ప్రథమాంశమును చక్కగ వినిన మైత్రేయుడు ఇట్లు అనెను:
సృష్టిని గురించి చక్కగా తెలిపితివి. ఈ విషయము ఇంకను వినగోరెదను. స్వాయంభువ మనువు కుమారులు ప్రియవ్రతుడు, ఉత్తాన పాదుడును. అందు ఉత్తాన పాదుని కుమారుడగు ధ్రువుని గూర్చి తెల్పితివి. ప్రియవ్రతుని సంతతినిగూర్చి దయతో తెలుపుము అనగా, శ్రీపరాశరుడు ఇట్లనెను. “ప్రియవ్రతుడు, కర్దమ ప్రజాపతి కూతురు కామ్యను పెండ్లాడెను. వారికి సమ్రాట్టు కుక్షి అనువారు కూతుండ్రు. పదిమంది కుమారులు వారిపేర్లు ఆగ్నీధ్రధుడు, అగ్నిబాహువు, వపుష్మంతుడు, ద్యుతి మంతుడు, మేధ మేధాతిథి.
వానికి త్వష్ట, వానికి విరజుడు, వానికి రజుడు, వానికి శతజిత్తు, వానికి విష్వగ్జ్యోతి మొదలగు నూర్గురు కుమారులును కల్గిరి. వారుప్రజలను పెంపొందించిరి. వారిచే నవ విభాగమందిన భారతవర్షము అలంకరింపబడినది. వారి వంశీయులచే ఈ భరత భూమి అనుభవింపబడినది. కృతత్రేతాది విభాగముగ దెబ్బదియొక్క మహాయుగములు, వారు ఈ భూమిని ముందుగ భుక్తము చేసికొనిరి. వరాహకల్పమందు ప్రథమ మన్వంతరాధిపుడు స్వాయంభువ మనువు ఉండగా ఈ ప్రియవ్రతాది సృష్టిజరిగినది. ఈ సృష్టిచే జగత్తంతయు నిండినది” అని చెప్పిన పరాశరులతో మైత్రేయుడు (II-1)
మహాత్మా మహామతివగునీవు భారతరాజుల యొక్కయు దేవదానవగంధర్వయ క్షోరగాదుల యొక్కయు, అద్భుతములగు చరిత్రలను స్థావర, జంగమాదుల సృష్ట్యాదులను మృదుమధురముగ మనశ్శ్రవణానందకరముగ చెప్పితివి. ఆహా! ఇప్పుడు భూమండల స్వరూపము వినుటకు కుతూహలులమై ఉన్నాము. భువనకోశ సంస్థానము అవధానముతో విననున్న మాకు దానిని ఆదరముతో ఆనతిమ్మని మునులు అడిగిరి. పరాశరుడు ఇట్లనెను. మైత్రేయ! ఇది నూరేండ్లు చెప్పినను తీరదు, సంక్షేపించి తెల్పెదను వినుడు. జంబూ + ప్లక్ష + శాల్మల + కుశ + క్రౌంచ + శాక + పుష్కరములు అనునవి సప్తద్వీపములు. ఇవి లవణ = ఉప్పు, ఇక్షు = చెరుకురసము, సురా = కల్లు, పర్పిః = నెయ్యి, దధి = పెరుగు, దుగ్ధ = పాలు, జల = నీరునుగల ఏడు సముద్రములచే చుట్టుకొనబడినవి. వీని నడుమ జంబూద్వీపమున్నది. దానికినడుమ “మేరువు”అను బంగారుకొండ ఉన్నది. అది ఎనుబదినాలుగు యోజనముల ఎత్తు, పదునారువేల యోజనముల లోతు, ముప్పది రెండువేల యోజనముల వైశాల్యముగల ఉపరిభాగము కలిగియున్నది. మూలము పదునారువేల యోజనముల విస్తారమై ఉన్నది. భూమి అను పద్మమునకు అది నడిమికర్ణిక (దుద్దు) వలె ఉన్నది.
హిమవంతము-హేమకూటము, నిషధము అనునవి దానికి దక్షిణమునను, నీలము, శ్వేతము, శృంగి అనునవి ఉత్తరమునను, వర్షపర్వతములున్నవి. రెండు నడుమ ఉన్నవి. అవి లక్షయోజన ప్రమాణములు, తక్కినవి తొంబది వేల యోజనముల ప్రమాణము కలవి. రెండువేల యోజనముల ఎత్తు, అన్నే యోజనముల వెడల్పు గలవి.
భారత-కింపురుష-హరివర్షములు మేరువునకు దక్షిణమున ఉన్నవి. రమ్యకము ఉత్తరమందున్నది. అది కనకమయము. ఉత్తర కురుభూములు అక్కడనే ఉన్నవి. ఈ వర్షములు ఒక్కొక్కటి భారత వర్షమువలె తొమ్మిదివేల యోజనముల వైశాల్యము కలవి.
మేరువు నలుదిశల ఇలావృతము తొమ్మిదివేల యోజనముల వైశాల్యము గలది కలదు. ఇందు నాల్గు పర్వతములు మేరువునకు విష్కంభములట్లు ఉన్నవి. విష్కంభములు = పదివేల యోజనముల పొడవు గలవి. తూర్పున మందరపర్వతము, దక్షిణమున గంధ మాదనము, పడమట విపులము, ఉత్తరమున సుపార్శ్వము అనునవి కలవు. వీనియందు క్రమముగ కదంబము(కడిమి), జంబువు(నేరేడు), పిప్పలము (రావి), వటము (మఱ్ఱి) అను చెట్లు పదునొకండు వందల యోజనముల విరివిగల వృక్షములు “గిరికేతువులు” (పర్వతాగ్ర పతాకముల వంటివి) కలవు. జంబూవృక్ష సమృద్ధిని బట్టి అది జంబూద్వీపము అని పిలువబడెను.
ఆ వృక్షములకు గల నేరేడు పండ్లు మహాగజ ప్రమాణమున రాలుచుండును. అవి ప్రిదిలి కారిన రసము ఏరైపారి జంబూనది అని పిలువబడును. ఆ జంబూరసము త్రావినవారు కష్టము, దుర్వాసన, ముదిమి, ఇంద్రియక్షయమును ఎఱుగరు. ఆ జంబూనది ఒడ్డునగల మన్ను ఆరసముచే తడిసి సుఖవాయువును ఆరి, జాంబూనదమను బంగారము ఏర్పడును. అది సిద్ధభూషణము అనగా సిద్ధులు ధరించునదన్నమాట. మేరువునకు తూర్పుదెస భద్రాశ్వము, పడమట కేతుమూలము అను రెండు వర్షములున్నవి. వానికి నడుమ ఇలావృతము, తూర్పున చైత్ర రధము, దక్షిణమున గంధమాదనము, పడమట వైభ్రాజము, ఉత్తరమున నందనవనము ఉన్నవి. అరుణోదము, మహాభద్రము, ఆసితోదము, మానసము అను సరస్సులు నాల్గు దేవభోగ్యములు.
సీతాంభము, కుముద్వంతము. కురరీ, మాల్యవంతము, వైకంకము, అనునవి మేరువు యొక్క కేసర పర్వతములు. త్రికూటము, శిశిరము, పతంగము, రుచకము, నిషధము మొదలైనవి దక్షిణదిశ మేరువు యొక్క కేసరపర్వతములు, శిఖివాసము, వైదూర్యము కపిలము గంధమాదనము జారుథి మొదలైనవి మేరు పశ్చిమ కేసరగిరులు. అవి మేరువును అంటి జఠరాది స్థానములందు ఉన్నవి. శంఖకూటము, ఋషభము, హంసము, నాగము, కాలాంజనము మొదలగునవి కురూత్తరదిశ కేసరశైలములు. మేరువుమీద బ్రహ్మయొక్క నగరము కలదు. అది పదునాలుగు వేల యోజనముల వైశాల్యముగలది. అందెనిమిది మూలలందు అష్టదిక్పాలుర పురములు గలవు. విష్ణుపాదమునుండి వెడలి చంద్రమండలమున ప్రవహించుచు, బ్రహ్మపురి నలువైపుల ఆకాశగంగ పడుచున్నది. అట్లుపడి నాల్గుదెసల నాల్గుపాయలైనది. అవి సీత, అలకనంద, చక్షువు, భద్ర అనునవి. సీత పూర్వశైలము నుండి మరియొక శైలమునకు అంతరిక్ష సంచారము చేయును. అటు పిమ్మట భద్రాశ్వవర్షపర్వతము మీదుగా సముద్రుని పొందును. అలకనంద, దక్షిణదిశగా భారత వర్షమును చేరి ఏడు భాగములై సముద్రమును చొచ్చును. చక్షువు, పడమటి గిరులన్నియు దాటి పడమటగల కేతుమాల వర్షమును చొచ్చి, సముద్రమును కలియును. భద్ర, ఉత్తర గిరులను దాటి ఉత్తర కురు భూములందు ప్రవహించి ఉత్తర సముద్రమును చేరును.
నీల పర్వతము నుండి నిషధపర్వతము అంతటి పొడవున మాల్యవంతము, గంధ మాదనమును కలవు. వాని నడిమి భాగమున తామరపువ్వులోని దుద్దువలె మేరువు ఉన్నది. మర్యాదాపర్వతమునకు ఆవల లోకాలోకము అను పర్వతమునకు భారతములు, కేతు మూలములు, భద్రాశ్వములు, కురుభూములును రేకులట్లు ఉన్నవి. జఠరము దేవకూటము అనునవి రెండు మర్యాదాపర్వతములు, అవి దక్షిణ ఉత్తరములందు నీలపర్వతమునుండి నిషధపర్వతముదాక వ్యాపించి ఉన్నవి. గంధమాదన కైలాస పర్వతములు తూర్పు, పడమరలందు ఎనుబది యోజనముల పొడవుగలవై, ఈ పర్వతమునుండి నిషధ పర్వతము వరకు వ్యాపించి సముద్రములో చొచ్చియున్నవి. నిషధము పారియాత్రము అనునవి రెండును మర్యాదాపర్వతములు, దక్షిణ ఉత్తరములందు నీలపర్వము నుండి నిషధ పర్వతము వరకు దైర్ఘ్యము కలవై, మేరుపర్వతమునకు పశ్చిమభాగమునందు, యథాపూర్వకముగ ఉన్నవి. త్రిశృంగము, జారుధి అనునవి ఉత్తరదిశలోగల వర్ష పర్వతములు. తూర్పుపడమరగా వ్యాపించి అవి సముద్రమధ్యమున ఉన్నవి. మర్యాదాగిరులను గురించి చెప్పితిని. వీనిలో రెండు, రెండు పర్వతములు మేరుపర్వతమునకు జఠర (గర్భ) భాగములుగా నలుదెసల ఉన్నవి. మేరువు నలుదెసలగల కేసర పర్వతములు. అవి చల్లని ఆద్యంత ప్రదేశములు కలవి. వానిలోపలగల లోయలు మనోహరములై, సిద్ధచారణ సేవితములై ఉండును. వానియందు రమ్యములైన పురములు, వనములు కలవు. అచ్చట లక్ష్మి, విష్ణువు, అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు మొదలగు దేవతల ఆలయశ్రేష్టములు నరకిన్నరులచే సేవితములై ఒప్పుచుండును. రమ్యములైన ఆ పర్వత ద్రోణు (లోయ) లందు రేయింబవళ్ళు గంధర్వయక్షరాక్షస దైత్యదానవులు క్రీడించుచుందురు. ఇవి భౌమ స్వర్గములు. అనగా భూమి మీద ఉన్న స్వర్గ భూములు. ధర్మనిష్ఠులకు నివాసములు. ఇందు ఎన్ని జన్మములకైనను పాపాత్ములు చేరజాలరు.
పరాశరుడు ఇట్లు అనెను:
సముద్రమునకు ఉత్తరమున, హిమాలయమునకు దక్షిణమున భారతవర్షము కలదు. అందలి సంతతి భారతి అనబడును. ఇది తొమ్మిదివేల యోజనముల వైశాల్యము కలది. కర్మభూమి అని దీనికి పేరు. కోరినవారికి స్వర్గము మోక్షము కూడ ఇందే ఉన్నవి.
ఇందు మహేంద్రము, మలయము, సహ్యము, శుక్తిమంతము, ఋక్షము, వింధ్యము, పారియాత్రము అను, సప్తకుల పర్వతములు ఉన్నవి. జీవులు భారతవర్షము నుండియే స్వర్గ మోక్షములు పొందుదురు. అవాంతర కర్మఫలమైనను స్వర్గమును పర్యవసాన మందు ఆత్యంతిక ఫలమైన మోక్షమును కూడ ఇటనుండియే మానవుడు పొందును. ఈ భూమండల మందే కర్మానుష్ఠానము విధింపబడినది. అందుచేతనే దీనికి కర్మభూమి అను పేరు సార్ధకము. భారతవర్షమున తొమ్మిది ద్వీపవిభాగములు ఉన్నవి. ఇంద్రద్వీపము, కశేరువు (కశేరు మంతము అని కూడ అందురు) తామ్రపర్ణము, గభస్తిమంతము, నాగద్వీపము, సౌమ్యము, గాంధర్వము, వారుణము అనునవి ఆ ద్వీప విభాగములు. ఇందు తొమ్మిదవది అగు వారుణము సముద్ర సంవృతము. ఇది దక్షిణ దిశ నుండి ఉత్తర దిక్కునకు వేయి యోజనములు. తూర్పున కిరాతులు, పడమట యవనులు, నడుమ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఉందురు. యజన, యాజనములు, యుద్ధము, వాణిజ్యము, కృషి (వ్యవసాయము) మొదలైన వృత్తులు క్రమముగా వీరికి విహితములు.
హిమవత్పర్వత ప్రత్యంత పర్వతమునుండి శతద్రు (సట్లెజ్) చంద్రభాగ, వేదము, స్మృతి, మొదలైన నదులు ప్రవహించుచున్నవి. నర్మద, సురస మొదలయినవి వింధ్యగిరి నుండి వెలువడుచున్నవి. తాపి, పయోష్టి, నిర్వింధ్య, కావేరి మొదలయినవి ఋక్షపర్వత ప్రాంతమందు జనించినవి. గోదావరి, భీమరధి, కృష్ణవేణి మొదలగునవి సహ్యగిరి పాదమందు పుట్టినవి. కృతమాలా, తామ్రపర్ణీ ప్రముఖములు మలయాద్రి సంభవములు. త్రిసాంధ్య, ఋషికుల్య మొదలయినవి మహేంద్రగిరి జన్యములు. ఋషికుల్య, కుమారి మొదలయినవి శుక్తిమత్పర్వత పాదమందు పుట్టినవి. వీని ఉపనదులు వేలకొలదిగ కలవు.
వానియందు కురుపాంచాలదేశ ప్రజ నివసించుచున్నది. తూర్పున కామరూప దేశవాసులు, కళింగులు, మగధులు ఉన్నారు. దాక్షిణాత్యులు దక్షిణమునందు ఉండువారు. పశ్చిమమున సౌరాష్ట్రులు, శూద్రులు, ఆభీరులు, అర్బుదులు, మారుకులు, మాళవులు, పారియాత్ర నివాసులు, మద్రులు, రాములు, అంబష్ఠులు, పారసీకాదులు. వీరందరు ఈ ఈ నదుల జలములను త్రాగుదురు. ఈ దేశములు కలిసిమెలసి ఆనందభరితులు పుష్టివంతులు అయిన జనులతో నిండియుండును.
కృత, త్రేతా, ద్వాపర, కలియుగ విభాగము ఇక్కడనే కలదు. అన్యత్రలేదు. ఇందు యతులు తపస్సు చేయుదురు. యజ్ఞ్యలు, హోమములు (యాగములు) చేయుదురు. పరలోకమును కోరి ఇచట దానములు ఆచరింపబడును.
జంబూద్వీపమందు, యజ్ఞపురుషుడు ఉపాసింపబడును. విష్ణువు యజ్ఞరూపుడుగ, యజ్ఞేశ్వరుడుగ ఇచ్చట ఉపాసింపబడును. ఇతర ద్వీపములందు మరియొక పేరున కొల్వబడును. ఈ జంబూద్వీపమున భారత వర్షము శ్రేష్ఠము. ఇది కర్మభూమి. తక్కినవి భోగభూములు. బహుజన్మఫలభోగముగ ఇందెంతో కాలమునకు జీవుడు మనుష్య జన్మమును పొందును.
దేవతలు ఈ భారత భూమిని గూర్చి స్వర్గాపవర్గములు ఒసగు భారత భూమియందు మనుష్యులై పురుషులై పుట్టి, కర్మభూమియందు జన్మమువడసి ఫలాభిసంధిలేక సర్వకర్మ ఫలములను పరమేశ్వరార్పణమని పరమాత్మయగు విష్ణువునందు అర్పించి, పాపదూరులై, ఆపరబ్రహ్మ మందు లీనమగు వారు ధన్యులు. పరమేశ్వరార్పణ ముగ ఆచరించిన స్వర్గ ప్రదమగు, కర్మలీనమైపోయిన తర్వాత దేహబంధమును మరెక్కడి పొందుదుమో ఎఱుగము. పరిశుద్ధేంద్రియవంతులై భారత వర్షమున పుట్టినవారు ధన్యులు అని ఇట్లు గానము చేయుచుందురు. తొమ్మిది వర్షములు కల్గి లక్షయోజనముల విరివిగల ఈ జంబూద్వీపమును గూర్చి సంక్షేపముగా తెల్పితిని. ఈ ద్వీపమును ఆవరించి లక్షయోజనముల విస్తారముగల క్షార (ఉప్పు) సముద్రము వలయాకారముగ ఉన్నది.
క్షీరసముద్రముచే జంబూద్వీపము చుట్టబడినట్లు, ప్లక్షద్వీపము లవణోదధిచే పరివృతమై ఉన్నది. జంబూద్వీప విస్తృతి లక్ష యోజనములు, దానికి రెట్టింపు ప్లక్ష ద్వీపము. ప్లక్ష ద్వీపేశ్వరుడు మేధాతిధి. వాని కుమారులు ఏడుగురు. శాంతహయుడు (జ్యేష్ఠుడు), శిశిరుడు, సుభోదయుడు, ఆనందుడు, శివుడు, క్షేమకుడు, ధ్రువుడు. వారు ఈ ద్వీపమును ఏలినవారు. వారిపేర మర్యాదా (హద్దు) కారక పర్వతములు ఏడు కలవు. అట్లే, వర్షపర్వతములు మఱి ఏడు కలవు. మునులారా! వాని పేర్లు వినుడు. అవి: గోమేధము, చంద్రము, నరదము, దుందుభి, సోమపము, సుమనస్సు, వైభ్రాజము అనునవి.
పుణ్యాత్ములారా! రమ్యములగు ఈ వర్షపర్వతములందును, వర్షములందును ప్రజలు దేవ, గంధర్వులతో కూడి వసింతురు. అందలి దేశములు పవిత్రములు. వీర్య వంతములు. అందు జనులు మృతినందరు. ఆధివ్యాధులు లేక సర్వకాలము సుఖముగా ఉందురు. అందు నదులుకూడ ఏడే. సముద్రగాములు. వానిపేర్లు అనుతప్త, శిఖ, విప్రాశ, త్రిదివ, క్రము, అమృత, సుకృత అనునవి. పేర్లు వినినంతనే పాపములు హరించునవి. ప్రధానము లైన నదులు, పర్వతములు పేర్కొనబడినవి. చిన్నచిన్న నదులు పర్వతములు వేలకొలది గలవు. అచటివారు ఎప్పుడును ఆ నదీ జలములనే త్రాగుచుందురు. కాని నదులు తగ్గవు పెరుగవు.
ఆ ప్రదేశములు ఏడింటియందును, యుగ వ్యవస్థలేదు. ఎల్లప్పుడు త్రేతాయుగ సమముగనే కాలము నడుచును. ప్లక్షద్వీపము మొదలు శాకద్వీపముదనుక, జనులు అయిదువేల ఏండ్లు ఆయుపుగల్గి నీరోగులయి ఉందురు. వర్ణాశ్రమ విభాగానుసారము అక్కడ ధర్మము నాల్గు విధములుగ ఉండును. అక్కడ వర్ణములు నాలుగు. వానిని మీకు చెప్పుచున్నాను వినుడు. ఆర్యకులు, కురువులు, వివిత్వులు, భావులు అనుపేర విప్ర, క్షత్రియ, వైశ్య, శూద్రులు అను నాలుగు వర్ణముల వారు ఉందురు.
జంబూద్వీపమున జంబూవృక్షము ఉన్నట్లు అంత పరిమాణముగల జువ్విచెట్టు ప్లక్షద్వీప మధ్యమందున్నది. అందుచే దానికా పేరు కల్గినది. అందు ఆర్యక అది వర్ణములు వారిచే, జగత్కర్త, సర్వేశ్వరుడును, సోమరూపియుఅగు హరి ఆరాధింపబడును. ప్లక్షద్వీప ప్రమాణముగల ఇక్షు (చెఱకు రసము) సముద్రముచే ప్లక్ష ద్వీపము ఆవరింపబడి ఉన్నది. మునులారా! ఇట్లు మీకు ప్లక్ష ద్వీపము సంగ్రహముగ వర్ణించితిని. ఇకనాచే చెప్పబడు శాల్మల ద్వీపమును గూర్చి తెలిసికొనుడు.
శాల్మల ద్వీపమునకు వీరుడైన వపుష్మంతుడు అధీశ్వరుడు. వాని కుమారుల నామములతోనే శ్వేతము, హరితము, జీమూతము, రోహితము, వైద్యుతము, మానసము, సుప్రభము అను వర్ష పర్వతములు ఏడును ప్రసిద్ధములు. శాల్మల ద్వీపము ఇక్షురస సముద్రముచే పరివేష్టితము. ఈ ద్వీపము ప్లక్ష ద్వీపమునకు రెట్టింపు ప్రమాణముకలది. అక్కడ రత్నగర్భములైన సప్తకులాచలములు సప్తనదులు కలవు. అందు కుముదము, ఉన్నతము, వలాహకము, ద్రోణము, కంకము, మహిషము, కపిద్మంతము అను పర్వతములున్నవి. ద్రోణగిరి యందు మహౌషధులు ఉండును. ఇందలి నదులు: శ్రోణి, తోయ, వితృష్ణా, చంద్ర, శుక్ర, విమోచని, నివృత్తిఅనునవి. అవి స్మరణ మాత్రమున పాపములను హరించును.
ఇందలి వర్షములు శ్వేతము, లోహితము, జీమూతము, హరితము, వైద్యుతము, మానసము, సుప్రభము అనునవి. ఇందు చాతుర్వర్ణ్య వ్యవస్థ ఉన్నది. కపిల = తేనెరంగు, అరుణ = ఎఱుపు, పీత = పసుపు, కృష్ణము = నలుపు అను రంగులు కల్గి ఉండి, క్రమముగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములవారు ఇందు సేవింతురు. ఇచ్చట యాగకర్తలకు ఉపాస దైవము విష్ణువు. యజ్ఞమందు వాయుస్వరూపునిగా, ఆ దైవమును యజ్జ్వలు సేవింతురు. అతి మనోహరమైన ఈ ద్వీపమందు దేవతలు సన్నిధి చేసి ఉందురు. శాల్మల వృక్షము ఉండుటచే ఈ ద్వీపమునకు శాల్మల ద్వీపమని పేరు. కుశద్వీపము చుట్టును సురాసముద్రము ఉన్నది. అది శాల్మల ద్వీపమునకు రెట్టింపు విస్తారము గలది.
ఇందు రాజైన జ్యోతిష్మంతుని కుమారులు: ఉద్భిదుడు, వేణువంతుడు, స్వైరథుడు, రంధనుడు, ధృతి, ప్రభాకరుడు, కపిలుడు అనువారి పేరులతో వర్షములు ఉన్నవి. ఇందు మనుష్యలతోపాటు దైత్య, దానవ, దేవ, గంధర్వ, యక్ష, కింపురుషులును వసింతురు. ఇక్కడ స్వధర్మ అనుష్ఠాన పరులైన బ్రాహ్మణాది చతుర్వర్ణ ప్రజలు వరుసగా దములు, శుష్మిణులు, స్నేహులు, మందహులు అనుపేర ఉందురు. అక్కడ పరబ్రహ్మ రూపుడు జనార్దనుడు ఆరాధ్యదైవము. అచట జనులు జనార్దనుని గూర్చి యజ్ఞములు చేసి అధికారిక పురుషులుగా అవతరింపవలసిన పురాకృత పుణ్యకర్మ ఫలమును క్షయింప చేసికొందురు. అనగా కేవల నైష్కర్మ్య విషయమున ముక్తి కోరుదురు. విద్రుమము, హేమశైలము, ద్యుతిమంతము, పుష్టిమంతము, కుశేశయము, హరి, మందరము అనునవి అచ్చట వర్షపర్వతములు. ఇవి ఏడు: ధూతపాన, శివ, పవిత్ర, సమ్మతి, విద్యుదంభస్సు, మహీ, అనునవి మరికొన్ని చిన్నచిన్న వేలకొలది యేరులు సర్వపాపహరములైనవి అక్కడ ఉన్నవి. కుశద్వీప మధ్యమున కుశస్తంభము ఉన్నది. అందుచే దానికి ఆ పేరు కల్గినది. ఘుృత సముద్రము క్రౌంచ ద్వీపముచే ఆవృతమై అచ్చట ఉన్నది.
ఇక క్రౌంచ ద్వీపము కుశద్వీపము కంటె రెట్టింపు విరివిగలది. ఇచట ద్యుతి మంతుని కుమారులు ఏడుగురు పరిపాలకులువారు. కుశగుడు, మందగుడు, ఉష్ణుడు, పీవరుడు, అంధకారకుడు, ముని, దుందుభి అనువారు, ఆ ఏడుగురు. దేవగంధర్వ నిషేవితములు, రమ్యములు అయిన వర్ష పర్వతములు ఇచ్చట కలవు. అవి క్రౌంచము, వామనము, అంధ కారకము, దేవవ్రతము, ధమము, పుండరీకవంతము, దుందుభి అనునవి అవి ఒకదాని కంటె ఒకటి రెట్టింపు ప్రమాణము గలవి. ఇక్కడ దేవగణములతో కూడిన పుష్కరులు, పుష్కలులు అనువారు ధన్యులై చరింతురు. బ్రాహ్మణాది చతుర్వర్ణములు ఇందు గలవు. ఇందు ప్రధాన నదులు ఏడు. గౌరి, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజవ, ఖ్యాతి, పుండరీక అనునవి. అక్కడ పుష్కరాదులచే ధ్యానయోగమున యజ్ఞమందు రుద్రరూపుడైన జనార్దనుడు ఆరాధింపబడును. ఇదిమీగడ సముద్రముచే ఆవృతము. అది ఆ ద్వీప పరిమాణము గలది. దాని చుట్టును శాకద్వీపము ఉన్నది. శాకద్వీప పతియైన భవ్యునికి జలదుడు, కుమారుడు, సుకుమారుడు, మనీరకుడు, కుశమోదుడు, మోదాకి, మహాద్రుముడు అను పుత్రులుగలరు. అందలి వర్షములు వారి పేర ఉన్నవి. అందు ఉదయగిరి, జలధార, రైవతకము, శ్యామము, అంభోగిరి, అస్తికేయము, కేసరి అను ఏడు వర్ష పర్వతములు కలవు. సిద్ధగంధర్వ సేవితమై, ఇచట శాకము అను (టీకులేక, కడిమి) మహావృక్షము ఉన్నది. దాని ఆకుల గాలి తాకినచో పరమ ఆహ్లాదము గల్గును. అక్కడ పవిత్రములైన చతుర్వర్ణ ప్రజలతో కూడిన జనపదములు కలవు. అచటజనులు నిరాతంకులు. ఏ అభ్యంతరము లేనివారు, నీరోగులు, నదులు మహా పుణ్యములు. పాపభయహరములు సుకుమారి, కుమారి, నళిని, రేణుక, ఇక్షువు, ధేనుక, గభస్తి అనునవి ఏడు చిన్నచిన్న ఏరులు. గిరులు వేలు ఉన్నవి. జలదాది గిరులపై వసించు జనులు ఆనదీ జలములను త్రాగుదురు. ఈ నదులు స్వర్గము నుండి వచ్చినవి. అచటి ప్రజలలో ధర్మహాని సుఖః దుఃఖములు, శాస్త్రము హద్దుమీరి నడచుట అనునవి లేవు. మగులు, మాగధులు, మానసులు, మందగులు అనుపేర బ్రాహ్మణాది చతుర్వర్ణ ప్రజలచట నివసింతురు. శాకద్వీపవాసుల కులదైవము విష్ణువు. సూర్యరూపుడుగా యథావిధిగా శ్రీహరి ఈ ప్రజలచేత అర్చింపబడును.
శాకద్వీపము అదే ప్రమాణముగల క్షీరాబ్ధిచే ఆవరింపబడి ఉన్నది. క్షీరాబ్ధి పుష్కర ద్వీప సమావృతము, శాకద్వీపము కంటె రెట్టింపు ప్రమాణము కలది. పుష్కరము పుష్కర ద్వీపమందు సవనుని కుమారులు మహావీతుడు, ధాతకి అనువారు. వారిపేర వర్షములు రెండు. ఇక్కడ వర్షపర్వతము మానసోత్తరము అనునది ఒక్కటియే. అది ఈ ద్వీపము నడుమ వలయాకారముగ ఉన్నది. ఏబదివేల యోజనముల ఎత్తు, అంతే వెడల్పుగలది. అది పుష్కర ద్వీపమండలమును నడిమికి రెండు భాగములు చేయుచున్నట్లు ఉన్నది. దాని మూలముననే ఈ ద్వీపము రెండు వర్షములుగా విభక్తమైనది. అవి వలయాకారములు. దానినడుమ పెద్దగిరి కలదు. అచటి జనులు పదివేల ఏండ్లు జీవింతురు.
వారు రాగద్వేష శోకములు లేనివారు. ఆరోగ్యవంతులు. వారిలో అధమ ఉత్తమ భేదము లేదు. చంపువాడు చంపబడువాడును లేరు. ఈర్ష్య అసూయలను ఎరుగరు. భయము, రోషము, దోషము, లోభము, శూన్యములు. మానసోత్తర పర్వతమునకు మహవీత ఖండము వెలుపలిది. ధాతకీ ఖండములోపలిది. దేవదైత్యులు వసింతురు. ఈవర్షద్వయమున పుష్కర ద్వీపమందు సత్యానృతము (వాణిజ్యము) లేవు. నదులు లేవు, కొండలులేవు, ద్వీపములు లేవు.
మనుష్యులందరి వేషమొక్కటే. వారు దేవసమరూపులు. అట వర్ణాశ్రమాచార ధర్మ విచక్షణలేదు. వేదత్రయము, వార్త, దండనీతి, శుశ్రూష, అనునవి లేనేలేవు. ఈ వర్ష ద్వయము భూలోక స్వర్గమే. జరారోగములు లేక కాలము సర్వసుఖ ప్రదమగును. ఈ రెండు ఖండములందు పుష్కర ద్వీపమునందు న్యగ్రోధ (మఱ్ఱి) మహావృక్షము బ్రహ్మ ఉండు స్థానము. బ్రహ్మ అచట సురాసురులచే పూజింపబడుచుండును. తియ్యని నీటి సముద్రముచే అది చుట్టుకొనబడి ఉన్నది. దాని ప్రమాణము పుష్కరద్వీప సమానము. ఇట్లు ద్వీపములు ఏడును, సముద్రములు ఏడింటిచేత ఆవరింపబడి ఉన్నవి. ద్వీపములు అన్నియు సమప్రమాణములు. సముద్రములన్నియు వానికి రెట్టింపు ప్రమాణము కలవి.
కల్పాంతమందు సహస్ర ముఖముల నుండి విషానలజ్వాలలు గ్రమ్ముకొన సంకర్షణ స్వరూపుడైన రుద్రుడు జగత్రయమును మ్రింగివేయును. గిరిమండలము అట్లు అశేష క్షితి మండలమును ఫణాగ్రమునధరించి, ఆ శేషుడు అశేష సురసమర్చితుడై పాతాళమూల మందు అధిష్టించియున్నాడు. దేవతలు కూడ అతని వీర్యప్రభావ రూపవైభవము వర్ణింప జాలరు. తెలిసికొనజాలరు. ఆయన ఫణామణి శిఖలచే అరుణమై కుసుమ మాలికవలె ఇలాతలము అఖిలము నిలిచి ఉన్నది. అట్టి మహానుభావుని శక్తిని ఎవ్వడు వర్ణింపగలడు.
మదముచే తిరుగడువడు కన్నులతో ఆ అనంతుడు ఎప్పుడు విజృంభించునో, అపుడు భూమండలము ఆపర్వతసముద్రముగకంపించును. గంధర్వాప్సర స్సిద్ధ కిన్నరోరగ వారణులుకూడ అశేషాహి గుణముల అంతు తెలియలేరు. కావుననే ఆయన అనంతుడు అనుపేరొందెను. నాగకన్యా తిలకములు తమమృదులకరకమలములచే అతనికి పూయు హరిచందనము శ్వాసానిలములచే విసరబడి, దెసలకు సువాసనా భరితపటవాసమై (పరిమళ చూర్ణమై) వాసించును. ఆ ఫణిరాజును ఆరాధించి పురాణమహర్షి గర్గాచార్యుడు జ్యోతిశ్చక్రము యొక్క రహస్యములను తెలుసుకొనెను. సకలశకున ఫలితములను తెలుపగల్గెను. ఆ నాగేంద్రునిచే శిరసావహింపబడిన ఈ వసుంధర దేవాసుర మానుష విశేష సహితములైన లయిన సర్వలోకములను ధరింపగల్గుచున్నది.
ఓ విప్రులారా! పాపాత్ములు పడవేయబడు రౌరవాది నరకములనుగూర్చి ఇప్పుడు చెప్పుచున్నాను ఇక వినుడు. గౌరవము, సౌకరము, రోధము, తాలము, విశసనము, మహాజ్వాల, తప్తకుంభము, మహాలోభము, విమోచనము, తుధిరాంభము, వసాతప్తము, కృమీశము, కృమి భోజనము, అసిపత్రవనము, కృష్ణము, లాలాభక్షము, పూయవహము, వహ్నిజ్వాల, అధశ్శిరము, సదంశము, కృష్ణసూత్రము, తమస్సు, ఆవీచి, శ్వభోజనము, అప్రతిష్టము మావీచి అనునవి ఇరువది నాలుగు నరకములు. ఇంతకంటెను. పరమ దారుణములైన మరి పెక్కు నరకములు కలవు. ఇవి యముని పరిపాలన దేశములు. శస్త్ర, అగ్ని, విషములను ప్రయోగించు యమభటులు పాపకర్మాసక్తి కలవారు వీనియందు ఉందురు.
దొంగ సాక్ష్య మిచ్చినవాడు, పక్షపాత బుద్ధితో మాట్లాడువాడు, అబద్ధము చెప్పువాడు గౌరవమునకు పోవును. భ్రూణహత్య, నగర ధ్వంసము, గోహత్య చేసినవాడు, జీవుల ఊపిరి అడకుండ చేసినవాడు, భయంకర గౌరవమునకు పోదురు. బ్రహ్మహత్యా కారకుడు, బంగారమును దొంగిలించినవాడు, వాని స్నేహితుడు శూకర నరకమున పడుదురు. క్షత్రియ వైశ్య ఘాతకుడు. గురుపత్నిని, అప్పచెల్లెండ్రను కూడినవాడు, రాజభటుని హత్య చేసినవాడు, తప్తకుంభమను నరకమున కూలును. మద్యవిక్రేత (సారాయిని అమ్మువాడు) వధ్యపాలుడు ఉరితీయు స్థానమును కాయువాడు (లేక) వధింపదగినవానిని కాపాడినవాడు కేసరవిక్రేత (విషమును అమ్మువాడు), భక్తుని విడిచినవాడు, తప్తలోహము అను నరకమున కూలుదురు. కూతురును, కోడలిని సంగమించినవాడు, మహాజ్వాలముఅను నరకమున పడవేయబడును. వేదదూషకుడు, వేదవిక్రయి, అగమ్యగామి, శబలము అను నరకము పాలు అగును. దొంగ, హద్దుమీరినవాడును, విమోహనరకమున పడును. దైవ, బ్రాహ్మణ, పితృద్వేషియు రత్నములను (శ్రేష్ఠవస్తువులను) దూషించినవాడు, కృమిభక్ష్యము అను నరకమును పొందును. దుర్యాగము చేసినవాడు కృమీశము అను నరకము పాలగును. పితృదేవతా తిధులను విడిచి కుడిచినవాడు లాలా (చొంగ) భక్ష్యమను నరకమున పడును. బాణములను చేయువాడు వేధక నరకమునపడును. ఖడ్గాదులను చేయువాడును, కర్ణి (కర్ణి-ఒక విధమైన ఆయుధము) కారుడును, పరమదారుణమైన విశసనము అను నరకమున పడుదురు. అపాత్రదానము పట్టినవాడు, అయాజ్యయాజనము (చేయకూడని వానిచే యజ్ఞము) చేయించినవాడు నక్షత్రసూచకుడు జ్యోతిశ్శాస్త్రము, తెలియకనే జాతక ముహూర్తములు చెప్పువాడు అధోముఖ నరకమునందును. అతిథికి పెట్టక మృష్టాన్నము ఆరగించువాడు కృమిపూయ నరకమునకు పోవును. (లాక్ష) = లక్క, మాంసము, రసములు, మధురపానీయములు, నువ్వులు, ఉప్పు అను వానిని అమ్ము బ్రాహ్మణుడు కూడ కృమి పూయ నరకమున పడును. పిల్లి, కోడి, మేక, కుక్క, పంది, పక్షులు వీనిని పెంచువానికిని అదేగతి. రంగోపజీవి (నాటకములందు నటించి జీవించువాడు), జాలరి, కుండాశి, భగభక్షకుడు (వీర్యపానము చేయువాడు) లేక జారజుని అగ్రము నుతించువాడు, విషము పెట్టువాడు, సూచి (చాడీకోరు), పేచీకోరు, మహిషకుడు (దున్నపోతుల వ్యాపారి), పర్వములందు స్త్రీ సంయోగము చేసిన బ్రాహ్మణుడు, కొంపలు అంటించువాడు మిత్ర ఘాతకుడు, శకునములు చెప్పువాడు, గ్రామపాచకుడు, సోమవిక్రయ రుధిరాంధ కూపమున పడుదురు. తేనె పుట్టలను రేపినవాడు, గ్రామ నాశనము చేసినవాడు వైతరిణిలో పడును.
రేతఃపానము చేసినవాడు మర్యాదోల్లంఘనము చేసినవాడు (సదాచారములను కట్టుబాట్లను తప్పినవాడు) మాయాజీవనులు, ఆచారహీనులు, కృచ్ఛ నరకమున పడుదురు. ఔరబ్రికులు (గొఱ్ఱెలమందచే జీవించువారు) మృగవ్యాధులు, వహ్నిజ్వాలము అను నరకమున పడుదురు. అపాకములందు (వండ కూడని వస్తువులకు) అగ్నిని పెట్టినవాడు అదే నరకమున పడును. వ్రతలోపము, ఆశ్రమ, ధర్మచ్యుతి చేసినవాడు, సందంశ యాతనముఅను నరకమున పడును. బ్రహ్మచారులు, కొడుకుల దగ్గర అధ్యయనముచేసిన వారు శ్వభోజనము అను నరకమున పడుదురు. ఇట్టివి నూర్లకొలది, వేలకొలది నరకములు కలవు. పాపములను చేసినవారు. ఈ బొందివిడిచి యాతనా శరీరములను పొంది, వీనియందు హింసింప బడుదురు. వర్ణాశ్రమ విరుద్ధమైన కర్మను త్రికరణములచే చేసినవారు నరకము పాలగుదురు. ద్యులోకమందలి దేవతలు, తలక్రిందులుగా ఉండు నరకలోక జీవులచే చూడబడుచుందురు. దేవతలు నరకలోక వాసులను అథోముఖులుగా చూచుచుందురు. జీవులు స్థావరములు, కృములు, జలజంతువులు, పక్షులు, పశువులు, నరులు, ధార్మికులు, దేవతలు అను వరుసలో జన్మించి క్రమముక్తిని పొందుదురు.
స్వర్గమందు ఎందరు జీవులుందురో నరకమందు అందరుందురు. పాపము చేసి ప్రాయశ్చిత్తము చేసికొననివాడు నరకమునకు పోవును. ఆయా పాపములకు అను రూపములైన ప్రాయశ్చిత్తములను పరమర్షులు స్మరించి (స్మృతులలో) పెద్ద పాపమునకు పెద్దగ, చిన్న దానికి చిన్నగా ప్రాయశ్చిత్తములను తెల్పిరి. స్వాయంభువ మనువు మొదలైన వారు ఆ ప్రాయశ్చిత్త కాండను రచించిరి. అన్నిటికిని ప్రాయశ్చిత్తము కృష్ణస్మరణము. దానిని మించినదిలేదు. ప్రాయశ్చిత్తము అనగా తపస్సు. పాపముచేసి అనుతాపమి నొందనేని, హరిస్మరణ చేసెనేని, దానిని మించిన పుణ్య సాధనము లేదు. దానిచే జీవి నారాయణుని చెందును. ప్రాతఃకాల అహోరాత్రములందు, సంధ్యాసమయము లందు నారాయణ స్మరణచేసి పాపక్షయమంది నరుడు నారాయణుని పొందును. ఎవ్వని మనస్సు జపహోమార్చనములందు వాసుదేవునందు లగ్నమై ఉండునో వాడు ముక్తినొందును. విష్ణువునందు అప్పుడప్పుడు మనసు నిలువక చలించెనేని, వానికి దేవేంద్రాది పదవి లభించును. పునరావృత్తి లక్షణమైన స్వర్గమన ఎక్కడ? ముక్తిబీజమైన వాసుదేవ నామస్మరణమెక్కడ? కావున అహర్నిశము పురుషుడు విష్ణుస్మరణ చేయుచు పాపక్షయమంది శుద్ధుడైనచో నరకమును చూడడు. స్వర్గము మనఃప్రీతి కూర్చునది. దానికి వ్యతిరేకము నరకము. నరకస్వర్గములు అనగా పాప-పుణ్యములే. అవి వానికి పర్యాయ పదములు, వాసుదేవైక చిత్తుడు ఆ పునరావృత్తి లక్షణమైన సాయుజ్యముక్తికి అర్హుడన్నమాట.
ఒకే వస్తువు దుఃఖమునకు, సుఖమునకు, ఈర్ష్యకు, కోపమునకు కారణమగును. కావున ఏ వస్తువైనను దుఃఖాత్మకమే. ఆ వస్తువే ఒకప్పుడు కోపమునకు హేతువై అదే ప్రసన్నతకు కారణము అగును. కావున కేవలము దుఃఖాత్మకము కేవలము సుఖాత్మకము అయిన వస్తువు లేనేలేదు. సుఖదుఃఖాది లక్షణమైన ఈ పరిణామము కేవలము మానసికము, బ్రహ్మజ్ఞానము ఒక్కటియే జ్ఞానము. లౌకికమయిన జ్ఞానము బంధమునకు బ్రహ్మజ్ఞానము, ముక్తికిని కారణము అగును. ఈ ప్రపంచ వ్యవహారము తెలివి వలననే జరుగును. కాని దీనికేమియు అంటదు. విద్య, అవిద్య అనువానిని బ్రహ్మజ్ఞానము, లౌకికజ్ఞానమునుగా గ్రహింపవలెను. (మోక్ష విషయకమైన జ్ఞానమే, జ్ఞానమనియు, తదన్య విషయకమైన తెలివి విజ్ఞాన మనియు అమరుడు చెప్పెను) ‘అవిద్యయా మృత్యుం తీర్త్యా విద్యయా అమృతమశ్నుతే’ అనగా అవిద్యచే జరా మరణములను లేకుండ చేసికొని విద్యచే అమృతస్థితిని (మోక్షమును) పొందునని శ్రుతి (వేదము) చెప్పినది. ఔపనిషదమైన (ఉపనిషత్తుల ద్వారా) లభించు జ్ఞానము బ్రహ్మజ్ఞానము అగును. వేద విద్యా శబ్దవాచ్యమై కేవలము పునరావృత్తికమైన ముక్తికి హేతువగును. తక్కిన వేద వేదాంగాది విద్యలు తదుదిత కర్మానుష్ఠానము, అవిద్యగా పేర్కొనబడి స్వర్గాది భోగమాత్ర సాధనములగును. వీనిచే చిత్తశుద్ధి వడసి, పునరావృత్తి సహితములయిన పుణ్యలోక భోగములను పొంద వచ్చును. కేవలము విద్యవలననే మోక్షస్థితి కలుగునని భావము. ఈ విధముగా నాచే భూమండలము, సమస్త పాతాళములు, నరకములు మీకు చెప్పబడినవి. సముద్రము, పర్వతములు, ద్వీపములు, నదులు సంక్షేపముగ చెప్పబడినవి. ఇంకేమి వినగోరుచున్నారు” అని అడుగగా.
ఓ లోమహర్షణ! నీవు సర్వమును మాకు తెలిపితివి. భువర్లోకము మొదలగు లోకములను, గ్రహసంస్థానము అను వాని ప్రమాణమును తెలుపుము అని ముని జనులు అడుగ లోమహర్షణుడు ఇట్లనియె.
సూతుడు ఇట్లు అనియె:
సూర్యచంద్రుల కిరణ ప్రసారముకల ఆసముద్ర శైలపరివృతమై ఉన్న పృథివీ మండలము భూమియొక్క విస్తారమెంతో, దానికి మీదనున్న అంతరిక్ష విస్తారము అంతే. భూమికి లక్షయోజనములలో సౌరమండలము ఉన్నది. దానికి లక్ష యోజనములలో చంద్ర మండలమున్నది. దానికి లక్ష యోజనముల మీద నక్షత్రమండలము ఉన్నది. ఆ నక్షత్ర మండలమునకు రెండు లక్షల యోజనములలో ఉత్తరమున బుధుడు కలడు. అతనికంతే దూరములో శుక్రుడు, అంతే దూరములో అంగారకుడు (కుజుడు) కలరు. అక్కడకు రెండు లక్షల యోజనముల దూరములో బృహస్పతియు, అటకు రెండు లక్షల యోజనములలో శని, ఆమీద లక్ష యోజనములలో సప్తర్షి మండలము, దానికి లక్ష యోజనములలో జ్యోతిశ్చక్రమున కెల్ల కేంద్ర స్థానమైన ధ్రువ మండలము ఉన్నవి. ఈ అంతరిక్షలోకము జ్యోతిర్మండలము. ఇది యజ్ఞ ఫలమునకు స్థానము. ఇజ్య (యజ్ఞము) ఇందు ప్రతిష్ఠితమై ఉన్నది. “క్షిప్రంహి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా” మనుష్య లోకమున కర్మఫలసిద్ధి వేగముగ కల్గును) అని శ్రుతులు చెప్పుచున్నవి.
ధ్రువ లోకమునకు మీద ఒకకోటి యోజనములలో కల్పాంత జీవులు నివసించు మహర్లోకము ఉన్నది. దానిపై రెండు కోట్ల యోజనములలో జనోలోకము ఉన్నది. అది బ్రహ్మమానసపుత్రులు, నిర్మలచిత్తులు అయిన సనకసనందనాదులు ఉండెడి స్థానము. జనోలోకమునకు పైన ఎనిమిది కోట్ల యోజనములలో తపోలోకము ఉన్నది. అచట వైరాజులు అను దేహరహితులైన (విదేహులు) దేవతలు నివసింతురు. తపోలోకమునకు పైన అరు యోజనములలో సత్యలోకము విరాజిల్లుచున్నది. అచట సిద్ధాది మునులు ఉందురు. అది అపునర్మారకము. తిరిగి మరణధర్మము లేని పుణ్యలోకము, బ్రహ్మలోకము.
పాదగమ్యమైన భూభాగమంతయు భూలోకము. దీని విస్తారము ఇంతకు ముందె చెప్పబడెను. భూమికిని సిద్ధాది మునిసేవితమైన సూర్యలోకమునకు నడిమి భాగము భువర్లోకము (అంతరిక్షము) అని చెప్పబడును. ఇది రెండవలోకము. సూర్యునకు ధ్రువునకును నడుమగల చతుర్దశ నియుత (లక్ష) పరిణామమైన లోకము స్వర్లోకము. ఈ మూడులోకములకు కృతకములు (కర్మసంపాద్యము) అను పేరుగలదు. ఆమీద జనతపస్సత్య లోకములు మూడును అకృతకములు అనబడును. కృతక అకృతకముల నడిమి భాగము మహర్లోకము. దీనికి కృతకాకృతమని పేరు ఇది కల్పాంతమందు శూన్యము అగును కాని నశింపదు.
బ్రాహ్మణులారా! సప్తమహాలోకములు, సప్తపాతాళములు నాచే చెప్పబడినవి. ఇది బ్రహ్మాండము యొక్క విస్తృతి. అండ కటాహముతో కింద, మీద, నడుమ వ్యాపించి వెలగపండు విత్తనమువలె ఉండునది బ్రహ్మాండము. దీనికి పదిరెట్లు విరివిగల ఉదకము వహ్నిచే ఆవరింపబడిఉన్నది. ఆ అగ్ని వాయువుచే, అది ఆకాశముచే ఆకాశము మహత్తత్వముచే పదేసిరెట్లు పరిమాణముగలదానితో ఆవరింపబడి ఉన్నది. మహత్తత్వమును ఆవరించి ప్రధానమున్నది. అది అనంతము. దానికి లెక్కలేదు. సమస్త సృష్టికి హేతువైన పరాప్రకృతి. ఇట్టి అనంత కోటి కోటి ప్రకృతులందు దారువునందు అగ్నివలె నువ్వులందు తైలమువలె, చేతనాత్మకమై పురుషతత్త్వము-అనగా పరబ్రహ్మ వస్తువు ప్రధాన మందు వ్యాపించి ఉన్నది. ఈ ప్రధానము పురుషతత్వము సర్వభూతముల అనుభూతిలో ఉన్న విష్ణు శక్తిచే ధరింపబడి, పరస్పరాశ్రయ ధర్మము కలవియై ఉన్నవి. ఆ రెంటి పృథగ్భావమునకు, సంశ్రయమునకు ఆ విష్ణుశక్తియే కారణము.
సృష్టి కాలమందు విష్ణు శక్తియైన మాయ (ప్రకృతి)యే, కారణరూపమైన తత్త్వము నందు క్షోభకు కారణమగును. అదే ప్రథమస్పందనము. ఈ శక్తి, వాయువు, నీటి బిందువులందలి చలువను భరించినట్లు ప్రధాన పురుషాత్మకమై, ఈ జగత్తును భరించును. చెట్టు మొదలు స్కంధము (బోదె), కొమ్మలు, రెమ్మలు, ఆకులతో మొదట విత్తనమునుండి పుట్టును. ఈ క్రమమునందు పుట్టిన చెట్లు మొదలయిన వాని లక్షణములు తత్తద్రవ్యములు. ఈ కారణముల ననుసరించి ఉన్నట్లే ఈ జగత్పరంపర (బీజపరంపర) అనంతమైన జగత్కారణమైన విష్ణువును అనుసరించి ఉండును. ఆ విష్ణువే అవ్యాకృత తత్వము. ఆ బీజము నుండియే మహత్తు అహంకారము సమిష్టి మనస్సు మొదలగునవి వ్యాకృతమగు చున్నవి. (అవ్యాకృతమునే-అవ్యక్తమని, వ్యాకృతమును-వ్యక్తమని శాస్త్రము వ్యవహరించినది) అహంకారతత్త్వము నుండి దేవవర్గము తత్పుత్రులు, పౌత్రులు జనించిరి. బీజము నుండి మొలక మొలక నుండి వృక్షము తద్భాగములు పుట్టినపుడు బీజాదులకు నాశము లేనట్లు భూతముల పరిణామము వలన మూలభూతములకు అపచయములేదు. వృక్షమునకు ఆకాశము, కాలము మొదలైన ద్రవ్యములు సన్నిధాన మాత్రమున కారణమైనట్లు సర్వసాక్షి అయిన భగవంతుని సన్నిధాన మాత్రమున పొడమెడి నామరూపాత్మక వివిధ సృష్టివలన సర్వాధిష్టానమైన భగవత్తత్వమునకు ఉపచయా పచయములు లేవు. హరి, పరిణామము లేకుండగనే కారణమగుచున్నాడు. ధాన్యపుగింజలో మూలము, కాడ, మొలక, ఆకు, కోశము, పువ్వు, క్షీరము, ధాన్యము, బియ్యము, ఊక, తవుడు, మొదలయిన పదార్థములు (అవ్యక్తముగ) ఇమిడి ఉండి తరువాత వ్యక్తమైనట్లు పరమాత్మయందు సృష్టి కారణసామగ్రి అయిన అనేక కర్మ బీజములు దేవాద్యుపాధులు జీవశరీరమును నిండియుండి, విష్ణుశక్తి వలన ఆపరమాత్మ నుండి ఆవిర్భావమును పొందుచున్నవి. కావున ఈ జగమెల్ల పుట్టిపెరిగి లయించుటకు హేతువైన, విష్ణువే పరబ్రహ్మము అనబడును. అదియే పరంధామము, పరమ పదము, సదసద్రూపము ననబడు పరతత్త్వము. చరాచరమైన ఈ జగత్తు అభేదదృష్టి చేత అతడే అగును. మూలప్రకృతియు వ్యక్త రూపమగు జగత్తును అతడే. ఆతనియందే సర్వము నిలుచుచున్నది. లయించుచున్నది. యజ్ఞకర్త, యజ్ఞము, యజ్ఞమున యజింపబడు వాడు, యజ్ఞభోక్త, యజ్ఞఫలము ఆతడే. సర్వరూపుడైన అతని నుండియే యుగాది కాలగమనము ఏర్పడినది. ఆ హరికి వ్యతిరిక్తమయినది ఏ కొంచెమును లేదు.
అటుపిమ్మట శ్రీ పరాశరుడు ఇట్లు చెప్పెను:
ఈ బ్రహ్మాండ సంస్థితిగూర్చి వివరించితిని. ఇక సూర్యాది జ్యోతిస్సుల యొక్క కొలతలను వాని సంస్థానము (ఉనికి)ని గురించియు వినుము. సూర్యుని రథము తొమ్మిదివేల యోజనములు. ఈషాదండము అనగా కాడికి ఇరుసునకు అనుబంధపడి ఉండు పోలుగఱ్ఱ, దీనికి రెండింతలు. అనగా పదునెనిమిది వేల యోజనములు. ఈ రథముయొక్క అక్షము (బండి కన్ను కుంచము) ఒకకోటి ఏబది ఏడు లక్షల యోజనములు. దీనియందు చక్రము ప్రతిష్టితము. ఈ చక్రము త్రినాభికము. అనగా కేవలము వర్తులాకారము గాక కోడిగ్రుడ్డు ఆకారముగా ఉండును. అదిగాక ప్రాతర్మధ్యాహ్న సాయాహ్నములు మూడు ఈకాలరూప చక్రమునకు నాభులని పండితులు చెప్పుచున్నారు. కొందరు నాల్గేసి మాసములు ఒకటిగా మొత్తము సంవత్సరమును మూడు కాలములుగా గణించి, అవి ఈ చక్రమునకు ఆకులు ఆరు అని చెప్పుదురు. దీనియందు అరలు అయిదు. బండి చక్రములో ఆకునకు, ఆకునకు నడుమగలు అంతము అర. అవి ఈ సంవత్సరాత్మక కాల చక్రములో వత్సర, పరివత్సర, ఇద్వత్సర, అనువత్సర యుగములు అను అయిదు భాగములని చెప్పుదురు. హేమంత శిశిరములు ఒకే ఋతువుగా, గణించగా వసంతాది ఋతువులు అయిదు, దీనియందు అరలై ఉన్నవని వేరొకరు చెప్పుదురు. ఇందు నేములు ఆరు. నేమి అనగా బండి చక్రము చుట్టునుగల ఇనుపపట్టా. ఆ పట్టాను తాకుచు ఆకులు ఉండును. ఆ తాకిన బిందువులు ఆరు ఋతువులుగా కాలచక్రము చుట్టును ఉన్నవని సంకేతము. గుర్రములు ఏడును ఏడు ఛందస్సులు. అవి గాయత్రి, బృహతి, ఉష్ణిక్కు, జగతి, త్రిష్టుభము, అనుష్టుప్పు, పఙ్తి అను పేరుగలవి. అక్షము (ఇరుసు) యొక్క ఒక వైపు మేరువుమీద, రెండవకొన మానసగిరిమీదను ఆనియుండగా, ఈ చక్రము అక్షము మీదను, ఆ అక్షము ద్రువమండలము నందును అనుబంధింపబడి ఉన్నది. చక్రముతో ఇరుసును, ఇరుసుతో ద్రువుడును తిరుగుచుండును. జంబూద్వీపము నడుమ మేరువు, దానిమీద పదునైదు లక్షల యోజనములలో ధ్రువ మండలము ఉన్నది. మేరువు మీద పదునారువేల యోజనములలో మహాక్షము యొక్క మొదలును, ఏబదివేల యోజనములలో మానసోత్తర పర్వతముమీద ఆ మహాక్షము యొక్క తుదిభాగమును కలవు.
మానసోత్తర పర్వతమునకు తూర్పున ఇంద్రరాజధాని ‘వస్వౌకసారము’, దక్షిణమున ‘యమపురి’ సంయమని అనునది పడమట ‘వరుణపురి’, ‘సుఖపురి’ అను పేరు గలది ఉత్తరమున సోముని యొక్క పురము ‘విభావరి’ అనునదియు కలవు.
దక్షిణదిశనున్న రవి, విసరిన బాణమువలె ఉత్తరదిశకు జ్యోతిశ్చక్రమంతను తన వెంటగొని నడచుచు, అయనము (గమనము) చేయును. అట్లు ఆరుమాసములు అయనము (గమనము) చేసి ఉత్తరమునకు చేరును. అటనుండి ఆరు మాసములు అయనించి దక్షిణమునకు చేరును. సర్వద్వీపములందును అహోరాత్ర వ్యవస్థకు కారణమై, సూర్యభగవానుడు ఈ రెండుదారులందు సంచారము చేయుచుండును. సూర్యుడు దక్షిణదిశ నుండి ఉత్తరదిశకు పోవు కాలము ఉత్తరాయణము. ఉత్తరాయణము ఆరు మాసములు. (తదభిమాన దేవత) అగ్నిజ్యోతి (అర్చిరభిమానినీ, ఆతివాహిక దేవత) అహస్సు (అహరభిమానినీ దేవత) శుక్లపక్షము (తదభిమానినీ దేవత) వీనికి దేవయానమార్గము అని పేరు. ఈ మార్గమునందు పోవు యోగులు అనగా జ్ఞానులు బ్రహ్మపదము అందుదురు. కావున ఈ మార్గము యోగుల క్లేశములను హరించు గొప్ప మార్గము.
సూర్యుని ఎవ్వరు ఎచ్చట చూచెదరో, అదిపగలు. ఆయన చాటుపడినపుడు అదియే రాత్రి. ఎల్లప్పుడు ప్రకాశించు రవికి నిజముగా ఉదయఅస్తమయములు లేవు. ఆయన కనపడుట కనుపింపకుండుటయే ఆయన ఉదయాస్తమయములు.
భాస్కరుని రథవైశాల్యము (భాస్కరుని కాంతి ప్రసరించు మేర) తొమ్మిదివేల యోజనములు. దాని ఈషాదండము (కాడికిని ఇరుసునకు మధ్య ఉండునది) పదునెనిమిదివేల యోజనముల పొడవు. ఆ రథముయొక్క అక్షము ఒకకోటి ఏబదిలక్షల ఏబదివేల యోజనములు. దానిపై చక్రము ఉంచబడినది. ఆ చక్రము మూడు నాభులు అయిదు అరలు, ఆరు నేములు కలది. దీనియందు సంవత్సర మయమైన కాలచక్రము ప్రతిష్ఠింపబడినది. మూడు నాభులనగా పూర్వాహ్ణము మధ్యాహ్నము, సాయాహ్నము అనునవి. అయిదరలనగా 1. సంవత్సరము, 2. పరివత్సరము, 3. ఇద్వత్సరము, 4. అనువత్సరము, 5. యుగము అనునవి ఆరు. అనగా ఆరు ఋతువులు. మేరు పర్వతమునకు మానసపర్వతమునకు నడుమ ఉన్న దూరమే అక్షముయొక్క కొలత. అక్షముయొక్క ఒక కొనమేరువుమీదను, రెండవకొన మానసగిరిమీదను ఆని ఉండగా ఈ చక్రము తిరుగుచున్నది అని గ్రహింపవలెను. చక్రము అక్షముమీదను, (ఇరుసుమీద) ఇరుసు, ధ్రువ మండలమందును కట్టబడి ఉన్నవి. చక్రముతో ఇరుసును, ఇరుసుతో ధ్రువుడును తిరుగుచుందురు. జంబూద్వీపము నడుమ మేరువు. దానిమీద పదునైదు లక్షల యోజనములలో ధ్రువుడు, మేరువుమీద పదునారువేల యోజనములలో మహాఅక్షముయొక్క మొదలు, దానికొస చక్రముతో కూడ మానస పర్వతముమీద, ఏఐదివేల యోజనములలో ఉన్న ఆకాశము ఉన్నవి.
మానసోత్తర పర్వతమునకు తూర్పుగా ఇంద్రపురమున్నది. దక్షిణమున యమ పురము, పడమట వరుణపురము, ఉత్తరమున సోమపురి ఉన్నవి. ఇంద్రుని పురము పేరు ‘వస్వాకసారము’, యమపురము ‘సంయమని’, వరుణునిపురము ‘సుఖ’ చంద్రుని పురము ‘విభావరి’. విసరినబాణమువలె సూర్యుడు దక్షిణ దిశయందు తిరుగును. సూర్యుడే అహోరాత్రములకు కారణము. అతడంతట తనకాంతిని ప్రసరింపజేయును. దేవతల పర్వతమగు మేరువునందు, బ్రహ్మలోకమందు అతని కాంతులు ప్రసరింపవు. బ్రహ్మ లోకమునకు ప్రసరించిన కాంతులందలి కాంతులచే త్రోసివేయబడి దివిటీ ముందరి దీపములవలె ఉండును. అందుచేతనే ఉత్తరదిక్కునందు ఎల్లప్పుడును దివారాత్రములు ఉండుట తటస్థించును. అనగా మేరువు మీదనున్న బ్రహ్మలోకము తన ప్రకాశముచే ఎల్లవేళల పట్టపగలై ఉండును అనియు, ఈ సూర్యకాంతి అట ప్రసరింపని కారణముచే, ఎల్లప్పుడు రాత్రిగానే ఉండునని తాత్పర్యము. సూర్యుడు అస్తమింపగనే రాత్రి, సూర్యుని కాంతి అగ్నియందు ప్రవేశించును. అగ్నికాంతి సూర్యోదయము కాగానే పగలు సూర్యునందు ప్రవేశించును. సూర్యాగ్నుల తేజస్సులు రెండును ఒకదాని యందు ఒకటి ప్రవేశించి, రాత్రింబవళ్ళు ఆప్యాయనము చేయుచున్నవి. మేరువునకు దక్షిణమువైపు సూర్యుడు ఉదయింపగా, తమోరూపమైన రాత్రి నీటియందు ప్రవేశించును. మేరువునకు అవలి ఉత్తరార్థమునకు రవి ఏగినపుడును, సూర్యుడు అస్తమింపగా ప్రకాశవంతమైన పగలు నీటియందు ప్రవేశించును. కావుననే పగలు నీరు ఇంచుక ఎఱ్ఱగా ఉండును, రాత్రి నీరు తెల్లగా చంద్రునివలె ఉండును. ఇట్లు మేరుమానస పర్వతముల నడుమనున్న పుష్కర మందలి ఒక ముహూర్తములో భూమండలముయొక్క ముప్పదియవ భాగమును రవి అతిక్రమించును. కుమ్మరిసారియందువలె జ్యోతిశ్చక్రమున ఇట్లు దక్షిణాయనమున సంచరించి, ఉత్తరాయణమున ప్రవేశించి, రాత్రింబవళ్ళు, ప్రమాణమును చిన్నదిగా పెద్దదిగా చేయుచుండును. మకరకుంభ మీనరాసులు మూడిటంగడచి, విషువములకు సూర్యుడు వచ్చిన, అపుడు పగలు రాత్రియు సమానముగా ఉండును. ఆవల రాత్రి తగ్గును. పగలు హెచ్చుచుండును. మిధునము దాటి కర్కాటకమునకు రాగానే, దక్షిణాయనము ఆరంభము అగును. అపుడు పగలు తక్కువ రాత్రి హెచ్చగును. పగలు పదమూడున్నర నక్షత్రములను, రాత్రి పదమూడున్నర నక్షత్రములను అతడు నడచును. పగలు ఆరు రాసులందు రాత్రి ఆఱు రాసులందు అతడు సంచరించును. అతని సంచారమును బట్టి రాసుల ప్రమాణములు హ్రస్వదీర్ఘములు అగుచుండును. ఉష అనగా రాత్రి. వ్యష్టి అనగా పగలు. వాని నడిమి కాలమునకు ‘సంధ్య’ అని పేరు. అది పరమదారుణమైన కాలము, రౌద్రము. అచ్చట మందేహులను రాక్షసులు సూర్యుని భక్షింపకోరుదురు. అనియములైన శరీరములను, దినదినము చావును కలుగునని బ్రహ్మ వారికి శాపమిచ్చెను. అందుచే వారు సూర్యునితో దారుణ యుద్ధము చేయుచుందురు. బ్రాహ్మణులు సంధ్యాసమయమున ఇచ్చు అర్ఘ్యములు, మంత్రపూతములై, వజ్రసమానములై, వారిని ఖండించును. అగ్ని హోత్రమునందు ఆ సమయమునచేయు హోమమున ఒక్క ప్రథమ ఆహుతిచేతనే సూర్యుడు లెస్సగా ప్రకాశించును.
ఓంకారమే భగవంతుడైన విష్ణువు. అది వాకృతి. ఋగ్యజుస్సామాత్మకము. (త్రిధామ) అది ఉచ్చరింపగనే, రక్కసులు నశింతురు. సూర్యుడు విష్ణుని అంశము. అంతర్జ్యోతియు, అవికారము అగు ఓంకారము చని, అవ్విష్ణుని ప్రేరణచేయును. ఓం కారమున ప్రేరేపింప బడి మిక్కిలి వెలుగుగల ఆ జ్యోతిస్సు సకల రాక్షసులను మందేహులు అను వారిని నశింపజేయును. అందుచేతనే సంధ్యోపాసనము (సంధ్యా వందనము) మానరాదు. అట్లు మానిన విప్రుడు సూర్యహాని చేసినవాడు అగును, ఆవల వాలఖిల్యాదులచేతను, బ్రాహ్మణుల చేతను నుతింపబడి సూర్యుడు లోకములను రక్షించుటకు పోవును. ముప్పది ముహూర్తములచే ఒక్క రాత్రియు పగలు ఏర్పడును. అందు ఐదవ భాగము మూడుముహూర్తముల కాలము ప్రాతఃకాలము అనబడును. అవల మూడు ముహూర్తముల కాలము, సంగవము అనబడును. అవలిది మధ్యాహ్నము. ఆవలిది అపరాహ్ణము. అంతకు మీదిది సాయాహ్నము. ఇట్లు ముప్పది గడియలు పదునేను ముహూర్తములలోగల పగటికాలము అయిదు విధములుగా విభజింపబడినది. పదునైదన ముహూర్తము విషువమ్ముము అనబడుచుండును. దక్షిణ ఉత్తరాయణములందు రాత్రింబవళ్ళు హెచ్చుచు, తగ్గుచు చివరకు ముప్పది ముహూర్తముల కాలముగా గణింపబడుచుండును. శరత్ వసంత ఋతువుల నడుమ విషువత్తువచ్చును. అనగా తులామేషములను సూర్యుడు పొందినపుడు విషువత్తులు వచ్చును. కర్కటమందు సూర్యుడు రాగా దక్షిణాయనము. మకరమందు ఉండుచో ఉత్తరాయణము అగును. రాత్రింబగళ్లు ముప్పది ముహూర్తములని ఇప్పుడు చెప్పిన దానిలో పదునేను ముహూర్తములకు పక్షము అనిపేరు. కృత్తికా ప్రథమ భాగమున సూర్యుడున్న ప్పుడు, విశాఖా చతుర్థపాదమున చంద్రుడు ఉండును. విశాఖ చతుర్థపాదమున చంద్రుడు ఉన్నప్పుడు కృత్తికా శిరస్సున సూర్యుడు ఉండును. అట్లున్నపుడే విషువత్తు అనునది ఏర్పడును. అపుడు బ్రాహ్మణులను పితృదేవతలను అర్చింపవలెను. దానాదులు ఒనర్ప వలయును.
లోకాలోకము అను పర్వతమున సుధన్వుడు, శంఖపుడు అను కర్దముని కొడుకులు ఇర్వురు ఉండిరి. హిరణ్యరోముడు, కేతుమంతుడు అను ఇర్వురును ద్వంద్వాతీతులు, నిరభిమానులునై, నాల్గు దెసలకు నల్గురును పాలకులై ఉందురు. అగస్త్యునికి ఉత్తరముగా, అజవీధికి దక్షిణముగా, ధూమాది మార్గమను పేర పితృయానము అను మార్గము ఉన్నది. అది వైశ్వానర మార్గమునకు ఆవల కలదు. అట అగ్నిహోత్రములు చేసిన పుణ్యులుందురు. భూతముల సృష్టికి కారణమైన బ్రహ్మవేదమును పఠించుచు ఋత్విక్కుల ద్వారమున కర్మమును ఆచరించు వారలుందురు. అది వారి మార్గము. దక్షిణమున యుగయుగమున చలించు బ్రహ్మమును, వేదమును, వారు ఉద్దరింతురు. ఆ ఉద్ధరణము వంశ ప్రవర్తనము చేత, తపస్సుచేత, వర్ణాశ్రమాదివ్యవస్థలచేత, శాస్త్రప్రవర్తనముచేత వారు చేయుచుందురు. భూతప్రళయము జరుగుదాక వారు సూర్యాది దక్షిణ మార్గమున వసించి చంద్ర, నక్షత్ర మండలములు ఉన్నంత వరకు, తండ్రి కుమారునియందు, కుమారుడు మరల తండ్రి యందు, అయాకులములందు అధికారికమైన కర్మము వలన పుట్టుచుందురు. నాగవీధికి ఉత్తరముగా సప్తర్షి మండలమునకు, దక్షిణముగ సూర్యుని ఉత్తర మార్గము. అర్చిరాది మార్గమను పేర దేవయానమున్నది. అచటి వారు జితేంద్రియులై, పరిశుద్ధులై, సిద్ధులై, బ్రహ్మచారులై, సంతానమునెడ జుగుప్సగలవారై ఉందురు. సంతాన విముఖులై యుండుట చేత, మృత్యువును జయించి ఉందురు. అమృతులగుదురని అర్థము. ఎనుబదివేలమంది ఊర్ధ్వరేతస్కులైనమునులు ఉత్తరమార్గమును ఆశ్రయించి, ప్రళయముదాక సంచరింతురు. లోభమువిడిచి, మైధునము విడిచి, ఇచ్ఛ, ద్వేషములేక, భూతములను ఆరాధించుట మాని, కామము విడిచి, శబ్దాదులగు విషయములు దుష్టములని తెలియుట వలనను, శుద్ధులై అమృతులు అయ్యెదరు.
ఇట అమృతత్త్వ మనగా చిరకాలము, అనగా బ్రహ్మ మొదలు పగటికాలమంతయు పునరావృత్తిలేక ఉందురు. భీతి ప్రళయము జరుగునంత కాలము ఉండుటయే ఇట అమృతత్వము అని పేర్కొనబడినది. త్రిలోకముల యొక్క స్థితికి ఇది సమయము. అవునర్నాకమని దీనికే పేరు. బ్రహ్మహత్యచే అగు పాపము, అశ్వమేధముచే కల్గు పుణ్యము, భూతప్రళయము దాక అనుభవింపవలసినవి. భూమి నుండి ధ్రువ మండలముదాక కల్గు మేలును సర్వమును భూతప్రళయమున నశించును. సప్తధ్రువములకు ఉత్తరముగా పైన ధ్రువుడు ఉన్నాడు. ఇదే విష్ణుపదము. భూమినుండి మూడవ దివ్యస్థానము ఆకాశమున ప్రకాశము కల్గియుండునది. పాపములు విడిచి మనసుగెల్చిన యతులకు అది నివాసము. అదే వైరాజుని హృదయనాడీ స్థానము. విష్ణుని వాసమదియే. ఇది స్వర్గముకంటె గొప్పది. (మీదిది సత్యలోకము కంటె క్రిందిది) పుణ్య పాపములు రెండును క్షీణమైన వారిచ్చట ఉందురు.
అనగా మోక్షార్హులు ఉండుచోటని అర్థము. ఆ మోక్షము కూడ క్రమముక్తిని సూచించునదే. ఇచట ఉన్నవారు, దేహము పొందుటకుగల హేతువులు అన్నియు క్షీణమై, క్రమముగా బ్రహ్మలోకమునకు ఏగి బ్రహ్మతో పాటు మోక్షము పొందుదురు. ఏలోకమున, విష్ణునితోసమాన ఐశ్వర్యము వడసి, ఇంద్రియాదులను గెల్చినందువలన కలిగిన యోగసమాధిచే, వెలుగువారు చరింతురో, అది ఆ విష్ణువుయొక్క పరమపదము. ఏచోట ఈ చరాచరరూపమైన జగత్తు, పడుగుపేకగా అల్లుకొని పొడముచున్నదో, ఆ చోటు విష్ణువుయొక్క పరమపదము. ఆకాశమున సర్వ ప్రకాశమై ప్రాపంచికమైన జ్ఞానముకంటె భిన్నమైన వివేక జ్ఞానముచేత ఇంతింత అని నిర్ణయింపరానిదిగా చూడబడు ఆ స్థానమే విష్ణువు యొక్క పరమపదము. ఏ స్థానమున నిలువుగాంచి, వెలుగువాడై స్వయముగా ధ్రువుడు ఉన్నాడో, ఏ ధ్రువునియందు ఎల్ల జ్యోతిస్సు, జ్యోతిస్సులయందు మేఘములు, మేఘములయందు ఎడతెగని వర్షము, వర్షమువల్ల పోషణము, దేవాదులకు తృప్తి కలుగుచున్నదో, ఆజ్యాహుతులచే (నేయి హోమములు చేయుటచే) దేవతలు పోషింపబడి, సృష్టికిఁ కారణులై, భూతముల రక్షణము చేయుచున్నారో అట్టిదానికెల్ల ఆధారమై, ముల్లోకముల వృద్ధిని కూర్చునట్టి ఆ మూడవ స్థానము విష్ణు పదము. ఆ విష్ణు పదము నుండి గంగానది సర్వపాపములను హరించు నదియై, దేవతాస్త్రీల శరీరగంధములచేఁ (ఎఱ్ఱనిదై) పరిమళించునదై. (ప్రభవించినది లెస్సగా ఏర్పడినది) త్రివిక్రముని పాదముచే పగిలిన బ్రహ్మాండము యొక్క పగులులోనుండి అది జనించినది. విష్ణుపాదముచే, బ్రహ్మాండము పగిలి, అంబరము నుండి, విష్ణుమాయ, విష్ణుపాదము అను వజ్రమువంటి ఊరుదండముచే కొట్టబడిన బ్రహ్మాండము తూటుపడి అందుండి భూమి కేగెను. అనఁగా అదివరకు పుట్టి ఉన్నను దృష్టికి గోచరము కాకుండ ఉన్న ఆ నది అది మొదలు దేవాదులకు తృప్తి కలిగించుచు ప్రకటమయినది. (బ్రహ్మయొక్క కమండలు జలముచే విష్ణుపాదమును కడుగ బడెననియు, అది చాలకపోగా ధర్మము బ్రహ్మాజ్ఞచే నీరుగా మారెననియు, అదియు చాలకున్న బ్రహ్మాండ కటాహము తూటుపడగా అందుండి వెలుపలి నీరు ధారగా ఆ కన్నము నుండి వెడలి విష్ణుపాదము స్పృశించుచు భూమికి అరిగెననియు, అదియే గంగ అయ్యెనని పురాణము లందున్నది.) విష్ణుని ఎడమ పాదముయొక్క బొటనవ్రేలి గోటినుండి వెడలిన ఆ గంగను ధ్రువుడు భక్తితో నెత్తిపై భరించుచున్నాడు. ఆవల సప్తర్షులు ప్రాణాయామపరులై, అఘమర్షణస్నానము చేయుచు ఆ నీట జడలను తేలించు చుందురు. ఆ జల ప్రవాహములచే చంద్రమండలము తడుపబడి రాత్రివేళ మిక్కిలి కాంతిని వహించును. చంద్రమండలము నుండి మేరుగిరిపై పడి, లోకములు పావనములు ఒనర్ప, నాల్గు దెసలకు ప్రవహించుచున్నది.
ఆ యా దిక్కులకు ఏగుటను బట్టి, సీత, అలకనంద చక్షువు, భద్రా, అను పేరులుకొని ఉన్నది. అలకనంద అను శాఖను పరమేశ్వరుడు శంభుడు నూరు వత్సరములకంటె ఎక్కువగా శిరమ్మున ధరించెను. అతని జటాకలాపము నుండిదిగి, సగర కుమారుల అస్థి చూర్ణములను తడిపి, వారికి ఉత్తమ గతులను అనుగ్రహించెను. అందు స్నానమొనర్చిన వెంటనే అప్పుడే పాపముపోవును. అపూర్వమైన పుణ్యము లభించును. కుమారులు తండ్రులకు వదలిన ఈ ఉదకములు నూరేండ్లవరకు వారికి తృప్తి నిచ్చును. గంగా, గంగా అని రెండు మారులు తలచిన చాలు మూడు జన్మల పాపము నశించును.
భగవానుడగు విష్ణుని నక్షత్రమయమై ‘శింశుమార స్వరూపము దినమ్మున వెలుగు చున్నది. దాని తోకయందు ధ్రువుడు ఉన్నాడు. ఆ శింశుమారాకృతియే, చంద్ర, సూర్యాది గ్రహములను, గిఱ్ఱున త్రిప్పుచున్నది. అట్లు తిరుగుచున్న దానివెంట నక్షత్రములు చక్రము వలె తిరుగుచున్నవి. సూర్యచంద్రులు, తారా నక్షత్రములు, గ్రహములతో కూడ, వాయుమయములైన గట్టి త్రాళ్ళచే ధ్రువునియందు కట్టబడి ఉన్నవి. అనగా భూమికి మేఘముల నడుమనున్న అవహము, అమీది మేఘములకు భాస్కరులకు మధ్య నున్న ప్రవహము, సూర్యునికి చంద్రునకు నడుమనున్న అనువాహము, చంద్రునికి నక్షత్రములకు నడుమనున్న సంవహము, నక్షత్రములకు గ్రహములకు మధ్యనున్న వివహము, గ్రహములకు సప్తర్షులకు మధ్యనున్న పురోవహము, సప్తర్షులకు ధ్రువునికి మధ్యనున్న పరివాహము అను సప్త వాయువులచే, వేగమున సూర్యచంద్రాదులు ధ్రువమండలమును అంటుకొని తిరుగుచున్నవి. జ్యోతిస్స్వరూపమైన ఈ శింశుమారాకారము యొక్క హృదయమునందు తారా స్వరూపమున నారాయణుఁడే స్వయముగా దానికి ఆధారమై ఉన్నాడు. తారామయమైన శింశుమారము యొక్క తోకయందు, జగత్పతియైన ఆ నారాయణుని ఆరాధించుచు, ఉత్తానపాదుని కుమారుడగు ధ్రువుడు ఉన్నాడు. సర్వాధ్యక్షుడైన జనార్ధనుడు శింశుమారమునకును, శింశుమారము ధ్రువునకును, ధ్రువుడు సూర్యునికి ఆధారముగా ఉన్నారు. ఆ సూర్యుడు దేవాసుర మనుష్యులతోగూడి, ఈ జగత్తునకు ఆధారముగా ఉన్నాడు.
అదెట్లన శ్రద్ధగా వినుము:
సూర్యుడు ఎనిమిది మాసముల రసముగల ఉదకములను ఆకర్షించి వర్షించును. దానివలన అన్నము, అన్నము వలన సర్వజగత్తు కలుగుచున్నవి. తీక్ష్ణమైన కిరణములచే, జగత్తునందలి నీటిని పీల్చి, చంద్రునియందు విడచును. చంద్రుడు, పొగ, నిప్పు, గాలి అను వాని కూడికయై ఉన్న మేఘములయందు, వాయు నాడీ మయము లైన నాళముల ద్వారమున (గొట్టముల ద్వారా) చిమ్మును. ఆ మేఘములందుండి నీరు భ్రంశము నొందదు (పడిపోదు). కాన నానికా (అ + భ్ర) మను పేరు వచ్చినది. కాలము వలన సంస్కారము పొంది, ఆ నీళ్ళు నిర్మలములై, వాయువుచే ప్రేరేపింపబడి భూమిపై వర్షించును. భగవానుడైన సూర్యుడు నాల్గు తెఱగులుగా ఉన్న ఉదకమును ఆకర్షించును. అనగా మేఘ గర్భమునకు చేరుటకు మున్ను నీరునదులందు, భూమియందును, జీవుల దేహమందును నాల్గు తెఱగులుగా ఉండును. ఆకాశగంగ యందలి నీటిని, సూర్యుడుపై వలెనే గ్రహించి మేఘముల మూలమున కాకుండ, తన కిరణములచేతనే దానిని భూమిపై వర్షించుచున్నాడు. దాని స్పర్శచే, మానవుడు పాపములు వాసి పుణ్య లోకములకు పోవును. దానికే దివ్యస్నానము అని పేరు. సూర్యుడు కనబడుచుండగనే మేఘముల మూలమునగాక సూర్యుని కిరణములచేత ఆకాశగంగాజలము కృత్తికా నక్షత్రము మొదలుకొని ఉన్న వానిలో బేసి నక్షత్రములయందు ఆకాశము నుండి వర్షింపఁబడు ఆ జలము దిగ్గజములచే వర్షింపబడు గంగోదకమని పేరు గాంచినది.
సరినక్షత్రములయందు అనగా రోహిణి, ఆర్ద్ర మొదలగు వానియందున్న సూర్యుని కీరణము లచే ఆకర్షింపఁబడి, వర్షింపబడు ఆకాశగంగా జలముకూడా చాలా పుణ్యమైనది. పాపహరము. దివ్య స్నానమను వాడుక దీనికే. మేఘములచే వర్షింపబడు ఈ ఓషధులను పెంచును. అది జీవనా ధారముకాన అమృతమని పేరొందినది. దానిచే పెంపొంది ఓషధులు ప్రజల శరీరోత్పత్తి పోషణముల సాధకములగుచున్నవి. అందుచే శాస్త్రదృష్టికల మానవులు వేద విహితములయిన యజ్ఞములు ఒనర్చి దేవతలను తృప్తి పఱతురు. అట్లు యజ్ఞములు, వేదములు, వర్ణములు, సర్వదేవతలు, పశువులు, భూతములు మొదలగు ఇవియెల్ల వర్షముచే నిలుచు చున్నవి. అన్నము వృష్టిచే ఏర్పడుచున్నది.
ఆ వృష్టికి ఆధారము సూర్యుడు. ఆతనికి ఆధారము ధ్రువుడు. ధ్రువునికి ఆధారము శింశుమారము. ఆ శింశుమార చక్రమునకు ఆధారము నారాయణుఁడు. దాని హృదయ మునందే ఆ నారాయణమూర్తి ఉన్నాడు. సర్వభూతములకు అతడే మొదలై సనాతనుడై భరించువాడైయున్నాడు.
శ్రీ పరాశరుడు ఇట్లు అనియె:
సూర్యుడు ఉత్తర దక్షిణ దిశల నడుమ రథముపై ఎక్కుచు దిగుచు ఉండు దారి నూట యెనుబడి మూడు మండలములు. ఆయన కాంతి ప్రసారమగు మేర ఆయన రథము అనబడును. ఆ రథమునందు పండ్రెండు మాసములందు దేవతాదివర్గము ఏడు రకములుగ అధిష్టించి ఉండును. ఆ వివరణము ఈ క్రింది పథకము నందు స్పష్ట పరుపబడినది –
ఈ దేవతాదులు ఏడ్వురును విష్ణుశక్తి సముపబృంహితులై ఆయామాసము లందుందురు. దేవతలు పండ్రెండుగురు ద్వాదశాదిత్యులు అను పేరబరగుదురు. ఋషులు పూర్యుని స్తుతింతురు. గంధర్వులు పాడుదురు. అప్సరసలు ఆడుదురు. పన్నగులు రథమును, యక్షులు (గ్రామణులు) పగ్గములను పట్టుదురు. రాక్షసులు బంటులై సూర్యుని వెంటనడుతురు. వాలఖిల్యాది ఋషులు పరివారమై, సూర్య భగవానుని సేవింతురు. ఈ సప్తవర్గము తమతమ మాసములందు చల్లని వెచ్చని నీరు వర్షించుటకు కారణమై ఉందురు.
ఉత్తర దక్షిణ దిశల నడుమ సూర్యుడు ఒక్క సంవత్సరము సంచరింపవలసిన చోటున, నూటయెనుబదిమూడు మండలములు ఉన్నవి, కాడికి, అక్షమునకు పోలుగర్రకు కట్టబడిన వాయురూపములైన రెండు పగ్గములచే దినదినమును ధృవుడు సూర్య రథమును ముందుకు లాగినకొలది, అది ఉత్తరాయణమున ఆ మండలమును ఒక్కటొక్కటిగా గడచి మీదికేగును (ఆరోహణము). ధృవుడు ఆ రెండు పగ్గములను సడలించినకొలది, దక్షిణాయ మున ఒక్కొక్క మండలమును సూర్యుడు దిగినపుడు అవరోహణమగుచున్నది. ఆ సూర్య రథమున, దేవతలు, ఋషులు, నాగులు, గంధర్వులు, అప్సరసలు, గ్రామణులు (యక్షులు), రాక్షసులు ఉందురు. ధాత, కృతస్థన (అప్సరస) పులస్త్యుడు, వాసుకి, రథ భృత్త అను గ్రామణి (ఇతడొక యక్షుడు), హేతి అను రాక్షసుడు, తుంబురుడు అను ఈ ఏడ్వురును చైత్రమాసమున ఉందురు. వీరు మాసాధికారులు. వైశాఖమున, అర్యముడు, పులహుడు, రధౌజుడు (యక్షుడు), పుంజికస్థల (అప్సరస), ప్రహేతి (రాక్షసుడు), కిచ్ఛవీరుడు (నాగుడు), నారదుడు (గంధర్వుడు), అనువారు ఏడుగురు ఉందురు. శుచియందు అనగా జ్యేష్ఠమున, మిత్రుడు, అత్రి (మహర్షి), తక్షకుడు (నాగుడు), పౌరుషేయుడు (రాక్షసుడు), మేనక (అప్సరస) హాహా అను గంధర్వుడు, రథస్వనుడు అను యక్షుడు అనువారు ఉందురు ఆషాఢమున, వరుణుడు, వశిష్ఠుడు, సహజన్య అను రంభ, హూహూ రధుడు, రథచిత్రుడు, శుక్రుడు అనువారు ఉందురు. శ్రావణమున ఇంద్రుడు, విశ్వావసువు, ప్రోత, ఏలాపుత్రుడు, అంగిరస్సు, ప్రమ్లోచ, సర్పిస్సు అనువారు ఉందురు భాద్రపదమున వివస్వంతుడు, ఉగ్రసేనుడు, భృగుడు, ఆపూరణుడు, అనుమ్లోచ, శంఖపాలుడు, వ్యాఘ్రుడు అనువారు ఉందురు. ఆశ్వయుజమున పూషుడు, వసురుచి (గంధర్వుడు), వాతుడు (రాక్షసుడు), గౌతముడు, ధనంజయుడు (నాగుడు), సుషేణుడు (యక్షుడు), ఘృతాచి (అప్సరస) ఉందురు. కార్తికమున విశ్వావసువు (గంధర్వుడు), భరద్వాజుడు, పర్జన్యుడు (రవి), ఐరావతుడు (నాగుడు) విశ్వాచి, సేనజిత్తు (యక్షుడు) ఆపుడు (రాక్షసుడు) అనువారు అధికులు. మార్గశీరమున అంశుడు (సూర్యుడు), కాశ్యపుడు (ఋషి), తార్క్ష్యుడు (యక్షుడు), మహాపద్ముడు (నాగుడు), చిత్రసేనుడు (గంధర్వుడు), ఊర్వశి, విద్యుత్తు (రాక్షసుడు) అనువారు అధికులు. పుష్యమున క్రతువు (ఋషి), భగుడు (సూర్యుడు), ఊర్ణాయువు (గంధర్వుడు), స్ఫూర్ణుడు (రాక్షసుడు), కర్కోటకుడు (నాగుడు), అరిష్టనేమి (యక్షుడు), పూర్వచిత్తి (అప్సరస) అనువారు ఉందురు. మాఘమున త్వష్ట (రవి), జమదగ్ని (ఋషి), కంబళుడు (నాగుడు), తిలోత్తమ (అప్సరస), (బ్రహ్మోపేతుడు (రాక్షసుడు), ఋతజిత్తు (యక్షుడు) ధృతరాష్ట్రుడు (గంధర్వుఁడు), ఈ ఏడుగురు మాఘమాసము నందు భాస్కరుని యందు నివసింతురు మైత్రేయా ! ఫాల్గుణమున విష్ణువు (రవి), అశ్వతరుఁడు (నాగుడు), రంభ, సూర్య వర్చస్సు (గంధర్వుడు), సత్యజిత్తు (యక్షుడు), విశ్వామిత్రుడు (ఋషి), యజ్ఞోపేతుడు (రాక్షసుడు) సూర్యునియందు నివసింతురు. ఇట్లు బ్రహ్మ విష్ణుశక్తులచే ఉపబృంహితులై, సూర్యమండలమున వీరు ఏడుగురుగా ఈయా మాసములందు ఉందురు. మునులు సూర్యుని పొగడుదురు. గంధర్వులు ఆయన ఎదుట పాడుదురు, అప్సరసలు ఆడుదురు. సూర్యుని సేవకులై రాక్షసులు నడతురు. పన్నగులు మోయుదురు. యక్షులు, ధర్మ సంయోపనము చేయుదురు. వాలఖిల్యాదులు ఇతని పరివారమై కొల్తురు. ఈ సప్తగణము మంచును, వేడిని, నీటిని వర్షించుటకు తమతమ సమయములలో హేతువులై ఉందురు.
మైత్రేయుడు ఇట్లు అనియె:
స్వామీ తమరు రవిరథమందలి సప్తగణములను వారి వారి పనులను గూర్చి సమగ్రముగ సెలవిచ్చితిరి. సూర్యుడు చేయు పనిని తెలిపినారు గారు. దేవతాది సప్తగణమే హిమోష్ణ జలములను వర్షించునేని, సూర్యుని వలన వృష్టి అని ఏల చెప్పబడినది? సర్వ కార్యక్రమమును ఈ సప్తగణమునకు చెందినదగునేని సూర్యుడు ఉదయించినాడు, ఆకాశ మధ్యమందు, ఉన్నాడు అస్తమించినాడని జనమేల పలుకును? అని సందేహమును వెలిబుచ్చగా పరాశరుడు ఇట్లు అనియె.
మైత్రేయ; విను. ఈ సప్తగణము ఒక్కటిగను, రవి సర్వప్రధానుడుగ ఉన్నా దీనికంతకుఁ పైని విష్ణువుయొక్క పరాశక్తి ఋగ్యజుస్సామ వేదరూపిణి త్రయీమూర్తి వెలుగుచున్నది. అది జగత్తుయొక్క పాపములనెల్ల నశింపచేయును. ఆ శక్తియే విష్ణువు. జగత్తును పాలించును. స్థితి హేతువగును. సూర్యునియందు ఋగ్యజుస్సామ స్వరూపిణియై ఆ శక్తియే ఉన్నది. ప్రతిమాసము ఆయాసూర్యులు ఎవరు గలరో, వారియందు త్రయీ రూపిణి అగు ఆ శక్తి నిలుపొందుచుండును. పూర్వాహ్ణమందు ఋక్కులు, మధ్యాహ్నము యజుస్సులు, సాయాహ్నమందు బృహద్రథంతరాదిసామములు సూర్యుని స్తుతించు చుండును. ఈ త్రయి విష్ణువుయొక్క శరీరము, బ్రహ్మ పురుషుడు (పురుషోత్తముడు అగు హరి, బ్రహ్మరుద్రుడు అను మూర్తిత్రయము త్రయీ రూపము. బ్రహ్మసృష్టియందు ఋగ్వేదమయుడుగను విష్ణువు స్థితియందు యజుర్మయుడుగను రుద్రుడు లయమందు సామమయుడుగను ఉందురు కావున రుద్రదేవతాకమయిన సామము యొక్క ధ్వని అశుచి హేతువు అనబడును.
శుద్ధ స్తత్వమయము. వేదత్రయరూపము అగు వైష్ణవీ శక్తి, తన శరీరమైన సప్తగణమునందు ఉన్న ఆ సూర్యుని అధిష్ఠించి ఉన్నది. దానివలన భానుడు తన కిరణములతో జాజ్వల్యమానుడగుచు, సర్వజగమ్ముల సర్వవిధ తమస్సును నశింపజేయుచున్నాడు. స్థూలమైన చీకటినేకాదు, జీవుల అంతఃకరణమునందు ఉన్న తమోగుణమును, అజ్ఞానమును నశింపజేయుచు చైతన్యాధాయకుడు అగుచున్నాడని భావము. ఈయనను మునులు స్తుతించుచున్నారు. గంధర్వులెదుట నిలిచి గానము చేయుచున్నారు. అప్సరసలు నృత్యము చేయుచున్నారు. రాక్షసులు అనుగమనము చేయుచున్నారు. పన్నగులు వహించు చున్నారు. యక్షులు రశ్మి సంయోజనము చేయుచున్నారు వాలఖిల్య మహర్షులు కూడ అట్లే వీనిని చుట్టుకొనియుందురు.
శక్తి రూపధరుడు అగు విష్ణువు ఒకప్పుడు ఉదయించుట లేదు. అస్తమించుటయు లేదు. కేవలము అధిష్ఠాత అగుటచే స్థిరుడు. అధిష్టయము అస్థిరమును అగు ఆయన సప్తవిధ గణముకంటె వేరైనవాడు. ప్రత్యేక శక్తిమయము. స్థంభము నందుఉన్న అద్దమునకు ఎదురుగా ఎవ్వడెవ్వఁగును అతడతడందు ప్రతిబింబ దర్శనము నొంది, దానితో సంబంధమును బడయును. ఇట్లే ఆ వైష్ణవీశక్తియు ప్రతిమాసమునందును దీపించు ఆ భానుబింబమునందు ఇరవుకొని ఎన్నడు విడిచిపోదు. ఆ ప్రభువు పితృదేవమనుష్యాదులను ఎల్లవేళల ఆప్యాయితులగావించును. అహోరాత్రములకు కారణమై తిరుగుచున్నాడు. సూర్యరశ్మి విశేషమైన సుషుమ్నచే తర్పితుడై అమృతమూర్తి యగు చంద్రుడు కృష్ణపక్షమందు దేవతలచే పానము చేయబడును. దేవపానా నంతరము రెండు కళలు మాత్రముగా మిగిలియున్న ఆ సోముని కృష్ణపక్షము. తుదను (అమావాస్య తిధియందు) పితృదేవతలు త్రాగుదురు. సూర్యుని వలన వారు తర్పణము (తృప్తిని) పొందుదురు. భూమియందున్న రసమును సూర్యుడు తన కిరణములచే గ్రహించి (పీల్చి) దానినే భూతజాలము యొక్క పుష్టికొఱకు, సస్య సమృద్ధి కొఱకును విడుచును. అట్లు సూర్యభగవానుడు అశేషభూత జాలమును పితృ దేవ మనుష్యాదులను తనియింప చేయుచున్నాడు. దేవతలకు ఒక శుక్ల పక్షమునందును పితృదేవతలకు నెలకొక రోజు (అమావాస్య) నందును, మర్త్యులకు దినదినము ఈ సూర్యతృప్తిని అనుగ్రహించుచున్నాడు. ఈసాయన కాలభేదము సూర్యగోళ పరిభ్రమణమును బట్టి ఇది దేవలోక పితృలోక మానవ లోకములందు ఏర్పడును. ఇది ఖగోళ శాస్త్ర విజ్ఞాన విషయము. పురాణములందిది కథారూపమున ప్రతిపాదితము.
చంద్రుని రథమునకు మూడు చక్రములు. మొల్లమొగ్గ వంటి తెల్లని గుర్రములు ఉదక గర్భమునుండి పుట్టినవి. ఆ రధముతో ఇతడు తిరుగును. కాడికి, కుడి ఎడమ భాగములందు మొత్తమదిపది. అంతరిక్ష వీధియందు వేగవంతమై ధ్రువమును ఆధారముగా గొని (ధ్రువ నక్షత్రము యొక్క ఆకర్షణ శక్తిచే) నక్షత్రములున్నవి. సూర్యకిరణములకు వలెనే చంద్రకిరణములకును తఱుగు పెఱుగులు జరుగును. ఉదక గర్భమునందు పుట్టిన అశ్వములు, సూర్యాశ్వములవలెనే ఆ చంద్రుని రథమును ఒక కల్పాంత కాలము మోయును. దేవతలచే త్రాగబడి క్షీణించిఉన్న చంద్రుని దీప్తిమంతుడైన రవి తృప్తి పరచును. అమావాస్యనాడు పితరులచేత పదునేనవ కళ, పానము చేయబడగా, పదునాఱవ కళ ఒక్కటి మాత్రము మిగిలి ఉన్న చంద్రుని, భాస్కరుడు ఒక్క కిరణముచే ‘సుషుమ్న’ అను పేరుగల దానిచే తృప్తిచెందించును. క్రమముగా కృష్ణపక్షమున ఏ తిథి యందు ఎంత చంద్రభాగము దేవతలు పానము చేయగా తగ్గినదో, శుక్లపక్షమున ఆ భాగమును తిథియందంతే పుష్టిని జలతస్కరుడైన భాస్కరుడు చేకూర్చుచుండును. పదునేను రోజులిట్లు ప్రోగుపడిన చంద్రబింబమందలి అమృతమును దేవతలు పానము చేయుదురు. అందుచేతనే సుధాహారులై వారు అమరులు అను పేరువడసిరి. ముప్పది మూడువేలు, ముప్పది మూడువందలు, ముప్పది ముగ్గురు దేవతలు చంద్రుని ఇట్లు త్రావుదురు. అపుడు చంద్రుడు రెండు కళలచే మాత్రము మిగిలి, సూర్యమండలమున ప్రవేశించి “అమా” అను కిరణమున వసించి ఉండును. కాన ఆ తిథికి ‘అమావాస్య’ అను పేరు కల్గెను. ఆనాడు అహోరాత్రములందు నీటియందు వసించును. పిమ్మట లతాదులందు వసించును. ఆవల క్రమముగా సూర్యునిలోనికి చొచ్చును. వీరుత్తులందు చంద్రుడు ఉండుటచే అమావాస్యనాడు వీరుత్తులనుగాని, వాని ఆకునుగాని, ఎవ్వడు త్రెంచునో వాడు బ్రహ్మ హత్యను పొందును. పదునైదవ కళాభాగమున ఇంచుక భాగముచే మిగిలి ఉన్న చంద్రుని, అపరాహ్ణ సమయమున పానము చేయుటకై పితృదేవతలు సేవింతురు. చంద్రకిరణముల నుండి స్రవించు ఆ అమృతము అమావాస్య యందు ‘తావి’ ఒక్క మాసము చక్కగా తృప్తిపడి, పితరులు ఉందురు. వారు సౌమ్యులు, బర్హిషదులు, అగ్ని ష్వాత్తులు అను మూడు తెఱంగులను ఉన్నారు. ఇట్లా దేవతలను శుక్లపక్షమునందు పితరులను కృష్ణపక్షమునందు చల్లని జల అమృతమయములు అయిన జలపరమాణువులచే, చంద్రుడు వీరుత్తులను, ఓషధులను పెంపొందించి, కాంతిచేత కలిగెడు ఆనందముచే, మనుష్యులను, పశువులను కీటకములను తనివి చెందించును.
చంద్రకుమారుడగు బుధుని రథము, పిశంగ వర్ణము కలిగి వాయు జవము కల్గిన ఎనిమిది గుర్రములతో కూడి ఉన్నది. అది వాయువు అగ్ని అను ద్రవ్యముచే ఏర్పడినది. వరూధము (రథ కవచము) అనుకర్షము (రథము క్రింది కఱ్ఱ) ఉపాసంగము (రథము ముందు భాగము) పతాకము అనువానితో కూడి భూమి మీద జనించిన గుఱ్ఱములతోగూడి శుక్రుని గొప్పరథమున్నది. కుజుని బంగారురథము ఎనిమిది పద్మరాగ మణుల వలెనే ఎర్రనగు గుర్రములతోగూడి శోభావంతమై ఉండును. ఆ గుర్రములు అగ్ని వలన పుట్టినవి. బృహస్పతి రథము పాండురవర్ణము కల ఎనిమిది గుర్రములు కలది. స్వర్ణమయము. ఆ రథముమీద ఆతడు ప్రతిరాశియందు ఒక్కొక్క వత్సరము వసించును. శని మెల్లగా ఆకాశమున జనించిన శబలవర్ణముకల గుర్రములుకల రథముపై ఏగును. రాహువు రథము ధూసర వర్ణముకలది. (ఇంచుక తెలుపు) గుర్రములు తుమ్మెదల వలె నల్లగా ఎనిమిది ఉన్నవి. ఒక్కమారు పూన్చబడినవై కల్పకలను నిరంతరము వహించును, పర్వములందు రాహువు ఆదిత్యునినుండి వెడలి సోముని పొందును. సోముని నుండి సౌరపర్వములందు సూర్యుని పొందును. అనగా సూర్య చంద్రుల మీద మూడవ ద్యులోకమున చరించుచు, రాహువు వారిగ్రహణ సమయములందు క్రిందుగా ఉండి భూచ్ఛాయా స్వరూపమై తమోమయమైన బింబము కల్గి దానిచే వారిని మేఘమట్లు కప్పి ఆ గ్రహణమందే కానవచ్చు చుండును. కేతువు రథమునకు వాయువేగముగల ఎనిమిది గుర్రములు కలవు. పలాల (ఊకవలె) ధూమ్ర వర్ణములు భాలాక్షారస (లక్క) వలె ఎఱ్ఱనివి.
ఇవి తొమ్మిది గ్రహముల రథములు. ఇవి అన్నియు వాయురూపములైన పగ్గములచే ధ్రువునియందు కట్టబడి ఆకర్షింపబడి ఉన్నవి. గ్రహములయు, ఋక్షములయు, నక్షత్రములయు, మండలములు. సర్వము ధ్రువునియందు వాయురశనలచే బద్ధములై తగినట్లు తిరుగుచున్నవి. ఎన్ని తారలున్నవో, అన్ని వాయు రజ్జువులున్నవి. అవి అన్నియు, ధ్రువునియందు నిబద్ధములై తిరుగుచు, ఆతనిని గూడ త్రిప్పుచున్నవి. ప్రవహము అను వాయువుచే ప్రేరేపింపబడి, జ్యోతిస్సులు తైలపీడలు (అనగా నూనె గానుగ ఆడే పళ్ళ చక్రములవలె) తాము తిరుగుచు, తైలచక్రమును (గానుగను) త్రిప్పునట్లు, తాము తిరుగుచు ధ్రువుని త్రిప్పుచున్నవి. ఆ ధ్రువుని లయమేదియందు తిరుగు గో చక్రమట్లు గ్రహ నక్షత్ర తారాగణ జ్యోతిశ్చక్రము నక్షత్ర రూపులయిన ధర్మాగ్నీ కశ్యప శుక్రులు, సప్తర్షులు తారకలతో గూడ ప్రదక్షిణము తిరుగుదురు. ఆ ధ్రువస్థానమునకు ధ్రువక్షయ అను పేరుగలదు. ఏ వాయు చక్రముచే గిర్రున త్రిప్పబడి జ్యోతిస్సులు అలాత చక్రమట్లు రూపము పొందుచున్నవో ఆ వాయువు, ప్రవహము అనబడుచున్నది. ధ్రువుడున్న స్థానమే శింశుమారము అనబడును. ఆ చక్రమును దర్శించిన మనుజుడు పగటి పాపమును విడిచి పోవును. శింశుమారమును అంటి ఎన్ని తారలున్నవో, అన్ని వర్షములు దానిని దర్శించునతడు జీవించును. దానికి క్రిందుగా ఉత్తరహనువై, ఉత్తానపాదుడు ఉన్నాడు. యజ్ఞము క్రింది దౌడయై ఉన్నది. ధర్మము శిరస్సును ఆశ్రయించినది. నారాయణుడు హృదయమున ఉన్నాడు. అశ్వినీ దేవతలు పూర్వపాదములుగా ఉన్నారు. వరుణుడు సూర్యుడు పశ్చిరు ఊరువు. సంవత్సరము శిశ్నము. మిత్రుడపానమును ఆశ్రయించి ఉన్నాడు. తోకయందు అగ్ని, మహేంద్రుడు కాశ్యపుడు ధ్రువుడు అను నలుగురు తారకలు ఉన్నారు. వారు అస్తమింపరు. భూమి, జ్యోతిర్గణము, ద్వీపములు, సముద్రము, పర్వతములు వీని సన్నివేశము చెప్పబడెను.
వర్షములు, నదులు, వానియందున్నవారు, వారి స్వరూపము చెప్పబడెను. సక్షేప వచనమును వినుము.
విష్ణు శరీరమైనది నీరు. దాని నుండి భూమి పర్వత నదీసాగరములతో కూడి పద్మాకారముగా జనించినది. జ్యోతిస్సులు, లోకములు, గిరులు, నదులు, సముద్రములు, దిక్కులు, మొదలగు సర్వము విష్ణువే. భగవానుడు జ్ఞానస్వరూపుడు. సర్వమూర్తి కావున పర్వతాదులన్నియు విజ్ఞాన విజృంభితములే కాని వాస్తవికములు కావని ఎఱుంగుము. సర్వకర్మ క్షయము కాగానే సర్వ దోష వర్జితమై, శుద్ధమై ఆత్మ రూపము గోచరించునపుడు సంకల్పమను వృక్షమునకు ఫలములైన అవాస్తవికమైన పృథివ్యాది వస్తువులందు పిన్న పెద్ద మొదలగు భేదములు స్ఫురింపవు. జడములైన ఈపదార్థములు ప్రతిక్షణ విలక్షణముగా కన్పించును. వీనికి ఆది మధ్య అంతములు గోచరించును. పాంచభౌతికమై ఈ అచిత్తును వస్తువుగా పేర్కొన చెల్లదు. ఇది నాస్తి శబ్ద వాచ్యము. అసత్తు అసత్యము అని ఇది పిలువబడును. పరిణామ శూన్యమై నిత్త్యెక రూపమై అలరారు ఆత్మఒక్కటియే ‘అస్తి’ శబ్దవాచ్యమై, చిత్తు సత్తు సత్యము అను పేరుల పిలువబడుచు అరూపమై అనామమై ఒప్పును. మట్టి నానా వికారంబులను పొందినపుడు దానిని ఏమని పిలువ వలయును? జ్ఞానులకా వికారజాతమున మృత్తేగోచరించును.
కావున విజ్ఞానముకంటే ఒక్కటి లేనేలేదు. అదొక్కటే నిజకర్మ భేదముచే పెక్కు తెఱంగులైన మనస్సులుకల వారిచే పెక్కు తెఱంగులైనట్లు చూడబడుచున్నది. విశుద్ధము వికలము అయిన జ్ఞానమై నిత్యమై సమస్తశోకాది వికారములు లేనిదై ఏకమై సత్తె ఒప్పు పరమాత్మ పరమేశ్వరుడు అగు వాసుదేవుడొక్కడే. అంతకుమించి వేరొక్కటి లేనేలేదు. ఇది సత్యము. ఈ జ్ఞానమును నేను తెల్పినాను. ఇంతకు వేరైనది అసత్యము. ఈ భువనకోశ విస్తారము వ్యవహారమునకుగాను నీకు తెల్పితినికాని వేరుకాదు. యజ్ఞము పశువు, అగ్ని, ఋత్విక్కులు, సోముడు, దేవతలు, స్వర్గమయమైన కోరిక ఇవన్నియు కర్మ మార్గమున గోచరించునవి. భూర్లోకాది భోగములు వాని ఫలములు. కర్మము నమ్మినవాడు వీనియందు తగుల్కొనును. ఇక అచలుడు, సదైక రూపుడగు ఆత్మను ధ్రువుడుగా ఎఱింగి ఉపాసించువాడు. వాసుదేవునే పొందును.
మైత్రేయుడు ఇట్లు అనియె:
భగవంతుడా! నేనడిగినదెల్ల, విష్ణువు ఆధారమైయున్న ముల్లోకములు అందలి భూ సముద్ర సద్యాది సంస్థానము జ్ఞాన ప్రధానమైన పరమార్థ విషయములను చక్కగ ఆనతిచ్చితిరి. భరత భూపతి సాలగ్రామ క్షేత్రమున నివసించి ఆ పుణ్యదేశ ప్రభావముచే యోగయుక్తుడై నిరంతరము వాసుదేవునియందు మనసు నిలిపియుండెను గదా; బ్రాహ్మణుడై ఆతడేమి చేసెను. ఆయనకేల ముక్తి కలుగలేదు? తామానతిచ్చిన భరత చక్రవర్తి కథనంతను వినవలతును అనుగ్రహింపుడు అని అడుగగా, పరాశరుడు ఇట్లు అనియె.
మైత్రేయా: ఆ భరతభూపతి మహానుభావుడు భగవంతునందు మనసునిల్పి చాలా కాలము సాలగ్రామము అను క్షేత్రమందు వసించెను. అహింస మొదలైన సర్వమానవ సామాన్య గుణములందు పరమావధి స్థితినందుటయే కాక మనోనిగ్రహ మందును పరమోన్నత స్థాయిని అందుకొనెను.
“యజ్ఞేశాచ్యుత గోవింద మాధవ అనంత కేశవ
కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోఽస్తుతే”
అని ఆ రాజు కేవలము హరినామోచ్చారణము తప్ప మఱియొండు పలుకును కలనైన పలుకడయ్యెను. ఈ విష్ణునామ పఠనము చేయుచు, దీని అర్థమును తప్ప మఱి ఒకండు ఆలోచింపడయ్యెను. దేవతార్చనకై పుష్ప, సమిత్కుశలను కొనితెచ్చుట తప్ప మరియొక్క పనిని నిస్సంగుడాతడు చెయడయ్యెను. ఒకతఱి ఆతడు స్నానార్థమై మహానదికేగి స్నానమాచరించి తరువాత, సంధ్యాతర్పణాదులు కావించెను. అప్పుడు దప్పికగొని ఈనుటకు సిద్ధముగనున్న ఒక లేడి ఆయేటికి ఒంటరిగా నీరు ద్రాగవచ్చి త్రాగుట అగునంతలో సర్వప్రాణి భయంకరమైన సింహగర్జనము వినిపించెను. దానికి గుండె తటతటకొట్టుకొన ఏటి ఒడ్డునకు గంతిడినంత దూకుటలో దాని గర్భము జారి నీటపడెను. కెరటములపై తేలి ఆడుచున్న ఆ శిశువుంగని, రాజు తటాలున పరువిడి పట్టి ఎత్తికొనెను. గర్భస్రావ దుఃఖము, పైనిపైకి దుమికిన శ్రమకులోనై, ఆ ఆడులేడి క్రింద నేలపైపడి మరణించెను. రాజతపస్వి ఆ లేడి చనిపోవుటను చూచి లేడిపిల్లను ఎత్తికొని అశ్రమమునకు ఏతెంచెను. అది మొదలు ఆ లేడిపిల్లను అనుదినము ఈతడు పెంప మొదలిడెను. అదియు క్రమముగా పెరిగెను. ఆశ్రమ ప్రాంతములందు అడవుల పచ్చిక బయళ్లలో అది సంచరించుచు, క్రమముగ దూరదూరముల కేగియు మేసి, పులులకు జడిసి, తిరిగి వచ్చుచుండెడిది. ఉదయమేగి సుదూరము సాయమందు ఆశ్రమమునకు వచ్చి భరతుని ఆశ్రమమందు పర్ణశాలయందు నిల్చెడిది. అది దూరమందును దగ్గరలో ఉన్నను అతనిడెందము ఆ లేడిపిల్లమీదనే కాని మఱి ఎందును నిలువదయ్యెను.
రాజ్యమును వదలినాడు, బిడ్డలను విడిచినాడు. బందుగులందరిని బాసినాడు. కాని లేడిపిల్లపై అతడు ఎక్కడలేని మమకారమును పెట్టుకొన్నాడు. తోడేళ్లు మ్రింగినవా? పెద్దపులులు నోట కఱచికొన్నవా? సింగము వాతబడెనా? అని ఆ మృగశిశువు రాక తడసిన నతని యెడద తటతట కొట్టుకొనును. ఇదె, ఈ నేల దాని డెక్కల తుది తాకిడిని వింత రంగు లెనసినది. ఈ చిఱులేడి నా ప్రీతికై కాబోలు ఎటకో దుమికియున్నది. తన కొమ్ము కొనచే నాబాహువును గోకుచుండెడిది. అది క్షేమముగా వచ్చి నన్ను ఆనంద పఱచునా? ఇవిగో దాని లేత పండ్ల కొరికిన లేత చివుళ్లు, దర్భఱెల్లు పఱకలు, సామగానము సేయు లేవడుగుట్లు ముద్దుకొల్పుచున్నవి. లేత పలువరుస వెలువడ బ్రహ్మచారులు సామవేదాధ్యయనము సేయుచున్నప్పటి అందము ఈ దర్భాంకురములు కుశాంకురములు జ్ఞప్తిచేయుచున్న వన్నమాట అనుకొనుచు ఇట్లు అది మిగుల తడిసిన కొలది, కొందలము పడుచు, అది పజ్జనున్న తఱి ఆనంద ప్రసన్నవదనుడు అగుచుండెను. దానిపైన వెఱ్ఱిమోహమున, ఆ ఋతమతికి (సత్యనిష్ఠునకు) సమాధి భంగమయ్యెను. రాజ్యమును వదలి భోగములు వీడి, సర్వసంపదలు వదలి, తనవారిని త్యజించిన మహానుభావునికి కూడ ఆ లేడిపిల్ల చపలమై దూకినకొలది మనసు చపలమయ్యెను. దూరమేగిన అది దూరమేగెడిది. ఇట్లు ఆ లేడిపిల్లయందు చిత్తము సుస్థిరము అయ్యెను.
ఆ విధముగా కాలము గడచిపోగా ఆ భూపతి కాలము చేసెను. తనబిడ్డ వలెనే ఆలేడిపిల్ల బిక్క మొగము పెట్టి, తండ్రివలెతాను కంటనీరు పెట్టుకొని చూచుచుండ, తానును దానివంకనే చూచుచు ప్రాణములు వదలుచు మనసు తన్మయమై, వేఱొకటి తలపడయ్యెను, తత్కాలకృత దృఢభావన వలన అతడు నేరేడు దీవిని దుర్గను అరణ్యమున పూర్వజన్మ స్మృతిగల లేడియై జన్మించెను. జన్మాంతర స్మృతినిజేసి సంసారమునెడ (జనన మరణ ప్రవాహరూపమైన దానియెడ) భయ, ఆందోళనములంది, తల్లి లేడిని విడిచి తిరిగి సాల గ్రామమునకే ఏతెంచెను.
అక్కడ ఎండిన గడ్డిగాదము ఆకులను కొఱుకుచు, తనకు తానే పోషణమందుచు మృగజన్మమునకు కారణమైన కర్మమునకు ప్రాయశ్చిత్తము నడపెను. అప్పుడు దేహము వాసి, జాతిస్మరుడైన ద్విజుడై, సదాచార సంపన్నులు అయిన యోగుల పవిత్ర విప్రవంశమందు జనించెను. సర్వవిజ్ఞానములు, సర్వశాస్త్రములు శాస్త్రార్థముల నిగూఢ రహస్యమును ఎఱిగి, ప్రకృతికంటె పెద్దన ఆత్మను దర్శించెను. ఆత్మజ్ఞాన మలవడినందున దేవాది సర్వభూతములను తనకంటె వేరుకావని కనుగొనెను. ఉపనయనము చేయబడియు, అతడు గురువు చెప్పిన శ్రుతి పాఠము చేయడయ్యెను. చేయవలసిన కర్మములను కనడయ్యెను. శాస్త్రములను గ్రహింపడయ్యె. పెక్కు రీతుల పలుకరింపబడియు, జడునివలె పలుకు చుండెను. ఆ మాటకూడ సంస్కార హీనము గుణహీనముగాను ఉండెను. పాటకపు జనము మాటలవలె ఉండెను. మాసిన ఒడలు, మాసిన వలువలు పాచి పట్టిన పలువ రుసతో, నాగరికులు ఏవగింప తిరుగాడుచుండెను. యోగసంపదకు గౌరవము హానిని కల్గించునది కావున ఆ యోగి జనముచే అవమానితుడై యోగసిద్ధిని పొందగలడు. కావున యోగి సత్పురుషుల ధర్మమును ఏ మాత్రము దూషింపక తాను మాత్రము తనను జనులు అవమానించునట్లు తనతో పొత్తు కూడకుండునట్లును చరింప వలయునన్న బ్రహ్మవచనమును తలచి ఆమహాజ్ఞాని తనను లోకమునకు జడునట్ల ఉన్మత్తునట్లు దయ్యము పట్టిన వాడట్లు కనబరచుకొనెను. ఒకతఱి కుల్మాషములను (గుగ్గిళ్ళను), ఒకప్పుడు వాట్య (పులగము) ఒక యెడ అడవి కూరాకులు, పండ్లు నూకలు (కణములు) ఏది దొరికిన అది ఆ కాలమునకు అనువుగ తినును. తండ్రి పోయిన మీదట అన్నదమ్ములు వారి పుత్రులు బంధువులచే పొలము పనులందు గూర్పబడి కదన్నము (గంజీవగైరాలు, ఎంగిలి మెతుకులు తిని సంతోషించును. తిన్నని కండ్లు బలిసిన బడలును కల్గి పనిలో మాత్రము మందగించుచు, జీతము నాతము లేని వట్టి కూడు మాత్రము జీతముగ ఇంటనే కాదూరికెల్ల పనిముట్టై వాడుకొనబడుచుండెను. అట్టి అసంస్కార విచేష్టితుని ఆకారమాత్ర విప్రుని సౌవీరరాజు సారథి కాళికి పశువుగా బలి ఈయనియోగించెను. వైశసవిధిని అనుసరించి (బలియిచ్చు విధానమును బట్టి) రాత్రి వానిని అలంకరించి బలి ఇచ్చు బండ్లపై నిలువబెట్టి, నంత వానింగని కాళియోగీశ్వరుడని తెలిసి, బలియిచ్చు వాని చేతి కత్తిని లాగికొని ఆ కౄరకర్ముని ఆ దాసీపుత్రుని కంఠము మొదలికి నరకెను.
తన పరివారముతో ఆ దేవి వాని మెడం పొంగిపొరలు రక్తమును త్రాగెను. ఆపై సౌవీర రాజు, మహాత్ముడు చనినంతట, వాని వెట్టివాడు, వీడు పెట్టి వానిపనికీ అనువైన వాడని అట్టి మహానుభావుని నివురుగప్పిన నిప్పన్నట్లు వానిని పెట్టి పనిలో పెట్టెను. అతడు ఒకనాడు శిబిర (పల్లకి) నెక్కి కపిలమహర్షి ఆశ్రమమునకు ఏగ సంకల్పించెను. ఈ సంసారము దుఃఖప్రాయము. ఇందు శ్రేయస్కరమేమి? అని మోక్షధర్మము గూర్చి కపిల మహామునిని అడుగ నెంచెను. రాజభటుని ఆజ్ఞచే ఆ భరతుడు వెట్టివాండ్ర నడుమ తానును పల్లకి మోతకు పూనుకొనెను. సర్వజ్ఞాన నిదానమై జాతిస్మరుడైన ఇతడు పాపక్షయము ఈ విధముగా కావలెనని కోరి జ్ఞానులకెల్ల ఉత్తముడు. ఆయన ఆ పాలకిని మోసెను. పాలకి దండమును మాత్రము చూచుకొనుచు భుజముమీద నుండి అదిరిపడకుండ ఉండునంత వరకు గమనించుచు మందమందముగ నడుచుచుండెను. దానిని చూచి ఆ రాజు పాలకి ఒడుదుడుకు పడుట గమనించి ఇది ఏమి? సమముగ నడుపుడు అని బోయీలను గద్దించెను. అప్పటికిని అది ఒడుదుడుకు పడుటను చూచి రాజు; ఏమిది? ఇట్లేల నడతురని పలుమారులు అడిగినంత వాహకులు వీడు త్వరగా నడచుట లేదనిరి.
అటుపై సౌవీరరాజతనిని చూచి ఇట్లు అనియె:
రాజు: అలసితివా? నా శిబికను నీవు నాలుగడుగులు మాత్రము కూడా మోయ లేదు. ఆయాసము ఎక్కువైనదా? సహించలేవా? ఔను! పాపము బక్కచిక్కినట్లు కన పడుచున్నావు అనెను.
బ్రాహ్మణుడు: నేను బలిసినవాడను కాను. నేను మోతగాడను కాను అలయను లేదు, ఆయాసము లేదు, సహించుటయు లేదు.
రాజు: ఎదురుగా బలిసి కనబడుచున్నావు. నీ మీద శిబిక ఉన్నది బరువు మోతలో, శ్రమ దేహులకు ఉండును కదా?
బ్రాహ్మణుడు: రాజా నీవు ప్రత్యక్షముగా ఏది చూచితివో అది నాకు చెప్పుము. బలశాలి దుర్బలుడు అన్న మాటలు తరువాత? నీవీ పల్లకీ బొంగును మోయుచున్నావు. ఇది ఇప్పుడును నీ మీద ఉన్నది అన్న నీ మాట అబద్ధము, నా పలుకును ఆలింపుము. భూమి మీద పాదములు రెండున్నవి, పిక్కలువాని మీదున్నవి. తొడలాపిక్కల మీదున్నవి, ఆ తొడలపై కడుపున్నది, దానిమీద రొమ్ములు, బాహువులు, భుజములున్నవి. ఆ భుజముల మీద ఈ శిబిక ఉన్నది. ఇదంతయు నా బరువందువు ఏమి? శిబిక ఉన్న ఈ శరీరము నీచే ఉపవీక్షితమైనది. అక్కడ నీవు నేను అన్న వస్తువు అన్యథా చెప్పబడుచున్నది. నీవు, నేను, మఱి ఇతరులు భూతములచే భయపడుచున్నాము. భూతవర్గము కూడా ప్రవాహము నబడి ఇట్లు కొట్టుకొని పోవుచున్నది. గుణములు కర్మకు లొంగిన, అవి సత్యము. రజస్సు, తమస్సు, అనునవి. కర్మ అవిద్యా సంచితము. అజ్ఞానముచే ప్రోగుపడినది. అది జంతువులు అన్నిట ఉన్నది.
ఆత్మ అనునది శుద్ధము, అక్షరము, శాంతము, అది గుణములకంటె ప్రకృతికంటె వేరైనది. అఖిలజంతువులందొకానొకటి అయి ఉన్న, దీనికి వృద్ధి, క్షయమును లేవు. పెరుగుదల ఎట్లు లేదో తరుగుదలయు దీనికి లేదు. అట్టియెడ నీవు బలిసి ఉన్నావని ఏ యుక్తినిబట్టి నీవు అన్నావు? భూమి పాదములు మోకాళ్ళు నడుము తొడలు కడుపు మొదలైనవానిపై మెడపైన శిబిక ఎట్లున్నదో సరిగా నీచే నీశరీరము అట్లున్నది. జంతువు లన్నిటి విషయము అంతే. శిబికను మోయువాడే కాదు. కొండలు, చెట్లు, ఇండ్లు మొదలైన వానివలన నలుగు భూభారమంతయు నీమీద ఉన్నది. ప్రాకృత కారణములవలన నీ బరువంతయు పురుషవాచ్యమగు వస్తువుకంటె ఇదెల్ల ‘వేరు’ అను భావమున్నంతదాక ఆయాసమును గూడ సహింపవలసి ఉండును. కాని నేనెందుకది సహింతును నాకాపృథగ్భావము (వేరు లేరని భావించు గుణము) లేదు కనుక నాకాభారమును లేదన్నమాట. ఈ శిబిక ఏ ద్రవ్యముచే జేయబడినదో, ఈ ఊత సమూహము నీకును, నాకును, అదే ద్రవ్యము. అంతకును మమకారముచే ఇదియెల్ల పెంచుకొనబడినది అని పలికి ఆపాలకినట్లే మోయుచు, మాఱుమాటాడక ఊరకుండెను. ఆ రాజును, సత్వరము ఆపాలకిదిగి పుడమిపై వ్రాలి ఆయన పాదములఁను పట్టుకొనెను. మఱియు ఇట్లు అనెను.
రాజు : ఓ విప్రోత్తమా ! శిబికవదలి స్వామీ ! నాయెడ అనుగ్రహము చూపుము. అల్పుని రూపమున ఉన్న తామెవరో ఆనతిండు. ఎందులకు? ఏమిపనిమీద ఇట్లు వచ్చితివో? ఓ బ్రాహ్మణమూర్తి ! అదెల్ల శుశ్రూషువును అగు నాకు ఆనతి ఇమ్ము.
బ్రాహ్మణుడు: దేశకాలాదులననుసరించి సుఖ దుఃఖానుభవము జరుగును. అవి రెండును ధర్మాధర్మముల వలన ఏర్పడునవి. దానినిబట్టి జంతువు దేహాదులను పడయును. ఎల్లెడల ఎల్లజీవులకు ఎల్ల అనుభవములకు కారణము ధర్మాధర్మములే, కావున నీవు కారణమడుగుట ఎందులకు?
రాజు: సర్వ కార్యములందు ధర్మాధర్మములు కారణములు. సందేహము లేదు. ఒకదాని వెంట ఒక శరీరము కల్గుట ఫలానుభవము కొఱకు సరికాని, నీవు అన్నావే ఆ వస్తువు నేను అని ఆత్మను గూర్చి అన్నమాట అనుటకు వినుటకు గూడ శక్యము కాకున్నది. అందు నాకు అభిరుచి కల్గుచున్నది. సోఽహం అనునదానియందు ఏదిగలదో అది పలుకుటకేల శక్యము కాదు? ‘అహమ్’ (నేను) అనుపదము ఆత్మయందు అన్వయించుట తప్పుకానప్పుడు అది అట్లు పలుకుటకేమి ఇబ్బంది?
బ్రాహ్మణుడు: ‘అహమ్’ నేను అన్నపదము ఆత్మయందు వర్తించుట తప్పనిగాదు. అది అంతియే, కాని ఆ ఆత్మ తానుగాని, వాని ఆ విజ్ఞానముగాని, శబ్దముగాని భ్రాంతి లక్షణమైనది. అట్టి భ్రాంతి మూలకమైన వాగాడంబరమన్నమాట. నాలుక ‘నేను’ అనును. దంతములు, పెదవులు, తాలువు (దొడలు)లును. కావున ‘అహం’ నేను అను నీమాటలు కేవలము వాఙ్మా త్రోచ్చారణ కారణములు. ఈ వాక్కు ‘నేను’ అనువస్తువును ఏకారణముచే చెప్పును? ఇందువలన నీవు బలిసి ఉన్నావనుటయు అది చెప్పుటకు వలనుపడదు. పురుషునికంటె పిండము (దేహము) వేరు. ఈ పిండము తల చేతులు మొదలయిన చిహ్నములుగలది. ఈ వివిధ వస్తుసంఘాతమందు ‘అహం’ నేను అను వ్యవహారము (సంజ్ఞ) దేనియందు చేయమందువు. నాకంటే మఱియొకడు ఇతరుడు ఉండెనేని వీడు నేను వాడు మఱియొకడు అని చెప్పుటకేని వీలగును? అని దేహములందు పురుషుడు ఒక్కడై ఉన్నపుడు నీవెవడవు? అతడు నేను ఇత్యాదిగ మాటలాడుట వ్యర్థము. నీవు రాజువు, ఇది శిబిక, మేము బోయీలము. ఈ రాజ్యము నీది. ఇత్యాదికము ఇదంతయును “అసత్తు” లేనిది ముందు చెట్టు - దాని నుండి దారువు, దాని నుండి ఈ నీవు ఎక్కిన పాలకి దీనికి వృక్షము - దారువు అను ఈ సంజ్ఞలు (పేర్లు) ఇప్పుడు ఏమి అయిపోయినవి? నీ పరిజనము నిన్ను వృక్షారూఢుడవని (చెట్టెక్కినవాడవు అని) అనుటలేదే? లేదా దారువు మీద ఎక్కినావనియు అనుటలేదు. శిబికారూఢుడవు అనుచున్నది. శిబిక దారువు, వృక్షము అనునది ఒక్క వస్తువే.
రచనాభేదమును అనుసరించి (రూప భేదమునుబట్టి) నామభేద మందినది. అ భేదమందలి ఈ శిబిక మొదలేమో వెదకికొనుము. ఇట్లే ఛత్రము (గొడుగు), శలాక (గొడుగు కామ) మొదలయిన వాని వేర్పాటు యందలి బండారము వెదకికొమ్ము నీ గొడుగు ఎటుపోయినది? అన్న ప్రశ్నము నీయందెంత న్యాయమో, నాయందు అంతే కర్మహేతువులైన (కర్మ కారణముగా ఏర్పడు) పురుషుడు, స్త్రీ, గోవు, మేక, గుఱ్ఱము, ఏనుగు, పక్షి, చెట్టు అనునది దేహములందు ఒక గుర్తు (సంజ్ఞ) నామముమాత్రమే. ఆ పురుషుడు (ఆత్మ) దేవుడుకాదు, నరుడుకాదు, పశువుకాదు, పాదపము కాదు. శరీరాకృతి భేదములు (ఉపాధినానాత్వ) కర్మ నిమిత్తములు కర్మము వలన ఈ భేదములు ఏర్పడినవన్న మాట రాజు -రాజభటాదికము మఱియుగల వస్తువెల్ల సత్పదార్ధము గాదు (ఉన్నదిగాదు) ఇది కేవలము కల్పనామయము, కాలాంతరముననేని ఏది తయోప పొంది పరిణామాదుల వలన ఏర్పడు నామాంతరములను వేరువేరు పేరులను పొందనిది ఏదో అది వస్తువు. ఆత్మవస్తువు? అదేమై యుండును? అది దృశ్య వస్తువులందు ఏదియును కాదు. నీవు సర్వలోకప్రభుడవు. తండ్రికి కొడుకువు. శత్రువునకు శత్రువవు. భార్యకు మగడవు. కొడుకునకు తండ్రివి. రాజా నేను నిన్ను ఏమని పిలుతును? ఈ తల నీవా? మెడ నీవా? కడుపు నీవా? పాదాదికము నీవా? ఇది నీదా? అన్ని అవయవములకు నీవు వేఱుగా ఉన్నావు. ఇక్కడ నీవు నేనెవ్వడనని నేర్పరివై ఆలోచింపుము. తత్త్వము ఇట్లుండ పృథగ్భావముతో ఏర్పడదగిన ‘అహం’ నేను అని యెట్లు పలుక శక్యమగును?
పరాశరుడు ఇట్లనెను - పరమార్థసంపన్నమైన విప్రుని (భరతుని) ఈ వచనములను ఆలించి వినయ వినమితుడై సౌవీరరాజు ఆయనతో ఇట్లనెను: భగవంతుడా! నీవు చెప్పిన పరమార్థమయమైన పలుకులను వినినంతనే నా మనస్సులోని తలపులట్టిట్లు భ్రమించినట్లు ఉన్నవి. ప్రకృతి కంటె మీదిదైన ఈ మహావివేక విజ్ఞానము సర్వజీవులందు నీచే చూపబడినది. నేను శిబికను మోయుటలేదు. శిబిక నా మీద ఉన్నది. శరీరరము నాకంటె వేఱువస్తువు. అది ఈ శిబికను మోయుచున్నది. భూతములయొక్క గుణములు ప్రవర్తించుటచేత కర్మచోదితమైన ప్రవృత్తి ఏర్పడును. ఈ గుణములు తమంతట తాను ప్రవర్తించును. దీనితో నాకేమి సంబంధము ఉండదు. పరమార్థతత్త్వము చెవిని పడగానే పరమార్థమునెడ లక్ష్యముగొన్న నామనస్సు అట్టిట్టయినది. ఇంతకు మున్నే నేను ఇక్కడ లెస్సగ వినవలసిన పరమ శ్రేయస్సు ఏదని మహానుభావుడుగు కపిలమహర్షిని అడుగ వలయునని యత్నపడితిని. ఆలోగా నీవీ వాక్యమును పల్కితివి. దానిచేత పరమార్థ ప్రయోజనమును తెలియుటకై నీయెడ మనస్సు దూకుచున్నది. కపిల మహర్షి సర్వమునైన విష్ణుభగవానుని అంశమున జగమ్ముల మోహము నశింపచేయుటకు ఈ అవనియందు అవతరించిన మహానుభావుడు. మాకు హితవుచేయ ఆ భగవంతుడే ఇక్కడ సాక్షాత్కరించినాడు. నీవిపుడు ఆనతి ఇచ్చిన విధము అదియే. కావున ఓ! ద్విజోత్తమ! నీకు ప్రణతుడను అయిన నాకు పరమ శ్రేయస్సేదో దానిని దయచేయుము. అఖిల విజ్ఞాన రసతరంగములకు సముద్రుడవు నీవు అని విన్నవించగా జడభరతుడు ఇట్లనియె:
భూపతీ ! శ్రేయస్సేదో అడుగుచున్నావా? పరమార్థమును అడుగుచున్నావా? శ్రేయస్సు అనగా ఐహిక సుఖము అదియా నీకు కావలసినది పరమార్థమా ఆత్యంతిక సుఖమా? మోక్షమా? అశేష శ్రేయస్సులు ఆ పరమార్థములు. దేవతలను కొల్చి, ధన సంపదను, పుత్రులను, రాజ్యమును కోరును అది శ్రేయఃప్రాప్తి లక్షణము. కర్మము అనగా యజ్ఞ రూపము. అది ఫలరూపము. శ్రేయస్సును ఇచ్చునది. ఆ కర్మయే ఫలాభిసంధిలేనప్పుడు ప్రధానమైన శ్రేయస్సు. శ్రేయస్సు పరమార్థము రెండు ఒకటి కావు. ఆత్మయోగులకు ఎల్లపుడు ధ్యేయము, ఆ పరమాత్మతో యోగము (ఆత్మైక్యము), పరమ శ్రేయస్సులు శ్రేయస్సు ఇట్లు అనేకములు, వందలు, వేలును కలవు. కాని ఇవి పరమార్థములు మాత్రము కావు. వినుము. ధర్మము కొఱకు ధనము త్యాగము చేయబడుచున్నది. ఆ ధనము పరమార్థము అగుచో ఎందులకు వ్యయింపబడును! కావున అది కామప్రాప్తికి హేతువే. సమస్తము దేనికొరకో; ఏది ఇతరము కొఱకు కాదో, అది పరమార్థము. అట్టిది ఆత్మయే. పుత్రుడే పరమార్థమగునేని అతడును (ఆ తండ్రి) మఱి ఒకనికి (అతని తండ్రికి) పరమార్థము. వాని తండ్రికూడ ఒకనికి పరమార్థమైన వాడే కదా! ఈవిధముగా ఈ పరమార్థ నిశ్చయములు అవ్యవస్థితమై పోవును. కారణములన్నిటికిని కార్యము పరమార్థమగు చుండునుగదా! రాజ్యాదుల ప్రాప్తి పరమార్థముగా చెప్పబడిన యెడల, ఈ రాజ్యాధి సుఖాలొకమారు పరమార్థములై ఇవే ఆమీద అపరమార్థములగుచుండును అనగా ఆయా రాజ్యాధి విషయములు దుఃఖహేతువులై, పరమార్థత్వమును కోల్పోవును, అనగా - ఆగమాపాయి అగుటచే రాజ్యాధికము పరమార్థము కాదు.
నీకు ఋగ్యజుస్సామరూప త్రయీ సంపాద్యమగు యజ్ఞకర్మము పరమార్థమేని దానిని కూడ చెప్పెద వినుము. కారణమైన మట్టిచేత ఘటాదిరూపమైన కార్యము తయారు చేయబడును. అప్పుడు కారణమైన వస్తువు (మట్టి) యొక్క అనుగమనముచేత మృణ్మయమైన వస్తువు తయారగుచున్నది. ఇట్లు నశించు ద్రవ్యములచే అనగా సమిధలు నెయ్యి మొదలయిన వానిచే ఒనరింపబడు క్రియ (యజ్ఞము), నాశన శీలము కలదియే అగును. పరమార్థమైన వస్తువు అవినాశి అని ప్రాజ్ఞులు ఎఱుగుదురు. నశ్వరవస్తు సంపాదితమైన ఆ వస్తువు నశించునదే. సందేహము లేదు, కర్మము ఫలదాయి కాదుకాని అది పరమార్థమైన ముక్తికి సాధనమగుట వలన పరమార్థము అనుకొనుచున్నావు. పరమార్థము సాధనము ఎన్నటికి కాదు. ఆత్మధ్యానము పరమార్థమని చెప్పబడదు. ఇతర వస్తువుల నుండి వేఱుచేయునది, భేదము కలది. పరమార్థ మెన్నటికి భేదము కలది కానేరదు. పరమాత్మ యొక్కయు ఆత్మ (జీవాత్మ) యొక్కయు యోగము (ఐక్యము) పరమార్థము అనెదవేని అదియు అసత్యమే. ఒక ద్రవ్యము మఱియొక ద్రవ్యము కాదు గదా! కావున ఓ రాజా! ఈ అనేకములైన ధనాదులెల్ల శ్రేయస్సులే. సందియము లేదు. పరమార్థమును సంక్షేపముగా తెల్పెద వినుము. ఒక్కటియై వ్యాపించునది. సమము, శుద్ధము, నిర్గుణము, ప్రకృతి కంటె పరము (ఉపాధి శూన్యము) జన్మ వృద్ధ్యాది షడ్భావ వికారములు లేనిది, ఆత్మయు, అర్వగము, అవ్యయము, ప్రకృష్ట, జ్ఞానస్వరూపము అసత్తులైన నామ జాత్యాదులతో విధువు, దేనితో కూడునది, మున్ను కూడినదియు మున్ముందు కూడగలదియు గాని, తన దేహమున ఇతర దేహములందు ఉన్నను ఒక్కటియైన వస్తువైన విజ్ఞానమే పరమార్థమై ఉన్న వస్తువు. ద్వైతులు (భేద దర్శనులు) అసత్య దర్శనులు. పిల్లనగ్రోవి యొక్క రంధ్రములందు వ్యాపించిన ఒకేవాయువు ఉపాధి భేదముచే షడ్జము మొదలయిన ఏడు స్వరములుగా చెప్పబడునట్లు, పరమాత్మ ఒక్కనికే దేహాది కర్మ ప్రవృత్తి వలన దేవాది రూపభేదము. ఆ కర్మావరణ పోగానే రూపభేదములేనేలేదు. ఉన్నది ఆ ఒక్క ఆత్మయే.
పరాశరులనిరి ఈ విధముగా తాను (భరతుడు) పలుకకు మౌనమూని లోలోన ఆలోచించుచున్న రాజునుగూర్చి బ్రాహ్మణుడు అద్వైత విషయమయిన కథను ఇట్లు వచించెను. ఓ నృపశ్రేష్ఠ, పూర్వమున ఋభుడు జ్ఞానోదయము చేయుచు నిదాఘునికి వర్ణించిన కథను వినుము: చతుర్ముఖ బ్రహ్మసుతుడు ఋభువు అనునాతడు సహజముగనే తత్త్వజ్ఞానియై, ఉండెను. అతనికి పులస్త్య కుమారుడు నిదాఘుడు అనువాడు శిష్యుడు అయ్యెను. అమిత ఆనందముతో అతనికి ఋభవు అశేషవిజ్ఞానమును ఒసంగెను. జ్ఞానము వడసిన ఈ శిష్యుని అద్వైతవాసన ఏపాటిదో ఋభువు పర్యాలోకించెను.
దేవికానదీ తీరమందు సర్వసమృద్ధము, సర్వసుందరము అయిన పురము ‘వీర నగరము’ అను పేర పులస్త్యునిచే నిర్మింపబడినది. రమ్యోద్యాన పరిసరమయిన ఆ పట్టణ మందు నిదాఘుడను పేరివాడు యోగజ్ఞాని, ఋభువు శిష్యుడు వసించుచుండెను. వేయి దివ్యసంవత్సరములు గడువగా, ఆతని చూచుటకు ఋభుడు అచ్చటకు పోయెను. వైశ్వదేవమైన తర్వాత, ద్వారమున అతిథులరాక కై ఎదురు చూచుచు నిలిచినతఱి ఋభుడు అతిథియై కనిపించెను. నిదాఘుని వలన ఆముని అర్ఘ్యపాద్యములుగొని ఆతని ఇంట ప్రవేశింపచేయబడెను. నిదాఘముని కాలుచేతులు కడిగి ఆసనమందు కూర్చుండిన ఋభుని సాదరముగ మా యింట భోజనము చేయుడని పలికెను.
ఋభుడు: ఓ విప్రోత్తమా ! భుజింపతగినది మీ ఇంటను ఏమున్నది తెల్పుము. నీర సాన్నములయెడ నా కెప్పుడును ప్రీతిలేదు.
నిదాఘుడు: పేలపిండి యావకము (యవలతో చేసిన వంటకము) వాట్యము (= కంద మూలాదికము) అప్పములు మా ఇంటకలవు. ఇందేది నీకు రుచించి, దానిని స్వేచ్ఛగ భుజింపుము.
ఋభుడు: ఓ ద్విజ! ఇవన్నియు పనికిమాలిన అన్నములు. సంయావము (= సారుసత్తులు; లేక జంతికలు) పాయసము (= పరమాన్నము) - ద్రప్సము (= పెరుగు) పాణితములు (= బెల్లపు భక్ష్యములు) పెట్టుము.
నిదాఘుడు: ఓ గృహిణీ! మంచి ఆహారము మన ఇంట ఏ కొంచెమైను భక్ష్యోప స్కరణమైనది రుచికరమైనది ఏదేని ఈయనకు ఆహారము సమకూర్చుము. అనగా ఆ ఇల్లాలు భర్తమాటయందున్న గౌరవముతో ఆ ద్విజునకు వడ్డించెను. ఆ అన్నమును మనసార భుజించుచున్న ఆమహామునినిగని, వినయవినతుడై నిలిచి నిదాఘుడు ఇట్లనియె.
నిదాఘుడు: మీకు పరమతృప్తి, తుష్టియు కలిగెనా? మీ మనస్సు స్వస్థమొనరించి కొంటిరా? మీ నివాసమెక్కడ? ఎటకేగపూనితిరి? ఎటనుండి మీరు వచ్చుచున్నారో అదియుఁ తెలుపుడు.
ఋభువు: ఓ బ్రాహ్మణా ! ఎవనికి అకలిగలదో అతడు భుజించిన తృప్తికలుగును. నాకు ఆకలి లేదు. తృప్తిని గూర్చి ఎందులకు అడిగెదవు. వహ్నిచే (జఠరాగ్నిచే) ప్రార్థివ ధాతువు జలధాతువు, క్షయించినంత ఆకలి దప్పికలు పుట్టును.
ఆకలి దప్పికలు దేహధర్మములు. ఇవి నాకు లేవు. ఆకలి తీరిన తృప్తి. ఓవిప్ర ! మనస్సు స్వస్థమై ఉండుట తుష్టి. ఇవి చిత్తముయొక్క ధర్మములు. ఎవనికి చిత్తము కలదో వానికే ఈధర్మములు. వానిని ఈ ప్రశ్నములు అడుగుము. పురుషుడు (ఆత్మ) వీనితో కూడి ఉండడు.
“నీ నివాసమెక్కడ? ఎచటికి వెళ్ళెదవు? ఎచటనుండి వచ్చుచున్నావని మూడు ప్రశ్నలు అడిగితివి. ఈ ప్రశ్న అర్థవంతమెట్లు? పురుషుడు సర్వగతుడు. ఆకాశమువలె వ్యాపియై ఉండుట వలన నీ ప్రశ్నలు కుదరవు. నేను వెళ్ళువాడనుగాను. వచ్చువాడను కాను. ఒక దేశమునందుండువాడను కాను. నీవును ఇతరులును, నీవు కావు ఇతరులును కారు. నేను నేనును కాను నీవేమి చెప్పుదువో? అని రుచిగా ఉన్నదా? రుచిహీనమా! అన్నమని జిజ్ఞాస చేసితిని. ఆ విషయములో కూడ చెప్పెదను. ఓ ద్విజోత్తమా! వినుము. తినువానికి స్వాదువని అస్వాదువని ఏమున్నది? రుచికరమయిన అన్నము రుచికరము ఎట్లో అట్లే, అదే ఉద్వేగ కారకము అగును. అమృష్టమే (అరుచికరమే) మృష్టమగును (రుచికరమగును). రుచికరమయిన వస్తువును చూచి జనము ఉద్వేగపడును (ఆందోళన పడును) అన్నము ఆదిని, నడుమను, తుదను కూడ రుచికారక మందువా? మట్టి ఇల్లు మట్టిపూత పెట్టిన, స్థిరమై నిలిచినట్లు ఈ దేహము పార్థివము (భూపరమాణుమయము) పార్థివ పరమాణువుల వలన అనగా యవలు, గోధుమలు, పెసలు, నెయ్యి, నూనె, పాలు, పెరుగు, బెల్లము, పండ్లు మొదలయిన వాని వలన స్థిరమగును. కావున నీవీ అంశమును ఎఱిగి ఇది మృష్టము (రుచి), అమృష్టము (అరుచి) అను విచారణకు దిగిన మనస్సును సమత్వాలంబమయిన దానినిగాచేయనగును. అట్టి సామ్యము (సమబుద్ధి) ముక్తికి కారణము అగును అని పలుకగా
బ్రాహ్మణుడు ఇట్లు చెప్పెను:
ఈ విధముగా నిదాఘునికి ఋభుడు తత్త్వోపదేశము చేయగా ఆ పరమార్థవచనములను ఆలించి మహానుభావుడు నిదాఘుడు ఇట్లనెను. “ప్రసన్నుడ వగుము. నా మేలుకొఱకు దయచేసిన మహాత్ముడవు ఎవ్వడవో తెలుపుము. బ్రాహ్మణుడా! ఈ నీ మాటలు విన్న నా మోహము పోయినది. అన ఋభువు: నేను ఋభుడను. నీకు ఆచార్యుడనై జ్ఞానమీయ వచ్చితిని. పరమార్ధము నీకు తెల్పబడినది, వెళ్ళుచున్నాను. ఈ జగమెల్ల ఒక్కటే వస్తువు. ఇందు భేదములేదు. వాసుదేవాభిధమయిన పరమాత్మయొక్క స్వరూపము ఇది అని గ్రహింపుము,” అన ఔననిపలికి నిదాఘుడు సాష్టాంగ ప్రణతుడై పరమభక్తితో పూజింప ఋభువు స్వేచ్ఛగా అచ్చటనుండి ఎటికో చనెను.
బ్రాహ్మణుడు ఇట్లు అనియె:
వేయేండ్లయిన తర్వాత ఋభువు నిదాఘునికి జ్ఞానము అనుగ్రహింప ఆ నగరమునకు ఏగెను. నగరము వెలుపల ఆ మహాముని ఒంటరిగా నిలబడి ఉండెను. అప్పుడు రాజు మహాజన పరివారముతో పురప్రవేశము చేయుచుండగా, దూరమందు జనసమ్మర్దము లేకుండ నిలువబడిన వానిని ఆకలిచే తడియారినకంఠముతో, సమిధలు, దర్భలు పట్టుకొని వచ్చుచున్న నిదాఘుని చూచి సమీపించి, మ్రొక్కి, నీవు ఏకాంతమందు ఎందులకు ఉన్నావని అడిగెను. అంత వారికిట్లు ఉత్తర ప్రత్యుత్తరములు జరిగినవి.
నిదాఘుడు: రాజా! జనసమ్మర్దముతో ఈ మహారాజు చక్కని పురమున ప్రవేశింప తలచియున్నాడు అందువలన ఇట నిల్చితిని.
ఋభువు: నీవుతెలిసిన వాడవని తోచుచున్నది. ఇక్కడ రాజెవడు? మఱి ఇతర జనులెవ్వరు?
నిదాఘుడు: పర్వతశిఖరమువలె ఉన్నతముగ ఉన్న గజేంద్రమును ఎక్కినవాడు నరేంద్రుడు. ఇతరులు పరిజనులు.
ఋభువు: ఈ ఏనుగు, రాజును, నీచే నాకు ఒక్కమారే చూపబడినవారు. తమచే ఇద్దరును వేరువేరుగా చూపబడ లేదు. కావున ఓ మహానుభావా! ఇక్కడ గజమేది? రాజెవడు? ఈ ఒండొరులను సెలవిమ్ము.
నిదాఘుడు: ఆ క్రిందుగా ఉన్నది యేనుగు. దీని మీద ఉన్నవాడు రాజు. ఒకటి మోయునది. ఒకడు మోయబడువాడు. ఈ వాహ్యవాహక సంబంధమును ఎవ్వడు ఎఱుగడు? అని నిదాఘుం గూర్చి జ్ఞాని ఋభుడు గురువై పలికి చనెను. నిదాఘుడు ఆ ఉపదేశముచేత అద్వైత నిష్ఠుడు అయ్యెను. అన్ని భూతములను తనకంటె అభిన్నముగ దర్శించెను. ఆ విధముగ బ్రహ్మపరుడై ముక్తిని పొందెను. ఆ విధముగ ఓ ధర్మజ్ఞా! నీవు, నిన్ను సర్వగతమై ఉన్న ఆత్మనుగా తెలిసి శత్రువు, బంధువునెడ సముడవు కమ్ము. ఒకే అకాశము తెలుపు, నలుపు మొదలగు భేదముతో భిన్నముగ కనిపించునట్లు, భ్రాంతిదృష్టులచే ఆత్మ ఒక్కటైయుండియు వేఱుపెట్టబడును. ఇదంతయు సర్వాత్మకుడైన అచ్యుతుడే. అంత కంటె మఱిలేదు. అతడే నేను, నీవు. ఈ అంతయు (దృశ్యము) ఆత్మ స్వరూపము. భేద మోహమును వీడుము.
ఋభువు: నేనెట్లు తెలిసికొందునో అట్లు చెప్పుము. అధశ్శబ్దముచే చెప్పబడున దేది? ఊర్ధ్వశబ్ద వాచ్యమేది? అని పలుకగా నిదాఘముని వెంటనే పైకి ఎక్కి ఇట్లనియె: రాజువలె నేను పైన, ఏనుగువలె నీవు క్రింద ఉన్నాము. బ్రాహ్మణుడా! నీకు దృష్టాంతము చూపబడినది. తెలిసికొనుము.
ఋభువు: బ్రాహ్మణోత్తమా! నీవు రాజువలెను నేను గజమువలెను ఉన్నచో నీవు ఎవ్వడవు? నేను ఎవ్వడను? అని ఋభువు పలుకగా, నిదాఘుడు అతని పాదముల కొఱగి ఇట్లనెను. మీరు మా గురువులగు ఋభు మహర్షులు: నిశ్చయము. మఱి ఇతరుల మనస్సు మీ మనస్సువలె అద్వైతసంస్కారముచే సంస్కరింపబడి ఉండదు. కావున నిన్ను మా గురువుగ తలచెదను.
ఋభువు: నిధాఘా! నేను ఋభువును. పూర్వము నీవు చేసిన సేవయందు ఆదరము ఉండి, గురుస్నేహము వలన నీకు అద్వైత ఉపదేశము చేయుటకై వచ్చితిని. మహామతీ! సంగ్రహముగ నీకు ఉపదేశించితిని. పరమార్థ సారమే అద్వైతము. దేవాది భేదరహితమైన జ్ఞానమే అద్వైతము.
పరాశరుడు ఇట్లు పలికెను: అని భరతునిచే తెలుపబడి ఆ రాజశ్రేష్ఠుడు పరమార్థ దృష్టి వడసి భేదమును విడిచెను. మఱియు అతడు జాత స్మృతి (పూర్వజన్మ జ్ఞానము)ను పొంది ఆ జన్మములోనే యవవర్గమును (సాయుజ్య ముక్తిని) పొందెను. ఈ భరత నృపుల సారభూతమైన చరిత్రను ఎవ్వడు చెప్పగా, ఎవ్వడు భక్తితో వినునో అతడు శుద్ధ చిత్తుడై ఆత్మమోహమును పొందడు. ముక్తికి అధికారియు అగును. (II-16)
Summary of chapter 2 of the Vishnu Mahā Purāṇa is as follows:
The second aṃśa turns the gaze of the listener toward the vast body of Bhūmi herself, describing the seven dvīpas and their encircling oceans, with Bharatavarṣa exalted as the land where karma bears its truest fruit. Here unfolds the poignant story of King Bharata, whose attachment even in renunciation binds him to rebirth as a deer, a teaching offered gently to Maitreya on the subtlety of desire. The text further ascends into the heavens, charting the courses of sun and moon, the shadow-planet Rāhu, and the celestial spheres, before descending again to the sobering geography of the narakas, where the fruits of adharma are meted out with precise and impartial justice.