విష్ణు మహా పురాణము

5వ అంశం

కృష్ణావతార ప్రసంగము

మైత్రేయుడు ఇట్లు అనియె:

క్షత్రవంశ చరిత్రమును వంశానుచరితమును వర్ణించిరి. యదుకులమందు వ్యాపకుడగు నారాయణుని అంశావతారమైన శ్రీకృష్ణుని యొక్క చరితమును విస్తృతముగను, యధార్ధముగను విన వేడుక పడుచున్నాను. “భగవంతుడగు పురుషోత్తముడు అంశాంశలుగ భూమియందు అవతరించి, చేసిన పనులను సవిస్తృతముగ వర్ణింపుడు” అని అడుగగా పరాశరుడు ఇట్లు అనియె.

“మైత్రేయా! ఇది జగన్మంగళకర చరిత్ర. వసుదేవుడు దేవకుని కుమార్తెను దేవతా సమానురాలగు, మహానుభావురాలగు దేవకిని వివాహమాడెను. ఆమె అన్న కంసుడు ఆమెను రథముపై అత్తవారింటికి గొనిపోవుటకు సారధ్యము వహించెను. అపుడు మేఘ గంభీర స్వరమున ఆకాశవాణి బిగ్గరగా ఓ మూఢుడా! “ఈ నీ చెల్లెలిని భర్తతో అత్తవారింటికి పంపించుచున్నావు. ఈమె ఎనిమిదవ గర్భము నీ ప్రాణములను హరించు”నని విని పించెను. కంసుడువిని ఒర నుండి కత్తిదూసి దేవకిని చంపబూనెను. వసుదేవుడు మహాను భావ! ఈమెను చంపవలదు. పుట్టిన పిల్లలను ఎల్లరను నీకర్పింతును అనగా కంసుడు సరియని వసుదేవునిపై గౌరవముగాని చెల్లెలిని చంపుట విరమించెను. అదేసమయమున భూదేవి భారమును ఓర్వలేక మేరుపర్వతమందున్న దేవసమాజము దరికేగి మ్రొక్కి తన కష్టమును జాలిగా చెప్పికొనెను.

అగ్నిస్సువర్ణస్య గురుర్గవాంసూర్యః పరోగురుః

మమాప్యఖిలలోకానాం గురునారాయణో గురుః

ప్రజాపతిపతి ర్రహ్మాపూర్వేషా మపిపూర్వజః

కళాకాష్ఠానిమేషాత్మాకాలశ్చా వ్యక్తమూర్తిమాన్

తదంశభూతాస్సర్వేషాం సమూహోపస్సురోత్తమాః

ఆదిత్యా మరుత స్సాధ్యా రుద్రావస్వశ్వివహ్నయః

పితరోయేచ లోకానాం స్రష్టారో అపుత్రపురోగమాః

ఏతే తస్యాప్రమేయస్య విష్ణోరూపం మహాత్మనః

యక్షరాక్షసదైతేయ పిశాగోరగదానవాః

గంధర్వాప్సరసశ్చైవ రూపం విష్ణోర్మహాత్మనః

గ్రహాక్షన్ తాతకాచిత్ర గగనాగ్ని జలానిలాః

అహంచ విషయాశ్చైవ సర్వం విష్ణుమయం జగత్

తథాచానేకరూపస్య యస్య రూపాణ్యహర్నిర్నశమ్

 బాధ్యబాధకతాం యాన్తి కల్లోలా ఇవసాగరే

తత్సాంప్రతమమీదై త్యాః కాలనేమిపురోగమా:

మత్సన్ లోకం సమాక్రమ్యబాధన్తే అహర్నిశంప్రజాః

కాలనేమిర్నతో యోఅసౌ విష్ణునా ప్రభవిష్ణునా

ఉగ్రసేనసుతః కంసస్సంభూతస్సమహాసురః

అరిప్టోధేనుకః కేశీ ప్రలమోబనరకస్తథా

సున్దో అసురస్తథా అత్యు గ్రోబాణశ్చాపిబలేస్సుతః

తధాన్యేచమహావీర్యా నృపాణాంభవనేషు యే

సముత్పన్నాదురాత్మానస్తాన్న సంఖ్యాతు ముత్సహే

అక్షౌహిఞ్యో అత్ర బహులాదివ్య మూర్నిధరా స్సురాః

మహాబలానాందృప్తానాందై త్యేన్ద్రాణాంమ మోపరి

తద్భూరిభారపీడార్తానశక్నో మ్యమరేశ్వరాః

బిర్తుమాత్మానమహమితి విజ్ఞాపయామి వః

క్రియతాంతన్మ మహాభాగా మమ భారావతారణమ్ యథారసాతలంనాహంగచ్ఛేయమితివిహ్వలా

ఇత్యాకర్ణ్య ధరావాక్యమశేషైస్త్రిదళేశ్వరైః

భువోభారావతారార్థం బ్రహ్మాప్రాహప్రచోదితః

బ్రహ్మోవాచ:

యథాహ వసుధా సర్వం సత్యమేవదివౌకసః

అహంభవోభవ స్తశ్చసర్వే నారాయణాత్మకాః

విభూతయ స్తుయా స్తస్య తాసామేవ పరస్పరమ్

ఆధిక్యన్యూనతాబాధ్యబౌధకత్వేన వర్తతే

తదాగచ్ఛతగచ్చామ క్షీఽబ్దే స్తటముత్తమమ్

తత్రారాధ్యహరింతస్మైసర్వం విజ్ఞాపయామవై

సర్వథై వజగత్యర్థే ససర్వాత్మా జగన్మయః

సత్త్వాం శేనావతీర్యోర్వ్యాంధర్నస్య కురుస్థేతిమ్

ఇత్యుక్త్వాప్రయయౌతత్ర సహదేవైః పితామహః

సమాహితమనాశ్చైవం తుష్టావ గరుడధ్వజమ్

అగ్ని బంగారమునకు గురువు. (కారణము) గోవులకు సూర్యుడు పరమగురువు. సర్వలోకగురువగు నారాయణుడు నాకు గురువు. ప్రజాపతులకెల్ల పతియగు బ్రహ్మ పూర్వుల కెల్ల పూర్వుడు ఆయన శ్రీమహావిష్ణువు కులమున బుట్టినాడు. కలా కాష్ఠనిమేషము ఇత్యాది మానముగల కాలస్వరూపము అవ్యక్త రూపుడు అతడే. మీరందరును విష్ణువు యొక్క అంశభూతులు. ఆదిత్యులు, మరుత్తులు, రుద్రులు, యక్షరాక్షసాదులు, గ్రహములు, పంచభూతములు, నేను భూతతన్మాత్రలు మొదలగు జగత్తంతయు విష్ణుమయము. కడలిలో కెరటములట్లు సర్వ స్వరూపుడగు అతనియొక్క రూపములు ఒకదానికొకటి బాధించునది బాధింపబడునదియునై తోచును.

కావున ఇప్పుడు కాలనేమి మొదలగు దైత్యులు మానవ లోకమును ఆక్రమించి అహర్నిశము ప్రజలను బాధించుచున్నారు. విష్ణుహతుడైన కాలనేమి కంసుడై ఉగ్రసేనునికి పుట్టినాడు. అరిష్టుడు ధేమకుడు కేశి ప్రలంబుడు నరకుడు సుందుడు బలికుమారుడు అయిన బాణుడు, ఇతరులైన పరమదుష్టులు, మహావీర్యులు, రాజుల ఇండ్లయందు పుట్టియున్నారు. వారిని లెక్కింపజాలను అనేక అక్షౌహిణుల దేవతలు మదోన్మత్తులగు రాక్షసులు నామీద వసించి విపరీత భారములు కూర్చుచున్నారు. దేవతలారా! ఇది నాకు దుర్భరమైన వేదనగా ఉన్నది. నేను పాతాళమునకు క్రుంగిపోకుండ ఈ బరువును దింపుడనవిని భారము తగ్గింప దేవతలచే ప్రేరితుడై బ్రహ్మ ఇట్లనియె.

“భూదేవి పలికినది నిజము. నేను, శివుడు, మీరు అందరమును నారాయణ స్వరూ పులమే. ఆయన విభూతులే. పరస్పరము పెద్దచిన్న, బాధించువాడు, బాధింపబడు వాడుగా వర్తించును. అందువలన క్షీరసముద్ర తీరమునకు అందరమును పోయి హరిని సేవించి స్వామికి సర్వమును విన్నవింతము. సర్వాత్మకుడైన శ్రీహరి సత్త్వగుణాంశముచే అవనిలో అవతరించి ధర్మస్థితి చేయును” అని పలికి దేవతలతోగూడ పితామహుడట జని సమాధి నిష్ఠుడై గరుడధ్వజుని ఇట్లు స్తుతించెను.

బ్రహ్మోవాచ:

ద్యేవిద్యేత్వమనామ్నాయ! పరాచై వాపరాతథా

తేవభవతో రూపే మూర్తిమూర్తాత్మికే ప్రభో

ద్వేబ్రహ్మణీత్వణీయో అతిస్థూలార్త్మ సర్వసర్వవిత్

శబ్ద బ్రహ్మపరంచైవ బ్రహ్మబ్రహ్మ మయస్యయత్

ఋగ్వేదస్త్వంయజుర్వేదస్సామవేదస్త్వథర్వచ

శిక్షాకల్పోనిరుక్తంచ ఛన్దోజ్యోతిషమేవచ

ఇతిహాస పురాణేచ తథా వ్యాకరణం ప్రభో!

మీమాంసాన్యాయకంతద్వద్ధర్మ శాస్త్రాణ్యధోక్షజ!

ఆత్మాత్మదేహగుణవద్వి చారాచారి యద్వచః!

తదప్యాద్యపతే! నాన్యదధ్యాత్మా త్మస్వరూపవత్

త్వమవ్యక్తమనిర్దేశ్యమచిన్త్యానామవర్ణవత్

అపాణిపాదరూపంచ శుద్ధం నిత్యం పరాత్పరమ్

శృణోష్యకర్ణః పరిపశ్య సిత్వమచక్షురూపో బహురూపరూపః

అపాదహస్తో జవనోగృహీతా త్వం వేత్సిసర్వంన చసర్వ వేర్యః

అణోరణీయాం సమసత్స్వరూపం త్వాంపశ్యతో అజ్ఞాననివృత్తిరగ్ర్యా

ధీ రస్య ధీరస్య బిభర్తినాన్యద్వ రేణ్య రూపాత్పరతః పరార్త్మ

త్వం విశ్వనాభి ర్భువనస్య గోప్తా సర్వాణిభూతాని తవా న్తరాణి

యద్భూతభవ్యం యదణోరణీయః పుమాంన్త్వమేకః ప్రకృతేః పరస్తాత్ ఏకశ్చతుర్ధాభగర్వాహుతాశో వర్చోవిభూతిం జగతో దదాతి

త్వం విశ్వతశ్చక్షురనన్త మూర్తే! త్రేధాపదంత్వం నిదదధాసిధాతః

తథాభవాన్ సర్వగతై కరూపీ రూపాణ్యశేషాణ్యనుప్రష్యతీశః

యథా అగ్ని రేకో బహుధాసమిధ్యతే వికారభేదై రవి కారరూపః

ఏకంత వాగ్ర్యంపరమం పదం యత్పశ్య న్తిత్వాం సూరయోజ్ఞాన దృశ్యమ్ త్వత్తోనాన్యత్కించిత స్తిస్వరూపం యద్వాభూతమ్ యచ్చభవ్యంపరాత్మన్!

వ్యక్తావ్యక్త స్వరూపస్త్వంసమష్టి వ్యష్టి రూపవాన్

సర్వజ్ఞస్సర్వ విత్సర్వ శక్తిజ్ఞాన లర్ధర్మా

అన్యూనశ్చాప్య వృద్ధిశ్చ స్వాధీనో అనాది మాన్వశీ

క్లమతస్ధిభయక్రోధకామాదిభి రసం యుతః

నిరవద్యః పరః ప్రాప్తేర్నిరధిష్ఠో అక్షరః క్రమః

సర్వేశ్వరః పరాధరోధామ్నాంధామాత్మకోక్షయః

సకలావరణాతీత నిరాలమ్బభావన

మహావిభూతి సంస్థాన సమస్తే పురుషోత్తమ!

నాకారణాత్కారణాద్వాకారణాకారణాన్నచ

శరీరగ్రహణంవాపిధర్మత్రాణాయ కేవలమ్

శ్రీ పరాశర ఉవాచ:

ఇత్యేవంసం స్తవంశ్రుత్వామనసాభగవానజః

బ్రహ్మాణమాహప్రీతేన విశ్వరూపం ప్రకాశయన్

శ్రీ భగవానువాచ:

భోభోబ్రహ్మం స్త్వయామత్తత్సహ దేవైర్యదిష్యతే

తదుచ్యతామశేషంచ సిద్దమేవావధార్యతామ్

శ్రీ పరాశర ఉవాచ:

తతోబ్రహ్మాహరేర్దివ్యం విశ్వరూపమవేక్ష్యతత్

తుష్టావభూయోదేవేషు సాధ్వసావనతాత్మసు

అనామ్నాయ!=వేదములకు గూడ వర్ణించుటకు అలవికాని ప్రభో! పర అపర అను రెండు విద్యలు నీవె. మూర్తము=సాకారము అమూర్తము నిరాకారము అయిన నీ స్వరూప ములే అవి. ఓ సర్వాత్మకః సర్వజ్ఞ అవి రెండును బ్రహ్మ స్వరూపములు. ఒకటి మిక్కిలి సూక్ష్మము. ఒకటి అతి స్థూలము. బ్రహ్మమయుడవయిన నీయొక్క స్వరూపమైన ఆ రెంటిలో ఒకటి శబ్ద బ్రహ్మము. ఒకటి పరబ్రహ్మము, ఋగ్యజుస్సామాధర్వణ వేదములు, శిక్షావ్యాకరణఛందోనిరుక్త జ్యోతిషకల్పములను వేదాంగములు ఆరును ఇతిహాస పురాణములును పూర్వోత్తర మీమాంసలును న్యాయవైశేషిక రూపతర్క శాస్త్రమును, ధర్మ శాస్త్రమును అను అష్టాదశ విద్యలు నీ స్వరూపములు. జీవాత్మ పరమాత్మ దేహస్థూల సూక్ష్మగుణ వదవ్యక్తముల యొక్క వ్యాఖ్యానములకు సంబంధించిన ఉపనిషద్వచనములు కూడ నీ కంటె వేరుకావు. అధ్యాత్మతత్త్వమగు జీవాత్మ ఆత్మతత్త్వము అగు పరమాత్మయు నీ స్వరూపమే. అవ్యక్తము అనిర్దేశ్యము అచింత్యము ఆ నామ రూపము పాణిపాదాదులు లేనిది శుద్ధము నిత్యము పరాత్పరమైన వస్తువు నీవే. వీసులు లేకుండ విందువు. కన్నులు లేకుండ కాంతువు. రూపములేకున్నను బహురూపుడవు. పాదములులేని వేగరివి. హస్తములు లేకయు అందుకొందువు. అందఱకు ఎఱుక పడకున్నను అంతయు ఎరుగుదువు. అణువుకంటె అణువవు. దృశ్యరూపరహితుడవు. వరణీయమగు నీ రూపమునే ధారణచేయు సమర్థమైన బుద్ధిగలవాడై ధీరుడై నిన్ను దర్శించిన వానికి అజ్ఞాననాశనము పరమఫలము.

ఓ పరమశ్రేష్ఠా! నీ రూపముకంటె మరొకటి ఈ జగత్తును భరించునది లేదు. ఓ పరాత్పరా! ఈ విశ్వమునకు నాభిస్థానమీవు. (విశ్వము గర్భమున ధరించువాడవు) భువన రక్షకుడవు. సర్వభూతములు నీలోనివి. పుట్టినది పుట్టబోవునది అణువుకంటె అణువు ప్రకృతి కంటే పరుడైన ఏకైక పురుషుడవు నీవే. ఒక్కడవే త్రేతాగ్నులు ఔపాసనాగ్ని రూపమున (లేక) వైద్యుత జాఠర నిర్మధ్య బాడబాగ్ని రూపమున నలుతెరగులైన అగ్ని స్వరూపుడవై జగత్తునకు వర్చస్సును విభూతిని (ఐశ్వర్యమును) ఒసంగుచున్నావు. ఓ అనంతమూర్తీ! విశ్వతశ్చక్షువు (సర్వద్రష్టవు. సాక్షివి) త్రివిధముగ నీ పదమును విన్యాసము చేయుదువు. త్రివిక్రమ అవతారమందు మూడు లోకములందు నీ పాదమును ఉంచెదవు. ఒకే అగ్ని వికార భేదములతో, వికారములేనిదై పలురూపములలో ఆరాధింప బడునట్లు, సర్వజ్ఞుడవై నను నీవు ఒకే రూపమై అశేషరూపములను నీవె అనుపోషణము చేయుచున్నావు. ఏకైకము సర్వోన్నతము జ్ఞానైక దృశ్యము పరమ పదమునుగ సూరులు (జ్ఞానులు) నిన్ను దర్శింతురు. నీ కంటె మఱియే కొంచెము స్వరూపము మున్నులేదు. ఇకముందు ఉండబోదు. నీవు వ్యక్తముగా వ్యష్టి రూపమునను అవ్యక్తముగ సమష్టి రూపమునను ఉన్నాడవు. సర్వజ్ఞుడవు. సర్వవేత్తవు. సర్వశక్తి, జ్ఞానబలసమృద్ధులు గలవాడవు. నీవే కొదువ లేని వాడవు. పెరగని వాడవు. స్వాధీనుడవు ఆదిలేని వాడవు ఇంద్రియ నిగ్రహము కలవాడవు. వసివాడుట, తంద్ర (అలసట) భయము, కోపము, కామము మొదలయిన గుణములు నీకులేవు. దోషములేని వాడవు. ప్రాప్తికీ పరుడవు. (ఇంద్రియాదుల యొక్క లక్ష్యమునకు అతీతుడు) సర్వాధారుడవు. సర్వేశ్వరుడవు. పరమాధారమును నీవే. నేనే సర్వతేజస్సులకు తేజస్సు నీవు. అక్షయుడను! సర్వావరణముల కతీతుడవు. నిరాలంబన మైన భావన నీ స్వరూ పము. (నిర్భీజ సమాధియందు కేవల జ్ఞానరూపుడవై ధ్యేయమగుదువు) మహావిభూతి సంస్థానమగు పురుషోత్తమా! నీకు నమస్కారము. అకారణముగను, సకారణముగను, కారణాకారణములమధ్యస్థితిగను నీవు శరీర గ్రహణము చేయుదువు. ఓ సర్వవ్యాపీ! నీవు శరీరము గ్రహించుట (అవతరించుట) కేవలము ధర్మ రక్షణమునకే అని ఇట్లుచేసిన బ్రహ్మస్తవమును భగవంతుడగు శ్రీహరి విని సంప్రీత మనసుతో తన విశ్వరూపమును వెలువరించుచు బ్రహ్మతో ఇట్లు అనియె. “ఓ బ్రహ్మా! నీవు దేవతలు కలిసి నా వలన కోరు నది ఏమో తెల్పుడు. పని అయినదే అనుకొనుడు.” అన, హరి యొక్క విశ్వరూపమును దర్శించి దేవతలు భయవినయములతో వినతులుకాగా అంతట పితామహుడు మఱల విష్ణువును ఇట్లు స్తుతించెను.

బ్రహ్మకృత నారాయణ స్తుతి

నమోనమస్తు అస్తే సహస్రకృత్వ స్సహస్రబాహో బహువక్త్ర పాద!

నమోనమస్తే జగతః ప్రవృత్తివినాశ సంస్థాన కరాప్రమేయ!

సూక్ష్మాతిసూక్ష్మాతి బృహత్ప్రమాణ గరీయసామప్యతి గౌరవాత్మన్! ప్రధానబుద్ధీన్ద్రియవత్ప్రధాన! మూలాత్పరార్త్మ భగర్వ! ప్రసీద

ఏషామహీ దేవ! మహీ ప్రసూతై ర్మహాసురైః పీడితశైలబన్ధా

పరాయణత్వాం జగతాముపైతి భారావతారార్థమపారసార!

ఏతేవయం వృత్రరిపు స్తథా అయం నాసత్యద స్రౌవరుణ స్తథైవ

ఇమేచరుద్రా వసవస్ససూర్యాస్సమీరణాగ్ని ప్రముఖా స్తథా అన్యే

సురాస్సమస్తాస్సురనాథ! కార్యమేభిర్మయా యచ్చ తదీశసర్వమ్

అజ్ఞాపయాజ్ఞాం పరిపాలయ స్తస్తవైవ తిష్ఠామసదా అస్తదోషాః

శ్రీ పరాశర ఉవాచ:

ఏవంసంస్తూయ మానస్తుభగర్వా పరమేశ్వరః

ఉజ్జహారాత్మనః కేశౌసిత కృష్ణామహామునే!

ఉవాచచసురానేతౌ మత్కేశౌవసుధాతలే

అవతీర్య భువో భారక్లేశ హానిం కరిష్యతః

సురాశ్చసకలాస్స్వాంశై రవతీర్య మహీతలే

కుర్వన్తుయుద్ధమున్మత్తైః పూర్వోత్పన్నైః మహాసురైః

తతః క్షయమళేషాస్తే దైతేయా ధరణీతలే

ప్రయాస్య న్తినసందేహో మద్ధృక్పాతవి చూర్ణితాః

వసుదేవస్యయాపత్నీ దేవకీ దేవతోపమా

తత్రాయమష్టమోగర్భోమత్కే శోభవితా సురాః

అవతీర్యచతత్రాయంకం సంఘాత యీతాభువి

కాలనేమిం సముద్భూత మిత్యుక్త్వాన్తర్దధేహరిః

నమస్కారము. నీకివే వేయి నమస్కారములు. నీవు సహస్రబాహువుడవు. అనేక ముఖములు పాదములు కలవాడవు. జగత్తుయొక్క సృష్టి స్థితి లయకర్తవు. సూక్ష్మము లన్నిటి కంటె సూక్ష్ముడవు గొప్ప పదార్థములన్నిటికంటె గొప్పవాడవు. ప్రధానము బుద్ధి ఇంద్రియములుగల జీవకోటికి మూలమైన వానికి మూలము నీవే స్వామీ! అనుగ్రహము చూపుము. ఇదిగో! ఈ భూదేవి తనయందు ఉద్భవించిన మహారాక్షసులచే మహాపర్వత శరీర సంధిబంధములు సడలిపోయి, అంతులేని సారము (శక్తి) గల ఓ శ్రీహరీ! జగత్పరాయ ణుడవగు నిన్ను తనభారము హరింతువని శరణు పొందవచ్చినది. ఇంద్రుడు అశ్వనీ దేవతలు వసు రుద్ర ఆదిత్యులు వాయువు అగ్ని మున్నగు మేము చేయవలసిన కార్యమును ఆనతిమ్ము నీ ఆజ్ఞను పరిపాలింతుము.

పాపములను తొలంగుదుమన భగవంతుడు తన తెల్లని నల్లని కేశములను పీకి వేల్పులతో ఇవి రెండు వెంట్రుకలు పుడమిపై అవతరించి భూభార క్లేశమును హరింప గలవు. సురులెల్లరు తమతమ అంశములచే అవనియందు అవతరించి ఇంతకు మున్ను పుట్టిన మదోన్మత్తులైన రాక్షసులతో పోరుదురుగాక! అందుచే వీరు నశింపగలరు. సందేహములేదు. నా చూపుపడినంతన ఎల్లరు మడియుదురు. వసుదేవుని భార్య దేవకీ దేవతామూర్తి, ఈ నా కేశము ఆమెకు ఎనిమిదవ శిశువుగ ఉదయింపగలదు. ఇది కాల నేమి రూపుడగు కంసుని సంహరించును అని పలికి స్వామి అంతర్ధానమయ్యెను.

సురులు ఆ దేవునికి మ్రొక్కి మేరుగిరికి ఏగిరి. అవ్వలవారే భూమిపై అవతరించిరి. దేవకి ఏడవగర్భము ధరణిని ఉద్ధరించునని, నారద భగవానుడు కంసున కెఱింగించెను. అదివిని కంసుడు కుపితుడై దేవకీ వసుదేవులను బంధించెను. వసుదేవుడన్న మాటకు కట్టువడి తానుకన్న కొడుకులను ఏడ్వురను కంసుని కర్పించెను. మున్ను హిరణ్యకశిపునికి పుట్టినవారే వారార్వురు. (షడ్గర్భములు) విష్ణుని నియోగమున యోగనిద్ర, వైష్ణవమాయ వారిని దేవకి గర్భమునందు సంధానముచేసెను. ఆ మాయా శక్తి చేతనే (అవిద్య చేతనే) సర్వజగత్తు సమ్మోహితమగుచున్నది. ఆమెను గూర్చి హరి ఇట్లనియె.

“ఓ నిద్రాదేవతా! నా ఆనతిగొని నీవు పాతాళమందున్న షడ్గర్భములను ఒక్కొక్కటిగా దేవకి ఉదరమున చేర్పుము. వారు హతులయినంతట నాయొక్క అంశాంశమైన వాడు, శేషుడు దేవకికి సప్తముడై ఆమె ఉదరమందు ప్రవేశించును. నంద గోకులమందు నందుని ఇంకొక భార్య రోహిణి ఉన్నది. నీవామె కడుపున నీశిశువును చేర్పుము. భోజరాజు వలని భయముచే కారాగారమందలి నిరోధముచే దేవకికి గర్భము పోయినదని లోకము చెప్పికొనును. అఈ శిశువు గర్భమునుండీ సంకర్షించుటచే (లాగుటచే) సంకర్షుణుడు అను పేరందును. ఆ బాలుడు మహావీరుడు, కైలాసగిరి వంటివాడు. ఆ మీదట నేను శుభస్థానమైన దేవకి జఠరమందు అవతరింపగలను. నీవాగర్భమును విరామముగ కొంపోయి యశోదయందు ఉంచవలయును. వర్షఋతువు శ్రావణ బహుళ అష్టమినాటి రేయి నేను పుట్టుదును. నీవు నవమినాడు పుట్టగలవు. నాశక్తి ప్రేరితమైన తలంపులో వసుదేవుడు నన్ను యశోద ప్రక్కను, నిన్ను దేవకి ప్రక్కకును చేకొనిచేర్చగలడు. దేవీ! కంసుడు నిన్ను బట్టి రాతిపైన వేసికొట్టును. అపుడు నీవు అంతరిక్షమునందు నిలుతువు. అంతట ఇంద్రుడు వేయి కన్నులవాడు కావున గమనించి తలవంచి తన చెల్లెలిగా స్వీకరించును. నీవు శుంభనిశుంభాదిదైత్యులను వేలకొలదిగా సంహరించి అనేక స్థానము లందు అనేక నామములతో ఎల్ల పృథివిని అలంకరింతువు. నీవు భూతిసన్నతి క్షాంతికాంతి ద్యులోకము పృథివి (ధృతిధైర్యాధి దేవత) లజ్జ, పుష్టి, రుష అను ఆయా గుణములు స్వరూపములుగా కలదానవై నీవెఉందువు. నిన్ను ఆర్య, దుర్గ, వేదగర్భ, అంబిక, భద్ర, భద్రకాలి, క్షేమద, భాగ్యద అని ప్రాతస్సాయాహ్నములందు జనులు వినతులై వినుతించి పూజింతురు. నా ప్రసాదముచే నీవు వారి కోరికలను సఫలము చేయగలవు. మానవులు సుర (మద్యము) మాంసము మొదలయిన వానిని భక్ష్య భోజ్యాదులను నీకు నివేదించి అర్చింప నీవు ప్రసన్నురాలవై వారి అశేష వాంఛా ఫలములను అనుగ్రహింతువు. ఓ కల్యాణీ! ఆ ప్రజలందరు నిస్సంశయమతులై నీయందు భక్తి తత్పరులయితీరెదరు. సంది యము లేదు. నా చెప్పిన చొప్పునఁ చనుము.

దేవకృత విష్ణు మాయాస్మృతి

శ్రీపరాశరుడు ఇట్లు అనెను:

జగద్విధాత దేవదేవుడు చెప్పినట్లు యోగమాయ ఆరవ గర్భమునందలి శిశువును రోహిణీగర్భమందుంచి ఆమె గర్భమునందలి శిశువును ఒక కర్షణమును కావించినది. ఆ రోహిణీ జఠరమందుంచబడిన అతడే సంకర్షణుడు (బలరాముడు). ఆ యోగనిద్ర అదేరోజున యశోదయొక్క జఠరమునందు విష్ణువు ఎట్లు ఆనతి ఇచ్చెనో అట్లే పుట్టెను. అటుపై దివంబున గ్రహగణము చక్కని స్థానములందు సంచరింప విష్ణ్వంశము అవని అందు అవతరించెను. ఋతువులు పరమ శోభనములై ప్రకాశించెను. అద్భుతతేజమున దీపించు, దేవకీదేవిని ఎవ్వరేని దర్శింప నేరరైరి. ఆమె వంక చూచినవారి మనస్సులు ఆందోళనమందినవి. స్త్రీ పురుషులెవ్వరికీ కనబడకుండ దేవగుణములు విష్ణుని తన ఉదరమందు ధరించిన ఆ దేవకీ దేవిని రేయింబవళ్ళు ఇట్లు స్తుతించిరి.

దేవతా ఊచుః: -

ప్రకృతిస్త్వంపరాసూక్ష్మా బ్రహ్మగర్భాభవత్పురా

తతో వాణీజగద్ధాతుర్వేదగర్భాసి శోభనే

సృజ్యస్వరూప గర్భాసి సృష్టి భూతాసనాతనే

బీజభూతాతు సర్వస్య యజ్ఞ గర్భాభవస్త్రయీ

ఫలగర్భాత్వమేవేజ్యావహ్ని గర్భాతధారణిః

అదితిర్దేవగర్భాత్వం దైత్య గర్భాతథాదితిః

జోత్స్నావాసరగర్భాత్వం జ్ఞానగర్భాసి సన్నతిః

నయగర్భా పరానీతిర్లజ్టాత్వం ప్రశ్రయోద్వహా

కామగర్భాతథేచ్ఛాత్వం తుష్టిస్సంతోషగర్భిణీ

మేధాచబోధగర్భాసి ధైర్యగర్భోద్వహాధృతిః

గ్రహర్షతారకార్భాద్యౌరస్యాఖిల హైతుకీ

ఏతావిభూతయో దేవితథాన్యాశ్చ సహస్రశః

తథాసంఖ్యాజగద్ధాత్రీ సాంప్రతంజఠరేతవ

సముద్రాద్రి నదీద్వీసవన పట్టణభూషణా

గ్రామఖర్వటఖేటాడ్యా సమస్తాపృథివీ శుభే

సమస్తవహ్నయో అబ్బాంసి సకలాశ్చ సమీరణాః

మహోరగాస్తథాయక్షారాక్షసాః ప్రేతగుహ్యకాః

గ్రహర్షతారకాచిత్రవిమానశతసంకులమ్

అవకాశమశేషస్య యద్దదాతినభస్థ్సలమ్

భూలోకశ్చభువర్లోకస్స్వర్లోకోథమహర్జనః

తపశ్చబ్రహ్మలోకశ్చ బ్రహ్మాణ్డమఖిలంశుభే

తదన్తరేస్థితాదేవాదైత్య గన్ధర్వచారణాః

మహోరగాస్తథాయక్షారాక్షసాః ప్రేపగుహ్యకాః

మనుష్యా! పశవశ్చాన్యేయేచ జీవయశస్విని

తైరన్తన్థెరనన్తో అసౌసర్వగః సర్వభావనః

రూపకర్మస్వరూపాణినపరిచ్ఛేద గోచరే

యస్యాఖిల ప్రమాణానిస విష్ణుగర్భగ్ర స్తవ

త్వంస్వాహాత్వం స్వధావిద్యాసుధాత్వం జ్యోతిరమ్బరే

త్వంసర్వలోకరక్షార్థమవతీర్ణామహీతలే

ప్రసీద దేవిసర్వస్య జగతశ్శం శుభే కురు

ప్రీత్యాతంధారయేశానం ధృతం యేనాఖిలం జగత్

 నీవు సూక్ష్మమయిన పరాప్రకృతివి. బ్రహ్మగర్భవు. ఓ కల్యాణీ ఆ మీద జగత్తులకు విధాతయగు బ్రహ్మకు వాణిపై వేదగర్భవైతివి. సృజ్యమగు (సృష్టింపబడునది అగు) దృశ్యాత్మకజగత్తునకు రూపగర్భవై సృష్టిరూపిణివైతివి. సర్వమునకు బీజమై త్రయీ రూపమగు యజ్ఞగర్భవైతివి. యజింపబడుదానవై (ఇజ్యవై) నీవే ఫలగర్భవైతివి. అరణి రూపమున నీవు వహ్ని గర్భవైతివి. వెన్నెలవై వాసరగర్భవైతివి సన్నతిపై (నమస్కార స్వరూపిణివై) జ్ఞానగర్భవైతివి. పరమ నీతినీవై, నయగర్భవతి యైతివి. వినయమునుపూని లజ్జాగర్భవైతివి. ఇచ్చవు కామగర్భవు. తుష్టిగా సంతోష గర్భిణివి. ‘మేధగా బోధగర్భవు ధృతివై ధైర్యగర్భవు అఖిలకారణమైన ద్యులోకము అంతరిక్షముగా గ్రహనక్షత్ర తారకాగర్భవు. మరియును వేలకొలదిగాగల విభూతులు అసంఖ్యాకములునైన జగద్ధాత్రి ఇపుడు నీ కడుపులో ఉన్నది. నీకు సముద్ర అద్రి నదీ, ద్వీప పట్టణములు విభూషణములు. గ్రామ ఖర్వట భేటాదులు ఎల్లపృథివి, అన్నిఅగ్నులు, నీళ్లు, వాయువులు, ఉరగులు, యక్షులు, రాక్షసులు, ప్రేతములు, గుహ్యకులు, గ్రహర్ష తారకా విమానశత సంకులమైన నభము (అంతరిక్షము) అంతటికి అవకాశమయిన ఆకాశము భూర్భువస్వర్మహర్జనస్తపో బ్రహ్మ లోకములు అఖిల బ్రహ్మాండము, దానిలో ఉన్న దేవదైత్య గంధర్వచారణ మహోరగ యక్ష రాక్షస ప్రేత గుహ్యకులు మనుష్యులు పశువులు మఱియుంగల జీవులు తనలోనున్న వానిచే అనంతుడగు ఈ సర్వాంతర్యామి, సర్వభావనుడు, ఎవ్వని రూపకర్మ స్వరూపములు కొలత కందవో అఖిలమైన కొలత లెవ్వనిలో ఇముడునో అట్టి విష్ణువు నీ గర్భమందున్నాడు. విష్ణుగర్భవు నీవు. నీవు స్వాహాదేవివి, స్వధవు, విద్యవు, సుధవు, నింగివి జ్యోతిస్సువు. నీవు సర్వలోక రక్షార్థము అవనిలో అవతరించినదానవు దేవీ! ప్రసన్నవు కమ్ము ఓకల్యాణి! సర్వజగమ్మునకు శం=సుఖమును, కురు=చేయుము. ఎవ్వనిచే అఖిల జగమ్ము ధరింపబడినదో ఆ ఈశానుని ప్రీతితో నీవు ధరింపుము. 

కృష్ణావతారము

శ్రీ పారాశరుడు ఇట్లు అనియె. ఇట్లా దేవి దేవతలచే స్తుతింపబడినదై తన గర్భమున సర్వజగత్రాణ కారణమైన పుండరీకాక్షుని ధరించెను. అఖిలభువన పద్మ బోధనము కొఱకు మహాత్ముడు విష్ణుభానువు దేవకీరూప పూర్వసంధ్య యందుఆవిర్భ వించెను. ఆ పుట్టినరోజు విమలమైన దిశాముఖములు కలదియునై చంద్రుని కౌముది (వెన్నెల) వలె సర్వలోకమును అత్యంతాహ్లాద కరమైనది. జనార్దనుడు ఆవిర్భవించినయెడ సత్పురుషులు మిగుల సంతోషమును, ప్రచండ వాయువులు ప్రశమమును, నదులు ప్రసన్నతను పొందినవి. సముద్రములు తమ శబ్దముచే మనోహర మంగళవాద్యములను మేళవించెను. గంధర్వ రాజులు గానములు చేసిరి. అప్సరోగణములు నాట్యములుచేసెను. వేల్పులు అంతరిక్షమందు ఉండి పూలవానలను కురిపించిరి. జగన్నాథుడు అవతరింపగా అగ్నులు శాంతముగ దక్షిణావర్త జ్వాలలచే దీపించెను. మేఘములు మందీమందముగ ఉరిమెను. మఱియు అవి పూలవాన కురిసినవి. జనార్దనుడు అర్ధరాత్రమునందు ఉదయించెను. వికసించిన నల్ల తామర పూవువంటి నిగనిగలాడు మేనికాంతితో నలుచేతులతో శ్రీవత్స చిహ్నముతో ఉదయించిన ఆ మూర్తిని చూచి వసుదేవుడు ప్రసాదగుణ భరితములయిన వచనములచే స్తుతించి కంసునివలన జడుపుతో అయ్యెడ ఇట్లని విన్నవించెను.

“ఓ దేవదేవ ప్రభూ! నీవు జన్మించితివి. అనుగ్రహముచేసి, ఈ నీ దివ్యరూపమును శంఖ చక్ర గదాధారియైన మూర్తిని ఉపసంహరింపుము. నానివాసమున నీవు అవతరించి నట్లు విని ఈకంసుడు ఈక్షణము నాకుహానిచేయును”. అటుపై దేవకి ఇట్లనియె. “అనంత రూపుడు అఖిలవిశ్వస్వరూపుడునై, తనలో సర్వలోకములను దాల్చునట్టి దేవదేవుడు మాయచే ఇయ్యెడ బాలకమూర్తియై ఉన్న స్వామి ప్రసన్నుడగు గాక! ఓ సర్వాత్మకా! నాల్గు భుజములతో ఉన్న ఈ రూపమును మఱుగుపఱపుము. దైత్యుడై పుట్టిన ఈ కంసుడు నీవు అవతరించినావని ఎరుంగకుండుగాక!” అనవిని భగవంతుడు ఇట్లనియె. “పుత్రునికోరి మున్ను నీవు నన్ను స్తుతించితివి. అది ఇపుడు ఫలించినది. నీకడుపున నేను జన్మించితిని” అని భగవంతుడు ఊరకున్నంత వసుదేవుడా శిశువు నెత్తికొని వెలికింజనియె. కారాగార రక్షకులయ్యెడ యోగనిద్రచే మోహమునపడిరి. మధురానగర ద్వారపాలురు గూడ వసుదేవు డేగుచుండ మాయామోహవశులైరి. నడిరేయి మేఘములు పెనువాన కురియుచుండ, శేషుడు తన పడగలవిప్పి పైకప్పి వాసుదేవుని వెంట నడిచెను. మిగుల లోతై పెనుసుడుల నురుగులచే ఉరకలిడు యమునానది విష్ణువును ఎత్తికొని వసుదేవుడు తన్ను దాటుతఱి మోకాలిలోతై తోచెను. ఆ నదీతటమునందు కంసునికి పన్నులుగట్ట ఏతెంచి విడిదిచేసిన నందాది గోపవృద్ధులను వసుదేవుడు చూచెను. ఆ సమయమందు యశోద యోగనిద్రచే మైమరచి నిద్రపోవ అయ్యింట పరిజనమును, ఒడలెఱుంగకున్న వేళ ఆ కన్యకను గాంచెను. వసుదేవుడు బాలుని యశోద ప్రక్కన ఉంచి ఆమె శయ్యపైనుండి ఆబాలికను ఎత్తుకొని, తిరిగి వేగముగ వచ్చెను. యశోదమేల్కొని తనకు నీలోత్పలదళశ్యాముడు కొడుకు పుట్టెనని ఆశిశువునిచూచి మురిసిపోయెను. వసుదేవుడు ఆ పిల్లనుగొని తన ఇరవున కేతెంచి దేవకి ప్రక్కలో ఉంచి ముందటియట్ల ఉండెను.

అవ్వల కారాగార రక్షకులు పిల్లయేడుపువిని తొట్రువడిలేచి దేవకి ప్రసవించినదని కంసునికి నివేదించిరి. కంసుడు వెంటనే వచ్చి ఈ బాలికను పట్టుకొని చంపబోగా దేవకి “విడువు విడువు” మని నిరుద్ధకంఠయై నివారింపగా, అంతట ఒక రాతిపై విసరి కొట్టినంత, ఆ శిశువు మీదికెగిరి, ఆయుధములతో కూడిన ఎనిమిది భుజములతోడి రూపమునుగొని బిగ్గరగ నవ్వి కోపోగ్రయై కంసునితో “ఓరీ! కంసా! నన్ను విసరి వైచినంత ఏమయ్యె? నిన్ను వధింపగలవాడు దేవతల సర్వభాగ్యాధి దేవత అయిన అతడింతకు మున్ను పుట్టినాడు. ఈ అంశము బుద్ధిని ఇడుకొని నీకు హితమట్లు చేయుము అని పలికి దివ్యకుసుమ మాలాధారిణియగు అదేవి భోజరాజు కనుగొనుచుండగనే సిద్ధులు స్తుతించుచుండ, గగన మార్గమునచనెను.

కంస దురాలోచనము

శ్రీ పరాశరుడు ఇట్లు అనియె:

కంసుడవ్వల మనముద్వేగమందగా ప్రలంబకేశీ ప్రముఖులగు ఎల్ల మహాసురవరుల పిలిచి ఇట్లనియె. “ఓ ప్రలంబా! వీరాగ్రేసర! ఓ కేశి! ధేనుకా! పూతనా! అరిష్టాదులారా! మఱియుంగల మీరందఱు నా మాటలను ఆలింపుడు. దురాత్ములగు దేవతలు నన్ను చంపు యత్నములో ఉన్నారు గదా! నేను వీరుడను. నా వీర్యముచే అట్టుడికినట్లు ఉడికిన వీరులను నేను లెక్కచేయను. అల్పబలుడగు ఇంద్రునిచే ఒంటరిగ తిరుగు హరునిచే, దొంగదారులచే అసురులకు ఘాతసేయు హరిచే ఏమగును? దేవతల లెక్కేమి. వసువులు అల్పవీర్యలు అగ్నులు మఱియుంగల ఎల్ల అమరులు నాబాహుబలమున డీలువడిన వారిలెక్కేమి? అమరరాజు నాతో యుద్ధమునకు వచ్చి నేను విసరిన అమ్ములనెల్ల తొమ్మునం గాక పిఱిదం తలగి పారిపోయినాడు. మీరు చూడలేదా? నారాష్ట్రమున చినుకువడకుండ నయ్యింద్రుడాపిన తఱి నా బాణములచే విడివడి, మేఘములు కుంభవృష్టి కురియ లేదా? ఈ ఉర్వింగల ఉర్వీశ్వరులందరు నా బాహుబలమునకు పిరికిపందలై, నా గురువు (శ్వశురుడు) ఒక జరాసంధుడు తప్ప అందరు నాఅడుగులం తలలు వంచినారు. దేవత లందు నాకు తిరస్కార భావమగుచున్నది. వారందులకు పూనుకొనుట అన్న నాకు నవ్వు వచ్చుచున్నది. అయినను ఆ దుష్టులు దురాత్ములకు ఉపకారము చేసితీర వలసినదే. అవశ్యము పూనుకొనవలసినదే.

అందువలన ఎవ్వరు పుడమిపై పేరుమోసినవారు యజ్ఞములు చేసినవారుకలలో వారివారిని దేవతల కపకారము చేయుటకై వెదకి వెదకి సర్వవిధముల వధింపవలసినదే. లోగడ నాపాలిట మృత్యువైనవాడు ఇపుడు మరల పుట్టినాడని దేవకి గర్భమందు పుట్టిన పసిపిల్ల చెప్పినది. కావున ఎక్కడ బాలురందు బలోద్రేకము కానబడునో, వానినిబట్టి ఈ పుడమిపై మట్టుబెట్టుటకు గట్టియత్నము చేయవలసినదే, వానిని కడతేర్పవలసినదే.” అని ఇట్లు కంసుడు అసురులకు ఆనయిచ్చి గృహమ్ము సొచ్చి, దేవకీ వసుదేవులను కారా గారమునుండి విడిపించెను. అపుడు కంసుడు నేను మీ శిశువులను అకారణముగ చంపితిని. ఇపుడెవ్వడో యొక్కడు నా కొఱకు ఇక్కడ పుట్టి ఉన్నాడు. పరితాప పడకుడు! మీకు ముందేజన్మించిన పిల్లలు బ్రతుకవలసి ఉన్నను నిజముగా మీ దోషము (పాపము) చేత ఆయువు కోల్పోజేయబడినారు. ఇందు నా దోషమేమియు లేదు” అని ఇట్లు ఆశ్వాసించి అప్పటికిని మదిలో శంకవాయకయ, ఆ దంపతులను విడిచిపుచ్చి యాపై కంసుడు తన అంతర గృహము లోనికి జొచ్చెను.

కృష్ణుడు మధురా నగరము ఏగుట

వసుదేవుడు బంధముక్తుడై నందుని బండి దరికేగి నాకు పుత్రుడు కల్గినాడని మిగుల ఆనందించుచున్న నందుని చూచెను. మఱియు అతనింగని బాగు! బాగు! నీకు ముసలి తనమున తనయుడు కల్గినాడు నీభాగ్యమని సాదరముగ నందుని పలుకరించెను. జేనికి పన్ను కట్టినారుగదా మీరిటకు వచ్చినపనియైనది. ధనరాసులతో మీరిట క్షణ మాగవలదు. ఆగవలసిన పని మాత్రముఏమున్నది మీరు వ్రేపల్లెకు ఇప్పుడచనుండు. నాకును రోహిణికి పుట్టినకొడుకు అచ్చటఉన్నాడు. మీ బిడ్డనట్లు వానిని కాపాడుము అని పలుక నందాది గోపకులు పన్నులు చెల్లించి తమసామాగ్రి బండ్ల కెక్కించికొని అటనుండి తరలిరి.

గోకులమందు వారు సుఖమున్నతఱి బాలఘాతిని పూతన అటకేగి రాత్రి నిదురిం చుచున్న బాలకృష్ణుని ఎత్తికొని పాలిచ్చెను. అది ఎవ్వనికి చన్నుగుడుపునో వాని శరీరము క్షణములో పడిపోవుచుండును. కాని కృష్ణుడు మాత్రము దాని బొమ్మును ఇరుచేతులం గట్టిగబట్టి, కుడిచికొని కినుకగొని పాలతోబాటు దాని ప్రాణములను త్రావివైచెను. ఆ రక్కసి మిక్కిలిగ ఆర్చి, ప్రేవులుతెగి ప్రాణవాయువులు పోయి చట్టన నేలపై కూలెను. దాని అయఱపువిని జడుపుగొని, ప్రజవాసులు మెలకువగాని, ఆ పూతన ఒడిలోని కృష్ణుని, అచ్చట పడియున్న ఆ రాక్షసిని చూచిరి. యశోదయు కృష్ణునిగని ఎత్తికొని మిక్కిలి జడిసి, బిడ్డ జడుపుగొని వాడని అవుతోక తలచుట్టు త్రిప్పుట, దిగదుడుపు మొదలగునవి కావించి బాలదోషనివారణ మొనరించెను. నందగోపుడును ఆవుపేడ గొనివచ్చి కృష్ణుని నడినెత్తిపై మంత్రములు జపించుచు ఇట్లు రక్ష పెట్టెను.

నందుడు బాలకృష్ణుని కంగరక్ష వెట్టుట:

రక్షతుత్వామశేషాణాంభూతానాంప్రభవో హరిః

యస్యనాభిసముద్భూత పంకజాతభవం జగత్

యేనదంష్ట్రాగ్రవిధృతాధారయత్య వనిర్జగత్

వరాహరూపధృద్దేవస్సత్వాం రక్షతుకేశవః

నఖాంకురని నిర్భన్నవైరి వక్షలోవిభుః

నృసింహరూపీ సర్వత్ర రక్షతుత్వాం జనార్దనః

వామనోరక్షతు సదా భవన్తంయః క్షణాదభూత్

త్రివిక్రమః క్రమాక్రాన్త త్రైలోక్యః స్ఫురదాయుధః

శిరస్తేపాతు గోవిన్దః కణ్ఠంరక్షతు కేశవః

గుహ్యంసజఠరం విష్ణుర్జజ్ఞేపా దౌజనార్దనః

ముఖంబాహూ ప్రబాహూచమనస్సర్వే న్ద్రియాణిచ

రక్షత్వవ్యాహతైశ్వర్వ స్తవనారాయణో అవ్యయః

శార్ఙ్గ చక్రగదాపాణేశ్శంఖనాదహతాః క్షయమ్

గచ్ఛన్తు ప్రేతకూశ్మాణ్డ రాక్షసాయేతవాహితాః

త్వాంపాతుదిక్షువైకుణ్ఠో విదిక్షుమసూదనః

హృషీకేశోమ్బరేభూమౌరక్షతుత్వాంమహీధరః

ఏవంకృతస్వస్త్యయనో నద్దగోపేన బాలకః

శాయితశ్శకటస్యాధో బాలపర్యఙ్కికాతలే

తేచగోపామహద్దృష్ట్వా పూతనాయాః కళేబరమ్

మృతాయాః పరమంత్రాసం విస్మయంచ తదాయయుః

“అశేష భూతకారణుడు హరి నిన్ను రక్షించుగాక! ఎవని బొడ్డున పొడమిన తామర పూవున జగమెల్ల పొడమినదో; ఎవ్వని కోరచే ధరింపబడి ధరణి ఈ జగము ధరించు చున్నదో, అవ్వరాహమూర్తి ధరుడు, దేవుడు కేశవుడు నిన్ను రక్షించు గాక! గోటికొనలచే వైరుల వక్షములను చీల్చిన అమ్మేటి నృసింహమూర్తి జనార్దనుండెల్ల యెడల నిన్ను రక్షించు గాక! క్షణములో పొట్టివడుగురూపై బెడిదపు ఆడిదములంగొని ముల్లోకములను మూడు అడుగుల ఆ నాక్రమించిన ఆవామనుడు నిన్నీ వేళ రక్షించుగాక! గోవిందుడు నీ శిరస్సును కాపాడుగాక! కేశవుడు నీ కంఠమును రక్షించుత! కడుపుతోటి నీ గుహ్యమును విష్ణువు, జనార్దనుడు అడుగులను పిక్కలను బ్రోచుగాక! అవ్యాహతైశ్వర్యుడు అవ్యయుడుఅగు నారాయణుడు ముఖమును చేతులను మోచేతులను మనస్సును ఎల్ల ఇంద్రియములను కాపాడుగాక! శార్ఙ్గ చక్ర గదా పాణి యొక్క శంఖ భంభాంకారములచే ప్రేతకూశ్మాండాదులగు రాక్షసులు నీకు అహితులు నిహతులయి నశింతురు గాక! వైకుంఠుడు దికులందు మధుసూదనుడు విదిక్కులందు (మూలలందును). ఆకసమునందు, హృషీకేశుడు, భూమి యందు ధరణీధరుడు రక్షించుగాక” అని! ఈ విధముగ నందగోపుడు పిల్లవానికి శాంతి కర్మముచేసి బండి క్రింద చిన్నమంచము మీద పరుండబెట్టెను. గోపాలురందఱు చని పోయిన పూతన యొక్క పెద్దశరీరమును చూచి గొప్ప భయమును ఆశ్చర్యమును పొందిరి.

బలరామకృష్ణ లీలా విహారము

శ్రీ పరాశరుడు ఇట్లు అనియె:

ఒక తఱి మధువైరి బండి క్రింద పరుండి చిఱు పాదములు ఎత్తి, పాలకై ఏడ్పు పెట్టెను. ఆతని కాలితాపున ఆబండి తలక్రిందులుగా పడి దరినున్న పాలకడవలు కుండలు పగిలి ఒదిగిపడెను. అంతట గోపగోపీజనము హాహాకార మొనరించుచు వచ్చి వెల్లకిల పరున్న చిన్న కృష్ణుని చూచిరి. “గోపకులారా! ఎవనిచే ఈ బండి తలక్రిందు పడినది? అనుచురాగా, అటనున్న పిల్లలు ఈ పిల్లవానిచే ఇది పడగొట్ట బడిన దనిరి. ఏడ్చుచు వీడు కాలాడించిన అంతట ఇది చట్టనతి ఱుగాడువడి కూలి పడెను ఇంకొకని చేతగాదు అనిరి. అంతట గోపులత్యాశ్చర్య మతులు అయిరి. నందగోపుడును మిక్కిలి అక్కజమున ఆ చక్కని పాపడినిఎత్తికొనెను. యశోదమ్ము బండిపై ఎక్కించిన కుండలు ఓటువడి చెదరిపడిన పాలికలను, బండిని, పెరుగు, పూలు అక్షతలు మొదలగు వానిచే పూజచేసిరి.

వసుదేవు పనుపున జ్ఞాననిధి గర్గాచార్యుడు వ్రేపల్లెకు వచ్చి తన్ను తానుప్రకటించు కొనక ఆ బలరామ కృష్ణులకు నామకరణాది సంస్కారములను జరిపించెను. పెద్ద వానిని రాముడని, పిన్నవానిని కృష్ణుడనియు, పేర్కొనెను. అల్పకాలముననే వారిద్దరు ఆ పల్లెలో, మోకాళ్లు, చేతులు, అవనిపై తాకించుచు ప్రాకుచు, ఒడలికి గోమయభస్మము పూసికొనుచు నిట్టట్టు పరువులువారుచు ఉండ యశోద, రోహిణియును వారిం పట్టజాలరైరి. ఆవుల దొడ్డిలో ఆటలాడుచు, ఆడుచునే, అదూడలమందలోని కుఱికి వాని తోకల బట్టికొని దూకుచు, వినోదము గొల్పుచుండిరి. ఒక తఱి అన్నదమ్ములు ఒక్కటై ఒక్కచో ఆటలాడుచు గంతులు వేయుచుండు వారిని వారింప వశముగాక యశోద యొకతటి ఎట్లో పట్టుబడిన కృష్ణుని బొజ్జకుత్రాడుచుట్టి తోటికి కట్టివైచెను. కోపముతో అతనినిగూర్చి “ఓ అల్లరి పిల్లవాడ! ఏదీ! చేతనైన కదలి వెళ్లుమని” అనవెట్టి బెదరించి తన ఇంటి పనులను చూచుకొనుచుండెను. ఆ తొందరలో ఆమె ఉండుటగని ఆ పాపడు రెండుమద్దిచెట్ల నడుమ నుండి ఆ ఱోలీడ్చుకొనుచు పోయి ఆ ఇరుకు సందున అది అడ్డము తిఱుగ, అబాలుడులాగి నంత ఆమహావృక్షములు విఱిగిపడెను. అయ్యెడ ఆకటకటా శబ్దమాలించి, వ్రేపల్లె జనమే తెంచి ఆ పెనుమ్రాకులను తిలకించిరి. వచ్చియు రాని లేత పలువరుస తెలికాంతులు మిగుల అచ్చమయిన చిఱునవ్వులు కులుక ఆతరువులు రెండిటి నడుమ బొజ్జకు పెనుత్రాట గట్టిబడిన తోలితో ఉన్న బాలకృష్ణుని కాంచిరి. అమ్మ దామమున (త్రాటిచే) కడుపునకు తోలుగట్టుటచే అపాపడు దామోదరుడను పేరు పొందెను.

నందాది గోపవృద్ధులు ఆపల్లెలో కలుగుచున్న ఉత్పాతములకు భయపడి, ఇక్కడ మనము నివసింపరాదు. వనమునకుపోవుదము. గాలి లేకుండనే ఈ మహావృక్షములు కూలినవి. పూతనా వినాశము శకటము తెలుగుడుపడులు మొదలగు భయంకర సంఘట నములైనవి. వెంటనే మనమిటనుండి కదలి బృందావనమునకు పోదము. ఈ భౌమోత్పాద దోషము తొలగునందాక అచ్చట ఉందము అని నిశ్చయించి, ప్రజవాసు ఎల్లరు లెండు! లెండు! వెనువెంటనే పోవలయునని తమవారలకు హెచ్చరికలు చేసి ఆక్షణమే మందలతో ఆలకాపరులు ఒండొరులం బిలిచికొని అక్కడ పోయిరి. క్షణములో బండ్లపై సామగ్రితో ఎక్కి గోధనములతో తరలినంత ఆ వ్రేపల్లె శూన్యమై, కాకులకు గ్రద్దలకు నిలయమై శోభకోల్పోయెను.

శ్రీ బలరామకృష్ణుల బృందావన విహారము

శ్రీకృష్ణ భగవానుడు గోవుల పెంపుగోరు శుభ సంకల్పముతో బృందావనమును తలచుకొనెను. అందుచే ఆ ప్రాంతము అంతయు మిక్కిలి తీవ్రమైన గ్రీష్మ కాలమందును వర్షర్తువు నందువలె పచ్చని లేపచ్చిక మొలచెను. సర్వగోకులము ఆపైన ఆదొడ్డిలో బండ్లను విప్పి అర్ధచంద్రాకారముగ ఏర్పఱచుకొన్న హద్దునందు విడిదిసేసిరి. అయ్యెడ బలరామ కృష్ణులు అకాపరులైరి. ఇద్దరు కూడి ఆఆవులమందలో బాలలీలలను నిర్వహింపజొచ్చిరి. నెమలిపింఛములం శిరములం జెరవికొని, వన్యములగు పువ్వులను జట్టులం తురుము కొని తోడిగోపాలురు లేగలను కాయుటకు చేకొన్న వేణు ఖండమ్ములచేతను పత్రవాద్యముల చేతను (కొబ్బరిఆకులు మొదలయిన వానిచే చేసి బూరాల చేతను) తాళ లయానుగుణ మేళనంబు గావింపకాక, పక్షధరులై (తలను ఇరువైపుల వ్రేలాడు వానిచే అయిన బూరాల చేతను) తాళలయాను గుణ మేళనంబు గావింపకాక, పక్షధరులై (జులపాలతో ముచ్చట గొలుపుచు) అగ్నికి ఉదయించిన కుమారులట్లు అగ్నియందు నిక్షిప్తమైన శివవీర్యమున ఉదయించిన స్కందస్వామి అంశావతార మూర్తులైన శాఖ విశాఖులను కుమారులట్ల, ఆ బలరామ కృష్ణులు ఆబృందావన మందు అల్లన నవ్వుచు కేరింతలు కొట్టుచు, అవనమందు ఆటలు మఱిగి తిరుగాడం జొచ్చిరి. ఏడేండ్ల ఈడువారై అమ్మహా వ్రజమందు సర్వ జగత్పరిపాలకులు గోవత్స పరిపాలకులైరి.

బృందావనమందు వర్షఋతు శోభ:

ఆకసమున అలముకొన్న మబ్బులతో మిన్నుమన్నేకము గావించు వర్షధారలతో వర్షర్తువు వచ్చెను. పచ్చని లేబచ్చికలతో ఇంద్రగోపములతో (అర్ద్రపురుగులతో) వసుమతి (భూమి) నడునడుమ పద్మరాగమణులుతాపిన మరకత మాణిక్యమయమై (పచ్చలతో నిండినదై) అచ్చట ముచ్చట గొల్పుచుండెను. నదులు వఱదలంగొని, కట్టలు తెంచుకొని పరవళ్ళు త్రొక్కుచు నడమంత్రపుసిరులచే మిడిసిపడు అవినయశీలుర మనస్సులట్లు దుందుడుకుంగొని పాఱజొచ్చెను. అచ్చపు తెల్లని చందమామ, నల్లని మబ్బుల చాటునబడి, మూర్ఖుల ప్రగల్భోక్తులచేత సద్వాదుల వాదమట్లు వెలవెల పోయెను. వివేకము లేని రాజుచేతిలోని విల్లటుల గుణహీనమై పనికిమాలినదై (శ్లేష) (గుణము = నారి ఎక్కిడినది గాని) ఇంధ్ర ధనుస్సు నింగిలో తిరవొందెను. నల్లని మబ్బుల వెనుక తెల్లని బెగ్గురుపక్షుల వరుస కులభ్రష్టునియెడ శిష్టాచారవంశుడు చేసిన శోభనచర్యవలె (ప్రాయశ్చిత్త క్రియవలె) విరాజిల్లెను. మెఱుపు మిక్కిలి చపలమై, ఉత్తమ పురుషునియెడ అపాత్రుడు చూపిన మైత్రివలె ఆకసమందు నిలుకడ కొనజాలదయ్యెను. గడ్డి గాదముల గ్రమ్ముకొని బాటలు పెడ అర్థములనిచ్చు మూర్ఖుల మాటలట్లు తెలియరావయ్యెను. నెమళ్ళు సారంగ ములు (బెగ్గురుపక్షులు) మిక్కిలి ముదమును, ముదముగొను అవానకారున అబృందావనమున బలరామకృష్ణులు ఆనందభరితులై గోపాలురతో సంచరించిరి. ఒక్కతఱి గోవులతోపాటు రమ్యముగ శ్రుతిగలుపుచు, మఱియొక తఱి, చల్లని చెట్టునీడకు ఆశ్రయించియు సంచ రించుచుండిరి. ఒకతఱి కడిమిపూలమాలలు వింతగులుకుచు నొకప్పుడు నెమలిపించెముల సొంపుగా మఱియొకవేళ, గైరికాధిధాతువును అంగరాగములుగ పూసికొనియు, అకుల సెజ్జలందొకవేళ నిద్రపోవుచు ఒక్కయెడ మేఘములు బిరుసుగ హాహాకారము లోనరించునట్లు ఇటునటు పరువులిడు తోడి గోపకులు పాటలు పాడుచుండ బాగు బాగని అభినందనములు చేయుచు, నెమళుల కేకారవములను అనుసరించుచు పిల్లనగ్రోవు లూదుచు, నిటులపలుపోకల బాలచేష్టల ఆనందవివశులై మనసులెంతేని తుష్టినంద ఆసుందర బృందావనమునందు ఆగోప సుందరులు అన్నాదమ్ములింపు కుల్కుచు క్రీడించిరి. ఇట్లు విహరించి సంజవేళ గోవులతో గోప బృందములతో మహాబలులు రామకృష్ణులు పల్లియకుచనుదెంచి ఈడుజోడైన గోపకులతో ఆటలాడుచు దేవకుమారులు అద్భుత ప్రభతో ఆ ప్రజవాటమునందు వసించిరి.

కాళీయమర్దనము

ఒకతఱి బలరాముడు తోడలేకుండ, కృష్ణుడు బృందావనమునకుపోయెను. అడవి పూలమాలలు చక్కగ గైసేసి అక్కడ గోపకులతో విహరించెను. కెరటములువ్వెత్తుగలేవ ఒడ్డులను అంటిన పెనునురుగులచే అల్లన నవ్వుచున్నదా అన్నట్లున్న కాళిందినది వద్దకుపోయెను. అందున మిగుల వెఱపుగొల్పు విషాగ్నులచే అలముకొన్న నీటితో కాళీయుడుఅను నాగుడున్న మహా భయంకరమైన మడుగును చూచెను. అతి రౌద్రమును చూపుచు మృత్యుదేవత నోరట్లు ఉన్న ఆ మడగును చూచి భగవంతుడు మధుసూదనుడు ఎదలో ఇట్లనుకొనెను. “దీనియందు మహాదుష్టుడు విషాయుధుడు కాలియుడు ఉన్నాడు. నాచే నోటువడి యీడుష్టుడు ఈమడుగు విడిచి సముద్రమున కేగవలయును. సాగరమండు సంగమించు యమునవానిచే దోష గ్రస్తమైనది. దప్పికగొని, ఆలమందలు, మానవులు దీనిని అనుభవింపలేకున్నారు. అందువలన నేనీ పాపనిని అదుపున పెట్టవలయును. ప్రజవాసులు జడుపువిడిచి ఈ మడుగునందు స్వేచ్ఛగా సంచరింప వలయును. ఇందులకే ఈ లోకమునందు నేను అవతార మెత్తితిని. మిడిసిపడు చెడుగఱులను అవశ్యము అదుపులో పెట్టి తీరవలయును కావున అనల్లదె ఈ దరినున్న కదంబతఱువెక్కి ఈ గాలిమేపరి మడుపులో దూకెదగాక!” అని ఇట్లు తలచి గట్టిగ తనవస్త్రము బిగించి కట్టుకొని శ్రీహరి చట్టన అమ్మడుగులో దుమికెను. పైబడిన ఆబాలునిచే నాపెనుమడువు మిగులకల గుండు వడి, మిక్కిలి దూర మందున్న తరువులంగూడ ముంచెత్తెను. అవి ఆ దుష్ట సర్పవిషజ్వాలలం వ్రాగిన నీటి గాలియందుడిని, దరినున్న చెట్లు నలుదెసలకుంమంటలుగ్రమ్మి మండి పోయినవి. అప్పుడు కృష్ణుడానాగుని మడువునం జబ్బలు చరచెను. దానివలన అయిన చప్పుడును విని, యా సర్పరాజు మీదికి వచ్చెను. అంతట నెఱుపాఱిన గ్రుడ్లు విషజ్వాలా కులమైన ముఖములతో మహావిషసర్పములు, మణి పరివారముతో వానిని చుట్టెను. వందలకొలది ఆ నాగుని భార్యలు మనోహర హారములతో, మేనులు వణక చెదరిన కుంతలముల కాంతులు అదర ఆ నాగుని వెంటవచ్చిరి. అవ్వల కృష్ణుడు పాముల ఫణా బంధనముల చుట్టబడి ఉండెను. అవియు ఆతని విషజ్వాలా కులములైన ముఖములను గఱచెను. పాము పడగల ఇఱుకునబడిన యాతనింగని శోకవివశులై గోపకులు ఘోషము నకు వచ్చిఇట్లు ఉద్ఘోషించిరి.

ఇదిగో కృష్ణుడు కాళియుని మడుగున మూర్ఛిల్లినాడు. నాగరాజు వీనిని భక్షించును. రెండురెండు చూడుడు. అనవినిగోపకులు పిడుగుపడినట్లు ఆమాటలనువిని గోపికలును తొందరపడి యశోద మొదలుగ అందఱు అమ్మడువునకేగిరి. అయ్యో! అయ్యో! ఎక్కడకృష్ణుడు ఏడి! అని మిక్కిలి విహ్వలించి, యశోదతో ఆగోపికజనము సంభ్రమించి వేవేగ అడుగులు తడబడవచ్చి అచట క్రమ్ముకొనెను. నందాదులును బలరాముడును కృష్ణునిచూచుటకు యమునకు ఏతెంచి సర్పరాజు వశంబున పాముపడగలచే చుట్టబడి ఏ యత్నము చేయ కున్న ఆతనిని చూచిరి. యశోదయు, నందుడు నిశ్చేష్టులై బిడ్డని వంక బిక్కచూపులతో చూచుచుండిరి. గోపికలు శోకించుచు దిగులుగుడిచి భయముచే గద్గద భాషణములతో ఇట్లు పలవింప జొచ్చిరి.

యశోదతోగూడ అందఱము ఈ కాళీయుని మడుపులో దిగెదము. మేమిక వ్రేపల్లెకు చనుట సరిగాదు. సూర్యుడు లేని పగలు చంద్రుడు లేని రాత్రి వృషభరాజు లేని ఆవులు కృష్ణుడులేని వ్రేపల్లెయు ఏమందము కలది అగును? ఈ కృష్ణుడులేని గోకులము అంతే తీర్చరాని నీరులేని మడుగు వంటిది. నల్లకలువ రేకులటుల నిగనిగలాడు శ్యామలమూర్తి, హరిలేని ఆ తల్లి యశోదగృహమున ఆనందముకల్గుట వింతైన విషయము. వికసించిన తామర పూరేకువలె విశదమగు కాంతులుకులుకు కన్నులుగల హరిని చూడక దీనలై ఆ గోష్ఠమునందు ఎటులు ఉండగలము? మిగుల తియ్యని పలుకులచే మా మనోరథమెల్ల దొంగిలిన పుండరీకలోచనుడు లేని నందగోకులమునకు పోనేపోము. పాము పడగల చుట్టుకొనియును మనలంగని చిఱునవ్వులొలుకు మన కృష్ణుని మోము ఓ గోపికలార తిలకింపుడు. అని ఇట్లు పలవించు వల్లవాంగన పలుకులు విని మహాబలుడు, బలరాముడు జడియుచు, తన వంక చూపులు నిలిపి చూచు గోపకులను మిక్కిలి దిగులుగొని బిడ్డని మోమున చూపువెట్టిఉన్న నందుని, మూర్ఛాకులయైన యశోదను చూచి కృష్ణుని మహిమ యొక్క గుర్తునుబట్టి; దేవదేవ! ప్రభూ! ఈ మానుష వర్తనమేల ఇంతగ నటింతువేల? నీవు నిన్ను అనంతునిగ ఎఱుగవా? నీదే ఈ జగచ్ఛక్రమున ఆకులకువలె నడిమి ఆధారమైన నాభివి, (కేంద్రమయిన బండి కుంచము) కర్తవు, హర్తవు, భర్తవును అగు వేదత్రయ మూర్తివి నీవు. నీ ఇంద్రాది దేవతలకు సర్వ యోగులకును భావింపవలను కాని అచింత్య స్వరూపుడవు. జగతి కొఱకు (భూదేవి ప్రార్ధనమన్నించి) జగన్నాథా! ఆమె బరువు దింప నెంచి మర్త్యలోకమునకు నీవు దిగివచ్చితివి. నీ అంశమున నీ కన్నను నేను, ఓ భగవంతుడ! మనుష్యలీలల నటించు నీతో ఎల్ల దేవతలు నీ లీలలను అనుకరించుచు నీతోకూడ ఉన్నారు. శాశ్వతుడవగు నీవు మునుముందు అమరసుందరుల గోకులమందు అవతరింపచేసి ఆపైన వారితో నీ క్రీడావినోదమునకు నీవు అవతరించితివి. కృష్ణా! ఇట అవతరించిన మన ఇద్దరకు చుట్టాలు గోపకులు గోపికలు గదా! వారు బాధపడకుండ నీ బంధువులంగని ఉపేక్షింతు వెందులకు? మాయామానుషభావము చూపితివి. బాల చాపల్యమును చూపబడినది. చాలునిక ఈ దుష్టాత్ముని, దశనాయుధుని (దంతములే ఆయుధముగా గలవానిని) నాగుని దమింపుము.

అని ఇట్లు జ్ఞప్తి సేయబడి కృష్ణుడు చిఱునవ్వునం పెదవులు విప్పార, బాహువులు చాచి చాచి తన శరీరమును నాగబంధమునుండి విడివడ చేసెను. రెండు చేతులను పాముయొక్క నడిమితలను వంచి, వంగిన తలపై కెక్కి అమితవిక్రమమున నర్తనము చేయనారంభించెను. కృష్ణుని పాదముల తాకిడిచే ఆనాగుని తోకనున్న ప్రాణములు తలకు వచ్చినవి. దానిచే ఆ కాళీయుడు, తల ఎత్తినట్లైత్తి అప్పుడే తలలువాంచెను. ఆపడగలపై కృష్ణుడు పరిభ్రమించిన కొలది బుస్సలు కొట్టుచు మూర్ఛ పడిపోయెను. పెనుబడితెల అడచినట్లు అడగిపడి మిగుల రక్తము గ్రక్కెను. తలయు మెడయు చితికిపోయి భుగ్నమై మొగముల రక్తము దొఱగ, తమదొరనుకని వాని భార్యలు కరుణామూర్తిని, మధుసూదను, శరణంది ఇట్లనిరి.

నాగపత్నులు కృష్ణుని వేడుకొనుట:

జ్ఞాతో అసిదేవదేవేశ సర్వజ్ఞ స్త్వమనుత్తమః

పరంజ్యోతిరచిన్త్యంయ త్తదంశః పరమేశ్వరః

న సమథా అస్సురాస్త్సోతుంయ మనన్య భవం విభుమ్

స్వరూపవర్ణానంతస్య కథం యోషిత్కరిష్యతి

యస్యాఖిలమహీవ్యోమ జలాగ్ని పవనాత్మకమ్

బ్రహ్మాణ్డమల్ప కాల్పాంశస్త్సోష్యామస్తంకథం వయమ్

యమతోనవిదుర్నిత్యంయత్స్వరూపంహియోగినః

పరమార్ధ మణోరల్పంస్థూలాత్సూలంనతాః స్మతమ్

నయస్యజన్మ నేధాతాయస్యచాన్తాయనాన్తకః

స్థితికర్తానచాన్యో స్తియస్యతస్మై నమస్సదా

కోపస్స్వల్పో అపితేనా స్తిస్థితిపాలన మేవతే

కారణం కాళియస్యాస్య దమనేశ్రూయతాం వచః

స్త్రీయో అనుకమ్ప్యాస్సాధూనాం మూఢాదీనాశ్చజన్తవః

యతత్తతో అస్య దీనస్య క్షమ్యతాం క్షమతాంవరః

సమస్త జగదాధారోభవానల్ప బలః ఫణీ

త్వత్పాదపీడితో జహ్యాన్ముహూర్తార్ధేన జీవితమ్

క్వపన్నగో అల్ప వీర్యో అయంక్వభర్వాబువనాశ్రయః

ప్రీతిద్వేషౌ సమోత్కృష్ట గోచరౌ భవతో అవ్యయ!

తతః కురుజగత్స్వార్మి ప్రసాదమవసీదతః

ప్రాణాం స్త్యజతినా గోయం భర్తృభిక్షా ప్రదీయతామ్

భువనేశ జగన్నాథ మహాపురుష పూర్వజ

ప్రాణాంస్త్యజతినా గోయం భర్తృభిక్షా ప్రదీయతామ్

వేదాన్తవేద్య దేవేశ దుష్టదైత్య నిబర్హణ

ప్రాణాంస్త్యజతినాగోయం భర్తృభిక్షా ప్రదీయతామ్

శ్రీ పరాశర ఉవాచ:

ఇత్యుక్తేతాభిరశ్యస్య క్లాన్తదేహో అపి పన్నగః

ప్రసీదదేవ దేవేతి ప్రాహవాక్యం శనైశ్శనైః

దేవ! దేవేశుడవు, సర్వజ్ఞుడవు, పురుషోత్తముడవు, అచింత్యమగు పరంజ్యోతి అంశ స్వరూపుడవు పరమేశ్వరుడవు అని మాకు నీ వెఱుగబడినావు. అనన్య భవుడగు ప్రభువు అగు, నిన్ను వేల్పులును స్తుతింపజాలరు. అట్టి నీ స్వరూపమును ఆడుది ఎట్లు స్తుతి చేయగలదు? ఏమని అఖిలపృథివ్యాప్తేజో వాయురాకాశములు అనంతకోటి బ్రహ్మాండములు అల్పాంశ ములో, అట్టి వానిని మేమెట్లు స్తుతింప గలము! యోగులెవ్వని కలరూపు నిచ్చలు. తెలియ లేరు అట్టి అల్పముకంటే అల్పము, స్థూలముకంటే స్థూలమైన ఆవస్తువునకు వినతుల మయ్యెదము. ఎవ్వని పుట్టువునకు ధాత, అంతమునకుఅంతకుడు, స్థితికి స్థితికర్తయు వేఱకడు లేడోఅట్టి వానికిదే నిత్యనమస్కారము. నీకించుకోని కినుకలేదు. ఈ కాళీయుని దమనమునకు కారణము ధర్మపాలనమే. కావున దయసేసి మావిన్నపము అలింపుము. సాధువులు అబలలను కనికరింతురు. జంతువులు మూఢములు, దీనములునుం కావున ఈ దీనుని క్షమించువారికి అధినేతవు కావున స్వామి! క్షమింపుము. నీవు సమస్త జగదాధారుడవు ఈపామో అల్పబలుడు. నీ అడుగుల నలుగుడువడి ఇదె ఈ క్షణము జీవితము వాయును. అల్ప వీర్యముగల ఈనాగ మెక్కడ? అఖిలభువన శరణ్యుడవు నీవు ఎక్కడ. ఓ అవ్యయ! నీకు ప్రీతి ద్వేషమును సమస్థాయిలో గోచరించునని, అందుచే ఓ జగత్ప్రభూ! చావనున్న వీనిపై దయచూపుము. ఈ నాగన్న ప్రాణములు విడుచుచున్నాడు. భర్తృ భిక్ష పెట్టుము. భువనేశ్వర! జగన్నాథ! మహాపురుషుల కెల్ల ముందటివాడవు! ప్రాణములు కోల్పోవుచున్నాడు. మాకు భర్తృ భిక్ష పెట్టుము. వేదాంత వేద్య! దేవప్రభూ! దుష్ట దైత్యదమన! ప్రాణముల బాయుచున్నాడు. భర్తృ భిక్ష పెట్టుము అని నాగపత్నులు పలవించుచు పలుక, ఒడలు బడలువడి పన్నగము దేవదేవ! ప్రసన్నుడవే అగుమని మెలమెల్లన పలికెను.

కాళియ ఉవాచ:

తవాష్టగుణమైశ్వర్యం నాథస్వాభావికం పరమ్

నిరస్తాతిశయం యస్య తస్యస్తోష్యామికిన్న్వహమ్

త్వంపరస్త్వం పరస్యాద్యః పరంత్వత్తః పరమాత్మక

పరస్మాత్పరమోయస్త్వం తస్యస్తోష్యామికిన్న్వహమ్

యస్మాద్బ్రహ్మాచరుద్రశ్చ చన్ద్రేన్ద్రమరుదశ్వినః

పసవశ్చసహాదిత్యై స్తస్యస్తోష్యామికిన్న్వహమ్

ఏకావయవసూక్ష్మాంశోయస్యైతదఖిలం జగత్

కల్పనావయవస్యాంశ స్తస్యస్తోష్యామికిన్న్వహమ్

సదసద్రూపిణోయస్య బ్రహ్మాద్యాస్త్రి దళేశ్వరాః

పరమార్థం సజానన్తి తస్యస్తోష్యామికిన్న్వహమ్

బ్రహ్మాద్యైరర్చ్యతేయస్తుగన్ధ పుష్పానులేపనైః

నన్దనాదిసమూద్భూతై స్సో అర్చ్యతేవాక ధంమయా

యస్యావతారరూపాణిదేవరాజస్సదార్చతి

నవేత్తిపరమం రూపంసోర్చ్యతేవా కథం మయా

విషయేభ్యస్సమావృత్య సర్వాక్షాణిచయోగినః

యమర్చయన్తిధ్యానేన సో అర్చ్యతేవాకథం మయా

హృదిసంకల్ప్యయద్రూపం ధ్యానేనార్చన్తి యోగినః

భావపుష్పాదినానాథసో అర్చ్యతే వాకథం మయా

సోహం తేదేవదేవేశనార్చనాదౌన్తు తౌనచ

సామర్థ్యర్వాకృపామాత్రమనోవృత్తిః ప్రసీదమే

సర్పజాతిరియం క్రూ రాయస్యాంజాతో అస్మికేశవ

తత్స్వభావో అయమత్రా స్తినాపరాథోమమాచ్యుత

సృజ్యతేభవతారస్వరం తథాసంహ్రియతే జగత్

జాతిరూపస్వభావాశ్చ సృజ్యన్తే సృజతాత్వయా

యథాహంభవతాసృష్టోజాత్యా రూపేణచేశ్వర

స్వభావేనచసాధుత్వం తథేదం చేష్టిశం మయా

యద్యన్యథాప్రవర్తేయం దేవదేవతతోమయి

న్యాయ్యోదణ్డ నిపాతో వైతవై వవచనం యథా

తథా అప్యజ్ఞేజగత్స్వాన్మిదణ్డం పాతితవాన్మయి

సశ్లాఘ్యో అయం వరోదణ్డ స్త్వత్తోమేనాన్యతోవరః

హతవీర్యో హతవిషోదమితో అహం త్వయాచ్యుత

జీవితం దీయతామేక మాజ్ఞాపయకరోమికిమ్

నీ ఐశ్వర్యము అష్టవిధము. అష్టైశ్వర్య సంపన్నుడవు. అది నీకు స్వాభావికము, సర్వాతిశాయి వైభవము. అట్టి వాని నేనేమి స్తుతించెదను? నీవు పరుడవు. పరమమునకు మొదలు, నీ వలననే అది పరము. పరమమున కంటె పరముడవు. నిన్ను నే నేమి పొగడెదను. ఈ ఎల్లజగము ఎవ్వని యొక్క భాగములో భాగమో, ఆఅవయవముకూడ నిరవయవునికి కల్పనా మాత్రమో, అట్టి నిన్నునేనేమి స్తుతింపగలను? సత్తు, అసత్తును, తానయైఉన్న ఎవ్వని కలరూపు బ్రహ్మాదులెఱుంగరు అట్టి నిన్నునేనేమి కొనియాడుదును? బ్రహ్మాదులెవ్వని నందనవనమునందలి గంధ పుష్పాదులచే అర్చింతురు అట్టి స్వామిని నేనేమి అర్చింతును! ఎవ్వని అవతారమూర్తులను దేవేంద్రుడు నిచ్చలు అర్చించునో ఎవ్వడు ఎవ్వని పరమ రూప మెఱుగడో అట్టివాడు నాచే ఎట్లర్చింపనగును? యోగులు సర్వేంద్రియులను విషయముల నుండి మరలించి ధ్యానముచే ఎవ్వని అర్చింతురు అతడు నాచే అర్చితుడగుట ఎట్లు? యోగుల్పువ్వని రూపమును ధ్యానముచే కల్పించుకొని భావమయమయిన (అహింసా ప్రథమ పుష్పం) పుష్పములతో పూజింతురో వానిని నేను ఎట్లు పూజింతును! అట్టి నేను దేవదేవా! ప్రభూ! అర్చనాదులందుగాని స్తుతియందుగాని సామర్థ్యములేనివాడను కావున కృపామాత్రమైన మనోవృత్తిగలవాడవై నన్ను అనుగ్రహింపుము. ఈ పాపజాతి పరమ క్రూర జాతి. ఇందు పుట్టినవాడను. కేశవా! ఇక్కడ అస్వభావము (నైజము) ఉన్నది. నాచేసిన తప్పిదములేదు. జగత్తు నీచే సృజింపబడుచున్నది. ఉపసంహరింపబడుచున్నది. సృష్టించు నీచేత, జాతులు జాతులకు అనుసారములైన రూపములు స్వభావములు సృష్టింప బడును. నీచే నేనే జాతి స్వభావ రూపములచే సృష్టింప బడితినో, అదే స్వభావముచే నీ సాధుత్వమున ఆదేశాను గుణచేష్ట చేష్టింపబడినది. మరొక తీరున నేను ప్రవర్తింతునేని అప్పుడు నాపై దండపాతము నీవచనానుసారము న్యాయము గదా! అయినను బాలుడ (అజ్ఞానిని) నా యెడ దండమువైచితి. విధి ఇతరులచేత నైనదికాదు నీ వలన అయినది కావున నిది మెచ్చదగినది. (ఇది నా అదృష్టము) వీర్యము హతమయ్యె, విషము హతమయ్యె, నన్ను అణగ ద్రొక్కితివి. ఒక్క ప్రాణము దయచేయుము. నేనేమి చేయవలెనో నన్ను ఆనవెట్టుము.

అని ఇట్లు వినతుడై వినుతించి కాళియుడు విన్నవింప శ్రీకృష్ణభగవానుడు “ఓ సర్పమా! నీవిక్కడ నీ యమునా జలమున ఎన్నడు ఉండ గూడదు. సపుత్ర కళత్రముగా సముద్రపు నీటికి పొమ్ము. నీ తలపై నా పాదములను చూచి ఆ సాగరమందు సర్వవిరోధి గరుడుడు నీపయిదెబ్బతీయడు” అనిపలికి ఆసర్పరాజమును భగవానుడు హరి వదలి పెట్టెను. అతడును కృష్ణునికి ప్రణామములుచేసి, తన మడువు విడచి, సర్వ భూతములు చూచుచుండ సపత్నీ పుత్రబంధుభృత్య పరివారముగ సముద్రమునకు చనెను. సర్పము అట్లేగగా గోపకులు మృతుడు బ్రతికి వచ్చినట్లుగా, కృష్ణునికని కౌగిలించికొని శిరమ్ము మూర్కొని హృదయపూర్వకముగ ఆదరించి ఆనంద బాష్పములచే స్వామిని అభిషేకించిరి. మఱియు ఎల్లరూ డెందముల అచ్చెరువంది పరమ మంగళ ఉదకములచెలంగు యమునా నదిని చూచి ఉప్పొంగి, స్వామిని నుతించిరి. గోపికలు గోపకులను కలస్వనంబుల సంగీ తమ్ముల స్వామి లీలలు కథలు చెయములు గానములు చేయ వారితో కృష్ణస్వామి వ్రేపల్లెకు విచ్చేసెను. (7)

ధేనుకాసుర వధ

ఆపై శ్రీపరాశరుడు ఇట్లు చెప్పెను. బలకేశవులు గోపాలనము చేయుచు తిఱుగుచు ఆ బృందావనమునందు అందమైన తాళవనమున కేగిరి. ధేనుకుడను రాక్షసుడు గార్దభ రూపముతో మృగమాంసములను తినుచు ఆవనమందు వసించెను. ఆవనము పండిన తాడిపండ్లతో సమృద్ధమగుట చూచి గోపాలురు ఆ పండ్లపై కోరిక గల్గి రామకృష్ణులతో ఇట్లనిరి. “ఓరామా! కృష్ణా! ధేనుకుని రక్షణలో ఉన్నందున నీ ప్రదేశమందు పండిన ఈ తాడిపండ్లు సమృద్ధిగా ఉన్నవి. ఈ పండ్లును చూడుము తమ సువాసనలచే దిక్కులను పరిమళింప చేయుచున్నవి. మేము వీనిని తినకోరుదుము. నీ కిష్టమేని వీనిని రాల్తము” అని గోపకుమారులు అనగా విని సంకర్షణుడు(బలరాముడు) ఈపని చేయవలసినదని ఆ పండ్లను రాల్చెను. కృష్ణుడును రాల్చెను. పండ్లు పడుచున్నసడివిని, దుష్టుడు దరియరాని క్రూరుడు, గర్దభాకారుడు, ధేనుకుడు కోపముతో వెనుకకాళ్ళను నేలను తాటించుచు వచ్చి ఆ రామకృష్ణుల బొమ్మునంగొట్టి వారికీపట్టువడెను. కృష్ణుడు వానిని చేతనెత్తి ఆకాశము నందిట్టట్టు త్రిప్పినంత వాడసువులు బాసెను. వానిని అటనున్న పచ్చికబయల పై పడునట్లు విసరివైచెను. వాడు తాలవృక్షాగ్రమునుండి కూలుచు మహావాయువు మేఘము లనుచిందరవందరచేసినట్లు తాటిపండ్లను చెట్లనుండి జలజలరాల్చెను. వాని పరివారము మఱికొన్ని గాడిదలు తనమీదికి రాగా కృష్ణుడు బలభద్రుడును వాటినిపట్టి అవలీలగ విసరి వైచిరి. క్షణములో ఆ ప్రదేశము తాడిపండ్లతో ఖరరాక్షసదేహములతో మిక్కిలి శోభించెను. అవ్వల గోవులు నిరాబాధములై అతాళవనమందు మున్నెన్నడు రుచిచూడని లేత గడ్డిని మేసినవి. (V-8)

ప్రలంబాసుర వధ

శ్రీ పరాశరుడు ఇట్లు పల్కెను:

రాసభాసురుడు పరివారముతో కూలిన తరువాత, ఆతాళ వనము గోపీ, గోపాలురకు ప్రశాంత రమణీయము అయ్యెను. వసుదేవసుతులట్లు ధేనుకుని కూల్చి ఆనందముతో భాండీరవటమునకు వచ్చిరి. పాటలుపాడుచు చెట్లలో ఒకరికొకరు వెదకికొనుచు, అల్లంత దూరముచని కదుపులం కాయుచు, వానిని పేరు పేరున పిలుచుచు, వనమాలా భూషితులై ఆ మహానుభావులు దూడపలుపులను మూపున వేసికొని చిఱు కొమ్మల కులుకు గిత్తలట్లు శోభించిరి. బంగరుజరీ కాటుకపొడి చిందిన వలువలందాల్చి ఇంద్రధనుస్సుతోడ దీపించు తెల్లని నల్లని మేఘములవలె భాసించిరి. అఖిల లోకనాథులకు నాథులైన మహానుభావులు అవనిని అవతరించి, లోకప్రసిద్ధములైన చెడుగుడి మొదలయిన పెక్కు బాలక్రీడల వినోదిం చుచుండిరి. మఱియు కుస్తీలు, సాముగరిడీలు, ఉండేలు బ్రద్దలు గోటీబిళ్ళలు, వడిసెలతో రాళ్ళు, విసరుట మొదలగు బాలక్రీడలచేత అమ్మహాబలశాలురు తోడి బాలురతో క్రీడింప జొచ్చిరి.

వారిని పట్టుకొన నెంచి, అయ్యిద్దరు ఆడుకొనుచున్న తఱి, ప్రలంబాసురుడు అను అసరుడు గోపవేషమువేసికొని, గోపాలురు నడుమ నిశ్శంకముగా వచ్చి చేరెను. ఆ ఇద్దరు అన్నదమ్ములను ఏమరియుండు సమయము కనిపెట్టుచు కృష్ణుని, బలరాముని సహింపరాని వారని గ్రహించి తుదకు తుదముట్టింప ఉబలాటపడెను. “హరిణా క్రీడనము” (లేళ్ళవలె గంతులు వేయుచు వెళ్ళుచున్న ఇద్దరిలో ముందు వెళ్ళినవాడు గెల్చినవాడు) అను పేరి ఒకానొక బాలక్రీడకు చొచ్చి గోపాలురెల్లరు ఇద్దరిద్దరు జంటలుగా ఆ ఆటలలో తలపడిరి. శ్రీదామునితో గోవిందుడు ప్రలంబునితో బలరాముడు మఱియుగల గోపాలురతో గోపా లురు ఎగురుటకు అరంభించిరి. కృష్ణుడు శ్రీదాముని హలిప్రలంబుని ఓడించిరి. కృష్ణపక్షి యులగు గోపకులు అన్యులను గోపాలురను ఓడించిరి. ఒకరినొకరు మోసికొని భాండీర వటమునకేగి తిరిగి అచ్చట నుండి ఇచ్చటకు ఓడిన వారు ఓడని వారిని మోచికొని రావల యునని పందెము పెట్టుకొనిరి. ప్రలంబాసురుడు సంకర్షణుని మూపుపై ఎక్కించుకొని తటాలున ఎగిరి ఆ క్షణమే చంద్రునితోడి మబ్బులవలె అకసమునకు పోయెను. ఆ దానవుడు బలరామునిబరువు మోయలేక ఒడలు పెంచనారంభించి, వర్షాకాలమున మేఘమట్లు విజృంభించెను. హలి వానిని దావాగ్నికి ఎఱయైన పర్వతమువలె ఉన్న వానిని పూలమాలలు, కుత్తుక వ్రేలాడ, నెత్తిపై కిరీటమూని ఉన్న వానిని రౌద్రరూపుని బండిచక్ర మట్లున్న మిడి గ్రుడ్లవానిని, అడుగుమోప భూమి కంపించుచున్న వానిని, జడుపు గిడుపులేని ఆరక్కసునిచే రోహిణీ తనయుడు మోచికొనిపోబడి అంతట కృష్ణుని కిట్లనియె.

కృష్ణ! కృష్ణా! పెద్ద పర్వతమట్లున్న వీడెవ్వడు ఒకానొక మాయా గోపాలకుడగు దైత్యుడు నన్ను మోచికొనిపోవుచున్నాడు. ఓమధుసూదనా! ఇప్పుడునేను ఏమి చేయ వలయునో దానిని చెప్పుము. ఈక్రూరుడు తురతుర పోవుచున్నాడు. అన విని గోవిందుడు నగవున పెదవులదర బలరాముని బలవీర్య ప్రమాణమెఱిగిన ప్రోడ కావున అతనితో ఇట్లనియె.

“ఓ సర్వాత్మక! గుహ్యాతి గుహ్యములకు అన్నిటికిని గుహ్యుడవు కేవల నిర్గుణ పర బ్రహ్మవైన నీ మానవాకార విడంబనమేల? స్పష్టముగా అవలంబించెదవు. అశేష జగద్బీజ కారణము, కారణముకంటె ముందుపుట్టినవాడవు జగమేకార్ణవమైనపుడు ఏకై కాత్మకమై శేషించిన నీ స్వరూపము స్మరింపుము. నేను నీవును భూభార అవతరణము నకే మర్త్య లోకమునకు వచ్చినామని నీ వెఱుంగవా?

విరాడ్రూపు నిరూపణము:

గగనము నీ శిరస్సు. మేఘములు నీ కేశములు, భూమి పాదములు, ముఖము అనంతాగ్ని, మనస్సు చంద్రుడు, నిట్టూర్పు వాయువు, నీ నాల్గుబాహువులు నాల్గుదిశలు, సహస్ర ముఖుడవు, భగవంతుడవు, మహాత్ముడవు, సహస్రపాద సహస్ర హస్తశరీర భేదము గలవాడవు. అనేక పద్మోద్భవులకు (బ్రహ్మలకు) ఆద్యకారణము అని మునులు నిన్ను వేయి విధాల వర్ణింతురు. నీ దివ్య రూపమును ఒరుడెఱుగడు. నీ ఆయా అవతార ముల రూపమును దేవతలు అర్చింతురు. తుదకీ విశ్వము నీ యందే లయ మందును. ఇది నీ వెఱుంగవా? నీచే ధరింపబడిన ఈ ధరణి చరాచర ప్రపంచమును ధరించును. ఓ అనంతమూర్తీ! (శేషుని స్వరూపమన్న మాట) నిమేషాది కృతయుగాది భేదమందిన కాలము నీ స్వరూపము. అదే ఈ జగమును భక్షించును. బాడబాగ్నిచే తినబడిన నీరు చక్కని మంచు రూపమొంది హిమగిరియందు భానుమంతుని భాను (కిరణ) స్పర్శముచే అదే నీరగును. ఇట్లే సంహారమందు (ప్రళయకాలమున) నీచే అత్తం = తినబడిన ఈ ఎల్ల జగత్తు నీ అందు అధీనమై ఉండి సృష్టిచేయ ఉద్యమించు నీ యొక్క రూపమే కల్పాను సారముగ జగద్భావమును పొందును. నీవు నేనును కలిసి, ఈ జగత్తునకు ఏకైక కారణమై ఉన్నాము. జగత్తు కొఱకై భిన్నరూపులై ఉన్నాము. ఓ విశ్వాత్మా! అమేయాత్మా నిన్ను నీవు స్మరింపుము. ఈదానవుని సంహరింపుము. మనుష్య రూపముతోనే బంధువులకు హితమాచరింతము” అని ఇట్లు కృష్ణుడు జ్ఞప్తిచేయగా బలశాలి బలుడు ప్రలంబుని పట్టి పీడించెను. కోపముచే కన్నులెఱ్ఱవడ వాని నడినెత్తిపై పిడికిట గ్రుద్దెను. ఆ దెబ్బతో కనుగ్రుడ్లు వెలికివచ్చి మెదడు బయలుపడి నోట రక్తము గ్రక్కికొనుచు, అవని తలమునపడి ఆ దైత్యుడు చనిపోయెను. అద్భుత లీలలచేత ఇట్లు బలరామునిచే ప్రలంబుడు కూలుటను చూచి గోపకులు ప్రహృష్టులై సాధుసాధు (బాగుబాగని) అని బలభద్రుని కొనియాడిరి. అట్లు గోపకులచే స్తుతింపబడి బలరామమూర్తి శ్రీకృష్ణమూర్తితో గోకులమునకు విచ్చేసెను.

గోవర్ధనగిరి యజ్ఞము

శ్రీపరాశరుడు ఇట్లుఅనెను:

ఇట్లు వ్రేపల్లెయందు బలరామకృష్ణులు విహరించుచుండ వర్షఋతువు వెళ్ళి, తామరపూలు వికసింప శరదృతువు వచ్చెను. గుంటలలోని నీటనున్న చేపలు పుత్రక్షేత్రాదు లందలి మమకారముచే (మోహముచే) గృహస్థువలె మిక్కిలి తాపమును పొందినవి. మదమువిడిచి మయూరములు సంసారము అసారమని తెలిసిన, యోగులట్లు మౌన మూనినవి. మేఘములు జలము సర్వస్వము (సర్వము) విడిచి విమలములై అచ్చపు తెలుపు రూపుదాల్చి గృహమును జ్ఞానులట్లు అంబరమును వీడినవి. సర్వధనమును గృహారామక్షేత్ర పుత్ర కలత్రాది సర్వమును వీడి విరక్తిచే చిత్తశుద్ధి గడించి అచ్చపు బ్రహ్మజ్ఞాన కళ దాల్చి జ్ఞానులు దేహాభిమానాదులు పోయి కట్టువస్త్రమునుగూడ విడిచి, అవధూతలగుదురను శ్లేష మూలమున మేఘములకు ఉపమానముగా ఇట సమన్వయింప బడినది. శరత్కాల భానుని వేడిమింగి సరస్సులు బహువిషయ భోగముల మీది మమకారముచే దేహుల హృదయములట్లు శోషించినవి (ఎండినవి). శరత్కాలమందలి జలములు విచ్చిన తెల్ల కల్వలచే శుద్ధ చిత్తులయొక్క (బ్రహ్మజ్ఞానుల యొక్క) మనస్సులు అవబోధములచే (ఆత్మ విషయిక జ్ఞానములచే)వలె యోగ్యతా లక్షణము పొందినవి. సరస్సులు యోగ్యములు అయినవని అర్థము. జ్ఞానుల మనస్సులు జీవాత్మ పరమాత్మేక్యాను సంధానయోగ సమాధి రూప లక్షణముగలవైనవి అని రెండవ యర్థము. నక్షత్రములచే విమల మైన ఆకాశమున అఖండ మండలముగల శరత్కాల పూర్ణిమ నాటి నిండుచంద్రుడు శుచులు శ్రీమంతులు అగు సాధుకులమున పుట్టిన చరమ దేహాత్ముడగు యోగివలె ప్రకాశించెను. అ వంశము తారకా విమలమైన ఆకాశ మనుటలో కూడ భ్రూమధ్య స్థానమున కనుపాపల నిలిపి కేవల మాకాశముగా ఉపనిషత్తులచే పేర్కొనబడిన నిర్గుణ నిర్వకార పరబ్రహ్మమందు కేవలము ఆనందము, తెలివి మాత్రము స్వరూపముగాగల నిరాకారమందు డెందమను కుంభగత ప్రదీపకలికా రూపమున నిలిపి చిచ్చంద్రమండలము అనబడు సహస్రారమందు స్వరూపోవరతి యందు బ్రహ్మవిద్వరిష్టుల అప్రాకృతసమాధి వైభవమిందు ధ్వనింపబడినది. జలాశయములు (నదులు సరస్సులు మొదలయినవి) అల్లనల్లన దినదినమించించుకకాగా తీరమును (ఒడ్డులను) జ్ఞానులు క్షేత్రపుత్రాదులందు మిక్కిలిగ రూఢమైన మమకారమునట్లు వదలుచుండెను.

హంస లింతకుమున్ను (వర్ష ఋతువున మానస సరోవరమునకు వెళ్ళి విడిచిన ఉదకములతో అనేక యోగ విఘ్నములచే దెబ్బతిన్న యోగులట్లు పునర్యోగమును (కల యికను) పొందినవి. ఇటహంస శబ్దమునకు హంసలు పరమ హంసలుఅను అర్థము. సముద్రుడు తరంగముల అలజడి తగ్గగా, స్థిమితమై జలములతో క్రమముగా యోగసిద్ధి గడించి కదలని మతివలె మిక్కిలి నిండుదనమొంది విలసిల్లెను.

అన్ని యెడల ఉదకములు వండ్రువిఱిగి సర్వాత్మకుడైన విష్ణువు తెలియబడగానే ఉత్తమ మేధావుల మనస్సులట్లు మిక్కిలి ప్రసన్నములయ్యెను. శరత్తుచే మబ్బులు వీడ గగనము యోగాగ్నిచే సకలక్లేశములు దగ్ధములై దీపించు యోగుల మానసమట్లు దీపిం చెను. సూర్య కిరణములచే జనించిన తాపమును తారాపతి (చంద్రుడు) అహము, అభి మానముచే (నేను నాది అను అహంకారముచే) పుట్టిన దుఃఖమును గొప్ప వివేకమట్లు శమింపజేసెను. నింగినుండి మబ్బులను భూమి నుండి పంకమును (బురదను), ఉదక ముల నుండి కాలుష్యమును శరత్తు, ఇంద్రియార్థముల నుండి (శబ్దాది విషయముల నుండి) ఇంద్రియములను శ్రవణాదులను ప్రత్యాహారమువలె హరించెను. ప్రత్యాహారము అనునది యమ నియమఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులనెడి యోగము యొక్క అష్టాంగములలో ఒకటి. విషయములంటిన ఇంద్రియములను వాని నుండి ప్రత్యాహరించుట అనగా వెనుకకు తరలించుటకు ప్రత్యాహారమని సంకేతము.

సరస్సులందలి ఉదకములు తొలుత పూరకములచేత, తరువాత కుంభకముల చేత, అవ్వల రేచకముల చేతను, దినదినము ప్రాణాయామ సాధన చేయుచున్నవా అన్న ట్లుండెను. అనగా వర్షర్తువులో నీటిని పూరించుకొని (నింపుకొని) దానిని కుంభించుకొని (ఇమిడించుకొని) శరదృతువునందు రేచించుచున్నవి అనగా వదలుచున్నవి తగ్గుదల నొందించుకొన్నవి.

ఆకాశము చుక్కలును విమలములైన కాలమగు శరదృతువురాగానే వ్రేపల్లెయందు ఇంద్రుని ఆరాధించు ఉత్సవ ప్రయత్నమునందు ప్రజవాసులు ఉత్సుకు లౌటగని పెద్దలం జూచి బుద్ధిశాలి కృష్ణుడు మనకింత హర్షమొదవించు నీ ఇంద్రోత్సవము ఏమి అని ప్రశ్నింపగా, నందగోపుడు సాదరముగ అతనితో

“శరక్రతువగు ఇంద్రుడు మేఘములకు ఉదకములకు ప్రభువు. అతని ప్రేరణచే మేఘములు జలమయమైన రసమును వర్షించును. ఆ వర్షము వలన జనించిన పంటను మనము మఱియుంగల దేహులు ఉపయోగించుకొనుచు బ్రతుకుదుము. దేవతలను తృప్తిపరతుము. ఆపంటచేతనే ఈ గోవులు పాలుగలవై, దూడలుగలవై, సంతృప్తిని పొందును. ఇంద్రుడిచ్చిన వర్షముచే వర్ధిల్లు పంటలచే తుష్టములు పుష్టములు అగునుగదా! పంట తృణము లేని భూమిగాని, ఆకలికి కుములు జనముగాని, వృష్టినిచ్చు మేఘములు కనిపించు చోట కనిపింపవు. సూర్యకిరణములచే ఈ భూమిపైగల నీరు పిదుకబడును. పర్జన్యుడు (ఇంద్రుడు) దానిని సర్వలోకోత్పత్తికి మేఘములద్వారా భూమిపై వర్షించును. అందువలన వర్ష ఋతువునందు రాజులెల్లరు, మనము ఇంకనుగల మానవులు సమ్మోద ముతో యజ్ఞములచే సురేశ్వరుడైన శక్రుని అర్చింతము అని పలుకగా ఇంద్రపూజయెడల ఇట్లా నందగోపుని పలుకులు విని దేవేంద్రునికి రోషము తెప్పింప దామోదరుడు ఇట్లు పల్కెను.

శ్రీకృష్ణుడు నందాదుల పూజ వలదనుట:

“మనము మడిదున్నువారము-కర్షకులము కాము. వాణిజ్య జీవులమును కాము. మనకు దైవము గోవులు. తండ్రీ! మనము వనములందు తిఱుగువారము. అన్వీక్షకి (తర్కము), త్రయి, వార్త, దండనీతి (అర్థశాస్త్రము) అనునవి నాల్గు విద్యలు. అందు వార్తను గురించి మాత్రము నేతెల్పునది వినుము. వ్యవసాయము వర్తకము మూడవది పశు పాలనము అను ఈమూడు వృత్తులకు సంబంధించినది. వార్త అనునది ఒక్కటే విద్య. భూమిదున్ను వ్యావసాయి కులవృత్తి కృషి. క్రయవిక్రయము వ్యాపారజీవులవృత్తి పణ్యము. మనకు గోవే పరమ వృత్తి. ఇట్లీ మూడు వృత్తులు వార్త అనుదానిభేదములే. ఎవడేవిద్యతో కూడిఉండునో వానికదే మహాదైవము. అదే పూజింపదగినదియు అర్చింపనైనదియు. అదే వానికి ఉపకారికయు. ఎవడుదేని ఫలము అనుభవించుచు, వేటొండు దానిని పూజించునో ఆ నరుడు ఇహమందు పరమందును ఆ శోభనమును పొందడు. కృష్యము (క్షేత్రము)నకు పరమావధి పొలిమేర. దానికి అవధివనము. వనమునకు అవధి గిరులు, ఆగిరులన్నియు మనకు పరమగతి. ద్వారబంధములు ఆవరణములు ఉన్నవారుగృహము పొలముగలవారు, సుఖులుకారు. ఎల్లలోకమున సుఖించువారు చక్రచారులు, అనగాబండ్లమీద తిరుగువారు. ఈవనమున గిరులు కామరూపములని విందుము. అవి ఆయారూపముగొని తమతమ చరియలం క్రీడించును. వానియెడ అపరాధము చేయు వారిని, ఆ పర్వతములందలి అడవులందు ఉండు వారిని, సింహాది రూపములతో ఆ పర్వతములు కడ ముట్టించును. అందువలన ఈ గిరియజ్ఞము గోయజ్ఞము, మనము చేయతగినది. ఇంద్రునితో మనకేమి పని? గోవులు, కొండలు మనకు దేవతలు. మంత్ర ప్రకాశిత దేవతా యజ్ఞమున దీక్షితులు విప్రులు. నాగలితో దున్నుటఅను యజ్ఞముచేయు వారు కర్షకులు. కొండలందు వనములందుండు వారము మనము. గిరి గోయజ్ఞ ఫలు లము. అందువలన గోవర్ధన శైలమును వివిధ పూజాసామగ్రులచే అర్చింపనగును. శాస్త్రవిధిని అనుసరించి పవిత్రములగు పశువులను బలి ఇచ్చి పూజింపనగును. వ్రేపల్లెలోని ఎల్ల వస్తు సామగ్రిని గైకొనుడు. ఆలోచింప బనిలేదు. దాన విప్ర సంతర్పణము అతిథి సంతర్పణము కావింపుడు. అందు అర్చనము, హోమముచేసి ద్విజులకు భోజనము పెట్టిన పిదప శరత్కాలకుసుమమాలలను శిరస్సులందు తాల్చిన గోగణము ప్రదక్షిణము చేయు గాక! ఇది నాకు అభిమతము. దీనిని మీరు ప్రీతితో ఆచరింతురేని దానిచే గోవులకు, కొండకు, నాకును ప్రీతి కలుగును.

అని చెప్పిన ఆ కృష్ణుని పలుకులనువిని నందాది ప్రజవాసులు ప్రీతిచే మోములు విప్పార బాగు! బాగు! అనిరి. వత్సా! నీమతము పరమశోభనము. అది యెల్ల చేసెదము. గిరియజ్ఞము సాగింతుము. అని శ్రీకృష్ణుడు చెప్పిన విధముగా గిరియజ్ఞము కావించి పెరుగు పాయసము మాంసాదులతో గోవర్ధన శైలమునకు (బలి) నివేదన చేసిరి. వందలు వేలు ద్విజులకు సంతర్పణములు చేసిరి. అర్చితములైన గోవులు వృషభములు అంకెలు వేయుచు నీటితోడి మేఘమువలె గోవర్ధనగిరికి ప్రదక్షిణములుచేసినవి. ఆ కొండ నెత్తమున కృష్ణుడును రూపుగొన గోవర్ధన గిరిని నేనే అని గోప శ్రేష్ఠులు కొనివచ్చి నివేదించిన సర్వ మును నిండుగ ఆరగించెను. కృష్ణుడు నిజరూపముననే ఆ గిరి మీదికి గోపకులతో ఎక్కి తన రెండవ మూర్తియగు గోవర్ధన శైలమును తానే అర్చించెను. అతడు అంతర్థానమైనం తట, గోపకులు వరములను బడసి గిరియజ్ఞముఇటుల నిర్వహించి తమ గో నిలయమునకు తిరిగి వచ్చిరి.

గోవర్ధనోద్ధరణము

శ్రీ పరాశరుండనియె:

మైత్రేయా! ఇంద్రుడు యాగభంగమైనందులకు మిగుల దోషముగొని, సంవర్తకములు అను మేఘగణమును పిలిచి నా మాట విని మీరు గోకులము నకు చనుడు. అక్కడ మిక్కిలి దుర్బుద్ధితో నందగోపుడు మఱి కొందఱను గూడి కృష్ణుని అండచేత బలుపుగొని యాగ భంగము చేసెను. గోపకులకు జీవనాధారములైన గోవులు కూడ దానికి కారణము. కావున ఆ గోవులను వర్షపాతముచే బాధింపుడు. నేను కొండ శిఖర మట్లెరావతమును ఎక్కి వాయుజలోపద్రవము సమకూర్చి సాహాయము చేసెదను.” అని తన ఆజ్ఞ ఇచ్చెను

ఇట్లాఙ్ఞాపింపబడి, మేఘములు గోవులు నశింపవలెనని పెనుగాలివాన కురిసినవి. క్షణములో భూమి దిక్కులు నింగియు ఏకమగునట్లు ఏకధారగా జడివానకురిసి ముంచెత్తెను. మెఱపు తీగలనెడి కొరడా దెబ్బలకు జడిసినవో అన్నట్లు మేఘములు దిక్కులు పెను గర్జనములచేత ప్రతిధ్వనింపగా కుంభవృష్టి కురియ లోకము అంధకార బంధురమై క్రిందు మీదులు అంతరాళమును కేవల జలప్రాయమయ్యెను. గోవులు పైబడు ఆ వాన పెనుగాలులకు ఎగిరిపోయి సంధిబంధములువిడి, తలలొరిగి, ప్రాణములు వాసెను. కొన్ని యావులు దూడలను కడుపునకు అదుముకొని నిలిచెను. జలపూరములలో కొన్ని లేగలను కోల్పోయినవి. దూడలు బిక్కమొగము పెట్టి పెనుగాలికి మెడలు వడక రక్షింపు రక్షింపుమని అల్లన కృష్ణునిగూర్చి అడలుచు అంబారవములు చేసినవి. గో గోపీ గోపాల సంకులమైన ఆ గోకులము మిక్కిలి దుఃఖితముకాగా, హరి చూచి ఇట్లనుకొనెను: “మఖ భంగము చేసెనని కసిగొని ఇంద్రుడు చేసిన చేష్ట ఇది. ఈ గోష్ఠము అంతను నేనిపుడు కాపాడవలయును. ఈ కనిపించు గిరి నేనుతేకువగొనియెత్తి పెనుశీలలం బలువైన దీనిని మీద గొడుగునువలెఎత్తి పట్టెదను” అని నిశ్చయించి, కృష్ణుడు గోవర్ధన పర్వతమును పెకల్చి ఒక్క చేతితో అవలీలగా ఎత్తి పట్టెను.

మఱియు కొండను పైకెత్తి నవ్వుచు, గోపాలురతో “తొందరగ అందఱు దీని క్రిందికి రండు. ఈదురుగాలి చొరని ఇక్కడ సుఖముగ ఉండును. కొండపై పైడునేమో అని జడియ కుడు” అని కృష్ణుడు పలుక, గోధనములతో గోపకులు భాండములను బండ్ల యందు కుక్కించి, గోపికలును ఆకొండ క్రిందకు చేరిరి. అందఱు ఆశ్చర్యపడి, ఆనందపడి ప్రీతిచే చూపులు విప్పార తసలీలలను స్తుతింప ఆకొండను హరి అవలీలగ తనకేల ధరించెను. ఏడు రాత్రులు అమ్మబ్బులుబ్బున కుండపోతగ కురిసినవి. గోవర్ధనమును ఎత్తి, గోకులమును కాపాడ, బలారి వింతయైన ఆ ముసరు వారిదములను వారించెను. అందఱు ఆశ్చర్య ముఖులై కనుగొన కృష్ణుడంత గోవర్ధన పర్వతమును యథాస్థానమున విడిచెను. (V-11)

గోవింద పట్టాభిషేకము

కృష్ణుడు గోవర్ధనశైలమును గోకులమును ఉద్ధరింప, పాకశాసనుడు కృష్ణ దర్శనము చేయ అభిలషించెను. అతడు ఐరావతము ఎక్కివచ్చి గోవర్థనగిరిపై గోపాలబాలక రూపము ధరించి గోవులను కాచుచు గోప కుమారులతో చుట్టబడి ఉన్న సకల జగద్రక్షకుని హరిని, హరి (ఇంద్రుడు) దర్శనము చేసికొనెను. మఱియు అందఱకుం గనబడకుండ పై యెత్తున హరి శిరమ్మున తన లెక్కలతో నీడ కల్పించుచున్న పక్షిరాజును గరుడుని కూడ దర్శించెను. అతడు ఐరావతమునుదిగి ఏకాంతమున ప్రీతిచే కనులు విప్పార అల్లన నవ్వుచు మధువైరి కిట్లనియె.

“కృష్ణకృష్ణా! ఇదే ఆలింపుము నేనెందులకు నీ సన్నిధికి ఏతెంచితినో విన్నపము చేసెదను. నీ వింకొక లాగు భావింపవలదు. పరమేశ్వరా! అఖిలాధారుడవు నీవే పృథివీ భారముడుప నవతరించినాడవు. యాగభంగము చేసితివని పగగొని, నేను గోకుల ఆకులము సేయ మేఘములకు ఆన ఇచ్చితిని. వానిచే ఈ కల్లోలము చేయబడినది. నీవు గిరినెత్తి గోవులం కాచితివి. అద్భుతమైన నీ ఈలీలచే నేను సంతసించితిని. ఒక్క చేతితో నీవీగిరిని అవలీల నెత్తుట వలన స్వామీ! వేల్పుల ప్రయోజనము నెరవేర్ప బడిన దని నేతలంతును. నీచే సురక్షితలైన గోవులు నిన్ను సత్కరింప వలెనను కారణముచే నన్ను మిక్కిలి ప్రేరేపింపగా, నీదరికి ఇటకు నేను ఏతెంచితిని. గోవుల మాటకు ఉత్తేజితుడనై గోకులమునకు ప్రభునిగా, ఉపేంద్రునిగ సత్యలోకోపరిస్థితగోకులేశునిగా నిన్ను పట్టాబి షేకించెదను. గోవులకు ఇంద్రుడవగు నీవు గోవిందుడవు కాగలవు.

దేవేంద్రకృత గోవింద పట్టాభిషేకము

అంతట సురపతి తన వాహనమైన ఐరావతము నుండి గంటపే చేకొని దానిని పవిత్ర జలములచేనింపి, గోపాలకృష్ణునకు అభిషేకము కావించుచుండగా ఆక్షణమున గోవులు పాలుచేపి వసుంధర నెల్ల గోక్షీరధారార్ధము ఒనరించినవి. గోవుల మాట వెంబడి శచీపతి జనార్దనుడి ఉపేంద్రునిగ సంప్రీతితో అభిషేకించి వెండియు సవినయముగ ఇట్లనియె: “పృథ్వీధరా! గోవులమాట చెల్లించితిని. మఱియు భూభారము తగ్గించదలచి చెప్పు నా పలుకులనుఆలింపుము. నా అంశము భూమియందు అర్జునుడనుపేర అవత రించినది అతడు నీచే రక్షింపబడుగాక! ఆ వీరుడు భూభారావతరణమున నీకు సాహాయ్య పడ గలడు. ఆత్మవలె అతడు నీకు సంరక్షణీయుడు అనెను. అంత ఇంద్రునితో భగవంతుడు ఇట్లుపలికెను.

భరతవంశమందు నీ అంశమున పుట్టినాడని పార్థుని నేనెఱుంగుదును. నేను భూతల మున ఉన్నంత వఱకుఆతని నేను పాలించెదను. దేవేంద్రా! నేనుఉన్నంత వఱకు ఆ అర్జునుని పోరులో ఎవ్వడును గెలువలేదు. కంసుడను దైత్యుడు అరిష్టుడు కేశి కువలయాపీడుడు, నరకుడు మఱి ఆ పెక్కురు హతులైనంత మీదట మహాయుద్ధము జరుగును. అందు సర్వభారావతరణము చేయబడినట్లే ఎఱుగుము. నీ కుమారుడగు అర్జునుని విష యమై సంతాపపడకుము. అర్జునుని శత్రువు ఎవ్వడును నాఎదుట ఏమియు చేయజాలడు. అర్జునుని కొఱకే నేను యుధిష్ఠిర పురస్సరులైన బిడ్డలను భారత యుద్ధమైన తరువాత, ఎట్టి దెబ్బతినకుండ కుంతి కొసంగెదను. అని పలుక విని దేవపతి జనార్దనుని కౌగలించు కొని, ఐరావత గజమెక్కి తిరిగి దివమ్మునకు ఏగెను. పిమ్మట కృష్ణుడును, గోవులతోను, గోపాలురతోను, గోపికల చూపులచే పవిత్రమయిన దారివెంట వ్రేపల్లెకు విజయ ముచేసెను.

రాసక్రీడ - గోపికా విప్రలంభము

శ్రీ పరాశరుఇట్లు అనెను:

ఇంద్రుడు అఱుగ, గోపాలురు సర్వప్రాణి సుఖకారియైన కృష్ణునిచూచి ప్రీతితో ఇట్లనిరి: స్వామీ! మహాభాగా! (మహాభాగుడు=కీర్తిమంతుడు, భాగ్యవంతుడు, పవి త్రుడు). గోవర్ధనగిరిని ఎత్తి మమ్ములను పెద్ద భయమునుండి రక్షించితివి. ఈ బాలక్రీడ అసామాన్యమయినది. నీకీ గోపాలకత్వము జుగుప్సితము. నీ చేష్టితము దివ్యము. ఇదేమో తండ్రీ! మాకు తెల్పుము! మడువున కాళీయుడుదమితుడయ్యెను. ధేనుకుడు గూల్ప బడెను. గోవర్థనమెత్తబడెను. మామనసులు శంకాకులములు అగుచున్నవి. నీ పాదములు తోడుగ ఓ అపారవిక్రమ! నిజము నిజము. శపథము చేయుచున్నాము. నీ ప్రభావము (వీర్యము=తేజస్సు, పరాక్రమము) ఉన్నది ఉన్నటుచూచి మేము నిన్ను నరునిగా తలంపము. ఆబాలగోపాలము, స్త్రీలకు పిల్లలకు నీయెడల ఎక్కడలేని ప్రీతి. ఎల్లవేల్పులకేని అశక్యము ఈపని. ఒక వంక నీకు బాల్యము. ఒకయెడ నీ అపూర్వ ప్రభావము. ఒక వంక మాలో అంత శోభనముగాని పుట్టువు. ఆలోచించిన కొలది కృష్ణా! మాకు సందేహము కల్గించుచున్నది. నీవు దేవుడవా? దానవుడవా! యక్షుడవా! గంధర్వుడవా! మాకెందులకీ విమర్శ! మా బంధువుడవు నీవు. వందనము. అనగా విని క్షణము ఊరకుండి కొంచెము నెయ్యంపుటలుక తెచ్చికొని, గోపకులకు కృష్ణుడు ఇట్లు మారు పలికెను:

నా సంబంధముచే మీకు సిగ్గుకలదేని, ఓ గోపాలకులారా! నేను మీకు కొనియాడ దగినవాడనా! అట్లైన ఆ విమర్శ వలన మీకేమి లాభము? మీకు నాయెడ ప్రీతిగలదేని, మీకు నేను శ్లాఘ్యుడనేని, మీ చుట్టములయెడల ఉన్న తలంపు నాపై ఒనరింపుడు. నేను దేవుడనుకాను. గంధర్వుడను కాను. దానవుడను అంతకంటె కాను. నేను మీకు చుట్టమనై పుట్టినాను. దీనిని గూర్చి ఇంతకంటె వేఱుగ ఆలోచింపవలసిన పనిలేదు. అన హరి పలుకులను విని పొల అలుకగొన వనమునకుం చనిరి. కృష్ణుడో విమలమైన ఆకాశమును, శారదచంద్రచంద్రికను, అయ్యెడ విప్పారినవై దిశలెల్ల పరిమళింప చేయుచున్న తెలికలువ పూతీగను ఝుంకారములు సేయు తుమ్మెదల గుంపులతో మనసు హరించు వనరాజినికని, గోపికలతోరమింప హరి మనసుగొనెను. బలరామమూర్తి లేకుండ వనితల కత్యంత ప్రియముగ అవ్యక్తమధురపద లలితముగ తారమంద్ర స్థాయుల చక్కగశౌరి సంగీతము పాడెను. ఆ రమ్యగీతధ్వనివిని గోపికలు ఇండ్లు వెడలి అయ్యెడ హరి ఉన్నయెడకు ఏతెంచిరి.

ఒక గోపిక ఆతని లయానుకూలముగ మెలమెల్లన వంతపాడెను. ఒక సుందరి ఆపాటయెడ శ్రద్ధకొని ఆతనిని మనసార తలంచెను. ఒక ముగ్ధ, కృష్ణ! కృష్ణా! అని పలికి సిగ్గుపడెను. ఒకామె ప్రేమాంధయై వెంటనే ఆతని పజ్జకు అరిగెను. ఒక బాల ముంగిలి వాకిటకువచ్చి, వెలుపలనున్న తమ పెద్దను జూచి కనులు మూసి తన్మయత్వముతో గోవిం దుని ధ్యానించెను. ఆ కృష్ణునిపైని చిత్తముతో విమలమై పొందిన ఆనందాను భవముచే తొలి జన్మములందు చేసిన పుణ్యముల ఫలమెల్ల తఱుగ, ఆతని చూడమిని కలిగిన దుఃఖా నుభవముచే తొలుత చేసికొన్న పాపఫలమెల్ల తఱిగిపోవ, జగత్పితయు కేవల పర బ్రహ్మ స్వరూపుడు అగు కృష్ణునే తలంచుచు, ఉచ్ఛ్వాసము నిలిచిపోయి, ముక్తిని పొందెను.

గోపికలు చుట్టునుం గ్రమ్ముకొన శరచ్చంద్ర మనోరమమయిన రాత్రిని గోవిందుడు రాసక్రీడారంభ రసోల్లాసియై గౌరవించెను. గోపికలును గుంపులు గుంపులై కృష్ణలీల యందు అధీనలై కృష్ణుడు ఒండొక యెడకేగి మఱుగువడ నాతనిపై హృదయములు నిల్పి బృందావనమందు నల్గడల వెదకుచుం తిరుగాడజొచ్చిరి. ఒండొరులు పిలిచికొని ఇట్లు పలుకం జొచ్చిరి-ఒక గోపి ఇదిగో నేను కృష్ణుడను. చక్కగా వెళ్ళుచున్నాను. నా జాడ కనుగొనుడు అనియె. మఱియొకతె నేనే కృష్ణుడను నా పాటవినుండనియె. ఓ దుష్టుడా! కాళియుడా! నిలునిలు. నేను కృష్ణుడనని బాహువులు చరచి, చాచి, సర్పమును ఒకతెపట్టెను. ఇంకొకతె ఓ గోపకులారా! నిశ్శంకముగ ఉండుడు. వానకు భయపడవలదు ఇదుగో! నేను గోవర్ధనమెత్తితిని. ఇడుగో ధేనుకాసురుడు. వీనినిపట్టి విసరివైచితిని. స్వేచ్ఛగా ఇక గోవులు సంచరించుగాక! అని కృష్ణలీలలను అనుకరించి పలికెను. ఇట్లు గోపికలు కృష్ణ లీలలను అభినయించుచు తిరుగజొచ్చిరి.

ఒక గోపిక భూమిని కని మేనెల్ల పులకరింప సఖీ! చూడుడు! కందొవలు విప్పార ధ్వజము వజ్రము అంకుశము, పద్మమునను చిన్నెలుగల కృష్ణుని అడుగులం తిలకింపుడు అల్లదె కనుగొనుడు. లీలావిలాస గమనముననేగు కృష్ణుని అడుగుజాడలివె అని పలికించిరి. ఎవ్వతెయో అదృష్టవంతురాలు మదవతి వానితోగలిసి ఏగిన జాడ ఇదిగో! గట్టివి, చిన్నవియైన దాని అడుగుల గుర్తులివిగో! ఇక్కడ దామోదరుడు పైనిగల పుష్పముల అపచయము చేసియుండును. నిక్కము. ఆ మహానుభావుని ముందడుగు పై భాగము మాత్రమే చిహ్నితమై కనిపించుచున్నది. ఇక్కడ కూర్చుండిన అభాగ్యవతి ఎవతెయో అతనిచే పుష్పాలంకార మిక్కడ నలంకరింపబడినది. అది కొండొక జన్మమందు విష్ణువును అర్చించి ఉండెనుకావలయును. స్వామి పూలుతురిమి ఆదరించిన కారణముచే అది నా అంతటిది లేదని మిడిసిపడె కాబోలు. అమానవతిని ఇట దిగవిడిచి నందగోపుని బిడ్డడీ జాడఏగినాడు. చూడుడు. అట్లేగుచున్న అందగాని వెంటందవిలి పిఱుదులబరువున మందమందముగ ఒక మందగమన అపఱుగందక కాబోలు పరువెత్తినది. దాని పాద్రాగములు ఇయ్యెడ ఈనేలపై గట్టిగ అంటినవి. ఆతని కేలుంగొననేల గైకొనినెచ్చెలి! ఒకతె ఈవెంట అడుగులు సరిగ ఆనింపక ఏగెను కావలయును. ఆ అడుగులజాడ ఇట అంటి ఉండునట్లు కనబడు చున్నది. చేయిపట్టుకొన్నంతమాత్రమున అధూర్తుడీ బాలికను విదలించుకొనిపోయి అవ మానించినాడు కాబోలు. నిరాశచెంది ఆ ఇందువదనమంద గమనమున వెనుదిరిగిన అడుగుజాడలు ఇట కనబడుచున్నవి.

తొందరగ పోవలయును. తిరిగి ఈదఱికి వత్తునని కృష్ణుడొకతెనుదాటి ఏగె కాబోలు ఈ అడుగుజాడలో ఆ తొందర కనిపించుచున్నది. కృష్ణుడీ గహనమందు ప్రవేశించినాడు. ఇదిగో అడుగుజాడ కనబడుట లేదు. మనమిక మరలి పోవలయును. జాబిల్లి వెన్నెల వెలుగిందు కనబడదు. అని ఆ గోపికలు కృష్ణ దర్శన నిరాశలై యమునా తీరమునకు చేరి ఆయన చరిత్రమును గాన ముసేయ చొచ్చిరి. అంతట ముఖారవిందమల్లన వికసింప ఎదురు గవచ్చుచున్న త్రైలోక్యరక్షకుని సర్వజీవనసుఖవిలాసుని కృష్ణుని కాంచిరి.  

వృషభాసుర వధ

అని చెప్పి శ్రీ పరాశరుడు ఇట్లు అనెను:

సంధ్యాకాల అనంతరము కృష్ణుడు రాసక్రీడాకుతూహలియైనతఱి అరిష్టుడు పొగఱు కొని, బెదరించుచు, గోష్ఠమునకు వచ్చెను. సజల మేఘములవంటి నల్లని మేనితో పెద్ద కొమ్ములతో సూర్యునట్లున్న కన్నులతో డెక్కలచే నేలను చీల్చుచు నాలుక సాచి పెదవులను గట్టిగ నాకుచు, తోక పైకెత్తి కఠినమయిన మెడతో మిక్కిలి ఎత్తయిన మూపురముతో అందలేని ఒడ్డును పొడవుతో మూత్రపురీషములు పూతగొన్న పృష్ఠముతో గోవులకు దుడుకు కూర్చుచు మెడవ్రేల పెద్ద ముట్టెతో చెట్ల రాపిడిచే పుండ్లు వడిన మొగముతో, గోవుల గర్భనిర్భేదనము చేయుచు వృషభరూపుడై ఆ రాక్షసుడు తపస్వుల చంపుచు వనమలందు ఏవేళను తిరుగుచుండును.

ఆ ఘోర రాక్షసుని చూచి గోపీగోపాలకులు జడిసిపోయి కృష్ణకృష్ణాఅని ఆక్రం దించిరి. అంతట కేశవుడు సింహగర్జనము చేసి అరచేతులు సరచి చప్పుడుచేసెను. సడివిని హరిపైకి వచ్చెను. ఆ దానవుడు కృష్ణుని కుక్షిం గురిసేసి కొమ్ములకౌనలం ముందునకుసాచి స్వామి మీదకు పరువిడెను. అట్లు పై బడు ఆమ్రుక్కడి రక్కసుని కనియు హరియున్న తావునుండి కదలక నీలెక్కేమి పోరాఅన్నట్లు నటించి, తన్ను దరసిన వానిని పట్టుకొని కదలకుండ రెండు కొమ్ములుబట్టి వాల్చి మోకాళ్ళం గడుపునం బొడిచెను. వాని దర్పబలమణచి, తడిబట్టపట్టి పిడిచినట్లు, వాని మెడబట్టి పిడుపపెట్టెను. ఒక కొమ్మూడ బెరికి దాననే వానిగొట్టెను. ఆరాక్షసుడు నోటనెత్తురు గ్రక్కికొని చచ్చెను. అక్రూర దానవుడు హతుడైనంత గోపకులు జంభాసురుడు చావగా దేవగణములు ఇంద్రుని బలె కృష్ణుని గొనియాడిరి.

ధనుర్యాగసంకల్పము - అక్రూరప్రేషణము

అరిష్టుండను వృషభాసురుడు హతుడుకాగా ధేనుకుడు కూల్చబడగా ప్రలంబుడు చంపబడగా, గోవర్ధనగిరి ఎత్తబడగా, కాళియసర్పము దమితముకాగా, పెనుమ్రాకులు కూల్చబడగా, పూతన చంపబడగా, శకటుడు తలక్రిందులుచేయబడగా, నారదుడు కంసునకు యశోదా దేవకీగర్భ పరివర్తనాది వార్తలన్నిటిని తెలిపెను. అదెల్ల దేవతలనుండి విని, నారదుని వలన కంసుడు విని ఆదుర్మతి వసుదేవునిపై పగగొనెను. వాడు సర్వయాదవ సమాజ మందు ఆవసుదేవుని ఆడిపోసెను. యాదవులను గర్జించెను. ఆపైకర్తవ్యము ఇట్లాలోచించెను. “రామకృష్ణులు బలవంతులు కాకముందే వారిని నేను కడముట్టింప వలయును. వయసు వచ్చిన వీండ్రు అసాధ్యులయ్యెదరు. ఇక్కడ చాణారుడు మహావీర్యుడు; ముష్టికుడు మహాబలుడు. వీరిద్దరిచే మల్లయుద్ధమున ఈయిద్దర దుర్మతులను కడతేర్చెదను. ధనుర్యాగ ఉత్సవము అను నెపమున వ్రజమునుండి వారిని ఇటకు రావించి, వారు నశించుటకు ఆయా తీరుల ప్రయత్నింతును. శూరుడు శ్వఫల్కతనయుడు యదుశ్రేష్ఠుడు అగు అక్రూరుని, వారిని కొనివచ్చుటకు గోకులమునకు పంపెదను. బృందావన మందు చరించు కేశిఅను ఘోర రాక్షసునికి ఆనయిచ్చెదను. బలశాలియగు ఆతడు ఆ ఇరువురిని అచటనే చంపగలడు. కువలయాపీడమను గజము నా వద్దకు ఏగుదెంచిన వసుదేవ కుమారులను ఇర్వురను చంపగలదని ఆలోచించి ఆదుష్టుడు కంసుడు వీరులగు బలరామకృష్ణుల కడతేర్ప నిశ్చయించి అక్రూరునికి ఇట్లనియె:

ఓ దానవతీ! నాకు సంతుష్టి కలుగునట్లుగా నేను చెప్పినట్లు సేయుము. ఇక్కడనుండి రథము ఎక్కి, నందగోకులమునకు చనుము. విష్ణువు అంశమున వసుదేవుని కొడుకులు పరమ దుష్టులు నన్నుకడతేర్చుటకు పుట్టి పెరుగుచున్నారు. ఈ చతుర్దశినాడు నా ధనుర్యా గోత్సవము ఇక్కడ జరుగనున్నది. నీవేగి మల్లయుద్ధమునకు ఆ ఇద్దరను కొనిరమ్ము. చాణూరముష్టికు లిద్దరు నియుద్ధమున-బాహుయుద్ధమున-నేర్పరులు. వారితో ఈ ఇద్దరు చేయుయుద్ధమును ఇక్కడ లోకము తిలకించుగాక! కువల యాపీడమను ఏనుగు మావ టీండ్ర నాయకునిచే ప్రేరితమై, ఈ వసుదేవసుతులను ఇద్దరు పిల్లలను చంపగలదు. వారిని చంపి వసుదేవుని నందగోపునిగూడ చంపెదను. మిక్కిలి దుష్టబుద్ధియగు మాతండ్రి ఉగ్రసేనునికూడ కడతేర్చెదను. అపై ఎల్లగోపకులు గోధనములను, ధనములనుకూడ హరిం చెదను. వారు నన్ను చంపవలెను అను దురాలోచనలో ఉన్నారు. నీవుతప్ప ఈయాదవు లందఱు నాకుద్వేష్యులు. ఆపై క్రమముగ వీరందఱిని వధింప యత్నము చేసెదను. అప్పుడే రాజ్యమెల్ల యాదవ శూన్యమై నిష్కంటకమైనంత నీతో దీనిని నేను శాసింతును. కావున నీవేగుము. గేదెనెయ్యి పెఱుగు పాలుగొని యాదవులు సత్వరము ఏతెంచు విధముగ వారికి నీవు నచ్చచెప్పుము. అని ఇట్లు ఆజ్ఞాపింపబడి, మహాభాగుడు, అక్రూరుడు, భక్తవద్భక్తుడు రేపే నేను కృష్ణుని దర్శింతునని ఉప్పొంగి, వేవేగ కంసరాజునకు అట్లేఅని పలికి రథమెక్కి మధురానగరము నుండి మధువంశ్యులకు ప్రియుడగు అక్రూరుడు బయలుదేరెను. (V-15)

కేశివధ

కేశి అను రాక్షసుడు ఉదగ్రబలుడు, అశ్వరూపుడు కంసుని దూత ప్రేరేపింపగా కృష్ణుని చంపగోరి బృందావనమునకు ఏతెంచెను. భూతలమును గిట్టలంతాటించుచు, జూలు విదలింపున మబ్బులను అదలించుచు, ఒక్కదాటున చంద్ర సూర్య మార్గమాక్రమించి గోపకుల పైకి దూకెను. దాని సకిలింపువిని, గోపీ గోపకబృందము బెదరి గోవిందుని శరణాందెను. త్రాహి! త్రాహి! రక్షింపుముఅను వారి అర్తరవమువిని గోవిందుండు సజల జలద గర్ణాగంభీరముగ జడియవలదు! గోపజాతిలో పుట్టిన మీరట్లు తల్లడిల్లుటచే, వీర వీర్యమునకు లోపము. వట్టి సకిలింపుల చేత ఆటోపము చూపు గంతులువేయు, ఈ దుష్టుడు, అత్యల్పసారునిచే, తుచ్ఛునిచే ఏమయ్యె. రారా! ఒరి దుష్టుడ! నేను కృష్ణుడను. పినాకపాణి (రుద్రుడు) పూషుని కిచేసినట్లువలె నీ నోటగల అన్ని పండ్లను రాలగొట్టెదను.  అని నొవ్వనాడి హరి కేశి కెదురునడిచెను. వాడును నోర్డెఱచి ఆతనిపైకి దూకెను. జనార్దనుడు తన విశాల బాహువును దాని నోటంబెట్టి లోనికి దూర్చెను. దాన వాని పండ్లూడి తెల్లని మబ్బుతునుకలట్ల లేదా అభ్రకపుంబలుకట్ల వానిపై రాలిపోయినవి. కేశి దేహమందు ప్రవేశించిన కృష్ణ బాహువు రోగము అంకురించి నప్పటి నుండి ఉపేక్షితమై ముంచుకొని వచ్చినట్లు పెరిగినంతట పెదవులు పగిలి నురుగులతో వాడు రక్తముం గ్రక్కుకుని కనులఇరవుతప్పి కనుగ్రుడ్లు విప్పార, మూత్రపురీషములు విడిచి పాదములచే నేలం గొట్టెను. ముచ్చెమటలు పోసి, అలసి, వడితరిగి, పూనికసెడి విడబార మహారౌద్రు డగు ఆ అసుర పిడుగును అడచినట్లు, ఇట్లు ఇరుతునుకలై కూలెను. రెండు పాద ములు పృష్ఠము తోకయు ఒక్కచెవి యొక కన్ను ఒక ముక్కుగనై ఆ కేశిరక్కసుని శకలములు రెండై భాసించెను.

కేశిని చంపి హరి సంబరపడు సంగడీండ్రతో హాయిగ ఒడలించుకయేని నొవ్వక స్వస్థుడై అక్కడనేఉండెను. అవ్వల గోపికలు గోపకులనుకేశి మడియుటకు ఆశ్చర్య పడుచు అనురాగ మనోరమ్యముగ పుండరీక నయనునిపొగడిరి. అటుపై నారదభగవానుడు మబ్బుల చాటుననుండి ఆనందనిర్భర చిత్తుడై బాగుబాగు జగన్నాథ! లీలామాత్రమున ఈరక్కసుడు అమరులను ఎంతేని ఇడుమలం గుడిపించిన కట్టిడివీడు. నీచే ఈల్లె నేను మిగుల కలహోత్సుకుడను. నరహరులకైన ఈపోర భూత పూర్వము, చూడ స్వర్గమునుండి ఇటు వచ్చితిని. ఈ అవతారమందు నీసేయు లీలలను చూచి నా మనసాశ్చర్యమందె. దాన నేను ఎంతేని సంతోషపడితిని. ఈ గుఱ్ఱమునకు శక్రుడును, దేవతలును జడిసి పోదురు. ఇదిసకిలించినను జూలు విదలించినను, నింగివంకచూచినను, వేల్పులకు గుండె దిగులు అగుచుండును. కేశి అనుపేరుగల వీనిని దునుముటచే నీవు లోకమందు కేశవుడను పేరం ప్రఖ్యాతి నందెదవు. నీకు మంగళమగుగాక! వెళ్లుచున్నాను. కంసునితోడి పోరున ఎల్లుండి మఱల నిన్ను కలిసికొందును. ఉగ్రసేనుతనయుడు కంసుడు పరివారముతో కూల్చబడిన తరువాత నీవు పృథివీ భారము దింపగలవు. అందనేక తీరుల రాజులకగు యుద్ధములను నీకావించిన వానిని నేను చూడవలయును. అట్టి నేనిపుడు వెళ్ళుచున్నాను. నీచే గొప్ప దేవకార్యము చక్కపఱుపబడినది. అదంతయు నీకే విదితము. నీకు శుభమగు గాక! ఇదిగో నేను పోవుచున్నాను. అని నారదుడుఏగినంతట కృష్ణుడు గోపకులచే ఆలింగనాదులచే గారవింపబడి గోపికల కన్నులకు అమృతపాన స్థానమై గోకులమును చొచ్చెను. కృష్ణావతారముచే గోకులము గోపికల కన్నులకు అమృతపాన స్థానమైనది.

అక్రూర ఆగమనము

శ్రీపరాశరుండనియె:

శ్రీకృష్ణ దర్శనమునకు అక్రూరుడు రథముపై నందగోకులమునకు పోయెను. ఏగుచు దనలో ; “స్వాంశముతో అవతరించిన చక్రాయుధుని ముఖమును చూడనున్నాను. ఇప్పుడు నా జన్మము సఫలమయినది. ఈ రేయి సుప్రభాత మైనది. అప్పుడు వికసించిన తామర రేకులట్టి కన్నుల విలసిల్లు విష్ణుముఖమును దర్శింపనున్నాను. సంకల్పనాత్మకమైన పాపమును హరించు విష్ణుని పుండరీకములబోలు కన్నులచే ఇంపగు నెమ్మోము చూడనున్నాను. ఎటనుండి వేదములు వేదాంగములు బయలు వెడలినవో ఆ పరంధాముని భగవంతుని ముఖము దర్శింపనున్నాను. యజ్ఞములందు యజ్ఞపురుషుడుగా, పురుషులచే పురుషోత్తముడుగ, యజింపబడు సర్వాధారుడగు జగత్పతిని దర్శింపనున్నాను. ఇంద్రుడు నూరు యజ్ఞములందు ఎవ్వని యజించి అమరరాజు పదవి నందెనో, ఆస్వామియగు కేశవుని దర్శించెదను.

బ్రహ్మ రుద్రాశ్వి వస్వాదిత్య మరుద్గణములు ఎవ్వని స్వరూపమును ఎఱుగనివారో అ హరి నాకు ప్రత్యక్షము అగుచున్నాడు. సర్వాత్మకుడు, సర్వవిదుడు, సర్వ భూతాంతఃస్థుడు, అచింత్యుడు, అవ్యయుడు, సర్వవ్యాపి నాతో మాటలాడనున్నాడు. మత్స్య కూర్మాది రూపములచే జగముల యొక్క స్థితిని గావించిన ప్రభువు అజుడు నాతో పలుకనున్నాడు. ఇపుడు జగత్ప్రభువు తన మీదనున్న స్థితి సంహారాది కార్యము నొనరింప స్వేచ్ఛా గృహీత మనుష్యాకారుడై ఉన్నాడు. ఎవ్వడు అనంత మూర్తియై (శేషుడు). తన శిరమ్మున భూమినితాల్చునో అతడవతరించి ఉన్నాడు. నన్ను అక్రూరా! అని పిలువనున్నాడు, పితృ పుత్ర మిత్ర కళత్రాది బంధు మోహమయమైన ఎవ్వని మాయను జగత్తు ద్ధరింప జాలదో అట్టి మాధవునకు నమస్కారము.

ఏ స్వామి హృదయమునందు ఉన్ననరుడు సర్వవ్యాపినియైన అవిద్యను యోగ మాయను ధరించునట్టి అమేయాత్మునకు జ్ఞానమూర్తికి నమస్కారము. యజ్వలు యజ్ఞ పురుషుడని సాత్వతులు (ఉపాసకులు) వాసుదేవుడని, వేదాంతవిదులు విష్ణుడని వర్ణింతురో ఆ పరబ్రహ్మకు నతుడనయ్యెదను.

ఎట్లు ఎచ్చోట ధాతయందీ సదసదాత్మక వస్తుతత్త్వము నిలుపబడినదో ఆసత్య రూపముచే ఈతడు నాయందు ప్రసన్నుడగు గాక! ఎవని స్మరించినంత పురుషుడు సకల కల్యాణ భాజన మగునో అట్టి నిత్యుని అజుని హరిని శరణోందెదను” అని ఇట్లు భక్తి వినమ్రమతియై విష్ణుని తలచుచు అక్రూరుడు ఇంచుక ప్రొద్దుండగా గోకులమును చేరెను. అతడు తొలుత ఆవులపాలు పిదుకుచున్న కృష్ణుని దూడల నడుమ ఉండగా వికసితనీలోత్పలదళశ్యాముని హరిని దర్శించెను. బాగుగ వికసించిన పత్రముల వంటి నేత్రములుగలవానిని, శ్రీవత్సాంకితవక్షుని, ఆజానుబాహుని విశాలోత్తుంగవక్షుని ఉన్నత నాసుని, సవిలాసదరహాసముఖారవిందుని, తుంగ రక్తనఖమృదుల పద విన్యాస మవనిలో చేయువానిని, పీతాంబరధారిని, వనమాలావిభూషితుని, “చంద్రబింబముతో గూడిన నీలాచల మట్లు తెల్లతామరల తలపూవులుగా దాల్చిన శ్రీకృష్ణుని, హంసలు, మొల్లలు, జాబిల్లియు, అట్లచ్చపు, తెలికాంతులు కులుకు నెమ్మేన నల్లని వలువ ధరించిన ఆకృష్ణుని వెంటనున్న యదునందనుని, ఎత్తరియై, ఎత్తైన భుజిశిరస్సులు గల్గి సువికాసి ముఖపంకజుడై మేఘమాలలు పైనలమిన రెండవ కైలాసాద్రియో అన్నట్లున్న బలభద్రుని వీరిద్దఱిని చూచి అమ్మహామతియగు అక్రూరుడు మోముతామర విప్పారు మేనెల్ల పులకింప ఇట్లు భావించెను:

ఆ పరమతేజ మిది: ఇది పరమ పదము. వాసుదేవ భగవానుని అంశమిట రెండు రూపములై ఉన్నది. జగన్నాథుడు ఇట కనబడగా కన్నుల సాఫల్యము చేకూరునా ; ఈ అనంతమూర్తి నావెన్నును తన కరకమలముచే తట్టునా? ఎవని కరాంగుళి తాకిన పాపములు పోయి అచ్చమైన సిద్ధికలుగునో, అగ్ని మెఱుపు రవికిరణముల మాలలవలె వెలుగు భయంకరమై అత్యుగ్రమైన చక్రాయుధమును వదలి రాక్షసరాజ చక్రమును కూల్చి, దైత్యుభార్యల కన్నుల కాటుకలు హరించెనో, భూతలము నందుండియే బలి యెవని చేతియందు ఉదకము, దానధారనుఉంచి మనోహర భోగములను అనగా అమరత్వమును మన్వంతర మంతదాక శత్రుశూన్యము అగునట్లుగా అమరాధిపత్యమును బడసెనో అట్టి మహాప్రభువు దోషరహితమయిన నన్ను కంసుని చేరదీసి నందున దోషమునకు స్థానమై ఉన్న వానినిగాతలచి అవమానముచే దూషితునిగా ఒనరించునా? అట్టియెడ సాధువులచే వెలిపెట్టబడిన వాని జన్మము ఛీ ఛీ! పరమ నికృష్టము. జ్ఞాన స్వరూపుడు.

అచ్చపు సత్త్వగుణమునకు నిధి, దోషదూరుడు, ఎల్లపుడు స్ఫుటమై తోచువాడు సర్వజన హృదయము నందుఉన్న వాడునైన ఈస్వామికి జగమ్మున తెలియరానిది ఏమున్నది? కావున నేను భక్తిచే మనసు విధేయముకాగ ఈశ్వరేశ్వరుడు, అజుడు, వ్యాపకుడుఅగు పురుషోత్తముని యొక్క ఆది మధ్యాంత రహితము అయిన అంశావతారమును శరణు పొందెదను.

శ్రీకృష్ణ అక్రూర సమావేశము

శ్రీపరాశరుడు ఇట్లు అనెను:

గోవిందుని ఇట్లు తలచుకొనుచు అయ్యాదవుడు వచ్చి, శిరసువంచి అక్రూరుడను నేనని స్వామి చరణములకు నమస్కరించెను. అతడు ధ్వజ వజ్ర పద్మరేఖాంకితమయిన హస్తముచే అక్రూరుని తాకి దగ్గరకు ఆకర్షించుకొని, ప్రీతితో గాఢముగ కౌగిలించుకొనెను. అతని వందనములందుకొని, బలరామకృష్ణులు ఆనందించుచు అతనిని చేకొని తమ మందిరముంజొచ్చిరి. అయ్యెడ అక్రూరుడు వారితో లోనికేగి వారికి నమస్కరించి వారితో సగౌరవముగ విందారగించి వారికి తాను వచ్చినపనిని ఇట్లు తెలిపెను. దుష్టదానవుడు కంసుడు వసుదేవుని దేవకీదేవిని బెదరించుట, వాడు ఉగ్రసేనునితో దుర్వృత్తితో ఉండుట అతనిని విడిచి వేయుట మొదలగునదెల్ల తెలుప భగవంతుడు విని “అదెల్ల నేనెఱుగుదును. మహాభాగా! ఇందునేనేమి చేయవలయును అది చేసెదను. ఇది ఇంకొక రీతిగ నీవు ఆలోచింపకుము. కంసుడు నాచే నిహతుడైనట్లే ఎఱుగుము. నేనును, బలరాముడును నీతోగూడ రేపు మధురకు వెళ్ళుదము. గోపవృద్ధులు ఉపాయనములెన్నో కొని వెళ్ళుదురు. ఓ వీరాగ్రేసరా! ఈ రేయి ఇక్కడ గడుపుము. మనసున చింతింపకుము. మూడు రాత్రులలోగా నేను సపరివారుని కంసుని సంహరింతును” అనెను.

గోపకులకు ఎల్లి ప్రయాణమని ఆదేశించి, అక్రూరుడు కృష్ణుడు బలరాముడును నందగోపుని ఇంట నిదురించిరి. అవ్వల వేకువ వెలుగు వచ్చినంత కృష్ణబలరాములు అక్రూరునితో మధురకేగ సన్నద్ధులైరి. గోపీజనము అదిచూచి కంటనీరుగ్రుక్కికొని కరకంకణములు జార కృశించి కుమిలి నిట్టూర్పులు పుచ్చుచు ఒండొరులు ఇట్లు అనుకొనిరి: “గోవిందుడు మధురానగరమునకు ఏగి ఇక గోకులమునకు ఏల తిరిగివచ్చును? ఇక నాగరిక సుందరుల మధురములగు పలుకుతేనియలు వీనుల గ్రోలగలడు. నెఱజాణలు మధురాపురీ విలాసినుల శృంగారవాక్యపానములందు రుచిమరిగిన వీని చిత్తము మఱల ఈ మన పల్లెటూరి ముద్దియల వైపెట్లు మఱులును? సర్వ గోకులమునకు సారమైన హరిని హరించికొని పోవు ఆపాడు దైవము దయమాలి, గోపసుందరులయెడ అపకారము చేసినాడు. నర్మగర్భముగ అల్లన నవ్వుచుపలుకు పలుకులు ఆ ఒయ్యారము కులుకు నడకలు ఆనగరకాంతల వాలుచూపులను మఱగి ఈ బేల ఈ పల్లెటూరి పిల్లడు ఏయుక్తిచే మీ పజ్జకు వచ్చును? అక్రూరుడట, కాదీతడు క్రూరుడు. నిర్దయుడు. వీనిచే బేలువడి ఇదుగో! ఇదే ఈతడు రథమెక్కి మధురకు చనుచున్నాడు. ఈ నృశంసుడు (ఘాతుకుడు) ఈ జనము వీనిపై ఎక్కడలేని మోహమునుగొని ఉన్నదని ఎఱుగడా? మన కన్నుల పండువును, ఇతడు హరిని వేరొక చోటకు తీసుకొని పోవుచున్నాడు. ఇతడో పరమనిర్దయుడు. గోవిందుడు బలరామునితో రథమెక్కి వెళ్ళుచున్నాడు. వీనిని ఆపుటకు త్వరపడుడు! పెద్దల సన్నిధిలో చెప్పుట మనకు తగదందురా? విరహాగ్ని దగ్ధులమైన మనలను పెద్దలు మాత్రమేమి చేయగలరు? అదిగాక నందగోపుడు మున్నుగా ఇదే వీరు పయనమగుచున్నారు. ఒక్కడును గోవిందుని మరలింప పూనుకొనడే! ఈరేయి మధురానగర భామినులకు సుప్రభాతము. వారి చూపుఅను తుమ్మెదల పంక్తులు అచ్యుతుని నెమ్మోము తామరలం త్రావనున్నవి. స్వామి ఇటనుండి మధురకుజనుచుండ, ఎవ్వరిచేగాని వారింపబడక వారితో పోవుచు వారిని కాంచుచు నెమ్మేను పులకరించువారు ధన్యులు. స్వామి ప్రత్యంగ సౌకుమార్య సౌందర్యమును తిలకించు మధురాపురీ పౌర నయనముల కిప్పుడు మహోత్సవముగా ఉన్నది. కనుదమ్ములువిచ్చి, కాంతులు విస్తరింప ఎవ్వరిఅడ్డు లేకుండ నీ గోప సుందరులు దర్శింప నా భాగ్యవతు లేమి మంచి కలలుగన్నారో కదా! గోపీ జనమునకు ఈపెన్నిధి చూపించి చూపుఓపమింకాబోలు కరుణమాలి అవ్విధి ఇప్పుడు కన్నులు పెరికినాడు. (విరహముచే మఱియొక వస్తువును చూచు ఇచ్ఛలేక పోవుటచే కళ్ళు లేనట్లే) శైథిల్యమును అందుచున్న హరియొక్క ప్రేమతోపాటు మాముంజేతి ముఱుగులును వెంటనే వదులగుచున్నవి. (హరి విరహముచే కృశించితిమి) అక్రూరుడు నిజముగా క్రూరహృదయుడు. గుఱ్ఱములను తొందఱగ తోలుచున్నాడు. ఇట్లు బాధపడు అబలలయెడ ఎవ్వనికి జాలి కలుగదు? ఇదిగో కృష్ణ రథము. ధూళి ఎత్తుగ రేగినది చూడుడు. అదికూడ కనబడుటలేదు. హరి దూరము అరిగినాడు. అని ఇట్లు హార్దముగ గోపీ జనము నిరీక్షింప హరి బలరామునితో వ్రేపల్లియ ప్రాంతమును వదలెను.

జవమునంబోవు గుఱ్ఱముల పూన్చిన రథముతో పోవుచు, మధ్యాహ్నసమయమున ఆ మువ్వురు యమునా తీరమునకు చేరిరి. అప్పుడు కృష్ణునితో అక్రూరుడు మీరిద్దరు ఇట ఉండుడు. నేకాళింది నదిలో స్నానమాచరించి, మాధ్యాహ్నిక అనుష్ఠానము కావింతును. అనగా వారు సరియన, అతడు స్నానముచేసి ఆచమించి ఆయమునా జలముల పరబ్రహ్మమును ధ్యానించెను. వేయి పడగలతో మొల్ల పూలమాలలతో వికసించిన తామర పూరేకులబోలు కన్నులతో వాసుకి రంభుడు మొదలైన మహాసర్ప వారముచే స్తుతింపబడుచు ఘుమ ఘుమలునించు వనమాల గైసేసి నీలాంబరమును తాల్చి చక్కని శిరోభూషణముతో సొంపగు కుండలములతో ఆనీట భాసించు బలభద్రుదర్శించెను. అతని ఒడిలో మేఘ శ్యాముడై ఎఱుపాఱు కన్నులు, నాల్గుబాహువులు, చక్రాధ్యాయుధములు చేతులయందు కలిగి ఉన్నతమూర్తియై, పీతాంబరములుదాల్చి, రంగురంగుల పూలమాలలు గైసేసి, ఇంద్రధనుస్సున మెఱుపుల మాలలనువింత గొలుపు మేఘమట్లు, శ్రీవత్సవక్షుడును చక్కగ మెఱయు మకరకుండలములను ధరించి తెల్లతామర పువ్వును సిగలో కలిగి ఉన్న వాడును అగు శ్రీకృష్ణపరమాత్మను, పుణ్యశీలురు సనందనాది మునులు సిద్ధయోగులు నీటనిలిచి ముక్కుకొన చూపులు నిలిపి ధ్యానించుచుండ దర్శించెను.

వారిద్దరు బలరామకృష్ణులని గుర్తించి విస్మయమంది అక్రూరుడు రథమునుండి వీరిట కెట్లువచ్చిరని అలోచించెను. అది అడుగవలెననుకొన్న అతని వాక్కును హరి స్తంభింప జేసెను. అంతట నీరువెడలి అతడు రథము దరినేతెంచెను. అతడు ఆ ఇద్దరను ఆరథమునందు మునుపటియట్లు మనుష్య రూపులైఉన్నవారిని చూచెను. నీట మునిగి అక్కడను ముందటియట్ల కాంచెను. గంధర్వులు, మునులు, సిద్ధులు, నాగులు అందరు ఆ ఇద్దఱను కొనియాడుచుండిరి. అంతట ఆదానపతి కలరూపు తెలిసి సర్వవిజ్ఞానమయుని ఈశ్వరుని అచ్యుతుని స్తుతించెను.

అక్రూర ఉవాచ:

సన్మాత్రరూపిణే అచిన్త్యమహిమ్నే పరమాత్మనే

వ్యాపినేనై కరూపైక స్వరూపాయనమోనమః

సర్వరూపాయతేచి న్త్యహవిర్భూతాయతే నమః

నమోవిజ్ఞాత పారాయపరాయప్రకృతేః ప్రభో

భూతాత్మా చేన్ద్రియాత్మాచ ప్రధానాత్మాతథాభవాన్

ఆత్మాచ పరమాత్మాచత్వ మేకః పఞ్చధాస్థితః

ప్రసీద సర్వసర్వాత్మన్ క్షరాక్షరమయేశ్వర

బ్రహ్మవిష్ణుశివాఖ్యాభిః కల్పనాభిరుదీరితః

అనాఖ్యేయస్వ రూపాత్మన్ననాఖ్యేయ ప్రయోజన

అనాఖ్యేయాభిధానంత్వాం నతోస్మిపరమేశ్వర

నయత్రనాథ విద్యన్తే నామజాత్యాదికల్పనాః

తద్ర్బహ్మ పరమం నిత్యమవికారిభవానజ

న కల్పనామృతే అర్థస్య సర్వస్యాధిగమోయతః

తతః కృష్ణాచ్యుతానన్త విష్ణుసంజ్ఞాభిరీడ్యతే

సర్వాథాన్ స్త్వమజవికల్పనాభిరేతై ర్ధేవాద్వైర్భవతి హియైరనన్త విశ్వమ్ విశ్వాత్మాత్వమితివికారహీనమేత త్సర్వస్మిన్నహిభవతో ఆస్తికించిదన్యత్

త్వం బ్రహ్మాపశుపతిరర్యమావిధాతా ధాతాత్వం త్రిదశపతిస్సమీరణో అగ్ని తోయేశోధనపతిరన్తక సత్త్వమేకో భిన్నార్దైర్జగదభిపాసిశక్తి భేదైః

విశ్వంభవాంత్సృజతి సూర్యగభస్తిరూపో విశ్వేశతేగుణమయో అయమతః ప్రపఞ్చః రూపంపరంసదితివాచకమక్షరంయద్ జ్ఞానాత్మనేసదనతేప్రణతో అస్మితస్మై

ఓన్నమోవాసుదేవాయనమస్సంకర్షణాయచ

ప్రద్యుమ్నాయ నమస్తుభ్యమనిరుద్ధాయ తే నమః

సన్మాత్రరూపియు, అచింత్యమహిముడును సర్వవ్యాప్తియు కార్యదశయందుఅనేక రూపియునైన పరమాత్మకు నమస్కారము. సర్వరూపుడు హవిర్మూర్తి ప్రకృతికిఅతీతుడు విజ్ఞానమునకు పర్యవసానభూతుడు, పంచ భూతములకు ఆత్మయైనవాడు, అవ్యక్తరూపుడు ఏకాదశేంద్రియరూపుడు, ఆత్మయు (జీవుడు) పరమాత్మయు (నిరుపాధికుడు) నుగా నీవు ఒక్కడవే అయిదువిధములైఉన్నావు. ఓసర్వ! సర్వాత్మక! క్షరాక్షరమయా! బ్రహ్మ విష్ణు శివులను పేర వివిధ కల్పనల పేర్కొనబడువాడవు. అనిర్వచనీయ స్వరూప భూత! అని ర్వచనీయ ప్రయోజన! అనిర్వచనీయాభిధాన! పరమేశ్వర! నీకు మ్రొక్కెదను. నామ జాత్యాది కల్పన యెచటలేదో - అట్టి పరబ్రహ్మము, నిత్యము, అవికారియు అయిన వస్తువు నీవు. వివిధ కల్పనారహితముగ సర్వార్థావగతి కలుగదు కావున నీవు కృష్ణాచ్యుతా అనంత విష్ణువులను సంజ్ఞలచే పేర్కొనబడుదువు. బ్రహ్మాదిదేవతలు పంచభూతములు దిక్పాలురునై శక్తి భేదములచే జగత్తును బ్రోచెదవు. సూర్యకిరణ రూపుడవై నీవే విశ్వమును సృజింతువు. ఈ ప్రపంచము నీ గుణవికారము. సత్ అను అక్షరమును నీకు వాచకముఅయిన రూపమునకు సదసదాత్మకునకు జ్ఞానరూపునకు ప్రణతుడను అయ్యెదను. “ఓం నమో వాసు దేవాయ” ఇత్యాది శ్లోకము మంత్ర రూపము. వాసుదేవ - సంకర్షణ - ప్రద్యుమ్నా నిరుద్ధము లనెడి శ్రీమహా విష్ణుని వ్యూహ చతుష్టయమును ఈ మంత్రమున పేర్కొనబడినవి. ఆమంత్రముచే అక్రూరుడు ఆహరికి నమస్కరించెను.

అక్రూరకృత కృష్ణ సమర్చనము

శ్రీపరాశరులిట్లనిరి: అయ్యాదవుడు-అక్రూరుడు-యమునానదినీటిలో విష్ణుని వినుతిచేసి, ధ్యానావాహన ధూపదీప నైవేద్యాదులు అను షోడశోపచారములచే మానసిక పూజ కావించెను. ఇతర విషయములనుండి మరలించి శ్రీకృష్ణ పరబ్రహ్మమందు మనసు చిరకాలము నిలిపి క్రమముగ సమాధినుండి వ్యుత్థానమందెను. ఆ బుద్ధిశాలి తాను ధన్యుడను అయితినని భావించి యమునా జలముల నుండి వెడలి తిరిగి రథము దఱికి వచ్చెను. ముందటివలె రథములందున్న బలరామకృష్ణులను దర్శించి విస్మితనయను డయ్యెను. శ్రీకృష్ణుడు అతనిని చూచి “అక్రూర! యమునాతీర్థమండేదో వింతకనినట్లున్నావు. ఇది నిజము. నీతనువు ఆశ్చర్యముచే వికాసమొంది కనిపించుచున్నది.” అనగా అక్రూరుడు “స్వామి! అచట నిండునీటిలో ఏమి వింతను నేనుచూచితినో అది రూపుగట్టి ఇచ్చట కనపడుచున్నది. కృష్ణా! ఈ విశ్వము ఏమహాత్ముని స్వరూపమో అట్టి పరబ్రహ్మమగునిన్ను నేనిపుడు కలుసుకొన్నాను. ఆ సంగతి కేమిగాని మనముసత్వరము మధురకు పోవలెను. నేను ఆ కంసునికి భయపడుచున్నాను. పరపిండోపజీవుల బ్రతుకు పరమతుచ్ఛము” అని చెప్పి వాయువేగములైన రథాశ్వములను తోలి, ప్రొద్దుగుంకుసరికి అతడు మధురకు చేరెను. బలరామ కృష్ణులనుగని “మీరు పాదచారులై రెండు, నేను ఒంటరిగ ఈ రథమున నగరమున ప్రవేశింతును. వసుదేవుని గృహమునకు పోవలదు. కంసుడు మీ నిమిత్తముగ ఆ వృద్ధుని గెంటివేయగలడు” అని పలికి అతడు మధురలో ప్రవేశించెను.

బలరామకృష్ణులు రాజవీధికి ఏతెంచిరి. స్త్రీ పురుషులు ఆనందమున కనులార వారిని కాంచిరి. మదపుటేనుగు గున్నలట్లు ఒయ్యారముగ నడచుచు, అట్టట్లు పరిభ్రమించుచు రంగాలంకరణముచేయు ఒక్క చాకలినిగనివారు వాడుచేయుచున్న చక్కని రాజోచిత వస్త్రములను మాకిమ్మని అడిగిరి. కంసరాజు దివాణపు చాకలి అగుటచే గర్వ పడినవాడై. వారిని ఆక్షేపించుచు ఎకసక్కము లాడుచు బిగ్గరగా అరచెను. కృష్ణుడు రోషము గొని అరచేతను కొట్టి వానితల నేలపడవేసెను.

అవ్వల, నీలపీతాంబరధారులు ఆఅన్న తమ్ములిద్దరు ఆ వస్త్రములను ధరించి, మరియును ఆ రాచబాట మాలాకారుని ఇంటికి జనిరి: అతడా ముద్దుకుమారుల గాంచి కనుగవ విప్పార చూచి మిక్కిలి వింతపడి,! వీరెవ్వరి వారిటకు వచ్చిరని ఆలోచించెను.

ఆ నలుపు తెలుపు వలువలం దాల్చి ముచ్చట గొల్పు అసుకుమార కుమారులను చూచి అవనికి దిగివచ్చిన దేవతలేమోఅని వాడు తలచెను. వారును మోము తామరలు వికసింప ఈ పువ్వులు తమకిమ్మని అడిగిరి. అతడు వారిదరివ్రాలి పుడమిని చేతులను ఆనించి శిరస్సును ధరణిదాక వంచి పరమ ప్రసన్నమూర్తులు, నాపాలి ప్రభువులు నా ఇంటికి దయచేసినారు. ధన్యుడను. ఇదె అర్చించెదనని హృష్టముఖుడై ఇంతకంటె ఇవి మంచివి! ఇవి గైకొనుండని వారిని మురిపించి ఊరించుచు, వారు మనసుపడిన చక్కని పూవులను కాన్క పెట్టెను. మఱిమరల మరల అయ్యిద్దరకుం ప్రణమిల్లి ఆ మాలాకారుడు ఆ పురుషోత్తములకు సువాసనలుమించు మంచి పూలెంచి ఇచ్చెను. అంతట హరి వానియెడ ప్రసన్నుడై, ఎప్పుడు నాతోనుండు మహాలక్ష్మి నిన్నెపుడును పాయకుండుగాక. మంచి వాడవు. బలహాని, ధనహాని, నీకు కలుగదు. నీ సంతతివారు పూర్ణాయుష్మంతులు అగుదురు. ఇహమున మహాభోగములను అనుభవించి నా అనుగ్రహమున నా అను స్మరణమునొంది దివ్యలోకమును పొందుదువు. ఓ భద్రుడా! నీ మనసు ఎల్లప్పుడు ధర్మము నందు నిలుచును. నీ సంతతి కలకాలము సుఖముండును. సూర్యుడు ఉన్నంత కాలము, నీ సంతానమునకు ఎట్టి ఉపద్రవములును కలుగవు అని ఆ మాలాకారుని కరుణించి బలదేవునితో కలసి వాని పూజలు అందుకొని వాని ఇల్లు వెడలెను.

కుబ్జానుగ్రహము - కంస సంహారము

శ్రీ పరాశరుడిట్లనియె:

శ్రీకృష్ణుడు సుగంధపాత్ర పూనివచ్చుచున్న నవయౌవనవతి అగు కుబ్జను ఒకామెను చూచెను. ఓ కువలయాక్షీ! ఈ కలపము ఎవ్వని కొఱకు కొనిపోవుచున్నావు? నిజము చెప్పుము అని కృష్ణుడు సొంపుగ పలుకరించెను. సాభిలాషుడై అడిగినట్లడుగబడి ఆమె ఆ దర్శనమునకు వివశయై, అనురక్తయై, హరితో ఇంపుగ ఇట్లనియె: కాంత! నేను కంసుని దాసినని ఏలయెఱుగవు? అనేకవక్ర అని ప్రసిద్ధిగన్న దానను. కంస ప్రభువునకు కలపములు కూర్చుట నాపని. ఇంకొకరు తీసిన అనులేపము కంసునికి ఇష్టము కాదు. నేను ఆతని పరమానుగ్రహ పాత్రురాలైన దానను. అని చెప్పగా విని శ్రీకృష్ణుడు ఇట్లు అనెను.

సుందరముఖీ! రాజోపభోగయోగ్యమైన ఈగంధము మా శరీరములకు అనువైనది మాకిమ్మన విని కుబ్జ సాదరముగ ఇదే కైకొనుడని ఆఉభయుల మైపూతకు ఆఅనులేపమును ఒసంగెను. ఆ పురుషోత్తములది రంగు రంగుల పత్రభంగాది రచనగా పూసికొని ఇంద్రధనువుతోడి తెలుపునలుపు మేఘములట్లు విలసిల్లిరి. అవ్వల శౌరి ఉల్లాఘన విధానము (పైకెత్తి సరిచేయుట) చక్కగ నెఱిగిన ప్రోడకావున ఆమె గడ్డమును తర్జనీ మధ్య మాంగుళులతో గూడిన హస్తాగ్రముతో ఎత్తి చలింపజేసెను. తన అడుగుల దాని అడుగులు పైకి తొక్కిపట్టి వంకరలు సరిచేసెను. ఆమె వంకలుదీరి చక్కని వారికెల్ల చక్కనిది అయ్యెను. సవిలాస సుందరముగ ఆ సుందరి నిండు ప్రేమ తొణక అల్లన గోవిందుని కట్టుపుట్టము పట్టుకొని మాయింటికి రమ్మనెను. హరి విని బలరాము మోముగని నవ్వి, అనింద్యయగు ఆ కుబ్జనుగని మీ యింటికి వచ్చెదనని నవ్వుచు పలికి దానినివదలి రాముని మోముంగని పకపక నవ్వెను. గంధముచే చేసికొన్న పత్రరచన ఇంచుకయు సడలకుండ నీల పీతాంబరముల అలంకృతులై ఇద్దరు రంగురంగు పూలమాలలు ధరించి ధనుశ్శాలకు నడచిరి.

అటనున్న ధనుశ్రేష్ఠమునుగూర్చి యాగ సమాప్తిఅగునంతదాక తద్రక్షకులను అడిగి తెలిసికొని, తటాలున కృష్ణుడు దానిని గైకొని ఎక్కిడెను. ఎక్కిడినదే తడవుగ అది విఱుగ, మధుర ఎల్లనిండి పెనుసందడి అయ్యెను. ఆపైని ధనూరక్షకులచే ఎదిరింపబడి ఇద్దరు ఆ సైన్యమును కూల్చి ధనుశ్శాలనుండి వెలువడిరి. అక్రూరుడు ఏతెంచిన వార్తను, ధనుర్భంగ వార్తను, విని కంసుడు చాణూర ముష్టికులతో ఇట్లనియె:

“గోపాలబాలురిద్దరు వచ్చిరి, నా యెదుట మీరు వారలతో మల్ల యుద్ధము చేసి నా ప్రాణాంతకులైన వారిని తుదముట్టింపుడు. బాహుయుద్ధమున మీరు వారిని కూల్చిన నేను సంతోషించి మీరు కోరినవెల్ల ఇచ్చెదను. నాశత్రువులగు వారిని ఇద్దఱను న్యాయమున నేని, అన్యాయముగానేని మీరు చంపవలయును అందువలన నారాజ్యము మీకును నాకును సామాన్యమైన సొత్తగును” అని ఆదేశించి ఆపైని మావటీని పిలిచి సభా ద్వారము నందు కువలయా పీడమను ఏనుగును పెట్టి ఆగోపబాలకుల బాహు యుద్ధమునకు రంగ ద్వారమునకు వచ్చినతఱి చావత్రొక్కింపుమని ఆనతిచ్చి ప్రేక్షకులు కూర్చుండుటకై మంచెలెల్ల సిద్ధమగుట పర్యవేక్షించి, చావు దాపురించిన కంసుడు సూర్యోదయమునకై ఎదురు చూచెను.

అవ్వల మంచెలన్నిటను నగర జనము, రాచమంచెలపై భృత్యులతో నరాధిపులు అధిష్ఠింప, మల్లుర పరీక్షకులయొక్క వర్గమును రంగమధ్య సమీపమున కంసుడు నిలిపెను. కంసుడన్నిటికంటెఎత్తైన మంచపై కూర్చుండెను. అంతఃపురము వారు కూర్చుండుటకు మఱికొన్ని మంచెలు ఏర్పరుపబడెను. వారాంగనలు, నాగర స్త్రీలు, ఆసీనులు అగుటకు మఱిప్రక్క మంచెలు లేర్పరుపబడెను. నందగోపాదులు వేఱుమంచములందు ఉండిరి. అక్రూర వసుదేవులు మంచములకుదగ్గర అసీనులైరి. పుత్రునియెడ ఉబలాటమున తుది సమయమందైన కొడుకు మొగము చూతునని దేవకి నాగర స్త్రీల నడుమ కూర్చుండెను. అంతట తూర్యములు మ్రోగినవి. చాణూరుడు రంగస్థలమున గంతులు వేయుచుండ ముష్టికుడు జబ్బలును తొడలును చఱచుచుండ బలభద్ర జనార్దనులు అల్లన నవ్వుచు గోపాల బాలుర వేషమున రంగద్వారమునకు వచ్చిరి.

అపుడు కువలయాపీడము మావటీనిచే ప్రేరితమై గోపకుమారులను చంపుటకు మిక్కిలి వేగముగ పరుగెత్తెను. రంగమందుఅయ్యెడ హాహాకారము పెల్లెగసె. బలభద్రుడు తమ్మునిగని శత్రువులు ఉసికొల్పిన ఈ నాగమును కడతేర్చవలెనన మాధవుడు సింహగర్జనము చేసి తనచేత దాని తుండమాకర్షించి కేశిసంహారకుడగు హరి, ఐరావతమును పోలిన దానిని నింగినట్టిట్టులు ఊచెను. తాను సర్వజగదీశుడయ్యు బాల లీలానుసారము చాలసేపు క్రీడించి కుడిచేత దాని యెడమ దంతము ఊడబెరికి మావటీని గొట్టెను. బలరాముడు కుడి దంతమును పెరికి రోషముతో ప్రక్కనున్న గజపాలురను కూల్చెను. ఆపై వేగముగమీదికి ఎగిరి రౌహిణేయుడి ఎడమ పాదమున ఏనుగు మస్తకమును అదిమెను. అవలీలగ హలికూల్పగ, సహస్రాక్షుడు వజ్రమున అణచిన పర్వతమట్లు ఏనుగు పడిపోయెను. ఇట్లా కువలయాపీడమును చంపి దాని మదము, రక్తము ఒడలెల్ల పూతవడ నా గజదంతములు ఆయుధములుగాగొని లేళ్లనడుమ సింహములట్లు గర్వలీలలను చూపుచు బలభద్రజనార్దనులు మహారంగము ప్రవేశించిరి.

అయ్యెడ ఈతడు కృష్ణుడు, ఇదుగో బలరాముడని లోకము ఆశ్చర్యము పొందెను. ఆ రంగస్థలమున పెద్ద హాహాకారము చెలరేగెను. బాలఘాతనను చంపిన వాడితడు. బండిని తల క్రిందులు చేసినవాడు యమలార్జునములును మద్దిచెట్లను గూల్చిన వాడితడే. కాళీయ సర్పదమనము చేసిన బాలుడు, ఏడు రోజులు గోవర్ధన గిరి ఎత్తిన పట్టిన ప్రోడ ఇతడే. అరిష్టుడు, ధేనుకుడు, కేశిఅను దుష్టులను అవలీలగ చంపిన మహానుభావుడు అచ్యుతుడు ఇడుగో! ఈతని ముందున్న ఈయన అన్న బలభద్రుడు ఈతడు సుందరీ నయనానందమూర్తి సవిలాసముగ ఇదె వచ్చుచున్నాడు. పురాణజ్ఞులు, ప్రాజ్ఞులు అగు పౌరులు ఈతడు గోపాలమూర్తియై యాదవ వంశమును ఉద్ధరించనున్న విష్ణువుయొక్క అంశావతారమూర్తి. భూభారము హరింప వచ్చినాడు అని రాముని కృష్ణుని వర్ణింప దేవకి వాత్సల్యమున పాలు చేపువచ్చి హృదయము తాపభరితమయ్యెను. పుత్ర ముఖ దర్శనముచే పెద్ద ఉత్సవ మట్లైన వసుదేవుడు ఆగంతుకమైన ముదిమింబాసి యువకుని వలె అయ్యెను.

మధురానగరాంగనలు కనుగవ చక్కవిచ్చి, కృష్ణుని నిర్విరామముగ తిలకింప జొచ్చిరి. సఖులారా! ఎరుపారిన కన్నులతో, గజయుద్ధ నిమిత్తమైన అలసటచే చెమట బిందువులచే నిండి, మంచు బిందువులగుటకు, శరత్కాలమందలి వికసించిన కమలమును కృష్ణుని మోము తిరస్కరించుచున్నది. చూడుడు. కన్నులజన్మను సఫలమొనరించు కొనుడు. భామినీ! శ్రీవత్సాంకితము లక్ష్మి, మొదలగు గొప్పవానికి ఆశ్రయము, శత్రుదమనమునైన ఈ బాలుని వక్షమును బాహుయుగ్మమును తిలకింపుము! అప్పుడు ఆ పితికిన పాలవలె చంద్రునివలె తామరతూండ్లవలె తెల్లనై నీలాంబధారియై ఇటువచ్చిన బలభద్రుని జూడవటెచెలీ! గంతులిడు ముష్టికునితో చాణూరునితో క్రీడించు బలరామకృష్ణుల పరియా చకము కనుగొనవె! సఖులార! కనుగొనుడిదె చాణూరునితో బాహుయుద్ధమునకు పైకొనుచున్నాడు. సుకుమారమూర్తి కృష్ణుడు. అక్కడ న్యాయముసేయు పెద్దలే లేరటె! ఇప్పుడిప్పుడ అంకురించు నెలప్రాయమువాడు, సుకుమారుడు, నందకుమారుడు ఎక్కడ! వజ్రమట్లు గడిదేరిన కర్కశ శరీరమువాడీ మహారాక్షసుడెక్కడ! ఈ ఇద్దరు మిగుల సొగసు గుల్కు మేనుల నవయౌవనులై ఉన్నారు. దైతేయ మల్లులు చాణూరాదులో అతి దారుణులు. ఈ మల్లయుద్ధ పరీక్షకులు బాలురకు బలియురకును యుద్ధము సంఘటించిరి. ఇది గొప్ప తప్పిదము. మధ్యస్థులు దీనిని చూచి ఊరకొనుట మహాదారుణము అని ఇట్లు నగరాం గనలు అనుకొనుచుండ, భగవంతుడు హరి కచ్చబిగించి భూమి చలింప ఆజనములో రంగమునందు ఇట్టిట్టు గంతులిడెను. బలరాముడును జబ్బలు సరచి చక్కగ గంతులు వేసెను. అడుగడుగున భూమి బీటలు వారకుండుటఅది అద్భుతము. అంతట కృష్ణుడు చాణూరునితో తలపడెను. మల్లయుద్ధ కుశలుడు ముష్టిక రాక్షసుడు బలభద్రునితో పోరెను.

సన్నిపాతము, అవధూతము, ప్రక్షేపణము, కీలకవజ్రనిపాతనము, పాదోద్ధూతము ప్రసృష్టము మొదలయిన మల్లయుద్ధ శాస్త్ర ప్రసిద్ధములైన బాహుయుద్ధగతి విశేషములతో ఒండొరులు గ్రుద్దుకొనుటతో వారికి పెద్ద యుద్ధము జరిగెను. వారి ఆయుద్ధము నిరాయుధము. బలిమి కొలది, ఊపిరాడు కొలది, సమాజోత్సవ సన్నిధానమున దారుణము అయ్యెను.

చాణూరుడెంతెంత దనుక హరితో పోరెనో అంతంతకించించుకగా పరమ ప్రాణహానిని పొందెను. దిగులుపడి కోపముచే తనసిగనున్న పూలదండను కదలించునంత మాత్రముగ చేయజాలినవానితో కృష్ణుడు విలాసముగనే (లీలామాత్రముగనే) పోరెను. చాణూరుని బలక్షయమును శ్రీకృష్ణుని అభివృద్ధిని గాంచి కోప నిమగ్నుడై కంసుడు ఆ వైపు మృదంగాది వాద్యములు వాయింపవలదని ఆపినంతలో ఆకసమున దేవదుందుభలు అనేకములు మ్రోగెను. గోవిందా! జయింపుము కేశవా! చాణూరుని వధింపుము అని అంతర్ధాన గతులైన దేవతలు మిక్కిలి హర్షించుచు పలికిరి. చాణూరునితో చిరకాలము హరి పోరి వానిని కడతేర్ప పూని బై కెత్తి అట్టిట్టు లూచెను. అట్లు నూరు మారులు యూచి యూచి ఆ రాక్షసమల్లుని ఆకసమునందే జీవితము పోయిన వానిని, నేలపైన వేసి కొట్టెను. దానిచే వాడు నూరుతునుకలై రక్తము గ్రక్కి నేలను పెనురోంపిని కావించెను.

బలరాముడును అయ్యెడ ముష్టికునితో తలపడి మల్లుడగు చాణూరునితో కృష్ణుడు పోరినట్లే పోరెను. అతడును వీని నడినెత్తిని పిడికిట అణచి, మోకాలిచే రొమ్మున క్రుమ్మి భూతలమున పడద్రొబ్బి ప్రాణములుపోవ కాలఱచెను. కృష్ణుడు అవ్వల తోసలకుడుఅను మల్లరాజుని బలియుని, యెడమ పిడికిట గ్రుద్ది అవనిపై పడవేసెను. చాణూరుడు ముష్టికుడును, కూల్చబడుటచే తోసలకుడు చంపబడగా, ఎల్లమల్లురు పారిపోయిరి. అవ్వల కృష్ణ సంకర్షణులు తమ ఈడువారి గోపాలుర బలిమిమైలాగి ఇద్దరూ ఆనందభరితులై ఆ ఆ మల్లరంగమున ఇట్టట్టు దుముక ఆరంభించిరి. కంసుడును కోపమున కన్నులెరుపార తన భటులను పెద్ద గుంపుగ ఉన్న వాండ్రనుగని ఈ గోపకులను ఈ సమాజము నుండి బలిమిమై గెంటుడని పెద్దగాకేకవేసెను. మహాపాపి నందునిఁగూడ సంకెళులువేసి పట్టుడు. వృద్ధులకు ఉచితముగాని దండనమున వసుదేవుని గూడ కడతేర్పుడు అనెను. కృష్ణునితో గూడ గంతులు వేయు ఈ గోపకుల గోవులను, వీరికడనున్న ధనమును లాగికొనుడనెను.

ఇట్లు ఆనతి ఇచ్చుచున్న కంసుని, హరి గేలిసేసి ఎగిరి, మంచమెక్కి వాని పట్టుకొనెను. జుట్టుపట్టిలాగి, కిరీటముఅవనిపై పడుచుండ పుడమిపై పడవేసి తాను వానిపై పడెను. అశేష జగదాధార గురువైన (బరువైన) హరిపైబడ ఉగ్రసేనుని కొడుకు అప్పుడు ప్రాణములు విడిచెను. చచ్చినవాని జుట్టుపట్టుకొని ఆ రంగమధ్యమున మధువైరి బరబర ఈడ్చెను.

పెద్దబరువున పడిన కంసుని శరీరమును ఈడ్చునెడ కృష్ణుని చేతనున్న ఇనుప గుదియ పెద్ద జల ప్రవాహము యొక్క వేగమును వహించెను. కృష్ణుడు కంసుని కూల్చినంత వాని తమ్ముడు సునాముడు ఎత్తిరాగ, వానిని బలరాముడు విలాస మాత్రముగా కూల్చెను. కృష్ణుడు మధురాధిపతియగు కంసుని తిరస్కార భావముతో చంపుటచూచి, ఆరంగ మండపము నందు హాహాకారములు ఎగసెను. కృష్ణుడు వసుదేవుని యొక్కయు దేవకి యొక్కయు పాదములను బలరామునితో కూడ ఏగి పట్టుకొనెను. దేవకీ వసుదేవులు ఆతనిని లేవనెత్తి పుట్టినవేళ హరిచెప్పిన మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని, వారే స్వామికి ప్రణతులై నిలువబడిరి. అయ్యెడ వసుదేవుడు ఇట్లనియె.

“ప్రభూ! బాధలచేకుములు దేవతలకు నీ దయచేసిన వరము మాపై అనుగ్రహముచే సఫలము చేయబడినది. భగవంతుని నిన్నారాధించి ఉంటిని. దాన నా ఇంట నీవుఅవతరించితివి. దుష్ట సంహారమునకే ఈ యవతారము. దాన మావంశము పవిత్రమైనది. భూతముల యందుఅతర్యామివై ఆ భూతములెల్ల నీవేయై ఉన్నావు. నీచేతనే భూత భవిష్యత్తులు ప్రవర్తించును. యజ్ఞములచే నీవు యజింపబడుదువు. అచింత్యుడవు. సర్వదేవమయుడవు నీవు. నీవే యజ్ఞము, యజించువాడును, యజ్వలకు పరమేశ్వరుడవు. సర్వ జగత్ప్రభవ కారణము నీవు. నాకును దేవకికిని నీయెడల మనస్సులో మా పుత్రుడవను ప్రీతిచే కలుగు భావము కృత్రిమము. విడంబన మాత్రము. నీవు సర్వభూతకర్తవు. నీకుఆదిలేదు అంతములేదు. అట్టి నిన్నొక మానవమాత్రునిగా నాపుత్రుడని ఈమె పిలుచుచున్నది. ఈ సర్వముఎవ్వని వలనపుట్టినది? అట్టివాడు మాయకాక మా వలన పుట్టుట ఎట్లు సంభవము? చరాచర ప్రపంచము ఎవ్వనియందు ఉన్నదో అట్టివాడు మాతృ గర్భమందు, ఒడిలోను శయనించి మనుష్యుడై జన్మించుటెట్టు? పరమేశ్వర! ప్రసన్నుడవు అగుము. అంశావతార సాధన సంపదచే నీవీ విశ్వమును ప్రోవుము. నీవు నాకు కొడుకవు కావు. బ్రహ్మాదిస్తంభ పర్యంత మీజగము నీనుండి పొడమినది. పురుషోత్తమా! మమ్మేల మోహింప చేసెదవు? మాయకప్పిన చూపుచే, నాబిడ్డవని కంసుని వలన జడిసితిని. ఏ జడుపు లేని నిన్ను గోకులమునకు కొనిపోయితిని. అచట పెరిగితివి. నాకేలాటి మమకారములేదు. నీ లీలలు రుద్రమరుదశ్విశతమఖాదులకేని సాధ్యములు గావు. అట్టివానిని చూచితిమి. నీవు విష్ణువవు. జగదుపకారముచేయ ఇట్లు వచ్చితివి. నా విమోహము పోయినది. (V-20)

భగవల్లీలా ప్రదర్శనము

భగవల్లీ లాదర్శనముచేసి తత్త్వజ్ఞానము పొందిన దేవకీ వసుదేవులనుచూచి హరి, యదుజనమును మోహపెట్టుటకు వైష్ణవ మాయను విస్తరింపచేసెను. అమ్మా! అయ్యా! కంసుని భయముచే ఎంతో కాలమునుండి అపేక్షతో ఉన్న నేను బలభద్రుడును మిమ్ము ఈనాటికి చూడగలితిమి. తల్లిదండ్రులను పూజింపని కాలము ఆయుర్దాయములో వ్యర్థమైన కాలము. దురదృష్టవంతులగు వారి జీవితములోనే ఉండును. గురుదేవద్విజులను మాతా పితరులను ఆరాధించు జనులకాలమే సఫలమైనదగును. కంసుని పరాక్రమ ప్రతాపములకు పరవశులమై ఇంతకాలము ఈ ధర్మమును తప్పిన మమ్మిద్దరను తండ్రీ! క్షమింపుము. అని పలికి ఆ తలిదండ్రులకు ప్రణామములు చేసి యదువృద్ధులనుకూడ వరుసగా యథావిధి పూజించి, వారిద్దరు పౌరజనమును గౌరవించిరి.

అత్తఱి కంసుని భార్యలు, తల్లులును పుడమి బడియున్న కంసుని చుట్టునుచేరి దుఃఖశోక నిమగ్నులై ఏడ్చిరి. అత్తటి పశ్చాత్తాపవివశుడై, హరి తానుకంట నీరు గ్రుక్కికొనుచు బహువిధముల అస్వస్థలైన వారిని ఓదార్చెను. అవ్వల హరి ఉగ్రసేనుని బంధముక్తుని చేసెను. కొడుకును కోల్పోయిన అతనిని స్వీయ రాజ్యమందు అభిషిక్తుని కావించెను. అతడట్లు అభిషిక్తుడై, కొడుకునకును మఱియు అప్పుడు కూలిన వారికిని ప్రీత కార్యములు కావించెను. అదంతయు అయిన తర్వాత, హరి ఆయననుచూచి ఆజ్ఞ దయచేయము శంకింపవలదు. యయాతి ఇచ్చిన శాపముచే నీ యాదవ వంశము రాజ్యార్హము కానిదై ఉన్నను, నేను భృత్యుడనై చరింప నీవు దేవతలను గూడ శాసింపుము. రాజుల లెక్కేమి? అనిపలికి, మధువైరి వాయు భగవానునిని దలచి కొనినంత ఆ క్షణము వాయువు అచ్చటకురాగా కార్యనిమిత్తముగ మానుష మూర్తియైన కేశవుడు; ఓసమీరా! నీవు ఇంద్రుని దరికేగి ఇంద్రా! నీ గర్వము చాలింపుము నీవు ఉగ్రసేనునికి సుధర్మసభను ఇచ్చివేయుము. కృష్ణుడు చెప్పుచున్నాడు. ఈసభ అత్యుత్తమమయినది రాజార్హమైనది. యదువంశ్యులు దీనిని అధిష్ఠించుట యుక్తము. అని చెప్పుమని అన, విని వాయువేగి శచీపతికిది ఎల్ల విన్నవింప అతడును ఆ సుధర్మ సభను వాయువునకు ఈయ, ఆతడు ఆ దివ్య సభను కొనివచ్చెను. సర్వరత్నసదనమైన ఆసభను గోవిందుని బాహురక్షణ మంది యాదవులు అనుభవించిరి.

బలరామకృష్ణులు సర్వవిజ్ఞాన వేత్తలు. సర్వజ్ఞులు ఐనను గురుశిష్య భావమిట్లు ఉండవలెనని లోకమున వెల్లడింపగోరి, కాశీలో జన్మించి అవంతీ నగరమునందు వసించుచున్న సాందీపని సన్నిధానమునకు ఆఇద్దరు ఉపనయనములు అయిన తరువాత ఏగిరి. తొలుత వేదాధ్యయనమునెడ ప్రీతిగొనిరి. ధనుర్వేదమును సరహస్యముగ చదివిరి. అరువది నాల్గురోజులలో సర్వవిద్యా గ్రహణము కావించిరి. అదిచూడ అత్యద్భుతము అయ్యెను. ఇతరులకు అసంభవమైనపని అనుకొని వారి ఈ అమానుష చర్యనుచూచి సాందీపని గురువులు చంద్ర సూర్యులు ఇట్లు వచ్చినారని అనుకొనెను. సాంగముగ నాల్గు వేదములను, సర్వశాస్త్రములను, అస్త్రగ్రామము అంతయును ఉపదేశ మాత్రమున అన్నదమ్ములు గ్రహించి గురుదక్షిణ ఏమి సమర్పించు కొందుమని ఆచార్యుని అడిగిరి. ఆమహాబుద్ధిశాలి వారి అతీంద్రియ కర్మ వైభవమును గ్రహించినవాడై, లవణోదధియందు ప్రభాసక్షేత్రమున పోయిన కొడుకును తెచ్చి ఇండని కోరెను. ఆ ఇద్దరు అస్త్రములు పట్టినంత సముద్రుడు అర్ఘ్యమును గైకొని, సాందీపని పుత్రుని నేను అపహరింప లేదు. పంచజనుడను దైత్యుడు శంఖరూపము దాల్చి ఆ బాలకులను పట్టుకొని నా ఉదకములందు ఉన్నాడు. అని చెప్ప గావిని కృష్ణుడు సాగర జలములందు చొచ్చి ఆ పంచజనుని చంపి వాని ఎముకల నుంచి పుట్టి శంఖమును గైకొనెను. దాని నాదము చేత దైత్యులకు తేజోహానియు, దేవతలకు తేజోవృద్ధియు, అధర్మక్షయము అయ్యెను. ఆ పాంచజన్యముబట్టి యొత్తి శ్రీహరి యమపురికి బలభద్రునితో ఏగి సూర్యపుత్రిని, యముని గెలిచి యాతనలలో ఉన్న ఆగురు బాలకుని ఎప్పటి శరీరముతో ఉన్న వానినిగా గొనివచ్చి తండ్రియైన తమ గురువునకు ఆ ఇద్దరు సమర్పించి, ఉగ్రసేన పరిపాలనలో ఉన్న మధురకు దయచేసిరి. పౌర స్త్రీ పురుష వర్గము ఆనంద భరిత మగుచుండ బలరామ కృష్ణులు తిరిగి విచ్చేసిరి.

జరాసంధ పరాజయము

కంసుడు జరాసంధుని కూతుండ్రను అస్తి, ప్రాస్తి అనువారిని పెండ్లాడెను. వారిద్దరి భర్తయగు కంసుని హరి చంపెనని మగధాధిపతి జరాసంధుడు పగగొని వానిని చంపదలచి ఇరువది మూడు అక్షౌహిణుల సేనతో దండెత్తివచ్చి మధురను ముట్టడించెను. బలరామ జనార్దనులు అల్ప పరివారముతో పురమువెడలి వానితో పోరిరి. అటుపై రామకృష్ణులు తమ తొలుతటి ఆయుధములగైకొని యుద్ధము చేయవలయునని తోచినయంత వారికి శార్ఙ్గము అను ధనువు అక్షయ బాణములుగల అంబులపొదులు రెండు, కౌమోదకి అను గదయు ఆకాశమందునుండి వచ్చినవి. బలరామునికి అభిమతమైన నాగలియు రోకలియు గగనము నుండివచ్చెను. అయ్యిరువురకు అవి అభిమతములును ఆనందకరములు అయ్యెను. వానినిగొని మగధపతిని వారా యుద్ధమున పరాజితుని గావించి పురప్రవేశ మొనరించిరి. ఆ దుష్టుడు ఓడిపోయి ప్రాణములతో పోగా కృష్ణుడది వానిని గెలిచినట్లు కాదనుకొనెను. వాడును సైన్యములు కూర్చుకొని తిరిగివచ్చిపోరి, ఓడిపోయి మరల పారిపోయెను. ఆ దుర్మార్గుడు ఇట్లు పదునెనిమిది మారులు దండెత్తి యుద్ధముచేసి పారిపోయెను. యాదవులు అల్ప సైన్యముతో బహుసైన్య పరివారులను ఇట్లు పలు పర్యాయములు ఓడించిరి. అదంతయు విష్ణువంశమైన కృష్ణునియొక్క సన్నిధానప్రభావమే. శత్రువులందు అనేక అస్త్రముల ప్రయోగించుట అనునది మానుషావతారియైన జగత్ ప్రభువునకు విలాసము. సృష్టిని జగత్సంహారమును కావించు ఆ చక్రాయుధునకు శత్రునాశన ఉద్యమము ఏపాటిది? అయినను అవతార మెత్తినందున ఆ నరకేసరి నరధర్మమును అనుసరించియే బలవంతులతో సంధిని, బలహీనులతో యుద్ధము, సామము, ఉపప్రదానము (దానము), భేదము అనునవి ప్రదర్శించుచు, తుదకు దండపాతమును చేయును. ఒక్కొక్క యెడ పారిపోవుటయు గలదు. ఈ రీతిగా మనుష్య చేష్టను అనుసరించును. ఇది అంతయు జగత్పతియొక్క స్వేచ్ఛాను సారమైన ఒక లీలయే.

తత్కృత కృష్ణ స్తుతి

శ్రీ పరాశరులు ఇట్లు అనిరి: సభలో యాదవులు అందరి ముందు గార్గ్యుడను బ్రాహ్మణుని, అతని బావమరది (సంతానము లేకుండుటచే) ఇతడు నపుంసకుడని గేలి చేసిరి. యాదవులు నవ్విరి. దాన కోపించి ఆతడు దక్షిణాపథమునకు వచ్చి, యాదవ చక్రమునకెల్ల భయంకరుడగు కొడుకు కావలయునని తపముచేసెను. అందులకు అతడు ఇనుపపొడిని తినుచు, శంకరునిగూర్చి చేసిన తపస్సునకు సంతుష్టుడై హరుఁడు పండ్రెండేండ్ల తపస్సు ఫలముగా వరమొసగెను. ఆ గార్యుని యవనరాజు సంతానహీనుడై సేవించెను. గార్గ్యుడు ఆయవనుని భార్యతో సంగమించి నంతట తుమ్మెద వంటి శిశువు గల్గెను. వాడే కాలయవనుడు. వజ్రమువలె కఠినమైన ఱొమ్ముగల వానిని రాజుకావించి, యవనరాజు వనమునకుపోయెను. ఆకాలయవనుడు వీర్యమదోన్మత్తుడై, నారదుని ఈనాడు భూమిపై బలవంతులుఅగు రాజులెవరని అడుగ ఆనారదుడు యాదవులని తెలిపెను. వాడుకోట్లకొలది మ్లేచ్ఛులను కూడగట్టుకొని, చతురంగ బలములతో తరలి నడుమ నడుమ అలసిన వాహనముల విడుచుచు విడుదులు చేయుచు, యాదవులను సంహరించుటకు మథురాపురికి దండయాత్ర వెడలెను, కృష్ణుడును యవనీశునిచే యాదవబలము క్షీణించి మాగధునికి లొంగునని అనుకొనెను. మాగధుని బలము అల్పము. ఆ కాల యవనుడు ప్రబలుడు. కావున వానితో గలిసి మాగధుడు యుద్ధము చేయవలయును. ఆహా! దైవమాయ! యాదవులకు ఇప్పుడు రెండువిధాల విపత్తువచ్చిపడినది అని గోవిందుడెంచి యాదవులకు దుర్గ నిర్మాణార్థమై సముద్రుని అడిగి పండ్రెండు యోజనముల చోటిమ్మని ప్రార్ధించి అట ‘ద్వారక’ అను పురమునునిర్మించెను. అట స్త్రీలు కూడ సురక్షితులై యుద్ధము చేయవచ్చును. పురుషుల సంగతి చెప్పనేల? అది మహోద్యానములతో చెఱువులతో మేడల మిద్దెలతో ప్రాసాదములతో కూడి ఇంద్ర రాజధానియగు అమరావతిని పోలియుండెను. మథురావాసులను అచ్చటకు రావించి హరి తాను అందు వసించెను.

కాలయవనుడు సైన్యమును రాజధాని వెలుపల నిలుపజూచి, కృష్ణుడు తానొక్కడ నిరాయుధుడై చనినంతట, యవనుడు బాహుయుద్ధ సమర్థునిగా హరి నెరిగి, మాహా యోగుల చిత్తములు వెంబడించి అందుకొనలేని ఆ స్వామిని వెంబడించెను. అట్లు పరువిడి తరుమ కృష్ణుడు అటనున్న ఒక గుహలో ప్రవేశించెను. అందు ముచుకుందుడు పరుండి ఉండెను. యవనుడును అందుచొచ్చి అందు శయనించిఉన్న ముచుకుందుని జూచి కృష్ణుడనుకొని పాదమున తన్నెను. అతడు మెలకువగని యవనునిని చూచెను.

చూచిన ఆక్షణమే ఆ యవనుడు ఆ క్రోధాగ్నిచే మసిఅయ్యెను. ఆ ముచుకుందుడు దేవాసుర యుద్ధమందు రాక్షసులను బలిగొని గాఢ నిద్రగొని దేవతల వరముగోరి నిద్ర పోయెను. వారును నిన్నెవ్వడు లేపునో, వాడు తన మేనపుట్టిన అగ్నిచే తానే కాలి ముసిఅగుననిరి.

ఇట్లా పాపిని యవనుని దహించి, ఆ ముచుకుందుడు ముకుందుంగని నీవెవ్వడవు అనన నేను చంద్రవంశమున యాదవుల వంశమున పుట్టిన వసుదేవుని తనయుడను అని చెప్పగా, ముచుకుందుడు వృద్ధగార్గ్యుడు అన్నమాట జ్ఞప్తికి తెచ్చికొనెను. వెనువెంటనే ప్రణమిల్లి సర్వేశ్వరుని సర్వరూపు హరితో ముచుకుందుడు ఇట్లనియె:

పురాగార్గ్యేణ కథతమిమష్టావింశతి మేయుగే

ద్వాపరాన్తే హరేర్జన్మ యదువంశేభవిష్యతి

సత్వం ప్రాప్తోనసన్దే హో మర్త్యానాముపకార కృత్

తథాహిసుమహత్తే జో నాలం సోఢుమహంతవ తథాహిసజలామ్భోదనాదధీరతరంతవ

వాక్యం నమతిచైవోర్వీ యుష్మత్పాద ప్రపీడితా

దేవాసుర మహాయుద్ధే దైత్యసైన్య మమాభటాః

నసేహుర్మమతేజ స్తేత్వత్తే జోనసహామ్యహమ్

సంసారపతితస్యైకోజన్తోస్త్వంశరణం పరమ్

ప్రసీదత్వం ప్రసన్నార్తి హరనాశయమే అశుభమ్

త్వం పయోనిధయశ్శైలాస్సరితస్త్వంవనానిచ

మేదినీగతనం వాయురాపోగ్ని స్త్వం తథామనః

బుద్ధిరవ్యాకృతం ప్రాణాః ప్రాణేశసస్త్వంత థాపుమాన్

పుంసః పరతరం యచ్చవ్యాప్యజన్మ వికారవత్

శబ్దాదిహీనమజరమమేయం క్షయవర్జితమ్

అవృద్ధినాశంతద్భ్రహ్మత్వ మద్యన్త వివర్జితమ్

త్వత్తోమరాస్సపితరోయక్ష గన్ధర్వకిన్నరాః

సిద్ధాశ్చాప్సరస్త్వత్తోమనుష్యాః పశవః ఖగాః

సరీసృపామృగాస్సర్వేత్వత్తస్సర్వే మహీరుహాః

యచ్చభూతం భవిష్యంచకించిదత్రచరాచరమ్

మూర్తామూర్తంతథా చాపిస్థూలం సూక్ష్మతరం తథా

తత్సర్వంత్వం జగత్కార్తానాస్తికించిత్త్వయా వినా

నీవు సాక్షాద్విష్ణుడవని ఎఱింగితిని. ఇరువది యెనిమిదవ యుగములో అవతారమగునని గార్గ్యుడు మున్ను తెలిపెను. ఆహరివే నీవిట సాక్షాత్కార మైతివి. సందేహము లేదు. మనుష్యులకు ఉపకారముచేయు నీ మహత్తర తేజము. నేనును సైపజాలను. సజల జలదనాద గంభీరమయిన నీ పలుకు, నీ పాదస్పర్శ మాత్రమున అవని క్రుంగుటయును కంటిని.

దేవాసుర మహాసమరమున దైత్యసైన్య మహాభటులు నాతేజము సైపలేరైరి. అట్టి నేనే నీమహాతేజమును ఓర్వలేకున్నాను. సంసారమునపడిన జంతువునకు నీవు ఒక్కడవు దిక్కు ప్రపన్నార్తి హరా! ప్రభో! ప్రసన్నుడవు అగుము. నా అశుభము హరింపుము! సముద్రశైల సరితోవనాదులు భూమ్యాది పంచభూతములు మనస్సు, బుద్ధి, అవ్యాకృత ప్రాణములు, ప్రాణేశ్వరుడవు నీవు. పురుషోత్తముడవు, పురుషతత్త్వమున కంటెను పైది, జన్మాది వికార రహితము, సర్వవ్యాపి, శబ్దాదిరహితము, అజరము, అమేయము, అక్షయము, వృద్ధినాశములు లేనిదియు, ఆద్యన్త హితమును అయిన బ్రహ్మము నీవు. నీ నుండియే దేవ పితృయక్ష గంధర్వాదులు ఆ పిపీలిక బ్రహ్మము చరాచరము భూత భవిష్యమును ఉదయించినది. మూర్తము, అమూర్తము స్థూలము సూక్ష్మము అయిన సర్వ విశ్వము నీవు. నినుమించి ఏ కొంచెమును లేదు.

ఈ సంసార చక్రమున నేనుఅనేక భ్రమణములు చేసి తాపత్రయము వలన కుమిలితిని. విశ్రాంతిని కానను, ఎండమావులను చూచి జలాశచే, జలాశయములని పరుగెత్తినట్లు, దుఃఖములనే సుఖములని ఎంచి పర్వులిడితిని. అవి నాకు తాపమునకే అయినవి. రాజ్యము, నేల, బలము, కోశము, మిత్రపక్షము, కొడుకులు, భార్య, సేవకులు, శబ్దాది విషయములు, సుఖములను బుద్ధితగిలితిని. ఇదియెల్ల పరిణామదశయందు నాకు తాపాత్మకమైనది. దేవా! దేవతలవద్దకు ఏగితిని. అక్కడ దేవగణము కూడ ఆదేవలోకము నావలన సాహాయ్య మర్థించినది. స్వామీ! శాశ్వత నిర్వృతి ఎక్కడ? సర్వ జగత్కారణమగు నిన్ను కొలువక శాశ్వత ఆనంద మెట్లు లభ్యము? నీమాయచే మూఢులై, జన్మ మృత్యుజరాదుల వశులై తాపములు పడి ప్రేతరాజు (యమధర్మరాజు) ను దర్శింతురా? ఆవలతాము ఒనరించిన వనుల పొడమిన అతిదారుణ నరకముల దుఃఖములను నీ కలరూపు ఎఱుంగని నరులు కుడుతురు. నేను అత్యంతము విషయలోలుడనై, నీ మాయచే మోహితుడనై, మమత్వాహంకారములనెడి గుంటలో నిట్టట్టులు పడి పర్వులిడితిని. పరమేశ్వరా! అట్టి నేను అప్రమేయము, పరమపదము అయిన నిన్ను శరణందుచున్నాను. ఇంతకు అధికముగాఏమియులేదు. సంసారభ్రమణపరితప్త చేతస్కుడను ఇప్పుడు నిర్వాణమందు కేవల తేజస్సు నందుఅభిలాషగా ఉన్నాను - ప్రభూ! శరణు! శరణు!

ముచుకుందుని బదరికాగమనము

శ్రీ పరాశరుండు ఇట్లు అనియె:

బుద్ధిమంతుడగు ముచుకుందునిచే ఇట్లు స్తుతింపబడి, అనాదినిధనుడు సర్వ భూతేశుడు అగు హరి ఇట్లనియె: ఓయీ! రాజా! నీవు అభీష్ట దివ్యభోగములు అనుభవించి, అవ్యాహతైశ్వర్యుడవై నా అనుగ్రహ సంపూర్ణబలమున ఉత్తమ లోకములకు ఏగుము. అట దివ్యభోగములు అనుభవించి, మహాకాలమందు పుట్టి జన్మాంతర వృత్తాంతమెరిగి, నా ప్రసాదముచే మోక్ష మొందెదవు. అనిన నాతడు ప్రణతుడై గుహనుండి వెడలి అల్పాకారుల నరులంగని కలియుగమని ఎరిగి తపముచేయ నరనారాయణ స్థానమగు గంధ మాదనగిరికి, బదరీ క్షేత్రమునకు చనెను.

కృష్ణుడును ఉపాయముచే పగతుని, వాని బలమును కూల్చి, మథురకు వచ్చి గజ తురగ పదాది సంకులమగు వాని సైన్యమును స్వాధీనముచేసికొని దానిని ద్వారక యందు ఉగ్రసేనునికి నివేదించెను. అంతట యాదవకులము పరాభి భవశంక ఏ మాత్రమేని లేక హాయిగ ఉండెను. మైత్రేయా! బలదేవుడు తగవులన్నియు శాంతివడ జ్ఞాతులు దర్శింప వేడ్కగొని నందగోకులము ఏగెను. గోపీగోపాలురను మున్నట్ల బహుమాన పూర్వకముగ పలుకరించెను. ప్రేమతో కొందరు కౌగిలించుకొనిరి. కొందరిని ఈతడు కౌగిలించెను. పరియాచకములాడి, కొందరితో ప్రియమ్ములాడ వారును హరింగని పెక్కు ముచ్చటలు జరిపిరి.

గోపికలు మాత్రము ప్రణయకుపితలై కొంత ఈర్ష్యగొని నాగరీజనవల్లభుడు ఇచ్చకాలమారి ఆకృష్ణుడు సేమమున ఉన్నాడుగద! పల్లెపడుచులగు మా చేష్టలు సరిపడక, పురాంగనల నెరజాణలందలి సౌభాగ్యగర్వము అధికముగ పెంచికొనలేదుగద! కణమాత్రపు మెరమెచ్చుగాడు అతడు. వేణుగీతమున తన్ను వెంటాడిన మమ్ము స్మరించునా? మమ్ము చూడనైన ఒకసారి ఈతడిటకు అరుదెంచునా? అదిగాక ఆ మాట ఎందులకు? ఒండు ముచ్చటల చెప్పుకొందము. అతడులేక మనకు మనములేక అతనికిం-జరుగదు కనుక నా! తండ్రి, తల్లి, అన్న, తమ్ముడు, భర్త, బంధువు అనునదెల్ల వానికై వదలుకొంటిమి గద! అతడు కృతఘ్నులకెల్ల యొక పతాక. అయినను ఇచటికి తిరిగిరాకను కూర్చిన మాట నీతో ఒక్కమాటైన అన్నాడా! రామా! అబద్ధ మాడకుము. ఈ దామోదరుడు గోవిందుడు నాగరిక విలాసినులదవిలెను. మాయెడల ప్రీతిపోయినది. ఇంక దర్శనము దుర్లభమే. ఇక మాకు కనబడడని తోచును. కృష్ణా! దామోదరా! అని పిలిచి పిలిచి హరి మనసుల దొంగిల గోపికలు నవ్విరి. సామ మధురములు ప్రేమ గర్భములు గర్వరహితములు అయిన కృష్ణస్వామి సందేశములను బలరాముడు వారికి వినిపించి వారలను ఓదార్చెను. మునుపటివోలె తోడి గోపాలురతో పరిహాసమనోహరములగు కథలు చెప్పుచు ఆ ప్రజ భూములందు వారితో బలరామమూర్తి విహరించెను.

బలరామకృత యమునాకర్షణము-పుత్రోదయము

శ్రీ పరాశరుడు ఇట్లు అనియె:

లీలా మానుషరూపియై గోపకులతో బృందావనమందు చరించుచున్న ఆదిశేష మూర్తి అగు బలరామమూర్తి, పెద్దపెద్ద పనులు చేయుటయు కార్య నిమిత్తముగా భూమియందు సంచరించుటయుగని వరుణదేవుడు ఆతని ఉపభోగమునకై వారుణిని బిల్చి మదిరా! నీవెప్పుడు బలభద్రునకు మిక్కిలి ఇష్టురాల వగుటజేసి అయ్యనంతమూర్తి ఉపభోగము కొరకు దరికి ఏగుము అన ఆ వారుణి అట్లుచేసెను. బలరాముడు బృందావనమందు చెట్టు తొర్రలో నివసించుచు నామదిరా గంధమాఘ్రాణించి దాని త్రాగవలెనను వేడుక నందెను. అవ్వల కదంబ వృక్షము నుండి పడు మదిరాధారను హరిచూచి పరమానంద మందెను. గోప గోపీ జనముతో సంగీతములు పాడుచు గంతులు వేయుచు, వాద్యములు మ్రోయించుచు, దానిని త్రాగెను. దానిచే అతడు మిగుల మత్తుగొని, మిక్కిలి ఉక్కచే, ఒడలెల్ల చెమటలు ఊరి కారగా రమ్ము! యమునా స్నానముచేయ కోరెదను” అనెను.

మద్యపానమత్తుడై ప్రేలుచున్నాడు, ఈ మాటలలెక్కేమని యమునానది ఆతని మాటను తృణీకరించి దరికిరాదయ్యెను. అంతట ఆతడు మదముచే విహ్వలుడై, నాగలిగొని ఆ నదిని లాగెను. ఓ పాపాత్మురాల! నే పిలిచిన రావైతివి. శక్తిఉన్న యెడల నీ ఇచ్చవచ్చినట్లు మఱియొక తావునకు పొమ్మనినంత, ఆనదీదేవత దారివదలి పారి, బలభద్రుడు ఉన్న వనమెల్ల ముంచిఎత్తెను. శరీరము దాల్చి అయ్యెడ ఆతని ఎదుటికి వచ్చి, జడుపునఁ కన్నులు విహ్వలింప దయచూపుమని “ఓ ముసలాయుధా! నన్ను విడువుము” అనెను. ఆమె పలుకాలించి హలి, “నదీ! నాశౌర్యము బలమును అవమానించితివి. ఈనాగలి నడిచి నిన్ను వేయితునుకలు గావింతును చూడుము అనెను.

అట్లనినంత, మిగుల వెఱపొంది ఆనది అతని బ్రతిమాలు కొన్నంత, ఆమెను పారిన భూమిలో ఆ మేరనే వదలిపెట్టెను. అవ్వల అతడుఅందు స్నానమాడినంత, అతనికి అద్భుత కాంతివచ్చెను. చక్కని కలువపూవును వరుణునిచే పంపబడినది అగు వాడని పద్మములను సముద్రమువలె నల్లనైన రెండు వస్త్రములను లక్ష్మి ఆయన కిచ్చెను. చక్కని మణికుండలములను మాలను కలువను శిరమున దాల్చి దండలకు అలంకరించు కొని నీలాంబరములు ధరించి, చక్కని కాంతితోని శోభించెను. ఇట్లు బలరామమూర్తి నంద ప్రజమున రెండు మాసములు విహరించి మరల ద్వారకాపురికేగెను. రైవతరాజు కూతురు రేవతిని పరిణయమై బలభద్రుడు, నిశితుడు ఉల్ముకుడు అను ఇర్వురు పుత్రులను కనెను.

రుక్మిణీ కల్యాణము - ప్రద్యుమ్న జననము

శ్రీ పరాశరుడు ఇట్లనియె:

భీష్మకుడను రాజు కుండినను రాజధానిగా చేసుకొని విదర్భ దేశమును ఏలుచుండెను. ఆయన కుమారుడు రుక్మి - కూతురు రుక్మిణి అనఁబరగిరి. రుక్మిణిని కృష్ణుడు, కృష్ణుని రుక్మిణియు అన్యోన్యము వరించికొనిరి. కాని రుక్మి ద్వేషముగొని ఆమెను చక్రికి ఈయడాయెను. జరాసంధుని ప్రేరణమున, రుక్మితోగూడ భీష్మకుడు ఆమెను శిశుపాలునకు వాగ్దానము చేసెను. శిశుపాలుని హితముకోరు రాజులు జరాసంధాదులు పెండ్లికి భీష్మక నగరమునకు ఏతెంచిరి. కృష్ణుడును, బలభద్రుడు మున్నగు యాదవులతో చైద్యరాజగు శిశుపాలుని పెండ్లి చూడ కుండినమునకు ఏగెను. రేపు వివాహముకానున్నతరి కృష్ణుడు, శత్రునిగ్రహ కార్యభారమును బలరామాదులగు బందుగులపైనిడి ఆ పెండ్లి కూతురుని దొంగచాటుగ కొనియేగెను.

అంత పౌండ్రక దంతవక్త్ర విదూరథ శిశుపాల జరాసంధ సాల్వాది రాజులు కోపమెత్తి, హరిని పరిమార్చుటకు పెద్ద ప్రయత్నము చేసిరి. ఎదుర్కొని యాదవులకు బలరామాది యదు పుంగవుల చేతిలో ఓడిపోయిరి కూడ. కేశవుని అనింగూల్పక కుండినము చొరనని ప్రతిన సేసి రుక్మి కృష్ణునికూల్ప వెనుదరిమెను. బలానుజుడు చతురంగ బలమునుగూల్చి విలాసమాత్రముగ అరుక్మిని అవనిపైబడద్రొబ్బెను. ఇట్లు రుక్మినిగెల్చి చక్కగ రాక్షస వివాహ ప్రక్రియను లభించిన రుక్మిణిని, మధుసూదనుడు పెండ్లాడెను. ఆమెయందు హరి మన్మథాంశుడైన, వీర్యవంతుడగు, ప్రద్యుమ్నుని కనెను. అతనిని శంబరాసురుడు హరించుకొని పోవ వానిని ప్రద్యుమ్నుడు సంహరించెను.

శంబరాసుర వధ - ప్రద్యుమ్నాగమనము

మైత్రేయుడనెను:

శంబరుడు ప్రద్యుమ్నుని ఎట్లు హరించెను? ప్రద్యుమ్నుడు వాని నెట్లు వధించెను? ఈకథ సవిస్తరముగ ఆనతిండుఅన శ్రీ పరాశరుడు ఇట్లు అనియె: ఓ మునీ! ప్రద్యుమ్నుడు పుట్టిన ఆఱవనాడు వీడు నన్ను చంపువాడని తెలిసి కాల (మృత్యుతుల్య) శంబరుడు ఆ శిశువును పురిటింటి నుండి కొంపోయి పెనుమొసళ్లతో, సుడులతో భయంకరమైన సముద్రమందు పడవేసెను. ఆ బాలుని ఒకచేప మ్రింగెను. ఆ చేప జఠరాగ్నికి అతడు నశింపలేదు. జాలరులు ఆ చేపను తక్కిన చేపలట్లు వలలో పడిన దానిని శంబరాసురునికి నివేదించిరి. ఆతని నామమాత్ర భార్యయగు మాయావతి సర్వ గృహేశ్వరి కావున ఆచేపను వంటవారికి అందించెను. దానినికోసినంతట అందు అతి శోభనమూర్తి మున్నుదగ్ధుడైన మన్మథుడనెడి తరువుయొక్క ప్రథమాంకుర మన్నట్లున్న కుమారుని జూచెను. వీడెవడు? చేప కడుపున ఎట్లు ప్రవేశించెను! అని ఇట్లు వేడుకగొని ఆ మాయావతిని గని నారదుడు ఈతడు సకల జత్థ్సితి సంహార కారకుడగు విష్ణుని తనయుడు. శంబరునిచే పురిటింటి నుండి హరింప బడినాడు. సముద్రమున పడవేయ చేప మ్రింగ ఆ చేప మూలమున నీ ఇంట బయలు పడినవాడు. ఇది ఒక మానవ రత్నము. విశ్వాసముతో వానిని పాలింపుము. అనగావిని మాయావతి బాల్య నిమిత్తమైన అనురాగము పెంపునను, వాని మోహమునను వానిని చక్కగ పెంచెను.

ఆతడు నిండు జవ్వనమున దీపించినంత ఆగజయాన వానియందభిలాషగలదై వానికి తాను తెలిసిన సర్వమాయలను ఒసంగెను. ప్రద్యుమ్నుడను పేరందిన ఆతనిపై అనురాగముని వానిపైనే మనసును చూపులుపెట్టికొనెను. ఇట్లు తనపై ఆసక్తిని చూపు ఆ పద్మనయనను చూచి కృష్ణసుతుడు మాతృభావము తలగి, నా యెడ ఇట్లేల వర్తింతువని అడిగెను. ఆమె నీవునాకు పుట్టిన వాడవు కావు అనెను. ఈకాల శంబరుడు కృష్ణుని తనయుడ వగు నిన్ను హరించి సముద్రమున పడవేయ చేప కడుపున బడి నీవు దాని మూలాన నాకు లభించితివి. ఆమె నినుగన్న తల్లి నీకై ఈపడచులను వాత్సల్యాతిశయమున చేర్చుకున్నది అనెను.

ఈ మాటలాలించి ప్రదుమ్నుడు శంబరుని యుద్ధమునకు ఆహ్వానించెను. క్రోధాకులుడై వానితో పోరెను. వాని సేనల కూల్చినవాని ఏడుమాయలను అతిక్రమించి తన ఎనిమిదవ మాయాశక్తిని ప్రయోగించి ఆరక్కసుని కూల్చెను. ఆవల ఆమాయావతిని గైకొని అకసమున కెగిరి తండ్రి పురమున కేతెంచెను. మాయావతితో కూడ నంతఃపుర మందు వ్రాలిన అతనిని చూచి, కృష్ణుని భార్యలు ఇతడు కృష్ణుడే అనుకొనిరి. రుక్మిణి వానినిగని ప్రేమతో కన్నీరు దొరుగ ఈ బిడ్డడేధన్యురాలు కన్నవాడోకద! ఎల ప్రాయమున ఉన్నాడు. ప్రద్యుమ్నుడు జీవించి ఉండెనేని ఈ ఈడువాడై ఉండువాడు. నీవంటి కొడుకుచే భూషితురాలైన ఆతల్లి ధన్యురాలు. అది కాదు. నీపై నాకుకలుగు నీ ప్రీతిని బట్టియు నీమేని కవళికలను బట్టియు నీవు హరిగన్న వాడవే. స్పష్టముగ నీవు హరికుమారు డవై ఉందువనెను.

ఇంతలో నారదమహర్షి కృష్ణునితో అంతఃపురమున కేతెంచి రుక్మిణీ దేవినిగాని, ఆమెను ఉల్లాస పరచుచు, ఓ సుందరీ! వీడు నీకొడుకు. శంబరుని చంపి వచ్చినాడు. పురిటింటి నుండి వానిచే హరింపబడిన వాడితడే. ఈమెయే నీకుమారుని భార్య. ఈమె శంబరుని భార్యకాదు. ఇందులకు కారణము వినుము. మును మన్మధుడు గతించిన తరువాత మరల అతడు పుట్టునను గట్టి తలంపుగొని, మాయారూపమున ఈ సుందరి శంబరాసురుని మోహవశుని కావించెను. వానితోడి విహారములందు భోగములందును తన రూపమును మాయగొని ఇరు రూపులను కావించి ఆ దైత్యుని కామ్యరూపము దర్శింపజేసెను. ఆ నీ కుమారుడుకాముడే ప్రద్యుమ్నుడై అవతరించినాడు. ఆతని భార్య రతీదేవియే ఈ మాయావతి. ఇందు సంశయింప వలసినది లేదు. కల్యాణి ఈమె నీ కోడలు” అనవినిన రుక్మిణీదేవినిగని ద్వారకగల జనమెల్ల ఆశ్చర్య మొందెను.

రుక్మివధ

శ్రీ పరాశరుడు ఇట్లు అనియె:

శ్రీ రుక్మిణీదేవి కన్న సంతానము చారుధేష్ణుడు, సుధేష్ణుడు, చారుదేహుడు, సుషేణుడు, చారుగుప్తుడు, భద్రబాహువు, చారువిందుడు, సుబాహువు, చారువులను పుత్రులు చారు మతి అను కన్యకయును. కృష్ణునికి మరియు ఏడుగురు పత్నులుండిరి. ఆ సప్త మహిషులు కాళింది మిత్రవింద నాగ్నజితి జాంబవతి కామరూపిణియగు రోహిణి మద్రరాజ సుతయగు సుశీల సత్రాజిత్తు కూతురు సత్యభామ, లక్షణ. వీరుగాక పదునారువేల మంది భామలు ఉండిరి. ప్రద్నుమ్నుడు రుక్మి కూతురు ఒండొరులను స్వయంవరమందు వరించుకొనిరి. వారికి మహా బలశాలి యుద్ధమందు ఎవ్వరికిని నిరోధింప వశముగానివాడు వీర్య సముద్రుడు అగు అనిరుద్ధుడు ఉదయించెను. రుక్మిపౌత్రిని ఆతనికిమ్మని శ్రీకృష్ణుడు కోరెను. రుక్మి కృష్ణునెడ స్పర్ధగొన్నను తన దౌహిత్రునకు పౌత్రిని ఇచ్చెను. ఆమె పెండ్లిలో కృష్ణునితో కూడ బలరామాది యాదవులు మరియుగల రాజులు అందరితో రుక్మి యొక్క నగరమగు భోజకటకమునకు తరలి వచ్చిరి. వివాహమహోత్సవమైన తరువాత కళింగరాజు మొదల యిన వారు రుక్మింగని బలరాముడు పాచికలు ఆడుట ఎఱుగడు. జూదమున అతని మనమేల గెలువరాదనిరి.

బలమదమున రుక్మి అట్లే కానిండని సభలో బలరామునితో ద్యూతక్రీడను ఆరంభించెను. ఒక్కవేయి నిష్కములొడ్డి బలరాముడు రుక్మిచే ఓడిపోయెను. రెండవ పందెమందు అట్లే అంతమొత్తము కోల్పోయెను.

ఆ మీద బలరాముడు పదివేల నిష్కముల పందెము కాసెను. దానిని ద్యూత విశారదుడు రుక్మి గెల్చుకొనెను. అది కని కళింగరాజు నోరుతెరచి విరగబడి పెద్దధ్వని అగునట్లు పండ్లు బయలుపడ నవ్వెను. అప్పుడు రుక్మియు మదోద్ధతుడై “ఇతడు ద్యూతము నెఱుంగనివాడు. నేను వీనిని గెలిచితిని. అక్షక్రీడలో లేనిపోని గర్వము గొని, అక్షక్రీడా కోవిదులమని మనలను ఎఱుగడయ్యెను” అనెను. కళింగరాజు పండ్లి కిలించుటయు, రుక్మి ప్రేలుటయుచూచి హలాయుధుడీసుగొని కోటి నిష్కములను మరల పందెము సరచెను. రుక్మి పాచిక బట్టి విసరెను. బలదేవుడు ఆ పందెము గెలిచి కొనెను. గెలిచితిననియు పలికెను. రుక్మి నేను గెలిచితినని పలికెను. అబద్ధమాడకుము. నీవు పందెము పెట్టితివి. నిజమేకాని దానిని నేనామోదించలేదు. ఇట్టియెడ గెల్పు నీదగు నంటివేని నాదెందులకుగాదు? అని రుక్మి వివాదమునకు దిగెను. అంతట నంతరిక్షము నందు ఆకాశవాణి గంభీర నాదమున మహానుభావుడగు బలదేవుని కోపమును పెంపొందించుచు “ధర్మముగా బలరాముడే గెలిచెను. రుక్మి అన్నమాట అబద్ధము. అంగీకారపు మాటను పలుకకుండ గూడ పని క్రియతో జరుగుచుండును” అనెను.

అవ్వల బలరాముడులేని కోపముచే కన్నులు ఎఱ్ఱవడ పాచికను గొని రుక్మిణిని కొట్టెను ఎగిరెగిరి పడుచున్న కళింగరాజు గూడ (చేయి) పట్టుకొని వాడుముందు ఏపండ్లచే నవ్వెనో ఆదంతములు ఊడిపడునట్లుకొట్టెను. మఱియు స్వర్ణమయమును పెద్దదగు ఆ సభా స్తంభమును చేకొని ఆ పక్షమునకు చెందిన రాజులు అందఱు దాని వలన కోపా వేశముతో నడిచెను.

బలరాముడు కుపితుడుకాగా, సభయంతయు గగ్గోలై రాజ మండల మెల్ల అదరి పారిపోబోయెను. మధుసూదనుడు బలునిచే అట్లు రుక్మినిహతుడగుట చూచి మైత్రేయా రుక్మిణీ బలరాములకు జడిసి ఇంచుకొని పలుకడయ్యెను. అవ్వల హరి పెండ్లియై నిరుద్ధుడై ఉన్న అనిరుద్ధుని యాదవమండలమును చేకొని ద్వారకాపురికి వచ్చెను.

నరకాసుర వధ

శ్రీ పరాశరుడు ఇట్లనియె:

మైత్రేయా! శ్రీకృష్ణుడు ద్వారకయందున్నతరి త్రిభువనేశ్వరుడు, ఇంద్రుడు ఐరావత మదగజము ఎక్కివచ్చి ద్వారక చొచ్చి హరిని కలిసికొని నరకాసురుని ప్రవర్తనము విన్నవించెను. మధుసూదనా! దేవాధినాథుడవు నీవు మనుష్యుడుగా వర్తింపగాగూడ సర్వదుఃఖములు ఉపశమింపచేయబడినవి. తపశ్శాలురకు బాధ గూర్పపూనుకొన్న అరిష్టుడు, ధేనుకాసురుడు, కేశి మొదలగు అసురులు ఎల్లరు నీచేత చచ్చిరి. కంసుడు, కువలయాపీడుడు, బాలఘాతిని పూతన మొదలగు జగదుపద్రవములు అన్నియు నీచే వినాశ మందినవి. నీదోర్దండ వైభవమున ముల్లోకములు రక్షణమొంద యజ్జ్వలు పిలిచి ఇచ్చు యజ్ఞభాగములను అందుకొని దేవతలు తనియుచున్నారు. జనార్దనా! వారిలో నొకడనైనను నేపనిమీద ఇపుడుఇటకు వచ్చితినో ఆలించి దానికనువైన ప్రతిక్రియ కావింపయత్నింపుము. భూమికొడుకు నరకుడు ప్రాగ్జ్యోతిషపురాధీశ్వరుడు, సర్వభూతములకు బాధ కూర్చుచున్నాడు. దేవసిద్ధుల యొక్కయు ధరణీనాధుల యొక్కయు కన్నియలను గొనిపోయి తన ఇంటను చెరగొన్నాడు.

ప్రచేతనుని (వరుణుని) జలస్రావియైన గొడుగును లాగికొన్నాడు. మందర పర్వత శృంగమగు మణిపర్వతమును హరించినాడు. మా అమ్మ దివ్యమణికుండలముల అమృతమును కురియువానిని కృష్ణా! ఆ అసురుడు కాజేసినాడు. ఐరావతమును కోరుచున్నాడు. గోవింద! వానిదుర్వినీతి ఇది అని నీకు నివేదించితిని. దీనికి ప్రతికర్తవ్యమేమో నీవు పరిశీలింపవలయును. అనితెలుపగా విని భగవంతుడగు దేవకీ తనయుడు అల్లన నవ్వి, ఇంద్రుని చేయిపట్టుకొని ఆసనము నుండిలేచెను. గరుడుని తలచి వెంటనే వచ్చిన ఆ పక్షిరాజును ఎక్కి సత్యభామనుగూడ ఎక్కించుకొని ప్రాగ్జ్యోతిషమునకు తరలెను. ఐరావత మెక్కి అమరపతి స్వర్గమునకుచనెను. ద్వారకావాసులు చూచుచుండ అటుపై కృష్ణుడును చనియెను.

ప్రాగ్జ్యోతిషము నలువైపుల భుమి నూరామడ దూరము మురాసురుని చుఱకత్తులతోడి పాశములును చుట్టుకొన బడి ఉండెను. సుదర్శన చక్రమునువిసరి హరి వానిని ఛేదించెను. అంతట మురాసురుడు ఎగయగా, వానిని దునిమి వాని కొడుకుల, ఏడు వేల మందిని మిడుతలనువలె చక్రధారాగ్ని దగ్ధులను కావించెను. మురాసురుని, హయగ్రీవుని, పంచజనుని కూల్చి ప్రాగ్జ్యోతిష పురమునకు పరువిడెను. అక్కడ నరకుని సేనలతో శ్రీహరికి పెనుయుద్ధము జరిగెను. శస్త్రాస్త్ర వర్షపాతమున ముంచెత్తు ఆ నరకుని ‘భౌముని (భూమి కుమారుని) దైత్యచక్రాంతకుడు చక్రము విసరి రెండు ఒనరించెను. నరకుడు హతుడైనంత అదితి కుండలములను గొని వచ్చి జగన్నాథుని సన్నిధానమునకు వచ్చి ఇట్లనియె.

భూదేవి కృష్ణుని స్తుతించుట:

“నాథా! వరాహమూర్తిపై నన్ను నీవు ఉద్ధరించినపుడు నీ స్పర్శచే నాకు పుట్టిన వాడు ఈ నరకుడు. నీ కొడుకును వీనిని నీవు ఇచ్చితివి. నీవు కడతేర్చితివి. ఇవిగో కుండలములు గైకొనుము. వీని సంతతిని బ్రోవుము. నా బరువును దింప భగవంతుడవు నీవు అంశావతార మెత్తితివి. ప్రసాదసుముఖుడవు కమ్ము. జగములకు నీవే కర్తవు. వికర్తవు, సంహర్తవుకూడా. కారణము, లయస్థానము, జగద్రూపుడవు నీవు. నిన్నేమని స్తుతింతును. వ్యాపించువాడవు వ్యాపింపబడు విశ్వము క్రియయు, కర్తవు, కార్యమును, నీవు. సర్వ భూతాంతరాత్మవగు నిన్నుఏమి కొనియాడుదును? పరమాత్మవు, భూతాత్మవు, ఆత్మవు, లయస్థానము. నేనే నిన్ను ఉన్నవానిని ఉన్నట్లు స్తుతి చేయనెట్లు వాక్కు ప్రవర్తింపగలదు? సర్వభూతాత్మా! దయచూపుము. ధర్మసంస్థాపన కొరకు నీ కొడుకు నీచేత చంపబడెను కావున వీని తప్పిదమును క్షమింపుము” అని భూదేవి స్తుతించెను.

భూతభావనుడు భగవంతుడు: ఆ భూదేవితో నరకుని ఇంటినుండి రత్నములను తరలించి కొని, కన్యాంతఃపురమున గల కన్నియల పదారువేలమందిని చూచెను. నాల్గుదంతములుగల శ్రేష్టములయిన గజములను ఆరువేలను, కాంభోజదేశమునకు సంబంధించిన అశ్వరాజములను ఇరువది యొక్క లక్షలను చూచెను. ఆ కన్యలను, నాగము(ఏనుగు)లను, గుర్రములను, గోవిందుడు ద్వారకాపురికి అప్పటికప్పుడు నరక కింకరులచే చేర్పించెను. మరియు వాని వారుణచ్ఛత్రమును మణి పర్వతమును చూచి పతగరాజు గరుడుని మూపుపై ఎక్కించి తానును సత్యభామతో అధిరోహించి, అదితికి కుండలములు ఇచ్చుటకు స్వర్గము వైపునను ఏగెను.

పారిజాతానయనము

శ్రీ పరాశరుడు ఇట్లు అనియె:

గరుత్మంతుడు వారుణ (వరుణిని యొక్క) ఛత్రమును మణిపర్వతమును సత్యభామతో శ్రీకృష్ణుని సలీలముగ వహించెను. స్వర్గ ద్వారమును చేరి హరి పాంచజన్య శంఖమును పూరించెను. అమరులు అర్ఘ్య పాద్యాదులుకొని ఎదురువచ్చిరి. వారిచే అచ్యుతుడు అర్చితుడై, దేవమాతయగు అదితి గృహమునకు అరిగెను. తెల్లని మేఘ శిఖరమట్టి ఆగృహమును ప్రవేశించి, అదితిని గని, ఇంద్రుడు తాను ప్రణమిల్లి కుండలములను ఒసంగి నరకనాశన వార్త నివేదించెను. అదితీయును ప్రీతిజెంది, జగద్విధాత హరిపై మనసుంచి ఇట్లు స్తుతించెను.

అది తిరువాచ:

నమస్తే పుణ్డరీకాక్ష భక్తానామభయంకర

సనాతనాత్మన్ సర్వాత్మన్ భూతాత్మన్ భూతభావన

ప్రణేతన్మనసోబుద్ధేరిన్ద్రియాణాం గుణాత్మక

త్రిగుణాతీత నిర్ద్వన్ద్వ శుద్ధసత్త్వ హృదిస్థిత॥

సీతదీర్ఘాదినిశ్చేషకల్పనా పరివర్ణిత

జన్మాదిభిరసంస్పృష్టస్వప్నాది పరివర్జిత

సంధ్యారాత్రిరహోభూమిర్గగనంవాయురమ్బుచ

హుతాశనోమనోబుద్ధిర్భూతాది స్త్వంతథా అచ్యుత

సర్గస్థితివినాశానాంకర్తాకత్మన్ పతిభన్ వాన్

బ్రహ్మవిష్ణు శివాఖ్యాభిరాత్మమూర్తిభిరీశ్వర

దేవాదైత్యాస్తథాయక్షా రాక్షసాస్సిద్ధపన్నగాః

కూశ్మాణ్డాశ్చపిశాశాశ్చ గన్ధర్వామనుజాస్తథా

పశవశ్చమృగాశ్చై వపతఙ్గాశ్చ సరీసృపా

వృక్షగుల్మల తాబహ్వ్యస్సమస్తాస్తృణజాతయః

స్థూలామధ్యాస్తథాసూక్షా స్సూక్షాత్సూక్ష్మ తరాశ్చయే

దేహభేదాభర్మాసర్వే యేకేచిత్పుర్గశాశ్రయాః

మాయాతవేదమజ్ఞాత పరమార్థాతిమోహినీ

అనాత్మన్యాత్మ విజ్ఞానంయయామూఢో నిరుధ్యతే

అన్వేస్వమితిభావో అత్ర యత్పుంసాముపజాయతే

అహంమమేతిభావోయత్ ప్రాయేణైవాభిజాయతే

సంసారమాతుర్మాయాయా స్తవైతన్నాథ! చేష్టితమ్

యైస్స్వధర్మపరైర్నాథ! నరైరారాధితోభవాన్

తేతర న్త్యఖిలామేతాం మాయామాత్మ విముక్తయే

                                    బ్రహ్మాద్యాస్సకలాదేవా మనుష్యాః పశవస్తథా

 విష్ణుమాయామహావర్త మోహాన్ధతమసా వృతాః

ఆరాధ్యత్వామభీప్సన్తే కామాన్నాత్మభవక్షయమ్

యదేతే పురుషామాయా సైవేయంభగం స్తవ

 మయత్వం పుత్రకామిన్యావైరి పక్షజయాయచ

 ఆరాధితో నమోక్షాయ మాయా విలసితం హితత్

కౌపీనాచ్ఛాదనప్రాయవా ఞ్ఛాకల్ప ద్రుమాదపి

జాయతేయదపుణ్యానాం సోపరాధస్స్వ దోషజః

 తత్ప్రసీదాఖిలజగన్మాయామోహక రావ్యయ

అజ్ఞానంజ్ఞాన సద్భావభూతం భూతేశ! నాశయ

నమస్తేచక్రహస్తాయ శార్ఙ్గహస్తాయతే నమః

 నన్దహస్తాయతే విష్ణో! శఙ్ఖహస్తాయతే నమః

ఏతత్పశ్యామితేరూపం స్థూలచిహ్నోప లక్షితమ్

 నజానామిపరంయత్తే ప్రసీదపరమేశ్వర

శ్రీ పరాశర ఉవాచ:

అదిత్యైవంస్తుతో విష్ణుః ప్రహస్యాహసురారణిమ్

 మాతాదేవిత్వ మస్మాకం ప్రసీదవరదా భవ

అదితిరువాచ:

ఏవమన్తుయథేచ్ఛా తేత్వమశేషైస్సురాసురై ః

అజేయః పురుషవ్యాఘ్రమత్యన్ లోకేభవిష్యసి

 తతః కృష్ణస్యపత్నీచ శక్రేణ హితా అదితిమ్

 సత్యభామా ప్రణమ్యాహ ప్రసీదేతిపునః పునః

అదితిరువాచ:

మత్ప్రసాదాన్నతే సుభ్రు! జరా వైరూప్యమేవవా

 భవిష్యత్యనవద్యాఙ్గి! సుస్థిరం నవయౌవనమ్

శ్రీ పరాశర ఉవాచ:

అదిత్యాతు కృతానుజ్ఞోదేవరాజో జనార్థనమ్

 యథావత్పూజయామాసబహుమానపురస్సరమ్

శచీచసత్యభామాయైపారిజాతస్య పుష్పకమ్

 నదదౌమానుషీం మత్వాస్వయంపుష్పైరలంకృతా

తతోదదర్శ కృష్ణో అపి సత్యభామా సహాయవాన్

 దేవోద్యానాని హృద్యాని నన్దనాదీనిసత్తమ

దదర్శచనుగన్ధాడ్యం మఞ్జ రీపుఞ్జధారిణమ్

 నిత్యాహ్లాదకరం తామ్రబాలపల్లవ శోభితమ్

మథ్యమానే అమృతేజాతం జాతరూపోమమత్వచమ్

 పారిజాతంపగన్నాదః కేశవః కేశిసూదనాః

తుతోషపరమప్రీత్యాతరురాజమనుత్తమమ్

 తందృష్ట్వా ప్రాహగోవిన్దం సత్యభామాద్విజోత్తమ

 కస్మాన్నద్వారకామేష నీయతేకృష్ణ! పాదపః

 యదిచేత్త్వద్వచః సత్యం త్వమత్యర్థం ప్రియేతిమే

మద్దేహనిష్కుటార్థాయ తదయం నీయతాం తరుః

నమేజామ్బవతీతాదృగ భీష్టానచ రుక్మిణీ

సత్యేయథాత్వమిత్యుక్తం త్వయాకృష్ణాస కృత్ర్పియమ్ సత్యంతద్యదిగోవిన్దనోపచారకృతం మమ

తదస్తుపారిజాతో అయం మమగేహ విభూషణమ్

 బిభ్రతీపారిజాతస్య కేశపక్షేణ మఞ్జరీమ్

సపత్నీనామహం మధ్యే శోభేయమితికామయే

అదితి కృష్ణుని స్తుతించుట

పుండరీకాక్షా! భక్తాభయప్రదా! సనాతనా! సర్వాత్మ! భూతరూపుడవు! మహా భూత జనకుడవు! నీకు వందనము. మనో బుద్ధి ఇంద్రియములను నడపించువాడవు. గుణా తీతుడవు కనుకనే శీతోష్ణరహితుడవు. శుద్ధసాత్త్విక హృదయవాసివి. తెలుపు నలుపు పొడవు వెడల్పు మొదలగు వికల్పములు లేనివాడవు. జన్మాది వికారములు లేనివాడవు. జాగ్రదాద్యవస్థలు లేనివాడవు సర్గాదికర్తవు కర్తలకు పతివి. బ్రహ్మ విష్ణు శివాది మూర్తులు చరాచర ప్రపంచమంతయు నీ స్వరూపమే. తత్త్వమునుఎఱుంగని వారిని మిక్కిలి మోహపెట్టు మాయ నీదే. ఆత్మకాని దానియందు ఆత్మ జ్ఞానమే మాయ. తనది కాని దానియందు తనదను భావము దాననే కలుగును. ఈ మాయ సంసార జనని. ఆమె చేష్టఇది. స్వధర్మపరులై నిన్ను ఆరాధించినవారు, ఈ మాయను దాటుదురు. బ్రహ్మాది దేవతలు, మనుష్యులు, పశువులు, విష్ణుమాయ అనెడి సుడిలోపడి మోహమును గాడాంధకారముతో చుట్టబడినవారై, నిన్నారాధించి కోరికలను కోరుదురు. కాని సంసార నాశమునుకోరడు. ఇట్టివారే మాయ. ఈ మాయ నీదే. నేను శత్రుపక్ష క్షయము చేయగోరి నీవు పుత్రుడవు కమ్మని నిన్ను ఆరాధించితిని కాని మోక్షము కొరకు కాదు. ఇదియు మాయా విలసనమే. కల్పవృక్షమునుగూడ గోచిపాత మాత్రముపై వాంఛ పుణ్యులు కానివారికి కల్గుచుండుటయను అపరాధము తమ కర్మ దోషమువలన కల్గినదే. కావున అన్ను ననుగ్రహింపుము. జ్ఞానమువలె భాసించు అజ్ఞానమును నశింప చేయుము. శార్ఙ్గచక్రధరునకు నీకు నమస్కారము. శంఖనందక ఖడ్గధారికి నీకు వందనము. ఈ స్థూల చిహ్నముల తోడి నీరూపము కాంచితిని. కాని పరమార్థ రూపము ఎఱుగను. అను గ్రహింపుము. అని అదితి స్తుతింపగా ఆ తల్లిని సురారణిం (జన్మహేతువు)చూచి విష్ణువ అమ్మా! మాకు వరములు ఇమ్మని మాయామానుషవేషధారి కుమారుడు అర్థింప అట్ల అగుగాక అనియు, సురారులకు నీవు అజేయుడవు అగుదువు అనియు మనుష్య లోకమున పుట్టుదువుఅనియు అదితి అచ్యుతుని దీవించెను. అంతట కృష్ణుని భార్య సత్యభామ ఇంద్రునితో గూడ అదితికి మ్రొక్కి దయచూపుము, దయచూపుమని మఱిమఱిపలికెను. ఆమెను సాదరమున నీకుముదిమి వైరూప్యము కలుగదు. నిత్య నవయౌవనిపై భాసింతువు గాక అని దీవించెను. ఇట్లు అదితి అనుగ్రహమందు అనుజ్ఞ గొని జనార్దనుని సబహు మానముగ యథావిదిగా పూజించెను.

శచీదేవి తాను పారిజాత పుష్పములం పెక్కింటిని కొప్పునందుఅమర్చుకొని, మానుష స్త్రీఅని భావించి ఒక్క పారిజాత కుసుమమును సత్యభామ కొసంగెను. అవ్వల కృష్ణుడు సత్యభామతో నందనాది దేవోద్యానములను ఆతి హృద్యములైన వానిని దర్శించెను. అందు ఘుమఘుమ పరిమళముల నించుచు, గుత్తులు గుత్తులుగ నిండపూచి, నిత్యా హ్లాదము గొల్పు కుసుమములతో లేత చివుళ్ళతో శోభిల్లుచు బంగారు పై పట్టతో రాజిల్లుచు, సముద్రమథన సమయ మందు క్షీరవారాశిని ఉదయించిన తరురాజము పారిజాతమును చూచి పరమప్రీతిచే ఆనందించి ముచ్చటగొని సత్యభామ గోవిందునిగని ఇట్లనియె. “కృష్ణ! ఈపాదపమును మనమేల ద్వారకకు కొనిపోరాదు? సత్యా! నీవు నాకెంతయు కూర్చుదానవని అన్న నీపలుకు సత్యమగునేని అది కేవలముఔపచారికము (వట్టి ఇచ్చకము) కాదేని నాయింటి పెరటిలో నాటుటకు దీనిని కొనిపోవలయును. జాంబవతిగాదు, రుక్మిణి యుంకాదు. భామా! నీవు అభీష్టురాలవైనట్లు ఎవ్వరు కారని పలుమారులు కృష్ణా! ముచ్చటలు చెప్పితివి. అదినిజమేని గోవింద! ఈ పారిజాతము నా గృహవిభూషణముఅగు గాక! నాకొప్పునందు ఒక వంక మెరుపుగా, మెరుగుగా, ఈ పారిజాత పుష్ప మంజరి చెరవికొని, నాసవతుఅఉ అందరిలో శోభింపవలయునని ముచ్చట పడుచున్నాను.”

అని పల్కగా ఆ మాటలను వినినదే తడవుగ, కృష్ణుడు అల్లన ఆమెవంక చూచి ఆ పారిజాత తరు రాజమును గరుత్మంతునిపైకి ఎక్కించెను. వనపాలురు - “దేవరాజ పట్టమహిషి శచీదేవి. ఆమె సొత్తు ఈ పారిజాత మహావృక్షము. దీనిని నీవు కొంపోదగదు. ఇది దేవరాజు కొరకే పుట్టినది. అతడును దానిని మహానుభావురాలగు పట్టమహిషి శచీ దేవికి వేడుకకొని ఇచ్చెను. శచీదేవి నగగా అలంకరించుకొనుటకు అమృత మథనమందు దేవతలు దీనిని జనియింప చేసిరి. దీనినిగొని క్షేమముగా నీవు పోలేవు. దేవేంద్రుడుఏదేవి మొగమునుచూచునో, ఆయిల్లాలి సొంత సొత్తైన ఈ పారిజాత రత్నము నీవు తెలియని తనముచే కోరుచున్నావు. క్షేమము గలవాడు ఎవ్వడు దీనిని కొనిపోగలడు? సురపతి ఇప్పటికే నీకు ప్రాయశ్చిత్తము చేయగలడు. వజ్రాయుధమును చేతనెత్తిన, శక్రుని అమరులు వెంబడింతురు. అందుచే అచ్యుత! దేవతలతో తగవు కోరి తెచ్చికొనుట నీకు తగదు. ‘పాక దశలో పరమ కటువయ్యెడు (విషమించెడు) పనిని పండితులు మెచ్చరు.”

అని పలుకగావిని, ఆ వనపాలురను చూచి అతికోపినియైన సత్యభామ “ఆ! పారిజాతమునకు శచి ఎవ్వతె? సురాధిపుడు శక్రుడు ఎవ్వడు. అమృతమథనమందు పుట్టిన ఈ చెట్టు సర్వలోకమునకు సమానము. ఇంద్రుడు ఒక్కడే ఏలగైకొనును? అమృతమెట్లో చంద్రుడు, ఎట్లో లక్ష్మి ఎట్లో, అట్లే పారిజాతమును సర్వలోకములకు ఉమ్మడి సొమ్ము. మగని బాహుబలము ఊతముగ గర్వ మెక్కి శచి అడ్డుచున్నది. అందుచే చెప్పుడు నీ ఓరిమిచాలు. సత్యఈ తరువును పట్టించుకొని వెళ్ళుచున్నదని చెప్పుడు. పరుగున మీరేగి పౌలోమి ఏమన్నదో వచ్చిచెప్పుడు. ఈ గర్వోద్ధతాక్షరములు అయిన మాటలు సత్యభామవి అని చెప్పుడు. నీవు భర్తకు వల్లభవేని, నీకు భర్త వశుడేని, ఈ వృక్షమును గొనిపోవుచున్న నా మగని నీవడ్డగింపింపుము. నీమగడు శక్రుడని ఎరుంగుదును. అతడు త్రిదశాధీశ్వరుడు అనియు ఎరుంగుదును. అయినను మానుషీ మాత్రను నేను పారిజాతమును ఇదిగో పట్టించుకొని పోవుచున్నాను” ఆని పల్కగా వన రక్షకులు శచికి సత్యభామ పలికినది నివేదించిరి. శచియును విని సురాధిపుని ప్రోత్సహించెను.

అవ్వల ఇంద్రుడు పారిజాతమునకై దేవతలతో సైన్యములను ఎల్లంగొని హరితో యుద్ధము చేయుటకు పోయెను. ఇంద్రుడు వజ్రాయుధము గైకొనగా, పరిఘనిస్త్రింశ గదా శూలాది దివ్య ఆయుధములనుగొని త్రిదశులు యుద్ధ సన్నద్ధులైరి. అంతట హరి ఐరావతమందున్న ఇంద్రుని యుద్ధమునకు సన్నద్ధమైన, ఇంద్రపరివారమును కని దిశలు మ్రోయ శంఖమును పూరించి నిశిత శర జాలమును విసరెను. అదిగని త్రిదశులును తీవ్ర దివ్యాస్త్ర శస్త్రములను వదలిరి. లీలగా, జగత్పతి ఒక్కొక్క దానిని పెక్కు తునుకలు కావించెను, ఉరగాశనుడు (పాములనుతిను గరుత్మంతుడు) వరుణుని పాశమును కొన ముక్కున పట్టిలాగి పాము పిల్లనట్లు పెక్కు తునుకలుచేసెను. యముడు విసరిన దండమును గదావిక్షేపమున ఖండించి, భగవంతుడు దేవకీ సుతుడుఅవనిపై పడవేసెను. కుబేరుని పాలకిని నువ్వుగింజంతగ నులివేసెను. హరి సూర్యుని తేరిచూచి సారము హరించెను. అమ్ములలో అగ్ని చల్లారెను. వసువులను దశదిశలకు పారిపోవునట్లు తరిమెను. చక్రముచే శూలముల కొనలు విరిగి రుద్రులు నేలకొరగిరి. సాధ్యులు, విశ్వేదేవులు, మరుత్తులు, గంధర్వులు, శార్ఙమువదిలిన సాయకములచే నింగిని బూరుగుదూదియట్లు పింజెలు పింజెలై తూలిరి. గరుడుడును, తన సూదిమొనవంటి ముక్కునపొడిచి వీక్షించి, ఇరుఱెక్కల దూల్చి, గోళ్ళగొనలన్ జీల్చి, పెక్కు తెఱంగుల వీరవిహారము జరిపెను.

అటుపిమ్మట దేవేంద్ర మాధవులు మేఘములు జలధారలు అట్లు ఒండొరులపై శరధార కురిసికొనిరి. ఐరావతముతో గరుడుడు పోరెను. అన్ని బాణములు అస్త్రశస్త్రములు తెగివడ వాసవుడు వజ్రాయుధము పట్టెను. కృష్ణుడు సుదర్శనము గైకొనెను. అంతట వారిని చూచి ముల్లోకములు హాహాకార మొనరించెను. ఇంద్రుడు వేసిన వజ్రాయుధము మెల్లగా హరి అందుకొనెను. నిలునిలుమని చక్రాయుధమును విసరెను. వజ్రాయుధమా నష్టమయ్యె, వాహనమా గరుడక్షతమయ్యె, అయ్యెడ ఇకపారిపోవలయునని భావించుచున్న ఇంద్రుని మహావీరునికని సత్యభామ త్రిభువనేశ! శచీ భర్తవుగదా! నీవు పారిపోవుట తగునా! పారిజాతమాలా సంపూర్ణవైభవ శచీదేవి నిన్ను సేవించుచున్నది. పారిజాత పుష్పమాలనుగైసేసి వలపుగొని మున్నట్లు దరికేతెంచు శచీదేవిం కనుగొనని నీకు దేవరాజ్య మేపాటిది? శక్ర! ప్రయాసపడకు! సిగ్గుపడ దగదు. పారిజాతమిది గొనిపొమ్ము. దేవతలు దిగులుపడవలదు. ఇంటికి వచ్చిన నన్ను పతిగర్వాతిశయముచే శచి సబహుమానముగ సోపచారముగ చూడలేదు. నేను స్త్రీ నగుటచే ఉదారభావము లేనిదానను. నామగడు నన్నెపుడు బహుమానించునన్న దురభిమానమున తమతో జగడము పెట్టికొంటిని, ఒరుల సొమ్ము హరించిన సొత్తు పారిజాతము వద్దు. ఆమె తన చక్కదనముచే, మగనిచే గర్వించినది. ఏ ఆడుది గర్వింపదు! అన సత్యభామ పలుకులు విని ఓ చండి! కోపనా స్వభావ! చాలుచాలు. మిత్ర భేదము చేయువచన విస్తరముఇక వలదు. సర్గస్థితి సంహార కర్తయైన విశ్వరూపి భగవంతునిచేత ఓడిన నాకు సిగ్గేమి? దేవీ! సృష్టి స్థితి ప్రళయ పాలన కారణమై ఆది మధ్యాంతములు లేని పరమాత్మచే ఓడిన నాకు లజ్జయేమి. అట్టి అజునిచేసియుచేయనివాని శాశ్వతుని, జగదుపకార నిమిత్త లీలామానుషావతారుని ఎవ్వడు గెలువ సమర్థుడు? అని ఇంద్రుడు స్తుతించెను.

పరమాత్మ లీలావిహార వైభవము

ఇంకను భగవంతుని లీలామానుష చరితమును వివరించుము శ్రీ పరాశరుడు ఇట్లు పలికెను: దేవరాజిట్లు వినుతింప, భగవంతుడల్లన నవ్వి, భావగంభీరముగ, “భువనేశ! నీవు దేవరాజవు. ఇంద్రుడవు. మేము మర్త్యులము. నేను అపరాధము చేసితిని. నీవు క్షమింపతగుదువు. ఈ పారిజాతము, దానికి ఉచితమైన తావునకు గొనిపోదగును. సత్యభామావచనముబట్టి దీనిని నేను గైకొంటిని. నీవు నాపైవైచిన ఈ వజ్రమును నీవే గ్రహింపుము. శత్రువిదారణమైన ఈ ఆయుధము నీదే; నీదగ్గర ఉండతగినదే”. అన విని ఇంద్రుడు ఇట్లనియె.

“ఈశ్వర! నేను మర్త్యుడననుచు నన్నేల తబ్బిబ్బు పఱతువు? నిన్నెఱుంగము. ఎవడవో? ఒక్కడవు అగుదువుగాక! జగత్ర్పవృత్తి త్రాణములు నడపు నాథుడవు నీవు. జగమ్మునందు శల్యనిష్కర్షము చేయుచున్నావు. (లోకములకు శల్య ప్రాయులై బాధించువారిని ఉన్మూలించుపని నీది) కృష్ణా! ఈ పారిజాతమును ద్వారకకు గొని పోదగును. నీవు మర్త్యలోకము వీడిన తఱి ఇదియును అక్కడ ఉండదు. దేవదేవ! జగన్నాథ! కృష్ణా! విష్ణూ! మహాభుజ! శంఖ చక్ర గదాపాణీ! నా తప్పిదమును క్షమింపుము”. అనిన అట్లనే అనిన ఇంద్రుని వీడుకొలిపి హరి భూలోకమునకు ఏతెంచెను. సిద్ధ గంధర్వులు సురలు పెక్కురీతుల వినుతించిరి.

అవ్వల ద్వారకకేగుదెంచి హరి శంఖము పూరించి ద్వారకావాసుల కానందమును కూర్చెను. సత్యభామతో గరుడునిదిగి పారిజాతతరువును ఆమెపెరటియందు తానై నాటెను. దానిని దరిసి జనమునకు పూర్వజన్మస్మృతికల్గును. దాని పూలపరిమళము పుడమిపై మూడామడ వ్యాపించును. ఆ పారిజాతమందు తమ ముఖ ప్రతిబింబములను కని యాదవులందరు తమ ముందటి జన్మములందైన అమానుష దేహబంధములు అన్నింటిని (అనగా తాము దేవతలమని దేశాధీశునితో పాటు అవనిపై అవతరించి పరమాత్మ లీలలో తాము పాల్గొనుటకు ఉపాధి ధరించివచ్చి నామని) దర్శించిరి. అవ్వల కృష్ణుడు నరకుని రాజధాని నుండి కొని వచ్చిన కనక మణిరత్నాది సంపదను అయ్యాదవులకు అందఱకు అప్పుడు పంచి ఇచ్చెను. నరకుని చెరబట్టగా తాను విడిపించిన కన్యలందఱను తాను గైకొనెను. అవ్వల ఒకే పుణ్యలగ్నమున వారందఱిని తాను పరిణయ మాడెను. వారు లెక్కకు పదాఱువేల నూఱుగురు. అందరు సుందరులకు అందరుతానై వారితో విలసించెను. వారందరు ఎవ్వతెమట్టుకు ఆమె, కృష్ణుడు నాపాణిం గ్రహించె నాకేలుపట్టి నన్నే పెండ్లాడెనని లోలోతలంచికొని మోదించిరి. శ్రీహరి విశ్వరూపము గొని ఓ మైత్రేయ! వింటివా! పరమాత్మ జగత్ర్సష్ట, కేశవుడు వారి గృహములందు రేలయందు నివసించెను. (V-31)

ఉషాపరిణయ ప్రసంగము

శ్రీ పరాశరుడనియె:

మైత్రేయ! రుక్మిణి సంతానము ప్రద్యుమ్నుడు మొదలుగా ఎఱింగించితిని. సత్యభామ భౌమభౌమేరికాదుల కాంచెను. దీప్తిమంతుడు తామ్రపక్షుడు మున్నగువారు రోహిణీ కుమారులు. జాంబవతికి సాంబుడు మొదలగు వీరులు హరివలన కల్గిరి. నాగ్నజితి కుమారులు భద్రవిందాదులు శూరులు. హరికి శైబ్యయందు సంగ్రామ జిత్తు మొదలయిన వారు కల్గిరి. మాద్రికి వృకాదులు, లక్షణకు గాత్రవంతుడు మున్నగువారు పుట్టిరి. కాళిందీ తనయులు శ్రుతుడు మున్నగువారు మరియుగల భార్యలందు హరికి ఎనుబదివేల నూరుగురు కుమారులుగల్గిరి. వారిలో ప్రద్యుమ్నుడు అందఱుకు పెద్ద. అతనికి అనిరుద్ధుడు, అతనికి వజ్రుడు కలిగెను. అనిరుద్ధుడు యుద్ధమున ఎవరికినికట్టు వడనివాడు. అతడు బాణాసురుని కూతురగు ఉషను పెండ్లాడెను. అప్పుడే హరిహరులకు పెద్ద ఘోరయుద్ధము జరిగెను. చక్రి ఆ యుద్ధమునందు బాణుని వేయి చేతులను ఖండించెను. అని చెప్పగా మైత్రేయుడు ఆ హరిహర సమర వృత్తాంతము విస్తరముగ ఆనతి ఇమ్మన శ్రీ పరాశరుడు ఇట్లనియె.

బాణుని కూతురు ఉషాదేవి. శంభునితో పార్వతి క్రీడించుటగని అట్టివిలాసముపై తాను ఉబలాటపడెను. అన్ని చిత్తములను గ్రహింపగలది కావున గౌరీదేవి చాలుచాలు. పెద్ద పరితాపపడకుము. నీవును నీమగనితో రమింతువనెను. అంతట ఉష ఎప్పుడు?

నా మగడెవ్వడగును? అని ప్రశ్నించెను. పార్వతి వైశాఖశుక్ల ద్వాదశినాడు నిన్ను కలలో ఎవడు కలియునో అతడు నీ మగడగుననియె. అన్నట్లుగ ఉషకు స్వప్న మందు ఆ రేయి ఒకానొకడు తన్నుపొందినట్లు కలవచ్చెను. ఆమెయు అతని యెడ అనురక్త అయ్యెను. ఆపై మేల్కొని ఆ చూచిన వానిని కానక సిగ్గువిడిచి ఏడి? ఏడి? ఎటుపోయెనని నెచ్చెలిని అడిగెను. బాణునిమంత్రి కుంభాండుడు. అతని కుమార్తె చిత్రరేఖ. ఆమె ఉషాదేవి చెలి. సఖీ! నీవు అన్న ఆ పురుషుడెవ్వడే అనెను. ఉష సిగ్గున చెప్పకున్న ఆమె పలురీతుల బ్రతిమాలి, నమ్మికకూర్చి, అడిగినంత ఆమె స్వప్న మందొక సుందరుడు తన్ను గలియుటను ఎఱిగించెను. మరియు ఆ రమణుని పొందు ఉపాయ మొనరింపు మనెను. అంతట చిత్రలేఖ ఇది తెలియుట ఏమి చాల కష్టము. తెలిసిన అతనిని పొందుట అంత కంటెను అశక్యము అయిన నాకు కూర్చుదానవు కావున కొంచెము ఉపకారము చేయుదును. ఏడు ఎనిమిది రోజులు ఓపిక పట్టుము. అని అంతఃపురములోని కేగి అయ్యుపాయము ఒనరించెను. ఒక వస్త్రమునందు సురలు దైత్యులు గంధర్వులు మనుష్యులలో ప్రధానులగు సుందరులు కొందరిని చిత్రించి చూపించెను. వారందరి చిత్రములను త్రోసిరాజని ఉష మనుష్యులలో, అందును వృష్ణ్యంధక కుటుంబములలోని యువక సుందరులపై సుందరి చూపు పెట్టెను. బలరామ కృష్ణమూర్తుల జూచి ఆ రమణి సిగ్గున నిశ్చేష్ట అట్లయ్యెను. ప్రద్యుమ్నుని దర్శించిన తఱి, లజ్జగొని వేఱొకవంకకు చూపు మరల్చెను. ఆ మీద ప్రద్యుమ్న తనయుని కాంతుని కనినంత మాత్రమున అత్యంత విలాస చకితమైన చూపున ఆ లజ్జను ఎటు నెట్టెనోకాని అతడే ఇతడు. అతడే ఈతడని అన్నదే తడవుగ నా చిత్రరేఖ యోగశక్తి గలది బాణకుమారి ఉషంగని ఇట్లనియె: ఈతడు కృష్ణుని పౌత్రుడు. గౌరీదేవి నీకు భర్తగా ప్రసాదించినవాడు. అనిరుద్ధుడను పేరందినవాడు, అందగాడు. ఈతని నీవు భర్తగా బడయుదువేని సర్వముం బడసినట్లే. కృష్ణపాలన మందున్నది, ద్వారకాపురమది. మున్ను దుష్ప్రవేశము. అయినను ప్రయత్నించి నెచ్చెలీ! నీ భర్తనుకొని తెత్తును. ఈ రహస్యమును ఎవ్వరికిని చెప్పవలదు. చిటికలో కొనివచ్చెద. నా యెడ బాటించుక సైరింపుమని ఉషను నెమ్మది పరచి చిత్రలేఖ ద్వారావతి కేగెను.

ఉషా అనిరుద్ధ కల్యాణము

శ్రీ పరాశరుండనియె:

బాణుడు త్రినేత్రుని ముందు వ్రాలి దేవా! యుద్ధములేక ఈ వేయి బాహువులు నాకెందులకని నిస్పృహుడనైతిని. నాకు నా ఈ బాహువులకు సాఫల్యము గూర్పగల రణమగునా? ఈ చేతులు పెనుబరువు నా కెందులకు అనగా శంకరుడు బాణా! నీ నెమలిటెక్కె మెప్పుడు విఱుగునో అప్పుడు మాంసాశనులకు మహానందముగూర్చు యుద్ధము నీకు సంఘటితముకానున్నది. అనవిని వీరుడగు శంభునికి మ్రొక్కి, బాణుడు ఇంటికివచ్చి, తనమయూర ధ్వజమువిఱుగుటగని ఉప్పొంగుచుండెను. ఇదే సమయమున అప్సరస చిత్రలేఖ యోగవిద్యాశక్తిచే ఆ అనిరుద్ధుని కొనివచ్చెను. అతడు అంతఃపురమునందు ప్రవేశించి, ఉషతో క్రీడించుటను ఎఱిగి రక్షకులుపోయి దైత్యపతికి తెల్పిరి. అతడు రాక్షస సైన్యమును ఆదేశింప ఆవచ్చిన సేనను పరిఘాఅను ఆయుధముచే అనిరుద్ధుడు కూల్చెను. తన భటులట్లుపడగా, బాణుడు అరద మెక్కివచ్చి అనిరుద్ధునితో పోరి ఓడిపోయెను. అవ్వల మంత్రులు ప్రేరేపించగా, మాయాయుద్ధ మొనరించి అనిరుద్ధుని నాగాస్త్రమున బంధించెను. అక్కడ ద్వారవతిలోన అనిరుద్ధుడుఎటుపోయెనని అనుకొను యాదవులకు నారదుడు అతడు బాణునిచే బద్ధుడగుటను తెలియచేసెను. మఱియు అతడు ఒక యువతిచే శోణనగరమునకు కొనిపోబడెనుకాని దేవతలచే కొనిపోబడలే”దని దేవముని చెప్పిన పలుకువిని యాదవులు ఇది నిక్కమని నమ్మిరి.

ఆపై హరి ప్రద్యుమ్నునితో తలచిన మాత్రమున, ఎదుటవ్రాలిన గరుడుని ఎక్కి బాణపురికేగెను. ప్రమథగణము ఆ మహాత్మునితో పురప్రవేశసమయమందే ఎదుర్కొనెను. వారినందరిని ఓడించి కృష్ణుడు నగరములోనికి ప్రవేశించెను. అప్పుడు బాణుని రక్షింప మూడుపాదములు మూడుతలలుగల శివజ్వరమువచ్చి హరితో పోరు సల్పెను. ఆ జ్వరము యొక్క భస్మపు స్పర్శవలని తాపము, కృష్ణ శరీరస్పర్శ మాత్రమున నశించెను. బలరాముడు కూడా దానిచే తాపశాంతిపొంది కన్నులు మోడ్చి సుఖానుభవము వెల్లడించెను. అవ్వల ఆజ్వరము హరితోబోరి కృష్ణశరీర నిర్గతమైన వైష్ణవజ్వరముచే సమసిపోయెను. నారాయణ బాహుఘాతముచే కలిగిన ఒత్తిడిచే విహ్వలమైన ఆ జ్వరమూర్తిని చూచి బ్రహ్మ వీనిని క్షమింపుమని హరిని వేడుకొనెను. కృష్ణుడు సైరించితినని పలికి వైష్ణవ జ్వరమును తనయందు ఇమిడించి కొనెను. అంతట జ్వరదేవత దేవదేవుని చూచి నీతోనే నొరించిన ఈ యుద్ధమును తలచుకొన్నవారు విజ్వరులు అగుదురని పలికి వెడలిపోయెను. ఆపై భగవంతుడు అగ్నులు ఐదింటిని శమింపజేసి దానవబలమును లీలగా చూర్ణమొనరించెను.

పిమ్మట బాణాసురుడు ఎల్లసేనలతో తరలెను. బాణుడును, శంకరుడును, కార్తికే యుడును, (దేవసేనాని కుమారస్వామి) శౌరితోపోరిరి. హరిశంకరుల ఆయుద్ధము అతి దారుణము అయ్యెను. సర్వలోకములు వారి శస్త్రాస్త్ర కిరణ జాతమున తపించిపోయెను. దేవతలు అది చూచి జగత్ ప్రళయము ఆసన్నము అయ్యెననుకొనిరి. గోవిందుడు జృంభకాస్త్రముచే శంకరుని జృంభింపజేసెను(బెండుపడజేసెను). దైత్యులును ప్రమథ గణమును, హరికి ప్రణమిల్లిరి. జృంభాస్త్రము దెబ్బతిని హరుడు రథము మొగ చతికిలబడెను. కృష్ణునితో పోరలేడయ్యె. గరుడుని ఱెక్కలం గుఱ్ఱములు కుంటుపడి ప్రద్యుమ్నాస్త్ర పీడితుడై కృష్ణుని హుంకారముచే శక్త్యాయుధముపారిపోగా తమరు బడిన కుమారస్వామి యుద్ధము నుండి తప్పుకొనెను. జృంభకాస్త్రమునకు శంకరుడు పడగాదైత్యసేనలును మందలమందలుగ ప్రమథ సైన్యము హరిచే క్షయింప, నందిసారథిగా బాణుడు రథమెక్కి కృష్ణకుమారులతో పోరుటకు యుద్ధభూమికి ఏతెంచెను.

మహావీరుడు, బలరాముడు, బాణములచే బాణు సైన్యమును పారగొట్టెను. మఱియు నాగటికొనచే, రోకలిచే, వీరి సైన్యమును చిందఱవందఱచేయు హరి, హలులచే ఓడిపోయిన తనసేనను చూచిన బాణుడు తాను అంతగా ఎదిరింప, ఆయుద్ధము అతిదారుణమయ్యెను. తీవ్రశరములచేత కృష్ణ సైనికుల కవచములను భేదించు బాణుని బాణములను హరి ఖండించెను. అవ్వల ఒండొరుల కొట్టుకొనిరి. తుట్టతుదకు శ్రీహరి బాణుని కూల్చి తీరవలెనను నిశ్చయము చేసికొని నూరుగురు సూర్యుల తేజస్సున వెలుగు సుదర్శన చక్రమునుపట్టెను. బాణుడు నశింపవలెనని దానిని విడువనున్నంత, కోటరీయమను నొకానొక రాక్షసవిద్య శక్తి నగ్నయై (దిగంబరయై) హరి యెదుట నిలువబడెను. దానింగని హరి కన్నులు మూసికొని సుదర్శ ఆయుధమును బాణినికి గురిసేసి, వాని బాహుసహస్రము తెగిపోవలెనని వదలెను. అది అసురులు ఒకవంక విసరు శస్త్రాస్త్రములను అన్నిటిని నరకుచు, బాణాసురుని చేతులను అన్నింటిని ఖండించెను. వాని బాహుసమూహమును అంతటిని ఖండించి. తిరిగి కృష్ణుని చేతిలో నిలిచెను. బాణునికూల్ప దానిని వదల వలెనను కొనుచున్నంతలో బాహువులన్నియును తెగి రక్తధారలు గురియుచున్న బాణునిచూచి త్రిపురారి, ఉమారమణుడు రమారమణు తలంపు ఎఱిగి ఎదుటికి ఏతెంచి సామ పూర్వ కముగ గోవిందునకు ఇట్లనియె:

శంకరుడు కృష్ణుని నుతించుట

కృష్ణకృష్ణజగన్నాథ! జానేత్వాం పురుషోత్తమమ్

 పరేశం పరమాత్మానమనాది నీధనం హరిమ్

దేవతిర్యఙ్మనుష్యేషు శరీరగ్రహణాత్మికా

 లీలేయం సర్వభూతస్య తవచేష్టోపలక్షణా

తత్ప్రసీదాభయందత్తం బాణస్యాస్యమయా ప్రభో!

తత్త్వయానానృతం కార్యం యన్మయావ్యాహృతం వచః

అస్మత్సంశ్రయదృప్తో అయం నాపరాధీతవావ్యయ

మయాదత్తవరోదైత్య స్తతస్తాంక్షమయామ్యహమ్

శ్రీ పరాశర ఉవాచ:

ఇత్యుక్తః ప్రాహగోవిన్దశ్శూలపాణిముమాపతిమ్

 ప్రసన్నవదనోభూత్వా గతామర్షో అసురంప్రతి

యుష్మద్దత్తవరో బాణోజీవతామేష శంకర

 త్వద్వాక్యగౌరవాదేతన్మయాచ క్రంనివర్తితమ్

త్వయాయదభయందత్తంతద్ద త్తమఖిలం మయా

 మత్తోవిభిన్నమాత్మానంద్రష్టుమహీసిశంకర

యోహంసత్వం జగచ్ఛేదం సదేవాసుర మానుషమ్

 మత్తోనాన్యద శేషం యత్తత్త్వం జ్ఞాతుమిహార్మాసి

 అవిద్యామోహితాత్మానః పురుషాభిన్నదర్శినః

 వదన్తిభేదంపశ్యన్తి చావయోర న్తరం హర!

 ప్రసన్నో అహంగమిష్యామి త్వంగఛ్ఛవృషభ ధ్వజ!

ఇత్యుక్త్వాప్రయయౌకృష్ణః ప్రాద్యుమ్నిర్యత్రతిష్ఠతి

 దర్బన్ధఫణినో నేశుర్గరుడానిలపోథితాః

తతో అనిరుద్ధమారోప్య సపత్నీ కంగరుత్మతి

 ఆజగ్ముర్ద్వారకాంరామకాష్ణిన్ దామోదరాః పురీమ్

 పుత్రపౌత్రైః పరివృత స్తత్రరేమే జనార్థనః

దేవీభిస్సతతంవిప్ర! భూభారతరణేచ్ఛయా

“కృష్ణా! కృష్ణ! జగన్నాథ! నిన్నునేను పురుషోత్తముడు పరేశుడు పరమాత్మ అనాధి నిధనుడు అగు హరివిఅని ఎఱుంగుదును. సర్వమును తానయ్యు దేవపశుపక్షి మనుష్యులందు లీలావిలాసముగా రూపొంది అవతరించుట ఇదినీకు ఉపలక్షణము. అందుచే ప్రసన్నుడవు కమ్ము. ఈ బాణునికినే అభయమిచ్చి ఉన్నాను. ఆనామాట నీవు అబద్దము చేయతగదు. నా అండగొని వీడు పొగరెక్కినాడు. అపరాధము చేయకుండ వలసినది చేసినాడు. నాచే వరమొందినాడు కావున వీని నేను క్షమించుచున్నాను.” అనవిని గోవిందుడు ప్రసన్నముఖుడై బాణునియెడ కోపముమాని శూలపాణికి ఉమాపతి (లక్ష్మీదేవి భర్త విష్ణువు) ఇట్లనియె:

“వీడు నీచే వరమువడసిన వాడుకావున బ్రతుకుగాక! నీ మాటయెడ గౌరవమున ఈ చక్రమును ఉపసంహరించెదను. నీవు వరమిచ్చుట అన్న, నేను ఇచ్చుటయే. నన్ను నీ కంటె అన్యునిగా కనవలదు. సదేవాసుర మానుషమైన ఈ జగము నాకంటె వేఱుగాదు. నీవును అట్లే తెలియుము. అవిద్యామోహితులైనవారు భిన్న దృష్టులై మన ఇద్దఱను భేదము జేసి పలుకుదురు, మనయందు భేదముగాంతురు. నేను ప్రసన్నుడనైతిని ఏగుచున్నాను. నీవును చనుము అని పలికి కృష్ణుడు ప్రద్యుమ్న కుమారుడున్న తావున కేగెను. అతని బంధించిన పాములు గరుత్ముంతుని గాలి తగిలిన మాత్రమున విరిసి చచ్చువడిపోయినవి. అవ్వల బలరామ కృష్ణ ప్రద్యుమ్నులు అనిరుద్ధుని సపత్నీకముగ రథము ఎక్కించుకొని ద్వారకానగరమునకు ఏతెంచి వివాహవైభవము కావించెను. అక్కడ జనార్దనుడు కొడుకులతో మనుమలతోకూడుకొని రుక్మిణి సత్యభామ మొదలుగాగల దేవీ సముదాయముతో భూభారమును అవతరింపచేయు తలంపున ఆద్వారకయందు సుఖముండెను.

పౌండ్రక వాసుదేవ వధ

మైత్రేయుడిట్లనియె. శౌరి మానుషమూర్తియై, అద్భుతమైన మహాకార్యములు ఎన్నో కావించెను. లీలామాత్రముగ ఇంద్రుని, పరమేశ్వరుని, దేవతలను మఱి పెక్కుమందిని జయించెను. దేవతలుచేసిన చేష్టలను ఇంకేమి ఏమియువమ్మొనరించె ఆయా లీలలను ఇంకను వినముచ్చట అగుచున్నది. కావున ఓ మహానుభావా! వానిని ఆనతిమ్ము అనగా శ్రీపరాశరులు ఇట్లనిరి: కృష్ణుడు నరావతార మెత్తి కాశీ నగరమును కాల్చెను. ఆకథ తెల్పెదను వినుము: అజ్ఞాన మోహితులగు జనులు నీవు వాసుదేవుడవే భువిలో అవతరించినావు అన పౌండ్రకుడు (పుండ్రదేశప్రభువు) వాసుదేవుడు అను నేనే ఇలపై అవతరించితినని జన్మాంతరస్మృతి కోలుపోయిన ఆపౌండ్రకుడు విష్ణుచిహ్నములన్నియు చేయించుకొని కృష్ణునికి ప్రతిగా వానినిధరించెను. అంతేకాక మహాత్ముడగు కృష్ణునిదగ్గరకు “ఓ మూఢా! నీవు బ్రతుక తలతువేని, విష్ణుని గుర్తులు చక్రాది చిహ్నములు విడిచి వాసు దేవుడు అను నా పేరును వదలి, నా కడకు వచ్చి, వ్రాలుము” అని ఒక దూతను పంపెను.

ఇదివిని, హరి దూతనుగని అల్లననవ్వి నీ చిహ్నమును చక్రమును నీపై విసరబోవు చున్నానని పౌండ్రకునకు చెప్పుము. నీమాటలోని భావము తెలిసినది, ఏది చేయతగునో దానిని చేయుము. ఆయాచిహ్నములు వేషము వేసికొనియే నీపురమున కేతెంతును. నిజ చిహ్నము చక్రమును వదలెదను. సంశయము లేదు. రమ్మని నన్ను ఆజ్ఞాపూర్వముగ అన్న నీమాటను రేపే నీకు అప్పగించెదను. నిముసము ఆగను. ఓరాజా! నీవలన భయము ఏమాత్రము లేకుండుగాక! ఇదే వచ్చి నిన్ను శరణుచొచ్చెదనని తెలుపుమని దూతను పంపి హరితలంచినంత అరుదెంచిన గరుత్మంతుని పైనెక్కి పౌండ్రక నగరమునకు చనియెను.

కాశీపతి హరి యుద్ధ ప్రయత్న వార్తవిని సర్వ సైన్యముతో స్వామిపైకి మడమలను త్రొక్కుకొని వచ్చెను. వానితోగూడి పౌండ్రకుడు వాసుదేవునికి ఎదురు నడచెను. చక్కని అరదమున ఉన్న వానిని దూరమునుండి చూచెను. చేత చక్రము, గద శార్ఙ్గము పద్మములను పూని వనమాలను ధరించి కిరీట కుండలములు తాల్చి గరుడచిహ్నితమైన జండా తోడి, వామ వక్షః స్థలమునందు శ్రీవత్స చిహ్నమును రచించుకొనిన వానిని నానారత్నాలంకృతుడై పీతాంబరధారిఅగువానిజూచి భావగంభీరముగ నవ్వెను. నానావిధ ఆయుధ శాలియైన వానితో తీవ్ర యుద్ధమును కావించెను.

శార్ఙ్గధనుర్విముక్త శరజాలముల గదా చక్ర విపాతనములను, క్షణములో వాని సేనలను కూల్చెను. కాశీరాజు సైన్యమును కూల్చి జనార్దనుడు తన చిహ్నములను చేయించి పెట్టుకొని వచ్చిన మూర్ఖునిపౌండ్రకునిచూచి ఇట్లనియె:

పౌండ్రకా! దూత ముఖమున నన్ను గూర్చి నీ శార్ఙ్గ చక్ర గదాది చిహ్నములు వదలుమన్న నీ మాట అక్షరాల పాటించెదను. ఇదిగో చక్రమును వదలితిని. ఇదిగో గదను వీడితిని. ఇడుగో గరుత్మంతుని కూడ వదలుచున్నాను. నీ ధ్వజముపై ఎక్కుగాక! అని పలికి వదలిన చక్రాయుధముచే వాడు చీల్చబడెను. గదచే దెబ్బకు కూల్చబడెను. గరుడునిచే ధ్వజము విరిగిపడెను. ఆవల లోకము హాహాకార మొనరింప, కాశీరాజు మిత్రునిపై మక్కువతో వాసుదేవునితో బోరెను, శార్ఙ్గధనుర్విముక్త బాణములచే కొట్టి లోకము వెఱగువడ వానిని కాశీపురిలో పడునట్లు విసరివైచెను. శౌరీ పౌండ్రకుని, కాశిఱేనిని, సపరివారముగ చంపి తిరిగి ద్వారవతి జేరి స్వర్గధామమందట్లు తాను క్రీడించెను.

ఆ పడిన, కాశిరాజు తలగని ఏమిది? ఎవ్వడిది నరకెనని వింతపడి వాసుదేవునిచే వాడుచచ్చుటనువిని, వానికొడుకు, పురోహితునితోగూడ శంకరుని పూజించి సంతుష్టుని ఒనరించెను. అవిముక్తము అను అమహాక్షేత్రమున వానిచే సంతుష్టినొందిన శంకరుడు వరము కోరుకొమ్మనెను. అతడు నాతండ్రిని చంపినవానిని చంపుటకు నీ అనుగ్రహముచే కృత్యఅను శక్తి విజృంభించుగాక అనెను. అట్లయగు లెమ్మని శూలి అనిన క్షణమున దక్షిణాగ్నినుండి మహాకృత్య అను శక్తి వాని నాశమునకు జ్వాలా కరాళమైన ముఖముతో అగ్ని శిఖలట్లున్నజుట్టుతో, పుర్రెలమాలతో, కృష్ణ కృష్ణ! అనుచు కోపముతో ద్వారావతికి చనెను. ఆమెను చూచి, ద్వారకాజనము భయపడి కన్నులు గిఱ్ఱునం తిఱుగ సర్వ జగచ్ఛరణ్యుడగు మధుసూదనుని శరఱొందెను.

కాశిరాజు కొడుకు వృషభ వాహనుని కొల్చి ఈ శక్తిని ఉత్పాదింప చేసినాడని గమనించి పాచికలాటలో ఉన్న హరి ఈ ఉగ్రశక్తి కృత్యను వహ్నిజ్వాలా జటిలమైన ఆకారము కలదానిని కూల్పుమని లీలామాత్రముగ సుదర్శనమును వదలగా అది అగ్ని మాలా జటిలముగ జ్వాలల క్రక్కుచున్న మహాభీషణమైన కృత్యను వెనుకకుతఱిమెను. చక్ర ప్రతాపమున ప్రతిహత ప్రభావయై ఆ మహేశ్వరీశక్తి బెండుపడి, పరుగిడి, వారాణసీ పురముననే ప్రవేశించెను. చక్రాయుధము దానిని వెంబడించి తఱిమెను. అంతట కాశీ సైన్యము ప్రమథ గణసేనలు సమస్త శస్త్రాస్త్ర సంయుతముగ చక్రమునకు ఎదురు నడిచెను. సుదర్శనము విజృంభించి కొండలతో గుట్టలతో గజములతో, గుఱ్ఱములతో, భుటులతోడి, అశేష గోష్ఠ కోశాగారాదులతో దేవతలకు కూడా తల తేఱిపాఱ చూడరాని ఆ కాశీపురిని అశేషగృహప్రాకార చత్వరములను, జ్వాలలతో నలుదెసలం క్రమ్మి పురమెల్ల దహించి వైచెను. అంతకును చల్లారని ఆగ్రహముతో అత్యుగ్రమైన హరి చక్రాయుధము ఇంకను సాధింపవలసినపని సాధనములు ఏమని అనుకొనుచునే అత్యద్భుత దీప్తితో విష్ణువు కరమున కేతెంచెను.  

బలరామ పరాక్రమ వైభవము

మైత్రేయుడు శ్రీ పరాశరులతో బలభద్రుడు చేసిన యమునాకర్షణాదులు విచిత్ర లీలలు తాము సెలవీయ నేనువిన్నాను. వెండియు ఆమహానుభావు డొనరించిన వింతలను తెలుపుడు అన అమ్మౌని ఇట్లు తెలుపదొడంగెను.

బలరాముడన కేవలము అనంతుడు, ధరణిని ధరించు శేషుడే. ఆయన అప్రమేయమూర్తి. సుయోధనుని కూతురును స్వయంవర సన్నాహము లందున్న దానిని జాంబవతి కొడుకు సాంబుడు, శూరాగ్రేసరుడు, బలిమియై ఎత్తికొనిపోయెను. దానిచేకుపితులై మహా వీరులు అగు భీష్మ ద్రోణ కర్ణ దుర్యోధనాదులు, యుద్ధమునందు సాంబుని ఓడించి బంధించికొనిపోయిరి. అదివిని యాదవులెల్లరు దుర్యోధనాదులపై కినుకగొని యుద్ధము చేయుటకు ఉద్యమించిరి. కృష్ణుడు వారిని ఆపి బలభద్రుడు నేను ఒక్కడను చాలుదుము. ఇదె కౌరవవులపై కేగెద. నా మాటనుబట్టి వానిని విడిపింతురని మదాలోల మధురాక్ష రముగ పలికెను. అన్నట్లు అతడు ఏగి హస్తి నగరమునకు పోయి బాహ్యోప వనమందు విడిదిచేసెను కాని పురములో మాత్రము ప్రవేశింపడయ్యెను. బలరాముని రాక తెలిసి, దుర్యోధనాదులు గోవును, అర్ఘ్యము రామునకు నివేదించిరి. అవి యథావిధిని గైకొని కౌరవులతో “ఉగ్రసేనుడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు సాంబుని వెంటనే విడుదల చేయుడు అనియె. భీష్మ ద్రోణాదులు మఱి రాజులు కర్ణ దుర్యోధనాదులు క్షోభించి కుపితులై బాహ్లికాదులు కౌరవులు,” యదువంశము రాజ్యార్హము కాదని చూచికూడ ఓముసలీ! నీవు ఇప్పుడు పలికిన మాటయేమి? కురుకులము వారికి యాదవుడెవ్వడు అన ఇచ్చును? ఉగ్రసేనుడు కూడ కౌరవులను శాసించువాడగునేని శ్వేతచ్ఛత్రములు రాజయోగ్యములైన విడంబనము ఇంకచాలును. ఓ బలా! నీవు పొమ్ము; మానుము. అన్యాయవర్తముని సాంబుని, నీ యొక్క ఉగ్రసేనుని యొక్క ఆజ్ఞతో వదలిపెట్టము. మాన్యులమైన మాకు కుకురాంధకులు చేసిన ప్రణతినిగూడ మేము ప్రణతిగ స్వీకరించుట లేదు. అది చేయబడనట్లే. అట్టియెడ భృత్యులగు మీరు మాకాజ్ఞ ఇచ్చుట ఏమి? సహాఆసన సహభోజనముల వలన మీరు గర్వమెక్కింప బడినారు. మీ తప్పేమి? మీ పై ప్రీతిచే నీతిని గమనింపని పొరపాటు మాది. ఓ బలరామ! నీకు ఇప్పుడు ఇచ్చిన అర్ఘ్యము (పూజ) ప్రేమచే ఈయబడినది. ఇది మాకులమునుండి మీ కులమునకు ఉచితమైనది కాదు.” అనిపలికి, కురువులు హరికుమారుని సాంబుని వదలమను నిశ్చయమునకు వచ్చి అప్పుడు హస్తినాపురమున ప్రవేశించిరి.

తిరస్కారమువలన గల్గిన కోపముచే మత్తుగొని ఘూర్నిల్లి లేచి, హలాయుధుడు మడమనే భూమిని అదిమి కొట్టెను. ఆ దెబ్బతో భూమి బ్రద్దలయ్యెను. ఆ మీద దిక్కులు ప్రతిధ్వనించునట్లు బాహువులు చఱచెను. కనులుమిగుల ఎఱుపెక్క కనుబొమలు ముడివడి, మోము కుటిలముకాగ, “నిస్సారులు దురాత్ములు అగు కౌరవులకు అహో! ఎంతపొగరు! వీరి దొరతనము మాకాల ప్రభావము వలన వచ్చినది. మా గ్రహవిదశ తాత్కాలికముగ వక్రమగుటచే వచ్చినదిగదా!, దానిచేగదా! ఉగ్రసేనుని ఆజ్ఞనుగూడ ఇపుడుల్లం ఘింపదలచుచున్నారు. సుధర్మసభను అధిష్టించినవాడు ఉగ్రసేనుడు; శచీపతికాడు; ఛీఛీ! చాలమంది మానవుల ఉచ్చిష్టమైన రాజాసనమునందు వీరికి తుష్టికలిగినది ఎంత నీచము! ఎవ్వని నౌకరులు అంగనా జనము పారిజాత పుష్పమంజరులను కొప్పులంతురుముదురు అట్టివాడు మా ప్రభువు సమస్త రాజాధిరాజు, సార్వభౌముడు, ఉగ్రసేనుడట్లుండు గాక! ఇప్పుడు ఇర్విషి నిష్కారవము ఒనరించి ఆఱేని రాజధాని కరిగెదను. కర్జుని, దుర్యోధనుని, ద్రోణుని, భీష్ముని, బాహ్లికుని, దుశ్శాసనాదులను, భూరిని, భూరిశ్రవసుని సోమదత్తుని, శల్యుని, భీమార్జున యుధిష్టిరులను, కవలలను మఱియునుగల కౌరవులను గజాశ్వరథ బలముతో మట్టుపెట్టి వరుడగు సాంబకుమారుని భార్యతోసహా చేకొని ద్వారకా పురికేగి ఉగ్రసేనాదులను బందుగులతో దర్శింతును. లేదా కౌరవ రాజధానిని (హస్తినా పురమును) కౌరవులతో గంగలో కలిపెదను.”

అని పలికి మత్తున ఎఱుపారుకన్నులతో, ప్రాకార వప్రదుర్గముల లాగిపెల్లగించు టకై క్రిందముఖమైయున్న నాగలింబట్టిలాగెను. అంత నొక్కుమ్మడి ఆ ఘూర్జితమైన హస్థినాపురమునుగని, హృదయములు సంక్షుబ్ధములై, కౌరవులు మొఱ్ఱోయని ఆక్రోశించిరి. “రామా! రామా! మహా వీరాగ్రేసరా! క్షమింపు క్షమింపుము. కోపము ఉపసంహరింపుము. ప్రసన్నుడ వగుము. ఇదిగో సాంబుడు భార్యతో నీబలిమిని వెడలింప బడినాడు నీ ప్రభావమును ఎఱుంగక అపరాధము చేసిన మమ్ము క్షమింపు”మనిరి. అవ్వల కౌరవులు సపత్నీకముగ సాంబుని తమ పురమునుండి సాగనంపిరి. అతడును భీష్మ ద్రోణ కృపా చార్యాదులకు నమస్కరించి మరలి, వక్తకావున నేను శమించితినని పలికెను. నేటికిని అట్టిట్టు మట్టుగ కదలిన రూపముతో ఆ నగరము కానబడుచున్నది. బలరాముని బల శౌర్యోప లక్షణమైన ప్రభావ మిది: బలరామునితో గూడ సాంబుని కౌరవులు పూజించి ఉద్వాహ ధనముతో (సారెతో) భార్యతోగూడ సాగనంపిరి.

బలరామకృత ద్వివిధ సంహారము

శ్రీపరాశరుడు ఇట్లు అనెను:

మైత్రేయ! వినుము. దేవపక్షవిరోధి నరకుడు. వాని మిత్రుడు ద్వివిదుడు అను వానరుడు. అతడు బలశాలియై, దేవతల యెడ వైరము గొనెను. కృష్ణుడు దేవేంద్ర ప్రేరణచే నరకుని చంపెను. కావున దీనికి ప్రతిక్రియ చేయుదునని ద్వివిదుడు దేవతలయెడ పగగొని యజ్ఞ విధ్వంసము ఆరంభించెను. మర్త్య లోకమునకు హానియు చేసెను. సాధువుల మర్యాదలను విచ్ఛిన్నపరచెను. ప్రాణులను నశింపజేసెను. దేశ నగర గ్రామవన ప్రదేశములను కాల్చెను. పర్వతములను ఎత్తి పడవైచి, గ్రామములను పిండికొట్టెను. కొండలను నదులందు, సముద్రమందు పడవైచెను. దానివలన ఉదధిపొంగి, పొంగి, కట్టదాటి దరినున్న పురగ్రామాదుల ముంచి వైచెను. ఆ వానరుడు కామరూపి కావున పెద్ద రూపమును గొని దూకుచు, సమ్మర్దపరచి చూర్ణము గావించు చుండెను. ఆ దుష్టునిచే సర్వ జగము ధ్వంసమొంది స్వాధ్యాయ వషట్కారములు పోయి మిగుల దుఃఖితమయ్యెను. ఒకప్పుడు బలరాముడు రైవతుని ఉద్యానమున తన ఇంతి రేవతితో మఱియుగల పెక్కుమంది తరుణులతో మద్యపానము చేసెను. అప్పుడు పెల్లున పాటలు పాడుచు తరుణీ రత్నములమధ్యయందు, నందనవనమున కుబేరుడట్లు క్రీడించెను. అంతట ఆ కోతి ఏతెంచి హలాయుధుని, నాగలిని, ముసలమును గైకొని ఈ బలరాముని ముందు కోతి చేష్టలుచేసెను. అట్లే ఆ అంగనల ముందు పండ్లు ఇగిలించి వెక్కిరించెను. మద్య పూర్ణములయిన కల్లుముంతలు పగులగొటఅట్టిటు పారవైచెను. అప్పుడు హలి కోపము గొని వానిని బెదరగొట్టెను. అయినను వాడాతనిని అవమానించుచు, కిలకిల ధ్వనిచేసెను. వానినట్లు వెక్కిరింపనిచ్చి, బలరాముడు రోషముగొని ముసలము చేపట్టెను. వాడు ఒక రాతిబండను పట్టుకొని విసరెను. దానిని బలరాముడు ముసలాయుధమున పగులగొట్టి క్రింద బడవైచెను. అవ్వల వాడావలకు దూకి, బలరాముని రొమ్మున ముసలముతోకొట్టెను. పిమ్మట బలరాముడు కోపముగొని వాని నడినెత్తిన గుప్పిట పొడిచినంత వాడు, రక్తము గ్రక్కుకొని ప్రాణములు వాసి నేలపై కూలెను. వజ్రాయుధుని వజ్రముచేవలె వాని శరీరముచే ఆ గిరి శృంగము నూరు బ్రద్దలయ్యెను. అంతట దేవతలు వచ్చి రామునిగని నీ విక్రమము బాగుబాగని కొనియాడుచు పుష్పవర్షము కురిపించిరి. రాక్షసపక్షమునకు ఉపకారియైన ఈ పాడుకోతిచే జగమెల్ల ధ్వంసము చేయబడినది. భాగ్యవశమున వాడు నాశనమంది నాడని సురలు పలికి, గుహ్యకులతోకూడ అమరులు ఆనంద భరితులై స్వర్గమున కేతెంచిరి. ఇట్టివి ధరణినిదాల్చు శేషుని మూర్తియైన బలదేవుని లీలలు అనంతములు. అపరి మేయములు. (V-36)

యాదవకులోప సంహారము

ఇట్లు జగద్రక్షణ కొఱకు శ్రీకృష్ణుడు బలదేవుని తోడ్పాటుగొని దుష్టరాజుల యొక్కయు, దైత్యుల యొక్కయు సంహారమును గావించెను. ఫల్గునునితో గూడ సర్వాక్షౌహిణీ సేనా నాశముచేసి భూభారమును కూడ దించెను. ఇట్లు కావించి విప్రశాపము మిషమున యాదవ కులమును గూడ ఉపసంహరింప చేసెను. ద్వారకను వదలి, మానుష రూపమును వీడి విష్ణువంశమైన కృష్ణుడు తన విష్ణుపదమున ప్రవేశించెను. అనవిని కృష్ణపరమాత్మ అయ్యాదవ వంశ సంహారాదులు ఎట్లు చేసెను తెలుపుమని మైత్రేయుడు అడుగ పరాశరుడు ఇట్లు పలుకదొడగెను.

విశ్వామిత్ర, కణ్వ, నారదులు మహామునులు పిండారక తీర్థమందు యదుకుమారులకు కనబడిరి. అయ్యాదవులు యౌవనమున మత్తెక్కి కాగల కార్యవిధి ప్రేరణచే జాంబవతీ కుమారుని సాంబుని ఆడుదానిగా అలంకరించి వినతులై, అమ్మునులకు ప్రణమిల్లి ఈ ఇంతి కొడుకును కనకోరికగలదై ఉన్నది. కొడుకుపుట్టునా? చెప్పుడనిరి. అమ్మునులు దివ్యజ్ఞాన సంపన్నులుగాన యదుకుమారులచే మోసగింపబడి కోపముగొని, ఈమె ముసలమును కనును. అది అతిలోక ప్రభావము, సర్వయాదవుల సంహార కారణము. దానిచే సర్వయాదవుల కులనాశము కాగలదనిరి. ఆ బాలురది ఎల్లను ఉగ్రసేన మహారాజునకు ఎఱింగించిరి. సాంబుని కడుపున ముసలము పుట్టనే పుట్టినది. ఉగ్రసేనుడు ఆ ముసలమును పొడి గొట్టించెను. అది ఏరకాచూర్ణము అయ్యెను. దానిని యాదవులు సముద్రమందు పడవేసిరి. ముసలాయుధము చూర్ణముకాగా, మిగిలిన ఖండముతో మరము రూపమున ఉన్న దానినిగూడ సముద్రమున పారవేసెను. దానిని ఒక చేపతినెను. ఆ చేప జాలరుల వలలోపడగా దానిని చంపి ఒక లుబ్ధుడు గైకొనెను. భగవంతుడు మధువైరి పరమార్థమిది ఎల్ల ఎఱింగియు, విధివిహితమైనందున దానిని అన్యధాకరించుటకు తలంపడయ్యె. అదే సమయమున దేవతల పనుపున వాయుదేవుడు ఏతెంచి హరికిని బ్రణమిల్లి ఏకాంతమున నేను అమరులు పంపగావచ్చిన దూతను. వసు రుద్ర ఆదిత్యా శ్విన్యాది సాధ్యాదు లందఱతో గూడి ఇంద్రుడు తమకిట్లు విన్నపము చేయుచున్నారు. ఆలింపుము. భూభార అవతరణమునకై వందయేండ్లపైగా ఇమ్మేదినిపై నీవు దేవప్రేరణముచే అవతరించితివి. దుష్టులు దైత్యులు స్వర్గమున నీచే సనాథులగుదురు గాక! నూరేండ్లు జరిగినవిఇక తమ ఇష్టమేని తాము స్వర్గమునకు దయచేయ వలయును. తమకిటనే ఉండ అభిలాషయేని, అనుచరులతో ఇక్కడనే ఉండవలెను.” అనగావిని భగవంతుడు ఇట్లు అనియె:

“ఓ దేవదూత! నీ వన్న దెల్ల నేను ఎఱుంగుదును. యాదవ వంశనాశము నేనే ఆరంభించితిని. తెగపెరిగిన యాదవులచే ఇపుడు గూడ బరువెక్కిన ఈభూమి భారము దింపి, ఏడు రాత్రులలో సముద్రమునుండి ద్వారకను గొనివచ్చి యాదవులకు ఇచ్చి సంకర్షణునితో ఈ మనుష్య శరీరమును ఉపసంహరించి దేవసదనమునకు ఏతెంతును. దేవేంద్రుడు దేవతలును నేను అక్కడకు వచ్చినాడను అనియే తలంపవలయును. జరా సంధాదులెందఱో నిహతులైరి. కాని యాదవుల వలనగూడ బరువెక్కిన ఈ భూభార మింత మాత్రాన తగ్గలేదు. ఈ పెనుబరువునుకూడ దింపి, యమపరలోకపాలనకు ఏను ఏతెంతును. ఈ మాట వారికి చెప్పుము.” అని వాసుదేవుడు ఇట్లు పలుక దేవదూత వాయు భగవానుడు భగవంతునికి ప్రణతుడై దివ్యగతి ఇంద్రుని దరికి ఏతెంచెను.

కృష్ణ భగవానుడు దివ్యభౌమ అంతరిక్షములు అయిన ఉత్పాతములను రేయింబవళ్లు ద్వారకయందు చూచెను. చూచి యాదవులతో “ఇదిగో చూడుడు” అని వాని ఉపశమనమునకు వెంటనే ప్రభాసతీర్థమునకు అరుగుదము అనెను. అది విని యాదవ ప్రవరుడు మహాభాగవతుడు ఉద్ధవస్వామి హరినిగని: “స్వామీ! నేనిపుడు ఏమి చేయవలయును ఆనతిమ్ము. ఈ యాదవకులమంతను నీవు ఉపసంహరింతువని తలచెద. ఈ వినాశమునకు శకునములను కూడ నేను చూచుచున్నాను” అన విని కృష్ణభగవానుడు ఇట్లు అనియె:

నీవు నా అనుగ్రముచే లభించిన దివ్యగతిని గంధమాదన పుణ్య బదర్యాశ్రమమునకు అరుగుము. పవిత్ర నరనారాయణ స్థానమందు గలదు. నాపై మనసునిల్పి అక్కడ నా అనుగ్రహమున సిద్ధినందెదవు. నేను ఈ కులమును ఉపసంహరించి స్వర్గమునకు వత్తును. నే విచిడిన ద్వారకను, సముద్రుడు ముంచి వేయును. నా నివాస సౌధ మొక్కటి మాత్రము నావలని భయమున ముంచడు. భక్త హితముగోరి నేక్కడ సన్నిహితుడను అయ్యెదను. అనవిని, ఉద్ధవుడు కేశవానుమోదితుడై సత్వరము నరనారాయణ స్థానమైన బదరీ తపోవనమునకు చనెను. అవ్వల, యాదవులెల్లరు శీఘ్రములైన రథములనెక్కి బలరామ కృష్ణులతో ప్రభాస తీర్థమునకుచనిరి. కుకురాంధక వృష్టి వంశములవారు అందరు వాసుదేవ ప్రచోదనచే తెగత్రావిరి. అట్లు త్రావి, ఒండొరుల సంఘర్షణ నొదివిన, ప్రేలుడు అను కట్టెలను గనగన మండు కలహాగ్ని సర్వనాశకము పుట్టెను. అనవిని “వారివారి వంతు వారువారు అనుభవించుచుండ వారికే నిమిత్తమునకలహము పుట్టెను; సంఘర్షణలు ఎందుల కయ్యెను అది నాకు తెలుపుము” అన పరాశరుడు ఇట్లనియె.

నా అన్నము రుచిగానున్నది. నీవుతిను అన్నము రుచిపచి లేనిదని యాదవులలో ఒండొరులకు మష్టామృష్ట నిమిత్తమైన కథ సాగెను. దాన వారికి సంఘర్షణ కయ్యము ఆరంభమైనది. అంతట కోపముచే గ్రుడ్లు ఎఱ్ఱపడ, ఒండొరులతారసిల్లి ఆయుధములచే బాదుకొనజొచ్చిరి. వారిని ఆకలహమునకు దైవమే బలాత్కరించినది. ఆయుధములు అన్నియు అయిన తరువాత దాపుననున్న తుంగను పట్టుకొనిరి. అది చేపట్టగానే అది వజ్రాయుధమైనట్లు కానవచ్చెను. దానిచే దారుణమయిన ఆ పోరు ప్రద్యుమ్న, సాంబ ప్రముఖులు, కృతవర్మ, సాత్యకి, అనిరుద్ధాదులు, పృథువు, విపృథువు, చారువర్మ, చారు కుడు, అక్రూరాదులు ఒకరినొకరు తుంగగడ్డి రూపములయిన వజ్రములచే కొట్టుకొనిరి. హరి వారిని ఆపెనుగాని, వారాతనిని శత్రువులకు సహాయుడని భావించి పరస్పరమింకను బాదుకొనిరి. అదిగని కృష్ణుడు కుపితుడై తుంగనుగుప్పిట బట్టినంత అదియు లోహమ యమైన ముసలమయ్యెను. ఆతతాయులైన అయ్యాదవులను ఆతడు దానిచేబాదెను. తక్కినవారు. వారును బాదుకొనిరి. అవ్వల చక్రాయుధుని అరథము దారుకుడు చూచుచుండగనే గుఱ్ఱములతో సాగరమునబడెను. చక్రము, గద, శార్ఙ్గము, అమ్ములపొది, శంఖము, ఖడ్గమును హరికి బ్రదక్షిణముచేసి ఆదిత్యమండల మార్గమున ఏగినవి. ఒక్క క్షణములో యాదవులలో కృష్ణుడు దారుకుడుతప్ప కొట్టబడని వాడొక్కడును లేడయ్యెను. ఆ ఇద్దరు అడుగులు వేసికొనుచు, చని వృక్షము మొదలనున్న బలరాముని చూచిరి. ఆయన ముఖమునుండి ఒక్క మహాసర్పము వెలువడు చున్నట్లును కాంచిరి. పెద్ద పడగగల ఆపాము అట్లు అతని మోము వెడలి సిద్ధులు నాగులు పూజింప సముద్రమును చొచ్చెను.

అవ్వల సముద్రుడు అర్ఘ్యమును గొని బలరామునికి ఎదురుగా ఏగెను. అటు పిమ్మట నాగులచే అర్చింపబడుచు, హలి (బలరాముడు) నీటిలోని కరిగెను. బలరామ నిర్మాణమును గాంచి హరి దారుకునితో నీవీవార్త యెల్ల వాసుదేవునికి ఉగ్రసేనునికి చెప్పుము. బలభద్రుని నిర్యాణమును, యాదవకుల క్షయమును ఎఱింగింపుము. నేనును యోగ సమాధి నిలిచి కళేబరము విడిచెదను. ద్వారకా వాసులకును, నాహుకుని’ ఈ నగరమునెల్ల సముద్రుడు ముంచివేయును. కావున మీరందఱు అర్జునుని రాక కెదురుచూడుడు. అతడిటకు వచ్చి నిష్క్రమించిన తరువాత మీరు ద్వారకానగర మధ్యమందు ఉండరాదు. అతనితో అతడెట కేగును అచ్చటికి మీరును ఏగుడు’ అని చెప్పుము. నీవేగి నామాటగా అర్జునునికి ఇట్లు ఈ నా భార్యావర్గమును యథాశక్తి కాపాడవలయునని చెప్పుము. నీవును, అర్జునునితో ద్వారవతి యందలి జనముం గొనిచనుము. వజ్రుడును రాజు కాగలడు. ఇదివిని దారుకుడు మఱిమఱి కృష్ణునికి మ్రొక్కి, పలుమారులు ప్రదక్షిణముచేసి ఆచెప్పినట్లు ద్వారకకేగి అర్జునునికి ఆమాటలు విన్నవించెను. వజ్రుని గొనివచ్చి రాజు గావించెను.

భగవంతుడగు గోవిందుడు వాసుదేవాత్మకమైన పరబ్రహ్మమును తనయందు ఆరోపించికొని సర్వభూతములందును ధారణచేసెను. నిష్ప్రపంచమగు ఆత్మయందాత్మను సంయోజించి తుర్యావస్థాత్మకుడై ఆపురుషోత్తముడు శయనించెను. దుర్వాసమహర్షి మున్నేమి పలికెనో ఆ మాటను గౌరవించుచు తన పాదమును మోకాలిపై నుంచి యోగ సమాధి స్థితుడు అయ్యెను. జరసుడుఅను బోయ ముసలము యొక్క అవశేషమైన లోహ బాణమును తోమరమును జతచేసి ఏతెంచెను. వాడు హరి పాదమును మృగపాదమట్లున్న దానిని అల్లంత దూరము నుండి చూచి ఆ తోమరముతో ఆ పాదతలమును గురిచేసి కొట్టెను. అటుపై అక్కడ వాడు చతుర్బాహుధారియైన విష్ణుని దర్శించెను. ఆయనకు మఱియు ప్రణతిచేసి దయ చూడుమని మఱిమఱి పలికెను. ఇదియొక లేడి అనుకొని తెలియక కొట్టితిని. నా పాపముచే దగ్ధుడను అగుచున్న నన్ను క్షమింప వలయును రక్షింప వలయునని వాడు వేడుకొనెను. అంతట భగవంతుడు “నీకు అణు మాత్రమేని భయము వలదులుబ్ధక! నా అనుగ్రహముచే నీవు దేవతావాసమగు స్వర్గమునకుచనుము” అనెను. ఆ మాట పలికినదే తడవుగ అరుదెంచిన విమానమెక్కి ఆ హరి ప్రసాదమున ఆబోయ స్వర్గమునకు చనెను. వాడటు పోయినంత కృష్ణ భగవానుడు తన్ను బ్రహ్మ భూతమును, అవ్యయమును, అచింత్యమును, అమలమును, వాసుదేవమయమును, అజమును, అమరమును, అప్రమేయమును, అఖిలాత్మకము అయిన తన విష్ణు తత్త్వమునందు ఆత్మను సంయోజించి దశాత్రయమును దాటి మానుష దేహము త్యజించెను. (V-37)

పరీక్షితుని పట్టాభిషేకము

శ్రీ పరాశరుడు ఇట్లు అనియె:

అర్జునుడు బలరామ కృష్ణ శరీరములను చూచి సంస్కారము కావించెను. మఱియుంగల అందరకును క్రమముగా అంతిమ సంస్కారములను చేసెను. రుక్మిణి మొదలుగాగల అష్టమహిషులు కృష్ణ శరీరమును కౌగిలించుకొని అగ్ని ప్రవేశము చేసిరి. రేవతి బలరామ దేహమును కౌగిలించి ప్రజ్వలదగ్నిలో చొచ్చెను. ఆమె తాకినంత అగ్ని ఆనందభరితుడై చల్లనయ్యెను. అదివిని ఉగ్రసేనుడు, వసుదేవుడు, దేవకి, రోహిణియు అగ్నిని చొచ్చిరి.

అర్జునుడు ప్రేతకృత్యము ఎల్లరకు యథావిధి కావించి, తక్కిన జనమునుగొని వజ్రుని వెంటనిడికొని బయలుదేరెను. ద్వారవతినుండి వెడలిన వేలకొలదిగాగల శ్రీకృష్ణుని భార్యలను, వ్రజుని పురజనమును కాపాడుచు అల్లనఏగెను. కృష్ణుడు మర్త్యలోకమును వీడినంతనే సుధర్మఅను ఇంద్రసభయు, పారిజాతమును, స్వర్గమునుచేరెను. ఏ దినమున హరి దివ మ్మునకరిగెనో ఆనాడె నల్లనిమేనివాడు బలీయుడు అయిన కలి అవనికి దిగెను. మహోదధి శూన్యమై పోయిన ఆ ద్వారకా నగరమును ముంచివేసెను. వాసుదేవ మందిరము ఒక్క దానిని మాత్రము ముంచడయ్యెను. ఓ బ్రహ్మణ్యుడ! వినుము ఇప్పటికిని సముద్రుడు ఆ నగరమును ఆక్రమింపలేకున్నాడు. అక్కడ అవ్యయుండగు కృష్ణ భగవానుడు నిత్య సన్నిహితుడై ఉన్నాడు. ఆ స్థానము సర్వపాతక నాశనము, మహాపుణ్యము. విష్ణు శ్రీ సంపన్నము. దర్శనముచేసినంతనే, పాపముపోవును. ద్వారకావాసుల కందరకు అర్జునుడు బహుధాన్య ధనసమృద్ధమైన పంచనతమను దేశమందు ఉనికి ఏర్పరచెను.

అటు మీద విల్లుపూని ఒక్కడు పార్థుడు, విధవలైన స్త్రీలను కొనిపోవుట చూచి దొంగలకు ఆశపొడమెను. ఆ పాపకర్ములు ఒండొరులు గదిసి, మిగుల పొగరెక్కిన వారై ఇడుగో ఒక్కడు అర్జునుడు విగత భర్తృకమయిన స్త్రీ జనమునుగొని మనలను అతిక్రమించుకొని పోవుచున్నాడు. ఛీఛీ! మీ బలము ఏ పాటిది? భీష్మ, ద్రోణ, జయద్రధులను, కర్ణుని జంపి పొగరెక్కి పల్లెటూరి వారమగు మన బలమెఱుంగకున్నాడు. కర్రచేకొనిన మనలను చూచి దుర్మతి వీడు తాను ధనుష్పాణియై నేను మేటి విల్కాడనని మనలనందరను అవమానించుచున్నాడు. ఎందులకు మనకీ పొడవు చేతులు? అని ఆ దొంగలు కర్రలుగొని, మట్టి ఇటుకలుగొని, వేలకొలదిమంది ఆ విధవా జనముపై పరువెత్తిరి. అది చూచి అర్జునుడు ఆఆభీరులను చూచి నవ్వుచునే, “ధర్మ జ్ఞాన హీనులు మీరు బ్రతుకదలతురేని మరలిపొండు” అనెను. అతని మాట నీసడించి వాండ్రు ధనమును కృష్ణుని భార్యలైన స్త్రీ ధనమునుకా జేసిరి. అంత అర్జునుడు యుద్ధమున వమ్ముగాని గాండీవమునుచేకొని ఎక్కిడ బూనెను. కాని అది చేయలేకపోయె. అతి కష్టము మీద ఎక్కిడెనుగాని అది అప్పుడే శిథిలమైపోయెను. అటుపై ఎంతఆలోచించినను అస్త్రములు జ్ఞాపకము రావయ్యెను. ఈసుగొని ఆఆభీరులపై బాణములను విసరెను. అవి వారి చర్మమును చించినవి అంతియ. అగ్నిదేవుడిచ్చిన అక్షయబాణములు అవికూడ కృష్ణుడు లేనందున అయ్యాల కాపరులతో పోరునెడ క్షయమునందెను అప్పుడు కౌంతేయుడు “ఇంతకుమున్ను నా బలమది అంతయు కృష్ణునిదే. దాననే సర్వరాజులను బాణ జాలములను కూల్చితిని” అని అతడు ఱెప్పవేసినంతలో, ఆమ్రుచ్చులాభీరులు అంగనామణుల యథేచ్ఛగా లాగికొని పోయిరి. కొందఱాడువాండ్రు పారిపోయిరి. ఆ మీద అమ్ముల వమ్మువోగా అర్జునుడు వింటికొప్పున అ దొంగలను కొట్టెను. ఆ దెబ్బలనుగని వారు పరిహసించిరి. అతడు చూచుచుండగనే ఆమ్లేచ్ఛులు వృష్ణ్యంధక స్త్రీజనమును అంతను కొనిపోయిరి. అందులకు జయశీలి అర్జునుడు ఎంతకష్ట మెంతకష్టమని దుఃఖించి ఆహా! భగవంతునిచే నేనిట్లు బలము హరింపబడిన వాడను అయితినని భోరున ఏడ్చెను. అదే విల్లు. అవే అమ్ములు. అదే రథము. అవే గుఱ్ఱములు. ఇవి ఎల్లను ఆ మహాత్ముడు లేమిని ఒక్క అడుగున అశ్రోత్రియునికి ఇచ్చిన దానమువలె అణగారిపోయెను. ఆహా! దైవమెంత బలవంతమైనది! అసమర్థమైన నీచ వర్గమునకు కూడ జయము కూర్చినది. అవే బాహువులు. అదే గుప్పిలి. స్థానము అదే. ఆ అర్జునుడనే నేను. పుణ్యము లేమి అయినయెడల, ఆతడు లేమిచే సర్వము అసారమైపోయినది. నాకు అర్జునత్వము, భీమునికి భీమత్వము నిక్కముగ ఆతడు చేసినదే. అతడు లేమి ఆభీరులచే రథిక శ్రేష్ఠుడను నేనోటువడితిని.

అని పలుకుచు జయశీలి అర్జునుడు ఇంద్రప్రస్థపురమునకు ఏగెను. అక్కడ యాదవనందనుని వజ్రుని రాజుని చేసెను. అటుపై అతడరణ్య మందున్న వ్యాసుని దర్శించెను. అమ్మహాను భావుని చేరి వినయముతో మ్రొక్కెను. ఆముని తన యడుగులకు ఎక్కువసేపు నమస్కరించుచున్న అతనింగని ఏమిది? నీ విట్లు వన్నె తఱిగితివి? ముట్టు తంకూడితివా! లేక బ్రహ్మహత్య చేసితివా? ఏదో దృఢాభిలాష భంగమై దుఃఖితు డైనట్లిదె కాంతి తఱిగి ఉన్నాడు. నీ సంతతివారు జ్ఞాతులు మొదలైనవారు నిన్ను యాచింపగా నిరాకరించితివా? అగమ్య స్త్రీ గమనము చేసితివా? ప్రభతఱిగి ఉన్నావు ఏమి? విప్రులకు పెట్టక, మృష్టాన్న మీవ కుడిచితివా? దీనజనముల ధనము హరింతివివా? అర్జునా! ధాన్యాదులను ఎగురబోయు చేటనుండివచ్చు గాలికి ఎదురైతివా? దిష్టి తగిలినవాడవై శోభ కోల్పోయితివా? గోళ్లనుండి జారు ఉదకము స్పర్శపొంది కుండ నీళ్లచే స్నానముచేసి ఛాయతరిగితివా? నీకంటె తక్కువవారిచే యుద్ధమున ఓడితివా! అని వ్యాసులు ప్రశ్నింప పార్థుడు నిట్టూర్పుచెంది స్వామీ! వినవలయునని తన పరాభవ వృత్తాంతమెల్ల పూస గ్రుచ్చినట్లు విన్నవించెను.

“బలము, ప్రతాపము, తేజస్సు, పరాక్రమము, వీర్యము, శోభ, కాంతి అన్నియు మాకు ఏహరిఇచ్చెనో ఆకృష్ణుడు మమ్ము విడిచివెళ్ళినాడు ఈశ్వరుడు, మహానుభావుడు, చిరునవ్వు మున్నుగ పలుకరించువాడునైన అతడు లేనివారమై మేము తృణ ప్రాయులమై నాము. అస్త్రములు, అమ్ములు, గాండీవము సారవంతములగుటకు ఏమూర్తి కారణమో, ఆ పురుషోత్తముడు వెళ్ళిపోయినాడు. ఎవని చూపున మమ్ము శ్రీ, జయము, సంపత్సమృద్ధి విడువలేదో అట్టి గోవిందుడు భగవంతుడు మమ్ము విడిచి వెళ్ళినాడు. భీష్మ ద్రోణాంగ రాజాదులు, దుర్యోధనాదులు ఎవ్వని ప్రభావమున నిర్దగ్ధులైరో-ఆ కృష్ణుడు భూమిని విడిచినాడు. ఆ చక్రి ఎడబాటున ప్రాయమువాసి శ్రీతఱిగి కాంతిచెడి మేదిని వెలవెల పోవుచున్నది. ఎవ్వని ప్రభావముచే భీష్మాదులునిప్పయిన నాయందు శలభములు (మిడుతలు) అయినారో అట్టి కృష్ణుడు లేమి నేను గొల్లకుఓడి పోయితిని. ఎవ్వని అనుభావముచే ఆగాండీవము త్రిలోక విఖ్యాతినందెనో అది ఇప్పుడతడు లేమిచే నాభీరుల కర్రలకు చచ్చుపడిపోయినది. అనేక స్త్రీ సహస్రములు నేనే దిక్కైనవి, నేనెంత యత్నించినను, ఆ దొంగల బడితెలకు లొంగి కొంపోబడినవి. కృష్ణాంతఃపురము కృష్ణ! కృష్ణా! వట్టి కర్రలతో నా బలము వమ్ముచేసి కొని పోబడినది. నేను శోభాహీనుడను అగుట నాకు వింతగాదు. ఇంకను నేను బ్రతికి ఉన్నాను. ఇదిచిత్రము. తాతగారూ! నీచులవలని యవమానము అను బెందడింబడి సిగ్గుచెడి ఉన్నాను”. అనవిని వ్యాసభగవానులు ఇట్లనిరి:

పార్థ! సిగ్గుపడకు, శోకింపకు, సర్వభూతములందు కాలగతి ఇట్టిదని ఎఱుగుము. భూతములు పుట్టుటకు గిట్టుటకు కాలము కారణము. ఇదెల్ల కాల మూలమని తెలిసి స్థైర్యపరుడవు అగుము. నదులు, సముద్రములు, గిరులు, వసుంధర దేవతలు, మనుష్యులు, పశువులు, తరువులు, పాములు, కాలముచేపుట్టి కాలముచే గిట్టును. ఇదంతయు కాలాత్మకమని తెలిసి శమింపుము. కృష్ణభగవానుడు కమలలోచనుడు కాలరూపి. ధనంజయ! కృష్ణ! మహాత్మా! నీవేమి ఉగ్గడించితివి అది అట్లే. భారావతరణమునకు అతడు అవనియందు అవతరించెను. మున్ను బరువుఓర్వరానిదై భూమి దేవసభ కేగెను. అందులకే కాలరూపి ఈవిష్ణువు అవతారమెత్తెను. ఆపని జరిపింపబడినది. అశేష రాజులు హతులైరి. వృష్ణ్యంధక కులము కూడ ఇట్లే ఉపసంహృత మైనది. భూమి తలమున ఆ ప్రభువునకింక చేయవలసినదే కొంచెము లేదు. ఇందుచే కృతార్థుడై, ఆయన స్వేచ్ఛగా ఏగెను. ఈయన సర్గకాలమందు సృష్టిని, స్థితికాలమందు స్థితిని, తుదకు అంతమును చేయ సమర్థుడు. ఇపుడు వెళ్లినాడు. కావున నీవుఓటమికి సంతాపపడవలదు. ఆయా కాలములందు పురుషులకు స్థితికలుగును. నీ ఒంటి చేత భీష్మ, ద్రోణ, కర్ణాదులు ఓడిరన్న అది వారికి కాలప్రాప్తమైన, క్రిందివానివలననైన ఓటమి కాదా! విష్ణు ప్రభావమున అంతవారికి ఆ పరాభవమెట్లో అట్లే నీకును దొంగలవలన పరాభవము జరుపబడినది. ఆ దేవేశ్వరుడు పలుమేనులందు ఆవేశించి జగత్ స్థితి చేయును. ఆ జగత్పతి తుదకు సర్వభూత నాశము చేయును. నీకు భాగ్యోదయము అయినది. నీకాయన సహాయుడయ్యెను. అట్లే తుదకు నీ శత్రువులను ఆ హరి తుద ముట్టించెను. నీవు గాంగేయాదులను కౌరవులను చంపితివన్న ఎవ్వడు నమ్మును. ఈ ఆభీరులచే గొల్లలచే నీ పరాభవమును మాత్రము ఎవ్వడునమ్మును? సర్వము తానైన హరి యొక్క లీలావిలాసమిది. నీచే కౌరవులు ధ్వంసమయినన్న గొల్లలచే నీవోడితినన్న నీవెవ్వరికోసము శోకించుచున్నావో ఆ స్త్రీలు మ్రుచ్చులచే గొంపోబడిరన్న దీనికి మున్ను నడచిన కథ అర్జునా! నీకు చెప్పెద వినుము:

మున్ను అష్టావక్రుడను విప్రుడు సనాతన బ్రహ్మమును జపించుచు పెక్కేండ్లు నీట నివసింపనెంచెను. అసుర సంఘములు ఓడిపోగా మేరు పృష్టమందు పెద్ద ఉత్సవమయ్యెను అచటికి ఏగుచు, సురకాంతలు ఆతనినిజూచిరి. రంభా తిలోత్తమాదులు వందలు వేలు ఆ మహాత్ముని కీర్తించిరి, కొనియాడిరి. కంఠము లోతునఉండి జటాభారము దాల్చి ఉన్న అమునిని వారు వినయవినతలై ప్రణమిల్లిరి. ఆయన ప్రసన్నుడగునంత వరకు అయెల్లరు నా ద్విజవరిష్ఠుని స్తుతించిరి. అంత ఆతడు వారితో ఇట్లు అనెను.

“మహానుభావులారా! సంతుష్టుడనైతిని. మీరు నావలన నేమి కోరుదురు - దుర్లభ మయినది ఇత్తును అనియెను. రంభాది దివ్యాప్సరసలు నీవు ప్రసన్నుడవయితేని మాకిక లోటేమి ఉన్నదనిరి. తదితరులు కొందఱు స్వామీ! నీవు భగవంతుడవు. ప్రసన్నుడవేని పురుషోత్తముడు మాపతి కావలయునని కోరుచున్నాము అనిరి. అమ్ముని అట్లే అగునని నీటినుండి వెలికివచ్చెను. ఆ వచ్చిన వాని వికృతరూపము ఎనిమిది వంకరలుగల దానిని వారు చూచిరి. అతనిని చూచి చాటునవ్వు నవ్వెడి వారినవ్వు ఆయనకు వినబడెను. దాన కోపముకొని ముని వికృతరూపుడనగునన్ను కని పరిహసించి శాపముచే చక్రిని భర్తగబడసి ఆ దేవాంగనలిప్పుడు దస్యుల చేజిక్కిరి. పాండవ! ఇందు నీవించుకయు శోకింపవలదు. అఖిలనాథుడా హరిచేతనే సర్వమును ఉపసంహృతము. ఆతనిచేతనే మీ యొక్కయు ఉపసంహారము దగ్గరయై ఉన్నది. నీ తేజో బలవీర్యాదులు ఆయన చేతనే ఉపసంహృతములు. పుట్టినవానికి చావుతప్పదు. ఎత్తునుండి పడుట తప్పదు. కూడుట, వీడుట కొఱకే. పెఱుగుట తఱుగుటకే. ఇది బుధులెఱిగి శోకింపరు. హర్షింపరు. అట్టి వారిలో కొందరిది ఇతరులకుగూడ అలవరుప నుందురు. అందువలన ఓనరవర! ఇది తెలిసి అన్నదమ్ములతో అఖిల తంత్రమును విడిచి, తపస్సునకు వనమేగనగును. కావున నీవేగుము. నా వచనము ధర్మరాజునకు నివేదించి ఎల్లుండి సోదరులతో గూడ వెళ్లునట్లు ఏర్పాటు చేయుము.

అని వ్యాసునిచే తెలుపబడి ధర్మజభీములకు నకుల సహదేవులకు తాను అట్లు చూచిన, అనుభవించినది ఎల్ల అట్లనే చెప్పెను. పాండవులు అర్జునుని ముఖమున బలుకబడిన వ్యాసునిరచనములను ఆలించి, పరీక్షితుని రాజ్యమునందు నిలిపి వనమేగిరి. మైత్రేయ! ఇట్లాది యదువంశమందు పుట్టిన వాసుదేవుని చేష్టితమును ఏనువిస్తరించి చెప్పితిని. కృష్ణుని ఈ చరితమును ఎవ్వడు వినునో ఆతడు సర్వపాప విముక్తుడై విష్ణులోకము ఏగును. (V-38)