్రద్యోతనునికి పట్టాభిషేకము చేయును. వాని నుండి తండ్రికొడుకులగు బలాక విశాఖయూప జనక నందివర్ధన నంది ప్రభృతులు ఎనిమిదివందల నలుబదిమూడు మంది ప్రద్యోతులు భూపతులగుదురు. అక్కడ నుండి తండ్రికొడుకులగు తేతవర్ణుడు, శిశునాభుడు, క్షేమధర్మ, క్షతౌజముడు విధిసార అజాశత్రు అర్భక ఉదయనందివర్ధన మహానందులు శైశునాభులు మూడువందలఅరువది రెండేండ్లు పాలింతురు.
మహానందునికి శూద్ర స్త్రీయందు అతిలుబ్ధుడు, అతిబలుడు అగు మహాపద్మ నందుడు అనువాడు అపర పరశురాముడట్లు అఖిల క్షత్రాంతము చేయును. అటునుండి శూద్ర రాజులు వత్తురు. ఆ మహాపద్ముడు అనుల్లంఘ్య శాసనుడై ఏకచ్ఛత్రముగ ఈ పృథివిని అనుభవించును. వానికి ఎనమండ్రుమంది కొడుకులు. సుమాలి మొదలయినవారు. అతని తర్వాత భూపతులు అగుదురు. వారు ఈ భూమిని నూరేండ్లు అనుభవింతురు. అవ్వల ఇందు నవనందులను కౌటిల్యుడు అను బ్రాహ్మణుడు ఉద్ధరించును, వారై పోయిన తర్వాత మౌర్యులు పాలింతురు. కౌటిల్యుడే, పుట్టియున్న చంద్రగుప్తునికి రాజ్యమందు పట్టాభిషేకము చేయును. అతనికి బింబిసారుడు కల్గును. అతని నుండి అశోక వర్ధనుడు, సుయశుడు, దశరథుడు, సంయుతుడు, శాలిశూకుడు, సోమశర్మ, శతధన్వుడు, బృహద్రథుడు, అనువారు పదిమంది తండ్రి కొడుకులు మౌర్యులు రాజులు అగుదురు నూటముప్పది యేడేండ్లు పాలింతురు. వీరి తర్వాత పదిమంది శుంగరాజులు ఏలుదురు.
సేనాధిపతియగు పుష్యమిత్రుడు రాజును చంపి రాజు అగును. వాని కొడుకు అగ్ని మిత్రుడు సుజ్యేష్ఠుడు, వసుమిత్రుడు, ఉదంకుడు, పులిందకుడు, ఘోషవసువు, వజ్రమిత్రుడు, భాగవతుడు, దేవభూతి అను ఈ శుంగరాజులు నూట పండ్రెండు ఏండ్లు ఏలుదురు. ఆమీద కణ్వులను ఈ భూమి చేరును. శుంగరాజగు దేవభూతి వ్యసనలోలుడై నందున ఆతని మంత్రి కణ్వును వంశమునకు చెందిన వసుదేవుడనువాడు, వానిని చంపి తాను భూపతి అగును. వానికొడుకు, భూమిత్రుడు వానికొడుకు నారాయణుడు, వానికొడుకు సుశర్మ. ఈ నల్గురు కాణ్వులు నలబదియైదేండ్లు పాలింతురు. సుశర్మ అను కాణ్వుని, వాని సేవకుడు బలిపుచ్చకుడను వాడు చంపి, భూమిని అనుభవించును. వీడు ఆంధ్రుడు. వాని తరువాత తమ్ముడు కృష్ణుడను వాడు పృథివీపతి అగును. వాని నుండి శాంతకర్ణి పూర్ణోత్సంగుడు, శాంతకర్ణి, లంబోదరుడు, పిలకుడు, మేఘస్వాతి, పటుమంతుడు, అరిష్టకర్ముడు, హాలాహలుడు, పలలకుడు, పులిందసేనుడు, సుందరుడు, శాతకర్ణి, శిస్వాతి, గోమతి పుత్రుడు వాని కొడుకు అలిమంతుడు, శాంతకర్ణి, శివశ్రీ, శివస్కందుడు, యజ్ఞశ్రీ, ద్వియజ్ఞుడు, చంద్రశ్రీ, సులోమావియను, తండ్రికొడుకులు ముప్పదిమంది నాలుగువందల ఏబది ఆరేండ్లుమించి, భూమిని అనుభవింతురు. ఆంధ్ర భృత్యులు ఏడుగురు ఆభీరాదులు, గర్దభులు పదిమంది రాజులు అగుదురు. ఆ మీద షోడశ రాజులు (16 గురు) రాజులగుదురు.
అటుపై, యవనులు ఎనమండుగురు, పదునల్గురు తురుష్కులు, పదముగ్గురు ముండులు, మేనులు పదకొండుగురు భూపతులు, భూమిని పదివందల తొంబదియేండ్లు అనుభవింతురు. వారు తొలగింపబడిన తర్వాత కైంకిలులు అను యవనులు పట్టాభిషేకము పొందనివారు భూపతులగుదురు. వారి సంతతి వింధ్యశక్తి పురంజయుడు, రామచంద్రుడు, ధర్మవర్మ, వంగుడు, నందనుడు, సునంద వానితమ్ముడు నందియశుడు, శుక్రుమి, ప్రవీరుడు అనువారు నూటయారేండ్లు భూపతులగుదురు. అటుపై వారికొడుకులు పదు ముగ్గురు, బాహ్లికులు ముగ్గురు, వారి తర్వాత పుష్యమిత్ర పటుమిత్రులు పదుముగ్గురు ఏకలులు ఏడుగురు ఆంధ్రులు పాలింతురు. కొనలయందు తొమ్మండుగురు రాజులగుదురు. నైషధులునువారే. మాగధయందు విశ్వస్ఫాటికుడనువాడు వర్ణములను మార్చును. కైవర్త పటుపులింద బ్రాహ్మణులను రాజ్యమునందు నిల్పును.
క్షత్రజాతినంతను లేపివేసి నవనాగులు పద్మవతి అను పురమందు గయ నుండి గంగాప్రయాగ ప్రాంతమునంటిన భూమిని మాగధులు అనుభవింతురు. కోసలాంధ్ర, పుండ్ర తామ్రలిప్త సమతట పురమును దేవరక్షితుడు పాలించును. కళింగ, మాహిష మహేంద్ర భౌమములను గుహులు అనుభవింతురు. నైషధనైమిశక కాలకోశకములను జనపదములను మణిధాన్యక వంశ్యులు అనుభవింతురు. తైరాజ్య ముషికములను జనపద ములను కనకుడు అనుభవించును. సౌరాష్ట్ర, ఆవంతి (ఉజ్జయిని), శూద్ర, ఆభీరములు అను, నర్మదా మరుభూములందలి దేశములను వ్రాత్యద్విజులు ఆభీర శూద్రాదులు అనుభవింతురు. సింధుతట దావిక ఉర్వీ చంద్రభాగా కాశ్మీర దేశములను వ్రాత్యద్విజులు, ఆభీర శూద్రాదులు అనుభవింతురు. సింధుతట దావికోర్వీ చంద్రభాగా కాశ్మీర దేశములను వ్రాత్యమ్లేచ్ఛ శూద్రాదులు అను వీరందరు సమకాలికులుగానే భూపతులగుదురు.
అనుగ్రహము కొంచెము, కోపము హెచ్చు సర్వ కాలమందు అబద్ధము, అధర్మములందు రుచిగలవారు, స్త్రీ, బాల, గోవధ, పరధనాపహరణములందు రుచిగలవారు అల్ప సారము గలవారు తమోగుణప్రాయులు పుట్టి గిట్టుట మాత్రమైన అల్ప జీవితము అల్ప ఆయుర్దాయముకల్గి పెద్దకోరిక అల్పధర్మము కల్గి లుబ్ధులై వీరు ఉందురు. వారితో కలసి పోయి జనపదములు అదే శీలమున వర్తించుచు, రాజు ఆశ్రయముచేతనే శుష్మిణః (=బలవంతులై), మ్లేచ్ఛాచారులై, విపర్యయ ప్రవర్తనులై ప్రజలను నాశనము చేయుదురు.
కలి లక్షణాలు
అందువలన అనుదినము కొంచెము కొంచెముగా తఱిగిపోయి ధర్మార్ధ పురుషార్థ ములు క్షయించుటచే, జగత్తు నశించును. అటుపై ధనమే అభిజన (కుల) కారణము (ధనమున్నవాడే ఉత్తమ కులీనుడు అని అర్థము) అభిరుచియే దాంపత్య కారణము, స్త్రీత్వమే భోగకారణము. అనృతమే వ్యవహార జయహేతువు ఎత్తున ఉదక సమృద్ధియే పృథివీ (స్వీకార) హేతువు, జందెమే విప్రత్వ హేతువు, రత్నములు సువర్ణాది ధాతువులుం డుటయే శ్లాఘ్యుడగుటకు కారణము. అన్యాయమే జీవన కారణము. దౌర్బల్యమే అవృత్తి కారణము భయములేకుండ ప్రగల్భముగ (బల్లగుద్ది) పలుకుటయే పాండిత్య కారణము. బీదరికమే (దైన్యమే) సాధుత్వ హేతువు. స్నానమే ప్రసాధన హేతువు (స్నానమే సర్వాను స్థానము) దానమే ధర్మహేతువు. స్వీకరణమే వివాహహేతువు. సర్వేషధారియే పాత్రము (దానము పొందుటకు అర్హత్వము (పాత్ర) దూరముగా ఉన్న ఉదకమే తీర్ధహేతువు. కపట వేషధారణమే మహత్వము నకు హేతువునై ఇట్లనేక దోషములు భూమండలమున పెచ్చుపెరిగి ఆయా వర్ణములందు ఎవ్వడు బలవంతుడో, వాడే భూపతి అగును. ఇట్ల తిలుబ్ధమైన పాలకులను సహింపలేక ప్రజలు, కొండలు, గుట్టలు, లోయలు బట్టి పోయి అట తలదాచుకొందురు. కల్లు, ఆకుకూరలు, దుంపలు, పండ్లు, ఆకులు, పువ్వులను తిందురు. చెట్లపట్టాలు, ఆకులు కట్టుకొందురు. పిల్లలను తెగకనెదరు. శీతావాతారాతప వర్షములకు ఓర్చుకుని బ్రతుకుదురు. ఇరువది మూడేండ్లు మించి ఎవ్వడును బ్రతుకడు. ఈ సకల జనము ఈ కలియుగమున తఱగిపోవును.
కలియుగమందు శ్రోతస్మార్త ధర్మము మహోపద్రవము పొంది క్షీణమైపోగా జగత్కర్త చరాచర గురువు ఆదిమధ్యాంత రహితుడు, బ్రహ్మమయుడు అగు భగవంతుడు వాసుదేవుని అంశము శంబల గ్రామమునందు ముఖ్యుడైన బ్రాహ్మణుడగు విష్ణుయశుని ఇంట అష్టగుణ సమృద్ధితో కల్కిరూపియై ఈ జగమందు అవతరించి అపరిమేయ శక్తిమహిమలుకలవాడై సకలమ్లేచ్ఛులను, దస్యులను (దొంగలను), దుష్టచిత్తులను, ఎల్లరను నశింపచేయును. సర్వమును స్వధర్మమందునిలుపును. అశేష కలియుగము తుదను రాత్రి తుద మేల్కొన్న వారికివలె, ఆ మనుష్యులకే స్వచ్ఛస్పటిక దళమువలె పరిశుద్ధమైన బుద్ధులు కల్గును. విత్తనములట్లున్న వారికి పరిణతులు అయిన వారికి కూడ (వయస్సు చెల్లిన వారికిని) తత్కాలమందు సంఘటితము అయిన సంతానము గల్గును. ఆ సంతతి కృతయుగాను సారులే అగును. ధార్మికమగు కృతయుగమునకు వారు బీజము లగుదురు.
చంద్ర సూర్యులు బృహస్పతి పుష్యమి నక్షత్రము లేక రాశి యందున్న తటి కృతయుగ ఆరంభమగును. ఈ విషయములో ఇట్లు చెప్పబడినది అని, గడచిన ఇప్పుడున్న రాగల ఆయావంశములందలి రాజులను గురించి చెప్పితిమి. పరిక్షిత్తు జన్మించినది మొదలు నందరాజుల అభిషేకముదాక గల ఈ కాలము ఒక వేయి యేబది సంవత్సరములు.
సప్తర్షులు పరీక్షిత్తు కాలములో మఖానక్షత్ర మందుండిరి. అప్పటికి కలియుగము పండ్రెండు వందల సంవత్సరముల ముందారంభమైనది. వసుదేవకులము నందు అవత రించిన విష్ణువుయొక్క అంశమైన కృష్ణభగవానుడు స్వర్గమలంకరించిన సమయమందే కలి ఈ లోకమునకు వచ్చినాడు. అంతదాక పృథివిని కలి క్రమ్ముకొన సమర్థుడుగాడయ్యె. సనాతన వాసుదేవాంశము దినమ్మునకుపోగా, యుధిష్ఠిరుడు విపరీత నిమిత్తములను (దుశ్శకునములు)చూచి కృష్ణుడువెళ్ళిన తరువాత పరీక్షిత్తునకు పట్టాభిషేకము గావించెను. సప్తర్షులు పూర్వాషాఢానక్షత్రమునకు వచ్చినపుడు నందరాజ్యారంభము నుండి కలి వృద్ధినందును.
ఏ రోజున కృష్ణుడు వైకుంఠమును అధిరోహించెనో, ఆ రోజుననే కలియుగము వచ్చినది. ఆ సంఖ్యవినుము. కలి పండ్రెండువందల దివ్య సంవత్సరములు పూర్తిగ జరి గిన తరువాత కృతయుగము రాగలదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు మహాత్ములు అనేకులు యుగయుగమందును వేలకొలది గడచినారు. వారివారి పేరులు వారిలెక్క మిక్కిలి ఎక్కువ అగుట చేతను, ఆయా కులమందు పునరుక్తిగా వచ్చుటచేతను నామ సామ్యము చేతను నేనవన్నియును చెప్పనైతిని. దేవాపీ పౌరవంశ నృపతి. పురువు, ఇక్ష్వాకు వంశజుడు, మహాయోగబలసంపన్నులై కలాప గ్రామమందున్నవారై, కృతయుగ మందు ఇక్కడకు వచ్చి (భారత భూమికి) క్షత్ర వంశ ప్రవర్తకులు కాగలరు. వారు మనువు యొక్క వంశమునకు బీజభూతులు. ఈ క్రమరీతిని మనుపుత్రులచే ఇవ్వసుంధర కృత త్రేతాద్వాపర యుగములు మూడింట ఉపభుక్తమగును. దేవాపి పురువులు ఇప్పుడు ఉన్నట్లే, కలిలో వారు కొందరు బీజ స్వరూపులై ఉందురు. ఈ రాజ వంశ చరిత్ర నీకు సంక్షేపముగ తెల్పితిని. దీనిని వందేండ్లకైనను సమగ్రముగ తెలుప శక్యముగాదు.
ఈ భూమండలమందును తుచ్ఛ శరీరమునందును. ఈరాజులు మఱి ఇతరులును మోహాంధులై మమకారము పెట్టుకొన్నారు. ఈ నేల నాదెట్లగును. నా కొడుకునకు ఇది ఎట్లగును? నా వంశపుది ఎట్లు అగును. అనుచింతచే కుమిలికుమిలి అంతమొందిరి. వారికి మునుముందటివారు, వారికంటె తరువాతివారు. ఇంకను రాగలవారును వారి వారిని అనుసరించువారు అందరును పోకమానరు. తనను గెల్చుకొనచేయు ప్రయత్న మును దానికై దండయాత్రలందు వ్యగ్రులైన రాజులను కని వసుంధర శరద్రుతువు నందలి పుష్పవికాసము నెపమున విరగబడి నవ్వుచున్నదా అన్నట్లున్నది. మైత్రేయ! ఈ విషయ మందు పృథివీగీత శ్లోకములివె వినుము. వీనిని ధర్మధ్వజయగు జనకునకు అసితుడను ముని వినిపించెను.
పృథివీ గీత:
పృథివి ఇట్లనియె. బుద్ధిమంతులయిన ఈ రాజులయొక్క ఈ మోహమెంత చిత్రము! వట్టి నురుగు మాత్రమైనవారు (అశాశ్వతులు) అయ్యు అతి విశ్వాసము పెట్టుకొన్నారు. తొలుత తమ్ము తాము జయించికాని, మంత్రులను, నౌకరులను, పౌరులను అట్లే శత్రువులను జయింపనెంతురు. ఈ రీతిగ క్రమముగ సాగరపర్యంతమైన నేల జయింతు మని అసక్తచిత్తులై మిక్కిలి దరినున్న మృత్యువునుకానరు. సముద్రము ఆవరణముగ గల క్షితి మండలము స్వాధీనమైనను, ఇది ఆత్మ జయముముందు ఏపాటిది? అత్మను గెలిచి నపుడు గలుగు ఫలము ముక్తి. మున్ను పుట్టినవారు యామినిని విడిచివెళ్ళిరి. తండ్రివెంట గొనిపోలేదు. అట్టినన్ను జయింతుమని పరమమూఢులై రాజులు కోరుదురు. నా కొఱకై తండ్రి కొడుకులకు, అన్నదమ్ములకును, అత్యంత మోహమువల్ల మమకారముగల వారికి విరోధము వచ్చును. పెద్దరగడగా ఈభూమినాది ఇదంతయునాది, నా కుటుంబమునకు గూడ శాశ్వతము అనుకొని ఎవ్వడెవ్వడు రాజుచచ్చి మఱియొకచోట, పుట్టినాడో అని వానివానికి ఈ కుబుద్ధి పొడముచునే ఉండెను. మమకారము పెట్టుకొన్న మనసు గలవానినిఇది విడిచి మృత్యుముఖగ్రస్తుడగుచున్న వానింగని, వాని వెంబడినే పోవనున్న వానికి, హృదయములో నన్ను గూర్చిన ఈ మమకారమేమి? ఈ భూమి నాది. వెంటనే దీనిని వదలి పెట్టుము. అని దూత ముఖమున తమ శత్రువులకు కబురు పంపు నరాధిపు లయెడ నాకెక్కడలేని నవ్వు వచ్చును. వచ్చియు ఆ మూఢుల యెడ మఱి జాలియును కల్గుచున్నది!
ఇవి ధరణీ గీతములయిన శ్లోకములు. మైత్రేయ! వీనిని ఎవరు విందురో వారికి సూర్యుడు తపించుతటి మంచు విరిసినట్లు మమకారము విలయించును.
ఈ మనువు వంశమును చక్కగ తెల్పితిని. స్థితి కార్య ప్రవృత్తుడైన విష్ణువు యొక్క అంశాంశ మూర్తులయిన రాజులు ఇందవతరించినారు. దీనిని మొదటినుండి క్రమముగ భక్తితో ఎవ్వడు వినునో వాని అశేష పాపము నశించును. మనస్సు శుద్ధమగును. సాటిలేని ధనధాన్య సమృద్ధిని అవ్యాహతేంద్రియుడై ఆతడు పొందెను. చంద్ర సూర్య వంశముల గురించి ఎల్లవిని ఇక్ష్వాకు, జహ్ను, మాంధాతృ, సగర, అవిక్షిత, రఘు, యయాతి, నహుషాదులను నాశము పొందిన వారిని మహాబలులను మహావీరులను అనంత ధన సంపన్నులను బలీయమైన కాలముచే కథామాత్రావశిష్టులుగా చేయబడిన రాజులను వినినవాడు పుత్రదార గృహక్షేత్రాది ద్రవ్యసముదాయమంది నరుడు ప్రాజ్ఞుడైన యెడల మమకారము చేయడు. చేతులు మీదికెత్తి అనేక వర్షగణములు తపస్సుచేసిన పురుష ప్రవీరులు మహాయజ్ఞములను ఆచరించిన బలశాలురు మహావీరులు కూడ కాలముచే కథామాత్రావశేషులు (కీర్తి శేషులు) కావింపబడినారు.
అడ్డులేనివాడై, మరి చక్రమెల్ల గెల్చి సర్వ లోకములను స్వేచ్ఛా సంచారము సేసిన పృథుచక్రవర్తి కాలవాతహతుడై అగ్నియందు వేసిన బూరుగుదూదివలె నష్టమైపోయినాడు. సర్వద్వీపములను ఆక్రమించి అనుభవించి, అరిచక్రమును కూల్చిన కార్తవీర్యుడు ఉన్నాడా? లేదా అను సంకల్ప వికల్పములకు హేతువు అయినాడు అట్టివాడు కథామాత్ర శేషియై పోయినాడు.
(భూభంగ (కనుబొమల) ముడిచే ప్రకాశింప చేయబడిన దిఙ్ముఖములుగల రావణ రాఘవాదుల ఐశ్వర్యము, యముని యొక్క ప్రసారముచే బూడిదకూడ మిగులని దాయె నేల? ఛీ! ఐశ్వర్యమంతుడని భూభంగపాత మాత్రమున క్షణము భస్మావశిష్టమై పోలేదా.
మాంధాతృ చక్రవర్తి పుడమిపై కీర్తి శరీరుడైనాడని విని సాధువు ఎవ్వడు మంద బుద్ధియై దేహమునందుకూడ మమత్వమును పొందును? భగీరథాదులు సగరుడు కకుత్రుడు రావణుడు రామలక్ష్మణులు యుధిష్ఠిరాదులు ఉండిరి. నిజమిది. అబద్దము కాదు. వారందరూ ఏమైనారో ఎఱుగము. ఎవరిప్పుడున్నారు? ఎవరుండబోవుచున్నారు? వారందరు మహావీర్యులు, బ్రాహ్మణోత్తమా! వారు, నేచెప్పినవీరు, మఱి ఇతరులు, పూర్వులట్లనే అందఱు అగుదురు అని చెప్పదగి ఉందురు. ఈ అంశమెఱిగి పండితుడైన (జ్ఞాని) మానవుడు క్షేత్రపుత్ర కలత్రాదులందుదురు ఇక! ఇతర శరీరధారులు అట్లుందురు గాక! అనగా వారియందు మమకారము అసలే పనికిరాదని భావము. వారియెడ మనసులో మమకారము చేయ గూడదు. శరీరమునందును మమకారము చేయరాదు.
Summary of chapter 4 of the Vishnu Mahā Purāṇa is as follows:
The fourth aṃśa becomes a river of lineage, tracing the solar dynasty (Sūryavaṃśa) from Vaivasvata Manu down through Ikṣvāku to the radiant deeds of Rāma of Ayodhyā, and the lunar dynasty (Candravaṃśa) through Purūravas, Nahuṣa, and Yayāti to the Kuru and Yadu houses. Kings both righteous and flawed pass before the listener in swift succession, each dynasty a testament to how Viṣṇu's providence threads through the affairs of mortal rulers even when hidden from their sight. By tracing the Yādava line to its very source, the aṃśa quietly prepares the ground for the descent of Kṛṣṇa, whose birth the coming aṃśa will celebrate in full.